Monday, April 14, 2014

బాలశతకము - అలపాటి వెంకటప్పయ్య

బాలశతకము
                                అలపాటి వెంకటప్పయ్య

-: మాతృదేవి :-

1. ఆత్మజాతచయమె ఆత్మసంపదయు
సంతు సౌఖ్యమె తన సౌఖ్యమంచు
తనరు మమతఁ జూపు తల్లికీడుండునా
విమల వినుతశీల వినురబాల
(ఆత్మజాతచయము=పుత్రులసమూహము, సంతు=సంతానము, తనరు=అతిశయించు, తల్లికీడుండునా=తల్లికిన్+(ఈడుఁ=సాటి), విమలవినుతశీల=స్వచ్ఛమైన కొనియాడదగిన నడవడికలవాడా)

2. మాతృదేవి మహిమ మాన్యమై వర్ధిల్లు
మాతృదేవి సహనమం దతుల్య
మాతృభక్తి మనకు మహిమంబు గూర్చురా
విమల వినుతశీల వినురబాల
(మాన్యమై=గౌరవింపదగినదై, అతుల్యము=సాటిలేనిది)

3. రోతలెల్లఁ బాపి వ్రేతలన్ దిగమ్రింగి
ఉర్వి రుచులెల్లఁ నొనరఁ జేయు
తల్లిఋణము దీర్ప తనయుల తరమౌనె
విమల వినుతశీల వినురబాల
(ఒనర=కలుగ, తరము=శక్యము)

4. ప్రకృతి పురుషజాత రమ్యజగమునందు
మాతయున్న లోకమాత గాదె
మాతృసేవ యెపుడు మరువ దగనిదయ్య
విమల వినుతశీల వినురబాల
(ప్రకృతిపురుషజాత=ప్రకృతియను స్త్రీకి పురుషుడను దేవునివలన కలిగిన)

5. మనసువాక్కు చేత మలినరహితమౌను
ఆత్మజాతశుభము నరయుచుండు మాత
కొమరుహితమె గోరు కొట్టినా తిట్టినా
విమల వినుతశీల వినురబాల

-: పితృ దేవుడు :-

6. సుతులఁ జూచు తండ్రి అతులాదరంబుతో
సుతులఁ జూచి తండ్రి సుఖము నందు
కొమరు వృద్ధి తండ్రి కోరుచుండునుగదా
విమల వినుతశీల వినురబాల

7. సుతులవృద్ధిఁ గోరు పితలెల్ల పడుచుంద్రు
పడయరాని పాట్లు పుడమి యందు
తండ్రి తనను మీఱు తనయుని వలచురా
విమల వినుతశీల వినురబాల
(వలచు= కోరు)

8. ఎండ వానలఁబడి బండచాకిరిచేసి
నిలయ భారమెంతొ నేర్పుగాను
సైచుచుండు తండ్రి సాటిఎన్నగలమె
విమల వినుతశీల వినురబాల
(నిలయభారము=గృహభారము, సైచు=ఓర్చు)

9. కోర్కెలెల్లదీర్చు కొండంత శ్రద్ధతో
తనయు కార్యదీక్ష తండ్రిపెంచు
పుత్ర యశముగాంచి పూర్ణసౌఖ్యము నందు
విమల వినుతశీల వినురబాల

10. భక్తిమెచ్చి చక్రి భవ్యవరములిచ్చు
కాంక్షలెల్ల దీర్చు కల్పశాఖి
కన్నతండ్రి మనకు కన్పట్టు వరదాత
విమల వినుతశీల వినురబాల
(కల్పశాఖి=కల్పవృక్షము, వరదాత=వరములిచ్చువాడు)

-: ఆచార్య దేవుఁడు :-

11. తల్లి తండ్రి పిదప తనరు గురువరుండు
విద్యలెల్ల మనకు వెలయఁజెప్పి
సాధుసూక్తి@గూర్చు సచ్ఛీల గురువురా
విమల వినుతశీల వినురబాల

12. కున్నులున్న నరుఁడు కాంచు వస్తువులెల్ల
కన్ను కందకున్న కణమునైన
శాస్త్రవిద్యచేత శాస్త్రిచూపించురా
విమల వినుతశీల వినురబాల
(కణము=నలుసు, శాస్త్రి=శాస్త్రమెరిగిన గురువు)

13. విద్యగఱపు మనకు వినతినిచ్చు గురువు
సాధిశీలమరయ సత్యసూక్తి
మహితశౌర్య మాత్మమహిమను గూర్చురా
విమల వినుతశీల వినురబాల
(వినతి=వినయము, సత్యసూక్తి=సత్యవాక్కు, మహితశౌర్యంబు=గొప్పపరాక్రమము)

14. అజ్ఞజనుల కహిల విజ్ఞానమునుగూర్చి
విజ్ఞనరులఁజేయు వేదమూర్తి
వస్తు తత్త్వమరసి వాస్తవంబందించు
విమల వినుతశీల వినురబాల
(అజ్ఞజనులు=మూఢులు, విజ్ఞనరులు=తెలిసినవారు, తత్త్వము=నిజరూపము)

15. కార్యదీక్షమహిమ కర్తవ్యపాలన
విద్యఘనత నిల వివేక బలము
బ్రదికుఫలము ముక్తి పథమొజ్జ దెల్పురా
విమల వినుతశీల వినురబాల
(ముక్తి=మోక్షము, ఒజ్జ=గురువు)

16. గుణములెల్ల గలుగు గురుభక్తి నరులకు
మహితశక్తిఁ గూర్చు మాన్యగురుడు
నరులహితము గోరు గురుల సాటిగలరె
విమల వినుతశీల వినురబాల

-: వంశ, రూప, విద్యా, అర్థ, శీల, వివేకవిశేషములు :-

17. మంచి వంగడంబు మనుజవరులకెల్ల
మహిమకూర్చు, నిచ్చు మాననంబు
పసిడిఁ గెంపుఁగూర్ప పరగ శోభించురా
విమల వినుతశీల వినురబాల
(వంగడంబు=వంశము, మాననము=సన్మానము, పసిడి=బంగారము, కెంపు=పద్మరాగము, పరగ=ఒప్పుగ)

18. జగతి నరుల రూపసౌందర్య, మరయంగ
పరులమనసుల తన వశముచేయు
ఒప్పు రూపమహిమ కోడరా జనులెల్ల
విమల వినుతశీల వినురబాల
(ఓడరా=లొంగరా)

19. విద్య ప్రతిభనిచ్చు వినయంబు సమకూర్చు
ధన వివేకమతుల తనరఁజేయు
సకల శుభము గూర్చు చదువునకెనలేదు
విమల వినుతశీల వినురబాల
(ఎన=సాటి, ప్రతిభ=సమయస్ఫూర్తి)

20. కులము రూపు విద్య కూడియుండిన గాని
విత్తహీననరుడు వెతలఁ బొందు
అఖిలమర్థమూల మనుచుండ వినలేదె
విమల వినుతశీల వినురబాల
(అఖిల మర్థమూలము=సకలజగత్తు ధనమూలము)

21. కులము రూపువిద్య కోటిధనము నున్న
శీలమెన్న సర్వమూలమౌను
శీలముడుగు బ్రతుకు చెఱచురా మననెల్ల
విమల వినుతశీల వినురబాల
(ఉడుగు=కృశించు(తగ్గిపోవు)

22. ధరణి సత్యవాణి ధర్మవర్తనమును
సుగుణజాల మెన్న శోభనిచ్చు
వరవివేకబుద్ధి పరమశుభము గూర్చు
విమల వినుతశీల వినురబాల

-: త్రికరణములు :-

23. కాయశుద్ధిచేత కలుగు నారోగ్యంబు
సూక్తి శుద్ధిచేత సూనృతంబు
స్వాంతశుస్షిచేత సౌఖ్యంబులబ్బురా
విమల వినుతశీల వినురబాల
(కాయశుద్ధిచేత=దేగశుభ్రతచేత, సూనృతంబు=సత్యము, స్వాంతశుద్ధిచేత= మనసు నిర్మలముగా నుండుటచేత)

-: సుజన, దుర్జన వివేకి పద్ధతి :-

24. సుజనుఁ డన్య జనులఁ జూచు నాత్మపగిది
అగుట నతడు మోసమందుచుండు
లోకయాత్ర లోని లోపంబు కనుమోయి
విమల వినుతశీల వినురబాల
(ఆత్మపగిది=తనవలె)

25. దుష్టులన్యజనుల ధూర్ర్త్లఁగా నెంచ
మాయ నందెపుడు మాయికుండు
దోషజాల్పసుఖులు దూష్యగతులుగారె
విమల వినుతశీల వినురబాల
(ధూర్తులు= మోసకారులు, మాయికుండు=టక్కరి, దోషజ=జెడ్డకార్యముల వలన కలుగు దూష్యము= దూషింపఁదగినది)

26. విద్యసార మెఱిఁగి వినయశీలమంది
లోకశాస్త్రరీతి లోతునరసి
వరవివేకమందువాఁడుత్తముండురా
విమల వినుతశీల వినురబాల

-: శత్రువు :-

27. బాహ్యశత్రు వెపుడు భంగపరుప నెంచి
అదనుకొరకుఁ దాను వెదకుచుండు
పగతుఁ డాత్మరిపుల పతకంబు జెఱచురా
విమల వినుతశీల వినురబాల
(బాహ్య=వెలుపలి, ప్రతిభ=సమయస్ఫూర్తి, పతకము=పన్నుగడ)

28. పెక్కుమాఱులోడి, చిక్కులోఁ బడికూడ
పదనునరసి, తగిన బలముకూర్చి
ఆత్మధరణిదీక్ష నందినారు గదయ్య
విమల వినుతశీల వినురబాల
(ఆత్మధరణి=తనరాజ్యము)

29. అరయ శత్రుశేష మగ్ని శేష మెపుడు
విడువరాదు జగతి విజ్ఞనరుఁడు
భావమందు నిల్పు భార్గవు చాణక్యు
విమల వినుతశీల వినురబాల
(విజ్ఞనరుఁడు=తెలిసినవాడు)

-: అంతశ్శత్రువులు :-

30. ఆత్మ నణగి యుండు నంతర్విరోధులు
వానిబారి తలఁగి వఱలుమయ్య
ఆత్మజయముచేత నఖిలజయము గాంచు
విమల వినుతశీల వినురబాల
(అంతర్విరోధులు=లోపలి శత్రువులు, బారి=హింస, తలఁగి=తొలగించుకొని)

31. ఏకపత్నిదీక్ష యెల్ల జనులకొప్పు
నన్యసతుల గోర హాని కలుగు
కామదోషము దశకంఠు హతునిఁజేసె
విమల వినుతశీల వినురబాల

32. క్రోధమున్న నరుడు కోల్పోవు సహనంబు
క్రుద్ధనరుడు ధర్మబద్ధుఁడగునె
కోపమున్నయెడల శాపంపుఫలమబ్బు
విమల వినుతశీల వినురబాల

33. లోభిమానవులకు లోపించు సంతృప్తి
తృప్తిలేని నరుఁడె సుప్తినుడుగు
లోభికెపుడు దుఃఖలోపంబులేదురా
విమల వినుతశీల వినురబాల
(సుప్తి=గాఢమైన మంచి నిద్ర

34.మోహినరుని తెలివి మూఢమై యొప్పును
ఉర్విమోహి కన్నులున్న గ్రుడ్డి
మోహమున్నజనుఁడు ముక్తిఁగాంచడు గద
విమల వినుతశీల వినురబాల
(మోహి=అజ్ఞానము)

35. మదము గల్గు జనుఁడు మరచును పరమాత్మ
మదముచేత నతఁడు మహిమ నుడుగు
మదము జనులకుండ మాఱుతుండేలరా
విమల వినుతశీల వినురబాల
(మారుతుండు=శత్రువు)

36. మహిననల సమంబు మాత్సర్యమది యెంచ
మన్యవృద్ధికేడ్చు మత్సరుండు
మచ్చరంబు గల్గ మనసు సంతప్తము
విమల వినుతశీల వినురబాల
(మాత్సర్యము=మచ్చరము, సంతప్తమౌ=తపింపఁబడినది)

37. ఆత్మలోన రిపుల నరసిచూడవలయు
అరివిజేతగాదె ఆత్మవిజయు
ఆత్మజేయయనఁగ అఖిలలోకవరుడు
విమల వినుతశీల వినురబాల
(రిపుల=శత్రువుల, అరివిజేత=శత్రువులను జయించినవాడు, ఆత్మవిజయి=తననుతాను జయించినవాడు)

-: విద్యా, ధన, శీల తారతమ్యము :-

38. విద్య యున్నవాఁడు బెలయించు తనుదాన
ధనికుఁదన్ని విలుచు ధరణిలోన
శీలవంతుఁ డఖిల జీవుల మేల్బంతి
విమల వినుతశీల వినురబాల
(వెలయించు= ప్రకాశింపఁ జేయును, విలుచు=కొనును)

39. అర్థవంతుఁదందు నలఘుకీర్తి జగతి
అలఘుతరయశంబు నఖిలవేది
అలఘునయశంబు నమలశీలుఁ పొందు
విమల వినుతశీల వినురబాల
(అలఘు=గొప్ప, అలఘుతర=పైదానికంటే గొప్ప, అఖిలవేది=సమస్తము తెలిసినవాడు, అలఘుతమ=సర్వోత్తమమైన, అమలశీలుడు=స్వచ్ఛమైన స్వభావము కలవాడు)

-: మానవుల అల్పత్వము, అనిత్యత :-

40. పుడమిజీవులెన్నొ పుట్టి గిట్టుచునుండ
మానవుండు మిగుల మహిమఁగాంచె
సర్వశక్తియుక్తి సర్వంబుతానౌనె
విమల వినుతశీల వినురబాల
(గిట్టుచు=చచ్చుచు, సర్వశక్తియుక్తి=సర్వశక్తులుండుటచే)

41. అరయ విత్తవంతు నర్థంబు నశియించు
అఖిలవేది నరుఁడు నంతరించు
మహిత రాజులైన మహిలీనమౌదురు
విమల వినుతశీల వినురబాల
(విత్తవంతు నర్థంబు=ధనవంతునుడబ్బు, అంతమందు=నశించును, మహి=భువిలో)

-: తర్క, వేదాంత, విజ్ఞానశాస్త్రములు - వానిసారాంశము :-

42. తర్కశస్త్రమందు దైవమనుమితంబు
వేదశాస్త్రమందు వెలయునంత
భౌతికమునందు పరశక్తి లేదురా
విమల వినుతశీల వినురబాల
(దైవము=దేవభావము, అనుమితంబు=అనుమానముగా జెప్పబడినది, అంత=అంతట, భౌతికంబు=భౌతికశాస్త్రము, పరశక్తి=పరబ్రహ్మము)

43. బ్రహ్మ సత్యమయ్యుపరఁగు జగన్మిధ్య
అనుచు నాదిశాస్త్రులరసి యనఁగ
భానుమూలకంబు భౌతికంబయ్యెరా
విమల వినుతశీల వినురబాల
(జనమిధ్య= లోకము అసత్యము, ఆదిశాస్త్రులు=పూర్వశాస్త్రజ్ఞులు, భాను=సూర్యుడు)

44. ఇలను శాస్త్రశక్తినెంచి చూచుచునుండ
భౌతికంబె వాస్తవంబు ననుచు
జనుల భావమదియు జాగృతంబయ్యెరా
విమల వినుతశీల వినురబాల
(జాగృతంబు=మేల్కొన్నది (కన్నులు దెఱచినది))

45. విజ్ఞుఁడిచ్చెనొకఁడు విద్యుత్తు వరశక్తి
బుద్ధిశాలిగూర్చె పొగలబండి
అరసిశాస్త్రిగాంచె నాకాశవాణిని
విమల వినుతశీల వినురబాల
(ఆకాశవాణి=రేడియో)

46. దూరదృష్టినమర దూరశ్రవణయంత్ర
మాకసంపుయాన మరసి విజ్ఞు
లందఁజేసిరయ్య యతుల సాధనములు
విమల వినుతశీల వినురబాల
(దూరదృష్టీ=దూరదర్శనయంత్రము, దూరశ్రవణయంత్రము=టెలిఫోను)

47. అరయ నచ్చుయంత్ర మమరె శాస్త్రజ్ఞుచే
అన్యుఁడొక్కఁడు గడియార మిచ్చె
సిద్ధమయ్యె నొకనిచే జలాంతర్గామి
విమల వినుతశీల వినురబాల
(జలాంతర్గామి=నీటిలోపలనేపోవు నావ)

48. కృత్రిమగ్రహముల కీల్కొల్పె నొకరుండు
ధరణి చుట్టివచ్చె నర్వరుండు
చంద్రుఁజేరు శక్తి సాధింపబడుచుండె
విమల వినుతశీల వినురబాల
(కీల్కొల్పె=పొసగించె (కనిపెట్టెనని భావము)

49. భౌతికమున సవిత వస్తుబలముకాఁగ
హైందవమున బ్రహ్మ యఖిలగతము
నిచ్చలు రవికుంద నిత్యుఁడా పరమాత్మ
విమల వినుతశీల వినురబాల
(హైందవమున=హిందుమతమున, బ్రహ్మ=పరబ్రహ్మ, కుంద=క్షీణింప)

50. అణుచయంబు వస్తువని తేల్చినారయ్య
అణువు శక్తిమహిమ యద్భుతంబు
అనువుశక్తి చిక్కినఖిలంబు వశమండ్రు
విమల వినుతశీల వినురబాల

51. అణువుకంటె నణువు నధికు కంటె నధికుఁ
డరయ రూపు నామ మందకుండు
ఆదిమధ్యరహితుఁ డక్షరుండాబ్రహ్మ
విమల వినుతశీల వినురబాల
(అక్షరుడు= నశింపనివాడు)

52. అరయ నుండు నిందునందు లేడను బుద్ధి
వలదు నీకు జగతి వలఁతికాఁడ
అంతబ్రహ్మశక్తి యంతర్గతంబురా
విమల వినుతశీల వినురబాల
(వలఁతికాఁడ= నేర్పుకలవాడ)

-: మతాదులభేదదృష్టి -  అందలిగుణదోషములు :-

53. మతములన్ని అరయ మహిని దేవునె చెప్పు
మహితశక్తుఁడతఁడు మతములందు
మూలశక్తినమ్మి మూఢతన్ వీడరా
విమల వినుతశీల వినురబాల

54. పుట్టుభేదమరుదు పట్టుబేధమె కాని
గిట్టుభేదమున్నె గుట్టునరయ
పుట్ట గిట్టలేని పొరపది యేలరా
విమల వినుతశీల వినురబాల
(పట్టుబేధము=కల్పించుకొన్న బేధము)

55. వెఱపు నిద్ర భుక్తి వెలయు దాంపత్యము
జనులకెల్ల సమము జగతియందు
జాతిభేదమెన్ని జనహత్యలేలరా
విమల వినుతశీల వినురబాల

56. "అల్ల" "తండ్రి" ఈశ్వరాదిదేవులరయ
సర్వమూల నిత్యశక్తులంద్రు
మమత నమ్మువారె మతవాదు లెంచగా
విమల వినుతశీల వినురబాల
(మమతన్=అభిమానముతో)

57. మతములన్ని చూపు మహితఁజేరు పథము
కామ్యవృత్తి నరుల కార్యబోధ
పదవిభేదముండు ప్రాప్యభేదమరుదు
విమల వినుతశీల వినురబాల

58. దైవభక్తులన్న దమశమశీలురు
నమిత విజ్ఞనరులు నంద్రుగాదె
వారె మచ్చరంబు వహియించుటేలనో
విమల వినుతశీల వినురబాల

59. ప్రాంత-దేశ-ఖండ-జాతి-వర్ణ-మతాల
కార్మికాన్య కర్ష్కాన్యరీతి
భిన్నులగుచు నరులు ఖిన్ను లగుట యేల
విమల వినుతశీల వినురబాల

60. షియలు సున్నిలనుచు శిష్టులనుచు
కాధ్లిక్తదన్య కాములనుచు
బ్రాహ్మణాదులనుచు బాహ్యభేదములేల
విమల వినుతశీల వినురబాల

61. వర్ణ-జాతి "రంగు" వర్గ-మతాదులఁ
గలుగు భేదమరయ కల్పితంబు
వానిబేధమరయువారె మూఢులు గదా
విమల వినుతశీల వినురబాల

-: ధన్యజీవి :-

62. జగతిలోన నరయ సర్వమానవులందు
మాన్యచరితుఁడౌను ధన్యజీవి
అతఁడనిత్యుఁడయ్యు నందు నిత్యయశము
విమల వినుతశీల వినురబాల

63. ధన్యజీవి యెపుడు తాను గోరు యశము
దానికంటె నిత్యమైనదేది
నిత్యమౌటకల్ల నిఖిలవస్తువులెల్ల
విమల వినుతశీల వినురబాల

-: ప్రజాస్వామికము - నియంతృత్వము :-

64. "పదుగురెంచు బిల్లు పాటియై ప్రజలెంచ
పాలనంబు సాగు పట్టుగాను
ప్రజ్ఞు నొకని సూక్తి పాటింపఁబడదయ్య
విమల వినుతశీల వినురబాల

65. ప్రజలు తమకు నచ్చు ప్రాజ్ఞునెన్ను కొనఁగ
దేశమేలు నతఁ తేజరిల్ల
ప్రజలకు ప్రజలెంచ ప్రజలేలు రాజ్యంబు
విమల వినుతశీల వినురబాల

66. ప్రాతినిధ్యమందు ప్రజ్ఞు లెల్లరుఁ గూడి
చర్చ సలిపి చేయ చట్టమమర
ప్రజలపాలనంబు పరఁగ సాగుచునుండు
విమల వినుతశీల వినురబాల

67. ప్రజలు విజ్ఞులైన, ప్రాజ్ఞప్రతినిధుల
నెన్నుకొనఁగ వారు చెన్నుమీఱ
శుభదపథము నెంచి శోభింపఁబాలింత్రు
విమల వినుతశీల వినురబాల

68. అజ్ఞులైన జనులు ప్రజ్ఞలేని నరుల
ప్రాతినిధ్యమిచ్చి పంపఁగాను
సర్వజనుల మేలు సమకూర్చుటెట్లురా
విమల వినుతశీల వినురబాల

69. నాడు నాడులందు నిండు ప్రజాస్వామ్య
మమరి ప్రజలు వృద్ధినందు చుండ
పార తంత్ర్య ముక్తులైరపరజనులు
విమల వినుతశీల వినురబాల

70. హక్కుఁగోరు నరుఁడు పెక్కు భాద్యతలంది
ఆత్మదేశవృద్ధి యతిశయింప
దేశభక్తితోడ దేశంబు నేలురా
విమల వినుతశీల వినురబాల

71. ప్రజలప్రతినిధులను ప్రజల సేమము వీడ
పదవికాంక్ష పెరిగి పదుగురుండ
ప్రజలపాలనంబు ప్రజల నెటులఁబ్రోచు
విమల వినుతశీల వినురబాల

72. జనుల మేలు కూర్ప శాసనసభలుంట
ప్రజలపాలనంపు పరమపథము
శాసనంబు ఫలము సర్వసంగతమౌను
విమల వినుతశీల వినురబాల

73. అపరిపక్వబుద్ధి అన్యాపకారంబు
పదవికాంక్ష పక్షపాతగుణము
లంచగొండి తనము నెంచ మేలు చెఱచు
విమల వినుతశీల వినురబాల

74. రాజ్యమేలు పథమరయ నొకనికిఁ జిక్క
నతఁడె ధర నియంత యగుచునుండు
అట్టి యధిపుఁడేలు నాత్మేచ్ఛ దేశంబు
విమల వినుతశీల వినురబాల

75. స్వేచ్ఛ దేశమేలు వీరపాలకుఁడును
అఖిల శుభము గూర్తుననును కాని
వాని మాటకెదురు వచనంబు లేదురా
విమల వినుతశీల వినురబాల

76. ప్రజలవాణి నతఁడుపాటింపఁ బూనఁడు
వాని మాత వేదవచనమనును
దీక్షఁ జెప్పఁ బూన శిక్షించి చెఱఁబట్ట
విమల వినుతశీల వినురబాల

77. ధర నియంత తాను పరుల నమ్మఁడెపుడు
నమ్ము నతఁడు సేన నెమ్మితోడ
సేన విడిచి యతఁడు సేమంబుఁ గానఁడు
విమల వినుతశీల వినురబాల

78. అతఁడు పూనుకార్య మదియెల్ల రూపొంద
వేగమార్గమంది సాగుచుండు
కార్యహానిఁ దెల్ప కాలంబె యరుదురా
విమల వినుతశీల వినురబాల

79. సరిగఁ బాలనమది సాగించి కొందఱు
దేశహితమె కోరి దీక్షఁబూని
పెంపు చేయఁ జూచి పెరలెంతొ పొగడిరి
విమల వినుతశీల వినురబాల

80. నేత సుజన్ఁడైన నిత్య సౌఖ్యములబ్బు
చెనఁటి యైన నేమి చెప్పఁ గలము
ఎంచ క్రూరుఁడైన నికనేమి బ్రతుకురా
విమల వినుతశీల వినురబాల

81. మానవాళి యమిత మమతఁ జూపుచునుండు
వాద పథములెన్నొ వసుధఁగలవు
వాద మహిమ దెలుపు భావికాలము సుమ్ము
విమల వినుతశీల వినురబాల

82. ఆత్మజేత జయమునందు కుటుంబాన
ఇంత గెలిచి రచ్చ నితఁడు గెలుచు
గ్రామకార్యమెలయఁ గావించు నేర్పుతో
విమల వినుతశీల వినురబాల

83. గ్రామజేతకబ్బుగా మండ్ల జయంబు
మండలంబు నేలి మాన్యుఁడగును
జనుల సుఖము గూర్చు మొనగాఁడె నేతరా
విమల వినుతశీల వినురబాల

84. రాష్ట్రనేతయైన రాష్ట్రజనులఁ బ్రోచు
జనుల యాదరంబు జాణ పొందు
జాణ యైనవాఁడె జాతినేలును గదా
విమల వినుతశీల వినురబాల

85. చాగి యయ్యు నఖిల జనహృన్నివాసియై
సకలజనులు నాత్మ సమ్మతింప
దేశనేత జాతి దీక్షతోఁ బాలించు
విమల వినుతశీల వినురబాల

86. దేశజనులనేత దేశవృద్ధికిఁ బూను
దేశరక్ష సేయ దీక్షతోడ
దేశభక్తితోడ దేశంబు నేలురా
విమల వినుతశీల వినురబాల

87. ప్రజలనాయకుండు ప్రజలనాకర్షించు
ప్రజల దేశభక్తిఁ బరఁగఁ బెంచు
దేశహితముఁ గోరి దీక్షఁ బూనుచు నుండు
విమల వినుతశీల వినురబాల

88. ప్రజల హితము తనకుఁ బ్రథమ లక్ష్యంబను
ప్రజలకొరకు తాను ప్రాణమిచ్చు
ప్రజల నాయకుండు ప్రజల సేవకుఁడయ్య
విమల వినుతశీల వినురబాల

89. పూజ్యనేత నిలను బూజింత్రు ప్రజలెల్ల
నతఁడు గోర ప్రాణమప్పగింత్రు
రాజుఁ బట్టి జనులు రాణింత్రు జగతిలో
విమల వినుతశీల వినురబాల

90. స్వార్ధదృష్టి విడిచి సౌభాత్రమది నిల్పి
చింత సేయుచుండు సేవకొఱకె
మనుజసేవ నెంచు మాధ్వసేవఁగా
విమల వినుతశీల వినురబాల

91. దేశసీమ దాటి దేశదేశాలేగు
వసుధ జనులఁ గోరు వాసిగాంచ
సర్వ జనులసమత సాధింపఁ బూనురా
విమల వినుతశీల వినురబాల

92. జనుల భావ మరయ జాతిమతము వీడి
జనుల లక్ష్యమెన్ను సత్యదృష్టి
అఖిల సుఖము గోరు నాదర్శజీవియై
విమల వినుతశీల వినురబాల

93. ఒకరి నొకరు నమ్మి యొండొరు మేల్గోరి
లాభదృష్టి వీడి లగ్గు దలఁచి
అన్యదేశవృద్ధి నాత్మవృద్ధిగఁ జూచు
విమల వినుతశీల వినురబాల

94. విశ్వదృష్టి కలుగ విశ్వజనుల కెల్ల
నేతపూనవలెను నేర్పుగాను
నేతలందఱికిది నిత్య కార్యంబురా
విమల వినుతశీల వినురబాల

-: సుగుణములు :-

95. జగతి దానగుణమె జనుల నాకర్షించు
సదయశీలమిచ్చు సంతసంబు
త్యాగబుద్ధి పరమ హర్షంబుఁ గూర్చురా
విమల వినుతశీల వినురబాల

96. సామదానములిల సర్వశుభములిచ్చు
వినయశీల మదియు వెలయఁజేయు
పరుల మేలు సేయఁ బరమ పుణ్యము నబ్బు
విమల వినుతశీల వినురబాల

-: ప్రాణి ప్రపంచము :-

97. జీవకోటులన్ని జీవించు జగతిలో
ప్రకృతి సిద్ధభుక్తి నంది కాదె
వాసి పోదె నరుఁడు వంచింప భుక్తికై
విమల వినుతశీల వినురబాల

98. జీవకోటిలోని జీవమన్య మొకటి
వసన ధారి గాదు వసుధయందు
నరుని వసనధారణమహిమ గనుమోయి
విమల వినుతశీల వినురబాల

99. కోటి జీవులుండ కొలది సంపదచేత
కొన్ని ప్రాణు లదియు కొఱల కుండ
విత్తమున్న నరుఁడు వెలితి గాంచుట యేల
విమల వినుతశీల వినురబాల
(కొఱలక+ఉండ= పొందక-ఉండ)

-: విజ్ఞుల కర్తవ్యము :-

100. ప్రాణి మూలమరసి భావభేదము వీడి
లోక భావమెఱిఁగి లౌకికుండు
విత్తసక్తి విడక వెలుగు పథమె లేదు
విమల వినుతశీల వినురబాల

101. జగతి విజ్ఞనరుఁడు సత్యసంధతఁ గాంచి
శుద్ధశీలమంది వృద్ధుఁడయ్యు
మంచి పనులుచేసి మహిత యశమునందు
విమల వినుతశీల వినురబాల

102. భుక్తమరుగు నరయ పుట్టంబు చిగురును
పుట్టు జీవి గిట్టు పట్టు కొన్న
శాశ్వతంపు కీర్తి సాధింపఁ బూనురా
విమల వినుతశీల వినురబాల

-: పురుషార్థములు - తత్సాధనము :-

103. నరును చేష్టలెపుడు నాణెంబు చెడకుండ
రాజ సంఘ ధర్మ రక్తి నంద
అతఁడు ధరణి వెలయు నంచిత ధర్మాన
విమల వినుతశీల వినురబాల

104. అర్థ మూలమైన ఆసక్తజనములో
విత్తవంతుఁడయ్యు వెలయవలయు
ధర్మ బద్ధ సంచితార్థంబె రానించు
విమల వినుతశీల వినురబాల

105. ప్రకృతి బద్ధులయ్యు పరఁగ మనుజులెల్ల
కాంక్ష వీడి సలుపఁ గలరె తపము
ధర్మ బద్ధ కాంక్ష ధరణి శోభించు రా
విమల వినుతశీల వినురబాల

106. పరఁగ నిహమునందు పురుషార్ధముల మూటి
నెవ్వఁడాచరించు నెపుడునర్థి
పరమునందు మోక్షఫలమునందు నతఁదె
విమల వినుతశీల వినురబాల

సమాప్తం

No comments:

Post a Comment