Friday, June 28, 2013

అఘవినాశ శతకము - దాసరి అంజదాసు

అఘవినాశ శతకము
                                            దాసరి అంజదాసు (1932)

శ్రీ యేజనులకురత్నము
శ్రీ యేబహుసంపదలను జేకూర్పదగున్
శ్రీ యేభక్తికి మూలము
శ్రీ యేరక్షించుజనుల శ్రీరఘురామా!

గొప్ప బొజ్జయయ్య గుణములమాయయ్య
తప్పులెల్ల ద్రోసిదారిజూపు
గొప్పవాడవనుచు కొనియాడెదనుముందు
అంజదాసపోష అఘవినాశ!

వాక్కునందునాకు వసియించి మాతల్లి
చక్కనైనభాష జాలనొసగు
ధిక్కరించబోకు దీనుడనేతల్లి
అంజదాసపోష అఘవినాశ!

వేమనార్యులందు వేదభక్తులయందు
పూర్వకవులయందు బుద్ధినిల్పి
సార్వభౌములంచు సాగిలిమ్రొక్కెద
అంజదాసపోష అఘవినాశ!

నీలవర్ణుడైన నిఖిల ధాముండైన
బాలురామచంద్రు భక్తిగొలచి
అఘవినాశశతక మర్పించితిని నీకు
అంజదాసపోష అఘవినాశ!

ధనములిచ్చినిన్ను తనియింపగాలేను
మనసునిల్పి నీదుమహిమదెల్ప
బూనుశతకపద్య పుష్పంబులిచ్చితి
అంజదాసపోష అఘవినాశ!

1. తప్పులైనగాని ఒప్పులైననుగాని
మెప్పులైనగాని మిమ్మునమ్మి
చెప్పియుంతినయ్య శ్రీరఘురామయ్య
అంజదాసపోష అఘవినాశ!

2. గురునిజేరిమ్రొక్కి గుర్తందగాలేక
గుణవికారమింత కూడబెట్టి
తిరుగువారికెట్లు దీరునుకర్మంబు
అంజదాసపోష అఘవినాశ!

3. కపటవృత్తిచాల గలిగినవారలు
భక్తులెట్లు? పాపభటులజెట్టు
వీరినుండినన్ను విడిపించిరక్షించు
అంజదాసపోష అఘవినాశ!

4. సేవజేయువాని జిక్కుల బెట్టుట
భావ్యమేననీకు భక్తవరద
త్రోవజూపినాకు దొలగించుబాధలు
అంజదాసపోష అఘవినాశ!

5. మోసపుచ్చకయ్య ముద్దుల మాయయ్య
దోసిలొగ్గియుంటి త్రోవజూపు
దాసదాసునిపై దయయుంచిరక్షించు
అంజదాసపోష అఘవినాశ!

6. కాయమందునున్ను గనుగొనలేకను
సేయుచుంద్రుపూజ జనులుభువిని
ప్రాయమెల్లయిట్లు పాడుచేయుటదేల
అంజదాసపోష అఘవినాశ!

7. ఎన్నిజన్మలెత్తి యీజన్మకొచ్చితో
కన్నతండ్రి నన్ను కరుణజూడు
చిన్నతనముచేత జేసితిపాపముల్
అంజదాసపోష అఘవినాశ!

8. దేహభ్రాంతిచేత దేవుని గనలేక
మోహబాధజిక్కి మోసపోతి
యిహపరంబులేని యీజన్మమేలయా
అంజదాసపోష అఘవినాశ!

9. భక్తిలేనివారు పరమనీచులబోలు
యుక్తిలేకయున్న యూరకుక్క
వ్యక్తిలేనివాడు వ్యర్థమైపోవురా
అంజదాసపోష అఘవినాశ!

10. నీతికన్నవేరె జాతియందునులేదు
ఖ్యాతికన్నవేరె కాంతిగలదె
నాతికన్నగలదె నాణ్యమౌయందము
అంజదాసపోష అఘవినాశ!

11. జీవహింసజేయ దైవవంచన యౌను
జీవమందు బ్రహ్మజేరియుండు
జీవుబ్రహ్మమందు జేర్చిన సుఖమౌను
అంజదాసపోష అఘవినాశ!

12. అప్పుకన్న వేరె ఆపదేమియులేదు
మెప్పుకన్న భాగ్యమొప్పదెందు
ముప్పుకన్న వేరె గొప్పకష్టములేదు
అంజదాసపోష అఘవినాశ!

13. దాతలున్న యూరు దైవభక్తుల యూరు
భూతదయనుగల్గి బ్రోచుయూరు
భూతలంబునందు బోలును స్వర్గంబు
అంజదాసపోష అఘవినాశ!

14. పప్పు యన్నములవి పరమేశ్వరుని రూపు
ఉప్పు పులుసు నెయ్యి హృదయగుణము
గొప్పకూరలన్ని గోవిందుభూతముల్
అంజదాసపోష అఘవినాశ!

15. త్రిపుటిమధ్యనుండు దేవుని కనుగొంటె
అపుడెయోగులౌదు రయ్యలంత
దాపుజేరి గురుని దానిని గనరైరి
అంజదాసపోష అఘవినాశ!

16. ధనము యెవరి సొమ్ము దానమెవరిసొమ్ము
మనసు యెవరిసొమ్ము మహిని జనులు
ఘనులమనుచు దిరిగి ఘననీచులయ్యేరు
అంజదాసపోష అఘవినాశ!

17. తల్లికన్నవేరె దైవమెక్కడజూడ
కల్లుకన్న నీచ కైపులేదు
యిల్లుకన్న లేదు యిలక్షేత్రముల త్రోవ
అంజదాసపోష అఘవినాశ!

18. ఆలికన్న వేరె ఆత్మబంధువులేదు
కాలికన్నలేదు గట్టిబంటు
పాలుకన్నవేరె ఫలమెందుగలదయా
అంజదాసపోష అఘవినాశ!

19. జాతినెంచువాడు నీతినెన్ననివాడు
జాతినీతిలేని కోతివాడు
నాతినెంచువాడు నరజన్మమెట్లౌను
అంజదాసపోష అఘవినాశ!

20. కామక్రోధమందు కనకంబునందును
తామసంబు స్త్రీల దలచుటందు
నీమ మెల్లవిడువ నిందలపాలౌను
అంజదాసపోష అఘవినాశ!

21. మోహబాధజిక్కి మునుగుచుండేవారు
దేహసుఖములెట్లు దెలియగలరు
సాహసంబువిడక సరసులెట్లౌదురు
అంజదాసపోష అఘవినాశ!

22. దేశభక్తికొఱకు దేహమర్పించెడి
భూసురోత్తములను బొగడదగునొ?
మాంసకండలమ్ము మాలిన్యకాంతల
పొగడదగునొ? మీరెపోల్చరయ్య
అంజదాసపోష అఘవినాశ!

23. అన్నదమ్ములైన ఆలిబిడ్డలెయైన
కన్నతల్లియైన గాంచబోరు
ధనములేనివేళ దైవమేదిక్కగు
అంజదాసపోష అఘవినాశ!

24. అట్టివారునేడు యగుపడరెందైన
యెట్టిజన్మమరయ యెంచలేము
తిట్టికొట్టుకొనుచు తిప్పలు బడెదరు
అంజదాసపోష అఘవినాశ!

25. మనుజపుట్టు వందు మహిమీదజన్మించి
వచ్చివరములిచ్చి వసుధనేలె
తెచ్చిరామనామ తేజంబువిరజల్లె
అంజదాసపోష అఘవినాశ!

26. పుట్టగానె మిగుల భూతదయతో దిర్గి
పట్టి విల్లువిరచి ఫలముగాంచె
యట్టుపురుషశ్రేష్టు దాపదదొలగించు
అంజదాసపోష అఘవినాశ!

27. పాపుడయినగాని భక్తుడయిననుగాని
లోభుడైనగాని రోగిగాని
దాపుజేరిమ్రొక్క దరిజేర్చు రాముండు
అంజదాసపోష అఘవినాశ!

28. సభను ద్రుపదపుత్రి శరణార్తయైవేడ
అభయమిచ్చివేగ యతివబ్రోచె
సఫలపరచె కోర్కె చక్కని హల్యకు
అంజదాసపోష అఘవినాశ!

29. దాశరధిని సతము దలచెడి జనులకు
దోషరహితమైన త్రోవదొరకు
ఆశవిడువకున్న అతిపాపులయ్యేరు
అంజదాసపోష అఘవినాశ!

30. అన్నదమ్ములయెడ నత్తమామలపోరు
కన్నతల్లిపోరు కాంతపోరు
యున్నవారియిల్లు యెన్నగ తరమౌనె
అంజదాసపోష అఘవినాశ!

31. దానమందుగొప్ప దైవమందును గొప్ప
మానమందుగొప్ప మాటగొప్ప
మనుజుడయినవాడు గనుగొన్న ఘనుడౌను
అంజదాసపోష అఘవినాశ!

32. నీటియందు మంచి పాటయందును మంచి
బోటియందు నుంచి పొందుమంచి
వాటినెరుగువారి సాటెవ్వరిలలోన
అంజదాసపోష అఘవినాశ!

33. కూటమందు మంచినాత్యమందును మంచి
దీటునందుమంచి తేట మంచి
వాటినెరుగువారు కోటికొక్కరులేరు
అంజదాసపోష అఘవినాశ!

34. భూషణంబుగొప్ప భాషణంబులగొప్ప
వేషమందుగొప్ప వేటగొప్ప
శేషశాయి కైన చెప్పంగతరమౌనె
అంజదాసపోష అఘవినాశ!

35. రోషమందుగొప్ప రోగమందునుగొప్ప
మాటకటువుగొప్ప నీటుగొప్ప
ఆశయందుగొప్ప యడుగంటజేయరా
అంజదాసపోష అఘవినాశ!

36. ధర్మమందు మంచి మర్మమందును మంచి
నిర్మలంబు మంచి నేర్పుమంచి
కర్మవిడువకున్న గనుగొన తరమౌనె
అంజదాసపోష అఘవినాశ!

37. మహిషమందు గొప్ప మార్జాలములగొప్ప
వాహనంబుగొప్ప వరునిగొప్ప
దేహభ్రాంతిలేక దీనికర్థముగనుము
అంజదాసపోష అఘవినాశ!

38. వారకాంతగొప్ప వైరి వీరులగొప్ప
నారచీరగొప్ప నరునిగొప్ప
సారవంతులైన సరసుల కెఱుకౌను
అంజదాసపోష అఘవినాశ!

39. మచ్చరంబు మంచి నిచ్చలయందును మంచి
పచ్చయందు మంచి ఫలము మంచి
సచ్చరిత్రుడైన్ సారంబు గుర్తించు
అంజదాసపోష అఘవినాశ!

40. సత్యమందు గొప్ప శౌచమందును గొప్ప
ముత్యమందుగొప్ప ముక్తి గొప్ప
నిత్యమనుచు దెలియ నిర్వాణపధమబ్బు
అంజదాసపోష అఘవినాశ!

41. ధైర్యమందు గొప్ప శౌర్యమందును గొప్ప
కార్యమందు గొప్ప ఘనత గొప్ప
ఆర్యులందు గొప్ప అలవియే వర్ణింప
అంజదాసపోష అఘవినాశ!

42. మనుజ జన్మగొప్ప మంచికార్యముగొప్ప
తనువుత్రాణగొప్ప దాతగొప్ప
యనుచు తెలియురీతి నాత్మకు ఘనమౌను
అంజదాసపోష అఘవినాశ!

43. ఆడవారిమంచి అందలంబులమంచి
కోడెత్రాచుమంచి కోతిమంచి
గూఢచారిమంచి గుర్తింపతరమౌనె
అంజదాసపోష అఘవినాశ!

44. భోగవంతులైన త్యాగవంతులెయైన
రోగరహితులైన లోకమందు
యోగభక్తిలేక యుండదుమోక్షంబు
అంజదాసపోష అఘవినాశ!

45. సారమెల్లతెలిసి సత్యశీలముగల్గి
వేదమూర్తివగుచు వెలసియుండి
సూర్యవంశమందు శుభజన్మమందితో
అంజదాసపోష అఘవినాశ!

46. దానమింతలేక దైవభక్తియులేక
పాపభీతిలేక భయములేక
యున్నవానిబ్రతుకు నెన్నగతరమౌనె
అంజదాసపోష అఘవినాశ!

47. కాసుకాశబెంచి కామ్యకర్మముద్రుంచి
నీటుకాండ్రపొంచి నీతిమించి
దోషములను పెంచి త్రోవగానదు వేశ్య
అంజదాసపోష అఘవినాశ!

48. ఇట్టిమరుగుచేత నిలమీద బుట్టించి
కట్టివేసి మమ్ము కర్మచేత
బట్టిలాగుటేల పరమార్థమివ్వక
అంజదాసపోష అఘవినాశ!

49. కర్మజన్మమిచ్చి కష్టంలోనుంచ
ధర్మమౌన నీకు దనుజహరణ
సారవంతమైన సత్కృపజూపవే
అంజదాసపోష అఘవినాశ!

50. నిన్ను మమ్మియుంటి నిజభక్తితోనుంటి
నన్నుజూడమంటి నారసింహ
పన్నగేంద్ర తల్ప బాధలు దీర్పరా
అంజదాసపోష అఘవినాశ!

51. బాధపెట్టకయ్య భక్తుడ నీకయ్య
వాదమాడకయ్య వందనములు
బంధనంబు బాపి పాలించవేమిరా
అంజదాసపోష అఘవినాశ!

52. తిప్పలేలనాకు తీర్చవా భువిలోన
గొప్పవాడవనుచు గోరియుంటి
తప్పులున్న గాచి దయయుంచు నాయెడ
అంజదాసపోష అఘవినాశ!

53. పంతగించి నీవి పలుకరించగబోకు
చింతనొందియుంటి శ్రీనివాస!
ఇంతకక్షయేల యిటులొచ్చిబ్రోవుమా
అంజదాసపోష అఘవినాశ!

54. నేనుజేయుపనులు నెరవేర్పవెందుకో
పన్నగేంద్ర తల్ప పలవతనమ
నిన్నునమ్మియుంటె నిరసించ సరసమా
అంజదాసపోష అఘవినాశ!

55. ఎన్నిరోజులిట్లు యిడుములబెట్టుట
కన్నతండ్రి నీకు కరుణరాద!
చిన్నవానిపైని జెల్లునే పంతంబు
అంజదాసపోష అఘవినాశ!

56. ఆశ్రయించి నిన్ను అడుగుచుంటేనేను
శాస్త్రవాదమేల జయకృపాల
ఆస్త్రశాస్త్రవిద్య లటుజేయుచుంటివా
అంజదాసపోష అఘవినాశ!

57. తంత్రగానివోలె దానిదీనినిజేర్చి
ఇంద్రజాలమెల్ల యిలనుజూపి
మంత్రమహిమచేత మముగట్టివేయకు
అంజదాసపోష అఘవినాశ!

58. గారడిపనివల్ల కట్టివైచియుమమ్ము
కోరుదానిజూపి కోర్కెదీర్చి
చూరబెట్టునీదు సూక్షంబుదెలుపవు
అంజదాసపోష అఘవినాశ!

59. దొంగవానిబోలి త్రోవదప్పెదవేల
భంగమొచ్చునీకు బాపనయ్య
దిక్కునీవెనాకు దీర్చుమీబాధలు
అంజదాసపోష అఘవినాశ!

60. సందుగొందులందు సావిళ్ళుసత్రాలు
తిరిగితిరిగి తుదకు దిక్కులేక
బొందినుండి పోవబోవునా నీదిక్కు
అంజదాసపోష అఘవినాశ!

61. చక్కదనముజూచి చాలభ్రమలొజిక్కి
నిక్కుచుండునట్టి నీటుగాండ్ర
దిక్కుజూచి నీవు దిరుగుచుంటివయేమి
అంజదాసపోష అఘవినాశ!

62. మాయనీదిగాక మరియెవ్వరిదిలేదు
సేయుచుంటివిట్లు చిత్రములను
కాయమందుయుండి గారడిజేసేవు
అంజదాసపోష అఘవినాశ!

63. ఆశలోనుజిక్కి యానందమొందుచు
వేష్మేసియున్న వెఱ్ఱిజనులు
మోసమొచ్చువఱకు మూలంబుదెలియరు
అంజదాసపోష అఘవినాశ!

64. ఎంతొచిత్రమైన వేషంబుధరియించి
భూతలంబునందు భుక్తికొఱకు
పాతకంబులెన్నొ బహుజేయుచుండేరు
అంజదాసపోష అఘవినాశ!

65. తోలు తిత్తిలోని దొడ్డవానెరుగక
కాలమెల్ల రిత్త గడపుచుండ్రు
నీళ్ళులేనిచేప నిర్మూలమౌగద
అంజదాసపోష అఘవినాశ!

66. భక్తిలేనిభార్య బాధపెట్టునుగాని
శక్తికొలది సేవ జేయగలదె
వ్యక్తిలేనిదాని వదలివేయుటమేలు
అంజదాసపోష అఘవినాశ!

67. ఎంతొవేడుచున్న యేమిచెప్పవదేల
పంతమేలనయ్య భక్తవరద
నిందపాలుజేయ నీకు జెల్లునటయ్య
అంజదాసపోష అఘవినాశ!

68. పుట్టినట్టిచోటు బొత్తిగాదెలియక
అట్టులిట్టిదిరిగి అదరిపడుచు
గుట్టుగానలేక కూతలుగూసేరు
అంజదాసపోష అఘవినాశ!

69. స్త్రీలకన్నవేరె చిత్తచోరులులేరు
ఎల్లలోకమందు యింద్రజాల
మెల సల్పుచుండి మెలగుచునుండురా
అంజదాసపోష అఘవినాశ!

70. తప్పుజేయునాడు ధైర్యమెక్కువయుండు
అప్పుడప్పుడుండు అతిశయంబు
తప్పుదెలియునాడు తిప్పలువిశదమౌ
అంజదాసపోష అఘవినాశ!

71. భార్యరంకుజేసి భర్తనికోపించి
కార్యమెల్ల నదియె గడుపుకొనుచు
ధైర్యమెంతొజేయు దానికిజెల్లుగా
అంజదాసపోష అఘవినాశ!

72. భోగస్త్రీలు మున్ను పుట్టినప్పటినుండి
బొంకుమాటలెన్నొ ప్రోగుజేసి
రంకులాటయందు రంజిల్లుచుందురు
అంజదాసపోష అఘవినాశ!

73. మచ్చరంబుచేత మహిమగాంచగలేరు
యుచ్చగుంట దీని యునికిజూడ
పచ్చిమాంసపుతిత్తి పరికించిజూడగా
అంజదాసపోష అఘవినాశ!

74. అంటియంటకుండ ఆకాశముండెను
రెంటిమధ్యజూడు రేయిపవలు
యట్టిదానిజూచి యానందమందరా
అంజదాసపోష అఘవినాశ!

75. రెంటిమధ్యగాను రేచించిజూచితె
ఒంటిస్తంభమేడ యొకటియుండు
అట్టిదానిలోను హాయిగాపవళించు
అంజదాసపోష అఘవినాశ!

76. కంటిలోను మంచి గారడివాడుండి
ఆటలాడుచుండె నందముగను
అట్టివానిబట్టికట్టివేసియుజూడు
అంజదాసపోష అఘవినాశ!

77. పాపభీతిలేక పదరుచుండెడివారి
దాపుజేర్చకయ్య తండ్రినన్ను
చూపుజూచినీదు సూక్ష్మంబుదెలుపుము
అంజదాసపోష అఘవినాశ!

78. ఏరుపారుచుండు నేవేళజూచిన
ఆరుచేపలందు యాడుచుండు
నీరుత్రాగవచ్చి నిలచి మింగెనుకొంగ
అంజదాసపోష అఘవినాశ!

79. మూటిలోనిచాయ ముప్పతిప్పలుగాను
యేటివెంటబడియు యేగుచుండు
అట్టినీటిలోన అపరంజిస్నానంబు
అంజదాసపోష అఘవినాశ!

80. చంటిబిడ్డనెత్తి జంకులేకను స్త్రీలు
యెట్టిబానలైన యిలనుజేసి
అట్టివానిచేత ఆపదలనుబొందు
అంజదాసపోష అఘవినాశ!

81. మూటిమధ్యమంచి ముక్తికాంతయునుండి
పాడుచుండునెపుడు భక్తితొను
పాటుపడియుదీని భావంబు దెలియుము
అంజదాసపోష అఘవినాశ!

82. కుక్కలారుగూడి కూయుచుపరువెత్తి
పక్కనున్నవాని పైనబడియు
జంకులేకతిరిగి చావుకుసిద్ధమౌ
అంజదాసపోష అఘవినాశ!

83. బూటకంబుతోను పురములోపలజొచ్చి
ఆటలాడుచుండె నాదిశక్తి
కోటలోనుజేరి కొంపదిప్పలుదెచ్చె
అంజదాసపోష అఘవినాశ!

84. గానిమాయజూడ ధత్రిలోపలనేమొ
యెన్నిమాటలైన నెన్నజేసి
పన్నిబొంకుచుండు పరికింపతరమౌన
అంజదాసపోష అఘవినాశ!

85. మూటిదాటి అందు మూలంబుదెలుసుక
బాటగన్నవాడు పరమయోగి
సాటియెవరయ్య సారమెరిగినయంత
అంజదాసపోష అఘవినాశ!

86. ఆడువారిబుద్ధి అంగడిబోలు తా
గూడబెట్టుచెడ్డ గుణములెన్నొ
చెండివేయకున్న చెప్పినట్లినదిరా
అంజదాసపోష అఘవినాశ!

87. భారమంతనీవు బాపెదవనియెంచి
కోరివేడుచుంటి కోర్కెతోడ
భారమేమిలేక భక్తులరక్షించు
అంజదాసపోష అఘవినాశ!

88. లోకనిందలేక లోపమురానీక
సాకుమయ్యతండ్రి సౌఖ్యముగను
థిక్కరించువారి తిప్పలుబెట్టవా
అంజదాసపోష అఘవినాశ!

89. కండనమ్ముచుండు కాసులకాసించి
చెడ్డవారితోను జేరివేశ్య
దండనేమిలేదు దానికిభువిలోన
అంజదాసపోష అఘవినాశ!

90. కుంటియైనగాని గ్రుడ్డియైననుగాని
రోగియైనగాని రోతలేక
నింటజేర్చివాని నెంతో ప్రేమింతురు
అంజదాసపోష అఘవినాశ!

91. డబ్బులేకయున్న డంబంబుగాయుంటె
నిబ్బరంబుగాను నింటజేర్చు
సబ్బుబిళ్ళరుద్ది సరసునిదరిజేరు
అంజదాసపోష అఘవినాశ!

92. పెండ్లిలేనిస్త్రీలు పేరంటమునకెట్లు
నిండలోనుయుంచ నెటులజెల్లు
కండ్లుదెఱచిచూడ గనపడులోపంబు
అంజదాసపోష అఘవినాశ!

93. తాళిలేకస్త్రీల దైవమెట్లు విధించె
తల్లుదండ్రిలేని తనయులట్లు
కల్లయయ్యె వార కాంతల జన్మంబు
అంజదాసపోష అఘవినాశ!

94. ఆంధ్రదేశమందు నన్నిజాతులలోను
యింద్రజాలమయ్యె యిట్టికులము
ఆంధ్రులెల్ల వీరి నాదరించుటతగదు
అంజదాసపోష అఘవినాశ!

95. నేను నేనటంచు నీల్గితిరిగె వారు
"నేను" యనెడిదాని నెన్నవలయు
దానిగన్నవాడు ధన్యుడౌ యిలలోన
అంజదాసపోష అఘవినాశ!

96. మాయలోనెబుట్టి మాయలోనె బెరిగి
మాయలోనెజచ్చు మనుజులంత
మాయమర్మమేదొ మహిలోన యెరుగరు
అంజదాసపోష అఘవినాశ!

97. భర్తపూజలేక బరగెడు స్త్రీలెల్ల
వ్యర్థులయ్యువారు యమునిజేరు
మున్ను పతివ్రతంబు ముక్తి నొసంగదే
అంజదాసపోష అఘవినాశ!

98. ఒంటిలోని హముయున్నంతవఱకును
జంటనంటిదిరుగు సరసులెల్ల
ఒంటిపొంగముడుగ యొక్కరురాబోరు
అంజదాసపోష అఘవినాశ!

99. ఆత్మశుద్ధిలేక యాచారవంతులై
కూయుచుంద్రు చెడ్డకూతలెన్నొ
భక్తిలైనవారి భావంబు దెలియక
అంజదాసపోష అఘవినాశ!

100. కంటిలోన పెద్దగారడివాడుండె
ఇంటిలోనయుండె వేటగాడు
జంటలేకవాడు జరుపుచుండును వింత
అంజదాసపోష అఘవినాశ!

101. అమరచరితులైన యార్యులెల్లరునన్ను
అంజదాసటంచు యనుచునుండ్రు
ఆదిపూడిగ్రామమందున పుట్టుక
అంజదాసపోష అఘవినాశ!

102. హీనజాతి శబరి యెంగిలి పండ్లివ్వ
జ్ఞానమార్గమిచ్చి గావలేదె?
దీను డిచ్చుభక్తి దివ్యమాలికగొమ్ము
అంజదాసపోష అఘవినాశ!

శ్రీరామపాదుకల్ శిరమునదాల్చియు
మోయుచుంటిని నేను ముక్తికొఱకు
భక్తిమీరగ నీకు భవనంబు గట్టించి
అర్పింతు మన్నను ఆస్తిలేదు
పొట్టబువ్వకునేను భూములెల్లఁదిరిగి
పడరాని కష్టముల్ పడుచునుంటి
నిర్మలంబుగనేను నీదుసేవనుజేయ
ఘర్మదేహము జబ్బుగలిగియుండె
అఘవినాశ శతకమనెడు పుష్పంబులు
అర్పించుచుంటిని అయ్యనీకు
అట్టినీ భక్తపరుడనై యనుదినంబు
సేవచేయుచునుంటిని చింతదీర్ప
కామితార్ధములిచ్చియు కన్నతండ్రి
...... బ్రోవుము అఘవినాశ!

సమాప్తం

Friday, June 21, 2013

కుమతి శతకము - రాళ్ళబండి రాజయ్య కవి

కుమతి శతకము
                                            రాళ్ళబండి రాజయ్య కవి (1938)

1. శ్రీమద్రవికుల మండన
శ్యామాంగా భక్తరాజ సన్నుతసుగుణో
ద్ధామ అయోధ్యాపుర సం
ధామా దైతేయభీమ దశరధరామా

2. సుమతియని శతకమున్నది
కుమతిశతకమెచ్చట లేమి గూర్చితినిటులన్
గమనింపతగును దీనిని
సుమతియేమియనెడు శంక గోరక కుమతీ

3. సుమతికి యేటికి నీతులు
కుమతికి జెప్పవలెగాని క్షోణిస్థలిలో
కుమతిని బాగొనరించిన
సముదం చత్పుణ్యమబ్బు చయ్యన కుమతీ

4. కనుకనెచెప్పెద నీకిటు
వినుమా యీనీతులెల్ల విశదముగాగన్
జనియించు జ్ఞానసంపద
దినదినమభివృద్ధియగును దీనన్ కుమతీ

5. ప్రొద్దుననెలేచి శుద్ధిగ
పెద్దలకడకేగి మిగుల ప్రేమదలిర్పన్
పద్ధతిగా వందనమిడి
సుద్ధులు వినిచుండువాడె సుగుణుడు కుమతీ

6. బీదలుసాధులు బాపలు
మోదముతోనింటదిగిన మ్రొక్కిభుజింపన్
లేదనక కలుగుదానినె
భేదములేకుండ నిడుము ప్రీతిగ కుమతీ

7. దేవబ్రాహ్మణ వృత్తుల
గావింపకుము నాశనంబు గలిగినశక్తిన్
రావించి యిహపరంబుల
సేవింపుము యశము ముక్తి జేకురు కుమతీ

8. ఇద్దరు గూర్చొని మెల్లగ
పద్దుగమాటాడుచుండ బరుగుననటకున్
బుద్ధివిహీనత బోయిన
గద్దింతురునిన్ను వారు గనుగొని కుమతీ

9. పెద్దలతో వాదించుచు
గద్దరిగామాటలాడి గదమకుమెపుడున్
పెద్దరికము ధరనిలువన్
ముద్దుగనటియింతువేని ముక్తిర కుమతీ

10. వేదబ్రాహ్మణ ఋషులన్
సాధులనాదేవతలను సద్గురునిలలో
శోధించి గేలిజేయుచు
బాధించిన గూడు ఘోరపాపము కుమతీ

11. సరసములాడకు మెప్పుడు
విరసముగా బరిణమించి వికటించుసుమీ
మురిసిన వెంతనె తప్పక
వరుసన ఖేదంబునీకు వచ్చుర కుమతీ

12. బిరుసైన హయము నెక్కకు
దురుసుగమాటాడి శ్రుతుల దూషింపకుమీ
కురుచయగు బుద్ధివిడువుము
పరమాత్మున్ గొల్వుమెపుడు భక్తిన్ కుమతీ

13. చింతయొనర్పకు సిరికై
కాంతలతో కలహమునకు కాల్దువ్వకుమీ
సంతతము శ్రీగిరిజా
కాంతున్ భజియించి ముక్తి గాంచుము కుమతీ

14. పంతులని చెవినిబడగా
దొంతులచాటునకుబోయి దొరకక బడిలో
సుంతయు నిల్వకదిరుగుచు
రంతులుజేసినను చదువు రాదుర కుమతీ

15. దుడుకుతనంబన గూడదు
కడుప్రేమన్ బీదజనుల గాంచుము మహిలో
దడిపింగూడదెవరిన్
చెడువారల చెలిమిచేయ జేరకు కుమతీ

16. పడుచులను చూచికోరకు
చెడుమాటలనెప్పుడే న్వచింపకు మింటన్
బడియుండుము ధరలోనె
క్కుడుకీరితినీకు సతము గూడుర కుమతీ

17. అప్పిచ్చువారియెడ నీ
వెప్పటికిని తప్పువెదకి యేమాత్రంబున్
ముప్పుగలిగింపబోకుము
తిప్పలుబెట్టకుము ఋణము తీర్పుము కుమతీ

18. గుడికేగిన బడికేగిన
పెడముఖమున బోకుమెపుడు పెద్దలగనుచో
చిడుముడులాడన్ గూడదు
పుడమిదొరల యెదుటనీవు బొంకకు కుమతీ

19. కసిమిడి యెద్దును గొనకుము
విసిగించును నిన్నుమిగుల వేసవియందున్
బుసగొట్టి రొప్పుచుండును
పసజెడుటయెకాక కృషియు పాడగు కుమతీ

20. కులవిద్యలో బ్రవేశము
గలుగనియెడ బ్రతుకుదెరువు గానని యెడలన్
విలపింపక కృషి బేరము
సలుపుము చౌర్యంబు జేయ సాగకు కుమతీ

21. దిసమొలనుండుటకూడదు
పసిబాలురతోడగూడి పంతులుకడకున్
మసిగుడ్డనైనదాలిచి
పసమీరగ నరిగి చదువ వలెరా కుమతీ

22. రుచికలదని మితిమించక
నుచితముగా వచ్చెననుచు నోపికతో నీ
వెచటేనియు భుజియింపకు
పచనముగాకున్న మేన బామగు కుమతీ

23. వరుసయగుకామినులగని
సరసఁబుల నాడబోకు సరసుడవగుచో
నిరతిశయానందమునకు
బురికొల్పుముమనము నెపుడు పొందుగ కుమతీ

24. వరుసయు వావియులేకయ
దిరుగాడెడి దానిచేర దీసినముప్పౌ
మరువకు మెన్నడు దీనిని
గురుబోధయ యిద్దినీకు గురుతౌ కుమతీ

25. తగువాడదలచినప్పుడు
తగసల్పుము యింటనీదు తరుణీమణీతో
బగలంతజేయు జగడము
దిగనాడియు రేయి రతుల దేలర కుమతీ

26. మేలునకిడలోదలచిన
వాలాయంబెంతొ బీదవారల కిడుటల్
చాలగ వాడినపైరుకు
వీలుగవర్షించువాన విధమున కుమతీ

27. బాకీనిడలోదలచిన
తేకువగా బ్రాహ్మణునకె తెంపుగనిడనౌ
రాకున్నన్ ఫలమబ్బున్
నీకిహపరసుఖములొదవు నిజముగ కుమతీ

28. దానములజాడదెలియుము
దానఫలంబొదవునీకు తప్పక యెపుడున్
దానములలోన నుత్తమ
దానమ్ము నిదానమనుచు దలపర కుమతీ

29. మొగమోటమిచే న్యాయము
దిగనాడుచు నిష్టమైన తీర్పులుదీర్పన్
దగదనుచు దెలిసిబంధువు
పగయందును నొక్కటిగనె పల్కర కుమతీ

30. వడ్డీకాశవహించుట
అడ్డముతానొకనికుంట అవనీస్థలిలో
చెడ్డతనము గావుననది
విడ్డురపుపని యటంచు వెరచుము కుమతీ

31. నిజమాడు వానికిలలో
భుజియింపన్ గూడులేదు పోనిమ్మని నీ
సుజనత విడువకు మెప్పుడు
కుజనుడవై యనృతమాడ గూడదు కుమతీ

32. భజియించు బ్రహ్మవేత్తల
ద్విజులను సాధులమునుల దేవతలనెదన్
నిజమైన పదవిదొరకును
గజిబిజియగు సంచితంబు గాలుర కుమతీ

33. పథ్యము జెరచినరోగము
నిత్యముగాతిరుగబెట్టి నీల్గగజేయున్
మృత్యువునకె అదిజెరచుట
సత్యమునామాట వినుము చాలుగ కుమతీ

34. భగవంతుడు నీకిచ్చిన
తెగువన్ నీకడుపునిండ దిని సౌఖ్యమునన్
తగినంతయొరుల కొసగుము
సగమునసగమైన నిడిన జాలును కుమతీ

35. గుడిపెత్తనంబు జేయకు
మెడబాయకుగురునిసేవ నెప్పుడుభక్తిన్
పుడమిన్ జనించినందుకు
మడిదున్నకబ్రతుకమంటి మహిలో కుమతీ

36. కన్యావిక్రేతలకడ
నన్యులుభుజియింపగూడ దదియెట్లనన్
కన్యావిక్రయ విత్తము
మాన్యుల కిల దలప గోవుమాంసము కుమతీ

37. ధనమున్న దనుచు నెప్పుడు
మనమున గర్వింపబోకు మత్సరమున స
ద్వినయముగొల్పిన జగతిన్
బనులన్నియుచక్కనౌను బాగుగ కుమతీ

38. నినునీవుబొగడు కొనకుము
ఘనముగపరనింద జేయ గడగకు మెపుడున్
పనిమాలితిరుగ బోకుము
అనుమానంబున్నచోటు కరుగకు కుమతీ

39. పగవాని యింటదినుటయు
బగవానికి కుడువనిడుట బారుటయనిలో
తగవున్నచోట నిల్చుట
మగువకుగోప్యంబుతెలుప మానర కుమతీ

40. ఆకలియుడిగిన కుడుపును
పాకమ్మొనరింపలేని పడతులబ్రతుకున్
పోకిరివారల నటనలు
లోకములోజూడచాల లోపము కుమతీ

41. వరదక్షణ ఇడకున్నన్
ధరలోపల బెండ్లిజేయ దరమా వరుడా
కరవయ్యె కన్యకెట్లని
పరమార్ధము జెరచబూన వలదుర కుమతీ

42. నమ్మకు వేశ్యల వైశ్యుల
నమ్మకు మపసవ్యస్త్రీల నమ్మకుజడులన్
నమ్మకుజారుల చోరుల
నమ్మకుమా త్రాగుబోతు నరులన్ కుమతీ

43. శరణన్నవారి జెరచకు
కరుణ నభయమొసగివేగ గావుముధరలో
సరిరారు నీకునెవ్వరు
పరమార్ధమునందు మంచిపద్ధతి కుమతీ

44. వంచింప నెంచకెవరిని
ముంచకు మా బాకిదార్ల మోసమొలర్పన్
పెంచకుమెదలో నీర్ష్యం
బుంచకు ఋణశేషమవని నొప్పుగ కుమతీ

45. టక్కరిమాటలజెప్పకు
మక్కువగా నిజముబల్కు మర్మమువిడి నీ
వెక్కడనైనన్ మితముగ
చక్కెరతీపియన ధాత్రి చయ్యన కుమతీ

46. శ్రమజేసి చదువుమయ్యా
జమజేతువు ధనముమిగుల జగతీస్థలొలో
శ్రమదీరు సార్ధకంబగు
గుమిగూడి నుతింత్రువేడ్క గొననిను కుమతీ

47. జూదములాడుట బిడ్డల
వేదమ్ముల నమ్ముకొనుట వెలదులతోడన్
వాదించుట పంక్తులలో
భేదముజూపుట అదర్మవృత్తిర కుమతీ

48. ఇలసంసారముజేసిన
పలువురు నేర్చెడుతెరంగు బాగగు సిరితో
నలువురు నవ్వగజేసిన
ఫలమేమిరసతము పస్తు బండుచు కుమతీ

49. పరువిచ్చి పరువుగాంచుము
బరులకు మర్యాదజేయ బాల్పడుమెపుడున్
దొరయైన నీచుడైనన్
పరువుగ మాట్లాడగొప్ప పద్ధతి కుమతీ

50. తాననుభవింప నొల్లక
దానంబు ధర్మంబు లెక ధనధాన్యములన్
కోనన్ దాచిన తుదకవి
మానవనాథునకు గాక మానవు కుమతీ

51. కుటిలురుజెప్పిన వాక్యము
లెటువంటివొ తెలిసికొమ్ము యింగితమునలో
దిట్టమొనరింపుము నీపని
మటుమాయపుమాటలనుచు మానుచు కుమతీ

52. మాసినవలువలు గట్టకు
పాసినయన్నంబు బండ్ల భక్షింపకుమీ
నాసికము సభను జీదకు
మోసముగల పనులనెపుడు ముట్టకు కుమతీ

53. కూర్చుందదలచినప్పుడు
మార్చకయుండెడు స్థలంబు మనమునముందే
యేర్చుకొని చూచికూర్చొన
దీర్చినసభవారు మెచ్చు తెలివది కుమతీ

54. కోరకుమెప్పుడు నేదియు
కోరకయేవచ్చు నీవుకుడువగనున్నన్
కోరివచ్చునె రానివి
కోరకరాకున్న వెతల గొనుటయ కుమతీ

55. క్షితిలోన మంచిపనికై
జతగూడరు రమ్మటన్న జగడంబనినన్
ప్రతిమనుజుడు కాల్దువ్వున్
అతులితముగనెల్లవేళ లందున కుమతీ

56. సిరివచ్చిన ధరహెచ్చిన
బరువడిగానేరువచ్చి పారినక్షితిలో
కరువొకటి యావరించిన
స్థిరముగనుండవనుమాట సిద్ధము కుమతీ

57. బాగుపడెడు వాడితరుల
బాగేతనబాగటంచు భావించుమదిన్
ఓగుపడువాడు సతతము
నోగేయితరులకు గోరు నొప్పుగ కుమతీ

58. కష్టమువచ్చిన వెంతనె
నిష్ఠురములనాడి దైవనింద యొనర్పన్
భ్రష్టత్వమొదవు నీవది
స్పష్టముగా దెలియవలయు జగమున కుమతీ

59. వాసిగ కృష్ణాతీరము
భాసురమగు కాశియనుచు పరమమునీంద్రుల్
వాసముజేసిరి వరుసగ
భాసిల్లును బుణ్యమిచట బాగుగ కుమతీ

60. గురుశుశ్రూష యొనర్పక
మరచియు మంత్రంబు జేర మరియొకగురువున్
నరునకు తప్పదు నరకము
మరియెన్నడు జేయకిట్లు మహిలో కుమతీ

61. వింతలమారిది లోకము
చింతలకాస్పాదముగాన స్థిరమౌ సుఖమా
వంతయులేదిక యేటికి
బొంతదగులవేసి ముక్తిబొందుము కుమతీ

62. సర్వముతానైయున్నన్
పూర్వాచారంపువిధుల బూనుచునీవీ
యుర్విని దిరుగుచు సాక్షిగ
నిర్వాణసుఖంబు జెంద నేర్చుము కుమతీ

63. సరసజ్ఞుడ నేననియెడి
బరువెంతయొ యెత్తికొనిన భక్తుడవనుచున్
గరువముబొందక నిరతము
గురువులసేవించి ముక్తి గొనరా కుమతీ

64. నొసటన్ వ్రాసిన వ్రాలది
మసిబొట్టేయయినకాక మఱియొకటైనన్
వెసదుడిచివేయవచ్చునె
మసిగాదది బ్రహ్మవ్రాత మారదు కుమతీ

65. తుమ్మిన పయనముగాకుము
నెమ్మదిగానొక్కనాడు నెలకొనియింటన్
సమ్మతిగ మరుదినంబున
బొమ్మనివచియింత్రు సర్వబుధులిల కుమతీ

66. కుందేలెదురై నప్పుడు
తొందరపడిపోకు నీకు తోడగుమృతియున్
ముందలరకృష్ణ సర్పము
పొందుగ మాసంబులారు బోకుర కుమతీ

67. నినుపయనపు ప్రారంభం
బున కాకమ్మెడమనుండి బోయినకుడికిన్
ఘనమైన మేలుగల్గును
చననెడమకు గొప్పకీడు సత్యము కుమతీ

68. పిల్లియెదురైన బోకుము
మళ్ళుము నీవింటికపుడె మఱియొకనాడున్
వెళ్ళగ దలచినచో మూ
ణ్ణాళ్ళుండియు నాపయి జనందగు కుమతీ

69. మీరకుమీ తలిదండ్రుల
చేరకుమీ దుష్టజనుల చెంతకునెపుడున్
కోరకుగా కుండెడిపని
ఏరకుమీ బుధుల తప్పు లేవియు కుమతీ

70. పచ్చికకై పశువులు ముని
ముచ్చులుదోపిళ్ళ కొరకు మూర్ఖు లనికి బల్
మెచ్చుచువత్తురు గావున
హెచ్చరికన్ కలిగియుండు మెప్పుడు కుమతీ

71. ఎప్పుడు శ్వానము లేడ్చిన
తప్పకతద్గ్రామమున కొదవు కీడెంతో
ముప్పగును గృహమునందున
గొప్పగ జగడము రోజు గూడదు కుమతీ

72. సారాత్రాగెడి వారికి
జీరాడునుపంచ సిగ్గరిబోవన్
నోరాడతగులు తన్నులు
మారాడిన బంధమిడక మానరు కుమతీ

73. పెద్దలుజెప్పెడి మాటలు
చద్దులమూటలని తెలిసి సఖ్యముతోడన్
యొద్దికతో దనెప్పుడు
పద్ధతిగానడచువాడె ప్రాజ్ఞుడు కుమతీ

74. పాపముపుణ్యం బెరుగక
నోపికతోక్రుధనువిడక నొప్పుగనహమున్
బాపకయెట్లగుముక్తుడు
పాపటనరువగనెగాదు పతిహిత కుమతీ

75. మతికుదిరిన గతిగుదురును
శ్రుతిగుదిరిన పాతగుదురు సొంపుగనుండున్
సతి సతి యగుచో సుఖమగు
హితమొదవిన యీటెకత్తె యింపగు కుమతీ

76. కరణీక మబ్బినంతనె
అరుణోదయమట్లు తెలివి యద్భుతమగు ని
ద్ధరిణిని నెవ్వనికైనన్
కరుణయునాతనికి వాక్యగతమగు కుమతీ

77. మోదమున ప్రొద్దుబోకయె
వాదప్రతివాదములుగ వరసన్ నేనీ
వాదముసల్పితి నీతిగ
పాదైయీలోకమందు భాసిల కుమతీ

78. చందంబుచదివి యెరుగను
కందములన్ జెప్పినాడ గావునదీనిన్
సందియములున్న దిద్దన్
వందనములొనర్తు నార్య వరులకు కుమతీ

79. నగుబాటు శతకమంచున్
నగిమీరెగతాళిచేసి నన్నపుడిలలో
తగనింద జేయవలదని
పొగడెదనే బుధులనెపుడు పొలుపుగ కుమతీ

80. తప్పులను దిద్దియిందున
నొప్పులసమకూర్చివేగ నోపికతోడన్
తప్పకగరంధము సాంతము
ముప్పదిగాజూడుడంచు మ్రొక్కెద కుమతీ

81. భారద్వాజస గోత్రుడ
కూరిమినరసింహ యాఖ్యు కొమరుడనై సీ
తారమణికి పిచ్చమకున్
నేరమణుడనైతి ధారుణీస్థలి కుమతీ

82. క్షితివెంకట లక్షంబా
సుతవర్గమునందు నగ్రజుడనై జన్మిం
చితి శ్రద్ధదోపగ జె
ప్పితి నీకీ నీతులెల్ల వినరా కుమతీ

83. నైజాము రాష్ట్రమందున
భూజననుత చింతిరేల పురిమునసబుగా
రాజాజ్ఞా బద్ధుడనై
నేజరిపితినలుబదేండ్లు నిష్ఠన్ కుమతీ

84. శ్రీరాళ్ళభండి వంశో
ద్ధారకుడన్ రాజయాభిదానుడనేనీ
సారతరంబగు శతకము
కూరిమిజేకూరునట్లు గూర్చితి కుమతీ

85. కృష్ణా తీరనివాసుడ
కృష్ణాప్తునినీలగళు భజించెడివాడన్
విష్ణుతనూజాన్వయ వ
ర్ధిష్ణుడవిద్వత్ప్రియుండ ధీరుడ కుమతీ

86. ప్రవిమల మానసభక్తి
స్తవమగుశ్రీనీలకంఠ శతకంబేనున్
జవసంపూర్తియొనర్చితి
భవరహితము దానిచదువు బాగుగ కుమతీ

87. రవిసోములుండు వరకున్
భువిలో నీశతకమధిక పూజ్యంబనగన్
ప్రవిమలగతి వెలిగెడున
క్కవిరాజున కమితయశము గల్గగ కుమతీ

88. ఈశతక మెవ్వరేనియు
నాసక్తినిచదివివ్రాసి నట్లైన మహా
క్లేశమ్ములనడచి ఉమా
ధీశుడుమోక్షంబు నిడు క్షితీస్థలి కుమతీ

89. సిరిసంతు పరిణయంబులు
కరితురగాందోళికాది ఘనవాహనముల్
దొరతనము చత్రచామర
పరివారము పాడిపంట ప్రబలుర కుమతీ

90. గురురాయ కరుణచేతన్
పరిపూర్తి యొనర్చినాడ పద్యములనికన్
సరిపుచ్చెద మరియొక్కటి
విరచించెద వేమనారు విధముగ కుమతీ

91. జయ సీతారామహరీ
జయ  నారాయణముకుంద జయగోవిందా
జయ విష్ణు నారసింహా
జయ కృష్ణ యటంచు బల్క కయముర కుమతీ

92. కందములను పువ్వులచే
సుందరమగుమాలగూర్చి శుభములనెల్లన్
జెందగ శ్రీరామునిగళ
మందునవేసితిని యెల్లరౌనన కుమతీ

93. రాయవరపురము నందున
స్థాయియగు చిదంబరాఖ్య సద్గురుకృపచే
పోయెన్ జన్మము లింతట
వేయరజయభేరి జగము వినగన్ కుమతీ

94. ఏమహనీయుడు జెప్పెనొ
యీమహిలోసుమతిశతక మింపుదలిర్పన్
యామహిమన్ గొనియాడుచు
నామహిమాఢ్యునకుమ్రొక్కు మనెదన్ కుమతీ

95. ధరవేణు గోపబాలుడు
కరుణాకరుడైన నీలకంఠేశ్వరుడున్
చిరయశమునొసగి నినునను
మరువకబ్రోచెదరుగాక మక్కువ కుమతీ

96. స్థిరలీల నిలువగానీ
శ్వరవత్సర చైత్రకృష్ణ సప్తమిశశి వా
సరమందున యీశతకము
పరిపూర్తియొనర్చినాడ భక్తిన్ కుమతీ

97. శాంతమున సంచరించుము
స్వాంతమురంజిల్ల నీతిచాటితిభువిలో
బ్రంతిన్ జెందకు మికనీ
కెంతోయశమొదవుముక్తి యొసగున్ కుమతీ

98. పరమపదంబున జేరుము
నిరుపమ నిర్వాణ లక్ష్మినీకులభించున్
స్థిరమగునా నందము జే
కురు శివజీవైక్యసిద్ధి జేకురు కుమతీ

99. శ్రీరామ రామయనిమది
నారూఢిగభజనజేసి యతులితభక్తిన్
శ్రీరాముని కృపచేతన్
నోరూరగనీతులెల్ల నుడివితి కుమతీ

100. కుమతివిని నీతులెల్లన్
సుమతిగస్వస్థానమునకు సుఖముగనరిగెన్
భ్రమవదిలి బ్రహ్మపదవిని
రమియించెన్ గానజన్మ రహితము కుమతీ

101. శ్రీకర మంగళదాయక
ప్రాకటసీతాకళత్ర భవ్యచరిత్ర
లోకాతీత పరాత్పర
చేకొనుమిదె మంగళంబు శ్రీరఘురామా

102. మంగళము రామచంద్రా
మంగళము పవిత్రగాత్ర మాన్యచరిత్రా
మంగళము రవికులోత్తమ
మంగళము కృపాసమేత మహిజానేతా

గద్య
బ్రహ్మశ్రీ రాళ్ళభండి రాజయ్య
గారిచేత రచింపబడిన
కుమతీ శతకము
సంపూర్ణము

Tuesday, June 18, 2013

భీమేశ శతకము - దేవరకొండ అనంతరావు

భీమేశ శతకము
                                        దేవరకొండ అనంతరావు

1. కం. శ్రీకర! యోసద్భక్త వ
శీకర! రిపుభీకర! సురశేఖర! హర! మో
క్షాకర! రజనీకరధర!
శ్రీకఱకంఠా! తలంతు శ్రీభీమేశా.

2. కం. అందములగు కందములను
మందార సుమంబులేరి, మాలగ నత్యా
నందంబునఁ గూర్చితినో
యిందుధరా! దీనిఁదాల్పుమిక భీమేశా

3. కం. దొసఁగులనేకములిందు
బొసఁగిన భవదీయనామమున్బొగడుటచే
వెసనూహింపరుగద బుధు
లిసుమంతయుఁ గూడదీనినిల భీమేశా.

4. కం. భక్తులఁగాచెదవంచు
న్శక్తివిహీనులనుఁగాచు శక్తుఁడవని స
ద్భక్తిని నినుఁగొలిచెదనిఁక
ముక్తిని దయసేయుమో ప్రభూ భీమేశా

5. ఈశా! గౌరీశా! వి
శ్వేశా! రిపునాశ! యో మహేశా! పోషా!
యాశా పాశవినాశా!
నాశరహిత! దయనుగనుమునను భీమేశా

6. కం. బసవన్న నెక్కుదంచుం
దిసమొలవాఁడంచునిన్నుఁ దిట్టేడివాడీ
వసుధనుఁ గసవును మెసవెడు
పసరముతో సాటియౌను ప్రభు! భీమేశా

7. కం. ధరణిరధము దానికి దిన
కర, శశి చక్రములు, మిన్కుగమితురంగంబు,
ల్థరణీధరమే ధనువును,
హరి నీశర, మజుఁడుసూతుఁడట భీమేశా

8. కం. హర! శశిధర! హరిశర! భూ
ధరధర! గౌరీవర! వరదా! పరమేశా!
సురపర! స్మరహర! సుగుణా
కర! గంగాధర! గురు శుభకర! భీమేశా

9. శివ! మాధవ! సరసీరుహ
భవ! యననొక్కటియకాదె? భవభయనాశా
భువనావళిపోషా! త్రిపు
రవినాశా! యీశా! యొహరా! భీమేశా

10.నందీశుఁడు, భృంగీశుఁడు
బృందారకు, లజుఁడు, హరియు, ఋషివరులిలనీ
సుందరపద పద్మంబుల
నందముగాఁగొల్వఁ జెలఁగుహర! భీమేశా

11. కం. ఒక్కడఁవటఁ, రక్కసులనుఁ
జెక్కుదువఁట; భక్తతతికిఁ జిక్కుదువఁట, నీ
దిక్కునుఁ గోరినవారికి
దక్కుదువఁట, నిక్కమేకదా భీమేశా

12. మృత్యుంజయ! జితదానవ!
నిత్యుండవు నీవయనుచు నిర్మలమతితో
సత్యస్వరూప! తలతును
నిత్యంబును నిన్నుమదిని, నే భీమేశా

13. కం. ఒకభక్తుఁడు నీకైతన
సుకుమార కుమారుఁజంపెఁజోద్యమకదె! వే
ఱొకఁడాలిని నీకొసఁగడె
యకలంకా! యోయుమాంక! హర! భీమేశా

14. విలు, కాంచనమేకద? భీ
షలఁగూర్పఁగ విశ్వకర్మ సన్నిధిలేఁడే?
యిలఁబాపనగలఁదాల్చఁగఁ
గలరూపునువేగఁదెల్పఁ గదె? భీమేశా

15. కం. ఎందునుఁగలవని జనులను
చుందురుగద, నీదుజాడఁ జూచితిగానీ
సుందరరూపముఁ గనలే
దిందుధర! కతముఁదెల్పవే? భీమేశా

16. కం. శంకర! యందునొ? భక్త వ
శంకర! యనిపిలితునో? హర! శశిధర! గౌరీ
శంకర! మృత్యుభయంకర!
యోంకారాకార! యందునో? భీమేశా

17. కం. పిలచినఁ పలుకవడేమకొ?
యలుకానాపై ననర్హుఁడన? ధూర్తుడనా?
కలుషాత్ముడఁనా? జగతి చ
పలమతినా? దెల్పి కావవా భీమేశా

18. కం. జయమున్బొందిన నాప్రతి
భ, యటంచుందలతులేని పట్టుననీదౌ
దయలేదందును జడుఁడను
దయతో మన్నించికావు ధర భీమేశా

19. కం. పాపాత్ముఁడనేయైనం
దాపసమందార! నన్నుదయఁజూడకిటుల్
కోపింపనగున? తగునా?
నీపుత్రుఁడఁగాననటయ్య నే భీమేశా

20. కం. పలికెడిది నీదునామము
పలికించెడివాఁడవీవు పలుకఁగ పాపం
బులు దొలఁగునంత హర! నీ
పలుకులు సుధలొలుకునఁటయ భవ! భీమేశా

21. సీ. ఒకటినేఁ దలఁచిన నీ
వొక్కటిఁజేయంగఁబోదు వుచితమ? నీకో
ముక్కంటీ! తెలుపుమయా
నిక్కముగను వేడికొందునిను భీమేశా

22. కం. ఒకనిముసంబానందం
బొకనిముసము దుఃఖమౌచునుండునిలను గా
డొకొ? నీమాయనుఁ గాననౌ
నొకొ? భువినాబోఁటి వానికో భీమేశా

23. కం. మామావారాశి ననుం
ద్రోయఁగలెస్సంచు నీకు దోచెనే? యికనే
జేయునదెయ్యదు? యెందుం
బోయెద, వెరవెద్ది? యోప్రభూ! భీమేశా

24. కం. నీ పరమభక్తులకు భువి
నాపదలేరావు, గాని యటువచ్చినచో
నో పశుపతి! భక్తినిఁగన
నీపన్నాగమనియెంతు నే భీమేశా

25. కం. వినలేదకొ? నామొఱలను
వినియును రక్షింపకుండ విడిచితివొక్కో
మనసెట్టులొప్పె? యిటుఁ జే
యను నీకోదీనబంధు! యజ! భీమేశా

26. కం. విశ్వేశ! విశ్వకర్మా!
విశ్వంబర! విశ్వనాథ! విశ్వవ్యాపీ!
విశ్వవినాశా! యీశా!
విశ్వకరా! కరుణఁబ్రోవవే భీమేశా

27. కం. నీభక్తుల సహవాసము,
నీభజనము, నీదుభక్తి, నీసేవయు, నా
కీభువి దయసేయఁగదే
యోభవనాశా! యమేశ! యోభీమేశా

28. కం. కాలుని భతూలకుఁజిక్కెడు
కాలంబున నిన్నుఁదల్పఁగలనో లేనో
కాలాంతక! కాన నిపుడె
నీలీలలఁబొగడుచుందు నే భీమేశా

29. కం. సుగుణుల కాపదలిడుదువు
సుగుణరహితులన్నఁ గరుణ జూతువు ధర్మం
బగునకొ? నీకిది శివ! యో
జగతీవర! భక్తపర! యజా! భీమేశా

30. కం. ఎట్టులుకాలముఁ గడుపు ద
దెట్టులు సంసారవార్ధినీదుదు నినుఁ జూ
పట్టెడు మంత్రంబెట్టిది?
గట్టిగనినుఁగొల్తుఁదెల్పఁగదె భీమేశా

31. కం. ఎవ్వాఁడు లోకపాలకుఁ
డెవ్వాఁడీశ్వరుఁడు, నభవుఁడెవ్వఁడు శర్వుం
డెవ్వఁడు, భవ్యచరితుం
డెవ్వండౌ? నీవయేకదే భీమేశా

32. కం. జడమతి, నిడుములఁ దడబడి
కడుపడి, సెడి, నీయడుగులకడఁ, బడ నీవీ
యెడఁజేవిడ, నోమృడ! యే
యెడకేగుదు మగుడఁ? దెల్పుమిక భీమేశా

33. కం. కనికరపుంగనీవేయగు
దని, కరములమోడ్చివేఁడ నారసిమొఱలన్
విని, కరముగాచెదని విబు
ధనికరము, నినుంబొగడుఁగదా భీమేశా

34. కం. పరమ మునీశ్వరులెవ్వని
చరణంబులఁగొలుచుచుంద్రు సతతముభక్తిన్
పరమేశ్వరుఁడెవ్వండగు
కరుణాళూనీవయౌదుగా భీమేశా

35. కం. కలియుగమున నూనామముఁ
దలచినమోక్షంబునిచ్చి తనుపుదు, హాలా
హలధర! గౌరీవర! యో
కలుషవిదూరా! హర! శుభకర! భీమేశా

36. కం. ఎవఁడీభవసాగరమును
శివనామంబనెడి నావచే దరిఁజేరన్
భువినాశించునొ వాఁడే
భవనాశా! పొందుముక్తి వరభీమేశా

37. కం. శివ! శివ! యని మదిఁదలచిన
భవభందములెల్లవేగఁ బాయునుగాదే
భవనాశా! యో యీశా!
ధవళేశా! దాసపోష! ధర భీమేశా

38. కం. ధన, పుత్ర, మిత్ర, బంధులఁ
గని, నిత్యమిదేయటంచుఁ గాసంత నినుం
గనలేక, పాపకూపము
ననుఁబడి, ప్రజమ్రగ్గఁ గూడునా భీమేశా

39. అంతకునడచితివని, యా
ద్యంతములిల లేనివాఁడవని, నిచ్చలు నే
నెంతయు వేడంగ, దయ ర
వంతైననుఁ జూపవేమయా? భీమేశా

40. కం. చదువులువేయిలఁ జదివిన
మదనహరా! యెందుఁబనికిమాలినవేయౌఁ
గదనినుఁ దెలిసికొననియా
చదువులువృధకావె? యోయచల! భీమేశా

41. కం. శిరమునఁ జందురుఁ, డురమునఁ
గరమొప్పఁగ విషధరములుఁ, గటిగజచర్మాం
బరమునుఁ, గేలఁద్రిశూలము
ధరించిన నిన్నుఁదలతు ధరభీమేశా

42. కం. పంచాక్షరి జపియించిన
సంచితముగఁ గాలుని భయమదియెటుకల్గున్
పంచశరగర్వ హర! హర!
పంచానన! వరద! భక్త పర! భీమేశా

43. కం. ధనమును నాకిమ్మని యో
ధనదసఖా! వేడలేదు, ధరమోక్షాపే
క్షను, నీ సుచరణపద్మము
లనవరతముఁ గొల్చుచుంటినయ భీమేశా

44. కం. ఈ భువి భస్మముఁ దాల్చిన
నోభవహర! దోషరాజి యుండునే? పరమే
శా! భువనపోష! యీశా!
యోభక్త జనాళితోష! యోభీమేశా

45. కం. చీమలుబ్రాఁకెడు రొదవిను
దీమహియన నామొఱ, నది యేలనువినవో
కామితజన కల్పద్రుమ!
మామకదురితాలవిత్రమా! భీమేశా

46. కం. ధనదుఁడు సఖుఁడై యుండం
గను, యాచనఁజేయనేలఁ గరుణాశరధీ!
మనమున సందేహమ? మి
త్రునియడుగంగా, సుజనహితుఁడ! భీమేశా

47. కం. ధవళము గృహమును, భూషలు,
ధవళము నీ జడనుగల సుధాకరుఁడరయన్
ధవళము నీదుశరీరము,
ధవళేశా! యెట్లుకాంతు? ధర భీమేశా

48. కం. హరుఁడొక్కఁడె దైవంబని
ధరవాక్భేరిం, డండాడ డాండ నినాదముల్
పురిఁగొన, హర! హర! శంభో!
వరదా! యని చాటెదనుశివా! భీమేశా

49. కం. నీవేయంతయు, నంతయు
నీవే, భువివేరులేరు, నిక్కముశివ! యో
భావాతీతా! పొగఁడగ
నావశమా, భువనపోషణా భీమేశా

50. దుర్గాధినాథ! యరిష
డ్వర్గమునంజిక్కికొంటి, వాసిగనన్నే
మార్గమునఁగాచెదో యో
భర్గ! స్వర్గీయవినుత! వరభీమేశా

51. కం. రమ్మా! క్రమ్మర నేల ను
రమ్మా నఁగ మ్రొక్కుచుంటి, రావేలను, నే
రమ్మా! యిదినాగ్రహ చా
రమ్మా! గజచర్మధర! హరా! భీమేశా

పద్యం 52 నుండి 59 వరకు దొరకలేదు

60. కం. నీవేమాతవు, జనకుఁడ
వీవే నాబంధుజనుఁడ వీవే, సర్వం
బీవే, లోకేశుండవు
గావే, యో దీనరక్షకా భీమేశా

61. కం. హరి హరిలననొక్కటియే
ధరమిమ్ముల భేదబుద్ధిఁదలచినవాఁడో
కరుణామయ కాలునికడ
కరుగుట తధ్యంబయౌనుగదె? భీమేశా

63. కం. కరివరదుండాహరికద,
కరివరమును దీర్పవల్వఁగాఁగట్టితివీ
వరయఁగ గజచర్మంబిక
హరిహరులనవేఱదెట్టులగు భీమేశా

64. కం. బలిగీముఁ గాచెనాహరి
యిల, నోహర! నీవుబాణునిలుఁగాచితిగా
తలపగ భేదంబేలను
కలుగును, మీయిరువురకునుఁగదె భీమేశా

65. కం. నరసఖుఁడా శ్రీహరి, దయ
నరునకుఁ బాశుపతమిచ్చినావీవును, మీ
కరయఁగ భేదమదేఁటికి
ధరఁగల్గును శంకర! వరదా! భీమేశా

66. కం. పన్నగములు నీభూషలు
పన్నగ పల్పుండు హరియుఁ బాపవినాశా!
యెన్నఁగహరియన్నను హరుఁ
డన్నను భేదంబు లేదయా భీమేశా

67. కం. మురహరుఁడాతఁడు, నీవో
పురహరుఁడవు సర్వలోకపూజ్య! భువిపై
హరియన, హరుఁడన నొకటియ
శరణాగతరక్షణ! గిరీశా! భీమేశా

68. కం. శ్రీగళుఁడవీవు హరియును
శ్రీగలవాఁడెన్నమీకు శివ! భేదంబే
లాగుంగల్గును? భవహర!
వాగీశాద్యమరవినుత! వర భీమేశా

69. కం. లీలావినోదుఁడవు, హరి
లీలామానుషుఁడు గాదె? లేశంబును మీ
కాలోచింపఁగ భేదం
బేలాగల్గున్మహేశ హే భీమేశా

70. కం. హరిమనికిపట్టు తిరుపతి
గిరి, నీదగుయుంకి రజితగిరి, యిర్వురికిన్
గిరులేనెలవులు, భేదం
బరయము మీకెందు జూడనయ భీమేశా

71. కం. దుష్టులశిక్షించును హరి
దుష్టులయుక్కడతువీవు దురమున, మీరో
శిష్టచరిత! యొక్కటికడే
కష్టహర! అభిష్టదాయకా! భీమేశా

72. కం. సారంగపుటెంగిలగుట
సారసమును బూజఁజేయఁజాల నిలనునీ
కారయ మధృదయమనెడు
సారసమిదె పూజఁగొనుమచల భీమేశా

73. కం. గట్టులరాయని ముద్దుల
పట్టినిఁజేపట్టినట్టి మరమేశు, ధరం
బుట్టుటఁ గిట్టుట లెరుఁగని
జెట్టిని, నినుఁదలతునెపుడు శ్రీభీమేశా

74. కం. లింగా! యాగవిభంగా!
యంగజహర! సాంబశివ! శుభాంగ! మహేశా!
మంగళకర! గంగాధర!
సంగర భీమా! రమేశశర! భీమేశా

75. కం. దినకర శశి శిఖనేత్ర!
ఘనకలుషలతాలవిత్ర! కామితగాత్ర!
మునిజననుత చారిత్ర!
యనుపమ ధీనాళిమిత్ర! హర! భీమేశా

76. కం. ఒకరాజు కళంకుఁడు, వే
రొకఁడిల వేకన్నులాఁడు, యోజింపఁగ నిం
కొకరాజోగ్రహ బాధితుఁ
డిఁకరాజననీవకాదె యిల భీమేశా

77. కం. శివుఁడవు సర్వభువన ధవుఁ
డవు కమలభవాది సేవ్యుఁడవు నిటలాక్షుం
డవు శంభుండవు, జితమరుఁ
డవు హరుఁడవు, భక్తపోషుఁడవు భీమేశా

78. కం. ఆమార్కండేయుడు నీ
కేమిచ్చెను జమునిఁగూల్చి యిలఁగాచితి, నే
నేమపచారముసేసితిఁ
గామితమందార! దెల్పఁగదె? భీమేశా

79. కం. చిత్తాశ్వమిచ్చవచ్చిన
చిత్తంబుననేగుచుండెఁ జిత్తజహర! నీ
విత్తఱి నధిరోహింపవె
యుత్తమమార్గంబుఁజూప నో భీమేశా

80. కం. రారా! రాకేందుధరా!
రారా! రుద్రాక్షహార! రజితాకారా!
రారా! రణభీమా! హర!
రారా! దుర్గామనోహరా! భీమేశా

81. కం. నతిఁగొనుమా నుతనామా!
యతిపరకామా! సుధామ! యగణితనామా!
గతినీవే రిపుభీమ!
పతితోద్ధార! విరామ వర భీమేశా

82. కం. నీనామ సుధాపానము
మానను, దిరుగాడుమనుపమానం బగునా
మానస సరోవరంబున
మానకనో రాజహంసమా భీమేశా

83. కం. తండ్రివి లోకములకు నా
యుండృఆల్దిండీనికనుచు నోపరమేశా
యండ్రు జనంబులుగద, నా
తంద్రీ! హర! యొత్రిపుండ్రధర! భీమేశా!

84. కం. రుద్రా! గయాసముద్రా!
సద్రూపా! దక్షశిఖ! సజ్జనపక్షా!
రుద్రాక్షధర! హర! యో
భద్రచరిత! కావఁగదవె వర భీమేశా

85. కం. ఒంటరివో? లేరొకొ యే
రింట, న్నీయున్కిఁజెప్పు మేయదియో, ము
క్కంటీ! యేమనిపిలచిన
వెంతనె పల్కిదెవు దెల్పవే భీమేశా

86. కం. మానసకాంతారంబేఁ
దానకముఁగఁగ్రోద్గమాది దారుణమృగముల్
కానఁనగును, నాదికిరా
తానీవిల వానిదునుము దయ భీమేశా

87. కం. కాలాంతకా! మహేశా!
ఫాలాక్షా! భక్తవాస! పాపవినాశా!
లీలామానుష వేషా!
కైలాసవాస! పోషకా! భీమేశా

88. కం. ఘనతాపస వినుతా! విష
మును ద్రావితివంత సురలు మునుబ్రార్ధింపం
గను, తావకమహిమలు బొగ
డనుతరమా! దీనబంధుడా! భీమేశా

89. రావా! ననుఁగాపాడఁగ
దేవా! నామొఱలవినఁగదే, యీశుండౌ
గావా! యింతటికఠినమ
బ్రోవా! శ్రీకంఠయోప్రభూ! భీమేశా

90. నీదయవే భవసాగర
మీదఁగఁదగుఁ గొండఁబిండియేఁ జేయనగుం
గాదొకొ నృత్యవినీదా!
యోదీనజనాప్తమిత్ర! యో భీమేశా

91. కం. పుట్టుటఁ గిట్టుటఁ గనియును
జుట్టల నెచ్చెలులఁ జూచుచునుఁ బొంగుదు నీ
కట్టెయ శాశ్వతమని, న
నెట్టుల రక్షించెదవో యిల భీమేశా

92. కం. నీలీలలఁగనుఁగొనగా
నీలగళా! నరుఁడఁగాను, నేతిన్నఁడఁగా
నేలీలనేలెదో నను
ఫాలాక్షా! హర! సుభక్తపర! భీమేశా

93. కం. శ్రీకరములు సుగునాళికి
భీకరములు దైత్యతతికి, వీనులవిన మో
క్షాకరములు, భక్తులకు వ
శీకరములు, నీచరితలు శ్రీభీమేశా

94. కం. శూలివి, గిరిజాసతికను
కూలివి, శశిమౌళి, వసురకుంజతతి ని
ర్మూలివి, కడుబలశాలివి
పాలితలోకాళి, వరయ ప్రభు! భీమేశా

95. కం. మారవిదారివి! దైత్య ప్ర
హారివి! శిపురారి! వురగహారి! వలసురా
ధారివి! కాకోలవిషా
హారివి! జడధారి! విలను హర! భీమేశా

96. కం. తోలునుదాల్చితివీవా
కూళజలంధరునినేలఁ గూల్చితి త్రుటిలో
కాలునిగెల్చితివాసిరి
యాళుని దయఁగాచితివయా భీమేశా

97. కం. మాటికిఁ బిల్వంగఁ బలుక
వేటికి, నాపైనికిన్కఁవదేటికి, చోటి
ప్పాటికి నీయనిచో, సుర
కోటినిఁగాచినది కల్ల, గురు! భీమేశా

98. కం. రక్షింప, కటాక్షింపను
శిక్షింపను నీవయౌట శ్రితమందారా!
దక్ష విపక్షా! యాప
ద్రక్షా! యీ కృతినిఁ గొనుహర! భీమేశా

99. కం. శ్రీవిశ్వకర్మకులజుఁడ
దేవరకొండాన్వయుఁడను ధీనుతచరితా!
శ్రీవిశ్వభద్ర గోత్రుఁడఁ
బ్రోవుమనంతాఖ్యునన్ను భువి భీమేశా

100. మంగళమిదెఁ గొనుమోశివ
మంగళకర! యో! శుభాంగ! మాధవహిత! నా
మంగళమిదెఁ గైకొనుమో
యంగజహర! భృంగివినుత! హర! భీమేశా

భీమేశ శతకము
సంపూర్ణం

Wednesday, June 12, 2013

తత్సమ శతకము - కోగంటి దుర్గామల్లికార్జునరావు

తత్సమ శతకము
                                                   కోగంటి దుర్గామల్లికార్జునరావు (1959)

1. కరిణకమునకుఁ గరణికము
కరతత్తికిఁ దత్సమంబు కరదృతి యయ్యెన్
కరిసెకుఁ గర్షంబందురు
కరసానకుఁ తత్సమంబు కరశాణయగున్

2. తురకకుఁ బ్రకృతి తురుష్కుఁడు
కఱకునకుం దత్సమంబు కర్కరమయ్యెన్
తురికిం బ్రకృతి తురంగము
కరకుం దత్సమ పదంబు ఖర మనిరి బుధుల్

3. కపుజునకుఁ గపింజల మగుఁ
గవుడునకుం దత్సమంబు కపటం బయ్యెన్
కవికిం గయి తత్సమమగుఁ
గవణమునకుఁ దత్సమంబు ఖాదన మయ్యెన్

4. కన్నయ్యకుఁ గృష్ణుం డగుఁ
గన్నడికిం దత్సమంబు కర్ణాటుఁ డగున్
కన్నెకుఁ గన్య ప్రకృతియగుఁ
గన్నమునకుఁ దత్సమంబు కర్ణం బయ్యెన్

5. కడకుం గాష్టం బయ్యెను
గడియమునకుఁ దత్సమంబు కటకం బయ్యెన్
గడవకుఁ గటాహమ య్యెను
గడుపునకుం దత్సమంబు గర్భం బయెన్

6. కత్తెరకుం గర్తరియగుఁ
గత్తికిఁ దత్సమపదంబు కర్తి యగుంగా
కొత్తమరికిఁ గుస్తుంబరి
కొత్తిమిరికిఁ దత్సమంబు కుస్తుంబ రగున్

7. కమ్మరికిం గర్మారుఁడు
కమ్మికిఁ దత్సమపదంబు కంబి యగుంగా
కుమ్మరికిఁ గుంభకారుఁడు
కమ్మరకుం దత్సమంబు కర్మార మగున్

8. కొడసకుఁ గొడిసకుఁ గుటజము
కొడిసెకుఁ దత్సమపదంబు కుటజం బయ్యెన్
గుడిసెకు గుడిసికిఁ గుటి యగుఁ
గొడపమునకుఁ దత్సమంబు కురపం బయ్యెన్

9. కేడమునకు ఖేటక మగుఁ
గేడెమునకుఁ దత్సమంబు ఖేటక మయ్యెన్
కోడికి గుక్కుట మయ్యెను
గోడకుఁ దత్సమపదంబు కుడ్యం బయ్యెన్

10. కబ్బమునకుఁ గావ్యం బగు
నబ్బురమను శబ్దమునకు నద్భుత మయ్యెన్
పబ్బమునకుఁ బర్వంబగు
నిబ్బరమను దాని ప్రకృతి నిర్భర మయ్యెన్

11. నిద్దమునకు స్నిగ్ధం బగు
నిద్దురకుం దత్సమంబు నిద్ర యగుంగా
ముద్దకు ముగ్ధ ప్రకృతి యగుఁ
బద్దెమునకుఁ దత్సమంబు పద్యం బయ్యెన్

12. విసమునకుఁ బ్రకృతి విష మగు
నసమునకుం దత్సమంబు యశమనిరి బుధుల్
వసమునకుఁ బ్రకృతి వశమగు
సిసువునకుం దత్సమంబు శిష్యుండయ్యెన్

13. రోసమునకు రోషం బగు
బాసకు భాషయగు నండ్రు పండితవర్యుల్
పాసెమునకుఁ బాయసమగు
వేసమునకుఁ దత్సమంబు వేషం బయ్యెన్

14. అంతిపురికి నంతఃపురి
అంతిపురంబునకుఁ బ్రకృతి యంతఃపురమౌ
నంతరువున కంతర మగు
నంతకు నథ ప్రకృతి యంగు రార్యవరేణ్యుల్

15. అక్కునకుఁ బ్రకృతి యంకము
అక్కర మనుదాని ప్రకృతి యక్షర మయ్యెన్
అక్కలకర కక్రారా
అక్కకు నర్క ప్రకృతి యగు నందురు విబుధుల్

16. అచ్చెరువున కాశ్చర్యము
అచ్చెరియంబునకుఁ బ్రకృతి యాశ్చర్యంబౌ
నచ్చమునకు నచ్చ మగును
అచ్చరకుం దత్సమంబు మప్సర యయ్యెన్

17. ఆడఁదికి హరిద్ర ప్రకృతగు
నడికిం దత్సమపద మతి యందురు విబుధుల్
అడసాల కట్టశాలయ
అడవికిఁ బ్రకృతి యటవి యగు నందురు విబుధుల్

18. అప్పడమున కర్పట మగు
నప్పచికిఁ బ్రకృతి యపూప మందురు విబుధుల్
అప్పళమున కర్పట మగు
నప్పనకుం దత్సమపద మర్పణ యయ్యెన్

19. అమ్మకు నంబ ప్రకృతి యగు
నమ్మాయికిఁ దత్సమపద మంబిక యయ్యెన్
అమ్మిక కమ్మికి నంబిక
అమ్మునకుం దత్సమపద మంబకమయ్యెన్

20. అరదమునకుఁ బ్రకృతి రథము
అరివేరంబునకుఁ బ్రకృతి యరివీర్యంబౌ
నరపలమున కర్ధఫలము
అరివాణంబునకుఁ బ్రకృతి హరివాణ మగున్

21. అరిసెకుఁ బ్రకృతి యతిరసము
అరసంజకు నసురసంధ్య యందురు విభుదుల్
అరసమునకు హర్షం బగు
నరుసమునకుఁ దత్సమంబు హర్షం బయ్యెన్

22. అగడిత కఖాతము ప్రకృతి
అగినికిఁ బ్రకృతిపద మగ్ని యందురు విబుధుల్
అగలునకుఁ బ్రకృతి యగరువు
అగసికిఁ బ్రకృతిపద మతసి యందురు విభుదుల్

23. ఈరస కీర్ష్య ప్రకృతి యగు
నీరస మనుదాని ప్రకృతి యీర్ష్య యగుంగా
ఆరామున కారామము
ఆరెకునకుఁ దత్సమపద మారక్షుఁ డగున్

24. ఆమతి కామంత్రణ మగు
నామిత కామంత్రణ మగు నందురు విభుదుల్
ఆమితి కామంత్రణ మగు
నామెత కామంత్రణ మగు నందురు విభుదుల్

25. ఇతవునకుఁ బ్రకృతి హితుఁ డగు
నితమునకుం దత్సమంబు హిత మనిరి బుధుల్
ఇతవునకుఁ బ్రకృతి హితమగు
నితకరికిం దత్సమంబు హితకరి యగున్

26. ఆసకు నాశ ప్రకృతి యగు
నీసునకుం దత్సమపద మీర్ష్య యగుంగా
ఈసరునకు నీశ్వరుఁ డగు
నీసరికిం దత్సమపద మీశ్వరి యయ్యెన్

27. ఉక్కెడ కుపకారిక యగు
నుక్కలునకుఁ దత్సమపద ముత్కలుఁడయ్యెన్
ఉక్కకు నుల్క ప్రకృతియగు
నుక్కెలుకుం దత్సమపద ముపకారికయౌ

28. ఉమ్మికి నూర్మి ప్రకృతియగు
నుమ్మెతకుం దత్సమపద మున్మత్త మగున్
ఉమ్మలక ప్రకృతి యూష్మము
ఉమ్మాదంబునకుఁ బ్రకృతి యున్మాద మగున్

29. ఒడ్డనమున కండన మగు
నొడ్డాణంబునకుఁ బ్రకృతి యోఢ్యాణ మగున్
ఒడ్డెకు నోఢ్రుండు ప్రకృతి
ఎడ్డకుఁ దత్సమంబు హృదయం బయ్యెన్

30. ఆఁకరమున కాగ్రహ మగు
ఆకస మనుదాని ప్రకృతి యాకాశ మగున్
ఏకాండమున కఖండము
ఏకత మనుదాని ప్రకృతి యేకాంత మగున్

31. అంచకు హంస ప్రకృతియగు
నంచునకుం దత్సమపద మంచల మయ్యెన్
ఇంచునకుఁ ప్రకృతి యిక్షువు
ఇంచుక యనుదాని ప్రకృతి యీష త్తయ్యెన్

32. అదనంబున కధికం బగు
నదరమునకుఁ దత్సమపద మధురం బయ్యెన్
ఉదియకు నుద్యోగం బగు
నెదకుం దత్సమపదంబు హృదయం బయ్యెన్

33. కబ్బురమున కద్భుత మగు
నబ్బురమునకుఁ బ్రకృతిపద మద్భుత మయ్యెన్
అబ్బెసమున కభ్యాసము
ఉబ్బ యనెడి శబ్దమునకు నూష్మం బయ్యెన్

34. ఆలతి కాలప్తి ప్రకృతి
ఆలత్తిక తత్సమపద మాలప్తి యగున్
ఆలసమున కాలస్యము
ఏలకి యనుదాని ప్రకృతి యేలా యయ్యెన్

35. అగ్గికి నగ్ని ప్రకృతి
నగ్గువకుం బ్రకృతి యర్ఘ మందురు విభుదుల్
ఎగ్గడికిఁ బ్రకృతి హేడుఁడు
ఎగ్గత మనుదాని ప్రకృతి యేకాంత మగున్

36. గంబురకుం గర్పూరము
గంబుర మనుదాని ప్రకృతి కర్పూర మగున్
గంబూరకుఁ గర్పూరము
గంబూరంబునకుఁ బ్రకృతి కర్పూరమగున్

37. గరితకు గృహస్త ప్రకృతగు
గరువం బనుదాని ప్రకృతి గర్వం బయ్యెన్
గరివికి గర్వి ప్రకృతి యగు
గొరిజెకు గొరిజకు గొరిసెకు ఖురము ప్రకృతి యౌ

38. గడనకుఁ దత్సమము గణన
గడియకుఁ దత్సమపదంబు ఘటిక యగుంగా
గడెకుం దత్సమంబు ఘటిక
కడెమునకుం దత్సమంబు కటకం బయ్యెన్

39. గారమునకు గౌరవ మగు
గారబ మనుదాని ప్రకృతి గౌరవ మయ్యెన్
గారెకు ఘారి ప్రకృతి యగు
గారడ మనుదాని ప్రకృతి గారుడ మయ్యెన్

40. గామమునకు గ్రామంబగు
గామునకుం దత్సమంబు గ్రహమనిరి బుధుల్
గామిడికిన్ గ్రామీణ యగు
గీమునకుఁ బ్రకృతిపదంబు గృహమనిరి బుధుల్

41. గొనమునకుఁ బ్రకృతి గుణ మగు
గొనయం బనుదాని ప్రకృతి గుణ మనిరి బుధుల్
గొనమునకుఁ బ్రకృతి ఘన మహు
గనికిం దత్సమపదంబు ఖని యనిరి బుధుల్

42. గుదెకుఁ బ్రకృతి గద యయ్యెను
గుదికిం దత్సమపదంబు గుచ్చం బయ్యెన్
గుదియెకు గద ప్రకృతి యగును
గొదకుం దత్సమపదంబు క్షుధ యనిరి బుధుల్

43. గోడాకుఁ బ్రకృతి ఘోటము
గోడిగ యనుదాని ప్రకృతి ఘోటిక యయ్యెన్
గోడునకుఁ బ్రకృతి గ్రుష్టము
ఓడకుఁ దత్సమపదంబు హోడం బయ్యెన్

44. గద్దకు గృధ్రంబు ప్రకృతి
గద్దియ యనుదాని ప్రకృతి ఖటిక యగుంగా
ఉద్దికి వృద్ధి ప్రకృతి యగు
గుద్దలి యనుదాని ప్రకృతి కుద్దాల మగున్

45. గట్టనకుఁ బ్రకృతి ఘట్టన
గట్టునకుం దత్సమంబు ఘట్టం బయ్యెన్
గుట్టకు ఘట్టంబు ప్రకృతి
గట్టునకుం దత్సమంబు గూఢం బయ్యెన్

46. గూడునకుఁ గులాయం బగుఁ
గాడకుఁ దత్సమపదంబు కాండం బయ్యెన్
కాడునకుఁ బ్రకృతి కట మగు
గాడిద యనుదాని ప్రకృతి గార్ధభ మయ్యెన్

47. ఒజ్జ కుపాధ్యాయుండగు
నుజ్జన యనుదాని ప్రకృతి యుజ్జన మయ్యెన్
ఉజ్జని కుజ్జయిని ప్రకృతి
గుజ్జునకుం దత్సమంబు కుబ్జుం డయ్యెన్

48. ఆదకు నాధి ప్రకృతియగు
నాదరు వనుదాని ప్రకృతి యాధార మగున్
ఈఁదాడికి హింతాలము
గేదంగికిఁ దత్సమంబు కేతకి యగున్

49. ఇట్టికకుఁ బ్రకృతి యిష్టక
ఇట్టికెకుం దత్సమపద మిష్టక యయ్యెన్
ఇట్టుకకుఁ బ్రకృతి యిష్టక
కట్టేకుఁ దత్సమపదంబు కాష్ఠం బయ్యెన్

50. ఆనయి కాజ్ఞప్తి ప్రకృతి
ఆనకుఁ బ్రకృతిపద మాజ్ఞ యందురు విబుధుల్
గోనెకు గోణి ప్రకృతియగు
గోనియ యనుదాని ప్రకృతి గీణి యగుంగా

51. గౌఁకకు ఘింకారం బగుఁ
గాకిత మనుదాని ప్రకృతి కాకల మయ్యెన్
కాకికిఁ గాకంబు ప్రకృతి
కాకిదమనుదాని ప్రకృతి కాకల మయ్యెన్

52. గాణకు గాయనుడు ప్రకృతి
గాణికిఁ దత్సమపదంబు గాయని యయ్యెన్
గోణమునకుఁ గౌపీనము
గాణునకుం దత్సమంబు గాయనుఁడయ్యెన్

53. ఉప్పరిగకు నుపకారిక
ఉప్పతికిం దత్సమపద ముత్పత్తి యగున్
ఉప్పరమున కభ్ర మగును
చుప్పనకకుఁ దత్సమంబు శూర్పణఖ యగున్

54. ఉల్లాడ కుల్లాభం బగు
నుల్లబ మనుదాని ప్రకృతి యుల్లాభ మగున్
గొల్లునకుం గలకల మగు
గొల్లకుఁ దత్సమపదంబు గోపాలుఁ డగున్

55. ఉమ్మకు నూష్మంబు ప్రకృతి
ఉమ్మర మనుదాని ప్రకృతి యూష్మం బయ్యెన్
చెమ్మటకుఁ బ్రకృతి శ్రమ మగు
గుమ్మడి యనుదాని ప్రకృతి కూష్మాండ మగున్

56. చదురునకుఁ బ్రకృతి చతురుడు
చదరంగంబునకుఁ బ్రకృతి చతురంగ మగున్
చదుకంబునకుఁ జతుష్కము
చదరమునకుఁ దత్సమంబు చతురస్ర మగున్

57. చెక్కెరకుఁ బ్రక్రుతి శర్కర
చిక్కన యనుదాని ప్రకృతి చిక్కణ మయ్యెన్
జక్కవకుఁ జక్రవాకము
చిక్కదనంబునకుఁ బ్రకృతి చిక్కణ మయ్యెన్

58. చూరకు చూరిక ప్రకృతియగుఁ
జూరికిఁ దత్సమపదంబు చూరిక యగుంగా
గోరమునకు ఘోరంబగు
గోరజ మనుదానికి ప్రకృతి గోరోచన మౌ

59. చెవికిం బ్రకృతి శ్రవం బగు
జెవుడునకుం దత్సమంబు క్షేడం బయ్యెన్
చవితికిఁ జతుర్థి యయ్యెను
చివరకుఁ దత్సమంబు శిఖరం బయ్యెన్

60. చెయికిం బ్రకృతి శయం బగు
చెయిదమునకుఁ దత్సమంబు చేష్ట యగుంగా
చెయిదికి నిజేష్ట యయ్యెను
చెయువునకుం దత్సమంబు చేష్ట యగుంగా

61. ఊసర కూషరము ప్రకృతి
ఊసర మనుదాని ప్రకృతి యూషర మయ్యెన్
గాసమునకు గ్రాసంబగు
గోసునకుం దత్సమంబు ఘోషణ మయ్యెన్

62. కజ్జమునకు ఖాద్యం బగుఁ
గజ్జాయంబునకుఁ బ్రకృతి ఖాద్యం బయ్యెన్
గజ్జికి ఖర్జువు ప్రకృతగుఁ
గజ్జుర మనుదాని ప్రకృతి కర్జూర మగున్

63. చిత్తకుఁ జిత్ర ప్రకృతి యగుఁ
జిత్తరు వనుదాని ప్రకృతి చిత్రం బయ్యెన్
చిత్తనికిఁ బ్రకృతి చిత్రిణి
గుత్తికిఁ దత్సమపదంబు గుచ్చం బయ్యెన్

64. తరగకుఁ దరంగము ప్రకృతి
తరవరి యనుదాని ప్రకృతి తరవా రయ్యెన్
తిరమునకుఁ బ్రకృతి స్థిరమగుఁ
దిరునకుఁ దత్సమపదంబు స్థిరుఁ డనిరి బుధుల్

65. జోదునకు యోధుఁ డయ్యెను
జాదికిఁ దత్సమపదంబు జాతి యగుంగా
జూదమునకు దూత్యం బగుఁ
జాదునకుం దత్సమంబు జాషం బయ్యెన్

66. గోరునకుఁ బ్రకృతి ఖురమగు
గోరోజనమునకుఁ బ్రకృతి గోరోచన మౌఁ
దోరమునకు స్థూలంబగు
నారంబంబునకుఁ బ్రకృతి యారంభ మగున్

67. తెలికిఁ బ్రకృతి ధవళం బగుఁ
దెలకులకుం దత్సమంబు తిల లనిరి బుధుల్
తెలుఁగునకుఁ ద్రిలింగ మగును
తలివమునకుఁ దత్సమంబు తల్పం బయ్యెన్

68. తందరకుఁ దంద్ర ప్రకృతగుఁ
దందన మనుదాని ప్రకృతి తానం బయ్యెన్
తొందరకుఁ బ్రకృతి త్వరయగుఁ
దొందకుఁ దత్సమపదంబు తుంది యగుంగా

69. జవలకు యవలు ప్రకృతియగు
జవనిక యనుదాని ప్రకృతి యవనిక యయ్యెన్
తవరమునకుఁ దమరం బగుఁ
దొవరకుఁ దత్సమపదంబు తువరి యగుంగా

70. జన్నమునకు యజ్ఞం బగుఁ
జిన్నెకుఁ దత్సమపదంబు చిహ్నం బయ్యెన్
సున్నకు శూన్యంబు ప్రకృతి
అన్నెమునకుఁ దత్సమపద మన్యం బయ్యెన్

71. కచ్చెకుఁ గలహంబు ప్రకృతి
కచ్చడ మనుదాని ప్రకృతి కచ్చట యయ్యెన్
చిచ్చునకుఁ బ్రకృతి శుచి యగుఁ
దొచ్చెమునకుఁ దత్సమంబు తుచ్చం బయ్యెన్

72. కక్కెరకుఁ బ్రకృతి క్రకరము
కక్కను మనుదాని ప్రకృతి కశ యనిరి బుధుల్
తొక్కకుఁ ద్విక్కు ప్రకృతియగు
డిక్కకుఁ దత్సమపదందు ఢక్క యగుంగా

73. తురితమునకుఁ ద్వరితం బగుఁ
గరువకుఁ దత్సమపదంబు గ్రావం బయ్యెన్
తొరకుం ద్వర ప్రకృతి యగును
కరదివ్వెకుఁ దత్సమంబు కరదీపిక యౌ

74. ఇటకకును బ్రకృతి యిష్టక
ఇటికెకును నిటికకును బ్రకృతి యిష్టక యయ్యెన్
ఇటుకకును బ్రకృతి యిష్టక
చిటికకుఁ దత్సమపదంబు క్షితిక యగుంగా

75. చిట్టకుఁ జిత్రము ప్రకృ తగుఁ
జిట్టక మనుదాని ప్రకృతి చిత్రక మయ్యెన్
చెట్టకుఁ జేష్ట ప్రకృతి యగు
జుట్టునకుం దత్సమంబు జూటం బయ్యెన్

76. గొడ్డలికిఁ గుఠారం బగు
జడ్డునకుం దత్సమంబు జాడ్యం బయ్యెన్
తెడ్డునకుఁ బ్రకృతి తండువు
కడ్డికిఁ దత్సమపదంబు ఖటిక యగుంగా

77. చామకు శ్యామ ప్రకృతియగు
జామన మనుదాని ప్రకృతి శ్యామల మయ్యెన్
తూమునకుఁ బ్రకృతి తుంబిక
తామరకుం దత్సమంబు తామరసం బౌ

78. తెల్లనకుఁ బ్రకృతి ధవళము
తల్లడ మనుదాని ప్రకృతి తరళము యయ్యెన్
చల్లడమునకుం జలనము
గుల్లకుఁ దత్సమంబు క్షుల్లక మయ్యెన్

79. చులకనకుఁ బ్రకృతి సులభము
తొలసికిఁ దత్సమపదంబు తులసి యగుంగా
జలగకు జలూక ప్రకృతగు
డులికిం దత్సమపదంబు ఢులి యనిరి బుధుల్

80. దోరమునకు ద్వారం బగుఁ
దోరణకుం దత్సమంబు తోరణ మయ్యెన్
దారకు ధార ప్రకృతి యగు
దారణ యనుదాని ప్రకృతి ధారణ మయ్యెన్

81. దిరిసెనమునకు శిరీషము
దరకుం దత్సమపదంబు ధర యనిరి బుధుల్
దురమునకుఁ బ్రకృతి త్వర యగు
దరిసెన మనుదాని ప్రకృతి దర్శన మయ్యెన్

82. దుగకు ద్వికంబు ప్రకృతియగు
దుగినునకుం దత్సమంబు ద్రుఘుణుం డయ్యెన్
దుగునమునకు ద్విగుణం బగు
దగకుం దత్సమపదంబు దాహం బయ్యెన్

83. దివటీకి దీపయష్టిక
దీవెకుం దత్సమపదంబు దీపం బయ్యెన్
దవుడకు ధాడ ప్రకృతి యగు
దవనమునకుఁ దత్సమంబు దవనం బయ్యెన్

84. దీవియకుఁ బ్రకృతి దీపము
దీవికిఁ దత్సమపదంబు ద్వీపం బయ్యెన్
దేవరకుఁ బ్రకృతి దేవుఁడు
దేవళ మనుదాని ప్రకృతి దేవాలయ మౌ

85. దోసికి దోషి ప్రకృతి యగు
దోసమునకుఁ దత్సమంబు దోషం బయ్యెన్
దేసమునకు ద్వేషం బగు
దాసరి యనుదాని ప్రకృతి దాసుం డయ్యెన్

86. ఉమి కూర్మి ప్రకృతి యయ్యెను
ఇమమునకుం దత్సమంబు హిమ మనిరి బుధుల్
తమలమునకుఁ దాంబూలము
డమరువునకుఁ దత్సమంబు డమరుక యయ్యెన్

87. చను తత్సమంబు స్తన మగుఁ
జనుమో మనుదాని ప్రకృతి స్తనముఖ మయ్యెన్
గునపంబునకు ఖనిత్రము
దొనకుం దత్సమపదంబు ద్రోణం బయ్యెన్

88. చేడియకుఁ బ్రకృతి చేటిక
చేడెకుఁ దత్సమపదంబు చేటిక యయ్యెన్
దాడికి ధాటి ప్రకృతి యగు
దాడింబకుఁ దత్సమంబు దాడిమ యయ్యెన్

89. చేదివియకు శయదీపము
తేదీకిఁ దత్సమపదంబు తిథి యనిరి బుధుల్
చైదమునకుఁ జేష్ట యగును
దాదికిఁ దత్సమపదంబు ధాత్రి యగుంగా

90. గొబకున్ గుహ తత్సమ మగు
గుబకుం దత్సమపదంబు ఘూకం బయ్యెన్
తబిసికిఁ దపస్వి ప్రకృతగుఁ
దబమునకుం దత్సమంబు తప మనిరి బుధుల్

91. తమ్మికిఁ దామరసం బగు
దమ్మమునకుఁ దత్సమంబు ధర్మం బయ్యెన్
చెమ్మటకుఁ బ్రకృతి శ్రమ మగు
జమ్మిజిఁ దత్సమపదంబు శమి యనిరి బుధుల్

92. గన్నెరకుం గరవీరము
గన్నే రనుదాని ప్రకృతి కరవీర మగున్
దొన్నెకు ద్రోణిక ప్రకృ తగుఁ
బున్నెమునకుఁ దత్సమంబు పుణ్యం బయ్యెన్

93. గుండీకిఁ గరండ మగును
గుండునకుం దత్సమంబు కుండం బయ్యెన్
గుండిగకుఁ బ్రకృతి కుండిక
గండికిఁ దతస్మపదంబు ఖండం బయ్యెన్

94. ద్రోవదికిఁ బ్రకృతి ద్రౌపది
దౌవేరికిఁ దత్సమంబు దేవి యగుంగా
దొవతికి ధౌతి ప్రకృతగు
దీవర మనుదాని ప్రకృతి తీవ్రం బయ్యెన్

95. దరణమునకు ధరణం బగు
దరుమమునకుఁ దత్సమంబు ధర్మం బయ్యెన్
చురియకు చురిక ప్రకృతి యగుఁ
జరవకుఁ దత్సమపదంబు చరు వనిరి బుధుల్

96. చందురునకుఁ జంద్రుం డగుఁ
జెందిర మనుదాని ప్రకృతి సిందూర మగున్
చందిరకకుఁ జంద్రిక యగుఁ
జందునకుం దత్సమంబు చంద్రుం డయ్యెన్

97. విదియకు ద్వితీయ ప్రకృ తగుఁ
జిదురకుఁ తత్సమపదంబు చిద్రం బయ్యెన్
తదియకుఁ దృతీయ ప్రకృతగు
మదికిం దత్సమపదంబు మతి యనిరి బుధుల్

98. దోదసికిఁ బ్రకృతి ద్వాదశి
దుదికిఁ దత్సమపదంబు తూలం బయ్యెన్
ఊదరకు నుదారం బగు
దాదిలికిం దత్సమంబు ధాత్రి యగుంగా

99. ఆరంజోతి కరుంధతి
కారియ మనుదాని ప్రకృతి కార్యం బయ్యెన్
చేరునకుఁ బ్రకృతి సర మగుఁ
గారిజ మనుదాని ప్రకృతి కాలేయ మగున్

100. దూలికి ధూళి ప్రకృతి యగు
గేలికిఁ దత్సమపదంబు కేళి యగుంగా
కాలవకుఁ గుల్య ప్రఖృతగు
గాలియకుం దత్సమంబు కాళిక యయ్యెన్

సమాప్తము

Sunday, June 9, 2013

శ్రీభర్గ శతకము - కూచిమంచి తిమ్మకవి

శ్రీభర్గ శతకము
                                              -కూచిమంచి తిమ్మకవి (1759)
భక్తి నీతి అధిక్షేప శతకము
ఇతరశతకములు : కుక్కుటేశ్వర శతకము

1. శ్రీకైలాస మహీధర శిరఃశృంగాట కాంచన్మణి
ప్రాకారాంతర చంద్రకాంత రజతప్రాసాద శుద్ధంత సిం
హాకారోన్నత హేమ పీఠమునఁగొల్వైయుండు నిన్నెన్నెదన్
రాకాచంద్ర నిభప్రభాకలిత! భర్గా! పార్వతీవల్లభా!

2. మ. క్షితినంభోనిధి కర్ఘ్యమిచ్చుక్రియ భక్తి న్బద్మినీ భర్తకా
రతి యర్పించుతెఱంగున న్బహుతర బ్రహ్మండ సంత్రాతకున్
శతకంబొక్కటి గూర్చి నీ కొసగెద న్సంరూఢిఁగైకొమ్ము నా
కృతి సంస్తుత్యలసద్గుణాభరణ! భర్గా పార్వతివల్లభా!

3. మ. శుక శాండిల్య మృకండు జాత్రి కలశీసూనుల్ భరద్వాజ శౌ
నక వాల్మీకి వసిష్ఠ గర్గభృగు మాండవ్యాజ సంభూత కౌ
శిక కణ్వాది మహర్షిశేఖరులు నిన్ జింతింపఁగాలేరు, కొం
కక నేనెంతటివాఁడ నిన్బొగడ భర్గా! పార్వతీవల్లభా!

4. మ. వరకౌండిన్య సగోత్రపాత్రుని యశోవర్ధిష్ణునిం గుక్కుటే
శ్వర కారుణ్యకటాక్ష లబ్ధ కవితాసామ్రాజ్య ధౌరేయునిన్
స్థిరపుణ్యుండగు గంగమంత్రి సుతునిన్ దిమ్మప్రధానేంద్రునిన్
గరుణన్భ్రోవుము కూచిమంచికులు భర్గా! పార్వతీవల్లభా!

5. మ. ప్రచురత్వంబుగ నెంతునాత్మనెపుడు న్బ్రత్యూహసంశాంతికై
విచలత్కర్ణ సమీరదూరిత మహా విఘ్నంబు భృజ్జాలునిన్
రుచిరాస్వాంబురుహ స్రవన్మదజల ప్రోత్సాహలీలాముహుః
ప్రచురద్భ్రుంగకులున్ గణాధిపుని భర్గా! పార్వతీవల్లభా!

6. శా. మేమాఱున్ భవదీయ పావనకళావిఖ్యాత కావ్యక్రియా
సామీచీన్యహృదంతరాళ కవిరాట్సంక్రదన శ్రేణికిన్
సామర్థ్యం బొనగూర్చి మంచినుడువుల్ సంప్రీతి నొందించు వా
గ్భామారత్నము లీలమై నిలిచి భర్గా! పార్వతీవల్లభా!

7. మ. చిరభక్తిన్మదిలో భవద్వ్రతముగాఁజింతింటు నశ్రాంతమున్
బరవాది ప్రమథద్విపేంద్రపదవీ పంచానన శ్రేష్ఠు బం
ధుర తేజోనిధి దెందులూరి కులపథోరాశిరాకానిశా
కరునిన్ లింగయ సద్గురూత్తముని భర్గా! పార్వతీవల్లభా!

8. మ. పులితోల్ము మ్మొనవాలు పాపతొడవుల్ భూత్యంత రాగంబు పు
న్కలపేర్లెక్కువ కన్ను నీలగళమున్ గంగావతంసంబుక్రొ
న్నెల పూవద్రిసుతా సమన్వయము విన్కీల్గంటు లేజింకయున్
గలనీమూర్తిఁదలంతు నెప్పుడును భర్గా! పార్వతీవల్లభా!

9. మ. హర! మృత్యుంజయ! చంద్రశేఖర! విరూపాక్షా! మహాదేవ! శం
కర! భూతేశ! మహేశ! రుద్ర! మృడ! గంగాజూట! గౌరీమనో
హర! సర్వజ్ఞ! బిలేశయాభరణ! శర్వా! నీలకంఠా! శివా!
కరిచర్మాంబర! యంచు నెంతు భర్గా! పార్వతీవల్లభా!

10. మ. జగదీశాయ మనోస్తుతే భగవతె చంద్రావతంసాయ ప
న్నగహారాయ శివాయలోకగురవే నానామరు ద్రూపిణే
నిగమాంత ప్రతిపాదితాయ విలసన్నిర్వాణనాథాయధీ
రగుణాఢ్యాయ యటంచు మ్రొక్కిడుదు భర్గా! పార్వతీవల్లభా!

11. మ. వ్రతముల్ దేవగురు ద్విజార్య పదసేవల్ వైశ్వదేవాది స
త్క్రరు హోమాదులు దానధర్మములు వైరాగ్య ప్రచారంబులా
శ్రితరక్షా విధులంచునే నెఱుఁగ నీ చిత్తంబు నా భాగ్యమే!
గతి రక్షించెదొకాని నన్నికను భర్గా! పార్వతీవల్లభా!

12. మ. మరుదర్కేందు కృశాను యజ్వగగనాంభకుంభినీమూర్తి నం
బరకేశున్ శరణాగతార్తిహరణున్బాలేందు చూడామణిన్
భరణీభృత్తానయాస్తనద్వయ మిళిత్కస్తూరికాపంకసం
కరదోరంతరు నిన్ భజించెదను భర్గా! పార్వతీవల్లభా!

13. మ. మిహిరప్రోద్భవ ఘోరకింకరసమున్మేషోరగశ్రేణికా
విహగోత్తంస మశేషదోషపటలీ వేదండ కంఠీరవం
బహిత క్రూరగణాటవీహుత వహంబైనట్టి పంచాక్షరం
బహహా! కల్గెను నాకు భాగ్యమున భర్గా! పార్వతీవల్లభా!

14. మ. నృపసేవాపర కామినీ పరధన ప్రేమాతిరేకంబు లొ
క్కపుడుం గూర్పక తావకీన పదపద్మారాధ నేచ్చారతుల్
కృపదైవాఱ నొసంగి భక్తవరుగా నేప్రొద్దునన్బ్రోవుమీ
కపటారాతి నిశాట సంహరణ! భర్గా! పార్వతీవల్లభా!

15. మ. అభవున్ శాశ్వతు నాద్యు నక్షయుని నవ్యక్తుం బరేశున్మహా
ప్రభునాద్యంతవిహీను భూతమయు సర్వజ్ఞునిన్ గుణాతీతుఁ బ
ద్మభవాండోదరు నాత్మరూపభవు నద్వంద్వుం జిదానందునిన్
రభసంబొప్పఁదలంతు నిన్నెప్పుడు భర్గా! పార్వతీవల్లభా!

16. మ. తనరన్నిన్మది నెంతు నెప్పుడును నా దైవంబుగా దాతఁగా
జనకుంగాఁ జెలికానిగా గురువుఁగా సద్భందుగా నన్నఁగా
ఘన నిక్షేపముగా మహాప్రభునిగాఁగల్యాణ సంధాయిగా
గనకోర్వీధరకార్ముకోల్లాసిత భర్గా! పార్వతీవల్లభా!

17. మ. ప్రతివారంబు శివోహమస్మి యనుచున్భావింతు గంగాధర
స్తుతులెల్లప్పుడుఁజేతు శంకరకథల్ సొంపార నాలింతు నా
యుత బుద్ధిన్ జగమెల్ల నీశ్వరమయం బంచు న్విచారింతు నే
గతి రక్షించదొ కాని నీవు నను భర్గా! పార్వతీవల్లభా!

18. మ. పురుహుతాగ్ని పరేతరాట్పలభు గంభో దీశ వాతార్థ పాం
బరకేశాబ్జ భవాచ్యుతాదిక మహాబర్హిర్ముఖానేక భా
స్వరకార్తస్వర విస్ఫురన్మకుట శాశ్వత్పద్మ రాగప్రభో
త్కర నీరాజితఒఆద పంకరుహ! భర్గా! పార్వతీవల్లభా!

19. మ. వ్యాకీర్ణాచ్చ జటాటవీ తటనితాంతాలంబితోద్యత్తమి
స్రాకాంత ప్రథిత ప్రభాసముదయాశ్రాంత ప్రపుల్లన్మహా
నాకద్వీపవతీ వినిర్మిల జలాంతర్భాగ భాగ్దివ్యరే
ఖాకాంతోత్పల కైరవ ప్రకర! భర్గా! పార్వతీవల్లభా!

20. మ. సతతానందితసర్గ! సర్వసుమనస్సంతుత్యసన్మార్గ! యూ
ర్జుత కారుణ్యనిసర్గ! రాజతధరిత్రీ భృన్మహాదుర్గ! హృ
త్కతుకాలింగిత దుర్గ! సంహృత సమిద్ఘోరద్విషద్వర్గ! సం
యుత నీరంధ్ర సుఖాపవర్గ! జయ! భర్గా! పార్వతీవల్లభా!

21. మ. పుర రక్షః వటుతూల హవ్యవహ! విస్ఫూర్జద్రురుక్రూరగో
పరిపంథిక్షణ దాచరోరగ మహాపక్షీంద్ర! ఘోరాంధకా
సురగంధ ద్విరదేంద్ర పంచముఖ! యక్షుద్ర ప్రభావోల్లస
త్కరిలేఖద్విషదభ్రగంధవహ! భర్గా! పార్వతీవల్లభా!

22. మ. అమరాహార్యము విల్లుగ ఫణికులాధ్యక్షుండు తన్మౌరిగాఁ
గమలాధీశుఁడు తూపుగా, నిగమముల్ గంధర్వముల్ గాగ స
ర్వమహీ చక్రముఁదేరుఁజేసి విషి సారథ్యంబు మీఱుబరా
క్రమలీలన్ దిగప్రోళ్ళఁ గూల్చితివి భర్గా! పార్వతీవల్లభా!

23. కోటిరాంగద మేఖలాఘనతులా కోటికవాటీ నట
ద్ఘోటీ హాటక పేటికా భటవధూకోటీ నటాందోళికా
వీటీ నాటక చేటికాంబరతతుల్ వే చేకూఱు న్నిన్నిరా
ఘాటపొరుఢి భజించు ధన్యులకు భర్గా! పార్వతీవల్లభా!

24. శా. కంఠేకాలుఁడటంచు నిన్నెప్పుడు లోకవ్రాత మగ్గింప వై
కుంఠేంద్రాంబుజ సంభవ ప్రముఖులం గోలాహల ప్రక్రియం
గుంఠీభూతులఁజేయు దుర్భయద కాకోలంబు హేలగతిన్
గంఠాగ్రంబునఁబూనినాడవట! భర్గా! పార్వతీవల్లభా!

25. మ. నిను డెందంబునఁ జీరికిం గొనక వాణీనాధ జంభ ద్విష
ద్దను జారి ప్రము ఖాఖిలామర తతిన్ దట్టంబుగాఁ గూర్చియా
మున జన్నం బొనరించు దక్షుని దురాత్మున్వీరభద్రోగ్రసం
హననం బూని వధించితౌరా! భళి! భర్గా! పార్వతీవల్లభా!

26. మ. కిరిహంసాకృతులూని వెన్నుఁడును బంకేజాతగర్భుండు నీ
చరణంబుల్ శిరము న్గనందలఁచి నిచ్చల్భోగిలోకంబు, పు
ష్కర మార్గంబునురోసి కానక నిరాశంజెందుచో వారలం
గరుణం బ్రోవవె లింగమూర్తివయి! భర్గా! పార్వతీవల్లభా!

27. మ. తరమే యేరికిఁదావకీన ఘననిత్యశ్రీ విలాస క్రియల్
గరిమన్దెల్పఁగ? దారుకావనిని లోకఖ్యాతిగా వర్ణివై
పరమానంద రసార్ద్రమానసుడవై పల్మారు గ్రీడించితౌ
నరుదార న్మునిదారలం గలిసి భర్గా! పార్వతీవల్లభా!

28. మ. హరికన్న న్మరి దైవ మెవ్వఁడును లేఁడంచు న్బుజంబెత్తి ని
ర్భరగర్వోద్ధతిఁ గాశికానగరిలోఁ బల్మాఱు వాదించు ని
ష్ఠురవాగ్దోషరతుం బరాశరసుతున్ స్రుక్కింపవే భీమవై
ఖరి దోఃస్థంభన మాచరించి మును భర్గా! పార్వతీవల్లభా!

29. మ. దనుజారాతిమృదంగమున్నలువకై తాళంబుగోత్రాహితుం
డెనయ న్వేణువు వాణి వీణయునువాయింపన్ రామాకాంత నే
ర్పున గానం బొనరింప సంజతఱి వేల్పుల్మెచ్చఁగా హాళిమై
ఘనతన్ దాండవకేళి సేయుదఁట! భర్గా! పార్వతీవల్లభా!

30. శా. నీలాంభోధరమధ్యసంస్థితతటిన్నికాశమై విష్పుర
ల్లీల న్నివ్వరిముంటిచందమున నెంతే సూక్ష్మమై పచ్చనై
చాలన్భాసిలుతేజమీవయనుచు న్స్వాంతంబునందెన్నుదుర్
వాలెంబున్ ఘనులైన తాపసులు భర్గా! పార్వతీవల్లభా!

31. మ. గొనబార న్విటజంగమాకృతినిమున్ గొంకేది భల్లాణరా
యనిసద్మంబున కేఁగి యాతనిసతి న్బ్రార్థించి యాలేమయ
క్కునఁ జక్క న్నెలనాళ్ళబాలకుఁడవై గోమొప్పఁగన్పట్టితౌఁ
గన నబ్రంబులు నీవిహారములు భర్గా! పార్వతీవల్లభా!

32. మ. యమరాడ్భీకరకాలపాశమథితుడై శ్వేతకేతుండు దు
ర్దమశోకాకులచిత్తవృత్తిమెయిని న్బ్రార్థింప వైళంబ యా
శమనుం గ్రొవ్వఱఁ దన్ని మౌనితనయున్ శశ్వద్గతిన్బ్రోవవే
కమలేశార్చితపాదపంకరుహ! భర్గా! పార్వతీవల్లభా!

33. మ. త్రిజగద్రక్షణశక్తిఁ గోరి కమలాధీశుడు నిన్వేయి పం
కజపత్త్రంబులఁ బూజసేయనెడనొక్కం డందులేకుండినన్
నిజనేత్రాబ్జ మతం డొసంగినఁ గృపన్వీక్షించితౌఁ జక్ర మ
క్కజ మొప్పారఁగ నిచ్చి యేలుకొని భర్గా! పార్వతీవల్లభా!

34. మ. చిరుతొండం డను భక్తునింటికిహొయల్ చెన్నారవేంచేసి త
ద్వరపుత్రున్ దునిమించి నంజుడుతునెల్వండించి భక్షించుచో
సిరియొప్ప న్నిజమూర్తిఁ జూపి యతనిన్ జేపట్టి రక్షింపవే
కరిదైత్యాధమగర్వనిర్మథన! భర్గా! పార్వతీవల్లభా!

35. విజయుం డుగ్రవిపక్షశిక్షణకళావృత్తి న్మిముం గోరి య
క్కజమొప్పన్ దప మింద్రకీలశిఖరిన్ గావించుచో బోయవై
విజయఖ్యాతిగఁ బోరి పాశుపత మీవే వాని కిష్టంబుగా
రజతక్షోణిధరాగ్రసద్భవన! భర్గా! పార్వతీవల్లభా!

36. మ. తనకున్ మిక్కిలి ముజ్జగంబుల కిఁకన్ దైవంబులేఁడంచుఁబా
యనిదర్పంబున దైత్యదానవమునీంద్రామర్త్యసంసత్పదం
బున వాదించు విరించి పంచమమహామూర్థంబు ఖండింపవే
కన నత్యుద్ధతభైరవాకృతిని భర్గా! పార్వతీవల్లభా!

37. మ. సకలాధీశుఁడ వెన్న నీవొక్కఁడవే సత్యంబు సత్యంబు కొం
చక యంతర్బహిరుజ్జ్వలద్భువనరక్షాదీక్షఁ గాకోల ము
త్సుకతం గంఠమునందుఁదాల్చితివిమెచ్చుల్మీఱఁ గ్రూరాత్ములై
యకటా! మూఢు లెఱుంగఁజాలరిది భర్గా! పార్వతీవల్లభా!

38. శా. ఏరి నీ కెనయైన దైవతములీ యీరేడులోకంబులన్
గారామారమృకండుసూనుఁడు మహోగ్రక్రూరమృత్యువ్యథా
భీరుండై శరణన్న మిత్తి నప్పుడే పెంపార్చి రక్షించి త
య్యారే! శాశ్వతజీవిగా నతని భర్గా! పార్వతీవల్లభా!

39. లోకశ్రేణికి నీవె కర్త వను టాలోకింప నిక్కంబెపో
వైకుంఠాధిపుఁడైన శౌరి దినరాడ్వంశంబునన్ రాఘవుం
డై కన్పట్టి జగద్ధితంబుగ నసంఖ్యన్ శంభులింగంబులన్
వ్యాకీర్ణేచ్చఁ బ్రతిష్ఠ చేసెఁగద భర్గా! పార్వతీవల్లభా!

40. శిలలన్ఱొప్పియుఁజెప్పుఁగాలను గడుంజిత్రంబుగాఁద్రొక్కియున్
వెలివెట్టించియుఁ గుంటెనల్నడపియు న్వేరోఁకటం గ్రుమ్మియు
న్నిలయద్వారమునందుఁగాఁపునిచియున్ నీవారలైనారు వా
రలభాగ్యం బిఁక నేమిచెప్పనగు? భర్గా! పార్వతీవల్లభా!

41. మ. అజినంబున్వృషఘోటియుం బునుకలు న్హాలాహలంబు న్మహా
భుజగంబు ల్శవభస్మముల్గొఱలఁగా భూతాళితో నుండియున్
ద్రిజగన్మంగళదాయకాకృతిఁ గడున్ దీపించు టబ్రం బహా
రజనీనాథకళాశిరోభరణ! భర్గా! పార్వతీవల్లభా!

42. శా. డాయన్రాదయటండ్రు మాదృశులు చండాలాదులన్డాసినన్
బాయుంబుణ్యచయంబులంచుఁ జదువుల్పల్కంగనీవయ్యయో
బోయం డెంగిలిమాంసమిచ్చుటకులో బుల్పూనిచేకొంటి వే
ప్రాయాశ్చిత్తము కద్దుదీని కిఁక? భర్గా! పార్వతీవల్లభా!

43. శా. భజించుంగద! ఘోరదుష్కృతతతిన్ భస్మత్రిపుండ్రంబుల
న్మంజుశ్రీలలితాక్షమాలికలఁ బ్రేమం బూని సద్భక్తి నీ
కుం జేమోడ్చు మహానుభావుఁ డెపుడుం కుక్షిస్థలప్రోల్లాస
త్కంజాతప్రభవాండభాండచయ! భర్గా! పార్వతీవల్లభా!

44. శా. శ్రీశైలంబునుగుంభఘోణమును గాంచీస్థానకేదారముల్
కాశీద్వారవతీప్రయాగములు నీలక్ష్మాధరావంతికల్
లేశంబున్ ఫలమీవు నిన్నెప్పుడు హాళింగొల్వలేకున్నచోఁ
గాశాకాశధునీఘనాభరణ! భర్గా! పార్వతీవల్లభా!

45. శా. కావేరీ సరయూ మహేంద్రతనయా గంగా కళిందాత్మజా
రేవా వేత్రవతీ సరస్వతుల కర్థింబోవఁగా నేల నీ
సేవాసంస్మరణార్చనాదు లెపుడున్ సిద్ధించు మార్త్యాళికిన్
గ్రైవీభూతభుజంగమప్రవర! భర్గా! పార్వతీవల్లభా!

46. మ. అరిషడ్వర్గముఁ దోలి సర్వహితులై యష్టాంగయోగక్రియా
పరులై గాడ్పుజయించిముద్రవెలయన్ బ్రహ్మంబునీక్షించివా
విరి సోహమ్మని యెంచుచుండెడిమహా వేదాంతులౌయోగిశే
ఖరులెల్లన్ మిముఁ గాంచుచుండ్రుగద? భర్గా! పార్వతీవల్లభా!

47. తలపోయన్ దిలజాలకాంతరమహా తైలంబుచందానఁ బూ
సలలో దారముపోల్కి నాత్మమయతన్ సర్వాంతరస్థాయివై
విలసల్లీలల నిండియుండుకొను నిన్వీక్షంపఁగా నేర్చువా
రలె ధన్యుల్ గద ముజ్జగంబులను భర్గా! పార్వతీవల్లభా!

48. శా. ఏణాంకుండొకఁడై పయోఘటములందెల్ల న్బహుత్వంబుచే
రాణం బొల్చు తెఱంగునం బృథుతర బ్రహ్మాండభాండాంతర
ప్రాణిశ్రేణులయందు నీ వికఁడవే రాణింతువౌ సర్వగీ
ర్వాణస్తుత్యచరిత్ర! యాత్మమయ! భర్గా! పార్వతీవల్లభా!

49. శా. ఓంకారప్రముఖాక్షరోచ్చరణ సంయోగంబు గావేన్ముఖా
లంకారార్థము, శబ్దబిందుకళలున్ లక్ష్యప్రయోగక్రియల్
పొంకంబౌగురుమార్గముల్ యతిగతిం బోదుష్కృతింబోలిసా
హంకారుండయి ప్రాకృతుండు చెడు భర్గా! పార్వతీవల్లభా!

50. అకలంకం బతులం బఖండ మమృతం బానందకందం బనూ
నక మాద్యంతవిహీన మక్షర మనంతం బప్రమేయం బరూ
పకమవ్యక్త మచింత్యమద్వయమునౌ బ్రహ్మంబునీవంచుఁగొం
కక లోఁ గన్గొనువారు బల్లిదులు భర్గా! పార్వతీవల్లభా!

51. శా. ఆకుల్ మెక్కదెమేఁక? చెట్టుకొననొయ్యన్ వ్రేలదేపక్షి? పె
న్గాకుల్ గ్రుంకవెనీట? గాలిఁగొనదే నాగంబు? బల్గొందులన్
ఘూకంబుండదె? కోనలం దిరుగదే క్రోడంబు? నిన్గాంచినన్
గా కిన్నింటను ముక్తిచేకుఱునె? భర్గా! పార్వతీవల్లభా!

52. మ. ధర మృద్దారుశిలామయప్రతిమలన్ దైవంబు లంచుం బర
స్పరవాదంబులఁ బోరుచున్ నిబిడసంసారాంధులై మేలు చే
కుఱకే మగ్గములోని కండెలగతిన్ ఘోరార్తులై ప్రాకృతుల్
కరముం జచ్చుచుఁబుట్టుచుంద్రుగద! భర్గా! పార్వతీవల్లభా!

53. మ. జననీగర్భ మహామహోగ్రనరక స్థానవ్యథం గొన్నినా
ళ్లెనయన్ బాల్యకుమారతాదశలఁగొన్నేడుల్ వధూమీనకే
తనగేహభ్రమఁగిన్నినాళ్ళు ఘనవృద్ధప్రాప్తిఁ గొన్నేళ్ళుఁబా
యనిదుఃఖంబులఁ బ్రాణి గుందుఁగద? భర్గా! పార్వతీవల్లభా!

54. శా. కేదారాదిక పుణ్యభూముల కశక్తిం బోవఁగారాదు; బల్
పేదర్కంబున దానధర్మవిధులోలిం జేయఁగారాదు గా
కేదే నొక్కతరిన్ సమస్తభువనాధీశున్ నునుం గొల్వఁగా
రాదో? కానరుగాక దురాత్ములు భర్గా! పార్వతీవల్లభా!

55. మ. తరుణీశుంభదురోజకుంభములపై ఘమిల్లబంధంబుపైఁ
గరమూలంబులపైఁ గపోలములపైఁ గందోయిపై మోముపై
నిరతంబున్ విహరించు చిత్త మెపుడున్ నీయందొకప్డేనిఁ జే
ర్పరుగా మూఢులదేమిదుష్కృయమొ? భర్గా! పార్వతీవల్లభా!

56. మ. మినునొక్కప్పుడుఁగొల్వనేరక వృథామిథ్యాప్రచారంబులం
గములై వాఁగులయందునెల్ల మునుగంగాఁ బుణ్యముల్సేరునే!
తమి నశ్రాంతము నీటఁగ్రుంకులిడి యేధర్మంబు లార్జించెనో
కమఠగ్రాహి ఢులీకుళీరములు! భర్గా! పార్వతీవల్లభా!

57. హరి దైవంబు; విరించి సర్వభువనాధ్యక్షుండు బృందారకే
శ్వరుడాఢ్యుండు హుతాశనుండుపతి భాస్వంతుండు వేల్పండ్రు
లో నరయన్నేరరుగా శివాత్పరతరం నాస్తీతివాక్యార్థమే
కరణిం గోవిదు లైరో కాని మఱి! భర్గా! పార్వతీవల్లభా!

58. శా. వేయేనూఱు పురాణముల్ సదివినన్ వేదాంతముల్ గన్న నా
మ్నాయంబుల్ పరికించినన్ స్మృతులువేమాఱుల్ విమర్శించిన
న్నీయందాఢ్యతదోఁచుచున్నయదివో నిక్కంబుభావింపఁగా
గాయత్రీపతివై తనర్చుటను భర్గా! పార్వతీవల్లభా!

59. శా. అఘంటాపథపద్ధతిన్ శివ శివే త్యాలాపసంశీలులై
రేఘస్రంబులుద్రోచుపుణ్యతములుర్విన్ బ్రహ్మహత్యాద్యనే
కాఘౌఘంబులు వాసి తావకపదప్రాప్తిన్ విడంబింతురౌ
ద్రాఘిష్ఠప్రభుతాగుణోల్లాసన! భర్గా! పార్వతీవల్లభా!

60. మ. పృథివిన్ మార్త్యుఁ డొకప్డునీశిరముపై బిల్వీదళంబొకట
త్యాధికాహ్లాదముతోడ నిడ్డ నదియాహా! ఘోటకాందోళికా
రథనాగాంబరపుత్రపౌత్రవనితా రత్నాదులై యెప్పుఁబో
ప్రథితాదభ్రసితాభ్రశుభ్రయశ! భర్గా! పార్వతీవల్లభా!

61. మ. మిము సేవించుటచేతఁగాదె చిరలక్ష్మీసంగతుల్ శౌరికిన్
నముచిద్వేషికి శాశ్వతస్థితమహానాకాధిపత్యంబు, వా
గ్రమణీభర్త కశేషసృష్టిరచనా ప్రావీణ్యమున్ గల్గె నీ
క్రమ మజ్ఞుల్ గనలేరుగాని భువి భర్గా! పార్వతీవల్లభా!

62. శా. వాణీశాంబుజలోచనప్రముఖ గీర్వాణార్చితాంఘ్రిద్వయున్
క్షోణీభాగశతాంగునిన్ గజహరున్ శ్రుత్యంతవేద్యున్ నినున్
బాణాదిప్రమథోత్తముల్ గొలిచి మేల్పట్టూనిరౌ సంతత
ప్రాణివ్యూహమనోంబురుడ్భవన! భర్గా! పార్వతీవల్లభా!

63. శా. దారిద్య్రంబుదొలంగు, మృత్యువెడలున్ దవ్వౌనఘవ్రాతము
ల్ఘోరవ్యాధులు గండదోషము లడంగున్ జారచోరవ్యథల్
దూరంబౌ, నహితానలగ్రహగణార్తుల్ వీడు నిక్కంబు నీ
కారుణ్యం బొకయింత గల్గునెడ భర్గా! పార్వతీవల్లభా!

64. మ. సుత, పద్మాకర, దేవతాగృహ, వన క్షోణీసురోద్వాహ, స
త్కృతి, నిక్షేపము లంచునెంచ నలువౌ నీసప్తసంతానముల్
హితవారంగనొనర్చుపుణ్యమెనయున్ హేలాగతిన్మర్త్యుఁడొ
క్కతఱిన్ మిమ్ముఁదలంచెనేని మది భర్గా! పార్వతీవల్లభా!

65. మ. అమరం ద్వత్పదపంకజాతయుగళ ధ్యానక్రియాశ్రాంతసం
భ్రమలీలన్ విలసిల్లుడెంద మొరులన్ బ్రార్థింపఁగా నేర్చునే?
సుమనోనిర్ఘరిణీసువర్ణకమల స్తోమాసవాలంపట
భ్రమరం బేఁగునే తుమ్మకొమ్మలకు భర్గా! పార్వతీవల్లభా!

66. మ. శివుఁజూడందగదండ్రు గొందఱధముల్ చిత్రంబుతారెన్నఁడు
న్రవిచంద్రాగ్ని గృహిక్షమాపవననీ రవ్యోమముల్ నీస్వరూ
పవిశేషంబు లటంచుఁ దెల్ప వినరో భావింప నమ్మూర్ఖపుం
గవు లెల్లం దదధీనతన్ మనరొ భర్గా! పార్వతీవల్లభా!

67. మ. ద్విపగంధరవిభూషణాంబరవధూ వీటీభటాందోళికా
తపనీయాదులచేత మత్తిలి బుధేంద్రశ్రేణిఁ బీడింతురౌ
తపనప్రోద్భవఘోరకింకరగదా దండోగ్రదుఃఖంబు లొ
క్కపుడుందుష్ప్రభులేలయెంచరకొ? భర్గా! పార్వతీవల్లభా!

68. శా. నానాద్వీపధరాధురావహనమా న్యస్ఫారబాహాబలా
నూనఖ్యాతిసమేతు లైన శశిబిందుక్ష్మాతలేశాదిక
క్ష్మానాథు ల్చనిపోవుట ల్దెలియరో సత్యంబులా దేహముల్?
కానంజాలరుగాక దుర్నృపులు భర్గా! పార్వతీవల్లభా!

69. మ. చవిలెల్ కాసులు వీసముల్ గొని యథేచ్చాలీలలంబ్రేలుదు
ష్కవులన్మెచ్చుచు భవ్యకావ్యఘటనాశాలుల్ ప్రసంగించుచో
నవివేకక్షితినాయకాధమవరుల్ హాస్యోక్తులం బొల్తురౌ
కవితాసార మెఱుంగకుండుటను భర్గా! పార్వతీవల్లభా!

70. మ. చెలుల న్బంధుల విప్రులన్ బ్రజల దాసీభృత్యమిత్త్రాదులం
గలవిత్తంబులు వృత్తులుం గొని కడున్ గారింతు రద్యక్షతం
దలపంజాల రదేమొ మీఁదటికథల్ దర్పాంధకారాంధులై
కలనైనన్ మహిభృద్దురాత్మకులు భర్గా! పార్వతీవల్లభా!

71. శా. మన్నెల్లందమసొమ్మటంచు వసుధా మార్త్యోత్తమక్షేత్రముల్
కన్నారంగని యోర్వలేక దిగమ్రింగం జూతురల్పప్రభుల్
వెన్నప్పంబులొ బూరెలొ వడలొ భావింపంగ నొబ్బట్లొకో
యన్నా! యెన్నఁగ వారిపాలి కవి? భర్గా! పార్వతీవల్లభా!

72. మ. ప్రజలం గాఱియఁబెట్టి పెట్టియల నర్థంబెప్పుడు న్నించుచున్
ద్విజవిద్వత్కవివందిగాయకుల కేదే నొక్కటీలేక య
క్కజమొప్పంబలుమూలలం దిరుగు భూకాంతాంళికిం గీర్తిధ
ర్మజయౌద్ధత్యము లేక్రియంగలుగు? భర్గా! పార్వతీవల్లభా!

73. శా. ఆజిన్ వైరివరూధినీమథనదీక్షారూఢిఁ గ్రాలన్ వలెన్
భోజుంబోలి సమస్తయాచకతతిం బోషించుచుండన్ వలెన్
తేజం బెప్పుడు నుర్విలోఁ బ్రజకుఁ జెందింపన్ వలెన్ గానిచో
రాజా వాఁడు? తరాజుగాక! భువి, భర్గా! పార్వతీవల్లభా!

74. శా. తేజంబొప్పఁ బురాకృతంబున జగద్ధ్యేయత్వదంఘ్రిద్వయీ
పూజాపుణ్యఫలంబునం దమరిటుల్ భూపత్వముంగంటకున్
వ్యాజంబూనికడుంజెడంగవలెనా యాలింపరా యీనృపుల్
"రా జాంతే నరకం వ్రజే"త్తనుట? భర్గా! పార్వతీవల్లభా!

75. మ. కవివిద్వద్ధరణీసుధాశనవరుల్ కార్యార్థులై యొద్ద డా
సి వడిం జేతులుదోయిలించుకొని యాశీర్వాదముల్సేయ నె
క్కువదర్పంబున నట్టిట్టుం బొరలకే కొర్మ్రంగిన ట్లుండ్రుగా
రవళిం దుర్నృపు లేమియీఁగలరొ భర్గా! పార్వతీవల్లభా!

76. శా. గాజుంబూస యనర్ఘరత్నమగునా? కాకంబు రాయంచయౌ
నా? జోరీఁగ మధువ్రతేంద్రమగునా? నట్టెన్ము పంచాస్యమౌ
నా? జిల్లేడు సురావనీజ మగునా? నానాదిగంతంబులన్
రాజౌనా ఘనలోభిదుర్జనుఁడు? భర్గా! పార్వతీవల్లభా!

77. శా. కోపంబెక్కువ, తాల్మియిల్ల, పరుషోక్తుల్ పెల్లు, సత్యంబుతీల్,
కాపట్యంబుఘనంబు, లోభమునహంకారంబు దట్టంబు, హృ
చ్చాపల్యం బధికంబు, ద్రోహమతి విస్తారంబు, చీ! యిట్టిదు
ర్వ్యాపారప్రభు లేరిఁ బ్రోతు రిఁక భర్గా! పార్వతీవల్లభా!

78. శా. హృద్వీథిం గనరుం దిరస్కృతియు బిట్టేపార నొక్కప్పుడున్
సద్వాక్యంబును దర్శనం బిడని రాజశ్రేణి కాశింతురౌ
"విద్వద్దండమగౌరవం" బనుస్మృతుల్ వీక్షింపరా దుర్నృపా
గ్రద్వారంబుల వ్రేలు పండితులు? భర్గా! పార్వతీవల్లభా!

79. మ. అపవర్గం బొనగూడునో చిరసుఖాహ్లాదంబు చేకూరునో
జపహోమాధ్యయనార్చనాదిక మహాషట్కర్మముల్డించి దు
ష్కపటోపాయవిజృంభమాణధరణీ కాంతాధమాగారని
ష్కపట భ్రాంతి జరింతు నార్యు లిల భర్గా! పార్వతీవల్లభా!

80. మ. అకటా! జుత్తెఁడుపొట్తకై కృపణమర్త్యాధీశగేహాంగణా
వకరక్షోణిరజశ్చటావిరతసం వ్యాప్తాంగులై క్రుంగి నె
మ్మొకముల్ వెల్వెలఁబాఱవ్రేలుదురదేమో యెందులంబోవనే
రక ధీమజ్జను లెంతబేలలకొ! భర్గా! పార్వతీవల్లభా!

81. మ. అతిలోభిన్ రవిసూనుఁడంచుఁ గపటస్వాంతున్ హరిశ్చంద్రభూ
పతియంచున్ మిగులం గురూపిని నవప్రద్యుమ్నుఁడంచు న్మహా
పతితున్ ధర్మజుఁడంచు సాధ్వసమతిం బార్థుడటంచు న్బుధుల్
ప్రతివేళన్ వినుతింతు రక్కఱను భర్గా! పార్వతీవల్లభా!

82. మ. జనసంస్తుత్యమహాప్రబంధఘటనా సామర్థ్యముల్ గల్గు స
జ్జను లత్యల్పుల దీనతం బొగడుదుర్ జాత్యంధతం జెందికా
కనువొప్పందమరెన్నఁడున్ "సుకవితా యద్యస్తిరాజ్యేనకి"
మ్మనువాక్యంబు వినంగలేదొమును? భర్గా! పార్వతీవల్లభా!

83. సుగుణోద్దామమహాకవింద్రఘటితా క్షుద్రప్రబంధావళుల్
జగదుద్దండపరాక్రమక్రమ విరాజద్భూమి భృన్మౌళికిన్
దగుఁగా కల్పుల కొప్పునే? కరికిముక్తాకాయమానంబుసొం
పగుఁగా కొప్పునే యూరఁబందులకు? భర్గా! పార్వతీవల్లభా!

84. మ. పటులోభాత్మున కెవ్వరైనఁ గడఁకంబద్యాదులర్పించినం
గుటిలుండై యవియెల్ల నిల్పుకొనఁగా గోరండునిక్కంబహా!
దిట మొప్పారఁగ నిల్పుకోఁగలదె ధాత్రిన్ గొంతసేపైన మ
ర్కటపోతం బురురత్నహారంబులు? భర్గా! పార్వతీవల్లభా!

85. మ. భువిలో మేదరసెట్టి చివ్వతడకల్ పొంకంబుగా నల్లి పె
స్రవళిన్ సంతలనెల్లఁదిప్పు క్రియ దైన్యంబెచ్చఁగా దుష్కవుల్
తివుటొప్పం జెడుకబ్బపుందడక లోలిం ద్రిప్పఁగా నద్దిరా!
కవితల్ కాసుకు గంపెఁడయ్యెఁగద భర్గా! పార్వతీవల్లభా!

86. మ. అవివేకక్షితినాయకాధమసభా భ్యాస ప్రదేశంబులన్
బవళు ల్రేలునుజుట్టఁబెట్టుకొని దుష్పాండిత్యముల్చూపుచుం
గవిముఖ్యుంబొడగాంచి జాఱుదురు వేగం; బుండవి ల్గన్న కా
కవులట్లే నిలఁబోక కాకవులు భర్గా! పార్వతీవల్లభా!

87. మ. భువిలో నిక్కలిదోషహేతుకమునం బొల్పారి గోసంగులున్
బవినాలున్బలుమోటకాఁపుదొరలుం బాషాండులు న్దాసరుల్
సివసత్తుల్ నెఱబోయపెద్దలును దాసేయుప్రభుల్ దుష్టకా
కవులు న్మీఱిరిఁకేమి చెప్పనగు? భర్గా! పార్వతీవల్లభా!

88. మ. కలుముల్నిక్క మటంచునమ్మితులువల్గర్వాంధులై యెన్నఁడు
న్బిలిభిక్షంబులు వెట్టకుండ్రు పిదప న్బ్రాణంబులంబాసియా
ఖలులృమౌదురో, వాండ్రుగూరిచినరొక్కం బెల్ల నేమౌనొకో
కలుషోద్గాఢతమస్సహస్రకర! భర్గా! పార్వతీవల్లభా!

89. తులువ ల్పెట్ట భుజింపలేక ధనమెంతోనెమ్మదింగూర్చిమూ
లల దట్టంబుగఁబాఁతుకొన్న నృపతుల్వాలెంబు నిర్మోహులై
పలుచందంబులఁ గట్టి కొట్టి మిగులన్భాదించి రోధించుచుం
గలసొ మ్మెల్ల హరించుచుండ్రుగద! భర్గా! పార్వతీవల్లభా!

90. మ. చెనఁతుల్గూర్చుధనంబుమ్రుచ్చులకు దాసీవారయోషాహు
తాశన దుష్టక్షితిపాలక ప్రతతికిన్ సంరూఢిఁ జేకూరుగా,
కనపద్యప్రతిభావిభాసిత బుధేంద్రానీకముం జేరునే?
కనదుద్దామపరాక్రమప్రథిత! భర్గా! పార్వతీవల్లభా!

91. మ. ధరణిన్ సద్గురుచెంత నెందఱుఖలుల్ దార్కొన్ననచ్చోటికే
కరమర్థి న్బుధులేఁగుచుండుదురు నిక్కంబారయన్ గంటకా
వరణోజ్జృంభితకేతకీవని కరుల్ వాలెంబుగాఁ జేరవే?
కరుణాదభ్రపయఃపయోనిలయ! భర్గా! పార్వతీవల్లభా!

92. శా. లోకానీకమునందు దుర్గుణులు కల్ముల్ గల్గియున్నప్డు ప
ల్గాకుల్ దార్కొని మెల్లమెల్లనే దురాలాపంబులంగేరుచుం
గైకొండ్రెల్లపదార్థల్నిజమహో కార్కూఁతలం గ్రోల్చుచు
న్గాకు ల్వేములఁ జేరుచందమున భర్గా! పార్వతీవల్లభా!

93. మ. చదువు ల్వేదపురాందము ల్గయితలు స్సబ్బండువిద్దెల్ గతల్
మొదలెన్నేనిగ విద్దుమాంసువు లదేమో తెల్పఁగావింటిఁగా
నదిగో చౌలకు మాలదాసరి శటాలైగారి జ్ఞానమ్మలెన్
గదియంజాల వటండ్రు ముష్కరులు భర్గా! పార్వతీవల్లభా!

94. శా. పో! పో! బాఁపఁడ! దోసె డూదలిడినం బోలేక పేరాసల
న్వాపోఁజాగితివేమి! నిసదువు తిర్నామంబులో! సుద్దులో
భూపాళంబులొ లంకసత్తెలొ బలా బొల్ల్యావుపోట్లాటలో
కా! పాటింపనటండ్రుబాలిశులు భర్గా! పార్వతీవల్లభా!

95. మ. అదిగో బాఁపనయల్లుభొట్లయకు ముందప్పయ్యతీర్తంబులో
నదనం"గిద్దెఁడుకొఱ్ఱనూక లిడితిన్ అబ్బబ్బ! తిర్నామముల్
సదువంజాగిన మాలదాసరయలన్ సంతోసనాల్ సేసితిం
గద" యంచుంబలుమోటులాడుదురు భర్గా! పార్వతీవల్లభా!

96. శా. రాలన్ దైలము తీయవచ్చు భుజగవ్రాతమ్ముల న్బేర్లఁగా
లీల న్బూనఁగవచ్చు నంభోనిధి హాళి దాఁటఁగావచ్చు డా
కేల న్బెబ్బులిఁ బట్టవచ్చు విపినాగ్ని న్నిల్పఁగావచ్చు మూ
ర్ఖాళిం దెల్పఁ దరంబె యేరికిని? భర్గా! పార్వతీవల్లభా!

97. శా. ఆఁకొన్నప్పుడు వంటకంబయిన బియ్యంబైన జావైనఁగూ
రాకైన న్ఫలమైన నీరమయినన్ హాలింగల ట్లిచ్చుచున్
జేకోనౌఁ బరదేశులం గృహులకు న్సిద్ధంబు గావింప ఛీ!
కాకున్న న్మరి యేఁటికొంప లవి? భర్గా! పార్వతీవల్లభా!

98. మ. మడతల్వల్కునృపాలుతోఁ బలుమాఱున్మారాడుపెండ్లాముతోఁ
జెడుజూడం బ్రచరించునాత్మజునితోఁ జేట్పాటుగోర్లెంకతో
బొడవంజూడఁగవచ్చు కార్మొదవుతోఁ బోరాడుచుట్టంబుతోఁ
గడతేరం దరమా గృహస్థునకు? భర్గా! పార్వతీవల్లభా!

99. శా. కాకిన్శాశ్వతజీవిగా నునిచి చిల్క న్వేగ పోకార్చి సు
శ్లోకుం గొంచెపుటేండ్లలోఁ గెడపి దుష్టుంబెక్కునాళ్లుంచి య
స్తోకత్యాగి దరిద్రుఁ జేసి కఠినాత్మున్ శ్రీయుతుంజేయి నా
హా! కొంకేదిఁక నల్వచెయ్వులకు? భర్గా! పార్వతీవల్లభా!

100. మ. ధరలో నెన్నఁగ శాలివాహన శకాబ్దంబుల్దగ న్యామినీ
కరబాణాంగశశాంకసంఖ్యఁజెలువై కన్పట్టు (సౌమ్యా) హ్వ
య స్ఫురదబ్దంబున నిమ్మహాశతక మేఁ బూర్ణంబుగావించి శ్రీ
కరలీల న్బుధు లెన్న నీకిడితి భర్గా! పార్వతీవల్లభా!

101. ధనధాన్యాంబరపుత్త్రపౌత్త్రమణిగోదాసీభటాందోళికా
వనితాబంధురసింధురాశ్వ (మహితైశ్వర్యంబు) దీర్ఘాయువు
న్ఘనభాగ్యంబును గల్గి వర్ధిలుదు రెక్కాలంబుఁ జేట్పాటులే
క నరు ల్దీని బఠించిరేని భువి భర్గా! పార్వతీవల్లభా!