Thursday, November 13, 2014

జ్ఞానబోధశతకము - మట్టపర్తి నడవపల్లి

జ్ఞానబోధశతకము
                                   మట్టపర్తి నడవపల్లి
(ఆటవెలదులు)

1. శ్రీమదాత్మగురుని సేవింతునెప్పుడు
భ్రాంతిరహితమైన బాటజూపి
నిత్యసుఖముగాంచు నేర్పునేర్పినవాని
వినుముజ్ఞానబోధ గనుముమనస

2. వ్యాసకాళిదాస వరకవీశ్వరులకు
వందనములుజేసి వ్రాయుచుంటి
జ్ఞానబోధయనెడు శతకంబు దీనిని
వినుముజ్ఞానబోధ గనుముమనస

-: నీతిబోధ :-

3. తన్నుపొగడుకొనుట తనకుమేలునులేదు
పరులనిందజేయ ఫలములేదు
నిందజేయువాడు నిందితుండగుగాదె
వినుముజ్ఞానబోధ గనుముమనస

4. సారమెరుగలేని చాలమాటలునేర్చి
నిజమెరుగనివాడు నిజముతెలసి
నటునటించి మాటలాడుటనైజంబు
వినుముజ్ఞానబోధ గనుముమనస

5. తరుచుచదువునతడు తర్కవాదముసేయ
నిజముతెలియజాలు నేర్పులేక
చదువునిజము తెలయ జచ్చువాదముల్
వినుముజ్ఞానబోధ గనుముమనస

6. సజ్జనుండు దుష్ట సహవాసమొనరింప
పుప్పుతిప్పలకును మూలమగును
సాధుజనులగూడ సమకూరుమోక్షంబు
వినుముజ్ఞానబోధ గనుముమనస

7. మాయసాధువెన్నొ మహిమలజూపించు
భోగసుఖముకొరకు పొట్టకొరకు
అజ్ఞుడట్టివాని నధికునిగానెంచు
వినుముజ్ఞానబోధ గనుముమనస

8. నువ్వుగింజలోని నూనెగన్పడనట్లు
గొప్పవారిగుట్టు కొద్దిజనుల
కెరుగరాదు మిగుల తరచిజూచినగాని
వినుముజ్ఞానబోధ గనుముమనస

9. ఎంతయోగడించి ఏమిపట్తుకుపోవు
మంచిచెడ్డయనెడు మాటెగాని
మంచినడతనడచి మరిచచ్చినామేలు
వినుముజ్ఞానబోధ గనుముమనస

10. తన్నునొరులుపొగడ తానుబ్బగారాదు
నిందజేసిరేని గుందరాదు
నిందస్తుతియు సమము నిజమైనయోగికి
వినుముజ్ఞానబోధ గనుముమనస

11. పాపకర్మచేయ పట్టిబాధించును
గడచిపోవువరకు విడువదెందు
గానఘోరకర్మ మానుమీయికనైన
వినుముజ్ఞానబోధ గనుముమనస

12. కఠినబాధలెన్నొ కాలుడుపెట్టును
చెప్పతరముగాదు ముప్పువచ్చు
దేహముందగానె దేవునిజూడుము
వినుముజ్ఞానబోధ గనుముమనస

13. తిరుగరానిదూర దేశాలుతిరిగియు
ధనముసంగ్రహించి ధరణిలోన
కష్టమొందిపెంప కాటికేదేహము
వినుముజ్ఞానబోధ గనుముమనస

14. ధనమధంధులకును దాసోహమనిజెప్పి
ధనముగోరుచుంట తప్పుచాల
హీనవృత్తియిదియె యిమ్మహిలోపల
వినుముజ్ఞానబోధ గనుముమనస

15. వాక్కుగట్టివేసి వైరాగ్యమునుబొంది
సర్వసంగములను సాగదోలి
మూలమెరుగునతడు ముక్తికల్వలనుండు
వినుముజ్ఞానబోధ గనుముమనస

16. సర్వభూతములను సమముగాజూచిన
నాత్మరూపుడగుచు నలరుచుండు
నట్టివానిబొగడ నజునకువశమౌనె
వినుముజ్ఞానబోధ గనుముమనస

17. తనువులస్థిరమని తలపోయగాలేక
మాయభవములోన మగ్నులగుచు
వెతలుబడగనేల వేడుకమీరంగ
వినుముజ్ఞానబోధ గనుముమనస

18. కాలమెల్లనువృధా గడుపుచునుండిన
పరముగానలేక పరితపించు
నిచటసేయకున్న నచటేమిసేతుము
వినుముజ్ఞానబోధ గనుముమనస

19. హింససేయువాడు హీనుడైధరయందు
వెతలబడుచునుండు గతులులేక
హింససేయకుండు హంసనుదెలసిన
వినుముజ్ఞానబోధ గనుముమనస

20. కోటిజన్మలెత్తి చేటునొందగనేల
మేలుకొనుమునీవు కీలుదెలసి
చాలుచాలుమాను సంసారవాంఛలు
వినుముజ్ఞానబోధ గనుముమనస

21. మలముకండలు నెముకలుగలిగినయట్టి
మట్టిదేహమందు మమతగలిగి
యున్నవారుముక్తి తెన్నుగానగలేరు
వినుముజ్ఞానబోధ గనుముమనస

22. ఇల్లువాకిలియును కల్లసంసారంబు
నాదియనుచుచాల నమ్మితుదకు
దండధరునియింట దైవమాయనియేడ్చు
వినుముజ్ఞానబోధ గనుముమనస

23. భూతపంచకమున మునుప్రపంచమునందు
పుట్టికర్మజేసి కొట్టుకొనుచు
కాలమృత్యువునను గూలునుకడపట
వినుముజ్ఞానబోధ గనుముమనస

24. ఆశచేతమనుజు డధముడైచెడిపోవు
ఆశవిడచెనేని యతడెలోన
నాత్మతత్వమరసి యానందమునుజెందు
వినుముజ్ఞానబోధ గనుముమనస

25. ఎంతకాలమున్న నంతమొందకపోడు
చింతచేతనరుడు చివుకుచుండు
సంతసబుగురుని చెంతజేరకరాదు
వినుముజ్ఞానబోధ గనుముమనస

26. మాయచేతజిక్కిపోయికర్మలజేసి
చల్నమొందుచుండు చపలగుణుడు
చపలగుణము విడువజాలక చెడిపోవు
వినుముజ్ఞానబోధ గనుముమనస

27. మనగుణములబట్టి మంచిచెడ్డలకును
మహినిజనులుతాము మసలుచుండ్రు
గానమనుజుడెపుడు దీనినెరుగవలె
వినుముజ్ఞానబోధ గనుముమనస

28. ఎక్కడీతలిదండ్రు లెక్కడిసతిసుతు
లెక్కడిధనధాన్య మేమిజన్మ
తనువువిడచునపుడు తనకుతోడెవ్వరు
వినుముజ్ఞానబోధ గనుముమనస

29. చెప్పనలవిగాని చెడ్డకర్మముచేత
ముప్పుదప్పదయ్యె మునులకైన
తానుజేయుకర్మ తగిలిబాధించును
వినుముజ్ఞానబోధ గనుముమనస

30. సర్వమున్నదనుచు సంసారమునమున్గి
పొంగుచుండునరుడు పొలుపుగాను
తనకునెంతయున్న తనవెంటవచ్చునా
వినుముజ్ఞానబోధ గనుముమనస

31. ఇహముసుఖముజూచి యహమువిడువలేక
విర్రవీగుచుండు వెర్రిబట్టి
మర్మమెరుగలేక కర్మకులోనౌచు
వినుముజ్ఞానబోధ గనుముమనస

32. కర్మచేతనెపుడు కలుగునుజన్మంబు
జన్మనెత్తమరల సలుపుకర్మ
కర్మజన్మలేని మర్మంబుతెలియుమా
వినుముజ్ఞానబోధ గనుముమనస

33. మదినివిడువకున్న మానాభిమానముల్
మనుజునకునుజగతి మాయగెల్వ
తరముగాదుసుమ్ము తానెంతవాడైన
వినుముజ్ఞానబోధ గనుముమనస

34. మేమెహెచ్చటంచు మేదినిజనులెల్ల
చెప్పుకొనుటచాల చెడ్డతనము
ఆత్మనెరుగకున్న నతడెట్లు ఘనుడౌను
వినుముజ్ఞానబోధ గనుముమనస

35. కాంతమేనుజూచి భ్రాంతినొందగనేల
చీమునెత్తురనెడు చింతలేక
క్రొవ్వుకండలందు కోర్కెనిల్పగబోకు
వినుముజ్ఞానబోధ గనుముమనస

36. ఎంతవానికేని కాంతలతోపొందు
పాపమనిరిగాదె పరమమునులు
కాంతవిడచువాడు ఘనమైనయోగియౌ
వినుముజ్ఞానబోధ గనుముమనస

37. సత్యమెల్లజగతి జనవిరోధంబాయె
ననృతమేనరులకు నరయతీపు
ఏదినిత్యసిఖమొ యెరుగకయుండిరి
వినుముజ్ఞానబోధ గనుముమనస

38. సత్వగుణముచేత సాధనసంపత్తి
నభ్యసించిదాని యర్ధమెరిగి
ఆత్మనెరుగుమార్గ మవనిలోగాంచుము
వినుముజ్ఞానబోధ గనుముమనస

39. ఆయువెన్న కొద్దియైయుడు నరునకు
ఆశవిడువకుండు లేశమైన
ఇట్టిజీవి తుదకు వట్టిచేతులబోవు
వినుముజ్ఞానబోధ గనుముమనస

-: ఎరుకబోధ :-

40. శ్రీమదాత్మగురుడు శివునియంశంబున
జనులనుద్ధరింప జగతిబుట్టి
మేలుచేయుచుండె కీలుబాగుగదెల్పి
వినుముజ్ఞానబోధ గనుముమనస

41. మురికియద్దమందు మోముగాననియట్లు
జీవబుద్ధిచేత శివునిగానక
పుట్టిచచ్చుచుండు పుడమిలోనజ్ఞాని
వినుముజ్ఞానబోధ గనుముమనస

42. తారకమననాత్మ ధ్యానించుటనుదెల్పు
సాంఖ్యాసూత్రమెల్ల సాక్షిదెల్పు
నాత్మయేనేనని యమనస్కమొగిదెల్పు
వినుముజ్ఞానబోధ గనుముమనస

43. బంధిపుత్రమిత్ర భార్యాదులందరు
నాశమొదెనేని లేశమైన
శోకమొందకుండు సూటిగాంచినయోగి
వినుముజ్ఞానబోధ గనుముమనస

44. పవనమందిరమున పరమాత్ముడుండెను
గుట్టుదెలిసినయట్టి గురువువద్ద
చేరితెలుసుకొనుడి చెడిపోవకనువృధా
వినుముజ్ఞానబోధ గనుముమనస

45. నిర్వికల్పమనెడు నిష్ఠనుండెడువాని
పలుకరింత్రుచలము పటిప్రజలు
చెడినకోతివనము జెరిచినట్లుగతాను
వినుముజ్ఞానబోధ గనుముమనస

46. సత్వగుణముగలుగ శాంతంబునిల్చును
శాంతమున్న సాధు జనులయొద్ద
జేరిగుట్టుతెలియ జేరునుబ్రహ్మంబు
వినుముజ్ఞానబోధ గనుముమనస

47. తుచ్ఛగుణమువిడచి తుదుతురీయంబున
సాక్షినెరుగునతడు సాధువగును
సాక్షినెరుగతరమె సామాన్యజనులకు
వినుముజ్ఞానబోధ గనుముమనస

48. సర్వవాసనలను సంకల్పములనెన్నొ
అంతలోనెచేయు వింతగాను
చిత్రమైనమనసు చెప్పతరముగాదు
వినుముజ్ఞానబోధ గనుముమనస

49. దేహమోహముడిపి దేవునిజూపిన
గురునినెపుడుధరణి మరువరాదు
మరచినట్టివారు మానవపశువులు
వినుముజ్ఞానబోధ గనుముమనస

50. దుష్టహయమువంతి దుర్మార్గమనసును
శిక్షసేయవలె నుపేక్షమాని
శిక్షజేసియాత్మ చెంతజేర్చగవలె
వినుముజ్ఞానబోధ గనుముమనస

51. మూడుదేహములకు మూలమైనట్టియా
సాక్షినెరుగువాడు సాధువగును
సాధువులనుగొల్వ సౌఖ్యంబుసమకూరు
వినుముజ్ఞానబోధ గనుముమనస

52. అలవికాదుతెలియ ననుభవాత్ములగుట్టు
సత్వగుణముగలుగు సరసుడెరుగు
కల్లలాడుజనులు కానంగలెరెందు
వినుముజ్ఞానబోధ గనుముమనస

53. ఎన్నిజన్మలెత్తి ఏపాట్లుబడినను
బ్రహ్మవలనగలుగు భవ్యసుకహ్ము
చేరిగురునిసేవ చేయకగలుగునా
వినుముజ్ఞానబోధ గనుముమనస

54. సాంఖ్యతారకముల సాధింపకుండిన
నాత్మనెరుగుబాట లవనిగలవె
గానగురునిజేరి గనవలెపరమును
వినుముజ్ఞానబోధ గనుముమనస

55. తనువులోననున్న తత్వంబుదెలియక
మోసపోవుటెల్ల మొద్దుతనము
అదియుదెలిసిబ్రతుకు నతడెపొసుజ్ఞాని
వినుముజ్ఞానబోధ గనుముమనస

56. శత్రులార్వురుండ్రు శ్రమబూనివారిని
బట్టిచంపిగురుని పజ్జజేరి
ఆత్మతత్వమెరుగ నానందమందును
వినుముజ్ఞానబోధ గనుముమనస

57. తారకమనుదాని తనువుతోగనకున్న
మనసునిలుపుత్రోవ మరియుగలదె
మనసునిలుపువాడు మహనీయుడైయుండు
వినుముజ్ఞానబోధ గనుముమనస

58. మాయచేయుచున్న మహిమతెలియరాదు
అంతలోనెమరపు నట్టెచేయు
మాయమర్మమెరుగ మహిలోనధన్యుండు
వినుముజ్ఞానబోధ గనుముమనస

59. మూలమెరుగలేక ముక్తినిజెందక
విర్రవీగుచుండు వెర్రిబట్టి
మాయజేతజిక్కి మమతవీడగలేడు
వినుముజ్ఞానబోధ గనుముమనస

60. ఇడకుపింగళకును నడుమనిమిడియున్న
వెలుగునన్రమింప వేడ్కజెందు
వారికిక జపతప వాంఛలేటికిగల్గు
వినుముజ్ఞానబోధ గనుముమనస

61. సంగవర్జితుండు సంశయంబులులేక
సరిగాజూచుచుండు సాక్షినెపుడు
సాక్షిజూడకున్న సాధువెట్లగుతాను
వినుముజ్ఞానబోధ గనుముమనస

62. నమ్మి గురునిగొలిచి నాల్గుమాహావాక్య
ముల నెరుంగజాలు పుణ్యపురుషు
డతులితప్రమోదమందును సతతంబు
వినుముజ్ఞానబోధ గనుముమనస

63. పగలు రాత్రులందు పనులలోమునిగియు
తన్నుగానలేక తల్లడిల్లు
నట్టివారికెట్టులలవడు బ్రహ్మంబు
వినుముజ్ఞానబోధ గనుముమనస

64. వంచనంబొనర్చి పంచతన్మాత్రల
పరమపదవికొరకు పాతుబడుచు
నిష్ఠవిడువబోకు నీవేదియెట్లైన
వినుముజ్ఞానబోధ గనుముమనస

65. కుటిలగుణములేక కుదురుగామనసును
చెదరనీకనాత్మ చెంతజేర్చి
నిత్యసుఖమునొందు నిర్మలుండైతాను
వినుముజ్ఞానబోధ గనుముమనస

66. ఎన్నిజన్మలెత్తి యేపాట్లుబడితివో
యిప్పుడైనగురుని యింటజేరి
జన్మరహితమైన మర్మంబుదెలియుమా
వినుముజ్ఞానబోధ గనుముమనస

67. కోతికొలువుజేయ కోర్కెతోముగ్గురు
బంటులగుచుదాని వెంటదిరుగ
పులినిజూచి చచ్చిపోయిరినల్వురు
వినుముజ్ఞానబోధ గనుముమనస

68. ఆశవిడచివేసి యశముగాంచుచునున్న
వానికేలనరయ వనితపొందు
మలమువిడుచువాడు మరిదానిగోరునే
వినుముజ్ఞానబోధ గనుముమనస

69. పంచభూతములకు పట్టగారాకను
నన్నిటనువసించు నాత్మనెరిగి
సంతసంబుజెందు సాధుసత్తముడెందు
వినుముజ్ఞానబోధ గనుముమనస

70. మాతలెల్లవిడచి మాయకల్వలనున్న
మూలమెరుగువాడు ముక్తిజెందు
వానిబొగడవశమె వారిజాసనుకైన
వినుముజ్ఞానబోధ గనుముమనస

71. నేలపాన్పుజేసి పేలికలెల్లను
గట్టుచుండుమౌని ఘనముగాను
భోగవాంఛలేక బుడమినివర్తించు
వినుముజ్ఞానబోధ గనుముమనస

72. అంత్యకాలమందు నాలుపిల్లలుగూడి
గొల్లుమనుచునేడ్చి గొడవజేయ
చెవినిడకయెజ్ఞాని చెందగవలెముక్తి
వినుముజ్ఞానబోధ గనుముమనస

73. జ్ఞానహీనుడైన వానికెన్నటికిని
నజునివశముగాది కాత్మజూప
జ్ఞానవంతుడైన ఘనయోగిజూచును
వినుముజ్ఞానబోధ గనుముమనస

-: పరిపూర్ణబోధ :-

74. ద్వాదశియనుమంత్ర మాదరించిజపింప
బట్టబయలుగాగ బాటదెలుపు
బాటదెలిసెనేని పరిపూర్ణమైయుండు
వినుముజ్ఞానబోధ గనుముమనస

75. కలనుగాంచుచున్న కాయములవిధాన
మాయయెరుకవచ్చె మహినటంచు
పంచదశియుదెల్పు బాగుమీరంగను
వినుముజ్ఞానబోధ గనుముమనస

76. ఎరుకతీసివేసె నెపుడులేకుండగ
షోడశాక్షిరెపుడు చోద్యముగను
ఎరుకవిడచువాని నెన్నుట్కష్టంబు
వినుముజ్ఞానబోధ గనుముమనస

77. సూక్ష్మబుద్ధిచేత సూటినెరింగియు
దుఃఖమేమిలేక దొడ్డసుఖము
నొందియోలలాడు చుండువాడచలుండు
వినుముజ్ఞానబోధ గనుముమనస

78. సర్వకార్యములను జరుపునుమనవలె
నచలుడనుచు వీని ననుటయెట్లు
అబ్బనచ్చదందు రజ్ఞులుకొందరు
వినుముజ్ఞానబోధ గనుముమనస

79. సకలకృత్యములను జరుపుచునున్నను
కేవలాత్మగనుచు భావమెరుక
మరపులేకయున్న మరలజన్మించడు
వినుముజ్ఞానబోధ గనుముమనస

80. పనులుజేయుచున్న పరిపూర్ణమెప్పుడు
గానవచ్చుకనుల గట్టినట్లు
అందరెరుగజాల రట్టివారలగుట్టు
వినుముజ్ఞానబోధ గనుముమనస

81. సంశయములులేక సాక్షికల్వలనున్న
పూర్ణభావమెరుగు బోధగురువు
మాయమహిమవిడచి మహనీయుడైయుండు
వినుముజ్ఞానబోధ గనుముమనస

82. ఎరుకవిడనివార లెనుబదినాలుగు
లక్షసంఖ్యయోను లనుజనింత్రు
పూర్ణభావమెరుగ పుట్టబోరెపుడిక
వినుముజ్ఞానబోధ గనుముమనస

83. యతులుమునులుఋషులు నాత్మయేగతియని
పలికిరచలబోధ పట్టువడక
ఎరుకవిడకజనన మరణముల్ విడచునే
వినుముజ్ఞానబోధ గనుముమనస

84. ఎరుకవిడువకున్న నెంతవారలుగాని
పుట్టికిట్టకుండ పోరుపుడమి
ఎరుకదరికిరాదు గురుకటాక్షంబున్న
వినుముజ్ఞానబోధ గనుముమనస

85. నిర్వికల్పనిష్ఠ నిరతంబుమానక
సర్వసుఖములందు సాధుజనుడు
ఆశవిడచియెందు నాశములేకుండు
వినుముజ్ఞానబోధ గనుముమనస

86. లేనివాడివచ్చి పూనికచేత తా
నున్నవానిజూచి యుర్విలోన
కలసిమెలసిపోయె కానరాకుండగ
వినుముజ్ఞానబోధ గనుముమనస

87. పుట్టికిట్టనట్టి గుట్టుపట్టెరిగియు
సాధనంబొనర్చు సజ్జనుండు
చంపగలుగుమాయ సంసారవాంఛను
వినుముజ్ఞానబోధ గనుముమనస

88. వేదశాస్త్రములను వేసారిచదివిన
బ్రహ్మమెరుగనగునె బ్రమలుగాక
భ్రమలువీడకున్న బ్రహ్మమెట్లగుతాను
వినుముజ్ఞానబోధ గనుముమనస

89. ఆత్మనాత్మనెరుగి నాత్మకుమించిన
దేవదేవునెరుగు దేశికుండు
దేవునెరుగకున్న డేశికుండెట్లగు
వినుముజ్ఞానబోధ గనుముమనస

90. తెలివిచేతతెలియు తేటగాబ్రహ్మంబు
తెలివిచేతతెలిసి తెలివివిడచి
నిష్ప్రపంచమందు నిలచినపూర్ణుడౌ
వినుముజ్ఞానబోధ గనుముమనస

91. చూచిచూడనట్టి చూపుచేనుండియు
చూపునెరుగునట్టి చూపువిడచి
పరమునెరుగువాడు పరిపూర్ణపదమందు
వినుముజ్ఞానబోధ గనుముమనస

92. ఎరుకమరపులేక యేకస్వరూపుడై
యున్నయోగిగాంచు నెన్నరాని
పరమపదవియనెడు పరిపూర్ణమెప్పుడు
వినుముజ్ఞానబోధ గనుముమనస

93. కార్యకారణములు కాకనున్నదియేదొ
గురుముఖమునదాని గురుతుదెలసి
గురుతువిడచువాడు కూడునుపూర్ణంబు
వినుముజ్ఞానబోధ గనుముమనస

94. రెండురూపులొక్క రీతిగానుండును
పేర్మిసాధుజనుడు బేధమెరుగు
రూపులనగవాని రూఢితెలియలేరు
వినుముజ్ఞానబోధ గనుముమనస

95. ఏమిచిత్రమౌర యెందుజూచిననందు
రూపమేమిలేక రూఢిగాను
గోచరించుచుండు గొబ్బుననచలంబు
వినుముజ్ఞానబోధ గనుముమనస

96. అచలగురునిజేరి యచలంబుగనకున్న
జన్మరహితమగుట జరుగదెందు
తరచిచూడవలయు తగినయత్నంబుచే
వినుముజ్ఞానబోధ గనుముమనస

97. ఎరుకమరపులేయెందు జూచినగాని
నిండియున్నదాని నిజమెరింగి
ఐక్యమెవ్వడొందు నతడెపొబ్రహ్మంబు
వినుముజ్ఞానబోధ గనుముమనస

98. తపముచేసిచేసి తల్లక్రిందులుపడ్డ
కేవలాత్మ నెరుగగావశంబె
గురునికరుణబడసి గురుతువీడగవలె
వినుముజ్ఞానబోధ గనుముమనస

99. పట్టనలవిగాని పరిపూర్ణపదమును
తెలియవశముగాదు తేటగాను
గురునికరుణచేత గురుతువీడినగాని
వినుముజ్ఞానబోధ గనుముమనస

100. రూపుగానరూపు చూపింపతరమౌనె
పాపగుణములన్ని పారదోలి
మర్మమెరుగునట్టి మహనీయులకుగాక
వినుముజ్ఞానబోధ గనుముమనస

101. ఎరుపునలుపుతెలుపు లెన్నాళ్లుజూచిన
బ్రహ్మమెట్టులగును భ్రమలుగాని
ఎరుకవిడువకున్న నెరుగునాబ్రహ్మంబు
వినుముజ్ఞానబోధ గనుముమనస

102. కదలమెదలబోదు కనినకానగరాదు
పట్టుకొనుదమన్న పట్టుబడదు
అన్నినిండియుండు నదియేమిచోద్యమో
వినుముజ్ఞానబోధ గనుముమనస

103. మూడుకలియునట్టి ముమ్మాలకోనలో
ప్రత్యగాత్మజూచి ప్రజలుదాని
కేవలాత్మయనుచు భావింతురదికల్ల
వినుముజ్ఞానబోధ గనుముమనస

104. ఎరుకచేతనెరిగి యెరుకనువిడచిన
నాతడిందుగాంచు నచలమాత్మ
నిందునెరుగకున్న నెందునెరుగలేడు
వినుముజ్ఞానబోధ గనుముమనస

105. చీకటియునువెలుగుగాక నన్నిటనిండి
పరగుబట్టబయలు బెరిగినేని
భయముదీరితాను పరిపూర్ణుడైయుండు
వినుముజ్ఞానబోధ గనుముమనస

106. మొదలుతుదియులేక కుదురుగానున్నట్టి
పరముదెలియువాడు ధరనుయోగి
యోగియైనవాడు భోగమాసింపడు
వినుముజ్ఞానబోధ గనుముమనస

107. ఎందుజూడనందు నందేమినులేక
యావరించియుండు నహమువిడచి
మాయకావలయున్న మౌనిసంఘమునకు
వినుముజ్ఞానబోధ గనుముమనస

108. చూడకుండజూడ చోద్యంబుగానిల
తెలిసితెలియకుండు తేటగాను
నంటియంటనట్టి యచలంబుధరలోన
వినుముజ్ఞానబోధ గనుముమనస

109. మూడుభేదములను మూడుకాలములందు
వదలివేయునతడు వసుధలోన
నిర్వికల్పమనెడు నిష్టలోనుండును
వినుముజ్ఞానబోధ గనుముమనస

110. పట్టనలవిగాని పరిపూర్ణమనుదాని
గురువుకరుణచేత గుట్టుదెలసి
పట్టజాలువాడు పండితుందనదగు
వినుముజ్ఞానబోధ గనుముమనస

111. బట్టబయలటన్న పరిపూర్ణపదమును
నెరిగితిననిచెప్పు టేమిఫలము
సాధనంబులేక సమకూరదెవరికి
వినుముజ్ఞానబోధ గనుముమనస

112. ముందుతనకుజరుగ బోవనున్నదియేదొ
తెలియదెవరికైన తేటగాను
ప్రాణముండగానె పరిపూర్ణమెరుగుమా
వినుముజ్ఞానబోధ గనుముమనస

113. ఎరుకనువిడదీసి మరుగెల్లజెప్పుట
హరిహరాదులకును తరముగాదు
హరిహరాదులకును నధికుండుగురుమూర్తి
వినుముజ్ఞానబోధ గనుముమనస

114. అచలమనుచునెప్పు డనుచునుందురుగాని
చలమెరుగ వశమె యజునికైన
సూటిదెలియునతడు కోటికొక్కడుసుమీ
వినుముజ్ఞానబోధ గనుముమనస

115. చూపదేమిలేని చోటుజేరినవాడు
జననమరణమేమి జగతిలేక
యెరుకవిడచియెపుడు యేమియెరుగనుండు
వినుముజ్ఞానబోధ గనుముమనస

116. మట్టపర్తివంశ మహలక్ష్మి సత్తెమ
వరసుతుండ నడవపల్లి యండ్రు
చన్నయార్యకరుణ శతకంబుజెప్పితి
వినుముజ్ఞానబోధ గనుముమనస

-: హితబోధ :-
(సీసపంచకం)

1. సర్వభోగంబులు సత్యమనుచునమ్మి, నిజమెరుంగకయుంట నీచమగును
భార్యయేతనకును పరదైవమనినమ్మి, తల్లిదండ్రులవీడ దగదుసుమ్మి
ధనమున్నదనియుబ్బి తనుభుజించుటగాదు, బీదలగనిపెట్టి పెట్టవలయు
మద్యమాంసంబుల మక్కువతోమెక్కి, మహినిపొర్లాడుట మంచిగాదు

ఎన్నియున్నను మనకిచటేమిసుఖము
విమలవైరాగ్యమునుజెంది క్రమముతోడ
గురుచరణంబులనుబట్టి గురుతుదెలసి
హితముగనుడయ్య పరముసాధించుడయ్య

2. అందచందంబుల నద్దంబులోజూచి, మురియుచుండెడు మూర్ఖుడొకడు
పరదారలనుగాంచి పండ్లికిలించుచు, భ్రాంతినొందుచునుండు భడవయొకడు
పరధనంబులకంత బడినపేరాశతో, దొంగిలింపగనెంచు తులువయొకడు
సాధుజనులగాంచి సరసంబులాడుచు, హేళనగావించు కూళయొకడు

కొంతకాలంబు బ్రతుకుకే యింతచేటు
నిక్కినీల్గుచునుందురు నీచులకట
గురువుచరణంబులనుబట్టి గురుతుదెలిసి
హితముగనుడయ్య పరముసాధించుడయ్య

3. చందనాగరుపున్గు జవ్వాదిబూసిన, మలమూత్రములకంపు మార్పనగునె
సబ్బుగట్టిగరాసి స్నానంబుజేసిన, కడుపులోమలినమే కడకుపోదు
పట్టివర్ధనములు గట్టిగా పెట్టిన, శ్రీహరి సాక్షాత్కరించబోడు
మెడను రుద్రాక్షల మెండుగాగట్టిన, ప్రారబ్ధకర్మంబు పారిపోనె

ఇట్టివేషంబులనుమాని గట్టిగాను
ఇహమునకిజిక్కిపోక మీరింపుమీర
గురువుచరణంబులనుబట్టి గురుతుదెలిసి
హితముగనుడయ్య పరముసాధించుడయ్య

4. తారకసాఆంఖయముల్ తరచెడిపనియేల, గురుసూటిదెలసిన సరసులకును
మనమునింద్రియముల మరలింపగానేల, గురుసూటిదెలసిన సరసులకును
జపతపక్రతువుల జరియింపగానేల, గురుసూటిదెలసిన సరసులకును
సగుణనిర్గుణములు సాధింపగానేల, గురుసూటిదెలసిన సరసులకును

గానయెటులోప్రయత్నించి ఘనముగాను
కష్టములలెక్కచేయకీ కలియుగమున
గురువుచరణంబులనుబట్టి గురుతుదెలిసి
హితముగనుడయ్య పరముసాధించుడయ్య

5. వేదశాస్త్రాదుల వినలేదుకనలేదు, చదువగావ్రాయగా జాలమిగుల
శబ్దార్ధములను లక్ష్యముల నెరుగను, పండితుండనుగాను పామరుండ
అనుభవంబునకు నాకందినదెల్లను, వ్రాసితి గొప్పకై వ్రాయలేదు
తప్పులున్నను వాని నొప్పులుగాదిద్ది, మన్నించుడిదెనాదు విన్నపంబు

గురుకటాక్షంబుచేజెందె బరిసమాప్తి
వినుడు వినదగియున్నను గనుడు ముదము
గురువుచరణంబులనుబట్టి గురుతు దెలసి
హితముగనుడయ్య పరముసాధింపుడయ్య.

సమాప్తము