Friday, June 28, 2013

అఘవినాశ శతకము - దాసరి అంజదాసు

అఘవినాశ శతకము
                                            దాసరి అంజదాసు (1932)

శ్రీ యేజనులకురత్నము
శ్రీ యేబహుసంపదలను జేకూర్పదగున్
శ్రీ యేభక్తికి మూలము
శ్రీ యేరక్షించుజనుల శ్రీరఘురామా!

గొప్ప బొజ్జయయ్య గుణములమాయయ్య
తప్పులెల్ల ద్రోసిదారిజూపు
గొప్పవాడవనుచు కొనియాడెదనుముందు
అంజదాసపోష అఘవినాశ!

వాక్కునందునాకు వసియించి మాతల్లి
చక్కనైనభాష జాలనొసగు
ధిక్కరించబోకు దీనుడనేతల్లి
అంజదాసపోష అఘవినాశ!

వేమనార్యులందు వేదభక్తులయందు
పూర్వకవులయందు బుద్ధినిల్పి
సార్వభౌములంచు సాగిలిమ్రొక్కెద
అంజదాసపోష అఘవినాశ!

నీలవర్ణుడైన నిఖిల ధాముండైన
బాలురామచంద్రు భక్తిగొలచి
అఘవినాశశతక మర్పించితిని నీకు
అంజదాసపోష అఘవినాశ!

ధనములిచ్చినిన్ను తనియింపగాలేను
మనసునిల్పి నీదుమహిమదెల్ప
బూనుశతకపద్య పుష్పంబులిచ్చితి
అంజదాసపోష అఘవినాశ!

1. తప్పులైనగాని ఒప్పులైననుగాని
మెప్పులైనగాని మిమ్మునమ్మి
చెప్పియుంతినయ్య శ్రీరఘురామయ్య
అంజదాసపోష అఘవినాశ!

2. గురునిజేరిమ్రొక్కి గుర్తందగాలేక
గుణవికారమింత కూడబెట్టి
తిరుగువారికెట్లు దీరునుకర్మంబు
అంజదాసపోష అఘవినాశ!

3. కపటవృత్తిచాల గలిగినవారలు
భక్తులెట్లు? పాపభటులజెట్టు
వీరినుండినన్ను విడిపించిరక్షించు
అంజదాసపోష అఘవినాశ!

4. సేవజేయువాని జిక్కుల బెట్టుట
భావ్యమేననీకు భక్తవరద
త్రోవజూపినాకు దొలగించుబాధలు
అంజదాసపోష అఘవినాశ!

5. మోసపుచ్చకయ్య ముద్దుల మాయయ్య
దోసిలొగ్గియుంటి త్రోవజూపు
దాసదాసునిపై దయయుంచిరక్షించు
అంజదాసపోష అఘవినాశ!

6. కాయమందునున్ను గనుగొనలేకను
సేయుచుంద్రుపూజ జనులుభువిని
ప్రాయమెల్లయిట్లు పాడుచేయుటదేల
అంజదాసపోష అఘవినాశ!

7. ఎన్నిజన్మలెత్తి యీజన్మకొచ్చితో
కన్నతండ్రి నన్ను కరుణజూడు
చిన్నతనముచేత జేసితిపాపముల్
అంజదాసపోష అఘవినాశ!

8. దేహభ్రాంతిచేత దేవుని గనలేక
మోహబాధజిక్కి మోసపోతి
యిహపరంబులేని యీజన్మమేలయా
అంజదాసపోష అఘవినాశ!

9. భక్తిలేనివారు పరమనీచులబోలు
యుక్తిలేకయున్న యూరకుక్క
వ్యక్తిలేనివాడు వ్యర్థమైపోవురా
అంజదాసపోష అఘవినాశ!

10. నీతికన్నవేరె జాతియందునులేదు
ఖ్యాతికన్నవేరె కాంతిగలదె
నాతికన్నగలదె నాణ్యమౌయందము
అంజదాసపోష అఘవినాశ!

11. జీవహింసజేయ దైవవంచన యౌను
జీవమందు బ్రహ్మజేరియుండు
జీవుబ్రహ్మమందు జేర్చిన సుఖమౌను
అంజదాసపోష అఘవినాశ!

12. అప్పుకన్న వేరె ఆపదేమియులేదు
మెప్పుకన్న భాగ్యమొప్పదెందు
ముప్పుకన్న వేరె గొప్పకష్టములేదు
అంజదాసపోష అఘవినాశ!

13. దాతలున్న యూరు దైవభక్తుల యూరు
భూతదయనుగల్గి బ్రోచుయూరు
భూతలంబునందు బోలును స్వర్గంబు
అంజదాసపోష అఘవినాశ!

14. పప్పు యన్నములవి పరమేశ్వరుని రూపు
ఉప్పు పులుసు నెయ్యి హృదయగుణము
గొప్పకూరలన్ని గోవిందుభూతముల్
అంజదాసపోష అఘవినాశ!

15. త్రిపుటిమధ్యనుండు దేవుని కనుగొంటె
అపుడెయోగులౌదు రయ్యలంత
దాపుజేరి గురుని దానిని గనరైరి
అంజదాసపోష అఘవినాశ!

16. ధనము యెవరి సొమ్ము దానమెవరిసొమ్ము
మనసు యెవరిసొమ్ము మహిని జనులు
ఘనులమనుచు దిరిగి ఘననీచులయ్యేరు
అంజదాసపోష అఘవినాశ!

17. తల్లికన్నవేరె దైవమెక్కడజూడ
కల్లుకన్న నీచ కైపులేదు
యిల్లుకన్న లేదు యిలక్షేత్రముల త్రోవ
అంజదాసపోష అఘవినాశ!

18. ఆలికన్న వేరె ఆత్మబంధువులేదు
కాలికన్నలేదు గట్టిబంటు
పాలుకన్నవేరె ఫలమెందుగలదయా
అంజదాసపోష అఘవినాశ!

19. జాతినెంచువాడు నీతినెన్ననివాడు
జాతినీతిలేని కోతివాడు
నాతినెంచువాడు నరజన్మమెట్లౌను
అంజదాసపోష అఘవినాశ!

20. కామక్రోధమందు కనకంబునందును
తామసంబు స్త్రీల దలచుటందు
నీమ మెల్లవిడువ నిందలపాలౌను
అంజదాసపోష అఘవినాశ!

21. మోహబాధజిక్కి మునుగుచుండేవారు
దేహసుఖములెట్లు దెలియగలరు
సాహసంబువిడక సరసులెట్లౌదురు
అంజదాసపోష అఘవినాశ!

22. దేశభక్తికొఱకు దేహమర్పించెడి
భూసురోత్తములను బొగడదగునొ?
మాంసకండలమ్ము మాలిన్యకాంతల
పొగడదగునొ? మీరెపోల్చరయ్య
అంజదాసపోష అఘవినాశ!

23. అన్నదమ్ములైన ఆలిబిడ్డలెయైన
కన్నతల్లియైన గాంచబోరు
ధనములేనివేళ దైవమేదిక్కగు
అంజదాసపోష అఘవినాశ!

24. అట్టివారునేడు యగుపడరెందైన
యెట్టిజన్మమరయ యెంచలేము
తిట్టికొట్టుకొనుచు తిప్పలు బడెదరు
అంజదాసపోష అఘవినాశ!

25. మనుజపుట్టు వందు మహిమీదజన్మించి
వచ్చివరములిచ్చి వసుధనేలె
తెచ్చిరామనామ తేజంబువిరజల్లె
అంజదాసపోష అఘవినాశ!

26. పుట్టగానె మిగుల భూతదయతో దిర్గి
పట్టి విల్లువిరచి ఫలముగాంచె
యట్టుపురుషశ్రేష్టు దాపదదొలగించు
అంజదాసపోష అఘవినాశ!

27. పాపుడయినగాని భక్తుడయిననుగాని
లోభుడైనగాని రోగిగాని
దాపుజేరిమ్రొక్క దరిజేర్చు రాముండు
అంజదాసపోష అఘవినాశ!

28. సభను ద్రుపదపుత్రి శరణార్తయైవేడ
అభయమిచ్చివేగ యతివబ్రోచె
సఫలపరచె కోర్కె చక్కని హల్యకు
అంజదాసపోష అఘవినాశ!

29. దాశరధిని సతము దలచెడి జనులకు
దోషరహితమైన త్రోవదొరకు
ఆశవిడువకున్న అతిపాపులయ్యేరు
అంజదాసపోష అఘవినాశ!

30. అన్నదమ్ములయెడ నత్తమామలపోరు
కన్నతల్లిపోరు కాంతపోరు
యున్నవారియిల్లు యెన్నగ తరమౌనె
అంజదాసపోష అఘవినాశ!

31. దానమందుగొప్ప దైవమందును గొప్ప
మానమందుగొప్ప మాటగొప్ప
మనుజుడయినవాడు గనుగొన్న ఘనుడౌను
అంజదాసపోష అఘవినాశ!

32. నీటియందు మంచి పాటయందును మంచి
బోటియందు నుంచి పొందుమంచి
వాటినెరుగువారి సాటెవ్వరిలలోన
అంజదాసపోష అఘవినాశ!

33. కూటమందు మంచినాత్యమందును మంచి
దీటునందుమంచి తేట మంచి
వాటినెరుగువారు కోటికొక్కరులేరు
అంజదాసపోష అఘవినాశ!

34. భూషణంబుగొప్ప భాషణంబులగొప్ప
వేషమందుగొప్ప వేటగొప్ప
శేషశాయి కైన చెప్పంగతరమౌనె
అంజదాసపోష అఘవినాశ!

35. రోషమందుగొప్ప రోగమందునుగొప్ప
మాటకటువుగొప్ప నీటుగొప్ప
ఆశయందుగొప్ప యడుగంటజేయరా
అంజదాసపోష అఘవినాశ!

36. ధర్మమందు మంచి మర్మమందును మంచి
నిర్మలంబు మంచి నేర్పుమంచి
కర్మవిడువకున్న గనుగొన తరమౌనె
అంజదాసపోష అఘవినాశ!

37. మహిషమందు గొప్ప మార్జాలములగొప్ప
వాహనంబుగొప్ప వరునిగొప్ప
దేహభ్రాంతిలేక దీనికర్థముగనుము
అంజదాసపోష అఘవినాశ!

38. వారకాంతగొప్ప వైరి వీరులగొప్ప
నారచీరగొప్ప నరునిగొప్ప
సారవంతులైన సరసుల కెఱుకౌను
అంజదాసపోష అఘవినాశ!

39. మచ్చరంబు మంచి నిచ్చలయందును మంచి
పచ్చయందు మంచి ఫలము మంచి
సచ్చరిత్రుడైన్ సారంబు గుర్తించు
అంజదాసపోష అఘవినాశ!

40. సత్యమందు గొప్ప శౌచమందును గొప్ప
ముత్యమందుగొప్ప ముక్తి గొప్ప
నిత్యమనుచు దెలియ నిర్వాణపధమబ్బు
అంజదాసపోష అఘవినాశ!

41. ధైర్యమందు గొప్ప శౌర్యమందును గొప్ప
కార్యమందు గొప్ప ఘనత గొప్ప
ఆర్యులందు గొప్ప అలవియే వర్ణింప
అంజదాసపోష అఘవినాశ!

42. మనుజ జన్మగొప్ప మంచికార్యముగొప్ప
తనువుత్రాణగొప్ప దాతగొప్ప
యనుచు తెలియురీతి నాత్మకు ఘనమౌను
అంజదాసపోష అఘవినాశ!

43. ఆడవారిమంచి అందలంబులమంచి
కోడెత్రాచుమంచి కోతిమంచి
గూఢచారిమంచి గుర్తింపతరమౌనె
అంజదాసపోష అఘవినాశ!

44. భోగవంతులైన త్యాగవంతులెయైన
రోగరహితులైన లోకమందు
యోగభక్తిలేక యుండదుమోక్షంబు
అంజదాసపోష అఘవినాశ!

45. సారమెల్లతెలిసి సత్యశీలముగల్గి
వేదమూర్తివగుచు వెలసియుండి
సూర్యవంశమందు శుభజన్మమందితో
అంజదాసపోష అఘవినాశ!

46. దానమింతలేక దైవభక్తియులేక
పాపభీతిలేక భయములేక
యున్నవానిబ్రతుకు నెన్నగతరమౌనె
అంజదాసపోష అఘవినాశ!

47. కాసుకాశబెంచి కామ్యకర్మముద్రుంచి
నీటుకాండ్రపొంచి నీతిమించి
దోషములను పెంచి త్రోవగానదు వేశ్య
అంజదాసపోష అఘవినాశ!

48. ఇట్టిమరుగుచేత నిలమీద బుట్టించి
కట్టివేసి మమ్ము కర్మచేత
బట్టిలాగుటేల పరమార్థమివ్వక
అంజదాసపోష అఘవినాశ!

49. కర్మజన్మమిచ్చి కష్టంలోనుంచ
ధర్మమౌన నీకు దనుజహరణ
సారవంతమైన సత్కృపజూపవే
అంజదాసపోష అఘవినాశ!

50. నిన్ను మమ్మియుంటి నిజభక్తితోనుంటి
నన్నుజూడమంటి నారసింహ
పన్నగేంద్ర తల్ప బాధలు దీర్పరా
అంజదాసపోష అఘవినాశ!

51. బాధపెట్టకయ్య భక్తుడ నీకయ్య
వాదమాడకయ్య వందనములు
బంధనంబు బాపి పాలించవేమిరా
అంజదాసపోష అఘవినాశ!

52. తిప్పలేలనాకు తీర్చవా భువిలోన
గొప్పవాడవనుచు గోరియుంటి
తప్పులున్న గాచి దయయుంచు నాయెడ
అంజదాసపోష అఘవినాశ!

53. పంతగించి నీవి పలుకరించగబోకు
చింతనొందియుంటి శ్రీనివాస!
ఇంతకక్షయేల యిటులొచ్చిబ్రోవుమా
అంజదాసపోష అఘవినాశ!

54. నేనుజేయుపనులు నెరవేర్పవెందుకో
పన్నగేంద్ర తల్ప పలవతనమ
నిన్నునమ్మియుంటె నిరసించ సరసమా
అంజదాసపోష అఘవినాశ!

55. ఎన్నిరోజులిట్లు యిడుములబెట్టుట
కన్నతండ్రి నీకు కరుణరాద!
చిన్నవానిపైని జెల్లునే పంతంబు
అంజదాసపోష అఘవినాశ!

56. ఆశ్రయించి నిన్ను అడుగుచుంటేనేను
శాస్త్రవాదమేల జయకృపాల
ఆస్త్రశాస్త్రవిద్య లటుజేయుచుంటివా
అంజదాసపోష అఘవినాశ!

57. తంత్రగానివోలె దానిదీనినిజేర్చి
ఇంద్రజాలమెల్ల యిలనుజూపి
మంత్రమహిమచేత మముగట్టివేయకు
అంజదాసపోష అఘవినాశ!

58. గారడిపనివల్ల కట్టివైచియుమమ్ము
కోరుదానిజూపి కోర్కెదీర్చి
చూరబెట్టునీదు సూక్షంబుదెలుపవు
అంజదాసపోష అఘవినాశ!

59. దొంగవానిబోలి త్రోవదప్పెదవేల
భంగమొచ్చునీకు బాపనయ్య
దిక్కునీవెనాకు దీర్చుమీబాధలు
అంజదాసపోష అఘవినాశ!

60. సందుగొందులందు సావిళ్ళుసత్రాలు
తిరిగితిరిగి తుదకు దిక్కులేక
బొందినుండి పోవబోవునా నీదిక్కు
అంజదాసపోష అఘవినాశ!

61. చక్కదనముజూచి చాలభ్రమలొజిక్కి
నిక్కుచుండునట్టి నీటుగాండ్ర
దిక్కుజూచి నీవు దిరుగుచుంటివయేమి
అంజదాసపోష అఘవినాశ!

62. మాయనీదిగాక మరియెవ్వరిదిలేదు
సేయుచుంటివిట్లు చిత్రములను
కాయమందుయుండి గారడిజేసేవు
అంజదాసపోష అఘవినాశ!

63. ఆశలోనుజిక్కి యానందమొందుచు
వేష్మేసియున్న వెఱ్ఱిజనులు
మోసమొచ్చువఱకు మూలంబుదెలియరు
అంజదాసపోష అఘవినాశ!

64. ఎంతొచిత్రమైన వేషంబుధరియించి
భూతలంబునందు భుక్తికొఱకు
పాతకంబులెన్నొ బహుజేయుచుండేరు
అంజదాసపోష అఘవినాశ!

65. తోలు తిత్తిలోని దొడ్డవానెరుగక
కాలమెల్ల రిత్త గడపుచుండ్రు
నీళ్ళులేనిచేప నిర్మూలమౌగద
అంజదాసపోష అఘవినాశ!

66. భక్తిలేనిభార్య బాధపెట్టునుగాని
శక్తికొలది సేవ జేయగలదె
వ్యక్తిలేనిదాని వదలివేయుటమేలు
అంజదాసపోష అఘవినాశ!

67. ఎంతొవేడుచున్న యేమిచెప్పవదేల
పంతమేలనయ్య భక్తవరద
నిందపాలుజేయ నీకు జెల్లునటయ్య
అంజదాసపోష అఘవినాశ!

68. పుట్టినట్టిచోటు బొత్తిగాదెలియక
అట్టులిట్టిదిరిగి అదరిపడుచు
గుట్టుగానలేక కూతలుగూసేరు
అంజదాసపోష అఘవినాశ!

69. స్త్రీలకన్నవేరె చిత్తచోరులులేరు
ఎల్లలోకమందు యింద్రజాల
మెల సల్పుచుండి మెలగుచునుండురా
అంజదాసపోష అఘవినాశ!

70. తప్పుజేయునాడు ధైర్యమెక్కువయుండు
అప్పుడప్పుడుండు అతిశయంబు
తప్పుదెలియునాడు తిప్పలువిశదమౌ
అంజదాసపోష అఘవినాశ!

71. భార్యరంకుజేసి భర్తనికోపించి
కార్యమెల్ల నదియె గడుపుకొనుచు
ధైర్యమెంతొజేయు దానికిజెల్లుగా
అంజదాసపోష అఘవినాశ!

72. భోగస్త్రీలు మున్ను పుట్టినప్పటినుండి
బొంకుమాటలెన్నొ ప్రోగుజేసి
రంకులాటయందు రంజిల్లుచుందురు
అంజదాసపోష అఘవినాశ!

73. మచ్చరంబుచేత మహిమగాంచగలేరు
యుచ్చగుంట దీని యునికిజూడ
పచ్చిమాంసపుతిత్తి పరికించిజూడగా
అంజదాసపోష అఘవినాశ!

74. అంటియంటకుండ ఆకాశముండెను
రెంటిమధ్యజూడు రేయిపవలు
యట్టిదానిజూచి యానందమందరా
అంజదాసపోష అఘవినాశ!

75. రెంటిమధ్యగాను రేచించిజూచితె
ఒంటిస్తంభమేడ యొకటియుండు
అట్టిదానిలోను హాయిగాపవళించు
అంజదాసపోష అఘవినాశ!

76. కంటిలోను మంచి గారడివాడుండి
ఆటలాడుచుండె నందముగను
అట్టివానిబట్టికట్టివేసియుజూడు
అంజదాసపోష అఘవినాశ!

77. పాపభీతిలేక పదరుచుండెడివారి
దాపుజేర్చకయ్య తండ్రినన్ను
చూపుజూచినీదు సూక్ష్మంబుదెలుపుము
అంజదాసపోష అఘవినాశ!

78. ఏరుపారుచుండు నేవేళజూచిన
ఆరుచేపలందు యాడుచుండు
నీరుత్రాగవచ్చి నిలచి మింగెనుకొంగ
అంజదాసపోష అఘవినాశ!

79. మూటిలోనిచాయ ముప్పతిప్పలుగాను
యేటివెంటబడియు యేగుచుండు
అట్టినీటిలోన అపరంజిస్నానంబు
అంజదాసపోష అఘవినాశ!

80. చంటిబిడ్డనెత్తి జంకులేకను స్త్రీలు
యెట్టిబానలైన యిలనుజేసి
అట్టివానిచేత ఆపదలనుబొందు
అంజదాసపోష అఘవినాశ!

81. మూటిమధ్యమంచి ముక్తికాంతయునుండి
పాడుచుండునెపుడు భక్తితొను
పాటుపడియుదీని భావంబు దెలియుము
అంజదాసపోష అఘవినాశ!

82. కుక్కలారుగూడి కూయుచుపరువెత్తి
పక్కనున్నవాని పైనబడియు
జంకులేకతిరిగి చావుకుసిద్ధమౌ
అంజదాసపోష అఘవినాశ!

83. బూటకంబుతోను పురములోపలజొచ్చి
ఆటలాడుచుండె నాదిశక్తి
కోటలోనుజేరి కొంపదిప్పలుదెచ్చె
అంజదాసపోష అఘవినాశ!

84. గానిమాయజూడ ధత్రిలోపలనేమొ
యెన్నిమాటలైన నెన్నజేసి
పన్నిబొంకుచుండు పరికింపతరమౌన
అంజదాసపోష అఘవినాశ!

85. మూటిదాటి అందు మూలంబుదెలుసుక
బాటగన్నవాడు పరమయోగి
సాటియెవరయ్య సారమెరిగినయంత
అంజదాసపోష అఘవినాశ!

86. ఆడువారిబుద్ధి అంగడిబోలు తా
గూడబెట్టుచెడ్డ గుణములెన్నొ
చెండివేయకున్న చెప్పినట్లినదిరా
అంజదాసపోష అఘవినాశ!

87. భారమంతనీవు బాపెదవనియెంచి
కోరివేడుచుంటి కోర్కెతోడ
భారమేమిలేక భక్తులరక్షించు
అంజదాసపోష అఘవినాశ!

88. లోకనిందలేక లోపమురానీక
సాకుమయ్యతండ్రి సౌఖ్యముగను
థిక్కరించువారి తిప్పలుబెట్టవా
అంజదాసపోష అఘవినాశ!

89. కండనమ్ముచుండు కాసులకాసించి
చెడ్డవారితోను జేరివేశ్య
దండనేమిలేదు దానికిభువిలోన
అంజదాసపోష అఘవినాశ!

90. కుంటియైనగాని గ్రుడ్డియైననుగాని
రోగియైనగాని రోతలేక
నింటజేర్చివాని నెంతో ప్రేమింతురు
అంజదాసపోష అఘవినాశ!

91. డబ్బులేకయున్న డంబంబుగాయుంటె
నిబ్బరంబుగాను నింటజేర్చు
సబ్బుబిళ్ళరుద్ది సరసునిదరిజేరు
అంజదాసపోష అఘవినాశ!

92. పెండ్లిలేనిస్త్రీలు పేరంటమునకెట్లు
నిండలోనుయుంచ నెటులజెల్లు
కండ్లుదెఱచిచూడ గనపడులోపంబు
అంజదాసపోష అఘవినాశ!

93. తాళిలేకస్త్రీల దైవమెట్లు విధించె
తల్లుదండ్రిలేని తనయులట్లు
కల్లయయ్యె వార కాంతల జన్మంబు
అంజదాసపోష అఘవినాశ!

94. ఆంధ్రదేశమందు నన్నిజాతులలోను
యింద్రజాలమయ్యె యిట్టికులము
ఆంధ్రులెల్ల వీరి నాదరించుటతగదు
అంజదాసపోష అఘవినాశ!

95. నేను నేనటంచు నీల్గితిరిగె వారు
"నేను" యనెడిదాని నెన్నవలయు
దానిగన్నవాడు ధన్యుడౌ యిలలోన
అంజదాసపోష అఘవినాశ!

96. మాయలోనెబుట్టి మాయలోనె బెరిగి
మాయలోనెజచ్చు మనుజులంత
మాయమర్మమేదొ మహిలోన యెరుగరు
అంజదాసపోష అఘవినాశ!

97. భర్తపూజలేక బరగెడు స్త్రీలెల్ల
వ్యర్థులయ్యువారు యమునిజేరు
మున్ను పతివ్రతంబు ముక్తి నొసంగదే
అంజదాసపోష అఘవినాశ!

98. ఒంటిలోని హముయున్నంతవఱకును
జంటనంటిదిరుగు సరసులెల్ల
ఒంటిపొంగముడుగ యొక్కరురాబోరు
అంజదాసపోష అఘవినాశ!

99. ఆత్మశుద్ధిలేక యాచారవంతులై
కూయుచుంద్రు చెడ్డకూతలెన్నొ
భక్తిలైనవారి భావంబు దెలియక
అంజదాసపోష అఘవినాశ!

100. కంటిలోన పెద్దగారడివాడుండె
ఇంటిలోనయుండె వేటగాడు
జంటలేకవాడు జరుపుచుండును వింత
అంజదాసపోష అఘవినాశ!

101. అమరచరితులైన యార్యులెల్లరునన్ను
అంజదాసటంచు యనుచునుండ్రు
ఆదిపూడిగ్రామమందున పుట్టుక
అంజదాసపోష అఘవినాశ!

102. హీనజాతి శబరి యెంగిలి పండ్లివ్వ
జ్ఞానమార్గమిచ్చి గావలేదె?
దీను డిచ్చుభక్తి దివ్యమాలికగొమ్ము
అంజదాసపోష అఘవినాశ!

శ్రీరామపాదుకల్ శిరమునదాల్చియు
మోయుచుంటిని నేను ముక్తికొఱకు
భక్తిమీరగ నీకు భవనంబు గట్టించి
అర్పింతు మన్నను ఆస్తిలేదు
పొట్టబువ్వకునేను భూములెల్లఁదిరిగి
పడరాని కష్టముల్ పడుచునుంటి
నిర్మలంబుగనేను నీదుసేవనుజేయ
ఘర్మదేహము జబ్బుగలిగియుండె
అఘవినాశ శతకమనెడు పుష్పంబులు
అర్పించుచుంటిని అయ్యనీకు
అట్టినీ భక్తపరుడనై యనుదినంబు
సేవచేయుచునుంటిని చింతదీర్ప
కామితార్ధములిచ్చియు కన్నతండ్రి
...... బ్రోవుము అఘవినాశ!

సమాప్తం

No comments:

Post a Comment