Thursday, March 13, 2014

ఇందిరా శతకము - గోవర్ధనం శ్రీరంగాచార్యులు

ఇందిరా శతకము
గోవర్ధనం శ్రీరంగాచార్యులు

1. ఉ. శ్రీసరసీజపాణి! భ్రమఋఈనిభవేణి! సుఖప్రదాయనీ!
దాసజనప్రసన్నముఖి! ధర్మవివర్ధిని! మంజుభాషిణీ!
భాసురదివ్యభూషణి! కృపాపరిపూర్ణ విశాలలోచనీ!
దోసము లెంచకమ్మ నిను దోసిలినొగ్గి నుతింతు నిందిరా

2. ఉ. కోరిక దీర్చుమంటి నినుగూర్మి భజించెద నంటి నింక నె
వ్వారిని వేడనంటి శ్రితవర్గము బ్రోచెదవంచు వింటి స
త్కారముగాగ నేను శతకం బొనగూర్పగ బూనియుంటి నా
భారము నీదె సుమ్మి పరిపాలనసేయుమి తల్లి యిందిరా

3. చ. శతకము లెన్నియో గలవు జాలవె యయ్యవి యేటి కీతడీ
శతకము వ్రాయబూనెనని సందియ మందకుమమ్మ లక్ష్మి యా
శ్రితులకు త్వద్గుణామృతరుచిన్ గన నీశతకంబె కాదుగా
శతశతకంబు లైన నిక జాలనుపించునె తల్లి యిందిరా

4. చ. మదిని చలత్వమో, మఱుపొ, మౌఢ్యమొ, భీతియొ, విస్మయంబొకో
ముదమున బల్కరా వెదను బుట్టుతలంపులు వ్యోమవాహినీ
సదకలుషప్రవాహసమచంచదనర్గళవాక్యవైఖరిన్
సదయుత నా కొసంగి నను సాకగదే ప్రియమార నిందిరా

5. చ. మెడగలపుష్పహారములు మేలగుకంకణముల్ కరంబులన్
దడబడ నాడు పాల్కడలి ద్రచ్చునెడన్ జగదీశుమేనికిన్
బడలిక బాప జల్లనగు వాల్గనుసన్నలు మందహాసముల్
బొడమ సుధాతరంగముల బుట్టితి వీవెగదమ్మ యిందిరా

6. చ. సకలచరాచరప్రకర సంతత జీవనహేతుభూత వై
అకలుష నిర్వికల్ప మహిమాంచితవై శ్రితపారిజాతవై
ప్రకృతి సుజాతవై పరమపావనతన్ భువనైకమాతవై
ప్రకటయశంబు నొంది కడుభాసిలు నిన్ను దలంతు నిందిరా

7. చ. అకలుషవందనార్హమగు నంఘ్రిసరోరుహ మొండు చాపి వే
రొకపదపద్మమున్ముడిచి యొప్పుగ హస్తసరోజ మానుచున్
వికచసరోజపీఠమున వేడ్క వసించెడు నీదుసత్కృపా
ప్రకట దపాంగదివ్యముఖపంకజ దర్శన మిమ్ము యిందిరా

8. చ. అవనియు, సప్తమాతృకలు నష్టవిభూతులు, పద్మముఖ్యులౌ
నవనిధు లుజ్జ్వలాకృతులు నమ్రత నంజలులన్ ఘటింప మౌ
నివరులు లక్ష్మీసూక్తముల నిశ్చలభక్తి పఠింప నచ్చరల్
అవహితలై నటింప భువనావనవై కొలువుందు విందిరా

9. చ. సురటిని భారతీరమణి సొంపుగ బూన నిలింపకామినుల్
వరుసలు తీర్చి ముంగల నవస్వరచాతురి మీర గానమా
ధురి గురియింప సేవకనతు ల్గొనుచున్ గొలువున్న నిన్ను సు
స్థిరులు విధీశ్వరామరులు చేరి భజింతురు గాదె? యిందిరా

10. చ. జయనినదంబుల న్సురలు సల్పుచుముంగలనిల్వ సంయముల్
ప్రియముగ సామగానముల వీనులవిం దొనరింప నీదు హృ
ద్దయ కడగన్నులన్ వెలయ దాసుల దైన్యము బోవద్రోసిని
శ్చయవిభవాదికంబుల నొసంగెద వీవెగదమ్మ యిందిరా

11. ఉ. అంబుజపాణి వీవు హరి యంబుజనాభుడు శ్రీదవీ వతం
డంబరొ! శ్రీదరుం డిల భవాశ్రయ వీవు భవాశ్రయుం డతం
డంబుధికన్య వీ వతడు నంబుధిశాయి మిము న్నుతింప శ
క్యంబె? పురాణదంపతులు గారె జగంబుల కెల్ల నిందిరా

12. చ. సురుచిరనీలనీరదసిశోభితమైన మెఱుంగుభంగి శ్రీ
హరియురమందు రంజిల్లుచున్ నాశ్రితులన్ గరుణావిలోకనా
కురముల బ్రోచుపాల్కడలికూతుర! నందకపాణిరాణి! యో
సిరి! కృప మద్గ్రుహంబున వసింపు మనారత మంబ యిందిరా

13. చ. నిను తనుజాతగా గనుట నీరధి రత్నఖనిత్వ మందదే
నిను సతిగా వరించి హరి నేర్పు వహించడె శ్రీనివాసుడై
నిను సహజాత నొంది దివి నిల్వదె కల్పక మర్ధదాయియై
నిను భజియించువారల కనిష్టము లున్నవె? దేవి! యిందిరా

14. చ. స్థిరచరరూపమౌ జగము శ్రీపతి! నీకు విలాసభూమి యా
పరమపదంబు నీ కునికిపట్టు, మురారి నిజేశ్వరుండు నౌ
నరయగ నాయనంతగరుడాదులు కింకరు లింక మేము న
స్థిరులము త్వత్కృపార్హల మశేషము నీపరివార మిందిరా

15. చ. అరయగబంచభూతము లహంకృతి బుద్ధి హృదింద్రియాదులా
వరణచయంబు భూర్భువదివంబుల నొప్పు నజాండకోటులన్
పరుడు భవన్మనోహరు డపారరతిన్ చిదచిద్విశిష్టుడై
గురుమతి నీవిహారమునకున్ సృజియించె నిజేఛ నిందిరా

16. చ. తనరగ నామరూపరహితంబును విశ్వమయంబునైన ని
రుగుణపరమాత్మ యాశ్రితుల గోర్కెల దీర్పదలంచి చిత్స్వరూ
పిణి! భవదాశ్రయంబున భువిన్సగుణుండయి నామరూపముల్
గని యనిశం బుపాస్యు డగుగాదె జగంబుల కెల్ల నిందిరా

17. చ. కరణకళేబరాదులు జగత్పతిసేవకు గల్పితంబు లం
చరయక భోగశీలురగు నాత్మల నీపతి నైజమాయచే
బురుషుడు వేశ్యవేసమును బూని విటాళిని మోసగించు న
ట్లెరిగియు మోసపుచ్చు భవదీయపరీహసనార్ధ మిందిరా

18. ఉ. వారధిన్ మధించె మును వారిధి బ్రేమను బవ్వళించె దో
ర్వీరగభీరతన్ హరుని నిల్వరచెన్ దగవార్ధి గట్టి దు
ర్వారపరాక్రమక్రమును రావణు ద్రుంచె నహో మురారి నిన్
గోరికదా మఱేది యొనగూర్పడు నీకొఱ కంబ యిందితా

19. చ. జననిరొ నీకు నీశ్వరుడు సర్వజగత్క్రియ లొప్పగించి దా
ననిశము సాక్షిమాత్రుడగునందు రపారము నీదుశక్తి యే
మనియెద నేస్వరూపములనైన ధరించెద వెట్టికార్యమై
నను నొనరింతు వెందు నిను నమ్మిన గోర్కె ఫలింప దిందిరా

20. ఉ. జ్ఞానము, తేజము న్బలము, శక్తియు బ్రేమజయంబు నాశ్రితా
ధీనతయున్, పరోపకృతి, ధీరతయున్, జగదీశ్వరత్వమున్
మానిత కాంతి శాంతియును మార్దవ మాదిగుణంబులెల్ల నో
మానిని! నీకు శౌరికి సమానములై తనరారు నిందిరా

21. ఉ. సుందరయౌవనాదిగుణశోభ సమాన మదిర్వురందు స్వ
చ్ఛందవిరోధిశిక్షణయశస్ధిరతాదికపౌరుషంబు గో
విందుకడన్ సతీహితవివేకమృదుత్వకృపాక్షమౌళి నీ
యం దగుటన్ సతీపురుషాహ్వయభేదము గల్గె నిందిరా

22. చ. ఇల గాల్శన్ గులాలకుడు మృత్తికలేక యొనర్పలేని య
ట్లలరి భవత్సహాయమును నందక నీవిభు డీప్రపంచకం
బెలమి సృజించునే? ప్రకృతి వీ వతడే పురుషుండు దుగ్ధమం
దలిధవళత్వముంబలె సదా వెలుగొందరె మీర లిందిరా

23. ఉ. కోరగ రాజదర్శనము కూర్మి నమాత్యముఖానగాని చే
కూరనిరీతిన్ నిన్ బ్రకృతి గొల్చి భవత్కృప నొందకున్న నో
క్షీరపయోధికన్య! తలక్రిందుగ నెంత తపంబు సల్పినన్
గోరిక దీర్ప నీశ్వరుడు గోచరుడౌనె జగాన నిందిరా

24. ఉ. స్వాంతమునం ద్రయీమయి బ్రశాంతబరాత్పరి నిన్నాదిమ
ధ్యాంతను సత్ప్రపంచకనియామక నీశ్వరి మూలశక్తి నిన్
శాంతముతోడ నిన్నరయ శాక్తి యొకింతయులేక ప్రాకృతుల్
భ్రాంతి దలంత్రు పాల్కడలిపట్టిరొ! చంచల వంచు నిందిరా

25. ఉ. ఈవె జగంబులెల్ల సృజియింపగ బెంప సత్ప్రభా
వావహవై చిదాకృతివియై నిజవల్లభునిన్ సుసౌఖ్యలీ
లావహితాత్ము జేయుదు వటంచనునైగమసూక్తివింటి నన్
గావగజాల నొక్కో త్రిజగన్నుత దివ్యచరిత్ర యిందిరా

26. చ. బహువిధకార్యభారుడు భవత్పతి సత్వరబుద్ధితో నను
గ్రహమును జూపడన్ దలపుగల్గి నుతింపుచునుంటి నిన్ను బ్ర
త్యహమును బ్రోవుమమ్మ నను దద్దయబ్రీతిని దండ్రికంటె ని
మ్మహి జనయిత్రి వేమరు కుమరులనారయదొక్కొ యిందిరా

27. చ. వినతి భవత్కృపామృతము వేడెడునన్ను సమాదరంబుచే
గనక నిరాకరించినను కంజజ! నీపదభక్తి మాన నే
జనని, క్షుదార్తి జన్గుడువసాగెడుబిడ్డను ద్రోసివేసినన్
బనివడి బ్రాకులాడుచును బాయడు మాతృపదంబు నిందిరా

28. చ. అసదృశమైనభక్తియని సాయనుపానముతో భవత్కృపా
రసమహదౌషధం బిడి తిరంబుగ మాన్పవె మన్మనోరుజా
వ్యసనములన్ భిషగ్మణి నిజౌషధమిచ్చి రుజన్ గుదుర్చు న
ట్లెసగు ద్వదాశ్రయంబు గన నెట్టిభయంబును గల్గ దిందిరా

29. చ. మగనియురంబునందువనమాల భవన్మృదుళాంఘ్రియుగ్మము
న్దగిలి నవత్వమందును సదా హిమసేచన మందినట్టు లా
నిగమనివేదితంబులగు నీదుపదాబ్జముల న్మనస్తహ్లిం
దగ నెలకొల్పి వందనశతంబు లొనర్చెద భక్తి నిందిరా

30. ఉ. అంగజుగన్నయమ్మ ముగురమ్మలలో తొలియమ్మ కాంతికిన్
బంగారుబొమ్మ భక్తులకు భాగ్యవిషేష మొసంగుకొమ్మ యా
రంగని ముద్దుగుమ్మ యనురాగము జూపగదమ్మ శ్రీజగ
న్మంగళమూర్తి వమ్మ యనుమాన మొనర్పకబ్రోవు మిందిరా

31. చ. అమృతము లొల్కునీదుచరణాంబురుహద్వయి నాశ్రయించివి
భ్రమత మదీయచిత్త మితరంబును జేరగ నిచ్చగించునే
ప్రమద మొసంగుచుండు మకరందభరంబగు పదముండగన్
భ్రమరము గొబ్బిపూకడకు బారునె తా కలనైన నిందిరా

32. ఉ. మాయువతుల్ తనూభవులు మాజననిజనకాది బాంధవుల్
మాయిలువాకిళుల్మడులు మాన్యము మాధనధాన్యసంపద
ల్మాయురె మోహమందిమది మాయవియందు మవెల్లమావియే
మాయన నీవె కావె మఱి మాయుత మీజగమెల్ల నిందిరా

33. చ. సరసిజనేత్రి నీ వెపుడు చంచలవంచును సారెసారెకున్
దురితమనస్కు లెన్నుటను దుర్యశ మొక్కటి సంఘటించె ద
త్పరిహరణార్ధమై స్ధురత దాసునియింట వసించుచుండినన్
బరగ నుతించి చాటెదను బాపుచు నయ్యపకీర్తి నిందిరా

34. ఉ. ఎందున నీకటాక్షము లొకించుక బైబడకుండు నాక్షణం
బందు న దెల్లదుఃఖమయమౌ సిరులన్ దులదూగు మాహరి
శ్చంద్రురు డానలుండు నృపచంద్రుడు ధర్మజు డాదిగాగ ము
న్నెందరొ దీనవృత్తి జరియింపరె నీకృపలేక యిందిరా

35. ఉ. ఆతతబ్రీతి నీ వెవని కాశ్రయమై వసియింతు వెప్పుడున్
అతడె పండితుండు నరు డాతడె సత్కులజాతు డాతడే
యాతడె జూడగ న్వినగ నాతడె వక్త రసజ్ఞు డాతడే
మాత! భవద్విశేషమహిమం బది గాదె సమస్త మిందిరా

36. చ. కరుణ దలిర్ప నేపురుషు గాంచి చరించెద వీ వతం డహో
పురుషవరేణ్యుడై భువనపూజ్యత గాంచు విశేషసంపదన్
ఉరమున నీవు ప్రేమభర మూని వసించుటచేత గాదె యా
హరికి బరాత్పరుం డనెడి యుంచిత వైభవమబ్బె నిందిరా

37. ఉ. ఆపద కేది యడ్డపడు హస్తగతామలకంబురీతిగా
జూపు సమస్త మెయ్యది యశోవిభవాదిశుభాళి కెద్దియౌ
గాపుర మెద్ది గాంచిననె గల్గగజేయు భ్రమ న్విరాగికిన్
బ్రాపుగ నద్ది నీదగుకృపాత్మక మైనధనంబె యిందిరా

38. ఉ. ఏనుగు నెక్కియుండు నతడెంత మొఱుంగుచు గుక్క లడ్డినన్
దా నెటు లేగునో యటుల ధారుణి నీపదకంజయుగ్మమున్
మానుగ నాశ్రయించి మను మానవు డాపద లెట్టివననున్
వాని నలక్ష్యతం గనడె వారిజనాభునిదేవి యిందిరా

39. చ. పరులను గెల్వజాలు నిజబాహుపాక్రమ మెంత యుండినన్
సరసవచోవిశాలగతి జాలగ విద్దెల నెన్ని నేర్చినన్
అరయ సుశీలధైర్యవినయాదిగుణావళు లెన్ని యున్న నీ
కరుణ యొకింత వానిపయి గల్గనిచో ఫల మేది? యిందిరా

40. చ. సుతు డనుకూలతం గనడు సోదరు డించుక బల్కరింప డా
శ్రితులును జెంత రారు నిజసేవకు డొందు జికాకు నాదృతిన్
సతియును గారవించదిల సంతస మొందరు తల్లితండ్రులున్
హితు డొసగండు దర్శనమునేని భవత్కృపలేక యిందిరా

41. ఉ. సుందరు లెందరుండినను సోదరబంధుతనూజసత్సుహృ
ద్బృందమదెంతయున్న వరవేషసుభాషలవెన్ని యున్న మే
నందము చందము న్గలిగి యంగదృఢత్వ మదెంతయున్న దా
బొందకయున్న నీకృపను భోగము లబ్బునె వాని కిందిరా

42. ఉ. ఎవ్వని నాశ్రయింతు రిల నీప్రలెల్ల సధా విధేయులై
ఎవ్వడు పూజ్యుడై గరిమనెంతయుగాంచు సభాంతరంబులం
దెవ్వనియాత్మకు న్వెత లొక్కింతయు గల్గ వహీనసంపదన్
ఎవ్వడు కీర్తి గాంచు నత డెప్పుడు నీకృపవాడు యిందిరా

43. ఉ. నేరము లెన్ని జేసినను నీకృప యెంతయు గల్గియున్నచో
నేరుపులై ముదం బొసగు నీకృప యించుక కల్గకున్నచో
నేరుపుతోడ దా నెటుల నెమ్మి జరించినగాని ధారుణిన్
నేరములౌచు నాపదల నిక్కముగా నొనగూర్చు నిందిరా

44. ఉ. ఈక్షితి నీకటాక్షలవ మించుక గల్గినరాజలోకగ
ర్వేక్షణనూత్నవైఖరి గణింపగబో మనమాదృశాళి ప్ర
త్యక్షత నీకటాక్షవిభవాళి నెఱుంగ వశంబె యాసహ
స్రాక్షవిధీశ్వరుల్ భవదపాంగకృతార్థులు గారె? యిందిరా

45. ఉ. మంగళదేవతాభిదము మానుగ గ్ల్గెను తొల్లి నీకు నే
సంగతిలేక, తావి గని సన్నుతి కెక్కెడు బూవుకైవడిన్
మంగళశబ్దవాచ్యుడని మానితుడయ్యె భవత్ప్యుండు నీ
సంగతి బొంది కాదె నిను సంస్తుతి జేయవశంబె? యిందిరా

46. ఉ. అమ్మ గణింపకమ్మ మదియందపరాధము లాశ్రితుండ, నే,
నమ్మ మఱెవ్వరమ్మ నిను నమ్మిన పేదరికమ్ము జేర రా
దమ్మ నిజమ్ము చూడ జగమంతయు నీవె గదమ్మ లక్ష్మి! శ్రీం
క్లీ మ్మహనీయమంత్రవశగీ! కృప దర్శన మిమ్ము యిందిరా

47. ఉ. అమ్మ భవన్మహామహిమ నారయ నిమ్మహిలో వశమ్మ వే
దమ్ములకైననున్ బహువిధమ్ముల నీదుకృపారసమ్ము పై
జిమ్మి కడున్ బ్రియ మ్మెసగ సేవల గొమ్ము సదా వరప్రదా
నమ్మున బ్రోవు నన్ను నిను నమ్మితి నెమ్మనమందు యిందిరా

48. చ. అలసు నశౌచునింట బహుళాశనునింతను సందెవేళ దా
దెలిసి పరుండునింట నతిదీనజనాదృతిలేనియింట దు
ష్కలహము గల్గునింట బరుషంబులు బల్కెడువానియింట నో
కలిమిపడంతి నీ వెపుడు గానగరా వనియందు రిందిరా

49. చ. ఇల ఘనవృష్టి సస్యచయ మెల్ల సమగ్రత మొల్కలెత్తి స
త్ఫలము నొసంగుచందమున తావకదివ్యకృపాకటాక్షసం
చలనమునన్ సమస్తమగుసంపద వేడ్క నుదర్కలబ్ధినిన్
గలుగగజేయునీశ్వరి జగజ్జనని ఘనవేణి యిందిరా

50. చ. సరసిజవాసిని!సరసిజశ్రితపాణి! సుధీమణీమన
స్సరసిజచారిణీ! సరసిజాతదళాయుతసుందరేక్షణీ
సరసిజజన్ముకు న్జనని, సారసనాభుమనోవిహారిణీ!
సరసిజజాండపాలనవిచక్షణి! రక్షణసేయు మిందిరా

51. చ. అతిమృదుశీతముగ్ధమధురాభసమర్ధతలన్ భవత్తనూ
లత కొదగన్ సుధాశశిసురామణికల్పకవస్తుసార మా
హృత మయె నబ్ధిచే నన, మహిం ద్వదకృత్రిమదివ్యమంగళా
కృతి కెటు లోపు సృష్టికథ కేవలవర్ణన జేయ నిందిరా

52. చ. వనజరజంబు లంతిన భవత్పద మోర్వదు చేటికావిలో
కనముల మేనువాడుగను, గంజము బట్టుట సాహసంబు నా
ధునివనమాలనూగుటయు దుర్భరమౌ నిక మోటుమాటల
న్బ్రణుతినోర్పజాలను భవన్మృదుళోజ్వలమూర్తి నిందిరా

53. చ. శశిధరసారసప్రభవ శక్రముఖామరవంద్యనీయ సా
దృశమహిమాస్వరూపమును దివ్యజగత్రయసంప్రకాశమౌ
యశమును నీకృపాలవశతాంశమునైన నొసంగకున్నచో
వశమటె యసందాదులకు వాకొని వర్ణనజేయ నిందిరా

54. చ. ధరను భవద్దృగంచలసుధారస మెవ్వని జిల్కు వానికిన్
సిరులు సర్స్వతీరతులు సిద్ధసమృద్ధులు ధీధృతుల్ బహూ
కరణముతో బరంపరలుగాగ వశంవదలై బ్రపూర్ణతం
బరగవె? యాదరింపుమ యపారకృపామతితోడ నిందిరా

55. చ. తడయక నీకృపారసము ధారుణి నెవ్వాని సోకుచుండు, వా
డడవుల శతృమధ్యమున, నంబుధియందున, దుర్దవాగ్నులం
బడినను బెక్కుయాపదల బాల్పడినన్ దగబ్రోతు వట్లు నన్
విడువక యాదరింపగదవే కరుణింపు విపన్ను నిందిరా

56. ఉ. నీకృప లేకయున్న ధరణీశ్వరుడైన దరిద్రు డౌగదే,
నీకృప గల్గెనేని జననీ! నిరుపేదయు ధారుణీశుడౌ
మీ కెనయైన దైవతము నీఘటనాఘటనప్రభావమే
లోకమలందు గానము సరోజదళాయతనేత్రి యిందిరా

57. ఉ. కొందరు భాగ్యవంతులరు గొందరుపేదలు గొంద రజ్ఞులున్
కొందరు కోవిదుల్ మరియు గొందరు వీరులు గొంద రల్పులీ
చందముగన్ జగంబు సదసద్యుత మౌట గనన్ నుతామరీ
బృంద! భవత్కటాక్షతదుపేక్షలనృత్య్ముగాదె యిందిరా

58. చ. అనఘులునై మనోజనిభులై విభవాఢ్యులునై యశస్కులై
ధనికులరై దయాళురయి ధార్మికులై ఘనులై వదాన్యులై
మనుజవరేణ్యులై సతతమాన్యులరై స్థిరులై విముక్తులై
దనరెడువారు తావకపదద్వయి గొల్చినవారె యిందిరా

59. నిర్ధనులై నిరాశులయి నీచులునై కరుణవిహీనులై
వ్యర్ధులునై క్షతాంగులయి వ్యాధినిబద్ధులరై వినష్టులై
స్పర్ధకులై వ్యధితాత్ములయి పాతకులై భువి మ్రగ్గువారు నీ
యర్ధ మెఱుంగలేక మదియం దిడకుండినవారె యిందిరా

60. ఉ. ఊరును బేరులేక నరు డుర్వి జనించి భవర్కృపాశ మే
పార నొక్కింతయేని దనపై గలుగన్ బహుభాగ్యవంతుడై
చారువిశాలకీర్తి గని సత్కవిసంస్తవపాత్రుడై మహో
దారత దేజరిల్లునుగదా జననీ! నను బ్రోవు మిందిరా

61. చ. ధనమె యశంబుగూర్చు నిల దైన్యము బాపుచు ధైర్యమిచ్చు నా
ధనమె వివేకమున్ మఱిముదంబు నొసంగును మానరక్ష నా
ధనమె యొనర్చు సత్సుఖము ధర్మము మోక్షము నిచ్చు నీవె త
ద్ధనమహితస్వరూపిణివి దాసునిపై దయజూపు మిందిరా

62. చ. ఋణమది హెచ్చె హారము రుచింపదు కంతికి గూర్కురాదు యా
ర్జనమున లేదు ధీరతయు రచ్చకు దెచ్చెను రాచకార్య మా
ధనకనకాదివస్తువుల తస్కరులింట హరించి రిద్ది ని
న్ననిశము గొల్పుచున్నఫలమా యిదియా కనికార మిందిరా

63. ఉ. అప్పులు దీర్చలే ననెడియాతుర మందుచు నాటినాటికిన్
జెప్పతరంబుకాని వెతచే దిగి లందితి నిల్పవమ్మ నా
గొప్పతనం బనన్యగతికున్ శరణాగతు నిట్టు లింక నన్
దిప్పలబెట్ట కీప్సితము దీర్చి కృపన్ వహియింపు మిందిరా

64. చ. పడగలపాటులన్ బడిన బైనిపరాత్పరుడే గలం డటం
చుడుగక మత్ప్రయత్నముల నివ్విళులూరితి ధైర్యమింక నా
యెడ విడచెన్ గటా గడియయేని భరింపగజాల దుర్ధశన్
దడయక జేరదీసి నను దైన్యము వాపి భరింపు మిందిరా

65. ఉ. భక్తుల నుద్ధరింపగ భవత్పతి తద్ధనమున్ హరింప నా
సక్తి మెలంగు నీ వన నసచ్చరితాత్ములచెంత నెప్పుడున్
రక్తివసింతు వయ్యయొ ధరాస్థలి నర్ధములేకయున్న మీ
భక్తులు వ్యర్హులేకద కృపామతి నాపయిజూపు మిందిరా

66. ఉ. పాయనిభక్తి నిన్నెపుడు బ్రస్తుతిజేయుచు నోరునొవ్వ కు
య్యో యభయార్ధి నన్ బలుకుతో మొర బెట్టినగాని నీకు నా
ప్యాయత గల్గ దౌ నదియు, బాలకు డేడ్చినగాని తల్లి పా
లీయదొడంగునే కనికరింపుచు నిమ్మహిలోన నిందిరా

67. ఉ. ఇమ్మహిలోన నిందనుక నెల్లవిధమ్ముల నాప్తబంధువ
ర్గమ్మున దీసిపోక నుతిగాంచితి నమ్మరొ నీకృపావిశే
షమ్మున నన్ను నిత్తరిని సాకకయున్న జరించుటెట్లు పూ
లమ్మినయూరిలో పుడకలమ్ముట హేయముగాదె? యిందిరా

68. చ. సకలజగన్నియంత పతి శౌరి, సుధానిధి కామధేనుక
ల్పకములు తోడుబుట్టువులు, భవ్యతనూజుడు సృష్టికర్త వే
రొకసుతు డారతీశుడు నహో నిఖిలార్ధసమృద్ధవయ్యు నీ
విక కృపణత్వ మూన తగుదే మదభీష్ట మొసంగ కిందిరా

69. ఉ. నీ వలనాడు సీతవయి నేర్పుగ రామునిగూడి కానయం
దీవు వసించునాయెడల నెగ్గొనరించిన కాక దైత్యునిన్
దేవి! భవత్ప్రియుండు బరిమార్పగ నెంచ గృపాంతరంగవై
కావు మటాంచు వాని కుపకారము సేయగలేదె? నీదు దీ
నావనతత్పరత్వ మిపు డారయ నాయెడ జూపు మిందిరా

70. చ. జనకుండుబోలె శౌరి యనిశం బపరాధుల బ్రోవు చెప్పుడేన్
మనమున గోపమూన నదిమాన్పగ నాధ! యిదేమినాయమిం
దనఘు డెవండు లోకమున నారయమం చుచితోక్తి వాని నీ
వనయము శాంతు జేసి స్వజనాళిగ జేయవె వారి నిందిరా

71. ఉ. శ్రీకరి! యావికుంఠనగరిన్ పతితో సరసంబు లాడుచో
నాకుశలప్రసంగము నొనర్చునె నీకడ నత డంబరో!
మీ కెరిగించువా రెవరు? మేలొనగూర్పగ నింక దిక్కు నీ
వేకద? నాకనారత మివే పదివేలనమస్సు లిందిరా

72. ఉ. తల్లికి దండ్రికంటె నిల దద్దయు బ్రీతిగదే ప్రజాలిపై
నెల్లవిధంబులన్ వెత హరింపగ మాయపరాధముల్ సదా
యుల్లమునన్ క్షమింప విభవోన్నతులన్ గలిగింప బెంప నో
తల్లిరో! నీకే చెల్లు నిటు దాల్మి వహింపక బ్రోవు మిందిరా

73. చ. తనదుపురాకృతంపుసుకృతంబున సంపద నొంద గల్గు నం
చని యెద రిందు గొందరిక నంబ నిను న్వినుతించు నాత డెం
దున దులదూగు సంపదలతో నని నేధృతిబూని సన్నుతిం
చిన నను బ్రోవకుందువె విశేషకృపామతి బ్రోవుమిందిరా

74. చ. ఇది కలికాల మిందొక డనేకవిధాననియుక్తి నిశ్చలం
బొదవెడు భక్తిని ంగొలువ నోపడవశ్యము కామ్యయోగమా
తుది గన దంతరాయమున ద్రోవలనేకము లుండు భక్తిలో
నుదయము జేయు నీవెకద యోరమ దిక్కిక మాకు నిందిరా

75. చ. సమదమతంగజాళియును సత్తురగావళులున్ రధంబులున్
సమరకళైక సాధనవిచక్షణయోధవతంసవారముల్
సమధికరత్నకాంచనలసద్గృహభూమిసతీసుతాదియో
గము భవదర్చనంబుననుగాదె? లభించు ధరిత్రి నిందిరా

76. చ. నెనరది యింతలేని యవినీతుడ నౌట యధావిధిం ద్వద
ర్చనలను సల్పనెంతయును జాలుదునే దగలోకమందు నన్
మనుజులబంధముక్తులకు మానసమేగద హేతు వౌట నా
మనమున నిల్పి నిన్నిప్పుడు మానసికార్చన జేతు నిందిరా

77. ఉ. మానితవిస్ఫురత్ఫలసుమవ్రజ దానవిరాజమాన సం
తానలతాపరీవృత నితాంత లసద్బహుదివ్యపాదపా
ధీన మధువ్రతీ పరభృతీ లలితశృతి సౌఖ్యద స్వనో
ద్యాన విహారకేళినిరతా సరితాంపతిజాత యిందిరా

-: మానసికపూజ :-

78. ఉ. ఓజననీ కృపాభరణి యోవరలక్ష్మి జగత్కుటుంబినీ!
ఓజనతామితార్తిహరి యోమురవైరిమనోహరీ రమా!
ఓజగదేకమోహిని పయోనిధికన్యక లోకమాత ని
ర్వ్యాజకృపాత్మ నాదుహృదయాబ్జమున న్వసియింపు మిందిరా

79. చ. సలలితమందహాసయుత చారుముఖాంబుజ భాసురత్కృపా
కతితకటాక్షవీక్షణ వికాసితమంజుల గండభాగ సం
చలిత సుకర్ణభూషణ విశాలధగద్ధగితద్యుతుల్ భువిన్
జెలగగ రమ్ము చిత్తమున జేసెద నావాహనమ్ము యిందిరా

80. చ. ఘనతవికుంఠధామ వరకల్పకమూలవిరాజమాన కాం
చనవరపీఠి నొప్పుచును సర్వదిగీశ్వరకామినీమణుల్
వినతి సపర్యలన్ సలుప విశ్వవిమోహనదివ్యమూర్తివై
దనరెడు యాదిలక్ష్మివని ధ్యానమొనర్చెద భక్తి నిందిరా

81. చ. మరకతతోరణావళులు మౌక్తికచిత్రత రంగవల్లులున్
బరిమళయుక్తధూపములు భవ్యమణీమయదీపికావళుల్
బరగెడు మంతపంబునను భర్మవినిర్మితసింహపీఠిపై
స్ధిరత వసింపు మందముగ సిద్ధము జేసితి నిందిరా

82. ఉ. పూతపసిండిపాత్రమున బొందుగ నుంచిన పారిజాతకా
బ్జాత సుకేతకీ వకుళ చంపకసూన సువాసితంబు నౌ
శీతలనిర్మలోదకము జేరగ దెచ్చితి నీదుపాదకం
జాతయుగ్మమ్మునుం గడుగ జక్కనిపాద్యముగొమ్ము యిందిరా

83. చ. వికచమనోజ్ఞ పుష్పచయ విస్త్రుతవాసన లేలకీ లవం
గల మృగనాభి సంమిళిత కర్పూరచందన సౌరభంబులన్
బ్రకలితమై సెలంగు నతిపావనతోయము నబ్జపాణి నీ
విక నెద స్వీకరింపగదె యిచ్చెద నార్ఘ్యము తల్లి యిందిరా

84. ఉ. చంచదనర్గళాతిశయ చంచలవీచి లసద్వియుత్తటి
న్యంచితమై మనోజ్ఞమయి యద్భుతమై త్రిజగత్పవిత్రమై
మించియు మంచులీల తగుమేలగు చల్లనిదివ్యతోయ మం
దించెద నే గ్రహింపు కమలేక్షణ యాచమనీయ మిందిరా

85. ఉ. వేమరు పున్నమందయిన వెన్నెలగేరెడు శోభ గల్గి శ్రీ
భామిని! మంచియావువగుపా ల్పెరుగుల్ నవగోఘృతంబుగా
రాముగ జుంటితేనె గడురంజిలు చక్కెర గూర్చినట్టి పం
చామృతము ల్ముదంబున సమర్పణ జేసెద గొమ్ము యిందిరా

86. చ. భువనములందు నెల్ల గడుపూజ్యములై యఘనాశనంబులై
నవఘనసార గంధమృగనాభిముఖాధికవాసితంబులై
భువి మణిహేమకుంభపూర్ణములై తగునిర్మలంబులౌ
వివిధసుతీర్ధతోయము లివే యభిషేక మొనర్తు నిందిరా

87. చ. అరయ ననర్ఘదివ్యధవళాంశుకము న్గనకోత్తరీయమున్
సురుచిరరత్నకంచుకము శుభ్రతరోజ్వలమౌక్తికావళీ
విరచితయజ్ఞసూత్రమును విస్తృతభక్తి మదిం దలంచి త
త్పరతనొసంగినాడ దయదాల్చి ముదంబొనగూర్చుమిందిరా

88. చ. మణిమయ నూపురద్వితయ మంగళసూత్ర కిరీట హార కం
కణచయమున్, శిరోమణియు, గాంచన మేఖల దివ్యకర్ణభూ
షణయుగ మాదిగా వివిధచారుతరాభరణంబులన్ ధరన్
గణుతి వహింప నీలలితకాయ మలంకృతి జేతు నిందిరా

89. చ్. వరఘనసార కుంకుమసువాసితగంధ మలంది మేన క
స్తురితిలకంబు ఫాలమున శోభిలగూర్తు శుభాంజనం బిదే
తరళదృగంచలంబులను దాల్పవె, రోచనపత్రకంబులన్
సురుచిరగండభాగముల సొంపొనగూర్చెదనమ్మ యిందిరా

90. చ. మరువక మల్లికా వకుళ మాలతి చంపక పారిజాత తా
మరసరసాల కేతకి సుమంబుల నీతులసీదళంబులన్
బరగ సహస్త్రనామముల భక్తియుతంబుహ బూజచేతు శ్రీ
కరభవదంఘ్రిపంకజయుగద్వయిపై మదినిల్పి యిందిరా

91. చ. భాసురచందనాగరు సువాసిత గోఘృతమిశ్రితంబు శ్రీ
వాససితాభ్రముఖ్యబహు వస్తుయుతంబగు దివ్యధూపమున్
శ్రీసతి! కల్పనం బమరజేసితి మామకచిత్త వృత్తి వి
శ్వాసముతోడ గైకొను మవార్యయశస్సువికాస యిందిరా

92. చ. సరసిజపాణి, నీమదికి సంతసము న్గలిగింప నెంతయున్
సురుచిరరత్నమండప సుశోభిత చిత్రహిరణ్యపుత్రికా
కర ధృతమాలికాకృతి వికాసితముల్ ఘృతవర్తంబులౌ
స్ధిరతరదీపికావళుల చిత్తమునన్ సమకూర్తు నిందిరా

93. చ. ఫలములుబానకంబు వడపప్పును బాల్పెరుగు ల్ఘృతంబునున్
బొలుపగు సూపశాకము లపూపములు న్స్సరసాన్నమట్లు పొం
గలి, పుళిహోర పాయసము గాంచనపాత్రలగూర్చి తమ్మ నీ
వలరుచు నారగింపగదె యాదరభావముబూని యిందిరా

94. ఉ. మేలగువక్క లేలకులు మెప్పొనరించెడు పండుటాకులుం
జాలిన పచ్చకప్పురము చక్కనిముత్తెఔసున్న మెన్న త
క్కోలలవంగముఖ్యముల గూర్చి సమర్పణ జేసినాడ తాం
బూలమిదే జగజ్జనని! బొందుగ వీడెముసేయ మిందిరా

95. ఉ. రాజముఖా..మరా..జసుర, రాజకిరీట మణిప్రభాళి నీ
రాజితపాదవై సతము రాజిలు తావకదేహవల్లికిన్
రాజసమొప్ప సంతతరాజితకర్పూరదీపరాజి నీ
రాజనమిత్తు నంబ రతిరాజునకుం జనయిత్రి యిందిరా

96. చ. మణిగణమిశ్రితంబు ఘనమౌక్తికకాంచనసంచయంబు ద
క్షిణగ సమర్పణం బొనరజేసెద నీశ్వరి! మత్పురాకృతా
ఘనిచయ మెల్ల ద్రోచి నను గావ ద్రివారము నీకిదే ప్రద
క్షిణము బ్రణామకోటులను జేసెద నాదృతిగొమ్ము యిందిరా

97. చ. మతి నతిభక్తితోడ నిను మానసికార్చన జేసినాడ స్వీ
కృతి నొనరించి లోపముల నెల్ల గృపన్ క్షమియించి నన్ను స
త్కృతునిగ నెంచి నీదగుమతిన్ బరిపూర్ణముగా దలంచి సం
తతము మదీయచేతమున దద్దయుబ్రీతి వసింపు మిందిరా

98. చ. పెన్నిధిగన్నయట్టి నిరుపేదవిధంబున మోద మందగా
నెన్నడు నేనొనర్చితినొ యెక్కుడుదానము లేతపంబు లిం
కెన్నగ నాపురాకృతము లెట్టివొ నీమహనీయరూపమున్
గన్నుల కోర్కెదీరగను గాంచితి ధన్యుడనైతి నిందిరా

99. ఉ. ఎప్పుడు లభ్యమౌనో భవదీయకృపారసమ న్మహౌషధం
బప్పుడె దుర్దశామయ మదంతయు బోవును లోకమాత! నా
కెప్పటికిం దదామయుము నింక ఘటింపగ జేయ కమ్మ నే
నొప్పుగ నీపదాంబురుహయుగ్మము నౌదల దాల్తు నిందిరా

100. ఉ. మంచితనంబు గాంచిమది మానవజన్మము వ్యర్ధమౌట నూ
హించి భవాంబుధివ్యధ సహించి సతంబు వృధాభిమానమున్
డించి నుతించి యీశ్వరునిలీలల నిన్ బరదేవి వంచు జిం
తించి తరించు నిశ్చయమతిన్ బరమార్ధవిదుండు యిందిరా

101. ఉ. ఆశకు మేరలేదు పరమార్ధ మెఱుంగగ రాదు దుర్మదా
వేశము తీరలేదు మరివిజ్ఞులసంగతి లేదు సంస్కృతీ
పాశము వీడబోదు గొలువన్నిను శక్యముగాదు త్వత్కృపా
లేశ మదైన నాకికను లేనియెడన్ దెర వేది యిందిరా

102. చ. నిలకడ లేదు చిత్తమున నేరుపుసున్న విలేక మందునా
గలుగదు సూనృతం బదియు గానరాదు సువిద్యలన్ననో
తలప హుళక్కి గౌరవము దబ్బర శాంతము నాస్తి నిన్మదిన్
దలచెద లోప మెంచ కిక దాసుని బ్రోవవె బ్రీతి నిందిరా

103. ఉ. ఇంచుకవచ్చిరాని నుడి నెద్దియొ గోరుచు బోరు బెట్టగా
సంచితరీతి మాత మది నారసి పాపని నూరడించు న
ట్లెంచగ భావగుంభరసహీననిరూహము లౌట నాడుతుల్
వించు మనోగతం బెఱిగి పెంచుము నన్ శరణార్ధి నిందిరా

104. చ. సిరులవి గల్గు నీదుపదసేవ నొనర్చినమానవాళికిన్
దురితము లంతరావు మఱిదుర్దశ బోవు నటంచు నాత్మలో
నురుతరభక్తి నీవిలసితోత్పలచంపకమాలికావళిన్
స్ధిరముగ దాల్పవేడితి నిదే భవదర్పణ జేసి యిందిరా

105. చ. అలరగ శాలివాహనశకాబ్దము వార్ధీశరేభభూమిసం
ఖ్యల దనరారు నాంగిరసహాయన పౌష సిత త్రయోదశీ
విలసిత సోమవారమున విస్త్రుతభక్తిని బూర్తి జేసి ని
ర్మలమతి నీకు నీశతకరాజ మొసంగితి నంబ యిందిరా

106. ఉ. మంగళ మాదిలక్ష్మి కిదె మంగళ మబ్జదళాయతాక్షికిన్
మంగళ మీశ్వరేశ్వరికి మంగళ మచ్యుతచిత్తహారికిన్
మంగళ మబ్ధిరాట్సుతకు మంగళమౌ జగదేకమాతకున్
మంగళ మబ్జమందిరకు మంగళమౌగదె నీకు నిందిరా

107. ఉ. ఈమహితేందిరాశతక మెవ్వడు భక్తి పఠించు సంతతం
బామనుజాగ్రహణ్యుగృహమం దెపుడున్వసియించి సత్కృపన్
కామితదివ్యవైభవ సుఖస్థితి నైహికపారలౌకిక
క్షేమములాదృతిన్ గలుగజేయుచు నిందిరవాని బ్రోచెడున్

108. ఉ. స్వస్తి సమస్త ప్రజకు సంతతము న్గణుతింప న్యాయమా
ర్గస్తులరై నృపాలురు ధర్మస్థలి బ్రోతురుగాత బ్రీతితో
నిస్తులమౌ శుభం బగుత నిత్యము గోగణవిప్రజాతికిన్
విస్తరసౌఖ్యసంపదల విశ్వము దా దులదూగు గావుతన్

109. మ. పరమప్రీతిని నిట్లు శ్రీమదనగోపాలాంఘ్రినిత్యార్చనా
గురుశీలుండును గౌతమప్రవరుడున్ గోవర్ధనోపాఖ్యుడున్
వరవైఖానసవైదికోత్తముడు గోపాలార్యసూనుండు ని
ద్ధర శ్రీరంగసమాఖ్యుచే నిది ప్రణితంబయ్యె సంపూర్తిగన్

సంపూర్ణము

No comments:

Post a Comment