Monday, July 6, 2015

వేంకటాచలరమణ శతకము - పప్పు మల్లికార్జునరావు

వేంకటాచలరమణ శతకము
                                                   -- పప్పు మల్లికార్జునరావు
(కందపద్య శతకము)

1. శ్రీసత్యరూపధారణ
వాసవముఖ విబుధలోక వందితచరణ
భాసిత జగదుద్భవ వి
న్యాసాంతచరణ వేంకటాచలరమణా!

2. నీ వెలసినమల తిరుమల
నీవే తిరుపతివటంచు నిరతము భక్తుల్
సేవింపఁగఁదన్నామం
బావరపురిదాల్చె వేంకటాచలరమణా!

3. బహుదూరదేశముల నీ
మహిమల్ వెలయంగ సంభ్రమమున జనముల్
బహుమతులు మ్రొక్కులుంగొని
యహరహ మేతెంత్రు వేంకటాచలరమణా!

4. కలి ముఖ్యదైవతమవై
నెలకొల్పితి విగ్రహముల నిరసించెడు మూ
ర్ఖుల మానసముల చోద్యం
బలరఁగ సద్భక్తి వేంకటాచలరమణా!

5. ఈలోకచిత్రవర్తన
మాలోకింపంగ నీమహత్త్వము దోచున్
డోలాయమానమానస
సాలోచనగతుల వేంకటాచలరమణా!

6. తన యింద్రియ మూలము
ననెగద గ్రహియించుఁ బ్రకృతి నరుఁ డెవ్వేళన్
గననోపునె సత్యము నీ
యనూనకృపలేక వేంకటాచలరమణా!

7. నామంబు రూపమును గా
కేమగపడుచుండు సృష్టి నివిత్యజియింపం
గా మిగులు సత్పదార్థమ
వై మెఱయుదు వీవు వేంకటాచలరమణా!

8. మాయాప్రతిబింబుఁడవై
యీ యఖిలాండములకెల్ల నీశుఁదవె యవి
ద్యాయుత్త ప్రతిబింబుం
డాయెను జీవుండు వేంకటాచలరమణా!

9. జీవుఁడు నిజస్వరూపము
తో వెలయన విద్యలెల్లఁ దోలఁగవలె న
ట్లే విడువ నీవు మాయయు
నావలనదె యౌదు వేంకటాచలరమణా!

10. జీవుని కించిద్ జ్ఞతయును
దేవుని సర్వజ్ఞతాప్రతిష్టయు నాయా
యావరణల భేదంబుల
నైవరలుంగాదె వేంకటాచలరమణా!

11. ఒకయాత్మయే గలదందఱ
నిఁక భేదముభ్రాంతియంచు నెఱిఁగిన నరుఁడే
రికి హింససేయకొప్పెడు
నకలంకపుబ్రేమ వేంకటాచలరమణా!

12. మమకార మహంకారము
క్రమాగతానేక జన్మకర్మజములెయై
శ్రమమిచ్చుచుండు నరునకు
నమనస్కతలేక వేంకటాచలరమణా!

13. రాగద్వేషంబులు గద
బాగుననాధారమయి ప్రపంచము నడుపున్
యోగిసుఖించును రెంటిని
త్యాగముసేయంగ వేంకటాచలరమణా!

14. సుఖదుఃఖంబుల సమతన్
సఖురీతిపరార్తులుడు పజతనంబుత్రయీ
శిఖబోధగలుఁగు నరుఁడ
య్యఖిలార్థములొందు వేంకటాచలరమణా!

15. ఆజన్మాంత తృష్ణా
భాజనుఁడయి విరతిలేకభ్రమియించునరుం
డోజగనెడు దృశ్యజగ
ద్వ్యాజపుమృగతృష్ణ వేంకటాచలరమణా!

16. చేతికినందినదెల్లయు
వాతన్ మ్రింగుచును శాఇశవంబుననుండున్
చేతమున గ్రాహమున్ బలె
నాతురపడుతృష్ణ వేంకటాచలరమణా!

17. బాలదశ భేలనంబు
నాలోలుండగుచుమది దురాభ్యాసములన్
వ్రాలఁగ శ్రమపడుచుండు స
దాలంబనలేక వేంకటాచలరమణా!

18. స్త్రీలోలత యౌవనమున
కాలముభోగముల గడుపఁగావాంఛమదిన్
జాలగఁ బెంపొందుచు గా
ర్యాలోచననింపు వేంకటాచలరమణా!

19. కౌమారమందు ధనమున్
భూములు గడియింపఁగాంక్షపొదలఁగఁ గైకొ
నేమార్గమేనిబట్టును
వ్యామోహతమీఱ వేంకటాచలరమణా!

20. ఒడలను మనమున దార్ధ్యం
బుడిగినఁదావృద్ధి యౌవయోవృద్ధిని నె
ప్పుడు కామమద్దిసర్వం
బడుఁగడుఁగునగోరు వేంకటాచలరమణా!

21. సకలానర్థపుతృష్ణన్
బెకలించిలయింపఁ జిత్తవృత్తియె వత్సా
ధకమగుటఁ జేయవలెనది
యకలంకముగాఁగ వేంకటాచలరమణా!

22. గతజన్మవాసనలచే
సతతము మనమేగుచున్న సత్సహవాసో
ద్ధృతిమాఱ్పుఁ జేయగావలె
నతులితముగదాని వేంకటాచలరమణా!

23. ఆవరణశుద్ధమగునేన్
బోవు మనోద్వేగమెల్ల బొడముశమాదుల్
తావక పదాబ్జభక్తియు
నావల నెఱుకయును వేంకటాచలరమణా!

24. ఎంత విశారదుఁడైనన్
గాంతా కనకములనాశగదలకయున్నన్
స్వాంతవిశుద్ధరలేకన్ దు
రంతములన్ జేయు వేంకటాచలరమణా!

25. తురగముల రీతిన్ వశతన్
జరియింపఁగ నింద్రియములు సంతృప్తినిడున్
తిరిగిన నవశతదుష్పధ
మరయంగాలాగు వేంకటాచలరమణా!

26. మనసు ధృడంబున నరిక
ట్టిన నింద్రియవృత్తు లెల్లడిందు భవత్పా
దనిరూఢభక్తి కుదురౌ
ననయము హృదయంబు వేంకటాచలరమణా!

27. వ్యవసాయాత్మికమౌ బు
ద్ధివలన మానసమునిల్పి తిరముగ ఫలసం
ధివివర్జిత కర్మలఁ జే
యవలెన్ బ్రజసేవ వేంకటాచలరమణా!

28. విశ్వమయుఁడ వీవగుటన్
విశ్వము సేవింపనదియె నీసేవయగున్
శాశ్వతసుఖ సంధాయక
మైశ్వర్యప్రదము వేంకటాచలరమణా!

29. ఒరుకష్టములన్ దనవని
అరయుచుఁ బాపంగఁదగుసహాయము నత్యా
దరమునఁజేసిన నరునకు
నరుదగుజన్మంబు వేంకటాచలరమణా!

30. పూనిక యుండఁగవచ్చును
గాని యహంకారమంతగారాదు క్రియా
నూనసమా చరణంబున
సానందుండగుచు వేంకటాచలరమణా!

31. అంతఃకరణ విశుద్ధత
యెంతయులేకుండ నుడువునేని నభేదం
బంతట స్వార్ధపరుండయి
యంతంబునఁజెడును వేంకటాచలరమణా!

32. ఈకలి వేదాంతులమని
మాకునుమీకును నభేదమయనుచు సొత్తున్
జేకొందురు చోరులక్రియ
నా కపటాత్మకులు వేంకటాచలరమణా!

33. శారీరకధర్మంబు లి
వేరీతిగనంతు నాత్మనితర స్త్రీలన్
జేరఁగ రాదొకొయండ్రు మ
హా రసికులరీతి వేంకటాచలరమణా!

34. విద్యాగంధము గల్గియు
మద్యంబులు త్రావుటొప్పు మతి నిలకడకై
సద్యోదర్శనమగు నం
డ్రాద్యబ్రహ్మంబు వేంకటాచలరమణా!

35. ఇంచుక తెలిసిన లోకము
వంచింపఁగఁ జూతు రాత్మవంచనమౌనం
చెంచ రధఃపతనం బౌ
నంచెఱుఁగరు దాన వేంకటాచలరమణా!

36. పరుల నుగికురించుటలో
నుఱవగు కుశలత్వ మెంతయుండునొ యంతౌ
సరళగతికి దూరంబయి
యరయండిది నరుఁడు వేంకటాచలరమణా!

37. చిత్తవిశుద్ధతతోఁ గిం
చిత్తయినను జ్ఞానపథము చేకొన్న మదిన్
సత్తగు ఋజుమార్గంబులు
హత్తి ఫలంబిడును వేంకటాచలరమణా!

38. సత్వాహారంబుల మది
సత్వరముగ శుద్ధమౌచు షట్ఛత్రు వినా
శత్వము నొందుచు న్రకృతి మ
హత్వక్రియలుడుఁగుఁ వేంకటాచలరమణా!

39. తినువస్తుల సాంకర్యము
లనేకములుజేరి గుణములందున మార్పుల్
పొనరింప నెట్లు సాత్విక
మని వానిన్ గొనుట వేంకటాచలరమణా!

40. భువిలో కాలక్రమమున
ప్రవర్తిల్లెడు లాభలోభభావంబుల వ
స్తువులన్ మనుజులు మార్పఁగ
వవి స్వచ్ఛములెట్లు వేంకటాచలరమణా!

41. పట్టణముల నెక్కుడు జూ
పట్టున నారోగ్యమెల్ల వస్తుగుణములన్
బుట్టుచుఁ గలుషానిలమున
నట్టటు పెంపొందు వేంకటాచలరమణా!

42. పల్లెల నారోగ్య స్థితు
లెల్ల నశించెను గృహాళి కెల్లలుగ పొలం
బుల్లోభగరిమ కర్షకు
లల్లన జేయంగ వేంకటాచలరమణా!

43. పెంటల పోగుల వీధుల
వెంటన్ దుర్గంధజలము విడుచుటచే వె
న్నంటిరు జల్ పొడసూపెడు
నంటువ్యాధులును వేంకటాచలరమణా!

44. తొల్లిటి యాచారములన్
పెల్లగు ఛాందసములనుచు విడుచుటచే ని
ప్డెల్ల యనర్థము లుర్విని
నల్లుకొనం దొడఁగె వేంకటాచలరమణా!

45. ఆచారము లారోగ్య
ప్రాచుర్యము లనుచు నేటి ప్రకృతివిధిజ్ఞుల్
వాచారూఢతఁ బల్కుదు
రాచరణలఁ జూపి వేంకటాచలరమణా!

46. ఉపవాసము సేయుటయున్
దపసున కెఱఁగుటయు గాంచినగు వారలె శా
స్త్రపు పరిశోధనఁ దెలిసిరి
అపారసుఖముంట వేంకటాచలరమణా!

47. గోసేవ సేయ మఱచిరి
గోసస్య విలుబ్ధులైరి గోగ్రాసంబుల్
భాసురమగు క్షేత్రంబుల్
నాసన్ దున్నుచును వేంకటాచలరమణా!

48. గోక్షీరము దేహము నెటు
రక్షించునొ జననమాది గ్రహియించిన త
ద్రక్షణ విడువక గాంచరె
యక్షయ లాభాప్తి వేంకటాచలరమణా!

49. గోమయ పరిశుద్ధతయును
గోమూత్ర విశుద్ధ యోగగుర్వౌషధ హిం
దూ మతవిధులున్ జిరకా
లామోదములయ్యె వేంకటాచలరమణా!

50. ముదుసలి తలిదండ్రులఁ బలె
ముదివగు గోవృషభములను బోషించుటయేన్
మదిగోరక్షణ సభలం
దదుకుటయే నౌను వేంకటాచలరమణా!

51. ఆహార సాత్వికంబున
దేహారోగ్యమున మనసు తిరపడుటయు ని
ర్మోహము గలుగన్ దెలియును
సోహంబని బ్రహ్మ వేంకటాచలరమణా!

52. మానసిక పరిభ్రమణము
న్యూనంబగు నేని వాంఛలుడుగున్ దానన్
జ్ఞానాగ్ని పుడమదద్ఘం
బౌ నురుసంచితము వేంకటాచలరమణా!

53. నిదురన్ లేచినదాదిగ
నెదురైనది స్వీయభోగ్య మెట్లగు ననుచున్
మది గాంక్షించుచు గృషి సే
యఁ దలంచెడు నొకఁడు వేంకటాచలరమణా!

54. ఇతరుల సుఖ సంపదలన్
మతి కలఁగి యసూయపడుచు మందప్రజ్ఞన్
వెతకును వారలదోషము
లతినిపుణత నొకఁడు వేంకటాచలరమణా!

55. ఇంటను రంభనుబోల్ వాల్
గంటి గుణోపేతయుండఁ గామాంధుండై
వెంటఁ జనురో వెలందుల
నంటఁగ నొకరుండు వేంకటాచలరమణా!

56. ఎన్నితరంబులకైనను
సన్నగీలని కలిమియున్న సంపాదింపన్
ఖిన్నత ప్రయాసపడు నొకఁ
డన్నము తినకుండ వేంకటాచలరమణా!

57. చిఱుతలయి యనుజులుండఁగ
హరియించి కుటుంబ ద్రవ్యమంతయు ఋణముల్
సరిజూపును వంచన నొరుఁ
డఱుతలఁ గోయుచును వేంకటాచలరమణా!

58. న్యాయస్థానము లన్నిట
బోయి కుయుక్తులను సూదిమొనయంతైనన్
దాయకు భాగంబీకొరుఁ
డాయము వెచ్చించు వేంకటాచలరమణా!

59. దౌర్జన్య మూలమున ధన
మార్జించుచు హానిగ దురవ్యయపరచు నొకం
డూర్జిత గౌరవమబ్భునె
యార్జవ గతిలేక వేంకటాచలరమణా!

60. ఒక్కొక్క వ్యక్తికి దుర్గుణ
మొక్కొక్కటి ప్రబలు వాసనోద్వేగము పెం
పెక్కఁ బ్రకృతి వ్యక్తంబయి
యక్కత మణఁగవలె వేంకటాచలరమణా!

61. ప్రాణులు సుఖమున్ గోరుచు
దానిని బడయంగ సర్వధాయత్నింతుర్
పూనికపుష్ప మరందం
బాను నళులరీతి వేంకటాచలరమణా!

62. నియమముగల సుఖము స్థిరం
బయి యొప్పుచు సత్యమైన యానందమిడున్
వియదంబువు కొలఁకుల జే
ర్పయినిల్చెడు కరణి వేంకటాచలరమణా!

63. సరునకు సిఖమున్ దుఃఖము
వరుసను జీవితమునణ్ వచ్చుచునుండున్
సరగున దినమున్ రాత్రియు
నరుదెంచెడి మాడ్కి వేంకటాచలరమణా!

64. మానసిక నిశ్చలత్వం
బూనఁగనౌ సుఖము దుఃఖ మొకరీతి సదా
నాణెంబొకటి యెయిరుదెస
లైనటు భేదంబు వేంకటాచలరమణా!

65. శీతోష్ణాది ద్వంద్వా
పేతత యభ్యాసమునను బృధువైరాగ్యో
పేతతఁగల్గును తులస్థిర
మై తగునస్పృశత వేంకటాచలరమణా!

66. వ్యామోహక దృశ్యంబులు
వేమరుదోషముల వెదకి విడువఁగ@జెల్లున్
కామిని చర్మాంతర్మాం
సామేద్యత లట్లు వేంకటాచలరమణా!

67. మేడలు తోతలు భూములు
తోడన్ రావనుచుఁ బ్రీతిదొఱగంగవలెన్
వీడమె రైలును మఱుమా
టాడక గమ్యమున వేంకటాచలరమణా!

68. సాధుల సాంగత్యమునన్
బోధిత వైరాగ్యపథము బొందునరుఁడు పూ
లాధారంబుగ దారము
సాదృతి తలకెక్కు వేంకటాచలరమణా!

69. స్త్రీ పురుష నైజభేదము
లీపృధివిన్ సృష్టిలోనె యేర్పడె వానిన్
బ్రాపుగ వర్తింపనిచో
నాపదలే కల్గు వేంకటాచలరమణా!

70. ప్రేమ క్షమాదిగుణములు
కామినికెక్కుడగువాని గల్గునక్రియలన్
నేమమునజేయ నొప్పెడు
నామెయి పురుషులకు వేంకటాచలరమణా!

71. పాతివ్రత్య సుశీలత
జాతివినాశంబునుండి సంరక్షింపన్
హేతువది విడువకుండిన
నాతత శుభదంబు వేంకటాచలరమణా!

72. బహిరంగ వ్యాపారము
సహజంబుగ పురుషులకు విసర్జింపుచు లో
గృహకృత్యము దీఱ్పఁగనౌ
నహరహ మబలలకు వేంకటాచలరమణా!

73. ఒండొరుల విధులు గలియఁగ
దండిగ నొకటై గృహస్థధర్మము నిండౌ
మెండగుధీసంపద తమ
కండయి తరియింత్రు వేంకటాచలరమణా!

74. పురుష దురభ్యాసములను
కరింపఁ జనదెందు నాతిఘనవర్తనచే
మరలించి యతని శ్రేయం
బరయుట శ్లాఘ్యంబు వేంకటాచలరమణా!

75. యౌవ్వనము ఝురీవేగము
జీవనమున్ బుద్భుదమని చెప్పిరిసూరుల్
బోవలదుకుమార్గంబుల
నావలగతి నెఱిఁగి వేంకటాచలరమణా!

76. స్వల్పమగు కారణంబున
కల్పించుచు కయ్యమంతఁగక్షలపాలై
నిల్పదురది జన్మాంతం
బల్పజ్ఞులుభువిని వేంకటాచలరమణా!

77. లంచముగొను నధికారుల
పంచనుజేరుచును మిగులఁ బగసాధింపన్
సంచులధనమున్ దోయుదు
రంచన తెలియకయె వేంకటాచలరమణా!

78. ధనమెట్టులొ గొనుటే పా
వనమను నధికారులదియె వమ్మైపోవన్
గని దుఃఖింతురు చంచల
మని యెఱుగరుశ్రీని వేంకటాచలరమణా!

79. జనులను బీడించుటయే
ఘనమనుకొని ప్రభులుదుండగము లొనరింపన్
వెనుకకు దూలుచు పైబడు
నని తెలియరు వాని వేంకటాచలరమణా!

80. ప్రకృతిగనదోచు నొక రొక
రికి నుపకారులుగ నౌట వృక్షములు నరుల్
ప్రకటోచ్ఛ్వాసంబు లనుభ
యకులంబుల్ పెరుగు వేంకటాచలరమణా!

81. మహిదున్నుచు ఫలియింపఁగ
సహాయపడు నెద్దుకాపు సంరక్షించున్
మహిషంబు మే పక్షీరము
లహీనగతినిడును వేంకటాచలరమణా!

82. భూజములు నదులు నొసఁగవె
సాజపు మధురంపు ఫలరసంబుల నీరున్
రాజిలు నుత్తమమై య
వ్యాజపు దానంబు వేంకటాచలరమణా!

83. స్థావరములు జంతువులున్
గావింప పరోపకారకార్యములు నరుల్
జీవితమున నేలకొ క్రో
ధా విష్టతఁబోర వేంకటాచలరమణా!

84. ఎన్నోవిధములఁ బ్రకృతిని
క్రన్నన మథియించి యైహికపు సౌఖ్యము బొం
దన్నేర్చిరి పాశ్చాత్యులు
ఔన్నత్యము గనిరి వేంకటాచలరమణా!

85. దూరపు వస్తుల గనుటయు
దూరపు గానముల వినుట దూరస్థులతో
చేరువగతి మాతాడుట
నౌరా సుద్ధించె వేంకటాచలరమణా!

86. వింత లిఁక నెన్నియున్నవు
యంతర్లీన మగుచుండి యా ప్రకృతినిధీ
మంతు లెవరేమి గనుదురొ
యంతముగనరాదు వేంకటాచలరమణా!

87. ఆనందము గూర్చుటె కా
దౌ నాశంబునకు మూలమనిఁ దృటిలోనన్
సేనలుగూలుట గనమె వి
షానిలముంబీల్చి వేంకటాచలరమణా!

88. వైమానికంపు దాడుల
చే ముదుసళ్ళర్భకులును స్త్రీలు నశింపన్
గా మోఱె ప్రకృతిశాస్త్ర మ
హా మహిమంబిలను వేంకటాచలరమణా!

89. భువిదుష్టుని చేతంబడు
ప్రవిమల వస్తువును దానపాయము తెచ్చున్
సవనాగ్ని యాతతాయికి
నవుగృహ దాహకము వేంకటాచలరమణా!

90. పరమాహిం సాధర్మం
బిరవగు మతమూనువారె హింసాపరులై
మురియుదు రదె నాగరకత
యరయఁగఁ గాబోలు వేంకటాచలరమణా!

91. దౌర్జన్యపు మార్గముల వి
సర్జించినగాని గనరుసౌఖ్యము నృపు లం
తర్జాతి సభలన్యాయం
బార్జవగతి నడిపి వేంకటాచలరమణా!

92. ఆధ్యాత్మజ్ఞత ప్రకృతి
స్సాధ్యములకుఁ దోడుపడిన సర్వహితంబౌ
బాధ్యతలల లోకశాంతి కు
పాధ్యయతఁ జూపు వేంకటాచలరమణా!

93. ప్రాక్పశ్చిమ దేశజ్ఞులు
వాక్పటిమన్ జెప్పి రిదిశుభంబని దీనిన్
దృక్పధమున నుంపఁగ స
మ్యక్పరిశోధనల వేంకటాచలరమణా!

94. కొండొకదేశ మొకంతన్
మెండగు విజ్ఞానమొంది మెరయుచునుండున్
ఒండొరు లది గణియింపుచు
నండను జేరవలె వేంకటాచలరమణా!

95. చిరకాలతపశ్చరణన్
బరిశోధనలన్ గ్రహించి ప్రకృతిన్ లోకో
ద్ధరణ మొనర్చు మహాత్ముల
నరయఁగ వలెనెందు వేంకటాచలరమణా!

96. వెలుపలి ప్రకృతిని దనలో
పవికృతిని దెలియువాఁడు పరిపూర్ణుండౌ
ఇలవ్యక్తులట్లె జాతులు
నలరున్ బెంపొంది వేంకటాచలరమణా!

97. ఉభయప్రకృతి జ్ఞానము
లభించు త్వచ్చరణభక్తి లాలసులకు భూ
త భవిష్యద్విజ్ఞానము
నభయము సంస్కృతిని వేంకటాచలరమణా!

98. ఎంతదృఢభక్తి గల్గునొ
అంతవిశుద్ధతయు శమము నలరారునెడన్
శాంతము స్థిరమౌ మనసున
నంతయు బొడకట్టు వేంకటాచలరమణా!

99. సందేశము నీదై భువి
యందలరుంగాత శాంతినంది సుఖింపన్
బొందుదురుగాక శాంతం
బందఱులోకమున వేంకటాచలరమణా!

100. ఈమకుటముతో శతకము
శ్రీమజ్జనకుండు చెప్ప శిధిలంబయె మున్
నేమగుడి చెప్పఁగడఁగితి
నామూలాగ్రముగ వేంకటాచలరమణా!

సమాప్తము

No comments:

Post a Comment