Friday, February 13, 2015

శ్రీరంగశతకము - తిరుమడ్యం దిగవింటి నారాయణదాసు

శ్రీరంగశతకము
                                           తిరుమడ్యం దిగవింటి నారాయణదాసు
(కందపద్యములు)

1. శ్రీమన్నారాయణహరి
సామజపరిపాలవరద సజ్జనలోల
నేమముతోనినుఁదలచెద
కామితములనొసఁగినన్నుఁ గావుమురంగా

2. ఓకారుణ్యపయోనిధి
పాకారిగిరీశవినుత పావనచరితా
లోకాధారపరాత్పర
నాకాధారమ్ముగమ్ము నగధరరంగా

3. సారసలోచనమాధవ
నారదసనకాదివంద్య నందకుమారా
మేరుగిరిధీరశ్రీధర
గారవమునబ్రోవవయ్య కరినుతరంగా

4. మురహరకృష్ణజనార్ధన
సరసిజభవవినుతచరణ సంకటహరణ
నరహరిననురక్షించవె
వరమునిపూజితముకుంద వరదారంగా

5. కమలపదకమలనాభా
కమలారిదినేంద్రనేత్ర కలుషవిదూరా
కమలనిధిశయనభవహర
సమయమిదేనన్నుఁగావ సద్గుణరంగా

6. దనుజగణవనకుఠారా
మునిమానసనళినమిత్ర మురళీలోలా
వనజభవభవసురార్చిత
కనకాంబరధారినన్నుఁ గావవెరంగా

7. సృష్టిస్థితిలయకారణ
శిష్టజనోద్ధరణమౌని సేవితచరణా
దుష్టవినాశనగిరిధర
కష్టములనుబాపవయ్య గజనుతరంగా

8. రక్షించుదొరవునీవని
పక్షింద్రవిహారనిన్నుఁ బ్రార్థించితినన్
రక్షించువరదపాండవ
పక్షాసరసీరుహాక్ష భవనుతరంగా

9. దానవకులసంహారా
దీనజనోద్దారవాసు దేవముకుందా
మానకనినుమనమునఁగడు
పూనికతోదలతు నన్నుఁ బ్రోవుమురంగా

10. భవనుతభవహరధీరా
నవవికచాంభోజనేత్ర నారదగాత్ర
నవరత్నమయవిభూషణ
శివకరదయజూడవయ్య శ్రీహరిరంగా

11. గతిలేనివారికెల్లను
గతినీవేయనుచువింటిఁ గాంచనచేలా
పతితుఁడననుపాలింపవె
యతిజనపోషణమురారి హరిశ్రీరంగా

12. సకలచరాచరనాయక
యకలంకచరిత్ర సుందరాననయీశా
శుకశౌనకమునివందిత
వికఛంబుజనయన గావవే శ్రీరంగా

13. ఎన్నెన్నొవిధములనునిను
సన్నుతిసేసిననుబ్రోవ సమయముగాదా
పన్నగశయనరమేశా
వెన్నుడభవదూర వేదవేద్యారంగా

14. త్రిగుణాతీతనిరంజన
సుగుణాలయభక్తవరద సురుచిరభూషా
నగధరనేనీవాడను
తగునానిర్ధయతఁజూప ధరధరరంగా

15. అండజవాహనసురరిపు
ఖండనపరిపాలసుజన కలుషదళననా
దండమ్ములుగైకొనిననుఁ
గుండలిపతిశయయేలు కొనుమీరంగా

16. గోపాలభక్తవరదా
పాపభ్రసమీరధీర పరమదయాళో
నాపాలిదైవమనిమది
శ్రీపతినినువేడుకొందుఁ జిన్మయరంగా

17. కరిమకరిచేతజిక్కియు
పరిపరివిధములనిన్ను ప్రార్ధించినయా
కరివైరిఁదృంచిదయతో
కరిఁగాచితిపరమపురుష కావవెరంగా

18. క్రూరుఁడు దుర్యోధనుఁడా
నారీమణిద్రుపదుపుత్రి నవమానింపన్
చీరలొసంగియుబ్రోచిన
వారిదనిభగాత్ర భక్తవత్సలరంగా

19. ఎందరినోగాచినావఁట
సుందరవదనారవింద శుభకరహరినా
యందుదయరాదదెందుకొ
మందరధరమదనజనక మాధవరంగా

20. రారాననుబ్రోవసుకు
మారారణశూరభక్త మందారనిరా
ధారాశ్రీదామోదర
ఘోరాఘవిదూరధీర కొమలరంగా

21. సర్వవ్యాపకుడంచును
సర్వేశ్వరుఁడనుచుసర్వ సముఁడవనుచునిన్
బర్వేందువదననమ్మితి
సర్వజ్ఞుఁడమనుపవయ్య సదయారంగా

22. నినుమించినదైవంబును
ననుమించినదీనుడవని నరయగలేఁడో
మునిజనమానసనిలయా
కనకాద్రిసమానధీర కవినుతరంగా

23. నారాయణనారాయణ
నారాయణయనుచుఁబ్రీతి నందనుఁజీరన్
గ్రూరునజామీళునిదయ
నారసిరక్షించితౌర నరహరిరంగా

24. హరిరామకృష్ణయనుచును
నిరతముజపియించువారి నిఖిలాఘములన్
హరియింతువనుచువినినే
గురుతుగనిమదలతుబ్రోవు గురువరరంగా

25. బంగరుచీరధరించిన
శృంగారశరీరభక్త సులభరమేశా
గంగాధరవందితపద
సంగరహితబ్రోవనిదియె సమయమురంగా

26. వనరుహసంభవుఁడైనను
వనజారిధరుండునైన వాసవుఁడైనన్
గననేరనినీమహిమలఁ
గొనియాడఁగనెంతవాఁడ గుణనిధిరంగా

27. సూరిజన వనధిసోమా
తారకనామాభిరామ దైవలలామా
యేరీతిననుఁబ్రోతువొ
భూరిగుణస్తోమధామ భుదనుతరంగా

28. సంసారాంబుధిఁద్రోయక
కంసాసురహరణనన్నుఁ గడతేర్పుమయా
హంసవిహారార్చితయిన
వంశాంబుధిసోమబుధనివాసకరంగా

29.నిన్నుభజించినవారికి
సున్నగదాయమునుబాధ సుందరరూపా
యెన్నడునీదయగల్గునొ
పన్నగరాడ్తల్పపరమ పావనరంగా

30. సతతమునినుఁగడూభక్తిని
మతిమాలినగానినన్నుఁ బాలింపనుస
మ్మతిలేదదేవవేరే
గతియెరుఁగనుసకలలోక కారణరంగా

31. కేశవపశుపతిసేవిత
నాశరహితవిశ్వరుప నతజనలోల
యీశామునిజీవనపర
మేశాననువేరుసేయనేలారంగా

32. కలిబృందతిమిరభాస్కర
నలినాక్షఖగేంద్రగమన నగరాడ్ ధీరా
బలవీరదైత్యమదహర
చలమేలరజలజనాభ సదయారంగా

33. ఖండితసురరిపుబృందా
పండితజనగేయపతితపావన రామా
భండనభీమావరవే
దండావనవరదనన్ను దయగనురంగా

34. ముచుకుందవరదనగధర
సచరాచరహృదయభక్త సన్నుతచరణా
యచలాత్మకననుఁబ్రోవర
యచలాత్మజనాధవినుత హరిశ్రీరంగా

35. ఏరీతిననుఁబ్రోతువొ
గౌరీపతివినుతపాప ఖండనదేవా
కారణభువనచతుర్దశ
హారానవరత్నభూష యచ్యుతరంగా

36. మారశతకోతిరూపా
తారేశదినేశనయన తారకరామా
నీరధిగభీరగరుడవి
హారాకైవల్యమీర హరనుతరంగా

37. మందారభక్తజనగణ
బృందారకవంద్యదీన పోషణహరిగో
విందాయభయమొసంగుము
వందితచరణారవింద వరదారంగా

38. సుందరముఖుపదపద్ముని
నిందీవరనయనువిష్ణు నీశురమేశున్
బంధవిమోచనునినునా
నందంబునదలఁతుఁగొల్తు నతభవరంగా

39. గిరిధరకరివరపాలా
పరిజనసంతోషకౌస్తు భాలంకారా
సిరినెదనిడుకొనుదేవా
హరినాచెయివదలకయ్య యతినుతరంగా

40. జైవాతృకమానసముని
సేవితపదయుగళసుజన జీవనభరణా
తావకమృదుపదభక్తియు
సేవయుదయసేయవయ్య శ్రీకరరంగా

41. తాపత్రయములబాపియుఁ
గాపాడుముకుజనదూర కామితఫలదా
శ్రీపతిజిర్జరవందిత
యాపద్భాధవచరాచరాత్మకరంగా

42. నీకేమిభారమాననుఁ
జేకొనిరక్షించుటకును శ్రీరమణీశా
రాకాసుధాకరానన
నాకాధిపవినుతలోక నాయకరంగా

43. ఆలింపుమునామనవిని
పాలింపుమునన్నువికచ పద్మదళాక్షా
దూలింపుముమఘచయమ్మును
శీలాశ్రీలక్ష్మిలోల చిన్మయరంగా

44. శరణుభవాంబుధితరణా
శరణుఖగేంద్రారిశయన శ్రాతవహరణా
శరణునీరీహనిరంజన
శరణమురా నకముకుంద శరణమురంగా

45. దండముధరణీనాయక
దండమురవికోటితేజ దండమునృహరీ
దండముపీతాంబరధర
దందముగైకొనుముమోక్షదాయకరంగా

46. దరిదాపునీవుయనుచును
నిరతముమదినమ్మినాఁడ నిర్మలచరితా
స్మరకోటిరూపదయతోఁ
బరిమార్పుమునాదుభవము భయహరరంగా

47. సుజనమయూరపయోధర
భుజగశయనభద్రచరణ భూమీశహరీ
విజితమదాసురశ్రీధర
భజియించెదనాదునఘము బాపుమురంగా

48. శ్రీనాధామధుసూధన
దీనజనత్రాణభానుతేజ సుధీరా
గానప్రియమంగళకర
మానకనినుదలతునునన్ను మనుపుమురంగా

49. బాలేందువదనత్రిజగ
త్పాలాభక్తానుకూల భవనిర్మూలా
మూలాసకలచరాచర
నీలాంబుదదేహసుగతి నీయవెరంగా

50. శరణాగతరక్షకుఁడని
బిరుదునువహియించినన్ను ప్రీతినిబ్రోవన్
కరుణయొకింతయు లేదా
మురదానవహరణపాపమోచనరంగా

51. ధరనేజన్మముగలిగిన
పరిపరివిధములనుదుఃఖపాత్రుడనైనన్
మరువకనినుస్మరియించెడి
గురుతరభాగ్యంబునీవె కోవిదరంగా

52. జన్మములెన్నిగతించెనొ
జన్మములికనెన్నిగలవొ జలనిధిశయనా
జన్మవినాశనననుదయ
జన్మరహితుఁజేయవయ్య సద్గుణరంగా

53. ఏవిధమునననుబ్రోతువొ
సేవితపురవైరిజన జీవనశౌరీ
భావజజనకమురారీ
నీవేగతికుధరధారి నిర్మలరంగా

54. చంచలమగునామనసును
పంచబాణజనకనీదు పదయుగ్మముపై
నుంచవెననుపాలించవె
యంచితమౌనీంద్రవినుత హరిశ్రీరంగా

55. హరిమృగములబొరిగొనుక్రియ
హరియింపుమునాధునఘము హరికరివరదా
హరిహయవందితపదయుగ
హరిశశధరనయన సుందరాననరంగా

56. నీదయగల్గిననాకే
భాధయులేదయ్యవికచ పంకజనయన
సాధుహృదాంబుజదినకర
భూధవసురవినుతభక్త పూజితరంగా

57. విశ్వాతీతపరాత్పర
విశ్వేశ్వరవిశ్వరూప విశ్వాధారా
విశ్వమయవిశ్వరక్షణ
విశ్వంభరనన్నుఁబ్రోవవేశ్రీరంగా

58. కష్టములెగల్గఁజేతువొ
కష్టములనుబాపినన్ను కడతేర్తువొనీ
యిష్టముఎటుసేసినసరె
శిష్టజనాధారమౌని సేవితరంగా

59. అపరాధసహస్త్రములను
కృపతోమన్నింపవయ్య గీర్వాణనుతా
తపనసమశుభశరీరా
కపటాసురమదవిభంగ కలిహరరంగా

60. మీనంబైసోమకుఁడను
దానవుఁబరిమార్చియలవి ధాతకుశ్రుతులన్
దీనావనయొసగితివట
మానకననుగావవయ్య మాధవరంగా

61. కమఠంబైగిరిదాల్చియు
నమరులకమృతంబునొసఁగినట్టి ఘనుఁడయో
కమలాలయమణిభూషణ
కమలదళాయతసునేత్ర గావవెరంగా

62. కిటియైకనకాక్షుండను
కుటిలాసురుఁజంపిసురలు కొనియాడంగా
పటుతరముగధరనిల్పిన
వటపత్రశయానబ్రోవవయ్యారంగా

63. సురరిపుహిరణ్యకశిపుని
బరిమార్చియుభక్తుఁడైన ప్రహ్లాదునిస
ద్వరముల నొసంగికాచిన
నరహరినాదిక్కునీవె నగధరరంగా

64. ఇలమూడడుగులు గైకొని
బలి దైత్యునిబలిమినడచి పాకారికిభూ
తలమొసగినవామననా
కలుషములనుబాపులోక కారణరంగా

65. ధరనిరువదియొకమారులు
వరఘనపరశువుధరించి వసుధాధిపులన్
నురుమాడినమధుసూధన
పురహరనుతననుబిరాన బ్రోవుమురంగా

66. దశరధవరతనయుఁడవై
దశముఖుదునుమాడినట్టి ధరణీజేంద్రా
శశినిభవదనమురాంతక
పసివాఁడనుప్రాపునీవె భవహరరంగా

67. బలరామకృష్ణరూపుల
ఖలులైన ప్రలంబకంస ఘనదానవులన్
బొలియించినపురుషోత్తమ
కలినాశనవేగనన్ను గావుమురంగా

68. ధరపాషాండులద్రుంచను
వరబుద్ధుఁడవైనవరద వసుధానాధా
గిరిధరపరిజనపోషణ
త్వరగాననుగావరావె దైవమరంగా

69. కలికల్మషనాఁశనహరి
దొలగింపుమునాఁదుభవము తోయజనేత్రా
కలికావతారమెత్తగ
దలచితిధర్మంబునిలుప ధరపతిరంగా

70.పలలాశనకులనాశన
జలరుహదళనేత్రభద్రచారిత్రహరీ
జలజారివదనమాధవ
జలజాసనవినుతశరణు జయశ్రీరంగా

71. వనమాలికైటభారీ
వననిధిశయనాసురేంద్రవందితశౌరీ
నినునమ్మితిగిరిధారీ
ననుమఱచుటన్యాయమౌనె నరహరిరంగా

72. నీమాయవలనుజిక్కియు
పామరుడైచెడితినన్ను పాలింపవెయో
కోమలగాత్రనిరంజన
తామరసదళాయతాక్ష దండమురంగా

73. నమ్మితిపంకజనాభా
నమ్మితిపూర్ణేందువదన నందకుమారా
నమ్మితిరక్షకుఁడనివా
నమ్మికయెటులౌనొ భక్తనందనరంగా

74. భక్తిజ్ఞానవైరాగ్యము
భక్తావనయొసగవయ్య పరమపవిత్రా
ముక్తిదమునిజననిలయా
నక్తంచరహరణపాప నాశనరంగా

75. శరణనివేడినశత్రుల
కరుణించిననీకునన్నుఁ గావఁగబరువా
పరువేమైననుచెడునా
సరివారలదక్కువౌన సదయుడరంగా

76. దుర్గుణములదొలగింపవె
నిర్గుణనిత్యస్వరూప నిర్మలతేజా
భర్గనుతభద్రనిలయా
స్వర్గేశార్చితముకుంద జయహరిరంగా

77. జేజేజగదభిరామా
జేజేవరసుగుణధామ జేరణభీమా
జేజేతారకనామా
జేజేమాంపాహిదేవ జేజేరంగా

78. దరిదాపునీవెయనినీ
దరిజేరితినన్నువిడువ దగునావరదా
హరినారాయణమాధవ
గురువులగురువైన యాదిగురువరరంగా

79. రావాననుదరిజేర్చవ
దేవాదేవాదిదేవ దీనదయాళో
భావాతీతజనార్ధన
భూవల్లభకృష్ణసుజన పోషకరంగా

80. నీకృపగల్గినయప్పుడె
లోకములన్నియునుచేతి లోనివిగదయో
పాకారివినుతకేశవ
నీకరుణనుజూపవయ్య నిరుపమరంగా

81. నినుభజియించుటకంటెను
ఘనపదవులుగలవెయరయ కాంచనచేలా
నినుభజియించెదదలచెద
ననునిర్దయజూడకయ్య నరహరిరంగా

82. హీనులచేతనునన్నవ
మానముగావింపనీకు మర్యాదగునా
దీనావనాఖ్యయెందుకు
నానాఘభుజంగగరుడ నగధరరంగా

83. ఘనుడైననీచుడైనను
నినుదలచకముక్తినంద నేరడుదేవా
దనుజకులాంతకశుభకర
వనజారిసహస్రవదన వరదారంగా

84. నినుగీర్తించెదమన్నను
నినుధ్యానించెదమటన్న నిముషంబైనన్
మనసొకచోటనునిలువదు
మునినుతనేనేమిసేతు మురహరిరంగా

85. భద్రముజలధరదేహా
భద్రముసౌందర్యరూప పరమపవిత్రా
భద్రమురిపుహరనీకును
భద్రముభద్రేభవరద భద్రమురంగా

86. సేవితబృందావననిను
సేవించెడిభక్తకోటి సేవకుడగుచున్
జీవనముగడుపుభాగ్యము
దేవారివినాశయొసగు దేవారంగా

87. కులహీనుడగుణహీనుడ
కలుషాత్ముడనన్నునెటుల కడతేర్చెదవో
జలజాక్షనిన్నెనమ్మితి
జలజాప్తశతప్రకాశ జయజయరంగా

88. పురుషోత్తమగోవిందా
పురుహూతనుతాబ్జపాద భోగిశయనశ్రీ
నరసింహవాసుదేవా
కరివరదాగావవయ్య ఘనగుణరంగా

89. ధ్రువునకుధ్రువపదమిచ్చిన
ధ్రువరూపయనంతవిగత దోషరమేశా
నవవికచకమలలోచన
తవపదభక్తీవెయిష్టదాయకరంగా

90. కందర్పజనకనీవీ
కందునిదయజూడవేమి కారణమౌనా
యందేమినేరమున్నను
మందరభరమాన్పిగావు మయ్యారంగా

91. పిడికెండటుకులనిచ్చిన
కడుముదముననారగించి ఘనసంపదలన్
వడిగఁగుచేలునికిచ్చితి
తడవేటికినన్నుబ్రోవ దయగనురంగా

92. ఎంగిలిపండులనిచ్చిన
మంగళమనిశబరిఁబ్రీతి మనిచినరామా
బంగారుకొండవుగదవొక
వెంగలినింగరుణఁజూడవేరారంగా

93. స్ఖీరాబ్ధిశయనలోకా
ధారానవరత్నహార దానవదూరా
మారారివినుతశ్రీధర
రారాననుబ్రోవవేగ రాఘవరంగా

94. ననుమఱచిననినుమఱువను
ననువిడచిననిన్నువిడువ నతసురబృందా
ననుదలఁపకున్నభక్తిని
నినుదలఁచెదసేవజేతు నిక్కమురంగా

95. తల్లియుదండ్రియునీవే
నల్లనిదొరగురుడునీవె నాధుడునీవే
ఫుల్లాబ్జనయనదైవం
బెల్లనునీవనుచుమదిని నెంచితిరంగా

96. కరిద్రౌపతిబిలువఁగనే
పరుగుననేతెంచివారి పాలించినయా
కరుణయిపుడెందుదాగెను
త్వరననుదయజూడుశత్రుతాపనరంగా

97. దేహేంద్రియప్రాణములను
శ్రీహరినీకర్పణంబు చేసితినయ్యా
పాహిముకుందమురారీ
మోహరహితభక్తబంధ మోక్షణరంగా

98. నీమూర్తియందేచూపులు
నీముక్తిదకధల చెవులు నీపైఁదలఁపుల్
నీమ్రోలమ్రొక్కుశిరమును
నీమంగళకృతులుగేలనీయవెరంగా

99. కోరితికడతేర్చెదవని
కోరితినినుమదినిభక్తి కోమలగాత్రా
కోరనునిన్నువినానా
కోరికయేమౌనొవినుతకుంజరరంగా

100. అడిగితినాఘనపదవుల
యడిగితినాభోగభాగ్య మైశ్వర్యమ్ముల్
అడిగితినాయేమైనను
అడిగితినీపాదసేవ యద్వయరంగా

101. పలికించినట్లుపలికితి
పలుకనునాయిష్టముగను పంకజనాభా
పలుకులలాభమునీదే
పలుకులలోభంబునీదె భవహరరంగా

102. నాకవితజదివిచూచియు
లోకులుహాస్యంబుసేయ లోకారాఢ్యా
నీకీర్తియె చెడుకొఱతయు
నాకేమియులేదుపాపనాశనరంగా

103. రవిశశియునుండువరకును
భువినాకవితనునిల్పి పోషింపుమయా
రవికోటితేజశ్రీధర
నవపద్మదళాక్షదేవ నరహరిరంగా

104. ధరబ్రాహ్మణపురివాసా
సురుచిరనవరత్నభూషా సుందరవేషా
వరమునిజనసంతోషా
కరుణింపుముమృదుసుభాష కలిహరరంగా

105. మంగళముపరమపురుషా
మంగళముభవాబ్ధితరణ మంగళముహరీ
మంగళము భక్తనిలయా
మంగళమిదెనీకువరద మాధవరంగా

106. లాలిజనార్ధనకృష్ణా
లాలియనంతాదిదేవ లాలిముకుందా
లాలినిరంజననిర్గుణ
లాలిహరీభక్తవత్సలాశ్రీరంగా

107. జోజోలోకశరణ్యా
జోజోశతపత్రనయన జోజోనృహరీ
జోజోనిలింపరక్షణ
జోజోననుగావునీకు జోజోరంగా

108. హెచ్చరికనీకుశివకర
హెచ్చరికయనంతరూప హిమకరవదనా
హెచ్చరికముక్తిదాయక
హెచ్చరికగుగాకనీకు యీశారంగా

109. మేల్కొనుముమ్రొక్కెదనునిను
మేల్కొనుమునినున్ భజింతు మేల్కొనుదేవా
మేల్కొనుముసేవచేసెద
మేల్కొనుముహరాదివినుత మేల్కొనురంగా

110. గోపాలగురునిశిష్యుడ
నాపేరెరిగింతునయ్య నారాయణుడన్
నీపయిజెప్పితిశతకము
శ్రీపతిగైకొమ్ముదేవ శ్రీహరిరంగా

111. ఈరంగశతకమెవ్వరు
కోరిపఠించిననువినిన కోరినవరముల్
నారాయణయిమ్మనినిను
కోరిభజించితినిశరణు గురువరరంగా

ఓంతత్సత్
శ్రీరంగనాధపరబ్రహ్మేంద్రార్పణమస్తు
శ్రీమద్దిగవింటి నారాయణదాస
విరచిత
శ్రీరంగశతకము
సంపూర్ణము
శ్రీ

No comments:

Post a Comment