Friday, October 17, 2014

కృష్ణశతకము - కపిల కృష్ణశర్మ (కర్మశ్రీ)

కృష్ణశతకము
                                      కపిల కృష్ణశర్మ (కర్మశ్రీ)
(కందపద్యశతకము)

1. శ్రీకర! మునిమానసమో
దాకర! జితనీలనీరదశ్యామా! ల
క్ష్మీకాంతా హృద్రమ్య
శ్రీకైరవకైరవాప్త! జేజేకృష్ణా!

2. భువి జక్రవరపు వంశో
ద్భవు శాస్త్ర నిగమ పురాణ పారంగతునిన్
కవివరగురువేంకటరా
య, విబుధవర్యు గొలుతు ననయంబును కృష్ణా!

3. వాణిని శాస్త్రనిగమచయ
పాణినిఁ బద్మజురమణిని ప్రాకట సుగుణ
శ్రేణిని పన్నగసన్నిభ
వేణిని మృదుపలుకు లొసఁగ వేడెదు కృష్ణా!

4. అసదృశ కవితా సృష్టులు
పస నొనరించియు వెలుంగు భాసురకవిలో
క సుధాకరులకు మ్రొక్కి, స
రసత శతకమును రచింతు రాధాకృష్ణా!

5. అదీది యనగను కుదరని
మదినొక నలత జలఁగి యరమరకలు వెట్టన్
బెదరియు నుపశమనమునకు
మది యలరఁగ నిది నుడివెద మాధవకృష్ణా!

6. పాదోద్భవ గంగాఝరి
మోదముతో శిరమునందుఁ బూనుటగాదే
సాదృశహీనమహామహి
మా దారియగుచు వెలుఁగు నుమాపతి కృష్ణా!

7. సతి సుతహిత జనజలచర
యుతమగు సంసార పంకిలోదధిగడువన్
తతనీసంస్మృతి నౌకా
ప్రతిపత్తియు లేక మాకు వశమే కృష్ణా!

8. వైష్ణవమాయాగుణ వ
ర్థుష్ణుత జాటఁగ నుమాపతిన్ఘన మాయా
నిష్ణాతు న్మోహినివై
దృష్ణత బాపవె విలాస ధుర్యతఁ కృష్ణా!

9. సిరిగల రోజులలోనన్
హరినామ స్మరణ గల్గ దద్ది హరించన్
దరిఁ జేరంజూతురు గద
మరి దీనజనావనాఖ్య మహిమది కృష్ణా!

10. నిరతము నిశ్చల భక్తిని
బరగుచు భవబంధ విదళపరిధవయుతమౌ
హరి పాదాంభోజాతత
స్మరణాసక్తుఁడగు వాడె మాన్యుఁడు కృష్ణా!

11. గోవు లుపనిషత్తు లరయ
నీ విల దోగ్ధవు కిరీటియే దూడ మహా
పావనగీతయు దుగ్ధము
ద్రావిన మోహమడఁగునట ద్రావెద కృష్ణా!

12. దేహము నిత్యముగాదని
యూహల నెఱిఁగియు గణింప నోపముగాదే
మోహానహవివశులమయి
శ్రీహరి పాదారవింద చింతన కృష్ణా!

13. విను మర్పణము బ్రహ్మము
అనలము బ్రహ్మము, హవిస్సునది బ్రహ్మమగున్
ఘనతర ఫలమది బ్రహ్మము
యొనరించెడివాడు బ్రహ్మయననగు కృష్ణా!

14. సర్వము బ్రహ్మమయంబగు
నుర్విని కర్మమున బ్రహ్మయూహాయునున్నన్
దుర్విషయ విముఖుఁడైనను
నుర్వర బ్రహ్మపద భాగ్యమొందును కృష్ణా!

15. భవదీయాకృతి భయ, భ
క్తి, విధేయత లలర నిలిపి స్థిరముగ మదిలో
భవ పాశంబులు ద్రెళ్ళగ
సవినయమున సన్నుతింతు సతతము కృష్ణా!

16. జ్ఞామికి సర్వము బ్రహ్మము
తానొనరించెడి పనులును తత్ప్రీతికినై
మానుగ బొందెడు ఫలమును
తాకినంత మెచ్చు నెపుడు దానికె కృష్ణా!

17. కాలము గడుపఁగ కర్మము
లోలి నటించు ఫలరక్తి నొడఁబడఁ డెపుడున్
మేలును గీడును బొందం
జాలక పరమున కలియును జ్ఞానియు కృష్ణా!

18. ఈ మఖమును జేయుదు నే
నీ మఖఫలముగ గనుదు ననేక సుఖములన్
కామిత భోగముల మరఁగ
తామది నెంచును జడమతి తప్పక కృష్ణా!

19. జీవునిగ వెలుఁగువాఁడును
దైవాంశమునై శరీరధరుఁడై యలరున్
"జీవోదేవ సనాత"
భావము గ్రాహ్యము గదర శుభంకర కృష్ణా!

20. ఆత్మలకును వెలియునయి స
ర్వాత్మలకు వెలుఁగుటఁజేసి ప్రాభసమున భూ
తాత్ముంద నగుట నిల బర
మాత్ముఁడనుచు విభుదవర్యు లాడరె కృష్ణా!

21. లీలఁగ మాయాశక్తిని
గ్రాలుచు చిన్మయ స్వరూపకలితుఁడ వగుచున్
నేలను నింగిని నన్నిఁట
డాలియు నుంటివి పొగడవశమె నిను కృష్ణా!

22. పదునాలుగు భువనంబుల
నుదరమునిడి దేవకీసతి యుదరములోనన్
కుదిరితి వెట్లొకొ దాననె
కుదురును చిద్రూపుఁడనుచు గొలువంగ కృష్ణా!

23. ద్యోతకమయ్యెడు తత్త్రయ
జ్యోతుల కవ్వల వెలిఁగెడు జ్యోతివగు బరం
జ్యోతివి తేజోధారివి
జ్యోతిర్మయ రూపివిగద శుభఁకర కృష్ణా!

24. చూచుట సులభము మదిలోఁ
జూచుట నేర్చిన నయినను జూచుటకేలా
దోచుట తనుదానే లోఁ
జూచుటయే చూచుటకద చోద్యము కృష్ణా!

25. విలువైనది విజ్ఞానము
సులువైనది కాదుకాని చోద్యము నరజ
న్మలకే యధికారంబును
గలదు తెలియ తెలియఁగవలె ఘనముగ కృష్ణా!

26. ఏ తెలివిని తెలిసిన నిఁక
నే తరిఁ దెల్యనగు దెలివి యిల మిగిలియు పో
దా తెలివిని తెలిసికొనుట
యే తెలివియని యెలియవలె నెదలో కృష్ణా!

27. తగువారల వేడినపని
యగుఁగా నందరిని జూచి యాచించుటయున్
తగునే సర్వాధిపతివి
యగుటను నిన్నే నుతింతు నరయము కృష్ణా!

28. దారులు వేరగు గమ్యము
నారయ నొక్కటె కనుగొన నభిమత గతులన్
జేరుదు రవ్వియ మతముల
దారులు దోచిన విధముగ దప్పెటు కృష్ణా!

29. కోయిల చేరని వనమును
ధీయుతులుండని సభ కవిధీరులు నరుదౌ
నాయూరును ధరన్యాయము
జేయని దొర, పురి దగదు వసింపఁగ కృష్ణా!

30. సరసత నెఱుఁగని సానియు
వరవాక్చాతురిమలేని పండిత జనుడున్
పరితుష్టుల జేయని కవి
వరుఁడును రాణించరుగద! వసుధను కృష్ణా!

31. ధనమును విద్యయు గలుఁగని
మనుజుని స్వజనులుగూడ మన్నింపరుగా
ఘన విషదంష్ట్రలు వడిఁ బెర
కిన పన్నగ లక్ష్యమేమి? కేశవకృష్ణా!

32. అతి గర్విని గణియింపక
సతిని బ్రక్కను పరుండ సమ్మతినీకే
కితునకు బలుకకయుండుట
యె తగిన శిక్షలు ముకుంద యీశ్వర కృష్ణా!

33. అతివాచాలత గూడదు
సతము ముభావమున నుండు సత్పురుషు భయా
న్వితుగ దలంచును లోకము
తత నిజము గ్రహింపలేమి తథ్యము కృష్ణా!

34. పరులకు మిక్కిలి నీతులు
గరపుట కడుతేలికయె ప్రకటముగ తానా
చరణం జూపుట కష్టము
కరుభయహర! శ్రితభవహర! కారణకృష్ణా!

35. అల కాళీయుని శిరమున
పలువిధముల నాట్యభినయ పావన పాదం
బులు మదిఁబాయక గొల్చెద
నిల భవబంధము లుడుగఁగ నెంచియు కృష్ణా!

36. హరిహర రూప విభేదము
నరయగ లేదని నెఱిఁగియు స్వాంతములోనన్
హరుఁడన నభిమానంబిల
నురవగు నదియేమి చిత్రమోకద కృష్ణా!

37. వినుమ నిరువుర సమముగ
మానసమున దలతుగాన మానక నిన్నున్
నేనోపినటుఁల బొగడుదు
మానుగ గ్రహియించవయ్య మాధవ కృష్ణా!

38. కలలోఁ బొడఁగని శతకముఁ
బలికించుట నరయ నీకు భక్తుల పాలన్
వలమాలిన ప్రేమయనుచుఁ
దలఁపగ వచ్చును మనమునఁ దప్పక కృష్ణా!

39. జనకుని మ్రొక్కగ సిగ్గిలు
తనయుఁడు నడివీధినిబడి తడబడు సానిన్
జనకూటమిఁ జేర వెఱపుఁ
గను పిఱికియుఁ బైకిరారు గదరా కృష్ణా!

40. పరుల ధనమ్మును గుడుచుచు
దొర నీయూరికి నటంచు దుందుడుకొప్పన్
చరియింతురు కొందఱు మరి
సరుకుండని యాకెగిరెడి సంగతి కేష్ణా!

41. ముదమున మెలఁగెడు భార్యయు
నెదురు బలుకుచు నిరసించు నే సోదరియున్
కుదురుగ పాలీనొల్లని
మొదవు నవశ్యము విడుచుట బోలును కృష్ణా

42. కుస్ఖిం గోసియు గాంచిన
నక్షరముండదు మరేల నన్నిఁట నేనే
దక్షుఁడనంచాడు తులువ
నీక్షితి నెటు మందలింతువీవో కృష్ణా

43. పిలిచినతోడనె పలికిన
తొలఁగును దొర ఠీవి యనచు దోర్గర్వమిలన్
అలరఁగ పరధ్యానంబున
మెలఁగెడు మందమతులుండ్రి మేదిని కృష్ణా

44. తెలసినవాఁడైనను మరిఁ
తెలియనివాఁడైన బ్రతుకు తెరువులు దెలియున్
తెలిసియు తెలియని మూఢుఁడు
తెలియక మిడిసిపడుచుండు తేలఁడు కృష్ణా

45. గిల్లలు బెరకిన కుక్కను
పిల్లలతోడనవసించు బెబ్బులిని యిలన్
జిల్లర తిరుగుడు మరగిన
పిల్లను నమ్మదగదు రిపుభీకర కృష్ణా

46. జ్ఞానవిహీనుఁడె ధారుణి
దీనుఁడు ధన భోగ భాగ్య దివ్యసుఖములన్
గానని వాఁడు దరిద్రుఁడు
గా నిల దీనుండుగాడు కదరా కృష్ణా

47. గోవింద కథా మధుర సు
ధావరధారానురక్తిఁ దవిలినవాఁడే
పావన చారిత్రుఁడు దీ
నావనభావన! ముకుంద! హరి! శ్రీకృష్ణా

48. చతురాంభోధిపరీతవ
సతి భూతల మెవ్వని నిజచరణత్రయమై
వృత్తమై వెలుఁగొందెడు న
య్యతుల మహిమయుతు భజింతు ననిశము కృష్ణా

49. పాలింపను లాలింప మొ
రాలింపంగా సమర్థుడాఢ్యుఁడ వీవే
పాలింపవె శరణంటిని
లాలింపవె యభమిచ్చి లలి శ్రీకృష్ణా

50. కోరను ధనధాన్యంబులు
జీరను ఘన భోగభాగ్య సిరిసంపదలన్
గోరెద భవబంధముల
జీఱెడి పదారవింద చింతన కృష్ణా

51. జలజాకర సలిలంబుల
దళలహరీఫేన బుద్భుదంబు లొదవి త
జ్జలమున కలియు గతిని ని
ర్మల సృష్టిని జీవులుండి మలఁగును కృష్ణా

52. శ్రీ రమణీ కుచ రంజిత
సార సుగంధ మృదులిత తుషార నిమగ్న
స్ఫారోదార విలాస ప్ర
కారా! శ్రితజన భయహర కారణ కృష్ణా

53. తారకము జటులతర స
సారవిదారకము సుజన సన్నుత ముని హృ
చ్చోరకము ముకుందు శుభా
కారముఁగోరి వినుతింతు హరి శ్రీకృష్ణా

54. పావన గీతా క్షీరము
ద్రావిన ధీరుఁడు కిరీటి ధన్యుఁడు సుమ్మీ
తావక తత్త్వము దెలిసిన
బోవును భవపాపపాశములుగద కృష్ణా

55. నందయశోదల నయనా
నందకర! మునిజన హృద్వనజమోదకరా!
సుందర విగ్రహ! హరి గో
వింద! ముకుంద! వినుత త్రివిక్రమ కృష్ణా

56. శ్రీధర! కేశవ! వామన!
మాధవ! శౌరి! పురుషోత్తమ! హరి! వృషీ కే
శాధోక్షజ! మధుసూధన!
సాధుజనావన! మునిజనసన్నుత కృష్ణా

57. శ్రీసతి పాదములొత్తఁగ
భాసుర కాంతులను కౌస్తుభమణి వెలయ నా
భీ సరసీజంబున విధి
యాసీనుఁడ ననురాగమున నలరదె కృష్ణా

58. దయ్యము దయ్యమనంగా
నెయ్యెడ వేరుం గలుగునె యింటిని దుయ్యం
గయ్యాళి సతియ కదరా
దయ్యము సుజనవినుతోన్నత చరణ! కృష్ణా

59. బాలుఁడ నీతులు జెప్పఁగ
జాలనుగాన వచియింతు శైశవ కేళీ
జాలము కరుణించియు నన్
పాలన జేయుము శ్రితజన బాంధవ కృష్ణా

60. నేలను తినుటయు నేలన
నేలయె నాలోన నుండు నేలనె గుడుతున్
జాల విఁకేమని నోటను
నేలను జూపితె జననికి నెమ్మది కృష్ణా

61. మాయలపుట్టగు దిట్టను
మాయను గ్రమ్మఁగ బశులను మరి కాపరులన్
మాయము జేసిన ధాతయె
మాయంబడిపోడె మున్ను మాధవ కృష్ణా

62. ప్రేమార!ం బిలువఁ బంపిన
మామను దరిఁజేరి చీరి మడియఁగఁ గొట్ట
న్నేమాత్రము ధర్మంబగు
దామోదర! నీరజాక్ష! దయంగను కృష్ణా

63. వృక్షమ్ములు రెంటికి నిజ
వక్ష స్థలి మోపిడి చిరుపాపని లీలన్
దక్షతఁ ద్రోసిన ఫెళఫెళ
నీక్షితి వ్రాలవె! మును జగదీశ్వర కృష్ణా

64. నీవెటు సేసిన లీలలు
మావిలఁ బిచ్చి పనులౌను మాకున్ నీకున్
ఈవైరుధ్య మదేమిటి?
పావనచరణా! శ్రితజన భయహర కృష్ణా

65. ఓంకారమయ స్వరూపా!
శంకర వనజోద్భవముఖసన్నుతభావా
పంకజనాభా! ప్రధిత శు
భంకరనామా! శ్రితజన బాంధవ కృష్ణా

66. జలకం బాడఁగబోవ
న్నల యక్రూరుని కరయుగ్మమందు ననతి కృపా
కలిత స్వాంతుడవై లీ
లల దర్శన మోవె కృప చెలంగఁగ కృష్ణా

67. ఈరేడు జగము లేలెడి
సారగుణు సుతునిగఁ బొదవి సాకెనన యశో
దారమణి సుకృత మెన్నఁగ
నేరుదుమే చిశ్వనాధ! నిర్గుణ కృష్ణా!

68. బొడ్డునఁగల నలుమోముల
బిడ్డకు సృష్టి విధమెల్ల వేళలఁ దెలిపే
దొడ్డవు వేడుక బుట్టెనె
బిడ్డగఁ బెరుగంగ గొల్లవీటిని కృష్ణా

69. వెన్నయు మీగడ పెరుగును
నెన్నఁగ పాలును గుడువఁగ నిత్తరి మనసై
యున్నదె హా! కాలబలిమి
నిన్నును బంధించు నొక్కొ నిచ్చలు కృష్ణా

70. పాలను ద్రావుమటంచును
చాలఁగ పాలిచ్చు రాక్షస యువతి నపుడున్
లీలగ పాలను నిజ ప్రా
ణాలను బీల్చితివఁట తగునా హరి శ్రీకృష్ణా

71. ధనమది మిక్కిలి గూర్చిన
జనునాడావంతయు వెనుజని వచ్చునె? క
న్గొనఁ గేవలమది జంజా
టన సప్ప మరేమి ప్రస్ఫుటంబుగ కృష్ణా

72. ధనమార్జన సేసెడివే
ళను నాకసలు మరణము హుళక్కి యటంచున్
ఘన దానధర్మముల వే
ళను రేపే జత్తునని దలఁపవలె కృష్ణా

73. పరకాంతల దల్లులవలె
నరయవలె నటంద్రు గోపికాంగనలను నె
ట్లరసితి వీవు జుజము నుడు
వరగోపాల! యవినీతిఁ బరగవె కృష్ణా

74. బాలుఁడవై నిఖిల భువన
పాలుఁడవై యిల యశోద భామిని సుకృతా
జాలుఁడవై రేపలి గో
పాలుఁడవై యలరు నిన్నుఁ బాడెదు కృష్ణా

75. ధైర్యము వీడక నిరతము
స్థైర్యంబున బురుషకార్య తత్పరుఁడైనన్
కార్యము దప్పక జరుగు న
వార్యంబగు దైవబలము బడనియు కృష్ణా

76. మానవ పూనిక మొదలే
లేనిచొ దైవంబెటుల ఫలించును మదిలో
దీనిని దలఁపక లేడని
జ్ఞానహీనత తలఁతురు సత్యము కృష్ణా

77. కర్తాకర్తవుగాఁగా
వర్తింతువు గాదె సత్యభామా గర్వ
స్ఫూర్తిని బాపఁగ నారద
మూర్తి నియంతగ నిలుపవె మురళీకృష్ణా

78. వారినివీరునిఁ బ్రోచిన
ధీరుఁడవంచును శరణు నుతించితి వడి న
న్జేరి గావకనున్నను
నేరను నీమహిమ నమ్మ నిజముగ కృష్ణా

79. తెగువఱకుఁ ద్రాడు బిగిం
చఁగఁ దగదు సుమా! ముకుంద! సత్వరముగ బ్రో
వఁగ చూడుము భక్తుని స
త్వగుణ విరాజిత గుణరహితా! హరికృష్ణా!

80. ఆరిషడ్వర్గమ జేయుము
ధర ముక్తిప్రద మహిత పదద్వయ నిజ సం
స్మరణ విడువఁగ నశక్యం
బిఱుకటమునఁబడితిని దయ నేలుము కృష్ణా

81. నాలుగు విధముల భక్తులు
జాలఁగ గొల్చెదరు నిన్ను జ్ఞానజిఘృక్షుల్
పాలిత కాములు నార్తులు
గా లలితజ్ఞులు వచింత్రు క్ష్మాతలి కృష్ణా

82. కామాతుర బుద్ధిని మే
మేమాలిన్యం బెఱుంగ మెన్నగ సత్వ
స్తోమం బుడిగిన దెలియు న
దేమో యాయగ బలుకుదు రిమ్మెయి కృష్ణా

83. పసఁ దెలియు బనులకు శివుని
యుసు కొల్పుచు పాలు బెరుగు లూరక గ్రోలన్
విసురుగ బోదువు మరతుమె
విసము గుడుచు సంఘటనను వీసము కృష్ణా

84. కన్నుల కాళుల చేతుల
నన్నుల మిన్న లిల సైగ లాడఁగ వనజో
త్పన్నునకైనను దెలియునె
కన్నెల చేష్టలు విచిత్రకరమగు కృష్ణా

85. దేహము శాశ్వత మంచును
మోహమునఁ దలంచెడివారు మూర్ఖులు ధరణిన్
దేహము బోవుట నెఱిఁగియు
మోహమున దపించువారు మూఢులు కృష్ణా

86. ఇతరము దలపక మదిలో
సతతము నిన్నే కొలిచెడి సత్పురుషునకున్
వితరణ లేకయె బంటుగ
నతని విడువక చరియింతు వటరా కృష్ణా

87. కోరిక లుడిగియు నాత్మన్
జేరిచి మనమును స్థిరముగ చింతన చేయ
న్నేరుచు సత్పూరుషుఁడే
యారయ నారూఢుఁడనగ నర్హుఁడు కృష్ణా

88. భేదములేకను సర్వము
నాది పురుషవరు స్వరూపమంచును మదిలో
మోదించెడి సమదర్శన
మేదుర భావము గలుగుట మేలగు కృష్ణా

89. అదుపాజ్ఞలు లేకను దా
జెదర దిరుగుమదిని విషయచింతల యెడలన్
గుదియించును నెమ్మది నె
మ్మది దైవపరంబు సలుప మలగును కృష్ణా

90. ఊపిరి వోయెడి వేళల
నోపము హరినామ చింత నొనరింపంగా
నా పరువంబున కిపుడే
నీపద సేవలు సలుపుదు నెమ్మది కృష్ణా

91. జలమున బడు లవణకణము
జలరూపము దాల్చుగతిని సర్వస్వము ని
శ్చల మనమున దైవార్పణ
మిలఁ జేసెడి వాడె భక్తిఁడెన్నగ కృష్ణా

92. నమ్మిక గావలె మును గ
ర్వమ్మది పోవలె పయి నరి వర్గము దొలగున్
నెమ్మది భక్తి గుదురు స
త్యమ్మిది తెలిసిన పురుషుఁడు ధన్యుఁడు కృష్ణా

93. తను తా నెఱిఁగియు క్రీడిం
చును మదిలో ముదమున మఱచును తనగతియున్
తనకే కోర్కెలు గలుగక
నివ నారూఢస్థితి నిల బరగును కృష్ణా

94. వేదంబులు శాస్త్రంబులు
దాదరి ముట్టఁ జదివియును తత్సారంబౌ
ఆదివిరాట్టు నెఱుఁగరు ప్ర
సాదమునన్ దిరుగు గరిట సంగతి కృష్ణా

95. పనిబడి యేగియు నచ్చో
టను జేరి తిరిగియు వచ్చుట మరచుగతి నే
లను జన్మము దాల్చితినని
మనమున నెంచడు బురుషుడు మాయగాక కృష్ణా

96. జ్ఞాన స్వరూపు డాతడు
ధ్యాననిదానుండ వీవు దద్దయు భక్తిం
బూని శివకేశవు లొకటి
గా నెఱిగినగాని శుద్ధిగాదుర కృష్ణా

97. దివ్యము భవ్యము మునిజన
సేవ్యము నిఖిల భువనతర శ్రేయోపద బా
ధవ్యము వనజోద్భవ శివ
స్తవ్యమగు శుభాకృతి మది దలచెదు కృష్ణా

98. విశ్వేశ్వరు, విశ్వాలయు
విశ్వేతరు, విశ్వలోలు, విశ్వాకారున్
విశ్వపతిని, విశ్వగతిని
విశ్వుని, ఘనవిశ్వమయుని వేడెదు కృష్ణా

99. కవితా మాధుర్య సుధా
నవధారలు దయనొసంగి నన్నిలబ్రోవన్
భవదీయాకృతి గొలిచెద
నపని గరుణగొని మొఱవిని నరయుము కృష్ణా

100. తత సత్కవితా ఘన ని
ర్మిత భవ్యచరిత్రలందు మేలగు స్థానాం
క్షత రవ్వంతయు లేదుర
క్షితి నీ నామస్మృతి నిటుజేసితి కృష్ణా

101. సృష్టి స్థితి లయకారణ
దుష్ట దురిత సంయుత భవ దుర్గతి హరణా
శిష్ట జన వినుత చరణా
స్రష్టా నిమిషేంద్ర వినుత శరణా కృష్ణా

ఇది శ్రీచక్రవరం వేంకటరామరాయ గురుకరుణాకటాక్ష
లబ్ధకవితా ధౌరేయ కాశ్యప సగోత్ర పవిత్ర కపిల
వంశాంబుధీ సుధాకర శ్రీకామేశ్వరసూర్య
నారాయణార్య ప్రియ మధ్యమ పుత్ర కృష్ణ
శర్మ నామధేయ ప్రణీత
శ్రీకృష్ణా శతకంబు
ఓం తత్ సత్

No comments:

Post a Comment