Tuesday, November 12, 2013

బెజవాడ కనకదుర్గాంబ శతకము - సరికొండ నరసింహరాజు

బెజవాడ కనకదుర్గాంబ శతకము
సరికొండ నరసింహరాజు
(కందపద్య శతకము)

1. శ్రీరమణీ వినుతాంబా
ఘోరదురితశైలశంబ గుణనికురంబా
నీరదవేణి విడంబా
నారీ బెజవాడ సత్కనక దుర్గాంబా

2. అంబరము జూచి వాజి సం
గంబొందు నటంచు శివదిగంబరివొయ్నీ
డంబము సరెనను శరజ
న్మాంబా! బెజవాడ కాళికాంబ! మదాంబా!

3. శంబర మొక్కటి కేలను
శంబరము శిరమునందు సరెసరెనే న
ర్ధంబిక నాయను శరజ
న్మాంబా! బెజవాడ కాళికాంబ! మదాంబా!

4. అంబుజములుదాల్చియు వా
డంబడునని యేరునిల్పు డమరుకధరయన్
చుంబతిగేరెటి శరజ
న్మాంబా! బెజవాడ కాళికాంబ! మదాంబా!

5. అంబిక నామది నీపా
దంబులపై యుండునటుల దయసేయ వేచి
........ శరజ
న్మాంబా! బెజవాడ కాళికాంబ! మదాంబా!

6. త్ర్యంబకమత ధూషుల నిశి
తాంబకములపాలుజేసి యఖిలసుర కదం
బంబుల నేలవె శరజ
న్మాంబా! బెజవాడ కాళికాంబ! మదాంబా!

7. అంబూకృత గీతసతీ
స్తంబవిజిత వాసినిన్ను సరసొక్తుల డెం
దంబున గొలిచెద శరజ
న్మాంబా! బెజవాడ కాళికాంబ! మదాంబా!

8. జంబూనది జంబూనద
జంబాలముగన్యజేసి చతురాస్యుడుని
న్సాంబునకిడడే శరజ
న్మాంబా! బెజవాడ కాళికాంబ! మదాంబా!

9. అంబికనీపద రాజీ
వంబులుభజించినాడ వడినాదుష్క
ర్మంబులు బాపవె శరజ
న్మాంబా! బెజవాడ కాళికాంబ! మదాంబా!

10. కంబంబున బొడమిన పీ
తాంబరధర తోడబుట్టి దయచేముల్లో
కంబులనేలవె శరజ
న్మాంబా! బెజవాడ కాళికాంబ! మదాంబా!

11. అంబుజ సంభవు వరగ
వంబున మహిషుండు నిను వడి మార్కొనిప్రా
ణంబులు విడవడె శరజ
న్మాంబా! బెజవాడ కాళికాంబ! మదాంబా!

12. జాంబవతి నీదుపద ప
ద్మంబులుమదినిల్పి విష్ణుదారామణియై
సంబర మొందదె శరజ
న్మాంబా! బెజవాడ కాళికాంబ! మదాంబా!

13. కంబుత్రి శులము గంతయు
శంబరమును కేలబూను సాంబశివునిదే
హంబున సగమౌ శరజ
న్మాంబా! బెజవాడ కాళికాంబ! మదాంబా!

14. లంబాలక నీదుకపో
లంబులు ముకురంబులనుచు లవిశంకరు స
చ్చుంబనల మెచ్చు శరజ
న్మాంబా! బెజవాడ కాళికాంబ! మదాంబా!

15. బింబాధరము చిల్కల
గుంబల్కులుకనులు మీండ్లుకుచములు కవలౌ
చుంబొదలియలర శరజ
న్మాంబా! బెజవాడ కాళికాంబ! మదాంబా!

16. నింబాళిచీరెగట్టి కు
సుంబాకంచుకము దొడగి సుందరమౌ వే
సంబులసుందరె శరజ
న్మాంబా! బెజవాడ కాళికాంబ! మదాంబా!

17. అంబికనీ మోముకు శశి
బింబంబెనగాక గగనవీధికి కనుప
క్షంబైన నోడె శరజ
న్మాంబా! బెజవాడ కాళికాంబ! మదాంబా!

18. అంబుదము నీదువేణి
కంబళమున కోడిగిరుల కానలబడి వా
దంబాడి గ్రక్కె శరజ
న్మాంబా! బెజవాడ కాళికాంబ! మదాంబా!

19. శంబరహర నితఖిలగిరి
శంబలసద్గుణ కదంబ శంబర నేత్రీ
బింబాధరివౌ శరజ
న్మాంబా! బెజవాడ కాళికాంబ! మదాంబా!

20. అంబక పంచకు డలను త్ర
యంబకు నెదిరించు పగిది ననృతులునిను హా
స్యంబాడి చెడరె శరజ
న్మాంబా! బెజవాడ కాళికాంబ! మదాంబా!

21. అంబరుహాప్త ప్రతి బిం
బంబనగా మెరయురత్న పతకమొసగునీ
లంబన మెన్నెద శరజ
న్మాంబా! బెజవాడ కాళికాంబ! మదాంబా!

22. అంబుజరుహ నేత్రిహర
చుంబిత బింబా ధరోష్టిశ్రుతిహితవాణీ
యంబుదవేణి శరజ
న్మాంబా! బెజవాడ కాళికాంబ! మదాంబా!

23. భంబులమించును నీదున
ఖంబులు పద్మములు నీదృగంబులు గద నీ
లాంబుద కచవౌ శరజ
న్మాంబా! బెజవాడ కాళికాంబ! మదాంబా!

24. తాంబూలీ సంభసం
భంబుల పోకలను ప్రజశుభంబుగనీ ధా
మంబుల నించరె శరజ
న్మాంబా! బెజవాడ కాళికాంబ! మదాంబా!

25. సాంబకరాలంబితకుచ
శంబరవైరినుత గౌరిసాథ్వీమణిరో
లంబసమాలక శరజ
న్మాంబా! బెజవాడ కాళికాంబ! మదాంబా!

26. జాంబూస దాంబరాభర
ణంబులు ధరియించి ప్రమథ నాధుని వామాం
కంబున మెరయవె శరజ
న్మాంబా! బెజవాడ కాళికాంబ! మదాంబా!

27. అంబరసమమధ్య మశశి
బింబసదృశముఖవిరాజి బింబాధరి కా
దంబగమన వర శరజ
న్మాంబా! బెజవాడ కాళికాంబ! మదాంబా!

28. పంబల తప్పెట్లమృదం
గంబుల రవములను నీదుగణములు ప్రతి గ్రా
మంబుల నెగడరె శరజ
న్మాంబా! బెజవాడ కాళికాంబ! మదాంబా!

29. తాంబూలంబులు గడుధూ
పంబులుగొని యుగ్రములను బ్రబలెగణములూ
ళ్లంబరికింపవె శరజ
న్మాంబా! బెజవాడ కాళికాంబ! మదాంబా!

30. తెంబలగా మేకల గొ
ర్లంబొరిగొని భక్తగణాము రక్షించిన నీ
సంబర మెంచెద శరజ
న్మాంబా! బెజవాడ కాళికాంబ! మదాంబా!

31. కంబుల పూరించుచు నృ
త్యంబుల చెలరేగి నీదయావేశులు కో
పంబున నెదడరె శరజ
న్మాంబా! బెజవాడ కాళికాంబ! మదాంబా!

32. అంబరకేశునితో వా
దంబాడిన దక్షునింట నడగియు హిమవం
తంబున బుట్టవె శరజ
న్మాంబా! బెజవాడ కాళికాంబ! మదాంబా!

33. లంబోదరు డెంతో మో
దంబున నినుగొల్వ ముదముదనరు పగిది క్షే
మంబొసగు మాకు శరజ
న్మాంబా! బెజవాడ కాళికాంబ! మదాంబా!

34. అంబనయుత సుగ్రీవా
జంబుక సంస్తూయనామ శాంభవి భవ్య
స్తంబజగదాంబ శరజ
న్మాంబా! బెజవాడ కాళికాంబ! మదాంబా!

35. తంబూర ఢక్కితాళర
వంబులతో నిన్నుబహుగావర్ణించిన మే
ల్సంబర మొందవె శరజ
న్మాంబా! బెజవాడ కాళికాంబ! మదాంబా!

36. అంబుజభవ శక్రాదులు
తుంబురునారదులతోడ తోతెంచిరి నీ
సంబరముజూడ శరజ
న్మాంబా! బెజవాడ కాళికాంబ! మదాంబా!

37. కంబళసమ కచసుప్రా
లంబగుణకదంబ భవ్యలీలానికురంబా
బింబాధరోష్టి శరజ
న్మాంబా! బెజవాడ కాళికాంబ! మదాంబా!

38. నంబులు తంబళులును భే
దంబులు లేకుండ నీసుధామములకు దం
డంబులు బెడుదురు శరజ
న్మాంబా! బెజవాడ కాళికాంబ! మదాంబా!

39. బింబితకర మౌనీరూ
పంబులు గాశిలల నేరుపరిదియు నటధూ
పంబుల నిడరే శరజ
న్మాంబా! బెజవాడ కాళికాంబ! మదాంబా!

40. బాంబూనద కృతకుంభజ
లంబులచేవారుబోసి లలనలు(?) నీ పా
దంబులబడరే శరజ
న్మాంబా! బెజవాడ కాళికాంబ! మదాంబా!

41. బొంబై కాశీపురదే
శంబులలో జనులయెదలు ఝల్లనగను నీ
డంబము జూపవె శరజ
న్మాంబా! బెజవాడ కాళికాంబ! మదాంబా!

42. డంబముగల మంత్రజ్ఞుల
దుంబాళా జేసి మాకుతో డైకడు మో
దంబున బ్రోవవె శరజ
న్మాంబా! బెజవాడ కాళికాంబ! మదాంబా!

43. కంబళి వాక్యంబులతో
పంబలు తప్పెట్లుమ్రోయ ప్రజలందరు నీ
గుంబము జేరరె శరజ
న్మాంబా! బెజవాడ కాళికాంబ! మదాంబా!

44. స్తంబేర మారినెక్కిజ
గంబులపై దాడివెడలి కరిడీజాడ్యా
డంబరముడుపవె శరజ
న్మాంబా! బెజవాడ కాళికాంబ! మదాంబా!

45. త్య్రంబక పరిరంభణమున
సంబరమును జెందుచిత్త సారసలహరీ
బింబాధరివౌ శరజ
న్మాంబా! బెజవాడ కాళికాంబ! మదాంబా!

46. శంబాకృతమగు భువిధా
న్యంబులు ఫలియించినటుల నంబికనీ మం
త్రంబున నెగడితి శరజ
న్మాంబా! బెజవాడ కాళికాంబ! మదాంబా!

47. స్తంబర మమునుకుంభీ
రంబొగి బాధించినట్లు రాపాడెటి లే
మింబొరిగొనవె శరజ
న్మాంబా! బెజవాడ కాళికాంబ! మదాంబా!

48. కంబీలం దింగలమిడి
రంబెముగను దీపమొసగి రాత్రులునీ మం
త్రంబులనుడువరె శరజ
న్మాంబా! బెజవాడ కాళికాంబ! మదాంబా!

49. జంబీర ఫలములను శు
భంబుగనీ ముందరునిచి ప్రజలందరు నృ
త్యంబులు జేయరె శరజ
న్మాంబా! బెజవాడ కాళికాంబ! మదాంబా!

50. చెంబులు మూతలుగాకల
శంబులనై వేద్యమునీచి జనములు సంతో
షంబుగ వచ్చెదరౌ శరజ
న్మాంబా! బెజవాడ కాళికాంబ! మదాంబా!

51. కంబములు నిల్పియిటికెల
గుంబంబులు గట్టినీదు కొలుపులు ప్రతిగ్రా
మంబులజేయరె శరజ
న్మాంబా! బెజవాడ కాళికాంబ! మదాంబా!

52. డంబము కృష్ణోత్తర శై
లంబుననివసించి భక్తులకు బహుసామ్రా
జ్యంబుల నివ్వవె శరజ
న్మాంబా! బెజవాడ కాళికాంబ! మదాంబా!

53. తంబళి నినుగొల్వగ మో
దంబున వేశ్యాజనంబు తాళగతులనా
ట్యంబాడిరిగద శరజ
న్మాంబా! బెజవాడ కాళికాంబ! మదాంబా!

54. జంబూఫలం బుక్రియను వి
షంబుగళంబందునిల్ప జాలుదువని ప్రే
మంబతిననుపవె శరజ
న్మాంబా! బెజవాడ కాళికాంబ! మదాంబా!

55. తాంబూరనాదమునుగా
త్రంబొక్కటి గాగబలుకు తాళజ్ఞులతో
సంబరమొందవె శరజ
న్మాంబా! బెజవాడ కాళికాంబ! మదాంబా!

56. అంబరము నొరయునీగుడి
కంబములందిడిన దీపకళికలునక్ష
త్రంబులనదగును శరజ
న్మాంబా! బెజవాడ కాళికాంబ! మదాంబా!

57. బింబంబని నీయధరో
ష్టంబుశుకంబాను నపుడుశంభుండుగని మో
దంబొందెనుగద శరజ
న్మాంబా! బెజవాడ కాళికాంబ! మదాంబా!

58. జాంబూన దగిరికార్ముక
మంబుధి యంబుధిగాగ నలరినశివు డెం
దంబందుమెలగు శరజ
న్మాంబా! బెజవాడ కాళికాంబ! మదాంబా!

59. భంబులమించును నీదున
ఖంబులు పద్మములు నీదృగంబులుగద నీ
లాంబుదకచవౌ శరజ
న్మాంబా! బెజవాడ కాళికాంబ! మదాంబా!

60. కుంభిణిదుష్కృత జనభా
రంబుడుపుమటంచు నిన్ను రహి వేడిన కో
పంబున వెడలితి శరజ
న్మాంబా! బెజవాడ కాళికాంబ! మదాంబా!

61. శంబరమును కేలబూనిన
శంభునియర్ధంగివైన శాంభవివని డెం
దంబునగొల్తును శరజ
న్మాంబా! బెజవాడ కాళికాంబ! మదాంబా!

62. శంబరమున నిలుడెత్తుక
దంభకుడై పోవుననుచు దాల్చువరుఫణీ
లంబనలమెచ్చు శరజ
న్మాంబా! బెజవాడ కాళికాంబ! మదాంబా!

63. శంభునితలభిక్షాపా
త్రంబుగగొన్నట్టి శంభుదారామణినే
మంబుగ నెంతును శరజ
న్మాంబా! బెజవాడ కాళికాంబ! మదాంబా!

64. సంభాదంబులనిను వే
దంబుల చేనుడువప్రేమ దళుకొత్తగ నే
రంబెంచదగునె శరజ
న్మాంబా! బెజవాడ కాళికాంబ! మదాంబా!

65. కుంభముమహిసురాది జ
నంబులునీఢాకకడ్రిన మ్రులమని ఖే
దంబులు మానరె శరజ
న్మాంబా! బెజవాడ కాళికాంబ! మదాంబా!

66. కాంభోజలాటదహళాం
ధ్రంబులజనులెల్లనీకు దగుకాన్కలు వే
గంబునదెచ్చిరి శరజ
న్మాంబా! బెజవాడ కాళికాంబ! మదాంబా!

67. దంభకుడై రావణుడురు
జృంభణముననవలమెత్తి సోలుచుమీబల్
గంభీరమెంచె శరజ
న్మాంబా! బెజవాడ కాళికాంబ! మదాంబా!

68. దంభకమతకుత్కీలక
దంభోళివటంచునిన్ను దలతునునా చి
త్తాంభోజమునను శరజ
న్మాంబా! బెజవాడ కాళికాంబ! మదాంబా!

69. గంభీరఘోషఘనసం
రంభంబునమించువాద్య రవములతో నీ
జృంభణము మెరసె శరజ
న్మాంబా! బెజవాడ కాళికాంబ! మదాంబా!

70. అంభోజోద్భవుడు చిత
స్తంభముల వేదినగ్ని సాక్షిగనిను శ్రీ
శంభునకు గూర్చె శరజ
న్మాంబా! బెజవాడ కాళికాంబ! మదాంబా!

71. అంభోదరగర్జితవా
గ్ధంభకజనగళవిదారి కరుణాకరు ది
వ్యాంభోజముఖివె శరజ
న్మాంబా! బెజవాడ కాళికాంబ! మదాంబా!

72. కుంభజముఖ సయ్యమినికు
రుంభము భవదీయ గృహవిలోకనమున మో
క్షంబందిరిగద శరజ
న్మాంబా! బెజవాడ కాళికాంబ! మదాంబా!

73. శంభుడు విజయుడు కిటికై
శుంభోత్కోపమునబోరు చుండగగనిమో
దంబొందితీవె శరజ
న్మాంబా! బెజవాడ కాళికాంబ! మదాంబా!

74. జంబలఫలములు నీకుచ
కుంభముల కీడుగాక కోతలబడి వా
డంబడెచూడగ శరజ
న్మాంబా! బెజవాడ కాళికాంబ! మదాంబా!

75. సంభాసిత జంభలకుచ
జంభారినుతాంఘ్రియుగళి శాంభవినావి
స్రంభము మాంపవె శరజ
న్మాంబా! బెజవాడ కాళికాంబ! మదాంబా!

76. రంభలకుసాటి నీతొడ
లంబుజములు బోలుపదములవనిని నీ
కుంబాటిలేరు శరజ
న్మాంబా! బెజవాడ కాళికాంబ! మదాంబా!

77. అంబరమణికాంతశిలా
స్తంబఘటితవాస వాసిశైలనితంబా
స్తంబవిహారివె శరజ
న్మాంబా! బెజవాడ కాళికాంబ! మదాంబా!

78. డంబముగను నీముందట
కుంభములబోసి గొర్ల గోసియబలు నృ
త్యంబాడిరిప్రజ శరజ
న్మాంబా! బెజవాడ కాళికాంబ! మదాంబా!

79. గుంబములు వదలి చెంబులు
కంభీల్గొని జనములెల్ల గదలియు వనవా
సంబునుజేయరె శరజ
న్మాంబా! బెజవాడ కాళికాంబ! మదాంబా!

80. అంబుధి జంబాలంబై
నంబుధజన కగ్రహంబు నడవడివిడినన్
దంభముబలుకవు శరజ
న్మాంబా! బెజవాడ కాళికాంబ! మదాంబా!

81. శంభుపరి అంభణమున
సంబాసిత చిత్తవైన జంబలకు సనా
దంభము లుడుపవె శరజ
న్మాంబా! బెజవాడ కాళికాంబ! మదాంబా!

82. రంభాస్థంభ ప్రతిరూ
పంబులు నీయురువులు నభంబగునీ మ
ధ్యంబుగదా వర శరజ
న్మాంబా! బెజవాడ కాళికాంబ! మదాంబా!

83. జాంబూనదగరుడశిలా
స్తంబస్ధగితంబుగాక దనరిననీ దే
హంబుభజియింతు శరజ
న్మాంబా! బెజవాడ కాళికాంబ! మదాంబా!

84. శంభుండు గంగనునీపా
దంబులబడవై చెననగదగె కృష్ణానం
ద్యాంబుదవేణి శరజ
న్మాంబా! బెజవాడ కాళికాంబ! మదాంబా!

85. బంభరసమకుంతలకా
దంబగమన కంబుకంఠి దైత్యాంతకి చి
త్రాంబరధారివె శరజ
న్మాంబా! బెజవాడ కాళికాంబ! మదాంబా!

86. శంభుండుకాళీయనిహా
స్యంబాడినగౌరవర్ణమతివినీ స
త్యం బేమనదగు శరజ
న్మాంబా! బెజవాడ కాళికాంబ! మదాంబా!

87. డాంబికమునదిరుగను కొం
డెంబులు పల్కంగనేర డెందంబుననీ
జృంభణమెన్నెద శరజ
న్మాంబా! బెజవాడ కాళికాంబ! మదాంబా!

88. అంభీధిస్తంబుండగు
శంభునిశాంబరిజయించి సాంతవనముచే
రంబొదలితివివౌ శరజ
న్మాంబా! బెజవాడ కాళికాంబ! మదాంబా!

89. శుంభద్భలయుతదానవ
కుంభినిచయసింహరూపి గురుతరకోపి
శాంభవివీవే శరజ
న్మాంబా! బెజవాడ కాళికాంబ! మదాంబా!

90. శుంభద్ధంభవిహారి
కంబుగళీయంబుజాక్షి కంబుచయధరీ
శుంభద్గుణివౌ శరజ
న్మాంబా! బెజవాడ కాళికాంబ! మదాంబా!

91. దంభకనికురుంబముపీ
తాంబరుధరుడాదివిష్ణు డనిగొల్వక వా
దంబులమడయరె శరజ
న్మాంబా! బెజవాడ కాళికాంబ! మదాంబా!

92. ఓంభూర్భువరవదక్షమ
ఖంబువిఖాతంబుజేసి కడువడిహిమ గో
త్రంబునబుట్టవె శరజ
న్మాంబా! బెజవాడ కాళికాంబ! మదాంబా!

93. అంబిక నినుభువనావ
స్తంభప్రతిమలుగ జేసి జనులందరు మో
దంబున గొలువరె శరజ
న్మాంబా! బెజవాడ కాళికాంబ! మదాంబా!

94. యంబెరు మానారుపదా
బ్జంబులు మదితలచినీదు సమ్మతిగొని ప
ద్యంబులు జేసితి శరజ
న్మాంబా! బెజవాడ కాళికాంబ! మదాంబా!

95. అంబిక నీచరితములం
దంబగుకందములుగాగ నఖిలజనా నం
దంబుగ జెప్పితి శరజ
న్మాంబా! బెజవాడ కాళికాంబ! మదాంబా!

96. తాంబూలీస్తంభ స్త
భంబులపోకలను ప్రజశుభంబుగనీ ధా
మంబులనించరె శరజ
న్మాంబా! బెజవాడ కాళికాంబ! మదాంబా!

97. స్తంభాద్రిపురికి నాగ్నే
యంబునకొండపలి దక్షణాచలశిఖరా
గ్రంబందునుండు శరజ
న్మాంబా! బెజవాడ కాళికాంబ! మదాంబా!

98. శంబర భరకృష్ణాతీ
రంబగునాగులవరంబు రాజిలుశుభవా
సంబుగ నుండుదు శరజ
న్మాంబా! బెజవాడ కాళికాంబ! మదాంబా!

99. కుంభిణితుమ్మల చెర్వున
యంబవగువంశాబ్ధిచంద్రు డౌ మల్లయ పా
దాంబుజ సేవ్యుడ శరజ
న్మాంబా! బెజవాడ కాళికాంబ! మదాంబా!

100. కుంభిణిగలసరికొండకు
లంబునజనియించు నర్స్రాయాఖ్యుడ నీ
కుంబరిచారుడ శరజ
న్మాంబా! బెజవాడ కాళికాంబ! మదాంబా!

No comments:

Post a Comment