Saturday, July 20, 2013

పందిళ్ళమ్మ శతకము - కట్టా అచ్చయ్యకవి

పందిళ్ళమ్మ శతకము
                                              కట్టా అచ్చయ్యకవి
(కందపద్యములు)

1. శ్రీమచ్చక్తి వనంగా
భూమిని పందిళ్ళపల్లిపురవరమునయం
దామోదంబున వెలసిన
భామాజనకల్పకమ్మ! పందిళ్ళమ్మా!

2. కాళీ! వృజనసమీర
వ్యాళీ! సంపూజితామరాళీ! గుణరిం
చోళీ! శ్రుతిహిత మృదువాక్
పాళీ! కాపాడుమమ్మ! పందిళ్ళమ్మా!

3. దుర్గా! పాలితకవిభ్ధ
వర్గా! నిలయీకృతాప వర్గా! నిల
సన్మార్గ! జయనిసర్గ! ముదిత
భర్గ! ననుబ్రోవుమమ్మ! పందిళ్ళమ్మా!

4. గౌరీ! వేదారణ్య మ
యూరీ! వాగ్విజితకీరి యుగ్రప్రియ! కౌ
మారీ! నుతభంజారీ!
వారింపగదమ్మ! భవము పందిళ్ళమ్మా!

5. అంబా! నవరత్న ప్రా
లంబా! నిరుపమకృపావలంబా! సుజ్ఞా
నాంబా! మ్రొక్కెద భవతా
పం బార్పంజూడుమమ్మ! పందిళ్ళమ్మా!

6. దేవీ! శ్రీకైవల్యపు
దీవీ! యురిగూల్చుక్రోవి తెలివియలరునె
త్తావీ! నుడితేనియ నడ
బావీ! నీకీవిసొమ్మ? పందిళ్ళమ్మా!

7. కొందఱు గొఱియపొటేళ్ళన్
గొందఱు టెంకాయలిచ్చి కొల్తురు నే నీ
కుం దనివిగ గందము లొక
వంద సమర్పింతునమ్మ! పందిళ్ళమ్మా!

8. నిక్కపు భక్తుండనఁ గవి
యొక్కడె కొల్చి కొలిపించు నొరుచే ధనికుల్
డక్కరులని తెలిసి మధుర
వాక్కులు నాకీయుమమ్మ! పందిళ్ళమ్మా!

9. ఆకాళిదాసు మును ని
న్నేకరణిన్ గొల్చి వాగమృతధారాను
శ్రీకలితకావ్యఘటనా
పాకము గడియించెనమ్మ! పందిళ్ళమ్మా!

10. విద్యాగంధమె నీస్మర
ణోద్యోగమునకు ఫలమనియును బూజింతున్
బాద్యాదికముల భక్తిన్
బ్రద్యోదిత కరుణగొమ్మ! పందిళ్ళమ్మా!

11. పలుమాఱున్ నీపూజకు
వలనొప్పన్ బత్ర పుష్ప ఫల తోయములన్
సుళువుగ గొని మత్కవితో
త్పలగంధియె తెచ్చునమ్మ! పందిళ్ళమ్మా!

12. నీకిడు గ్రంధము పత్రము
శ్లోకము పుష్పంబు భక్తి సురుచిరఫల మ
స్తోకరసము తొయమ్మ ని
ప్రాకటముగ నెంచవమ్మ! పందిళ్ళమ్మా!

13. పత్రమ్మౌ శత్రున కసి
పత్రమ్మాయాతనపాత పత్రమ్మౌ స
త్పాత్రమ్మౌ నుతికిని శత
పత్రాయతనేత్రవమ్మ! పందిళ్ళమ్మా!

14. పుష్పము భక్తునిగాచున్
దుష్పరిణతి నాపు చేయు ద్రుటికాలమునన్
గీష్పతి నానందమహా
బాష్పము లురలించునమ్మ! పందిళ్ళమ్మా!

15. ఫలము బహుళతీర్ధాటన
ఫలము నొడంగూర్చు వేదపారాయణసత్
ఫలమును జేర్చు ఘనతపః
ఫలమును సమకూర్చునమ్మ! పందిళ్ళమ్మా!

16. తోయం బఘుపుంజము గడ
ద్రోయందొడగగ సతంబరులపై గత్తిన్
దూయంగడగగ వివిధో
పాయంబుల్ సూపునమ్మ! పందిళ్ళమ్మా!

17. నవరసయుక్తంబగు మ
త్కవితానైవేద్య మర్పితంబుగ జేతున్
శివురాణీ! నాకుంగల
భవభయంబును బాపుమమ్మ! పందిళ్ళమ్మా!

18. మత్కవితా సాగరమున
సత్కావ్యమ్ములను మణులెసగె నీదయ సం
పత్కరములగుచు నవి యా
పత్కాలము గడపునమ్మ! పందిళ్ళమ్మా!

19. ఎన్నియలంకారములవి
యన్నిరచింతున్ భవన్మహత్వగుణ గణా
భ్యున్నతిఁ గాంచనమణి సం
పన్నము సమకూడనిమ్మ! పందిళ్ళమ్మా!

20. సంగత షడంగకేళి
శృంగారమరాళివి సరసియె కృతి భావో
త్తుంగ తరంగప్రేంఖా
భంగగతుల నూగుమమ్మ! పందిళ్ళమ్మా!

21. భువి పరిమళింప, వ్యోమము
రవళింపగ, వాయువు విసర, ననల వరుణుల్
దివెఁగొనఁ గలాపిఁ జల్లగ
భవదుత్సవ మొప్పునమ్మ! పందిళ్ళమ్మా!

22. భూదివితాళముల చతు
ర్వేదామలతంత్రుల తనివిఁమహానటనా
త్యాదృతి మారుతవీణా
వాదనమొనరింతువమ్మ! పందిళ్ళమ్మా!

23. పార్వతి! ప్రకృతిరమామణి
సర్వతరులలతాలతాంత సహితాంజలి శా
ఖోర్వరపుఁ గలిమి లోచన
పర్వంబుగ బట్టునమ్మ! పందిళ్ళమ్మా!

24. మాయూరనటి; మృదంగం
బా! యన ఘనముఱుమ, గాలి బయకాడై త్రి
స్థాయిల నందును బాడగ
బాయకఁ దమినాడునమ్మ! పందిళ్ళమ్మా!

25. తెర యింద్రధను స్సభ్యం
తరనాటకశాల పాత్రధరచాతకముల్
మెఱుపుల్ దివ్వెలు పరత
త్వరసమ్మ? ప్రదర్శనమ్ము! పందిళ్ళమ్మా!

26. శాంకరి! గీర్వాణులె ని
కింకర కింకరులు పాడి గేయంబుల ని
శ్శంకన్ గాహళ భేరీ
భాంకృతు లొనరింతురమ్మ! పందిళ్లమ్మా!

27. నిను గొలువ శంఖ భేరీ
ప్రణవ పటహకాహళముఖవాద్యధ్వనిక
న్నను బద్యగద్యకావ్య
ధ్వని హృద్యంబౌ గదమ్మ! పందిళ్ళమ్మా!

28. ఒక్కడె తనయుడు జ్వరమున
బొక్కుచు నున్నాడని భయమున మ్రొక్కిన యా
మ్రొక్కుం జెల్లించెద నీ
ఫక్కిన్ గృతినందికొమ్మ! పందిళ్ళమ్మా!

29. నీపదాబ్జమరందము
నాపుత్రుడు క్రోలినకతనగదా! సంజీ
వీపానంబు గొన్నటు
బాపుకొనెన్ రుజ నిజమ్ము! పందిళ్ళమ్మా!

30. నీ నామస్మరణంబౌ
నానావిధరోగవారణనివారణ బం
చానన మదిలెక యమృత
పానంబున్ వృధకదమ్మ! పందిళ్ళమ్మా!

31. నాపట్టియన నిజంబుగ
నీపెట్టిన బిషమని గణించి యతని నే
జూపెట్టితి నిక దాసుని
బ్రాపై రక్షించుమమ్మ! పందిళ్ళమ్మా!

32. పసివాడు శాస్త్రగంగా
రసమజ్జన మాచరింపరా! యనుచు దయా
రసభోజనమిడి సుయశో
వనంబునన్ గట్టనిమ్మ! పందిళ్ళమ్మా!

33. ఒకచో దుర్గయనగ వే
ఱొకచో గాళియన నింక నొకచో భ్రమరాం
బికయన నిట్లంతట్ తా
వక తేజము వెలసెనమ్మ! పందిళ్ళమ్మా!

34. భావింప నన్నపూర్ణవు
గావ? "యమృతమస్త"నుచు సకాలమ్ములయం
దీవాపోశనమిడి యం
బా! విందుల్ గూర్పుమమ్మ! పందిళ్ళమ్మా!

35. దాసుడ నీకనఁ దృప్తిగ
వ్యాసున కాహారమిడితివట! కాశిన్ నన్
దాసానుదాసుడని యుప
వాసమ్ముల నుంచకమ్మ! పందిళ్ళమ్మా!

36. శుంభనిశుంభాద్యాశర
దంభానిలఫణి యఘూద్రితతదంభోళీ!
జంభారిపు హృదయసారస
బంభరి! ననుబ్రోవుమమ్మ! పందిళ్ళమ్మా!

37. అల కొమరుసామి వేలుపు
దళముల నడుపంగ నాడు దరినున్నటులీ
యిల దండుబాటయే తా
వలముగ నిల్చితివిసుమ్మ! పందిళ్ళమ్మా!

38. మగడు కిరాతుండయి ముం
దుగ జనుచున్ బ్రేయసీ! యనుచు మెల్లన దా
నగుచుండ సురాపగతో
పగతో నిటనుంతివమ్మ! పందిళ్లమ్మా!

39. శృంగార రసాకృతి నా
లింగనమిడి యుండె రామలింగాలయమం
దుంగంగ తదీయజల మ
భంగమధురతరము సుమ్మ! పందిళ్ళమ్మా!

40. హెచ్చిన రిపువనికి న్గా
ర్చిచ్చగు నామందపాటిచినరాజును మో
క్షేచ్చాపరుడయి యిటకున్
వచ్చి నినున్ గొల్చెనమ్మ! పందిళ్ళమ్మా!

41. నీపేర నొక్క మామిడి
తోపా చినరాజు నాటె తోరంబగుచున్
జూపఱ దన్పగ నాతని
ప్రాపన తోడైతివమ్మ! పందిళ్ళమ్మా!

42. అల మందపాటి చినరా
జలయక నీమ్రోల నిచటి యతిబలులౌ మి
త్రులతోజేసియు సాములు
బలిగుడులాడెనుగదమ్మ! పందిళ్ళమ్మా!

43. అధికాసక్తిన్ గొని పుర
పృధు లైశ్వర్యంబు దస్కరింపగ జోరుల్
బధమెది? ముదుసలి! యనగా
పధమిది యంటివికదమ్మ! పందిళ్ళమ్మా!

44. పొలిమేరతగవునన్ రిపు
బలములు చెలరేగ నట్టె నలనగుగాలిన్
గొలిపి పగఱకన్నులలో
పల కారం బిడితివమ్మ! పందిళ్ళమ్మా!

45. మున్నీ ప్రాంతపు గ్రామము
లన్నిట పందిళ్ళపల్లియనగ గడు బే
రెన్నిక గొన్నదిట వి
ద్వన్నిచయమ్ముంటఁజుమ్మ! పందిళ్ళమ్మా!

46. ఘనయోగులకిది నెలవని
వినుపింపగ కనుపర్తి వేంకట్రామా
ర్యునికృతియౌ "కైవల్యన
వనీతము" గలిగెఁగదమ్మ! పందిళ్ళమ్మా!

47. ఆతతవీణాచార్య
ఖ్యాతిన్ రాట్పభల భాష్యకాచార్య తనూ
జాతత్రయగానం బా
పాతమధురమిచ్చెనమ్మ! పందిళ్ళమ్మా!

48. పందిళ్ళపల్లి నీఉన్
మందిరమిందున జనసమాజము సంతౌ
సందియమేలా? నను మను
పం దయతీజూడుమమ్మ! పందిళ్ళమ్మా!

49. ఇది జన్మభూమియైనను
పదపడి సాహితిని వేటపాళెమ్మున నే
జదివితి తత్ఫలము భవ
త్పదభజనన్ గలుగునమ్మ! పందిళ్ళమ్మా!

50. జననివలె జన్మభూమియు
గణనీయంబంటి నిక భగవతివి నిన్నున్
గనుగొంటిన్ మది నీపద
వనజము లిడుకొంటినమ్మ! పందిళ్ళమ్మా!

51. దుందగముగ బీటలపై
బెండిలి దప్పింప దగవు బెట్టుకొనిన యా
మొండిశిఖండుల పాపము
పండిట యేనాటికమ్మ! పందిళ్ళమ్మా!

52. పురమర్దను చిచ్చఱక
న్నరమరగొని యొక్కొక్కప్పు డరయవరిఁగవీ
శ్వరరోషాగ్ని రిపుపరం
పరాటవినిఁ గాల్చునమ్మ! పందిళ్ళమ్మా!

53. సద్భక్తకవిమనక్షో
భోద్భూతాభీలబాడబోషర్భుధకీ
లోద్భటము ద్విషదుదధి సం
పద్భరమున్ బీల్చునమ్మ! పందిళ్ళమ్మా!

54. కట్టిడుల దిట్టవలదా
కుట్టకయే యున్నఁ దేలుఁగుమ్మరిపుర్వం
చట్టె హసింతురు జను లి
ప్పట్టున గనిపెట్టుమమ్మ! పందిళ్ళమ్మా!

55. కవి కపకృతి గావించుట,
శివనిందయొనర్చుట, ఫణి జెనకుట, సాధ్వీ
నివహముఁ జెరుపదలంచుట
పవిగొని ముద్దాడుటమ్మ! పందిళ్ళమ్మా!

56. కొట్టిరె? తొల్లికవుల్ దెగ
దిట్టిరి యరి నర్ధినన్న దీవించి సిరుల్
వెట్టిరి నీబలమున కవి
పట్టుఁగొమ్మవుకదమ్మ! పందిళ్ళమ్మా!

57. సుస్మేరాస్యసుధన్నను
విస్మయముగ బెంచి క్రోధవీక్షణశిఖచే
నస్మచ్చత్రుకులాటవి
భస్మము గావింపుమమ్మ! పందిళ్ళమ్మా!

58. దుష్టులు నిందల కోర్చు య
రిష్టంబులు వెట్టుచుండరె? కులమునకు దు
చ్చేష్టలకలిమి నిహపర
భ్రష్టులనం బడుదురమ్మ! పందిళ్ళమ్మా!

59. గ్రంధరచనాప్రవీణ ధు
రంధర కవిగంధసింధురంబేనను గ
ర్వాంధుడు నిను వేడక భవ
బంధము తెగుటెట్టులమ్మ! పందిళ్ళమ్మా!

60. శ్రుతీయ తృతీయశ్రుతియగు
ద్రుతమ్మహమ్మతి మొదట నొదుగ నొదుగు గలా
ప్రతిభ నినుబాడు సుకవి
ప్రతతికి యశమబ్బునమ్మ! పందిళ్ళమ్మా!

61. యతి యతియై వెంబడిపడు
నతి కఠినప్రాస ప్రాసమగు పదగతి దు
ర్గతియగు గుకవికి గీర్తి
ప్రతిపత్తి యొసంగదమ్మ! పందిళ్ళమ్మా!

62. నీరూపకల్పనంబున
బూరుషుడు గడించు నిత్యమోక్షమ్మును కా
కేరు ధనమదాంధుల నే
వారతిఁగొన నేర్తురమ్మ! పందిళ్ళమ్మా!

63. నీమహిమంబును దెలియక
పామరుడయి స్వీకరించు బరమతము నరుం
డా మోక్షపదవి నందక
బాముల బడుచుండునమ్మ! పందిళ్ళమ్మా!

64. ఇచ్చియుఁ గడిపెడు బిడ్డల
దచ్చతురతమాయగ విధిదారిద్ర్యము పై
పెచ్చుగనిడె నీవిక సం
పచ్చయమిడి ప్రోవుమమ్మ! పందిళ్ళమ్మా!

65. దుష్టశనిగ్రహ మిట్టుల
కష్టమ్ముల పాలుజేసి కలచుచునుండెన్
నిష్టన్నిను గొలిచెద దద
వష్టంభన మాపుమమ్మ! పందిళ్ళమ్మా!

66. ఒడలిం జందన మలదినఁ
బడుకొన్నన్ బూలపాన్పుపయిఁ బాయసమున్
గుడిచిన సుఖము ఋణాగ్నిం
బడిన నరుం డందడమ్మ! పందిళ్ళమ్మా!

67. భూధారిణి! నీనాధు న
నాధుడనై పెండ్లిగాక నాడడిగితి నిల్
నీధర్మాన గలిగె ఋణ
బాధను నేడడపుమమ్మ! పందిళ్ళమ్మా!

68. వేధకునైనను దుస్సహ
మీధర మానవున కలవియే? భరియింపన్
సాధనమగు నీకృప ఋణ
బాధానల మార్పుమమ్మ! పందిళ్ళమ్మా!

69. పాధోధిఁబుట్టి గరళము
వేధోండము గాల్పజూడ వేమ్రింగిన గం
గాధరునకు గృహిణివి ఋణ
బాధానల మార్పుమమ్మ! పందిళ్ళమ్మా!

70. గాధితనూజుడు చంద్రమ
తీధవునిన్ దీనదశకు దెచ్చుట కనువౌ
సాధన మెది? యనె నా ఋణ
బాధానల మార్పుమమ్మ! పందిళ్ళమ్మా!

71. తనువున్ గార్శ్వము జూపున్
మనమున ధృతిమాపు, నోతమాతయు నాపున్
ఋణబాధ కెవండోపున్
వ్రణబాధయె మేలు సుమ్మ! పందిళ్ళమ్మా!

72. రాజ్యంబున్ గవితాసా
మ్రాజ్యంబునకున్ సమానమా? యనె దైనన్
భోజ్యతురునిం జేయక
ప్రాజ్యయశోధనములిమ్మ! పందిళ్ళమ్మా!

73. జననీ! నిను బొగడదలం
తునుపో! సంగీతసాహితులు నేను న్నే
నని ముందునడచు నీపా
వననామాక్షరబలమ్మ? పందిళ్ళమ్మా!

74. అంబా కృతిబాడుచు రా
గం బాలాపనము సేయగా డెందము దే
హంబు మఱచి సంసృతితా
పంబున్ గనకుండెనమ్మ! పందిళ్ళమ్మా!

75. వేడుచు నాడుచు పాడుచు
వీడక నినుగొల్చు భక్తవితతికి సతమున్
దోడయి సంపదలిడి కా
పాడెడు దేవతవుసుమ్మ! పందిళ్ళమ్మా!

76. కన్నుమూసిన గన్దెఱచినఁ
బొనరగ బ్రహ్మాండభాండముల నిండిన నీ
తనుకాంతి మహానందపు
వనధి న్ననుదేల్చె నమ్మ! పందిళ్ళమ్మా!

77. నీకరుణగొన్న భక్తున
కాకలి దప్పియు నిదురయు నార్తి భయంబున్
జీకులు రావంచు నమో
వాకము లర్పింతునమ్మ! పందిళ్ళమ్మా!

78. నిను సగము పొగడినంతనె
నను మెచ్చియు నాదిభట్ట నారాయణదా
సునిచే బిరుదంబును దీ
వన మిప్పించితివి సుమ్మ! పందిళ్ళమ్మా!

79. నీకొలువుసేయ భక్తుల
కేకాలంబునను గొఱత యేర్పడదనుచున్
నాకెఱుకపడె నిజమ్మని
వాకొనుచున్నాడనమ్మ! పందిళ్ళమ్మా!

80. ధృతియు శ్రుతిలయజ్ఞానా
దృతి నిశ్చలమతి ప్రతాపతీవ్రాగ్నిలస
ద్ధృతి సద్గతి యిడు నీకున్
బ్రతిదేవత లెవ్వరమ్మ! పందిళ్ళమ్మా!

81. ధారాదృతిన్ గవిత నసి
ధారాదృతి జగతి సంతతయశమ్ము జలా
ధారాదృతి గేదార మ
పారాదృతిఁ జూపుమమ్మ! పందిళ్ళమ్మా!

82. కారము పసిబిడ్డల కోం
కారము వేదమున కఖిలకామితఫలదా
కారము శిష్టులకిడు సం
భారము నీసొమ్ముసుమ్మ! పందిళ్ళమ్మా!

83. హారము మణి ఫణియుతము, వి
హారము దీనవనార్ధ మసురచమూసం
హారము కృత్యము మహిమ మ
పారము నీకు గలదమ్మ! పందిళ్ళమ్మా!

84. కరము నిరంతరదానా
కరము గభీరగుణమణినికరమా? రత్న
కరము నిగమభాస్వరమా?
స్వరము నినున్ గొల్తునమ్మ! పందిళ్ళమ్మా!

85. దారమునన్ బేటయు, మం
దారమునన్ బూలదోట, ధన్వునకున్ భూ
దారమునన్ వేట, భవద
పారకృపన్ వెలయునమ్మ! పందిళ్ళమ్మా!

86. సారమునన్ బైరుల సం
సారమునన్ బామరులను చండామితదో
స్సారమునన్ వీరులను కృ
పారతి బెంతువుగదమ్మ! పందిళ్ళమ్మా!

87. రాగం బర్ధులజూడ వి
రాగం బొగివీడ ధనపరాగము సంధ్యా
రాగం బర్యమువేడ బ్ర
భాగరిమం బిడితివమ్మ! పందిళ్ళమ్మా!

88. సారము గన్పింపని సం
సారము మెడగట్టుకొని విచారము భయవి
స్తారము గనినాడను వి
స్ఫారముదం బీయవమ్మ! పందిళ్ళమ్మా!

89. నమ్మనివాడు చెడు నిధా
నమ్మని నీనామకీర్తనము యాగవిధా
నమ్మని నమ్మిన భవతా
పమ్మనిశము దొలగునమ్మ! పందిళ్ళమ్మా!

90. పద్మము వగగాలినడచు
పద్మము నూత్నపరిమళము బరగించు మహా
పద్మము సుఖమిడు నీపద
పద్మము మోక్ష మిడునమ్మ! పందిళ్ళమ్మా!

91. పారము గన్పడని యకూ
పారముకద! సంస్కృతి గడవగ స్మరణ వ్యా
పారము కాకితర వ్యా
పారము పనిసేయదమ్మ! పందిళ్ళమ్మా!

92. వనమౌ మునులకు, ఘనజీ
వనమౌ నమరులకు, దారపతులకు ననయౌ
వనమౌ పతితులకును పా
వనమౌ, నీస్మరణమమ్మ! పందిళ్ళమ్మా!

93. వారము సింగమ్మగు బరి
వారము సురవార మాయవారము సేయన్
వారముఁ బంపెదవౌ ప్రతి
వారమునకు దగునటమ్మ! పందిళ్ళమ్మా!

94. కుశము కలుగ విప్రుం డం
కుశము కలుగ మావటీడు, క్షోణీపతి నిరం
కుశము కలుగ తనవశమున్
వశమై చరియించునమ్మ! పందిళ్ళమ్మా!

95. పొందుగ పద్యము సిరిగల
పందల కందించు టూరబందుల మెడలో
గందము పూయుట రసికుడు
వందలకొక డుండడమ్మ! పందిళ్ళమ్మా!

96. దొడ్డసిరిగలుగ దెలియని
గ్రుడ్డి కనునె? కవిత సొంపుగుల్కెడుతెఱగుల్
తెడ్డెఱుగునె? కూరలరుచు,
వడ్డనకే తగుగదమ్మ! పందిళ్ళమ్మా!

97. లిబ్బి తిరంబని యుబ్బుచు
గబ్బపుగూర్పరుల గనడు కని వెలయాండ్రన్
తబ్బిబ్బై యొక్కొకరుడు,
పబ్బంబుగ నిచ్చునమ్మ! పందిళ్ళమ్మా!

98. ఉరుగౌరవ పదవులకై
కరమర్ధి నొనర్చెద రధికార్లకువిం దా
మెఱమెచ్చుల దాతలకున్
బరమార్ధము దొరకదమ్మ! పందిళ్ళమ్మా!

99. పాయము పోనుండె, జరా
పాయము రానుండె, ముక్తిబడయుటకు మహో
పాయంబు లేకుండె, నభి
ప్రాయము సెలవొసగుమమ్మ! పందిళ్ళమ్మా!

100. గాటపుభక్తిన్ డెందపుఁ
బీటపయిన్నిల్పి నిన్ను వేడితి నికనే
నాటికి మోక్షద్వారక
వాటము దెఱిపింతువమ్మ! పందిళ్ళమ్మా!

101. దూలించితిఁ గామాదుల,
నాలించితిని శ్రుతి ధనమదాంధులకొలు వుం
జాలించితిఁ బితృవాక్యముఁ
బాలించితిఁ బ్రోవుమమ్మ! పందిళ్ళమ్మా!

102. మీసలుదువ్వుచు వయసున
జేసిన పనులెల్ల జెప్ప సిగ్గగు నాకే
దోసములై యిపుడు దుర
భ్యాసములై తోచెనమ్మ! పందిళ్ళమ్మా!

103. తెరువయ్యె నిరులు పాముం
గఱచిన నదియొక్క దోమకాటుగ నుండెన్
నెఱదయ్యము సఖుడయ్యెన్
పరికింపగ వయసునందు పందిళ్ళమ్మా!

104. వేయేల మహాపాతక
తోయధిలోబడితిని కృపతోడ నన్నునీ
చేయూతయొసగి యిక నిర
పాయమ్మగు మోక్షమిమ్మ! పందిళ్ళమ్మా!

105. శక్తివని తొలుత నామ్నా
యోక్తముగ గొలువ సురాళి నోమి నరులకున్
ముక్తియొసగుదువు నీకిది
భక్తావనదీక్షసుమ్మ! పందిళ్ళమ్మా!

106. అమ్మా! భగవతివని నిను
నమ్మియు నీదగు సహస్రనామంబుల నే
నెమ్మిఁజపించెద భవతా
పమ్మును దొలగింపుమమ్మ! పందిళ్ళమ్మా!

107. భోగము త్యాగము మహితో
ద్యోగమ్మున్నీదు భక్తియోగమునన్ సం
యోగంబగుఁ గవికని నిన్
బాగుగఁ బ్రార్థింతునమ్మ! పందిళ్ళమ్మా!

108. కంజజ నారాయణ మృ
త్యుంజయులకు దారిజూపుదువు నీతేజః
పుంజమున భక్తమనః
పంజరపుం జిలుకవమ్మ! పందిళ్ళమ్మా!

109. ఇంధనసములని ద్రవ్యమ
దాంధుల గోపాగ్నిగాల్చి యడతువు తన్ని
ర్భంధమ్ముల, భక్తిగహన
పాంధుడ నను గావుమమ్మ! పందిళ్ళమ్మా!

110. వరమడిగెదను చతుర్విధ
పురుషార్ధమ్ముల నొసంగి ప్రోవుమనుచు నీ
వరమరగొన కద్దానిన్
ద్వరగ బ్రసాదింపుమమ్మ! పందిళ్ళమ్మా!

111. వాస్తవముగ నిన్ బోలిన
నిస్తుల మోక్షప్రదాత్రి నిన్నేగానన్
దుస్తర భవజలధికి నీ
ప్రస్తుతి నౌకయగునమ్మ! పందిళ్ళమ్మా!

112. సూక్తంబుల ఘోషించున్
శాక్తేయం బతుల మోక్షసాధనమని నీ
భక్తి లభించుట జనులకు
బ్రాక్తనపుణ్యమునసుమ్మ! పందిళ్ళమ్మా!

113. పూరుషుండు పురాణాగమ
పారంగతుడగునుగాక బడయునే మోక్షం
బారయ నీపదభక్తికిన్
వారక లభియించునమ్మ! పందిళ్ళమ్మా!

114. నరుడార్తి దూలునప్పుడె
స్మరియించున్ మఱచుచుండు స్వాస్థ్యముగొని నిన్
స్ఠిరభక్తి గొలువకెట్టుల
పరమార్ధము దొరకునమ్మ! పందిళ్ళమ్మా!

115. కొలుపు సుఖంబుల పెంపున్
గొలుపు విమోహపరవశులకున్ బాడున్ మే
ల్కొలుపు నరికెడగొలుపు బ్రా
బలుకుల గీల్కొలుపునమ్మ! పందిళ్ళమ్మా!

116. జవనత్వనిధానము లా
జనంజన విభేదనములు సర్వగుణగణా
ర్జన సాధనములుగావా
భవదంఘ్రులు గొల్తునమ్మ! పందిళ్ళమ్మా!

117. ఇల సహజగానకవితా
విలాసులను దెలిసి గౌరవింపగలర? మ
ర్త్యులు; ధనమిడనేర్తురు నీ
వలె ముక్తినిడరుగదమ్మ! పందిళ్ళమ్మా!

118. అర్థినయి భక్తితోదన్
బ్రార్థనమున్ జేయుచుంటి పై నుండెడు త
త్వార్థంబెఱిగించి యశో
వర్ధనమున్ సలుపుమమ్మ! పందిళ్ళమ్మా!

119. కస్తిబడియన సలుప ను
పాస్తిస్వరూప మెలమి గనబఱతువు ప్రణవం
బాస్తికతకు మూలంబని
వాస్తవ తత్వముగనమ్మ! పందిళ్ళమ్మా!

120. సుకవులు దరిద్రతృష్ణా
గ్నికిదాళక లుబ్ధుడగు ధనికగృహమృగతృ
ష్ణకడకుజని యెదియుం దో
పక నిను దలతురుగదమ్మ! పందిళ్ళమ్మా!

121. తమ సంపదలన్నియు ని
త్యములని సమ్ముకొని ధనమదాంధులు "ధనమూ
లమిదంజగత్త"టంచును
భ్రమచే గర్వింతురమ్మ! పందిళ్ళమ్మా!

122. కవి పండిత గాయక నట
నివహంబున్ గాంచి లోభి నిలువున నీరై
శవమటు పల్కెడు కొండయు
బవియన నెట్లుండునమ్మ! పందిళ్ళమ్మా!

123. నీరమణువలచి సఖియై
భైరవునిన్ గన్న విష్ణుపైనలుగవు భా
గీరధియె లోకువా? మన
వారని నీకున్నదమ్మ! పందిళ్ళమ్మా!

124. రాజులు కవిరాజులు రిపు
రాజిగెలువ శస్త్రశాస్త్రరాజి నొసగి నీ
తేజము గన్పర్తువు వి
భ్రాజిత పుణ్యాత్మవమ్మ! పందిళ్ళమ్మా!

125. నాయెడదతుమ్మెద రొదం
జేయు నెనరుదేనెనానిచెందక దనివిన్
నీ యడుగుందమ్ముల నెడ
బాయంజాలదుగదమ్మ! పందిళ్ళమ్మా!

126. అగపడుమమ్మ! కనులగొల
తెగులేర్పడె నాకు జ్ఞానదృష్టిఁ బ్రసాదిం
పగనగు కృపాంజనముదా
పగనేల? వెల శతకమ్మ! పందిళ్ళమ్మా!

127. అంబా! యీ శతకము ని
త్యంబు జదువువారి కాయురారోగ్యైశ్వ
ర్యంబులిడి కొనుడు! సుతలా
భంబని దీవింపుమమ్మ! పందిళ్ళమ్మా!

128. జయజయ జయ కాత్యాయని!
జయజయ శర్వాణి! మృదులసారసపాణి!
జయజయ హైమవతీ! భవ
భయమున్ దొలగింపుమమ్మ! పందిళ్ళమ్మా!

129. మంగళము! గుణశ్రేణీ!
మంగళము! వినీలవేణి! మంజులవాణీ!
మంగళము! సుపాణి! కృపా
పాంగములం జూడుమమ్మ! పందిళ్ళమ్మా!

130. శతకపు పళ్ళెరమున సం
స్తుతి తైలమిడి వెలిగించి సుయశోజ్యోతిన్
ధృతి అచ్చయకవితాగుణ
వతిహారతి బాడెనమ్మ! పందిళ్ళమ్మా!

సమాప్తము

No comments:

Post a Comment