Friday, June 26, 2015

భద్రాద్రిసీతారామ శతకము - అబ్బరాజు పిచ్చయ్య

భద్రాద్రిసీతారామ శతకము
                                  -- అబ్బరాజు పిచ్చయ్య

1. శ్రీకల్యాణ గుణాకర
నాకేద్ర ముఖార్చితాంఘ్రి నళినద్వంద్వా
నీకిదె మ్రొక్కెద బ్రోవుము
శ్రీకర భద్రాద్రిధామ సీతారామా!

2. నీకారుణ్యము నందగ
లోకేశ్వర నిన్ను జూడ లోదలచెదనే
నాకోరిక లిడి బ్రోవుము
శ్రీకర భద్రాద్రిధామ సీతారామా!

3. నీకంటె మేలుదైవము
నాకెవ్వరు లేరు వెదుక నమ్మిన భక్తున్
చేకొని రక్షింపంగదె
శ్రీకర భద్రాద్రిధామ సీతారామా!

4. వాకొనుచుంటిని మొరవిను
నాకొక గడ్డయ్యె తొడన నళినాక్ష మహా
కాక యిడుచుండె గావవె
శ్రీకర భద్రాద్రిధామ సీతారామా!

5. ఏకరణియోర్తు బాధకు
నాకెవ్వరు దిక్కు నీవ నయమగునటులన్
నీకృప జూపింపంగదె
శ్రీకర భద్రాద్రిధామ సీతారామా!

6. కాకుత్స్థవంశ జలనిధి
రాకాకుముదాప్త సకల రాక్షసహర సు
శ్లోక నిజసేవకావన
శ్రీకర భద్రాద్రిధామ సీతారామా!

7. ఏకోనారాయణుడని
లోకంబులు సకల మౌని లోకంబులు ని
న్నేకాలము భజియించును
శ్రీకర భద్రాద్రిధామ సీతారామా!

8. కైకపనుపనెడి నెపమున
లోకంబులు గష్టపెట్టు లుబ్ధుల దనుజా
నీకమడచి తడవికిజని
శ్రీకర భద్రాద్రిధామ సీతారామా!

9. ఆకలి యగుచున్నవనిన్
లేకున్నవె పండ్లు శబరి నిన్ రక్షింపన్
జేకొంటి దాని యెంగిలి
శ్రీకర భద్రాద్రిధామ సీతారామా!

10. కాకాసురుండు చుంచున
నీకామిని కుచము బొడువ నెమ్మిని వానిన్
బోకార్పక నేలితివహ
శ్రీకర భద్రాద్రిధామ సీతారామా!

11. భీకరమై నేరెత్తని
శ్రీకఠుని విల్లువిరచి సీతాదేవిన్
జేకొంటివి చిన్నప్పుడ
శ్రీకర భద్రాద్రిధామ సీతారామా!

12. కోకలు పచ్చడములు న
స్తోకవిభూషావళులును సొరిదినడుగ నే
నీకరుణ గోరువాడను
శ్రీకర భద్రాద్రిధామ సీతారామా!

13. మీకల్యాణ మహోత్సవ
మేకాలము మద్గృహమున నిట్లేజరుగన్
ప్రాకటముగ గరుణింపుము
శ్రీకర భద్రాద్రిధామ సీతారామా!

14. మీకాలిదుమ్ము కొంచము
సోకిన శాపంబుబాసి సుదతియయి యహ
ల్యాకాంత లేచె నద్దిర
శ్రీకర భద్రాద్రిధామ సీతారామా!

15. శ్రీ కామినియై తగు సీ
తాకాంతామణిని గూడి తమ్ములతో నీ
వేకాలముండు మీహృది
శ్రీకర భద్రాద్రిధామ సీతారామా!

16. వాకున కందక జూడగ
రాకుండెను నూదురూపు రఘుతిలకదయన్
నాకుం జూపింపంగదె
శ్రీకర భద్రాద్రిధామ సీతారామా!

17. సాకల్యంబుగ మీదగు
ప్రాకటవైభవముగంటి భవ్యుడనైతిన్
నా కానందము కలిగెను
శ్రీకర భద్రాద్రిధామ సీతారామా!

18. ఆకార రహితుడవు
విమలాకారుడ వచ్యుతుండ వచలుండ బహో
లోకారాధ్యుడ వీవె
శ్రీకర భద్రాద్రిధామ సీతారామా!

19. ఆకలి దప్పియు బడలిక
వేకియు జరలంటనట్టి విద్యల నీవే
గైకొనుట చిత్రమయ్యెడి
శ్రీకర భద్రాద్రిధామ సీతారామా!

20. కూకటులతోడ రాముని
పాకారిని వెంతనంతి పాపాసురులన్
బోకార్చి సవనమేలితి
శ్రీకర భద్రాద్రిధామ సీతారామా!

21. నీకడిమికి నచ్చెరువడి
ఢీకొన భార్గవుడు వాని ఠీవియతని వి
ల్లే కైకొని యడగించితి
శ్రీకర భద్రాద్రిధామ సీతారామా!

22. రాకా నిశాకరునిగతి
నేకోరెడు కలువలట్లు నృనెపుడు నీ
రాకను గనగోరెద మది
శ్రీకర భద్రాద్రిధామ సీతారామా!

23. నాకాధిప నందను నొక
భీకర బాణమున దృంచి వేరవిజునకున్
యా కపి రాజ్య మొసగితివి
శ్రీకర భద్రాద్రిధామ సీతారామా!

24. రాకలుషంబులు వెడలుప
మాకట్టును మరలనీక మఱితలుపయి మో
క్షాకరమగు నీనామము
శ్రీకర భద్రాద్రిధామ సీతారామా!

25. పాకారి భోగమబ్బిన
లేకుండును దృప్తిమదికి లేశంబును నీ
యాకార మహిమ జూపవె
శ్రీకర భద్రాద్రిధామ సీతారామా!

26. నీ కామిని సిరులిచ్చును
నీకొడుకు జగంబులెల్ల నిర్మించు నహా
నీకాపురంబె లోకము
శ్రీకర భద్రాద్రిధామ సీతారామా!

27. ఆకాశంబది త్రివిధం
బౌకరణిని మూడువిధములైతివి నీవే
సాకారు నిన్ను గొలిచెద
శ్రీకర భద్రాద్రిధామ సీతారామా!

28. నా కలుష భవాబ్ధిని మో
దాకర దాటంగయుష్మదంఘ్రి స్తోత్రం
బేకలము నిశ్చయంబుగ
శ్రీకర భద్రాద్రిధామ సీతారామా!

29. చీకునకు రాత్తిరియును ప్ర
భాకర యుతమైన పట్టపగలును నొకటే
మీకరుణలేక మాకటె
శ్రీకర భద్రాద్రిధామ సీతారామా!

30. రాకట పోకటగల యీ
ప్రాకృతమగు భవమదేల భవదాకృతిలో
నే కలుపుకొమ్ము చివరకు
శ్రీకర భద్రాద్రిధామ సీతారామా!

31. ఓ కమలాప్త కులోత్తమ
సాకల్యంబుగను నీదు సద్రూపంబున్
నాకుం జూపంగదవే
శ్రీకర భద్రాద్రిధామ సీతారామా!

32. రూకలు నాలుగు వక్రపు
పోకడలన్ సంతరించి భువిజనులకు బ
ల్కాకలిడు వారి నడపవె
శ్రీకర భద్రాద్రిధామ సీతారామా!

33. వాకలు సంద్రమునంబడు
పోకడగా నెల్లవేలు పులకిడుమ్రొక్కుల్
నీకేజెందు నిజంబిది
శ్రీకర భద్రాద్రిధామ సీతారామా!

34. సాకగవలె నీ భక్తుడ
వేకష్టములెల్లదీర్చి ప్రేమను నీవే
నాకుం దల్లివి దండ్రివి
శ్రీకర భద్రాద్రిధామ సీతారామా!

35. భీకరులై యప్పులవా
రేకష్టము లిడుదురొక్కొ యికనన్నాపల్
గాకులలో బడనీకుము
శ్రీకర భద్రాద్రిధామ సీతారామా!

36. సోకుగమి ప్రబలిదేవా
నీకంబును బాధపెట్ట నిజముగవారిన్
పోకార్ప నవతరించితి
శ్రీకర భద్రాద్రిధామ సీతారామా!

37. ఏకతమున వటవృక్షపు
టాకున బాలుండవగుచు నతిసుఖదుడవై
యేకార్ణవమున పండెడు
శ్రీకర భద్రాద్రిధామ సీతారామా!

38. కాకివలె సంచరించెడి
నేకాలము నిలువదొకట యిదె నామది నీ
వే కట్టడి యిడవలెజుమి
శ్రీకర భద్రాద్రిధామ సీతారామా!

39. రాకేందువదన యొక్కతె
చేకొని శ్రీరామయనుచు చిలుకను బిలువం
గాకైవల్య మొసంగితి
శ్రీకర భద్రాద్రిధామ సీతారామా!

40. మీకథనంతయు మును
వాల్మీకుడు విరచించిగాదె మేదిని పుణ్య
శ్లోకుండయ్యె నతండును
శ్రీకర భద్రాద్రిధామ సీతారామా!

41. మాకందఫలము మధురర
సాకరమగునట్లు యుష్మదాఖ్యామృతమున్
మాకందంబగు చుండును
శ్రీకర భద్రాద్రిధామ సీతారామా!

42. ఆ కమలజు నిగమములన్
జేకొని సంద్రంబుజొచ్చు చెడుసోమకుమ
త్స్యాకారమ్మున గూల్చితి
శ్రీకర భద్రాద్రిధామ సీతారామా!

43. సోకులు వేల్పులు వడి క్షీ
రాకరమును తఱచువేళ నల మందరమున్
శ్రీకూర్మముమ వై మోచితి
శ్రీకర భద్రాద్రిధామ సీతారామా!

44. సూకర రూపముదాలిచి
భీకరుడగు హేమనేత్రు పీచమడచి నీ
వే కదగాచితి జగములు
శ్రీకర భద్రాద్రిధామ సీతారామా!

45. ఈ కంబమునం జూపుము
కాకవిపక్షునన హేమకశిపుని నరసిం
హాకారమున వధించితి
శ్రీకర భద్రాద్రిధామ సీతారామా!

46. నాకాధిపత్య మాదిగ
లోకాలన్నియునుదానె లోగొను బలినిన్
పోకార్చితి గుజ్జుడవై
శ్రీకర భద్రాద్రిధామ సీతారామా!

47. ఆకార్తవీర్యుకతమున
లోకంబున గలుగు రాజలోకము నెల్లన్
వీకనడచితి పరశువు
చేకొని భద్రాద్రిధామ సీతారామా

48. ఆ కమలజువరమున సుర
భీకరుడై రావణూండు వేధింపగ నీ
కాకుత్స్థుడవై గూల్చితి
శ్రీకర భద్రాద్రిధామ సీతారామా!

49. ఆకఱ్ఱికి నెచ్చెలివై
భూకామిని భారమెల్ల పోగీట్టుటకై
శ్రీకృష్ణుడ వైతివిగద
శ్రీకర భద్రాద్రిధామ సీతారామా!

50. ఈకలివేళను బుద్ధుడ
వై కలధర్మముల నెల్ల బహుళపరచి యెం
తోకారుణ్యత నేలితి
శ్రీకర భద్రాద్రిధామ సీతారామా!

51. వాకులలోపల తప్పులు
బోకుండునె వానిసైచి బ్రోవందగు మీ
నాకర గర్వ విభంజన
శ్రీకర భద్రాద్రిధామ సీతారామా!

52. వైకుంఠము భద్రాచల
మాకమలాక్షుండవీవ యవనిజ లక్ష్మీ
లోకేశ్వరి నిశ్చయముగ
శ్రీకర భద్రాద్రిధామ సీతారామా!

53. వేకువజామున మేల్కొని
వాకకు జని తానమాడి వడి తనపూజా
నీకంబులు నడుపగవలె
శ్రీకర భద్రాద్రిధామ సీతారామా!

54. నేకాపురుషుడ నంచు వి
లోకింపక నుంత దగునె లోకములోనన్
నాకంటె హీనుగావవె
శ్రీకర భద్రాద్రిధామ సీతారామా!

55. రాకుండునె సిరియుండిన
కాకుండునె కాగలట్టి కార్యములెల్లన్
మీకరుణ బడయగావలె
శ్రీకర భద్రాద్రిధామ సీతారామా!

56. శ్రీకంఠుడు మీనామం
బేకఠినపు నీమమూని యెల్లప్పుడు న
స్తోక మనీష జపింపడె
శ్రీకర భద్రాద్రిధామ సీతారామా!

57. కేకీసంఘము మేఘవి
లోకనమున సుఖముగాంచు లోనెప్పుడటుల్
నాకబ్బుముదము మిముగన
శ్రీకర భద్రాద్రిధామ సీతారామా!

58. నీకథలు జెప్పుదాసు ల
నేకులుధనవంతులైరి నీప్రాపకమే
జేకూర్చు నఖిలసుఖములు
శ్రీకర భద్రాద్రిధామ సీతారామా!

59. మోకాలు నడ్డుపెట్టిన
ప్రాకటముగ లక్ష్మి దాను రాదలచినచో
రాకుండునె వగపేటికి
శ్రీకర భద్రాద్రిధామ సీతారామా!

60. కోకలనూడ్చిన ద్రౌపది
వ్యాకులపడి నిన్నువేడ నక్షయవలువల్
రాకాబ్జముఖికి నొసగవె
శ్రీకర భద్రాద్రిధామ సీతారామా!

61. రూకలకై మనుజుడు పలు
పోకలుబోవంగ నేల పూర్వభవమునం
దౌకర్మఫలము గుడుపదె
శ్రీకర భద్రాద్రిధామ సీతారామా!

62. ఏకఠినదపము దశరథ
భూకాంతుడు కోసలేంద్ర పుత్రీమణియున్
జేకొని జేసిరొ నినుగన
శ్రీకర భద్రాద్రిధామ సీతారామా!

63. కాకని కాకవియనుచు వి
వేకంబొకయింతలేక ప్రేలెదరిల దా
రేకవులొ దలిచిచూడగ
శ్రీకర భద్రాద్రిధామ సీతారామా!

64. నాకవితలోనదప్పు ల
నేకంబులుగలవెటైన నీకృతిగద శో
భాకరుమగునని దలచెద
శ్రీకర భద్రాద్రిధామ సీతారామా!

65. కాకోదరారివాహన
కాకోదరశయన దళితకాకోదరయా
కాకోదరభూషణనుత
శ్రీకర భద్రాద్రిధామ సీతారామా!

66. రాకేందుముఖము తామర
రేకులనేత్రముల బాల్యరీతులతోడన్
నాకడ నృత్యముజేయవె
శ్రీకర భద్రాద్రిధామ సీతారామా!

67. నాకంబున కరుగక మీ
రాకకు శరభంగుడుండి ప్రవిమలభక్తిన్
నీకళగని తరియించెను
శ్రీకర భద్రాద్రిధామ సీతారామా!

68. మీ కాపాడినరాజ్యము
శ్రీకరమై పక్షులకును సేమమెగూర్చెన్
ఘూకమ్ము గ్రద్దకధవిన
శ్రీకర భద్రాద్రిధామ సీతారామా!

69. ఓకమలాధిప రార
మ్మా కావగనంచు వేడ మకరినడచి ము
న్నా కరి నేలవె ప్రేమను
శ్రీకర భద్రాద్రిధామ సీతారామా!

70. ఆకులురాలి చిగిర్చిన
మాకులు శోభీంచునటుల మహినీభక్తా
నీకము దివ్యాకృతిగను
శ్రీకర భద్రాద్రిధామ సీతారామా!

71. తేకువ ప్రతియామమునకు
కోకోయని గూయునట్టి కోడివిధముగా
నేకాగ్రత గనవలె మది
శ్రీకర భద్రాద్రిధామ సీతారామా!

72. తోకలజుక్కలు బుట్టును
భూకంపములొదవు జగము బొందుభయంబున్
నీకరుణ దప్పెనేనియు
శ్రీకర భద్రాద్రిధామ సీతారామా!

73. ఏకర్మాచరణంబున
జేకూరు శుభోన్నతులును స్థిరముగ నా
కాకర్మము లొనగూర్పవె
శ్రీకర భద్రాద్రిధామ సీతారామా!

74. ఆ కుచేలుండు పిడికెం
డేకద యటుకులనొసంగె యేమన నతడ
స్తోకవిభవంబులందడె
శ్రీకర భద్రాద్రిధామ సీతారామా!

75. రాకొమారుడు ధృవుడైదేం
డ్లేకలిగియు నినుభజింప యెలమిధృవపదం
బా కంజార్కమొసగితివి
శ్రీకర భద్రాద్రిధామ సీతారామా!

76. తాకిట తధికిణధోమ్మని
ప్రాకటనృత్యంబుసల్పు భజపరులతో
నేకీభవింపజేయుము
శ్రీకర భద్రాద్రిధామ సీతారామా!

77. రోకలిపాటగ పాడుచు
నీకథలెల్లకడలందు నిండెజగతి సు
శ్లోకుండవగుట నరవర
శ్రీకర భద్రాద్రిధామ సీతారామా!

78. మోకయయి దివ్యఫలదపు
మాకైగంపట్టు నిమిషమాత్రను వ్యూహా
నీకంబు నిన్నుదలచిన
శ్రీకర భద్రాద్రిధామ సీతారామా!

79. మూకాంధక బధిరాదుల
యాకారముదాల్చితిరుగు నవధూతయనన్
గాకాశ్యపి నీభక్తుడు
శ్రీకర భద్రాద్రిధామ సీతారామా!

80. ప్రాకారాదులతోడను
మీ కాలయ మేరుపరచి, మేలందెను భూ
లోకారాధ్యుడు గోపన
శ్రీకర భద్రాద్రిధామ సీతారామా!

81. టూకిగజెప్పెద రెండే
వాకులలో నిన్నుమించు పరదైవంబున్
నాకంటె పాపిలేడిల
శ్రీకర భద్రాద్రిధామ సీతారామా!

82. ఆకొన్నవానికింత మ
ధూకరమిడడేని, యేటిదొర యక్కరకున్
రాకున్న వేల్పువేలుపే
శ్రీకర భద్రాద్రిధామ సీతారామా!

83. కాకులుతోకలలో నెమ
లీకల జేర్చికొనినంతనే శిఖులగునా
పోకిరుల వేషగతు లివి
శ్రీకర భద్రాద్రిధామ సీతారామా!

84. ఆ కంచర్లాన్వయునిన్
బాకీకై తురకరాజు బాధలపెట్టం
బాకీలెల్లను దీర్చితి
శ్రీకర భద్రాద్రిధామ సీతారామా!

85. నీకున్ శరణాగతులను
సాకెడు బిరుదంబదేడ చనియెనొ నాపై
రాకున్నది కారుణ్యము
శ్రీకర భద్రాద్రిధామ సీతారామా!

86. రూకలగూర్చినవాడొక
పోకైనను గొంచుజనునె పుణ్యము పాపం
బేకద వెన్నంటెడునది
శ్రీకర భద్రాద్రిధామ సీతారామా!

87. మీకుం గుడిగోపురములు
ప్రాకారంబులునుగట్ట ద్రవ్యముగలదే
సాకుము మ్రొక్కులుగైకొని
శ్రీకర భద్రాద్రిధామ సీతారామా!

88. నాకడ లేదొక పుచ్చిన
పోకైనను మీదు దివ్యపుం క్షేత్రంబుల్
నేకరణి గాంచగల్గుదు
శ్రీకర భద్రాద్రిధామ సీతారామా!

89. ఆకుల దుంపల మెక్కుచు
తేకువ దపమాచరించు దివ్యమునులె యా
లోకింపలేరు నిన్నిల
శ్రీకర భద్రాద్రిధామ సీతారామా!

90. నీకార్యం బాకోతుల
మూకలె నెరవేర్చె నేరుపుంగల నీచే
కాకున్నె యెట్టిపనియును
శ్రీకర భద్రాద్రిధామ సీతారామా!

91. ఈ కఱవుకాలమున నా
నాకష్టములందనీక నను దయతో సౌ
ఖ్యాకర బ్రోవగవలెజుమి
శ్రీకర భద్రాద్రిధామ సీతారామా!

92. చీకునివలె నీమాయా
నీకములోమునిగి తెరవునేగనలేకన్
నీకు గైమోడ్చితింజుమి
శ్రీకర భద్రాద్రిధామ సీతారామా!

93. ఊకనుదంచిన నందుల
నూకలుగనపడునె యెందునుం జిల్లర జే
జేకైమోడ్పులులాభమె
శ్రీకర భద్రాద్రిధామ సీతారామా!

94. బాకులపోటుల కల్ల
తుపాకీలకు భయముపడునె భక్తుడు దా
నిర్యాకులుడై తేజముగను
శ్రీకర భద్రాద్రిధామ సీతారామా!

95. లోకజ్ఞానము గలిగిన
ప్రాకటవిజ్ఞానమదియు పట్టువడునె య
స్తోకమగుభక్తిలేకను
శ్రీకర భద్రాద్రిధామ సీతారామా!

96. లౌకికుడు దన్నుదాన వి
వేకంబున మెచ్చుకొనుచు విహరించును మో
క్షాకరమగు గతిగానక
శ్రీకర భద్రాద్రిధామ సీతారామా!

97. నాకవిత పద్దెములనే
మీకొక పూదండగాగ మెడనిడితిదయన్
జేకొని కోర్కెలొసంగవె
శ్రీకర భద్రాద్రిధామ సీతారామా!

98. నేకౌండిన్యస గోత్రుడ
ప్రాకటముగ నబ్బరాజు వంశజుండను నే
నీకాప్తుడ పిచ్చయ్యను
శ్రీకర భద్రాద్రిధామ సీతారామా!

99. మీకారుణ్యముచే నిది
జోకప్రమోదూతయందు సురుచిర లీలన్
నీకర్పణ గావించితి
శ్రీకర భద్రాద్రిధామ సీతారామా!

100. భూకన్యాధిప మంగళ
మాకరినుత మంగళంభాస్కరకుల శో
భాకర మంగళమిదెగొను
శ్రీకర భద్రాద్రిధామ సీతారామా!

సమాప్తం

Sunday, June 21, 2015

గువ్వల చెన్న శతకము - పట్టాభిరామ కవి (?) /గువ్వల చెన్నడు(?)

గువ్వల చెన్న శతకము
శతకకర్త: పట్టాభిరామ కవి (వంగూరి సుబ్బారావుగారి అంచనా ప్రకారం కానీ స్పష్టమైన ఆధారాలు లేవు) గువ్వల చెన్నడు అనే కవికానీ ఆపేరులో మరెవరైనా కాని రచించి ఉండవచ్చునని పలువురి అభిప్రాయము. సుమారు క్రీ.శ. 1600 ప్రాంతములోని కవి.
అధిక్షేప శతకము.

1. శ్రీపార్థసారథీ! నేఁ
బాపాత్ముఁడ నీదు పాలఁ బడినాడ ననుం
గాపాడు మనుచు నాంతర
కోపాదు లడంచి వేఁడు గువ్వల చెన్నా!

2. నర జన్మ మెత్తి నందున
సరసిజనాభు నెదలోన స్మరియించుచుఁ ద
చ్చరణములు మఱవ కుండిన
గురుఫల మగు జన్మమునకు గువ్వల చెన్నా!

3. ఎంతటి విద్యలఁనేర్చిన
సంతసముగ వస్తు తతులు సంపాదింపన్
చింతించి చూడ నన్నియు
గొంతుకఁ దడుపుకొనుకొఱకె గువ్వల చెన్నా!

4. సారా సారము లెఱుఁగని
బేరజులకు బుద్ధిఁజెప్పఁ బెద్దల వశమా!
నీరెంత పోసి పెంచినఁ
గూరగునా వేలవేము గువ్వల చెన్న!

5. అడుగునకు మడుగు లిడుచును
జిడీముడి పాటింతలేక చెప్పిన పనులన్
వడిఁజేసినంత మాత్రాన
కొడుకగునా లంజకొడుకు గువ్వల చెన్నా!

6. ఈవియ్యని పద పద్యము
గోవా చదివించు కొనఁగఁ గుంభిని మఁదన
ఈవిచ్చిన పద పద్యము
గోవా మఱిఁ జదువుకొనగ గువ్వల చెన్నా!

7. ఇరుగు పొరుగు వారందఱుఁ
గర మబ్బుర పడుచు నవ్వగా వేషములన్
మఱిమఱి మార్చిన దొరలకు
గురు వగునా బ్రాహ్మణుండు గువ్వల చెన్నా!

8. అనుభవము లేని విభవము
లను భవ్యము కానియాలు నార్యానుమతిన్
గనని స్వభావము ధర్మముఁ
గొనని సిరియు వ్యర్థ మెన్న గువ్వల చెన్నా!

9. పదుగురుఈ హితవు సంప
త్ప్రదమును శాస్త్రోక్తమైన పద్ధతి నడువన్
జెదరదు సిరియు హరి భక్తియుఁ
గుదురును గద మదిని నెన్న గువ్వల చెన్నా!

10. వెలకాంత లెంద ఱైనను
గులకాంతకు సాటిరారు కువలయ మందున్
బలు విద్య లెన్ని నేర్చిన
గుల విద్యకు సాటి రావు గువ్వల చెన్నా!

11. కలకొలది ధర్మముండినఁ
గలిగిన సిరిగదలకుండుఁ గాసారమునన్
గలజలము మడువు లేమిని
గొలగొల గట్టు తెగిపోదె గువ్వల చెన్నా!

12. తెలిసియుఁ దెలియనివానికిఁ
దెలుపం గలఁడే మహోపదేశికుఁడైనన్
బలుకం బారని కాయను
గొలుపంగలఁ డెవఁడుపండ గువ్వల చెన్నా!

13. చెలియలి భాగ్యము రాజ్యం
బులనేలుచు జనుల ద్వేషమునఁ జూచుచుఁ గ
న్నుల మత్తతఁగొన్నాతఁడు
కొలనికి గాపున్నవాఁడు గువ్వల చెన్నా!

14. అపరిమిత వాహనాదిక
మపూర్వముగనున్న యల్పుఁ డధికుండగునా?
విపులాంబర వాద్యంబుల
గుపతియగునె గంగిరెద్దు గువ్వల చెన్నా!

15. పందిరి మందిరమగునా?
వందిజనం బాప్తమిత్రవర్గంబగునా?
తుందిలుఁడు సుఖముఁ గనునా?
గొంది నృపతి మార్గ మగున గువ్వల చెన్నా!

16. మిత్రుని విపత్తునందుఁ గ
ళత్రమును దరిద్ర దశను భ్రాతలగుణమున్
బాత్రాది విభక్తంబున
గోత్రను గనుగొనగఁవలయు గువ్వల చెన్నా!

17. అంగీలు పచ్చడంబులు
సంగతిఁగొను శాలుజోడు సరిగంచుల మేల్
రంగగు దుప్పటులన్నియు
గొంగళి సరిపోలవన్న గువ్వల చెన్నా!

19. స్వాంతప్రవృత్తిఁ గార్యా
నంతరమున మిత్రలక్షణంబు మద్యోహో
గాంతరమున బంధుత్వముఁ
గొంతైనంతటమ చూడు గువ్వల చెన్నా!

20. పురుషుండు తటస్థించిన
తరుణమునం దరుణిగుణముఁ దరుణిదనంతన్
దొరికినఁ బురుషుని గుణమును
గిరుబుద్ధి దెలియవలయు గువ్వల చెన్నా!

21. కలిమిఁగల నాడె మనుజుఁడు
విలసనమగు కీర్తిచేత వెలయఁగ వలె రా!
గలిమెంత యెల్లకాలము
కులగిరులా కదలకుండా గువ్వల చెన్నా!

22. బుడ్డకు వెండ్రుకలున్నఁ
గడ్డము కానట్లు కార్యకరణుల సభలన్
దొడ్డుగఁ జూతురే తలపై
గుడ్దలు బుట్టంత లున్న గువ్వల చెన్నా!



23 వ పద్యం నుండి 29 వ పద్యం వరకు దొరకలేదు

30. నీచునకు ధనము గల్గిన
వాచాలత గల్గి పరుష వాక్కులఱచుచున్
నీచకృతియగుచు మది సం
కోచము లేకుండఁ దిరుగు గువ్వల చెన్నా!

31. అల్పునకు నెన్ని తెల్పినఁ
బొల్పుగ నిల్వవని పేడబొమ్మకు నెన్నో
శిల్పపుఁ బను లొనరించినఁ
గోల్పోక యలారుచున్నె గువ్వల చెన్నా!

32. పిత్రాద్యైశ్వర్యముచేఁ
బుత్రులుఁ బౌత్రులును ధర్మబుద్ధిఁ జరింతుర్
చిత్రగతి నడుమఁ గల్గిన
గోత్రం జిత్రగతిఁ దిరిగు గువ్వల చెన్నా!

33. ధర నాదపడుచు సిరిచే
నిరతంబును బొట్టనించి నీల్గెడు మనుజుం
డొరు లెఱుఁగకుండ ఱాతో
గురుతుగ నూతఁబడు టొప్పు గువ్వల చెన్నా!

34. గొల్లింటఁ గోమటింటను
దల్లియుఁ దండ్రియు వసింప దాను వకీలై
కళ్ళ మదమెక్కి నతనికి
గుళ్ళైనం గానరావు గువ్వల చెన్నా!

35. కాళ్ళం జేతులఁ జెమట
నీళ్ళవలె స్రవించుచుండ నిరతము మదిలోఁ
గుళ్ళక వకీలునని తన
గోళ్ళం గొఱుకుకొను ద్విజుడు గువ్వల చెన్నా!

36. సవతితన మున్న చుట్టలు
భువి నెఱసుగ నుండి సమయమున దూరంబై
నపుచుందురు రావేడినఁ
గువచనములు పల్కుచుంద్రు గువ్వల చెన్నా!

37. తనవారి కెంత గల్గిన
దన భాగ్యమె తనకు నగుచు దగు వాజులకున్
దన తోకచేత వీచునె
గుణియైనన్ ఘోటకంబు గువ్వల చెన్నా!

38. అతిచన విచ్చి మెలగంగ
సుతసతులైన నిరసించి చులకన చేతుర్
మత మెఱిగి చరియింపదగుఁ
గుతుకముతో మనుజుఁడెపుడు గువ్వల చెన్నా!

39. చెన్న యను పదము మునుగల
చెన్నగుపుర మొకటి దీనిచెంతను వెలయున్
సన్నుతులు వేల్పు సుతులును
గొన్నాతని కరుణచేత గువ్వల చెన్నా!

40. ధర నీపేర పురంబును
గిరిజేశ్వర పాదభక్తి కీర్తియు నీయు
ర్వరసుతులగాంతు విదియొక
గురువరముగ నెంచుకొనుము గువ్వల చెన్నా!

41. తెలుపైన మొగము గలదని
తిలకము జుట్టు చ్యజించి తెల్లయిజారున్
దలటోపి గొనఁగ శ్వేత ము
ఖులలో నొకఁడగునే ద్విజుడు గువ్వల చెన్నా!

42. వెల్లుల్లిఁ బెట్టి పొగచిన
పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా
మొల్లముగ నూనివేసుక
కొల్లగ భుజియింప వలయు గువ్వల చెన్నా!

43. నీచున కధికారంబును
బాచకునకు నాగ్రహంబుఁ బంకజముఖికిన్
వాచాలత్వము బుధ సం
కోచముఁ గడు బాధకములు గువ్వల చెన్నా!

44. దుడ్డన నెఱుఁగని తలిపా
టొడ్డుగఁగొను విద్యచే మహోద్యోగము తా
నడ్డైనఁ గనులకీఁ గల
గొడ్డువలెఁ జరించు చుండు గువ్వల చెన్నా!

45. బుడుతలు భోగంబులు సిరి
యడరు కొలంది గన కార్యమందతి హితులై
తొడరి కడుఁ జెడుదు రిలపైఁ
గుడి యెడమలు లేర ముందు గువ్వల చెన్నా!

46. కస కసలు కాయగూరల
బుస బుసలగు ఱొంపనుండు బుడుతల యందున్
రుస రుసలు కోపి యందును
గుస గుసలు రహస్యమందు గువ్వల చెన్నా!

47. కర కర నమలుటయందును
బరపర యగునెపుడు చుఱుకు వ్రాతలయందున్
జురచుర కాలుట యందును
గొర కొర యగుఁ గోపదృష్టి గువ్వల చెన్నా!

48. కలిమిగల లోభి కన్నను
విలసితమగు పేద మేలు వితరణియైనన్
చలి చెలమ మేలుకాదా
కులనిధి యంభోదికన్న గువ్వల చెన్నా!

49. విను మిన్నీల శిఫార్సున
దనునమ్మిన వాని పనులు ధ్వంసించు వకీ
ల్తన మున్నవాఁడు తిరిపెముఁ
గొనునాతడు చల్లవాఁడు గువ్వల చెన్నా!

50.సజ్జనులు సేయునుపకృతి
సజ్జను లెఱుగుదురు గాక సజ్జన దూష్యుల్
మజ్జనమునైన నెఱుగరు
గుజ్జన నంబలిని గాక గువ్వల చెన్నా!

51. తడ తడ భీతహృదయముల
బెడ బెడయగుఁ బుట్టు బట్ట విడఁగట్టనెడున్
బడ బడ బాదుట యందును
గుడగుడ  యన్న ముడుకందు గువ్వల చెన్నా!

52. పాగా లంగరకాలును
మీఁగాళ్ళ నలారఁబంచె మేలిమి కట్టుల్
సాగించు కండువాల్పయి
కోఁగా యిఁక గాన మెన్న గువ్వల చెన్నా!

53. వెలయాండ్ర వీధులం జనఁ
దలపు లవారిగఁ జనించి తమ మిత్రులతోఁ
గలిసి షికారు నెపంబునఁ
గులుకుచు పోవుదురు ముందు గువ్వల చెన్నా!

54. ఎన్నగల జీవరాసుల
యన్నిటి గర్భమునఁ బుట్టి యట మనుజుండై
తన్నెఱిఁగి బ్రతుక వలెరా
కొన్నాళ్ళకు నెచట నున్న గువ్వల చెన్నా!

55. కామినులకు సంతుష్టియు
గాముకులకు వావి వరుస కఠినాత్మునకున్
సామోక్తులు విశ్వాసము
కోమటులకుఁ దలఁప సున్న గువ్వల చెన్నా!

56. లొడలొడ యగు నదులందును
బుడబుడ నీళ్ళందు బుడ్డి మునుగుటయందున్
గడగడ చెవిబాధ యెడన్
గొడగొడ అప్రస్తుతోక్తి గువ్వల చెన్నా!

57. సంకటములచే మెయిగల
పొంకంబెల్లను నడంగి పొలుపరి నడుపన్
జంకుం గలిగియు మెల్లన
కొంకర ముండింటికేగు గువ్వల చెన్నా!

58. ధన మైనంతట భూముల
తనఖాలును విక్రయములు తరువాత సతీ
మణి భూషణాంబరములు
గొనుటయు విట లక్షణములు గువ్వల చెన్నా!

59. నిత్యానిత్యము లెఱుఁగుచు
సత్యంబగుదానిఁ దెలిసి సత్కృత్యములన్
నిత్యము జేయుచు దశ ది
క్త్సూత్యముగా మెలఁగుమన్న గువ్వల చెన్నా!

60. ధనమే మైత్రినిఁ దెచ్చును
ధనమే వైరమును దెచ్చు ధనమే సభలన్
ఘనతను దెచ్చును నెంతటి
గొనముల కుప్పలకునైన గువ్వల చెన్నా!

61. జనకుని కులవిద్యలు గల
తనుజుఁడు తనుజుండు గాక ధారుణిలోనన్
దనుజుఁడు దనుజుండగుఁ ద
ద్గుణవిద్యలు లేకయున్న గువ్వల చెన్న!

62. అక్కరకగు చుట్టములకు
మ్రొక్కఁగవలెగాని చూచి మూల్గెడు వారల్
లెక్కిడుట కొఱకె యోర్వని
కుక్కలు మేఁక మెడ చళ్ళు గువ్వల చెన్నా!

63. నిజ వారకాంత లైనన్
బొజుగులలారఁ గమరంద భుజుల నధములన్
గజివిజి లేక గ్రహించుచు
గుజగుజ బెట్టక లరింత్రు గువ్వల చెన్నా!

64. ప్లీడరులమని వకీళ్ళీ
వాడుక చెడ స్చేచ్చఁ దిరిగి పాడు మొగములన్
గూడనివారిం గూడుచు
గూడెములఁ జరింత్రు ముందు గువ్వల చెన్నా!

65. ఇల్లా లబ్బె నటంచును
దల్లింగని తిట్టికొట్టి తరిమెడి తను భృ
త్తల్లజునకు భువికీర్తియుఁ
గుల్లలు గద దివి సుఖములు గువ్వల చెన్నా!

66. తల పరువు నోరే చెప్పును
లలికాయల పండు పరుపు రంగే చెప్పున్
కులవాజి జవము నడకయుఁ
గులమును వేషంబు చెప్పు గువ్వల చెన్నా!

67. వేముల దిను నలవాటును
భామలగని వీడుటయు బరితోషమునన్
బాముల మైత్రియు నేర్చినఁ
గోమటితో మైత్రి వలయు గువ్వల చెన్నా!

68. ఇలఁ గోమటీఁ జెలికానిగఁ
వలఁచుచుఁ దద్థితముగాగ దలనాల్కవలెన్
మెలగుటనేర్చిన గడుసగు
కులకర్ణిని గూడవలయు గువ్వల చెన్నా!

69. తన హితవుగోరు సతిగల
దనుకనె గృహనివసనంబు తగు పురుషునకున్
దన కడుపు శక్తి కొలదిగ
గొనవలయుఁ బదార్థములను గువ్వల చెన్నా!

70. తన తల్లియొక్క పరువును
తనదగు నోరె ప్రకటించు దథ్యం బనియే
సునృపులు ఘోషాఁబెట్టిరి
గుణాదులన్య మగుచుననుచు గువ్వల చెన్నా!

71. చుట్టరికము జేసికొనన్
గట్టడిగా దిరిగి తిరిగి కార్యంబైనన్
మిట్టిపడుచు మాట్లాడడు
గుట్టించు నియోగి వరుఁడు గువ్వల చెన్నా!

72. ఎంతధికారం బున్నను
సంతతమును బరులయెడల సత్కులజాతుం
డెంతయు నమ్రతఁ జూపును
గొంతైనను మిడిసిపడఁడు గువ్వల చెన్నా!

73. వేషముల చేత నొకటను
భాషాపతి కులులు మొదలు పదజుల వరకున్
శేషించి యొకడు నుండడు
ఘోషాయును బోవు ముందు గువ్వల చెన్నా!

74. సధవయు విధవయు నొకటిగ
బుధి లీక్షింపంగ నుంద్రు బొంకము మీఱన్
అదమంపు వేషభాషలఁ
గుధరము లనఁ గదలకుంద్రు గువ్వల చెన్న!

75. నీతి యెఱుంగని నీచు న
కాతత రాజ్యము లభింప నధికుండగునా
నాతివలెను నటియించునె
కోఁతికి స్త్రీ వేషమిడిన గువ్వల చెన్నా!

76. తక్కువ తరగతిగల నరు
డెక్కువ యగువానిఁ గాంచి యేడ్చుచు నుండున్
జక్కఁగ గరి వీధిం జన
గుక్కలు గని మొఱుగకున్నె గువ్వల చెన్నా!

77. పరువున కొకటగు బంధూ
త్కరమున ధనవంతు నధికుగా నధనికునిన్
గర మల్పునిగాఁ జూతురు
గురినెన్న ధనంబు తిరమె గువ్వల చెన్నా!

78. తొత్తునకే శివమెత్తగ
నత్తఱి మ్రొక్కవలెననెడి నార్యోక్తి వలెన్
తొత్తు కొడుకైన రాజును
క్రొత్తగ సేవింపవలయు గువ్వల చెన్నా!

79. కంగా బుంగా గొట్టిన
పొంగిన మిరియాల నేతి పిడుచతో
మ్రింగిన నాకలి నడచుట
కుంగల నజ్జును హరించు గువ్వల చెన్నా!

80. సంగీతము నాట్యము గణి
కాంగనలవి గాని యవి కులాంగనలవియా?
పొంగుచు వాద్యము రచ్చల
కుం గొని చని పాడఁగలరె గువ్వల చెన్నా!

81.జాలివీడిన చెలికానిని
మాలనిగా నెన్నవలయు మఱియును బనికిన్
మాలినదై చెట్టేక్కెడి
గోలాంగూల మనవలయు గువ్వల చెన్నా!

82. ముట్టంచు మాసమునకొక
కట్టడిచేయఁబడె దానికట్టుఁ దెలియకే
రట్టొనరింతురు గర్భపు
గుట్టు దెలియటకుఁ గాదె గువ్వల చెన్నా!

83. ఆలికిఁ జనువిచ్చినచోఁ
దేలిక కులమందుదైనఁ దేలికచేయున్
లాలించిన కొలఁదిగ నను
కూలతఁ గొను నధిక కులజ గువ్వల చెన్నా!

84. అవసరవిధిఁ బరువెఱుఁగని
నివసనమున కరుగనగు ననేకావృత్తుల్
భువి విత్తముఁగొని పలుకని
కువాక్కులు వకీళ్ళె సాక్షి గువ్వల చెన్నా!

85. ధనవద్గర్వులు కొందఱు
ఘనమనుచుం బంక్తిభేద కలితమ్ముగ భో
జనముం గావింతు రటులఁ
గొను టఘ మందురు బుధాళి గువ్వల చెన్నా!

86. చెడుబుద్ధి పుట్టినపుడు
సడిచేయక తనదు హృదయసాక్షి యెఱిఁగి నీ
వుడిగు మిది తగదనుచు జన
కుడువలెఁ గృపజెప్పుచుండు గువ్వల చెన్నా!

87. మేడ యొకటి కలదని కడు
వేడుకలం బడుచు విఱ్ఱవీగుచు నీచుం
డాడకుఁ బరులెవ్వరు రాఁ
గూడదనుచుఁ బల్కుచుండు గువ్వల చెన్నా!

88. లోభికి వ్యయంబు త్యాగికి
లోభిత భీరునకు యుద్ధలోలత్వమ్మున్
వైభవము పతికి బ్రాణ
క్షోభంబుగఁ దోఁచుచుండు గువ్వల చెన్నా!

89. సిరిగలుగ సుఖము కలుగును
సిరిసంపదలున్న సుఖము చింత్యము భువిలోఁ
దరువు చిగిర్చిన గోమగు
గురుతఁ గొనదె కాయలున్న గువ్వల చెన్నా!

90. తక్కువవానిని రమ్మని
యెక్కువవానిఁగా నొనర్ప నెంచినఁ గాద
మ్మక్కఁగ నందల ముంచినఁ
గుక్కాకున కుఱుకకున్నె గువ్వల చెన్నా!

91. తబ్బిబ్బుగాడు క్షుద్రుఁడు
సబ్బండుగ నిష్ఠనున్న సబ్బునఁ గడుగఁ
బొబ్బలిడ నల్లశ్వనము
గొబ్బున తెల్లనిది యగునె గువ్వల చెన్నా!

92. జారిణి తనవగు పనులె
వ్వారలుఁ జూడరను బుద్ధి వర్తించు నిలన్
క్షీరముఁ దాగు బిడాలము
కోరికలో దలచునట్లు గువ్వల చెన్నా!

93. వాకొనెద గూనమును గల
చాకలి యధికారియైన జనముల సుఖముల్
చేకొనిన కొఱవిచేఁ దలఁ
గోకికొనిన యట్టులుండు గువ్వల చెన్నా!

94. పక్కలనిడి ముద్దాడుచుఁ
జక్కఁగఁ గడుగుచును దినము సబ్బు జలముచే
నక్కఱదని యస్పృశ్యపుఁ
హుక్కలఁ బెంచుదురు ద్విజులు గువ్వల చెన్నా!

95. కాంచనచేలుని విడిచి ప్ర
పంచమున న్నీచుపాలయ్యుఁ గడున్
జంచల యగు సిరి పోకకుఁ
గుంచితమతి యగుట తగదు గువ్వల చెన్నా!

96. చింతలఁ జివుకుచు నున్నను
స్వాంతము నెపుడైన హరుని యదుంచ దగున్
అంతట నాఁచున్న సరసి
గొంతట రేవైనభంగి గువ్వల చెన్నా!

97. వెలయాండ్రవలెను బనిపా
టలు వీడి సంగీతము నటనము నభినయమున్
గులవిద్యలుగా గైకొని
కులసతులు చరింత్రు ముందు గువ్వల చెన్నా!

98. లోభికి వ్యయంబు సోమరి
యౌ భామకుఁ బనియుఁ నిర్ధనాత్మునకు నప
త్యాభివృద్ధియును బహు
గోభర్తకు నఘము లురువు గువ్వల చెన్నా!

99. సరియైన వారితోడను
నరుగఁగవలె నొక్కపనికి నటుకాకున్నన్
విరసపుఁ బల్కులు పల్కుచు
గురి విడిపొమ్మనగఁ గలరు గువ్వల చెన్నా!

100. తన్ను మునుపు చదివించిన
మున్నీని విలేఖనమున మాన్యజనునకున్
సున్నిడి యరిచే విత్తముఁ
గొన్న వకీల్చల్లవాఁడు గువ్వల చెన్నా!

101. వెలయాలు లజ్జచేఁ జెడు
నిలఁ దాఱుడు చెడు దురాశ నెద సంతుష్టిన్
విలసిల్లి భూధవుఁడు చెడుఁ
గులసతి చెడు లజ్జ లేమి గువ్వల చెన్నా!

102. భువి నొకడు చెడును మఱియొకఁ
డవిరళముగ వృద్ధినొందు నది విధి వశమౌ
రవి యుదయించును నొక దెసఁ
గువలయపతి క్రుంకు నొకెడ గువ్వల చెన్నా!

103. ఎవ్వరి కెయ్యది చెప్పిన
నెవ్వరు వినరెయ్యదియును నెట్టెట్టినరుల్
మువ్వముగఁ జూచుచుండుము
గువ్వలనఁ జరింత్రు ముందు గువ్వల చెన్నా!

104. ఎప్పటికైనను మృత్యువు
తప్పదని యెఱింగియుండి తగిన చికిత్సం
దప్పింప నెఱుఁగ కత్తఱి
గుప్పింప నేడ్చెద రదేల గువ్వల చెన్నా!

105. జరయును మృత్యువు మొదలుగ
మరలఁగ రాకుండునట్టి మార్గంబేదో
గురుతెఱుఁగఁ జేయుమని శ్రీ
గురుగురుని భజింపవలయు గువ్వల చెన్నా!

106. పరమార్థము నొక్కటెరిగి
నరుడు చరింపంగవలయు నలువురిలోఁ బా
మరుఁడనఁగ దిరిగినను దన
గురి యొక్కటి విడువకుండ గువ్వల చెన్నా!

107. చతురాస్యుని సృష్టియు ఘట
కృతి వర్యుని భంగికాన నేకగతి సర
స్వతి చర్యలట్లె యుండును
గుతుకముతోఁ జూచుచుండు గువ్వల చెన్నా!

108. పాపము లంటగ నీయక
ప్రాపొసగి శరీర మొసగి పరమపదంబున్
జేపట్టి యొసగి కృష్ణుఁడు
గోపికలను గరుణఁగాచె గువ్వల చెన్నా!

109. మగవారి లక్ష్యపెట్టక
తెగి వీధుల నంగడులను దిమ్మరియెడి యా
మగనాలు దుర్యశంబున
కుఁనగుదురగుం విడువవలయు గువ్వల చెన్నా!

110. వెలయాలు సుతుడు నల్లుడు
నిలపతియును యాచకుండు నేవురు ధరలో
గలిమియు లేమియు నెఱ్గరు
కులపావనమూర్తి వన్న గువ్వలచెన్నా!

111. అడుగదగు వారి నడుగక
బడుగుల నడుగంగ లేమిఁ బాపంగలరా?
వడగళ్ళ గట్టువడునా
గుడి,ఱాళ్ళను గట్టుకొన్న గువ్వల చెన్నా!

112. నిలు వరుస దానగుణములు
గలవారికి గాక లోభిగాడ్దెలకేలా?
తలుపేల చాప గుడిసెకు
గులపావన కీర్తివన్న గువ్వల చెన్నా!

113. పరిగేరుకున్న గింజలు
కరువున కడ్డంబురావు కష్టుందిదు నా
తిరిపెమున లేమితీరదు
గురుతర సత్కీర్తిఁగన్న గువ్వల చెన్న!

114. గుడి కూలును నుయి పూడును
వడి నీళ్ళం జెరువు దెగును వనమును ఖిలమౌ
చెడనిది పద్యము సుమ్మీ
కుడియెడమలు చూడకన్న గువ్వల చెన్నా!

115. ఇప్పద్యము లన్నిటిలోఁ
జెప్పిన నీతులను మదినిఁ జేర్చి తెలిసినన్
దప్పక పదుగురిలోఁ గడు
గొప్పగ నీతిపరుడగును గువ్వల చెన్నా!

సమాప్తం

Wednesday, June 17, 2015

నరసింహశతకము - రచయిత తెలియదు

నరసింహశతకము
                                  రచయిత తెలియదు

1. శ్రీ మానినీవిమలహృ
త్తామరస దివాకరా సుదర్శనహస్త
శ్రీమంగళశైలాధిప
ధామా నరసింహనామ దైవలలామా

2. అంబుధిశయనా! మునిహృద
యాంబుజసంచార! ఫణికులాధిపశయనా
కంబుగ్రీవార్చిత పా
దాంబుజయుగ! శౌరి! మంగళాద్రినృసింహా

3. కుంభీంద్రపాలకా! హరి
కుంభినిపరిపాలకా! యకుంఠితతేజా!
జంభారివినుత! ఘనకరు
ణాంభోనిధి! దేవ! మంగళాద్రినృసింహా

4. ధర్మము నిలుప జనించితి
వర్మిలియుగయుగమునందు నయముగనిపుడున్
ధర్మము నిలుప జనింపుము
శర్మదుఁడవు మంగళాద్రి జయనరసింహా

5. రోగంబులు క్షామము భూ
భాగంబునఁ ప్రబలె మాయభాగ్యము సమ్య
క్త్యాగవిహీనులు ప్రబలిరి
యాగమనుత మంగళాద్రి యనఘనృసింహా

6. అజ్ఞానిని నినుదెలియఁగ
ప్రజ్ఞాహీననుగదయ్య పాలింపుమినన్
సుజ్ఞానహృదయవాసా
యజ్ఞానము బాపి మంగళాద్రినృసింహా

7. నిగమములు బలుకఁజాలవు
నగజాపతినిన్నుఁ దెలియడటసేవింపన్
జగదీశ్వర! సర్వాత్మక!
అగణితదయనేలు మంగళాద్రినృసింహా

8. యోగవిధ్యానవిహీనులు
భోగపరాయణులుధాత్రి బొడమిరి స్వార్ధ
త్యాహులఁజేయుమి యందఱ
నాగడములు వాపి మంగళాద్రినృసింహా

9. ధ్యానము మౌనమునాత్మ
జ్ఞానమునెఱుఁగంగలేని కలుషాత్ములు నీ
మానవులగుచుండిరయో
మానుపవే దుర్గుణములు మాన్యనృసింహా

10. ఘనరోగపీడితులు మఱి
ధనలోభులు క్రోధమతులు దంభాకారుల్
గుణహీనులైరినరులిదె
ఘనమతులను జేసిప్రోవు ఘననరసింహా

11. భుక్తియురక్తియు యుక్తియు
ముక్తియు భక్తియును శక్తి మొదలెఱుఁగమయో
ముక్తిప్రదుగన మాత్మసు
శక్తి నొసఁగు మంగళాద్రి జయనరసింహా

12. అథముఁడును ధర్మమెఱుఁగని
యధికారికి సేవచేయుటన్నంబునకై
యధమత్వముగాదే ఘన
పథకమెఱుఁగక మంగళాద్రి భవ్యనృసింహా

13. సేవింపనేటికే తమ
జీవితంగడుపనీచు చిత్తులమది స
ద్భావమున నాత్మశక్తిని
సేవింపఁగరాదె నిన్ను శ్రీనరసింహా

14. సాకారుఁడన్ననేమి ని
రాకారుండన్ననేమి యఖిలాంతరధ
ర్మైకరతుల్ న్యాయమతుల్
బ్రాకటగుణధనులకెన్న భవ్యనృసింహా

15. ధర్మంబె నీస్వరూపము
ధర్మమయుడవీవుసకల ధర్మరతులె నీ
మర్మమెఱుంగగనేర్తురు
ధర్మవిహీనులకు నీకు దవ్వునృసింహా

16. ఏవిధినిన్నెఱుఁగందగు
నేవిధిధర్మంబునిలుచు నెవ్వేళలమా
కేవిధికర్తవ్యమె నీ
వావిధిబోధించు మంగళాద్రినృసింహా

17. ఎవ@డు ప్రజోన్నతికైధర
ప్రవిమలమతినేలునతని పావనయశమే
రవళించునెల్లదిక్కుల
కవివాగ్లక్ష్యంబుచేవె ఘననరసింహా

18. ధర్మమెఱుంగని చదువును
ధర్మములేనట్టి తెలివి ధనమునుబ్రదుకుం
కర్మములు వ్యర్ధములుగద
దర్మమె నీతేజమంచు దలఁతునృసింహా

19. ఏతీరునభావించిన
నాతీరునదోఁపుచుచుందు వమలాత్ములకున్
భూతదయోన్నతమతులకు
భూతమయాసర్వమీవె ప్రోలనృసింహా

20. దయనరునకు తొడవెయ్యెడ
దయయేనీరూపమంచు దలచెదనేనా
దయలేనివాడు శాత్రువు
జయముంగాంచంగలేడు జయనరసింహా

21. ధనలోభమతికి దయయును
వినయముత్యాగంబు స్నేహవిభవంబునునె
మ్మనమునకెక్కవు ధనమే
ఘనమాసద్గుణముఘనము ఘననరసింహా

22. పరహితమతికవ్వేళను
గురుతింపగహేతువేల కూరిమిచూపం
బరహింసాసక్తునకును
గురుకారణమేలచెఱుపగోరునృసింహా

23. అర్థప్రియులౌచును స
ర్వార్థప్రదునిన్ను దెలియ రజ్ఞులుభో
గార్ధములును గడపటిపురు
షార్ధముబోలెనని యార్యులండ్రునృసింహా

24. శాంతాత్ములు నీభక్తులు
శాంతాట్ములె నిన్నెఱుంగజాలుదు రెదలో
శాంతవిహీనులకునునీ
కెంతోదూరంబు జగదాధీశనృసింహా

25. శాంతవిహీనుండా దివి
జాంతకుఁడెఱుఁగంగ జాలె నానిన్నుమహా
శాంతుడు ప్రహ్లాదుఁడుబహి
రంతరములనిన్నెచూచెనయ్యనృసింహా

26. శాంతంబె ముక్తినిచ్చును
శాంతవిహీనునకును నాత్మసౌఖ్యముగలదా
శాంతమె గౌరవమొసఁగును
శాంతునకగు నిత్యసంతసంబునృసింహా

27. నిర్మలము నిరుపమానము
ధర్మమయము నీచరితము దలచెద నాదు
ష్కర్మములు ద్రోసిబ్రోవలె
కల్మషహర మంగళాద్రి ఘననరసింహా

28. మిత్రంబులు సుజనులకు ప
విత్రంబులునఘలతలవిత్రంబులుస
త్పాత్రములు పొగడనీదుచ
రిత్రంబులు మంగళాద్రి శ్రీనరసింహా

29. భూరిభయవిదారణములు
కారణములు మోక్షరాజ్యగరిమకు నీస
చ్చారిత్రవర్ణనలుభవ
హారివిగదె నీవుమంగళాద్రినృసింహా

30. అరివర్గహారివని నిను
బరిపరివిధములభక్తి భావించిమదిం
దిరముగనమ్మితి కూరిమి
నరయగదే నిన్ను మంగళాద్రినృసింహా

31. కల్యాణదాయివని వై
కల్యములేకుండగొలుతు గదవేమాకుం
గల్యాణము లొసగుము సా
కల్యముగా మంగళాద్రి ఘననరసింహా

32. మంగళగిరినిలయా నీ
మంగళతరమహితగుణసమాజంబెన్న
న్మంగళము లొసఁగునెపుడు శు
భాంగామమ్మేలు మంగళాద్రినృసింహా

33. ఎవ్వఁడునినుమదినమ్మునొ
యెవ్వనిరక్షింపనీవు నెంతువొ వాని
నెవ్వగలఁగుందజేతువు
నవ్వులకేయేమొగాని నవ్యనృసింహా

34. అపనిందలనొందింతువు
నపరాధియటంచుమనుజులనఁ జేతువు నీ
చపుదశ నొందింతువు నీ
కృపచూపవు గాదెమొదట శ్రీనరసింహా

35. అప్పటికిని నిశ్చలమతి
దప్పక నిన్నాత్మనెంచు ధర్మాత్ముని నీ
వెప్పటికిని రక్షింతువు
చెప్పితినే నిదినిజంబు శ్రీనరసింహా

36. పలుక నశక్యంబగు మది
దలఁచిన కొలఁదినివిచిత్ర తరమగు నీలీ
లలు నిట్టివనినుతింపఁగ
నలవియకో యెవరికైన ననఘనృసింహా

37. ముక్తి సతీమణిమౌళిని
ముక్తామణులగు నీపదములు పొగడఁగ న
వ్యక్తను నే నేరఁజుమీ
శక్తిత్రయమూర్తివీవు జయనరసింహా

38. పొంతనములు ముక్తికిశ్రుతి
కాంతా సీమంతవీధి ఘనభూషలు పా
దాంతమహితదీధితులా
ద్యంతస్థితిరహిత మంగళాద్రినృసింహా

39. ఏతేజమనలశశిఖ
ద్యోతాదులయందు వెలుఁగునో భూతౌఘం
బేతేజముచే నలరెడి
నాతేజెమెగొలుతు మంగళాద్రినృసింహా

40. శ్రీకరము నఖిలశత్రుని
రాకరమును మహితకీర్తికారకమును సౌ
ఖ్యాకరమగు కల్యాణగు
ణాకర నీసేవ మంగళాద్రినృసింహా

41. బాలుఁడు ప్రహ్లాదునిలో
నాలోచింపంగఁబెద్ద యగు నారదులో
చాలవెలుఁగు నీతేజమె
లలితగుణజాల నేదఁలంతు నృసింహా

42. చారుతరమంగళాద్రి ఘ
నారామమనిహారకౌతుకాయుత్తమతీ!
సూరిజనహృదయ పద్మవి
హారా! రవితేజ! మంగళాద్రినృసింహా

43. మంగళతర మంగళగిరి
శృంగాగ్రవిహార నారసింహాకారా
సంగరహితమునిమానస
రంగన్మణిపీఠవాస రమ్య నృసింహా

44. సామాదిగానలోల ని
రామయుఁడవు భూతమయుఁడ వమలుఁడ వనుచుం
బ్రేమంబున నుతిచేతును
కామితఫలదాతవీవు ఘననరసింహా

45. సారసదళలోచన నీ
చారుపదాంబుజయుగంబు సద్భక్తిని హృ
త్సారసమునఁ గొల్చెదభవ
తారకమని మంగళాద్రిధామనృసింహా

46. ఆద్యమ నిర్వచనీయము
హృద్యము నిర్వధిక మనుపమేయము శ్రుతిసం
వేద్యంబునీదు చరితం
బాద్యంత విహీన మంగలాద్రినృసింహా

47. ప్రజ్ఞానులు నిశ్చలది
వ్యజ్ఞానులునైనఁ దెలియఁగానేరరు నే
నజ్ఞాని నెఱుగనేర్తునె
ప్రజ్ఞానమయస్వరూప భవ్యనృసింహా

48. నిరవధివై నిర్విధివై
నిరంజన నిరామయతను నెఱివెల్గెడి ని
న్నరసి తెలియంగఁగలరే
హరసురవిధులైన మంగళాద్రినృసింహా

49. నిను సగుణుఁడు సాకరుం
డనినను నిర్గుణుఁడు మఱి నిరాకారుండే
యనినను యెటులెన్నిన నా
మనమున నానందమొదవు మాన్యనేసింహా

50. వేదండవరద బాయక
నీదిపదాబ్జములు గొలుతు నిశ్చలమతిన్
నీదరిజేరితి నన్ను ఘ
నాదరమునఁబ్రోవు మంగళాద్రినృసింహా

51. నానాథుని సఫలీకృత
మనోరథునిఁజేసిప్రోవుమా దయతోడన్
నీనామమె దలఁచెద నీ
యానసుమీ మంగళాద్రి యమలనృసింహా

52. నమ్మితి నీపదయుగళము
నెమ్మదిని నిరంతరంబు నిండినభక్తిన్
నమ్మినఁ బ్రోచుటనీకును
సొమ్ముగదే మంగళాద్రి శుభనరసింహా

53. భూషింపనేరఁ బెక్కులు
శేషశయన! నిన్నుమదిని సేవింతు మముం
బోషింపు మార్తరక్షక
భూషణముదిగాదె నీకుఁ బుణ్యనృసింహా

54. నీపదము లెన్నువారల
నాపదలనుబాపి సుఖములందింపంగా
తాపత్రాయాబ్ధి గడుపఁగ
నీపనిగదె మంగళాద్రి నిలయనృసింహా

55. తెలిసియుఁ దెలియక తప్పులు
పలికినచో దేవ! మదిని బాటింపక ని
శ్చల భక్తినొసఁగి ప్రోవుము
అలఘు దయానిలయ మంగళాద్రినృసింహా

56. సతులకు పతియందు బ్రియో
న్నతి భూతదయారతియును నయ విద్యాసం
తత ధైర్యమతియు సజ్జన
హితమతియు నొసంగిప్రోవు మీశనృసింహా

57. మానవతులపై మది నను
మానమసూయయును బూని మాత్సర్యమతు
ల్మాన కపనిందమోపుట
యేనాఁడును గలదుచూవె యీశ! నృసింహా

58. ఇది నిజమా కాదా యని
మదిలోఁజర్చింపకొరుల మదిఁగలఁగం బె
ట్టిదముగఁ బలుకుటె యెప్పుడు
ముదమగు దుష్టులకు విమలమూర్తినృసింహా

59. సోదరభావోన్నతి మరి
యాదవిహీనులకుఁ దెలియదకటా! కాలో
న్మాదంబటంచు నితరుల
కాదని తిట్టుటయె తెలియుఁగాని నృసింహా

60. తరుణులఁ జుల్కదనంబుగ
నరయక నెవ్వేళగౌరవార్హలటంచుం
గరము దలంపగఁజేయుము
పురుషుల నెమ్మనములందు బుణ్యనృసింహా

61. తనబాహుకలిమి దైవం
బునుసత్యమునమ్మి ద్రోహమునుజేయక నె
మ్మనమున సుఖమొందగఁనీ
జనులకు బోధింపుమీవు జయనరసింహా

62. తలితండ్రులకును బిడ్డల
కిలను సహోదరులకైన నెయ్యెడ వైరం
బులు పెంచుధనము నేటికిఁ
గలిగించితి వీజగమున ఘననరసింహా

63. తల్లినిబిడ్డలు బిడ్డలఁ
దల్లియు భగినులను నన్నదమ్ములు హితులుం
గల్లరులై ధనమునకై
చల్లగ మోసంబొనర్తు జయనరసింహా

64. స్వార్ధపరులైన దుర్మతు
లర్ధమునార్జించి కీర్తినాశింపరు స
ర్వార్ధప్రదునిను గాంతురు
స్వార్ధత్యాగులుగదయ్య జయనరసింహా

65. అందఱు పరమార్థమతిం
జెంది చరించిననుగీర్తి జెందదెవరికిన్
గొందఱు లోభులునుండినఁ
బొందుయశము నొక్కపుణ్యపురుషునృసింహా!

66. ధృతరాష్ట్రు నగ్రపుత్రుఁడు
హితమతి ధర్మాత్ముఁడైననిఁక ధర్మజు సం
గతియేలవ్యాసునకు భా
రతరచనావసరమేల రమ్యనృసింహా

67. పరు నష్ట పఱచుమతికిఁ
బురుడింపఁగరానిసుఖముఁ బొందుధరిత్రిం
బరులాభం బెదగోరెడు
పురుషుండిహసుఖముగోరఁబోడు నృసింహా

68. పరహితరతమతి నెన్నఁగ
బురుడింపఁగరాని యశము బొందుధరిత్రిం
గురుతరసుఖమానసుఁడై
పరమపదమునందుఁజేరు భవ్యనృసింహా

69. ధర్మమునకె త్త్రైశంకుఁడు
ధర్మసుతుఁడు నలుఁడు రామధరణీశ్వరుడున్
నిర్మలకీర్తిధనులు స
త్కర్ములు బాధలుసైచిరి కద నరసింహా

70. సత్యమునకు సంకెలలు న
సత్యమునకు నందలములు సత్యముచుమ్మీ
సత్యరతుఁడు దివికేగియు
నిత్యము బుధవరులు పొగడఁ నెగడునృసింహా

71. సురవైరిని యాచించుట
సురలకొఱకెకాని నీదు సుఖమునకా నీ
పరహిరశీలమె రత్నా
భరణంబైయొప్పె నీకు భవ్యనృసింహా

72. కపిలుడవై ఘనతత్వము
నుపదేసించితి విదేవహూతికి దయతో
నపగతకల్మషులకు నీ
కృపగల్గును మంగళాద్రిశ్రీనృసింహా

73. వెజ్జవు భవరోగములకు
నొజ్జవు విద్యలకు భుదజనోత్తములకు నీ
ముజ్జగముల కీశుఁడవని
సజ్జనులు నితింతురయ్య జయనరసింహా

74. దనుజపతికి మోక్షపురీ
ఘనతరపట్టాభిషేక కాలమునందున్
గనకపు సింహాసనములు
ననఘ మునీయూరుయుగళమయ్యెనృసింహా

75. నీపాదసేవకులకును
రూపింపగ సుప్రసన్న రూపివి పరసం
తాపకులకు గోపకులకు
పాపులకును భయకరుడవు భవ్యనృసింహా

76. ఎక్కడజూచిన నీవే
యొక్కరుడవు పిక్కటిల్ల యుండెదవైన
న్నిక్కము దెలియనివారల
కెక్కడజిక్కవుగదయ్య యీశనృసింహా

77. సతులును నెఱగనివారు విద్యో
న్నతి నెఱగనివారు పేదనరులును సత్య
వ్రతులై నమ్మిన బ్రోతువు
హితకారివి సర్వసముఁడ వీవు నృసింహా

78. కులమును మతమను భేదము
దలపంగా నీకులేదు దయఁజూతువు నిం
దలచిన నిర్మలచిత్తుల
కలుషంబులు వాపిబ్రీతి ఘననరసింహా

79. ప్రణవస్వరూప! నీపైఁ
బ్రణయంబునవినుతిజేసి ప్రణతులొనర్తుం
గణుతింపరాని పదవిం
గణనాతీతుఁ డఁయొసంగగదె నరసింహా

80. సత్యం బెఱుంగఁజాలరు
సత్యముబలికంగలేరు సాధుజనుల యౌ
న్నత్యంబుఁజూచి సైఁపరు
సత్యంబీమాట దుష్టజనులు నృసింహా

81. లోకావళి యెల్లప్పుడు
నీకుక్షి నడంగుఁ బొడము నిలుచు న్వెలుగుం
లోకేశ! నిను నుతింపఁగ
నాకలవియె మంగళాద్రి నవ్యనృసింహా

82. నిర్మలహృదయులఁ జేయుమి!
ధర్మంబులు దెలిపిమాకు దండ్రీ! మాదు
ష్కర్మములఁబాపి ప్రోవుమి
శర్మదచారిత్ర దేవ జయనరసింహా

83. ఒకసుంత చదువొసంగితి
వకలంకానిను నుతింపనయ్యెనునాకున్
సకలజ్ఞనుగానుసుమీ
యకలుషదయనేలు మంగళాద్రినృసింహా

84. పతియును గురుజనులును గడు
హితమతులగుటన్నుతించి యిటువ్రాసితినో
నితనీయ యెల్లవారల
హితవిద్యోన్నతుఁలజేయు మీవునృసింహా

85. భువనభరం బుడిపిన నీ
యవిరళ మహిమాన్వితములు ననఘంబులు నీ
యవతారంబులు పొగడఁగ
నెవనివశంబైనఁ జెప్పనెంతునృసింహా

86. ఖలుఁడగు నసురుఁడు ప్రాజదు
వులు హరియింపంగ వానిఁ బొలియించిననీ
జలచరతనువు నుతింపఁగ్
నలవియొకో మంగళాద్రి యమలనృసింహా

87. మేటిగిరి భరించితి తా
మేటివినై దేవతలకమృతమిడితివిగా
బోటివినై నీకగు స
య్యాటలె యీపనులు మంగళాద్రినృసింహా

88. పటుదంష్ట్రా భీకరయుని
సటాజనితవాతభిన్న జలదౌఘంబౌ
కిటిరూపంబున దైత్యుని
హటమఁడచితిగాదె మంగళాద్రినృసింహా

89. శరదిందురేఖఁబోలెడు
వరదంష్ట్రాగ్రమునఁదాల్ప వన్నెదలిర్చెం
ధరపుణ్యమేమిచేసెనొ
యరయంగా దేవ మంగళాద్రినృసింహా

90. నరరూపము సగము మహా
హరిరూపము సగము తాల్చి యమరులు వొగడన్
బరువడిఁగంబమువెడలితి
సురవైరికుమారుఁబ్రోవ శుభనరసింహా

91. శిఖసమములు వజ్రాయుధ
సఖముల్ దనుజేంద్రుఁగూల్ప ధన్యాత్ములకు
న్సకములు సుఖములు నఖముల
నఖిలేశా! మదిదలంతునయ్యా నృసింహా

92. శుభకరమున బ్రహ్లాదుని
కభయమొసంగితివి మాకు నాగతి దయతో
నభయంబొసంగు మరివ
ర్గభయంబునుబాపి శ్రిశరమ్యనృసింహా

93. అరుణనటాభరచరితా
ధరభ్రూకుటికుటిలధవళ దంష్ట్రోజ్జ్వలమౌ
నరసింహరూపమెంచిన
నరుఁడౌగదవయ్య మంగళాద్రినృసింహా

94. నిశ్చలభక్తుని బ్రోవగఁ
గుశ్చితు నాభువనకంతకునిఁ గూల్పగనే
మాస్చర్యమార్తరక్షక
నిశ్చలమతినిమ్ముమాకు నేడునృసింహా

95. వామనుఁడవునై భువన
స్తోమంబులు పాదయుగముతోఁ గొల్చితిగా
నీమహిమ వింత సురర
క్షామన మమ్మేలు మంగళాద్రినృసింహా

96. భీమకుఠారంబున భృగు
రాముఁడవైదుష్టులైన రాజన్యుల సం
గ్రామమునఁగూల్చిజగదభి
రాముడవై యలరినావు రమ్యనృసింహా

97. దశవదన వదనపంకజ
శశివై రఘురాముఁడౌచు జనియించితివా
దశరధపుణ్యఫలమవై
యసదృశచారిత్ర మంగళాద్రినృసింహా

98. కృష్ణార్తి హారివై రిపు
జిష్ణూడవై నిహతగర్వ జిష్ణుడవగుచున్
గృష్ణరహితులనుబ్రోచితి
కృష్ణాఖ్యను మంగళాద్రిశ్రీనృసింహా

99. నను నెవ్వరు దూషించిన
ఘనదేహా వారియందు గార్పణ్యంబున్
మనమునఁజొరనీకుండెడు
ఘనశక్తి నొసంగునాకు ఘననరసింహా

100. విశ్వమయుత నొప్పెడు నో
విశ్వేశ్వర! నిదురూపు విమలాత్ములునై
శాశ్వతభక్తిఁ దలంచిన
శాశ్వతసుఖపదవిగలుగు జయనరసింహా

101. దివ్యంబై మునిజనసం
సేవ్యంబై రవిసహస్ర భాస్వరమై సం
సేవ్యంబు సుజనులకు నో
యవ్యయ నీరూపు మంగళాద్రినృసింహా

102. ఈయుగపుమహిమయేమో
మాయోపాయంబులేక మనలేరెవరున్
మాయోపాయములేని య
మాయకు వంచింత్రు దుష్టమతులు నృసింహా

103. కలికాలమహిమసతులను
దలఁపగా సతులె తిట్టఁదలతురు కట్టా!
పలుకం దెలియ నశక్యం
బిల దుష్టులమానసంబు లీశనృసింహా

104. పరులను వంచనసేయక
పరహితరతమతియుగలిగి వర్తించిన నా
నరులఁ దెలివిహీనులఁటని
దురితాత్ములు గేలిసేయుదురు నరసింహా

105.ఇతరుల యమాయకత దు
ర్మతులు దెలివిహీనతయని మదినెంతురు పాం
డుతనూజులసాధుత్వము
దృతరాష్ట్రతనూజులెఱిగిరే నరసింహా

106. పరసతిఁ దన సోదరిగా
నరయుచు వారియశముగని హర్షించెడు నా
పరమపురుషులకు నిరతము
వరభక్తి నమస్కరింతు వరనరసింహా

107. నిర్మలచిత్తుల హృదయము
నిర్మలమే యనుచుఁ దెలియనేరరుకుమతుల్
నిర్మలమతులంజేయుమి
నర్మిలి నీవెల్లవారి నన్యనృసింహా

108. బిడ్డల యందైనను కడు
చెడ్డతనముగలుగువారి సేవింత్రుమదిం
దొడ్డగ వెఱతురు నోటికిఁ
జెడ్డతనమె మంచిదేమొ శ్రీనరసింహా

109. అపనిందలమోపి ననుం
గపటముతోఁజూచి చుల్కగనెంచిన నీ
చపుఁగఠినోక్తులు వల్కి న
నెపుడును ఘనశాంతమిమ్ము యీశనృసింహా

110. ఘనకీర్తి యిహమునను బర
మునముక్తి నొసంగి మోదమును జూపుము నీ
కృపఁగోరితి శ్రీకరుడవు
నపగతకల్మషుడ మంగళాచలరమణా

111. కరుణానిలయుడ వాశ్రిత
వరదుండవు సాధుహృదయవాసుడవని నే
దిరముగ నమ్మితి గూరిమి
నరయుమి నరసింహమంగళాచలరమణా

112. గీ. మాల్యశైలేంద్రశృంగాంగ్ర మణివిరాజి
తీకృతివి నీవె శ్రీమంగళాద్రిశృంగ
వాసుఁడవు నీవెయోభక్త వరదమాకు
సర్వశుభములు ప్రీతినొసంగుమయ్య

113. గీ. పరమశాంతము నిమ్మంచుఁ బరమభక్తి
వేడుచుంటిని దయలేదె విశ్వమూర్తి
యక్కటా తలచూపు నహంకృతి యపు
డప్పుడిది యేమిపాపమో యరయజాల

114. ఉ. హరికి మంగళాద్రిశిఖరవిహారికి వేదమార్గసం
చారికి సాధుమానసన్మణిమందిరసుందరసుప్రచారికిన్
కూరిమినేలు మము కోరికలీరికలెత్త మ్రొక్కుడుం
సారవిచారమానసను సజ్జనసన్నుతిపాత్రజేయగన్

115. ధననష్టమైనగానీ
నను జుల్కనచేసి తూలనాడిన విడనా
డిన నేరినైన గినియక
ఘనశాంతముతో జరింపగాధృతినిమ్మా

116. గీ. మోసకారితనము దోసకారితనంబు
మాయనిచ్చకంపు మాటనేర్పు
పరధనంబుకాసపడెడుమానసవృత్తి
మాకు వలదు చుమా నృసింహా

సమాప్తం

Friday, June 12, 2015

ఒంటిమిట్ట రఘువీర శతకము - అయ్యల్రాజు త్రిపురాంతక కవి

ఒంటిమిట్ట రఘువీర శతకము
                                                     -అయ్యల్రాజు త్రిపురాంతక కవి

1. శా. శ్రీకల్యాణగుణాభిరామ విబుధశ్రేణీకిరీటద్యుతి
వ్యాకీర్ణాంఘ్రిసరోరుహద్వయసహస్రాక్షస్తుతా! యచ్యుతా
నాకుం బ్రాపును దాపు నీవె యగుచున్ నన్నేలుమీ రామభ
ద్రా కారుణ్యసముద్రధీర రఘువీర జానకీనాయకా!

2. శా. ఆకర్ణాటకమండలాధిపతిచేనాస్థానమధ్యంబులో
నాకావ్యంబులు మెచ్చఁజేసితివి నానారాజులుం జూడగ
నీకుం బద్యము లిచ్చుచో నిపుడు వాణీదేవి నాజుహ్వకున్
రాకుండెట్లు వసించు గాక రఘువీర జానకీనాయకా!

3. శా. నీకేలన్ దృణమందివైవ నదియున్ నిర్ఘాతపాత క్రియన్
గాకాకారవికారదానవుని లోకాలోకపర్యంత మీ
లోకంబుల్ పదునాల్గు త్రిప్పి నది కాలున్మోపఁగానీక యౌ
రా కాకుత్ స్థకులాగ్రగణ్య రఘువీర జానకీనాయకా!

4. మ. సకృపాలోకన నందగోపునితనూజాతుండవై గొల్లవై
సకలక్షోణులు నేలినాఁడ వఁట మించంగశ్యపబ్రహ్మ గ
న్న కుమారుండన మిన్నుముట్టి కుఱుచై నాఁడేలయాలీల నే
రక దానంబులు వేడుకొంటి రఘువీర జానకీనాయకా!

5. మ. సకలామ్నాయములన్ బఠించుఫల మబ్జాతాక్షు నామంబులం
దొక టేదైనఁ బఠింపఁ గల్గు నటువంటుత్కృష్టపుణ్యప్రవ
ర్తననామంబులు చక్రపాణికి సహస్త్రంబుల్ సహస్రాభ మ
ర్కకులా నీశుభనామ మౌర రఘువీర జానకీనాయకా!

6. శా. కొంకన్ గారణ మేమి ధర్మములు పెక్కుల్ చేసి మర్త్యుండు నీ
వంకన్ జిత్తము నిలపలేక పెఱత్రోవల్ త్రొక్కినన్ సర్వమున్
బొంకై (పోవు) తూలు కురంగనేత్ర తగునోముల్ వేయునున్ నోఁచి తా
ఱంకాడంగఁ దొడంగినట్లు రఘువీర జానకీనాయకా!

7. శా. ఆగౌరిశ్వరకీర్తనీయుఁడగుని న్నర్చింపఁగాలేనివా
రోగుల్గాక నిజానయోగు లయినన్ యోగ్యాను సంధానులే
మాగుర్వాజ్ఞ యథార్థ మాడితిని నీమంత్రంబె మంత్రంబురా
రాగద్వేషవిదూర ధీర రఘువీర జానకీనాయకా!

8. మ. జగముల్ మూఁడు సృజింపఁ బ్రోవఁ బిదపన్ సంహారమున్ జేయఁగాఁ
ద్రిగుణాకారముఁ దాల్చినట్టి వరమూర్తీ వాసుదేవాచ్యుతా
నిగమస్తుత్య పవిత్రగాత్ర నృహరీనీలాభ్రవర్ణా మహో
రగతల్పా జనకల్పభూజ రఘువీర జానకీనాయకా!

9. శా. నీచారిత్రము చెప్ప నద్భుతమగున్ నీనామసంకీర్తనం
బాచండాలునకైన మోక్షమొసఁగున్ హత్యాదిదోషంబులన్
వేచించున్ విదళించుఁ ద్రుంచుఁ దునుమున్ వేఁటాడు నంటంబడున్
రాచుం ద్రోచు నడంచు నొంచు రఘువీర జానకీనాయకా!

10. శా. తేజం బొప్పఁగ నీవె కావె మొదలన్ ద్రేతాయుగాంత్యంబునన్
రాజై పుట్టితి వింక నీకలియుగాంత్యంబందునన్ రౌతవై
వాజిందోలివిరోధులం దునుమ దేవా నీవ యొండెవ్వఁ డా
రాజున్ రౌతును నీవె కావ రఘువీర జానకీనాయకా!

11. శా. గాజుంబూస సురేంద్రనీలమణిఁగాఁ గల్పించు చందంబునన్
బాజుంజర్మముమీఁది (బే)జేగడపొఱల్ బంగారు చేసేగతిన్
నాజన్మంబుఁ బవిత్రభాజనముగా నన్నేలరా యేలరా
రాజీవాక్ష కృపాకటాక్ష రఘువీర జానకీనాయకా!

12. శా. నాజన్మాంతరవాసనావశమునన్ నాపాలిభాగ్యంబునన్
నాజాడ్యంబులు పోవుకాలముతఱిన్ నాపుణ్యపాకంబునన్
ఈజన్మంబున నిన్నుఁ గొల్వఁ గలిగెన్ హీనుండఁగా నింక నే
రాజన్ నాకెదురెవ్వ రుర్వి రఘువీర జానకీనాయకా!

13. శా. నేఁటం దీఱె ననేకజన్మములనుండే నన్ను వెంటాడుచున్
వాటంబై చనుదెంచుపాపములు శ్రీవత్సాంక నీవంక నీ
పాతల్ పాఠముసేయువారికి మఱిన్ బాపంబులం బాపుఁ గ
ర్ణాటాధీశ్వర యొంటిమిట్ట రఘువీర జానకీనాయకా!

14. మ. పటునిర్ఘతకఠోరనాదము ఘనబ్రహ్మాండభాండంబు బి
క్కటిలం జేయుచు వచ్చునప్పు డితరుల్ గాండీవినామంబు లె
న్నుట మేలందురు వైష్ణవుల్ తలఁప రన్యుం గోరి యెంతంతదు
ర్ఘటముల్ వచ్చిన నిన్నె కాక రఘువీర జానకీనాయకా!

15. మ. కొడుకు ల్బ్రహ్మలు కూఁతు రీశ్వరశిరఃకూటంబుపైఁ గాపురం
బుడురాజుం దినరాజుఁ గన్నులహిరా జుయ్యాలమంచంబు నీ
పడఁతుల్ శ్రీయు ధరిత్రియున్ సవతు చెప్పన్ పేరు? నీకన్యులా
రడిమర్త్యుల్గనలేరుకాక రఘువీర జానకీనాయకా!

16. మ. వడిమీఱంగ నమోఘమై నిగుడునీవాలమ్ము వాలమ్ముఁ దాఁ
కెడునంచున్ మెడయొడ్డినన్ జమరిపైఁ గీల్కొన్నకారుణ్య మే
ర్పడ మున్నేసినయమ్ము వేఱెయొకనారాచమ్మునం ద్రుంచి పే
ర్పడి తౌరా విలుకాండ్రలోన రఘువీర జానకీనాయకా!

17. మ. చెడుగన్ గష్టుఁడ దుష్టచిత్తుఁడ బరస్త్రీలోలుఁడన్ బాలుఁడన్
జడుఁడన్ మూఢుఁడఁ గొండెకాఁడను దురాచారిన్నిషేధాత్ముఁడన్
గడుసన్ గాకరిఁ గల్లగుల్లఁ గపటిన్ గర్వి న్ననుం గావు మూ
ఱడి యున్నాఁడను నీవేదిక్కు రఘువీర జానకీనాయకా!

18. మ. అడిగేవిద్యకు లోను చేసితివి నన్నావంతయున్ వంతలే
కడియాసల్ గొనుచుం దురాత్మకుల నే నర్థింపుచున్నాఁడ నె
న్నఁడు రక్షించెదు నీవు నన్ను బలె నెన్నంబేదవా యేలయా
ఱడిఁ బెట్టేవు రమావిహార రఘువీర జానకీనాయకా!

19. మ. ప్రణుతింపన్ మృతదేహుఁ జూచి బ్రతికింపన్ బ్రహ్మరుద్రుల్ మరు
ద్గణనాథాదులు నోప రద్భుతము గాఁగ న్నీదుభృత్యుండు ల
క్ష్మణుప్రాణంబులు దెచ్చెఁజచ్చినతరిన్ సంజీవనీప్రక్రియన్
రణభూభాగములోనఁ దానె రఘువీర జానకీనాయకా!

20. శా. ఏతాత్పర్యముగల్గి కొల్చెదవురా యేనేలనిన్నెంతురా
నీతోనాకు బనేమిరా యనక మన్నింపందగున్ నన్ను నీ
చేతన్ మోక్షముగన్న వారివిననా చిత్రంబుగా నిర్జరా
రాతిన్ ఱాతిఁగిరాతుఁ దొల్లి రఘువీర జానకీనాయకా!

21. శా. దాతల్ త్రాతలు దల్లిదండ్రులు మఱిన్ దైవంబు లాప్తులు చెలుల్
భ్రాత ల్తక్కినవారు చుట్టములు మీపాదాలమీఁ దాన నా
దాతల్ త్రాతలు తల్లిదండ్రులు మఱిన్ దైవంబు లాప్తుల్ చెలుల్
భ్రాతల్ సర్వము నీవె కావె రఘువీర జానకీనాయకా!

22. మ. శ్రుతిపాథోధి మధించి శాస్త్రమహిమల్శోధించి యష్టాదశ
స్మృతులాలించి మహేతిహాసకథలుం జింతించి తారొక్క స
మ్మతమై సన్మును లాచరించినమహామార్గంబు నీసేవ దు
ర్మతులీ మార్గముఁ గానలేరు రఘువీర జానకీనాయకా!

23. మ. మతి నూహింపరు కొంద ఱీసుకృత మేమార్గంబునందున్న దు
గ్రతపోథ్యానము సామగానమును దీర్థస్నానమున్ దానమున్
గ్రతుసంథానము నేల నేలఁ దులసిం గర్వయ్యెనో యూర నీ
ప్రతిమ ల్లేవొ నమస్కరింప రఘువీర జానకీనాయకా!

24. మ. సుతులంచున్ హితు లంచు బంధుజను లంచు న్దల్లులు న్దండ్రులున్
సతులున్ బౌరులు నంచు నెంచుకొనుచున్ సంసారమోహాబ్ధిలో
గతజన్మంబులఁ దేలుచున్ మునుఁగుచున్ గర్వించి యే ని న్నానా
రతముం గొల్వనిమోస గల్గె రఘువీర జానకీనాయకా!

25. మ. క్షితిలోఁదామును బ్రహ్మసృష్టికి బునస్సృష్టిన్ వినిర్మించియున్
గ్రతువిఘ్నం బొనరించుదానవుల వీఁగం దోలఁగాలేక నాఁ
డతిబాలున్ నినుఁ దోడు తోడుకొని పోఁడా గాధిసూనుండు నీ
ప్రతివీరాగ్రణి యెవ్వఁ డింక రఘువీర జానకీనాయకా!

26. మ. క్షితిలో నల్పులమీఁదఁ జెప్పినకృతుల్ చీ! చీ! నిరర్థంబులై
మతికిం బాత్రము గావు మేఁకమెడ చన్నుల్ నేతిబీఱాకులున్
వితతప్రౌఢిమ నీకుఁ జెప్పినకృతుల్ వేదాలు శాస్త్రాలు భా
రతరామాయణముల్ తలంప రఘువీర జానకీనాయకా!

27. శా. సంతానంబును బారిజాతకమహీజాతంబు మందారమున్
కింతారత్నముఁ గామధేనువు సుధాసింధూత్తమంబున్ మదిన్
జింతింపన్ సరిగావు నీకు విజయశ్రీధామ యోరామ య
శాంతత్యాగవివేకపాక రఘువీర జానకీనాయకా!

28. శా. ఏదైవాలవరాలకంటే సులభంబెవ్వానికైనన్ దుదిన్
నీదాతృత్వము చెప్పంగ్రొత్త శరణంటేఁగాతు వింతేల నీ
పదాంభోజరజంబు ఱాతికయినన్ బ్రాణంబు లీఁజాలు నౌ
రా దిక్పూరితకీర్తిహార రఘువీర జానకీనాయకా!

29. శా. విందున్ వేదపురాణశాస్త్రముల గోవిందున్ ముకుందున్ హరిన్
విందున్ వేల్పునునైన భక్తసులభున్ విశ్వంభరున్ సచ్చిదా
నందున్ నందుఁడు కన్న చిన్నిశిశువున్ నాపాలిపాపాలిఁబా
ఱందోలేనరసింహు నిన్ను రఘువీర జానకీనాయకా!

30. శా. సందిన్ బూసలలోన నీకవచరక్షామంత్రరాజంబుఁ బెం
పొందన్ వ్రాసి ధరించినాతఁడు రిపువ్యూహంబులో నైన నే
కందుం బొందక వజ్రపంజరములోఁ గాఁపున్నచందానఁ బా
ఱందోలున్ బగవారినౌర రఘువీర జానకీనాయకా!

31. మ. వృధగా దెవ్వఁడు నిన్నుఁగొల్చినఁ గృపన్ వీక్షించి వాఁడే మనో
రథముల్ వేఁడిన నట్లే సేయుదువుగా రక్షావిధేయుండవై
కథగాదీవచనంబు నిక్కమటులంగాదేని మున్నేల సా
రథివైతర్జును తేరుఁదోల రఘువీర జానకీనాయకా!

32. మ. ఘనసారంబును లోనికిం గొనిన శ్రీగంధంబుఁ బైఁబూసినన్
దినమున్ మర్ధనజేసినన్ గడగినన్ దృష్టంలోనన్ దొలం
గనిదుర్గంధము నైజమీముఱికిడొక్కల్ నమ్మి ని న్గొల్వనే
రనిమూఢాత్ముల నేమి చెప్ప రఘువీర జానకీనాయకా!

33. మ. ఇనుమా ఱాశ్రితు నిల్పువాడ వినుమా ఱేమాటయున్ సాయకం
బినుమా ఱాహవభూమిఁబూన నిదిగా కింకొండు మేలంచు నీ
వినుమా ఱీదురితాంధకారపటలం బేరీతి వీక్షింతు వు
గ్రనిశాటాంతక రామభద్ర రఘువీర జానకీనాయకా!

34. మ. మును నా కెన్నఁడు వేదశాస్త్రపఠనంబుల్ రిత్తతీర్థాటనం
బును దానంబును జేయఁబోను సతతంబున్ నిన్ను సేవించి కీ
ర్తన చేసేమతిలేదు దానమునకర్థంబల్ప మింకెట్లు బో
రన నాదుష్కృతముల్ తొలంగు రఘువీర జానకీనాయకా!

35. మ. మును నా కెన్నఁడు దోసముల్ గలవు నామ్రోలన్ భయంబందకే
మనినన్ గాలునిపోటుబంటులిఁక నన్నాపేరు నా పేరు పె
ట్టినవానిన్ బరలోకదూరుఁడని పట్టేదెట్లు పొండంచుబో
రనరమ్మా యిపుడడ్డగింప రఘువీర జానకీనాయకా!

36. మ. అనఘం బైనదశాశ్వమేధకృతపుణ్యస్ఫూర్తి నీకొక్కమా
టు నమస్కారము సేయఁ గల్గునని విందున్ యాగధర్మంబులున్
గొనసాగుంజననంబు లొక్కమఱినీకున్ మ్రొక్కెనేనిన్ బున
ర్జననం బేది తలంచిచూడ రఘువీర జానకీనాయకా!

37. మ. దనుజారిజ్వలనాంతకా సురసముద్రస్వామివాయుత్రిలో
చనమిత్రాభవసూర్యసోమధరణీజాతంబుజాతద్విష
జ్జననాంగీరసశుక్రభానుతనయస్వర్భానుకేతుప్రవ
ర్తనముల్ నీవిభవంబులౌర రఘువీర జానకీనాయకా!

38. మ. కనుఁగొన్నప్పుడె గుప్పఁడే కుజనులన్ గాలుండుకాలుండు పొం
డనుచున్ రౌరవనరకాగ్నులఁబడన్ హత్తించి యయ్యగ్నులన్
మునుంగంజాలఁ బరేతరాజునకు నన్నొప్పింపఁగాఁబోకుము
గ్రనిశాటాంతక రామభద్ర రఘువీర జానకీనాయకా!

39. మ. నిను సేవించెదనంచుఁ గోరుకొని యుండేవానికిన్ బూర్వక
ర్మనిమిత్తంబు(నఁ గల్గుకష్టములు వేమాయింప) నీవడ్డమౌ
దనిచెప్పంబడు ద్రౌపదిం గరిని బ్రహ్లాదున్ ధ్రువున్ మున్ను బో
రన రక్షించుట కల్దొ లేదొ రఘువీర జానకీనాయకా!

40. మ. అనిశంబున్ నినుఁగొల్చు మానవులు ప్రాణాంతంబునన్ రోగబా
ధనిమిత్తంబున రామరామ యనుచున్ వాక్రువ్వ లేకుండినన్
జననాథాగ్రణి నీవు వారిరసనాస్థానంబున న్నిల్చి బో
రన రామా యనిపింతు వౌర రఘువీర జానకీనాయకా!

41. మ. ఇనవంశోత్తమ వేదశాస్త్రములలో నేవింటి నేవింతివాఁ
డును నీకుం బ్రతిగాఁడు నీకుఁగల బంట న్నన్ను రక్షింపు కా
లునిబంట్లన్ విదలింపఁగావలయు నాలోనుండుమీ మెండుమీ
ఱ నమోఘాస్త్రమువిల్లుఁ బూని రఘువీర జానకీనాయకా!

42. మ. జననాథాగ్రణి నిన్నుఁగొల్చునతఁ డాచండాలుఁడైనన్ బున
ర్జననం బొందక ముక్తిఁగాంచు నొనరన్ సద్భక్తుఁడైనన్ దుదిన్
జనుఁ జండాలకులంబులోన నుదయించం గోరి నీనామకీ
ర్తనసేయన్ నిరసించెనేని రఘువీర జానకీనాయకా!

43. మ. జనకుం డెవ్వఁడు నీకు నీకడుపులో సర్వంబు నుండంగ నీ
యునికిస్థానము దుగ్ధవార్ధి నడుమన్ యోగీంద్రహృద్గేహ యే
మని వర్ణింపుదు నీమహత్త్యముల సర్వాశ్చర్యముల్ పుణ్యవ
ర్తన రాజన్య యశోవిహార రఘువీర జానకీనాయకా!

44. మ. జనకుం డా జనకుండు నీసతికిఁ గౌసల్య యహల్యాఘ
మోచననిన్ గాంచినతల్లి పంక్తిరథుఁడా సర్వేశ మీతండ్రి యే
మినిమిత్తంబున నుద్భవించితి*వొ నమ్మేనెట్లునీపుట్టువు
గ్రనిశాటాంతక రామభద్ర రఘువీర జానకీనాయకా!
(* వి నెమ్మిన్నిట్టు లీపుట్టువు అని పాఠాంతరము)

45. మ. హనుమంతుం డొకయబ్ధి దాఁటునని యేలా ప్రస్తుతుల్ సేయఁగా
దనుజారాతి భవత్పదాబ్జములు హృత్పద్మంబునన్నిల్పునా
ఘనపుణ్యుండు భవాంబురాసులు తృణీకారంబుగా దాఁటు భో
రన దానింతయుఁ గొంకులేక రఘువీర జానకీనాయకా!

46. శా. నీపాదోదక మక్షులం దదుముకొంటిన్ గొంటి నాలోనికిన్
నీపళ్ళెంబు ప్రసాదముం గుడిచితిన్ నీపేరునుం బెట్టితిన్
నీపెన్ముద్రలుదాల్చితిన్ భుజములన్ నీవింక నన్నేగతిన్
బ్రాపైప్రోచెదొకాని పూని రఘువీర జానకీనాయకా!

47. మ. తపముల్ చేసినఁబోనిపాపములు మంత్రంబుల్ సమర్థంబుగా
జపముల్ చేసినఁ బోనిదోషము నదీస్నానంబునం బోని ఘో
రపుకర్మంబులు వాయునొక్కమఱి శ్రీరామ యనేమాట క
ర్ణపుటం బించుక సోఁకెనేని రఘువీర జానకీనాయకా!

48. శా. కంపింతున్ మును దండధారికిని మత్కాయంబు వీక్షించి శం
కింపన్ గారణమేమి నాకిఁక నినున్ గీర్తింపుచున్నాఁడ బల్
దుంపల్ గట్టినఘోరపాపములసంధు ల్గోసివేసేతఱిన్
ఱంపంబైనది నీచరిత్ర రఘువీర జానకీనాయకా!

49. శా. నీమంత్రంబు సదా సదాశివుఁడు పత్నీయుక్తుఁడై కాశిలో
నేమంబొప్ప జపించునంచు *శ్రుతులన్నిన్ నిన్నెవర్ణింపఁగా
నేమా నిన్ను నుతించువార మయినన్ నేనేర్చిన ట్లెన్నెదన్
రామా రాఘవ రామభద్ర రఘువీర జానకీనాయకా!
(శ్రుతులు న్నిన్నెన్ని అని పాఠాంతరము)

50. శా. నీమంత్రంబు జపించుమానవులకున్ నిశ్శ్రేయమౌనర్థముల్
హేమంబు ల్గొడుగుల్ తురంగములు మత్తేభంబు లాందోళికల్
గ్రామంబుల్ నగరంబుల్ విభవమున్ రాజ్యంబులున్ రత్నముల్
రామారత్నము లేమిలెక్క రఘువీర జానకీనాయకా!

51. శా. గోమేధాధ్వరమశ్వమేధశతముల్ గోదానభూదానముల్
హేమాద్రుల్ తిలపర్వతంబులుసువర్ణేభాశ్వదానంబులున్
నీమంత్రం బగునక్షరద్వయము *నేనీపుణ్యముంబోలవో
రామారాఘవ రామభద్ర రఘువీర జానకీనాయకా!
(* పొందే పుణ్యముం అని పాఠాంతరము)

52. శా. గోమాంసాశనిమద్యపాని సగరిన్ గొండీడు చండాలుఁడున్
హేమాస్తేయుఁడు సోదరీరతుఁడుఁగూడేకాదశన్ భుక్తిఁగాం
చేమూఢాత్ముఁడు లోనుగాఁగలుగుదుశ్శీలాత్ము లైనన్ దుదిన్
రామా యన్నను ముక్తిఁగాంత్రు రఘువీర జానకీనాయకా!

53. శా. ఏమీ పాతకులార మాపురికి రా రీపుట్టునందున్నత
శ్రీమైఁబోయెద రెందుకన్న జమునిన్ గ్రేఁగన్నులన్ జూచుచున్
రామయ్యా యిఁకనంచు పల్కి యపవర్గస్వర్గముం జొత్తురో
రామయ్యా! నినుఁ గొల్చువారు రఘువీర జానకీనాయకా!

54. శా. స్వామిద్రోహిని తమ్ముఁడెట్లు ఘనరాజ్యం బెల్ల నీవిచ్చుటే
ట్లామాటల్ విని కాదె నిన్ను నడిగే యాసక్తి నాకున్న దొం
డేమిన్ పల్మాఱు వేసరింప కిఁక నీవీరాదె సీసీమలో
గ్రామంబొకటి చాలు నాకు రఘువీర జానకీనాయకా!

55. శా. మామాయంచును మామయంచు నెపుడున్ మాయల్లుఁ డుద్యద్గతిన్
హేమాద్రిప్రతిమానమైన హరువిల్లేవిల్లు మోపెట్టఁగా
సామర్థ్యంబున *మేటి యీతఁ డనుచున్ సత్వంబె వర్ణింపుదున్
రామా రాఘవ రామభద్ర రఘువీర జానకీనాయకా!
(* వీఁడు మేటి యని నీసత్వంబు వర్ణింతు నో యని పాఠాంతరము)

56. మ. కమరం గ్రాఁగినలోభివానితలపుంకన్ గుక్కమాంసంబు మ
ద్యముతో వండుకొతిన్నమాలఁ డయినన్ దత్పాపకర్మంబులన్
యమకూపంబుల లోపలం బడఁడు జిహ్వాగ్రంబునన్ రామమం
త్రముఁ బేర్కొన్నను నౌర ధీర రఘువీర జానకీనాయకా!

57. మ. యమకూపంబులలోపలం బడి మహాహైన్యంబునున్ బొందకుం
డ ముదంబారఁగ నన్నుఁ బ్రోచి కరుణన్ సాయుద్య మిమ్మీ తుదిన్
క్రిమిరూపుందనరూపుగాఁ బెనిచి రక్షింపన్ విచారించునా
భరమరంబుంబలెఁ బాపదూర రఘువీర జానకీనాయకా!

58. మ. మమకారంబున సార్వకాలమును నీమంత్రంబు వాక్రుచ్చుడెం
దము నాకుంగలుగంగని మ్మటుల నైనన్ మృత్యువక్త్రమ్ము దూ
ఱము నిన్నున్ మతి దూఱ మంత నపవర్గస్వర్గమార్గంబు దూ
రము గాకుండును మాకుఁ జేర రఘువీర జానకీనాయకా!

59. మ. తమగర్వంబున వారు మూఢులగుచున్ దైవంబు మంత్రంబు తం
త్రములన్ వీడఁగ నాడుచున్ దిరుగు నిర్భాగ్యుల్ మహారాజులై
మము నూరింపఁగ నేము నిన్నెఱిఁగి నీమంత్రం బెఱింగిన్ దరి
ద్రమతిన్ వేఁడఁగఁబోవుటెట్లు రఘువీర జానకీనాయకా!

60. మ. హిమధామప్రతిమానకాంతియుతులై యింద్రాది దిక్పాలకుల్
తములన్ స్తోత్రముసేయ నుండుదురు నీదాసానుదాసుల్ సుర
ప్రమదాపల్లవ పాటలాధరసుధాపానాదికేలీవిహా
రములన్ మీఱుచు మీరుచూడ రఘువీర జానకీనాయకా!

61. శా. మిమ్ముం గొల్వఁదలంచి పాపముల నెమ్మిం జోఁపైనానింక నే
నెమ్మిన్ సౌఖ్యముఁ బొందువాఁడనగుచున్ నీమూర్తి భావించెదన్
రమ్మా వీని తలంపు మేలని కృపన్ రక్షింప నాలోనికిన్
రమ్మా నన్నుఁ గృతార్థుఁజేయ రఘువీర జానకీనాయకా!

62. మ. ప్రమదారత్న మహల్య గౌతమునిశాపప్రాప్తిఁ బాషాణరూ
పముతోఁ బెక్కుయుగంబు లుండఁగ హరబ్రహ్మాదులుం బాపలే
నిమహాపాపముఁ బాపనోపినదికా నీపాదరేణుప్రకా
రము నేనేమని సన్నుతింతు రఘువీర జానకీనాయకా!

63. శా. నాయజ్ఞానముఁ బాపుమంచు మదిలో నానాప్రకారంబులన్
గూయం గూయ నదేమిరా యనవు నీకున్ మ్రొక్కనా కుక్కనా
చీ యం చేటికి రోఁతగించెదవు నీచిత్తంబు రాకుండినన్
బ్రాయశ్చిత్తము నాకు నెద్ది రఘువీర జానకీనాయకా!

64. మ. నియమంబొప్ప ననేకజన్మములనుండిన్ దాఁచుకొన్నట్టిసం
చయదోషంబులు మాటమాత్రమునఁ గొంచుంబోవు చోరత్వ మె
న్ని యుపాయంబుల నభ్యసించినవియో నీనామముల్ వేయు నా
రయలీల న్వివరించుటెట్లు రఘువీర జానకీనాయకా!

65. శా. తారుణ్యోదయ యొంటిమిట్టరఘునాథా! నీకునేఁ బద్యముల్
నూఱున్ జెప్పెద నూరఁ బేరు వెలయన్ నూత్నంబుగా నంత నా
నోరుం బావనమౌను నీ కరుణఁ గాంతున్ భక్తిన *న్నందఱున్
రారమ్మందురు గారవించి రఘువీర జానకీనాయకా!
(* న్నెవరున్ అని పాఠాంతరము)

66. శా. చీరన్ దీయకు చన్నుగుబ్బలపయిన్ జీకాకుగాఁ గాకుగా
జేరన్ దీయకు మందబోయఁడిదెవచ్చే ప్రొద్దు రావద్దురా
జారల్ మేనుల జారలంగవయు కృష్ణా ఏకపత్నివ్రత
ప్రారంభం బిపుడేల నీకు రఘువీర జానకీనాయకా!

67. మ. తిరునామంబు ధరింపఁడేని నొసలన్ దిక్పూరితంబైననీ
వరనామంబుఁ దలంపఁడేని మదిలో వాంచించి నీపాదపం
కరుహశ్రీతులసీదళోదకముఁ ద్రాఁగండేని వాఁడేఁటి నే
ర్పరి వైకుంఠపురంబుఁజేర రఘువీర జానకీనాయకా!

68. మ. శరణం బన్నను మాటమాత్రమున విశ్వద్రోహి తోఁబుట్టునకున్
గరుణాపూర్ణవిలోకనం బొదవ లంకారాజ్యసింహాసన
స్థిరపట్టం బొనరించినాఁడవఁట యేదేవుండు నీసాటి యు
ర్వరలోనన్ భవరోగదూర రఘువీర జానకీనాయకా!

69. మ. పరనారీకుచకుంభపాలికలపైఁ బాదాబ్జయుగ్మంబుపైఁ
గరమూలంబులపైఁ గపోలతటిపైఁ గంఠంబుపైఁ గొప్పుపైఁ
బరువుల్ వాఱెడునాతలంపులు మిమున్ భావింపఁగాఁజేసి స
ర్వరసాధిశ్వర నన్నుఁ బ్రోవు రఘువీర జానకీనాయకా!

70. మ. నరకుల్ గ్రాఁగినయిన్పకంబముల నంటంగట్టఁగాఁ గొట్టఁగాఁ
బొరలం బొర్లఁగఁ గక్కుఱాలఁగొని వీఁపు ల్గోయఁగా వ్రేయఁగా
నరకావాసులలోన నుండువారు నీనామంబు వర్జించి దు
ర్మరణంబుల్గని చన్నవారు రఘువీర జానకీనాయకా!

71. మ. పురసంహారునిచాపమున్ జివుకుదంబున్ ద్రుంచి పోవైచినన్
పరశూదగ్రభుజుండు పోవిడుచునే భంజించుఁగాకంచు ని
ష్ఠూరముల్ పల్కిన భార్గవున్ నిజబలాటోపంబు వారించి ని
ర్భరశాంతంబునఁ గాచితౌర రఘువీర జానకీనాయకా!

72. మ. స్మరసంహారుఁడు గౌరిఁ బొత్తున భుజింపన్ బిల్వ వేరాని శ్రీ
హరినామంబులు వేయు నెన్నెదను నిత్యం బైననో మన్ననో
యరవిందానన వేయునేమిటికి రామా యన్ననుం జాలు మం
త్రరహశ్యంబుఁ దలంతు నేను రఘువీర జానకీనాయకా!

73. శా. బాలత్వంబునఁ గొంతకాలము వృథాపాపంబు దుర్బుద్ధినై
చాలం జవ్వనమందు గర్వమతినై సంసారినై దుష్క్రియా
జాలభ్రాంతిఁ జరింతుఁ గాని నినుఁ గాంక్షం గొల్వలేదయ్య హే
రాళంబైనది చింతవంత రఘువీర జానకీనాయకా!

74. శా. సాలగ్రామశిలాశిలోచ్చయగయాస్థానప్రయాగస్థలుల్
పోలన్ జూచెద నంచుఁ బోవఁ దలంతున్ బోలేను మీదాసులన్
బోలె నన్నను బుద్ధిపుట్ట దిఁక నేఁబుణ్యాత్ముఁడౌ టెట్లు హే
రాళంబైనది చింతవంత రఘువీర జానకీనాయకా!

75. మ. కొలువంజాలక మానన్ నీనుతులు పెక్కుల్ సేయుటల్ మాననిన్
దలఁపన్ జాలక మాననిన్ గలసి నీదాసాదివర్గంబుతో
నిలువంజాలకమాననేఁ గడపటన్ నీనామముల్ విన్న వా
రలకున్ గల్గును మోక్షలక్ష్మి రఘువీర జానకీనాయకా!

76. మ. తలపన్ జిత్రము మీమహత్త్యములు మీదాసుల్ మహాభాగ్యవం
తులు త్త్రైలోక్యమునన్ బదస్థులు ధ్రువుం డుండున్ నభోమండలిన్
బలి పాతాళమునన్ విభీషణుఁడు భూభాగంబునన్ బద్మజ
ప్రలయం బైనను బోవ రౌరా రఘువీర జానకీనాయకా!

77. మ. చెలఁగన్ మార్త్యులువేఁగి లేచి తమచేసే వెల్లఁబాపంబు లీ
గలుషంబుల్ బెడబాయు టేదిగతి యింకన్ ద్రోవ యొండెద్ది పు
ర్వులగుంటం బడఁబోకయుండ దయనేర్పున్ బుద్ధియున్ గల్గు వా
రలు నీసేవకు లౌట లెస్స రఘువీర జానకీనాయకా!

78. మ. కలకాలంబువ్రతంబులున్ దపములున్ గావించి యన్యు ల్తుదిన్
గలకాలంబును బోలె నిర్జరపురీకాంతాకుచాలింగనం
బులఁ గొన్నాళ్ళుసుఖించి క్రమ్మఱ నిలం బుట్టేదినే మెచ్చ ని
ర్మలముక్తుల్ నినుఁగొల్చి కాంతు రఘువీర జానకీనాయకా!

79. మ. నిలువెల్లన్ బులకాంకురంబు లొదవన్ నీపాదతీర్థంబుతోఁ
దులసీవర్ణమొకించుకంతఁ గొనినన్ దోషాలు ఖండింపఁగాఁ
బొలపాకుల్ దినఁ గాననంబులఁబడన్ బోనేల మోక్షంబుకూ
రలను న్నారల నేలగల్గు రఘువీర జానకీనాయకా!

80. మ. చెలువం బొప్ప సువర్ణముద్రలితరుల్ చెల్లించుటేక్రొత్తకా
కలనీముద్రలు చూడఁ జెల్లుబడి చక్రాలంచు వేయించుమం
డలనాథాగ్రణి క్రొత్త నీబలిమి నానావర్ణపుం దోలుము
ద్రలు చెల్లించితి విందు నందు రఘువీర జానకీనాయకా!

81. మ. ప్రళయాపాదితకాలమృత్యు*నిభ యీరాకాసి రాగా వా
దులు వారింపఁగ**నోపనింక నెటుచొత్తున్ నొత్తుఁ గాకన్న సం
చలితున్ గౌశికుఁగాచి తాటకను శస్త్రజ్వాలచేఁ ద్రుంచిదో
ర్బలశక్తిన్ విలసిల్లి తౌర రఘువీర జానకీనాయకా!
(* నగు నా; ** నేర యని పాఠాంతరములు)

82. మ. చిలుకన్ ముద్దులు చిల్కఁ బల్కుతఱి రాజీవాక్షి యొక్కర్తు ని
చ్చలు నోరాఘవ రామరామయనినన్ సాలోక్యసామీప్యముల్
కొలఁదుల్మీఱఁగ నిచ్చినాఁడవఁట నీకున్ బిడ్డపే రిడ్డవా
రలపుణ్యంబున కెద్ది మేర రఘువీర జానకీనాయకా!

83. మ. ఇల నిన్నున్ దొలుబామునం దలఁపనై తీజన్మమందైన నా
తలఁపు ల్మీపదపంకజంబులపయిన్ దాపింతు నే నింక బి
డ్డలలోఁ జెట్టులలోన నంబువులఁ బుట్టం బుట్టఁగా నోపఁగ
ర్మలతాబంధముఁ బాపుమయ్య రఘువీర జానకీనాయకా!

84. మ. ఇల నీమీఁదను జాల భక్తిగలవాఁ డేచెట్టవాడైన నే
ఖలుఁడైనన్ మది నుత్తమోత్తముఁడగున్ గాదన్నఁగొంగీడ్చెదన్
దెలుపన్నిల్చిననాఁడుకొన్న పరవాదిన్ గెల్చెదన్ వేదశా
స్త్రలసద్వాక్యానుతప్రతాప రఘువీర జానకీనాయకా!

85. శా. దేవా! నాదొకవిన్నపంబు గల దేదీ యంటివా వింటివా
త్రోవన్ దండధరుండు దుర్గతులకై త్రోవన్ విచారించునో
యేవిఘ్నం బొనరించునో యెఱుఁగరాదౌ ముక్తికిన్ బోవుచో
రావే వెంబడి నింత నంత రఘువీర జానకీనాయకా!

86. శా. గోవం దొల్తటిజన్మకాలంబుల నీకుం బంటఁగా నైతిఁ గాం
చీవక్రంబులెకాక నాకు నివిలక్షింపంగ జన్మంబులా
చావుంబుట్టువు మాన్పుకోవలయు నీజన్మాననీవాఁడనై
రావానామది కింకనైన రఘువీర జానకీనాయకా!

87. శా. చావు ల్మర్త్యులకెల్లఁ గల్గుటలు నిస్సందేహము ల్దేహముల్
చేవ ల్గల్గిననాఁడె శ్రీగిరి గయా శ్రీవేంకటాహోబిల
గ్రావప్రాంతములందుఁజేరవలెఁ జేరంబోవ కేలబ్బు నా
ర్యావాణీస్తుత మోక్షలక్ష్మి రఘువీర జానకీనాయకా!

88. శా. త్రోవన్ మానవుఁ డొంటిఁ బోవుతఱి నీస్తోత్రంబు వాక్రుచ్చినన్
నీవుం దమ్ముఁడుఁ దోడువత్తురఁటె కా నెయ్యంబు తియ్యంబుగా
నీవంటాప్తుఁడు నిన్నుఁ బోలుహితుఁడున్ నీవంటిభక్తప్రియ
ప్రావీణ్యుండును లేఁడు చూడ రఘువీర జానకీనాయకా!

89. మ. నవనీతంబుల కేల పాఱెదవురా నాయన్న రా యెన్నరా
యివి దూత్యంబులు గాఁగ గోపికలు నీయింటన్ బదార్థంబు లె
య్యవి లేవంచు వంచించునమ్మకడ కొయ్యం జేరు నీచేయు మా
రవినోదంబులు నేఁ దలంతు రఘువీర జానకీనాయకా!

90. మ. వివిధ బ్రహ్మలయంత్యకాలముల నేవీనిల్వ వావేళలన్
ధ్రువుఁడుండుండు విభీషణుండు బలియుండున్ వారు నీదాసులై
నవిశేషంబునఁగాక తక్కొరుల కుండంబోలునే యింద్ర రు
ద్ర విరించి స్తుతశౌర్యసార రఘువీర జానకీనాయకా!

91. మ. చెవి నీనామము విందునో యని కడున్ శంకించి కర్ణంబులన్
రవముల్మీఱినఘంట లంట నిడి ఘంటాకర్ణుఁ దేతేరఁగా
నవిచూచే వర మిచ్చినాఁడవఁట నీయంఘ్రీద్వయీసేవక
ప్రవరున్ గాచుట యేమిలెక్క రఘువీర జానకీనాయకా!

92. మ. రవిసూనున్ బరిమార్చి యింద్రసుతునిన్ రక్షించినాఁ డందునో
రవిసూనుం గృప నేలి యింద్రసుతుఁ బోరం ద్రుంచినాఁ డందునో
యివి నీయందును రెండునుంగలవు నీకేదిష్టమౌనోకదా
రవివంశాగ్రణి తెల్పవయ్య రఘువీర జానకీనాయకా!

93. శా. దోషంబు లుకులపర్వతంబులకొలందుల్ గల్గినన్ గల్గనీ
మీసంకీర్తనశబ్దమాత్రమున భస్మీభూతముం జేయఁగా
త్రాసు ల్కోటిసహస్త్రముల్ గలిగి యెత్తన్ రాని కార్పాసపున్
రాసు ల్సోఁకిన నిప్పువోలె రఘువీర జానకీనాయకా!

94. మ. కసుమాలం బగుదేహి పుట్టువుల నీకష్టంబులంబాసి దీ
ప్యసుకాయం బొనరింతు వెవ్వఁడునినున్ వాక్రుచ్చినన్ యోగిమా
నసగేహంబులనుండి లోహము సువర్ణచ్చాయగాఁ జేయఁగా
రసవాదంబులు నేర్చి తౌర రఘువీర జానకీనాయకా!

95. పసులం గాచినగొల్లవాఁడ వనుచున్ భావింతు నెంతున్ మదిన్
ముసలిప్రాయమువాఁడ వైతివనుచున్ మూర్తిత్రయాకారునిన్
వసుధాధీశ్వరు నెంతు నిక్క మెఱుఁగన్ సర్వాపరాధిన్ గృపా
రసపాథోనిధి కావుమయ్య రఘువీర జానకీనాయకా!

96. మ. పసిడిం జూచి మహాప్రదాత యనుచున్ బీభత్సకుత్సాంగునిన్
ప్రసవాస్త్రప్రతిమానరూపుఁడనుచున్ బందన్ బ్రియంబంద శ
త్రుసమూహాంతకుఁ డంచు నెప్పుడు నరస్తోత్రంబుఁ గావించు నీ
రసుఁడన్ నున్ను నుతింప నేర రఘువీర జానకీనాయకా!

97. మ. బహురూపాలు ధరించుకొంచును గ్రియాభాషాంగము ల్ముట్టఁగా
బహుకాలంబులనుండి యాడితినిఁకన్ బ్రాల్మాలి నట్లయ్యెడిన్
దహలంబెట్టక చాల్పురే యనుము నీత్యాగంబు నేనొల్ల నా
గ్రహదైతేయమదాపహార రఘువీర జానకీనాయకా!

98. శా. మోక్షాపేక్ష జనించె నాకు నిది యేమొకాని యీజన్మమం
దక్షీణోదయ ముక్తి కెవ్వఁడొడయం డాపుణ్యునిం జెప్పెదో
దక్షారిస్తుత నీవె కర్తవయినన్ గక్కేల నీవే ననున్
రక్షింతో యెఱుఁగంగఁ జెప్పు రఘువీర జానకీనాయకా!

99. మ. అక్షీణప్రతిమానదానవిభవాహంకార పారీణ యో
రక్షోదైత్యమదాపహారవిభుధ త్రైలోక్యసంరక్షకా
దక్షధ్వంసవధూటికావినుత నీదాసానుదాసుంద నన్
రక్షింపంగదవయ్య నీవు రఘువీర జానకీనాయకా!

100. మ. చదువు ల్దొంగిలి సోమకాసురుఁడు భాషాభర్తకూపెట్టఁగా
నుదధుల్ సొచ్చిన వానిఁబట్టుటకు నుద్యోగించి మత్స్యంబవై
యదరంతన్ రిపుఁ ద్రుంచి వేదములు తేవా దేవ శాండిల్యనా
రదకౌండిన్యనుతప్రతాప రఘువీర జానకీనాయకా!

*101. మనుజాధీశులు నిర్జరాధిపతులున్ దామందఱున్ ముందరన్
ఘనసత్వంబున నెత్తివైచి జలధిన్ గర్వంబుతోఁ ద్రచ్చుచో
మునుగం బారకయుండఁ గచ్చాపమవై మున్నీటిలో నుండు వ
ర్తనమే నాత్మం దలంచుచుండ రఘువీర జానకీనాయకా!
(* 101. మ. అమరుల్ రాక్షసనాయకుల్ కడంకతో నత్యంతగర్వంబునన్
దమసత్వంబున మందరాచలముచేఁ ద్రచ్చంగ నంభోధిలో
రమణన్ దద్గిరి మోచి కాచినజగత్ప్రణుంద కూర్మవతా
రమనంగా మఱినీవె కావె రఘువీర జానకీనాయకా!)

102. మ. ధర కల్పాంతమునన్ గరంగఁబడి పాతాళంబులో *నంటినన్
దొరయన్ దొల్లిటియట్లకా నిలుప నుద్యోగించి క్రోడంబవై
పోరి నబ్భూతల మెత్తినట్టిఘనదర్పున్ నిన్నుభావింతు ని
ర్భరకారుణ్యనిరూఢ చిత్త రఘువీర జానకీనాయకా!
(* ఁజొచ్చినన్ అని పాఠాంతరము)

103. మ. వడుగా నీవడుగ న్నెఱుంగ విట నల్పం బైనవాసంబు న
న్నడుగన్ వచ్చితి వన్నఁ గంగొని బలీంద్రా నాకు నీవిచ్చుమూఁ
డడుగుల్మూఁడుజగంబులంచుఁ గొనవా*యాద్యంతముల్ మాట మా
ర్పాడ నాడే **మతికాఁడ వౌర రఘువీర జానకీనాయకా!
(* యత్యంతమున్; ** ముడికాఁడవౌదు అని పాఠాంతరము)

104. శా. ఏతాఁగాక మురాంతకుండు గలఁడా యెందైన నిందైన నీ
*చేఁతల్మానుమటంచుఁదండ్రిసుతునిన్ స్తంబంబులోఁ జూపరా
చూతా మన్న నృసింహరూపమున నచ్చో నుండవా చెండవా
రాతింబోలినదైత్యుమేను రఘువీర జానకీనాయకా!
(* చాఁతల్ అని పాఠాంతరము)

105. మ. సమరక్షోణులఁ బాఱఁబాఱఁగ జరసంధాదులన్ ద్రుంచి చం
డమదాభీలుని ధేనుకాసురుని చట్టల్చీరి ముష్టిప్రహా
రమ్ములన్ ముష్టికు నాప్రలంబదనుజున్ మ్రందించి తౌ రేవతీ
రమణాకారముఁ దాల్చి యౌర రఘువీర జానకీనాయకా!

106. మ. నిను నారాయణమూర్తిఁగాఁ దలఁచుచున్ నీదండ నాదండకా
వనవాచంయము లెల్లఁ జేరికొలువన్ వారిం గృపన్ జూచుటల్
వనధిం గట్టుట రావణుం దునుముటల్ వర్ణింతు రామావతా
రనురూఢాకృతి నిన్ను నోర రఘువీర జానకీనాయకా!

107. మ. అమరారాతివధూటికారమణుల న్నశ్వత్థనారాయణ
ద్రుమముం గౌఁగిటచేర్పఁజేసి వ్రతముల్తూలించి బుద్ధావతా
రమునన్ రుద్రసహాయమై త్రిపురముల్ మ్రగ్గించి తౌరౌరా ధీ
రమునిస్తుత్య యశోవిహార రఘువీర జానకీనాయకా!

108. మ. కలికాలాంతమునన్ గిరాతజనముల్ గర్వించి చంచత్కిరా
తులనెల్లన్ విదళింపుచున్ గృతయుగద్యోతంబుఁ గావింప నిం
పలరన్ గల్కివిగాఁగనిన్నహరిని న్నశ్రాంతముంగొల్చువా
రలు పుణ్యాత్ము లగణ్యశూర రఘువీర జానకీనాయకా!

ఒంటిమిట్ట రఘువీరశతకము
సంపూర్ణము

Wednesday, June 10, 2015

కృష్ణశతకము - సుబ్రహ్మణ్య భాగవతులు

కృష్ణశతకము
                                          -సుబ్రహ్మణ్య భాగవతులు 
(కందపద్య శతకము)

1. శ్రీవసుదేవునిగృహమున
దేవకీగర్భమున సకల దేవతలు నరుల్
నీవేదిక్కని కొలువగ
నావిర్భమైనదేవ యచ్యుతకృష్ణా

2. ఒకచోట జననము వే
రొకచోటను పోషణంబు నొప్పగను యశో
దకు నందునకును ముద్దుల
సుకుమారుడనైన బాలసుందర కృష్ణా

3. అష్టమగర్భమువలనను
కష్టమ్ములు గలుగుననుచు కంసుడు భీతిన్
దుష్టుండై నీయన్నల
కష్టాత్ముడు చంపె జాలిగానక కృష్ణా

4. చనుబాలిచ్చెదనని పూ
తన నీ చెంతకునుజేర దానియుసురులన్
చనుబాలతోడ బీల్చిన
ఘనుడవు నీశక్తినెన్న గలమే కృష్ణా

5. మూడునెలల బాలుడవై
వాడల యాదవుల వింత పడగ పడకపై
నాడుచు పదమున శకటము
గూలంగాదన్ను ముద్దు కొమరుడ కృష్ణా

6. సుడిగాలి రూపమున నిను
వడి వడి గొనుచున్ వధింప వచ్చిన దనుజున్
మెడబిగియబట్టి నేలం
బడద్రోసి వధించు చిన్నిపాపడ కృష్ణా

7. బాలుడవై వ్రేపల్లెను
బాలురతో కలిసి మెలసి బహువిధముల నీ
వే లీల నాడుకొంటివి
ఆలీల లనంతములు మహాత్మా కృష్ణా

8. నీపాపని దుండగముల
కోపగలేమమ్మ యనుచు న్గోపికలు చనన్
గోపికలు మొరలు వెట్టగ
నేపాపము నెరుగనటు నటింతువు కృష్ణా

9. మన్ను దిన గని యశోదయు
అన్నా యిదియేమి యనుచు నాగ్రహపడగా
చిన్నారి మోము లోపల
నన్ని జగములను జూపవా శ్రీకృష్ణా

10. అల్లరి బాలుడవనుచును
తల్లి నినున్ ఱోల గట్టి దండించగా నా
తల్లి గనకుండ లాగుచు
చల్లగ మద్దులనుగూల్చు జానవు కృష్ణా

11. గోపకుమారులు క్రేపుల
మేపుచు యమునాతటమున మెలగెడు వేళన్
క్రేపులలో క్రేపగు నొక
పాపపురక్కసుని గూల్చు బాలుడ కృష్ణా

12. బక దైత్యుడు నిను మ్రింగగ
నకటా యని మిత్రులెల్ల నాక్రోశింపన్
బకుమోము వెడలి వానిన్
వికలాంగునిజేసి చంపు వీరుడ కృష్ణా

13. తనయన్న బకుని జంపితి
వని పటురోషంబుతోన ఘాసురుడంతన్
పెనుబామై నిను నమ్మిన
జనులను హింసింపవాని జంపవె కృష్ణా

14. చిక్కముల చలిదిమూటలు
నక్కున గురువింద పేరులమరు సఖులతో
చక్కగ వేణువునూదుచు
మక్కువ గోవులనుగాయు మాధవ కృష్ణా

15. నడుచుచు నాడుచు పాడుచు
వడివడి డాగుచును వచ్చి పైనంబడుచు సం
దడిజేయుచు చలిది భుజిం
చెడువిధముల నెన్నదరమె చిత్రము కృష్ణా

16. చలుదుల సందడిలో లే
గల బాలుర కమలభవుడు గైకొని దాచన్
సలలితముగ నా రూప
మ్ములదాల్పవె బ్రహ్మనిన్ను పొగడగ కృష్ణా

17. వనమున తాళఫలముల
ననువుగ భక్షింపగోరు యాదవులకు భీ
తినిగొల్పు ధేనుకాసురు
ననుచరులను గూల్చిబ్రోచు హరి శ్రీకృష్ణా

18. కాళింది మడుగులోపల
వ్యాళంబందఱను గఱచి బాధలుపెట్టన్
కాళియు పడగలపైన మ
హాలీలలనాడి బాధ లణపవె కృష్ణా

19. మడుగును వెడలెడు నినుగని
పడతులు గోపకులు చింత బాసిచనుచు నా
యడవిని కార్చిచ్చునబడి
మిడతలవలెగుంద చిచ్చు మ్రింగవె కృష్ణా

20. చెలువలు జలకములాడగ
వలువలు గట్టుపయినుంచి వారిజొరగ నా
వలువలుగొని చెట్టెక్కిన
బలుకొంటె .... భక్తవత్సల కృష్ణా

21. పొలముల గోవుల మేపుచు
నలసిన బాలురకు నన్న మడుగగ ముని భా
ర్యలు భక్ష్యభోజ్యములు పు
ష్కలముగ నర్పింపగొనవె కరుణన్ కృష్ణా

22. పరియేట జరుగు నింద్రుని
క్రతువును మాన్పించి కొండ గట్టుకు పూజల్
చతురత సలుపుచు నా ప
ర్వతమై విందారగించు ప్రభుడవు కృష్ణా

23. మండిపడుచు దేవేంద్రుడ
ఖండముగా ఱాళ్ళవాన కల్పించగ గో
మండలముగావ కేలను
కొండను గొడుగువలెనెత్తు కుఱ్ఱవు కృష్ణా

24. వరుణుని భృత్య్డు నందుని
వరుణపురమ్మ్మునకుజేర్ప భక్తిన్ పరమా
దరమున వదల్చి తండ్రికి
పరమపదముజూపు భక్తపాలన కృష్ణా

25. వెన్నెలలో మురళిని గొని
తిన్నగ నదికేగి యిసుక తిన్నెలమీదన్
కన్నెలు గోవులు పాములు
పన్నుగ పరవశమునొంద పాడవె కృష్ణా

26. భాసురముగ నా గోపవి
లాసవతులు నడుమ మండలమ్ముగ నిలువన్
వాసిగపలురూపులతో
రాసక్రీడలచరించి రంజిలు కృష్ణా

27. సర్పమ్మొక్కటి నందుని
దర్పమున మ్రింగ పాదతాడనమున కం
దర్పసమదేహుజేయుచు
సర్పపు శాపమ్ముబాపు సదయుడ కృష్ణా

28. మురదళిని వినవచ్చెడు సుం
దరులనుగొని యక్షుడొకడు తత్తరమున ను
త్తరదిశకు జనగ వానిని
శిరమున మణిలాగి ద్రుంచు జెట్టివి కృష్ణా

29. గోవుల లేగల దఱుముచు
గోవృషదైత్యుండు మందకున్ వడిరాగా
నావృషభాసురు కొమ్ముల
చేవంగొని నేలగొట్టు శ్రీహరికృష్ణా

30. కేశియనెడు నశ్వాసురు
నాశగొనుచు కంసుడంప నతిభీకరుడౌ
నాశత్రుని మాయలతో
కేశవ వాని మదమణచి గెడుపవె కృష్ణా

31. ఆటలలో గోపకులను
పోటుతనమ్మున హరించి వోమాసురుడా
చాటున గుహలోదాచిన
వాతముగావానిద్రుంచు వరదుడ కృష్ణా

32. నారదుని పలుకులను విని
క్రూరుండౌ కంసుడధిక కోపముతో న
క్రూరు థనుర్యాగంబను
పేరిట నినుబిల్వనంప వెడలవె కృష్ణా

33. యమునా నదిలోపల నీ
రముమధ్యను నిన్నుగాంచి రథమున నీ రూ
పముగని యత్యంతానం
దము నక్రూరుండుగనడె ధన్యుడు కృష్ణా

34. పురకాంతలు నీ యందము
నరసి విరులవానగురియ నరుగుచు మధురా
పురమున చాకలియొద్దను
సురుచిర వస్త్రములగొనెడు శూరుడ కృష్ణా

35. వాయక సుదాములొసగిన
నాయర్చన లంది కుబ్జ యనెడు త్రివక్రన్
చే యెత్తిలాగి సుతనుం
జేయుచు చందనములందు చెలువుడ కృష్ణా

36. ధనువు నవలీల విఱిచితి
వనుచును నీపైన కువలయాపీడంబున్
దనుజుడుపంపగ దంతము
లను బెఱికి వధించు వీరలక్షణ కృష్ణా

37. తల్లడమందుచు కంసుం
డుల్లంబునకలగ మల్లయుద్ధమునందున్
బల్లిదుల ముష్టికాదుల
మల్లవరులద్రుంచు గీతిన్ మండన కృష్ణా

38. గరుడుడు పాము శిరంబును
కరమరుదుగబట్టి యీడ్చు కరణిని కంసున్
వరసింహాసనగతునిన్
బిరబిరలాగి తెగటార్చు వెన్నుడ కృష్ణా

39. నిను హింసించిన రాక్షస
జనులకు నైక్యంబుగలిగె సర్వము నీకే
యనువుగనిచ్చిన గోపాం
గనలకు నీవేమియొసగ గలిగితి కృష్ణా

40. కడుచింతించెడు కంసుని
పడతులనోదార్చి చెఱల బడిన పితరులన్
విడిపించి యుగ్రసేనుని
పుడమికిపట్టమ్ముగట్టు పుణ్యుడ కృష్ణా

41. గురువులకెల్లను గురువై
వరలెడు నీవొక్క విప్రవర్యునియింటన్
గురుశిష్యన్యాయముతో
గురుమతి విద్యలను నేర్చుకొంటివి కృష్ణా

42. గురుదక్షిణకొఱకై సా
గరమున నా పంచజనుని కాయమునందున్
వరశంఖముగైకొని యమ
పురి గురుసుతుదెచ్చియిచ్చు ప్రోడవు కృష్ణా

43. తన సుతలు కంసు భార్యలు
తను ప్రేరణజేయ సప్తదశవారంబుల్
నినుబాధించు జరాసం
ధుని యుద్ధమునందు పాఱద్రోలవె కృష్ణా

44. జవమున మధురాపురిపై
యవనజరాసంధులిరువు రరిగెదరని యా
దవులను రక్షింపగ ద్వా
రవతిని మున్నీటగట్టు రక్షక కృష్ణా

45. చలమున నీ వెంబడిపడి
యలయక పరుగెత్తుకాల యవనుని గుహలో
పల ముచికుందుని కనుమం
టలపాలొనరించు లోకనాయక కృష్ణా

46. నీదర్శనభాగ్యముకై
సాదరముగ నిద్రజెందు నా ముచికుందున్
బీదివ్యరూపదర్శన
మోదంబునదేల్చు భక్తపూజిత కృష్ణా

47. బలరాముడు నీవును మీ
బలదర్పములుడిగ్ చన ప్రవర్షణగిరిపై
నలుదెసల మగధు డగ్నిని
నెలకొల్పిన దూకిపఱచు నిపుణుడ కృష్ణా

48. శిశుపాలున కిచ్చెదరని
విశదమ్ముగ దెలిసియొక్క విప్రుని బంపన్
దిశల యశము నిండగ నీ
వశమున రుక్మిణిని గొనెడు ప్రభుడవు కృష్ణా

49. దక్షుడవై రాజేంద్రులు
వీక్షింపగ భీష్మసుతను వేగమె దయతో
రాక్షసవివాహమునగొను
సాక్షాద్విష్ణుడవు దేవ సన్నుత కృష్ణా

50. సరివాడవిగావని నిను
విరసమ్ముగ రుక్మితాక వీరుడవై సో
దరి ప్రార్థింపగ వానిని
కరుము విరూపునిగజేసి కాచెడు కృష్ణా

51. పురుటింటి బాలుగొని శం
బరుడు సముద్రమున వేయ మత్స్యము మ్రింగన్
దొరికి పెఱిగి యా శంబరు
మరిమార్చినమరుని గన్న వాడవు కృష్ణా

52. మణికై వచ్చిన యపనిం
దను బాపగ జాంబవంతు దర్పమడచి యా
మణియుని నిరువురు కన్యా
మణులను గైకొన్న మేటి మగడవు కృష్ణా

53. పుత్రిక మెసంగలేదని
సత్రాజితు గొంతుగోసి చనుచున్ మణిన్
మిత్రునకిడు శతధన్వు న
పాత్రుని దెగటార్చి మణిని బడసిన కృష్ణా

54. కాళిందీజలములలో
కాలాత్మకుడైన సూర్యు కన్యకయగు నా
కాళింది తపము జేయగ
నా లలితాంగినివరించు యదువర కృష్ణా

55. వృషభమ్ముల నేడింటిని
విషమస్థలమందు జనులు వేడుకగన పౌ
రుషమున బంధించిన యదు
వృషభుండవు నాగ్నజితికి ప్రియుడవు కృష్ణా

56. శ్రీరుక్మిణి జాంబవతియు
వీరయువతి సత్య మిత్రవిందా భద్రల్
కాళింది నాగజితియను
వారలు లక్షణయు అష్టభార్యలు కృష్ణా

57. సురకంతకుడగు నరకుని
సురమున బరిమార్చి సత్యతోగూడి యటన్
తరుణుల బదాఱువేలను
పరిణయమగు సర్వలోక భర్తవు కృష్ణా

58. పురమునకు మరలివచ్చును
సురపతితో బోరి గెలిచి సుందరతరమౌ
వరపారిజాతతరువును
గరుడునిపై బెట్టితెచ్చు ఘనుడవు కృష్ణా

59. నారదుని వాక్యములు విని
ధీరుడు ధర్మజునిచేత దివ్యమహిమతో
నారాజసూయమఖ మ
వ్వారిగ జేయించు యోగివందిత కృష్ణా

60. బలిమి జరాసంధుని నె
చ్చెలులై యొకరొకరికొఱకు ప్రాణములైనన్
విడిచెడు హంసడిచికులన్
బలునేర్పునద్రుంచు లోకపాలక కృష్ణా

61. కపట బ్రాహ్మణులై చని
విపులాహవభిక్షవేడి భీమునిచే మీ
కపకారి మాగధుని జగ
దుపకారముగావధించు యోగ్యుడ కృష్ణా

62. అలమాగధుండు భైరవ
బలికైకారాగృహముల బడవేసిన రా
జుల విడుదలజేయుచు వా
రలచే ప్రార్థనములంది గ్రాలెడు కృష్ణా

63. తొలుతన్ పూజలనందగ
కులగోత్రము లేని వెఱ్ఱి గొల్లడనుచు నిన్
వలదనిన తిట్టు చైద్యుని
తల చక్రమున హరించు దక్షుడ కృష్ణా

64. యతివేషంబున వచ్చిన
నతిసుందరు డర్జునునకు ననుజ సుభద్రా
సతి పరిచర్యకు నిలుపుచు
నతనికి పరిణయము జేయు హరి శ్రీకృష్ణా

65. అనలునిచేతను ఖాండవ
వనమును భక్షింపజేయు వరుణునిచే న
ర్జునునకు చాపము రథమును
ఘనచక్రము గదయు నీకు గైకొను కృష్ణా

66. మయుడగ్నిని బడకుండగ
దయతో నర్జునుడు ప్రాణదానముజేయన్
మయుచే సభచేయించి వి
జయునకు సభతోడ జయమొసంగెడు కృష్ణా

67. సభలోన ధర్మతనయుని
విభవంబు నసూయతోడ వీక్షించు కురు
ప్రభుని నగుబాటుచె నా
సభ రణబీజముగ నాటు చతురుడ కృష్ణా

68. హా కృష్ణా! యదునందన
నాకెవ్వరు దిక్కులేరు ననుగావుమనన్
కోకల నక్షయముగ నీ
వా కృష్ణాకు నొసగి బ్రోవవా శ్రీకృష్ణా

69. కౌరవులకు పాండవులకు
వైరమ్ములు మాన్పి స్నేహభావము గలుగన్
పోరవలదని సుయోధను
వారింపగ జూచురాయబారివి కృష్ణా

70. చేతుల చాపము జాఱగ
భీతింగొను నర్జునునకు ప్రియమున భగవ
ద్గీతల నుపదేశించిన
నేతవుగద విశ్వరూపనిలయుడకృష్ణా

71. కురుపతి సుయోధనునకు న
పరిమితమగు సైన్యమొసగి స్వయముగ నీవే
నరునకు నరదము గడపుచు
సరగున జయమొసగు పార్థసారధి కృష్ణా

72. అభిమన్యుని మేనల్లుని
నభిమానమొకింతలేక యనిలోన కురు
ప్రభువులచే జంపించిన
విభుడవు సర్వేశ వేదవేద్యా కృష్ణా

73. చక్రంబు పూనననుచు న
వక్రగతి ప్రతిజ్ఞజేసి పార్థునిపైనన్
విక్రమమున భీష్ముడు చన
చక్రము చక్రమని యఱచు సదయుడ కృష్ణా

74. ఉత్తరగర్భము లోపల
తత్తరమున బాణశిఖల దగ్ధుడగు పరీ
క్షిత్తును గదచేగాచిన
యుత్తమచరితుడవు ప్రణుతయోగివి కృష్ణా

75. నరునకు సారథివై యా
నరవరుకొడుకునకు ప్రాణనాశకరుడవై
నరుపొత్రుడగు పరీక్ష
న్నరపతి రక్షించు నందనందన కృష్ణా

76. శరతల్పమందు నీపద
సరసీజములు మదినినిల్పి సంకల్పాదుల్
స్థిరుడై విడిచిన భీష్ముని
కరయగ మోక్షపదమిడవె యవ్యయ కృష్ణా

77. కేళీగృహమున రుక్మిణి
జాలగ విరసోక్తులాడి సతి ధరమీదన్
వ్రాలిన కరుణాలుడవై
జాలింగొని మూర్చదేర్చు సరసుడ కృష్ణా

78. తనకూతును గూడిన నీ
మనుమని పాశములగట్టి మందిరమును గా
వను శివుని నిల్పుకొను బా
ణుని గర్వమడంచు శంభునుతుడవు కృష్ణా

79. మును దానంబిచ్చిన గో
వును మరలనొసంగ కూపమునబడి పాపం
బున నూసరవెల్లిగ నుం
డిన నృగునకు మోక్షమిచ్చు నేర్పరి కృష్ణా

80. తన పేరును తన లక్షణ
మును దాల్చితివనుచు పంతమున గద చక్రం
బును దాల్చి వడిగ నీపై
జను పౌండ్రక వాసుదేవు జంపవె కృష్ణా

81. జనకుని వధియించున నా
తని సుతుడు సుదక్షిణుండు దర్పమున కృ
త్యను బంపగ చక్రంబున
ఘనమగు మంటలను దాని గాల్పవె కృష్ణా

82. హరుని కృపవలన శల్వుడు
వర నూత్నవిమానమొకటి బడసి యలుకతో
నరుదేర సౌభకముతో
నరివీరుని బాహుగర్వ మడచిన కృష్ణా

83. చెలులగు పౌండ్రక సాల్వా
దులకును తర్పణములొసగి తోరపుటలుకన్
కలహించు దంతవక్త్రుని
బలిమిన్ వధియించు చక్రపాణివి కృష్ణా

84. షోడశ సహస్త్ర భార్యల
గూడిన నీమహిమ తెలిసికొను కోరికతో
నాడుచు నీ చరితంబుల
పాడుచు నారదుడు తుష్టి బడయడె కృష్ణా

85. కడుపేద విప్రుకొంగున
ముడిచిన యటుకులనుజూచి మోదముతోడన్
పిడికెడు తిని వానికి తృ
ప్తుడవై సంపదల నొసగు మోహనకృష్ణా

86. గ్రహణంబునాడు భార్యా
సహితుడవై తీర్థమందు స్నానముజేయన్
మహితాత్ములు రాజులు నీ
మహిమలు గొనియాడ వెలయు మాధవ కృష్ణా

87. గురుసుతుని దెచ్చియిచ్చిన
తెరగున నీ తల్లి కోర్కె దీర్పగ బలి మం
దిరమున మృతులైన సహో
దరులంగొని వచ్చియిచ్చు దాతవు కృష్ణా

88. మునిగణములు నినుగొల్వగ
జని మిధిలాపురమునందు సత్కారములన్
గొని భూపతికిని విప్రున
కును సుజ్ఞానము నొసంగు గురుడవు కృష్ణా

89. శిరమంట భస్మమగునని
వరమిచ్చిన శివునివెంటబడి కనుగొనగా
పరిగెత్తు వృకుని కడు నే
ర్పరివై సమయించు సాధువత్సల కృష్ణా

90. తనవారు వీరు పరులని
యణుమాత్రము భేదమైన యమరదునీకున్
గనుకనె నీ యాదవకుల
మునకు కల్పించినావు ముసలము కృష్ణా

91. యాదవుల మద్యజనితో
న్మాదులను ప్రభాసమందు మసలెడివారిన్
వాదములాడుచు చావగ
మోదుకొనంజేయుదేవ ముఖ్యుడ కృష్ణా

92. చరణంబు మీద వేరొక
చరణము నిల్పుచు కదల్చు సమయమందున్
బరువడి కిరాతు డొకడు
శరమేయగ తనువుబాసి చను శ్రీకృష్ణా

93. నినుగాంచి వగచుబోయకు
వెనుకటి కర్మంబుదాట వీలుగలుగునా
యని పలికితి వచ్యుతునకు
వెనుకటి కర్మంబు నీకు వెలయునె కృష్ణా

94. ఈ యుర్విబాసి చనునెడ
నా యుద్ధవు డడుగనిన్ను నతిహర్షముతో
శ్రీయుతమగు పరమార్థము
నాయనఘన కొసగి చనవె యవ్యయ కృష్ణా

95. శుకుడు పరతత్వమగు నీ
యకలంకంబైన చరితమంతయు దెలుపన్
ప్రకటయశుడు పుణ్యారం
భకుడు పరీక్షత్తు ముక్తి బడయదె కృష్ణా

96. ఏదినమున నవతారము
మేదినిపై మానదలచి మేను విడచినా
వాదినము కలియుగంబున
కాదిగ ప్రారంభమయ్యె నచ్యుత కృష్ణా

97. గాండీవంబు చేతనుండియు
చండభుజపరాక్రమంబు చాల గలిగియున్
దండిసహాయుడవగు నీ
వుండమి నరుడేమిచేయ నోపడు కృష్ణా

98. అవని పరునింట బ్రదుకుట
యవన జరాసుతులకోడి యబ్ధిని భీతిన్
నివసించుట రెండును ను
ద్ధవు డతిదుఃఖంబుతోడ దలచును కృష్ణా

99. జలధికి చేరువ తనువును
విడిచిన క్షేత్రంబు సకల విశ్వమునందున్
పలువురు యాత్రలు జేయగ
నలఘు జగన్నాధమగుచు నలరెను కృష్ణా

100. కొందఱు పగచేతను మఱి
కొందఱు మోహంబుచేత కొందఱు భీతిన్
కొందఱు ప్రేమను నిను మఱి
కొందఱు సద్భక్తి కలసికొందురు కృష్ణా

101. ముల్లుగొని ముల్లు దీయుచు
చల్లగ రెంటిని త్యజించు చందమున భువిన్
కల్ల తనుపుగొని యసురుల
కల్లరుల వధించు నిర్వికారుడ కృష్ణా

102. క్రూరులగు దుష్టరాక్షస
వీరుల సృజియింపనేల పృథివీస్థలిపై
భారము మాన్పుటకై యవ
తారము నెత్తంగనేల తలపగ కృష్ణా

103. నామము రూపము కర్మము
లేమాత్రములేని నీకు నీశునకు భువిన్
నామము రూపము కర్మము
లేమిట గలుగంగవలసె నెఱుగము కృష్ణా

104. హరియనుచును నిను కొందఱు
హరుడనుచున్ మఱియుకొందఱర్చింతురునన్
కరుణించి జన్మ కర్మల
హరియింపు మెవందవైన నరయసు కృష్ణా

105. క్రమమున నెగుఱుచు నాకా
శము దూరము పక్షి తెలియజాలని గతి నీ
కమనీయ లీలలను స
ర్వముతెలియగ నెవ్వడోపు భవవారకృష్ణా

106. ధరణిపయి కాలుజాఱిన
ధరణియె చేయూతయగు విధంబున నీకున్
కర మపరాథమొనర్చిన
నరునకు శరణంబు నీవె నాకున్ కృష్ణా

107. ఘననీలకాంతి కౌస్తుభ
మును పింఛము నాణిముత్తెమును కస్తురి మో
విని వేణూవొప్పురూపము
కనుమూసిన విచ్చినపుడు కనబడు కృష్ణా

108. అష్టోత్తరశతకందము
లిష్టముగా నీ పదముల కిదె యర్పింతున్
సృష్టి స్థితి లయకర నా
కష్టమ్ములు మాన్పి నన్ను గైకొను కృష్ణా

కృష్ణా నీ పదపంకజంబను పంజరంబును నేడె నా
మానసంబను రాజహంసంబు చేరుగావుత ప్రాణముల్
తర్లిపోయెడువేళ శ్లేష్మము వాత పైత్యములడ్డమై
గొంతు జుట్టుకొనంగ నీస్మరణంబు నాకెటులభ్యమౌ?

శ్రీకృష్ణ శతకము సంపూర్ణము

Sunday, June 7, 2015

శ్రీదుర్గామల్లేశ్వర శతకము - చల్లా పిచ్చయ్య

శ్రీదుర్గామల్లేశ్వర శతకము
                                               -- చల్లా పిచ్చయ్య

1. శా. శ్రీమంతంబగు నీమహామహిమ వర్ధిష్ణుత్వమొక్కొక్కచో
శ్రీమంతుంబొనరించె నొక్కొకని మున్ శ్రేయస్ప్వరూపమ్మునన్
స్వామీ! నేఁడటె "కోటవీరశరభ ప్రజ్ఞాబ్ధులన్" బేర్మి దు
ర్గామల్లేశ్వర సర్వదేవ పరివారా! హారహీరాకృతీ!

2. శా. శ్రీమించు ల్గల నీపురి న్నలుగడన్ జేబూని ఖడ్గంబరి
స్తోమమ్ము న్విదళించి భైరవ తను జ్యోతుల్ప్రదీపింపఁగా
యామమ్ముల్కనిపెట్టు దిస్సమొలదీవ్యత్ఖ్సేత్రపాలుండు దు
ర్గామల్లేశ్వర సర్వదేవ పరివారా! హారహీరాకృతీ!

3. శా. ఓమాకారము వక్రతుండమును దంతోధ్భూత కాంతిచ్ఛటల్
మైమై త ద్యమునా సరస్వతుల శుంభద్రేఖఁగాన్పింపఁ ద్వ
త్ప్రేమస్థానము "సిద్ధి బుద్ధి" పతి సేవించున్గజాస్యుండు దు
ర్గామల్లేశ్వర సర్వదేవ పరివారా! హారహీరాకృతీ!

4. శా. చామంతీ నవమల్లికాది సుమగు చ్ఛస్వచ్ఛసౌగంధ్య మి
మ్మౌమూర్తింబ్రకటించుచున్ సకలశాస్త్రామ్నాయసంధాతశో
భామధ్యందినభాస్కరుండెసఁగు సుబ్రహ్మణ్యుఁడౌఁజెంత దు
ర్గామల్లేశ్వర సర్వదేవ పరివారా! హారహీరాకృతీ!

5. శా. ధీమాంద్యమ్ముదొలంచి సన్మకుట పంక్తిస్ఫీత ముక్తాఫల
శ్రీమద్విద్రుమహేమనీలసితరొచిఃక్రాంతకాంతాస్యముల్
భూమానందమొసంగ నీదరిని పొల్పుంగూర్చుగాయత్రి దు
ర్గామల్లేశ్వర సర్వదేవ పరివారా! హారహీరాకృతీ!

6. శా. మై మించుల్ గలవల్వ కైవిలు తలన్ భాస్వత్కిరీటంబు వీ
క్షామార్గమ్మును నిల్ప నీడయు భుజాస్కంధంబులొప్పన్ గుణ
గ్రామశ్రీనిథి రామచంద్రుఁడు శుభాకారుండునిన్గొల్చు దు
ర్గామల్లేశ్వర సర్వదేవ పరివారా! హారహీరాకృతీ!

7. శా. హేమంబుంగురియించు మేనిసిరి హాయింగూర్చుచున్ సర్వదా
యామోదంబు ఘటింప రామవిభు నిత్యానందరూపంబు భా
మా ముంగొంగుపసిండి నినొలుచు సంపద్వల్లిగోపుత్త్రి దు
ర్గామల్లేశ్వర సర్వదేవ పరివారా! హారహీరాకృతీ!

8. శా. భీమాకారపరాక్రమక్రమము జూపింపం గడుం జాలియున్
భూమిన్ మించినశాంతి జాలియును నెమ్మోమెత్తితెల్పన్ తధు
స్వామి స్వచ్ఛయశంబు వెల్లగొడుగౌ సౌమిత్రినిన్గొల్చు దు
ర్గామల్లేశ్వర సర్వదేవ పరివారా! హారహీరాకృతీ!

9. శా. భూమీశాకృతి భాతృభక్తి యువరూపుంగొన్న వైరాగ్యమౌ
రామప్రేమసుదాబ్ధి చంద్రముఁడు ధర్మప్రాణ మౌదార్య వి
ద్యామర్త్యత్యము యోగిరాడ్భరతుఁ డుద్యద్భక్తి నిన్గొల్చు దు
ర్గామల్లేశ్వర సర్వదేవ పరివారా! హారహీరాకృతీ!

10. శా. సీమస్థానమతిక్రమించువిధదోషిన్ వార్ధిరామక్రియన్
సీమస్థానమతిక్రమించువిషదో షిం దున్మి పేర్గన్న ని
ర్ధూమాతిప్రతిమప్రతాపరవిశ త్రుఘ్నుండు నిన్గొల్చు దు
ర్గామల్లేశ్వర సర్వదేవ పరివారా! హారహీరాకృతీ!

11. శా. శ్రీమద్రామకథామృతం బిల నవిచ్ఛిన్నంఉగాఁ గ్రోల్చుచున్
రామధ్యాననిమగ్నతన్ మొగిఁబరబ్రహ్మమ్ముగాఁ జూచుచున్
మైమౌంజీముఖచిహ్నముల్ గల హనూమంతుడు నిన్గొల్చు దు
ర్గామల్లేశ్వర సర్వదేవ పరివారా! హారహీరాకృతీ!

12. శా. ప్రామింకుల్రతనాలపేటిజగతీ భాగ్యప్రభోదంబు తే
జోమూలంబు సువర్తులాకృతిమహా స్త్సోమంబు బాహ్యాంతర
వ్యామోహాగ్ర తమోనివర్తకము భా స్వన్మూర్తి నిన్గొల్చు దు
ర్గామల్లేశ్వర సర్వదేవ పరివారా! హారహీరాకృతీ!

13. శా. వ్యోమాలంకృతినిర్మలాకృతికలా పూర్ణుండుసర్వౌషథీ
భూమానందము కౌముదీనిధి భవ న్మూర్ధప్రసూనంబు నం
భోజమంజూషదృగుత్పలప్రసవక ర్పూరంబునిన్గొల్చు దు
ర్గామల్లేశ్వర సర్వదేవ పరివారా! హారహీరాకృతీ!

14. శా. భూమిప్రేమనిదానభూమి నిధిసం పూర్ణప్రమోదావహ
స్థేమస్థానవదాన్యమౌళి విలసత్సిందూరమందార తే
జోమీమాంస కుజుండు నిన్నుమదినెంచుంన్భక్తి యుక్తాత్మ దు
ర్గామల్లేశ్వర సర్వదేవ పరివారా! హారహీరాకృతీ!

15. శా. సామానూనవచఃప్రదాతమిధునా శాస్యప్రయుక్తాస్యుఁడో
జోమైత్రిలతికాలవాలముకలా స్ఫూర్తిస్ఫురన్మూర్తి మే
ధామకందము సౌమ్యుఁడంచితుఁడు చెంతంగొల్చునిత్యంబు దు
ర్గామల్లేశ్వర సర్వదేవ పరివారా! హారహీరాకృతీ!

16. శా. సామంజస్య గుణప్రశంస్యుఁడు సదాచార ప్రచార స్థిర
క్షేమాకారుఁడు వీక్షణప్రణుదితా శేషదోషుండు ధీ
సామగ్రీప్రతిపాదకుండు విబుధాచార్యుండు నిన్గొల్చు దు
ర్గామల్లేశ్వర సర్వదేవ పరివారా! హారహీరాకృతీ!

17. శా. గోమాణిక్య కలావిశేషము వచో గుంభప్రియం భావుక
శ్రీమేదః పరిపుష్టి సర్వసుకలా సిద్ధాంత ఘంటాపథ
గ్రామాభ్యంతర సీమ కావ్యుఁడు శుభాకారుండు నిన్గొల్చు దు
ర్గామల్లేశ్వర సర్వదేవ పరివారా! హారహీరాకృతీ!

18. శా. ద్యోమార్గంతరమందగామి యఘ యాదోరాశి, నిర్మగ్న చే
తోమంథానము, తావకీనగళవిద్యోతప్రమేయాత్మ శో
భా మూర్తి స్ఫుర, శౌరి కొల్చు నిను శుంభద్భక్తిసంయుక్తి దు
ర్గామల్లేశ్వర సర్వదేవ పరివారా! హారహీరాకృతీ!

19. శా. భూమీశత్వ ముఖ ప్రకృష్ట పదవీ భూయస్త్వ సంపాదనో
ద్దామప్రఖ్యుఁడు రాహు భోగమకుటోద్యద్ద్యోత రత్నప్రభా
స్తోమద్రావిత రోదసీ తిమిర సందోహుండు నిన్గొల్చు దు
ర్గామల్లేశ్వర సర్వదేవ పరివారా! హారహీరాకృతీ!

20. శా. ప్రేమం దా సమసప్తకంబున సదా వీక్షించుచున్ రాహువున్
సోమున్ సూర్యుని మిత్రదృష్టిఁగనుచున్ శుద్ధాంతరంగమ్ముతో
క్షేమంబున్ మదిఁగోరి కేతువును నీసేవం బ్రవర్తించు దు
ర్గామల్లేశ్వర సర్వదేవ పరివారా! హారహీరాకృతీ!

21. శా. తా మేలౌయవధూతయయ్యు మహిశాస్తన్ లోఁబరీక్షింప నే
మేమో వింతలుపన్ని లంపటునియట్లే తోఁచి మూర్తిత్రయో
ద్ధామప్రస్ఫుటధామమై వెలయుఁదత్తాత్రేయుఁడౌమ్రోల దు
ర్గామల్లేశ్వర సర్వదేవ పరివారా! హారహీరాకృతీ!

22. శా. క్షామాడంబరమున్ సృజింపఁగల దుశ్చారిత్ర దుస్త్రంత మి
థ్యా మూలంబుల దుర్మతేభముల వాదస్ఫార సింహద్వనిన్
బ్రామిన్కుల్వెలయించు శంకర పరివ్రాట్చంద్రుఁడీ వౌదు దు
ర్గామల్లేశ్వర సర్వదేవ పరివారా! హారహీరాకృతీ!

23. శా. సామోధ్భూతము నాదరూపమును నౌ సంగీత రత్నాకరం
బామూలంబు మథించి సత్కృతుల గేయంబౌ సుధాధార శ్రీ
రామ బ్రహ్మముఁదన్పు త్యాగయ్య సదారంజిల్లు మీమ్రోల దు
ర్గామల్లేశ్వర సర్వదేవ పరివారా! హారహీరాకృతీ!

24. శా. సామర్థ్యంబున శృంగ శబ్ధధృతి ప్రాశస్త్యంబు బోధింపఁగా
భీమంబౌ నిజ కంఠనాదమున దుర్వీరు ల్భయంబందఁగా
నీముందే నివసించి నిన్నుఁ గొలుచు న్నిర్ణిద్రుడౌ నంది దు
ర్గామల్లేశ్వర సర్వదేవ పరివారా! హారహీరాకృతీ!

25. శా. బూమేల్వన్నెడు చెట్టరక్కసులు వాపోవంగ గర్జిల్లుచున్
బాముల్వెట్టెడు కిల్బిషేభవితతిం బాదాహతిన్ వ్రచ్చుచున్
నేమంబొప్పఁగ సింహవాహనము నిన్నిత్యమ్ము సేవించు దు
ర్గామల్లేశ్వర సర్వదేవ పరివారా! హారహీరాకృతీ!

26. శా. ఐమాకారము దుర్గయందుఁగల యయ్యష్టాక్షరీ సారమున్
భా మల్లేశపంబున న్వెలయు త త్పంచాక్షరీ సారమున్
దామేకత్వముఁజెంది యిక్కలిని భక్తత్రాణముంబూనె దు
ర్గామల్లేశ్వర సర్వదేవ పరివారా! హారహీరాకృతీ!

27. శా. నీమస్తంబువలెన్ జడల్ గలతలల్ నెమ్మేన భస్మం బెదన్
నీమంత్రంబుసతంబు నిండుకొనఁ బూంకి న్నీ సమక్షంబునన్
గోమౌమూతుల శృంగిభృంగిరిటి ముఖ్యుల్కొల్తు రెల్లప్డు దు
ర్గామల్లేశ్వర సర్వదేవ పరివారా! హారహీరాకృతీ!

28. శా. నీమ్రోయించెడుఢక్క కారణముగా నిష్పన్నమై సర్వదా
స్వామిత్వప్రతిపాదకత్వమునకౌ శబ్దప్రధానమ్మునై
నీమూలస్థితిఁదెల్పు వ్యాకరణము న్నిందెల్పు నిత్యంబు దు
ర్గామల్లేశ్వర సర్వదేవ పరివారా! హారహీరాకృతీ!

29. శా. నేమం బొప్పఁగఁ జండశాసనమున న్నీరేజ జాండంబులన్
సామర్థ్యంబున మంచిచెడ్డలను విశ్వాసోక్తి బోధించుచున్
నీ మహాత్మ్యము దెల్పుశిక్షయును బూన్కి న్విశ్వసంరక్ష దు
ర్గామల్లేశ్వర సర్వదేవ పరివారా! హారహీరాకృతీ!

30. శా. ధూమంబెచ్చట నగ్నియచ్చటను సూక్తుల్చూపికార్యాత్మకం
బౌ మాయా శబలంబు విశ్వమున ముఖ్యంబౌ నుపాదాన మీ
వే ముమ్మాటికటంచుఁ దర్కమును నెంతేఁదెల్పు సర్వత్ర దు
ర్గామల్లేశ్వర సర్వదేవ పరివారా! హారహీరాకృతీ!

31. శా. భూమింజేసిన యజ్ఞసాధనము రూపున్ వీడినన్ సంస్కృతిన్
దీమంబైన యపూర్వమే ననుచు నందించున్ ఫలంబంచు వా
క్సామర్థ్యంబును జూపుఁగర్మవిధి విశ్వాసంబు మీమాంస దు
ర్గామల్లేశ్వర సర్వదేవ పరివారా! హారహీరాకృతీ!

32. లోమాటైన యథార్ధతత్త్వముననౌ లోతుల్ ప్రభోదించుచున్
సామోదంబుగ సర్వశబ్దముల నీయందే సమర్పించి నీ
ప్రామాణ్యంబు దృఢంబుఁజేయు భువినెప్పాటన్ నిరుక్తంబు దు
ర్గామల్లేశ్వర సర్వదేవ పరివారా! హారహీరాకృతీ!

33. శా. ఆమూలాగ్రము సర్వశాఖలను నిత్యాచారసంపత్తి న
య్యైమార్గంబుల నిల్పుపొంటె విధులన్ వ్యాపింపఁగాఁజేసి ది
వ్యామోదంబగు కల్పకల్పకము నీ యాహ్లాదమౌఁగాదె దు
ర్గామల్లేశ్వర సర్వదేవ పరివారా! హారహీరాకృతీ!

34. శా. శ్రీమించు ల్కల నిల్వుటద్దమున మూర్తిస్ఫూర్తులట్టుల్ జగ
ద్వ్యామిశ్రంబగు జీవికర్మము గ్రహ వ్యావృత్తి బోధించుచున్
నీమన్కిందగు జ్యౌతిషంబు తెలుపున్ నీసాక్షిభావంబు దు
ర్గామల్లేశ్వర సర్వదేవ పరివారా! హారహీరాకృతీ!

35. శా. నేమంబొప్పఁగమాత్రలున్ గురువులున్నిందగన్ గణమ్ముల్ మహా
శ్రీమాన్యంబులువృత్తముల్ వెలయఁగాఁద్రిష్టుమ్ముఖమ్ముల్ సదా
ధీమల్లిన్విరియుంచు ఛందమును వర్ధిష్ణుత్వ సంపాది దు
ర్గామల్లేశ్వర సర్వదేవ పరివారా! హారహీరాకృతీ!

36. శా. భూమిన్ ద్యోతలమందునం జెలగు జీవుల్ పుట్టుటల్ పుట్టితా
మే మాద్రింజరింయింపఁగా వలయునో, యేజీవికాహారమె
ట్లోమేలోధులెట్లొ సర్వమును దెల్పున్ ఋక్కునీయూర్పు దు
ర్గామల్లేశ్వర సర్వదేవ పరివారా! హారహీరాకృతీ!

37. శా. ద్యోమేది న్యనుబంధముందెలుపు విధ్యుక్తాధ్వరశ్రేణి సు
త్రామాదుల్ తవియంగఁ జేయునది కర్మ బ్రహ్మరూపంబుగా
నామంత్రించు యజుస్సుసూక్ష్మముశిరంబశ్రాంతమున్నిన్ను దు
ర్గామల్లేశ్వర సర్వదేవ పరివారా! హారహీరాకృతీ!

38. శా. భూమాశ్చర్యకరంబులై తగి నభో భూభాగమున్నిండి సం
ధామూలమ్ముల నస్త్రశస్త్రముల మంత్రస్వీయశక్తిన్ ఖల
స్తోమమ్మాపు నధర్వవేదమును నిన్ ధ్యానించు మోదించు దు
ర్గామల్లేశ్వర సర్వదేవ పరివారా! హారహీరాకృతీ!

39. శా. పాముల్ జంతులు బాలకుల్ తనియ శ్రావ్యంబైన నీరూపు వీ
ణా మధ్యంబుమ@<దంత్రులందిరుగురాణంజూపిచొక్కించుచున్
సామంబెప్డును నీమహామహిమ విశ్వాసాత్మఁగీర్తించు దు
ర్గామల్లేశ్వర సర్వదేవ పరివారా! హారహీరాకృతీ!

40. శా. సోముండై జనదృక్చకోరికలమెచ్చుల్ కోరికల్ దీర్చుచున్
వేమా`రున్ దృఢభక్తిలోదలఁచునీవిశ్వాత్మమాహాత్మ్యమున్
సామోక్తింగొనియాడు నిత్యమును పుచ్చాకోటయాఖ్యుండు దు
ర్గామల్లేశ్వర సర్వదేవ పరివారా! హారహీరాకృతీ!

41. శా. భూమిన్ జీవుల జీవితంబును సతంబున్ బూతముంజేయు నౌ
గోమూర్తుల్ కపిలాకృతుల్ వలయుకోర్కుల్గూర్పఁ బోషించుచున్
శ్రీమాల్యంబులగొల్చుచుంద్రు మువురుంజిత్తమ్ములుప్పొంగ దు
ర్గామల్లేశ్వర సర్వదేవ పరివారా! హారహీరాకృతీ!

42. శా. నీమెచ్చందగు వారలందనుపుచున్ నిన్ బూలఁబూజించుచున్
నీమీదంగల కబ్బముల్ నలుగడన్ నిండించుచుంద్రచ్చుచున్
నీమంత్రంబు జపింతు రీమువురుబూన్కిన్ సర్వకాలంబు దు
ర్గామల్లేశ్వర సర్వదేవ పరివారా! హారహీరాకృతీ!

43. శా. నీమూలంబుననే సమస్తజగముల్ నిర్ణిద్రతం గాంచుటల్
నీమాహాత్మ్యమె పండువెన్నెలవలెన్ నీరంధ్రమైనిండుటల్
నీమించే జగమౌటలీమువురు లో నేర్పప్ప భావింత్రు దు
ర్గామల్లేశ్వర సర్వదేవ పరివారా! హారహీరాకృతీ!

44. శా. బాముల్వేలకొలంది యెత్తి భువిసంపాదించుకొన్నట్టి మే
లౌ మానుష్యఫలంబునిన్ దెలియుటేయంచున్ సదాయెంచుచున్
ప్రామాణ్యంబునఁ గొల్చుచుంద్రు మువురున్ బాహ్యాంతరావృత్తి దు
ర్గామల్లేశ్వర సర్వదేవ పరివారా! హారహీరాకృతీ!

45. శా. సామేనై యలకోటయాఖ్యునకు భాషాదేవియు న్మెచ్చనౌ
శ్రీ మేధానిధియై గుణప్రతతికిం జెల్వొందులేఁదీవెయై
రామారత్నము కొల్చు నిన్ కనకదుర్గాంబా యశఃపేటి దు
ర్గామల్లేశ్వర సర్వదేవ పరివారా! హారహీరాకృతీ!

46. శా. శ్రీమంతంబగు బేతపూడి కులవర్ధిం జంద్రుఁడై ధీబల
స్థేమాకారము నామముందలఁచి దుశ్చిత్తుల్భయంబంద నీ
స్వామిత్వమ్ము గణించు వీరశరభ ప్రఖ్యుండు నిత్యంబు దు
ర్గామల్లేశ్వర సర్వదేవ పరివారా! హారహీరాకృతీ!

47. శా. నీమూర్తింగనిదోయి గప్పురముగా నీపాదసంస్పర్శమున్
మైమీదన్ హరిచందనమ్ముగను నామమ్మున్ మరందమ్ముగా
నీమూవుర్తలపోయుచుందు రెద హాయిన్ నిత్యమున్ భక్తి దు
ర్గామల్లేశ్వర సర్వదేవ పరివారా! హారహీరాకృతీ!

48. శా. నేమంబొప్పఁగ వేదరూపముననౌ నీశాసనంబందు నీ
వేమార్గంబులఁ జూపినావొయటహాయింగాంచుచున్నిత్యమున్
వేమాఱుంగనుచుందురీమువురు భావిం త్రోలి సేవింత్రు దు
ర్గామల్లేశ్వర సర్వదేవ పరివారా! హారహీరాకృతీ!

49. శా. తామార్జించిన సంపదందెలిసి శ్రద్ధాళుల్ గుణాంభోనిధుల్
భూమానందము నీయనుగ్రహము సంపూర్ణమ్ముగా ధనధ
ర్మామేయముగ కోటవీరశరభ ప్రాజ్ఞుల్ సమర్పింత్రు దు
ర్గామల్లేశ్వర సర్వదేవ పరివారా! హారహీరాకృతీ!

50. శా. శ్రీమద్వ్యాసకృతోపదేశమున వర్ధిష్ణుండుగాండీవిమె
ప్పౌమాహేంద్రగిరిం దపంబునను గయ్యమ్మందుమెప్పించినీ
ధామమ్మున్ నిజనామధేయమున సార్ధంబౌనటు ల్సల్పె దు
ర్గామల్లేశ్వర సర్వదేవ పరివారా! హారహీరాకృతీ!

51. శా. ఏమేనింబొనరించు నీచముల మాయించున్ మహౌదార్యమున్
కామించున్ జెడుతిండి దుర్లభములెక్కాలంబుఁజింతించు సీ
యేమీ చిత్రము చిత్రముంగొలుపు క్షుత్తృష్ణల్గ్ దయాసాంద్ర దు
ర్గామల్లేశ్వర సర్వదేవ పరివారా! హారహీరాకృతీ!

52. శా. భూమింగల్గినజీవికెప్డు దివిషద్భోగమ్మువై, వారికిన్
భూమిశ్రీపయిబుద్ధి, గొల్పుచు జరం బూర్ణాత్మయై యింద్రియ
గ్రామమ్మున్ సురియించుఁగామ మకటారాదయ్యెనిన్గొల్వ దు
ర్గామల్లేశ్వర సర్వదేవ పరివారా! హారహీరాకృతీ!

53. శా. పాముంబోలుచు బుస్సఁగొట్టుబులిఠేవన్ బిట్టుగాండ్రిల్లుసం
గ్రామక్షోణి విహారమున్ సలుపు యుక్తాయుక్తశూన్యంబు హిం
సామేయంబగుఁగానిక్రోధ మతిదుష్టం బెన్నదింతైన దు
ర్గామల్లేశ్వర సర్వదేవ పరివారా! హారహీరాకృతీ!

54. సామర్ధ్యంబు దలంపదింతయిన విశ్వాసంబుపోకార్చు హే
లామందస్మిత ధైర్యసాహసికతా లజ్జాభిమానాదులన్
సీమాంతమ్ముగ గెంటు లోభమది యిస్సీరాదు నిన్గొల్వ దు
ర్గామల్లేశ్వర సర్వదేవ పరివారా! హారహీరాకృతీ!

55. శా. భామా పుత్త్రగృహాదులే భవముఁదేపంబోలి దాటించు నం
చేమోకల్పన లల్లిబిల్లిగఁ గడున్ సృష్టించుఁ గష్టంపడున్
నీమాయంచును భేదమెంచు వలపేనిన్ రాదు నిన్గొల్వ దు
ర్గామల్లేశ్వర సర్వదేవ పరివారా! హారహీరాకృతీ!

56. శా. సాముంజేయును మైకముంగొనును హేషల్ సల్పు ఘూర్ణిల్లుమే
ల్గీముం గానదు కన్నులుండియునుభుక్తిం దృప్తికింగాదు క్రిం
దై మృత్పిండముఁబోలుఁగాని మద మహా రాదు నిన్గొల్వ దు
ర్గామల్లేశ్వర సర్వదేవ పరివారా! హారహీరాకృతీ!

57. శా. ఏమాత్రంబు సహింపలే దొకనిమే లెప్డున్ వివాదించు లో
లోమూర్ఖత్వము వెల్లడించుఁబొరిమేల్కొల్పున్ బగన్ సర్వదా
యామాత్సర్యము నిన్నుఁగొల్చుటకుఁగాదయ్యా! దయామేయ దు
ర్గామల్లేశ్వర సర్వదేవ పరివారా! హారహీరాకృతీ!

58. శా. శ్రీమించు ల్నిధులెన్నియేని వెలయుం జెల్వొంది దివ్యౌషధీ
స్తోమంబు న్నెలకొల్పిగంధవతియై శోభిల్లి భూతత్త్వమున్
నీమేనేయగునయ్య దర్శనహృతానే కాఘ సర్వజ్ఞ దు
ర్గామల్లేశ్వర సర్వదేవ పరివారా! హారహీరాకృతీ!

59. శా. భూమాకారము భూమికారణము సంపూర్ణాయురారోగ్య సు
శ్రీ మూలంబు శుచి ప్రవర్తకమునౌ సృష్ట్యాదితత్త్వంబు జి
హ్వామోఘంబుత్వదీయమూర్తియగుఁగా సామోదసంస్తుత్య దు
ర్గామల్లేశ్వర సర్వదేవ పరివారా! హారహీరాకృతీ!

60. శా. శ్రీమెప్పుల్ విరియించు యజ్ఞహుతమున్ శీఘ్రంబ జేజేలకున్
బ్రేమంజేర్చుచు జాఠరాంతమునం బ్రేరేచు నయ్యగ్నియున్
నీమేనే యగునయ్య నిర్మల యశో నీరంధ్రభూత్యంగ దు
ర్గామల్లేశ్వర సర్వదేవ పరివారా! హారహీరాకృతీ!

61. శా. ద్యోమార్గంబునఁబట్టువందివెలిలో నుత్సాహముం గూర్చుచున్
సామోదమ్ముగ స్పర్శసౌఖ్యమిడి యత్యానందముంగూర్చుతా
నీమేనే యగునయ్య వాయువును వాణీగేయ సుధ్యేయ దు
ర్గామల్లేశ్వర సర్వదేవ పరివారా! హారహీరాకృతీ!

62. శా. పై మై వీడిన సర్వజీవతతి యప్రత్యక్షసంస్కారముల్
లోమైజేర్చుచువాయువృష్టిముఖతన్ లోకంబులన్ జొన్పుమిన్
నీమేనేయగుగాదె గాంగలహరీ నీర్యజ్జటాజూట దు
ర్గామల్లేశ్వర సర్వదేవ పరివారా! హారహీరాకృతీ!

63. శా. సామర్ధ్యంబున నర్ధవంతుఁడగుచున్ జాతాత్మయై పండితుం
డై మేఘాభశిరోజుఁడై హుతవాహుం బ్రార్థించునయ్యజ్వయున్
నీమేనే యగుఁగాదె యెన్నఁగ భవానీనాధ సమ్మోద దు
ర్గామల్లేశ్వర సర్వదేవ పరివారా! హారహీరాకృతీ!

64. శా. చీమంబోలుచుఁ గూడఁబెట్టిన మహాశ్రేయస్సులన్ దుర్లభం
బౌమానుష్యముఁ జెందియుంగడఁగి నిత్యానిత్య విజ్ఞాన ల
క్ష్మీ మర్యాద నతిక్రమించునెడ్ దూషింపంబడున్ బిట్టు దు
ర్గామల్లేశ్వర సర్వదేవ పరివారా! హారహీరాకృతీ!

65. శా. ఆముల్లోకములందు నాచరణమే యాత్మస్వరూపంబుగా
లోమై స్త్రీపురుషుల్ కనుంగొనఁగనై లోకంబుల న్నిల్పుత
త్క్షేమాకారము ధర్మ మీజగతి శాసించుం ద్విదీయాజ్ఞ దు
ర్గామల్లేశ్వర సర్వదేవ పరివారా! హారహీరాకృతీ!

66. శా. కామంబర్థము ధర్మయుక్తమగుచోఁ గల్పద్రుమంబేయగున్
కామంబర్హము నేకమైన జగముల్ కాలాహి వాతం బడున్
ధీమేదో బలయుక్తి దీనినెఱుఁగం దీఱుంబశుత్వంబు దు
ర్గామల్లేశ్వర సర్వదేవ పరివారా! హారహీరాకృతీ!

67. శా. నోముల్ నోమి కృశించి కష్టపడి యెన్నోపాట్లపాలై శుభ
శ్రీమేల్కొల్పుచు నేలుకోఁగల మహాప్రేమ స్వరూపంబు జి
హ్వామాధుర్యము కన్నతల్లి కెనయౌనా? స్వర్గమున్ భర్గ దు
ర్గామల్లేశ్వర సర్వదేవ పరివారా! హారహీరాకృతీ!

68. శా. క్షేమంబుం గలిగించు నోషధివలెం జేతఃప్రమోదావహం
బౌ మోచాఫలమైన పల్కుబడి సత్యంబుం బ్రహోదించుచున్
నీమేనేయగుఁ గన్నతండ్రి శ్రుతిని ర్ణిద్రాత్మ విజ్ఞాన దు
ర్గామల్లేశ్వర సర్వదేవ పరివారా! హారహీరాకృతీ!

69. శా. తాముప్పూటలబుద్ధికిం దగిన చందానం బ్రబోదించుచున్
ప్రేమన్ వృద్ధికివచ్చు పద్ధతుల రూపింపన్ గురుండౌ గురు
స్వామిన్ శిష్యుఁడునిన్నుఁగాఁదలపఁడా శ్చర్యంబగున్ నేఁడు దు
ర్గామల్లేశ్వర సర్వదేవ పరివారా! హారహీరాకృతీ!

70. శా. ప్రేమన్ వెల్లడిజేయుచున్ సెలవులన్ బెల్లుబ్బుపాల్నుర్వులన్
మోముంజేరిచి తల్లి పాలపొదుగున్ ముద్దైన లేలేఁగ పా
లౌ మేల్పాలును విల్చువాడు మనుజుండౌనా మహాదేవ దు
ర్గామల్లేశ్వర సర్వదేవ పరివారా! హారహీరాకృతీ!

71. శా. శ్రీమేదఃపరిపుష్టిఁ గూర్పఁగల సు క్షీరంబులం గ్రోల్చుచున్
భూమిన్ దున్నఁగభూరిభారముమెడన్ మోయన్ సమర్థంబులై
సోమస్వచ్ఛములైన వత్సముల నిచ్చుం గాదె గోమాత దు
ర్గామల్లేశ్వర సర్వదేవ పరివారా! హారహీరాకృతీ!

72. శా. మైమైరాయుచుఁ గర్నపుచ్ఛముల స మ్యక్ప్రీతిమై త్రిప్పుచున్
గోమైపయ్యెర నీ రెలుంగులిడునొ క్కుల్ బీటిమేఁతన్ మొగిన్
రోమంధం బొనరించు గోచయము దృగ్రూపంబురూపించు దు
ర్గామల్లేశ్వర సర్వదేవ పరివారా! హారహీరాకృతీ!

73. శా. ఈముల్లోకములందు నెన్నఁగనుగోవే జీవరత్నంబు గో
వే మందారము గోవె మేలుసిరి గోవే భూమి సర్వస్వమం
చే ముమ్మాఱువచింతుగట్తిగను మ్రోయింతున్ యశోఢక్క దు
ర్గామల్లేశ్వర సర్వదేవ పరివారా! హారహీరాకృతీ!

74. శా. ఆమంత్రించిన యంతభక్తిని హవిష్యంబున్ లసత్షడ్రస
శ్రీ మిశ్రంబగు భోజనమ్ముల నవిచ్ఛిన్నంబుగా మున్ను వి
శ్వామిత్రుంగృత వీర్యపుత్రు గని చేయన్లేదె సాశ్చర్యు దు
ర్గామల్లేశ్వర సర్వదేవ పరివారా! హారహీరాకృతీ!

75. శా. కామంబుల్ సఫలంబులన్ సలుపు తోకల్ పోల్చుప్రాధాన్యపుం
బ్రామాణ్య<బెఱిగించు శృంగములు నొప్పన్ నాల్గుపాదంబులన్
భూమిందిర్గెడు ధర్మదేవతలుకావో గోవులెన్నంగ దు
ర్గామల్లేశ్వర సర్వదేవ పరివారా! హారహీరాకృతీ!

76. శా. గోమూత్రంబు సమస్తపాపమయముల్ కుష్ఠాదులంబాచు మా
యామేయంబు భయంబు గోమయము మాయంజేయు గోధూళి ధూ
ళీ మిథ్యాంబుదపంక్తిమారుతముమౌళి ప్రక్కలాపేందు దు
ర్గామల్లేశ్వర సర్వదేవ పరివారా! హారహీరాకృతీ!

77. శా. సామోదంబగు గోఘృతంబొసఁగుదీ ర్ఘాయుష్యమున్ సారమున్
భూమంబుం బొనరించుఁబాలుదధి సంపూర్ణప్రసాదత్వమున్
ధామంబున్ సమకూర్చుసత్కవిగవీ తౌర్యత్రికస్తుత్య దు
ర్గామల్లేశ్వర సర్వదేవ పరివారా! హారహీరాకృతీ!

78. శా. తామంద ల్పొనరించి గోవుల నమం దానంద సాంద్రాత్ముఁడై
నేమంబొప్పఁగమేత నీరు తఱులన్ నిండించుచున్ గాలి రా
నౌమేరన్ విడియించుచుంగను దయా స్యందుండె ధన్యుండు దు
ర్గామల్లేశ్వర సర్వదేవ పరివారా! హారహీరాకృతీ!

79. శా. మామేల్మేఁతలకున్కిపట్టులు గదమ్మ బీళ్ళు వేల్సెసి ర
మ్మా! మార్తుల్ వినఁజెప్పఁజాలముగదమ్మ దిక్కు నీవేగద
మ్మా! మొఱ్ఱన్ వినుమన్న భావమునునంభారావముల్ తెల్పు దు
ర్గామల్లేశ్వర సర్వదేవ పరివారా! హారహీరాకృతీ!

80. శా. తమున్నర్జునుఁడై వధంబునకు శద్ధంగొన్న యశ్త్రంబు వి
ల్గా మాంసంబును బెట్టి సాహసికతం గన్నిచ్చి కన్నప్పయై
నీమెచ్చుంగొని కాలహస్తినిలఁడే నీమ్రోలఁ దిన్నండు దు
ర్గామల్లేశ్వర సర్వదేవ పరివారా! హారహీరాకృతీ!

81. శా. ఏమీయంచును నెల్లరబ్రపడఁ బైకేతెంచు వైవస్వతున్
వామాంఘ్రింబడఁదన్ని యేలుకొనవేబాలున్ మృకండూద్భవున్
నామప్రీణిత సర్వలోక! సహజానందా! దయాకంద! దు
ర్గామల్లేశ్వర సర్వదేవ పరివారా! హారహీరాకృతీ!

82. శా. చామంతుల్ విరిమల్లె బిల్వములు లక్షల్ కోట్లు పూఁదోఁటలన్
సామీచీన్యముగాఁగఁ గూర్చుకొని స్వచ్ఛంబైన డెందాన నీ
నామంబుంబ్రణవంబునుంగలిపి రాణన్ భక్తిఁబూజింత్రు దు
ర్గామల్లేశ్వర సర్వదేవ పరివారా! హారహీరాకృతీ!

83. శా. తామిస్రంబునఁ గూలనీయదు శుభస్థానంబునన్నిల్పు సు
శ్రీమేల్కొల్పుందల్చు భూతభయమున్ శీఘ్రంబుభక్తిప్రసూ
నామోదంబున గండుతేఁటియగు రుద్రాక్షంబు భద్రాక్ష దు
ర్గామల్లేశ్వర సర్వదేవ పరివారా! హారహీరాకృతీ!

84. శా. నీమూర్థమునఁ బొల్చుచంద్రరుచియై నీర్యజ్జటాజూటగం
గా మోఘాంబుఝరిప్రకాశ మయి భద్రాయుః కుమారాత్మతే
జో మూలంబగు భస్మమెన్నఁదరమా శుద్ధాంతరంగస్థ దు
ర్గామల్లేశ్వర సర్వదేవ పరివారా! హారహీరాకృతీ!

85. శా. ఆమోక్షంబను సౌధమెక్కుటకు నగ్ర్యంబైన సోపాన మా
యీమూర్తుల్ కనుదోయిఁదోఁచునవి నీవేయంచు బోధించుఁజూ
నీమంత్రంబు చరాచరప్రకట జన్మిస్తోమజప్యంబు దు
ర్గామల్లేశ్వర సర్వదేవ పరివారా! హారహీరాకృతీ!

86. శా. మ్హూమిన్ మర్త్యుని నెన్నుచో రసనయేమో పల్కబిట్టుల్కు నీ
దౌ మాహాత్మ్యము నెన్నఁబూన్కొన సహస్రాకారముల్ పూనుమే
మే మేమే యని శబ్దముల్ తమకుతామే సన్నిధింజేయు దు
ర్గామల్లేశ్వర సర్వదేవ పరివారా! హారహీరాకృతీ!

87. శా. లేమిన్లేమిఁబొనర్పఁగఁ గలుగు కల్మిన్నీసఖుంబోలి సు
త్రాముండోయన భూరిభోగములఁ బూర్ణత్వమ్మునంగ్రాలినన్
నీమూర్తిన్ వెలిలోనఁజూడనియెడన్ నిన్ జేరఁగాలేఁడు దు
ర్గామల్లేశ్వర సర్వదేవ పరివారా! హారహీరాకృతీ!

88. శా. భూమీధ్రమ్ము లగల్పజాలిన భుజాపుష్టి న్మరుత్సూనుఁడే
యఒ మార్తాండునిరేవశాత్రవులఁ దైక్ష్య్ణంబుం బ్రదర్శించినన్
భీముండేయయిన న్రణమ్మునను నిన్ సేవింపకెట్లొప్పు దు
ర్గామల్లేశ్వర సర్వదేవ పరివారా! హారహీరాకృతీ!

89. శా. ఏమున్ సల్పిన కర్మమేతనువు నాకెచ్చోటఁజేకూర్చినన్
స్వామీ నాకట ఱెప్పపాటయిన నన్యభ్రాంతికింగాక నీ
నామమ్మున్ స్మృతినిల్వఁజేయఁగదె చిన్నాళీకమత్తాళి దు
ర్గామల్లేశ్వర సర్వదేవ పరివారా! హారహీరాకృతీ!

90. శా. సౌమాంగల్యము పట్టుగొమ్మ సుకలాసంపల్లతాకేళికా
రామశ్రీ జగతీత్రయీస్థిత సతీరత్నప్రకాశంబు పూ
జా మూలంబుహరిద్రమాంగళిక సంస్థానం బనూనంబు దు
ర్గామల్లేశ్వర సర్వదేవ పరివారా! హారహీరాకృతీ!

91. శా. శ్రీమంతంబు పతివ్రతాస్యతిలక శ్రీసంధ్యారాగ ప్రవా
ళామేయారుణిమప్రకృష్టము హరిద్రాంతస్సముద్భూత ము
ద్దామప్రఖ్యము కుంకుమమ్ము సకలాంతర్యామిచిత్సాక్షి దు
ర్గామల్లేశ్వర సర్వదేవ పరివారా! హారహీరాకృతీ!

92. శా. ఏమోత్రవ్వుకొనున్ గతంబులను ముందింతైనఁజింతింపఁడా
పై మిన్ముట్టునొకప్డురిత్తగను డోలాందోళితాంతస్థ్సితిన్
నీమన్కిన్గనుటెట్లు నిన్ దలఁచుపూన్కిన్నిల్చుటెట్లౌను దు
ర్గామల్లేశ్వర సర్వదేవ పరివారా! హారహీరాకృతీ!

93. శా. తామేల్పట్టుననున్న యప్పుడనుభూతంబైన దానిన్ జగ
త్క్షేమమ్ముం బొనరించుపొంటె సలుపంజెల్లున్ విచారింప నే
నే మేధానిధినన్న గర్వమగునేని న్నిల్వదాపట్టు దు
ర్గామల్లేశ్వర సర్వదేవ పరివారా! హారహీరాకృతీ!

94. శా. ఏమంచున్ వచియింపఁజెల్లునకటా యీయింద్రియాభోగముల్
చీమల్ దోమలుగూడఁ బాలుగొను నిస్సీలెస్సలోనెంచి తా
నీమెట్టెక్కునుపాయమెల్లపుడు నన్వేషింపనౌఁగాదె దు
ర్గామల్లేశ్వర సర్వదేవ పరివారా! హారహీరాకృతీ!

95. శా. భూముఖ్యంబులఁ బంచభూతములనౌ మూర్తింగనంజాలుకన్
నీమూర్తింగనుటెట్లు దివ్యమును దండ్రీ! దివ్యమౌనీంద్రులే
లోమైజ్ఞానమయమ్ము నేత్రమున నాలోచించకన్గొంద్రు దు
ర్గామల్లేశ్వర సర్వదేవ పరివారా! హారహీరాకృతీ!

96. శా. నేమస్మిన్ వపుష స్సతీహృది ఫణి నేతానిశశ్శేఖరే
భీమం యస్య పురత్రయప్రహరణం భిల్లో స్త్రదాసేచ యో
నౌమిస్వాత్మని మల్లికార్జునమహంత మ్మండ్రు జేజేలు దు
ర్గామల్లేశ్వర సర్వదేవ పరివారా! హారహీరాకృతీ!

97. శా. ప్రామంజేయవె బత్తి నీపయిని బాబా పత్తిరింబూల నే
నీమైజల్లెద నిల్కడన్నిలుపవే నెమ్మిన్ సతంబున్ మదిన్
నీముందే నెలకొందునంచు గొలుతు ర్నిన్నాంధ్రులాసక్తి దు
ర్గామల్లేశ్వర సర్వదేవ పరివారా! హారహీరాకృతీ!

98. శా. లేమింబాపఁగదమ్మ తల్లి గుణమల్లి సూనసౌగంధ్య స
ర్వామోదప్రద పాదపద్మ నవరత్నామేయ కాంతిస్ఫుర
శ్రీమహేంద్ర ధనుస్స్మృతిప్రద సురశ్రేణీకిరీటౌఘ దు
ర్గామల్లేశ్వర సర్వదేవ పరివారా! హారహీరాకృతీ!

99. శా. లేమింబాపఁగదయ్య తండ్రి! గుణలాలిత్యాత్మసాహిత్య వి
ద్యామాధుర్య మధుద్రవోపహితహృద్యద్దివ్య సంగీత గో
ష్ఠీ మాంజిష్ఠ నిధీశ సౌహృదకలాచ్ఛిన్నాయసంఛన్న దు
ర్గామల్లేశ్వర సర్వదేవ పరివారా! హారహీరాకృతీ!

100. శా. నామొఱ్ఱన్వినుమమ్మ తల్లి! నిజకంఠ ప్రోత్థసప్తస్వర
గ్రామప్రస్ఫుటమూర్ఛనా గతిలయగ్రాహిస్వమాణిక్య వీ
ణా మోఘస్వరమాధురీచలదనంతానంతతానాంత దు
ర్గామల్లేశ్వర సర్వదేవ పరివారా! హారహీరాకృతీ!

101. శా. నామొఱ్ఱన్వినుమయ్య తండ్రి! భువనానందాను సంధాన వా
చా మోచాఫలశర్కరా మధురసా స్వాదితప్రతుష్టామర
స్వామిధ్యేయపదారవిందయుగ సేవామ్రనందీశ దు
ర్గామల్లేశ్వర సర్వదేవ పరివారా! హారహీరాకృతీ!

102. శా. నీమాహాత్మ్యమెఱుంగ శక్యమె సదానిద్రాళుకుక్షింభర
వ్యామోహాంధ నిరర్థమత్తక్షల దుర్వ్యాసంగ గర్విష్ఠ చిం
తామగ్నాధమ నాస్తిక ప్రతతికిన్ దారాపైస్తుత్య దు
ర్గామల్లేశ్వర సర్వదేవ పరివారా! హారహీరాకృతీ!

103. శా. నీమాహాత్మ్య మెఱుంగశక్యము సదానిర్ణిద్ర నిస్తంద్ర దీ
క్షామేధా మహితాశయ ప్రముదితస్వాంతప్రబోధోదయా
వ్యామోహాత్మ దయావిధేయులకు విద్యాశౌర్యధౌరేయ దు
ర్గామల్లేశ్వర సర్వదేవ పరివారా! హారహీరాకృతీ!

104. శా. నామీదన్నెనరుంపుమమ్మ సమఖండప్రాజ్యసామ్రాజ్య శా
స్త్రామేయ ప్రతిభాంఫురాసుకవితా సామ్రాజ్య సంపత్ప్రదా
నామోఘాశయహృత్కుశేశయదయా న్యాసా! మహోల్లాస దు
ర్గామల్లేశ్వర సర్వదేవ పరివారా! హారహీరాకృతీ!

105. శా. నామీదన్నెనరుంపుమయ్య! శివ! యన్న ప్రాణ చిత్తాది మూ
ర్తా ముర్తాంతర పంచకోశవిషయోపాత్తేశ జీవత్వ స
త్తా మాత్రాత్మ సుఖానుభూతి విలస ద్ధన్యత్వ సంపన్న దు
ర్గామల్లేశ్వర సర్వదేవ పరివారా! హారహీరాకృతీ!

106. శా. శ్యామ శ్రీభ్రమరాంబ! గౌరి! శివ! కూష్మాండేశ్వరీ! చంద్రఘం
టా! మాహేశ్వరి! సిద్ధధాత్రి! యుమ! కాత్యాయన్యభిఖ్యాంబ! లీ
లామాధ్వీక! మహాసరస్వతీ! మాహాలక్ష్మీ! మహాకాళి! దు
ర్గామల్లేశ్వర సర్వదేవ పరివారా! హారహీరాకృతీ!

107. శా. భ్రూమధ్యస్థ! చరారచస్థ! భవ! శంభూ! స్తంభితేంద్రావలే
పా! చాపాయుతమేరుభూమిధర! యష్టైశ్వర్య! దివ్యోదయా
ప్రామాణైక్య సులభ్య! భక్తజనతా వాసాగ్రమందార దు
ర్గామల్లేశ్వర సర్వదేవ పరివారా! హారహీరాకృతీ!

108. శా. గోమంతంబును సారవంతమునునౌ గోదావరీ కృష్ణవే
ణీ మధ్యంబున యందు దుర్గపురి వాణీగేయ సుధ్యేయ ది
వ్యామేయాలయఁ గోటవీరశరభ ప్రస్తుత్య నెక్కొంటి దు
ర్గామల్లేశ్వర సర్వదేవ పరివారా! హారహీరాకృతీ!

సమాప్తము