Wednesday, June 12, 2013

తత్సమ శతకము - కోగంటి దుర్గామల్లికార్జునరావు

తత్సమ శతకము
                                                   కోగంటి దుర్గామల్లికార్జునరావు (1959)

1. కరిణకమునకుఁ గరణికము
కరతత్తికిఁ దత్సమంబు కరదృతి యయ్యెన్
కరిసెకుఁ గర్షంబందురు
కరసానకుఁ తత్సమంబు కరశాణయగున్

2. తురకకుఁ బ్రకృతి తురుష్కుఁడు
కఱకునకుం దత్సమంబు కర్కరమయ్యెన్
తురికిం బ్రకృతి తురంగము
కరకుం దత్సమ పదంబు ఖర మనిరి బుధుల్

3. కపుజునకుఁ గపింజల మగుఁ
గవుడునకుం దత్సమంబు కపటం బయ్యెన్
కవికిం గయి తత్సమమగుఁ
గవణమునకుఁ దత్సమంబు ఖాదన మయ్యెన్

4. కన్నయ్యకుఁ గృష్ణుం డగుఁ
గన్నడికిం దత్సమంబు కర్ణాటుఁ డగున్
కన్నెకుఁ గన్య ప్రకృతియగుఁ
గన్నమునకుఁ దత్సమంబు కర్ణం బయ్యెన్

5. కడకుం గాష్టం బయ్యెను
గడియమునకుఁ దత్సమంబు కటకం బయ్యెన్
గడవకుఁ గటాహమ య్యెను
గడుపునకుం దత్సమంబు గర్భం బయెన్

6. కత్తెరకుం గర్తరియగుఁ
గత్తికిఁ దత్సమపదంబు కర్తి యగుంగా
కొత్తమరికిఁ గుస్తుంబరి
కొత్తిమిరికిఁ దత్సమంబు కుస్తుంబ రగున్

7. కమ్మరికిం గర్మారుఁడు
కమ్మికిఁ దత్సమపదంబు కంబి యగుంగా
కుమ్మరికిఁ గుంభకారుఁడు
కమ్మరకుం దత్సమంబు కర్మార మగున్

8. కొడసకుఁ గొడిసకుఁ గుటజము
కొడిసెకుఁ దత్సమపదంబు కుటజం బయ్యెన్
గుడిసెకు గుడిసికిఁ గుటి యగుఁ
గొడపమునకుఁ దత్సమంబు కురపం బయ్యెన్

9. కేడమునకు ఖేటక మగుఁ
గేడెమునకుఁ దత్సమంబు ఖేటక మయ్యెన్
కోడికి గుక్కుట మయ్యెను
గోడకుఁ దత్సమపదంబు కుడ్యం బయ్యెన్

10. కబ్బమునకుఁ గావ్యం బగు
నబ్బురమను శబ్దమునకు నద్భుత మయ్యెన్
పబ్బమునకుఁ బర్వంబగు
నిబ్బరమను దాని ప్రకృతి నిర్భర మయ్యెన్

11. నిద్దమునకు స్నిగ్ధం బగు
నిద్దురకుం దత్సమంబు నిద్ర యగుంగా
ముద్దకు ముగ్ధ ప్రకృతి యగుఁ
బద్దెమునకుఁ దత్సమంబు పద్యం బయ్యెన్

12. విసమునకుఁ బ్రకృతి విష మగు
నసమునకుం దత్సమంబు యశమనిరి బుధుల్
వసమునకుఁ బ్రకృతి వశమగు
సిసువునకుం దత్సమంబు శిష్యుండయ్యెన్

13. రోసమునకు రోషం బగు
బాసకు భాషయగు నండ్రు పండితవర్యుల్
పాసెమునకుఁ బాయసమగు
వేసమునకుఁ దత్సమంబు వేషం బయ్యెన్

14. అంతిపురికి నంతఃపురి
అంతిపురంబునకుఁ బ్రకృతి యంతఃపురమౌ
నంతరువున కంతర మగు
నంతకు నథ ప్రకృతి యంగు రార్యవరేణ్యుల్

15. అక్కునకుఁ బ్రకృతి యంకము
అక్కర మనుదాని ప్రకృతి యక్షర మయ్యెన్
అక్కలకర కక్రారా
అక్కకు నర్క ప్రకృతి యగు నందురు విబుధుల్

16. అచ్చెరువున కాశ్చర్యము
అచ్చెరియంబునకుఁ బ్రకృతి యాశ్చర్యంబౌ
నచ్చమునకు నచ్చ మగును
అచ్చరకుం దత్సమంబు మప్సర యయ్యెన్

17. ఆడఁదికి హరిద్ర ప్రకృతగు
నడికిం దత్సమపద మతి యందురు విబుధుల్
అడసాల కట్టశాలయ
అడవికిఁ బ్రకృతి యటవి యగు నందురు విబుధుల్

18. అప్పడమున కర్పట మగు
నప్పచికిఁ బ్రకృతి యపూప మందురు విబుధుల్
అప్పళమున కర్పట మగు
నప్పనకుం దత్సమపద మర్పణ యయ్యెన్

19. అమ్మకు నంబ ప్రకృతి యగు
నమ్మాయికిఁ దత్సమపద మంబిక యయ్యెన్
అమ్మిక కమ్మికి నంబిక
అమ్మునకుం దత్సమపద మంబకమయ్యెన్

20. అరదమునకుఁ బ్రకృతి రథము
అరివేరంబునకుఁ బ్రకృతి యరివీర్యంబౌ
నరపలమున కర్ధఫలము
అరివాణంబునకుఁ బ్రకృతి హరివాణ మగున్

21. అరిసెకుఁ బ్రకృతి యతిరసము
అరసంజకు నసురసంధ్య యందురు విభుదుల్
అరసమునకు హర్షం బగు
నరుసమునకుఁ దత్సమంబు హర్షం బయ్యెన్

22. అగడిత కఖాతము ప్రకృతి
అగినికిఁ బ్రకృతిపద మగ్ని యందురు విబుధుల్
అగలునకుఁ బ్రకృతి యగరువు
అగసికిఁ బ్రకృతిపద మతసి యందురు విభుదుల్

23. ఈరస కీర్ష్య ప్రకృతి యగు
నీరస మనుదాని ప్రకృతి యీర్ష్య యగుంగా
ఆరామున కారామము
ఆరెకునకుఁ దత్సమపద మారక్షుఁ డగున్

24. ఆమతి కామంత్రణ మగు
నామిత కామంత్రణ మగు నందురు విభుదుల్
ఆమితి కామంత్రణ మగు
నామెత కామంత్రణ మగు నందురు విభుదుల్

25. ఇతవునకుఁ బ్రకృతి హితుఁ డగు
నితమునకుం దత్సమంబు హిత మనిరి బుధుల్
ఇతవునకుఁ బ్రకృతి హితమగు
నితకరికిం దత్సమంబు హితకరి యగున్

26. ఆసకు నాశ ప్రకృతి యగు
నీసునకుం దత్సమపద మీర్ష్య యగుంగా
ఈసరునకు నీశ్వరుఁ డగు
నీసరికిం దత్సమపద మీశ్వరి యయ్యెన్

27. ఉక్కెడ కుపకారిక యగు
నుక్కలునకుఁ దత్సమపద ముత్కలుఁడయ్యెన్
ఉక్కకు నుల్క ప్రకృతియగు
నుక్కెలుకుం దత్సమపద ముపకారికయౌ

28. ఉమ్మికి నూర్మి ప్రకృతియగు
నుమ్మెతకుం దత్సమపద మున్మత్త మగున్
ఉమ్మలక ప్రకృతి యూష్మము
ఉమ్మాదంబునకుఁ బ్రకృతి యున్మాద మగున్

29. ఒడ్డనమున కండన మగు
నొడ్డాణంబునకుఁ బ్రకృతి యోఢ్యాణ మగున్
ఒడ్డెకు నోఢ్రుండు ప్రకృతి
ఎడ్డకుఁ దత్సమంబు హృదయం బయ్యెన్

30. ఆఁకరమున కాగ్రహ మగు
ఆకస మనుదాని ప్రకృతి యాకాశ మగున్
ఏకాండమున కఖండము
ఏకత మనుదాని ప్రకృతి యేకాంత మగున్

31. అంచకు హంస ప్రకృతియగు
నంచునకుం దత్సమపద మంచల మయ్యెన్
ఇంచునకుఁ ప్రకృతి యిక్షువు
ఇంచుక యనుదాని ప్రకృతి యీష త్తయ్యెన్

32. అదనంబున కధికం బగు
నదరమునకుఁ దత్సమపద మధురం బయ్యెన్
ఉదియకు నుద్యోగం బగు
నెదకుం దత్సమపదంబు హృదయం బయ్యెన్

33. కబ్బురమున కద్భుత మగు
నబ్బురమునకుఁ బ్రకృతిపద మద్భుత మయ్యెన్
అబ్బెసమున కభ్యాసము
ఉబ్బ యనెడి శబ్దమునకు నూష్మం బయ్యెన్

34. ఆలతి కాలప్తి ప్రకృతి
ఆలత్తిక తత్సమపద మాలప్తి యగున్
ఆలసమున కాలస్యము
ఏలకి యనుదాని ప్రకృతి యేలా యయ్యెన్

35. అగ్గికి నగ్ని ప్రకృతి
నగ్గువకుం బ్రకృతి యర్ఘ మందురు విభుదుల్
ఎగ్గడికిఁ బ్రకృతి హేడుఁడు
ఎగ్గత మనుదాని ప్రకృతి యేకాంత మగున్

36. గంబురకుం గర్పూరము
గంబుర మనుదాని ప్రకృతి కర్పూర మగున్
గంబూరకుఁ గర్పూరము
గంబూరంబునకుఁ బ్రకృతి కర్పూరమగున్

37. గరితకు గృహస్త ప్రకృతగు
గరువం బనుదాని ప్రకృతి గర్వం బయ్యెన్
గరివికి గర్వి ప్రకృతి యగు
గొరిజెకు గొరిజకు గొరిసెకు ఖురము ప్రకృతి యౌ

38. గడనకుఁ దత్సమము గణన
గడియకుఁ దత్సమపదంబు ఘటిక యగుంగా
గడెకుం దత్సమంబు ఘటిక
కడెమునకుం దత్సమంబు కటకం బయ్యెన్

39. గారమునకు గౌరవ మగు
గారబ మనుదాని ప్రకృతి గౌరవ మయ్యెన్
గారెకు ఘారి ప్రకృతి యగు
గారడ మనుదాని ప్రకృతి గారుడ మయ్యెన్

40. గామమునకు గ్రామంబగు
గామునకుం దత్సమంబు గ్రహమనిరి బుధుల్
గామిడికిన్ గ్రామీణ యగు
గీమునకుఁ బ్రకృతిపదంబు గృహమనిరి బుధుల్

41. గొనమునకుఁ బ్రకృతి గుణ మగు
గొనయం బనుదాని ప్రకృతి గుణ మనిరి బుధుల్
గొనమునకుఁ బ్రకృతి ఘన మహు
గనికిం దత్సమపదంబు ఖని యనిరి బుధుల్

42. గుదెకుఁ బ్రకృతి గద యయ్యెను
గుదికిం దత్సమపదంబు గుచ్చం బయ్యెన్
గుదియెకు గద ప్రకృతి యగును
గొదకుం దత్సమపదంబు క్షుధ యనిరి బుధుల్

43. గోడాకుఁ బ్రకృతి ఘోటము
గోడిగ యనుదాని ప్రకృతి ఘోటిక యయ్యెన్
గోడునకుఁ బ్రకృతి గ్రుష్టము
ఓడకుఁ దత్సమపదంబు హోడం బయ్యెన్

44. గద్దకు గృధ్రంబు ప్రకృతి
గద్దియ యనుదాని ప్రకృతి ఖటిక యగుంగా
ఉద్దికి వృద్ధి ప్రకృతి యగు
గుద్దలి యనుదాని ప్రకృతి కుద్దాల మగున్

45. గట్టనకుఁ బ్రకృతి ఘట్టన
గట్టునకుం దత్సమంబు ఘట్టం బయ్యెన్
గుట్టకు ఘట్టంబు ప్రకృతి
గట్టునకుం దత్సమంబు గూఢం బయ్యెన్

46. గూడునకుఁ గులాయం బగుఁ
గాడకుఁ దత్సమపదంబు కాండం బయ్యెన్
కాడునకుఁ బ్రకృతి కట మగు
గాడిద యనుదాని ప్రకృతి గార్ధభ మయ్యెన్

47. ఒజ్జ కుపాధ్యాయుండగు
నుజ్జన యనుదాని ప్రకృతి యుజ్జన మయ్యెన్
ఉజ్జని కుజ్జయిని ప్రకృతి
గుజ్జునకుం దత్సమంబు కుబ్జుం డయ్యెన్

48. ఆదకు నాధి ప్రకృతియగు
నాదరు వనుదాని ప్రకృతి యాధార మగున్
ఈఁదాడికి హింతాలము
గేదంగికిఁ దత్సమంబు కేతకి యగున్

49. ఇట్టికకుఁ బ్రకృతి యిష్టక
ఇట్టికెకుం దత్సమపద మిష్టక యయ్యెన్
ఇట్టుకకుఁ బ్రకృతి యిష్టక
కట్టేకుఁ దత్సమపదంబు కాష్ఠం బయ్యెన్

50. ఆనయి కాజ్ఞప్తి ప్రకృతి
ఆనకుఁ బ్రకృతిపద మాజ్ఞ యందురు విబుధుల్
గోనెకు గోణి ప్రకృతియగు
గోనియ యనుదాని ప్రకృతి గీణి యగుంగా

51. గౌఁకకు ఘింకారం బగుఁ
గాకిత మనుదాని ప్రకృతి కాకల మయ్యెన్
కాకికిఁ గాకంబు ప్రకృతి
కాకిదమనుదాని ప్రకృతి కాకల మయ్యెన్

52. గాణకు గాయనుడు ప్రకృతి
గాణికిఁ దత్సమపదంబు గాయని యయ్యెన్
గోణమునకుఁ గౌపీనము
గాణునకుం దత్సమంబు గాయనుఁడయ్యెన్

53. ఉప్పరిగకు నుపకారిక
ఉప్పతికిం దత్సమపద ముత్పత్తి యగున్
ఉప్పరమున కభ్ర మగును
చుప్పనకకుఁ దత్సమంబు శూర్పణఖ యగున్

54. ఉల్లాడ కుల్లాభం బగు
నుల్లబ మనుదాని ప్రకృతి యుల్లాభ మగున్
గొల్లునకుం గలకల మగు
గొల్లకుఁ దత్సమపదంబు గోపాలుఁ డగున్

55. ఉమ్మకు నూష్మంబు ప్రకృతి
ఉమ్మర మనుదాని ప్రకృతి యూష్మం బయ్యెన్
చెమ్మటకుఁ బ్రకృతి శ్రమ మగు
గుమ్మడి యనుదాని ప్రకృతి కూష్మాండ మగున్

56. చదురునకుఁ బ్రకృతి చతురుడు
చదరంగంబునకుఁ బ్రకృతి చతురంగ మగున్
చదుకంబునకుఁ జతుష్కము
చదరమునకుఁ దత్సమంబు చతురస్ర మగున్

57. చెక్కెరకుఁ బ్రక్రుతి శర్కర
చిక్కన యనుదాని ప్రకృతి చిక్కణ మయ్యెన్
జక్కవకుఁ జక్రవాకము
చిక్కదనంబునకుఁ బ్రకృతి చిక్కణ మయ్యెన్

58. చూరకు చూరిక ప్రకృతియగుఁ
జూరికిఁ దత్సమపదంబు చూరిక యగుంగా
గోరమునకు ఘోరంబగు
గోరజ మనుదానికి ప్రకృతి గోరోచన మౌ

59. చెవికిం బ్రకృతి శ్రవం బగు
జెవుడునకుం దత్సమంబు క్షేడం బయ్యెన్
చవితికిఁ జతుర్థి యయ్యెను
చివరకుఁ దత్సమంబు శిఖరం బయ్యెన్

60. చెయికిం బ్రకృతి శయం బగు
చెయిదమునకుఁ దత్సమంబు చేష్ట యగుంగా
చెయిదికి నిజేష్ట యయ్యెను
చెయువునకుం దత్సమంబు చేష్ట యగుంగా

61. ఊసర కూషరము ప్రకృతి
ఊసర మనుదాని ప్రకృతి యూషర మయ్యెన్
గాసమునకు గ్రాసంబగు
గోసునకుం దత్సమంబు ఘోషణ మయ్యెన్

62. కజ్జమునకు ఖాద్యం బగుఁ
గజ్జాయంబునకుఁ బ్రకృతి ఖాద్యం బయ్యెన్
గజ్జికి ఖర్జువు ప్రకృతగుఁ
గజ్జుర మనుదాని ప్రకృతి కర్జూర మగున్

63. చిత్తకుఁ జిత్ర ప్రకృతి యగుఁ
జిత్తరు వనుదాని ప్రకృతి చిత్రం బయ్యెన్
చిత్తనికిఁ బ్రకృతి చిత్రిణి
గుత్తికిఁ దత్సమపదంబు గుచ్చం బయ్యెన్

64. తరగకుఁ దరంగము ప్రకృతి
తరవరి యనుదాని ప్రకృతి తరవా రయ్యెన్
తిరమునకుఁ బ్రకృతి స్థిరమగుఁ
దిరునకుఁ దత్సమపదంబు స్థిరుఁ డనిరి బుధుల్

65. జోదునకు యోధుఁ డయ్యెను
జాదికిఁ దత్సమపదంబు జాతి యగుంగా
జూదమునకు దూత్యం బగుఁ
జాదునకుం దత్సమంబు జాషం బయ్యెన్

66. గోరునకుఁ బ్రకృతి ఖురమగు
గోరోజనమునకుఁ బ్రకృతి గోరోచన మౌఁ
దోరమునకు స్థూలంబగు
నారంబంబునకుఁ బ్రకృతి యారంభ మగున్

67. తెలికిఁ బ్రకృతి ధవళం బగుఁ
దెలకులకుం దత్సమంబు తిల లనిరి బుధుల్
తెలుఁగునకుఁ ద్రిలింగ మగును
తలివమునకుఁ దత్సమంబు తల్పం బయ్యెన్

68. తందరకుఁ దంద్ర ప్రకృతగుఁ
దందన మనుదాని ప్రకృతి తానం బయ్యెన్
తొందరకుఁ బ్రకృతి త్వరయగుఁ
దొందకుఁ దత్సమపదంబు తుంది యగుంగా

69. జవలకు యవలు ప్రకృతియగు
జవనిక యనుదాని ప్రకృతి యవనిక యయ్యెన్
తవరమునకుఁ దమరం బగుఁ
దొవరకుఁ దత్సమపదంబు తువరి యగుంగా

70. జన్నమునకు యజ్ఞం బగుఁ
జిన్నెకుఁ దత్సమపదంబు చిహ్నం బయ్యెన్
సున్నకు శూన్యంబు ప్రకృతి
అన్నెమునకుఁ దత్సమపద మన్యం బయ్యెన్

71. కచ్చెకుఁ గలహంబు ప్రకృతి
కచ్చడ మనుదాని ప్రకృతి కచ్చట యయ్యెన్
చిచ్చునకుఁ బ్రకృతి శుచి యగుఁ
దొచ్చెమునకుఁ దత్సమంబు తుచ్చం బయ్యెన్

72. కక్కెరకుఁ బ్రకృతి క్రకరము
కక్కను మనుదాని ప్రకృతి కశ యనిరి బుధుల్
తొక్కకుఁ ద్విక్కు ప్రకృతియగు
డిక్కకుఁ దత్సమపదందు ఢక్క యగుంగా

73. తురితమునకుఁ ద్వరితం బగుఁ
గరువకుఁ దత్సమపదంబు గ్రావం బయ్యెన్
తొరకుం ద్వర ప్రకృతి యగును
కరదివ్వెకుఁ దత్సమంబు కరదీపిక యౌ

74. ఇటకకును బ్రకృతి యిష్టక
ఇటికెకును నిటికకును బ్రకృతి యిష్టక యయ్యెన్
ఇటుకకును బ్రకృతి యిష్టక
చిటికకుఁ దత్సమపదంబు క్షితిక యగుంగా

75. చిట్టకుఁ జిత్రము ప్రకృ తగుఁ
జిట్టక మనుదాని ప్రకృతి చిత్రక మయ్యెన్
చెట్టకుఁ జేష్ట ప్రకృతి యగు
జుట్టునకుం దత్సమంబు జూటం బయ్యెన్

76. గొడ్డలికిఁ గుఠారం బగు
జడ్డునకుం దత్సమంబు జాడ్యం బయ్యెన్
తెడ్డునకుఁ బ్రకృతి తండువు
కడ్డికిఁ దత్సమపదంబు ఖటిక యగుంగా

77. చామకు శ్యామ ప్రకృతియగు
జామన మనుదాని ప్రకృతి శ్యామల మయ్యెన్
తూమునకుఁ బ్రకృతి తుంబిక
తామరకుం దత్సమంబు తామరసం బౌ

78. తెల్లనకుఁ బ్రకృతి ధవళము
తల్లడ మనుదాని ప్రకృతి తరళము యయ్యెన్
చల్లడమునకుం జలనము
గుల్లకుఁ దత్సమంబు క్షుల్లక మయ్యెన్

79. చులకనకుఁ బ్రకృతి సులభము
తొలసికిఁ దత్సమపదంబు తులసి యగుంగా
జలగకు జలూక ప్రకృతగు
డులికిం దత్సమపదంబు ఢులి యనిరి బుధుల్

80. దోరమునకు ద్వారం బగుఁ
దోరణకుం దత్సమంబు తోరణ మయ్యెన్
దారకు ధార ప్రకృతి యగు
దారణ యనుదాని ప్రకృతి ధారణ మయ్యెన్

81. దిరిసెనమునకు శిరీషము
దరకుం దత్సమపదంబు ధర యనిరి బుధుల్
దురమునకుఁ బ్రకృతి త్వర యగు
దరిసెన మనుదాని ప్రకృతి దర్శన మయ్యెన్

82. దుగకు ద్వికంబు ప్రకృతియగు
దుగినునకుం దత్సమంబు ద్రుఘుణుం డయ్యెన్
దుగునమునకు ద్విగుణం బగు
దగకుం దత్సమపదంబు దాహం బయ్యెన్

83. దివటీకి దీపయష్టిక
దీవెకుం దత్సమపదంబు దీపం బయ్యెన్
దవుడకు ధాడ ప్రకృతి యగు
దవనమునకుఁ దత్సమంబు దవనం బయ్యెన్

84. దీవియకుఁ బ్రకృతి దీపము
దీవికిఁ దత్సమపదంబు ద్వీపం బయ్యెన్
దేవరకుఁ బ్రకృతి దేవుఁడు
దేవళ మనుదాని ప్రకృతి దేవాలయ మౌ

85. దోసికి దోషి ప్రకృతి యగు
దోసమునకుఁ దత్సమంబు దోషం బయ్యెన్
దేసమునకు ద్వేషం బగు
దాసరి యనుదాని ప్రకృతి దాసుం డయ్యెన్

86. ఉమి కూర్మి ప్రకృతి యయ్యెను
ఇమమునకుం దత్సమంబు హిమ మనిరి బుధుల్
తమలమునకుఁ దాంబూలము
డమరువునకుఁ దత్సమంబు డమరుక యయ్యెన్

87. చను తత్సమంబు స్తన మగుఁ
జనుమో మనుదాని ప్రకృతి స్తనముఖ మయ్యెన్
గునపంబునకు ఖనిత్రము
దొనకుం దత్సమపదంబు ద్రోణం బయ్యెన్

88. చేడియకుఁ బ్రకృతి చేటిక
చేడెకుఁ దత్సమపదంబు చేటిక యయ్యెన్
దాడికి ధాటి ప్రకృతి యగు
దాడింబకుఁ దత్సమంబు దాడిమ యయ్యెన్

89. చేదివియకు శయదీపము
తేదీకిఁ దత్సమపదంబు తిథి యనిరి బుధుల్
చైదమునకుఁ జేష్ట యగును
దాదికిఁ దత్సమపదంబు ధాత్రి యగుంగా

90. గొబకున్ గుహ తత్సమ మగు
గుబకుం దత్సమపదంబు ఘూకం బయ్యెన్
తబిసికిఁ దపస్వి ప్రకృతగుఁ
దబమునకుం దత్సమంబు తప మనిరి బుధుల్

91. తమ్మికిఁ దామరసం బగు
దమ్మమునకుఁ దత్సమంబు ధర్మం బయ్యెన్
చెమ్మటకుఁ బ్రకృతి శ్రమ మగు
జమ్మిజిఁ దత్సమపదంబు శమి యనిరి బుధుల్

92. గన్నెరకుం గరవీరము
గన్నే రనుదాని ప్రకృతి కరవీర మగున్
దొన్నెకు ద్రోణిక ప్రకృ తగుఁ
బున్నెమునకుఁ దత్సమంబు పుణ్యం బయ్యెన్

93. గుండీకిఁ గరండ మగును
గుండునకుం దత్సమంబు కుండం బయ్యెన్
గుండిగకుఁ బ్రకృతి కుండిక
గండికిఁ దతస్మపదంబు ఖండం బయ్యెన్

94. ద్రోవదికిఁ బ్రకృతి ద్రౌపది
దౌవేరికిఁ దత్సమంబు దేవి యగుంగా
దొవతికి ధౌతి ప్రకృతగు
దీవర మనుదాని ప్రకృతి తీవ్రం బయ్యెన్

95. దరణమునకు ధరణం బగు
దరుమమునకుఁ దత్సమంబు ధర్మం బయ్యెన్
చురియకు చురిక ప్రకృతి యగుఁ
జరవకుఁ దత్సమపదంబు చరు వనిరి బుధుల్

96. చందురునకుఁ జంద్రుం డగుఁ
జెందిర మనుదాని ప్రకృతి సిందూర మగున్
చందిరకకుఁ జంద్రిక యగుఁ
జందునకుం దత్సమంబు చంద్రుం డయ్యెన్

97. విదియకు ద్వితీయ ప్రకృ తగుఁ
జిదురకుఁ తత్సమపదంబు చిద్రం బయ్యెన్
తదియకుఁ దృతీయ ప్రకృతగు
మదికిం దత్సమపదంబు మతి యనిరి బుధుల్

98. దోదసికిఁ బ్రకృతి ద్వాదశి
దుదికిఁ దత్సమపదంబు తూలం బయ్యెన్
ఊదరకు నుదారం బగు
దాదిలికిం దత్సమంబు ధాత్రి యగుంగా

99. ఆరంజోతి కరుంధతి
కారియ మనుదాని ప్రకృతి కార్యం బయ్యెన్
చేరునకుఁ బ్రకృతి సర మగుఁ
గారిజ మనుదాని ప్రకృతి కాలేయ మగున్

100. దూలికి ధూళి ప్రకృతి యగు
గేలికిఁ దత్సమపదంబు కేళి యగుంగా
కాలవకుఁ గుల్య ప్రఖృతగు
గాలియకుం దత్సమంబు కాళిక యయ్యెన్

సమాప్తము

No comments:

Post a Comment