భీమేశ శతకము
దేవరకొండ అనంతరావు
1. కం. శ్రీకర! యోసద్భక్త వ
శీకర! రిపుభీకర! సురశేఖర! హర! మో
క్షాకర! రజనీకరధర!
శ్రీకఱకంఠా! తలంతు శ్రీభీమేశా.
2. కం. అందములగు కందములను
మందార సుమంబులేరి, మాలగ నత్యా
నందంబునఁ గూర్చితినో
యిందుధరా! దీనిఁదాల్పుమిక భీమేశా
3. కం. దొసఁగులనేకములిందు
బొసఁగిన భవదీయనామమున్బొగడుటచే
వెసనూహింపరుగద బుధు
లిసుమంతయుఁ గూడదీనినిల భీమేశా.
4. కం. భక్తులఁగాచెదవంచు
న్శక్తివిహీనులనుఁగాచు శక్తుఁడవని స
ద్భక్తిని నినుఁగొలిచెదనిఁక
ముక్తిని దయసేయుమో ప్రభూ భీమేశా
5. ఈశా! గౌరీశా! వి
శ్వేశా! రిపునాశ! యో మహేశా! పోషా!
యాశా పాశవినాశా!
నాశరహిత! దయనుగనుమునను భీమేశా
6. కం. బసవన్న నెక్కుదంచుం
దిసమొలవాఁడంచునిన్నుఁ దిట్టేడివాడీ
వసుధనుఁ గసవును మెసవెడు
పసరముతో సాటియౌను ప్రభు! భీమేశా
7. కం. ధరణిరధము దానికి దిన
కర, శశి చక్రములు, మిన్కుగమితురంగంబు,
ల్థరణీధరమే ధనువును,
హరి నీశర, మజుఁడుసూతుఁడట భీమేశా
8. కం. హర! శశిధర! హరిశర! భూ
ధరధర! గౌరీవర! వరదా! పరమేశా!
సురపర! స్మరహర! సుగుణా
కర! గంగాధర! గురు శుభకర! భీమేశా
9. శివ! మాధవ! సరసీరుహ
భవ! యననొక్కటియకాదె? భవభయనాశా
భువనావళిపోషా! త్రిపు
రవినాశా! యీశా! యొహరా! భీమేశా
10.నందీశుఁడు, భృంగీశుఁడు
బృందారకు, లజుఁడు, హరియు, ఋషివరులిలనీ
సుందరపద పద్మంబుల
నందముగాఁగొల్వఁ జెలఁగుహర! భీమేశా
11. కం. ఒక్కడఁవటఁ, రక్కసులనుఁ
జెక్కుదువఁట; భక్తతతికిఁ జిక్కుదువఁట, నీ
దిక్కునుఁ గోరినవారికి
దక్కుదువఁట, నిక్కమేకదా భీమేశా
12. మృత్యుంజయ! జితదానవ!
నిత్యుండవు నీవయనుచు నిర్మలమతితో
సత్యస్వరూప! తలతును
నిత్యంబును నిన్నుమదిని, నే భీమేశా
13. కం. ఒకభక్తుఁడు నీకైతన
సుకుమార కుమారుఁజంపెఁజోద్యమకదె! వే
ఱొకఁడాలిని నీకొసఁగడె
యకలంకా! యోయుమాంక! హర! భీమేశా
14. విలు, కాంచనమేకద? భీ
షలఁగూర్పఁగ విశ్వకర్మ సన్నిధిలేఁడే?
యిలఁబాపనగలఁదాల్చఁగఁ
గలరూపునువేగఁదెల్పఁ గదె? భీమేశా
15. కం. ఎందునుఁగలవని జనులను
చుందురుగద, నీదుజాడఁ జూచితిగానీ
సుందరరూపముఁ గనలే
దిందుధర! కతముఁదెల్పవే? భీమేశా
16. కం. శంకర! యందునొ? భక్త వ
శంకర! యనిపిలితునో? హర! శశిధర! గౌరీ
శంకర! మృత్యుభయంకర!
యోంకారాకార! యందునో? భీమేశా
17. కం. పిలచినఁ పలుకవడేమకొ?
యలుకానాపై ననర్హుఁడన? ధూర్తుడనా?
కలుషాత్ముడఁనా? జగతి చ
పలమతినా? దెల్పి కావవా భీమేశా
18. కం. జయమున్బొందిన నాప్రతి
భ, యటంచుందలతులేని పట్టుననీదౌ
దయలేదందును జడుఁడను
దయతో మన్నించికావు ధర భీమేశా
19. కం. పాపాత్ముఁడనేయైనం
దాపసమందార! నన్నుదయఁజూడకిటుల్
కోపింపనగున? తగునా?
నీపుత్రుఁడఁగాననటయ్య నే భీమేశా
20. కం. పలికెడిది నీదునామము
పలికించెడివాఁడవీవు పలుకఁగ పాపం
బులు దొలఁగునంత హర! నీ
పలుకులు సుధలొలుకునఁటయ భవ! భీమేశా
21. సీ. ఒకటినేఁ దలఁచిన నీ
వొక్కటిఁజేయంగఁబోదు వుచితమ? నీకో
ముక్కంటీ! తెలుపుమయా
నిక్కముగను వేడికొందునిను భీమేశా
22. కం. ఒకనిముసంబానందం
బొకనిముసము దుఃఖమౌచునుండునిలను గా
డొకొ? నీమాయనుఁ గాననౌ
నొకొ? భువినాబోఁటి వానికో భీమేశా
23. కం. మామావారాశి ననుం
ద్రోయఁగలెస్సంచు నీకు దోచెనే? యికనే
జేయునదెయ్యదు? యెందుం
బోయెద, వెరవెద్ది? యోప్రభూ! భీమేశా
24. కం. నీ పరమభక్తులకు భువి
నాపదలేరావు, గాని యటువచ్చినచో
నో పశుపతి! భక్తినిఁగన
నీపన్నాగమనియెంతు నే భీమేశా
25. కం. వినలేదకొ? నామొఱలను
వినియును రక్షింపకుండ విడిచితివొక్కో
మనసెట్టులొప్పె? యిటుఁ జే
యను నీకోదీనబంధు! యజ! భీమేశా
26. కం. విశ్వేశ! విశ్వకర్మా!
విశ్వంబర! విశ్వనాథ! విశ్వవ్యాపీ!
విశ్వవినాశా! యీశా!
విశ్వకరా! కరుణఁబ్రోవవే భీమేశా
27. కం. నీభక్తుల సహవాసము,
నీభజనము, నీదుభక్తి, నీసేవయు, నా
కీభువి దయసేయఁగదే
యోభవనాశా! యమేశ! యోభీమేశా
28. కం. కాలుని భతూలకుఁజిక్కెడు
కాలంబున నిన్నుఁదల్పఁగలనో లేనో
కాలాంతక! కాన నిపుడె
నీలీలలఁబొగడుచుందు నే భీమేశా
29. కం. సుగుణుల కాపదలిడుదువు
సుగుణరహితులన్నఁ గరుణ జూతువు ధర్మం
బగునకొ? నీకిది శివ! యో
జగతీవర! భక్తపర! యజా! భీమేశా
30. కం. ఎట్టులుకాలముఁ గడుపు ద
దెట్టులు సంసారవార్ధినీదుదు నినుఁ జూ
పట్టెడు మంత్రంబెట్టిది?
గట్టిగనినుఁగొల్తుఁదెల్పఁగదె భీమేశా
31. కం. ఎవ్వాఁడు లోకపాలకుఁ
డెవ్వాఁడీశ్వరుఁడు, నభవుఁడెవ్వఁడు శర్వుం
డెవ్వఁడు, భవ్యచరితుం
డెవ్వండౌ? నీవయేకదే భీమేశా
32. కం. జడమతి, నిడుములఁ దడబడి
కడుపడి, సెడి, నీయడుగులకడఁ, బడ నీవీ
యెడఁజేవిడ, నోమృడ! యే
యెడకేగుదు మగుడఁ? దెల్పుమిక భీమేశా
33. కం. కనికరపుంగనీవేయగు
దని, కరములమోడ్చివేఁడ నారసిమొఱలన్
విని, కరముగాచెదని విబు
ధనికరము, నినుంబొగడుఁగదా భీమేశా
34. కం. పరమ మునీశ్వరులెవ్వని
చరణంబులఁగొలుచుచుంద్రు సతతముభక్తిన్
పరమేశ్వరుఁడెవ్వండగు
కరుణాళూనీవయౌదుగా భీమేశా
35. కం. కలియుగమున నూనామముఁ
దలచినమోక్షంబునిచ్చి తనుపుదు, హాలా
హలధర! గౌరీవర! యో
కలుషవిదూరా! హర! శుభకర! భీమేశా
36. కం. ఎవఁడీభవసాగరమును
శివనామంబనెడి నావచే దరిఁజేరన్
భువినాశించునొ వాఁడే
భవనాశా! పొందుముక్తి వరభీమేశా
37. కం. శివ! శివ! యని మదిఁదలచిన
భవభందములెల్లవేగఁ బాయునుగాదే
భవనాశా! యో యీశా!
ధవళేశా! దాసపోష! ధర భీమేశా
38. కం. ధన, పుత్ర, మిత్ర, బంధులఁ
గని, నిత్యమిదేయటంచుఁ గాసంత నినుం
గనలేక, పాపకూపము
ననుఁబడి, ప్రజమ్రగ్గఁ గూడునా భీమేశా
39. అంతకునడచితివని, యా
ద్యంతములిల లేనివాఁడవని, నిచ్చలు నే
నెంతయు వేడంగ, దయ ర
వంతైననుఁ జూపవేమయా? భీమేశా
40. కం. చదువులువేయిలఁ జదివిన
మదనహరా! యెందుఁబనికిమాలినవేయౌఁ
గదనినుఁ దెలిసికొననియా
చదువులువృధకావె? యోయచల! భీమేశా
41. కం. శిరమునఁ జందురుఁ, డురమునఁ
గరమొప్పఁగ విషధరములుఁ, గటిగజచర్మాం
బరమునుఁ, గేలఁద్రిశూలము
ధరించిన నిన్నుఁదలతు ధరభీమేశా
42. కం. పంచాక్షరి జపియించిన
సంచితముగఁ గాలుని భయమదియెటుకల్గున్
పంచశరగర్వ హర! హర!
పంచానన! వరద! భక్త పర! భీమేశా
43. కం. ధనమును నాకిమ్మని యో
ధనదసఖా! వేడలేదు, ధరమోక్షాపే
క్షను, నీ సుచరణపద్మము
లనవరతముఁ గొల్చుచుంటినయ భీమేశా
44. కం. ఈ భువి భస్మముఁ దాల్చిన
నోభవహర! దోషరాజి యుండునే? పరమే
శా! భువనపోష! యీశా!
యోభక్త జనాళితోష! యోభీమేశా
45. కం. చీమలుబ్రాఁకెడు రొదవిను
దీమహియన నామొఱ, నది యేలనువినవో
కామితజన కల్పద్రుమ!
మామకదురితాలవిత్రమా! భీమేశా
46. కం. ధనదుఁడు సఖుఁడై యుండం
గను, యాచనఁజేయనేలఁ గరుణాశరధీ!
మనమున సందేహమ? మి
త్రునియడుగంగా, సుజనహితుఁడ! భీమేశా
47. కం. ధవళము గృహమును, భూషలు,
ధవళము నీ జడనుగల సుధాకరుఁడరయన్
ధవళము నీదుశరీరము,
ధవళేశా! యెట్లుకాంతు? ధర భీమేశా
48. కం. హరుఁడొక్కఁడె దైవంబని
ధరవాక్భేరిం, డండాడ డాండ నినాదముల్
పురిఁగొన, హర! హర! శంభో!
వరదా! యని చాటెదనుశివా! భీమేశా
49. కం. నీవేయంతయు, నంతయు
నీవే, భువివేరులేరు, నిక్కముశివ! యో
భావాతీతా! పొగఁడగ
నావశమా, భువనపోషణా భీమేశా
50. దుర్గాధినాథ! యరిష
డ్వర్గమునంజిక్కికొంటి, వాసిగనన్నే
మార్గమునఁగాచెదో యో
భర్గ! స్వర్గీయవినుత! వరభీమేశా
51. కం. రమ్మా! క్రమ్మర నేల ను
రమ్మా నఁగ మ్రొక్కుచుంటి, రావేలను, నే
రమ్మా! యిదినాగ్రహ చా
రమ్మా! గజచర్మధర! హరా! భీమేశా
పద్యం 52 నుండి 59 వరకు దొరకలేదు
60. కం. నీవేమాతవు, జనకుఁడ
వీవే నాబంధుజనుఁడ వీవే, సర్వం
బీవే, లోకేశుండవు
గావే, యో దీనరక్షకా భీమేశా
61. కం. హరి హరిలననొక్కటియే
ధరమిమ్ముల భేదబుద్ధిఁదలచినవాఁడో
కరుణామయ కాలునికడ
కరుగుట తధ్యంబయౌనుగదె? భీమేశా
63. కం. కరివరదుండాహరికద,
కరివరమును దీర్పవల్వఁగాఁగట్టితివీ
వరయఁగ గజచర్మంబిక
హరిహరులనవేఱదెట్టులగు భీమేశా
64. కం. బలిగీముఁ గాచెనాహరి
యిల, నోహర! నీవుబాణునిలుఁగాచితిగా
తలపగ భేదంబేలను
కలుగును, మీయిరువురకునుఁగదె భీమేశా
65. కం. నరసఖుఁడా శ్రీహరి, దయ
నరునకుఁ బాశుపతమిచ్చినావీవును, మీ
కరయఁగ భేదమదేఁటికి
ధరఁగల్గును శంకర! వరదా! భీమేశా
66. కం. పన్నగములు నీభూషలు
పన్నగ పల్పుండు హరియుఁ బాపవినాశా!
యెన్నఁగహరియన్నను హరుఁ
డన్నను భేదంబు లేదయా భీమేశా
67. కం. మురహరుఁడాతఁడు, నీవో
పురహరుఁడవు సర్వలోకపూజ్య! భువిపై
హరియన, హరుఁడన నొకటియ
శరణాగతరక్షణ! గిరీశా! భీమేశా
68. కం. శ్రీగళుఁడవీవు హరియును
శ్రీగలవాఁడెన్నమీకు శివ! భేదంబే
లాగుంగల్గును? భవహర!
వాగీశాద్యమరవినుత! వర భీమేశా
69. కం. లీలావినోదుఁడవు, హరి
లీలామానుషుఁడు గాదె? లేశంబును మీ
కాలోచింపఁగ భేదం
బేలాగల్గున్మహేశ హే భీమేశా
70. కం. హరిమనికిపట్టు తిరుపతి
గిరి, నీదగుయుంకి రజితగిరి, యిర్వురికిన్
గిరులేనెలవులు, భేదం
బరయము మీకెందు జూడనయ భీమేశా
71. కం. దుష్టులశిక్షించును హరి
దుష్టులయుక్కడతువీవు దురమున, మీరో
శిష్టచరిత! యొక్కటికడే
కష్టహర! అభిష్టదాయకా! భీమేశా
72. కం. సారంగపుటెంగిలగుట
సారసమును బూజఁజేయఁజాల నిలనునీ
కారయ మధృదయమనెడు
సారసమిదె పూజఁగొనుమచల భీమేశా
73. కం. గట్టులరాయని ముద్దుల
పట్టినిఁజేపట్టినట్టి మరమేశు, ధరం
బుట్టుటఁ గిట్టుట లెరుఁగని
జెట్టిని, నినుఁదలతునెపుడు శ్రీభీమేశా
74. కం. లింగా! యాగవిభంగా!
యంగజహర! సాంబశివ! శుభాంగ! మహేశా!
మంగళకర! గంగాధర!
సంగర భీమా! రమేశశర! భీమేశా
75. కం. దినకర శశి శిఖనేత్ర!
ఘనకలుషలతాలవిత్ర! కామితగాత్ర!
మునిజననుత చారిత్ర!
యనుపమ ధీనాళిమిత్ర! హర! భీమేశా
76. కం. ఒకరాజు కళంకుఁడు, వే
రొకఁడిల వేకన్నులాఁడు, యోజింపఁగ నిం
కొకరాజోగ్రహ బాధితుఁ
డిఁకరాజననీవకాదె యిల భీమేశా
77. కం. శివుఁడవు సర్వభువన ధవుఁ
డవు కమలభవాది సేవ్యుఁడవు నిటలాక్షుం
డవు శంభుండవు, జితమరుఁ
డవు హరుఁడవు, భక్తపోషుఁడవు భీమేశా
78. కం. ఆమార్కండేయుడు నీ
కేమిచ్చెను జమునిఁగూల్చి యిలఁగాచితి, నే
నేమపచారముసేసితిఁ
గామితమందార! దెల్పఁగదె? భీమేశా
79. కం. చిత్తాశ్వమిచ్చవచ్చిన
చిత్తంబుననేగుచుండెఁ జిత్తజహర! నీ
విత్తఱి నధిరోహింపవె
యుత్తమమార్గంబుఁజూప నో భీమేశా
80. కం. రారా! రాకేందుధరా!
రారా! రుద్రాక్షహార! రజితాకారా!
రారా! రణభీమా! హర!
రారా! దుర్గామనోహరా! భీమేశా
81. కం. నతిఁగొనుమా నుతనామా!
యతిపరకామా! సుధామ! యగణితనామా!
గతినీవే రిపుభీమ!
పతితోద్ధార! విరామ వర భీమేశా
82. కం. నీనామ సుధాపానము
మానను, దిరుగాడుమనుపమానం బగునా
మానస సరోవరంబున
మానకనో రాజహంసమా భీమేశా
83. కం. తండ్రివి లోకములకు నా
యుండృఆల్దిండీనికనుచు నోపరమేశా
యండ్రు జనంబులుగద, నా
తంద్రీ! హర! యొత్రిపుండ్రధర! భీమేశా!
84. కం. రుద్రా! గయాసముద్రా!
సద్రూపా! దక్షశిఖ! సజ్జనపక్షా!
రుద్రాక్షధర! హర! యో
భద్రచరిత! కావఁగదవె వర భీమేశా
85. కం. ఒంటరివో? లేరొకొ యే
రింట, న్నీయున్కిఁజెప్పు మేయదియో, ము
క్కంటీ! యేమనిపిలచిన
వెంతనె పల్కిదెవు దెల్పవే భీమేశా
86. కం. మానసకాంతారంబేఁ
దానకముఁగఁగ్రోద్గమాది దారుణమృగముల్
కానఁనగును, నాదికిరా
తానీవిల వానిదునుము దయ భీమేశా
87. కం. కాలాంతకా! మహేశా!
ఫాలాక్షా! భక్తవాస! పాపవినాశా!
లీలామానుష వేషా!
కైలాసవాస! పోషకా! భీమేశా
88. కం. ఘనతాపస వినుతా! విష
మును ద్రావితివంత సురలు మునుబ్రార్ధింపం
గను, తావకమహిమలు బొగ
డనుతరమా! దీనబంధుడా! భీమేశా
89. రావా! ననుఁగాపాడఁగ
దేవా! నామొఱలవినఁగదే, యీశుండౌ
గావా! యింతటికఠినమ
బ్రోవా! శ్రీకంఠయోప్రభూ! భీమేశా
90. నీదయవే భవసాగర
మీదఁగఁదగుఁ గొండఁబిండియేఁ జేయనగుం
గాదొకొ నృత్యవినీదా!
యోదీనజనాప్తమిత్ర! యో భీమేశా
91. కం. పుట్టుటఁ గిట్టుటఁ గనియును
జుట్టల నెచ్చెలులఁ జూచుచునుఁ బొంగుదు నీ
కట్టెయ శాశ్వతమని, న
నెట్టుల రక్షించెదవో యిల భీమేశా
92. కం. నీలీలలఁగనుఁగొనగా
నీలగళా! నరుఁడఁగాను, నేతిన్నఁడఁగా
నేలీలనేలెదో నను
ఫాలాక్షా! హర! సుభక్తపర! భీమేశా
93. కం. శ్రీకరములు సుగునాళికి
భీకరములు దైత్యతతికి, వీనులవిన మో
క్షాకరములు, భక్తులకు వ
శీకరములు, నీచరితలు శ్రీభీమేశా
94. కం. శూలివి, గిరిజాసతికను
కూలివి, శశిమౌళి, వసురకుంజతతి ని
ర్మూలివి, కడుబలశాలివి
పాలితలోకాళి, వరయ ప్రభు! భీమేశా
95. కం. మారవిదారివి! దైత్య ప్ర
హారివి! శిపురారి! వురగహారి! వలసురా
ధారివి! కాకోలవిషా
హారివి! జడధారి! విలను హర! భీమేశా
96. కం. తోలునుదాల్చితివీవా
కూళజలంధరునినేలఁ గూల్చితి త్రుటిలో
కాలునిగెల్చితివాసిరి
యాళుని దయఁగాచితివయా భీమేశా
97. కం. మాటికిఁ బిల్వంగఁ బలుక
వేటికి, నాపైనికిన్కఁవదేటికి, చోటి
ప్పాటికి నీయనిచో, సుర
కోటినిఁగాచినది కల్ల, గురు! భీమేశా
98. కం. రక్షింప, కటాక్షింపను
శిక్షింపను నీవయౌట శ్రితమందారా!
దక్ష విపక్షా! యాప
ద్రక్షా! యీ కృతినిఁ గొనుహర! భీమేశా
99. కం. శ్రీవిశ్వకర్మకులజుఁడ
దేవరకొండాన్వయుఁడను ధీనుతచరితా!
శ్రీవిశ్వభద్ర గోత్రుఁడఁ
బ్రోవుమనంతాఖ్యునన్ను భువి భీమేశా
100. మంగళమిదెఁ గొనుమోశివ
మంగళకర! యో! శుభాంగ! మాధవహిత! నా
మంగళమిదెఁ గైకొనుమో
యంగజహర! భృంగివినుత! హర! భీమేశా
భీమేశ శతకము
సంపూర్ణం
No comments:
Post a Comment