కుమతి శతకము
రాళ్ళబండి రాజయ్య కవి (1938)
1. శ్రీమద్రవికుల మండన
శ్యామాంగా భక్తరాజ సన్నుతసుగుణో
ద్ధామ అయోధ్యాపుర సం
ధామా దైతేయభీమ దశరధరామా
2. సుమతియని శతకమున్నది
కుమతిశతకమెచ్చట లేమి గూర్చితినిటులన్
గమనింపతగును దీనిని
సుమతియేమియనెడు శంక గోరక కుమతీ
3. సుమతికి యేటికి నీతులు
కుమతికి జెప్పవలెగాని క్షోణిస్థలిలో
కుమతిని బాగొనరించిన
సముదం చత్పుణ్యమబ్బు చయ్యన కుమతీ
4. కనుకనెచెప్పెద నీకిటు
వినుమా యీనీతులెల్ల విశదముగాగన్
జనియించు జ్ఞానసంపద
దినదినమభివృద్ధియగును దీనన్ కుమతీ
5. ప్రొద్దుననెలేచి శుద్ధిగ
పెద్దలకడకేగి మిగుల ప్రేమదలిర్పన్
పద్ధతిగా వందనమిడి
సుద్ధులు వినిచుండువాడె సుగుణుడు కుమతీ
6. బీదలుసాధులు బాపలు
మోదముతోనింటదిగిన మ్రొక్కిభుజింపన్
లేదనక కలుగుదానినె
భేదములేకుండ నిడుము ప్రీతిగ కుమతీ
7. దేవబ్రాహ్మణ వృత్తుల
గావింపకుము నాశనంబు గలిగినశక్తిన్
రావించి యిహపరంబుల
సేవింపుము యశము ముక్తి జేకురు కుమతీ
8. ఇద్దరు గూర్చొని మెల్లగ
పద్దుగమాటాడుచుండ బరుగుననటకున్
బుద్ధివిహీనత బోయిన
గద్దింతురునిన్ను వారు గనుగొని కుమతీ
9. పెద్దలతో వాదించుచు
గద్దరిగామాటలాడి గదమకుమెపుడున్
పెద్దరికము ధరనిలువన్
ముద్దుగనటియింతువేని ముక్తిర కుమతీ
10. వేదబ్రాహ్మణ ఋషులన్
సాధులనాదేవతలను సద్గురునిలలో
శోధించి గేలిజేయుచు
బాధించిన గూడు ఘోరపాపము కుమతీ
11. సరసములాడకు మెప్పుడు
విరసముగా బరిణమించి వికటించుసుమీ
మురిసిన వెంతనె తప్పక
వరుసన ఖేదంబునీకు వచ్చుర కుమతీ
12. బిరుసైన హయము నెక్కకు
దురుసుగమాటాడి శ్రుతుల దూషింపకుమీ
కురుచయగు బుద్ధివిడువుము
పరమాత్మున్ గొల్వుమెపుడు భక్తిన్ కుమతీ
13. చింతయొనర్పకు సిరికై
కాంతలతో కలహమునకు కాల్దువ్వకుమీ
సంతతము శ్రీగిరిజా
కాంతున్ భజియించి ముక్తి గాంచుము కుమతీ
14. పంతులని చెవినిబడగా
దొంతులచాటునకుబోయి దొరకక బడిలో
సుంతయు నిల్వకదిరుగుచు
రంతులుజేసినను చదువు రాదుర కుమతీ
15. దుడుకుతనంబన గూడదు
కడుప్రేమన్ బీదజనుల గాంచుము మహిలో
దడిపింగూడదెవరిన్
చెడువారల చెలిమిచేయ జేరకు కుమతీ
16. పడుచులను చూచికోరకు
చెడుమాటలనెప్పుడే న్వచింపకు మింటన్
బడియుండుము ధరలోనె
క్కుడుకీరితినీకు సతము గూడుర కుమతీ
17. అప్పిచ్చువారియెడ నీ
వెప్పటికిని తప్పువెదకి యేమాత్రంబున్
ముప్పుగలిగింపబోకుము
తిప్పలుబెట్టకుము ఋణము తీర్పుము కుమతీ
18. గుడికేగిన బడికేగిన
పెడముఖమున బోకుమెపుడు పెద్దలగనుచో
చిడుముడులాడన్ గూడదు
పుడమిదొరల యెదుటనీవు బొంకకు కుమతీ
19. కసిమిడి యెద్దును గొనకుము
విసిగించును నిన్నుమిగుల వేసవియందున్
బుసగొట్టి రొప్పుచుండును
పసజెడుటయెకాక కృషియు పాడగు కుమతీ
20. కులవిద్యలో బ్రవేశము
గలుగనియెడ బ్రతుకుదెరువు గానని యెడలన్
విలపింపక కృషి బేరము
సలుపుము చౌర్యంబు జేయ సాగకు కుమతీ
21. దిసమొలనుండుటకూడదు
పసిబాలురతోడగూడి పంతులుకడకున్
మసిగుడ్డనైనదాలిచి
పసమీరగ నరిగి చదువ వలెరా కుమతీ
22. రుచికలదని మితిమించక
నుచితముగా వచ్చెననుచు నోపికతో నీ
వెచటేనియు భుజియింపకు
పచనముగాకున్న మేన బామగు కుమతీ
23. వరుసయగుకామినులగని
సరసఁబుల నాడబోకు సరసుడవగుచో
నిరతిశయానందమునకు
బురికొల్పుముమనము నెపుడు పొందుగ కుమతీ
24. వరుసయు వావియులేకయ
దిరుగాడెడి దానిచేర దీసినముప్పౌ
మరువకు మెన్నడు దీనిని
గురుబోధయ యిద్దినీకు గురుతౌ కుమతీ
25. తగువాడదలచినప్పుడు
తగసల్పుము యింటనీదు తరుణీమణీతో
బగలంతజేయు జగడము
దిగనాడియు రేయి రతుల దేలర కుమతీ
26. మేలునకిడలోదలచిన
వాలాయంబెంతొ బీదవారల కిడుటల్
చాలగ వాడినపైరుకు
వీలుగవర్షించువాన విధమున కుమతీ
27. బాకీనిడలోదలచిన
తేకువగా బ్రాహ్మణునకె తెంపుగనిడనౌ
రాకున్నన్ ఫలమబ్బున్
నీకిహపరసుఖములొదవు నిజముగ కుమతీ
28. దానములజాడదెలియుము
దానఫలంబొదవునీకు తప్పక యెపుడున్
దానములలోన నుత్తమ
దానమ్ము నిదానమనుచు దలపర కుమతీ
29. మొగమోటమిచే న్యాయము
దిగనాడుచు నిష్టమైన తీర్పులుదీర్పన్
దగదనుచు దెలిసిబంధువు
పగయందును నొక్కటిగనె పల్కర కుమతీ
30. వడ్డీకాశవహించుట
అడ్డముతానొకనికుంట అవనీస్థలిలో
చెడ్డతనము గావుననది
విడ్డురపుపని యటంచు వెరచుము కుమతీ
31. నిజమాడు వానికిలలో
భుజియింపన్ గూడులేదు పోనిమ్మని నీ
సుజనత విడువకు మెప్పుడు
కుజనుడవై యనృతమాడ గూడదు కుమతీ
32. భజియించు బ్రహ్మవేత్తల
ద్విజులను సాధులమునుల దేవతలనెదన్
నిజమైన పదవిదొరకును
గజిబిజియగు సంచితంబు గాలుర కుమతీ
33. పథ్యము జెరచినరోగము
నిత్యముగాతిరుగబెట్టి నీల్గగజేయున్
మృత్యువునకె అదిజెరచుట
సత్యమునామాట వినుము చాలుగ కుమతీ
34. భగవంతుడు నీకిచ్చిన
తెగువన్ నీకడుపునిండ దిని సౌఖ్యమునన్
తగినంతయొరుల కొసగుము
సగమునసగమైన నిడిన జాలును కుమతీ
35. గుడిపెత్తనంబు జేయకు
మెడబాయకుగురునిసేవ నెప్పుడుభక్తిన్
పుడమిన్ జనించినందుకు
మడిదున్నకబ్రతుకమంటి మహిలో కుమతీ
36. కన్యావిక్రేతలకడ
నన్యులుభుజియింపగూడ దదియెట్లనన్
కన్యావిక్రయ విత్తము
మాన్యుల కిల దలప గోవుమాంసము కుమతీ
37. ధనమున్న దనుచు నెప్పుడు
మనమున గర్వింపబోకు మత్సరమున స
ద్వినయముగొల్పిన జగతిన్
బనులన్నియుచక్కనౌను బాగుగ కుమతీ
38. నినునీవుబొగడు కొనకుము
ఘనముగపరనింద జేయ గడగకు మెపుడున్
పనిమాలితిరుగ బోకుము
అనుమానంబున్నచోటు కరుగకు కుమతీ
39. పగవాని యింటదినుటయు
బగవానికి కుడువనిడుట బారుటయనిలో
తగవున్నచోట నిల్చుట
మగువకుగోప్యంబుతెలుప మానర కుమతీ
40. ఆకలియుడిగిన కుడుపును
పాకమ్మొనరింపలేని పడతులబ్రతుకున్
పోకిరివారల నటనలు
లోకములోజూడచాల లోపము కుమతీ
41. వరదక్షణ ఇడకున్నన్
ధరలోపల బెండ్లిజేయ దరమా వరుడా
కరవయ్యె కన్యకెట్లని
పరమార్ధము జెరచబూన వలదుర కుమతీ
42. నమ్మకు వేశ్యల వైశ్యుల
నమ్మకు మపసవ్యస్త్రీల నమ్మకుజడులన్
నమ్మకుజారుల చోరుల
నమ్మకుమా త్రాగుబోతు నరులన్ కుమతీ
43. శరణన్నవారి జెరచకు
కరుణ నభయమొసగివేగ గావుముధరలో
సరిరారు నీకునెవ్వరు
పరమార్ధమునందు మంచిపద్ధతి కుమతీ
44. వంచింప నెంచకెవరిని
ముంచకు మా బాకిదార్ల మోసమొలర్పన్
పెంచకుమెదలో నీర్ష్యం
బుంచకు ఋణశేషమవని నొప్పుగ కుమతీ
45. టక్కరిమాటలజెప్పకు
మక్కువగా నిజముబల్కు మర్మమువిడి నీ
వెక్కడనైనన్ మితముగ
చక్కెరతీపియన ధాత్రి చయ్యన కుమతీ
46. శ్రమజేసి చదువుమయ్యా
జమజేతువు ధనముమిగుల జగతీస్థలొలో
శ్రమదీరు సార్ధకంబగు
గుమిగూడి నుతింత్రువేడ్క గొననిను కుమతీ
47. జూదములాడుట బిడ్డల
వేదమ్ముల నమ్ముకొనుట వెలదులతోడన్
వాదించుట పంక్తులలో
భేదముజూపుట అదర్మవృత్తిర కుమతీ
48. ఇలసంసారముజేసిన
పలువురు నేర్చెడుతెరంగు బాగగు సిరితో
నలువురు నవ్వగజేసిన
ఫలమేమిరసతము పస్తు బండుచు కుమతీ
49. పరువిచ్చి పరువుగాంచుము
బరులకు మర్యాదజేయ బాల్పడుమెపుడున్
దొరయైన నీచుడైనన్
పరువుగ మాట్లాడగొప్ప పద్ధతి కుమతీ
50. తాననుభవింప నొల్లక
దానంబు ధర్మంబు లెక ధనధాన్యములన్
కోనన్ దాచిన తుదకవి
మానవనాథునకు గాక మానవు కుమతీ
51. కుటిలురుజెప్పిన వాక్యము
లెటువంటివొ తెలిసికొమ్ము యింగితమునలో
దిట్టమొనరింపుము నీపని
మటుమాయపుమాటలనుచు మానుచు కుమతీ
52. మాసినవలువలు గట్టకు
పాసినయన్నంబు బండ్ల భక్షింపకుమీ
నాసికము సభను జీదకు
మోసముగల పనులనెపుడు ముట్టకు కుమతీ
53. కూర్చుందదలచినప్పుడు
మార్చకయుండెడు స్థలంబు మనమునముందే
యేర్చుకొని చూచికూర్చొన
దీర్చినసభవారు మెచ్చు తెలివది కుమతీ
54. కోరకుమెప్పుడు నేదియు
కోరకయేవచ్చు నీవుకుడువగనున్నన్
కోరివచ్చునె రానివి
కోరకరాకున్న వెతల గొనుటయ కుమతీ
55. క్షితిలోన మంచిపనికై
జతగూడరు రమ్మటన్న జగడంబనినన్
ప్రతిమనుజుడు కాల్దువ్వున్
అతులితముగనెల్లవేళ లందున కుమతీ
56. సిరివచ్చిన ధరహెచ్చిన
బరువడిగానేరువచ్చి పారినక్షితిలో
కరువొకటి యావరించిన
స్థిరముగనుండవనుమాట సిద్ధము కుమతీ
57. బాగుపడెడు వాడితరుల
బాగేతనబాగటంచు భావించుమదిన్
ఓగుపడువాడు సతతము
నోగేయితరులకు గోరు నొప్పుగ కుమతీ
58. కష్టమువచ్చిన వెంతనె
నిష్ఠురములనాడి దైవనింద యొనర్పన్
భ్రష్టత్వమొదవు నీవది
స్పష్టముగా దెలియవలయు జగమున కుమతీ
59. వాసిగ కృష్ణాతీరము
భాసురమగు కాశియనుచు పరమమునీంద్రుల్
వాసముజేసిరి వరుసగ
భాసిల్లును బుణ్యమిచట బాగుగ కుమతీ
60. గురుశుశ్రూష యొనర్పక
మరచియు మంత్రంబు జేర మరియొకగురువున్
నరునకు తప్పదు నరకము
మరియెన్నడు జేయకిట్లు మహిలో కుమతీ
61. వింతలమారిది లోకము
చింతలకాస్పాదముగాన స్థిరమౌ సుఖమా
వంతయులేదిక యేటికి
బొంతదగులవేసి ముక్తిబొందుము కుమతీ
62. సర్వముతానైయున్నన్
పూర్వాచారంపువిధుల బూనుచునీవీ
యుర్విని దిరుగుచు సాక్షిగ
నిర్వాణసుఖంబు జెంద నేర్చుము కుమతీ
63. సరసజ్ఞుడ నేననియెడి
బరువెంతయొ యెత్తికొనిన భక్తుడవనుచున్
గరువముబొందక నిరతము
గురువులసేవించి ముక్తి గొనరా కుమతీ
64. నొసటన్ వ్రాసిన వ్రాలది
మసిబొట్టేయయినకాక మఱియొకటైనన్
వెసదుడిచివేయవచ్చునె
మసిగాదది బ్రహ్మవ్రాత మారదు కుమతీ
65. తుమ్మిన పయనముగాకుము
నెమ్మదిగానొక్కనాడు నెలకొనియింటన్
సమ్మతిగ మరుదినంబున
బొమ్మనివచియింత్రు సర్వబుధులిల కుమతీ
66. కుందేలెదురై నప్పుడు
తొందరపడిపోకు నీకు తోడగుమృతియున్
ముందలరకృష్ణ సర్పము
పొందుగ మాసంబులారు బోకుర కుమతీ
67. నినుపయనపు ప్రారంభం
బున కాకమ్మెడమనుండి బోయినకుడికిన్
ఘనమైన మేలుగల్గును
చననెడమకు గొప్పకీడు సత్యము కుమతీ
68. పిల్లియెదురైన బోకుము
మళ్ళుము నీవింటికపుడె మఱియొకనాడున్
వెళ్ళగ దలచినచో మూ
ణ్ణాళ్ళుండియు నాపయి జనందగు కుమతీ
69. మీరకుమీ తలిదండ్రుల
చేరకుమీ దుష్టజనుల చెంతకునెపుడున్
కోరకుగా కుండెడిపని
ఏరకుమీ బుధుల తప్పు లేవియు కుమతీ
70. పచ్చికకై పశువులు ముని
ముచ్చులుదోపిళ్ళ కొరకు మూర్ఖు లనికి బల్
మెచ్చుచువత్తురు గావున
హెచ్చరికన్ కలిగియుండు మెప్పుడు కుమతీ
71. ఎప్పుడు శ్వానము లేడ్చిన
తప్పకతద్గ్రామమున కొదవు కీడెంతో
ముప్పగును గృహమునందున
గొప్పగ జగడము రోజు గూడదు కుమతీ
72. సారాత్రాగెడి వారికి
జీరాడునుపంచ సిగ్గరిబోవన్
నోరాడతగులు తన్నులు
మారాడిన బంధమిడక మానరు కుమతీ
73. పెద్దలుజెప్పెడి మాటలు
చద్దులమూటలని తెలిసి సఖ్యముతోడన్
యొద్దికతో దనెప్పుడు
పద్ధతిగానడచువాడె ప్రాజ్ఞుడు కుమతీ
74. పాపముపుణ్యం బెరుగక
నోపికతోక్రుధనువిడక నొప్పుగనహమున్
బాపకయెట్లగుముక్తుడు
పాపటనరువగనెగాదు పతిహిత కుమతీ
75. మతికుదిరిన గతిగుదురును
శ్రుతిగుదిరిన పాతగుదురు సొంపుగనుండున్
సతి సతి యగుచో సుఖమగు
హితమొదవిన యీటెకత్తె యింపగు కుమతీ
76. కరణీక మబ్బినంతనె
అరుణోదయమట్లు తెలివి యద్భుతమగు ని
ద్ధరిణిని నెవ్వనికైనన్
కరుణయునాతనికి వాక్యగతమగు కుమతీ
77. మోదమున ప్రొద్దుబోకయె
వాదప్రతివాదములుగ వరసన్ నేనీ
వాదముసల్పితి నీతిగ
పాదైయీలోకమందు భాసిల కుమతీ
78. చందంబుచదివి యెరుగను
కందములన్ జెప్పినాడ గావునదీనిన్
సందియములున్న దిద్దన్
వందనములొనర్తు నార్య వరులకు కుమతీ
79. నగుబాటు శతకమంచున్
నగిమీరెగతాళిచేసి నన్నపుడిలలో
తగనింద జేయవలదని
పొగడెదనే బుధులనెపుడు పొలుపుగ కుమతీ
80. తప్పులను దిద్దియిందున
నొప్పులసమకూర్చివేగ నోపికతోడన్
తప్పకగరంధము సాంతము
ముప్పదిగాజూడుడంచు మ్రొక్కెద కుమతీ
81. భారద్వాజస గోత్రుడ
కూరిమినరసింహ యాఖ్యు కొమరుడనై సీ
తారమణికి పిచ్చమకున్
నేరమణుడనైతి ధారుణీస్థలి కుమతీ
82. క్షితివెంకట లక్షంబా
సుతవర్గమునందు నగ్రజుడనై జన్మిం
చితి శ్రద్ధదోపగ జె
ప్పితి నీకీ నీతులెల్ల వినరా కుమతీ
83. నైజాము రాష్ట్రమందున
భూజననుత చింతిరేల పురిమునసబుగా
రాజాజ్ఞా బద్ధుడనై
నేజరిపితినలుబదేండ్లు నిష్ఠన్ కుమతీ
84. శ్రీరాళ్ళభండి వంశో
ద్ధారకుడన్ రాజయాభిదానుడనేనీ
సారతరంబగు శతకము
కూరిమిజేకూరునట్లు గూర్చితి కుమతీ
85. కృష్ణా తీరనివాసుడ
కృష్ణాప్తునినీలగళు భజించెడివాడన్
విష్ణుతనూజాన్వయ వ
ర్ధిష్ణుడవిద్వత్ప్రియుండ ధీరుడ కుమతీ
86. ప్రవిమల మానసభక్తి
స్తవమగుశ్రీనీలకంఠ శతకంబేనున్
జవసంపూర్తియొనర్చితి
భవరహితము దానిచదువు బాగుగ కుమతీ
87. రవిసోములుండు వరకున్
భువిలో నీశతకమధిక పూజ్యంబనగన్
ప్రవిమలగతి వెలిగెడున
క్కవిరాజున కమితయశము గల్గగ కుమతీ
88. ఈశతక మెవ్వరేనియు
నాసక్తినిచదివివ్రాసి నట్లైన మహా
క్లేశమ్ములనడచి ఉమా
ధీశుడుమోక్షంబు నిడు క్షితీస్థలి కుమతీ
89. సిరిసంతు పరిణయంబులు
కరితురగాందోళికాది ఘనవాహనముల్
దొరతనము చత్రచామర
పరివారము పాడిపంట ప్రబలుర కుమతీ
90. గురురాయ కరుణచేతన్
పరిపూర్తి యొనర్చినాడ పద్యములనికన్
సరిపుచ్చెద మరియొక్కటి
విరచించెద వేమనారు విధముగ కుమతీ
91. జయ సీతారామహరీ
జయ నారాయణముకుంద జయగోవిందా
జయ విష్ణు నారసింహా
జయ కృష్ణ యటంచు బల్క కయముర కుమతీ
92. కందములను పువ్వులచే
సుందరమగుమాలగూర్చి శుభములనెల్లన్
జెందగ శ్రీరామునిగళ
మందునవేసితిని యెల్లరౌనన కుమతీ
93. రాయవరపురము నందున
స్థాయియగు చిదంబరాఖ్య సద్గురుకృపచే
పోయెన్ జన్మము లింతట
వేయరజయభేరి జగము వినగన్ కుమతీ
94. ఏమహనీయుడు జెప్పెనొ
యీమహిలోసుమతిశతక మింపుదలిర్పన్
యామహిమన్ గొనియాడుచు
నామహిమాఢ్యునకుమ్రొక్కు మనెదన్ కుమతీ
95. ధరవేణు గోపబాలుడు
కరుణాకరుడైన నీలకంఠేశ్వరుడున్
చిరయశమునొసగి నినునను
మరువకబ్రోచెదరుగాక మక్కువ కుమతీ
96. స్థిరలీల నిలువగానీ
శ్వరవత్సర చైత్రకృష్ణ సప్తమిశశి వా
సరమందున యీశతకము
పరిపూర్తియొనర్చినాడ భక్తిన్ కుమతీ
97. శాంతమున సంచరించుము
స్వాంతమురంజిల్ల నీతిచాటితిభువిలో
బ్రంతిన్ జెందకు మికనీ
కెంతోయశమొదవుముక్తి యొసగున్ కుమతీ
98. పరమపదంబున జేరుము
నిరుపమ నిర్వాణ లక్ష్మినీకులభించున్
స్థిరమగునా నందము జే
కురు శివజీవైక్యసిద్ధి జేకురు కుమతీ
99. శ్రీరామ రామయనిమది
నారూఢిగభజనజేసి యతులితభక్తిన్
శ్రీరాముని కృపచేతన్
నోరూరగనీతులెల్ల నుడివితి కుమతీ
100. కుమతివిని నీతులెల్లన్
సుమతిగస్వస్థానమునకు సుఖముగనరిగెన్
భ్రమవదిలి బ్రహ్మపదవిని
రమియించెన్ గానజన్మ రహితము కుమతీ
101. శ్రీకర మంగళదాయక
ప్రాకటసీతాకళత్ర భవ్యచరిత్ర
లోకాతీత పరాత్పర
చేకొనుమిదె మంగళంబు శ్రీరఘురామా
102. మంగళము రామచంద్రా
మంగళము పవిత్రగాత్ర మాన్యచరిత్రా
మంగళము రవికులోత్తమ
మంగళము కృపాసమేత మహిజానేతా
గద్య
బ్రహ్మశ్రీ రాళ్ళభండి రాజయ్య
గారిచేత రచింపబడిన
కుమతీ శతకము
సంపూర్ణము
No comments:
Post a Comment