Wednesday, November 13, 2019

శతకాల పట్టిక 8

ఫేస్బుక్ లో "ప్రజ-పద్యం" వారిద్వారా ప్రచురితమైన అనేక శతకాలతో పాటు ఈ మద్య నాకు లభ్యమైన మరిన్ని క్రొత్త శతకాలని జోడించి ఈ లిస్టును తయారు చేసాను. ఈ లిష్టులో ప్రచురించిన అన్ని శతకాలు ఈ మద్యకాలం లో వ్రాయబడినవే. ఈ ఆధునిక కవులు వారిరచనలలో ప్రాచీనకిక తయారు చేయటంలో సహకరించిన మిత్రులు, కవులు శ్రీ కంది శంకరయ్య గారికి, "ప్రజ-పద్యం" సమూహం అడ్మిన్, కవి, శ్రీ నారుమంచి వేంకట అనంతకృష్ణ గారికి, వివరాలను అందచేసిన మిగిలిన కవులకు హృదయపూర్వక ధన్యవాదములు.


1. శంకర శతకము, కంది శంకరయ్య, "శంకరా!"
2. వరద శతకము, కంది శంకరయ్య, "వరదా!"
3. తెలుగుబిడ్డ శతకము, కవిశ్రీ సత్తిబాబు, "తెలుగుబిడ్డ!"
4. బంగరుకొండ శతకము, నారుమంచి వేంకట అనంతకృష్ణ, "బంగరుకొండా!"
5. హరి శతకము, గుండు మధుసూదన్, "హరీ!"
6. వనదుర్గా శతకము, బండకాడి అంజయ్య గౌడ్, "వనదుర్గా!"
7. శ్రీ లలితాష్టోత్తర శతకము, డా. గుఱ్ఱం సీతాదేవి, "లలితా!"
8. వాగ్దేవతా శతకము, అవుసుల భానుప్రకాశ్, "వాగ్దేవతా!"
9. భూమనార్య శతకము, సి.హెచ్. భూమయ్య, "భూమనార్య!"
10. భరతవీర శతకము, మహ్మద్ షరీఫ్, "భరతవీర!"
11. అన్నపూర్ణా శతకము, యం.వి.వి.యస్. శాస్త్రి, "అన్నపూర్ణ!"
12. శ్రీ గురు శతకము, పూర్ణకృష్ణ, "శ్రీ గురువర్యా!"
13. శంభు శతకము, మల్లి సిరిపురం, "శంభో!"
14. రామ శతకము, రామశర్మ, "పల్లవింప ముదము పలుకు రామ!"
15. మాధవ శతకము, సంగడి రామయ్య, "మాధవా!"
16. లక్ష్మీనారాయణ శతకము, సంగడి నాగదాసు, "నతజనసురక్ష! ఘనకరుణాకటాక్ష! లక్ష్మినారాయణాబ్జాక్ష! లలితవక్ష!"
17. చిద్విలాస శతకము, త్రిపురారి పద్మ, "చిన్మయ! శశిధరా! హర! చిద్విలాస!"
18. శబరిగిరీశ శతకము, కవిశ్రీ సత్తిబాబు, "శబరిగిరీశా!"
19. తేనీటి శతకము, మిరియాల ప్రసాదరావు, "టీ!"
20. శౌరి శతకం, ఆకుండి శైలజ, "శౌరీ"
21. నారసింహ పదాలు, ఆకుండి శైలజ, "నారసింహా"
22. మదళీ శతకం, ఆకుండి శైలజ, "మదళీ"
23. అర్క శతకం, మంథా భానుమతి, "అర్కా!"
24. అంశు శతకం, మంథా భానుమతి, "అంశూ!
25. సిరి శతకం, మంథా భానుమతి, "సిరీ!"
26. సువర్ణవిజయకృష్ణ శతకం, సువర్ణ విజయ లక్ష్మి, " సువర్ణ విజయ కృష్ణ "
27. శ్రీ శారదాంబ శతకం, పిన్నలి వేంకట రామ గోపీనాథ్, "సాకు మమ్మ మమ్ము శారదాంబ"
28. శ్రీ గణపతి శతకం, పిన్నలి వేంకట రామ గోపీనాథ్, "గణపతయ్య మమ్ము గావుమయ్య"
29. శ్రీ దేవి శతకం, పిన్నలి వేంకట రామ గోపీనాథ్, "అమ్మ మమ్ము నీవె యాదరింపు"
30. నీతి కందాలు, పిన్నలి వేంకట రామ గోపీనాథ్, "రహి చూపు శివా"
31. శివుడు శతకం, పిన్నలి వేంకట రామ గోపీనాథ్, "ఈశ", (అముద్రితం)
32.  సుబ్రహ్మణ్య స్వామి శతకం, పిన్నలి వేంకట రామ గోపీనాథ్, "స్కందా", (అముద్రితం)
33. అయ్యప్ప శతకం, పిన్నలి వేంకట రామ గోపీనాథ్, "శాస్తా", (అముద్రితం)
34. రామ శతకం, పిన్నలి వేంకట రామ గోపీనాథ్, "కౌసలేయ మమ్ము గావుమయ్య", (అముద్రితం)
35. కృష్ణ శతకం, పిన్నలి వేంకట రామ గోపీనాథ్, "వంశీ", (అముద్రితం)
36. ఆంజనేయస్వామి శతకం, పిన్నలి వేంకట రామ గోపీనాథ్, "హనుమా", (అముద్రితం)
37. షిర్డీ సాయి శతకం, పిన్నలి వేంకట రామ గోపీనాథ్, "వందనాలు! సాయి వదలకయ్య", (అముద్రితం)
38. శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రమ్, పిన్నలి వేంకట రామ గోపీనాథ్,  "వందనాలు హరికి వంద వేలు", (అముద్రితం)
39. లలిత పదముల మది లలిత గొలుతు, నారుమంచి వేంకట అనంతకృష్ణ, "లలిత పదముల మది లలిత గొలుతు"
40. వరసిద్ధి వినాయక భక్త పాలకా, నారుమంచి వేంకట అనంతకృష్ణ, "వరసిద్ధి వినాయక భక్త పాలకా"
41  అనంత భాస్కర శతకం,  నారుమంచి వేంకట అనంతకృష్ణ, "భాస్కరాదిత్య ఘృణిసంజ్ఞ భక్తవరద దివసకరసవితా తిగ్మ కిరణ"
42. శ్రేయస్కరా శ్రీధరా, నారుమంచి వేంకట అనంతకృష్ణ, " శ్రేయస్కరా శ్రీధరా"
43. ఈశా భక్త కల్పద్రుమా, నారుమంచి వేంకట అనంతకృష్ణ, "ఈశా భక్త కల్పద్రుమా"
44. ఈశ్వరమ్మ శతకము, కొమ్మోజు శ్రీధర్,  "ఈశ్వరమ్మ సుతుడు హితము పలుకు "
45. రామదూత శతకము, డా.బల్లూరి ఉమాదేవి, "కామవర నివాస కపివరేణ్య"
46. రామమోహనుక్తి రమ్య సూక్తి, చెరుకు రామ్మోహన రావు, "రామమోహనుక్తి రమ్య సూక్తి"
47. నృహరీ శతకము, నృహరీ, సంగనభట్ల  చిన్నరామకిష్టయ్య
48. బాల భావన, పెద్దలార! ఙ్ఞాన వృద్ధులార!, చింతా రామకృష్ణారావు


Thursday, September 26, 2019

శతకాల పరిచయం

మిత్రులందరికి
నేను అచ్చంగా తెలుగు అంతర్జాల మాసపత్రికలో ప్రతినెల ఒక శతకాన్ని పరిచయం చేస్తున్నాను. ఇంతవరకూ నేను పరిచయం చేసిన శతకాల పట్టిక ఈ క్రింద పొందుపరుస్తున్నాను. వీటిలో చాలా వరకూ ఎవరికీ తెలియని శతకాలను పరిచయం చేయటానికి ప్రయత్నించాను. సుమతీ, దాశరథి, వేమన, నారాయణ, శ్రీకాళహస్తీ మొదలైన శతకాలు ఇప్పటికీ ప్రజాదరణ పొందుతూనేఉన్నాయి. అటువంటివి కాక మరుగున పడిన అనేక ఆణిముత్యాలను పరిచయం చేయాలనేదే నా ప్రయత్నం. అందుకు తగిన అవకాశం ప్రోత్సాహం ఇచ్చిన శ్రీమతి భావరాజు పద్మినిగారికి ధన్యవాదములు.

1. శ్రీచక్రి శతకము - న్యాసావఝ్ఝల సత్యనారాయణమూర్తి
2. అగస్త్యలింగ శతకము - తాడికొండ పూర్ణమల్లికార్జున అయ్యంవార్లు
3. ఒంటిమిట్ట రఘువీర శతకము- అయ్యలరాజు త్రిపురాంతకుడు
4. భక్తమందార శతకము - కూచిమంచి జగ్గకవి
5. శ్రీబాలగోపాల శతకము - పుసులూరి సోమరాజకవి
6. సర్వేశ్వర శతకము - యథావాక్కుల అన్నమయ్య
7. హిమగిరి శతకము - త్యాగి
8. మహిషాసురమర్ధిని శతకము - దిట్టకవి రామచంద్రకవి
9. జ్ఞానప్రసూనాంబికా శతకము - శిష్టు సర్వాశాస్త్రి
10. ఆర్తరక్షామణి - వడ్డాది సుబ్బరాయకవి
11. శ్రీవేంకటేశ్వర శతకము  - తాళ్ళపాక తిరుమలాచార్యుడు
12. సంగమేశ్వర శతకము - పరిమి వెంకటాచల కవి
13. సర్వేశ్వర శతకము - అల్లమరాజు రంగశాయి కవి
14. శ్రీద్రాక్షారామ భీమేశ్వర శతకము - వి.ఎల్.ఎస్. భీమశంకరం
15. కోలంక మదనగోపాల శతకము - వంకాయలపాటి వేంకట కవి
16. నీలకంఠేశ్వర శతకము  - బళ్ళ మల్లయ్య కవి
17. రామలింగేశ శతకము - అడిదము సూరకవి
18. శ్రీరఘునాయక శతకము - మదిన సుభద్రాయమ్మ
19. భద్రగిరి శతకము - భల్లా పేరయ్యకవి
20. నానార్థ శివ శతకము - మాదిరాజు కోటేశ్వర కవి
21. కుమతీ శతకము - రాళ్ళబండి రాజయ్య కవి
22. సంపఁగిమన్న శతకము - పరమానంద యతీంద్రులు
23. దేవకీనందన శతకము - వెన్నెలకంటి జెన్నయ్యమంత్రి
24. శ్రీరమణీమనోహర శతకము - గంగాధరకవి
25. చౌడప్ప శతకము - కుందవరపు చౌడప్ప
26. భర్గ శతకము - కూచిమంచి తిమ్మకవి
27. ఆంధ్రనాయక శతకము - కాసుల పురుషోత్తమకవి
28. వేణుగోపాల శతకము - పోలిపెద్ది వేంకటరాయకవి
29. సింహాద్రి నారసింహ శతకము - గోగులపాటి కూర్మనాథకవి
30. శ్రీమదనగోపాల శతకము - మేకా బాపన్న
31. యాదగిరీంద్ర శతకము - తిరువాయిపాటి వెంకటకవి
32. శ్రీలక్ష్మీ శతకము - పరవాస్తు మునినాథకవి
33. గువ్వలచెన్న శతకము - గువ్వలచెన్నడు/ పట్టాభిరామకవి
34. మానసబోధ శతకము - తాడేపల్లి పానకాలరాయడు
35. శ్రీవిష్ణుసహస్త్రనామస్తోత్రం - పిన్నలి వెంకటరామ గోపీనాధ్
36. లలితపదముల మదిని లలిత గొలుతు - నారుమంచి అనంతకృష్ణ
37. కృష్ణ శతకము - నృసింహ కవి
38. శ్రీకనకదుర్గ శతకము - శ్రీదేవవరపు రాఘవులు
39. మాధవ శతకము - అల్లమరాజు రంగశాయి కవి
40. మారుతీ శతకము - గోపీనాథము వేంకటకవి
41. సూర్య శతకము - ఆకొండి వ్యాసమూర్తి శాస్త్రి
42. కీరవాణి శతకము - గంగాధరకవి
43. శ్రీ వసుదేవనందన శతకము - వెల్లాల రంగయ్య
44. ద్వారక వెంకటేశ్వరా శతకము - మంత్రులు నరసింహ కవి
45. శ్రీరంగనాయక శతకము - బొమ్మరాజు నరసింహ దాసు
46. శ్రీగురునాథేశ్వర శతకము - దోమా వేంకటస్వామి గుప్త
47. రఘుకులతిలక శతకము - దిట్టకవి రామచంద్రకవి
48. ముకుంద శతకము - దూపాటి తిరుమలాచార్య
49. శ్రీముకుందరాఘవ శతకము - జూలూరి లక్ష్మణ కవి
50. శ్రీరాజరాజేశ్వర శతకము - "రసప్రియ" కేశ్వాచార్య (ఫోతేదార్)
51. విశ్వనాథ శతకము - అమలాపురం సన్యాసకవి
52. దుర్గ-భర్గ శతకము - కపిలవాయి లింగమూర్తి
53. అభినవ సుమతీ శతకము - దుర్భ సుబ్రహ్మణ్యశర్మ
54. కుక్కుటలింగ శతకము - అల్లమరాజు రంగశాయి కవి
55. శ్రీ సాక్షిలింగ శతకము - కొప్పుల ఆదినారాయణ
56. శ్రీవీరనారాయణ శతకము - రావూరి సంజీవకవి

Monday, June 24, 2019

భక్తమందారశతకము కూచిమంచి జగ్గకవి

భక్తమందారశతకము
కూచిమంచి జగ్గకవి

1. శా. శ్రీసాకేతపురీ వరంబున సునా సీరోపల స్థాపిత
ప్రసాదాంతర చంద్రకాంతిమణియుక్పర్యంక భాగంబునన్
శ్రీసీతాసతిఁగూడ వేడ్కలలరం గ్రీడించు మిమ్మెప్పుడున్
మా సన్మానస వీధిఁ గొల్చెదము రామా! భక్త మందారమా!

2. శా. అస్తోకామల కీర్తికామ! లసదుద్య న్నిరద శ్యామ! భూ
విస్తార ప్రభుతా లలామ! త్రిజగత్ప్రఖ్యాత సన్నామ! ధీ
రస్తు త్యోరు గుణాభిరామ! భుజసారస్ఫార పౌలస్త్యదు
ర్మ స్తస్తోమ విరామ! ధీమహిత! రామా! భక్త మందారమా!

3. మ. కదన ప్రాంగణకార్తికేయ! విలస ద్గాంగేయకౌశేయ! భా
స్వదు దంచద్ఘననీలకాయ! త్రిజగ త్సంరక్షణోపాయ! స
మ్ముదితాశేష మరున్నికాయ! దివిపన్ముఖ్యాతిగేయ! గరు
త్మద మేయాశ్వ! సుధీ విధేయగుణ! రామా! భక్త మందారమా!

4. మ. అకలాంకయుత కీర్తిజాల! మహనీయాభీల శౌర్యస్ఫుర
న్మక రాక్షాసుర రావణప్రముఖ నానాదానవోత్తాల తూ
ల కరాళస్ఫుట వహ్నికీల! జయశీల! సద్దయావాల! హే
మకనచ్చేల! భ్ధానుపాల! రఘురామా! భక్తమందారమా!

5. మ. దురిత ధ్వాంత పతంగ! సంగర మహా దుర్వార గర్వాహితో
త్కర సేనాకదళీ మతంగ! లస దేకాంతాత్మ పంకేజ సం
చర దుద్యన్మదభృంగ! ఔంగవ ఘన నీల శ్యామాంగ! సద్గంగ! క
మ్ర రమాలింగన సంగతాంగ! రఘురామా! భక్తమందారమా!

6. శా. దండం బీయదె నీకుఁగైకొనుము దోర్ధండాగ్రజాగ్రన్మహో
దండోత్తాల విశాల దివ్యాంతర కోదండాగ్ర నిర్ముక్త స
త్కాండ వ్రాత విఖండి తాహిత శిరఃకాండా! కనత్కుండలా!
మాండవ్యాది తపోధన ప్రణుత! రామా! భక్తమందారమా!

7. శా. వింతల్ గాఁగడు మీకు సత్కృతులు గావింతును దుషారాద్రి జా
కాంతా క్రాంత జటాంతరాళ విలుఠద్గంగా తరంగచ్ఛటో
త్క్రాంతాత్యంత ఝుళం ఝుళన్నినద రంగద్ధాటి మీఱంగ సా
మంతా! సంతత శాంతిమంత! జయరామా! భక్తమందారమా!

8. మ. రకపుంగావ్యకళాకలాప రచనా ప్రాగల్భ్య సంసిద్ధికై
ప్రకట ప్రేమ భజింతు నీశ మకుట ప్రస్ఫీత గంగా జలా
ధిక మాధుర్య కవిత్వ ధూర్వహస ధీ దివ్య ప్రభావాఢ్యఁ ది
మ్మ కవిశ్రేష్ఠు మదగ్రజున్ మదిని రామా! భక్తమందారమా!

9. మ. సకలాభీష్ట ఫల ప్రదాయకుఁడవై చంచద్ధయాశాలివై
ప్రకట స్నేహ రసార్ద్ర మానసుఁడవై భంగీకృతానేక పా
తక ఘోరామయశాత్రవోత్కరుడవై ధాత్రీసుతం గూడి మా
మక చిత్తాజ్జమునన్ వసించు మొగి రామా! భక్తమందారమా!

10. మ. మణి పుంఖాంకిత కంకపత్త్రచయ సమ్యగ్దివ్య తూణ ద్వయం
బణుమధ్యంబునఁ దళ్కు గుల్క ఖల దైత్యానీకహృద్భేదకృ
ద్ధణ నీయోగ్ర కఠోరకార్ముకము చేతంబూని నా వెంటల
క్షణుడు న్నీవును నంటి త్రిమ్మరుము రామా! భక్తమందారమా!

11. మ. పలుమాఱున్ భవదీయ కావ్య రచనా ప్రాగల్భ్య మొప్పార ని
న్గొలుతున్ మామక మానసాబ్జమున బొంకుల్ గావు నీ వెచ్చటం
గలళొనం బొడకట్ట విట్టి వగ బాగా! మేల్! బళా! శ్యామకో
మల విభ్రాజితమందారా వయువ! రామా! భక్తమందారమా!

12. మ. రఘు వంశాంబుధి పూర్ణచంద్ర! విలసద్రాజన్య దేవేంద్ర! నా
యఘ సంఘంబులఁ బాఱఁద్రోలి భవదీయామేయ కారుణ్యదృ
ష్టి ఘన ప్రక్రియఁ జూచి యేలుకొనుమా! సేవింతు నత్యంతమున్
మఘవ ప్రస్తుత సద్గుణాభరణ! రామా! భక్తమందారమా!

13. మ. గణుతింతున్ భవదీయ సద్గుణ కథల్ కౌతుహలం బొప్పఁగాఁ
బ్రణుతింతున్ నచరాచరాదిక మహా బ్రహ్మాండ భాండచ్ఛటా
గణితప్రాణిజనాంతరాత్మవని వేడ్కన్ సతతంబున్ నభో
మణివంశాంబుధి శీతభాను! రఘురామా! భక్తమందారమా!

14. మ. సారసారవిచార! ధీరజనతా సంరక్షణోదార! స
త్కారుణ్Yఆకరమూర్తి వంచు నెద నత్యంతంబు నీ దివ్యశృం
గారగా పదారవిందములు వేడ్కన్ గొల్తు నన్ బ్రోవుమీ
మారీచ ప్రమదప్రహారశర! రామా! భక్తమందారమా!

15. మ. మిహికాంళూపమ సుందరాననముతో మే లీను కందోయితో
నహిజిద్రత్న వినీల విగ్రహముతో నంచ త్కిరీతంబుతో
విహగాధీశ్వరు నెక్కి నా యెదుటికిన్ విచ్చేయవే యోపితా
మహా సుత్రామ మఖామర ప్రణుత! రామా! భక్తమందారమా!

16. శా. కంజాత ప్రభవాండ భాందచయ రంగచ్చేతనాచేతనా
ళిం జెన్నారఁగఁ బ్రోదిసేతు వని హాళిన్ ధీజనుల్ దెల్ప హృత్
కంజాతంబున మిమ్ముగొల్తు ననువేడ్కన్ వేగ రక్షింపుమీ
మంజిశ్రీకరుణా కటాక్షమున రామా! భక్తమందారమా!

17. మ. తళుకుం బంగారు కామగుబ్బ గొడుగందంబొప్ప శత్రుఘ్నుఁడ
ర్మలి బట్టన్ భరతుండు చామరము గూర్మి న్వీచఁగా లక్షమణుం
డలదుం దూపుల విల్లుదాల్పఁ గపి సేనాధీశ్వరుల్ గొల్వ ని
ర్మల లీలం గొలువుండు నిన్ దలఁతు రామా! భక్తమందారమా!

18. శా. నిక్కంబరాయంధావకాంఘ్రి విలసన్నీరే రుహ ద్వంద్వమే
దిక్కెల్లప్పుడు మా కటంచు మదినెంతే వేడ్క భావించె దన్
జిక్కుల్ పన్నక నమ్మికిచ్చి సరగం జేపట్టి రక్షింపు స
మ్యక్కారుణ్యకటాక్ష వీక్ష నను రామా! భక్తమందారమా!

19. మ. అతసీపుష్పసమాన కోమల వినీలాంగున్ సముద్య న్మహో
న్నతకోదండ నిషంగగంగు బలవ న్నక్తంచరాఖర్వ ప
ర్వత జీమూత తురంగుఁ గింకరజనవ్రాతావనాత్యంత ర
మ్యతరాపాంగుని నిన్ భజింతు మది రామా! భక్తమందారమా!

20. శా. ఆర్తత్రాణ పరాయణుండ వని నిన్నత్యంతమున్ సజ్జను
ల్గీర్తింపన్ విని తావకీన పదనాళీక ద్వయంబాత్మ వి
స్ఫూర్తింజెందఁగనెంతు నెల్లపుడు నన్బోషింపు మీ సత్కృపన్
మార్తాండ ద్విజరాజ సన్నయన! రామా! భక్తమందారమా!

21. మ. మదనాగాశ్వ శతాంగకాంచన కసన్మాణిక్య భూషామృగీ
మద దివ్యాంబర చామరధ్వజ లస న్మంజూషికాందోళికా
మృదు తల్పార్ధ సమృద్ధిగల్గి పిదప న్నీ సన్నిధిం జేరు నిన్
మదిలో నెప్పుడు గొల్చు మానవుఁడు రామా! భక్తమందారమా!

22. శా. శ్రీకం ఠాబుజ సంభవేంద్ర రవిశోచిష్కేశ ముఖ్యమరా
నీకంబుల్ గడుభక్తి నిన్ గొలిచి పూంకిన్ ధన్యులైనారు నేఁ
డాకాంక్షన్ భజియింతు మేమఱక చిత్తూనంద మొందింపుమా
మాకుం బ్రాపును దాపు నీ వగుచు రామా! భక్తమందారమా!

23. మ. కరి రా, జార్జున, పుందరీక, శుక, గంగానందన, వ్యాసులున్
పరమాధీశ, బలింద్ర, మారుతసుతుల్, సంప్రితి సద్భక్తి మీ
పరమాంఘ్రిద్వయ చింతనాభిరతిమైఁ ద్రాపించిరౌ సద్గతిన్
స్మరకోటి ప్రతిమాన రూపయుత రామా! భక్తమందారమా!

24. అహితార్తుల్ వెడఁబాయు లేము లెడలున్ వ్యాధుల్ దొలంగు న్నవ
గ్రహ దోషంబులు శాంతిఁబొందుఁ గలుషవ్రాతంబు కాఱున్ శుభా
వహమౌ తావక దివ్యనామ మెలమిన్ వాక్రుచ్చినన్ ధాత్రిపై
మహితోద్దండతర ప్రతాపగుణ రామా! భక్తమందారమా!

25. గార్గాగస్త్యవసిష్ఠ శుక మార్కండేయ గాధేయులం
తర్గాఢాధిక శత్రుశిక్షణ కళాధౌరేయుతాబుద్ధి సం
సర్గ ప్రక్రియ ముమ్ముఁ గొల్తురుగదా క్ష్మాకన్య కోరోజస
న్మార్గస్ఫాయ దురఃకవాటతట! రామా! భక్తమందారమా!

26. మ. అకలంకాయుత భోగభాగ్యదము నిత్యానంద సంధాన హే
యుక మాభీలతరాఘమేఘ ఘనవాతూలంబు ముక్తిప్రదా
యక మత్యంత పవిత్ర మెంచ నిల నాహా! తారకబ్రహ్మ నా
మక మంత్రంబు భళీ! భవన్మహిమ! రామా! భక్తమందారమా!

27. మ. ఇనుఁడద్దంబగు నగ్నినీరగు భుజగేంద్రుండు పూదండయౌ
వనధుల్ పల్వల పంక్తులే జలధరాధ్వం బిల్లెయౌ రాజయో
గ నిరూఢస్థితిఁ దావకీనపదయుగ్మం బెల్లకాలంబు ప్రే
మ నెదం బూని భజించు ధన్యులకు రామా! భక్తమందారమా!

28. మ. ముద మొప్పార నిరతరంబు బలవన్మోక్షప్రదామేయభా
స్వదుదం చ్ఛపదంఘ్రితామరస సేవాసక్త చిత్తంబు దు
ర్మదులం జేరునె పారిజాత సుమనోమత్తద్విరేఫంబు దా
మదనోర్వీజము చెంతకుం జనునె రామా! భక్తమందారమా!

29. మ. ఖండించున్ బహుజన్మసంచిత చలద్గాఢోగ్ర దోషావలిం
జండప్రక్రియ శైలజావినుత భాస్వచ్చారు దివ్యన్మహో
ద్దండ శ్రీ భవదీయనామ మిలమీఁదన్ భూతభేతాళ కూ
ష్మాండద్రాత ఘనాఘనశ్వనన రామా! భక్తమందారమా!

30. శా. సారాసారకృపా కటాక్షమున నిచ్చల్ భూర్భువ స్వస్త్రిలో
కారూఢాఖిల జంతుజాలముల నెయ్యం బొప్పఁగాఁ బ్రోచు ని
న్నారాధించి సుకింపలేక శిలలం బ్రార్ధింతురెంతే నప
స్మారభ్రాంతి మదాత్మ మూఢులిల రామా! భక్తమందారమా!

31. మ. సరసీజాత భవాభవామరుల్ చర్చింప మీ మాయ గా
నరటంచున్ సతతంబు ప్రాఁజదువులు న్నానా పురాణంబులున్
సరస ప్రక్రియఁ జాటుచుండఁగఁ బిశాచప్రాయు లెంతేని సో
మరిపోతుల్ నరులెట్లు గాంచెదరు? రామా! భక్తమందారమా!

32. శా. ధర్మంబంచు నధర్మమంచుఁ గడు మిధ్యాలీల లృ పారఁగా
నిర్మాణం బొనరించి ప్రాణులను నిర్నిద్ర ప్రభావంబులన్
బేర్మిం జెందఁగఁ జేసి యంత్రకుగతిన్ బిట్టూరకే త్రిప్పు నీ
మర్మం బెవ్వ రెఱుంగఁగా@ గలరు? రామా! భక్తమందారమా!

33. మ. వ్రతముల్ పట్టిన, దేవభూసుర గురువ్రాతంబులం గొల్చి నం
గ్రతు తంత్రంబులు దానధర్మము లపారంబౌనటుల్ చేసినన్
శతవర్షంబులు గంగలో మునిఁగినన్ సంధిల్లునే ముక్తి దు
ర్మతికిం దావక భక్తి గల్గమిని? రామా! భక్తమందారమా!

34. శా. సందేహింపక కొంచకెప్పుడు హృదబ్జాతంబులో భక్తి నీ
యందంబై తగుమూర్తి నిల్పికొని యత్యాసక్తి సేవించువాఁ
డొందుం గుప్పున వాంచితార్ధములు బాగొప్పారు వందారు స
న్మందారంబవు గావె నీ వరయ రామా! భక్తమందారమా!

35. మ. అరిషడ్వర్గముఁ బాఱద్రోలి సకలవ్యామోహముల్ వీడి సు
స్థిర యోగాంతర దృష్టి మీ చరణముల్ సేవించు పుణ్యాత్మకుల్
వరవైకుంఠపురాంతరాళమున భాస్వల్లీలలన్ ముక్తి తా
మరసాక్షి రతికేలిఁ జొక్కుదురు రామా! భక్తమందారమా!

36. మ. ఉదయార్కాంశు వికస్వరాంబుజ రమాయుక్తంబులై యొప్పు నీ
పదముల్ ధ్యానము చేసి ముక్తియుపతిం బ్రాపింపఁగా లేక సు
ర్మదవృత్తిన్ బశుమాంస మగ్ని దనరారన్ వేల్చుఁగా! దేవతా
మదిరాక్షీసురతేఛ్చ! భూసురుఁడు రామా! భక్తమందారమా!

37. శా. ప్రాని వ్యూహ లలాట భాగముల లీలాలోల చిత్తంబునన్
పాణీకోకిల వాణినాథుఁడు లిఖింపంబొల్చు భాగ్యాక్షర
శ్రేణిం బెంపఁదరంబెయెవ్వరికి సంసిద్ధంబుస్వారాట్ఛిరో
మాణిక్య స్ఫురదంఘ్రి తామరస రామా! భక్తమందారమా!

38. మ. నిను సేవింపని పాపకర్ములకు వాణీనాథ గోరాజవా
హనసుత్రామముఖామరప్రవర వాచాగోచరంబై సనా
తనమై ముక్తి రమా సమేతమగు నీ ధామంబుసిద్ధించునే
మనురాడ్వంశసుధాబ్ధిసోమ! రఘురామా! భక్తమందారమా!

39. మ. మొదలంజేసిన పుణ్యపాపములు సన్మోదాతిఖేదంబులై
యదన న్వచ్చి భుజింపఁబాలు పడు నాహా! యెవ్వరి న్వేఁడిన
న్వదలం జాలవవెన్ని చందములఁ దా వారింపఁ జింతించినన్
మదనారాలికినైనఁ దథ్యమిది రామా! భక్తమందారమా!

40. శా. ఇం దందున్ సుఖమీయఁజాలని మహాహేయార్థ సంసారఘో
రాంధూ బృందనిబద్ధులై సతత మన్యాయ ప్రచారంబులన్
గ్రిందున్మీఁదును గానకెంతయున్ రక్తిన్ ధాత్రివర్తింతురౌ
మందుల్ సుందర మందహాసముఖ రామా! భక్తమందారమా!

41. మ. అమరశ్రేష్టుని వారువంబునకు దూండ్లాహారమీశానమౌ
శి మహాభోగికి గాలిమేఁత, నిను హాళి న్మోయుమాద్యద్విహం
గమలోకేంద్రున కెల్లఁ బుర్వుగమియె బోనంబు ప్రారబ్ధక
ర్మ మవశ్యంబ భుజింప కెట్లుచను? రామా! భక్తమందారమా!

42. మ. నరుఁడెల్లప్పుడు నాజవంజవభరానమ్రాత్ముఁడై యున్నఁగా
ని రహస్యంబుగ నీ పదద్వయము ధ్యానింపన్ వలెన్ భక్తితో
బరమానంద సుధాసారనుభవలిస్సాబుద్ధుయై నుర్విఁగు
మ్మరి పుర్వుం బలెఁ బంకదూరగతి రామా! భక్తమందారమా!

43. శా. దానంబాభరణంబు హస్తమునకు దద్ జ్ఞానికిన్నీపద
ధ్యానంబాభరణంబు భూసురున కత్యంతంబ గంగానదీ
స్నానంబాభరణంబు భూతలమునన్ బాడెంపుటిల్లాలికిన్
మానంబాభరణంబు తథ్యమిది రామా! భక్తమందారమా!

44. మ. అదన న్వేఁడిన యాచక ప్రతతికీయంగా వలెన్ రొక్కమిం
పొదవన్ మీ కథలాలకింపవలె మేనుప్పొంగ గంగామహా
నదిలో స్నానము లాచరింపవలె హీన ప్రక్రియన్ మాని స
మ్మద చిత్తంబున మార్త్యుఁడెల్లపుడు రామా! భక్తమందారమా!

45. శా. ఉద్యానాదిక సప్తసంతతుల బా గొప్పార నిల్పన్ వలెన్
సద్యోదానమునన్ బుధాళి కెపుడున్ సంప్రీతి సల్పన్ వలెన్
ప్రోద్యద్విద్యలు సంగ్రహింపవలె నిత్యోత్సాహియై మార్త్యుఁడో
మాద్యద్దానపకానన జ్వలన! రామా! భక్తమందారమా!

46. మ. నిను భక్తిన్ భజియించినన్ గురువులన్నిత్యంబు సేవించినన్
ధనవంతుండయి గర్వదూరుఁడగుచున్ ధర్మంబు గావించినన్
జనతామోదక పద్ధతి న్మెలఁగినన్ జారుండు గాకుండినన్
మనుజుండారయ దెవుఁ డిమ్మహిని రామా! భక్తమందారమా!

47. శా. అన్యాయంబు దొఱంగి యెల్లరకు నిత్యానంద మింపొంద సౌ
జన్య ప్రక్రియ నేల యేలు నతఁడున్ శాస్త్రానుసారంబుగాఁ
గన్యాదానము సేయు నాతఁడును వేడ్కన్ భూసురున్ బిల్చి స
న్మాన్యం బిచ్చినవాడు ధన్యుడిల రామా! భక్తమందారమా!

48. మ. చెఱువున్ సూబుఁడుఁదోటయుంగృతియు నిక్షేపంబునుం దేవమం
దిరమున్ విప్ర వివాహమున్ జగతి నెంతే వేడ్క గావించుచున్
నిరతంబున్ భవదీయ పాదవిలస న్నీరేరుహద్వంద సం
స్మరణం బూనెడువాఁడు ముక్తుఁదగు రామా! భక్తమందారమా!

49. శా. ఆకాంక్షన్ గృహదాసికా సురతలీలాసక్తి వర్తించినన్
లోకస్తుత్య చరిత్ర! సత్కులవధూలోలుండు గాకుండినన్
కోకాప్తాస్తమయోదయంబుల యెడన్ గూర్కూనినన్ మర్త్యుపై
మా కారుణ్య కటాక్ష మూన దిల రామా! భక్తమందారమా!

50. మ. గణుతింపంగ నరాధముల్ సుకవికిం గాసీనివాఁడున్ దయా
గుణ మొక్కింతయు లేనివాఁడు నొరుపైఁ గొండెంబుగావించు వాఁ
డణుమధ్యన్ సతిఁబాసి దాసి పొందాసించువాఁ డుర్వి బ్రా
హ్మణ విత్తంబు హరించువాఁ డరయ రామా! భక్తమందారమా!

51. మ. వృషలీభర్తయుదేవలుండు నటుఁడున్ వేదాభిశస్తుండు మా
హిషి కుం డగ్నిదకుండగోళకులునున్ హింసా పరస్వాంతుడున్
విషదుండుం గొఱగాడు పంక్తి కెపుడుర్విన్ భక్తసంఘాత క
ల్మష మత్తద్వితదౌఘ పంచముఖరామా! భక్తమందారమా!

52. మ. అగసాలిన్ దిలఘాతకున్ యవనునిన్ వ్యాపారి దాసున్ విటున్
జగతీనాథుని వేటకాని గణికన్ జండాలునిన్ జోరునిన్
బ్రెగడంగోమటి జూదరిన్ బుధజనుల్ పెన్రొక్కమర్పింప న
మ్మఁగ రాదెంతయుఁ దథ్య మిద్ధరణి రామా! భక్తమందారమా!

53. మ. అలుకన్ మిక్కిలి సాహసంబు ఘనమన్యాయ ప్రచారంబునుం
జలముం దట్టము మామ మెక్కుడు మహాజాలంబు శీలంబహో
తలపైఁజేయిడి బాసజేసిన యదర్థంబుర్విపైఁ బుష్పకో
మలుల న్నమ్మఁగరాదు పురుషులు రామా! భక్తమందారమా!

54. మ. కుకవుల్ కూళలు కొంటె తొత్తుకొడుకుల్ కొండీలు కోనారులుం
దకలై తత్తలవారు పాచకులు జూదంబాడువారు న్మహిం
బ్రకటంబై సిరిగాంచిరి కలియుగ ప్రామాణ్య మాశ్చర్య మో
మకరాక్షాసుర గర్వ సంహరణ రామా! భక్తమందారమా!

55. మ. కలియుగంబున వైద్యలక్షణ పరీఁక్షా శూన్య మూఢావనీ
తలనాథుల్ బలుమోటకాఁపు దొరలున్ దట్టంబుగా బిల్చి మం
దుల వేయింప భుజించి క్రొవ్వి కడువైద్యుల్ గారె సిగ్గేది? త
మ్మళులున్ నంధులు క్షౌరకాంత్యజులు రామా! భక్తమందారమా!

56. శా. దీనత్వంబునఁగూడులేక చెడి యెంతే భైక్ష్యముల్ గౌంచుల
జ్జానామంబులు లేకయుండు బలురాజన్యుండు చేపట్టి దా
నానా వస్తువులిచ్చి వైభవ మిడన్ న్యాయజ్ఞుఁడై వాఁడిలన్
మానం జాలునె తొంటినీచగతి రామా! భక్తమందారమా!

57. శా. ఎన్నంగార్ధభ ముత్తమాశ్వమగునే; హీనుండు దాతృత్వ సం
పన్నుండౌనె; ఖలుండు పుణ్యుఁడగునే; పల్గాకి సాధౌనె; క
ల్జున్నౌనే; మహిషంబ హస్తి యగునే; జోరీగ దేఁటౌనెటుల్
మున్నుం బిల్లి మృగేంద్రమౌనె భువి రామా! భక్తమందారమా!

58. మ. బలిభిక్షన్ దయఁబెట్టఁబూనిన మహాపాపాత్మకుల్ భువిలో
పలఁగోట్యర్భుద సంఖ్యయైనఁద్రిజగత్ర్పఖ్యాత దానవచ్ఛటా
కలనావర్తిత పుణ్యమూర్తియగునే గాటంబుగాఁబర్వు దో
మలువేయైన మదద్విపంబగునె రామా! భక్తమందారమా!

59. మ. ధరలోనన్ సుకవిప్రణీత బలవద్ధాటీనిరాఘాట భా
స్వర సత్కావ్య కథాసుధారస పరీక్షాదీక్ష విద్వన్మహా
పురుషశ్రేష్టునకబ్బు, పామరునకే పోల్కిన్ లభించున్ సదా
మరుదాత్మోద్భవసేవితాంఘ్రినల! రామా! భక్తమందారమా!

60. మ. పద్యంబేల పసిండి? కీప్సితము దీర్పన్ లేని జేజేకు నై
వేద్యంబేల? పదార్థ చోరునకు నుర్విన్ వేదవేదాంత స
ద్విద్యాభ్యాసక బుద్ధియేల? మదిభావింపంగ నెల్లప్పుడున్
మద్యం బానెడు వానికేల సుధ? రామా! భక్తమందారమా!

61. మ. ముకురంబేటికి గ్రుడ్డివానికి, జనామోదానుసంధాన రూ
పకళాకౌశలకామినీ సురతలిప్సాబుద్ధి ద్ధాత్రిన్నపుం
సకతం గుందెడు వానికేమిటికి, మీసంబేటికిన్ లోభికిన్
మకుటంబేటికి మర్కటంబునకు రామా! భక్తమందారమా!

62. మ. కుజనున్ ధర్మతనూజుఁదంచు నతుమూర్ఖున్ భోజరాజంచు ఘో
రజరాభార కురూపకారిని రమారామాకుమారుండటం
చు జడత్వంబునవేఁడి కాకవులు కాసుంగాన రెన్నంగ సా
మజ రాజోగ్రవిపద్దశాపహర! రామా! భక్తమందారమా!

63. మ. చలదశ్వద్ధతరుప్రవాళమనుచున్ సారంగ హేరంబటం
చలరుందింటెన పూవటంచు ముకురంబంచున్ భ్రమన్ సజ్జనుల్
కళలూరంగ రమించుచున్ వదలరే కాలంబు ముగ్ధాంగనా
మలమూత్రకర మారమందిరము రామా! భక్తమందారమా!

64. మ. సుదతీపీనపయోధర ద్వయముపై సొంపొందు నెమ్మోముపై
మదనాగారముపైఁ గపోలములపై మధ్యప్రదేశంబుపై
రదనావాసంబు పయిన్నితంబముపయిన్ రాజిల్లు నెంతేని దుర్
ర్మద వృత్తిన్ ఖలుచిత్త మిద్ధరణి రామా! భక్తమందారమా!

65. మ. రసికోత్తంసులు సత్కులీనులు మహాద్రాఘిష్ట సంసార ఘో
రసముద్రాంతరమగ్నులై దరికిఁ జేరన్ లేక విభ్రాంతిచేఁ
బసులం గాచిన మోతకొయ్య దొరలం బ్రార్థింతు రెంతేని దే
మసగాదే యిది యెంచి చూచినను రామా! భక్తమందారమా!

66. మ. సరసుం డాతఁడు పెద్ద యాతఁడు మహాసౌందర్యవంతుం డతం
డరి హృద్భీకరశౌర్యధుర్యుఁ డతఁడుద్యద్దాన కర్ణుం డతం
డురుగోత్రోద్భవుఁడాట డెవ్వడిల నుద్యోగార్థ సంపన్నుఁడౌ
మరుదీశోపల నీలమూర్తి ధర! రామా! భక్తమందారమా!

67. శా. విత్తం బొత్తుగఁ గూర్చి మానవుఁడు దుర్వృత్తిం బ్రవర్తించి యు
వ్వెత్తుం దేహ మెఱుంగలేక తిరుగున్ హేలాగతిన్ బత్తెఁ దాఁ
జిత్తాంబ్జంబున మిమ్ముఁ గొల్వఁ డెపు డిస్సీ యెంత పాపంబొకో
మత్తరాతి నిశాట సంహరణ! రామా! భక్తమందారమా!

68. మ. శమ మావంతయుఁ బూననొల్లఁడు గరుష్ఠ జ్ఞానవిద్యావిశే
షము గోరంతయు నాత్మలోఁ దలఁపఁ డాచార ప్రచారంబు ధ
ర్మము వీసంబును జేయఁజాలఁడు గదా, ముందుండు పెన్ రొక్కపున్
మమతన్ దేహ మెఱుంగలేక ధర రామా! భక్తమందారమా!

69. మ. భువిలో లోభులు కూడఁబెట్టిన ధనంబున్ బందికా డ్రూడిగల్
బవినీలున్ దరిబేసులున్ దొరలొగిన్ వచ్చుల్ నటీ దాసికా
యువతుల్ గుంటెనకత్తెలున్ గొనుదు రోహో! యెట్టి కర్మంబొ! హై
మవతిసన్నుత దివ్యనామ! రఘురామా! భక్తమందారమా!

70. మ. సిరులెంతేనియు నిక్కువంబనుచు దుశ్శీలన్ మదిన్ నమ్మి ని
ర్భర గర్వంబున మీఁదు చూతు రహహా! భవంబుతో నెంచినం
గరి కర్ణాంతము లంబు బుద్భుదతతుల ఖద్యోతకీతప్రభల్
మరుదగ్రార్పిత దీపమాలికలు! రామా! భక్తమందారమా!

71. మ. ఇటురా రమ్మని పిల్చి గౌరవముగా హేమాంబరాందోళికా
కటకప్రాకట భూషణాదులిడి వేడ్కన్ ఱేఁడు ప్రార్థింప వి
స్ఫుట భంగిం దగు కావ్యకన్య నిడనొప్పున్ గానిచో నుర్వి కో
మటి మేనర్కమె బల్మిఁగట్టఁగను? రామా! భక్తమందారమా!

72. మ. తనకుం బద్యము లల్లి సత్కవులు నిత్యంబుం బ్రసంగింపఁగా
విని యొత్తుల్ దిను దాసరింబలె బయల్వీక్షించుచుం గానియై
న నొసంగన్ మదిలో@< దలంపని మదాంధక్షోణిపాలుండిలన్
మునుమార్గంబు గ్రహింపఁగాఁగలడె రామా! భక్తమందారమా!

73. శా. ధాటీపాటవ చాటు కావ్యరచనోద్యద్ధోరణి సారణీ
వాటీకోద్గతి సత్కవీశ్వరుఁడు నిత్యంబుం దమున్ వేఁడఁగా
వీటీఘోటక హాటకాదు లిడ రుర్విన్ నిర్దయాబుద్ధిచే
మాటే బంగారు నేటి రాజులకు రామా! భక్తమందారమా!

74. మ. పలుమాఱుం ద్విజరాజు లొక్కటఁ దముం బాధింతురంచున్ విషా
నలఘోరాననముల్ముడుంచుకొని కానన్ రాక దుర్గస్థలం
బుల వర్తించుచు బుస్సు రందు రిల నాభోగేశు లెందైననున్
మలఁకల్మాని చరింపఁగాఁగలరె? రామా! భక్తమందారమా!

75. మ. గడియల్ రెండిక సైచిరా వెనుకరా కాసంత సే పుండిరా
విడిదింటం గడె సేద దీర్చుకొనిరా వేగంబె బోసేసిరా
యెడపొద్దప్పుడు రమ్మటంచు సుకవిన్ హీనప్రభుం డిగతిన్
మడఁతల్వల్కుచుఁ ద్రిప్పుఁగాసిడక! రామా! భక్తమందారమా!

76. బలరాజన్యుఁడు ధూర్తకాకవిఁ గనంగంపించి విత్తంబు దా
నలఘ ప్రక్రియ నిచ్చు సత్కవివరున్ హాస్యంబు గావించు నౌ
నిల బర్బూరము గాలివానఁబడుగాఁ కింతైనఁ గంపించునే
మలయోర్వీధర మారుతంబునకు రామా! భక్తమందారమా!

77. శా. కాయస్థుల్గణికా జనంబులు తురుష్క శ్రేణులున్ దుష్టదా
సెయుల్ వైద్యులున్ బురోహితులు దాసీభూతముల్ గాయకుల్
బోయల్ గొందఱు లోభిభూవరు ధనమున్ సంతతంబున్ మహా
మాయాజాలము పన్ని లాగుదురు రామా! భక్తమందారమా!

78. శా. శ్రీలక్ష్మీ మదయుక్తుఁడై నృపుఁడువాసింబేర్చు భూదేవునిం
గేలింబెట్టి తదీయకోమ మహిమన్ గీడొందు నెట్లన్న ది
క్ఖేలత్కీర్తి త్రిశంకుం డల్క నలశక్తింబల్కి తద్వాగ్గతిన్
మాలండై చెడిబోవడోట మును రామా! భక్తమందారమా!

79. మ. లస దుద్యజ్జ్వల భవ్యదివ్య కవితాలంకార విద్యావిశే
షసమాటోప విజృంభమాణ కవిరాత్సంక్రందనుం ద్రిప్పి త్రి
ప్పి సమీచానతఁబ్రోవకుండు నృపతుల్ పెంపేది నిర్భాగ్యులై
మసియై పోవరె తత్క్రుధాగ్ని నిల రామా! భక్తమందారమా!

80. మ. రసికత్వంబును దాన ధర్మగుణముం బ్రత్యర్థిశిక్షాకళా
భ్యసనప్రౌఢిమ నాధుబంధుజనతా త్యం తావనోపాయ లా
లసచిత్తంబును దృప్తియుం గొఁఱత వాలాయంబు దానెంచఁదా
మసమే మిక్కిలి దుర్నరేంద్రులకు రామా! భక్తమందారమా!

81. మ. ఖలభూనాథఁడు నిచ్చనిచ్చ జనులన్ గారించి విత్తంబు మి
క్కిలిగా గూరిచి పుట్టలో నిఱికి వేఁగింపంగ నుద్దండతం
బలవన్మేచ్ఛులు పొంది లావనుచు లే బాధింతురౌపెట్టి జెఱ్ఱిఁజీ
మలు చీకాకుగఁ జేయుచంగముగ రామా! భక్తమందారమా!

82. మ. అతికష్టం బొనరించి భూమిజనుఁ డత్యాసక్తి విత్తంబు వి
స్తృతభంగిం గడియింపఁగా నెఱిఁగి ధాత్రీకాంతు లుద్దండ ప
ద్ధతి వానిం గొనిపోయి కొట్టి మిగులం దండించి యా సొమ్ము స
మ్మతిఁగైకొండ్రు మఱెంత నిర్దయులొ రామా! భక్తమందారమా!

83. శా. దానంబిల్లె, దయారసంబు నహి, సద్దర్మంబుతీర్, మీపద
ధ్యానంబున్ గడులొచ్చు సత్యవచన వ్యాపారముల్ సున్న సు
జ్ఞానం బెంతయు నాస్తి సాధుజన సన్మానేచ్ఛ లే దెన్న నీ
క్ష్మానాధాధమకోటి కేది గతి రామా! భక్తమందారమా!

84. మ. తనువుల్ నిక్కము లంచు నెంచుకొని అత్యంత దుర్మార్గ వ
ర్తనులై నిర్దయమీఱ భూమిప్రజలం దండించి విత్తంబులా
ర్కవము ల్సేయుచు గొందు లందొదిగి నిచ్చల్గానరాకుంద్రు ఛీ!
మనుజాధీశుల కేఁటి ధర్మములు రామా! భక్తమందారమా!

85. మ. మురుగుల్ ప్రోగులు నుంగరాల్సరిపిణీల్ముక్తా మనీహారముల్
తురంగంబు ల్గరు లందబులు భట స్తోమంబులున్ రాజ్యమున్
స్థిరమంచున్ మది నమ్మి పాపములు వే సేతు ర్మదోన్మత్త పా
మర భూవిష్టప దుష్టనాయకులు రామా! భక్తమందారమా!

86. మ. మకరోగ్రక్రకచాగ్రజాగ్రదురు సమ్యక్ఛాత దంష్ట్రా క్షత
ప్రకటాంఘ్రిద్వయనిర్గళ ద్రుధిరధారాపూరఘోరవ్యధా
చకితుండై మొఱసేయు నగ్గజపతిన్ సంప్రీతిరక్షింపవే
మకుటీభూత శశాంక చాపహర! రామా! భక్తమందారమా!

87. మ. అగవిద్వేషణుఁగూడి వేడుక నహల్యా దేవి గ్రీడింపఁగా
భగవంతుం డగు గౌతముండు హని కోపస్ఫూర్తి శాపింప నీ
జగతిం ఱాపడి తాపమొందగ పదాబ్జ ప్రస్ఫుర ద్ధూళిచే
మగువం జేసితి వెంత వితయది రామా! భక్తమందారమా!

88. మ. అమరేంద్రాది సమస్త దేవభయదాహంకార హుంకార సు
ర్ధద బాహా బలసింహనాద పటుకోమండోగ్ర బాణఛ్చటా
సమజాగ్రత్ఖర దూషణాసురుల భాస్వ ద్దండకారణ్య సీ
మ మును ల్మేలని మెచ్చఁ ద్రుంచితివి రామా! భక్తమందారమా!

89. శా. నే నీ బంతను నీవు నా దొర విదే నిక్కంబటంచు న్మదిన్
నానాభంగుల నమ్మి కొల్చితినే యెన్నాళ్ళాయె జీతంబుకా
సైన న్నేఁటి కొసంగవైతి భళియాహా! లెస్స! బాగాయెగా!
మౌనీంద్ర శయపద్మ షట్చరణ! రామా! భక్తమందారమా!

90. మ. బలదేవుందతి నీచవృత్తిని సురాపానంబు గావింపఁగా
జలజాతాస్త్రుఁడు మానినీ పురుషలజ్జాత్యాగముల్ సేయఁగా
చలమారంగనలక్ష్మి సజ్జనుల నిచ్చల్ పట్టి బాధింపఁగా
మలపం జాల విదే వివేక మిల? రామా! భక్తమందారమా!

91. మ. అదిరా! పిల్చినఁ బల్కవేటికి? బరాకా చాలు నిం కేలఁగాఁ
గదరా! మిక్కిలివేఁడి వేసరిలు బాగా? నీకు శ్రీజానకీ
మదిరాక్షి శరణంబులాన! నను బ్రేమన్ బ్రోవరా వేడ్క శ్రీ
మదుదుంచత్ప్రభుతాగుణప్రథిత! రామా! భక్తమందారమా!

92. శా. వందిం బోలి భవత్కథావళులనే వర్ణింతు నత్యంత మీ
చందం బొందఁగఁగొందలం బుడిపి నిచ్చల్లచ్చి హెచ్చంగ నీ
వందందుం దిరుగంగబోక దయ నాయం దుండు మెల్లప్పుడున్
మందప్రక్రియమాని పూనికను రామా! భక్తమందారమా!

93. మ. అకటా! తావకకావ్య భవ్య రచనావ్యాపార లీలావిలో
లకసత్స్వాంతుఁదనైన నా పయిని నీలక్ష్మీకటాక్షామృతం
బొకవేళం జనుదేరదేమి? దయలేదో యోగి హృత్పద్మస
నృకరందాసవ పానకృద్భ్రమర రామా! భక్తమందారమా!

94. మ. నతమర్త్య వ్రజ వాంచితార్థ ఫలదాస శ్రీవిరాజన్మహో
న్నత మందారమ వంచు ధీరజను లానందంబునం దెల్ప నే
వ్రతచర్య న్నినువేఁడి వేసరితి ప్రోవన్ రావిదే నీకుస
మ్మతమా! తెల్పుము తేటతెల్లముగ రామా! భక్తమందారమా!

95. మ. పదపద్యంబు లొనర్చి నీకొసగనో ప్రాజ్ఞుల్ నుతింపగ మీ
పదపద్మంబులు భక్తితోడ మదిలో భావింపనో! యేమిటం
గొదవే దేఁటికి జాగుచేసెదవు? కోర్కులు దీర్పువేవేగ! శా
మదరాతిక్షణ దాచరప్రమద! రామా! భక్తమందారమా!

96. మ. క్రతువుల్ సేసెదనంటినా, బహుపదార్థంబిల్లె! సంధ్యాజప
వ్రతముల్ సేసెదనంటినా దొరలఁ గొల్వంగావలెం గూటికె
ధృతి నిన్వేడెదనంటినా నిలువ దొక్కింతైనగానీ దయా
మతి నన్నేగతిఁబ్రోచెదో యెఁఱుగరామా! భక్తమందారమా!

97. మ. తగునా పావన తావకీన పదధ్యాననిష్ఠాగరి
ష్ఠ గతిన్ వర్తిలుమాకు నిప్పు డతికష్ట ప్రాప్తిఁగావించి బల్
పగవానిన్ బలెఁజూడఁగాఁ హటకటా! పాపంపు గాదోటు! జి
హ్మగ సమ్రాట్కరకంకణప్రణుత! రామా! భక్తమందారమా!

98. మ. నిను నా దైవముగా భజించుటాకు నేనిత్యంబుఁ గావించు స
జ్జనతాకర్ణ రసాయన ప్రకటభాస్వత్ సోము లేసాక్షి నీ
వనుకంప న్నినుఁబ్రోచుచుండుటాకు నీయైశ్వర్యమె సాక్షి నీ
మనసు న్నా మనసు న్నె~ౠఁగు నిది రామా! భక్తమందారమా!

99. మ. జయ మొప్పార నిను న్మదీయ హృదయాబ్జాతంబునం గొల్తు నే
రములెల్లన్ క్షమచేసి ప్రోతు వనుచున్ రాఁగంజనన్ నీదుచు
త్తము నాభాగ్య మదెట్టిదో యెఱుగ తధ్యం బిద్దసంగ్రామ ధా
మమహాకాయవిరామశతశర! రామా! భక్తమందారమా!

100. మ. జయనారాయణ! భక్తవత్సల! హరే! శౌరే! జగన్నాయకా
జయ! సీతాహృదయేశ! శేషశయనా! శశ్వద్దయాసాగరా!
జయ పీతాంబర! రామచంద్ర! జలదశ్యామాంగ! విష్ణో! నిరా
మయ! లీలామనుజావతారధర! రామా! భక్తమందారమా!

101. మ. సరసప్రస్తుత కూచిమంచి సుకభాస్వద్వార్ధి రాకాసుధా
కరుఁడన్ గంగన మంత్రినందనుఁడ! రంగల్తిమ్మభూమందలే
శ్వరపర్యార్పిత "బేబదల్" బిరుదవిస్ఫాయజ్జగన్నాథనా
మ రసజ్ఞుందను బ్రోవు మెప్డు నను రామా! భక్తమందారమా!

సమాప్తము

Wednesday, June 12, 2019

అభినవ సుమతి శతకము - దుర్భా సుబ్రహ్మణ్యశర్మ (1931)


1. శ్రీదంబులు, భవపాశ
చ్చేదంబులు, సకలభక్త చిత్తాంబురుహా
మోదంబులు, పరమేశ్వరు
పాదంబులు కొలుచువాడు ప్రాజ్ఞుడు; సుమతీ!

2. ఇలక్రుంగకుండ, వారా
సులు మేరలు మీఱకుండ, సూర్యాదులు దా
రులు సప్పకుండ, నెవ్వఁడు
తెలివిన్ నియమించె నతఁడె దేవుఁడు; సుమతీ!

3. తలపోసి మనుజు లీశ్వరు
నలఘు మహత్త్వంబు దెలియ నాసపడుట, యా
జలరాశిలోఁతు గనుఁగొనఁ
జలిచీమల పైనమైన చందము; సుమతీ!

4. ఒరులెవరు చూడలేదని
దురితంబులు సలుపఁబోకు దుష్టాత్ముఁడవై,
నిరతము వేగన్నులతోఁ
బరమేశుఁడు చూచుచున్న వాఁడుర; సుమతీ!

5. ప్రత్యక్షదైవంబులు
సత్యముగా నీకు నీదు జననీజనకుల్;
ప్రత్యహము వారిఁ గొలువుము
నిత్యైశ్వర్యంబు నీకు నెలకొను; సుమతీ!

6. జనయిత్రికంటె దైవము
జనకునికంటెను గురుండు, జనహితరతికం
టెను మేలు, జనవిరోధం
బునకంటెను గీడు లేదు భువిలో; సుమతీ!

7. యెన్నియిడుములకు నోరిచి
నిన్నుంగని పెంచినారొ నీ తలిదండ్రుల్!
మి న్నొఱిగి మీఁదఁ బడఁగా
నున్నను, బిత్రాజ్ఞ మీఱకుండుము; సుమతీ!

8. భౌతికదేహంబునకున్
మాతాపితలట్ల జ్ఞానమయతనువునకున్
హేతువు గావున నొజ్జలఁ
జేతమునన్ నిలిపి భజన సేయుము; సుమతీ!

9. గురుని యవగుణము లెన్నకు,
గురునింద యొనర్చువారిఁ గూడకు, మఱి యా
గురువేది చెప్పెనయ్యది
యరసి యనుష్ఠించి శ్రేయమందుము; సుమతీ!

10. జననియును జన్మభూమియు
జనకుండు జనార్ధనుండు జాహ్నవియు ననన్
జను నీ యైదు ' జ ' కారము
లనయము సేవ్యములు సజ్జనాళికి; సుమతీ!

11. మనదేశభాష యనియును
మనపుట్టినదేశ మనియు మనదేశంపున్
జనులనియుఁ బ్రీతిఁ బొరయని
మనుజుఁడు జీవన్మృతుండు మహిలో; సుమతీ!

12. హరుఁ డౌదల నిడికొన్నను
హరిణాంకుఁడు కృశతవీఁడ డది యుక్తమె రా
దొరయెంత సౌమ్యుఁడైనను
పరాశ్రయము దుఃఖకరము ప్రాణికి; కుమతీ

13. పరవేదన మొకయింతయు
నెఱుఁగరు శ్రీమంతు లల ఫణీశుని శిరముల్
ధరక్రింద నులియు చుండఁగ
హరి సుఖముగ నిద్రపోవు నంబుధి; సుమతీ!

14. సేవావృత్తి శ్వవృత్తిగ
నేవాఁడు వచించె నాతఁ డెఱుగఁడు; శుని స్వే
చ్చావృత్తిఁ దిరుగు, నట్టిది
సేవకునకు నెన్నఁడైన జెల్లునె? సుమతీ!

15. సింగమున కెవఁడొసంగెను
రంగుగ మృగరాజపద మరణ్యమున, ను
త్తుంగబలశౌర్యశాలికి
వెంగలుల సహాయమేల వేఁడఁగ; సుమతీ!

16. కాలం ద్రొక్కిన యంతన
తూలక సిగనంట నెగయు ధూళియు మేలే,
హేళనపడి పగతురపై
నాలమునకుఁ బోని యాపద కంటెను; సుమతీ!

17. ప్రాణంబు లొడ్డియైనన్
మానము కాపాడుకొనుము మానము తొలఁగం
గా నుండినను, స్వధర్మము
మానకు మిదె ధీరజనుల మార్గము; సుమతీ!

18. వెఱవకుము మృత్య్వునకున్
వెఱవకు బాధలకు, ధరణి విభుశిక్షలకున్,
వెఱవకుము లోకనిందకు,
వెఱవుము తప్పక యధర్మవృత్తికి, సుమతీ!

19. న్యాయమునఁ బోవువానికిఁ
బాయక మృగపక్షులైన బాసట యగు, న
న్యాయపరుఁడైనవానిన్
బాయున్ దోఁబుట్టువైన వసుమతి; సుమతీ!

20. ఎది యెదిరి నీకొనర్చిన
నెద యుమ్మలికమ్మునొందు నెదిరికి నీ వ
య్యది సేయకుండు; మిదియే
సదమల ధర్మోపదేశసారము; సుమతీ!

 21. కీర్తికయి ప్రాఁకులాడకు,
వర్తింపుము ధర్మ మెఱిఁగి వారకదానన్
గీర్తియయినఁ గా కున్నను
బూర్తిగఁ బుణ్యంబునీకుఁ బొసఁగును; సుమతీ!

22. ధర్మమున నిలచి, దానన్
శర్మము శాంతియును గనుటె స్వర్గము; మఱి దు
షర్మంబు చేసి మనమున
నిర్మథనము నొందునదియ నిరయము; సుమతీ!

23. కనకంబు గాదు తలఁపగఁ
గనకాంగియుఁ గాదు, కాదు కాదంబరియున్;
మనుజులకుఁ గైపు కొలిపెడి
పెనురోగము మౌఢ్య మొకఁడె పృథ్విని; సుమతీ!

24. మృగమునకు నేల ముత్యము
లగణిత మణిదర్పణమ్ము లంధున కేలా?
తగఁ జెవిటి కేల సొరములు,
నిగమార్గము లేల మూఢునికి నిల? సుమతీ!

25. జ్ఞానంబుకతనఁ గాదే
మనవుఁ డఖిలార్థసిద్ధిమంతుడగుటల్;
జ్ఞానము విద్యాధీనము
కానన్ గష్టించి విద్య గఱవుము; సుమతీ!

26. ఏనుంగులు సింగంబులు
వానరములు బెలుఁగుబంట్లు వ్యాఘ్రములు నరా
ధీనంబు లగుట, యాతని
ధీనీతి మహత్త్వమంచుఁ దెలియుము; సుమతీ!

27. స్నానమున మేనిముఱికియు,
జ్ఞానమున మనోమలంబు, శబ్దాగమ వి
జ్ఞానమున నుడిదొసంగులు,
పూని తొలగించుకొనుము పూర్ణత; సుమతీ!

28. ఎంతెంతచదువు చదివెద
వంతంతకొఱంత యునికి యది విశదమగున్;
ఎంతెంత యది యపూర్ణమొ
అంతంత వృథాభిమాన మడరును; సుమతీ!

29. వేసమున కేమి? చాకలి
నాసించిన, వలువ లెట్టివైన లభించున్!
భాసురమగు విద్య, చిరా
భ్యాసంబునఁ గాక యెరవు కబ్బునె? సుమతీ!

30. విననేర్చు బధిరుఁ, డంధుఁడు
కన నేర్చున్, నడువ నేర్చు ఖంజుఁడు బళిరా!
అనవరత పరిశ్రమమున
నెనయంగారాని సిద్ధి యెయ్యది? సుమతీ!

31. నీకన్న నధికులం గని
శోకించిన నేమిఫలము? సుస్థిరమతివై
యాకొలఁదివాఁడ వగుటకు
వీఁకన్ యత్నింపు మీవు విసువక; సుమతీ!

32. ధన మున్న, ధాన్య మున్నన్
ఘనవైభవ మున్న, శాస్త్ర కౌశల మున్నన్
గొన మొకటి లేకయుండిన
ననయమ్ము నిరర్థకము లన్నియు; సుమతీ!

33. జాతి యేదియైనఁ గాని,
పూతచరిత్రుండు లోకపూజ్యుండగు; దు
ర్నీతిపరుఁ డెట్టి యున్నత
జాతి జనించినను నధమజన్ముఁడ; సుమతీ!

34. ప్రాఁత దని కొనకు మెదియును,
నూతనమని త్రోయఁబోకు న్యూనాధికతల్
చేతనమున నరసి, గుణసం
ఘాతం బెటనుండు దానిఁ గైకొను; సుమతీ!

35. సుగుణంబు లెల్ల నొక్కచో
నొగి నుండునే యొక్కఁడొక్కఁ డెక్కడఁగాకన్?
మొగలికి ఫలములు గలవె?
తగఁ బవసకుఁ బూలు కలవె? ధారుణి; సుమతీ!

36. పలుకుము సత్యముగా, మఱి
పలుకు మటు ప్రియమ్ము గాఁగఁ బలుక కసత్యం
బులు ప్రియము లంచు, సత్యం
బులు పలుకకు మప్రియంబులు మూర్ఖత; సుమతీ!

37. సత్యమునకంటె ధర్మము,
హత్యన్ గావించుటకంటె నతిపాతకమున్
ప్రత్యాశకంటె నూఱట
మృత్యూద్ధతికంటె భయము నెయ్యది? సుమతీ!

38. తప్పొక్కటి చేసి, దానిం
గప్పఁగ ననృతంబు వేఱొకటి చెప్పినచోఁ
దప్పు ద్విగుణీకృతం బగు;
ఒప్పుకొనినఁ దొలియఘంబు నుడుగును; సుమతీ!

39. తప్పకు మాడినమాటను,
చెప్పకు మనృతంబు నెట్టి చెడువేళను, పైఁ
గప్పకుము మలినవస్త్రము,
విప్పకు మాప్తుల రహస్యవృత్తము; సుమతీ!

40. భూతహితంబునకంతెను
ప్రీతికరం బొండు లేదు విను మీశునకున్,
భూతాపకృతికి మించిన
పాతకమును లేదు మార్త్యపంక్తికి; సుమతీ!

41. జన్నము లని జాతర లని
పున్నెమునకు భూతకోట్లఁ బొలియింప కవి
చ్చిన్నసుగుణములపెంపున
నున్నతి నార్జించి సుగతి నొందుము; సుమతీ!

42. ఉపనిష దధ్యయనంబుల
జపములఁ దపముల సమాధి సంయమములఁ దో
రపుఁ పుణ్యమెంత, యంతయు
నుపకారపరుండు పొందు నుఱకయ; సుమతీ!

43. అపకారుల కైనను
ఉపకారము చేయుచుందు రుత్తము, లల గం
ధపుఁజెట్టు తన్ను నఱికెడి
కృపాణికకుఁ దావిగూర్చు రీతిని; సుమతీ!

44. క్షీరములు ద్రావి, సర్పము
ఘోరంబగు విష మొసంగు; గో వన్నఁ, దృణాం
కూరము దిని క్షీరము లిడు;
నీరీతిది కుజనసుజనవృత్తము; సుమతీ!

45. ఆరోగ్యమె యైశ్వరం
బారోగ్యమె యింద్రభోగ మపవర్గమునన్
ఆరోగ్యమె సకలార్థము
లారోగ్యవిహినుజన్మ మధమము; సుమతీ!

46. కాయపరిశ్రమ మింతయుఁ
జేయక, బుద్ధిశ్రమంబు చేయుట యెల్లన్
లేయిసుక నేలపై న
త్యాయుతసౌధంబు కట్టునటువలె; సుమతీ!

47. ఒళ్ళు చెడఁదిరిగి, ముప్పున
భల్లాతకసేవ పడఁగోరుట, తా
నిల్లు దరికొనుచు నుండఁగఁ
జల్లాఱుప బ్రావి త్రవ్వు చందము; సుమతీ!

48. ఒడలు చెడు, మతి నశించును
విడిముడి వితవోవు, యశము వీసరపోవున్
కుడు పుడుగుఁ, గూలు మనుగడ,
యొడరులకున్ మద్యపాన మెల్లర; సుమతీ!

49. కొంచమున కేమి లెమ్మని
కొంచక కలు ద్రావవలదు కూపంబుదరిన్
' కించిత్తు ' కాలుజాఱినఁ
బంచత్వము గాక కలదె బ్రతుకును; సుమతీ!

50. మనవచ్చు, మనుపవచ్చున్,
దినవచ్చున్, బెట్టవచ్చు దీనులదుఃఖం
బును దీర్చవచ్చు, ధనముం
డిన నేయదిసేయరాదు నిజముగ; సుమతీ!

51. దుర్జనులయడుగు లొత్తక,
భర్జింపక సాధుజనుల వ్యవహారములం
దార్జనము సెడక, సుఖముగ
నార్జించిన దల్పమైన నధికమ! సుమతీ!

52. జలభరమున జలదంబులు
ఫలభరమునఁ బాదపములు వ్రాలును జుమ్మీ;
అలఘుమతు లైనవారికి
గలిమి వినమ్రతన కూర్చు; కాంచుము; సుమతీ!

53. పరికింప విషము విషమే
పరధనము విషంబుగాక వసుమతి విస మొ
క్కరిఁజంపు పరధనంబో
పొరిపుచ్చుఁ గుటుంబమును సమూలము; సుమతీ!

54. పరకాంతలఁ దల్లులఁగాఁ
బరధనము విషంబుగాఁగఁ బరవిహితకృతిన్
బరమార్థముగాఁదలఁచెడు
పురుషుం డెవఁడైన లోకపూజ్యుడు; సుమతీ!

55. పగలిటివెంటన్ రాతిరి,
తగ రాతిరివెంటఁ బగలు తార్కొనుభంగిన్
సుగమువెనువెంట వగయును,
వగవెంటన్ సుగమువచ్చు వసుమతి సుమతీ!

56. బురదన్ నీరును, నీటన్
బురదయు, నిరువుకొనియున్న పొలుపున దుఃఖాం
తరమున సౌఖ్యమ్య్, సౌఖ్యాం
తరమున దుఃఖము గలదు తథ్యము సుమతీ!

57. సిరులందు సిలుగులందున్
దిరముగ నొకరహిన యుంద్రు తేజస్వులు; భా
స్కరుఁ డుదయవేళ రక్తుఁడు;
అరసంజను గూడనాతఁ డట్టిఁడె సుమతీ!

58. పొంగకుము మేలువచ్చినఁ,
గ్రుంగకు మటఁ గీడు తారుకొన్నను, రెంటన్
సంగంబు విడిచి ధర్మము
సాంగోపాంగముగ నీవు సలుపుము సుమతీ!

59. తొలిచేసిన కర్మంబులు
ఫలోన్ముఖములైన వానిఁ బాపఁగ వశమా?
విలు విడిచిన బాణము, న
వ్వల మరలుప నజునకైన వశమా? సుమతీ!

60. మ్రోలం బ్రియంబు లాడుచు
వాలాయము వెనుకఁ గార్యభంగము సేయున్
నూలుకొను పాపకర్ముఁడు
పాలు పయిం దోఁచు గరళపాత్రము సుమతీ!

61. నీతులు పదివేల్ నేర్చినఁ
జేతోగతి మాఱ దెందుఁ జెనఁటులకు, యుగ
వ్రాతంబు నీటనున్నను
రాతికి మెత్తదనంబు రాదుర సుమతీ!

62. ఉన్నతమగు స్థానంబున
నున్నంతనె నీచపురుషుఁ డుత్తముఁ డగునా?
మిన్నంటు మేడకొనఁ గూ
ర్చున్నను, కాకంబు ఖగవరుండటె? సుమతీ!

63. కఱటులకు దుష్టకార్య
చరణంబున నేర్పు పెద్ద సాంద్రతమ స్సం
భరిత నిశయందు, ఘూకో
త్కారమునకున్ దృష్టి పెద్ద ధారుణి సుమతీ!

64. పాలెంత మంచి వైనను,
హాలరసపాత్ర నున్న నర్హము లగునా?
మేలైనవిద్య యైనను
పాలసుకడనున్న నంతపాటిదె సుమతీ!

65. అప్పు తలమీఁద నుండఁగ
విప్పుగ విభవములఁ దూఁగు విభ్రాంతుడు, దా
నిప్పంతుకొన్న గృహమునఁ
దప్పక నిదురించు దుర్విదగ్ధుడు సుమతీ!

66. ఆలుం బిడ్డల యక్కఱ
వాలాయము తీర్పఁబాటు పడనోపక, త
త్త్వాలు పదాలుం జదివెడు
బాలీశుఁడు గృహస్థు గాఁడు పశువుర సుమతీ!

67. ముక్తికని గేహమున్ విడి,
ప్రాక్తనవాసనల మరల భార్యాదులపై
రక్తిఁగొను ధర్మనిష్ఠా
రిక్తుఁడు రెండిటికిఁ జెడిన రేవఁడు సుమతీ!

68. కరి పెద్ద, దానికంటెన్
గిరి పెద్ద, పయోధి దానికిం బెద్ద, చదల్
మఱిపెద్ద దానికంటెను
అరయఁగ నన్నిటికిఁ బెద్ద యాశయె సుమతీ!

69. శోకహత మని యెఱుంగుము
లోకం బఖిలంబు దీనిలో లవమైనన్
బోకార్ప నోపె దేనియు
నీకైవడి ధన్యు డెవఁడు నిజముగ సుమతీ!

70. పనిపాట లుడిగి యాచన
మనఁ గోరెడిసోమరులను మన్నింపకు త
జ్జను లితరుల కష్టార్జిత
ధనమును బగటన హరించు సస్యులు సుమతీ!

71. కుంటికి, గ్రుడ్డికిఁ, దేవులుం
గొంటుకు, ముదుసలికి, ననదకు, దరుద్రునకున్
సొం టిడక పెట్టుకంటెను
ఘంటాపథ మెద్ది పుణ్యగతికిని సుమతీ!

72. కలవాఁడు, త్యాగశీలత
కలవాఁడు, గుణంబు నెఱుఁగఁ గలవాఁడు, దయో
జ్జ్వలుఁ డొక్కఁడైన నుండుట
ఫలవృక్షం బూరినడుమఁ బండుట సుమతీ!

73. బలీయుం డైనను నిష్ఫలుఁ
గొలువరు జను లలఁతి నైన గొలుతురు ఫలదున్
సలిలార్థులు వార్ధిన్ విడి
కేలనన్ గూపములఁ జేరు క్రియగా సుమతీ!

74. సిరియెంత యున్న, లోభికి
నఱగొఱయే యనుభవాప్తి అదియెట్లన్నన్
చెఱువెంత నిండియున్నను
కొఱమాలిన గదుకు నీళ్ళె కుక్కకు సుమతీ!

75. కాళిక పగఱం గూల్పదె?
శ్రీలక్ష్మి సమస్తరాజ సేవిత గాదే?
ఏలదె కళల సరస్వతి?
స్త్రీలేమిటఁ దక్కువైరి చెప్పుము సుమతీ!

76. అమృతంబు బాలభాషిత
మమృతంబు ప్రియోక్తిసహిత మగు నాతిథ్యం
బమృతంబు నృపబహుకృతి
అమృతం బనుకూల యగు కులాంగన సుమతీ!

77. నెలతోడఁ గ్రుంకుఁ గౌముది
జలద్దముతోడన్ నశించు సౌదామని సా
ద్వులు పతులకు ననుగతులని
తెలుపున్ జడములును గూడఁ దిరముగ సుమతీ!

78. కులకాంత కులట యైనన్
చెలికాఁడు కృతఘ్నుఁడైన సేవకుఁ డుర్విన్
బలుమాటలవాఁడైనను
నలవదురా వేఱునరక బాధలు సుమతీ!

79. పరసతులతో, యతులతో
ధరణీశులతోడఁ దల్లి దండ్రులతోడన్
గురుయోగిజనులతోడను
పరిహాసము వలదు చేటు వచ్చుర సుమతీ!

80. ఏపూఁటఁ జేయఁదగుపని
యాపూఁటనె చేయుమీ వనాలస్యముగా
రే పన్నదేమి నిశ్చయ
మాపన్మయమైన తనువునందును సుమతీ!

81. పోయిన క్షణంబు మరలుపఁ
దోయజగర్భునకుఁ దరమె? తోడ్తోఁ గడలిన్
బోయి పడినట్టి నది పా
నీయము క్రమ్మఱుప నెవరు నేర్తురు? సుమతీ!

82. గతమునకై వగవక యా
యతిఁ గూర్చి దురంత చింత నందక యెది ప్ర
స్తుత మది చక్క జరపుము
చతురమతులమార్గ మిదియె శాంతికి సుమతీ!

83. గౌరవముతోడి మనుగడ
యారయ క్షణమైనఁ జాలు నది లేనియెడన్
నూఱేండ్లు బ్రతికెనేనియుఁ
బూరుషుఁడా? పురుగు గాక భూమిని సుమతీ!

84. చెడుఁ గలిమి చెడును గృహములు
చెడు మడులును మాన్యములును చెడు వాహనముల్
చెడు బలము చెడును సర్వము
చెడనిది సత్కీతి యొకఁడె సిద్ధము సుమతీ!

85. ఎప్పటి కేది కావలెనో
అప్పటి కది యగు నటంచు యత్నంబుదెసన్
జప్పపడకు విత్తనిపొల
మెప్పాటను బంద దనుచు నెఱుఁగుము సుమతీ!

86. కలదో లేదో యదృష్టము
తెలియంగా రాదు బ్రహ్మదేవుని కయినన్
గల దనుకొని యత్నింపుము
ఫల మెట్టిది యైనఁ జింతపడకుము సుమతీ!

87. కానిపనికై కడంగకు
మూనినపని వీడకుము నిరుత్సాహమునన్
పూనకుము దీర్ఘచింతను
కానక దొరఁకొనకు మెట్టికార్యము సుమతీ!

88. బాలుండు చెప్పెనేనియుఁ
బోలినపలు కైన వీటి పుచ్చకకొనుమా
ఫాలాక్షుఁడూని చెప్పిన
బోలనిమాటైనఁ గొనకు బుద్ధిని సుమతీ!

89. పరులకు బోధించెడునెడఁ
బరమేష్ఠిసమాను లెల్ల వారును మఱి స్వా
చరణంబు వేళ వచ్చినఁ
బరమేష్ఠియు జగముతోడి వాడుఁర సుమతీ!

90. అతికామంబున రావణుఁ
డతిగర్వముచేత నహుషుఁ డతిదాన సము
న్నతి బలియుఁ జెడిరి కావున
"అతి" వర్జింపంగ వలయు నన్నిట సుమతీ!

91. ధనికులకు చేతు లొగ్గకు
ధనహీనుల నెందు నెల్లిదము సేయకు మీ
వను వెఱిఁగి యెల్లవారల
ప్రణయంబు గడింపు ముచిత నర్తన సుమతీ!

92. చెలిమిన్ మే లొనరింపరు
చెలికారము మాన నెగ్గు సేయుదురు కడున్
బలయుతు లగుదుష్టులతోఁ
జెలిమైనను వైరమైనఁ జేటుకె సుమతీ!

93. చన వధికమైన మన్నన
పొనుగు పడుట యేమి వింత? బోయపడఁతి చం
దనతరుకాష్ఠంబుల నిం
ధనములఁ గావించు మలయనగమున సుమతీ

94. వితరణ విహీను విత్తము
ప్రతిభాన విహీను చండ పాండిత్యంబున్
ధృతిహీను బాహుబలమును
వితథము లీమూఁడు నెట్టి వేళను సుమతీ!

95. లలితములు విరులకంటెను
కులిశంబునకంతె మిగులఁ గ్రూరములు, మహా
త్ముల చిత్తవృత్తులిట్టివి
కలనాళ్ళన్ గానినాళ్ళఁ గ్రమముగ సుమతీ!

96. అసదృశపండితుఁ డైనను
వెస నాశ్రయహీనుఁ డైన వెలుఁగం గలడే?
మిసిమిగల రత్నమైనను
బసిఁడిం బొదువంగఁ బడక వఱలునె? సుమతీ!

97. చెఱకునకు ఫలము చందన
తరువునకున్ విరులు కమ్మదావి పసిఁడికిన్
వరమతులకు నైశ్వర్యము
పొరయింపని బ్రహ్మ మూఢుఁడొ సుమతీ

98. కవికంటె బోధకరుఁడును
రవికంటెన్ దీప్తికరుఁడు రాకాధవళ
చ్చవికంటె హర్షకరుఁడును
భువనత్రయమందులేరు పోలఁగ సుమతీ!

99. కాకిం గసరఁగ నేలా?
కోకిలమును గొసరనేల కూయమటంచున్?
లోకంబు మెచ్చుకవితా
పాకం బది పూర్వపుణ్య ఫలముర సుమతీ!

100. తరువు పువు పూచెనేనియుఁ
బరిమళము వెలార్ప గంధవాహుఁడు వలదా?
వరకవితకైన సరసుల
కరుణాప్తింగాక వ్యాప్తి కలదే సుమతీ!

101. కవిలోక విశ్రుతుఁడు సా
ధువు సుబ్రహ్మణ్యశర్మ దుర్భాన్వయ సం
భవుఁ డిది భవద్ధితార్థము
చవిపుట్ట రచించె దీనిఁ జదువుము సుమతీ!