Wednesday, June 12, 2019

అభినవ సుమతి శతకము - దుర్భా సుబ్రహ్మణ్యశర్మ (1931)


1. శ్రీదంబులు, భవపాశ
చ్చేదంబులు, సకలభక్త చిత్తాంబురుహా
మోదంబులు, పరమేశ్వరు
పాదంబులు కొలుచువాడు ప్రాజ్ఞుడు; సుమతీ!

2. ఇలక్రుంగకుండ, వారా
సులు మేరలు మీఱకుండ, సూర్యాదులు దా
రులు సప్పకుండ, నెవ్వఁడు
తెలివిన్ నియమించె నతఁడె దేవుఁడు; సుమతీ!

3. తలపోసి మనుజు లీశ్వరు
నలఘు మహత్త్వంబు దెలియ నాసపడుట, యా
జలరాశిలోఁతు గనుఁగొనఁ
జలిచీమల పైనమైన చందము; సుమతీ!

4. ఒరులెవరు చూడలేదని
దురితంబులు సలుపఁబోకు దుష్టాత్ముఁడవై,
నిరతము వేగన్నులతోఁ
బరమేశుఁడు చూచుచున్న వాఁడుర; సుమతీ!

5. ప్రత్యక్షదైవంబులు
సత్యముగా నీకు నీదు జననీజనకుల్;
ప్రత్యహము వారిఁ గొలువుము
నిత్యైశ్వర్యంబు నీకు నెలకొను; సుమతీ!

6. జనయిత్రికంటె దైవము
జనకునికంటెను గురుండు, జనహితరతికం
టెను మేలు, జనవిరోధం
బునకంటెను గీడు లేదు భువిలో; సుమతీ!

7. యెన్నియిడుములకు నోరిచి
నిన్నుంగని పెంచినారొ నీ తలిదండ్రుల్!
మి న్నొఱిగి మీఁదఁ బడఁగా
నున్నను, బిత్రాజ్ఞ మీఱకుండుము; సుమతీ!

8. భౌతికదేహంబునకున్
మాతాపితలట్ల జ్ఞానమయతనువునకున్
హేతువు గావున నొజ్జలఁ
జేతమునన్ నిలిపి భజన సేయుము; సుమతీ!

9. గురుని యవగుణము లెన్నకు,
గురునింద యొనర్చువారిఁ గూడకు, మఱి యా
గురువేది చెప్పెనయ్యది
యరసి యనుష్ఠించి శ్రేయమందుము; సుమతీ!

10. జననియును జన్మభూమియు
జనకుండు జనార్ధనుండు జాహ్నవియు ననన్
జను నీ యైదు ' జ ' కారము
లనయము సేవ్యములు సజ్జనాళికి; సుమతీ!

11. మనదేశభాష యనియును
మనపుట్టినదేశ మనియు మనదేశంపున్
జనులనియుఁ బ్రీతిఁ బొరయని
మనుజుఁడు జీవన్మృతుండు మహిలో; సుమతీ!

12. హరుఁ డౌదల నిడికొన్నను
హరిణాంకుఁడు కృశతవీఁడ డది యుక్తమె రా
దొరయెంత సౌమ్యుఁడైనను
పరాశ్రయము దుఃఖకరము ప్రాణికి; కుమతీ

13. పరవేదన మొకయింతయు
నెఱుఁగరు శ్రీమంతు లల ఫణీశుని శిరముల్
ధరక్రింద నులియు చుండఁగ
హరి సుఖముగ నిద్రపోవు నంబుధి; సుమతీ!

14. సేవావృత్తి శ్వవృత్తిగ
నేవాఁడు వచించె నాతఁ డెఱుగఁడు; శుని స్వే
చ్చావృత్తిఁ దిరుగు, నట్టిది
సేవకునకు నెన్నఁడైన జెల్లునె? సుమతీ!

15. సింగమున కెవఁడొసంగెను
రంగుగ మృగరాజపద మరణ్యమున, ను
త్తుంగబలశౌర్యశాలికి
వెంగలుల సహాయమేల వేఁడఁగ; సుమతీ!

16. కాలం ద్రొక్కిన యంతన
తూలక సిగనంట నెగయు ధూళియు మేలే,
హేళనపడి పగతురపై
నాలమునకుఁ బోని యాపద కంటెను; సుమతీ!

17. ప్రాణంబు లొడ్డియైనన్
మానము కాపాడుకొనుము మానము తొలఁగం
గా నుండినను, స్వధర్మము
మానకు మిదె ధీరజనుల మార్గము; సుమతీ!

18. వెఱవకుము మృత్య్వునకున్
వెఱవకు బాధలకు, ధరణి విభుశిక్షలకున్,
వెఱవకుము లోకనిందకు,
వెఱవుము తప్పక యధర్మవృత్తికి, సుమతీ!

19. న్యాయమునఁ బోవువానికిఁ
బాయక మృగపక్షులైన బాసట యగు, న
న్యాయపరుఁడైనవానిన్
బాయున్ దోఁబుట్టువైన వసుమతి; సుమతీ!

20. ఎది యెదిరి నీకొనర్చిన
నెద యుమ్మలికమ్మునొందు నెదిరికి నీ వ
య్యది సేయకుండు; మిదియే
సదమల ధర్మోపదేశసారము; సుమతీ!

 21. కీర్తికయి ప్రాఁకులాడకు,
వర్తింపుము ధర్మ మెఱిఁగి వారకదానన్
గీర్తియయినఁ గా కున్నను
బూర్తిగఁ బుణ్యంబునీకుఁ బొసఁగును; సుమతీ!

22. ధర్మమున నిలచి, దానన్
శర్మము శాంతియును గనుటె స్వర్గము; మఱి దు
షర్మంబు చేసి మనమున
నిర్మథనము నొందునదియ నిరయము; సుమతీ!

23. కనకంబు గాదు తలఁపగఁ
గనకాంగియుఁ గాదు, కాదు కాదంబరియున్;
మనుజులకుఁ గైపు కొలిపెడి
పెనురోగము మౌఢ్య మొకఁడె పృథ్విని; సుమతీ!

24. మృగమునకు నేల ముత్యము
లగణిత మణిదర్పణమ్ము లంధున కేలా?
తగఁ జెవిటి కేల సొరములు,
నిగమార్గము లేల మూఢునికి నిల? సుమతీ!

25. జ్ఞానంబుకతనఁ గాదే
మనవుఁ డఖిలార్థసిద్ధిమంతుడగుటల్;
జ్ఞానము విద్యాధీనము
కానన్ గష్టించి విద్య గఱవుము; సుమతీ!

26. ఏనుంగులు సింగంబులు
వానరములు బెలుఁగుబంట్లు వ్యాఘ్రములు నరా
ధీనంబు లగుట, యాతని
ధీనీతి మహత్త్వమంచుఁ దెలియుము; సుమతీ!

27. స్నానమున మేనిముఱికియు,
జ్ఞానమున మనోమలంబు, శబ్దాగమ వి
జ్ఞానమున నుడిదొసంగులు,
పూని తొలగించుకొనుము పూర్ణత; సుమతీ!

28. ఎంతెంతచదువు చదివెద
వంతంతకొఱంత యునికి యది విశదమగున్;
ఎంతెంత యది యపూర్ణమొ
అంతంత వృథాభిమాన మడరును; సుమతీ!

29. వేసమున కేమి? చాకలి
నాసించిన, వలువ లెట్టివైన లభించున్!
భాసురమగు విద్య, చిరా
భ్యాసంబునఁ గాక యెరవు కబ్బునె? సుమతీ!

30. విననేర్చు బధిరుఁ, డంధుఁడు
కన నేర్చున్, నడువ నేర్చు ఖంజుఁడు బళిరా!
అనవరత పరిశ్రమమున
నెనయంగారాని సిద్ధి యెయ్యది? సుమతీ!

31. నీకన్న నధికులం గని
శోకించిన నేమిఫలము? సుస్థిరమతివై
యాకొలఁదివాఁడ వగుటకు
వీఁకన్ యత్నింపు మీవు విసువక; సుమతీ!

32. ధన మున్న, ధాన్య మున్నన్
ఘనవైభవ మున్న, శాస్త్ర కౌశల మున్నన్
గొన మొకటి లేకయుండిన
ననయమ్ము నిరర్థకము లన్నియు; సుమతీ!

33. జాతి యేదియైనఁ గాని,
పూతచరిత్రుండు లోకపూజ్యుండగు; దు
ర్నీతిపరుఁ డెట్టి యున్నత
జాతి జనించినను నధమజన్ముఁడ; సుమతీ!

34. ప్రాఁత దని కొనకు మెదియును,
నూతనమని త్రోయఁబోకు న్యూనాధికతల్
చేతనమున నరసి, గుణసం
ఘాతం బెటనుండు దానిఁ గైకొను; సుమతీ!

35. సుగుణంబు లెల్ల నొక్కచో
నొగి నుండునే యొక్కఁడొక్కఁ డెక్కడఁగాకన్?
మొగలికి ఫలములు గలవె?
తగఁ బవసకుఁ బూలు కలవె? ధారుణి; సుమతీ!

36. పలుకుము సత్యముగా, మఱి
పలుకు మటు ప్రియమ్ము గాఁగఁ బలుక కసత్యం
బులు ప్రియము లంచు, సత్యం
బులు పలుకకు మప్రియంబులు మూర్ఖత; సుమతీ!

37. సత్యమునకంటె ధర్మము,
హత్యన్ గావించుటకంటె నతిపాతకమున్
ప్రత్యాశకంటె నూఱట
మృత్యూద్ధతికంటె భయము నెయ్యది? సుమతీ!

38. తప్పొక్కటి చేసి, దానిం
గప్పఁగ ననృతంబు వేఱొకటి చెప్పినచోఁ
దప్పు ద్విగుణీకృతం బగు;
ఒప్పుకొనినఁ దొలియఘంబు నుడుగును; సుమతీ!

39. తప్పకు మాడినమాటను,
చెప్పకు మనృతంబు నెట్టి చెడువేళను, పైఁ
గప్పకుము మలినవస్త్రము,
విప్పకు మాప్తుల రహస్యవృత్తము; సుమతీ!

40. భూతహితంబునకంతెను
ప్రీతికరం బొండు లేదు విను మీశునకున్,
భూతాపకృతికి మించిన
పాతకమును లేదు మార్త్యపంక్తికి; సుమతీ!

41. జన్నము లని జాతర లని
పున్నెమునకు భూతకోట్లఁ బొలియింప కవి
చ్చిన్నసుగుణములపెంపున
నున్నతి నార్జించి సుగతి నొందుము; సుమతీ!

42. ఉపనిష దధ్యయనంబుల
జపములఁ దపముల సమాధి సంయమములఁ దో
రపుఁ పుణ్యమెంత, యంతయు
నుపకారపరుండు పొందు నుఱకయ; సుమతీ!

43. అపకారుల కైనను
ఉపకారము చేయుచుందు రుత్తము, లల గం
ధపుఁజెట్టు తన్ను నఱికెడి
కృపాణికకుఁ దావిగూర్చు రీతిని; సుమతీ!

44. క్షీరములు ద్రావి, సర్పము
ఘోరంబగు విష మొసంగు; గో వన్నఁ, దృణాం
కూరము దిని క్షీరము లిడు;
నీరీతిది కుజనసుజనవృత్తము; సుమతీ!

45. ఆరోగ్యమె యైశ్వరం
బారోగ్యమె యింద్రభోగ మపవర్గమునన్
ఆరోగ్యమె సకలార్థము
లారోగ్యవిహినుజన్మ మధమము; సుమతీ!

46. కాయపరిశ్రమ మింతయుఁ
జేయక, బుద్ధిశ్రమంబు చేయుట యెల్లన్
లేయిసుక నేలపై న
త్యాయుతసౌధంబు కట్టునటువలె; సుమతీ!

47. ఒళ్ళు చెడఁదిరిగి, ముప్పున
భల్లాతకసేవ పడఁగోరుట, తా
నిల్లు దరికొనుచు నుండఁగఁ
జల్లాఱుప బ్రావి త్రవ్వు చందము; సుమతీ!

48. ఒడలు చెడు, మతి నశించును
విడిముడి వితవోవు, యశము వీసరపోవున్
కుడు పుడుగుఁ, గూలు మనుగడ,
యొడరులకున్ మద్యపాన మెల్లర; సుమతీ!

49. కొంచమున కేమి లెమ్మని
కొంచక కలు ద్రావవలదు కూపంబుదరిన్
' కించిత్తు ' కాలుజాఱినఁ
బంచత్వము గాక కలదె బ్రతుకును; సుమతీ!

50. మనవచ్చు, మనుపవచ్చున్,
దినవచ్చున్, బెట్టవచ్చు దీనులదుఃఖం
బును దీర్చవచ్చు, ధనముం
డిన నేయదిసేయరాదు నిజముగ; సుమతీ!

51. దుర్జనులయడుగు లొత్తక,
భర్జింపక సాధుజనుల వ్యవహారములం
దార్జనము సెడక, సుఖముగ
నార్జించిన దల్పమైన నధికమ! సుమతీ!

52. జలభరమున జలదంబులు
ఫలభరమునఁ బాదపములు వ్రాలును జుమ్మీ;
అలఘుమతు లైనవారికి
గలిమి వినమ్రతన కూర్చు; కాంచుము; సుమతీ!

53. పరికింప విషము విషమే
పరధనము విషంబుగాక వసుమతి విస మొ
క్కరిఁజంపు పరధనంబో
పొరిపుచ్చుఁ గుటుంబమును సమూలము; సుమతీ!

54. పరకాంతలఁ దల్లులఁగాఁ
బరధనము విషంబుగాఁగఁ బరవిహితకృతిన్
బరమార్థముగాఁదలఁచెడు
పురుషుం డెవఁడైన లోకపూజ్యుడు; సుమతీ!

55. పగలిటివెంటన్ రాతిరి,
తగ రాతిరివెంటఁ బగలు తార్కొనుభంగిన్
సుగమువెనువెంట వగయును,
వగవెంటన్ సుగమువచ్చు వసుమతి సుమతీ!

56. బురదన్ నీరును, నీటన్
బురదయు, నిరువుకొనియున్న పొలుపున దుఃఖాం
తరమున సౌఖ్యమ్య్, సౌఖ్యాం
తరమున దుఃఖము గలదు తథ్యము సుమతీ!

57. సిరులందు సిలుగులందున్
దిరముగ నొకరహిన యుంద్రు తేజస్వులు; భా
స్కరుఁ డుదయవేళ రక్తుఁడు;
అరసంజను గూడనాతఁ డట్టిఁడె సుమతీ!

58. పొంగకుము మేలువచ్చినఁ,
గ్రుంగకు మటఁ గీడు తారుకొన్నను, రెంటన్
సంగంబు విడిచి ధర్మము
సాంగోపాంగముగ నీవు సలుపుము సుమతీ!

59. తొలిచేసిన కర్మంబులు
ఫలోన్ముఖములైన వానిఁ బాపఁగ వశమా?
విలు విడిచిన బాణము, న
వ్వల మరలుప నజునకైన వశమా? సుమతీ!

60. మ్రోలం బ్రియంబు లాడుచు
వాలాయము వెనుకఁ గార్యభంగము సేయున్
నూలుకొను పాపకర్ముఁడు
పాలు పయిం దోఁచు గరళపాత్రము సుమతీ!

61. నీతులు పదివేల్ నేర్చినఁ
జేతోగతి మాఱ దెందుఁ జెనఁటులకు, యుగ
వ్రాతంబు నీటనున్నను
రాతికి మెత్తదనంబు రాదుర సుమతీ!

62. ఉన్నతమగు స్థానంబున
నున్నంతనె నీచపురుషుఁ డుత్తముఁ డగునా?
మిన్నంటు మేడకొనఁ గూ
ర్చున్నను, కాకంబు ఖగవరుండటె? సుమతీ!

63. కఱటులకు దుష్టకార్య
చరణంబున నేర్పు పెద్ద సాంద్రతమ స్సం
భరిత నిశయందు, ఘూకో
త్కారమునకున్ దృష్టి పెద్ద ధారుణి సుమతీ!

64. పాలెంత మంచి వైనను,
హాలరసపాత్ర నున్న నర్హము లగునా?
మేలైనవిద్య యైనను
పాలసుకడనున్న నంతపాటిదె సుమతీ!

65. అప్పు తలమీఁద నుండఁగ
విప్పుగ విభవములఁ దూఁగు విభ్రాంతుడు, దా
నిప్పంతుకొన్న గృహమునఁ
దప్పక నిదురించు దుర్విదగ్ధుడు సుమతీ!

66. ఆలుం బిడ్డల యక్కఱ
వాలాయము తీర్పఁబాటు పడనోపక, త
త్త్వాలు పదాలుం జదివెడు
బాలీశుఁడు గృహస్థు గాఁడు పశువుర సుమతీ!

67. ముక్తికని గేహమున్ విడి,
ప్రాక్తనవాసనల మరల భార్యాదులపై
రక్తిఁగొను ధర్మనిష్ఠా
రిక్తుఁడు రెండిటికిఁ జెడిన రేవఁడు సుమతీ!

68. కరి పెద్ద, దానికంటెన్
గిరి పెద్ద, పయోధి దానికిం బెద్ద, చదల్
మఱిపెద్ద దానికంటెను
అరయఁగ నన్నిటికిఁ బెద్ద యాశయె సుమతీ!

69. శోకహత మని యెఱుంగుము
లోకం బఖిలంబు దీనిలో లవమైనన్
బోకార్ప నోపె దేనియు
నీకైవడి ధన్యు డెవఁడు నిజముగ సుమతీ!

70. పనిపాట లుడిగి యాచన
మనఁ గోరెడిసోమరులను మన్నింపకు త
జ్జను లితరుల కష్టార్జిత
ధనమును బగటన హరించు సస్యులు సుమతీ!

71. కుంటికి, గ్రుడ్డికిఁ, దేవులుం
గొంటుకు, ముదుసలికి, ననదకు, దరుద్రునకున్
సొం టిడక పెట్టుకంటెను
ఘంటాపథ మెద్ది పుణ్యగతికిని సుమతీ!

72. కలవాఁడు, త్యాగశీలత
కలవాఁడు, గుణంబు నెఱుఁగఁ గలవాఁడు, దయో
జ్జ్వలుఁ డొక్కఁడైన నుండుట
ఫలవృక్షం బూరినడుమఁ బండుట సుమతీ!

73. బలీయుం డైనను నిష్ఫలుఁ
గొలువరు జను లలఁతి నైన గొలుతురు ఫలదున్
సలిలార్థులు వార్ధిన్ విడి
కేలనన్ గూపములఁ జేరు క్రియగా సుమతీ!

74. సిరియెంత యున్న, లోభికి
నఱగొఱయే యనుభవాప్తి అదియెట్లన్నన్
చెఱువెంత నిండియున్నను
కొఱమాలిన గదుకు నీళ్ళె కుక్కకు సుమతీ!

75. కాళిక పగఱం గూల్పదె?
శ్రీలక్ష్మి సమస్తరాజ సేవిత గాదే?
ఏలదె కళల సరస్వతి?
స్త్రీలేమిటఁ దక్కువైరి చెప్పుము సుమతీ!

76. అమృతంబు బాలభాషిత
మమృతంబు ప్రియోక్తిసహిత మగు నాతిథ్యం
బమృతంబు నృపబహుకృతి
అమృతం బనుకూల యగు కులాంగన సుమతీ!

77. నెలతోడఁ గ్రుంకుఁ గౌముది
జలద్దముతోడన్ నశించు సౌదామని సా
ద్వులు పతులకు ననుగతులని
తెలుపున్ జడములును గూడఁ దిరముగ సుమతీ!

78. కులకాంత కులట యైనన్
చెలికాఁడు కృతఘ్నుఁడైన సేవకుఁ డుర్విన్
బలుమాటలవాఁడైనను
నలవదురా వేఱునరక బాధలు సుమతీ!

79. పరసతులతో, యతులతో
ధరణీశులతోడఁ దల్లి దండ్రులతోడన్
గురుయోగిజనులతోడను
పరిహాసము వలదు చేటు వచ్చుర సుమతీ!

80. ఏపూఁటఁ జేయఁదగుపని
యాపూఁటనె చేయుమీ వనాలస్యముగా
రే పన్నదేమి నిశ్చయ
మాపన్మయమైన తనువునందును సుమతీ!

81. పోయిన క్షణంబు మరలుపఁ
దోయజగర్భునకుఁ దరమె? తోడ్తోఁ గడలిన్
బోయి పడినట్టి నది పా
నీయము క్రమ్మఱుప నెవరు నేర్తురు? సుమతీ!

82. గతమునకై వగవక యా
యతిఁ గూర్చి దురంత చింత నందక యెది ప్ర
స్తుత మది చక్క జరపుము
చతురమతులమార్గ మిదియె శాంతికి సుమతీ!

83. గౌరవముతోడి మనుగడ
యారయ క్షణమైనఁ జాలు నది లేనియెడన్
నూఱేండ్లు బ్రతికెనేనియుఁ
బూరుషుఁడా? పురుగు గాక భూమిని సుమతీ!

84. చెడుఁ గలిమి చెడును గృహములు
చెడు మడులును మాన్యములును చెడు వాహనముల్
చెడు బలము చెడును సర్వము
చెడనిది సత్కీతి యొకఁడె సిద్ధము సుమతీ!

85. ఎప్పటి కేది కావలెనో
అప్పటి కది యగు నటంచు యత్నంబుదెసన్
జప్పపడకు విత్తనిపొల
మెప్పాటను బంద దనుచు నెఱుఁగుము సుమతీ!

86. కలదో లేదో యదృష్టము
తెలియంగా రాదు బ్రహ్మదేవుని కయినన్
గల దనుకొని యత్నింపుము
ఫల మెట్టిది యైనఁ జింతపడకుము సుమతీ!

87. కానిపనికై కడంగకు
మూనినపని వీడకుము నిరుత్సాహమునన్
పూనకుము దీర్ఘచింతను
కానక దొరఁకొనకు మెట్టికార్యము సుమతీ!

88. బాలుండు చెప్పెనేనియుఁ
బోలినపలు కైన వీటి పుచ్చకకొనుమా
ఫాలాక్షుఁడూని చెప్పిన
బోలనిమాటైనఁ గొనకు బుద్ధిని సుమతీ!

89. పరులకు బోధించెడునెడఁ
బరమేష్ఠిసమాను లెల్ల వారును మఱి స్వా
చరణంబు వేళ వచ్చినఁ
బరమేష్ఠియు జగముతోడి వాడుఁర సుమతీ!

90. అతికామంబున రావణుఁ
డతిగర్వముచేత నహుషుఁ డతిదాన సము
న్నతి బలియుఁ జెడిరి కావున
"అతి" వర్జింపంగ వలయు నన్నిట సుమతీ!

91. ధనికులకు చేతు లొగ్గకు
ధనహీనుల నెందు నెల్లిదము సేయకు మీ
వను వెఱిఁగి యెల్లవారల
ప్రణయంబు గడింపు ముచిత నర్తన సుమతీ!

92. చెలిమిన్ మే లొనరింపరు
చెలికారము మాన నెగ్గు సేయుదురు కడున్
బలయుతు లగుదుష్టులతోఁ
జెలిమైనను వైరమైనఁ జేటుకె సుమతీ!

93. చన వధికమైన మన్నన
పొనుగు పడుట యేమి వింత? బోయపడఁతి చం
దనతరుకాష్ఠంబుల నిం
ధనములఁ గావించు మలయనగమున సుమతీ

94. వితరణ విహీను విత్తము
ప్రతిభాన విహీను చండ పాండిత్యంబున్
ధృతిహీను బాహుబలమును
వితథము లీమూఁడు నెట్టి వేళను సుమతీ!

95. లలితములు విరులకంటెను
కులిశంబునకంతె మిగులఁ గ్రూరములు, మహా
త్ముల చిత్తవృత్తులిట్టివి
కలనాళ్ళన్ గానినాళ్ళఁ గ్రమముగ సుమతీ!

96. అసదృశపండితుఁ డైనను
వెస నాశ్రయహీనుఁ డైన వెలుఁగం గలడే?
మిసిమిగల రత్నమైనను
బసిఁడిం బొదువంగఁ బడక వఱలునె? సుమతీ!

97. చెఱకునకు ఫలము చందన
తరువునకున్ విరులు కమ్మదావి పసిఁడికిన్
వరమతులకు నైశ్వర్యము
పొరయింపని బ్రహ్మ మూఢుఁడొ సుమతీ

98. కవికంటె బోధకరుఁడును
రవికంటెన్ దీప్తికరుఁడు రాకాధవళ
చ్చవికంటె హర్షకరుఁడును
భువనత్రయమందులేరు పోలఁగ సుమతీ!

99. కాకిం గసరఁగ నేలా?
కోకిలమును గొసరనేల కూయమటంచున్?
లోకంబు మెచ్చుకవితా
పాకం బది పూర్వపుణ్య ఫలముర సుమతీ!

100. తరువు పువు పూచెనేనియుఁ
బరిమళము వెలార్ప గంధవాహుఁడు వలదా?
వరకవితకైన సరసుల
కరుణాప్తింగాక వ్యాప్తి కలదే సుమతీ!

101. కవిలోక విశ్రుతుఁడు సా
ధువు సుబ్రహ్మణ్యశర్మ దుర్భాన్వయ సం
భవుఁ డిది భవద్ధితార్థము
చవిపుట్ట రచించె దీనిఁ జదువుము సుమతీ!

No comments:

Post a Comment