Saturday, March 1, 2014

రామమోహనుక్తి రమ్య సూక్తి - చెరుకు రామ్మోహన రావు


రామమోహనుక్తి రమ్య సూక్తి
చెరుకు రామ్మోహన రావు

1. శ్రీరామ మోహనంబుగ
చిరుచేదగు వాస్తవాల చిక్కగయుండే
చెరుకు రసమందు కలుపుచు
కరయుగళము తోడనిత్తు కవితా పాత్రన్ 

2. దండగ రాముడ, నీ కై
దండల తగు అండనివ్వు దాక్షిణ్యనిధీ 
దండముల కూర్చి దండిగ 
దండగ మెదవైటు నేకదంతుడ నీకున్ 

3.  అక్షరాల తల్లి నారాధనము జేసి 
వ్రాయ బూనుకొంటి వరుసగాను 
ఆమె కలమునందు ఆసీనమైయొప్ప 
రామమోహనుక్తి రమ్య సూక్తి

4.  కచ్ఛపంబు నడకగల మందబుద్ది లో 
కచ్చపీ రవంబు కరుణ మీటి 
వరమునొసగె వ్రాయ వాణి పుస్తక పాణి 
రామ మొహనుక్తి రమ్య సూక్తి

5. తియ్యనైన చెరుకు తినిన యట్లుగ నుండు 
తెలుగు భాష మనది తెలియ బరుప 
పంచమమ్మున పికము పాడినట్లుగ నుండు 
తెలుగు భాష మనది తెలియ బరుప 
ఘన మత్త వేదండ గమనమట్లుగ నుండు 
తెలుగు భాష మనది తెలియబరుప 
కృష్ణ గీతామృతం గ్రోలినయట్లుండు 
తెలుగు భాష మనది తెలియబరుప 

అన్ని యందము లొకచోట యమరజేసి 
ప్రాణములు పోయ నాబ్రహ్మ ప్రబల రీతి 
వాణి పుత్రికయై జెలగెను వసుధ యందు 
తెలుగు పేరున మన భాష తేజరిల్ల 

6.  వ్యాకరణము నేను వల్లే వేయగలేదు 
గురు లఘువులేవి గురుతు లేవు 
చేత నాది కాని చేయించే శ్రీశుండు 
రామమోహనుక్తి రమ్య సూక్తి 

7.  మధుర భక్ష్యమ్ముల మనసు కల్గినవారి 
పాలిట మైసూరు పాకు కవిని 
తాంబూల చర్వణ తపన గల్గినవారు 
పలవరించు తమలపాకు కవిని 
కవిమత్త వేదండ కావ్యమ్ములందలి 
సార సంగ్రహమెల్ల సాకు కవిని 
సంఘ రుగ్మతలెల్ల సరసంపు బాసలో 
ఎరిగియుండిన రీతి నేకు కవిని 

రాగామేరుగాక పాడు పరాకు కవిని 
సరస హాస్యంపు కవితల సరకు కవిని 
సొగసు బట్టలు ధరియించు సోకు కవిని 
నేను సుకవిని కాలేను నే కుకవిని 

8.  ఆంద్ర భాష యందు అభిరుచి దప్పించి 
భాషయందు నాకు పట్టు లేదు 
వాస్తవములనెల్ల వాడుక భాష లో 
చాటు కవిని నిజాము చాటు కవిని 

9.  పద్యమునకు కాస్త ప్రాణంబు సమకూర్ప 
జతన మొకటి నేను చేసినాను 
తప్పులెల్ల మీరు దయతోడ మన్నించి 
సంతసింప నేను సంతసింతు 

10. సుబ్బన్న గారు యిచ్చిరి 
అబ్బుర పడ  జేసి కాఫి యాదర మొదవన్ 
నిబ్బరముగ త్రాగినంత 
అబ్బెను ఈ శతక రచన ఆయన చలువన్ 

11. కాఫీ పొడికి తానూ కవితెంట కలిపెనో 
పాలు పంచదార ప్రీతి జేర్చి 
కరము తోడ నాకు కవితామృతము నిచ్చె 
అట్టి మాన్యతముని కంజలింతు 

12.  అమ్మ లేని నన్ను అమ్మమ్మ ఏ పెంచె
అన్ని తానెయౌచు ఆది నుండి
వీడిపోయే నన్ను విద్ పిల్పు మేరకు
అట్టి తల్లి మ్రొక్కి అడుగు వేతు

13.  తల్లిదండ్రి గురువు దైవంములను గొల్చి
మన సుకవులనెల్ల మనసు నందు
మ్రొక్కి పేర్మి మీర  మొదలు పెట్టుచునుంటి
రామమోహనుక్తి రమ్య సూక్తి 

14.  కొన్ని పార్ట్సు లూజు కొన్నేమో నో యూజు
తీసిరింక కొన్ని తీరుబడిగ
పార్ట్సు గోలయేల హార్తున్న నా సతికి
రామమోహనుక్తి రమ్య సూక్తి 

15.  బస్సు ఒకటి యుండు పాసిజరులు మెండు
కదల టైర్లు పగులు కదల లేక
ఆశ అతిశయింప అగచాట్లధికమిది
రామ మొహనుక్తి రమ్య సూక్తి 

16.  గచ్చ పొదలయండు పుచ్చ పొడమినం
గచ్చ లెట్లు వచ్చు పుచ్చ లిచ్చు   
నీటి గల్గు వాని నైజమ్ము రా ఇది   
రామమోహనుక్తి రమ్య సూక్తి 

17. ఇంటి టాంకు నందు ఇంకిపోయిన నీరు 
 నల్ల ట్రిప్ప నేతలు నడచు ధార 
బుద్ధి లేని వాని సుద్ది ఈలాగురా 
రామమోహనుక్తి రమ్య సూక్తి 

18.  చెవిటి వాని చెవిని చేరి శంఖమునూద 
ఎముక కొరుకు చుంటి వేల యనును 
తెలివి లేని వాని తెరుగు ఈ రీతిరా 
రామమోహనుక్తి రమ్య సూక్తి 

19.  త్రాగు నీటి గొయ్యి త్రవ్వి ఉంచుత తప్పు 
కప్పు వేయకున్న కలుగు ముప్పు 
ఆచరించ దలచి అలసత్వ మేటికి
రామమోహనుక్తి రమ్య సూక్తి 

20.  తల్లి విల్లు చూడ తండ్రియే మరి నారి 
కొడుకు బాణమౌను కోర్కె గురుతు
గురిని కూర్చుకొన్న గురుతును తాకదా 
రామమోహనుక్తి రమ్య సూక్తి 
       
21.   పేస్టు ట్యూబునుండి ప్రెస్సు చేయగ వచ్చు
తిరిగి లోనికంపి తీర లేము 
థాటు లేని పనుల తలపోయ నిట్లురా 
రామమోహనుక్తి రమ్య సూక్తి 

22.   పూవు మంచు చేరి పులకింత కలిగించు 
తావి గాలి చేరి తనివి తీర్చు 
మంచి మనిషి చేరి మాన్యత కలిగించు 
రామమోహనుక్తి రమ్య సూక్తి 

23.   కాలమొకటి మనకు కలిసి రాకుండిన 
తాడు పామే యగును తలచి చూడ 
కావ గల్గు వాడు కైలాస పతి జూడు 
రామమోహనుక్తి రమ్య సూక్తి 

24.  అద్దమేమొ  నీదు ఆకారమును జూపు 
ఆత్మా జూపబోదు అరయగాను 
మిగుల ప్రేమయేల మిధ్య రా బింబంబు 
రామమోహనుక్తి రమ్య సూక్తి 

25. సౌండు సిస్టమందు రౌండు  డిస్కును పెట్టి 
పాపు రాపు బీట్ల పరవశింప 
ఆదరిపోవు నిల్లు బెదరును చెవు లిది 
రామమోహనుక్తి రమ్య సూక్తి 

26.  తిండి నలుసు పట్టి తిరముగ గోడపై  
పడుచు లేచి చీమ ప్రాకుచుండు 
పట్టుదలకు జయమె ఫలితంమురా ఇది 
రామమోహనుక్తి రమ్య సూక్తి 

27.  ఆపిలేమో చూడ అందమైయున్నను 
మచ్చ పాదమే నాన్న పుచ్చ గలదు 
రూపమేమి చేయు రుగ్మత ముందిది 
రామమోహనుక్తి రమ్య సూక్తి 

28. కలిమిలేము లెపుడు కలిసి యుండగ లేవు 
మంచి చెడ్డ లేమొ మసలు కలిసి 
భారతమున కర్ణు పాత్రను గమనించు 
రామమోహనుక్తి రమ్య సూక్తి 

29.గళము వ్యక్తిదేంట గంభీరమైనను 
సరుకు లేని ఎడల సరుకు గొనరు
బుద్ది లేని యట్టి పెద్దలీలాగురా 
రామమోహనుక్తి రమ్య సూక్తి 

30. వనము లోన మావి వనరుగా పెంచినా 
కలుపు వున్నా ఫలము కలుగ బోదు 
తలపులధికమైన  తపమిట్లురా ఇది 
రామమోహనుక్తి రమ్య సూక్తి 

31. మంచమున్న యంత మరి నీవు పడుకొన్న 
మంచి నిద్ర వచ్చు మసల కుండ 
కాసు కలిగినంత ఖర్చు ఈ లాగురా 
రామమోహనుక్తి రమ్య సూక్తి 

32. చెప్పుకింద పైరు చెడును దాన్యంబీదు 
చెడ్డ క్రింద చేరు దొడ్డ ఇట్లు 
వివర మరసి చూడ విధి రాతరా ఇది
రామమోహనుక్తి రమ్య సూక్తి 

33. దాహమున్నవాని దరి ఉప్పు నీరున్న 
త్రాగలేడు  త్రాగి తనియ లేడు 
సాయపదగాలేని సావాసమిట్లిది 
రామమోహనుక్తి రమ్య సూక్తి 

34. జలధి నిండియుండు జలము త్రావగరాదు 
పాము గాచు నిధిని బడయ రాదు 
అనుభవించలేని ఆస్తులీలాగురా 
రామమోహనుక్తి రమ్య సూక్తి 

35. చుక్క యన్న మోజు చుక్కలన్నను మోజు 
తెరల చుక్కలన్న తగని మోజు 
చుక్క దగ్గరున్న చూడరు ధరలిది  
రామమోహనుక్తి రమ్య సూక్తి 

36. విధి విదానమేపుడు వివరించగా రాదు 
రాత మార్చ మనకు చేత కాదు 
శకుని ధర్మజునకు శనియాయె  చూడిది 
రామమోహనుక్తి రమ్య సూక్తి 

37. అరటి తొక్క పైన ఆతండు కాలుంచి 
గాయపడెద నంచు కలత పడగ 
జారి పదేనతండు జలజాక్షి పైనిది 
రామమోహనుక్తి రమ్య సూక్తి 

38. సెక్సు వాయలెన్సు చెప్పశక్యము కాని 
చెడుగు చిత్ర చయము చెలగి భువిని 
మంచి యన్నదెపుడొ మటుమాయమాయెను 
రామమోహనుక్తి రమ్య సూక్తి 

39. నియమ నిష్ఠ లెల్ల నీళ్ళ పాలాయెను 
నీతి  యన్నదాయే నేతి  బీర 
కాల మహిమ కాదు కలి మహిమై యుండు 
రామమోహనుక్తి రమ్య సూక్తి 

40. పాలిటిక్సు  నీట పడ  నీతిమంతుడు 
నీతి బరువు తగ్గు నిక్కముగను 
ఆర్కే మెడిసు సూత్ర మరసిన తెలియదా
రామమోహనుక్తి రమ్య సూక్తి 

41. పగలు రాత్రి యనక పనిచేసి డబ్బుకై 
పతుల సతుల ప్రేమ పలుచనాయె 
దైవచింత కరిగే డైవర్సు పెరిగెరా 
రామమోహనుక్తి రమ్య సూక్తి 

42. పాపపుణ్యములను పరమెశ్వరు డెరుగు 
మంచి చేయవయ్య మనసు మెచ్చ 
కాయమేప్పుడైన మాయమ్ము నగు నిది 
రామమోహనుక్తి రమ్య సూక్తి 

43. కప్రమొకటి యుండు కాదు శుభ్రతను గల్గి 
కాలి కరుగు వరకు కాంతి నిచ్చు 
సత్వ మూర్తి యైన సాధువీరీతిది 
రామమోహనుక్తి రమ్య సూక్తి 

44. అన్ని యున్న ఆకు అణిగి యుండును గాని 
ఏమి లేని యాకు ఎగిరి పడును 
విజ్ఞుడిట్లు మరియు అజ్ఞుండు అట్లురా 
రామమోహనుక్తి రమ్య సూక్తి 

45. బావి లోని కప్పు భావించు నీరీతి 
బావి కాక వేరు బ్రతుకు లేదు 
గడప దాట నట్టి ఘనుడిట్లురా ఇది 
రామమోహనుక్తి రమ్య సూక్తి 

46. మంచి చేయనెంచు మనసున తా వంగి 
చెప్పుకింద తెలు చేర దీయ 
కుట్టి గోడ నెక్కు, కుజనులీలాగురా 
రామమోహనుక్తి రమ్య సూక్తి 

47. కంకి తిన్నఎదల కడుపు నిండును గాని 
ఎన్ను తిన్న యెడల ఏమి ఫలము 
తారతంయమేరిగి తగు పని చేపట్టు 
రామమోహనుక్తి రమ్య సూక్తి 

48. పాలు పంచదార పసుపును చేరిచి 
మిరెము సొంటి పొడిని మితము గాను 
కలిపి కాచి త్రావ కలుగదు జలుబిది 
రామమోహనుక్తి రమ్య సూక్తి 

49. ఎన్ని సోకులున్న ఎంతటి విలువైన 
సిమ్ము లేక సెల్లు చెల్లబోదు 
మగని తోడూ లేని మగువిట్లురా ఇది 
రామమోహనుక్తి రమ్య సూక్తి 

50. బాసు మాట కెపుడు బల్కొట్టు చుండిన 
బడయవచ్చు పదవి పైన పదవి 
కార్పొరేటు లందు కల్చరు గమనించు 
రామమోహనుక్తి రమ్య సూక్తి 

51.అరవ కన్నడములు ఆముదము కస్తూరి
ఒకటి తెలియలేము ఒకటి ఘాటు
తెలుగు తేనే ఊట తేటరా గమనించు
రామమోహనుక్తి రమ్య సూక్తి

52. కాసు జమను చేయ కన్యాకుమారిలో
చిటికె లోన జేరు శ్రీనగరుకు
కోరు బేంకులొచ్చి కురుచయ్యె దూరమ్ము
రామమోహనుక్తి రమ్య సూక్తి

53. చేరెడంత రసము చెరుకును యాచింప  
ఉలుకు పలుకు లేక ఊరకుండు 
మరన పెట్టి త్రిప్ప మరి యిచ్చు రసమది
రామమోహనుక్తి రమ్య సూక్తి 

54.  గళము దాటనీడు గరళము నీశుండు 
శశిని శిఖన జేర్చె శాశ్వతముగ
మంచి తప్ప ఘనులు మారేమి తెలుపరు
రామమోహనుక్తి రమ్య సూక్తి 

55.  అగరు బట్టి మిగుల అఘ్రాణమిచ్చును
తానూ కాలుచుండి తరిగి తరిగి 
నీతిమంతు నియమ నిష్ఠలీలాగురా 
రామమోహనుక్తి రమ్య సూక్తి 

56.  ఎట్టి ఛానలైన ఏముంది దానిలో
వాయలెన్సు సెక్సు వరద తప్ప 
నీతి నెల్ల వారు గోతిలో పాతిరి 
రామమోహనుక్తి రమ్య సూక్తి 

57.  దీప ఆవళింత దివ్యమ్ము అని చెప్పు 
అయ్య మాట మొరకు ఆలకించి 
ఆవలింత ఇంత అపురూపమా యనె 
రామమోహనుక్తి రమ్య సూక్తి 

58.  పీయెసెల్వినెక్కి పిలువక ధరలెల్ల 
ధరను దాటి పోవ తమకు తాము 
నెల జేర్చనెల్ల నేత లెగెదరిది
రామమోహనుక్తి రమ్య సూక్తి 

59.  కట్టుకొన్న భార్య గడప దాటాడు నాడు 
ధన మాదాలు నాడు దరికి రావు 
కర్మమొకటె నీదు కడదాక వచ్చును 
రామమోహనుక్తి రమ్య సూక్తి 

60.  షిట్టు నోటికొచ్చె శివశివ మరుగాయె 
కోకు త్రాగు చుంట సొకులాయె 
అరయ జంకు ఫుడ్డు ఆహారమిప్పుడు
రామమోహనుక్తి రమ్య సూక్తి 

61.   మిక్సి గీజరెంత మెలైనవైనను
పవరు లేక యున్న పనికి రావు 
పవరుకున్న పవరు పరికించి చూడిది 
రామమోహనుక్తి రమ్య సూక్తి 

62. గొప్ప వారి కొల్వు కోరిన వలయును
చాకచక్య మొకటి చాలినంత
దంత పంక్తి నడుమ దనరు నాలుక జూడు 
రామమోహనుక్తి రమ్య సూక్తి 

63.  మాట వలన జరుగు మహిలోన కార్యముల్ 
మాట వలన పెరుగు మనిషి ఘనత 
మాట నేర్వకున్న మనుగడే లెదిది 
రామమోహనుక్తి రమ్య సూక్తి 

64.   మంచి చేతుమంచు మరి మరి నమ్మించి
మనల మోసగించి మాట మార్చి 
మంత్రులైనయట్టి మహనీయులను జూడు 
మంచి చేతుమంచు మరి మరి నమ్మించి
రామమోహనుక్తి రమ్య సూక్తి 

65. చెలిమి చేయ వచ్చు చాల తేలికగానూ 
నిలుప దుర్లభంబు నిజాము గాను 
మనసు కోతియన్న మాటను గమనించు 
రామమోహనుక్తి రమ్య సూక్తి 

66. కాలమెంత జూడ కమనీయమైనదో 
కాలమంటే జూడ కరుకుదోయి 
రాజు రౌతు యగును రౌతౌను రాజిది 
రామమోహనుక్తి రమ్య సూక్తి 

67. జుట్టు ఒత్తుగున్న చూపరి కింపుగా 
ముడిని వెయ వచ్చు జడను గూడ 
సొత్తు వున్నా వారి సోకిట్లు యుండిది 
రామమోహనుక్తి రమ్య సూక్తి 

68. పాడుపడిన గుంట  పరికించి చూడగా 
పకముండు క్రింద పైన నీరు 
మొసగానిమనసు ముఖమిట్లురా యిది 
రామమోహనుక్తి రమ్య సూక్తి 

69.  పవరు ఫుల్లు కారు పరుగులేట్టేడు కారు 
రోడ్డు బాగు లేక రొప్పుచుండు 
ఇలా పుకారు కిట్టి ఇబ్బంది లేదిది 
రామమోహనుక్తి రమ్య సూక్తి 

70. అమ్మ కమ్మనైన అన్నమ్ము కరువాయె 
తల్లి పాలనిచ్చు తరము మారె 
అమ్మ గతము గాంచ ఆయమ్మ యుగమిది 
రామమోహనుక్తి రమ్య సూక్తి 

71. కాలమొకటి మరియు కలము వేరోక్కటి 
నంది పంది  చేయు పంది  నంది
రాత బాగాయున్న రానిదేమున్నది 
రామ మొహనుక్తి రమ్య సూక్తి 

72.  ఇహము పరము లేక ఇంటిలో మగడుండె 
చవులు లేని కూర చట్టి నిండె 
రాత బాగా యున్న రానిదేమున్నది 
రామ మొహనుక్తి రమ్య సూక్తి 

73.  నవ్వు కలుగజేయు నయనమ్ములకు హాయి 
నవ్వు రుగ్మతలను నయము జేయు 
నవ్వు లేని జన్మ నరజన్మ మెట్లిది 
రామ మొహనుక్తి రమ్య సూక్తి 

74.  నారి కట్టు బట్ట నాగరీకము దెల్పె 
కురుచ బట్ట యున్న కూడె ఘనత 
మాన మిగిరి పోవ మరియేమి మిగులురా 
రామ మొహనుక్తి రమ్య సూక్తి 

75. తాము డబ్బు నంత దాపెట్టి దాపెట్టి 
కొడుకు చేతికివ్వ కూర్మి తోడ 
తల్లి దండ్రి నంత తనయుండు వెలివేసే 
రామ మొహనుక్తి రమ్య సూక్తి 

76. కడుపులోన విసము కాన జిహ్వ పై తేనె 
మెసవ కలిపి యిచ్చె మోసగాడు 
హంస గుణము లేక హరియిన్చునా చూడు 
రామ మొహనుక్తి రమ్య సూక్తి 

77. తల్లి అల్లమాయె తన భార్య బెల్లము 
తనయులోచ్చినంత తండ్రి దవ్వు 
నేటి సుతుల ప్రీతి నిజముగా ఈ రీతి 
రామ మొహనుక్తి రమ్య సూక్తి 

78. బాల్య స్నేహితమ్ము పనికిరాదీనాడు 
గుణము చేలిమిచేయ గురుతు గాదు 
స్టేటసుండ వలయు స్నేహమ్మునకు యిది 
రామ మొహనుక్తి రమ్య సూక్తి 

79. ఏకదంతు భక్తీ ఎక్కసమైపోయి 
రోడ్డుమీదికొచ్చె  రోత  సేయ 
భక్తీ కాదు నేడు భుక్తి మార్గమ్మిది 
రామ మొహనుక్తి రమ్య సూక్తి 

80. మంచి యొకటి చాలు మనుషులొక్కటి సేయ 
పగలు ద్వేషములను పక్కనుంచి 
కులములేట్లు యగును కొలమానమిలనిది 
రామ మొహనుక్తి రమ్య సూక్తి 

81. బలము కల్గె నంచు బలహీనులెల్లర 
తప్పులోప్పులనక తానుతిట్టి 
బలము తగ్గినంత బానిసౌరా యిది 
రామ మొహనుక్తి రమ్య సూక్తి 

82.  అందు డబ్బు లెల్ల అతిగ ఖర్చులు చేసి 
బరువు బాధ్యతలకు బ్రతుకు చేర్చి 
పెన్షనర్లు పాడెడు పెను బాధ చూడరా 
రామ మొహనుక్తి రమ్య సూక్తి 

83.  చదువు పదవి పెళ్లి సర్వమ్ము సమకూర్చి 
తృష్ణ లెల్ల విడిచి తృప్తి తోడ 
బరుగు పెన్షనరును బహు దొడ్డ యందురు 
రామ మొహనుక్తి రమ్య సూక్తి 

84. సాగరమ్ము సుమ్ము సంసారమన్నను 
ఈదలెని నారును గాఢ చూడు 
కంప మీద పడ్డ కాకి చందమ్మిది 
రామ మొహనుక్తి రమ్య సూక్తి 

85. తేనే తెచ్చి తెచ్చి తేనే పట్టున చేర్చి 
తానూ త్రాగకుండా తరలిపోవు 
తేనెటీగ జూచి తెలియరా త్యాగమ్ము 
రామ మొహనుక్తి రమ్య సూక్తి 

86. కన్న బిడ్డ లాగ కాపాడెదను నేను 
కూడు గుడ్డ తప్ప కూర్చి యన్ని 
అన్న వాడు సాకు ఆ బిడ్డ గతి చూడు 
రామ మొహనుక్తి రమ్య సూక్తి 

87. బేగు చేత బూని బిగ్ బజారుకు పోయి 
కోరినంత సరుకు కొన్న పిదప 
పర్సు మరచితంచు పరుగెత్తె మొరకిది 
రామ మొహనుక్తి రమ్య సూక్తి 

88. సొత్తు మనది కాక సోకు మనదియైన 
వేయగాలము అన్ని వేషములను
చలన చిత్ర నటుల విలసనమ్మిట్లురా
రామ మొహనుక్తి రమ్య సూక్తి 
      
89. సెక్సు ఒండు మరియు సెన్సెక్సు వేరొండు 
పెరుగుచున్న హాయి పెరుగు చుండు 
తరిగి పోవుచున్న తలకిందులే మరి 
రామ మొహనుక్తి రమ్య సూక్తి 

90. చవులు గొల్పు మాట చెవులకింపగు పాట 
చిక్కగల్గ మనసు చక్క బడును 
మాట పాట కింత మాహాత్మ్య మున్నది 
రామ మొహనుక్తి రమ్య సూక్తి 
      
91. ఉర్లగడ్డ చేయు వుపకారములు మెండు 
తినుచు గూడ దాని తిట్టుచుండ్రు 
మేలు పొందు చుండి మేలమాడెదరిట్లు 
రామ మొహనుక్తి రమ్య సూక్తి 

92. పచ్చి మిరప బజ్జి బాల్కమ్మగా నుండు
మితము దాటి తినుట హితము గాదు 
ఇష్ట మొకటి గానకింగితమును చూడు  
రామ మొహనుక్తి రమ్య సూక్తి 

93. మూర్ఖులీల్ల జేరి మోసగానిని గొల్వ 
వున్నా సంపదేల్ల వూడ్చి తాను 
చెవిన పూవు బెట్టి చేజారడా యిది 
రామ మొహనుక్తి రమ్య సూక్తి 

94. వేడి మూకుదండు వెన్నెంత జారినా 
మరిగి తీరు వేరు దారి లేక   
చెడును చేరియున్న చేటు నిశ్చయమిది 
రామ మొహనుక్తి రమ్య సూక్తి 

95. ఎంత విద్య యున్న ఎంతటి ధనమున్న 
ఎంత పదవి యున్న ఏమి ఫలము 
తృప్తి యొకటి లేక తిన్నదేట్లరుగిది 
రామ మొహనుక్తి రమ్య సూక్తి 

96. మోసగాళ్ళ నడుమ మసలువాడెప్పుడు 
పదును బుద్ది గల్గి బరగ వలయు 
మకరి కోటి కథను మరువక చదువిది
రామ మొహనుక్తి రమ్య సూక్తి 
      
97. సహన మొకటి మరియు సర్దుబాటింకొకటి
కలిగియున్నవాడు కార్యవాది 
బావినీరు తోడూ బాల్చీని చూడిది 
రామ మొహనుక్తి రమ్య సూక్తి 
      
98. పెద్ద వారి ముందు పెదవి కదపబోకు 
మంచి కలుగు వారి మాట విన్న 
వినుటవలన కలుగు విలువను గుర్తించు 
రామ మొహనుక్తి రమ్య సూక్తి 

99. తల్లి దండ్రి బోల్ప తాల్మిన భూదేవి 
ఆదిశేషు పగిది  అరయగాను 
వారి సుఖము కోరు వారలే తనయులు 
రామ మొహనుక్తి రమ్య సూక్తి 
      
100. అత్త గారి ఇల్లు ఆనంద నిలయమ్ము 
అడిగినంత నివ్వ అల్లునకును 
ఆదరమ్ము తగ్గ నగచాట్లు మొదలౌను 
రామ మొహనుక్తి రమ్య సూక్తి 
      
101. తనది,తండ్రి మరియు తన సహోదరులిచ్చు 
ధనము వాడవచ్చు ధాటిగాను 
అతివ సొమ్ము కొరకు ఆశ పడవద్దిది 
రామమోహనుక్తి రమ్య సూక్తి 

102. ఆది శంకరునకు ఆపైన చక్రికి 
అత్తగారి ఇల్లే ఆశ్రయమ్ము 
హరియు హరుడె మనకు ఆదర్శ ప్రాయమ్ము 
రామమోహనుక్తి రమ్య సూక్తి 

103. వెబ్బు చూచి నేర్వ వేల సంగతులుండు 
వెబ్బు నందు కలుగు గబ్బు కూడ 
మంచి నేర్చుకొన్న మహానీయుదౌడువు 
రామమోహనుక్తి రమ్య సూక్తి 

104. దూర శ్రవణ మొకటి దూర భాషణ మొకటి 
దుడుకు వాని చేతి దురద తీర 
కాన రిమోటు బటను కదా నిల్చె చూడిది 
రామమోహనుక్తి రమ్య సూక్తి 

105. వయసు పెరుగు చుండె వత్సరాలు కరిగె 
చిత్తశుధ్ధి పెంచి శివుని చేరు 
ఓటికుండ నీటి పాటిది వయసిది 
రామమోహనుక్తి రమ్య సూక్తి 

106. అమ్మ మమ్మీ యాయె అయ్యేమో డాడీగ
హాయి బాయి లెల్ల అధికమాయె 
అంటి అంకులనుట ఆచారమిప్పుడు 
రామమోహనుక్తి రమ్య సూక్తి 

107. సుధయె  రాహు జంపెచూడగా నవలీల  
గరళమాయె శివుని కంఠ భూష 
విధి విదానమేరిగి విజ్ఞత గాంచరా 
రామమోహనుక్తి రమ్య సూక్తి 

108. పగలు సూర్యుదోచ్చి పనులను చేయించు 
చంద్రుడొచ్చి రాత్రి చలువ కూర్చు 
అట్టి వారినెపుడు ఆదర్శముగనెంచు 
రామమోహనుక్తి రమ్య సూక్తి 

109. వయసు కాంత యొకటి అయసుకాంత మొకటి 
పట్టివేయ దలచు కట్టివేయ 
ఆపడున్న చోట ఆకర్షణిట్లురా  
రామమోహనుక్తి రమ్య సూక్తి 

110. ఆకలైన వాని నథిది మర్యాదతో 
ఇంత  అన్నమెట్ట ఇంటి దంతె 
లెల్ల లెక్క జేసి ఇల్లు నాదనె నిది 
రామమోహనుక్తి రమ్య సూక్తి 

111. చిన్న వయసునందు చేసేటి తప్పుల 
అరచి కొట్టి తిట్టి ఆపవలయు 
పాసిపోవ కూడు పక్వంమునకు రాదు 
రామమోహనుక్తి రమ్య సూక్తి 

112. ఓలె కొంచేమనుచు ఒనరంగ దెచ్చిన 
గ్రుడ్డి కొమిరె గూల్చె కుండలెల్ల 
లోభితనము లోని లోపమ్ము గమనించు 
రామమోహనుక్తి రమ్య సూక్తి 

113. ఎక్కువున్నదనుచు ఎపార బనిలేదు 
తక్కువున్నదనుచు తల్లడిలకు 
ఇవ్వ వలసినంత నిచ్చు నీశుండిది 
రామమోహనుక్తి రమ్య సూక్తి 

114. ఎల్ల రాయి జూడ ఎన్నడు మారదు 
ఎదగాలేదటంచు ఏడ్వబొడు 
మనికితమ్ము లేని మహానీయులిట్లు రా 
రామమోహనుక్తి రమ్య సూక్తి 

115. రాగ రహిత గీతి రసహీన వాక్యమ్ము 
లయ విహీనమైన లాస్య సరళి 
ఉప్పు లేని పప్పు ఉపయోగ పడదురా 
రామమోహనుక్తి రమ్య సూక్తి 

116. అగ్రికల్చరందు అధిక మందులు వాడి
ఈల్డు పెంచమనుచు ఇట్లు  చెప్ప 
కోర్కె మీర వాడ  రుగ్మతలొచ్చె 
రామమోహనుక్తి  సూక్తి 

117. శేష సాయి చెంత సేవించగా కాఫి 
పౌడరుండ పాలు పంచదార 
విరివి దొరుకు మీకు వివరమ్ము తెలియునా 
రామమోహనుక్తి  సూక్తి

118. వెలుగు చూచేనేని వెనుక చేరును నీడ 
కటిక చీకటిన కాన రాదు 
చేవ యొకటి నీకు చేదోడు వాదోడు 
రామమోహనుక్తి  సూక్తి

119. నల్లనైన కురులు నా ప్రమేయము లేక 
తెల్లబారిపోయే తేలికగను 
మనసులోని నలుపు మరిమారదేమిది 
రామమోహనుక్తి  సూక్తి

120. కంట నీరు వచ్చు గంటలు వేస్టౌను 
కదలకుండ టీవి గాంచినంత 
అట్టి పనుల బోక హాయిగా చదువుకో 
రామమోహనుక్తి  సూక్తి

121. గాలి మేసి ఋషులు ఘన తపంబులు చేసి 
ఆబాల ముందు ఒడి రబ్బురముగ 
ఆడవారి కిలను అతుకునా పేరిది 
రామమోహనుక్తి  సూక్తి

122. స్తేట్సు కలిగియున్న స్టేబుల్లెకానమి 
కప్పురంబు ఓలే కరగి పోయె 
వాపు బలుపు కాదు వాస్తవమ్మిది గాంచు 
రామమోహనుక్తి  సూక్తి

123. అమెరికాన కలుగ  నార్థిక సంక్షోభ 
మతల కుతలమాయె నఖిల జగతి 
ముడ్డిమీద తన్న మూతి పళ్ళూడెరా 
రామమోహనుక్తి  సూక్తి

124. బిన్నులాదేనోకడు బీభత్సమును జేసి 
మానవాళి జంపె మతము పేర 
అట్లు చేయుటెల్ల 'అల్లా'కు ఇష్టమా 
రామమోహనుక్తి  సూక్తి

125. పిలుపునిచ్చినంత పిజ్జాలు పరిగెత్తు 
గాసి పదియు వంట గ్యాసు రాదు 
చెడ్డ మంచి ఇట్లు చెలుగురా భువినిది 
రామమోహనుక్తి  సూక్తి

126. కలిమి లేని వాడు కానీకి కొరగాడు 
బలము లేనివాడు  బడుగు వాడు 
బుద్ది లేని వాడు భూమికే భారమ్ము 
రామమోహనుక్తి రమ్య సూక్తి 

127. నేతి  బీరకాయ నేయి చూడగ వచ్చు
పెరుగు తోటకూర పెరుగు కూడ 
నేటి నేత లోని నీతెట్లు గాంతువు 
రామమోహనుక్తి రమ్య సూక్తి 

128. కొలిమి లోన ఇనుము కోరినట్లుగ వంగు 
కొలిమి వదిలెనేని కొరుకు పడదు
సమయ మెరిగి పనిని సాధించ వలెనిది 
రామమోహనుక్తి రమ్య సూక్తి 

129. కన్నగడ్డి తినగ కడకు అద్దములొచ్చె 
గడ్డి మేయు గొడ్ల కనమదెపుడు 
కనుల వాడకమున కల భేదమౌనిది 
రామమోహనుక్తి రమ్య సూక్తి 

130. కాకి ఒకటి దొరుకు కాసిన్ని మెతుకుల 
నైన వారి బిలిచి ఆరగించు 
కాకి బుద్ది మనకు కలనైన రాదిది 
రామమోహనుక్తి రమ్య సూక్తి 

131. ఆటలెన్నో ఆడి ఆనందమును బొంది 
కప్పులెన్నో పొంద  కడకు మిగిలె 
మోయ లేని వళ్ళు మోకాళ్ళ నొప్పులు 
రామమోహనుక్తి రమ్య సూక్తి 

132. కొండ కోన దిరిగె కోదండ రాముండు 
తండ్రి మాట నిలుప ధర్మమనుచు 
తల్లిదండ్రి నంపు తనయుడు నేడిది 
రామమోహనుక్తి రమ్య సూక్తి 
     
133. కోహినూరు బోలు కోలారు గని బోలు 
మలల రాజు మంచు మలను బోలు 
అన్యుడతాడు కాడు అబ్దుల్కలామిది 
రామమోహనుక్తి రమ్య సూక్తి 
       
134.మావి పండు ఎంత మంచిదై యున్నను 
తీపు లేని యడల తినగ బోరు 
రోపమొకతి కాదు రుచి ముఖ్య మౌనురా 
రామమోహనుక్తి రమ్య సూక్తి 

135. కన్న బిడ్డలెంత కఠినాత్ములైనను 
కన్నా వారు నోరు కదప బోరు 
కడుపు చించు కొన్న కాళ్ళపై పడునని 
రామమోహనుక్తి రమ్య సూక్తి 
       
136. పెద్ద వారి మాట పెడ చెవిని పెట్టుచు 
పేరు బదులు చెడ్డ పేరు దెచ్చి 
పూవులమ్ము చోట పుడక లమ్ముదు రిది 
రామమోహనుక్తి రమ్య సూక్తి 

137. బుజ్జగించి చెప్ప బుద్ది గాంచనివాని 
కొట్టి తిట్టి చెప్పి కోపపడుము 
వంచ వచ్చు మొక్క వంగునా మానిది 
రామమోహనుక్తి రమ్య సూక్తి 

138. కళల నిదులనేల్ల కనలేము ఇల లోన 
కన్న నిధులు లేవు కన్ను మూయ 
భ్రమల బట్టి ఏల ప్రాకులాడెద విది 
రామమోహనుక్తి రమ్య సూక్తి 

139. ధనము నొదిలి పోవ తా బాధ పడుచుండ 
దాని కొరకు వచ్చు దాయలెల్ల 
గుంత కాదా నక్క గురుతు చేయుదురిది 
రామమోహనుక్తి రమ్య సూక్తి 

140. వాడి నష్టి ఎదురు వాదియౌ ముదనష్టి 
జడ్జి మూడు బట్టి జడ్జిమెంటు 
లాభమెవరికన్న లాయర్లకే ఇది 
రామమోహనుక్తి రమ్య సూక్తి 

141. గజము భూమి కొరకు గలభాలు చెలరేపి 
కోర్టు కెక్కుటేల కొల్ల బోవ 
సమరసంపు చర్చ సత్ఫల మివ్వదా 
రామమోహనుక్తి రమ్య సూక్తి 
       
142. వ్యాధులధికమాయె వైద్యులు పెరిగిరి 
టెస్టు చేయ వలయు లిస్టు పెరిగె 
ఫీసు చుక్కలంటె పేషంటు నేలంటె 
రామమోహనుక్తి రమ్య సూక్తి

143. క్రెడిటు కార్డు నేడు క్రేజైన సాధనం 
కోరుకొన్నవన్ని కొనగ వచ్చు 
డబ్బు కట్టకున్న డప్పౌను వీపిది 
రామమోహనుక్తి రమ్య సూక్తి

144. సంధ్య వేళలందు సాంతము తల దువ్వి 
మొగము కడిగి నుదుట ముత్తెమంత
బొట్టు పెట్టుకొనెడు బోటి ఇంటిని చూడు 
రామమోహనుక్తి రమ్య సూక్తి

145. చంప దగినయట్టి శతృవైనను గూడ 
గారవించు నత్తి ఘనులు నాడు 
తప్పు జూడకుండ తల కోయు యుగమిది 
రామమోహనుక్తి రమ్య సూక్తి

146. పెద్ద చేయు పనుల దద్దయు గమనించి 
చేయుచున్డురింత చిన్న వారు 
బుద్ది లేని పనుల పోరాదు పెద్దలు 
రామమోహనుక్తి రమ్య సూక్తి

147. సాయపదేడు మనసు సరి పడ్డ సలహాలు 
పరుష వాక్య రహిత భాషణమ్ము 
కలిగి యున్న వాని కదనుండురా ఇది 
రామమోహనుక్తి రమ్య సూక్తి

148. వైద్యుడన్న ఎడల విష్ణు రూపుండతడు 
పెదసాదలందు పేర్మి జూపు 
'వ్యయము చేయనీక వ్యాధి మాన్పించు రా'
రామమోహనుక్తి రమ్య సూక్తి

149. రాయి రాయి కలిసి రాతి గోడగ మారు 
పడుగు పేక కలిసి బట్ట యగును 
చేయి చేయి కలుప చేతేమి కాదిది 
రామమోహనుక్తి రమ్య సూక్తి

150. అడుగ, కానివాని నాగంతకుండగు 
ఐన వాని నడుగ నప్రదిష్ట 
సాయమడుగకుండా సాధింప నేర్చుకో 
రామమోహనుక్తి రమ్య సూక్తి

151. బాలలందు నీవు బాలకుడై యుండు 
యౌవ్వనులకు నవ్య యౌవ్వనుడిగ
వృధ్ధులందు మిగుల వృద్ధుడ వగుమిది 
రామమోహనుక్తి రమ్య సూక్తి
   
151. బాలలందు నీవు బాలకుడై యుండు 
యౌవ్వనులకు నవ్య యౌవ్వనుడిగ
వృధ్ధులందు మిగుల వృద్ధుడ వగుమిది 
రామమోహనుక్తి రమ్య సూక్తి

152. బొట్టు పెట్టుకొనుట బోరైన పనియాయె 
పైట వేసుకొనుట పాపమాయె 
ఇంగిలీసు మిగుల ఇంపితమైపోయె 
రామమోహనుక్తి రమ్య సూక్తి

153. తెలుగు వారికింత తెగులేలనోమరి 
తెలుగు మాటలాడు తెంపు లేదు 
దెస భాషలందు తెలుగాయే లెస్సిది 
రామమోహనుక్తి రమ్య సూక్తి

154. పంచదార తీపి పరదార బహుతీపి 
పాప పంకమన్న పరమ తీపి 
తీపి తెచ్చు 'షుగరు' తీరని వ్యాదిది 
రామమోహనుక్తి రమ్య సూక్తి

155. తామరాకు పైన తనియక తిరుగాడు 
నిలకడెరుగకుండ నీటి బొట్టు 
ఉన్న యాకు విడువ ఉనికేది గమనించు 
రామమోహనుక్తి రమ్య సూక్తి

156. కర్వులన్న కలుగు కడుమోహ మిలలోన 
కర్వులన్న యువత కలల పంట 
కర్వు గూని యందు  గమనించరేలనో 
రామమోహనుక్తి రమ్య సూక్తి

157. ఎన్ని కోట్లు తిన్న ఏమేమి చేసినా 
నీతి  హీను కెపుడు ఖ్యాతి రాదు 
కాలి క్రిందె  చెప్పు కడు విలువ చేసినా 
రామమోహనుక్తి రమ్య సూక్తి

158. మంచితనము ఎంత మించి యున్నాగూడ 
దుర్వ్యసనము ఒకటి దుష్టు జేయు 
గబ్బు నూనె చుక్క గాల్చు గంధపు చెక్క  (గబ్బు నూనె= kirosin )
రామమోహనుక్తి రమ్య సూక్తి

159. జంతు సామ్యమిన్త జనులొంది రెట్లన్న 
ఇల 'సమాజ' 'సమజ' మిరుగు పొరుగు
అట్లు ఊన్దనొఉత అది ఎట్లు రాకుండు 
రామమోహనుక్తి రమ్య సూక్తి             (సమాజము= మానవ సంఘం) (సమజము=జంతుమూక) 

160. జంతు మూక కెంత జనులు చేరువయున్న 
మనిషి చూసి చెడుగు మారుగ లేదు 
తమదు ధర్మమేదొ తాము పాటించెరా 
రామమోహనుక్తి రమ్య సూక్తి

161. కాకి రెట్ట వెయ కర్చీపు నందివ్వ 
అటుల నిటుల జూచి అర్భకుండు 
కాకి ఎగిరి పోయె కర్చ్చ్పు ఏలనె 
రామమోహనుక్తి రమ్య సూక్తి

162. అమ్మ నాన్నలందు అనుగు సంతతి ప్రేమ 
అయిసు క్రీము బోలు అరసి చూడ 
కరిగి కరిగి తరిగి కనిపించ బోదిది 
రామమోహనుక్తి రమ్య సూక్తి

163.  వక్క పలుకు కొరుకు వాడి ఎంతున్నదో 
దంత పంక్తి ఇరుగు దవడ కాదు 
చేవ గూర్చి జనుల చిత్తమ్ము కెరుకరా 
రామమోహనుక్తి రమ్య సూక్తి 

164.  గాంచ పూల తావి గాలివాటమ్మది 
ఎదురు గాలిలోన ఈదలేదు 
కీర్తి గంధమట్టి కీడులు పడదిది 
రామమోహనుక్తి రమ్య సూక్తి 

165.  ఎంత శూరులైన ఎంత సజ్జనులైన 
రాజులైన మంచి రాత లేక 
పాండు సుతులు పడిరి పడరాని పాట్లిది 
రామమోహనుక్తి రమ్య సూక్తి 

166.  ఆలు మగలు తాము ఆఫీసులకు పోవ 
వంట చేయుతెట్లు వలను పడును 
కాదు మంట తీర్చ గతి కర్రి పాయింటు 
రామమోహనుక్తి రమ్య సూక్తి 

167.  తెలిసి తెలియనట్టి తెలివిగల్గినవారు 
కోడిగ్రుడ్డు తెచ్చి కోర్కె మీర 
లాఘవమ్ము తోటి లాగెదరీకల 
రామమోహనుక్తి రమ్య సూక్తి 

168.  ఆశకల్గు వాడు అరయగ నిరుపేద 
ఆశలెని వాడు అధిక ధనుడు 
మరచిపోయి ఆశ మరి ఈశు సేవించు 
రామమోహనుక్తి రమ్య సూక్తి 

169.  వ్రాయ వలసినంత వ్రాసితి మరిమీరు 
చదవ  గలిగినంత చదివినారు 
నచ్చే నేని ఘనత నా తండ్రి యవ్వది 
బాగులేకయున్న బాధ్యుడౌదు 

(ఇంత వరకు చెప్పినవి సమకుటములు  ఇప్పుడు చెప్పబోఏవి మకుట సమములు )


1.  ఆరు కర్మ లెరిగి అణకువయును గల్గి 
     ఆదరాన జూచు అతివ వీడి 
     ఓడలు కప్పుకోనక ఒయ్యారమొలికించు 
     పదాతి గోరు చుండ్రు పతులు జగతి 

2. తిరముగా నుంచి యొక్కటి త్రిప్పియొకటి 
    తిరుగాలిచ్చును తా పిండి తినుటకిలను 
    రాళ్ళు రెండును తిరిగిన రాబవళ్ళు 
    పిండి రాదన్నదెరుగరు పిచ్చి జనులు 
   
3. మనసు మాట లోన మాటేమొ పనిలోన 
    ప్రతిఫలింప వలయు  ప్రతిదినమ్ము 
    కరణ త్రయములన్న గాన్చరా యివియేను 
    ఆచరించు దేవుదండు గలడు 

నా బుద్ది 

కుక్క తోకను బట్టి గోదావరీదినే నెక్కుతా 
గిన్నీసు బుక్కునందు 
అజగజమ్ములు గూర్చి అగమును సృష్టించి 
నోబెలు ప్రైజుకై నోచుకొందు 
నక్క కుక్కల ప్రేమ నగ్న చిత్రము దీసి 
ఆస్కారవార్డుల నందుకొందు 
మూడు ఘనతలు గలిగిన మూర్తి నగుత 
ఎయిటు వండరు నౌదు నే నెట్టులైన 

ఇట్టి అరుదైన కార్యముల్ ఇతర జనులు 
చేయగాలేరు వారికి చేత గాక 
నన్ను మించిన వారెవరు నేనుగాక 
అనుచు గప్పాలు కొట్టె నా అల్ప బుద్ధి 

మాయూర నీరు 

ఘన తపమ్ములు జేసి గంగ తెచ్చుట కాదు 
చెడు మా బావి లో చెంబు నీరు 
జటిల మందాకిని  జడల నిల్పుట కాదు 
ఇంటి టాంకున  నింపు ఇంత  నీరు 
పాతాళ గంగను బయలు దెచ్చుట  కాదు 
బోరింగు కొట్టి మా బొచ్చె నింపు 
జలనిదులింకంగ జలము ద్రావుట గాదు 
చూపు మాయూరిలొ చుక్క నీరు 

ఓ భగీరథ భూజాని ఓ మహేశ 
పాండుమధ్యమగస్త్య పరమ పురుష 
గతము గొప్పలు గట్టిగా కట్టి పెట్టి 
మండు వేసవి మాయూర మసలి పొండు 

మానవత్వము 

బాలు పెన్నులు నాడు బ్రహ్మ దేవునకున్న 
భారతి సాయమ్ము బడయడేమొ 
గౌతమునింటిలో గడియారముండిన 
కోడియై సురరాజు కూయడేమొ 
ఐ ట్రాన్సు ప్లాంటేష నానాడు కల్గిన 
గాంధారి గంతలు గట్టదేమొ 
ఐస్క్రీము లానాడు  అందుబాటున యున్న 
వెన్నకై కన్నయ్య వెదకడేమొ 

నేటి వనరులు ఆ నాడు నెగడియున్న 
ఘనత నానాటి జనులసలు గాంచరేమొ 
సకల విజ్ఞాన సంపదల్ సాధ్యమయ్యు 
మానవత్వమునే  మరచె మనిషి నేడు 


ఏడు కొండల వెంకటేశా 

ఏడు కొండల వెంకటేశా వేడుకొందును కావగా 
వీడని మొహాల బ్రతుకు వాడిపోయే లోపుగా 

1. కలవనుచు లేవనుచు నుందురు 
    తెలియ తరమా నీదు ఉనికి 
   కలవు లేవను కలత బాపి 
   కనికరముతో కావరావా              ।ఏడుకొండల। 

2. నీదు నామము నాడు నీమము
    నీదు రూపే నిండే హృదయము 
    నీదు పదమే పరమ పదము 
    నీవే నాకు గతియు మోక్షము     ।ఏడుకొండల। 

3. బరి తెగించిన మానవతను
    దరిని జేర్చే దారి జూపు 
    కరుణ నిండిన కనుల కాంతి 
    జగము నింపి జనుల బ్రోవు          ।ఏడుకొండల। 
   
శివశివ యనరాదా 

శివశివ యన రాదా శివ నామము చేదా 
భవభవ శుభదా యన బాధ నిలువ గలదా 
శివ పాదము మీద నీ శిరసు నుంచ రాదా 
కనికరించు వరదాయన కరుణ మనల కాచు గదా      ।శివశివ| 

గగన తలము నుండి దుముకు గంగ నెత్తి కెత్తె కదా 
శ్రీకరులను బ్రోవ తాను శ్రీకంఠుండాయె సదా 
మనసారాహర యంటే మనకు కరువు తీరదా 
తామసింప బోక శివుని తలచ తీరిపోవు దువిధ         ।శివశివ| 

పంచ భక్ష్య పాయసాలు పనిలేదని తెలియదా 
భూరి సంపదలు పొందగ బూది పూజ కలదు గదా 
మనసారా హర యంటే మనకు కరువు తీరదా 
తామసింపబోక శివుని తలచ తీర పోవు దువిధ           ।శివశివ| 

(చెరుకు రామ్మోహన రావు గారు రచించిన ఈ "రామమోహనుక్తి రమ్య సూక్తి" అన్న ఈ శతకం వారే స్వయంగా టైపుచేసి నాకు పంపటం జరిగింది. ఈశతకాన్ని వారు తమ తల్లితండ్రులకు అత్యంత భక్తి ప్రేమలతో అంకితం చేసారు. వారి ఈ శతకాన్ని నాకు దయతో పంపినందుకు ఎంతో కృతజ్ఞుడిని. వారికి అనేక ధన్యవాదములు. ఇది వారి అనుమతితోనే ఈ బ్లాగులొ పోష్టు చేస్తున్నాను. చదివి మీ అమూల్యాభిప్రాయాలు తెలియచేయగలరు.)

No comments:

Post a Comment