భక్తజీవన శతకము
వాసా కృష్ణమూర్తి
1. శ్రీజనకాత్మజా విమల
చిత్తసరోజనివాస! *ద్యోరమా
రాజకిరీటహీరమణి
రాజితపాద! పరాత్పరా! భర
ద్వాజమునీంద్రపూజిత! వి
దారితశాత్రవ! సన్నమోఘ వి
ర్వ్యాజ కృపావలోకనల
వారకజూడుము భక్తజీవనా!
(ద్యోరమారాజ :ఇంద్ర)
2. సామజపాలకా! జలజ
సంభసన్నుత! వేదసంతతిన్
సోమకదానవుండుగొను
చున్ జలధిన్ జొర వాని మీనమై
నామమడంచి బ్రోవవె స
నాతనపూజ్యములైన ఋగ్యజు
స్సామముఖాగమంబులను
సారసలోచన! భక్తజీవనా!
3. సురలు నుతింప గూర్మమయి
చొచ్చి పయోదధిమంథరాద్రి న
త్యురుతరశక్తినెత్తియు సు
ధోద్బవమొందగజేసి వారికిన్
గరుణ్ నొసంగినట్టినిన్
గాంచిసపర్యలఁజేయఁగొరుదున్
దరిసెనమీయరమ్ము ముర
దానవనాశన! భక్తజీవనా!
4. రక్షణసేయవే, మును ధ
రావనితన్ సురవైరి యా హిర
ణ్యాక్షుడు గాసివెట్టుతఱి
నాదివరాహమవై రమావరా!
యక్షయవైభవా! యటుల
నాదరణంబున నన్నుగావు కం
జేక్షణ! సౌమ్యభాషణ! సు
రేశ్వరతోషణ! భక్తజీవనా
5. నీరజనేత్ర యంచునిను
నిశ్చలభక్తి గొల్చుపుత్రుతో
బోరెడునాహిరణ్యకశి
పున్ వధియించిన నారసింహ! నీ
నేరుపునెంచనాతరమె
నిర్మలసద్గుణ! పాపవారణా!
వారణరక్షణా! యహిత
వారవినాశన! భ్క్తజీవనా
6. తరుణముఁజూచి వామనత
దానవనాథుని యజ్ఞభంగమున్
సరగునఁజేసి వానిని ర
సాతలవాసునిగానొనర్చి ని
ర్జరవరు కోర్కెదీరిచిన
జానవు నీవనిగొల్తు నాత్మలో
సురగశయాన! కేశవ స
ముజ్వల భూషణ! భక్తజీవనా!
7. జనకునిద్రుంచ్నట్టిపగ
సంధిల నిర్వదియొక్కమారులున్
బనివడి బెక్కుభూపుల కృ
పారహితాత్మతజంపి భార్గవుం
డనగఁ బ్రసిద్ధినొప్పు నిను
నర్చనఁ జేయుదు సంతతంబున
న్ననుపమరీతిఁజూడు కన
కాంబరధారణ! భక్తజీవనా!
8. ఇనకులమందు బుట్టిమిథి
లేశునిపుత్రికఁ జెట్టబట్టి, కా
ననమును జుట్టి చుట్టి, కుల
నారిమృగాశను గోలువెట్టి య
బ్ధిని బలు కట్టగట్టి పొల
దిండిని గొట్టిన జట్టి, రామ! నా
మనమున నట్టెనిల్వఁగదె
మంగళరూపున భక్తజీవనా
9. హలధర! రోహిణీతనయ!
హాసమధుస్రవ రేవతీసతీ
లలితముఖాంబుజార్క! శుభ
లక్షణ! యోమధూపానమత్త! నీ
విలసిత దర్శనంబు మది
వేమారిగోరెదఁ జూపవేలరా?
కొలుతును నిన్నజస్రమును
గోకులపావన! భక్తజీవనా!
10. మరునకలభ్యలౌ త్రిపుర
మానినులన్ దమకింపఁజేయునే
ర్పరితనమున్ సురూపమును
భాసిలు బుద్ధుఁడవౌ భవత్పాదాం
బురుహములన్ భజింతు నను
బుత్రునిఁబోలె నిరంతరంబు స
త్కరుణను గావుమయ్య! నవ
*కంధరవిగ్రహ! భక్తజీవనా!
(*కంధరము=మేఘము)
11. కలుషవితాన గాఢతర
కాలబలాహకమారుతంబవై
విలసితకల్కిరూపమున
వేయివిధంబుల భక్తకోటిచేఁ
గొలుపులనందు నీదు శుభ
కోమలపాదయుగంబు భక్తితో
దలఁతును గావరార! నను
దానవనాశన! భక్తజీవనా!
12. క్ష్మాతలి సర్వరత్నములు
శాస్త్రము చొప్పున నెవ్వఁడేని సం
గీత మొనర్చినన్ గరగు
కేశవ! తావకచిత్త రత్నమా
రీతి గరంగఁజేయఁగ వి
రించికినైనఁదరంబుగాదు యీ
చేతకు భక్తియేతగు కు
శేశయలోచన! భక్తజీవనా!
13. నందకుమార! దైత్యకు
నాథగిరీంద్ర శతార! మౌనిసం
క్రందనపంకహార! సుర
రాజమదోద్ధార! గోపికా
బృందవిహార! చక్రధర!
ప్రేమ సుధాఫలసార! యీ గతిన్
దందనలేలరా? విమల
ధర్మవిచారణ! భక్తజీవనా!
14. అతుల కృపాసముద్రుఁడ వ
నంతగుణోత్తరుఁడంచు నిన్నునే
సతతము నమ్మియుందు విర
సంబునఁ జూడగ నేల? భ్క్తసం
తతిపరిపాలనా బిరుదు
గప్పగనెంచితివేమొలేక యీ
గతి నను నేమరిల్లుదువె
కావశ్రీగుణ! భక్తజీవనా!
15. ధ్రువసురవైరి డింభకుల*
తోరపుఁ గోర్కులఁ దీర్చినట్టి నీ
యవిరళమౌ కృపారసము
నందగఁ జూచినఁ బొందఁ జేయవే
సవనఫల ప్రదాయక! వి
చారణఁ జేయఁగ నేను నీకు శా
త్రవుఁడనె? వారు చుట్టములె?
తండ్రివి నీకిల భక్తజీవనా!
(సురవైరి డింభకుడు=ప్రహ్లాదుడు)
16. పాలనఁ జేయవే మును న
పారకృపన్ ఖలు నయ్యజామిళున్
కాలముఁ జేయువేళఁదన
గాదిలిపట్టిని నీదుపేరిటన్
దాలిమిఁ దూలిపిల్వ; కడు
దైన్యత నేనిను నెంతవేడినన్
జాలము సల్పుటేల? మది
జాలివహింపక భక్తజీవనా!
17. మేలనిమార్త్య జన్మమును
మెచ్చిరి కొంద, రిదేమిటి మేలు? నీ
లాలన లెక రాజ్యపద
లాభము గల్గినఁగాని, నీకృపా
పాలితమైన నయ్యుడుత
పావనమైనదిగాఁదలంతును
న్మీలితపంకజోదర! య
మేయ యశోధన! భక్తజీవనా!
18. ఏకపదంబు మోఇ శిల
నింతినిఁ జేసెడువేళ నన్ను గా
రాకుగనైన దాని కడ
నావహిలంగ నొనర్చి నీదుప్ర
త్యేకపదంబు నాపయిని
నించుక సోఁకగ జేసియున్న రా
మా! కడుధన్యతన్ గనుదు
మంగళదాయక! భక్తజీవనా!
19. కంధివిహార! మౌనిజన
కంటకసంహార! రత్నహార! శ్రీ
గంధశరీర! వైరిజన
కాననశాతకుఠార! భక్తపం
కాంధికసూర! భేదరహి
తా! గిరిధార! దయాపయోధరా!
సింధూరదుఃఖహార! తుల
సీదళమండిత! భక్తజీవనా!
20. ఛత్రకిరీటహార నవ
చందనకుంకుమ పంకదీప్త స
ద్గాత్రముతోడ పర్శ్వమున
కంజదళాక్షి తటిల్లతాంగి భూ
పుత్రికతోడ, సర్వగుణ
పూతుఁడు లక్షణు తోడ, నంజనా
పుత్రునితోడ దర్శనము
పొందుగనియ్యవె భక్తజీవనా!
21. రమ్ము మదీయవాంఛలఁద్వ
రన్ నెరవేర్పఁగఁ, గొమ్ము నీవునె
య్యమ్మున నేనొర్చు భవ
దర్చనల్ సిరితోడఁ గూడి, పా
రమ్ముగనంగఁ జాలని య
లంకృతి నొప్పెడు మోముఁ జూపుమా,
యిమ్ము మనమ్ము సంతసిల
నీప్సితముల్వెస భక్తజీవనా!
22. బోనున జిక్కు మూషికము
బోలె భవన్మహనీయ మాయచే
నానిన ఘోరసంసరణ
మందుఁ దగుల్పడి భాదితుండుగా
గాని తెఱంగుఁ జూపినను
గావవె నిత్యము నీపదాబ్జముల్
మానసమందు గొల్చెద ర
మాహృదయాధిపా! భక్తజీవనా!
23. తనయ నొసంగ బంగారపుఁ
దట్టను నబ్ధివరేణ్యుడెవ్వితా
వినయము తోడుతన్ గడిగె,
వేమరు జానకిసేవ జేయు వే
నిని, ఫణిరాట్ఫణాగ్రముల
నేర్పున నృత్య్ము సల్పెనేవి, వా
నిని భవదీయ పాదముల
నెమ్మి భజింతును భక్తజీవనా!
24. ధన మమకారమంది మదిఁ
దల్లడిల్లంగనొనర్ప లక్ష్మి, స్త్రీ
జనమమకారమందియు వి
చారముఁ జెందగఁ జేయు మారుఁడున్
దిన మటు లేమరిల్లక స
తీసుతులే నినుఁ గాచియుండ నే
యనువున నిల్చు చిత్తమర
యన్ ద్రడిమన్ గని భక్తజీవనా!
25. వితతమహాప్రతాప! రఘు
వీర! జనోత్తమ భూప! భంజితా
ద్భుత శివచాప! గోపకుల
పూజితదీప! విమోహరూప! నీ
ల్ తను సుదీప్త కౌస్తుభ క
లాప! విదారితభక్తతాప! నీ
యతులిత కూర్మి జూప సమ
యంబిదె పావన! భక్తజీవనా!
26. వనధిసుతా కళత్ర! *ముని
వాసవవారిజమిత్ర! విశ్వపా
లనశుభకార్యపాత్ర! ముర
రాక్షస జైత్ర! విమోహగాత్ర! పా
వనతర గోత్ర! పాపమద
వారణ తోత్ర! విశాలనేత్ర! రా
జనయ కళాపవిత్ర! బుధ
సత్తమపాలన! భక్తజీవనా!
(మునివాసవ= మునీంద్ర)
27. పారము లేని పాప ఫల
భారము, దుర్విషయాలవాల కూ
పారము; *శ్రాద్ధదేవపరి
పాలిత సారము ఘోరమైన సం
సారము సారమంచనిరి?
సారసలోచన! యిందునీకృపా
సారము బొందకుండిన, న
సారతఁ జెందదె భక్తజీవనా!
(*శ్రాద్ధదేవ= యముడు)
28. సారము సర్వవేదఫల
సారము, సురిజనోత్కరైకమం
దారము, పాపభూధరశ
తారము, శ్రీకర దివ్యయోగసం
భారము శాశ్వతామృతవి
భాసితసారము, నీమనోహరా
కారము రామచంద్ర నను
గావగఁ జూపవె భక్తజీవనా!
29. ఎవ్వని వేడుదున్ మదిని
నెవ్వని నమ్మి భజింతు? దిక్కటం
చెవ్వనినెంతు? దైవమని
యెవ్వనికే నొనరింతు పూజ; లే
నివ్విధి నీకృపారసము
నించుకనైనను జూపకున్ననో
కవ్వడి సంగడీఁడ! తోగ
కన్నులరాయఁడ! భక్తజీవనా!
30. అంబర వీధినుండి నిఖి
లావనిపాతము నొందు వారివా
హాంబువులెల్లఁ జేరు వరు
ణాలయమున్ దలంపంగనట్లు చ
ర్మాంబరముఖ్య దైవనివ
హార్చనలన్నియు నిన్నుఁ చేరవే!
కంబుగదాసి చక్రవర
కార్ముకధారణ! భక్తజీవనా!
31. నీదయ నీదు దర్శనము
నీమృదుభాషణనాలకించుటల్
నీదుప్రియంబునందుటయు
నీనిజపాదసరోరుహార్చనల్
పేదకు పెన్నిధనము ల
భించినరీతిగఁ గల్గకుండినన్
గాదె నిరర్థకంబు శుభ
కర్మల యందున భక్తజీవనా!
32. నే మును జన్మలన్ మనసు
నిల్పి నినున్ వినుతింపకుంతచే
నీమహివెండియున్ జనన
మేర్పడె, నీపదపంకజంబులం
దేమరకుండఁ చిత్తము ర
హింపఁగఁ జేసియు నుద్ధరింపవే
ప్రేమము జూపి దైత్యవన
భీషణపావక! భక్తజీవనా!
33. ఈశ! సురారినాశ! భువ
నేశ! నిరాశ! పరేశ! తారిత
క్లేశ! శుభప్రకాశ! వర
కంధిసుతా పరిశుద్ధచిత్త ప
ద్మేశ! వినీలకేశ తర
ణీందువిలోచన భక్తజీవనా!
34. తల్లుయుఁ దండ్రి ప్రేమలక
తంబునఁ గొంత, ముదంబుచే నవో
త్ఫుల్లసరోజలోచనల
పొందులకొంత, సుతాలి రాగమం
దుల్లసమంది కొంత, నమి
తోన్నత మౌ ద్రవిణార్జనంబునన్
దల్లడమంది కొంత, గత
దార్ఢ్యతఁ గొంతయు, నాయు వేగగా
గల్లరి జన్మ ధన్యమగు
కాలమదెప్పుడు భక్తజీవనా!
35. పారములేని విశ్వమునఁ
బ్రాణులఁ గొన్ని సృజించి, యవ్వలన్
దీరని క్షుత్పిపాసల వి
ధింపఁగఁ, గామముఖారి వర్గముల్
చేరి స్వకార్యజాలములఁ
జేయఁగ, నాటకమాడెదీవు నీ
నేరుపునెంచ నాతరమె
నిత్యదయాగుణ! భక్తజీవనా!
36. అరుసము గల్గి నీదు చర
ణాంబుజసేవలొనర్పకుండి నే
నిరతము కుక్షిపోషణకు
నీచుల దాస్యమొనర్చినందునన్
వరుసగ నాదు జన్మములు
వ్యర్థములయ్యెను బ్రోవరాగదే
కరుణ ద్లిర్ప సర్వముని
కామితదాయక భక్తజీవనా!
37. కలుముల రాణి జాయయని
గాదు, జగత్రయ సృష్టి కార్యకౌ
శల గురువర్యుఁడా నళిన
సంభవుఁడాత్మజుఁడంచుఁగాదు, నిన్
గొలుచుట భక్తపాలనమ
కుంఠితరాగరసైకవాహినీ
జలజమటంచు సారసవి
శాలలోచన! భక్తజీవనా!
38. నరమృగరూప! వైరి శమ
నా! శమనవ్య గుణాభిరామ! భా
స్కరశతతేజ! తల్పభుజ
గా! భుజగాశనపింఛ భూషణా!
నరసఖ! పాపమేఘపవ
నా! పవనాత్మజసేవితా! సుధా
కరహరినేత్ర! కీర్తి కన
కా! కనకాంబర! భక్తజీవనా!
39. ప్రియతమ మయ్యా నేరికిని
వీడ నసాధ్యములైన యీషణ
త్రయము నెసంగియుండ, వసు
ధాసుత, మామకమాత సీత నా
యయుచుఁ బ్రలాపమందితివి
రామ! భవర్సృజితాత్మజుండ నే
నయివిలపింప నీహృదయ
మార్ద్రత జెందదె భక్తజీవనా!
40. వింటిని గర్ణపర్వముగ
వేమారు నీచరితంబు, నాశతో
నుంటిని యెప్పుడైన దయ
నొందెద వంచని, గోర్కెలూరగా
మంటిని, సాటిలేని కడు
మూర్ఖుఁడనై యిపుడైన గావర
మ్మంటిని రామచంద్ర! నను
నార్తజనావన! భక్తజీవనా!
41. బాలుఁడ బుణ్యహీనుఁడ న
పారశఠుండ మదోద్దతుండ దు
శ్శీలుఁడ పాపకార్యచర
శేఖరుఁడన్ విమలాత్మకా! జగ
త్పాలుఁడవీవు నన్నొకనిఁ
బాలన జేయఁగలేవె> శ్రీరమా
లోల! శ్రితవనా! కమల
లోచన! శ్రీగుణ భక్తజనావనా!
42. అనయము నిన్భజించుటల
నారయకెల్ల నసత్యమంచు నీ
మనమున నెంచితేమొ నను
మన్ననఁ జేయవు విశ్వమెల్లడన్
దనరుచునున్ననీకునిది
దాగునె యిట్లు పరాకు లేక నా
వనటను దీర్పరా! కలుష
వారవినాశన! భక్తజీవనా!
43. కాదనకుండఁ బేదయును
కల్గినవారలు కల్గువానికే
లేదనకుండ నిత్తురను
రీతిని నేర్పడె నీదుచేత, ప్ర
హ్లాద ధ్రువాదులన్ గరుణ
లాలనఁ జేసియు బీదనౌట నా
మీఁదనుపేక్ష జేయుటన
మీకిదిచెల్లునె భక్తజీవనా!
44. చతురవిలాసమున్ బరపి
చంచల నిన్నరికట్టెనేమొ, దే
వతతిసపర్య మెచ్చి మది
వశ్య మొనర్చితివేమొ, లోకపూ
జితులగు మౌనియోగబల
సిద్ధిని బంధితుఁడైతివేమొ, నా
గతిగానరావు! కారణము
గానను పావన! భక్తజీవనా!
45. యదుకులబాల! మౌని హృద
యాంబుజలోల! త్రిలోకపాల! స
మ్మదయుతశీల! కిల్బిష వి
పాటన ఖేల! మదారికాల! శ్రీ
ప్రదసుగుణాలవాల! మద
బంభరనీలసుకేశజాల! ని
ర్మదసుజనానుకూల! ఖల
మర్దన! పావన! భక్తజీవనా!
46. వదనము కంజమంచు, నిడు
వాలుకనుంగవఁ గల్వలంచు, నిం
పొదవెడు పాదయుగ్మమరు
ణోజ్వలపద్మములంచు, గాత్రమున్
మృదుల శిరీషసూనమని,
మెచ్చి నినున్ వినుతించితిరేల? నీ
మది కడుఁగర్కశంబు బుధ
మానసచంద్రమ; భక్తజీవనా!
47. ఎటుల నుతింప మెప్పగునొ
యెట్లు జపింపగ సంతసింతువో
యెటుల నుతింప బ్రీతియగు
నెట్టుల ధ్యానముఁజేయ నొప్పునో
యెటుల నమస్కరింపమది
కింపొ, యెరుంగఁగజాలఁ గల్పనా
నటన కళాధురీణ! నిను
నమ్మితి బ్రోవవె? భక్తజీవనా!
48. భక్తులనేకులన్ గడుఁగృ
పామతిఁ బ్రోచితివండ్రు; నమ్మనా
యుక్తుల సత్యమంచు నను
నొక్కపుడైన ప్రసన్నమై మహా
సక్తినిఁ బాప దర్శనమొ
సంగినఁ గాని కృపామయాత్మకా!
ముక్తినిధాన! శ్రీహృదయ
మోహన! సద్గుణ! భక్తజీవనా!
49. వరద! భవత్కృపాత్రిదశ
వాహినిఁ గల్గెడి లీలలన్ ఝషో
త్కారముల మౌని జాలికవి
తానము ధ్యానమహీలతావలిన్
సరగున గ్రుచ్చి యోగబడి
శంబులఁ బట్టి సుఖింపుచుండ గొ
క్కెరనగు నాతలంపు కృత
కృత్యతఁ జెందునె భక్తజీవనా!
50. పట్టెడు కూటికై వివిధ
బాధలఁజెంది, భవత్పదంబులన్
గట్టిగ నమ్మకే ధనవి
కారమదాంధులసేవఁజేసి బల్
రట్టడిఁ జెందు వారిగని
త్రాసముఁ జెందుచునుందు దేవ నా
కట్టి విధంబు దూరమగు
నట్టులొనర్పవె భక్తజీవనా!
51. నీకనుదమ్ములన్ వెడలు
నిర్మలమౌ కరుణామరంద మ
స్తోక ముదంబు బెంపొదవి
తుష్టిగ మామకచిత్త బంభరం
బాకలిఁ బాయుఁ గ్రోలునటు
లాదరణంబునఁ జేయవే సురా
నీకానుతాంఘ్రిపద్మ! నవ
నీరద విగ్రహ! భక్తజీవనా!
52. భక్త జనోత్కరోగ్రతర
పంకఫణీశవిపాటనోద్ధతా
సక్త సుపర్ణ! విక్రమ వి
శాల! కఠోర గుణాతిరేక సం
యుక్తమదారికానన *మ
యూఖ రసజ్ఞ! పవిత్రపాలనో
ద్యుక్త రమావరా! కరుణ
తో ననుగావుము భక్తజీవనా!
(మయూఖరసజ్ఞ = అగ్ని)
53. పాపవినాశనం బొనరు
పన్ రఘురాముఁడ వయ్యు నీవయో
ధ్యాపురినేలు కాలమునఁ
దావక సేవలొనర్చి భక్తిచే
నీపరితోషమే తమకు
నిర్మల మోక్షమటంచు నెంచు వా
రీపుడమిన్ పునర్జనన
మేవిధి గాంతురు భక్తజీవనా!
54. అనిలజుచేత ముద్రిక ధ
రాత్మజ కంపుటయున్ విరోధులన్
హననమొనర్పకుండియెర
యంబున రాజ్యపదంబు పట్టమౌ
యినజునకున్ విభీషణున
కేపునఁగట్టుటెఱుంగ కజ్ఞులె
ల్లను నరుఁడంచుఁ బల్కుదురు
రాముఁడవౌ నిను భక్తజీవనా!
55. వైరి విదారణం బొనరు
పన్ శరచక్రము లంపునాఁడె యీ
ధారణి తల్లడిల్లెనట
తావక కోపము గాక యద్ది ని
స్సారతరాయుధ ప్రకర
శక్తియె? త్వత్క్రుధ నించుకైన నా
ఘోరతరాఘమం దనిపి
కూలగఁ జేయవె భక్తజీవనా!
56. ఎన్నడువిందువో మనవి
నెన్నఁడు నాపయి ప్రేమ కల్గునో
యెన్నఁడు నిన్ను జూతునని
యేను నిరీక్షణ బుద్ధి నుండి నా
కన్నులుగాచెఁగాయలు వి
కాసితనిర్మల పంకజాక్ష! యా
పన్నుఁడ నన్నుఁగావర! కృ
పామతి పావన! భక్తజీవనా!
57. సరసిజసూతి శ్వేతుఁడని,
శర్వుఁడు కాలగళుండటంచు శ్రీ
హరి ఘననీలవర్ణుఁడని
యందు రదెందులకన్న? భక్తపా
పరహిత కార్యమందున న
పారము నీవు శివుండు స్వల్పమున్,
దురితవహంబొనర్చుటను
దోచెడినీలిమ భక్తజీవనా!
58. నీ పద పంకజంబులను
నిండిన భక్తిని గొల్తు నీవె నా
ప్రాపగు బాంధవుండవని
పాయక యెంతు, భజింతు నీవె సం
తాపముఁ బాపు వాఁడవని
తావక నామమె సంస్మరింతు, నా
పాపములన్ హరింపఁగదె
పంకజలోచన! భక్తజీవనా!
59. పన్నగరాజతల్ప! శిశు
పాలమదాపహ! లోకరక్షణో
ద్భిన్నదయాంబుజాత! బల
భేది ముఖామరవంద్య, దివ్యసం
పన్నగుణాతిరేక! భవ
బంధ విమోచన! ప్రేమమీర నా
విన్నపమాలకించి నను
వేగమె బ్రోవుము భక్తజీవనా!
60. రామ! గుణాభిరామ! రఘు
రామ! మనోహరసీమ! మానినీ
కామ! మునీంద్రసద్దృదయ
కంధి నిరంజన సోమ! యంచునే
నేమరకే నిరతము
నే పగు భక్తిని నీదు దివ్య మౌ
నామమునే దలంచు మది
నాకొన గూర్పవె? భక్తజీవనా!
61. కాయము నిల్చునంత దను
కన్ నినుఁ బ్రస్తుతిఁజేయుచుందునే
బాయకనాదు ప్రాణములఁ
బాసెడివేళ భరింపరాని వౌ
నాయమ బాధలన్ బడి స్పృ
హల్జెడిపోవునొయేమొకావగా
నీయదె భారమౌ విమల
నీరజలోచన! భక్తజీవనా!
62. కాదనబోకు దీన జన
కల్ప రుహంబగు నీ యశోన్నతిన్,
రాదనబోకు భాగవత
రక్షయొనర్చిన నాటి నీ కృపన్
లే దనబోకు దాసతతి
లేముల బాపెడు దివ్యశక్తి, నీ
పాదయుగంబె దిక్కనుచుఁ
బాయకనమ్మితి భక్తజీవనా!
63. మేలగు భక్తిచే నిను న
మేయ దయాకర! రామచంద్ర! గో
పాల! సువర్ణచేల! ముని
బాంధవ! కృష్ణ! మురారి! గోపికా
లోల! జనార్థన! యనుచు
లోలుభులై స్మరియించువారిన్
కాలుఁడు తేఱి చూచునె యె
గాదిగనైనను భక్తజీవనా!
64. దుర్విషయంబులన్ దవిలి
తుష్టియొకింతయులేక యెల్లెడన్
బర్విడుచుండు నామనసు
బట్టినినున్ బొగడంగఁచాలనో
సర్వమయా! దయా పరవ
శంబున నాదు విలోకనాళికిన్
బర్వముగాఁగఁ గన్పడి య
భాగ్యత దీర్పవె భక్తజీవనా!
65. పలువల చెల్మిఁబూని యతి
పాపపు బుద్ధి, నొకప్పుడైననిన్
దలపక, నీపదాబ్జయుగ
దాస్యమొనర్పక, నీదు దాసులన్
గొలువక, కాలపిప్పగిది
గోల్పడి నేటికి నెన్నె నమ్మతిన్
గలుగునె నీ కృపారసము
కంధి సుతావర! భక్తజీవనా!
66. పరినయవేళ సిగ్గున భ
వత్సముఖానత శీర్ష జానకీ
తరుణి యురస్థ దివ్యమణి
దర్పణమందునఁ దోఁచి యామెనున్
పరవశమందజేసినటు
భావమణిన్ వెలుగొంది నన్నునీ
కరుణకుఁ బాత్రుఁ జేయగదె
కామితదాయక! భక్తజీవనా!
67. హితమిత సౌమ్యభాష! దను
జేశ్వరవంశపయోదిశోష! పం
డితజనపోష! భక్తజన
*డింబ తుషారవినాశపూష! శ్రీ
యుత రమణీయవేష! వర
యోగి జనావనతోష! పాలనా
చతురమనీష! నిన్ను మది
సన్నుతిఁజేసెద భక్తజీవనా!
(డింబ =భయము)
68. నెఱతనమంది నీ విమల
నిర్గుణ తత్వము పొందు లభ్యమే
త్తఱికగు నంతదాక మదిఁ
దావక సుందరమూర్తి పూజలే
మరక సదా పవిత్రతర
మానసతం బొనరింపుచుందు నే
గఱవున గంజియైన సుధ
గా మది దోపదె భక్తజీవనా!
69. కుడియెడమల్ రవంతయును
గూడ నెఱుంగక యుంటమేలు, నే
ర్పడర వివేకియై యహార
హంబు నినున్ దెలియంగమేలు, యీ
నడుగతియైన జన్మమును
నాకొనఁ గూర్చియునిట్లు రెంతికిన్
జెడిన త్రిశంకు నాకమటు
జెసితి వేలకొ భక్తజీవనా!
70. అంతములేని రూపుఁడ వ
యాచిత కామితదాత, వాదిమ
ధ్యంత గుణత్రయేతరుఁడ
వౌ నిను నామదిఁ బ్రస్తుతింప నా
వంతయు నాపయిన్ గరుణ
నావహిలంగ నొనర్ప వైభవం
బంతయు వ్యర్థమౌనె తమ
కార్త జనావన! భక్తజీవనా!
71. తిన్నని కృష్ణ జన్మమున
దేవసుమంబగు పారి భద్రమా
యన్నులమన్న సత్య తన
కద్ది ఘటిల్లక కాలఁదన్నగా
మన్ననఁజేసి నేను పలు
మారిటు వేడిన బ్రోవవేలరా!
తన్నునకన్న విన్నపము
తక్కువ యయ్యెనే భకతజీవనా!
72. నగుమొగ మించుకంతయు గ
నంబడ రేలు నిన్నమిత
భక్తి భజించితిఁ గానరావు నా
వగపు రవంత నీశ్రవణ
వల్లరులందున నంతదేమొ యీ
బిగువది యేలరా! కుసుమ
వేశల! మోహన! భక్తజీవనా!
73. శరణను వారి బ్రోతునని
చాటి జగంబుల దీనరక్షణా
భరణముగాఁగఁగంకణము
పాణితలంబునఁదాల్చి నన్ను నీ
కరణి నుపేక్షఁజేయఁగను
గౌరవమిట్లని చాటుకుందునే
కరుణను జూడు మారజన
కా! నరకాంతక! భక్తజీవనా!
74. గొప్పతనంపువాఁడవని
కొల్చితినిట్లు నిరాదరింతువం
చెప్పుడెఱుంగ నుస్సురని
యే విలపింప దదీయ పాపముల్
దప్పునొ తాకునో తెలియ
దా? సకలంబు నెఱుంగవాఁడవే
యిప్పటికైన నన్ను దయ
నేలర! పావన! భక్తజీవనా!
75. *ఆనక దుందుభిన్ సుతుఁడ
వై యలరించి, యశోదపెంపగా
ధేనుగణంబు నేలుచును,
ధీరతఁ గాలియుఁదోలి, గోపికా
మానస వల్లభుందవయి,
మామను గంసు వధించినట్టి ప
ద్మానన బ్రోవరా! సురవ
రార్చిత! మోహన! భక్తజీవనా!
(ఆనకదుంధుభి = వసుదేవుడు)
76. లోకగురుండవై, సుజన
లోకహితస్పదకార్య లక్ష్యతా
లోకివియై, త్రయీ భువన
రోచనుఁడై, వరతేచ్ఛనుండు న
స్తోక గుణాఢ్య! శాంతియుత!
శోభనరూపక! జన్మతారకా!
నీకిదె వందనం బమల
నిత్యనిరంజన! భక్తజీవనా!
77. యోగిన్ గాని నేను మరి
యోగ రహశ్యమెఱుంగనించుకన్
భోగమె కోరునామనసు
భోగము యోగము నొక్కచోట సం
యోగము నందు నే తమము
నుజ్వల తేజము నొక్కటౌనె యీ
భోగము వీడి యోగమును
బొందగ జేయుము భక్తజీవనా!
78. లోకము సర్వమున్ తమకు
లోబడియుండెను నేను సైతమున్
మీకు వశూండనయ్యు మది
మీపయి నిల్వ కనాది యౌచు బ
ల్గాకితనంబునన్ దిరుగ
లాగిత్వదీయ పదాబుజంబులం
దేకము జేసితిన్ గొనుము
యయ్యదెకానుక భక్తజీవనా!
79. బాలుఁడ దీనుఁడన్, విగత
భాగ్యుఁడ, మూఢుఁడ, దిక్కులేని కా
కోలము కావు కావు మని
కూయిడు రీతిగ నిన్నెవేడితిన్
యేలెదవంచు నమ్ముకొని
యేలరజాలిని బూనవైతివే?
తాలిమి దూరమయ్యెనిఁకఁ
దాళిగజాలర భక్తజీవనా!
80. పిట్టకుఁజెట్టు, తీవకును
బిట్టగు పందిరి, గాలిదిండికిన్
బుట్టయుఁ, దమ్మికిన్ జలము,
పొట్టకుఁ బుట్టెడు కూడు, భక్తిచే
నెట్టన నమ్ము దాసులకు
నీకృపగాక మరేది దిక్కటం
చిట్టుల నిన్ను వేడితి గ
జేశ్వరప్లన! భక్తజీవనా!
81. దందము రామచంద్ర! భవ
తారకనామ! యభీష్టదాయకా!
దందము కీర్తిసాంద్ర! సుర
తాపనివారక! లోకనాయకా!
దందము జానకీంద్ర! నృప
తల్లజు! దీనజానార్తి హారకా!
దందము నీకుపేంద్ర! వర
ధర్మవిచారణ! భక్తజీవనా!
82. *శ్రీవరుఁడై జగత్రయము
సృష్టినొనర్పుచు, నిందిరేశుఁడై
బ్రోవుచు వానివెండియును
భూతగణాధిపుఁడై హరించుచుం
బావనమూర్తియై కడుశు
భక్రియ నొప్పెడు నీవు దిక్కదీ
నావన కార్యధుర్య బిరు
దార్హులిఁకెవ్వరు? భక్తజీవనా!
(శ్రీ = సరస్వతి)
83. ఎల్లెడ వ్యాపకుందవని
యెంచి నినున్ గని సీత లంకలో
దల్లడమందియున్ మదిని
ధైర్యముచే మరణింపకుండె నీ
చల్లని మోముగన్గొనక
సర్వమయా! యెటుతాపమారు? నా
యుల్లము పల్లవింపగద
యోన్నతిఁ జూపుము భక్తజీవనా!
84. జలఘట భిన్నరంధ్రమున
జారెడు బిందువులట్లు నిత్యమున్
దలఁగుచు మెల్ల మెల్లన వృ
ధాయగుచున్నది యాయువెంత నిన్
దలచినగాని నీ కరుణా
దాసునిగా నను నెంచి బ్రోవవే
విలసితరూప! భూభరణ!
వేంకటనాయక! భక్తజీవనా!
85. నిరతము రామ రామయని
నిన్ను మనంబునఁజింతజేయఁగా
దురితము వెల్గు గన్గొనినఁ
దోరపుఁ జీకటులట్లు దూరమున్
బరువిడునంచుఁ బెద్దలను
పల్కుల నమ్మి యపారభక్తిచే
స్మరణముఁ జేయుచుంటి నిను
సప్తగిరీశ్వరా! భక్తజీవనా!
86. తరణికులేశ! సర్వవర
దా! వరదానమహాప్రవీణ! భూ
ధరసమధీర! జ్ఞానభరి
తా! భరతాగ్రజ! దేవదేవ! సం
గర తలవీర! పక్షితురఁ
గా! *తురగార్తి దవానలాబ్ద! భా
స్వరతరదివ్యపాదవన
జా! వనజాంబక! భక్తజీవనా!
(*తురగ = హృదయ)
87. కలగను వేలనైన నినుఁ
గాంతునటంచుఁ దలంప లోకమం
దలి వివిధంపు గృత్యములె
దర్శనమౌటయెగాని, నీదుస
ద్విలసిత మోహనాకృతి మ
దింబొడఁగట్ట దదేమి పాపమో
తలఁపఁగరాదు నీవిమల
దర్శనమియ్యవె భక్తజీవనా!
88. ఎందరఁ బాపులన్ కరుణ
నేలవు సకృప దుఃఖితాత్ములిం
కెందఱిఁ బ్రోవవో సరసి
జేక్షణ! వీరల యందు నీకు నే
బొందని భారమైతినె? త
పోజనసేవిత! నాదు వాంఛలా
యందనిపండ్ల కాశపడి
నట్టులనయ్యెనె! భక్తజీవనా!
89. అమరులవీటినైన నిట
లాక్షునివాసమునైన, దివ్యమౌ
కమలజు లోకమైన సిత
కంజవిలోచను సద్మమైన, నా
దు మనము నందుఁ గోర భవ
దుఃఖహరంబగు నీదుదర్శనం
బమితదయాకరా! యొసఁగ
నాత్మఁ దలంచెద భక్తజీవనా!
90. వారణాయుధనాధ భయ
వారణ వారణ కార్య కౌశలా!
*నారదనీల! పాపశిఖ
నారద! నారదమౌని వందితా!
నీరజనాభ! భక్తజన
నీరజ నీరజమిత్రసన్నిభా!
**తారకహార తామరస
తారక! తారక! భక్తజీవనా!
(* నారద = మేఘము; **తారక = కన్ను, ముత్యము)
91. ననుఁ గరుణించినంతట న
నాథశరణ్య! పవిత్రకీర్తి క్రుం
గునె? భువనాధిపత్యమిల
గోల్పడునే? నునుసోయగంబు పా
రునె? నవసద్విలాసములు
లుంఠితమౌనె? యగౌరవంబు నీ
కొదవినె? సంపదల్విరతి
నొందునె? శ్రీవర! భక్తజీవనా!
92. నయగుణశీల! ఘోరమగు
నాదుచరితంబును బాపగాఁ గృపా
మయుఁడవు నీవె చాలుదని
మానకనేమొరవెట్టుచుండ నే
మియు నెఱుగంగనట్లు విర
మించిన దిక్కెవరయ్య! యింతని
ర్దయతగునా? మదీయ హేది
తామము బాపుము భక్తజీవనా!
93. ఎచ్చటనుంతివో తెఱుఁగ
నీశ్వరలోకమొ, ధాతృవాసమో
ముచ్చటఁగొల్పు విష్ణుపుర
మో, బలి సద్మమొ, దేవరాజ్యమో,
సచ్చరితాత్మ! నామొర ప్ర
సారితమై శ్రవణంబులం దొగిన్
జొచ్చెనోలేదో నన్నుఁదయ
జూడవదేటికి భక్తజీవనా!
94. పాలును నేయి చక్కెరల
పాయస మొల్లవు, బోయ ముద్దరాల్
మేలిమిఁజూచి యెంగిలిని
మెచ్చి భుజించితివేమొ, యౌరనీ
లీలలెఱుంగ శక్యమె! భ
ళీ సుగుణాఢ్యుఁడవీవు యీపరా
కేలర? యేలరా! కరుణ
నెంచి మనంబున భక్తజీవనా!
95. రక్షకుఁడంచు నవ్య మణి
రాజివిరాజిత సౌఖ్యదాయకా
ధ్యక్షము దైత్యరాజపుర
తారము, లంకను వీడి నీకృపా
భిక్షను గోరి కొల్వఁగ వి
భీషణుఁడార్తినిఁ జేరెసేవకో
పేక్షకుఁడంచు నిన్నెఱుఁగ
బెట్టునె పాదము భక్తజీవనా!
96. రాజకిరీట దివ్యమణి
రాజవిశుద్దమయూఖకాండనీ
రాజితపాదపంకజవి
రాజిత రాజబిడౌజుఁడానలుం
డోజు యొకింతలేక విభ
వోన్నతిఁ బాసి చరించె నీదయా
తేజము దప్పికాదె జగ
తీపరిపాలక! భక్తజీవనా!
97. భాసురపంకజోదర! సం
భాభవనంబున నంబరంబు దు
శ్యాసనుఁ డీడ్వ ద్రౌపది వి
శాలవిలోచన నిర్గతామృతా
భాసముఖాబ్జయఒ నునుఁ గృ
పామతిఁ బ్రోతువటంచు బిల్వ గృ
ష్ణా సదయాక్షయాంశుకమొ
సంగియు బ్రోవవె భక్తజీవనా!
98. శరణనువారి బ్రోతువు ప్ర
శాంతమనస్కుఁడ వాదిదేవ! య
ధ్వరఫలదాయకుందవు ని
వారిత భక్త భయుందవౌ భవ
చ్చరణ సరోరుహంబులకు
సాగిలి మ్రొక్కెడు నాదు శీర్షమె
వ్వరికి నమస్కరింపనటు
వాంఛను దీర్పవె భక్తజీవనా!
99. పన్నగ కిన్నరామర స
పర్యల నొందెడి నీవు మన్మనో
త్పన్నము చంపకోత్పల శ
తంబగు మాలిక దాల్చి ప్రేమతో
కన్నకుమారు రీతి నను
గావుము నిర్దయతోడఁజూడకా
పన్నుఁడ మందభాగ్యుఁడ కృ
పాభరితాత్మక! భక్తజీవనా!
100. మంగళమిందిరేశ జయ
మంగళముజ్జ్వలచక్రధారణా!
మంగళమంబుజాక్ష! శుభ
మంగళమార్తజనావనా! హరే
మంగళమీశ్వరా నిరత
మంగళదాయక! భక్తజీవనా!
ఇది
శ్రీరామచంద్ర శారదాంబా కరుణా కటాక్ష భవిత కవితోచ్ఛారణ పాత్ర కాశ్యపగోత్ర కువిందకులపయః పారావార రాకాసుధాకర వాసామలయార్య చంగమాంబా గర్భశూక్తి ముక్తాఫల కృష్ణమూర్తి నామధేయ కవి విరచిత
భక్తజీవన శతకము సమాప్తము
శ్రీకృష్ణార్పణము
No comments:
Post a Comment