మాస్వామి (విశ్వేశ్వర శతకము)
విశ్వనాధ సత్యనారాయణ
1. శ్రీమంజూషిక, భక్తరక్షణకళాశ్రీచుంచు, వానంద వ
ల్లీమంజు ప్రసవంబు, చిద్గగన ప్రాలేయాంశువున్, మోక్ష ల
క్ష్మీ మానిక్య వినూత్న మేఖల కటాక్షీభూత నీహారరుక్
శ్రీమంతంబయి పోల్చు వెల్గు నొకఁడే సేవింతు విశ్వేశ్వరా!
2. కైలాసాచల సానువాసము, వృషస్కందాగ్ర సంస్థాయి, త
త్ప్రాలేయాచల కన్యకా కుచతటీ పర్యంక నిద్రాగతం,
బాలోలాగ్ర జటావనీఘటిత నాకౌకస్సరిత్కతంబు, దే
హాలంకారిత లేలిహానము, వెలుం గర్చింతు విశ్వేశ్వరా!
3. నీవే రాజువు నేను సత్కవిని దండ్రీ! నిన్ను వర్ణించెదన్
నీవే దైవమ నేను భక్తుఁడను దండ్రీ! నిన్ను ధ్యానించెదన్
నీవే భూమివి నేను గర్షకుఁడఁ దండ్రీ! నిన్నుఁ బండించెదన్
నా వైదగ్ధ్యము నీవ చూతు, కృప సంధానించు విశ్వేశ్వరా!
4. వాగ్నేతృత్వము వృత్తిరీతి రసభా వౌచిత్య శయ్యార్థ సం
లగ్నోక్త్యంచితలక్షణధ్వని గుణాలంకారముల్ లేని నా
నగ్నోద్విగ్న కవిత్వ మెంచఁగఁద్రయీనాదంబొ? ఓంకారమో
భగ్నారిధ్వజ! వేదపుం గొసలొ నిన్ భాషింప? విశ్వేశ్వరా!
5. శ్రీవాణీగిరిజాధినాథుల జగత్స్థి త్యుద్భవాంతక్రియా
ప్రావీణ్యాత్ములఁ దత్తదాచరణభారం బూనఁగాఁజేసి నా
నావిశ్వంబు లనంతగోళము లనంతాకాశ సంభ్రాంతముల్
గా విశ్వాత్మ! త్వదాత్మనీనములుగాఁ గావింతు విశ్వేశ్వరా!
6. శ్రీనిహారనగాధిరాజతనయా స్నిగ్ధాననాంభోజ ని
త్యానందైకపరుండు, గంగాఝరనిత్యస్నాత, రాకానిశా
సూనాంగీశశిరోవిభూషణుఁ డటంచున్ నిన్ను ధ్యానించు భ
క్తానీకంబుల పైపయిన్ గరుణరాదా నీకు విశ్వేశ్వరా!
7. తలపై జాబిలి నెమ్మిపించియము వేదశ్వానముల్ ముందు న
మ్ములునున్ ముమ్మొనవింటిబద్దయుఁ గరాంభోజాతయుగ్మంబునన్
మలరాకూఁతురు బోయసాని వెనువెంటన్ రాఁగ మాయామృగ
మ్ముల వేఁటాడుఁ బుళిందరాజు నిను సంపూజింతు విశ్వేశ్వరా!
8. చలి మిన్నేటి కెలంకులందు సొగసుం జాబిల్లి పూరేక వం
కలు సింగారముగా నమర్చి చెవులన్ గంపింపఁగాఁ బాఁప పో
గులు మేనన్ బులితోలువైచికొని కొంగుల్ జారఁబ్రేమంపుజూ
పుల సంధ్యాసతిఁజూచు నీసొగసు మమ్మున్ బ్రోచు విశ్వేశ్వరా!
9. కరితోల్పట్టముకొంగుతోఁ బునుకభిక్షాపాత్ర చేఁబూని సం
స్కర్ణం బించుకలేమి మైజడలు మూఁగన్ బొట్ట పెల్లాఁకటన్
నురుగన్ ముమ్మొనకఱ్ఱతోఁ దడుముకొంచున్ లచ్చిగేహంబుముం
దర నిల్చున్ భవదీయభిక్షుకత కంతం బెప్డు విశ్వేశ్వరా!
10. ఓ సామీ! అలకొండకోయెతకు నీయొయ్యారమే బూదిపూఁ
తే సర్వంబయి నీకు నా యమ సొబంగే నచ్చి కన్నారు ర
య్యా! సంతానము, నేన్గుమోముకఁడు వింతౌనార్మొగాలొక్కడో
హో! సౌరపద కాకరుం డొకఁడదేమో కాని విశ్వేశ్వరా!
11. నీవో యౌవనమూర్తి వౌదు వసురానికంబు మ్రదించు శి
క్షావైశద్యము పొల్చు నీతనువు నీశా! అన్నపూర్ణాంబికా
దేవిం జూచిన వేద్ధవోలె మదికిన్ దీపించు దాంపత్య మీ
భావం బెవ్వఁ డెఱుంగు శైలతనయా ప్రాణేశ! విశ్వేశ్వరా!
12. ఓసామీ! అదియేమిపాపమొకదా యూహించి యూహించి నీ
తో సయ్యాతము లాడెదన్ గృపణబంధూ! యెట్లొ సైరింతు వీ
దోసం బా నిగమాధ్వమం దుపనిషల్లోలాయతాక్షీపరీ
హాసశ్రీఁగను నీకు మత్కృతపరీహాసంబు విశ్వేశ్వరా!
13. అంతా వ్యర్థము వట్టి యాశ, పెనుమాయావల్లి, దివ్యంబు సీ
మంతిన్యర్ధము నీదుమూర్తి యొక్కఁడే మాతండ్రి! నిక్కంబు నా
కింతా తోఁచియు నీమహార్థమెపుడేనీ రూఢి కాలేదు శా
మంతీ కుట్మలవ త్సుధాకర శిరోమాణిక్య! విశ్వేశ్వరా!
14. దివ్యజ్యొతివి నీకుఁ బెల్లుబుకు భక్తిన్ జాటజూటాగ్ర చా
రువ్యాబద్ధ పవిత్ర దైవతాధునీ! రుద్రాభిషేకం బొగిన్
నవ్యశ్రీగతిఁ జేయగా నమకమైనన్ రాదుగా హూణ వా
క్కావ్యామోదముముక్తిత్రోవెదురుచుక్కైపోయె విశ్వేశ్వరా!
15. నృత్తాంతంబునయందుఁ ద్వద్ధ్వనితభేరిన్ బుట్టె శబ్దాగమం
బత్తర్కాగమ ముద్భవించె భవదీయాంబూకృతిన్ వేదముల్
త్వత్తస్సంభవముల్ శివా! ఉపనిషత్త్వం బందె నీమేను వి
ద్యాత్తాకారునిఁ బొంద నాకవిత కౌనా నిన్ను విశ్వేశ్వరా!
16. సంప్రార్థించెద నిన్ను మోక్షయువతీ సంపుల్ల పీనస్తనా
గ్రౌంప్రాణాక్షర లేఖనాచతుర హస్తాంభోజ! ఓస్వామి! సా
యంప్రాతస్సుల సంగవంబునను బూర్వాహ్ణాపరాహ్ణంబులన్
సంప్రీతాత్ముఁడ వెప్పు డౌదువు భవా! సర్వజ్ఞ! విశ్వేశ్వరా!
17. పాటింతున్ నిను సర్వదైవతా శిరోభాగస్థ రత్నంబుగాఁ
బాటింతున్ సకలాఘముల్ సురధునీ పాథస్తరంగాగ్ర భా
గాటచ్ఛీతలమందమారుతతరంగాధూతముల్ గాఁగ నై
శాటప్రాణ మరుమ్నహాభుజగవంశస్వామి! విశ్వేశ్వరా!
18. దిగ్వ్యోమాఖిల పూర్ణ! నీయెడల భక్తిన్ బొల్చి నీమూర్తి స
మ్యగ్వ్యాఖ్యానము చేసెఁబో, అఘములేలా నిల్చునయ్యా! సుధా
రుగ్వ్యాబద్ధ కిరీట! దైవతజగద్ద్రు శ్రీప్రసూన ప్రభా
స్రగ్వ్యుత్పత్తులు నీ జటలతలు రక్షాదక్ష! విశ్వేశ్వరా!
19. అంహోవారణ కుంభ పాటన కళోద్యచ్ఛ్వేత భూభృద్దరీ
సింహస్వామి! భవత్ప్రగర్జనల దిక్సీమల్ ప్రతిధ్వానతా
రంహఃఖేదము పొంది భీతిమెయిఁ దత్రత్యుల్ నిశాటుల్ "నచా
హం హంతవ్య" యటంచు వ్రాలెదరు భార్యల్ కాళ్ళ విశ్వేశ్వరా!
20. నీ వాదిత్యుల వెంటఁబెట్టుకొని తండ్రీ! దుష్టసంహార వే
ళావేశంబున శత్రుమూర్ధములయం దాఘాతముల్ సేయఁ గ్రో
ధావిష్టుల్ తమ రక్తమే యితర రక్తంబంచు దైత్యాధముల్
త్రావన్ జూతురు రాక్షసప్రకృతి యౌరా! వింత! విశ్వేశ్వరా!
21. ఆధ్మత ప్రమధాళి శంఖములఁ బెల్లై, సోమపీథి ప్రణీ
తేధ్మప్రోజ్జ్వల వహ్ని కారవము లెంతే దట్టమై, జాతవీ
థీ ధ్మాతామరవాస్తరంగ మయి, యింతే మొఱ్ఱ విన్పించదో!
క్రుధ్మాంతుండవొ? దోసముండిన యెడన్ రూపించు విశ్వేశ్వరా!
22. నద్వైహాయస మార్గ చిత్పరిణ తాచ్ఛ జ్యౌత్స్నికాకారి ని
త్యాద్వైతాక్షిలలోకగర్భపరిపూర్ణానంద చంద్రుండవై
మద్వాగ్లేశముచేతఁ గట్టువడి యీ మర్యాద పాటింతు నా
హృద్వేగోద్గత భాష్పముల్ గొనుము తండ్రీ! కాన్క, విశ్వేశ్వరా!
23. నీ విన్నాణము చిత్రమే మకుటరత్నీభూత జైవాతృకా!
ద్రైవేయీకృత కాద్ర వేయ! గళరుద్రాక్షీభవద్బాడబా!
సేవాస్వీకృత భూతరాక్షస పిశాచీప్రేత! నేత్రప్రభా
శ్రీవిన్యస్త కృశాను! పార్వతమృగాక్షీదార! విశ్వేశ్వరా!
24. ముక్త్యాధ్వనంబుల నీపదాంకముల వంపుల్ పూలఁబూజింతు సం
సక్త్యాశాభయ లోభ మోహమద తృష్ణావల్లికల్ ద్రెంతు, ధీ
శక్త్యుత్సాహములన్ దమఃప్రకృతిలో సారింతు జ్యోతిర్లతల్
భక్త్యావేశ మొసంగితేని యొకఁ డప్పా! నాకు విశ్వేశ్వరా!
25. గండూషించిన నీట స్నాన మొసఁగంగా, సల్లకీ శాఖలన్
దుండానన్ గొనిదెచ్చి పూజలిడఁగా, ద్యుత్యున్నతంబుల్ ఫణా
దందంబందునఁ దెచ్చి రత్నములు పాదద్వందమున్ జేర్పఁగా,
నిండారన్ బెను భక్తి కబ్ధిగతిఁ బొంగే రాదు విశ్వేశ్వరా!
26. స్వఃపూర్గోపుర శాతకుంభ శిఖర స్వచ్ఛప్రభల్, పాటితై
నః పాండిత్య ధురంధరాఖిల సురానంతాధ్వ ఘాసచ్ఛటల్,
నిఃపర్యాప్తసుఖాలు కోరుటకుఁ బోనే పోదు నీ దివ్య స
ద్యః పారంగత చిన్మయాకృతి సదైక్యం బిమ్ము, విశ్వేశ్వరా!
27. అక్లీ బద్వయమూర్తి! నీదు జట లయ్యా బాలపత్రావళుల్
శుక్ల ద్వాదశి చంద్రఖండము జటాజూటిన్ బ్రసూనంబు, ని
త్యాక్లాంతంబును భస్మపుప్పొడి, మధుస్యందంబు ద్యోగంగ, నా
యీక్లేశంబు హరింప సౌరుతరమూర్తీ! చూడు, విశ్వేశ్వరా!
28. కంటే నీ పదముల్ త్రయీపరిణతాగ్ర్య శ్రీమహార్థస్ఫుర
ద్ఘంటామార్గము లల్పశాత్రవసతీ కంఠాగ్రసూత్రావళీ
లుంటాకంబులు మోక్షపట్టణ చరలోలాక్షి కాంచీరవ
ద్ఘంటానాదము లాశ్రితావనకళాత్తశ్రీలు విశ్వేశ్వరా!
29. నూత్నాంభోధరలక్ష్మి పొల్చి స్తనయుత్ను ప్రౌఢజీమూతముల్
రత్నంబుల్ మెఱపించుకొన్నవి దిశల్ రంజిల్ల సౌదామనీ
పత్నీదేహములందు నీ కరుణ యున్ భ్రాంతిన్ విలోకింతు నా
యత్నంబుల్ నినుఁబొందు నెప్పగిది నూహాతీత! విశ్వేశ్వరా!
30. సావిత్రాధ్వమునందుఁ గాంతిమయనక్షత్రంబుగా జ్ఞాన వి
ద్యావీథిన్ మిను కట్లుగాఁ బరిణతత్రయ్యంత మార్గంబులన్
నీవెగా పొనరించు మ ట్లొడఁబడన్ నీకంత కష్టంబుగా
భావంబందునఁ దోఁచెనేని యది నా ప్రారబ్ధి, విశ్వేశ్వరా!
31. ద్యోస్రోతోంబులు దిజ్మదేభకరసింధుశ్రీలు కల్పప్రసూ
నస్రగ్మాలలు శ్వేతహస్తికటదానంబుల్ త్వదభ్యర్చనా
ఘస్రారంభములందు స్నానకుసుమౌఘశ్రీసుగందార్థ మై
త్రిస్రోతఃపతి! నేను నాకపతినా తెప్పింప! విశ్వేశ్వరా!
32. ఏల యొక్కఁడు కొన్నిశబ్దముల కెట్లే నర్థముల్ నేర్చి శ
య్యాలంకార రసధ్వనుల్ తెలిసి కావ్యమ్ముల్ క్వచిత్కంబుఁగా
నాలోకించి తనంతపండితుఁడు లేఁడంచున్ విడంబించుఁ దం
డ్రీ! లీలామయమూర్తి! నిన్నెఱుఁగ లేనేలేఁడు విశ్వేశ్వరా!
33. పది పద్యంబులు వ్రాసి దీనిఁగయికో పైకంబు తే యంచుఁ దా
నిది సాగించె నెవండునేని యని యూహింపంగ నేల యశ
స్సది వాంఛించెడు లోభిదాతవలెఁ గాడా? కాఁడు, ఔనా? యగున్
మది నీకెక్కినయేని నా తపము సంబాళించు విశ్వేశ్వరా!
34. అయ్యా! భక్తులపైని నీ కరుణ దివ్యాభస్తరంగాలతో
ముయ్యేఱై ప్రవహించుఁ గానియెడ శంభూ! దివ్యవారాణసీ
శయ్యానిద్రితు నిన్ను మేల్కొలిపిదీక్షన్ దెచ్చెమాతండ్రి తా
నియ్యామ్యావని నందమూరునకు నింకే రీతి? విశ్వేశ్వరా!
35. నిన్నున్ మజ్జనకుండు చూపిచనెఁ గానీ నిన్నుఁ బీడింపఁగా
నెన్న గాస్తకుకూస్త కిప్పటికి నీవే దక్క దిక్కొండు లే
దన్నా! మొన్నటిదాఁక మౌన మది గర్వాధీనతన్ గాదు నీ
కన్నన్ వేఱొకయుండయున్నదనియున్ గాదయ్య విశ్వేశ్వరా!
36. మాతాతల్ గడియించునాస్తి యొకయేమాత్రంబుమాతండ్రి పెన్
దాతృత్వంబున కాఁగలేదు కవితా ధమ్మిల్ల కళర సు
శ్రీ తావుల్, తిరిపెంబురాయఁడవు నీసేవల్, ద్విధామార్గముల్
యాతాయాత నిరంతయాతనయు నాయాసంబు, విశ్వేశ్వరా!
37. తన హస్తంబునఁ బెల్లురేఁగిన మహాదాతృత్వ శౌర్యాగ్ని కిం
ధనమైపోయిన మమ్ముఁబుత్త్రుకుల మాదారిద్ర్యమున్ జూచి యీ
తని సేవింపుఁడటంచుఁ జెప్పి చనియెన్ మాతండ్రి, బంగారుకొం
డను జేఁదాల్చిన నిన్నుఁజూపి, కనవా నా మాట విశ్వేశ్వరా!
38. పునుకల్ చూచిన కాజగడ్డలు ఫణుల్ పొల్పారు కాజాకు లే
మననౌ జాబిలి కాజపూ వెరువుపెల్లై సారమౌ దుబ్బుల
ల్లిన యుండల్ మొయి బూదిపూఁత తెలిఢిల్లీభోగముల్ చేను నీ
వనెదన్ మా పితృపాదు లమ్మని పొలంబౌ దీవు విశ్వేశ్వరా!
39. మీ దాతృత్వమొ తండ్రిదాతృతయో మీమీమధ్యనున్నట్టి లా
వాదేవీలకు నాదు బాధ్యతకు సంబంధంబులే దిట్లు రా!
ఏదో లెక్కలు తేల్చుకో! మొఱటుతో నేలా? యొడల్ మండెనా
ఎదో వచ్చినకాడి కమ్మెదను సుమ్మీ నిన్ను, విశ్వేశ్వరా!
40. ఉదితైణాంక మనోజ్ఞ మౌళితల శాణోల్లేఖ రత్నద్యుతీ!
అదియున్ బ్రహ్మకపాల నిర్గత సహస్రార ప్రభాపుంజమో!
అదియున్ రూపముపొంది నిశ్చలమునౌ నాహార్యకన్యాసుధా
స్పదరేఖాస్మిత మంజుభావమో కృపాసర్వస్వ! విశ్వేశ్వరా!
41. సర్వంబున్ బ్రతికూలమే యయిన యోజన్ దోఁచులోకంబు ని
త్యార్వాచీన భవచ్ఛ్రితావనకళా వ్యాసంగ పారీణతా
ఖర్వ శ్రీమధుమూర్తి దీనజనరక్షాకంకణ ధ్వానముల్
పర్వన్ దిక్కుల నేఁగుదేరఁగదె నన్ బాలింప విశ్వేశ్వరా!
42. కడు నాభాగ్యము సందెచీఁకటులుగాఁ గంపించుఁ గంపించవే
నడకల్ వోయినఁ గంతకాధ్వములకే న న్నీడ్చు విధ్యానిధిన్
జడుఁడట్టుల్ సుజనున్ దురాత్ముఁడటు ప్రజ్ఞావంతు సామర్థ్యహీ
నుఁడువోలెన్ గనిపింపఁ జేతు విది యెంతో వింత విశ్వేశ్వరా!
43. నా సామీప్యమునందె రత్ననిధు లున్నట్లౌను, జేసాచ నం
తా శూన్యం, బగు క్షీరవార్ధి వటపత్రంబందు నిద్రించు న
ట్లే సుప్తిన్ గలగందు, మేలుకొని నట్టేటన్ గనుల్ తేల్తు, నీ
యాశాహేమ కురంగ కృష్ణుఁడను ముక్తాసుండ విశ్వేశ్వరా!
44. మాయాపద్ధతి చేతఁగాదు, పరసంపత్కైతవప్రక్రియో
పాయవ్యాప్తికి బుద్ధిపోదు, కృపణత్వం బొప్ప దుర్మాగులం
దే యాచ్జామతి స్తోత్రపాఠము లొకింతేఁ జేయఁగాఁజాల దం
డ్రీ! యీజీవితనౌక పట్టఁగల దొడ్డేరీతి విశ్వేశ్వరా!
45. అప్పా! లోకరహస్య మీ వెఱుఁగ వేనై నిన్నుఁ బీడించెదన్
దెప్పన్ జూచెద, రద్ది పెట్టెదను, నా త్రిప్పల్ పడన్ లేక నీ
వొప్పన్ బిల్తువు మధ్యవర్తులను, వారోస్వామి! హా! నీదియున్
దప్పే నందురు, కాన సంధి కెటులైనన్ రమ్ము విశ్వేశ్వరా!
46. అన్యాయం బనినంత భగ్గుమని దేహం బంతయున్ మండి కా
ఠిన్యంబున్ గొను నాదు వాక్కు శివ! తట్టీకల్ మహాకైతవో
పన్యాసంబులఁ జేయుచుందురు ఖలుల్ ప్రభ్రష్ట సన్మార్గు లే
మన్యుప్రక్రియ లోకవృత్తి నడచున్ మాయందు విశ్వేశ్వరా!
47. ఇల లజ్జాపరిహీణు లీ జనులు తండ్రీ! నీవు మర్యాద త్రో
వలు పాటించెడు నేత వీ జనులు చెప్పన్ మాంసభుక్తంబు విం
తల కోరల్ మిడిగ్రుడ్లు లేని దితిసంతానంబు నీ వాసురా
ఖిల ప్రాణానిల దందశూకమవు, ద్యోకేశాంత! విశ్వేశ్వరా!
48. ఈతూష్ణీంకృతి యేల నీవు మఱి మాకేదైవమం చెంచుచున్
నీతోడన్ మడివెట్టుకొంటివి, భవానీభర్గులే నాకుఁ ద
ల్లీ తండ్రంచుబు నమ్మితిన్ గరుణ పాలింపంగదే నాకు నే
లా తీవ్రాపద? యప్రతిష్ఠ పడనేలా మీకు? విశ్వేశ్వరా!
49. పో వింటన్ బదియారు వన్నె కనకంబో, నిల్చు నక్కొండఁజా
దీవెండో, తనుభూషలన్ దలలపై దీపించు రత్నంబులో,
నీ వేదో యొకయింత యిచ్చినను గాని చాలు దారిద్ర్యమే
ఘావష్టంభము తీవ్రమారుతహుతంబైపోవు విశ్వేశ్వరా!
50. ధృతశీతాంశుకిరీట! నా బ్రతు కెడారింబోలెఁ గావింతువో?
అతినైరాశ్యము నిన్నువంటి సురసంఘాధ్యక్షు పాదాంబుజ
ద్వితయారాధన శీలవంతులకు, నింతే తప్పదాయేని, యే
గతి కల్పింతు సతీకృతామరధునీకా! మాకు సర్వేశ్వరా!
51. స్వామీ! నాబ్రతు కెండి నీ కరుణ్ వర్షాగాఢ జీమూత మా
లా మాధుర్యము లేది దుఃఖమయవేళా గ్రీష్మసూర్యాతపౌ
ష్న్యామందత్వముచేత బీడువడి యంతా నెఱ్ఱెలైయున్న దిం
కేమో సాగుకుఁ గుంభవృష్టిపడి కానీ రాదు, విశ్వేశ్వరా!
52. స్వామీ! ఏలనయాబహూక్తులునినున్ బ్రార్థించుచున్నాను రెం
డేమాటల్ సిరులిచ్చి వ్యర్థజనులందే సేవ చేయించ కె
ట్లో మాన్పింపుము, కాదయేని మృదుపాండు శ్రీనవచ్ఛాయలో
నీ మై దీధితిలోనఁ జేర్చుకొను తండ్రీ! నన్ను, విశ్వేశ్వరా!
53. నా స్వామీ యిది యేమి న్యాయ మనెదన్ దారిద్ర్యమన్పేరిటన్
నా స్వాతంత్ర్యము నా మతిప్రతిభ నానామత్ప్రభావంబులన్
భాస్వన్మత్పతృరక్త గౌరవము కిం భాగ్యంబుగాఁ జేతు నా
యీ స్వాంతాలయ నిత్యపూజలకు నీకే లోటు విశ్వేశ్వరా!
54. ఈ నా భార్యయుఁ బిల్లలున్ బ్రదుకుత్రోవేదేనిఁజూపించు మం
తే నేఁడే చని యేగిరీంద్రములనో నిద్రింతు, నే వాగులం
దో నీరానెద, నే ఫలావళులో తిందున్, బర్ణముల్ మేసెదన్
నీ నిష్ఠాగతి నీవుగాక మరి లేనే లేను విశ్వేశ్వరా!
55. నే నీ రోజున నేఁగి యే యడవులందే నాకులన్ దించు నె
ట్లో నిల్పన్ బ్రయతింతు దేహమటు కాదో చచ్చెదన్ లెమ్ము పో
కానీ యీ ఋణ మెట్లు తీర్చెదనొ యీ కాసంతకై వచ్చి జ
న్మానేకంబులు దుఃఖినై తిరిగి పొందన్ జాల విశ్వేశ్వరా!
56. ఈ సంసారపయోధి లోఁతెరుఁగ కిట్లే యీది నట్లే మన
స్త్రాసంబౌ మృతి యున్నదం చెఱిఁగియున్ దన్మార్గమే పట్టి న
ట్లే సామీ! యిది జీవిలక్షణము, నిన్నే సన్నుతింపంగలే
నే సంస్తోత్రము సేయఁబోదు జనుఁ డింతే సామి! విశ్వేశ్వరా!
57. తెలిపూఁబానుపులందు నొత్తిగిలి నిద్రింపన్, జగాలేత వె
న్నెలలోఁ జల్లని పిల్లగాలి పొరలో నెమ్మేను చేర్పన్ నెలం
తల లేనవ్వుల సోగబుగ్గ గిలిగింతల్ వెట్ట, నెంతెంత కో
ర్కులు నాకున్నవొ, అంతనిన్నుఁగన కోర్కుల్ లేవు, విశ్వేశ్వరా!
58. మఱి రక్షించుట నన్ను నీకు బహుసామాన్యంబుగాఁదోఁచునో
పురముల్ గాల్చుటకాదు, బ్రహ్మలిఖితంబున్ మార్చుటాకాదు, సం
సరణాంభోది మహాపదద్రిధుత తృష్ణా వీచికల్లోలగ
హ్వరమౌ నాహృదయాన శాంతి నెలకొల్పన్ జూడు విశ్వేశ్వరా!
59. సాఁబాముల్ మనకాటలో విడుచుఁగూసాలాజడల్ ముళ్ళలో
జీబుల్ గట్టిన మింటి క్రొత్తరఁగలో చిన్నారి జాబిల్లిగా
రాబంపున్ దనికించు వెన్నెలల దారా లల్లులో కీలుబొ
మ్మై బందిన్ గొనె నా తలంపు తెమిలింపన్ రాదె విశ్వేశ్వరా!
60. కులదైవం బనుచున్ దలార నినుమ్రొక్కుల్ మ్రొక్కుకొన్నాను లో
కుల దైవంబువలెన్ ముభావమున నీకున్ జేఁత మేలయ్య? నీ
తలపై వెలుపుబువ్వక్రొత్తరఁగ మొత్తాలూరి ముయ్యేటి చెం
గలువల్ జార్చిన తేనె నా పయినిఁ జిల్కన్రాదె విశ్వేశ్వరా!
61. నాకేమో మఱి నీవొసంగుదని రత్నాలున్ మహైశ్వర్యముల్
నీకేమో మఱి నేను బూదితనువున్ నిండారఁగాఁబూసి భి
క్షాకుక్షింభరవృత్తిఁ బుత్తు ననుచున్ గాలంబు భిన్నాధ్వముల్
గా కేదోయొక మధ్యత్రోవఁజన నేల రావు విశ్వేశ్వరా!
62. నాకున్ జిన్నతనంబునుండి మదిలోనన్ దోచు వైరాగ్యమే
కా కీ సంస్కృతియొండు వెంతఁబడి యీ కాంతాసుతుల్ పేరిటన్
నా కాళ్లన్ బెనవైచుకొన్నయది కంఠానన్ దగుల్కొన్న దీ
శోకం బేగతి మాన్పెదో గిరిసుతాశుద్ధాంత! విశ్వేశ్వరా!
63. ఈసంసారముచేత నిల్లొడల్ గుల్లేకాని లేదేమి మి
థ్యాసౌఖ్యం బనిపించు దుఃఖమయ జన్మానేక మూహింపఁగా
సీసీ పో యనుఁగాని వానిపయినే చిత్తంబు లగ్నంబగున్
భాసాభాసము నీదు చిన్మయప్రభావజ్యోతి విశ్వేశ్వరా!
64. నా కే పూర్వజనుర్మహత్త్వముననో నాతండ్రి! నీ యీ పద
శ్రీకంజాతములన్ దగుల్కొనియెఁబో చిత్తంబు దానన్ ననున్
జేకో భాద్యత నీకయున్నయది తూష్ణింభావ మేలా ప్రభూ!
నా కుయ్యింతయు నీచెవిన్ జొఱద సంధ్యాదార! విశ్వేశ్వరా!
65. నేనున్ జేసిన పాపకర్మములు తండ్రీ! చెప్పఁగా రానివిన్
లోనన్ దల్పఁగనైన రానివి దయాలోకాంబుధారాప్రవా
హానన్ క్షాళన చేసివైచెదవొ, లేదా రౌరవాగ్నిస్ఫులిం
గానీకంబుల నూరెదో రురువిషాణశ్రేణి! విశ్వేశ్వరా!
66. ఏనాఁడో శివ! దుఃఖసంస్కృతి మహాహీనాంబుధిన్ దాటి యెం
దో నేనొక్కఁడనే మహాగహనమందున్ నిల్చి నీతేజమున్
బ్రాణాయామమునందుఁజూచి "శివ!నిర్వాణైకమూర్తీ! నిరం
తానందైక మయస్వరూప" యనుచున్ ధ్యానింతు విశ్వేశ్వరా!
67. నే నీ లోకపు దౌష్ట్యమున్ దెలిసి తండ్రీ! పెన్ విరాగంబుతో
దీనిన్ వీఁడఁగనెంచు నా నిముసమందే భార్యగా సంతతిం
గా నా కాళ్ళను బంధముంచితివి పోఁగానెంతుఁ బోనైనచోఁ
బ్రాణాల్ పోవునువీరి కీ మమతఁ గోయన్ జాల విశ్వేశ్వరా!
68. వ్యాఘ్రంబుల్ గలవంచు నాకుభయమేలా! అచటన్ గోముఖ
వ్యాఘ్రంబుల్ బలె మోసపుచ్చవుగదా పైకెంతొలోనంతయే
శీఘ్రం బచ్చొటికేఁగి తాపసుఁడనై చింతింప వాంఛింతు వ్యా
జిఘ్రున్మోక్షపథాశ మిక్కుటమయా చిత్తేశ! విశ్వేశ్వరా!
69. నినువీక్షించెద నంచుఁ బూజలిడుదున్ నీకంచులోనెంచుచున్
గనులన్ జోరునభాష్పముల్గురియుచున్ గాద్గద్యముల్ పొందుదున్
దనివోకే యెదలోని భావములి పద్యాలల్లి నాగుండెతోఁ
జని లోకంబును జూచిపుచ్చెదను నిశ్వాసాలు విశ్వేశ్వరా!
70. ఈ సాయంతన మేఁగుదెంతువని నే నే రోజు కా రోజు తం
డ్రీ! సర్వాశలు యత్నముల్ ఫలముల్ నీ మీఁదనే పెట్టి యా
యాసం బొక్కఁడె నే మిగిల్చుకొని సర్వానేహమున్ బుత్తు నీ
వేసం బూర్జితచంద్రచూడ మెటులన్ వీక్షింతు విశ్వేశ్వరా!
71. స్వాంతంబన్ మృదుశయ్యపైఁ బఱచితిన్ భక్తిప్రథావస్త్ర మ
త్యంతంబున్ బయిఁ జల్లితిన్ మృదుల భావాఖ్యప్రసూనాళి నా
యంతర్గేహము బాగుచేసితిని నీకై కంతిదారిన్ బ్రతీ
క్షింతున్ వాసకసజ్జికన్ బలె నుమాచిత్తేశ! విశ్వేశ్వరా!
72. నీ వేమో యరుదెంతువంచు మఱి నన్నే వచ్చి నాతండ్రి! "యీ
నీవా నన్నెద నమ్మి కష్టముల నెన్నేఁబొందె"దం చోర్పుగా
నేవో చెప్పెదవంచు నా మనసులో నేమేమొ యూహించి నీ
పై విశ్వాసము నుంచితిన్ వదలకప్పా! నన్ను విశ్వేశ్వరా!
73. ఆకర్ణించెద నేమియో ప్రమథ శంఖారావమో! జాత వీ
థీకల్లోల తరంగ దేవతటిని దీప్తారవంబో! కుభృ
ఛ్ర్ఛీకన్యామణి పాదనూపురమణిక్రేంకారమో! నన్నిదే
కైకో నీ వరుదెంతు వీ ధ్వని యదే కాఁబోలు! విశ్వేశ్వరా!
74. స్విద్యాత్ఫాలము, స్పందితాధరనవశ్రీ సద్య ఉద్వేగ భా
స్వద్యోషార్ధము, చంచలద్భుజగరాజన్మంజుహారంబు, శౌ
క్లద్యుత్యూర్జిత దీపితావయవ సంలానంబు, నీమూర్తి, భ
క్తాద్యుజ్జీవనరంహ మేమనుదు మద్భాగ్యంబు? విశ్వేశ్వరా!
75. నను రక్షింపఁగ నీవు వచ్చి తవులే నాతండ్రి! యీచంద్రికల్
తనుకన్, శ్రీనవగాంగవారి చినుకన్, తారుణ్య రేఖా వినూ
తన సౌందర్యము పిల్ల తెమ్మెరలు చిందన్, నన్ను నానంద వా
సన పొందన్, మది నీదురాక గురుతించన్ లేనె? విశ్వేశ్వరా!
76. దీర్ఘాధ్వమ్ము గమించి వచ్చి తడుగుల్ తే యెత్తెదన్, శీతలా
నర్ఘాంబుల్ చిలికింతు నంజలిపుటం బందిమ్ము, హేమంతప్రా
తర్ఘాసంబులు బిల్వపత్రములు మందారాది పుష్పాలు నీ
కర్ఘంబిచ్చెద, రమ్ము తీర్చెదఁబథాయాసంబు, విశ్వేశ్వరా!
77. నీకున్ సూడిద లిత్తు నా హృదయ తంత్రీయుక్తనూవల్లకీ
శ్రీకల్యాణ మనోజ్ఞగీతములు తండ్రీ! వాని నేఁ బాడుచో
నాకన్నుల్ బడివచ్చు భాస్ఫములు కంఠగ్రావ్యగ్రగాద్గద్యముల్
మై కేడించిన లేఁత చెమ్మటలు, రోమాంచాలు, విశ్వేశ్వరా!
78. నీకారుణ్యము కోసమై విధుర తంత్రీవీన వాయించు బా
లాకృత్యంబుగ నంగలార్చిన దినాలన్ నాదు జిహ్వాగ్ర వా
ణీకింక్ణింకిణి నూపురస్వనము లెంతే దట్టమై పోయె నేఁ
డీ కారుణ్యము చేచి నాకసలు నోరే రాదు, విశ్వేశ్వరా!
79. నీ కారుణ్యము సాటి చెప్పెదను గానీ నిక్కమూహింపఁగా
నీ కారుణ్యము సాటి దాని కదియే, నీ యీ కృపాలేశ మీ
నాకున్ దోచెను గించిదేతదుదితానందంబు దైనందిన
ప్రాకట్యంబును బొందఁజేసి నను సంరక్షించు, విశ్వేశ్వరా!
80. నీ కారుణ్యము సాటిసేయదు హిమానీ వాఃకణాలోలమా
లాకేళీనలినాకరాచ్ఛజల వేలా కేలికాసక్త బా
లా కర్పూరకపోలఫాలరుచిజాల స్రస్తచేల స్ఫుర
త్ప్రాకారాకృతిమత్కుచద్వితయసంభరాలు విశ్వేశ్వరా!
81. నీకారుణ్యము సాటితెత్తును భవానీ మోహనాకేకర
శ్రీకార శ్రవణాంబుజాత రుచిమత్స్మేరాననానందకు
ల్యాకల్యాణ తరంగవత్త్రివళి సంలగ్నాత్మసంధాన! వ
ర్షాకాలాంబుద సంస్రవజ్జలలవాచ్ఛశ్రీకి, విశ్వేశ్వరా!
82. నీ కారుణ్యము సాటిచెప్పెదఁ బికీ నిర్హ్రాదవేళాద్విరే
ఫైకోన్మాదిత సర్వతః పరివృత ప్రారంభగీతీ లస
న్మాకందాగ్రలతాంతపత్ర విగళన్మరంద కల్లోలినీ
వ్యాకీర్ణాంబు ప్రనేక శిశిరత్వం బందు విశ్వేశ్వరా!
83. నీ కారుణ్యము సాటి చూచెద వియన్నీలాతినీలప్రభా
శ్రీకృన్మోహన వర్ణ భాద్రపదసంశ్లేష ప్రగర్జద్విలా
సైకాంభోద తనూ ప్రకాశిత వధూ సౌదామనీ దేహవ
ల్లీ కల్యాణమనోజ్ఞదీధితి కరాళీ కేళి, విశ్వేశ్వరా!
84. నీవేమో కనిపించకుండినను గానీయైనఁ గన్పించిన
ట్లే వేలూహలుగాఁగఁ దెచ్చుకొని నీవే కాక లేఁడే కదా
దైవంబంచును నా కవిత్వము భవత్పాదద్వయిన్ జేర్చితిన్
రావే దీనికి నే ఫలం బొసఁగెదో రానిమ్ము, విశ్వేశ్వరా!
85. కుమతుండైన దురాత్ము పాపములు భక్తుండైన యవ్వానిక
ష్టములున్ బండినఁగాని నీకు నది నచ్చన్ బోదఁటట్లుండెఁబో
క్రమమేలా గయికోవు చావొకటియేగా తక్కు వావెంక స
ర్వము నెగ్గించితి వద్దిగూడఁ బ్రియమా? రానిమ్ము, విశ్వేశ్వరా!
86. భూమీదేవుల మానసంబు మృదువై పోల్పన్ వచస్సుల్ శిలా
సామాన్యంబులునై కనంబడెడిపో! జాల్ముల్ మనోభావమం
దేమో వహ్నులు పైకి వెన్నలు, జగం బీ రీతిగా సాగెడిన్,
భూమీదేవుల దుష్టు లందురు జన్మముల్ చూడు విశ్వేశ్వరా!
87. పైకిన్ లోపల నెంతొ యంత బహుధావ్యక్తంబుగా వీతమా
యాకారుల్ కుజనుల్, బహిస్సుధలు, లోనగ్నుల్ మఱీలోస్వయం
పాక శ్రీపరిపాలకులే సుజను లప్ప! యింత దుర్మార్గ మీ
లోకం బింతకు నేను జాలను దయాళూ! పాహి! విశ్వేశ్వరా!
88. కవి శైవాంశమటందు రక్కతననే గాఁబోలు నిన్ బోలె నన్
గవిసెన్ నిక్కముగా నమాయకత, నాకంఠంబుఁ గోయంగ నెం
చు విరోధిన్ సయితమ్ము నేనదుమగాఁజూడన్ మహాకోప మే
చు వడిన్ దగ్గును నిష్ఠ చాల దరులన్ జూర్ణింప, విశ్వేశ్వరా!
89. తేనెల్ వాఱును మేఘగర్జనలు వీతెంచున్ బికీకన్యకా
నూనవ్యాహృతి మాధుపంచమము చిందున్ ద్యోనదాంభఃకణ
శ్రీనృత్యంబులు సూపు నాకవిత తండ్రీ! నాహృదంభోజ మం
దానందచ్యుతి పొంది నీశతక మిట్లైపోయె, విశ్వేశ్వరా!
90. నా భాగ్యంబిది యెట్టిదో శతకమైనన్ బూర్తికాదే బ్యధా
క్షోభాకంపిత దేహయష్టి పులకాశ్రుస్వేద రూపంబుగాఁ
భ్రాభాతాంబుజ మట్లు నూత్నమధుహర్ష శ్రీధునీ వీచికా
క్షోభంబందెడుఁ దండ్రి! యింత కృపయాచూపింతు విశ్వేశ్వరా!
91. ఈ కించిత్కృతి యిట్టులైన మఱియేమి లేదు లేవయ్య వే
ధా! కాపర్ధశిఖాధునీ స్వనితగాథా! విశ్వనాథా! భవ
చ్ఛ్రీకంఠాభరణంబు చెప్పెదను రాజీవంబులోఁ దేనియల్
కైకోనే కయికోని క్రొత్తసిరి వాఁకల్ గట్ట విశ్వేశ్వరా!
92. తలపై జాబిలిరేకక్రొవ్వెలుఁగులోఁ దాత్పర్య మక్కొండ కూ
తలకున్ నాకు నిరాదృతి స్ఫుట తపోధుఃక్లప్తి సామాన్యమై
వెలసెన్ నాకును నమ్మవారికిని నీ ప్రేమం బొకేరీతి ని
మ్ములుగా భాగము పంచిపెట్టెదవు పోపో! స్వామి! విశ్వేశ్వరా!
93. మనసేమందును? దీనివక్రత లహో మాన్పంగ నీవంతి చి
క్కనిదైవంబు తలంపగా వలయునే కానీ మఱింకెట్లు మా
నును? స్వీయావిలపాపకార్యచరణాంధు ప్లుష్ట వాఃప్లావనం
బును బశ్చాత్తపనంబు నిత్యమయి యేమోప్రాప్తి? విశ్వేశ్వరా!
94. గాటంబౌ తెలిచిక్క వెన్నెల శిరః కళరపున్ దావి గా
నై టాటోటుగ సోడుముట్టెను వికృష్ణాఘ్రూణ పర్యంత మా
ర్గాటోపంబుల లోచనేంద్రియ పథవ్యాపార లుంటాకమై
పాటో పోటొ భవత్కృపాధునికిఁ జెప్పన్ జాల, విశ్వేశ్వరా!
95. చెలువొప్పన్ సరసీజ బంధవుఁడు వేంచేసెన్ వియధ్వీథి చుం
గులపై నప్పుడు నిద్రలేచితినయా, కుక్షింభరిన్ దేవులా
టలతో వెళ్ళెను నాల్గుజాలు, నిశితోడన్ స్వేంద్రి యజ్ఞానమున్
వెలితయ్యెన్ మఱియిద్ది యేమిబ్రతుకో వెళ్ళింతు? విశ్వేశ్వరా!
96. ఆక్రోశించెద బాహులెత్తి ప్రభువా! ఆలింపవే! యేమి కా
మ క్రోధంబు లహో! ప్రమాణతను సంపాదించె నాయందు, నీ
యక్రూరత్వము నీ వశిత్వమును నాయం దింత పొందింపవే!
అక్రీతుం డగు దాసుఁడన్ శివశివా యన్నాను, విశ్వేశ్వరా!
97. తెమలన్ జాలనివాటుగా నుసికొలందిన్ దూయఁజన్నట్టి బొం
గ్రమునా గాఢచలత్పరిభ్రమణరేఖన్ స్థైర్య మాభాసమై
యమరన్ జూచుచుఁజూచుచుండఁదల బర్వై తూలిపోనైన దే
హముగా నెన్నిగిరాట్లు నన్నిడెదొ క్రీడాసక్త! విశ్వేశ్వరా!
98. మునులేనట్టిది లోభమొక్కఁడు ననున్ బొందెన్ జరాక్రాంతియౌ
నని భీతావహమైనతో సుతునియందై మోహంపుబెల్లు, కా
మిని తొల్లింటిది నన్ బ్రశస్తపథగామిన్ జేయు దానిన్ దొలం
చిన మార్గానఁదొలంచి నా విహపరశ్రేయస్సు, విశ్వేశ్వరా!
99. ప్రస్థానత్రయమున్ గనుంగొనుట తప్పన్ క్లిష్టకామావిలా
వస్థానమర్గము నువుగింజంయినఁ దప్పన్ బోదు లోఁగాలమే
ఘస్థూలాకృతి నల్లనైన పొగయై కట్టెన్ వెలారెన్ మన
స్స్వస్థత్వం బని నేఁటి జన్మకె గడింపన్ లేనొ విశ్వేశ్వరా!
100. నినుఁ గ్రోంగ్రొత్తలు తేర్చుగుంఫనల వర్ణింపంగ నూహింతునౌ
నని యే దారినిఁబోయి పూర్వకవి పాదాంకంబులే తోఁచి లో
నన లజ్జాపరిగూఢ మానసుఁడనై నాలోన నేనే వినూ
తన శంకాహృదయుండ నౌదు, మఱి క్షంతవ్యుండ, విశ్వేశ్వరా!
101. ఆనందైకమయస్వరూప! భవదీయైశ్వర్యమున్ ధూర్జటి
శ్రీనాథుల్ కవితాసతీ కుచతటీ శ్రీగంధ కస్తూరికా
స్థానంబున్ బొనరించి రిప్పటికి నస్మత్ స్తోత్ర పాత్రంబవై
తేనెల్ ద్రావిన నోటికిన్ జలము లందింపయ్యె విశ్వేశ్వరా!
సమాప్తము
No comments:
Post a Comment