Saturday, July 27, 2013

శ్రీసరస్వతీ శతకము - చేబ్రోలు సరస్వతీదేవి

శ్రీసరస్వతీ శతకము
                                      చేబ్రోలు సరస్వతీదేవి

1. ఉ. శ్రీదయివాతభాగ్యమును చెల్వగువిద్యయునిత్యశాంతియున్
భేదమొకింతలేక సితనీరజవాసిని! భక్తకోటికిన్
మోదముతోడనియ్యగల మూర్తివినీవనియెంచి యాత్మలో
పాదసరోజయుగ్మముల పైబడివేడెద శ్రీసరస్వతీ!

2. ఉ. భారతి! చంపకంబులును భవ్యములైతగునుత్పలంబులున్
చేరిచి పూజుసేయుటకు సిద్ధముచేసితి శుద్ధభక్తిమై
పారములేనినీకరుణ పైపయిఁజూపి కృతార్ధసేయుమా
నేరుపుచాలదయ్యెనిఁక నివశరణ్యము శ్రీసరస్వతీ!

3. చ. తలచినకార్యసాధనము తప్పకసేయుచునాదువాక్కునన్
పలుకుదొసంగులేక వరపద్యగణంబులగూర్చి నవ్యమౌ
సలలితభావముల్ జెలగు శబ్దములన్ దగనిల్పిప్రోవఁగా
చలిమలపుత్రినందనుని సన్నుతిజేసెద శ్రీసరస్వతీ!

4. చ. హరునకువానిరాణికిని సంచితభక్తినిమ్రొక్కి యాపయిన్
హరికినివానిరాణికిని నంబుజగర్భునకున్ బుధాళికిన్
కరములుమోడ్చి మ్రొక్కెదను కామితసంపదసౌఖ్యసంతతుల్
వరలగబ్రోదిసేయుటకు వర్ణమయీ! సతి! శ్రీసరస్వతీ!

5. సదమలవత్సలత్వమున శాస్త్రములందలి నీతిసారముల్
ముదమలరంగవిద్యలను భూతములైనప్రబోధవైఖరుల్
సదయుతమీరగాదెలుపు సద్గురునాధునిసుబ్బరాయునిన్
వదలకచిత్తమందునిచి ప్రస్తుతిచేసెద శ్రీసరస్వతీ!

6. చ. కవికులరాజకోటి పదకంజములన్ భజియింతుభక్తితో
నవరసభావకల్పనలు నాకునుదోపగజేసివేడు నీ
ప్రవిమలనామరూపముల పల్మారుసన్నుతిజేయగావెసన్
కువలయమందుకీర్తినొడఁగూర్పఁగఁగోరితి శ్రీసరస్వతీ!

7. చ. గురువులనెల్లచిత్తమున కోరినుతించెద తల్లిదండ్రులన్
పరమగురుండనంబరగు భవ్యుని లక్ష్మినృసింహదేవునిన్
సరసకవిత్వసంపదలు సమ్మతిమీరగ జిహ్వనాటగన్
మఱిమఱిసంస్తుతించెదను మన్ననఁగాంచుము శ్రీసరస్వతీ!

8. చ. నలువపడంతి! నమ్మితిని నాలుకపై వెసనిల్చిదిట్టవై
పలుకుదొసంగులేక రసవంతములై దొరలంగపద్యముల్
పలుకుమటంచువేడితిని భారతి! మేలగురీతికైతమున్
వెలువడజేయుమమ్మ కరుణించికళావతి! శ్రీసరస్వతీ!

9. ఉ. మానకనాపయిన్ కరుణ మాటిమాటికిజూపి ధర్మవి
జ్ఞానముగాంచఁగాదగిన శక్తిని సత్వరమిచ్చుచున్ గుణ
శ్రీనయబోధపద్ధతుల జెందుటకున్ సతమున్ భవత్కృపా
దానముసేయుమోజనని! తద్దయుగొల్చెద శ్రీసరస్వతీ!

10. ఉ. చల్లనిచూపులన్ బరపి శాంతగుణమ్ముననుగ్రహించి సం
పుల్లవిలాసలీలలను బ్రుంగగజేసినయంబొకింత నా
యుల్లమునందుజొన్పిప్రియ మొప్పగనన్నెదనుంచిమేలురం
జిల్లభజింప బుద్ధివికసింపఁగఁజేయుమ శ్రీసరస్వతీ!

11. చ. చిరతరభక్తినాహృదయ సీమనునిన్నుభజింతునెప్పుడున్
మరచెడుదానగాను నినునమ్మితివేఱుగ నెంతచూచినన్
గరమనురక్తిబూని ననుగాచెడువారలులేరుగావునన్
గరుణదలిర్పనన్నెపుడు గావుమతల్లిరో శ్రీసరస్వతీ!

12. చ. వినయముతోడభక్తిపదవిన్ మనమందుననాట జేసి నే
మనవియొనర్చుచుంటివినుమా ననుగావుమపెంపుగూర్పమా
కనికరముంచుమా తెలుఁగుకైతమునందుననేర్పొసంగుమా
జనని! భజింతునిన్నెపుడు సమ్ముదమొప్పగ శ్రీసరస్వతీ!

13. ఉ. నిన్నుభజించుచున్ సతము నీపదపద్మములాశ్రయించుచున్
జెన్నలరారనీగుణము నెమ్మనమందున జింతసేయుచున్
గ్రన్నననీదునామమెనిరంతరమున్ జపియించుచున్ నినున్
సన్నుతిజేయుచుంటి ననుసమ్మతి బ్రోవుమ శ్రీసరస్వతీ!

14. చ. కలియుగమందునీదుకృప గల్గినవారలు పండితోత్తముల్
నెలతరొ! నీకృపారసములేని మనుష్యులువట్టిమందులై
మెలకువజెందలేరు పరమేష్ఠిమనోహరి! నిన్నెగొల్తు  నా
కలవడజేయుమీరసమయంబగుకైతము శ్రీసరస్వతీ!

15. చ. ఒకపరిపద్మసంభవుని యుత్తమపత్నిగఁదోచుచుందు వీ
వొకపరి విష్ణువక్షమున నున్నతిజూపెడునాదిలక్ష్మివై
యొకపరిరుద్రురాణివయి యుండుదువెన్నఁగనీదుతత్వమున్
సకలసురేశ్వరుల్ తెలియజాలరునిక్కము శ్రీసరస్వతీ!

16. చ. సదమలభక్తినీచరణ సారసయుగ్మముగొల్చెదన్ జయ
ప్రదమగులీలనాసుతుల భర్తనురక్షణసేయుమాననున్
వదలకయాయురున్నతులు బాగుగనిచ్చియనుగ్రహించినీ
పదములగొల్చుభాగ్యమిడి వర్ధిల్లజేయుమ శ్రీసరస్వతీ!

17. చ. వ్రతములుసేయలేను నుపవాసములైననుసల్పలేను నా
దృతిజపమైననున్ సరిగ దీరికగాంచితదేకనిష్ఠతో
మతినిలబెట్టిచేసెడు క్రమంబెఱుగన్ నినుమాత్రమెంతయున్
పతితముగానిచిత్తమున భక్తిగఁగొల్చెద శ్రీసరస్వతీ!

18. చ. సురుచిరహస్తమున సొంపుగఁదాలిచి నాల్గువేదముల్
వరలగమీటుచుంబరమ భక్తులపాలిటికల్పకంబవై
సరసిజగర్భసంభవుని స్వాంతనికేతనమందునిచ్చలున్
దిరముగనిల్చి తేజరిలు దేవి! కృపామతి! శ్రీసరస్వతీ!

19. ఉ. నీవమదీయదైవమని నెమ్మినిగొల్చెదసతతంబు నీ
పావననామసంస్మరణ బాయనుతల్లి! యుపేక్షసేయకో
దేవి! దయాస్వరూపిణివి దీనను దోషములెంచకమ్మ సం
భావితమైననీచరణపద్మము బట్టితి శ్రీసరస్వతీ!

20. ఉ. ఆయతమైనభక్తిని సమగ్రముగాభజియింతునిన్ను దీ
ర్ఘాయువొసంగినాకెపుడ నంతసుఖంబుజయంబులిచ్చి నీ
సాయమునాకొసంగి భవసాగరమీదగఁజేసియాపయిన్
శ్రేయముగాంచుసత్పదవి సిద్ధముచేయుము శ్రీసరస్వతీ!

21. చ. ఇరయనునామధేయమున నెల్లజగములునిండి విద్యకున్
గురుపదమున్ వహించునినుఁ గూర్మిభజించెదనెల్లవేళనా
దరముననాదువాక్కున సుధామధురంబగుపద్యరాజముల్
వరలఁగనీకటాక్షమును వర్ధిల్లజేయుము శ్రీసరస్వతీ

22. ఉ. తెల్లనిచీరగట్టి కడుఁ దేజముతుంపెసలాడుపీఠమం
దుల్లముపల్లవింప స్వరయోగమనోహరవీణమీటుచున్
ఫుల్లసరోజనేత్రములు పూర్ణకృపారసమున్ వేలార్చునో
పల్లవపాణి! కొల్చెదభవత్పాదయుగ్మము శ్రీసరస్వతీ!

23. చ. తెలియవుధ్యానయోగములు దెల్లముగాజపహోమతత్వమున్
దెలియదుమంత్రశాస్త్రములు దివ్యములైనత్వదీయశక్తులన్
దెలుయఁగనేర్పుచాలదిఁక దీనజనాశ్రిత దిక్కునీవిఁకన్
నెలతరొ! నిన్నుజేరితిని నీవెటుచూచెదొ శ్రీసరస్వతీ!

24. చ. యెఱుఁగకచేయుతప్పులను నెంతయు లెక్కనుసేయబోకనా
కెఱుఁగఁగఁజెప్పుమాయలుగ కీవువచించినరీతిభక్తిమై
నిరతముచేయుచుందుదగు నేరుపుమించెడిశక్తినిమ్ము నే
సిరులనుగోరశాంతగుణ సిద్ధినిగోరెద శ్రీసరస్వతీ!

25. చ. సతతమునీపదాంబుజము సన్నుతిజేసెదభక్తిపెంపునన్
సుతలొనరించుతప్పులను జూదరుతల్లులు వేఱుభంగిగ
పతితనటంచుమార్మొగము పట్టకజ్ఞానపథంబుజూపి స
మ్మతమగురీతిగావుమిఁక మాటికివేడితి శ్రీసరస్వతీ!

26. ఉ. దోసములెంచిచూడకుము దుర్గుణపుంజమునాభవంబుకై
వేసటజెందినీమరుగు వేగమజొచ్చితిచారునేత్రి! సం
తోసముమీరవత్సలతతోదరిఁజేరితి శారదాంబ! నీ
దాసికలందునన్ గలిపి ధైర్యముగూర్పుమ శ్రీసరస్వతీ!

27. చ. విమలమతిన్ వహించి యరవిందదళాయితలోచనా! సదా
ప్రమదమెలర్పగొల్చెదన వశ్యముతోరపుభక్తిగాంచి పెం
పమరచిరాయురున్నతుల నందఁగఁజేయుము మేలుగొల్చుచున్
గొమరులనేలినాపతికి గూర్పుమక్షేమము శ్రీసరస్వతీ!

28. ఉ. తప్పులుచేసినాననుచు తథ్యముగావచియించినన్ ననున్
దప్పచరించితంచునిటు దందనసేయుటపాడియౌనె? నే
ర్పొప్పఁగజెప్పరాదొకొ? హితోక్తులజెప్పిన జేయకుందునే?
యొప్పగులీలయోజనని! యోమునిపూజిత! యోసరస్వతీ

29. ఉ. తల్లివిగాననీమనసు తాలిమిజెందకబోదునిక్కమే
యెల్లవిధంబులన్ సుతులనేలుటనీకుధర్మమౌను సం
పల్లలితాంగి! కత్సితులపత్యములుందురుగానియెందునున్
తల్లులుకుత్సితంబెపుడు దాల్చుటసత్యము శ్రీసరస్వతీ

30. చ. ఋతమగువాక్కునాలుకపయిన్ దగనిల్పివివేకశీలముల్
చతురతశాంతిదాంతియును సాధుగుణంబునుదారబుద్ధి స
మ్మతమగునీతిమార్గమును మానకనాకునొసంగినిత్యమున్
క్షితిపయికౌతుకంబెసఁగ క్షేమముగూర్పుమ శ్రీసరస్వతీ!

31. ఉ. పున్నెముసేయలేదుపలు భూములుజుట్టియుఁ దీర్ధకోతిలో
తిన్నగగ్రుంకలేదు పరదేవిప్రసాదమునందలేదు నే
పిన్నను దానధర్మములు పెద్దలసేవలుచేయలేదునిన్
సన్నుతిజేయబూనితిని శారద! నీదయ శ్రీసరస్వతీ!

32. చ. భవముతలంచిచూచుతఱి పాపపుకర్మలుపెక్కులై పున
ర్నవనవమైతమోగుణగణంబుల కాస్పాదమైసుపుణ్యముల్
లవమునుజేయలేక ఫలలాభములొందకకాలమెల్లనో
కువలయలోచనా! చెడియె కోర్కెలగూర్పుము శ్రీసరస్వతీ!

33. ఉ. దేహమువీడివోవుతఱి దీరనిరోగముచేతఖిన్ననై
గేహమునందుబంధువులు కేకలుపెట్టఁగ నార్తచిత్తనై
యూహకలంగినీభజనయొప్పుగ సేయగనౌనొకాదొ? వ్యా
మోహముబాపినీభజనమున్ దయచేయుము శ్రీసరస్వతీ!

34. చ. గళమునశ్లేష్మవాతములు గ్రమ్ముశరీరముపోవునప్డు నీ
సలలితనామరూపములు సంస్మరణంబొనరించునేర్పునున్
బలమురహింపఁబోవదు భవచ్చరణాంబురుహంబులిప్పుడే
కొలిచెడిభాగ్యమిచ్చినను గూరిమినేలుము శ్రీసరస్వతీ!

35. చ. సనకసనందనాది మునిసత్తములైనను భక్తిగాంచియే
జననిశరణ్యయంచుపదసారసముల్ భజియింత్రుమోక్షమున్
గనుటకునట్టితల్లిని యనారతమున్ భజియింతునిన్నెదన్
వినయవివేకభావములు నెమ్మదిదాలిచి శ్రీసరస్వతీ

36. ఉ. దీనజనావనామిగుల దిక్కఱినేనినువేడుకొంటి నా
మానసరాజకీరమును మానకనీపదపంజరంబునన్
పూనికమీఱనీక్షణమె పొందికగావసియింపజేయుమా
చానను మంచిచెడ్డవిచక్షణనేరను శ్రీసరస్వతీ!

37. ఉ. అస్థిరమైనదేహమిది యాకలిదప్పులకోర్వలేదు చ
ర్మాస్థులు రక్తమాంసముల నాయుతమైనదిశైశవంబు బా
ల్యస్థవిరాదిప్రాయముల నారటబెట్టెడుదీనినమ్మి స
త్యస్థితిగానలేను వరదాయి! కృపన్ గను శ్రీసరస్వతీ!

38. ఉ. శ్రీకరమైనసద్యశము చేతనరారుచు నిందునందునన్
ప్రాకుడులేనిజీవితమునన్ సుఖసంపదగాంచనెంచుబల్
ప్రాకటభక్తియుక్తిదనరన్ సతమెంతయుశ్రద్ధబూనుచున్
సాకిభజించుమానవుల జన్మముజన్మము శ్రీసరస్వతీ!

39. ఉ. సారమతిన్ దలంచినిను సంస్తుతిజేసినమూడుప్రొద్దులన్
జేరుఁజిరాయురున్నతులు శిష్టజనస్తవనీయబుద్ధి సం
సారసుఖంబులున్ గలుగు జ్ఞానముగల్గును నిత్యమోక్షల
క్ష్మీరతీగల్గుసదశ్యము చేకురునెప్పుడు శ్రీసరస్వతీ!

40. చ. అనవరతంబుమోహమున కాస్పాదమైనభవాబ్ధిజిక్కి నే
వినయవిధేయతాగుణము వీడితమోమయతత్వమందుపూ
నినమతిచేతదివ్యమగు నీపదచింతయొకింతలేకనా
జననమువీటఁబుచ్చితిని శారద! ప్రోవుము శ్రీసరస్వతీ!

41. ఉ. అక్షయమైననీపదము నందఁగఁగోరితి హంసగామినీ!
యక్షరమూర్తినినుగొని యాడగనాతరమౌనె? సత్యవే
దాక్షరపంక్తులేమహిమ నంతయుఁదెల్పగజాలదయ్యెగా
సాక్షివిసర్వలోకముల సత్కళదేలెడు శ్రీసరస్వతీ!

42. ఉ. ఆయువుకొంచమయ్యెను తదర్ధమురాత్రులయందునిద్రలో
బోయెనహంబుసర్వమును బూనిధనార్జనమందుబుచ్చుచున్
న్యాయపథంబుదప్పి విషయాబ్ధినిమున్గుచునింతకాలమున్
వేయివిధంబులన్ జెడితి నీదయగోరితి శ్రీసరస్వతీ!

43. ఉ. ఆదరమింతజూపదగదా? నినునింతగగొల్చుచుండగా
నీదుకృపాప్తిగోరితిని నీవసమస్తమటంచునమ్మితిన్
మోదపయోధిదేల్పగలమూర్తి వటంచు భజింపుచుంటిసు
శ్రీదయివారబ్రోవుమ ప్రసిద్ధగుణమ్మున శ్రీసరస్వతీ!

44. చ. సలలితతేజమున్ వడసి చక్కనిరూపునుదాల్చిభక్తకో
టులకెనలేనిభాగ్యముకడుంగడు గూర్చి సుఖింపజేయుచున్
బలమునొసంగిప్రోచుగుణభద్రతను తల్లినినెమ్మనమ్మునన్
గొలుతుమదీయపాపములు గొబ్బునఁగూల్చగ శ్రీసరస్వతీ!

45. ఉ. నీమహిమంబులేక ధరణింబ్రతుకంగలశక్తియున్నదే?
యేమియొనర్పనేర్తు కృపనీవుననున్ దగబ్రోవకుండినన్
నీమముతోభజించెదను నీవమదర్ధముప్రాణమంచువే
నీమదినెంచిప్రోవుమవనిన్ సుఖమందగ శ్రీసరస్వతీ!

46. చ. కుజనులతోడినెయ్యములు గూర్పకనెప్పుడుచిత్తవృత్తులన్
సుజనులుబోవుమార్గమున జొన్పడజేసితదీయనామముల్
భజనయొనర్పగాదగిన భక్తియుశక్తియునిచ్చినాకు యా
ర్యజనులుమెచ్చువాక్కు తనరారగజేయుము శ్రీసరస్వతీ!

47. చ. వలనుగనీస్వరూపములు వర్ణనసేయఁగలేక తల్లిప్రాఁ
బలుకులునిర్జరాలియును ప్రాజ్ఞశిరోమణులుండవారితో
నలుసునకైనన్ దగని నాకుదరంబె త్వదీయతత్వముల్
పొలుపుగకీర్తిసేయుటకు పుష్కరలోచన శ్రీసరస్వతీ!

48. చ. భగవతి! సత్యలోకమున బ్రహ్మసమేతముగావసించి యె
ల్లగతులభక్తకోటులు చెలంగవరంబులనిచ్చిప్రోచుచున్
చిగురులమించుకేలుగవ చేనొకవీణియబట్టిమీటుచున్
మొగమునచిన్నినవ్వలర మోదమొసంగుమ శ్రీసరస్వతీ!

49. చ. కనుగవమోడ్చినీచరణ కంజములన్ స్మరింయించువేళ నా
మనముచలించుచున్ గలఁగి మాటికిమాటికి క్షోభమొందఁగా
జననితమఃప్రభావమున శారద! నీభజంబునిల్వదో
జనని! ముదంబుతోనపుడు చలగచూడుమ శ్రీసరస్వతీ!

50. ఉ. ప్రాణమువోవువేళలను బంధులుపుత్రులుమిత్రులందఱున్
బూనుచుమూగిచిత్తమును బుగ్గినిగల్పుదురంతెకాని వి
జ్ఞానముతోదనీశ్వరుని సన్నుతిచేయుపదాళినిచ్చు ని
న్నే నెటుభక్తిగొల్చినను దృప్తిఘటిల్లదు శ్రీసరస్వతీ!

51. చ. గళమునప్రాణవాయువులు గల్గినదాకనెబంధులాప్తులున్
పలపలమూగుచుంద్రు బహుభంగుల ప్రాణముపోవునాపయిన్
మెలకువగాంచియొక్కొకరు మెల్లగవీడుదురీవొకష్టముల్
గలిగినయప్పుడేదయను గాంచెదవెంతయు శ్రీసరస్వతీ!

52. ఉ. నిన్నెభజింతునెల్లపుడు నేర్పలరారగభక్తిపెంపుతో
నెన్నుదుసర్వకాలముల నీవశరణ్యమటంచు భాషయం
దున్నవిషేషముల్ మృదుహితోక్తులదెల్పినపుణ్యరాసినే
నెన్నియుగాలైన భజియించెదమద్గురు శ్రీసరస్వతీ!

53. చ. సదమలభావముల్ గలుగు సత్యపథమ్మునబోవునట్లుగా
హృదయమునందునెట్లుదలపింతువొ భక్తిమెయిన్ భజింతునీ
పదములబట్టితిన్ గృపకుబాత్రనుగా నొనరింపుమిప్డె నే
ర్పొదవెడులీలబ్రోచి దయయుంచుమునాపయి శ్రీసరస్వతీ!

54. చ. తనయదొసంగుచేసినను తల్లిక్షమించికృపన్ వహించు న
ట్లనయమునేనొనర్చు పనులందునగల్గు దొసంగులన్ శమిం
చినయపథంబునన్ జనెడుచెల్వగుబుద్ధులుసెప్పి మంచిత్రో
వనుజనునట్లుతోద్పడుమ భద్రముగాగాంతును శ్రీసరస్వతీ!

55. చ. విలసితమైనఫాలమున వేడుకమీరగకమ్మవజ్రపుం
తిలకముదిద్ది కన్నులకు తీరుగకాటుకబెట్టి యందమౌ
వెలగలయాణిముత్యముల పేరులురంబున చౌకళింపగా
పలుకువెలంది! నీముఖము భావనజేసెద శ్రీసరస్వతీ!

56. చ. తొళసీదళంబుతోనెపుడు తోరపుభక్తినిమూడుప్రొద్దులన్
దలచిత్వదీయరూపమును తప్పకపూజయొనర్తు తప్పులన్
దలపకజ్ఞానమార్గమును తార్కొనజేయుము నాదుచిత్తమున్
కలవరమందిసద్గతిని గానకస్రుక్కితి శ్రీసరస్వతీ!

57. ఉ. నీదయలేనిజీవిత మనేకదినంబులుదాల్చియుండినన్
ఖేదమునొందుటేఫలము కీర్తిగడించుటలేదుపిమ్మటన్
మోదముజెందబోదకట! మోక్షముదూరము శారదాంబనీ
పాదములందుసంస్మరణ బాయకనిల్పుమ శ్రీసరస్వతీ!

58. ఉ. విద్యకుమాతృభూమివయి విశ్వమునిండుచుదద్దప్రేమతో
విద్యయుబుద్ధినిచ్చి కడువీతతమోగుణచిత్తపద్ములై
సదశ్యముల్ విశేషగుణ సంపదలందఁగామానవాళికిన్
వేద్యవిధానముల్ దెలుపు వేల్పనినమ్మితి శ్రీసరస్వతీ!

59. ఉ. వేకువలేచినీభజన వేడుకమీరగఁజేతునెమ్మదిన్
శ్రీకరమైనపుష్పముల నేకములన్ గొనితెచ్చి నిత్యమున్
ప్రాకినభక్తితో జనని! భారతి! నామొరలాలకించి నీ
వేకరణిన్ మదీప్సితము లియ్యదలంచితొ? శ్రీసరస్వతీ!

60. చ. పసితనమందునెరమిని పాపములెన్నియొ చేసిచేసినే
వ్యసనముజెందిజీవితము భారమునై కనుపట్టనంతటన్
విసువుజనియించెచిత్తమున వేరొకమార్గముదోచదయ్యె సా
రసభవురాణి! నన్నిపుడు రక్షణచేయుము శ్రీసరస్వతీ!

61. చ. స్ధిరముగనీదుపాదముల చిత్తమునిల్పగలేదు త్వత్పదాం
బురుహముగొల్చువారలకు పుట్టుటగిట్టుటలంతరించునో
సరసిజనేత్ర! వందనము సల్పెద కోర్కులదీర్పనీవెకా
మరువకనీకటాక్షమొక మాటునిగూడ్చుమ శ్రీసరస్వతీ!

62. ఉ. చింతలుక్రొత్తలైవొడమి చేరగనీయదుసద్గుణంబులన్
శాంతియుదాంతియున్ గలిగి సజ్జనసేవలు జేయబోదువే
దాంతవిచారభావముల తధ్యమెఱుంగదు నాదుచిత్తమా
సంతమసంబునందణగి సద్గతిగోరదు శ్రీసరస్వతీ!

63. నీపయిభారమున్ వయిచి నెమ్మదిశాంతివహించి సత్యమే
ప్రాపయినన్నుబ్రోచునని భావమునన్ దలపోయుచుంటినే
పాపమెరుంగనిన్నెపుడు భక్తిమెయిన్ భజియించుచుంటినీ
వేపగదాల్చినన్ పరులికెవ్వరు బ్రోతురు శ్రీసరస్వతీ!

64. ఉ. దేవి! భవత్ప్రభావమున తెన్గునకైతమునేర్చి తెంతయున్
శ్రీవినయంబుగాంచుచు ప్రసిద్ధమతిన్ నినుగొల్చుబుద్ధియున్
భావమునందునేర్పు పరివర్తనమందు యశంబుగూర్చి సం
భావనజేసెదన్ సతము మానకగొల్చెద శ్రీసరస్వతీ!

65. ఉ. సంపదగల్గినప్పుడెద సంతసమందు విపత్తుగల్గినన్
బెంపువహింపబోదుమఱి ప్రేమదలిర్ప సమత్వభావమే
యింపువహింప నెమ్మదిని నేడ్తేఱనాటుమ క్రోధబుద్ధియున్
జంపివిశాలభావములు సమ్మతినిమ్మిఁక శ్రీసరస్వతీ!

66. చ. కొడుకులుసేయుదోసములు కూర్మిసహించెడు తల్లిదండ్రుల
ట్లెడద కృపారసంబువహియించి పరాంబిక! నాదొసంగులన్
తడవునుసేయకే సయిచి ధర్మవిధనమునందు జ్ఞానమున్
బడయఁగనీయుమా సుకృతమార్గమునందగ శ్రీసరస్వతీ!

67. ఉ. నీవలనన్ గదాసతము నిత్యసుఖంబుగాంచుచుంటి సు
శ్రీవిభవంబులన్ వడసి చెన్నలరార యశంబుగాంచితిన్
డెవి! స్తుతించుచుంటి వెనుదీయక నాయెడ దోసముండినన్
కావుమనన్ క్షమించి కలకాలము వేడెద శ్రీసరస్వతీ!

68. చ. తెలిసియుకొన్నితప్పులను తెల్వియొకింయులేకకొన్నియున్
బలగుణగర్వభారమున బాల్పడి కొన్నియు బుద్ధిహీనతన్
సలిపితి పెక్కుదోషములు సమ్మతి బ్రోవగదేయటంచు న
ర్మిలి నినుమ్రొక్కుచుంటి ననుపేర్మినిజూడుము శ్రీసరస్వతీ!

69. ఉ. మానక నీపదాబ్జములె మాటికినమ్మి భజింతు నీకు సే
వానియమంబులన్ సలిపి భక్తిగనుంటి దోషమున్న దే
వీ! ననుగూర్మినేలవలదే? తగునా యిటుత్రోసివేయ న
జ్ఞానముబాపి శ్రేయమగు జ్ఞానమొసంగుమ శ్రీసరస్వతీ!

70. ఆయుతభక్తిదాల్చి యనయమ్మునినున్ భజియించుటే సదా
శ్రేయమటంచు భర్త వినిచెన్ పలుమారు పురాణగాధలా
ప్యాయనమై పఠించుసమయంబున నాపతిభక్తిభావముల్
కాయమునుండుదాక వికలంబొనర్పకుము శ్రీసరస్వతీ!

71. చ. సారసమతిన్ భజింతునిను స్వాంతమునందున భక్తిభావమే
మరక నిరతంబును సమంచిత రీతిని ప్రేమజూపుచున్
సిరులను వైభవోన్నతుల జెందఁగ సౌఖ్యము గాంచునట్లుగా
వరమొక్కటిమ్ము నాకు కొదవా? దయచేసిన శ్రీసరస్వతీ!

72. చ. జననమునీటిబుగ్గ ధనసంపదభోగము చంచలాభమౌ
తనువులనిత్యముల్ రుజలుదార్కొని చిందరవందరయ్యెడున్
తనయులు బంధుమిత్రములు తాజనువేళలవెంటరారు పా
వనమగునీదు నామమునె పాటిగగొల్చెద శ్రీసరస్వతీ!

73. ఉ. లోకములోన నెందుచపలుల్ నినుభక్తిభజింపఁజాల ర
స్తోకముదంబుతో నెపుడు దోయలిగూర్చెద హర్షచిత్తవై
చేకొనుమమ్మ నాప్రణిధి శ్రీగిరిజానతపల్లవాంఘ్రి! నీ
వేకృపజూపఁగావలెను వీదకనన్నిక శ్రీసరస్వతీ!

74. ఉ. నీముకమెప్డులోకజన నీముకహ్బింబము గేలిచేసెడిన్
నీమృదుమానసంబు నవనీతసమానము నీదుచూపులా
సోమమరీచిజాలములు చూడగ .... భక్తులన్
కామితమిచ్చి ప్రోచుటగు గట్టిగనమ్మితి శ్రీసరస్వతీ!

75. నిన్నెదనమ్మియుండుటను నీరజనేత్ర! సుఖంబులందితిన్
మన్ననగాంచితిన్ ప్రభులమాన్యత బొందితి శ్రేయమొందితిన్
గ్రన్ననభాగ్యసంపదల గాంచితి నేమియులోటులేదు సౌ
ఖ్యోన్నతి నిచ్చిప్రోవు మహితోక్తులఁగూర్మిని శ్రీసరస్వతీ!

76. చ. దినదినమున్ క్షణక్షణమ దేపనిగా నినుగొల్చుచుంటి నె
మ్మనమున భక్తిభావములు మాటికిపై నుబుకంగజేసి కా
వునదయదాల్చి నన్నెటులొ ప్రోవఁగరాదె పరాంబికా! సుఖం
బునతులతూగి జీవితము బుచ్చెడిరీతిని శ్రీసరస్వతీ!

77. ఉ. చిన్నికుమారులన్ సుఖముజెందఁగఁజేసి మదీయభర్తకున్
గ్రన్ననభాగ్యవైభవము గాంచఁగనిచ్చి శుభప్రదముగా
నన్ననయంబు బ్రోతువని నమ్మితిరూఢిగ నాత్మలోపలన్
నన్నిక నేవిధమున మనమ్ముననెంతువొ శ్రీసరస్వతీ!

78. ఉ. అర్ధముగోరికాదు ధనమన్నను కాంక్షజనించి కాదు నిన్
ప్రార్ధనజేయుటల్ దినమునందున రాత్రులయందు కాలమున్
వ్యర్ధముగాక యుండునటు లర్ధ్యబలమ్మును నాటఁజేసిలో
స్పర్ధజనింపకుండుటకు సమ్మతిగొల్చెద శ్రీసరస్వతీ!

79. ఉ. నీకృపపెంపునన్ గద గణించితిదెంగుకైతమింక సు
శ్రీకమనీయమూర్తులగు చిన్నికుమారులుగల్గిరెప్పుడున్
నాకునుదైవమట్టపతి నవ్యసుఖంబులు గూర్చుచుండెడిన్
నీకెపుడున్ నమస్కృతుల నేకముచేసెద శ్రీసరస్వతీ!

80. చ. సకలము నీవయంచు పెలుచన్ మృదుభావమునన్ భజింతునే
వికలముగాని చిత్తమున వెండియు భక్తిమతిన్ ద్వదీయమూ
ర్తికి గుణరాసికిన్ విమలతేజముదాల్చిన ధర్మమూర్తికె
ప్డుకరము మోడ్చెదన్ గృపనుబ్రోవుమునన్నిక శ్రీసరస్వతీ!

81. ఉ. చెప్పెడిదేమినీకు సరసీరుహలోచన! నాదొసంగులన్
దప్పకసైచి ప్రోవుమిక త్వత్పదయుగ్మముగొల్చుదాననే
ర్పొప్పమనంబునందు దయయూనుచు బుత్రికవోలె చూడుమా
యెప్పటికైననీవ భరియింపవలెన్ జుమ శ్రీసరస్వతీ!

82. ఉ. నన్నెటునుద్ధరించెదవొ నాపతినేవిధినాదరింతువో
యెన్నుచునుందు నీదయనెయీ తనువుండెడినంతదాక నా
విన్నపమాలకించి కురిపింపుమ నీదుకృపామృతంబులన్
నిన్నుత్యజించి వేఱొకరినిం భజియింపను శ్రీసరస్వతీ!

83. ఉ. నాపయినన్ గృపారసము నాటెదవన్నతలంపుతోడ నీ
ప్రాపుగణింపఁగా గలుగు భావమునన్ గొనియాడుచుంటి నే
పాపము జేసినాననుచు భారతి! గోపములేక పేర్మిమై
జూపుమ సత్కృపన్ నుదురుసోకగ మ్రొక్కెద శ్రీసరస్వతీ!

84. ఉ. భావమునందు నీచరణ పద్మముదక్క మరేవియేని నే
భావనజేయనొల్లనిది భావ్యము నీకు నెఱుంగఁజెప్పితిన్
నీవమదీయ దేవతవు నీవమదిష్టమును గూర్చుమమ్మ సొం
పావహిలంగఁ బ్రోవఁదగదా? బరువౌనొకొ? శ్రీసరస్వతీ!

85. చ. నిలచిప్రణామముల్ సలిపి నెమ్మది సమ్మదమిన్మడింప దో
యిలి ఘటియించి భక్తిమెయినెంతయు సంస్తుతిజేసిచేసి మ్రొ
క్కులిడితి నామనంబునను గోరికలెవ్వియునులేవు నీపదం
బులు మదిలోన నిల్పు దృఢబుద్ధి గఱంపుము శ్రీసరస్వతీ!

86. చ. పనివడి పాపకార్యములపై మనమున్ బురికొల్పబోకు మే
యనువునైన నీపదములంచితరీతిని కొల్వలేదటం
చనిశము నేడ్చుచుంటినకటా! తెరువెద్దియు లేదు నాపయిన్
కనికరమున్ వహించి వెసగావ దలంపుము శ్రీసరస్వతీ!

87. చ. మనమున సద్గురూత్తముని మానకపూజలు సేయుచుంటి నా
జననికి మ్రొక్కుచుంటి నలసాధుచరిత్రుల గొల్చుచుంటి నే
ననయము భర్తృపాదము సమంచితరీతి భజించుచుంటి గా
వున యపరాధముల్ సయిచి ప్రోవుమయెప్పుడు శ్రీసరస్వతీ!

88. ఉ. వారక గొల్చుచుంటినిను స్వాంతమునన్ గలభక్తిపెంపునన్
కోరికదీర్చి భద్రములుకూర్చి యనుగ్రహముంచి యెప్పుడున్
తీరని సౌఖ్యమిచ్చి వెలితిన్ గననీయక నీదుసత్కృపా
సారమునాపయిన్ జిలికి చక్కగప్రోవుమ శ్రీసరస్వతీ!

89. ఉ. ప్రేమరసంబులుట్టిపడ పేర్మినిగాంచుచు జ్ఞానసంపదన్
నీమహిమంబులన్ దెలిపి నెయ్యము తియ్యము మీరునట్లు నా
పై ముదమున్ వహించితగు పద్దతులన్నియు బోధసేయరా
దా? మహితప్రబోధమున తద్దియగొల్తును శ్రీసరస్వతీ!

90. ఉ. నీకృపపెంపు నాయెడల నిశ్చయమై తనరారునంచు నే
ప్రాకట సౌఖ్యసంపదల భవ్యశుభంబుల నొందుచుందు లో
కైకకృపావలంబ! భవదంఘ్రియుగంబును గొల్చువారికే
లాకొఱతల్ ఘటిల్లు కమలాసనుప్రేయసి! శ్రీసరస్వతీ!

91. ఉ. కోరిభజింతు నిన్నెపుడు కోరికలీరికలెత్త నాత్మలో
జేరగదీసి ప్రోచుటకు చెల్లదె? సేవకురాలనైతి సం
సారమునందు జిక్కుకొని సంకటమందితి నీదుపాదముల్
సారెకు సన్నుతించెదను జాలిదలంచుము శ్రీసరస్వతీ!

92. చ. శ్రితజనకల్పవల్లివని చేరితినీదరి కన్నతల్లి! స
మ్మతమగు రీతింగావుమనుమానము పెంచక చింతవాపి స
ద్గతిబడయంగఁ జేయవె యుదారగుణాఢ్య! మరాళగామినీ!
సతతము దోసిలొగ్గి నిను సంస్తుతిఁజేసెద శ్రీసరస్వతీ!

93. ఉ. శరదచంద్రికాధవళ సన్నుతగాత్ర! కురంగనేత్ర! నీ
హారసముజ్జ్వలస్ఫటిక హార కరాంకుశపాశవల్లకీ
ధారిణి! దీనపోషణి! సుధారసభాషిణి! నిత్యతోషిణి!
శరద! నీదుపాదముల సన్నుతిచేసెద శ్రీసరస్వతీ!

94. ఉ. అంబ! సితాంబుజాసని! దయంబుధి! పద్మజురాణి! వాణి! ధ
ర్మాంబిక! నారదాదివిభుదాళి సమర్చిత! సారసాంఘ్రి! నే
రంబులసపు నీపదపరాగమెదిక్కిఁక నీకృపావిశే
షంబునుజూపి కావుమిఁక సంసృతికష్టము శ్రీసరస్వతీ!

95. చ. సకలకలాస్వరూపిణి! ప్రసన్నవిలోచన! భక్తరంజనీ!
సకలచరాచరంబులకు సాక్షివి కోవిదకల్పవల్లి! తా
వకపదభక్తిచే సకల వాంచితముల్ బడయంగవచ్చు త
ప్పకవరమీయకున్న పెరవారలులేరిక శ్రీసరస్వతీ!

96. ఉ. అమ్మ! నవాబ్జపాణి! శుభమందగ సత్కృపజూపవమ్మ! ని
న్నెమ్మది గొల్తునమ్మ! కరిణింపుమ నీసరివారులేరు స
త్యమ్ముగ నమ్మినాను బహుళాగమవందిత! బ్రాహ్మి! నాకు ని
త్యమ్ముసుభద్రమిమ్మ! కమలాసనుభామిని! శ్రీసరస్వతీ!

97. చ. శరణము పూర్ణచంద్రముఖి! సర్వకళాకలితస్వరూపిణీ!
శరనము సర్వలోకనుత! సద్గుణవల్లి! మరాలగామినీ!
శరణము నారదాదిబుధ సన్నుత! పల్కులకల్కి! భారతీ!
శరనము పద్మపాణి! సితసారసవాసిని! శ్రీసరస్వతీ!

98. చ. జయజయ బ్రహ్మరాణి! భవసంహారి చారుకురంగలోచనా!
జయజయ మంజుభాషిణి! లసన్మణిభూషణి! లోకతోషణీ!
జయజయ భోగభాగ్యసుఖ సద్గుణదాయఖిలైకపావనీ!
జయజయ వాక్సతీ! లలిత! శర్మద! భారతి! శ్రీసరస్వతీ!

99. చ. తెలుగుకవిత్వమున్ సరిగ దీర్చిరచింపఁగ నర్హయోగ్యతల్
గలుఁగఁగఁజేసి భావములు కాంతివహించి వికాసమొందగా
జిలిబిలి ముద్దుపల్కులను జిమ్మెడీ భాగ్యమునిచ్చి ప్రోవఁగా
నలికులవేణి! నాహృదయమందు వసింపుము శ్రీసరస్వతీ!

100. ఉ. నీమృదుపాదపద్మముల నెమ్మదిఁదాల్చితి నీస్వరూప వి
ద్యామహితప్రచారముల నర్చనచేసితి నిన్నుఁబోలె సు
శ్రీమహిమంబులొప్పునొక చెల్వనుసందియమేటికింకనీ
నామమెదాల్తు; నీకృపకు నాకొకలోపమే శ్రీసరస్వతీ

సమాప్తము

No comments:

Post a Comment