Saturday, July 6, 2013

వృషాధిప శతకము - పాలకురికి సోమనాథ కవి

వృషాధిప శతకము
                            పాలకురికి సోమనాథ కవి

1. ఉ. శ్రీగురులింగమూర్తి సువిశేషమహోజ్వల కీర్తిసత్క్రియో
ద్యోగకళాప్రపూర్తి యవధూతపు నర్భవాజార్తి  పాలితా
భాగ్యతసంశ్రితార్థికవిపండి తగాయకచక్రవర్తి దే
వా! గతి నీవె మాకు బసవా! బసవా! బసవా! వృషాధిపా.

2. చ. ప్రమథవిలోల భక్తపరిపాల దురంధరశీల సంతతా
ప్తమితసమస్తదేహగుణజాల! సుఖప్రదలీలలింగజం
గమమహిమానుపాలగతకాలసమంచితనాదమూల దే
వ మముభరింపుమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా.

3. ఉ. అప్రతిమప్రతాప సముదంచిత నాదకళాకలాప దీ
ప్తప్రథమస్వరూప శివభక్తగణాత్మగతప్రదీప ధూ
తప్రబలేక్షుచాప విగతప్రకటాఖిలపాప లింగత
త్వప్రద నీవే దిక్కు బసవా! బసవా! బసవా! వృషాధిపా.

4. ఉ. భక్తిరసాభిషిక్త భవపాశవితానవిముక్త జంగమా
సక్త దయానుషక్త తనుసంగతసౌఖ్యవిరక్త సంతతో
ద్యుక్త గుణానురక్త పరితోషితభక్త శివైక్యయుక్త ప్ర
వ్యక్తమ నీవె దిక్కు బసవా! బసవా! బసవా! వృషాధిపా.

5. ఉ. శత్రులతాలవిత్ర గుణజైత్ర భవాబ్ధివహిత్ర జంగమ
క్షేత్రవిచిత్రసూత్ర బుధగీతచరిత్ర శిలాదపుత్ర స
త్పాత్ర విశుద్ధగాత్ర శివభక్తికళత్ర శరణ మయ్య భా
స్వత్త్రిజగత్పవిత్ర బసవా! బసవా! బసవా! వృషాధిపా.

6. ఉ. త్ర్యాక్ష సదృక్ష సంచితదయాక్ష శివాత్మకదీక్ష సత్ప్రసా
దాక్ష ప్రతాపశిక్షితమహాప్రతిపక్ష మహోక్ష భూరిక
ర్మక్షయదక్ష జంగమసమక్షమభక్తిపరోక్ష లింగ త
త్వక్షమ నీవె దిక్కు బసవా! బసవా! బసవా! వృషాధిపా.

7. ఉ. అక్షయభక్తిపక్ష బసవాక్షర*పాఠక కల్పవృక్ష రు
ద్రాక్షవిభూతివక్ష ఫలితార్థముముక్ష శివప్రయుక్త ఫా
లాక్ష కృపాసముంచితకటాక్ష శుభాశుభపాశమోక్ష త
త్వక్షమ నీవె దిక్కు బసవా! బసవా! బసవా! వృషాధిపా.
(* సాధక యని పాఠంతరము)

8. ఉ. ఆర్యవితానవర్య భువనాధికశౌర్య యుదాత్తసత్పదా
చార్య యవార్యవీర్య బుధసన్నురచర్య విశేషభక్తితా
త్పర్య వివేకధుర్య పరిపాలితతుర్య శరణ్యమార్యదు
ర్వార్య యనూనధైర్య బసవా! బసవా! బసవా! వృషాధిపా.

9. ఉ. తజ్ఞజితప్రతిజ్ఞ యుచితప్రమథానుగతజ్ఞ నమ్రదై
వజ్ఞకళావిధిజ్ఞ బలవచ్చివభక్తిమనోజ్ఞ ధూతశా
స్త్రజ్ఞ సునాదపురితరసజ్ఞ తృణీకృతపంచయజ్ఞ స
ర్వజ్ఞ శరణ్య మయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా.

10. ఉ. క్షీణజనప్రమాణ యసికృత్తకుయంత్రకఘోణ జంగమ
ప్రాణ వినిర్జితప్రసవబాణ సముంచితభక్తి యోగసం
త్రాణ కళాప్రవీణ శివధర్మరహశ్యధురీణ దత్తని
ర్వాణ శరణ్యమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా.

11. ఉ. గానరసప్రవీణ గతకాలవితాన సమస్తభక్త స
న్మాన మహాకులీన యసమానచరాచరరూప భేదసం
ధాన జితభిమాన తనుధర్మవిహీన మహాప్రధాన దే
వా ననుఁ గావుమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా.

12. లింగమయాంతరంగ గురులింగపదాబుజభృంగ సత్ప్రసా
దాంగ కృపాపరిస్ఫురదపాంగ విముక్త భుజంగ జంగమో
త్తుంగ జితాభిషంగ గతదుష్కృతభంగ మదీయలింగనీ
వంగడమేఁజుమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా.

13. ఉ. ఉత్తమభక్తివృత్త భజనోత్సుకచిత్త యుదాత్తచిత్సుఖా
యుత్తక్రియాప్రమత్త బిఖిలాగమవేత్త గుణోపయుక్త స
ద్వృత్తప్రసాదభోగసముదీర్ణ విశేషసుఖప్రమత్త భా
స్వత్తమ నీవె దిక్కు బసవా! బసవా! బసవా! వృషాధిపా.

14. ఉ. దేహజవైరివాహ శివదీపితదేహ సుఖప్రవాహ ని
ర్మోహ వినమ్రసంయమిసమూహ లసద్గుణ గేహ సంతతో
త్సాహ నిరీహ జంగమవితానదయావిహితావగాహ ని
ర్వాహమ నీవె దిక్కు బసవా! బసవా! బసవా! వృషాధిపా.

15. ఉ. న్యాసఫలానివాస దరహాసముఖప్రతిభాస దత్త కై
లాస విశేషజంగమవిలాస శివైక్యసమాస నిర్జితా
యాస సమస్తభక్తహృదయాంబుజనిత్య నివాస ధిక్కృత
వ్యాస శరణ్యమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా.

16. ఉ. రాగపరోపభోగ గతరాగ విధూతభవాదిరోగ ని
ర్యాగ మహానురాగ బహిరంతరనిష్ఠితయోగ సత్క్రియో
ద్యో యకర్మయోగ శివయోగ సమగ్రసుఖాతి భోగదే
వా గతినీవె మాకు బసవా! బసవా! బసవా! వృషాధిపా.

17. ఉ. శీతలతాలవాల య. శిష్ట..ప్రతికూలలాలితో
త్తాల గుణానుకూల శివధర్మప్రతిపాల నిత్య స
ల్లీల యశోవిశాల చరలింగసుఖోదయకాల జియ్య దే
వా లలిఁ బ్రోవుమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా.

18. కామితభక్తిభామ గతకామ మహాగణసార్వభౌమ ని
స్సీమ యశోభిరామ సవిశేషవిముక్తిలలామ సద్గుణ
స్తోమ శివైక్యధామ సుఖదుఃఖవిరామ ప్రమోదసీమ దే
వా మముఁ గావుమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా.

19. సాధితజన్మబాధ గతసర్వనిషేధ *హతాపరాధ దు
ర్భోధకళావిరోధ పరిపోషితశాంభవవేధ వర్జిత
క్రోధ నిరాకృతాఖిలవిరోధ శివైక్యసుబోధ యీభవ
వ్యాధికి నీవె మందు బసవా! బసవా! బసవా! వృషాధిపా.
(*జితన్యగాధ యని పాఠాంతరము)

20. శ్రీవిలసత్ప్రభావ *ప్రవిశిష్టపరాజితసర్వదేవ స
ద్భావయుతస్వభావ శివతత్వవిశిష్టమహానుభావ యం
హోవనదావ పాలితమహోద్ధతశైవవిభుండ వీవ దే
వా వరదానశీల బసవా! బసవా! బసవా! వృషాధిపా.
(* వ్రత యని పాఠంతరము)

21. ఉ. ఆద్య సమర్పితాఖిలపురాతనభక్తగణానువేద్య సం
పాద్యగుణాబవద్య యనుభావశివాంకితగద్యపద్య ని
ర్భేద్య గణైకవేద్య యురరీకృతవాద్య భవాదిరోగస
ద్వైద్య శరణ్య మయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా.

22. ఉ. నాదకళావినోద యభినందితవేద హృతాపవాద సం
పాదితభక్తిమోద బుధవందితపాద చిరప్రమోద యా
స్వాదితసుప్రసాద యవిషాద శిలాదసుతావిభేద దే
వా దయఁ జూడు మయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా.

23. ఉ. కాయగుణావిధేయ జితకాయ వినమ్రజగన్నికాయయా
మ్నాయవచో ప్రమేయయసమాన సముంచితగేయ భక్తిధౌ
రేయ సదానపాయసుచరిత్రసహాయ జితాంతకాయ దే
వా యొడయుండ వీవ బసవా! బసవా! బసవా! వృషాధిపా.

24. ఉ. స్వీకృతభక్తలోక యవశీకృతకర్కశవావదూక యూ
రీకృతసద్వివేక యురరీకృతజంగమభక్తి శూక దూ
రీకృతదుష్టపాక యధరీకృత వేదవిరుద్ధబౌద్ధచా
ర్వక శరణ్యమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా.

25. ఉ. నిత్య యుదాత్తసత్య యతినిశ్చలజంగమభృత్య సజ్జన
స్తుత్య కృపాకటాక్ష పరిశోభితచైత్య మహేశభక్తి సం
గత్యభిరామసత్య గురుకార్యపరాయణకృత్య వర్జిత
వ్రాత్య శరణ్యమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా.

26. ఉ. ధన్య మహావదాన్య గతదైన్య విధూతజఘన్య భక్తిచై
తన్య గుణైకమాన్య హతదర్పకసైన్య నిరస్తమాతృకా
స్త్న్య జితారిఘోరభవజన్య శరణ్యము చిత్సుఖాత్మభా
వాన్య శరణ్యమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా.

27. చర్విరశృంగిగర్వి గుణసంపదఖర్వ యపూర్వగీతగాం
ధర్వ దిగంతపూర్ణ సముదాత్తయశఃకృత కర్ణపర్వ యం
తర్వినివిష్టశర్వ విదితస్ఫుర *దర్వకావుమో
పర్వఘనప్రసాద బసవా! బసవా! బసవా! వృషాధిపా.
(దర్పకోటమా పర్వఘనప్రసాద, సర్వఘనమ్రపాద అను పాఠాంతరములు)

28. ఉ. ఖ్యాత దయాభిజాత విపదంబుధిపోత యజాతతత్వని
ర్ణేత వినీత భక్తిపరిణేత మనోరథదాత జంగమ
స్తోత ముముక్షుగీత పరిశోభితనీతిసమేత సద్గుణ
వ్రాత శరణ్యమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా.

29. ఉ. మారముదాపహార సుకుమారశరీర గణప్రసాదవి
స్తార వృషావతార సముదారవిహార నమద్దయాపరి
ష్కార శుభప్రకార యవికార మహాజగదేకవీర దు
ర్వార శరణ్యమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా.
(* సముద్దయా అని పాఠాంతరము)

30. ఉ. దేశికజన్మదేశ యవిదేశ యనావృతపాశ సంహృత
క్లేశ మహాప్రకాశ కృతకిల్బిషనాశ దయానివేశ నం
దీశనికాశ జంగమసమీహితకారిగుణావకాశ దే
వా శరణియ్యవయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా.

31. ఉ. ఉద్ధతభక్తవృద్ధ వినుతోత్తమసిద్ధ పరీతజంగమ
శ్రద్ధ సదాత్మశుద్ద గుణరాజిసమృద్ధ విముక్తపాశస
న్నద్ధ మహాప్రసిద్ధ యగుణత్రయబద్ధ శరణ్యనయ్య భా
స్వద్ధతచిత్ప్రబుద్ధ బసవా! బసవా! బసవా! వృషాధిపా.

32. ఉ. నందితభక్తబృంద యవినాశిరదాంశుముఖారవింద సా
నంద వినీతికంద కరుణామకరంద రసోపలాలిత
స్కంద యుదాత్తభక్తితరుకంద యశోజితకుంద నాకరా
డ్వందిత నీవె దిక్కు బసవా! బసవా! బసవా! వృషాధిపా.
(*యానందవిలీయమానకరుణా యని పాఠాంతరము)

33. ఉ. లౌల్యపరాయణాత్మగుణలౌల్య యమూల్య సదోపయుక్తని
ర్మాల్య వినీతికల్య యసమానదయారసకుల్య నిత్య నై
ర్మల్య యమూల్య దుష్టజనమానసశల్య పదాబ్జలబ్ధికై
వల్య శరణ్య మయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా.

34. గురుపదపద్మసద్మ యవికుంఠితజంగమశీలఖేల సు
స్థిరమృదుపాదమోద సమిదీర్ణవిశేషమహత్వతత్త్వని
ర్భరభుజశౌర్యధుర్యపరిరంభితభక్తికళత్ర గోత్రమ
ద్వరద శరణ్యమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా.

35. చ. భువనహితార్థతీర్థ భవభూరుహశాతకుఠారధార గౌ
రవసముదాత్తవేత్త యనురాగరసామృతసారపూర శాం
భవమయవేదబోధ శివభక్తహృదబ్జవికాసభాస దే
వ వరద కావుమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా.

36. చ. వినుతనవీనగాన గుణవిశ్రుతభక్తవిధేయ కాయయ
త్యనుపమగణ్యపుణ్య నయనాంచల*దూరభవోపతాప స
ద్వినయవికాసభాస సముదీర్ణశివైకసుఖైకపాక దే
వ నను భరింపుమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా.
(*మారమదోపతాప ... భావసముదీర్ణవిశాలశివైక్యపాల)

37. ఉ. అంచితభక్తియుక్త యసహాయవిశృంఖలవీరపూర ని
శ్చంచలశైవభావ శ్రితజంగమపాదకిరీటకూట హృ
త్సంచితసత్త్వతత్త్వ దురితవ్రజశైలకదంబశంబ ని
ర్వంచక నీవెదిక్కు బసవా! బసవా! బసవా! వృషాధిపా.

38. నిర్గతధర్మకర్మ యవినీతపునర్భవయంత్రతంత్ర
దుర్మార్గవిహీనయాన గుణమాన్య మహావృష*సామ్య సౌమ్యష
డ్వర్గవిరక్తసక్త మదడంబర వర్జితవేషభూష నీ
వర్గము నేఁజుమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా.
(* సైన్యధన్య)

39. చ. సరసవచస్క నిర్మలయశస్క శివైక్యమనస్క భక్తహృ
త్సరసిజగేహ క్లుప్తభవదాహ దయాపరివాహ చిత్సుఖో
త్తరనిజశిల్ప భక్తపరతల్ప మహావృషకల్ప మన్మనో
వరద శరణ్యమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా.

40. చ. హరసమసౌఖ్య యాదివృషభాఖ్య పురాతన ముఖ్య తత్వవి
త్పరిషదుపాస్య వీతగుణదాస్య త్రిలోకనమస్య తార్కికో
త్కరజయశౌండ దీర్ఘభుజదండ మహాగుణషండ మన్మనో
వరద శరణ్యమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా.

41. చ. వరగుణదీప్ర భక్తజనవప్ర తృణీకృతవిప్రతాత్త్వికాం
కురపదపద్మ భక్తిరసగుంభ నిరాకృతదంభ సద్గుణ
స్ఫురితవిశిష్ట శాంతగుణపుష్ట నిరస్తనికృష్ట మన్మనో
వరద శరణ్య మయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా.

42. ఉ. లింగనిరూఢ సంచితవిలీఢ పరాక్రమగాఢ మానసా
సంగివృషాంక నిర్గళితశంక నిరస్తకళంక సంతతా
భంగురపుణ్య శీలమణిపణ్యత్రిలోకవరేణ్య దేవ నీ
వంగడమేఁజుమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా.

43. చ. ఉరుతరభాగ్య సన్మహితయోగ్య జగత్త్రయమృగ్య పాపసం
హరణసమర్థ నమ్రచరితార్థ లసదుణసార్థభావభా
స్వరనయసాంద్రకీర్తిజితచంద్ర వివర్జితతంద్ర మన్మనో
వరద శరణ్య మయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా.

44. చ. విరచితశుద్ధసాళగన వీనమృదుస్వరమంద్రమధ్యతా
రరుచిరదేశిమార్గ మధురస్వరగీతా సుధాతరంగిణీ
తరలతరంగజాలసముదంచితకేళివిలోల సంగమే
శ్వర గతినీవె నాకు బసవా! బసవా! బసవా! వృషాధిపా.

45. చ. అసమవదాన్యమాన్య ప్రణుతార్య యవార్యరసజ్ఞ తజ్ఞ దు
ర్వ్యసనవిదూర శూర గణవంద్య యనింద్య యమాఢ్య యాధ్యభ
క్తిసుఖసమృద్ధ వృద్ధ చిరదీప్తిపవిత్రచరిత్రపాత్ర నా
వసిఁ గని ప్రోవుమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా.

46. అసమశిలీముఖస్ఫురదహంకృతికర్తన కర్మకర్మ ఠా
భ్యసనధురీణవిభ్రమ గణాధిపపాదసరోజసంతత
ప్రసృమరసౌరభోరుమకరందకసిక్తవనక్రియాకళా
వ్యసన శరణ్యమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా.

47. చ. అసదృశవిస్ఫురద్గుణదృగంచల కల్పితసృష్టిపాలన
గ్రసరకళాకలాప ఘనకౌశలఖేలన లింగమూర్తి మా
నసకలనావశీకరణనైపుణ తత్పరశీల జంగమ
శ్వసన శరణ్యమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా.

48. చ. ప్రమథగణాధినాథ సముపాసనభాసురపార్వతీ మనో
రమరమణీయహృత్కమలరాజితనవ్యపతంగ సౌరభ
భ్రమరవిలోలతామధుకరాయిదితదివ్యశరీర సత్ప్రభా
వమహిత నీవెదిక్కు బసవా! బసవా! బసవా! వృషాధిపా.

49. కందళితాత్మయంత్రితవికర్తనశీల మరీచిమన్మనో
మందవిహార విస్ఫురితమధ్యమయాన చిదంబరేందుని
ష్యందసుధారసానుభవ సంతతదివ్యశరీర యోగిరా
డ్వందిత నీవె దిక్కు బసవా! బసవా! బసవా! వృషాధిపా.

50. ఖ్యాతయశఃప్రపూరిత జగత్త్రితయాయ నమో నమో మహా
పాతకసూతకఘ్న పదపద్మయుగాయ నమోనమో సము
ద్ద్యోతవృషయతే యనుచు నుత్సుకతన్ బ్రణుతింతు సంయమి
వ్రాత శరణ్యమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా.

51. ఉ. ఆప్తగణప్రవిష్టసకలార్తిహరాయ నమోనమో సుఖా
వాప్తికరస్మితాంచితకటాక్ష దయాయ నమోనమో సము
ద్దీప్తగుణాయతే యనుచు దీనగతిన్ బ్రణుతింతు నిన్ను ని
ర్వ్యాప్తజగత్ప్రపంచ బసవా! బసవా! బసవా! వృషాధిపా.

52. ఉ. కల్పితలింగజంగమసుఖస్ఫురణాయ నమోనమో యసం
కల్పవికల్పమార్గకథితప్రధితాయ నమోనమో గుణా
కల్పవరాయతే యనుచు గౌరవలీల నుతింతు నిన్ను న
స్వల్పతరప్రభావ బసవా! బసవా! బసవా! వృషాధిపా.

53. ఉ. తర్జితదుష్కృతాయ భవతాపనికృతనకల్మషాయ భ
క్త్యూజితమానసాయ సుగుణోత్తమరత్నకరందకాయ తే
ఆర్జితసత్క్రియాయ సదయాయ నమోయని సన్నుతింతు నా
వర్జిత భక్తలోక బసవా! బసవా! బసవా! వృషాధిపా.

54. ఉ. చూర్ణితమన్మథాయ పరిశోభితభస్మవిలేపనాయ సం
పూర్ణమనోరథాయ గతపూర్వభవాశ్రితవర్తనాయ తే
వర్ణనిరాసకాయ సశివాయ నమో యని సంతతంబు ని
న్వర్ణనసేయువాఁడ బసవా! బసవా! బసవా! వృషాధిపా.

55. ఉ. హృన్నలినే స్మరామి భవదీయపదద్వితయంభవాటన
స్విన్నతనుశ్రమాపహ మశేషజగత్ప్రణుతం మదీశ ని
ష్పన్న దయనిధే యనుచు సంస్కృతభాష నుతింతు నిన్ను వి
ద్వన్నుతనామధేయ బసవా! బసవా! బసవా! వృషాధిపా.

56. చ. పరమనె యన్నె యాందవనె పన్నగతానె యనాథనథనే
పెరియవనే పుళిందవనె పేరుడయానెపిరానెయప్పనే
తరిమురియయ్యనే యనుచు ద్రావిడభాష నుతింతు మన్మనో
వరకరుణావిధేయ బసవా! బసవా! బసవా! వృషాధిపా.

57. చ. హసుళెయరెన్న రక్షిసువు దారయలెన్న వనీతనెందు మ
న్నిసువుదు నిమ్మడింగెరగ నిమ్మప్రసాదియె నిమ్మదాత్మవే
కసిగతి యంచుభక్తి నునుఁగన్నడభాష నుతింతు షడ్గుణ
శ్వసన పురాతనాత్మ బసవా! బసవా! బసవా! వృషాధిపా.

58. ఉ. దేవపరీతుమ్హీచగురుదేవమణూనుతరీతుమ్హీచగో
సావితరీతుమ్హీచతుమచాచప్రసాదచమ్హీ కృపాకరా
హెవరదా యటంచునుతియించెద నిన్ను నునారేభాసదే
వా వినుతార్యలీల బసవా! బసవా! బసవా! వృషాధిపా.

59. చ. అన్యముఁ జేతులందు భవదంఘ్రీసరోజయుగం నమామి నె
మ్మనమున సంస్మరామి యను మాటల నిన్ పరివస్కరోమ్యహ
మ్మనుచు మణిప్రవాళమున నంకన సేయుదు భక్తలోక హృ
ద్వనజవిహారలోల బసవా! బసవా! బసవా! వృషాధిపా.

60. చ. అరశుగిరిప్రసాదముయానె భవద్గుణవర్నసల్పి నా
కొరువనినేస్మరామి సురయేశ్వరురేగణవర్య యంచుని
ట్లరుదుమణిప్రవాళముననంకనసేయుదు నిన్ను మన్మనో
వరకరుణావిధేయ బసవా! బసవా! బసవా! వృషాధిపా.

61. ఉ. వాయువువొందు యీవిగతవావామాపరహంబభౌ మహా
న్యాయవిధేయమీశతరి యన్యనబాణుకళాభి దంచువా
గ్దేయమణిప్రవాళమునఁ దెల్లము నిన్ను నలంకరింతు దే
వా యమిబృందవంద్య బసవా! బసవా! బసవా! వృషాధిపా.

62. చ. *బొలుపొడతోలు చీఱెయును పాఁపపెసల్ గిలుపారు కన్ను వె
న్నెలతలఁజేందుకుత్తుకయు నిండిన వేలుపుటేఱు పల్గుపూ
సలు గలఱేమిలెంక వని జానుఁదెనుంగున విన్నవించెదన్
వలపు మదిన్ దలిర్ప బసవా! బసవా! బసవా! వృషాధిపా.
(* శుద్ధాంధ్రము)

63. చ. తిరువడి నెమ్మనంబునను దేవ హృదీశ్వర కింపరీయతా
బరికరితంబురాణి నినుబాహిరిఁబోలుటశాసితాహతా
వరదనెగిల్లెయంచు నిను బ్రస్తుతిసేయుదుఁ బెక్కుభాషలన్
వరదవివేకశీల బసవా! బసవా! బసవా! వృషాధిపా.

64. హాడువెదా మహారసదినంఘ్రీయుగభ్రమగొండు సద్గుణా
మాడువదర్చనంబిడె సమగ్రనుతి త్వయిసక్రియన్ దగన్
గూడ మణిప్రవాళమునఁ గోరి నుతింతును సంచితార్థముల్
పాడిగనివ్వటిల్ల బసవా! బసవా! బసవా! వృషాధిపా.

65. ఉ. రుద్ర గణాదిరుద్ర వినిరూపితలింగ సుఖాదిసద్రయ
చ్చిద్ర దయాసముద్ర సవిశేషపరాక్రమ వీరభద్ర య
క్షుద్రజనావలీభవనిషూదనరౌద్ర సమస్తభక్త దే
వద్రుమ నీవెదిక్కు బసవా! బసవా! బసవా! వృషాధిపా.

66. చ. ఇహపరసిద్ధ సిద్ధవృషభేశ్వరఈశ్వరభక్తభక్త హృ
ద్గహనవిలోక లోకహితకారణ కారణజన్మ జన్మదో
షహరణదక్ష దక్షరిపుసన్నిభ సన్నిభ రూప రూపని
ర్వహన శరణ్య మయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా.

67. ఉ. సన్నుతజంగమాగమము స్వాతిజలంబులు భక్త నిమ్మగం
జెన్నుగ నీదుచూడ్కు లను చిప్పల జొన్నలు ముత్తియంబులై
యున్న నొకయ్యమ్రుగ్గునియమోన్నతి నిల్పినధన్యు నిన్ను శ
శ్వన్నుతులన్ భజింతు బసవా! బసవా! బసవా! వృషాధిపా.

68. ఉ. బల్లహునొద్ద నున్ననునుఁ బట్టణవీథులఁ జల్లలమ్ముచో
గొల్లతఁజీరువాఱికడుఁగూర్మి మెయిన్ బసవా యనన్ భువిన్
ద్రేళ్ళఁగనీకపట్టిన యతి స్థిరసర్వగతైకభావ మ
ద్వల్లభ నీవె దిక్కు బసవా! బసవా! బసవా! వృషాధిపా.

69. ఉ. వేఁడినమిండజంగమము వెక్కసమందఁగఁ దత్సభాస్థలి
న్నాఁడట నారివల్వొలువ నైజపుమానము దూలకుండఁగాఁ
బోఁడిమిఁ బట్టుపుట్టములు ప్రోవులు పెట్టినపుణ్యమూర్తి ని
వాఁడఁజుమయ్య జియ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా.

70. చ. అరయఁగసిద్ధరామురజితాద్రిపయిన్ బసవాఖ్యు నిన్నుఁబే
రరులున జంగమాజ్ఞ మెయి నారయనప్పుడు భక్తి పెంపొసొం
పరుదుగఁ బార్వతీశు హృదయాంబుజకర్ణిక నత్తమిల్లు భా
స్వరుఁడగు నీవె దిక్కు బసవా! బసవా! బసవా! వృషాధిపా.

71. ఉ. వర్ణవిహీనుఁ డంచు ద్విజవ్ర్గము దా గళమెత్తి పల్కుడున్
వర్నములెల్లఁ జూడ శివనాగయగారికరంబులందు స
ద్వర్ణుఁ డితండనా నమృతధారలు చూపినభక్తిరూఢ నీ
వర్ణము నేఁజుమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా.

72. ఉ. బిజ్జలునర్థమంతయును బ్రీతిగ జంగమకోటి కిచ్చె నా
నజ్జగతీశ్వరుం డడుగ నక్షయబండరు వాక్షణంబులో
నిజ్జగమెల్లఁ జోద్యపడ నిచ్చినలింగసదర్థ నమ్రవి
ద్వజ్జన నీవె దిక్కు బసవా! బసవా! బసవా! వృషాధిపా.

73. చ. ఉరుశివయోగనిద్రమయినున్న తఱిన్ ఫణిహారియేఁ గుడున్
మరచిచనంగ జంగమసమన్వితమై మునుబ్రాణమేగి యు
ద్ధురగతి వారు వచ్చుటయుఁదోడనెవచ్చిన జంగమాత్మ నీ
వరవుఁడ నేఁజమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా.

74. ఉ. సంగయదేవుఁ డర్థి నొకజంగమమై చనుదెంచి వేఁడను
ప్పొంగి లలాటలోచనము భోరున నద్దమువట్టి చూపుడున్
జెంగి యదృశ్యుఁడైన శివుఁ జేకొని యార్చిన యప్రతర్క్య నీ
వంగడమేఁజుమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా.

75. ఉ. కర్ణవతంసమీక పెనఁగన్ సతిచెక్కిలి వ్రేయుఁడున్ మహా
తూర్ణితఁజెంది జంగమముల దోస్థ్సలమెత్తిపసిండియాకు సం
పూర్ణనికృష్టభక్తిమెయిఁ బొల్పుగ నిచ్చిన నిష్ప్రపంచ నీ
వర్ణము నేఁజుమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా.

76. ఉ. శృంగిపురోగమాఖిలవిశేషవిషంబులు గూర్చిమండుచున్
దొంగి భుగిల్లుభుగ్గు రనుభూరివిషాగ్నినిషాదు లార్తులై
చెంగి చనన్ శివార్పితము చేసి భుజించినసుప్రసాద నీ
వంగడ మేఁజుమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా.

77. ఉ. చిత్తజవైరివిక్రమముఁ జెప్పకు చెప్పకు త్రావనోడితాఁ
గుత్తుక నిల్పెనంచుఁ గడుఁ గ్రూరతరంబగుకాలకూటమున్
గుత్తుకబంటి గ్రోలిన యకుంఠితవిక్రమ చక్రవర్తి భా
స్వత్తమ నీవెదిక్కు బసవా! బసవా! బసవా! వృషాధిపా.

78. ఉ. తంగెటిజున్ను ముంగిటినిధానము పండినకల్పవల్లి ముం
గొంగునముత్తియం బనఁగఁ గూర్మిమనంబునఁ దొంగిలింపఁగా
జంగమకోటి కర్చనలు సల్పుచు నున్న యగణ్యపుణ్య నీ
వంగడ మేఁజుమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా.

79. ఉ. భీమగజంబు ధీకొనిన బిట్టరఁజంపుడు బిజ్జలేంద్రుఁడు
ద్దామతఁదక్కి మ్రొక్కుటయుఁదత్కరి నెత్తిన విక్రమోద్ధతుం
డామడియాలుమాచనకు నగ్గలమైన మహానుభావ నా
స్వామివి నీవె దిక్కు బసవా! బసవా! బసవా! వృషాధిపా.

80. ఉ. శంక దలిర్ప నెంతయు వెసన్ బరదైవపతంగకోట్లకున్
బింకముతోడ ఫాలతటభీమవిలోచనవహ్ని నేర్చునా
శంకరదాసిదేవునకు సద్భటుఁడంచు నుతించు నిన్ను నీ
వంకకుఁ ద్రిప్పుమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా.

81. ఉ. ఏఁడులు నూరటంచు శ్రుతు లెన్నఁగ శ్రీగిరిమీఁద నాఱునూ
ఱేఁడులు సంచరించు సకలేశ్వరదేవరమాదిరాజు నా
నేఁడలనూఱుమన్నభువి నిష్ఠురకాలమహోగ్రదృష్టి క్రొ
వ్వాఁడులణంపుమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా.

82. ఉ. సూత్రము దప్పి గొఱ్ఱెగుడిఁ జొచ్చిన మిండనిఁజంపి సాక్షిగా
నోత్రిపురాంతకా యనుచు నోయని పిల్చిన యల్ల *సద్యశః
పాత్రుఁడు కిన్నరయ్యకును బ్రాణసఖుండగునిన్నుఁగొల్తు దే
వాత్రిజగత్పవిత్ర బసవా! బసవా! బసవా! వృషాధిపా.
(*నాదయా అని పాఠాంతరము)

83. ఉ. ఒక్కఁడె రుద్రుఁడన్న శ్రుతులొల్లక ప్రేలుపురాణభట్టులన్
వ్రక్కలుసేసి తత్తనువువావిరి@ *బ్రువ్వులుగాఁగ@జూచునా
కక్కయగారిబిడ్డఁడనఁగా నుతికెక్కిననిన్నుఁ బూన్తు మ
ద్వక్కలికాసమూహి బసవా! బసవా! బసవా! వృషాధిపా.
(*పురువు శబ్దమునకిది పూర్వరూపము)

84. ఉ డంభమయాన్యదర్శనవిడంబనుఁ డష్టమదాపహారి యా
శుంభదుదాత్తకీర్తి యగు చోడలదేవరబాచిరాజు వి
స్రంభసఖుండ వీవని ప్రశంస యొనర్తుజగత్ప్రపూత వి
శ్వంభర శంభుమూర్తి బసవా! బసవా! బసవా! వృషాధిపా.

85. ఉ. దీప్రము నీమహామహిమ దివ్యము నీమహనీయ విక్రమం
బప్రతిమంబు నీచరిత మాద్యము నీనిజరూప మంచు న
ల్లప్రభుఁ డర్థితోడ నుపలాలన సేయఁగ నొప్పుచున్న దే
వా ప్రణుతింతు నిన్ను బసవా! బసవా! బసవా! వృషాధిపా.

86. ఉ. మెదురభక్తినీశ్వరుఁడు మెచ్చఁగ జిహ్వయెపళ్ళెరంబుగా
నాదటఁ బ్రాఁచియంబలి సమర్పణచేసి పొగడ్త కెక్కునా
మాదరచెన్నలింగము కుమారుఁడ నిన్నుభజింతు సంతతా
స్వాదిత సుప్రసాద బసవా! బసవా! బసవా! వృషాధిపా.

87. ఉ. బల్లిదుఁడై గణాధిపుల పాదజలంబులు కట్టేమోపుపైఁ
జల్లికడానిగావుడును జంగమకోటికిఁ బంచియిచ్చుచున్
మొల్లపుభక్తిఁ బేర్కొనినమోళిగమారయ కూర్మిబంట మ
ద్వల్లభ నీవెదిక్కు బసవా! బసవా! బసవా! వృషాధిపా.

88. ఉ. భీకరరుద్ర నేత్రశిఖ బెద్దఁగఁ జేయఁగ వీరభద్రును
ద్రేకగజంబునా నితరదేవతలన్ బడఁదాఁకునుద్ధతుం
డాకలికేతబ్రహ్మయకునర్మిలి భృత్యుఁడ నిన్నుఁ గొల్తు దే
వా కరుణింపుమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా.

89. చ. పసిగమెయిన్ *వృషాధిపుని ప్రాణము జంగమకోటి ప్రాణముల్
మసలక యెత్తుచున్ భువనమాన్యచరిత్రతఁ దేజరిల్లున
మ్ముసిడిగ చౌడరాయనికి మున్నిటిభృత్యుఁడ నింభజింతు న
న్వసిగోని ప్రోవు మయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా.
(*గణాధిపుల అని పాఠాంతరము)

90. ఎన్నఁగజంగమంబుఁ దనయింతికినెప్పుడు వచ్చునప్డు దాఁ
గన్నమువెట్టి తెచ్చి యధికంబగు నర్థము వానికిచ్చు నా
కన్నడబ్రహ్మసమ్యమికి గాదిలిభృత్యుఁడ వైననిన్ను శ
శ్వన్ను తలతున్ భజింతు బసవా! బసవా! బసవా! వృషాధిపా.

91. ఉ. అసురవృత్తిఁ జూపరుభయంపడిమ్రొక్కఁ బ్రసాదవహ్నిచే
భూసురు లిండులన్నియును బొగ్గులప్రోఁకలు సేయుధూతసం
త్రాసుల బిబ్బబాచయల దాసి యనన్ విలసిల్లు సద్గుణా
వాస శరణ్యమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా.

92. ఉ. సుంకపుఁబైడి భక్తులకుఁ జూఱలు విడ్వఁ బసిండిక్రాఁగులన్
శంకరుఁ బూఁటవెట్టి నరనాయకుచేతను మ్రొక్కుఁగొన్నయా
సుంకరబంకిదేవునకు సూనుఁడ వైనప్రసాది దేవ నీ
వంకకుఁ ద్రిప్పుమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా.

93. ఉ. దివ్యవిమానపంక్తి దివిఁ దేజరిలన్ రజితాద్రికిన్ జగ
త్సేవ్యముగాఁగ మున్ను దనచే మృతిఁబొందు మృగాలిఁ బుచ్చుసం
భావ్యుఁడు తెంగుబొమ్మయకుఁ బ్రాణసఖుండగు నిన్నుఁగొల్తు దే
వావ్యసనాదిదూర బసవా! బసవా! బసవా! వృషాధిపా.

94. ఉ. చెన్నగు ప్రాణలింగరతిచేగ ప్రసాదము పుట్టినిల్లు న
త్యున్నత భక్తిసీమ శివయోగ సమగ్రత కల్మియైనమా
యన్నకు నాదిచెన్న బసవన్న కుసద్గురుఁ డైన నిన్ను శ
శ్వన్నుతులన్ భజింతు బసవా! బసవా! బసవా! వృషాధిపా.

95. చ. అడరఁగఁ గళ్ళుచేసి రుచిరాన్నము లాదట నందియిచ్చుచోఁ
గడిఁగడి నందుకొంచు నతికాంక్ష మెయిన్ శివుఁడారగింపఁ గా
సడిసనుభక్తుఁ డా సురియ చౌడయ్యగారిప్రసాది దేవ నీ
వడుగఁ జుమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా.

96. ఉ. జంగమ *మారగింపక విషంబును మీకు ననర్హమంచుఁ దా
ముంగల నారగించిన సముద్ధత భక్తియుతుండు సత్ప్రసా
దాంగుఁడు శృంగిబొప్పయకు నగ్గల మైన మహానుభావ నీ
వంగడమేఁ జుమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా.
(*మారగింపఁగ అని పాఠాంతరము)

97. చ. కొఱతను లేఁత పత్తిరియు గొడ్డునబాలును రేయి జంగమం
బఱిమఱివేఁడినన్ బడసి యాక్షణమాత్రాన యిచ్చినట్టి యా
మొరటదవంక దేవునకు ముద్దుతనూజుఁడ వైననిన్ను నే
వఱలఁగఁ బ్రస్తుతింతు బసవా! బసవా! బసవా! వృషాధిపా.

98. అనయము భక్తులీడ్యకు లటంచును వేదములాద్విజోత్తముల్
విన నుతియింపఁ గుక్కఁ జదివించినహాలినహళ్ళికళ్ళిదే
వినకు ననుంగువాఁడ వని యుత్సుకతన్ నుతుయింతు భక్త హృ
ద్వనజవిహారలోల బసవా! బసవా! బసవా! వృషాధిపా.

99. ఉ. భక్తునిమ్రింగఁ జంప మును భర్గునకున్ జిరుతోడనంబికిన్
యుక్తమేయంచు వారిపయి నొక్కట నుద్ధతి ఘంటప్రేసి యు
ద్రిక్తతనొప్పఁగా నలరు దిట్టహలాయుధు కట్టనుంగ ప్ర
వ్యక్తమ నీవెదిక్కు బసవా! బసవా! బసవా! వృషాధిపా.

100. చ. ధరసురులింగమూర్తి ధ్వజదండముగా మలగచ్చతోఁక(?) శ్రీ
కరముగ భక్తికిం బడగఁగా శివుగర్భముఁ జొచ్చి పొల్చుమా
యరియమరాజుగారి పరమాప్తుఁడ వైనమహానుభావా నీ
వరవుఁడ నేఁజుమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా.

101. ఉ. దండితవాదియై శివుఁడె దైవము గాకని కన్నులిచ్చి తా
నిండుమనంబుతోడ నెడనిద్దపుఁగన్నులు దాల్చి పొల్చు మా
పండితమల్లికార్జునుఁడు ప్రస్తుతి సేయగ నేర్చు నిన్ను నె
వ్వండు నుతింప నేర్చు బసవా! బసవా! బసవా! వృషాధిపా.

102. చ. వసుమతిఁ బేరుకొన్న నరువత్తురు మువ్వురికూర్మిబంట షో
డసులసుతుండ తేరసుల దక్కినభృత్యుఁడ వీరలాదిగా
నెసఁగు మహానుభావులకు నెల్ల ననర్గళమైనభక్తిన
న్వసిగొని ప్రోవుమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా.

103. చ. బసవనిథానమా బసవభవ్యనిధీ బసవామృతాంబుధీ
బసవమహానిధీ బసవభర్మగిరీ బసవామరద్రుమా
బసవమహాబలీ బసవభండరువా బసవోల్లసన్మణి
వసిగని ప్రోవుమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా.

104. ఉ. నాయెడయుండ నావిభుఁడ నాహృదయేశ్వర నామనోరమా
నాయిలవేల్ప నావరుఁడ నాగురులింగమ నాదుజంగమా
నాయధినాథ నావరదనన్నుఁ గృపామతిఁ బ్రోవుమయ్య దే
వా యమిబృందవంద్య బసవా! బసవా! బసవా! వృషాధిపా.

105. ఉ. నోరికి వచ్చినట్టు నిను నూఱువిధంబులఁ బ్రస్తుతింతు నే
నేరుతు నేరఁ బొమ్మనక నీపయి నొచ్చెములేని మచ్చికన్
గారవమంద మత్ప్రణుతిఁ గైకొనఁగాఁ దగు గౌరవంబునన్
వారనికూర్మిపేర్మి బసవా! బసవా! బసవా! వృషాధిపా.

106. చ. బసవఁడు ప్రీతిఁగైకొనియె భక్తి మెయిన్ రచియించె సోముఁడున్
బసవపురానమంచు మునుఁ బ్రస్తుతిసేయుదురట్లుగాన నీ యసమదయాధురీణతకు నంకిలిపాటు ఘటిల్లకుండనన్
బసఁగొని బ్రోవుమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా.

107. చ. (?)సురవరమల్ల మల్లలితసూత్రసుధాంబుధి ఖేలఖేలసం
గరకలకంఠ కంఠమణి నాయకభీమ భుజంగ జంగమ
స్థిరతరనాథ నాధకనిధీకృతరూప విరూపసమ్మతా
వరకరుణాబ్ధి ప్రోవు బసవా! బసవా! బసవా! వృషాధిపా.

108. చ. సురవరపూజ్య పూజ్యగుణశోభిత శోభితరూప రూపవి
స్ఫురతరశీల శీలగణపుంగవ పుంగవసత్త్వ సత్త్వసం
వరపరవాద వాదభయవర్జితపాపవిచార చార యీ
శ్వరసమ నీవెదిక్కు బసవా! బసవా! బసవా! వృషాధిపా.

109. అకుటిలలింగజంగమ సమగ్రదయాకలితప్రసాది పా
లకురికి సోమనాథుఁ డతిలౌల్యమునన్ బసవన్నదండనా
యకునకు *నొప్ప నీశతక మర్పణచేసె **నలిన్ బఠించువా
రికి వినువారికిన్ గలుగు శ్రీయును నాయువు భక్తిముక్తియున్
(* నీకు; ** ధరన్ అని పాఠంతరములు)

వృషాధిపశతకము సంపూర్ణము

No comments:

Post a Comment