శ్రీ ఆచంట రామేశ్వర శతకము
మేకా బాపన్న (1850)
ఇతర రచనలు: మదనగోపాల శతకము (1863)1. సీ. శ్రీశ పులోమజా చిత్తేశ వాగీశ
ముఖ మఖాశస్తవ ముదిత హృదయ
దయమాన నయన సుధాతార దరహీర
హార నీహార ప్రకార కాయ!
కాయజాపత్తి సంధాయక లోచన
భవబంధ మోచన పాపహరణ
రణరంగ విజయ పారాయణ బాణాగ్ని
నిర్దగ్ధ పురహర నీలకంఠ
గీ. కంఠ కలితాహి భూషణ కాలకాల!
కాలకాతర భూసుర బాల పాల!
భూతలోకేశ! ఆచంట పుర నివేశ!
భావ భవనాశ! రామేశ! పార్వతీశ!
2. సీ. త్రసదమరాభయ దాన దక్షిణ కర
కరగత గైరిక గ్రావ రాజ
రాజచూడద్యుతి రమ్య జటాభోగ
భోగ నిర్భర తర పూర్ణ చిత్త
చిత్త జనాశాగ్ని చిత్ర రుగ్దృగ్వామ
వామామణి శ్లిష్ట వామ భాగ
భాగధేయ త్యాగ ప్రముదితాశాపాల
పాలనా కలనాతివేల భావ
గీ. భావ భవకోటి భాస్వర ప్రౌఢ రూప
రూపవందిత హృద్గిరి భూప భూత
భూతలోకేశ! ఆచంట పుర నివేశ!
భావ భవనాశ! రామేశ! పార్వతీశ!
3. సీ. వినుమదంతర్వాణి వినుత గుణ శ్రేణి
పరిచిత గీర్వాణి పద్మపాణి!
స్వీకృతోరు కృపాణి సేవమానేంద్రాణి,
దీన శుభక్షోణి దృగ్జితైణి!
పులిననిభ శ్రోణి కలహంస కల్యాణి
పరమకల్యాణి షట్పాద వేణి
కలిత కామద్రోణి కైవల్యనిశ్రేణి
మౌనీంద్ర నిర్వాణి మంజువాణి!
గీ. వాణి విధిరాణి తుష్ట శర్వాణి నాదు
కబ్బ మబ్బురముగ జేయ గడఁగు గాత!
భూతలోకేశ! ఆచంట పుర నివేశ!
భావ భవనాశ! రామేశ! పార్వతీశ!
4. సీ. రాజకళా మౌళి రక్షిత దీనాళి
దురిత తమోహేళి తుష్టకాళి
మహనీయ తర దేహు మంజుల రుచి బాహు
వీరరసోత్సాహు వీతమోహు
సమద మూషక సాది సాధుజనామోది
వితత విద్యాపాది వేదవేది
భూరిభూమాసాద్యు సూరి హృత్సంవాద్యు
విఘ్న రుజావైద్యు విశ్వవేద్యు
గీ. నేకదంతుని దాంతుని వీక మది ను
తింతు నిర్విఘ్న పరిసమాప్తిని దలంచి
భూతలోకేశ! ఆచంట పుర నివేశ!
భావ భవనాశ! రామేశ! పార్వతీశ!
5. సీ. వర కవిత్వశ్లోకు వాల్మీకునకు మ్రొక్కి,
మాఘు నిర్మధితాఘు మది నుతించి,
కవితా రసోల్లాసు కాళిదాసు దలంచి,
చారు వాక్సారు మయూరు నెంచి,
ఆంధ్ర భాషాచార్యు నన్నపార్యు గణించి,
యోజ దిక్కనసోమయాజి, యాది
యైన కవులకు జోహారులు గావించి,
యద్యతన కవుల నాత్మ దలచి
గీ. కుకవి లెద నన్నుపేక్షింప గోరి వారి
పొలుపు దలపకుపేక్షింప బూనినాడ,
భూతలోకేశ! ఆచంట పుర నివేశ!
భావ భవనాశ! రామేశ! పార్వతీశ!
6. సీ. గణ యతి ప్రాస లక్షణములేమి యెఱుంగ,
శబ్దార్ధ గుణరీతి శయ్య లెఱుగ,
నాటకాలంకార చాటు ప్రబంధముల్
చతురత మీఱంగ చదువలేదు,
శతకమొక్కటి భవచ్చరణాపచితికి నే
శతపత్ర మాలగా మతిఁదనర్ప
దలఁచితి నిందుకు థైర్య మెద్దియు లేదు
నీ కటాక్షావాప్తి నియతి దక్క,
గీ నిర్వహించిన మానిన నీదె భరము
తండ్రులవిగావె? బాలుర తప్పిదములు,
భూతలోకేశ! ఆచంట పుర నివేశ!
భావ భవనాశ! రామేశ! పార్వతీశ!
7. సీ. క్రొమ్ముడి ముడిచిన క్రొవ్విరి సోనల
సొగయు తేటుల మ్రోత సుతిగ కల్మి
వాల్గంటి కోడలు వలిగుల్కు గుబ్బల
బండిన మణివీణ పద్మరాగ
కంకణ ఝణ ఝణత్కార పాణి ధరించి
మీటఁ దంత్రీ స్వర మేళమాధు
రీసాధు రీతుల రేకజోక సరస
కవులకు చెవులకు చవులు దవుల
గీ. దగు రసస్ఫూర్తి నా కవితకు నొసంగు
తాపసత్రాత సకల విద్యా ప్రదాత,
భూతలోకేశ! ఆచంట పుర నివేశ!
భావ భవనాశ! రామేశ! పార్వతీశ!
8. సీ. భవ మహాంబుధి పోత! పాపాంబు భృద్వాత!
సద్గుణోపేత! వాచామతీత!
ధూత లోకోత్పాత! దుష్టాగ్ని జీమూత!
భక్త కామితజాత! పారిజాత!
కలి హిమఖద్యోత! కాతర యమదూత!
గణ పరివృఢతాత! కామజేత!
రక్షితార్త వ్రాత! రణజయ విఖ్యాత!
దీనావనాకూత! దృహిణ సూత!
గీ. అద్రిజా చిత్త కాసార హంసపోత!
నర సురాసుర కిన్నర నాగగీత!
భూతలోకేశ! ఆచంట పుర నివేశ!
భావ భవనాశ! రామేశ! పార్వతీశ!
9. సీ. కాంచనాచలచాప! ఖండిత మునిశాప!
దందశూక కలాప! దళితపాప!
కరుణారసనదీప! కంజలోచనరోప!
మునిమనో గృహదీప! మోహలోప!
కలితాగమాలాప! కామ హృద్దురవాప!
నందితాచల భూప! నాదరూప!
శమితాసురాటోప! శమ ధన నిక్షేప!
సింధురాజవనీప! శ్రితసునీప!
గీ. నామ జపశోషితానమన్నరక కూప
అంఘ్రి విక్షేప నిహతాంత కావలేవ!
భూతలోకేశ! ఆచంట పుర నివేశ!
భావ భవనాశ! రామేశ! పార్వతీశ!
10. సీ. శయసంగత కురంగ! చంద్రసూర్య రధాంగ!
వితత దయాపాంగ! విశ్వసంగ!
మన్మధ మదభంగ! మధితారి మాతంగ
సన్మనోంబుజ భృంగ! సత్యరంగ!
వలయీకృత భుజంగ! కలిత నంది తురంగ!
నీరరాశి నిషంగ! నిర్మలాంగ!
శేఖర శశిలింగ! శీర్షగంగా తరంగ!
కరుణాంతరంగ! సుఖానుషంగ!
గీ. మత్త దుర్వృత్త దైత్య తమః పతంగ!
అఖిల గీర్వాణ నివహవ నాతిభంగ!
భూతలోకేశ! ఆచంట పుర నివేశ!
భావ భవనాశ! రామేశ! పార్వతీశ!
11. సీ. శారదాంబుదగాత్ర! చతురాననస్తోత్ర!
శ్రితజన వనచైత్ర! శ్రీదమిత్ర!
భవవిమోచన సూత్ర! భక్తేప్సితక్షేత్ర!
దుష్ట దావన జైత్ర! సృష్టిచైత్ర!
పాలిత ద్విజపుత్ర! పావన చారిత్ర!
వృజినాతపచత్ర! వేదపత్ర!
కామున్ కీకృత గోత్ర! కామిత ఫలసత్ర!
శుచ్యబ్జ రవి నేత్ర! శోకతోత్ర!
గీ. కమల సంభవ జనక సత్కంకపత్ర!
ఆపదార్ణవ తరణైక యానపాత్ర!
భూతలోకేశ! ఆచంట పుర నివేశ!
భావ భవనాశ! రామేశ! పార్వతీశ!
12. సీ. మహిత తాపస బృంద మానసాబ్జ మిళింద!
వినత శతానంద! విశ్వతుంద!
కలిత కామితసుంద కరుణాలతాకంద!
నందిత ముచికుంద నతసునంద!
వికృత జాతస్పంద వితత దయామంద!
నిభృత మహానంద నిహితమంద!
కాయరుగ్జిత కుంద కలిత శైలాళింద
గళ తిరస్కృతకంద గళితనింద!
గీ. చారుతర పద వరిభబితారవింద!
అనవరత చామరాంచిత హస్త నంద!
భూతలోకేశ! ఆచంట పుర నివేశ!
భావ భవనాశ! రామేశ! పార్వతీశ!
13. సీ. రజత భూధర ధామ రంజితార్త స్తోమ!
ఫాలదృగ్జిత కామ పఠితసామ!
పతిత పావననామ భక్త రక్షణ కామ!
మస్తక గత సోమ మహిత భామ,
వినత భార్గవరామ విజిత దైత్యస్తోమ!
శ్రీకల్పకారామ చింత్యభూమ!
గజదానవ విరామ కరుణాత్త సుత్రామ!
సారమహోద్దామ సత్యసీమ!
గీ. సూరి జన నుత గుణ ధామ సురలలామ!
చతుర సంగ్రామ గర్వితా శర విరామ!
భూతలోకేశ! ఆచంట పుర నివేశ!
భావ భవనాశ! రామేశ! పార్వతీశ!
14. సీ. సురవార పరివార శోభామానాకార!
సకల లోకాధార సద్విహార!
లాస్యమాన కుమార లాస్యలోల శరీర!
దుష్ట దైత్య విదార దురితదూర!
వందారు మందార వారిధి గంభీర!
విహృత దుర్జనవార వేదసార!
యోగి మానస చోర భోగినాయకహార!
నిటల దృగ్జిత మార నిర్వికార!
గీ. మార శతకోటి సుకుమార మేరుధీర!
కలుష దుర్దమసంసార ఘనసమీర!
భూతలోకేశ! ఆచంట పుర నివేశ!
భావ భవనాశ! రామేశ! పార్వతీశ!
15. నిష్కామ సన్నాహ నిభృత మనోత్సాహ!
సర్ప భూషిత బాహ శమ్యదూహ!
గంగాపరీవాహ కలిత జటావ్యూహ!
వృష పరివృఢ వాహ విగతమోహ!
ఫాలదృక్శుచి దాహ భస్మితాంగజ దేహ!
కామిత సందోహ కామదోహ!
హిత విహంగమ వాహ హత దితిజ సమూహ
రాజతాచల గేహ రమ్యదేహ!
గీ. వరగళద్యుతి నిర్జిత వారివాహ!
ఉద్యతానంద గిరితనయోపగూహ!
భూతలోకేశ! ఆచంట పుర నివేశ!
భావ భవనాశ! రామేశ! పార్వతీశ!
16. సీ. జన్మ జరాత్యాగ జగదవనోద్యోగ!
వినత మహారాగ విదితయోగ!
వందారు కల్పగ వనజారి సంయోగ!
ఘన జటాభాగ సంకలితభోగ!
శ్రిత సుధాశనపూగ హతదైత్య పున్నాగ!
మన్మధ జయవేగ మధితయాగ!
పరిహృత మునిరోగ దురితభారవియోగ!
వరవర్ణినీ యోగ వామభాగ!
గీ. పావకాక్షి రుచిస్ఫీత పాలభాగ!
భూషణీకృత సర్వంగ పూర్ణనాగ!
భూతలోకేశ! ఆచంట పుర నివేశ!
భావ భవనాశ! రామేశ! పార్వతీశ!
17. గోపాయితమఘాద కుటిల దైత్య విభేద!
సాధు జనామోద సత్యవాద!
దేవ పూజితపాద! దేశకానోహ్లాద!
సత్కీర్తి సంపాద క్షపితభేద!
నూపురీకృత వేద పాప సముత్సాద!
విహృత సజ్జన భేద విదితనాద!
ఉపనిషత్సంవాద చపల దురుపసాద!
దుష్టావసాద మేదుర వినోద!
సూరి సముదాయ రక్షణ సుప్రసాద!
పరిహృతాపన్న జన పునర్భవ విషాద!
భూతలోకేశ! ఆచంట పుర నివేశ!
భావ భవనాశ! రామేశ! పార్వతీశ!
18. సీ. శర్వ శంకర భవ సర్వేశ సర్వజ్ఞ!
శ్రీకంఠ శితికంఠ శివ గిరీశ!
భూతేశ మృడహర పురహర ఫాలాక్ష!
నీలకంద మహేశ కాలకాల!
నీలలోహిత మహా కాల మహానట!
స్మరహర భర్గ పంచాస్య రుద్ర
ఈశ్వర భీమ మహేశ్వర కైలాస
వాస మృత్యుంజయ వామదేవ!
గీ భూత భావన క్రీడా కిరాత యనుచు
కేరి పాడుచు నీ నామ కీర్తనములు,
భూతలోకేశ! ఆచంట పుర నివేశ!
భావ భవనాశ! రామేశ! పార్వతీశ!
19. సీ. కణ్వ మార్కండేయ గౌతమ జాబాలి,
రైభ్య శమీక దుర్వాస కచుర
కుత్స భార్గవ బక క్రోష్టి భరధ్వాజ,
కశ్యప పిప్పల కౌశి కాత్రి,
చ్యవన పలాగస్త్య శౌనక సంవర్త,
మాండవ్య రోమశ మందపాల,
వాలఖిల్య వసిష్ఠ వామదేవ సుదేవ
శరభంగ నారద హరితులైన
గీ. నీ గుణంబులు వర్ణింప నేర రన్న
నల్ప మతులగు మా బొంట్ల కలవి యగునె?
భూతలోకేశ! ఆచంట పుర నివేశ!
భావ భవనాశ! రామేశ! పార్వతీశ!
20. సీ. రావె పుంగవ వాహ రావె మంగళదేహ!
రావె నిర్గతమోహ రా నిరీహ!
రావె మహాకాల రావె గౌరీలోల!
రావె లోచనపాల రాసుశీల!
రావె వియత్కేశ రావె మార వినాశ
రావె సురాధీశ రా గిరీశ
రావె మహాదేవ రావె మహద్భావ!
రావె నమద్దేవ రా సుభావ
గీ. రావె శ్రీకంఠ శితికంఠ రావె యనుచు,
తలచి పిలచిన రావిదే తగునె నీకు,
భూతలోకేశ! ఆచంట పుర నివేశ!
భావ భవనాశ! రామేశ! పార్వతీశ!
21. సీ. శ్రీకంఠ నీగుణ చింతనామృతముచే
మరిగి చొక్కినయట్టి మనము మనము!
సర్వజ్ఞ నీపాద జలజ సమర్చన
కలితమై తనరెడి కరము కరము!
క్రీడా కిరాత నీ కింకర పదరజ
శ్చిహ్నితంబైనట్టి శిరము శిరము!
వైకుంఠ మిత్ర నీ వరచరిత్ర స్తోత్ర
స్థిత భక్తి బరగెడి జిహ్వ జిహ్వ!
గీ. శర్వ నీ దివ్య రూపంబు సతతంబు
నమ్మి గాంచఁగ నేర్చిన నరుఁడు నరుఁడు!
భూతలోకేశ! ఆచంట పుర నివేశ!
భావ భవనాశ! రామేశ! పార్వతీశ!
22. ఓ మేరు కోదండ యో మురజిత్కాండ!
యో దయా గుణశాలి యో కపాలి!
ఓ యక్షరాణ్మిత్ర యో యక్షరాట్పత్ర!
యో గజాసురవైరి యో పురారి!
ఈ హిమాద్రి విహార యో యహి కేయూర!
యో సురద్రుమ గేహ యో నిరీహ!
ఓ ఫాలలోచన యో పాపమోచన!
యో మదన వినాశ యో గిరీశ!
గీ. ఓ సుధీభాగదేయ యో యోగిగేయ!
ఓ మహానట యో యీశ యో మహేశ!
భూతలోకేశ! ఆచంట పురనివేశ!
భావ భవనాశ! రామేశ! పార్వతీశ!
23. సీ. మహిత ప్రసన్న కోమల మంగళ స్మిత
లలితాననేందు మండలము తోడ,
మునిజన మానస వనరుహ కర్ణికా
చంచరీక పదాంబుజముల తోడ,
గంగా తరంగ భుజంగ కురంగాంక
సంగ జటాల మస్తకముతోడ,
మస్తకోపరి శస్త మణిగణస్తి వితాన
రాజితోరగ రాజ రాజి తోడ,
గీ. వెలయు నీ దివ్య రూపంబు నిలుపు నాదు
చిత్తమందు దయాలత చిగురులొత్త!
భూతలోకేశ! ఆచంట పురనివేశ!
భావ భవనాశ! రామేశ! పార్వతీశ!
24. సీ. ఓ భక్త మందార యో భద్ర గుణవార!
యో భోగి భూష యో యోగి పోష!
ఓ పుంగవ తురంగ యో పురాసుర భంగ
యో ముని వనచైత్ర యో పవిత్ర
ఓ విశ్వ భావన యో విశ్వ వావన
యో సురాసుర భావ్య యో సుసేవ్య!
ఓ విశ్వమంగళ యో విషాంచద్గళ
యో మహా దేవేశ యో మహేశ
గీ. రావె! రక్షింపవే నన్ను రాజమౌళి!
వేర్వ్ రక్షింప నీకంటె వేల్పు లేరె?
భూతలోకేశ! ఆచంట పురనివేశ!
భావ భవనాశ! రామేశ! పార్వతీశ!
25. సీ. మృత్యు భీతిని నిన్ను మృడ కావు మని వేడ
కరుణ మార్కండేయు గాచినావు!
విషవహ్ని కీలల వేగి సురాసురుల్
శివ బ్రోవు మనగ రక్షించినావు!
నరు డరి జయకాంక్ష హర యని నినువేడ
మెచ్చి పాశుపతాస్త్ర మిచ్చినావు!
శ్రీదుడు నినుజేరి శితికంఠ యని మ్రొక్క
సఖ్య సమున్నతి జరిపినావు!
గి. గాన దీనావళీ కామథేను వనగ
నలరు నిన్గొల్వ కోరిక లబ్బు టరుదె?
భూతలోకేశ! ఆచంట పురనివేశ!
భావ భవనాశ! రామేశ! పార్వతీశ!
26. సీ. రజిత భూథర ధామ రక్షింపుమని మ్రొక్క
రాకున్న పార్వతీ రమణి యాన,
గజదానవాంతక కావుమంచును వేడ,
బలుకకున్నను వీరభద్రు నాన,
దక్షాథ్వారధ్వంస దయజూడు మనిపిల్వ
నరయకున్నను వినాయకుని యాన,
ఖండేందు శేఖర కరుణింపవేయన్న
తలచకున్నను శక్తిధరుని యాన,
గీ. రాజరాజాప్త రమ్మన్న రాకయున్న
భైరవుని యాన, శంకర! ప్రమధనాథ!
భూతలోకేశ! ఆచంట పురనివేశ!
భావ భవనాశ! రామేశ! పార్వతీశ!
27. సీ. నీ కీర్తనల్ వించు నీ కధల్ పాడుచు
నీ దాస జన గోష్ఠి నెగడుచుండు
భూత దయాళులౌ పురుషుల మనమను
ప్రవిమలోదకముల బ్రతిఫలింతు
వధ్వర జప తపో ధ్యయనాది క్రియల ని
ష్ణాతులౌ నీ దాస జనుల గోష్ఠి
నెరి యెరుంగని కర్మ నిరతుల హృత్సన్ని
హితుఁడవయ్యును దోచ వతుల మహిమ
గీ. తత మహానంద సాగరాంతర్నిమగ్న
మాన మానస మానవ మాననీయ
భూతలోకేశ! ఆచంట పురనివేశ!
భావ భవనాశ! రామేశ! పార్వతీశ!
28. సీ. చెన్నగు మొగమున వెన్నెల వెదజల్లు
నవ్వుతో జాబిల్లి పువ్వుతోడ,
పెద్ద వేలుపు పుఱ్ఱె పేరుల జెన్నారు
నురముతో జడలల్లు శిరముతోడ,
పసిమిరంగు జెలంగు పసమీరు పులితోలు
వలువతో సామేని చెలువతోడ,
తలగ్రాలు రతనాల తళ్కుల పాపరా
పేరుతో మెడకప్పు తీరుతోడ,
గీ. నీవు విచ్చేసి దయనేడు గావకున్న
ఎవరి వాడను నేనౌదు నెంచిచూడ,
భూతలోకేశ! ఆచంట పురనివేశ!
భావ భవనాశ! రామేశ! పార్వతీశ!
29. వాకిటి కావలి వాని జేయగనేర,
కోదండమున నిన్ను గొట్టనేర,
రాళ్ళచే రువ్వుచు రవ్వ సేయగనేర,
కుంటెనగా బంప గోరనేర,
బుడుత కూరగ జేసి బువ్వ బెట్టగనేర,
చెలగి కనుల బూజ సేయనేర,
మేను సగంబిచ్చి మెప్పించగానేర,
యెంగిలి వస్తువు లియ్యనేర,
గీ. నివ్వటిలు నెవ్వచే నిన్ను నే దలంప
గూయి వినవైతి వికనేమి సేయువాడ!
భూతలోకేశ! ఆచంట పురనివేశ!
భావ భవనాశ! రామేశ! పార్వతీశ!
30. సీ. నా తల్లి భుజగాధి నాధ కేయూరుండు,
నా తండ్రి కైలాస నాయకుండు,
నా సోదరుడు శీత నగరాడ్విహారుండు,
నా గురుం డంగజ నాశకుండు,
నా సఖుం డమరేంద్ర నందన శరణుండు,
నా బాంధవుడు సన్మనః ప్రియుండు,
నా స్వామి శుచిచంద్ర నలినాప్త నేత్రుండు,
నా దిక్కు నమ్ర జనావనుండు,
గీ. అనుచు మదిలోన నిన్నెంచి యనుదినంబు,
సేవ జేసెద నన్నేలు చిత్తజారి!
భూతలోకేశ! ఆచంట పురనివేశ!
భావ భవనాశ! రామేశ! పార్వతీశ!
31. సీ. కాలకింకరు లుగ్ర ఖడ్గగదా కుంత
శూల ముద్గర భిండి వాల పాశ
పాణులై సంవర్త పవి ఘోష నిర్ఘోష
భీషణ భాషణా భీలకీల
గ్రాల నా మ్రోల సురాసుర కిన్నెరుల్
వీరభద్ర కుమార విఘ్ననాధ
భైరవుల్ ప్రమధులు బలిసి చుట్టును గొల్వ
నగరాజ తనయతో నందినెక్కి
గీ. నీవు ప్రత్యక్షముగ వచ్చి, నిలిచి వత్స!
వలదు వెరవంగ నని నన్ను బలుకుమయ్య!
భూతలోకేశ! ఆచంట పురనివేశ!
భావ భవనాశ! రామేశ! పార్వతీశ!
32. సీ. సర్వేశ్వరుండవు సర్వజ్ఞమూర్తివి,
సర్వకారణుడవు సర్వగుడవు,
సర్వంబు నీలోన సంపన్నమైయుండు,
సర్వంబులో గ్రీడ సలుపుదీవు,
సర్వ సముద్భవ సర్వ సంరక్షణ,
సర్వ నాశనకర చణుడవీవు,
సర్వ రూపకుడవు సర్వ వేద్యుండవు,
సర్వ దృక్కువు సర్వ సాక్షివీవు,
గీ. కాన ననుగావ పరులకు గలదే గరజు?
గలయ బచ్చల కేలయ్య కంద దురద?
భూతలోకేశ! ఆచంట పురనివేశ!
భావ భవనాశ! రామేశ! పార్వతీశ!
33. సీ. నిష్కామ ధర్ములై నీ పాద రాజీవ
సేవాసమాసక్త చిత్తులైన
భక్తులందు ప్రసన్న భాంధవుండగు రీతి
శుద్ధసత్వ గుణోప శోభితులును
మహితానుభావులు మహనీయులగు సుప
ర్వులయందు సద్బాధవుఁడవుగావు,
వీక డెందము కామ నైకతానంబగు
నేని సురాసుర మాననీయ!
గీ అయ్య దయచేసి మీ చరణారవింద
సేవపై చిత్త మిగురొత్త జేయుమయ్య!
భూతలోకేశ! ఆచంట పురనివేశ!
భావ భవనాశ! రామేశ! పార్వతీశ!
34. సీ. జయజయ గౌరీశ! జయజయ సర్వేశ!
జయజయ విశ్వేశ! జయ గిరీశ!
జయజయ ధవళాంగ! జయజయోక్ష తురంగ!
జయజ యాంగజ భంగ! జయ విసంగ!
జయజ యాహి విభూష! జయజ యాశ్రిత పోష!
జయజ యామృతభాష! జయ సువేష!
జయజ యామర రక్ష! జయజ యాగమ వక్ష!
జయజ యాధ్వర శిక్ష! జయ సదీక్ష!
గీ. జయజ యాపన్న రక్షణాక్షయ సుదీక్ష!
జయజయత్ప్రేక్ష మోక్షద చతురవీక్ష!
భూతలోకేశ! ఆచంట పురనివేశ!
భావ భవనాశ! రామేశ! పార్వతీశ!
35. సీ. వసుధా శతాంగాయ! వనధి నిషంగాయ!
దానవ భంగాయ తే నమోస్తు!
సురగిరి చాపాయ! గరుడాశ్వరోపాయ!
దివ్యస్వరూపాయ! తే నమోస్తు!
కరుణాలవాలాయ! గజచర్మ చేలాయ!
దీనాళి పాలాయ! తే నమోస్తు!
నిగమాంత గణ్యాయ! నిభృత లావణ్యాయ!
త్రిజగద్వరేణ్యాయ! తే నమోస్తు!
గీ. దినకరాబ్జ రధాంగాయ! తే నమోస్తు!
అనుచు నిరతంబు నీకు జోహారు సేతు!
భూతలోకేశ! ఆచంట పురనివేశ!
భావ భవనాశ! రామేశ! పార్వతీశ!
36. సీ. దండంబు కుండలి కుండలాంచద్గండ
దండంబు మేరు కోదండ దండ!
దండంబు బ్రహ్మాండ మండితోరుపిచండ
దండంబు భండ నోద్దండ దండ!
దండంబు శుండాల దనుజ ఖండన చండ
దండంబు దండ భృద్దళన కాండ!
దండంబు తాండవ దళిత దిగ్వేదండ
దండంబు దండిత దైత్యకాండ
గీ. దండ మాఖండలాండ జాతాశ్వపుండ
రీక భవ ముఖ మఖ భుగనీక వినుత
భూతలోకేశ! ఆచంట పురనివేశ!
భావ భవనాశ! రామేశ! పార్వతీశ!
37. ముని జనావన శీల! ధనద సఖ్య విలోల!
కరధృత శూల! మంగళము నీకు!
సనకాది మునిజాల! సన్నుత గుణలీల!
కరుణాలవాల! మంగళము నీకు!
త్రిభువన జంఘాల! దివ్యకీర్తి విశాల!
కంకాలమాల! మంగళము నీకు!
కుత్కీల వరఖేల! ఘోరదైత్య విఫాల!
గళజితనీల! మంగళము నీకు!
కాళి కాంచిత ఖేల మంగళము నీకు!
కామితామరసాల! మంగళము నీకు!
భూతలోకేశ! ఆచంట పురనివేశ!
భావ భవనాశ! రామేశ! పార్వతీశ!
38. జయ విజయీభవ! శమధన నిక్షేప!
జయ విజయీభవ! శాంతరూప!
జయ విజయీభవ! శమన నిర్వాపణ!
జయ విజయీభవ! శైలశరణ!
జయ విజయీభవ! చక్రాంగ హయసూత!
జయ విజయీభవ! సారభూత!
జయ విజయీభవ! సర్పరాజ విభూష!
జయ విజయీభవ! సత్యభాష!
గీ. యనుచు గీర్తింతు నిను భక్తి ననుదినంబు
దీన సంతాన సంతాన దృగ్వితాన!
భూతలోకేశ! ఆచంట పురనివేశ!
భావ భవనాశ! రామేశ! పార్వతీశ!
39. ముని మనశ్చాతక ఘన కరుణారస
నుమ్నగా వల్లభ నీకు శరణు!
వట మహీరుహమూల వాసవాసవ వంద్య
నీరజాక్షప్రియ నీకు శరణు!
పాపశిలోచ్చయ భంజన పవిథాన
నీలలోహిత శర్వ నీకు శరణు!
దైవమానస హంస దేవదేవ వతంస
నీలకంఠ మహేశ నీకు శరణు!
గీ. అనుచు నీ పద యుగమున కనుదినంబు
దండ మొనరింతు నా మది నుండు కొఱకు!
భూతలోకేశ! ఆచంట పురనివేశ!
భావ భవనాశ! రామేశ! పార్వతీశ!
40. పాహిమా మహిరాజ బంధకంకణబాహ!
పాహిమామాహృత భవ విమోహ!
పాహిమా మంగజ భస్మ భూషితకాయ
పాహిమా మాపన్న భాగదేయ!
పాహిమా మాశ్లిష్ట పార్వతీ రుచిరాంగ!
పాహిమా మానత పాప భంగ!
పాహిమా మమరేంద్ర పరిచిత పదపద్మ!
పాహిమా మాశ్రిత భాగ్య పద్మ!
గీ. యనుచు భజియింతు నా మది నహరహంబు!
ఘన దయాపాంగమున నన్ను గాంచుమయ్య!
భూతలోకేశ! ఆచంట పురనివేశ!
భావ భవనాశ! రామేశ! పార్వతీశ!
41. సీ. వందన మిందిరా వల్లభ లోచన
పంకజ పూజిత పాద నీకు!
వందన మిందురుగ్బృంద విభాసిత
ఘన జటా పటల వికాస నీకు!
వందన మరవింద చందన మందార
హార నిహార శరీర నీకు!
వందన మిందీవ రేందింది రానీక
కాంతి మేచక రుచి కంఠ నీకు!
గీ. వందనం బబ్జసంభవ వరద నీకు!
వందనం బింద్ర ముఖసుర వరద నీకు!
భూతలోకేశ! ఆచంట పురనివేశ!
భావ భవనాశ! రామేశ! పార్వతీశ!
42. చిన్ని బసవెన్నెన్ని జిల్గు శాల్వు లొసంగె
గోరక్షుఁ డేయగ్రహారమిచ్చె?
మణివాలు మాచయ్య మణుల నెన్నిటినిచ్చె?
బసవన్న యేమేమి భాగ్యమిచ్చె?
మరుశంకరుండెన్ని మదగజంబుల నిచ్చె?
కిన్నరుం డెన్నెన్ని హొన్నులిచ్చె?
చిక్కన్న యేమేమి చిత్ర వస్తువులిచ్చె?
కన్నప్ప యేమేమి కట్నమిచ్చె?
గీ. నేను నీకేమి యియ్యంగ నేరనైతి!
వలదు చలమిక నన్నేలు వామదేవ!
భూతలోకేశ! ఆచంట పురనివేశ!
భావ భవనాశ! రామేశ! పార్వతీశ!
43. చంద్ర సూర్య గ్రహ చపలాభ నీరద
పవిఘోష జిష్ణు చాపములు నీవ!
అజ హరి దిక్పాల కాదిత్య వసురుద్ర
గరుడ గంధర్వ కిన్నరులు నీవ!
నదనదీ ద్వీప వనధి శైల కానన
సాల వల్లీ నికుంజములు నీవ!
పశు పక్షి కీటక పన్నగ క్రిమి నర
స్త్రీ పున్న పుంసక తిములు నీవ!
గీ. జపతపోవ్రత దాన యజ్ఞములు నీవ!
మంత్రశాస్త్ర పురాణాగమములు నీవ!
భూతలోకేశ! ఆచంట పురనివేశ!
భావ భవనాశ! రామేశ! పార్వతీశ!
44. సీ. సిగమీద చల్వొందు తొగవిందు గలవాని
పులితోలు సాలు మై బూనువాని,
సామేన నిరవొందు చాన గల్గిన వాని
కేల ముమ్మొనవాలు గ్రాలువాని,
చిల్వరా సొమ్ముల జెలగు చేతులవాని
యెదనల్వ పునుక పేర్లసగువాని,
నింగివాక కరళ్ళెసంగిన తలవాని
పొలదిండి మూకల గలచువాని,
గీ. వేలుపుల చాలు నేలంగ జాలువాని,
కన్ను లలరంగ నెన్నడు గాంతు నిన్ను!
భూతలోకేశ! ఆచంట పురనివేశ!
భావ భవనాశ! రామేశ! పార్వతీశ!
45. మించుల జిగిమించు మేల్జడల్ మిన్నేటి
రాయంచ తెగకు లేరంగులునుప
తలమీద నెలకొన్న నునుసోన చాన తా
మేను జాను కొకింత మెరుగు వెట్ట
పాపరా రవణాల పసమానికపు రంగు
సెగకంటి కసటు బాయగ నొనర్ప
మెడబెడంగగు కప్పు మినుకు మేనను గ్రాలు
తోలు దువ్వల్వకు దోడు పడగ
గీ. నొకటి కొక్కటి మేన జెన్నొసగుచుండు
అంద మిరువొంద బెంపొంది యలరితౌరా!
భూతలోకేశ! ఆచంట పురనివేశ!
భావ భవనాశ! రామేశ! పార్వతీశ!
46. కమనీయ శుభదేహ కరుణారసోత్సాహ
సురసంఘపాల భూసుర కపోల!
నాగరాట్కేయూర నతజన మందార
దుష్టలోక విదార దురితదూర!
నందితార్తస్తోమ వందిత సుత్రామ
కైలాస వాస వికాస హాస!
మహనీయ హితవేష మంజులామృత భాష
సర్వలోకాధార సద్విహార!
గీ. విశ్వ సంపాద్య నిరవద్య వేదవేద్య!
నన్ను కృప బ్రోవవే జగన్నాధ నాధ!
భూతలోకేశ! ఆచంట పురనివేశ!
భావ భవనాశ! రామేశ! పార్వతీశ!
47. సీ. శబ్ద మర్ధంబును సహజంబుగా నేక
మైయున్న చందంబు నచ్చుపడగ
పుష్పంబు పరిమళంబును నైజముగ నేక
మైయున్న పోలిక యావహిల్ల
ఘన సువర్ణము వన్నెయును నొప్పుగా నేక
మైయున్న మాడ్కి పెంపంగలింప
చంద్రికయును పూర్ణ చంద్ర్ఁడు తహనేక
మైయున్న కైవడి యందమొంద
గీ కాయమును కాయ మేకంబు గాగ సుకహ్ము
కాంచు సతికిని పతివీవె గాక యొరుఁడె?
భూతలోకేశ! ఆచంట పురనివేశ!
భావ భవనాశ! రామేశ! పార్వతీశ!
48. సీ. మడమల తడబడు జడపూన్కి నకనక
లాడు నెన్నడుము జవ్వాడ బెళుకు
బేడిసమీలను బెదరించు కందోయి
మిసమిస లెసగు నెన్నొసల మసలు
భసలములన నెరు లెసగ వివ్వచ్చు రా
పచ్చల బొలుపొందు బాజు బందు
లందమంద కడాని యందెల రవలి జె
న్నొంది యంచల నడ గ్రిందు పరప
గీ. వెన్నుడన్నగు చెన్ను నీ వెన్న మరచి
చన్న నిన్నెన్న నలువన్న జాలడన్న!
భూతలోకేశ! ఆచంట పురనివేశ!
భావ భవనాశ! రామేశ! పార్వతీశ!
49. సీ. అల్క హుమాగుల్కు చిల్క తేజి నెక్కి
మావి లేజిగురాకు మావుబాకు
మొలజిక్కి యెలగోలు ముస్తాదు వస్తాదు
చందురుండామణి జంట నడువ
గోర్వంక లంచలు కోయిలల్ చిల్కలు
పావురా ల్లకుముకుల్ పౌజు గొల్వ
తమ్మిమిద్దె ఢమామి ధణ థణ మ్రోయంగ
కేకి నకీబులు కూకవేయ!
గీ. మించు పూముల్కు లెదనించు నించు విల్తు
చంచదాలోకనాగ్ని దహించితౌరా!
భూతలోకేశ! ఆచంట పురనివేశ!
భావ భవనాశ! రామేశ! పార్వతీశ!
50. సీ. తల నపరంజి నిద్దాతళ్కు లొల్కు మేల్
చెక్కడపుంబుట్ట సిరిలెసంగ
రంగారు బంగారు రతనాల కంకణాల్
పోచీలు సూడిగాల్ పొలుపు మీర
రంగు చెరంగు లవంగపు మొగ్గల
కంచెల బిగి చన్నుగవ దలిర్ప
ఎఱుకతవై హిమగిరికి గౌరినిగాన
నరుగు నొయార మెంతని నుతింతు
గీ. సుందర స్మిత నిందిత వందనార
వింద బృందేందు మందార కుంద కోశ!
భూతలోకేశ! ఆచంట పురనివేశ!
భావ భవనాశ! రామేశ! పార్వతీశ!
51. సీ. గమగమ వలచు చొక్కపు తావి వీడెంపు
కావి మోవికి బలు ఠీవి బెనుప
మినుకు కాటుకరేక మిలమిల దెలివాలు
కన్గవ కొకవింత కాంతి నెరప
కళ్కులీనెడి కెంపు కర్ణపూల్ ధగథగల్
తళ్కు లేచెక్కు టద్దముల బొదల
నాణెమౌ కట్టాణి యాణిమిత్తెపు నత్తు
చిరునవ్వు కొకవింత సిరి యొసంగ
గీ. తేట మాటల పాటల కూటవులను
మంచుమలమాలి నిన్ వలపించెనౌర!
భూతలోకేశ! ఆచంట పురనివేశ!
భావ భవనాశ! రామేశ! పార్వతీశ!
52. సీ. మొకమల్ జిలుగు దట్టి మొలగట్టి టీకైన
మోజాల్ బిగించి హాముకొని చెరుకు
సింగాణి చెంగల్వ చికిలి నేజాబూని
గందంపు గుబ్బలి గాడ్పుటాము
టేనుంగు పై నెక్కి యెదిరి హుటాహుటి
కమ్మవిల్ పాదుషా కణక మీర
కాయమ్ము గాయమ్ముగా నేయ నాయమ్మ
నాయమ్మ వనిజేర నన్నెరుంగు
గీ. మనుచు నిన్ గోరి వగగేరి యలరు గౌరి
దూరి సఖి జేర్చు కేళికాగార మౌర!
భూతలోకేశ! ఆచంట పురనివేశ!
భావ భవనాశ! రామేశ! పార్వతీశ!
53. సీ. మీరి కాల్నడ దప్పి పారు గొజ్జంగి పూ
నీటి కాలువ లెట్లు దాటెదమ్మ
పచ్చ కప్రపనంటి పచ్చిక ప్రపుటస
లెటుల కాలూని నీ వేగెదమ్మ
జోరున తేనెల సోనల జడి జిను
నెలమావి గమినెట్లు నిలిచెదమ్మ
కమ్మ దెమ్మెర దోడుగా నున్న వెన్నెల
చిచ్చులో నీ వెటు జొచ్చెదమ్మ
గీ. యనుచు నాళీజనంబు నీకై విరాళి
బాళి మీరగ కాళిని బలుకు నౌర!
భూతలోకేశ! ఆచంట పురనివేశ!
భావ భవనాశ! రామేశ! పార్వతీశ!
54. సీ. వగగుల్కు తళ్కుల వజ్రాల బేసరి
కళజెందు గుజరాతి ఖత్తి నత్తు
తళతళల్ చెక్కు టద్దము మీద నటియింప
నీలాల బావిలీల్ నిగ్గులడర
మొగము జాబిల్లికి నగవుటన్నువ చెన్ను
వెన్నెల లీనంగ నెన్నడుమను
మిన్నుకు మొగులన మింకు నీలంపు రా
మొలనూలు మొల మిలమిల జెలంగ
గీ. జిల్క తేజీ వజీరు రా సిరి యనంగ
నున్న యుమ గూడి యున్న నిన్నెన్న దరమె?
భూతలోకేశ! ఆచంట పురనివేశ!
భావ భవనాశ! రామేశ! పార్వతీశ!
55. సీ. తావి గుబుల్ కొను గోవ జవ్వాది వా
సన రవల్ మేనను జాదు కొనగ
నీరెండ పై బర్వ నిక్కు జక్కువలన
రంగు చెంగావి జెలంగు రవిక
కప్పున గుత్తంపు గబ్బి గుబ్బ లెసంగ
బిత్తరంపు పిసాళి బెళ్కు చూపు
తళ్కుల దమ్మి మొత్తము గ్రుమ్మరింపంగ
తొగవిందు రాచరా జగతి మీద
గీ. వెలయ గూర్చుండి మణివీణ వ్రేళ్ళ మీటు
నుమ గనుంగొని యానంద మొందు దౌర!
భూతలోకేశ! ఆచంట పురనివేశ!
భావ భవనాశ! రామేశ! పార్వతీశ!
56. సీ. జేజేల రారాల సీ యను వేనలి
మించుల జిగి నదలించు మేను
కవకవ జక్కవ కవనవ్వు చన్గవ
కలదు లేదను నౌను కౌను వెలయ
నూడిగపుం జేడె లాడాడ దోడరా
వలుమల చూలుతో గలసి వలపు
పుప్పొడి తిప్పల పొగడల నీడల
మావుల తావుల మల్లె పొదల
గీ. జాజి పందిళ్ళ కిసిమిసి చప్పరముల
వన్నె గ్రుమ్మరు నీ హొయ లెన్నదరమే?
భూతలోకేశ! ఆచంట పురనివేశ!
భావ భవనాశ! రామేశ! పార్వతీశ!
57. సీ. వీణె కస్తూరి బొట్టు విన్నాణముగ దిద్ది
వలపుల గోవ జవ్వాది మేన
నలది మేలి బనార సపరంజి కమ్ముల
ఖండువా వల్లెవాటుగ నొనర్చి
బర్మా బుటేదారు పాగపై మగరాల
నిగరాల సరిఫేషు నీటు గుల్క
షాన్ కలాబతుతీవ సఖాతులాలుపా
పోసులు పదముల పూని మ్రోల
గీ. సల మణిగ్రీవ నలకుబేరులు చెలంగి
కొల్వగ వయ్యాలి వెడలితౌ గొనబు మీర!
భూతలోకేశ! ఆచంట పురనివేశ!
భావ భవనాశ! రామేశ! పార్వతీశ!
58. సీ. రాజంపు ముత్తెంపు రవడాల తెలిడాలు
వెలివలిపము కొక్క తెలివి యొసగ
మొగ మరవంపు కెమ్మోవి కెంపుకు పెంపు
సవరింపు మెడ బన్న సరుల సిరుల
నంద మందెడు కురువిందంపు బాదామి
దగు కుందనపు జిగి జిగిని గుల్క
శాతమాన్యవ శిలా శకలమే చకచక
చ్చకలూను మేనెల్లి జమున నీన
గీ. కాలి గళపాళి హాళి విరాళి దాళి
తాళి ముడిగొల్పు నీబాళి దరమే పొగడ?
భూతలోకేశ! ఆచంట పురనివేశ!
భావ భవనాశ! రామేశ! పార్వతీశ!
59. సీ. రాణ రంజిల్లు నపరంజి కీల్ బొమ్మల
పదము లొయ్యన నొత్త పంజరముల
పంచాస్త్ర శాస్త్రముల్ పలుకంగ చిల్కలు
పవడపు కోళ్ళు హొంబట్టు పరుపు
పందిరి మంచముపై జేరి గౌరితో
తారుమారుల మోవి మారుపులను
తడబడు మడుపుల తమి నొడబడికల
సారె గిల్గింత గుజాగుజలను
గీ. సుద్దులను ముద్దులను నద్ది ప్రొద్దు పుచ్చు
జాణతనమెన్న వేనోళ్ళు జాలవన్న!
భూతలోకేశ! ఆచంట పురనివేశ!
భావ భవనాశ! రామేశ! పార్వతీశ!
60. సీ.కుళితంపు కెంపుల గుల్కెడు రాగిడీ
రవ నీరు జిల్కు మెరంగు పసరు
పసగ్రక్కు పక్కిరా పచ్చల బిందీలు
జిగిబెళ్కు లెసగి జేజేల రాచ
సింగాణి చందంబు జెంద నొడ్డాణంపు
నిద్దా కడాని డాల్ నిగ్గు జగ్గు
క్రొమ్మించు మించుల గొనబారు చేర్చుక్క
ముత్యాల వడగళ్ళు మురువు చూప
గీ. తురుము మబ్బుగ తొల్కరి సిరి దనర్చు
మంచుమల చూలి సామేన నుంచి తౌరా!
భూతలోకేశ! ఆచంట పురనివేశ!
భావ భవనాశ! రామేశ! పార్వతీశ!
61. సీ. పెంపురు వారంపు కెంపురారవజవ
హవణింపు జాళువా బవిర లొరయ
మొల్క నిద్దానిగ్గు ముత్తెంపు పేరులు
వలుగుల్కు గబ్బి గుబ్బల చెలంగ
ముదురు నెల సవురు కెదురగు నుదురున
చొక్కమౌ చేర్చుక్క సొగసు గల్గ
వెరవెరకు చికిలి మ్మొరుగుల శిరిచూలి
చిక్కటారి మిటారి చెన్ను మీరి
గీ. పెండ్లి తరి గౌరి నీ యోర పేర్మిమీర
నణకు తలనున్న సొబగెన్న నలవటన్న!
భూతలోకేశ! ఆచంట పురనివేశ!
భావ భవనాశ! రామేశ! పార్వతీశ!
62. సీ. వెడవింటి దొరదాడి వెడలంగ నూహించి
పూల కుంకుమమున బూజ సేయ
దరుచికిలీతేజు తరుల తర్వారన
చీని కలాబతు జిల్గు వన్నె
పస నొసంగెడు కుసుంబా చీర కటిగట్టి
గంబురాజభరా గంద మలది
సొంపగు కెంపులు సొమ్ములు మైబూని
మగరాకళా సిక మాళిగందు
గీ. నగజ సర్వ సుపర్వాంగనలు భజింప
ప్రౌఢి జెల్వోందు నీ వామ భాగమందు!
భూతలోకేశ! ఆచంట పురనివేశ!
భావ భవనాశ! రామేశ! పార్వతీశ!
63. సీ. మేల్మి జరీ బుటా మిసమిస మొగ్గల
రహిమించు పై ఠాణి రవిక పిక్క
టిలి వలిగుల్కు గుబ్బల చకచ్చకలుబ్బ
బహరీగుజా జరీ పట్టే లడరు
సన్నపావడ మించు సరిమించు సరిగంచు
చీరపై మిసిమి డాల్ సౌరుదేర!
బిందీలు రాగిడి బేసరి బావిలీ
లాదిగాగల నగ లందమొంద
గీ. వేల్పుటింతులు సీవిరుల్ వీవ నీవు
ముచ్చటింతువు సనకాది మునులతోడ!
భూతలోకేశ! ఆచంట పురనివేశ!
భావ భవనాశ! రామేశ! పార్వతీశ!
64. సీ. మా రమణీమణి మణి దర్పణముజూప
వారాహి యడపంబు వన్నెదాల్ప,
కౌమారి యపరంజి కాళంజి పూనంగ,
భారతీసతి విన్నపం బొనర్ప,
పౌలోమి తగటాకు బాగా లొసంగ న
చ్చర పిండు వీవ సీ విరులు వరలు
నుంగరపుంగుర్లెసంగు వాగురుల హొ
రంగున నొసల దురంగలింప
గీ వెలయు గిరికన్యతో గూడి వెండి కొండ
చరుల గ్రుమ్మరు నీ సౌరు సన్నుతింతు!
భూతలోకేశ! ఆచంట పురనివేశ!
భావ భవనాశ! రామేశ! పార్వతీశ!
65. సీ. గుర వేశ్రితామర తరవేథరాత్మజా
తోషితాయ భుజంగ భూషితాయ
శూలినే ఫాల దృక్కీలినే గుణసింధ
వేనకద్రుచి జిత లోకబాంధ
వేనమ్ర విష్ణవే వినమిత జిష్ణవే
కమలారి ధారిణే కలుషహారి
ణే గో తురంగాయ నిర్మలాంగాయ న
మస్తే యటంచు నా మది భజింతు
గీ. కటి నికట ఘటిత వికట కరటి చర్మ
పటల పటపట నీల రుక్పట వికాస!
భూతలోకేశ! ఆచంట పురనివేశ!
భావ భవనాశ! రామేశ! పార్వతీశ!
66. సీ. తెరగంటి తెగ పొలదిండి పిండును కడ
లి దరువ బొడము గడిది విసంబు
మెసవి లోకములకు మేలొనర్చితి వను
నుడియు పారుని చిన్ని బుడుత కసువు
లొసగితి వనుసుద్ది వెస నాలకించె నే
మదినమ్మి నిన్ను వేడ దయ జాలి
నున్న నన్నన్న ని న్మానగజాలను
హేతి నిర్భిన్న కుంభీంద్ర విద్వ
గీ. షద్వపుఃపాత నోచ్చ లక్ష్మా విభుగ్న
కుంభి కుంభీనసాచల కూర్మ కేశ!
భూతలోకేశ! ఆచంట పురనివేశ!
భావ భవనాశ! రామేశ! పార్వతీశ!
67. సీ. తిగ ప్రోళ్ళు గొట్టిన దిట్టవు మిత్తి గొం
గవు వెనకయ్య జియ్యవు వణంకు
మెట్ట కూతురు చెట్ట బట్టిన సామివి
బూచుల గమినేలు ప్రోడవంచు
మ్రొక్కి నే మది నెంచి మోడ్పుగే లౌదల
గదియింప నను దయ గనవదేర?
అక్షీణ దాక్షిణ్య లక్షణ లక్షిత
కరుణాకటాక్ష వీక్షాళి సంధు
గీ. క్షిత సులక్ష్యక్షమాక్షౌమ క్షేత్ర పత్ర
దంతిముఖ పూర్ణ భక్త కదంబ కాశ!
భూతలోకేశ! ఆచంట పురనివేశ!
భావ భవనాశ! రామేశ! పార్వతీశ!
68. సీ. శివ! భవ! శ్రీకంఠ! శితికంఠ! స్మరహర!
పురహర! పన్నగభూషణా ప్ర
పన్నపోషణ శీత భాను బృహద్భాను
భానునేత్ర! సితాభ్ర పాండుగాత్ర!
పాహిమా మంచు నే బలవరించిన నాల
కించవు నా మొర గిరిజ కైన
జాలి పుట్టగ దెల్ప జాలవో నతశత
మఖముఖ సురవర మౌళి పాళి
గీ. తాన సంతాన మాలికా లీన రీణ
ప్రసవరవ ధారణీ థౌత పాదదేశ!
భూతలోకేశ! ఆచంట పురనివేశ!
భావ భవనాశ! రామేశ! పార్వతీశ!
69. సీ. గతి నీ వటంటి, నన్ గావంగ నీ కంటె
గతి యెందు నొండు నే గాననంటి,
నావంటి దీనులౌ నరుల నేలితివంట,
నేర్పులు నేనేమి నేరనంటి,
తొంటి నీ లీలలు వింటి ముక్కంటి నన్
వంటి వీడగ జూడ వల్వదంటి,
ప్రళయ వేళాధ్వన ద్భయదాభ్రకాళిమ
కాయకరాళాంధకాసుర హన
గీ. నప్రమత్తేంద్ర శుచి యమ నైరృతాబ్థి
నాథ వృషదశ్వ యక్షరా ణ్ణగనివేశ!
భూతలోకేశ! ఆచంట పురనివేశ!
భావ భవనాశ! రామేశ! పార్వతీశ!
70. సీ. తొగరేని నిగ నిగనగు నగు మొగముల
మగువల మగరాల నగల తగటు
వగగుల్కు జిల్గు దువ్వల్వల జగజంపు
వెడవెడ నడల తత్తడుల వేడ
లేదుగా యెదనీదు పాదముల్ కుదురు కొ
ల్పుమటన్న నోహోహో పొసహ నింత
మాత్రమైనను జేయ మదిదల్ప రాదకో
శారీర రుచి జిత శారదాబ్జ
గీ. హార హీర సురాహార పూరగంధ
సార ఘనసార హిమజలాసార కాశ
భూతలోకేశ! ఆచంట పురనివేశ!
భావ భవనాశ! రామేశ! పార్వతీశ!
71. సీ. ఎగదిగ కన్నులు, నేనుగుతోల్వల్వ,
కాడిల్లు, బూడిద గంద, మెద్దు
జుల్మతీతత్తడి, చెల్మి బూచులతోడ,
బొల్లి నెమ్మేను సంధిల్ల నిట్టి
విభవ మొప్పెడి నిన్ను వేదురువట్టి కొల్వగ
ల్వగ బూను నన్ననవలెను గాక
నిన్నన పనియేమున్నది? శాబాసు!
సాయం సమారంభ చటుల నటన
గీ. భ్రమదదభ్ర జటాచ్చటా బహుళ భంగ
స్వర్థునీ ధ్వని ముఖారితాశావకాశ!
భూతలోకేశ! ఆచంట పురనివేశ!
భావ భవనాశ! రామేశ! పార్వతీశ!
72. సీ. పుట్టింప రక్షింప బొలియింప నబ్జ సం
భవుడవై, శ్రీరమా ధవుడవై, భ
వుడవయి యున్నాడ వొక్కడ వరయంగ,
నాద్యంత శూన్యుండ వజుడ వాద్యు
వటంచు దెలియ శుకాగస్త్య శౌనక
దూర్వాస కౌశికాదులకు గాక
వశమే యస్మాదృశ కృశమనీషుల కెన్న?
పటహ భూరి ధ్వని స్ఫాయ దుత్క
గీ. టార్భటీ ఘోర కహకహ కాట్టహాస
ఘోర నిర్భిన్న బ్రహ్మాండ కుహర దేశ!
భూతలోకేశ! ఆచంట పురనివేశ!
భావ భవనాశ! రామేశ! పార్వతీశ!
73. సీ. మునుప జేజేలలో మంచి దేవరవంచు
ముదురు చదువు తుదల్ మొరసె ననుచు
పెద్దల సుద్దులు తద్దియ బాటించి
సేవింప వంచన చేసి నన్ను
గనవయ్యయో యింత కఠినంబు బూనుట
కేది గతంబొ నే నెరుగ నలిక
దృగ్విష్వగుచ్చల ద్వీతిహోత్ర స్ఫాయ
దుత్కట విస్ఫులింగోగ్ర హేతి
గీ. చక్రద్వీప వపుః పుష్ప చాప భూతి
ధామ దిగ్మూఢ భాస్వ దుద్యద్దినేశ!
భూతలోకేశ! ఆచంట పురనివేశ!
భావ భవనాశ! రామేశ! పార్వతీశ!
74. సీ. రక్షింపవే నన్ను రాజరాజ వయస్య
శశిథర త్ర్యక్ష పంచాస్య యనగ
పోషింపవే నన్ను భుజగేంద్ర కంకణ
ఫాలదృగ్జిత పంచబాణ యనగ
పాలింపవే నన్ను పార్వతీ ప్రియధామ
చూడామణీకృత సోమయనగ
కరుణింపవే నన్ను కమలాప్త శశినేత్ర
భవ మహార్ణవ యాన పాత్రయనగ
గీ. విషము దిన్నట్లు పలుకవు వినవు మనవి
స్థాణునామము నిజమయ్యె స్వామి నీకు!
భూతలోకేశ! ఆచంట పురనివేశ!
భావ భవనాశ! రామేశ! పార్వతీశ!
75. సీ. తత రత్న కాంచనాంచిత సౌథములకంటె
విహితమా ప్రేతభూ విహరణంబు?
మంజుల మణిమయ మంజీరములకంటె
చిత్రమా భుజగ మంజీర చయము?
మువ్వంపు మేల్ జరీ దువ్వల్వకంటెను
మృదులమా మువ్వన్నె మెకముతోలు
నలువైన నడల జెన్నారు వార్వముకంటె
గౌరవమా వెలి గబ్బి గిబ్బ?
గీ. భక్తు లడిగిన లేదను పనికి వల్ల
జేసికొనబూని యీవేస మేసితౌర!
భూతలోకేశ! ఆచంట పురనివేశ!
భావ భవనాశ! రామేశ! పార్వతీశ!
76. సీ. పల్లకి లందలాల్ బాబాలు నడుగంగ
నెరుగనే నీ వెద్దు నెక్కుచుంట
చీని చీనాంబరాల్ జిల్గు శాల్వల గోర
చూడనే మొలతోలు చుట్టుచుంట
మురుగులు సరిపెణాల్ మురిడీలు యాచింప
కాననే పాముల బూనుచుంట
భక్ష్యముల్ భీజ్యముల్ పానీయముల్ వేడ
వినియుండనే నీవు విసము దినుట
గీ. వెఱ్ఱినే నిన్నెరింగియు విత్త మడుగ
చాలు నీ భక్తి స్థిరముగ సంఘటింపు
భూతలోకేశ! ఆచంట పురనివేశ!
భావ భవనాశ! రామేశ! పార్వతీశ!
77. సీ. మణిగణ విభ్రాజమాన కూటుడు మామ,
కాంచనా హార్యంబు కార్ముకంబు,
రాజతాద్రియే గీము, రాజరాజు సఖుండు,
నన్నపూర్ణ ప్రియ యమృత వాపి
దీర్ఘిక యుపవని దేవతాగమ వాటి,
కామథేనువు దొడ్డి గల్గు గడ్డి,
యైన లోభితనాన నవి వాడుకకు దేక
బువ్వ బిచ్చాలును పొట్టనింపి
గీ. కాల మీరీతి కష్టాన గడుపుచున్న
నిన్ను జేరిన నా వెఱ్ఱి నెన్నవేల?
భూతలోకేశ! ఆచంట పురనివేశ!
భావ భవనాశ! రామేశ! పార్వతీశ!
78. సీ. శ్రీశైల పతితోడ జెప్పునేమో యని
వెల్తికైనను నీవు వెరవవైతి!
భీమేశ్వరుని తోడ బ్రేలునేమో యని
నాడికకైనను నోడవైతి!
అవిముక్త పతితోడ నాడునేమో యని
కొదువకైనను నీవు నదలవైతి!
గోకర్ణు నాధుతో గొణుగునేమో యని
సడికైన నీవేమి జడియవైతి!
గీ. వహహ! ఏమైనగాని నీ వరసి నన్ను
సాకలేవైతివని నిన్ను చాటువాడ!
భూతలోకేశ! ఆచంట పురనివేశ!
భావ భవనాశ! రామేశ! పార్వతీశ!
79. సీ. నిన్ను సేవింపక మున్ను నరుండన్న
మంశుకమారామ మాలయంబు
నామయా భావమౌ నంగంబు గలిగియు
నన్యమెరుగక యహర్నిశంబు
సేవించి భిక్షుడై చీర గట్టగలేక
కాటిక్రేవల వెఱ్ఱిగా జరించి
గుట్టమెట్టలవెంట గూడి మేనరవెల్ల
దనమొంది దలయేరు దనరుచుండ
గీ. తుదిని నినుగొల్వ దొరకొను పదవిది గద!
బళిర నీ భక్త సముదాయ భాగ్య మహిమ!
భూతలోకేశ! ఆచంట పురనివేశ!
భావ భవనాశ! రామేశ! పార్వతీశ!
80. సీ. కూరిమి మీరంగ కూతు నాలిగ జేసె
కొడుకును రథ చోదకునిగ జేసె
మామ నమ్ముల పొదిగ ముదమున జేసె
దారను రథముగా దనర జేసె
బావనన్నను తేరి బండ్లుగా నొనరించె
తాను శిలీముఖతను వహించె
నట్టి మిత్రుని పుత్రు నభినవాకారు నీ
కంటి మంటలచేత గాల్చినట్టి
గీ. కఠిన పాకివి దయజూడ గలవె నన్ను,
గలయ గతిలేక నిన్ గొల్వ వలసెగాక!
భూతలోకేశ! ఆచంట పురనివేశ!
భావ భవనాశ! రామేశ! పార్వతీశ!
81. సీ. పుణ్య జనాత్యయ స్ఫూర్తి వీ వంతివా
పుణ్య జనాత్యస్ఫూర్తి వీవు!
బ్రహ్మ హత్యక్రియా పరుడ వీవంతివా
బ్రహ్మ హత్యక్రియా పరుడవీవు!
పరదార సంగతి ప్రబలుడ వంటివా
పరదార సంగతి ప్రబలుడీవు!
మఘ వినాశక్రియా మతివి నీవంటివా
మఘ వినాశక్రియా మతివి నీవు!
గీ అరయ స్వామీవసేవకో యనెడు సూక్తి
గలుగనే నన్ను దాసుని గాగ నేలు!
భూతలోకేశ! ఆచంట పురనివేశ!
భావ భవనాశ! రామేశ! పార్వతీశ!
82. సీ. "శివ! శివ" యని నిన్ను జింతన చేసిన
పాప సంఘంబుల పాపవేల?
"హర! హర" యని నిన్ను నార్తి భజించిన
తాపత్రయంబుల మాపవేల?
"భవ! భవ" యని నిన్ను బ్రస్తుతి చేసిన
కలుష సంఘంబుల గాల్పవేల?
"మృఢ! మృఢ" యని నిన్ను మ్రొక్కి సేవించిన
దుఃఖ సంతతులను దునుమవేల?
గీ. కలిమి దయచేయుటకు నీకు కష్టమైన
నింతమాత్రము చేయ నీ కేమి కొరత?
భూతలోకేశ! ఆచంట పురనివేశ!
భావ భవనాశ! రామేశ! పార్వతీశ!
83. సీ. మోహ వశంబున ముని దారలనుగూడ
దారుకా వనముకు దారినావొ?
భక్తి భావము మది బరికింపగా గోరి
కరమర్థి భల్లాణు గదిసినావొ?
చతురత నెరుకల సానివై గట్టు రా
పట్టికా వలిమల మెట్టినావొ?
వర గర్వ వృక సుర వైరి కేల్గవ తల
పై పెట్ట గమకింప బారినావొ?
గీ. గాని రజతాద్రి నున్నను గానరావె?
భో! మహదేవ! దేవ! శంభో! యటన్న,
భూతలోకేశ! ఆచంట పురనివేశ!
భావ భవనాశ! రామేశ! పార్వతీశ!
84. ఏ నీ పదాంబుజం బింద్రాది సురశిరో
రాజిత రత్న నీరాజితంబు!
ఏ నీ స్ఫురన్నామ మినజఘోరాకార
దారుణ కింకరోత్సారణంబు
ఏ నీ పరాక్రమం బిభ దానవోత్తాల
భయదాపఘనవన పావకంబు!
ఏ నీ దయాలోక మిందిరా సుందరీ
సుందరేందిందిరా లిందకంబు!
గీ. అట్టి నీ యందు నా మన మనవరతము
మరులుకొన జేసి బ్రోవవే! మదన హరణ!
భూతలోకేశ! ఆచంట పురనివేశ!
భావ భవనాశ! రామేశ! పార్వతీశ!
85. సీ. ఆమ్నాయములు మహదాదులు మాతృకల్
సనకాది మౌనులు సన్నుతింప,
మందార వనిక్రేవ మహితామృతాపగా
ప్రాంత మాలూర వనాంతరమున
దినకరాబ్జానల దీప్తి తిరస్కార
రుచిర రత్న చిరత్న రచిత సౌధ
తల ఘనకాంతి చింతారత్న కోత్సేధ
పీఠిపై నుమగూడి పేర్మిమీర
గీ. నిశ్చలానంద నిర్భర నిత్యభూతి
వెలుగు నీవేడ నా మొర వినుటలేడ!
భూతలోకేశ! ఆచంట పురనివేశ!
భావ భవనాశ! రామేశ! పార్వతీశ!
86. సీ. వనజ నయన హిత వసు మునిజన నుత!
భుజగ కటక శివ రజత శిఖరి
నిలయ! థనద సఖ! లలిత తనురుచి వి
జిత దరదరకర వితత చరిత!
నిగమ హయ హర ఫణిగుణ వృష గమన!
కమలహిత శిశిర కరక నయన!
విమత గజ దనుజ విదళన చణ హిమ
కర ధర! నగధర శరసుశరణ!
గీ. సతత హిమగిరి శిఖర కలిత విహరణ
వటవిటపి నికట నిలయ! వరద! గిరిశ!
భూతలోకేశ! ఆచంట పురనివేశ!
భావ భవనాశ! రామేశ! పార్వతీశ!
87. గణపతి సేనాని కాలభైరవ వీర
భద్రులు నల్వురు భద్ర యశులు
సుతులు నీ కై దవ సుతునిగా గాచి ర
క్షింపు మంచును నిరీక్షించియుండ
గణపతిత్వము, దేవగణపతిత్వము, కాశి
కాపతిత్వము, సర్వ గణపతిత్వ
మొనర నిచ్చి యాపేక్ష గనవైతి వహహ నా
దీనత్వ మగజకు దెలుపుమయ్య!
గీ. పెద్ద కొడుకులపై ప్రీతి పెద్ద తండ్రి
కన్న సామెత నిజమాయె నెన్నిచూడ!
భూతలోకేశ! ఆచంట పురనివేశ!
భావ భవనాశ! రామేశ! పార్వతీశ!
88. సీ. పాతక త్రాత జీమూత వాతూలంబు,
దారుద్ర్య దవ వహ్ని వారిదంబు,
తీవ్ర దుస్సహ దుఃఖ తిమిర ప్రభావంబు,
భవ మోహ సాగర బాడబంబు,
భక్త కామిత ఫల పారిజాత నగంబు,
యోగి సంతాన భాగ్యోదయంబు,
కాల కింకర గర్వ కరి మృగరాజంబు,
సేవకజన మీన జీవనం బ
గీ. నంగ దనరారు నీ పాద నలిన యుగళ
మస్మదీయ హృదంభోజ మందు నిలుపు!
భూతలోకేశ! ఆచంట పురనివేశ!
భావ భవనాశ! రామేశ! పార్వతీశ!
89. సీ. అవ్యక్తు, నచలు, ననంతు, ననామయు,
నక్షయు, నవికారు, నద్వితీయు,
నజు, నప్రమేయు, ననాదినిథను, నాఢ్యు,
నజితు, నతీంద్రియు, ననఘు, నమలు,
నక్షయు, నాదిమధ్యాంతశూన్యు, నసంగు,
నకలంకు, ననుపము, నజరు, నాద్యు,
నమర ధనాకారు, నాగమసంవేద్యు,
నఖిల కారణు, మృడు, నాదిదేవు,
గీ. నిన్ను భజియించి, బుధులు నిర్ణిద్ర భక్తి
పొందుచుందురు కైవల్య భూరి సుఖము!
భూతలోకేశ! ఆచంట పురనివేశ!
భావ భవనాశ! రామేశ! పార్వతీశ!
90. సీ. నిర్గుణు, నిరవద్యు, నిగమాంత సంవేద్యు,
నీరజాక్ష ప్రియు, నిరుపమాను,
నీరధి తూణీరు, నిర్జితాసురవీరు,
నిత్యు, నిరంజను, నిష్కలంకు,
నిష్కలు, నిష్కులు, నిర్వికల్పు, నిరీహు,
నిష్కాము, నిశ్చలు, నిర్వికారు,
నిర్జర సంసేవ్యు, నిర్ణిద్ర మహిమాఢ్యు,
నీరజభవ నుతు, నిఖిల భావ్యు,
గీ. నిన్ను గొల్వంగ నేరని నీచమతులు,
అవ్యయానంద పదమున నలరగలరె?
భూతలోకేశ! ఆచంట పురనివేశ!
భావ భవనాశ! రామేశ! పార్వతీశ!
91. సీ. సకల పాపౌఘ నాశకమైన భవదీయ
నామ స్మరణ కీర్తనమ్ము వలన
విముఖులై కామ్య కర్మము లాచరించుచు
నష్టమనీషల దుష్టకార్య
రూఢి కర్మ గుణానురూప దేహము దాల్చి
పుత్ర మిత్ర కళత్ర భోగ విషయ
దుఃఖ దుస్సహ పీడ దురపిల్లి కామాగ్ని
తంతప్యమానులై ధర జరించు
గీ. మానవులు నీ పదాంబుజ ధ్యాన గరిమ
నప్రతర్క్యాపవర్గము నందగలరె?
భూతలోకేశ! ఆచంట పురనివేశ!
భావ భవనాశ! రామేశ! పార్వతీశ!
92. సీ. నీ మాన్య తత్వార్థ నిశ్చిత బోథ క
ధా సుధాబ్ధిని నరుల్ దగిలి గ్రుంక
కధిగత వ్యర్ధ పయత్నులై కాయ మా
యాసంబు జెందంగ నఖిల దిశల
గల తీర్థముల నెల్ల గలయ నాడిన యంత
తామస కామ సంధాన దుర్వి
కార మానస భార కలుషంబు వోవునే
బహిరంగ పంకంబు పాయుగాని
గీ. నిరుప మాత్మాను సంధాన నిత్య నిర్వి
కార విజ్ఞానమున కంటె గలదె పరము?
భూతలోకేశ! ఆచంట పురనివేశ!
భావ భవనాశ! రామేశ! పార్వతీశ!
93. సీ. ఆర్త రక్షణ కళా ఖ్యాత దైవములలో
నధికుండు నీ కంటె నరయ లేడు!
బహుళ విపద్దశా భావితాత్మకులలో
నాకంటె నధికుడౌ నరుడు లేడు!
అథికుల మిర్వుర మరయ పోషక పోష్య
భావంబు గలదు సంబంధ మెన్న,
గాన నన్ రక్షింప గడవని విధి నీకు!
విథి నాకు నిన్ జేరి విడువకుంట!
గీ. ధర్మ మిది నాకు నీకును తప్పబోకు
మెంచి డెందంబులోన నూహించుమయ్య
భూతలోకేశ! ఆచంట పురనివేశ!
భావ భవనాశ! రామేశ! పార్వతీశ!
94. సీ. కమలనాభుడు మృదంగంబు మ్రోయింపంగ,
చతురాననుడు తాళ గతుల నెరప,
వాణి విపంచికా వాదనం బొనరింప,
వేల్పురే డరిమురి వేణు వూద,
మునివరుల్ కాహళుల్ ముదమార వాయింప,
సంగీత మిందిరా సతి నెఱపగ,
జేజేలు నటనంబు చెలగి యాలోకింప,
విధ్యాధరాదులు వినుతి సేయ,
గీ. తకట థిక్కిట జ్ఝణుతంచు దాండవమును
సంధ్య వేళ నొనర్తువు సతతంబు!
భూతలోకేశ! ఆచంట పురనివేశ!
భావ భవనాశ! రామేశ! పార్వతీశ!
95. సీ. జిహ్వ గల్గు ఫలంబు శివ! శర్వ! భవ! యని
పలుమారు భక్తిని బల్కె నేని,
చేతులున్న ఫలంబు శ్రీ మహాదేవ! నీ
చరణ సపర్యలు సలిపెనేని,
శిరము గల్గు ఫలంబు చిత్తజాంతక! నీకు
ముదమార సతతంబు మ్రొక్కెనేని,
వీనులున్న ఫలంబు విశ్వేశ! నీ నామ
కీర్తనల్ రతి నాలకించెనేని,
గీ. కానిచో జిహ్వ కర మస్తక శ్రుతులును
వ్యర్ధములు గావె? వానికి వసుధ లోన!
భూతలోకేశ! ఆచంట పురనివేశ!
భావ భవనాశ! రామేశ! పార్వతీశ!
96. సీ. ముందర పురుహూత ముఖ దేవ బృందముల్
జయజయేతి ధ్వని సందడింప,
దాపల వైకుంఠ థనాదు లాదట నిష్ఠ
గోష్ఠి వినోదంబు కూర్మి నెరప,
సనక సనందన చతురాన నాదులు
వలపల శ్రుత్యుక్తి వాదుసేయ,
కలహాశనుడు మ్రోల కలవల్లకీస్వన
సంగతి సంగీత సరణి జరుప,
గీ. కొండ రాచూలితో గూడి నిండు కొల్వు
కూటముననుందు వౌరా హా! కూర్మిమీర!
భూతలోకేశ! ఆచంట పురనివేశ!
భావ భవనాశ! రామేశ! పార్వతీశ!
97. సీ. తలనున్న మిన్నేటి తరగల చప్పుళ్ళు
రహిమించు మర్దళ రవముగాగ,
సీవిరుల్ వీచు జేజే వెలందుల మణి
కంకణ ధ్వని తాళ గతులుగాగ,
గౌరీ కరాంచిత కంజ గంధంబాను
తేటితూటుము మ్రోత పాటగాగ,
తెరగంటి బాసవాల్ దొరమీటు వల్లకీ
కల నినాదం బుపాంగంబుగాగ,
గీ. సలయగతి భృంగి నాత్యంబు సలుపువేళ,
వింత దివిజులతో చిత్తగింతు వౌరా!
భూతలోకేశ! ఆచంట పురనివేశ!
భావ భవనాశ! రామేశ! పార్వతీశ!
98. సీ. మస్తక లోచన మానసామయ మహా
శూల మేహ జ్వరాభీల కాస
యక్ష్మాశ్మరీ క్షయాద్యములైన రోగముల్
మాన్ప వైద్యుడ వీవు మందు భూతి
రౌరవంబును మహా రౌరవంబును మృత్యు
జన్మ జరాదులన్ దున్ముదీవు!
జీవుని బాయంగ జేయు వెజ్జవు! మందు
భూతేశ శర్వ రక్షేతి యనెడు
గీ. నుడువె యనుపానముగ నాకు నిడుము నీదు
భక్తి స్థిరమున నద్రిజా ప్రాణనాథ!
భూతలోకేశ! ఆచంట పురనివేశ!
భావ భవనాశ! రామేశ! పార్వతీశ!
99. సీ. కోపమా! లేక నా పాపమా! యిదికాల
లోపమా! నన్నిటు లొంగజేయ!
అందమా! ఇది నీకు చందమా! నాభాగ్య
మందమా! నను శ్రమ నొందజేయ!
భారమా! యిది గ్రహచారమా! నే జేయు
నేరమా! నను సవికారుజేయ!
నీతమా యిది నిజాకూతమా! నిర్ఘృణా
జాతమా! నను దైన్య భీతుజేయ
గీ. ఏల! నన్నేల! జాగేల? వేలుపులను
కరుణ గలవారు నీకంటే గలరె యొరులు?
భూతలోకేశ! ఆచంట పురనివేశ!
భావ భవనాశ! రామేశ! పార్వతీశ!
100. సీ. శంకర! నీ జటా జాల చంచద్ద్యుతి
ప్రకట హరిద్ర పంకంబు గాగ,
కైలాసవాస! నీ కంటి మంటల రంగు
సొగసైన కుంకుమ చుక్క గాగ,
కనకాద్రిచాప! నీకంఠ కాళిమకాంతి
నెరపు కాటుక రేఖ నీటు గాగ,
గోరాజ గమన! నీ కొమరొందు మైచాయ
సిరిమించు వెలిపట్టు చీర గాగ,
గీ. నలర గై జేసికొని గొల్చు నతివ లనగ,
తెలివి జెన్నొందె నౌర! విదిశలు దిశలు!
భూతలోకేశ! ఆచంట పురనివేశ!
భావ భవనాశ! రామేశ! పార్వతీశ!
101. సీ. కాంచనా హార్యంబు కార్ముకంబుగ జేసి,
కుండలిరాజుచు గుణము జేసి,
చంద్ర భాస్కరులను చక్రముల్ గా జేసి,
రాజీవభవుని సారథిగ జేసి,
అంబుజనాభుని నంబకంబుగ జేసి,
రత్నగర్భను పటు రధము జేసి,
ఆమ్నాయములను వాహనములుగా జేసి,
తోయధీశుని యంపదొనగ జేసి,
గీ. నీవు రథికుడవై పేర్మి నిగుడ మెరసి,
త్రిపురముల గూల్చితౌ! నొక్క దెబ్బలోన!
భూతలోకేశ! ఆచంట పురనివేశ!
భావ భవనాశ! రామేశ! పార్వతీశ!
102. సీ. సుర మహీరుహ గేహ! సుందరతర దేహ!
పన్నగరాడ్భూష! భక్త పోష!
శీతశైల విహార! సింధురాజ గభీర!
పుంగవేశ తురంగ! మంగళాంగ!
ముని జన వన చైత్ర! మోహలతాదాత్ర!
వందారు గీర్వాణ వనధి తూణ!
కాంచనాచల చాప! కమనీయతర రూప!
విశ్వంభరాధార! వేదసార!
గీ. దివ్య మునిజన సన్నుత! దేవదేవ!
శ్రవణ మంగళతరనామ! సల్లలామ!
భూతలోకేశ! ఆచంట పురనివేశ!
భావ భవనాశ! రామేశ! పార్వతీశ!
103. సీ. జాలంధరాటోప శైలరాడ్దంభోళి!
ద్విపయామినీ చర తిమిర హేళి!
అంథకాసుర విగ్రహారణ్య దవకీలి!
స్మరయశశ్చక్రాంగ జలదపాలి!
పుర నిశాచర బల ముదిర ఘోర సమీర!
కాలాపలేపద్రు ఘనకుఠార!
దుంధుభితమ మిత్ర! దోషలతాదాత్ర!
చటులాగ్నికృతన్నేత్ర! జాతిచైత్ర!
గీ. దీన జన కల్పపాదప! దివ్యపాద!
భక్త చింతామణి స్ఫురద్భవ్య వీక్ష!
భూతలోకేశ! ఆచంట పురనివేశ!
భావ భవనాశ! రామేశ! పార్వతీశ!
104. రేయును బవ లొక్క రీతిని దీపించు
శశిబింబ మననొప్పు సతి మొగంబు,
పగలు రేతిరి నొక్క భంగిని వికసించు
కంజాతయుగ మింతి కన్నుదోయి,
వాదక యెప్పుడు వాసన గలిగిన
నీలోత్పల సుమంబు నెలత మేను,
మేల్మి బంగరు చాయ మెరయ మదేభేంద్ర
కుంభ ద్వయము కల్కి కుచ యుగంబు,
గీ. అవికులమునకు గురువగు నతివ కుచము
లిట్టి గిరి సుత కర్ధంగ మిచ్చితౌర!
భూతలోకేశ! ఆచంట పురనివేశ!
భావ భవనాశ! రామేశ! పార్వతీశ!
105. భవ విమోచన సూత్ర! పావన చారిత్ర!
భావుకగాత్ర! తుభ్యం నమోస్తు!
మహనీయతర వేష! మంజులామృత భాష!
పన్నగ భూష! తుభ్యం నమోస్తు!
వందారు మందార! వననిధి తూణీర!
పాతక దూర! తుభ్యం నమోస్తు!
శ్రుతి చతుష్టయ ఘోట! శుచినయ లలాట!
పదనమత్ఖేట! తుభ్యం నమోస్తు!
గీ. అనుచు నాతత భక్తిని నతుల గతుల
నతు లొనర్చెద నీపాద నలినములకు!
భూతలోకేశ! ఆచంట పురనివేశ!
భావ భవనాశ! రామేశ! పార్వతీశ!
106. సీ. కాశ్యపీ కామినీ కమనీయ ముఖపద్మ
ముక్తాలలంతికా స్ఫురిత మయిన
యాచంట పురమున నంఘ్రీ జాతాన్వయ
మహిత మేకా వంశ మౌక్తి కాయ
మాన నాగయ్య ధీ మణికిని చల్లమాం
బకు నగ్ర వర తనూభవుడ నైన
దేవావనీ దేవ పావన పాదరా
జీవ సేవా జీవ జీవితుండ!
గీ. బాపనాఖ్యుడ! తావక పాదభక్తి
తోడ నర్పించితిని సీస శతక మిదియు!
భూతలోకేశ! ఆచంట పురనివేశ!
భావ భవనాశ! రామేశ! పార్వతీశ!
107. సీ. శాలివాహన శక సంవత్సరములలో
చనగిరి శైలేందు సౌమ్యవర్ష
భాద్రపదాసిత పక్షాష్టమీ సోమ
వారమునను భవద్వర్ణనమున
పుట్టువు సఫలత బొందింప దలచి నే
సీస శతంబు రచించినాడ
నెందాక భాస్కర హిమకర తారకా
కరి హరి గిరి కిరి కమఠ థరలు
గీ. దరలకుండెడు నందాక తావకీయ
కరుణ నిది యొప్పు గాత! సత్కవుల సభల!
భూతలోకేశ! ఆచంట పురనివేశ!
భావ భవనాశ! రామేశ! పార్వతీశ!
108. సీ. విన్నప మాలించు! విశ్వేశ! సర్వేశ!
విశ్వోద్భవ స్థితి విలయ కరణ!
ఆచంట పురమున నంగనా స్తనలింగ!
విఖ్యాతి వెలసిన వేల్ప! భక్తి
నీ కర్పితంబుగ నే రచియించిన
సీస పద్య శతంబు చిత్తగించి,
రహి విన్న, జదివిన, వ్రాసిన వారికి
ధన ధాన్య వాహన దంతిధామ
గీ. పుత్ర మిత్ర కళత్ర విస్ఫూర్తి పరమ
పదవి దొరకొన జేయవే! పార్వతీశ!
భూతలోకేశ! ఆచంట పురనివేశ!
భావ భవనాశ! రామేశ! పార్వతీశ!
ఆచంట రామేశ్వర శతకము
సంపూర్ణము
No comments:
Post a Comment