Monday, May 5, 2014

ద్వారకాపతి శతకము - ఆదిభట్ట శ్రీరామమూర్తి

ద్వారకాపతి శతకము
                                             ఆదిభట్ట శ్రీరామమూర్తి

1. ఉ. శ్రీరమణీమనోహర! విశేషకృపాకర! యాదవాన్వయో
దారపయోధిశీతకర! దానవదూర! వినమ్రదాసమం
దార! మదాంధ చైద్యముఖ దర్పకుఠార! కళిందనందినీ
తీరవిహార! గోపవరధీర! వశీకర! ద్వారకాపతీ

2. ఉ. విఘ్నములేకమత్కృతి వివేకులు సంతసమొందియుండ, ని
ర్విఘ్నముగా సమాప్తి నెఱవేర్పఁ గణాధిపుమ్రొక్కి కొల్తు, శ్రీ
నిఘ్న మదీయవాంఛితము నెమ్మిని దీర్చి కృతార్థుఁజేసి, శ
త్రుఘ్ను! మహాత్మ! నన్నుఁబరితుష్టుని సల్పవె ద్వారకాపతీ

3. చ. కరముల నాలుగింట, వర కంజముఁ బొత్తము నక్షమాల సం
బరముగ వేణెఁదాలిచి శుభమ్ముగఁబాటనుబాడు వాణి ని
బ్బరముగనాదు నాల్క నిలువంగ భజించెద, మంచిపల్కులం
దొరలిచి, నన్నుఁబ్రోచి, పరితుష్టునిజేయఁగ ద్వారకాపతీ

4. చ. చతురకవిత్వసంస్కృతవిశారదు నాదికవీంద్రు నెంచి స
మ్మతిఁదలపోసి, వ్యాసునిగ్రమమ్ముగగొల్చుచుఁ గాళిదాసుభా
రతకవులందలంచి, మది బ్రౌఢులఁబోతన ముఖ్యులందఱిన్
స్తుతులొనరించి వేడెద వసుంధర నే నిను ద్వారకాపతీ

5. చ. అల సిరి లచ్చిఱేండ్లన మహాత్ములు, జ్ఞానులు, నాదు తల్లి దం
డ్రులకు నమస్కరింపుచు, నిరూఢిగ మద్గురుసేవ సల్పి యు
జ్వలమగుభక్తి నాకిడధ్రువమ్ముగఁగోరి మదాత్మశుద్ధి ని
శ్చలమగు బుద్ధి నిన్ గొలుతుఁ జక్కగనాకిడు ద్వారకాపతీ

6. ఉ. రాజిత కీర్తిశాలి, మునిరాజు కృపారసవార్ధి, యాభర
ద్వాజయమీంద్రుఁడయ్యనఘువంశనునంజనియించె, విద్యనం
భోజభవుండొనాఁగ నుతిబొందిన రామయలక్ష్మిభర్త ని
ర్వ్యాజుఁడుమత్పితామహుఁడు త్యాగియుదారుఁడు ద్వారకాపతీ

7. ఉ. ధీయుతిఁడౌచు లక్ష్మియను దివ్యపదంబునఁగూడియొప్పినా
రాయణుఁడన్న పేరున విరాజిలువాఁ డవధాని శ్రీయుపా
ధ్యాయుల వేంకటార్యునకుఁ తత్సతి సుబ్బమకుందనూజకా
త్యాయనిసాటిపాపమయుఁ దల్లియుఁదండ్రియు ద్వారకాపతీ

8. ఉ. వేడుచు నున్నవాఁడ నిను వేయివిధమ్ముల నన్నుఁ బ్రీతిఁ గా
పాడుము రామమూర్తి యనువాఁడ భవత్పదసేవకుండ నీ
వాఁడను నీవెనా కెపుడుఁ బ్రాపని నమ్మిక నున్నవాఁడ న
జ్జాడపురీనివాసకుండ సాధువుధేయుఁడ ద్వారకాపతీ

9. ఉ. పూనిక నీకుఁ బద్యశతమున్ రచియించి యొసంగ దాని స
మ్మానముతోడలోనననుమానముమాని పరిగ్రహించి యా
భానునుశేశతకముగ బాలన సేయు మనశ్వరాయువుం
బూని వెలుంగునట్లు పరిపూర్ణ కృపం గని ద్వారకాపతీ

10. చ. నలు వయి సృష్టి సల్పితి జానార్ధను పేరిటఁ బెంచుచుంటి వీ
వలరఁగఁ జంద్రశేఖరుఁడవై నశియింపఁగఁ బుచ్చుచుంటి ని
ర్మలముగ మూఁడుపేరులఁగ్రమమ్ముగ వృత్తులఁ బొందియుంటి ని
శ్చలముగఁ గాంచ నొంతివగు సామివి నీవెగ, ద్వారకాపతీ

11. చ. సరసిజసూతి వేదములఁ జౌర్యతఁగైకొని సోమకుండు ము
ష్కరుఁడయి వార్ధిడాగ మొఱసారసగర్భుఁడిడంగ నీవు ని
బ్బరమగు మీనరూపమున వారిధిఁజొచ్చి సురారిద్రుంచి సం
బరముగఁ బ్రానుడుల్ వడసి బ్రహ్మకొసంగితి ద్వారకాపతీ

12. ఉ. గ్రావము మందర మ్మసురకాండము వేల్పులు పట్టివార్ధి సం
భావనఁ ద్రచ్చఁ బర్వతము భారముగాఁగ విడంగ వారలున్
నీవును గూర్మరూపమున నెమ్మిగిరిన్ భరియించి తేల్చి యా
దేవగణాన జీ విడితి తేకువ నా సుధ ద్వారకాపతీ

13. చ. కుటిలుఁడు హేమలోచనుఁడు కుంభినిఁజాపఁగఁ జుట్టిపట్టియు
త్కటుఁడయిపోవుచో నమరకాండమునీకడ మొఱ్ఱవెట్టఁగాఁ
గిటినయి కోఱలం బెనిచి కేశవ యాహవమాచరించి యా
కుటిలుని ద్రుంచి నీవపుడు క్షోణిని నిల్పితి ద్వారకాపతీ

14. ఉ. నీదగు పాదభక్తిని జనింపకమున్పటినుండి కొల్చుఁ బ్ర
హ్లాదు హిరణ్యకశ్యపుఁడు రచ్చల కెక్కెడు బాధవెట్ట స
మ్మోదుఁడవౌచు బాలకుని మోదమునన్వెలయింపనెంచి పె
ల్లాదట దైత్యుఁదున్మి దనుజార్భకుఁ బ్రోచితి ద్వారకాపతీ

15. చ. అడిగితి వామనుండవయి యా బలి మూఁడుపదాల నేల న
ప్పుడె వడిఁగుజ్జురూపువిడి భూమినొకడ్గునఁ గొంచు వేఱ యొ
క్కడుగున మిన్నుఁగైకొని ప్రకాశుఁదవౌచును మూడవడ్గునా
యెడ బలి మస్తమందిడి రహింబలిఁద్రొక్కితి ద్వారకాపతీ

16. చ. పరశువు కేలఁబూని నరపాలుర నిర్వదియొక్కసారి సం
హరణమొనర్చి నల్ల ననునయమ్ముగఁబైతృకతృప్తి సల్పియ
త్తఱిఘృగురామదాతవయి ధాత్రిని గశ్యపమౌని కిచ్చి సు
స్థిరతరకీర్తిఁగాంచితివి చెప్పెడి దెయ్యది ద్వారకాపతీ

17. ఉ. రావణ కుంభకర్ణముఖ రాక్షసబాధల కోపలేక, యా
దేవగణమ్ము నిన్నువినుతింపఁగ నంతఁ గృపాంబురాశివై
భూవరుఁడైనపఙ్తిరథుపుత్రుఁడవై జనియించి, రాముఁడ
న్నీవుదశాస్యముఖ్యులవనింబడగూల్చితి ద్వారకాపతీ

18. చ. అల వసుదేవుచే జననమందుచు రోహిణి కల్ల దేవకీ
లలనకు ముద్దుఁజూపుచు విలాసములన్ బలరామకృష్ణులై
యలరుచు మేనులందున సితాసితవర్ణములందు నొంటివై
యిలభారమెల్ల మాన్పి రిపుహీనను జేసితి ద్వారకాపతీ

19. చ. మతములపాడి వీడి పలుమాయ లొనర్చి యనేకరీతులై
శ్రుతిగతులం జరింపక వసుంధరఁ జూడఁగ నెల్లవారు దు
ర్మతులయియుండియుండియపమార్గములంజరియింప బుద్ధయీ
క్షితివెలయంగఁ బాడి పరిశిలన నిల్పితి ద్వారకాపతీ

20. చ. కలియుగమైన వెన్క నృపకాండము దొంగలరీతిగాను సం
చలనమొనర్చి బాములనొసంగెడివారలఁద్రుంపనెంచి ని
ర్మలమగు వెల్ల తేజిని బిరానను నెక్కి మహాసి కేల నీ
వలరఁగఁ బూని రాజులనయారె వధింతట ద్వారకాపతీ

21. ఉ. దేవకి గర్భమందు వసుదేవునిచే జననమ్ముఁజెంది సం
భావన పారిజాత మనభాసురమంగళ వేదశాస్త్ర శో
భావహమైన శాఖల ననంత సుఖాళి జనాళి కిచ్చుచుం
జీవనదానకర్తవయి జీవనమిచ్చెదు ద్వారకాపతీ

22. చ. సురమణికోర్కెలెన్నొ యిడుచున్ సురకోటినిఁబ్రోచునట్టులీ
శ్వర! వరదాయకుండ వయి సర్వచరాచరజీవకోటి నీ
వరయుచు జీవన్మ్ముల మహాత్ముఁడవై యిడికాంతువీవు మ
ద్వరము నొసంగి భక్తుననుఁ బానలఁజేయవే ద్వారకాపతీ

23. ఉ. వేల్పులగిడ్డి వేల్పుల నవీనపు బువ్వలఁ బెట్టిప్రోచు నా
వేల్పుల వేల్పువౌదువు ప్రవీణుఁడవౌచును నీవు నాగరా
ట్తల్పశయాన! నాకు లలితంబగు నీ పదభక్తి నిచ్చి య
త్యల్పపుఁగోర్కె భక్తుననుఁ దన్పినఁదప్పటె ద్వారకాపతీ

24. చ. అడుగును దాటనీయను మహాత్ముఁడవైననుఁబ్రోవకున్న ని
న్వడిగ మదీయభక్తి యనుపాశము నీదుపదాలకున్ ముడిన్
జడియక నేను వైవఁగను సాగు టదెట్లగు నీకు, నీవు ని
య్యెడ నభయమ్ముదానమిడవేనియు నిన్ విడ ద్వారకాపతీ

25. ఉ. మోదమెనీకు వేదపరిపూర్ణులఁగాంచిన నెంతొ శాస్త్రసం
వాదులఁ జూడ సంతసమె పండితభాషల విన్గనీవు నా
హ్లాదుఁడవౌదు వింకను వివాదమటన్నను కాలుఁద్రవ్వెదౌ
కాదను మాట గెల్తువు ప్రకాశతఁ జెందగ ద్వారకాపతీ

26. చ. కృపాణపుబుద్ధిమాని పరికింపుము చెల్లఁగనాదు ముద్దు, నీ
కపశయమబ్బు ప్రొద్దు పరిహార మొనర్పుము, నీవురద్దు నా
చపలతసద్దు నీవిఁకను జాలముసేయక కోర్కెదిద్దు, నీ
కృపకును హద్దుఁగాననొకయింత యొసంగుము ద్వారకాపతీ

27. ఉ. పోడిమిదప్పకున్నఁ బరిపూర్ణసుఖమ్ములఁ బొందుదంట నీ
వాడినమాటఁ దప్పక నయమ్మగుపాడినె చూతువంట తు
త్మాడుచు దుష్టులం జగతి మాదృశదీనులఁబ్రోచెదంట వి
న్నాఁడను నీదు భక్తుఁడ ననాథునిఁగావవె ద్వారకాపతీ

28. చ. నిలువఁగఁ గొంపలేదు మది నీపదభక్తినివీడఁబోదు చం
చలతను బొట్టకూటికిని సంచరణమ్ముని సేయ వాదు ని
శ్చలముగ నొక్కతావున విచారములేకను నిన్నుఁగొల్వ ని
ర్మల భవదీయభక్తి నిడుమా కృపఁగొల్చెద ద్వారకాపతీ

29. ఉ. శాత్రవశిక్ష సల్పఁగ విచక్షణదక్షుఁడవౌదు వీవు నా
క్షాత్రపుఁజిహ్నలొందుచు విశాలయశుండవు కావెచూడ సు
క్షేత్రవరుండ వీవికి విశేషదయాళుఁడవౌదు వెన్న ని
ద్ధాత్రిని భక్తునన్నొకనిఁ దన్పుట కష్టమె ద్వారకాపతీ

30. చ. దనుజుఁడు సర్పరూపమును దాలిచి క్రూరతఁగాననాంతరం
బునఁ బడియుండి గోపకులభోరున మ్రింగెడునప్డు వారు వే
డినఁ గరుణించునట్టులు గడిందిభయార్తుని నన్నుఁగావ ని
న్ననవరతంబుఁగొల్చెద దయామతిఁజూడుము ద్వారకాపతీ

31. ఉ. జంకక దుష్టులన్న రిపుసంఘ మటన్నను నీవెదిర్చి ని
శ్శంకను వారిఁద్రుంతువు విశంకటశక్తిని నాదుశత్రులన్
బింకములూడునట్టు లతిశీఘ్రముగా నొనరించి మించియో
పంకజనాభ! ప్రోచిననుఁ బజ్జను జేర్చవె ద్వారకాపతీ

32. ఉ. గోవుల గోపబాలకుల గోపికల న్గడుచిచ్చు చుట్టి దే
వా! వడినిన్ను మొఱ్ఱలిడ వారలఁ గావఁగఁ జిచ్చుమ్రింగి నీ
వావిధి వారిఁబ్రోచితివి యట్టులె నావెతచిచ్చుమ్రింగి త్వ
త్సేవకు నన్నుఁ జొన్పికృప జెచ్చెరఁబ్రోవవె ద్వారకాపతీ

33. చ. కులము పవిత్రమయ్యె యదుకుంజర! నీవుదయమ్మునందనీ
వలనయశమ్మువచ్చె రిపువర్గమునొయ్యనఁద్రుంచియుంట వ్యా
కులము నశించె గోవులకుఁ గోరికవచ్చెడి మేతలెచ్చె వి
ప్రులు పరితుష్టిజెందిరి మెఱుంగులు గల్గుట ద్వారకాపతీ

34. ఉ. ఏటికి మేనుపెంచ నతిహీనపు వృత్తుల సల్పి కాటికే
నాటికి నీదుభక్తియు జనార్ధన! కొల్వఁగ నాకొసంగి యీ
పాటికిఁ ద్వత్పదాబ్జముల భక్తునిఁజేరిచి ప్రోవకున్న ము
మ్మాటికి నిన్నువీడను సుమా! దరిగాంచక ద్వారకాపతీ

35. ఉ. లంచముమెక్క నైజము విలాసమునీకది బాల్యమిత్రుఁడై
వంచన లచ్చిసేయఁ దనపత్నియు బాములఁబెట్టి యడ్కులే
కొంచమొమూటగా మడిచి కోమలిపుచ్చగ మూతవిప్పి భ
క్షించుచు నా కుచేలు సిరిఁజేర్చుచుఁ బంపవె ద్వారకాపతీ

36. ఉ. కొంటెతనమ్ముఁ బూనుచును గూనవయస్సుననుండినీవు వా
ల్గంటుల గొల్లఛేడెల వికారపుఁజేష్టల సల్పునట్టి బల్
తుంటరి జారనాయకుఁడు దొంగవటంచు వంచింత్రునిన్నహో
వింటిని వేదవాక్యముల వీడను నిన్నెద ద్వారకాపతీ

37. ఉ. త్రాతవటంట భక్తుల నుదారమనీషను బ్రోచితంట వి
ఖ్యాతుఁడు విప్రవర్యుఁడగు కశ్యపమౌనికి భూమినిచ్చి సం
ప్రీతునిఁ జేసియుంటివటరే నను పోషణఁ జేయలేవె నీ
దాతృత భక్తుపై నెఱప దప్పుట నీకెటు ద్వారకాపతీ

38. ఉ. దొంగలలోన దొంగవయి తుంతరివౌచును వెన్నదొంగవై
రంగఁడవన్న కీరితి విరాజిలుటెట్లగు, నన్నుఁ బ్రోవ స
త్సంగుఁడవౌదు, భక్తునెడఁదామసముంగొని ప్రోవకుండిన
న్భంగమునంది నీయశ మవారిని మాయదె ద్వారకాపతీ

39. చ. సిరికి మగండవౌచుఁ బరిశీలన భక్తునిఁ బ్రోవకున్న, నీ
సరసతయెట్లునిల్చు, జలజప్రియకోటిసమానతేజ! పెన్
సిరులును సంపదల్ మెయివిశేషములెల్లను శాశ్వతమ్మొకో
పరగతి నాకు నీ విడు నుపాయముఁ జూపవె ద్వారకాపతీ

40. ఉ. జారుతనమ్ము కూడదని చాటితి వేదములందు, శాస్త్ర సం
స్కారములందు వ్రేఁతలను జక్కగఁ గ్రీడలదేలియుంట, పిం
జారితనమ్ముకాదె యటుసల్పితి, చెప్పగఁ బెద్దవౌచు, నా
తీరునఁ జేయఁబాడియె, ధృతిన్ మదివీడుచు ద్వారకాపతీ

41. ఉ. దానమొసంగ నిచ్చ పరిధానములీయఁగఁ దృప్తి జ్ఞానసం
ధానమటన్న మోదము నిదానపుశాంతముసొత్తుకార్య సం
ధానము గానమున్ భవదుదారగుణంబులు భక్తపాలన
స్థానము లాతపట్లు నను సాకఁగలేవటె ద్వారకాపతీ

42. చ. పరమ పతివ్రతామణుల భక్తగణమ్ములఁబ్రీతిదాపసో
త్కరములఁ బ్రోవనుంటినని కంకణమేలను గట్టికొంటి ని
బ్బరముగ నీవ్రతమ్మున కపాయముఁ జెందక భక్తుఁడౌననుం
జిరభవదీయ కీర్తిదరిఁజేరిచి ప్రోవుము ద్వారకాపతీ

43. ఉ. న్యాయముకాదు నన్ విడననాథునిఁబ్రోచుటిదెంతనీకుఁ బ్రా
ధేయుఁడనొచు వేడితి విధేయతఁజెందుచునెంతొనిన్ను శ్రీ
నాయక! నీకు నియ్యది ఘనమ్మగుఁగాదటెభక్తుఁబ్రోవనన్
డాయఁగరమ్ము కీరితిదృఢమ్ముగ నీకగు ద్వారకాపతీ

44. చ. కలను జరించునప్పుడు సుఖమ్ములవెట్టులుకల్లలౌనొ యీ
కలిమియు సౌఖ్యసంతతి జగాన నటే క్షణభంగురమ్ము చం
చలము భవత్పజాబ్జయుగసారపు భక్తియె శాశ్వతమ్ము ని
శ్చలమగు భక్తి నాకిడు రసాస్థలిఁగొల్చెద ద్వారకాపతీ

45. ఉ. దారముకూర్చు పుష్పములదండగతిన్ వసియించి జీవులం
దారయ నీవె యంతట మహాత్ముఁడవై చరియించి జీవనా
ధారుఁడవౌదు వందరికిఁ దప్పక యట్టిడవౌచు నాకు నా
హారము వెట్టకుందువె యయారె విరుద్ధము ద్వారకాపతీ

46. ఉ. సోకులమారి వంద్రు, మధుసూధన! నీకపకీర్తి, భక్తిచే
నాకలిఁ దిర్చు భక్తు ననయమ్ముగ నీవటు సేయవేని నీ
జోకులు గొల్లఛేడియలు చేచుటకేకద దాల్చియుంట పో
పోకిరివంచునిన్నరరె భూమిని భక్తులు, ద్వారకాపతీ

47. చ. పసరపుఁజింకు నాయసముపైఁబడ నాయసరూపుమారి బం
గరు వెటులౌనొ యటులనె కల్మషముందెగనాడియేయు నీ
కరుణ రవంత నాపయిని గల్గినఁజాలును, దానఁజేసి, నేఁ
గరము పవిత్రముం గొనుచు గౌరవమందెద, ద్వారకాపతీ

48. ఉ. క్రూరుఁడు బాలిశుండు నతికోపుఁడటంచును నన్నునెంచి నా
నేరము లెన్ని వీడినను నేర్పరివంచును నిన్నునెంత్రే యా
క్రూరునిఁ గోపిఁబాపి, యదుకుంజరప్రోచుటెనీఘనమ్మునిం
డారయశమ్మువచ్చును, ధృఢమ్ముగ నీకిల ద్వారకాపతీ

49. చ. వరమిడ దుస్తరమ్ము బహుభంగుల భక్తునిమానసమ్ముని
బ్బరమెటులుండునోయని ధ్రువమ్ముగనీవు పరీక్షసల్పి యా
వరమిడుదీవు శాశ్వతమపాయముఁబొందదునిన్నుఁగొల్తుద్వఁ
చ్చరణములుండ, నీసిరియు సంపదలేలను ద్వారకాపతీ

50. ఉ. పేదకుఁ బొట్టనిండె, రిపువేదన లెల్లడ నారియుండె ని
మ్మేదినిఁబంటపండెఁగడు మేలగుధర్మము హెచ్చుచుండె నిం
డాదరమున్ గ్రహించెడు జనార్ధనుఁడీవయి పుట్టియుండ న
న్నీదరిఁ జేర్చికావుము గణింతును నే నిను ద్వారకాపతీ

51. చ. శరణని వేడియుండిన విచక్షణతం గని భక్తుపైని నీ
సరసతఁ జూపవైతివి వశాలయశ మ్మెటు లబ్బె నీకు ని
ష్ఠూరములువల్కఁగోపముకడున్ వహియించెదవీవదెంతొ నీ
యరమది ఱాయియేమొ వినయోక్తులకుబ్బవు ద్వారకాపతీ

52. ఉ. శ్లేషలఁ జెల్లు కబ్బము బలే యన విందురు పండితాళి నా
శ్లేషల కిచ్చగించెదరు చేడియ లెంతయొ యాజివాద్యసం
ఘోషలవీరులుబ్బెదరు గొప్పగయుక్తిమృదూక్తి పద్యసం
భాషల కాలకించెదరు బాగుగలోకులు ద్వారకాపతీ

53. చ. పరపతి లేద నీదుపదభక్తునిఁ బ్రేముడి నేద లచ్చికి
న్వరుఁడవె కాద నామొఱవినం జెవి కెంతయుఁ జేద సజ్జనా
దరణ మొనర్పరాద వరదా! శుభదాయక భవ్యపాద! దు
ర్భరరిపుభేద వేడెదఁ గృపన్ నను గాంచుము ద్వారకాపతీ

54. ఉ. దీనుల రక్షసల్పగఁ బ్రతిజ్ఞగలాడవు ప్రజ్ఞయందు సం
ధానుఁడవౌచు జీవులయథార్థమునం గృపఁబ్రోచికాతు స
మ్మానసమానవీక్షణము మాన్యతఁగాంచ నొసంగి నీపద
ధ్యానము నాకు నిచ్చుచు రయమ్మునబ్రోవవె ద్వారకాపతీ

55. ఉ. చర్వితచర్వణమ్ముల విచారము లేమికి భక్తి లేమి నీ
యుర్వినిఁ బుట్టిచచ్చుచు నయోపచరించెడు కర్మసంఘమున్
గర్వితచిత్తులై సలుపఁగాఁదలపోయుచు నుంద్రుగాని యా
సర్వసుఖమ్ములున్ సిరులుసాటియె భక్తికి ద్వారకాపతీ

56. చ. చతురుఁడ వౌదుసామమున సాహసివెన్నఁగ దానమందు స
మ్మతమగు భేదమందున సమర్థుఁడ వెంతయొ దండనమ్ము సం
గతిఁ గనిపెట్టి సల్పెదవు నాల్గు నుపాయములందు వీవెకా
చతురుఁడ వన్న పేరు కొనసాగితి విద్ధర ద్వారకాపతీ

57. ఉ. మాయలనెంతొ వైరులవమానములం బచరింపుచుంటప్రా
ధేయత నిన్నుఁ జేందెడి విధిం జరియింపుచు భీతివార ల
త్యాయతశ్రద్ధ నీదగుపదద్వయిభృత్యతఁ గొల్చునటులం
జేయుదు వంట నీవు పరిశీలన సల్పుచు ద్వారకాపతీ

58. చ. తలలను మార్పొనర్చెడు విధమ్మున కీ వతిప్రౌఢుఁడౌచు ను
జ్జ్వలమగు దిట్టవీవని సెబాసని మెచ్చి కనుల్ నుతింప వై
రులఁ బరిమార్చి కీరితిని రూఢిగ వాసికి నెక్కియుంతివే
యిలఁబరికింప నీకు సములేరును గారుగ ద్వారకాపతీ

59. ఉ. జుట్టుల ముళ్ళిడంగ మధుసూధన! నీవతిప్రౌఢుఁడౌదు
జెట్టివి కౌరవాన్వయముఁజీల్చితి రాజ్యము పాండవాళికిం
దిట్టరివౌచు నిచ్చితి వదేగతి కోరికఁ దీర్పవేని నీ
గుట్టు జగాన నుంతు యదుకుంజర! యింకను ద్వారకాపతీ

60. బూటకమాడసుమ్ము పరిపూర్తిగ భక్తునిపల్కునమ్ము జం
జాటముఁగాదులెమ్ము కృపసాకుచుఁ గోరికలిమ్ము నాజగ
న్నాటకసూత్రధారివయి నన్ ఘనమేయిఁకఁ గాచికొమ్ము నేఁ
జాటెదఁ జేతఁగాని పురుషప్రపశుండని ద్వారకాపతీ

61. చ. పరుసములాడియుంటి బహుభంగుల వానిని సైచి నీవు నీ
కరుణను నాపయిం బఱపికావుము నాదగు కోర్కిఁదీర్పు మి
త్తఱి భవదీయభక్తుఁడను తామసముంచకు పుత్రుపైని నీ
నిరుపమవత్సలత్వమును నిండుగఁ జూపుము ద్వారకాపతీ

62. ఉ. వేసము లేలపోయెదు వివేకునిలక్షణ మద్ధికాదు సే
బాసుర పోకిరీ వనరె భక్తగణమ్ములు నిన్నుఁగూర్చి సం
తోసముతోడ గొల్చెదరె తుష్టుగ నన్నిఁకసల్పవేన్ రసా
భాసముఁగాదె నీదుపదభక్తుడఁ బ్రోవుము ద్వారకాపతీ

63. ఉ. గొల్లలయిండ్లదూరి యదుకుంజర! చల్లలబుడ్లచిల్లు లీ
వల్లరిసల్పిపెట్టెదవహా మొఱవెట్టుచు గొల్లలెల్ల నీ
తల్లి యశోదతోనుడువఁ దథ్యము కాదని కల్లలాడు నా
యల్లరి వీవ భక్తు ననయమ్మును జూచెదె ద్వారకాపతీ

64. చ. రసికుఁదవౌదు భక్తు నను రక్షణసల్పిన సల్పకున్న నీ
రసికత యెట్లునిల్చును బిరానను నిందలముంచువాఁడ బెం
పెసఁగ నకీర్తివచ్చునట హీనముఁగాదె యటైన నీవు నా
దెసఁగృపఁజూపిప్రోవుము నుతించెద నే నిను ద్వారకాపతీ

65. ఉ. బంధురవిక్రముండు తన బాహుబల మ్మనిఁజూపుచున్ జరా
సంధుఁడు నీపయింగవయ సంగరమందున నోడిపాఱి నీ
బంధులఁగూడి ధైర్యమెడఁబాసెడు నీవెటునన్నుఁబ్రోతువో
కంధరదేహ నాకదియె కష్టముఁదోఁచెడు ద్వారకాపతీ

66. ఉ. కాలునిఁబోలి యుగ్రలయకారుఁ డనంగను జన్యశీలియై
కాలునుదువ్వి నీపయికిఁ గాలతురుష్కుఁడురాఁగ నీవు న
క్కాలమునందు ధైర్యమువికావికలై చనఁబాఱియుంటి వి
క్కాలమునందు నన్నెటులుగాచెదొతోఁచదు ద్వారకాపతీ

67. చ. పరుసములన్ వచించితిని భావమునందునఁ గోపమెంచ కి
ద్ధరణిని వానిద్రోయఁదలిదండ్రుల్ దేశికదైవతమ్ము లం
చరయఁగనిన్నెనమ్మితి నయమ్ముగ దోసములంద్యజించి నీ
చరణయుగాబ్జసేవ నిడి సాకుము నన్నిఁక ద్వారకాపతీ

68. ఉ. కల్లలువల్కినాఁడవు జగమ్మున నిన్ దయఁజూడ నింతలోఁ
జెల్లదు కొన్నినాళ్ళయినఁ జెప్పెదనంచు వచింతువేని, నే
నొల్ల విలంబనమ్మునకు నోపికపట్టమటందు వౌఊయో
పిల్లికి నాట మూషికపుబిల్లకుఁ జేటగు ద్వారకాపతీ

69. చ. అపగతకిల్బిషుండవు మహాతుఁడ వెయ్యెడ నట్టినిన్ను నా
చపలతవాంఛఁగూర్చి కడుసల్పితి నిందల వానిఁద్రోసి నీ
నిపుణత నాదుకోర్కులిడి నీరజలోచన నీదుభక్తి స
త్కృపనునొసంగి నన్నిఁకను దేల్పుము మ్రొక్కెద ద్వారకాపతీ

70. ఉ. ఆలనుగాచువాఁడ నయమారెడు గొల్లలజోడుకాఁడ నిం
డాలములోనిప్రోడ, యవురా బొలిగద్దను నెక్కువాడ యే
కాలము బత్తులన్ మిగులఁ గాచెడువేల్పులఱేనిఱేఁడ, న
ంబాలనసల్పు నల్లగొలవాఁడ నుతించెద ద్వారకాపతీ

71. ఉ. అన్నులమిన్న ద్రౌపది సభాంతరమందున మానభంగ మా
తెన్నునఁ గౌరవుల్ సలుప సిక్కటలేకను నిన్నువేడ, బ్ర
చ్ఛన్నత నక్షయమ్మని ప్రశస్తత వల్వలొసంగి ప్రోచు సం
పన్నుఁడవీవు, దీను ననుఁ బాలనసేయవె, ద్వారకాపతీ

72. చ. నిపుణతవిద్యఁజెప్పు గురునిం గురుదక్షిణఁగోరుమన్న సాం
దిపుఁడుసముద్రగామిసుతుఁదెచ్చియొసంగుమటన్న బ్రీతిఁగా
లు పురికినేగిబాలకు బలుండవునై కొనితెచ్చియెంతొ నీ
కృప సుతుదేశికోత్తమున కిచ్చుచుఁదంపితి, ద్వారకాపతీ

73. ఉ. కోకలు విప్పి యొడ్డునను గుప్పలువెట్టుచు గోపికాంగనల్
తేఁకువమీఱ నీరమున లీలలనాడెడువేళఁ జీరలన్
వీఁకను మ్రుచ్చిలించి, కడువేగ, నమేరువునెక్కిడాగ, నా
ళీకముఖుల్ కనుంగొని చలింపఁగ వారికి జ్ఞానబోధ మ
స్తోకతఁ జల్పినట్టి నిను స్తోత్రముఁ జేసెద ద్వారకాపతీ

74. చ. నలువ మొదల్ సమస్తస్వజనమ్మునయందును నిల్చియుందు నీ
చెలిమి చరాచరమ్ములగు జీవులకెంతయొ జీవనమ్ము నీ
విలసనమెల్ల ప్రాణులకు విశ్రుతతేజము, నన్నుఁబ్రోవఁగా
దలఁపమిపెద్దలోపమిది తథ్యము తథ్యము, ద్వారకాపతీ

75. చ. దురమున హస్తియమ్మకరితోడను బోరొనరించుచున్న న
త్తఱి కరిరాజుడస్సి వరదా! పరమేశ్వర! కావుమంచు నీ
చరణములన్ భజింప వడిఁజక్రముచే మకరిన్ వధించి స
త్కరుణను సామజేంద్రునిలఁగాచితి వెంతయు ద్వారకాపతీ

76. ఉ. చుట్టమె హస్తిరాజు మధుసూధన యావిధిబ్రోచి నీవు చే
పట్టితివట్లె భక్తు ననుఁ బాలన సల్పుము సల్పవేని నీ
గుట్టును బైటఁబెట్టెదను గొబ్బున నిందల లోకమందు నీ
కట్టులు రట్టు భక్తుని రయమ్మునఁ బ్రోవుము ద్వారకాపతీ

77. చ. పరుఁడనె భక్తునన్నుఁ బరిపాలన సల్పిన పాపమొక్కొ నీ
కరుణను భక్తులన్ మునుపు గాచితి వంతదికల్ల సుమ్ము ని
బ్బరముగ నీవుపల్కుమటు పాడియె పక్షముఁబూన న్యాయమే
ఓరువును గాచికొమ్ము ననుఁ బాలనసల్పక్ ద్వారకాపతీ

78. ఉ. పేదవె నన్నుఁబ్రోవగ వివేచన భక్తునిఁ గావరాదె సం
వాద మదేల నాకడ ధ్రువంబుగ నిండ ఘటిల్లఁజాలు నీ
పాదయుగంబె దిక్కు పెఱవారినిఁగోరను బ్రోవకున్న నిన్
గాదనిపింతు భక్తజనకాండము సన్నిధి ద్వారకాపతీ

79. ఉ. క్రూరపుజింతఁగంసుఁ డతికోపమునన్ నినుఁజంపనెంచి యా
క్రూరుని నీకుఁగాఁ బనుపఁగూరిమి నాతనిఁగూడివచ్చు న
ద్దారిని నీస్వరూపము హితమ్ముగ నీతను నీవుచూపి య
క్రూరుఁడె యీతఁడంచని కోర్కులొసంగితి ద్వారకాపతీ

80. బోటియశోద నీదు నడుమున్ బిగిత్రాటనుఱోఁటఁగట్ట నీ
వాటల మద్దిచెట్లనడి యాటల ఱోటను దారుచుండ జం
ఝాటన పాటవోన్నతిని సాలయుగమ్ము విఱుంగశాపము
చ్చాటనగాఁగ వారికి నిజాకృతు లిచ్చితి ద్వారకాపతీ

81. చ. తరువుల శాప మావిధి ముదమ్ముగ నీవతివేగఁద్రుంచి నీ
కరుణ నిజాకృతుల్ వడయగా నొనరించితి నిన్నుఁగొల్వ న
ట్లరయ భత్పదమ్ములనయమ్ముగఁ గొల్చెడిభక్తినిచ్చి నా
దురితములం దొలంచి ననుదుష్టినిఁబ్రోవవె ద్వారకాపతీ

82. ఉ. పాతకి కంసుఁడెంతయు నపాయము నీకొనరింపనెంచి యా
పూతనఁబంపఁ జన్గవను బూరితిగాను విసమ్ముఁదాల్చి య
న్నాతి బిరానవచ్చి కరుణం జనుబాలిడ దుష్టయైన య
ప్పూతనఁజంపి దానికిని మోక్షమొసంగితి ద్వారకాపతీ

83. చ. కపటమొనర్చి నిన్ దునుమఁగాఁదలపోసిన చెట్టఁగాను నే
నెపమిడి చన్గవన్ విసమునింపి యొసంగిన దుష్టఁగాను ఘో
రపుఁబెనుమంటలంబఱపి ప్రానముఁదీయఁ దలంచుచుచ్చుగా
నపరిమితప్రసాదమ్మున నాత్మభంటుంగను ద్వారకాపతీ

84. ఉ. ఎంతయునాయసమ్ముగ్రహియించిదఱిన్ వడిఁజేర్చునాయయః
కాంతము రీతిగా సతముఁ గల్మషుఁడైనఁ ద్వదీయచింతనం
బింతయొనర్ప భక్తుని గ్రహింపుచు వానియఘమ్ముద్రుంచి నీ
చెంతకుఁ జేర్తువంట నయశీలతఁబ్రోచుచు ద్వారకాపతీ

85. చ. తఱియిది వాసుదేవ! ననుఁ దన్పుట కెంతయుఁ దాళజాల నీ
చరణసరోజయుగ్మపువిశంకటభక్తిని నా కొసంగి నా
దురితములం దొలంచి పరితుష్టిగ నిన్ను భజించునట్లు నీ
కరుణను భక్తు నాపయిని గాఢముగా నిడు ద్వారకాపతీ

86. ఉ. దోసము లేని యంబరీషుఁ దోరపు భక్తిఁ బరీక్షసేయ దు
ర్వాసుఁడు వచ్చియావ్రతము భంగమొనర్పఁగనెంచ నాతనిం
గాసిలఁ జేసి యానృపతిగాచి ముదంబిడునట్లె నన్ను నీ
దాసుని దోషదూరునిగ దద్దయుఁ జేయుము ద్వారకాపతీ

87. చ. మడువున నున్కిగా నిలిచి మారుతభోక్త సమస్తజీవులం
గడఁక విషాగ్నికీలలను గాల్పఁ దదీయశిరః ప్రదేశమం
దడుగులు వెట్టిత్రొక్కఁగఁ దదంగన లెల్లరు వేడ వారికిం
గడుఁ బతిభిక్ష పెట్టితివి కాదె ముదమ్మున ద్వారకాపతీ

88. చ. ఫుల్లసరోజనేత్ర! పరిపూర్ణజలాంబుదగాత్ర శాంభవీ
వల్లభమిత్ర! లోకనుతిపాత్ర! మహాలతాలవిత్ర! స
ద్ధల్లకపత్ర చిత్రతరదామవిదర్భసుతాకళత్ర! రా
జిల్లెడు త్వత్కృపారసముఁజిందవె నాపయి ద్వారకాపతీ

89. చ. ఖగపతివాహ స్నిగ్ధఘనకాంతిసముజ్జ్వల నీలదేహ ప
త్రగనంథాధిరోహ భుజదర్పితదైత్యవనప్రదాహ స
న్నిగమసమూహసంస్తుత వినిర్మలపాదజనిప్రవాహ భ
క్తగణ సుపర్వమాహ! ననుదారకుఁబ్రోవవె ద్వారకాపతీ

90. ఉ. సాంద్రయశోవిశాల గుణజాల సుశీల కృపాలవాల ని
స్తంద్రసువర్ణచేల మునిసత్తమచిత్తనివాసఖేల మౌ
నీంద్రసురారికాల ఘననీల వినీలకపోల నాకవా
సేంద్రముఖప్రపాల నను నిత్తఱిఁ బ్రోవవె, ద్వారకాపతీ

91. చ. స్మరహరమిత్ర పంకరుహశాత్రవభాస్కరయుగ్మనేత్ర సు
స్థిరనుతిపాత్ర భక్తజనచిత్తవిసర్పితపంకమిత్ర వి
స్ఫూరితసువర్ణనేత్ర భవమోచనసూత్ర రమాకళత్ర యం
బరవితతాతపత్ర ననుఁ బాలనసేయవె ద్వారకాపతీ

92. ఉ. యాదవవంశదీప కరుణాంచితదివ్యకలాకలాప వి
చ్ఛేదితభక్త తాప పరిశిలితపుణ్యజనానులోప స
మ్మోదితభవ్యరూప పరిపూరితపాందవరక్షణానుసం
పాదితవిశ్వరూప ననుఁ బాలన సేయవె, ద్వారకాపతీ

93. చ. నరహితరథ్యచోదక జనార్ధననామక భక్తచిత్తపం
జరనిలయస్థభవ్యశుక సజ్జనపోషక మోక్షదాయకా
తరణినిశారాంబక కృతఘ్నువినాశక దైత్యకాననో
త్కరదహనప్రపావక సతమ్మును బ్రోవవె ద్వారకాపతీ

94. చ. పరమపవిత్రనామ యదువంశపయోనిధిపూర్ణసోమ సం
గరరిపుభీమ భక్తజనకాండమనోరథపూర్ణకామ ము
ష్కరభుజవిక్రమక్రమనిశాచరగర్వవిరామ చంద్రభా
స్కరనయనాభిరామ నిను సన్నుతిఁజేసెద ద్వారకాపతీ

95. ఉ. గోపకులాగ్రగణ్య రణకోవిదపణ్య యగణ్యపుణ్య సాం
దీపశరణ్యపణ్య కమనీయపదాంబుజజాతపుణ్య దు
ష్ప్రాపమహాపరాక్రమపరాజితపుణ్యజనేడ్వరేణ్య స
త్యాపరిహాసపణ్య కృపఁ దన్పుము నన్నిఁక ద్వారకాపతీ

96. చ. నిరుపమతేజ భక్తగణనీయ సుభక్తినియుక్తపూజ సం
గరకరిరాజమానసవికాస రామరభూజ పూతస
చ్చరణసరోజసంజనిత శైవలినీపరిపూతదేవతా
సరససమాజ భక్తు నను సాకవె నీకృప ద్వారకాపతీ

97. ఉ. బాలశశాంకఫాల యదువంశనృపాల సువర్ణచేల స
మ్మేళితవార్ధిఖేల గుణమేదుర సజ్జనపాల భానుసం
పాలనరత్నకుండల విభాధివిభాసికపోల బాల స
చ్ఛీల యశోవిశాల ననుఁ జేర్పుము నీకృప ద్వారకాపతీ

98. చ.  సరసిజపత్రలోచన విచారవినాశన నందనందనా
కరధృతశంఖచక్రవరఖడ్గగదాఘన భక్తచందనా
సురుచిరలోకవందన విశుద్ధమనోధనమౌనికుర్ధనా
దురితవిమర్ధన కరుణతో ననుఁ గావవె ద్వారకాపతీ

99. ఉ. సూనృతభాష నీలఘనసుందరవేష యశోవిశేష సు
జ్ఞానమహావిభూష వరకౌస్తుభసన్మణికాంతిపూష సం
ధానిత సర్వభక్తవరదానకతోష యశేషలోకదు
ర్మానితభూరిభూష నను మన్పుము నీకృప ద్వారకాపతీ

100. దురితవిదూర భక్తజనతుష్టకృపాపరిపూర సారవి
స్ఫురితకటాక్షధార పరిశోభితగోపకిశోర గోపికా
వరతరుణీవిషాదభవ బంధవిదూర! యుదార! దుగ్ధసా
గరసువిహార ధీర కృపఁ గాంచుము నాపయి ద్వారకాపతీ

101. ఉ. పాండవరక్షదక్ష సురపక్షమునీడ్యబుధారిశిక్ష యా
ఖండముఖ్యనిర్జరనికాయసమక్ష కృపాకటాక్ష బ్ర
హ్మండభరైకదీక్ష కలుషావృతవిష్ణపముక్తి భిక్ష వే
దండభయప్రమోక్ష ననుఁదన్పవె నీకృప, ద్వారకాపతీ

102. ఉ. గోపరిపాల కాంచనదుకూల సమస్తకళానుకూల వి
ద్యాపరిపాలశీల యమరారివనోత్కటదావకీల సం
తాపితశత్రుజాల వరధర్మనిరంతరగర్భగోళ యు
ద్దీపితగోపబాల కృపఁ దేల్పవె నన్నిఁక ద్వారకాపతీ

103. చ. అలరెడు చంపకోత్పలములాదట దండగఁ గూర్చి త్వత్పదం
బులఁ గడు భక్తి వెట్టితి ప్రమోదమనంబున స్వీకరించి నీ
కలుషములెల్లఁ బాసెనిఁక గాదిలిభక్తుఁడవైతి వంచు నా
తలపయి నీకరంబు నిడి తద్దియుఁ బ్రోవుము ద్వారకాపతీ

104. ఉ. తప్పులుగల్గ సామమును దండ్రి వచించును వెన్క దానముం
జొప్పడసేయుభేదమును జూపును మీదఁ బయింబొనర్చుదా
నప్పుడు దండనంబు పరమాత్మ గురుండవు నీవె కావ నా
చొప్పునఁ బుత్రునిన్ నను విశుద్ధునిఁజేయవె ద్వారకాపతీ

105. ఉ. నోటికి వచ్చినటులు నిను న్నుతియించితిఁ దప్పులున్న నా
సాటిభటప్రకాందమునఁ జాటక యొంటిగ నున్నయప్డు నా
చోటికివచ్చి తెల్లముగఁ జూపుము దానికిఁ బ్రీతిలేనిచోఁ
జాటుగ స్వప్నమందయిన సల్పుము దిద్దెద ద్వారకాపతీ

106. ఉ. ధర్మము మీఱకుండ ఫలితంబున నాసఁదొలంచి శ్రద్ధమైఁ
గర్మ లొనర్చుటే? నరసుఖంబని చేసిన బోధ వింటి నా
దుర్మతల్ త్యజించికొని తోఁచిన యట్లు శతంబు పద్య స
త్కర్మ మొనర్చినాఁడ ఫలితంబుఁ దలంతునె ద్వారకాపతీ

107. చ. నెలకుఁ ద్రివృష్టి నింపి ధరణిన్ వహియింపఁగ సస్యవృద్ధిగో
వులు పృథివీసురుల్ సుఖముఁబొంద నిలాధిప వైరహీనమై
కలిమియుఁ జెల్మియుండ జనకాండముఁ దక్కిన సర్వజీవులు
జ్వలనముదమ్మునందఁగృప బాలనఁజేయవె ద్వారకాపతీ

108. చ. యువయనినేట మాధ్వసితోత్ప్రతిపత్థ్సిరవాసరాంతమం
దవిరళభక్తిఁ దావకపదాంబుజయుగ్మసదర్చసేయ నే
ప్రవిమలపద్యపుష్పముల బాగుగ నూటొక్కయ్ర్న్మిదింటి మా
ధవ యిడియుంటిఁ గొంచునను దన్పవె నీకృప ద్వారకాపతీ

సంపూర్ణము

1 comment:

  1. The best casinos to play online slots - KTH
    The best casinos to play 강원도 출장마사지 online slots · 태백 출장안마 Bitstarz Casino: A new player 의정부 출장샵 welcome bonus of £100 · Royal Ace Casino: The 성남 출장안마 best choice 제주도 출장샵 for those looking to play at a

    ReplyDelete