గోపకుమార శతకము
ప్రహరాజు గంగరాజు
(కందపద్యములు)1. శ్రీరుక్మిణీకళత్రా
సరసదళనేత్ర విమల సత్యచరితా
నీరధరోపమగాత్రా
కూరిమితోఁబ్రోవుమయ్య గోపకుమారా
2. శ్రీకరుఁడవనుచు భక్త వ
శ్రీకరుఁడవటంచు శుక్ర శిష్యాళియెడన్
భీకరుఁడ వనుచుఁగొలచెద
గోకులమణి భీమసింగి గోపకుమారా
3. శ్రీగౌరీ శంకరులను
వాగీశ సరస్వతులను వారణముఖునిన్
యోగివరు శుకునిఁగొలచెద
గోగోపక యుతవిహార గోపకుమారా
4. ఇన శశి కుజ బుధ గురు కవి
దినకరసుత రాహుకేతు ధీవరులనునే
ఘనముగమత్కృతి నెగఁడగఁ
గొనియాడెద మానసమున గోపకుమారా
5. సలలితముగ హృదయంబున
బలినారద వాలఖిల్య భక్తిల నెల్లన్
బలుమారు వినుతించుచు నే
గొలచెదనీ దాసులగుట గోపకుమారా
6. ధారుణిమద్గురు నమలా
చారునితోలేటి వంశ జలధివిధునిసీ
తారామకవి ప్రవరునిఁ
గోరిభజించెదను భక్తి గోపకుమారా
7. యతిగణ నియమంబెఱుఁగను
వితతపురాణాదులైన వీక్షింపగలే
దతిభక్తిఁ జెప్పఁబూనితిఁ
గుతుకముతోఁ గొనుముదీని గోపకుమారా
8. తలఁచెద నినునిరతంబునుఁ
గొలచెదనీపాదయుగము గొబ్బునబ్రోవం
దలఁపుముదయతో ననుఁజి
క్కులుఁబెట్టకు వేడుకొందు గోపకుమారా
9. దినకరశతతేజా! సుర
వినుతపదాంభోజ యుగళ! వినతాసుతవా
హన! కృపతో నాకృతిఁగై
కొనుమామ్రొక్కెదను నీకు గోపకుమారా
10. నరహరినరసఖ గిరిధర
కరివరదమురారి కృష్ణ కంసధ్వంసీ
పురుహూతవినుత పదయుగ
కురుకులవనవీతి హోత్ర గోపకుమారా
11. వినుమానావిన్నపమున్
గనుమాకృపతోడ నన్నుఁ గడువడినోహో
యనుమానేఁ బిలిచినఁగై
కొనుమానా వందనములు గోపకుమారా
12. శ్రీధరనారాయణ హరి
మాధవవసుదేవ తనయ మధుదనుజహరా
సాధుజనావనశీల
గోధనపరిపాల విజయ గోపకుమారా
13. మందరధర! సుందరశర
దిందుముఖా! మురహరణ! సురేశ్వరసుత! సా
నందా! గోవిందా! ముచి
కుందవరద నందతనయ గోపకుమారా
14. మాధవకేశవ త్రిజగ
న్నాధాశ్రీ రుక్మిణీస నాధానిన్నా
రాధనఁజేసెదఁ బ్రోవవె
క్రోధరహిత భక్తవినుత గోపకుమారా
15. నాగాధిప సంరక్షా
నాగాధిప భోగతల్ప నాగారిహయా
నాగారి నిభపరాక్రమ
గోగణపరిపాల విమల గోపకుమారా
16. యదుసద్వంశ పవిత్రా
మదరిపు దావాగ్నిహోత్ర మహితచరిత్రా
సదయుత నాహృదయంబునఁ
గుదురుగ నివసింపుమెపుడు గోపకుమారా
17. కంజదళాయతలోచన
కుంజర రిపుశౌర్యదైత్య కుంజరసింహా
కంజభవ వినుతపదయుగ
కుంజరపతి వరద కృష్ణా గోపకుమారా
18. సేవించెదనిన్నెప్పుడు
నావిన్నపమవధరింపుము నళినదళాక్షా
నీవేదిక్కనినమ్మితి
గోవిందాబ్రోవుమెపుడు గోపకుమారా
19. వారకనీమృదుపదాం
బోరుహములుసతతంబుఁ బూజింతుమదిన్
కూరిమి నెల్లప్పుడునా
కోరికలొనగూర్పుమయ్య గోపకుమారా
20. రారాయాదవకులమణి
రారావసుదేవ తనయ రక్షింపునగో
ద్ధారాశ్రితమందారా
గోరాజతురంగ మిత్ర గోపకుమారా
21. దామోదర సంకర్షణ
వామనకేశవమురారి వసుదేవసుతా
కామారిముఖ్యసన్నుత
కోమలపదపద్మయుగళ గోపకుమారా
22. వీక్షింతువుదాసులకృప
రక్షింతువుదీనజనుల రాజీవాక్షా
శిక్షింతువుదుర్మార్గులఁ
గుక్షిస్థితపద్మజాండ గోపకుమారా
23. హరిహరియనివచియించిన
దురితములుందవని చెప్పుదురు పెద్దలు నే
నిరతమునిన్ను స్మరించెద
గురుతరకృపఁబ్రోవుమయ్య గోపకుమారా
24. సతతమునీపదయుగళము
హితమతినాహృదయమందు నిడుకొనిభక్తిన్
ధృతివాక్కుసుమంబులచేఁ
గుతుకంబునఁ బూజసేతు గోపకుమారా
25. నారాయణనీనామముఁ
బారాయణఁ జేయునట్టి భక్తులనెల్లన్
వారకఁ బ్రోతువుసతతము
కూరిమిననుగావరాదె గోపకుమారా
26. మౌనులసురలనునేచెడి
దానవులనుగూల్పభువిని దశరధపృధ్వీ
జానికినుదయించితివట
గోనారీరమణవినుత గోపకుమారా
27. పుట్టితివి రవికులంబునఁ
బట్టితివిప్రతిజ్ఞమునులఁ బాలించుటకున్
గట్టితివి లవణవారధిఁ
గొట్టితివి సురారిచయము గోపకుమారా
28. దుండగులగు కురుకులజుల
భండనమునసమయఁజేసి పాండవసుతు భూ
మండలపతిఁ జేసితి వహ!
కుండలపతిశయన శౌరి గోపకుమారా
29. కురురాజసభను ద్రౌపది
పరిభవమునుబొందినిన్నుఁ బ్రార్ధింపంగా
సరగునరక్షించితివట
కురుకులజులుసిగ్గునొంద గోపకుమారా
30. ఎంచెద నినుమదిలోఁ బూ
జించెద నిరతముమదీయ చిత్తంబున నో
కాంచనచేలా! ననుఁజే
కొంచుఁగృపనుఁగావుమయ్య గోపకుమారా
31. శ్రీపానీపదభక్తుల
పాపములెడఁబాపఁబ్రతినఁ బట్టితివికనా
పాపంబులపనయింపుము
గోపవధూచిత్తలోల గోపకుమారా
32. తలఁచెదమదినిన్నెప్పుడుఁ
బలికెదనీపేరునోట భక్తశరణ్యా
సలలితముగ నీపదములఁ
గొలిచెదననుఁ గావుమయ్య గోపకుమారా
33. ఏలితివి ముజ్జగంబులఁ
జాలితివి సమస్తశత్రుజాలముఁద్రుంపన్
గ్రాలితివికీర్తిచే భువిఁ
గ్రోలితివి యశోదపాలు గోపకుమారా
34. జలజభవాండములెల్లను
బొలుపొందగబొజ్జలోనఁ బూనియెటువలెన్
మెలఁగితివోవసుదేవుని
కులసతి గర్భాననీవు గోపకుమారా
35. పాపాత్ముఁడజామీళుఁడు
నీపేరందనకుమారునింబిలువఁగదా
ప్రాపించెనీపదంబులు
గోపీవస్త్రాపహరణ గోపకుమారా
36. మ్రుచ్చిలితివిపాల్పెరుగులు
చెచ్చెరగోపాల సతుల చేలములెల్లన్
దెచ్చితివిలీలనొక్కట
కుచ్చిత జనహరణ కృష్ణ గోపకుమారా
37. గాంభీర్యవిజితసాగర
జంభారిప్రముఖదేవ సంచయరక్షా
కుంభీంద్రప్రాణావన
కుంభజముఖవినుతదేవ గోపకుమారా
38. రజనీచరాధములుభువి
ద్విజులనుమునివరులసురల వేధింపంగా
భుజబలమునఁగూల్చితిలఁ
గుజనులరక్కసులనెల్ల గోపకుమారా
39. చాణూర మల్లముష్టిక
బాణాసుర ముఖ్యదుష్ట పర్వతబిధూరా
వాణీశ జనకకాంచన
క్షోణీధర ధీరకృష్ణ గోపకుమారా
40. నామానసమందున నెపుడు
నీమృదుపద పల్లవములు నిల్పిభజింతున్
ప్రేమఁగదుర రక్షింపుము
కోమల నవనీరదాంగ గోపకుమారా
41. కడుభక్తితోఁగుచేలుఁడు
పిడికెఁడు పృధుకములునీకుఁ బ్రీతినొసంగన్
దడయక కృపనాత్నికె
క్కుడు భాగ్యమొసంగితీవు గోపకుమారా
42. అనయము నీసంకీర్తన
మనుసల్పు నరుండుమిగుల మూర్ఖుండైనన్
గనులను యమలోకముఁగనుఁ
గొనఁడని చెప్పుదురుబుధులు గోపకుమారా
43. సంతతము నీపదంబులు
మంతనమునఁజింతసేయు మానవులకునొ
క్కింతయును బాపమంటదు
కుంతీసుత పక్షనంద గోపకుమారా
44. నిండుకృపను బాండవులను
భండనమున జయమొసంగి పాలించితివా
ఖండలనుత భాల్యంబున
కొండను ధరియించినావు గోపకుమారా
45. పారాశర్య నదీసుత
నారదరుక్మాంగదార్జునప్రముఖమహా
ధీరులగు భాగవతులన్
గూరిమిదరిఁజేర్చినావు గోపకుమారా
46. తలఁచిన తఱినామనమున
నిలువుము కేష్ణాయటంచు నినునేఁబిలువం
బలుకుము దృఢభక్తిగనినుఁ
గొలచెద సతతము నంద గోపకుమారా
47. వారిజహిత శశినేత్రా
వారణపతినుతచరిత్ర వనధరగాత్రా
క్షీరాబ్ధిజాకళత్రా
కూరిమి ననుఁగావుమంటి గోపకుమారా
48. నీమాయఁ దెలియతరమే
తామరచూలికిని చంద్రధారికినైనన్
సామజపతి సంరక్షా
కోమలనీలాభ్రదేహ గోపకుమారా
49. ఘనభక్తితోడ నినునే
మనమునఁ బూజింతునెపుడు మాధవకృపతో
ననునీపుత్రుని గతిఁజే
కొనియభయ మొసంగుమయ్య గోపకుమారా
50. శివుఁడన్ననునీవే కే
శవుఁడన్నను నీవెగాక జగతీస్థలిపై
లవమంత భేదమున్నదె?
కువలయహిత భానునేత్ర గోపకుమారా
51. రమ్మా ననురక్షింపఁగ
నిమ్మా నాకభయమిప్పు డిభరాడ్వరదా
సమ్మతి నామనవిని గై
కొమ్మా మ్రొక్కెదనునీకు గోపకుమారా
52. రావేల నన్నుఁబ్రోవఁగ
వీవేల బిరాననభయ మింద్రాదినుతా
నీవేతల్లివి దోడువు
గోవిందానందతనయ గోపకుమారా
53. ప్రతిదినమును నీకునమ
స్కృతులొనరించెదను దేవకీప్రియతనయా
హితమతి నన్నేలుహరీ
కుతుకముతో నెల్లప్రొద్దు గోపకుమారా
54. హరినారాయణకేశవ
వరదపరాత్పర మురారి వనజదళాక్షా
గిరిధర పురహ మిత్రా
గురుతరకృపఁబ్రోవుమయ్య గోపకుమారా
55. రామానుజ శ్రీమానస
ధామా యదువంశజలధి తారాధీశా
కామజనకసురవందిత
కోమలనవనీరదాంగ గోపకుమారా
56. జుఱ్ఱెద నీనామసుధన్
మఱ్ఱాకునఁబవ్వళించి మహినొకగ్రద్దన్
గుఱ్ఱముగఁజేసినాడవు
కుఱ్ఱడ నాతప్పుఁగావు గోపకుమారా
57. గంగాధర సన్నుత శ్రీ
రంగాశ్రీవక్ష రాజీవాక్ష
మంగళములొసఁగుభక్తుల
కొంగునబంగారమీవు గోపకుమారా
58. గరుడగమన! గిరిధర! సుర
వరసన్నుత దివ్యపాద వనజాత! హరీ!
నరసఖ! కురుకులనాశన!
గురుతుగనినుఁగొలుతునెపుడు గోపకుమారా
59. రావయ్యబాలకృష్ణా
రావయ్యకృపాలవాల రాగుణజాలా
రావయ్యవేగ ననుఁజే
కోవయ్యజాలమేల గోపకుమారా
60. జున్నును దేనెయు శర్కర
మున్నగుతియ్యనిపాదార్ధములుసరియగునే
చెన్నగునీనామముతోఁ
గ్రొన్నన విలుకానిఁగన్న గోపకుమారా
61. మీనమవై సోమకునిన్
బూనికతోఁజంపివేదపుంజముబ్రహ్మా
ధీనముఁజేసితి వప్పుడు
గోనారీరమణవినుత గోపకుమారా
62. మందరశైలము వీఁపునఁ
గందుకగతినెత్తిదేవగణములకమృతం
బందఁగఁజేసితివౌర! ము
కుందా దంతీద్రవరద గోపకుమారా
63. సూకరరూపుఁడవగుచునుఁ
బ్రాకటముగ హేమనేత్రుఁ బరిమార్చిధరన్
నీకొమ్ముననిల్పితివట
గోకుల పరిపాలనంద గోపకుమారా
64. నరకేసరి రూపంబున
దురితుఁడగు హిరణ్యకశిపుఁ దునుమాడిధరన్
కరుణం దత్పుత్రునేలిన
గురువిక్రమ చక్రహస్త గోపకుమారా
65. వామనుఁడగుచు బలినిన్
భూమిపదత్రయమువేడి భువనములెల్లన్
శ్రీమీర నాక్రమించిన
కోమల నీలాభగాత్ర గోపకుమారా
66. జమదగ్నికి సూనుఁడవై
క్రమమున ముయ్యేడుమార్లు రాజులనెల్లన్
సమయించిన నతకైవర
కుముదాస్తా భక్తవరద గోపకుమారా
67. దశరధ రాముఁడవగుచును
దశముఖ ఘటకర్ణముఖ్య దనుజులననిలో
మశకములఁ బోలిచంపిన
కుశలమతి నందత్నయ గోపకుమారా
68. బలరామకృష్ణులనగా
నిలలో నుదయించిఖలుల నేపడఁచిమహీ
వలయభరముడిపినావట
కులగిరి నిభధీర గోపకుమారా
69. భువి బుద్ధరూపమున ఖిల
నివహముఁబరిమార్చిమిగుల నీతిజ్ఞుల మ
క్కువతోడఁబ్రోచినావట
కువలయ పరిపాల విజయ గోపకుమారా
70. కలియుగమునఁ బాపాత్ములఁ
గలిరూపము నొందికూల్పఁగలవికమీదన్
దలఁప నినుపొగడఁదరమే
కులగిరి నిభధైర్య కృష్ణ గోపకుమారా
71. మామపయిఁ బండుకొనియా
మామను మధియింపఁజేసి మామనుఁజంపం
గా మహినినీకుఁజెల్లును
కోమల పదకమలయుగళ గోపకుమారా
72. అత్తయగు మహీకాంతనుఁ
జిత్తమలర రత్నగర్భఁ జేసితివిక మే
నత్తయగు రాధవయసున్
గుత్తకుఁ గొంతివిగదయ్య గోపకుమారా
73. సత్రాజిత్సుతకై సుర
ధాత్రిజముఁదెచ్చి తీవు ధాత్రికి హిమవ
ద్ధాత్రీధర నిభధైర్య
గోత్రారి ప్రవరవినుత గోపకుమారా
74. బాలుఁడవైయుండఁగనిను
రోలను నీతల్లికట్టె రోషముతోడన్
రోలీడ్చు కొంచు మద్దులఁ
గూలఁగద్రోచితివి యౌర గోపకుమారా
75. రంగా దానవ గర్వవి
భంగా కరుణాంతరంగ పతగతురంగా
గంగా ధర నుతదాసుల
కొంగున బంగారమీవు గోపకుమారా
76. ఆలింపుమయ్య నామొఱఁ
బాలింపుము వేగనన్ను బద్మదళాక్షా
చాలింపుము చలమింకను
గోలలనానాధ వినుత గోపకుమారా
77. ఓవసుదేవ తనూభవ
యోవారిజ పత్ర నేత్ర యోకరివరదా
భావజ సమాన సుందర
గోవింద ముకుంద నంద గోపకుమారా
78. సుత్రాముఁడు గర్వంబునఁ
జిత్రముగా ఱాళ్ళవాన క్షితిఁగురిపింపన్
ఛత్రము గతి గోవర్ధన
గోత్రంబెత్తితివి నీవు గోపకుమారా
79. ఫణిరాజ శయన దానవ
ఫణిసముదయ వైనతేయ ఫణిధరమిత్రా
ఫణి గర్వ హరణవిల స
ద్గుణరత్నాకర ముకుంద గోపకుమారా
80. నందతనూభవ వందిత
బృందారక బృందశత్రుభీషణముని హృ
న్మందిర దీనసురద్రుమ
కుందముకుళవదన నంద గోపకుమారా
81. వారిజరిపుధరమిత్రా
వారిధర సమానగాత్ర వనరుహనేత్రా
వారిజ భవనుత పాత్రా
కోరిభజించెద నిన్ను గోపకుమారా
82. నీపుత్రకుండ నంటిని
కోపము నామీదఁ బూనఁ గూడదటంటిన్
కాపాడమంటిఁ గృపతో
గోపీజన పంచబాణ గోపకుమారా
83. ఎంచగ నీసాటియె? య
క్కాంచన గర్భాదిపుత్రికానాధులు, హే
పంచశరజనక! నన్నున్
గొంచక రక్షింపరమ్ము గోపకుమారా
84. సంతతమును తావకపద
చింతనసేయుదునటన్నఁ జిత్తమునాకొ
క్కింతయిఁ దిరముగనుండదు
కుంతీసుతపాల కృష్ణ గోపకుమారా
85. నిజభక్తి నిన్నుఁగొలిచెద
సుజనులతొఁ జెలిమిసేతు సుస్థిరమతినై
భజియించెదనిను సతతము
కుజనవిదూరా ముకుంద గోపకుమారా
86. భువినీమాయ నెరుంగన్
భవుఁడు సమర్ధుండుగాడు పరులకు వశమే?
రవికోటితేజ నిను ని
క్కువభక్తిఁదలంతునెపుడు గోపకుమారా
87. నిబ్బరముగఁ బూతనచను
గుమ్మలఁ గబళించిపాలు గ్రోలెడుమిషచే
నబ్బురముగఁ దత్ప్రాణముఁ
గొబ్బునఁ బీల్చితివియౌర! గోపకుమారా
88. నీపాదపంకజంబులు
ప్రాపుగ మదినమ్మినాడ పద్మనయన నా
పాపంబులెల్లఁ బాపుము
గోపవధూశంభరారి గోపకుమారా
89. వారణ రిపువిభవిక్ర సం
వారణపతిరక్ష దనుజ వారణసింహా
దురీకృతాఘ సంచయ
కోరికలొనఁగూర్చిప్రోవు గోపకుమారా
90. సంతతముభక్తి నినునా
స్వాంతమున నిల్పిగొలుతు సరసిజనేత్రా
వంతలుడిపి రక్షింపుము
కుంతీసుత వరదనంద గోపకుమారా
91. అనుదినమును నిను నెమ్మన
మున నిల్పిభజింతు మోదమున వనజాక్షా
కనికరముఁబూని సనుసర
గునఁ గావగదయ్య తండ్రి గోపకుమారా
92. నేపాపవర్తనుఁడనని
కాపట్యుఁడననుచు మిగుల గర్వినటంచున్
గాపాడకుంట నాతమె?
కోపము నీకుండజనునె? గోపకుమారా
93. తనయులు తప్పొనరించిన
జనకులు సరించిబ్రోవ జగతినిధర్మం
బనఘూ తనయులపైఁ జగఁ
గొని ప్రోవకయునికిదగునె? గోపకుమారా
94. భవభయహర భవనీరజ
భవసురపతివినుతపాద పంకజయుగళా
సవినయముగ మ్రొక్కెద మ
క్కువననుఁ గాపాడుమెపుడు గోపకుమారా
95. భావజజనకా యదుకుల
పావన జగదేకవీర భవ్యవిచారా
దేవస్తుత పాదాంబుజ
గోవర్ధన శైలధరణ గోపకుమారా
96. బృందావన సంచారా
బృందారకపక్షనీల బృందశరీరా
మందరభూధరధీర
కుందేందుసమానకీర్తి గోపకుమారా
97. నిర్మదుల నిర్వికారుల
నిర్మోహుల నిరతిశయుల నిశ్చలమతులన్
నిర్మల భక్తులనెప్పుడు
కూర్మినిబ్రోచెదవు నీవు గోపకుమారా
98. వాణీశ మఘప్రముఖ గీ
ర్వాణస్తుత దివ్యపాద వనజాతనత
త్రాణ సరోరుహ నేత్రా
క్షోణీసుర సంఘరక్ష గోపకుమారా
99. యదుకుల సాగరచంద్రా
మదనజనక సదయ హృదయ మదరిపుజైత్రా
వదలక సతతమునిలువుము
కుదురుగ నాహృదయమందు గోపకుమారా
100. హాటక భూధరధీరా
హాటక గిరిచాపవినుత హాటకవసనా
హాటకరుక్మాంగద నేఁ
గోటినమస్కృతులొనర్తు గోపకుమారా
101. దుర్మదము విడిచిసతతము
నిర్మల భావంబుతోడ నినుసేవింపన్
కర్మలుతెగునని వింటిని
కూర్మినిదరిజేర్పు నన్ను గోపకుమారా
102. కాతక కేతన జనకా
పాటిరాగరు విలిప్త భాసురవక్షా
హాటకదివ్యాంబర మణి
కోటిరాంగదవిభూష గోపకుమారా
103. కంఠీరవవిక్రమ శతి
కంఠస్తుతపాత్ర నీలఘననిభగాత్రా
కంఠకలితకౌస్తుభ వై
కుంఠపురాగార బంద గోపకుమారా
104. రవికోతితేజవిను మిక
సవినయముగ యాజ్ఞవల్క్య శాఖోద్భవుఁడన్
కవితాకన్య నొసంగితిఁ
గువలయ పరిపాలనీకు గోపకుమారా
105. క్షితిగంగ రాజనామా
న్వితుఁడన్ ప్రహరాజువంశ నీరధిభవుఁడన్
శతకమి నీకర్పించితిఁ
గుతుకమునఁ బరిగ్రహింపు గోపకుమారా
106. ఒప్పుగ నీకొసఁగితిఁ గను
మప్పాగైకొనుము కంద హారంబిది నా
తప్పులు మన్నింపుము నిను
గొప్పగఁ బూజింతునెపుడు గోపకుమారా
107. నతిఁ జేసెద లోకేశా
నతిఁ జేసెద పరమపురుష నతిఁజేసెద నా
గతి నీవేయని నమ్మెదఁ
గుతుకముతోనెల్లప్రొద్దు గోపకుమారా
108. వందనము భక్తవత్సల
వందనపు పురందరాది వందితచరణా
వందనము దీనపోష ము
కుందా కరుణాంతరంగ గోపకుమారా
-: సమాప్తము :-
శలివాహన శకపు వత్సరములందు
శైల పుర హస్తి చంద్రుల సంఖ్యలోనఁ
జైత్రశుద్ధసప్తమి నాఁడు శతకమనుచు
గంగరాజు కవి రచించె ఘనులువొగడ
No comments:
Post a Comment