శ్రీరామ శతకము
మంచిరాజు సీతమాంబ (1934)
1. శ్రీజానకి వరరమణా
నాజాలియు మాన్పిగావు నలినదళాక్షా
నేఁజాలగఁ వేడితి నిను
రాజితపాదారవింద రఘుకులరామా
2. తల్లియుఁ దండ్రియు నీవని
యుల్లము నీయందు నిల్పి యుంటినిగాదే!
కల్లగఁ దలచకు శ్రీహరి
చల్లగఁ దయఁ జూడునన్ను జానకిరామా!
3. కరివరదా! భయరహితా!
అరమరసేయకుము గావు మఖిలాధారా
పరమదయానిధి మునినుత
అరవింద దళాక్ష రార యచ్యుతరామా!
4. హరివని నెరనమ్మితి నిను
మురహరివని వేడుచుంటి మోహనరూపా
సురులనుఁ గాచిన దొరవే
సరసిజ దళనేత్రరార సద్గుణరామా
5. సోమకుఁడనియెడు దైత్యుని;
తామసు; వేదాపహరును దండించి భువిన్
ప్రేమమున శ్రుతులు నిల్పిన
శ్రీమహిళాభర్త నుతిని చేసెదఁరామా!
6. పొందుగ దేవాసురులొక
మందరగిరితోడను దధి మధియింపంగన్
పొందిక గచ్చపరూపున
మందరమును మోసినావు మహిమనురామా!
7. ఖగపతి వాహన మాధవ
నగధర నిను గొల్చువారు నరకమునకు బో
వగఁబనిలేదటగదరా
జగముల సృజియించునట్టి జాణుడరామా!
8. కమలాప్తు వంశమున నీ
వమలమతివిగాఁ జనించి యవనిని సమభా
వమునను పాలనజేసిన
కమనీయ దళాక్షరార కరుణనురామా!
9. నిను దలచెడి వారికి నెం
దును మోసము లెదు లేదు తోయజనేత్రా
కనికరముంచుము నాపై
అనుదినమును వేడుచుంటిఁ ఖ్యాతిగరామా!
10. పరమదయాకర రారా
కరుణారస పూర్ణజలధి కావుము నన్నున్
శరణన్నఁ బగతు తమ్మునిఁ
బరమకృపను గాచినట్టి పావనరామా!
11. మిత్రకులంబున బుట్టి సు
మిత్రసుతుడు కొల్చుచుండ మెచ్చుగ నీవున్
క్షత్రియ ధర్మముఁ దప్పక
కృత్రిమమతులను మదమడ గించినరామా!
12. అండజవాహన నేనీ
యండను జేరితినిగావు మఖిలాధారా
కుండలిశయనా కేశవ
పండిత సంస్తుత్య పరమపావన రామా
13. వింతల రూపులతో నీ
వంతట వసియించునట్టి హరిహరతేజా
పంతములు మాని నాదగు
చింతల నడగించరార శ్రితజనరామా!
14. భవహర నీ యుదరంబున
భువనంబులు పదియునాల్గు పొందుగనుండ
న్నవనవ రూపులతోడన్
భువిలో జనియించు నేర్పు బూనినరామా!
15. మునివరు వెనువెంటనుజన
తన కపకారంబుసలుప తాటకి రాగన్
బనిఁబూని దాని నొకశర
మునగూల్చిన ధీరుడవుగ భువిలో రామా!
16. కోటి తపనతేజుడ నీ
సాటి యెవరు లేరు గాద సారసనేత్రా
మాటికి నాదగు తప్పుల
సూటిగ జూడంగ దగదు సుందర రామా!
17. దశరధ రాజకుమారా!
శశిధరువిలు విరచినట్టి జనకజ నాధా!
దశముఖసంహార నిను నా
వశమా కొనియాడగాను భవహర రామా!
18. అంజని పుత్రునిగాచిన
కంజనయన వరదనన్నుఁ గావనురారా
అంజలి నిడితిని నీకును
మంజులతర వచనరచన మానిత రామా!
19. గౌతమముని శాపముచే
నాతిశిలగఁ బడినదాని నరవరవేగన్
బ్రీతిని బ్రోచితిగద వి
ఖ్యాతింజేకొనిన భక్తకాముడ రామా!
20. ఒకచోటనుండి మరి వే
రొకచోటున లేవనంగ నొప్పదు సుమ్మీ
అకుటిలమతివై యన్నిటఁ
బ్రకటితముగ వెలుగుచుండు ప్రౌఢుడరామా!
21. అంగన నీకొసగిన యా
యెంగిలి ఫలములఁ భుజించి యెంతోదయచే
హంగుగ మోక్షంబిచ్చిన
రంగా నిను బొగడవశమె రవికుల రామా!
22. మాధవ మునినుత రారా
శ్రీధరయని నను దినంబు చింతించెదనిన్
గాధిసుతుయజ్ఞ రక్షక
సాధుజనావన ముకుంద సద్గుణరామా!
23. శంకర వందిత చరణా
సంకటహర నిన్ను నమ్మి సన్మార్గముచే
పంకజనయనా మౌనులు
పొంకముగా మోక్షమునకు బోయిరిరామా!
24. మదిలోఁ నమ్మితినిను నే
ముదముగఁ ధ్యానించుచుంటి మురహరివరదా
యదుకుల సంజాతుడవై
సుదతులఁగావంగ లేద సుముఖుడరామా!
25. రేపులు గడుపకు శ్రీహరి
వాపోవుచు నున్నదాన వరదా రారా
నీపాదభక్తి నాకును
యే పొద్దును గల్గ వరము నివ్వర రామా!
26. పీతాంబరధర గావర
సీతాపతి! భక్తజన సుసేవిత ధీరా
భూతలమున నిను దలచిన
పాతకములు తొలగిపోవుఁ బావన రామా!
27. వరశంఖు చక్రధారీ
పరమాత్మా పరమపురుష పావన నామా
నిరతము నీనామము నే
మరకే నుతియించు దాన మాధవ రామా!
28. జగదీశ్వర కరుణాకర
ఖగపతి వాహన ముకుంద కమలా నాధా
నిగమాగమ సంచారా
అగణితగుణ మాన్యుడవు మహాత్మారామా!
29. శ్రీకాన్తా హృద్నిలయా
పాకారి ప్రముఖవినుత వసుధాధీశా
లోకాతీత విహారా
నాకోర్కెలు దీర్చరార నరవర రామా!
30. వాసవ వందిత కేశవ
దాసజనావన ఖరారి తాపసపోషా
కౌసల్య గర్భరత్నమ
భూసుత హృదయాబ్జభృంగ పూజితరామా!
31. శరనిథివర గంభీరా
పరమదయాకర సురవర భావజ జనకా
నరహరి భక్తాభీష్టా!
పరమాత్మ గావరార భవహర రామా!
32. భక్తజనావన కేశవ
నక్తంచర వైరి వీర నరహరిరూపా
భక్తిగ నిను పూజించిన
ముక్తి పొందుదురుగాద మునివర రామా!
33. యోగీశ హృదయనిలయ
వాగీశామరసుపోష వందిత రూపా
భోగిశయన గోవిందా
వేగముగాఁ నన్నుగావు ప్రేమనురామా!
34. కిన్నర గణనుతచరణా
పన్నగపతి సంస్తుతాత్మ పంకజనేత్రా
అన్నులమిన్నలఁ బ్రోచిన
మన్నీడా గావుమయ్య మధురిపురామా!
35. లీలామానుష ధారీ
పాలకడలి మనికిరేడ వాసవవంద్యా
చాలగ నుతియించెద నిను
కాలహరణమేల నన్ను గావుమురామా!
36. గుడిగోపురంబులను నే
గడనకు గట్టించలేదు కౌస్తుభధామా!
భిడియము వీడి నీనామము
వడివడి నుతియించుదాన వసుధరరామా
37. అన్నపు సత్రంబుల నే
నెన్నడు గట్టించలేదు నృపకులవీరా!
వెన్నుడనీ నామావళి
పన్నుగ బుతియించుదాన భవహరరామా!
38. తిరుణాలలఁ సేవింపగ
పరుగిడలే దాత్మయందు బ్రస్తుతిచేతున్
సరసిజ నాభాయని నిన్
మరిమరిఁగొనియాడుచుందు మధురిపు రామా!
39. సారసనయన ముకుందా
కోరితి నీపాదసేవ కువలయధామా!
నేరములెంచకు శ్రీధర
సారెకు నిను వేడినాను సద్గుణరామా!
40. సుజనుల బ్రోచెడివాడా
అజరుద్రామరులనుతిని నందినరేడా
నిజముగ నిను నమ్మిన యా
గజరాజును గావలేద ఘనముగ రామా!
41. అక్షీన దివిజపాలన
పక్షిగమన సురనికాయ వందితరూపా
శిక్షింపవె దానవులను
రక్షిత సురబృందరార రఘుకులరామా!
42. బంగరు పుట్టము గట్టుక
శృంగారముగా నటించు సురుచిరదేహా
అంగదుఁగరుణించిన భవ
భంగా దయజూడరార వసుధనురామా!
43. పటుతరముగ నిను నమ్మిన
జటాయువును గావలేద సద్గుణమిత్రా
నటనలు సల్పెడి శౌరీ
కటకట బెట్టకుము కరుణ గావర రామా!
44. కామితఫలదా కేశవ
కోమల హృదయారవింద గురుతరతేజా
నీమముతో నినుదలతును
ప్రేమను జూడంగరార నృపకులరామా!
45. కనకాక్షుడు భూదేవిని
గొనిచన భూధార రూపకుడవై వేగన్
మునివరులు బొగడ వానిని
ఘనముగ వధియించి కీర్తిఁగంటివి రామా!
46. సారసనేత్రా శుభకర
శ్రీరమణీ హృదయనిలయ శ్రితజనపాలా
కారుణ్యకరమూర్తీ
పోరాటము మాని నన్ను బ్రోవవె రామా!
47. పరమకృపాకర జలధే
సురగణనుత చరణపద్మ శుభగుణశౌరీ
నిరుపమగుణ గణధీరా
కరమరుదుగ నమ్మియుంటిఁ గావుము రామా!
48. ఆగమ సంచారా! భవ
సాగరతరణా! సురగణ సంస్తుతధీరా
భోగిశయన గోవిందా!
రాగద్వేషాదిరహిత రవికులరామా!
49. కోటిమదనరూపా! నీ
సాటియెవరు లేరు లేరు సద్గుణజాలా!
హాటకవరసింహాసన
తాటక సంహారకర దశరథరామా!
50. దీనదయాళో రిపుహర
దానవసంహారధీర ధార్మికమూర్తీ
మౌనిజనహృదయ నిలయా
మానిత సుకుమారదేహ మాధవరామా!
51. నీరజనాభా! వరదా!
నారదముని సంస్తుతాత్మా నగధరశూరా
నారాయణ జగధీశ్వర
కారుణ్యామృతసువాక్య కామితరామా!
52. బృందారక గణసేవిత
మందరధరసుందరాంగ మంగళరూపా
వందిత మృదుపదపద్మ! ము
కుందా! నమ్మితినిగావు కోసలరామా!
53. దరహాసవదన శ్రీహరి
పరమకృపాకర శుభగుణ భక్తగణేశా
ధరణీధర సురపోషా
సరసీరుహనేత్ర రార సన్నుతరామా!
54. మందస్మితాశ్య మునివర
సుందర వదనారవింద సూర్యకులేశా
కందర్పజనక! కరుణా
నందజలధి దేవవినుత నరవర రామా!
55. దీనదయా పరమూర్తీ
వానరసేనా సమూహ వారిజనయనా
ఆనందామృత సాగర!
కానల జరియించు నేర్పుఁ గాంచిన రామా!
56. అసురేశ్వరు వరతనయుని
పసిపాపని గావలేద భక్తుడటంచున్
వసుధరశౌరీ నరవర
మసలకనను బ్రోవువేగ మగువనురామా!
57. కమలదళనేత్ర శ్రీధర
రమణీయాంచిత చరిత్ర రంజితగాత్రా
కమలాసనాది సురనుత
కమలాహృదయాబ్జ భృంగ గావర రామా!
58. శీలముచెడి సోదరసతిఁ
జాలిని విడికొనినయట్టి జాల్ముని వాలిన్
గూలిచి యినజుని బ్రోవవె!
కోలాహలమేల రార కోరితి రామా!
59. మునిసతి శాపము బాపిన
ఘనతర సుకుమార దేహ కామితఫలదా
కనకాంబధర శూరా
జననాయక నిన్నుఁబొగడఁ జాలను రామా!
60. గోవిందా! రిపుమర్ధన!
గోవర్ధన ధర ముకుంద గోపకవేషా
గోవులగాచిన వీరా
నావెరపును దీర్చరార నరవరరామా!
61. సరసిజనేత్రా వరదా
పరమాత్మా! సన్నుతాంగ పావనగాత్రా
సురగణసేవితమూర్తీ
పురహరనుత చరణభక్త పోషకరామా!
62. లెక్కకు మిన్నగు రాజులు
చక్కగ నిను జూచుచుండ చతురతమెరయన్
రక్కసిఁ జంపినవాడా
గ్రక్కున హరు విలు విరచిన ఘనుడవురామా!
63. హనుమంతుని రక్షించిన
ఘనవంతుడవైన ప్రభువ కామితవరదా
మునిగణ వందితరూపా
వినుతించెద గావరార వేగమె రామా!
64. ఇనసుతుడగు సుగ్రీవుని
వనమాలీ కావలేద వాసవ వంద్యా
సనకాది మునీంద్రస్తుత
ఘనకోమలదేహ రార కరుణను రామా!
65. వారిజనయనా! భవహర!
నీరద నిభగాత్రవరద నిర్మలతేజా
వీరాధివీర శుభకర
కోరితి నను గావరార కోమలరామా!
66. ఉదధినివాసా! శ్రీధర
విదితమృదు పదారవింద వేదోద్ధరణా
మది నమ్మియుంటిఁ గావర
సదయహృదయ సుందరాంగ సద్గుణరామా!
67. సీతావల్లభ శ్రీహరి
రాత్రించరవైరి! సుగుణ రంజితవేషా
భూతేశ! పరమపురుషా!
పాతక సంహరవిరాధ భంజనరామా!
68. రావణసంహార! వీరా
కావర మడగించలేద! కాకాసురునిన్
సేవిత సురగణనిలయా
బ్రోవుమనుచు వేడినాను పూజిత రామా!
69. దుష్టాసుర సంహర! త్రి
విష్టాధిపసేవి తరణ వీరసురేశా
కష్టంబులఁబడజాలను
సృష్టిపతీ నన్నుగావు శీఘ్రమెరామా!
70. మకరాంతక! మురవైరీ!
ప్రకటిత భక్తజనపోష భవహరశౌరీ
వికసితపంకజలోచన
సుకుమారాన్విత శరీర శుభకరరామా!
71. అక్షయశుభగుణ నిలయా
పక్షికులేశ్వరసువాహ భాసురదేహా
రక్షిత భక్తజనేశ్వర
తక్షణమున నన్ను గావు దశరథరామా!
72. ప్రేమా! రఘుకులసోమా!
రామా! జానకీమనోబ్జ రంజితధామా!
కోమల సద్గుణనామా!
భ్రామిక నినుదలతు నెపుడుఁ బార్ధివరామా!
73. రమణీయాంచిత నేత్రా
విమల పదాంబుజ సురేశ వేదవిచారా
సమరవిశారద శ్రీహరి
కమలహృదయేశ రార ఘనముగ రామా!
74. నిగమాగమ సువిచారా
జగదోద్ధారక మురారి శశిధరవినుతా
అగణిత మణిమయభూషా
నగధీరా నన్నుగావు నరవర రామా!
75. రాజిత శుభగుణభాషా
పూజితసురబృందపోష పూర్ణసువేషా
రాజకులాధిప భూషా
ప్రాజదువులు జదువనేర భవహర రామా!
76. సుకుమార గాత్ర మాధవ
అకలంకాన్వయ చరిత్ర హరివరశయనా
సకలైశ్వర్యనివాసా
ప్రకటిత భక్తజన హృదయ పంజర రామా!
77. సీతామానస నిలయా
ధాతాది ప్రముఖభాష తాపసపోషా
భూతలపతి నుతపదయుగ
శాతమణి స్ధగితమకుట జయరఘురామా!
78. రామా! రాక్షస భీమా!
భామామణి సీతహృదయ పంకజధామా!
కోమలశుభ గుణనామా!
వేమరు వేడితిని గావు వితరణరామా!
79. మునిజనవర సంరక్షా
కనకాంబర ధరసువక్ష కంజదళాక్షా
ఇనసుతు సైన్యసుపక్షా
కనికరమున గావరార కరివర రామా!
80. సరసీరుహాక్షి శబరిని
పరమకృపను బ్రోవలేద భందనభీమా!
దురితాంతక దేవేశా
గరుడగమన నన్నుగావు కరుణను రామా!
81. కోసల దేశా ధీశా
భాసుర మణిభూషణాంగ పరమానందా
వాసవవందితశౌరీ
వేసరితిఁ నుతించి గావు వేగమె రామా!
82. జగదా ధారక కేశవ
అగణిత సంసార దుఃఖ హంతకమూర్తీ
విగత భవపాశ బంధన
సుగుణజనావన మురారి సురనుర రామా!
83. హరిచందన లిప్తతనూ
సురగరుడోరగ సుసేవ్య సుందరరూపా
కరుణామృత సాగర! పుర
హరనుత హాటక సురత్నహారా! రామా!
84. అక్రూరవరద శ్రీధర
చక్రాయుధ ఖడ్గహస్త సారసనేత్రా
విక్రమ సురసంసేవిత
నక్రాంతక నన్నుగావు నగధర రామా!
85. సుగుణాకర సర్వేశా
అగణిత మోహాంధకార హంతకతేజా
నిగమాగమ సంవేద్యా
ఖగపతి సంరక్ష నన్ను గావుము రామా!
86. ఘటకర్ణాసురహంతక
నిటలనయన వినుతనామ నీరదగాత్రా
పటుతర మునిగణ రక్షా
దిటవుగఁ నుతియించుచుంతి దినమిటురామా!
87. కనకాంబరధర మాధవ
జనకునియాజ్ఞానుసార సర్వాధారా
ఘనమునిజన సంసేవిత
దనుజాంతక నన్నుగావు దశరథరామా!
88. పశుపతి సన్నుతకామా
దశరథవర పుత్రరత్న తారకనామా
విశద గుణోన్నతధామా
నిశాచరేశ్వర విరామ నిర్జితరామా!
89. సన్నుత సుజన నివేశా
పన్నగపతిశయన వరద పాపవినాశా
మన్నించుము జగదీశా
పన్నుగ నుతియించుదాన భక్తిని రామా!
90. సకల గుణాకరవీరా
వికసిత వదనారవింద విశ్వాధారా
అకుటిల సుజనవిచారా
ప్రకటముగా నన్నుగావు రఘుకులరామా
91. నారదమౌనింద్రస్తుత
నీరదనిభగాత్ర వరద నిత్యానందా
నీరజనేత్ర సురేంద్రా
వారధి బంధనకబంధ భంజనరామా!
92. మోక్షనివాసా శ్రీహరి
దాక్షిణ్యామృతమనోబ్జ తాపసవినుతా
రాక్షస సంహారవీరా
ఈక్షణమున నన్నుగావు మినకులరామా!
93. శ్రితజనపోషక మాధవ
సతతానంద పరిపూర్ణ సద్గుణజాలా
వితత యశోధర1 సుర సే
వితమోహనరూప వేద వేద్యుడరామా!
94. ఘనసుగుణాకర జలనిధి
వినతాసుతు వినుతనామ భేషజరహితా
వనచరపరిసోషక ని
న్ననవరతము నమ్మియుంటి నచ్యుతరామా!
95. ఉధధినివాసరమేశా
సదమల హృదయారవింద సాధుగణేశా
విదితామరగణపోషా
ముదముగఁ ధ్యానించుచుంటి మునివరరామా!
96. ఇనవంశోద్భవ కేశవ
వనమాలాంచిత సుగాత్ర వాసవ వినుతా
సనకస నందన వంద్యా
జనకజచిత్తాబ్జభ్రమర జయరఘురామా!
97. జయ రవికుల వరదీపక
జయ కరుణాహృదయనిలయ జయ పరమేశా
జయ సురవరనుత శ్రీధర
జయమంగళకర శుభాంగ జయరఘురామా!
98. అనుజత్రయ పరివేష్టిత
ఘనసారాగరుసుగంధ కౌస్తుభధామా
ఘనసామ్రాజ్య నివేశా
ధనపతి సంస్తుత సుధీర దశరథరామా!
99. ఆహా రఘుకుల తిలకా
ఓహో నినుబొగడనేర నూర్వీనాధా
ఊహా విశాషమనదగ
దాహాయివి యేమివింత లచ్యుతరామా!
100. సారసనేత్ర సురాపన
కోరికమీరంగఁ రార కువలయ నాధా
వీరాధి వీర! నే నీ
తీరునఁ శతకంబు నిడితిఁ దినకర రామా!
101. శ్రీభీమరాజ వంశ జ
శోభిత శ్రీసీతమాంబఁ సుస్థిరమతితో
శ్రీభద్రగిరీశునిపై
ప్రాభవకృతి దీనిఁగొనుము భవహర రామా!
సంపూర్ణము
No comments:
Post a Comment