కృష్ణ శతకము
నృసింహకవి
(కందపద్య శతకము)1. శ్రీరుక్మిణీశ కేశవ
నారదసంగీతలోల నగధరశౌరీ
ద్వారక నిలయ జనార్ధన
కారుణ్యముతోడ మమ్ముఁ గావుము కృష్ణా
2. నీవే తల్లియు తండ్రివి
నీవే నాతోడునీడ నీవే సఖుఁడౌ
నీవేగురుడవు దైవము
నీవే నాపతియు గతియు నిజముగ కృష్ణా
3. నారాయణ పరమేశ్వర
ధారాధర నీలదేహ దానవవైరీ
క్షీరాబ్ధిశయన యదుకుల
వీరా ననుగావు కరుణ వెలయఁగ కృష్ణా
4. హరియను రెండక్షరములు
హరియించును పాతకంబు లంబుజనాభా
హరి నీనామమహత్త్వము
హరి హరి పొగడంగ వశమె శ్రీకృష్ణా
5. క్రూరాత్ముఁ డజమీళుఁడు
నారాయణయనుచు నాత్మనందను బిలువన్
ఏరీతి నేలుకొంటివి
ఏరీ నీసాటివేల్పు లెందును కృష్ణా
6. చిలుకనొకరమణి ముద్దులు
చిలుకను శ్రీరామయనుచు శ్రీపతిపేరన్
బిలిచిన మోక్షము లియ్యఁగ
అలరఁగ మిముఁ దలచుజనులకరుదా కృష్ణా
7. అక్రూరవరద మాధవ
చక్రాయుధ ఖడ్గపాణి శార్జ్గిముకుందా
చక్రాదిదివిజసన్నుత
శుక్రార్చిత నన్ను కరుణజూడుము కృష్ణా
8. నందుని ముద్దులపట్టిని
మందరగిరిధరుని హరిని మాధవ విష్ణున్
సుందరరూపుని మునిగణ
వందితు మిముఁ దలతు భక్తవత్సల హరీ కృష్ణా
9. ఓకారుణ్యపయోనిధి
నాకాధారంబ వగుచు నయముగఁ బ్రోవన్
నాకేల యితరచింతలు
నాకాధిపవినుత లోకనాయక కృష్ణా
10. వేదంబులు గన నేరని
యాది పరబ్రహ్మమూర్తి యనఘ మురారీ
నాదిక్కుఁ జూచి గావుము
నీదిక్కే నమ్మినాను నిజముగఁ కృష్ణా
11. పదునాలుగు భువనంబులు
కుదురుగ నీకుక్షి నిల్పుకొని నేర్పరివై
విదితంబుగ బా దేవకి
యుదరములో నెట్టులొదిగియుంటివి కృష్ణా
12. అష్టమి రోహిణిప్రొద్దున
నష్టమగర్భమునఁ బుట్టి యాదేవకికిం
దుష్టుని గంసు వధింపవె
సృష్టిప్రతిపాదనంచుసేయగ కృష్ణా
13. అల్లజగన్నాధుకు రే
పల్లియు క్రీడార్థమయ్యెఁ బరమాత్మునకున్
గొల్లసతి యాయశోదయుఁ
దల్లియునై చన్ను గుడిపెఁ దనరగఁ కృష్ణా
14. అందెలు గజ్జెలు మ్రోయగఁ
జిందులు ద్రొక్కుచును వేడ్క చెలువారంగా
నందుని సతి యాగోపిక
ముందర నాడుదువు మిగుల మురియుచుఁ కృష్ణా
15. హరి చందనంబు మేనను
గర మొప్పెడు హస్తములను గంకణరవముల్
ఉరమున రత్నము మెఱయఁగఁ
బరగితి వౌనీవు బాలప్రాయము కృష్ణా
16. పాణీతలంబున వెన్నయు
వేణీమూలంబునందు వెలయఁగ బింఛం
బాణీముత్యము ముక్కున
జాణఁడవై దాల్తు శేషశాయివి కృష్ణా
17. మడుగుకుఁ జని కాళింగుని
పడగలపై భరతశాస్త్రపద్ధతివెలయం
గడు వేడుకతో నాడెడు
నడుగులు నేమదిని దాల్తు నచ్యుతకృష్ణా
18. బృందావనౌన బ్రహ్మా
నందార్భకమూర్తి వేణునాదము నీవుం
మందారమూలమున గో
విందా పూరింతువౌర వేడుక కృష్ణా
19. వారిజనేత్రలు యమునా
వారిని జలకంబులాడవచ్చిన నీవుం
జీరెలుమ్రుచ్చిలి యిస్తివి
నేరుపురా యిదియునీకు నీతియె కృష్ణా
20. దేవేంద్రుఁ డలుకతోడను
వావిరిగా రాళ్ళవాన వడిగురియింపన్
గోవర్ధనగిరియెత్తితి
గోవుల గోపకులఁ గాచుకొఱకై కృష్ణా
21. అండజవాహన విను బ్ర
హ్మాండంబుల బంతులట్లు యాడెడునీవున్
గొండలనెత్తితి వందురు
కొండికపనిగాక దొడ్డకొండా కృష్ణా
22. అంసాలంబితకుండల
కంసాంతకనీవు ద్వారకాపురిలోనన్
సంసారి రీతినుంటివి
సంసాదితవైరి సత్ప్రశంసిత కృష్ణా
23. పదియాఱువేలనూర్వురు
సుదతులు యెనమండ్రునీకు సొంపుగభార్యల్
విదితంబుగ బహురూపుల
బెదరక భోగింతువౌర వేడుక కృష్ణా
24. అంగన పనుపున ధోవతి
కొంగున నటుకులను ముడిచికొని వచ్చినయా
సంగడి విప్రునకిడితివి
రంగుగ సంపదలు లోకరక్షక కృష్ణా
25. హా వసుదేవకుమారక
కావుము నామానమనుచు గామినివేడన్
ఆవనజాక్షికి నిడితివి
శ్రీవర యక్షయమటంచుఁ జీరెలు కృష్ణా
26. శుభమగు పాంచజన్యము
నభ్రంకషపగిదిమ్రోవ నాహవభూమిన్
నభ్రము కాదనుజసుతా
గర్భంబులువగులఁజేయు ఘనుఁడా కృష్ణా
27. జయమును విజయునకీయవె
హయముల ములుగోలమోపి యదలించిమహా
రయమున రొప్పవె తేరును
భయమున రిపుసేనవిరిగి పాఱఁగ కృష్ణా
28. దుర్జనులగు నృపసంఘము
నిర్జింపఁగ వలసినీవు నిఖిలాధారా
దుర్జనులను సంహరింపను
నర్జునునకు సారధైతివి కృష్ణా
29. శక్రసుతుఁ గాచుకొఱకై
చక్రముఁజేపట్టి భీష్ముఁజంపగ జను నీ
విక్రమమేమని పొగడుదు
నక్రగ్రహ సర్వలోకనాయక కృష్ణా
30. దివిజేంద్ర సుతునిజంపియు
రవిసుతురక్షించినావు రఘురాముఁడవై
దివిజేంద్ర సుతునిగాచియు
రవిసుతుబరిమార్చి తౌర రణమున కృష్ణా
31. దుర్భరబాణమురాగా
గర్భములోనుండి యభవ కావుమటన్నన్
నిర్భరకృప రక్షించితి
యర్భకు నభిమన్యుసుతుని నచ్యుతకృష్ణా
32. గిరులందు మేరువౌదువు
సురలందును నింద్రుడౌదు చుక్కలలోనన్
బరమాత్మచంద్రుడౌదువు
నరులందును నృపతివౌదు నయముగ కృష్ణా
33. చుక్కల నెన్నగవచ్చును
గ్రక్కున భూరేణువులను గణుతింపనగున్
జొక్కపునీగుణజాలము
నక్కజమగు లెక్కపెట్ట నజునకు కృష్ణా
34. కుక్షిని నఖిలజగంబులు
నిక్షేపముజేసి ప్రళయవీరధినడుచున్
రక్షక వటపత్రముపై
దఖతబవళించునట్టిధన్యుడ కృష్ణా
35. విశ్వోట్పత్తికి బ్రహ్మవు
విశ్వమురక్షించందలఁచి విష్ణుఁడవనగా
విశ్వము జెరుపను హరుఁడవు
విశ్వాత్మక నీవెయగుచు వెలయఁగ కృష్ణా
36. అగణితవైభవ కేశవ
నగధర వనమాలి యాదినారాయణ యో
భగవంతుఁడ శ్రీమంతుఁడ
జగదీశ్వర శరణు శరణు శరణము కృష్ణా
37. మగమీనమవై జలనిధి
బగతుని సోమకునిఁజంపు పద్మభవునకున్
నిగములు దెచ్చియిచ్చితి
సుగుణాకర మేలు భక్తశుభకర కృష్ణా
38. అందఱు సురులును దనుజులు
పొందుగ క్షీరాబ్ధిఁ దరువ పొలుపుగ నీవున్
అందం బగు కూర్మంబై
మందరగిరి ఎత్తితౌర మాధవ కృష్ణా
39. ఆదివరాహము వయ్యును
నాదనుజు హిరణ్యనేత్రు హతు జేసితగన్
మోదమున సురలు పొగడఁగ
మేదిని వడి గొడుగు నెత్తిమెఱసితి కృష్ణా
40. కెరలి యరచేతఁ గంబము
నరుదుగ వేయుటయు వెడలి యసురేశ్వరునిన్
బురమునఁ జేరి వధించితి
నరహరిరూపావతార నగధర కృష్ణా
41. వడుగడవై మూడడుగుల
నడిగితివౌ భళిర భళిర యఖిలజగంబుల్
దొడిగితివి నీదు మేనను
గడుచిత్రము నీచరిత్రము ఘనుఁడవు కృష్ణా
42. ఇరువదొక్కమాటు నృపతుల
శిరములు ఖండించి తౌరచేఁ గొడ్డంటన్
ధరఁ గశ్యపునకు నిచ్చియు
బరఁగఁగ జమదగ్ని రామభద్రుఁడ కృష్ణా
43. దశకంఠుని బరిమార్చియు
గుశలముతో సీతదెచ్చికొనుచు నయోధ్యన్
విశద మగుకీర్తి నేలిన
దశరధరామావతార ధన్యుడ కృష్ణా
44. ఘనులగుధేనుకముష్టిక
దనుజుల జెండాడితౌర తగ భుజశక్తిన్
అనఘాత్మ రేవతీపతి
యనఁగా బలరామమూర్తి వెలసితి కృష్ణా
45. త్రిపురాది దైత్యసతులకు
నిపుణతతో వ్రతముఁ జెప్పినిలిపితి కీర్తుల్
కృపగలరాజువు భళిరే
కపటపు బుద్ధావతారఘనుఁడవు కృష్ణా
46. బలుపుగల తేజి నెక్కియు
నిలపై ధర్మంబు నిలుప హీనులఁ ద్రుంపన్
గలియుగము తుదకు వేడుక
కలికివిగా నున్నలోక కర్తవు కృష్ణా
47. వనజాక్ష భక్తవత్సల
ఘనులగు త్రైమూర్తులందుఁ గరుణానిధివై
విను నీసద్గుణజాలము
సనకాదిమునీంద్రు లెన్నఁజాలరు కృష్ణా
48. అపరాధసహస్త్రంబులు
నపరిమితములైనయఘము లనిశము నేనున్
గపటాత్ముఁడ నై చేసితి
చపలుని ననుఁగావు శేషశాయివి కృష్ణా
49. నరపశును మూఢచిత్తుఁడ
దురితారంభుఁడను మిగులదోషకుఁడనునీ
గుఱుఁ తెఱుఁగ నెంతవాఁడను
హరి నీవే ప్రాపుదాపువౌదువు కృష్ణా
50. పరనారీముఖపద్మము
గురుతుగఁగుచకుంభములను గొప్పునునడుమున్
అరయఁగ గనిమోహింతురు
నిరతము నినుఁ భక్తిఁ గొల్వనేరరు కృష్ణా
51. పంచేంద్రియమార్గంబులు
కొంచెపుబుద్ధిని జరించి కొన్నిదినంబుల్
యించుక సజ్జనసంగతి
నెంచుచు మిమ్మెఱిఁగినాఁడ నిప్పుడు కృష్ణా
52. కష్టు ననాచారుని గడు
దుష్టచరిత్రుఁడను చ్ల సుర్భుద్ధిని నే
నిష్టములఁ గొల్వనేరను
కష్టుని నను గావు కావు కరుణను కృష్ణా
53. కుంభీంద్రవరద కేశవ
జంభాసురవైరి దివిజసన్నుత చరితా
యంభోజనేత్రజలనిధి
గంభీరుఁడు నన్నుఁగావు కరుణను కృష్ణా
54. దిక్కెవ్వరు ప్రహ్లాదుకు
దిక్కెవ్వరు పాండవులకు దీనులకెపుడున్
దిక్కెవ్వరయ్యహల్యకు
దిక్కెవ్వరు నీవునాకు దిక్కగు కృష్ణా
55. హరి నీవె దిక్కునాకును
సిరితో నేతెంచి మకరి శిక్షించి దయం
బరమేష్టి సురలు వొగడఁగఁ
గరి గాచినరీతి నన్నుఁగావుము కృష్ణా
56. పురుషోత్తమలక్ష్మీపతి
సరసిజగర్భాది మౌనిసన్నుత చరితా
మురభంజన సురరంజన
వరదుఁడ వగు నాకు భక్తవత్సల కృష్ణా
57. క్రతువులు దీర్ఘాగమములు
వ్రతములు దానములు సేయవలెనా లక్ష్మీ
పతి మిముఁ దలఁచినవారికి
నతులితపుణ్యములు గలుగు టరుదా కృష్ణా
58. స్థంబమున వెలసి దానవ
డింభకు రక్షించినట్టి ఠీవిని వెలయన్
అంభోజనేత్రజలనిధి
గంభీరుఁడ నన్నుఁ గావు కరుణను కృష్ణా
59. శతకోటిభానుతేజుఁడ
యతులితసద్గుణగణాఢ్య యంబుజనాభా
రతినాధజనక లక్ష్మీ
పతిహిత నను గావు భక్తవత్సల కృష్ణా
60. మందుఁడ నే దురితాత్ముడ
నిందల కొడిగట్టినట్టి నీచునినన్నున్
సందేహింపక కావుము
నందునివరపుత్ర నిన్నునమ్మితి కృష్ణా
61. గజరాజవరద కేశవ
త్రిజగత్కల్యాణమూర్తి దేవమురారి
భుజగేంద్రశయన మాధవ
విజయార్చిత నన్నుఁ గావు వేగమ కృష్ణా
62. దుర్మతినై బలుకష్టపు
కర్మంబులు జేసినట్టికష్టుని నన్నున్
నిర్మలుఁ జేయఁగవలె ని
ష్కర్ముడ వని నమ్మినాఁడ గదరా కృష్ణా
63. దుర్వారచ్క్రధర హరి
శర్వాణీప్రణుతవినుత జగదాధారా
నిర్వాణనాధ మాధవ
సర్వాత్మక నన్నుఁగావు సరసుడ కృష్ణా
64. సుత్రామనుతజనార్ధన
సత్రాజిత్తనయనాధ సౌందర్యకళా
చిత్రావతార దేవకి
పుత్రానను గావునీకుఁ బుణ్యము కృష్ణా
65. బలమెవ్వఁడు కరిబ్రోవను
బల మెవ్వడు పాండుసుతులభార్యను గావన్
బలమెవ్వఁడు సుగ్రీవుకు
బలమెవ్వఁడు నీకు నాకు బలమౌ కృష్ణా
66. పరుసము సోకిన నినుమును
వరుసతొ బంగారమైన వడువున జిహ్వన్
హరి నీనామము సోఁకిన
సురవందిత నేను నట్లు సులభుఁడ కృష్ణా
67. ఒకసారి నీదునామము
ప్రకటముగాఁదలఁచువారి పాపములెల్లన్
వికలములై తొలఁగుటకును
సకలాత్మయజామీళుండు సాక్షియె కృష్ణా
68. హరి సర్వంబునఁగలఁదని
గరిమనుదైత్యజుఁడు పలుకఁగంబములోనన్
ఇర వొంది వెడలి చీరవె
శరణన్న విభీషణుండు సాక్షియె కృష్ణా
69. భద్రార్చితనిజచరణ సు
భద్రాగ్రజ సర్వలోకపాలన హరి శ్రీ
భద్రానుజకేశవ వర
భద్రాధిప నన్నుఁబ్రోవు భయహర కృష్ణా
70. ఎటువలెఁ గరిమొర వింటివి
యెటువలెఁ బ్రహ్లాదు కభయమిచ్చితి కరుణన్
అటువలె నను రక్షింపుము
కటకట నిను నమ్మినాడగావుము కృష్ణా
71. తటవట లేటికిఁ జేసెదు
కటకట పరమాత్మ దుష్టఘంటాకర్ణున్
ఎటువలె బుణ్యునిఁ జేసితి
వటువలె రక్షింపుమయ్య యచ్యుతకృష్ణా
72. తురగాధ్వరంబు జేసిన
పురుషులకును వేఱె పదవి పట్టుట యేమో
హరిమిముఁ దలచిన వారికి
నరుదాకైవల్యపదవి యచ్యుతకృష్ణా
73. ఓభవబంధవిమోచన
యోభరతాగ్రజ మురారి యోరఘురామా
యోభక్త కామధేనువ
యోభయహర నన్నుఁగావు మోహరికృష్ణా
74. ఓతండ్రీ కనకకశ్యపు
ఘతకువై యతనిసుతుని గరుణను గాచెన్
బ్రీతిసురకోటిఁబొగడఁగ
నాతండ్రీ నిన్ను నేను నమ్మితి కృష్ణా
75. ఓపుందరీకలోచన
ఓపురుషోత్తమ ముకుంద యోగోవిందా
యోపురసంహారమిత్రుఁడ
యోపుణ్యుఁడనన్ను బ్రోవుమోహరికృష్ణా
76. ఏవిభుఁడు ఘోరరణమున
రావణు వధియించి లంకంరాజుగ నిలిపెన్
దీవించి యావిభీషణు
నావిభునేఁ దలతు నేను అచ్యుతకృష్ణా
77. గ్రహభయదోషముఁ బొందదు
బహుపీడలు చేర వెఱచుఁబాయును నఘముల్
ఇహపరఫలదాయక విను
తహతహ లెక్కడివి నిన్నుఁదలఁచిన కృష్ణా
78. గంగ మొదలైననదులను
మంగళముగఁ జేయునట్టి మజ్జనములకున్
సంగతి గలిగినఫలములు
రంగుగ మిముఁదలఁచుసాటిరావుర కృష్ణా
79. ఆదండకావనంబునఁ
గోదండముఁగాచినట్టి కోమలమూర్తిన్
నాదండ దాపు గమ్మీ
వేదండముఁ గాచినట్టి వేల్పుఁడ కృష్ణా
80. చూపుము నీరూపంబును
బాపుముదుష్కృతములెల్లఁబంకజనాభా
ప్రాపవు నాకును దయతో
శ్రీపతి నిను నమ్మినాఁడ సిద్ధము కృష్ణా
81. నీనామము భవహరణము
నీనామము సర్వసౌఖ్యనివహకరంబున్
నీనామ మమృతపూర్ణము
నీనామము నేఁ దలంతు నిత్యుఁడ కృష్ణా
82. పరులను నడిగిన జనులకు
గుఱచ సుమీ యగ్నటంచు గుఱుతుగనీవున్
గుఱచవునై బలిచే మును
ధరఁ పాదత్రయముం గొంటి దద్దయు కృష్ణా
83. పాలును వెన్నయు మ్రుచ్చిలి
ఱోలను మీతల్లి గట్ట రోషముతోడన్
లీలావినోది వైతివి
బాలుఁడవా బ్రహ్మకన్నఁ బ్రభుఁడవు కృష్ణా
84. ఏఘడియను నీనామము
లఘుమతితోఁ దలచఁగ్లనె లక్ష్మీరమణా
అఘములు వాపుదయతో
రఘురాముఁడ వైన లోకరక్షక కృష్ణా
85. అప్పాయిత్తువు దయతో
నప్పాలను నతిరసంబు లనుభవశాలిన్
అప్పాననుఁ గనుఁగొనవే
యప్పాననుఁబ్రోవు వెంకటప్పా కృష్ణా
86. కొంచపువాఁడని మదిలో
నుంచకుమీ వాసుదేవ గోవింద హరీ
యంచితముగ నీకరుణకుఁ
గొంచము నధికంబు గలదె కొంతయుఁ కృష్ణా
87. వావిరి నీభక్తులకున్
గావరమున నెగ్గుసేయు గర్వాంధులకున్
దేవ వధించుట వింటిని
నీవల్లను భవ్యమయ్యె నిజముగ కృష్ణా
88. అయ్యాపంచేంద్రియముల
ఉయ్యాలల నూగినట్టులూగితి నేనున్
అయ్యాజ్ఞఁగదల నేయను
కుయ్యాలింపుము మహాత్మ గుఱుతుగ కృష్ణా
89. కంటికి రెప్పవిధంబున
బంటుగదా యనుచునన్నుఁ బాయక యెపుడుం
గంటుండ వెరవనేలా
కంటక మగుపాటములను గడచితి కృష్ణా
90. యమునకు నిఁక నేవెరువను
కమలాక్ష జగన్నివాస కామితఫలదా
విమల మగునీద్నామము
నమరఁగ దలచెదను నేను నమరగ కృష్ణా
91. దండమయా విశ్వంభర
దండమయా పుండరీకదళనేరహరీ
దండమయా కరుణానిధి
దండమయా నీకునిపుడు దండము కృష్ణా
92. నారాయణ లక్ష్మీపతి
నారాయణ వాసుదేవ నందకుమారా
నారాయణ నిను నమ్మితి
నారాయణ నన్నుఁ బ్రోవు నగధర కృష్ణా
93. తిరుమణి దురితవిదూరము
తిరుమణి సౌభాగ్యకరము త్రిజగములందున్
తిరుమణి పెట్టినమనుజుఁడు
పరమపవిత్రుండు భాగ్యవంతుడు కృష్ణా
94. శ్రీలక్ష్మీనారాయణ
వాలాయము నిన్నుదలఁతు వంద్యచరిత్రా
ఏలుము నను నీబంటుగ
జాలా నిను నమ్మినాను సరసుఁడ కృష్ణా
95. శ్రీధర మాధవ యచ్యుత
భూధర పురుహూతవినుత పురుషోత్తమ నీ
పాదయుగళంబు నెప్పుడు
మోదముతో నమ్మినాడ ముద్ధుల కృష్ణా
96. శిరమున రత్నకిరీటము
కరమున నవ శంఖచక్ర ఘనభూషణముల్
ఉరమున వజ్రపుపతకము
సిరినాయక యమరవినుత శ్రీహరికృష్ణా
97. అందెలఁబాదములందును
సుందరముగ నిల్పినావు సొంపమరంగా
మందరధర మునిసన్నుత
నందుని వరపుత్రనిన్ను నమ్మితి కృష్ణా
98. కందర్ప కోటిసుందర
మందరధర భానుతేజ మంజులదేహా
సుందరవిగ్రహ మునిగణ
వందితమిముఁదలఁతుభక్తవత్సల కృష్ణా
99. గోపాల దొంగ మురహర
పాపాలను బాఱదోలు ప్రభుఁడవునీవే
గోపాలమూర్తి దయతో
నాపాలిటఁ గలిగిబ్రోవు నమ్మితి కృష్ణా
100. అనుదినము కృష్ణశతకము
వినినఁబఠించినను ముక్తివేడుకగలుగున్
ధనధాన్యము గోగణములు
తనయులు నభివృద్ధిబొందు దద్దయు కృష్ణా
101. భారద్వాజ సగోత్రుఁడ
గౌరవమున గంగమాంబ కరుణాసుతుడన్
పేరు నృసింహుయుఁడన్
శ్రీరమాయుత నన్నుగావు సృష్టివికృష్ణా
సంపూర్ణము
No comments:
Post a Comment