Saturday, August 31, 2013

శ్రీరామ శతకము - శ్రీమతి కల్లూరి విశాలాక్షమ్మ

శ్రీరామ శతకము
                                         శ్రీమతి కల్లూరి విశాలాక్షమ్మ (1948)

1. కం. శ్రీజానకీమనోహర
రాజేంద్రవిరాజమాన రాజబిడౌజా
రాజితకీర్తివిశాల
రాజీవదళాయతాక్ష రాఘవరామా

2. కం వైదేహీహృదయేశ్వర
యాదిత్యసమప్రకాశ యఖిలాధారా
వేదాంతవేద్య నీశుభ
పాదాబ్జము లాశ్రయింతుఁ బ్రభు! శ్రీరామా

3. కం. ఓకారుణ్యపయోనిధి
నీకంకిత మాచరించి నే నిడితిఁ బ్రభూ
యీకందపద్యశతకముఁ
గైకొని మమ్మేలుమయ్య కరుణను రామా

4. కం. కౌసల్యాప్రియనందన
భాసురసుగుణాలవాల పద్మదళాక్షా
శ్రీసీతాహృదయేశ్వర
కోసలపురనాధ దీనిఁ గొను శ్రీరామా

5. కం. కందర్పకోటిసుందర
యిందీవరనీలగాత్ర యినసమతేజా
వందనము లొనర్చెద నా
నందమ్మున నన్నుఁ బ్రోవు నమ్మితి రామా

6. కం. శ్రీవిఘ్నరాజు మదిలో
సేవించియు శారదాంబ స్ఠిరమతితోడన్
భావించి యిష్టదేవుల
భావంబునఁ బ్రస్తుతించి వ్రాసితి రామా

7. కం. సురలెల్ల నిన్ను వేఁడిన
ధరణిన్ దశరథనరేంద్రతనయుఁ డవయ్యున్
బరమాద్భుతము లొనర్చిన
పరమేశుని నిన్నుఁ బొగడ వశమే రామా

8. కం. అనుజులతోడను దశరథ
జనవిభుసుతుఁడై జనించి జనులు వొగడు స
ద్గుణరత్నాభరణుని నిన్
మనమందున సన్నుతింతు మానక రామా

9. కం. చిరుతగుప్రాయమునను సో
దరయుతుఁడగునట్టి నీవు తలిదంద్రులకున్
మురిపెము ముద్దులఁ జూపుచుఁ
బరమామోదంబుఁ గూర్చుస్వామివి రామా

10. కం. ఇలనెల్ల వేదశాస్త్రము
లలరంగా నభ్యసించి యనుజాత్ములతో
విలసిలు నిను నుతించెద
జలజాయతచారునేత్ర జానకిరామా

11. కం. కుశికాత్మజుతో నడవికి
దశరథు పన్పునను బోయి తాటక యనుర
క్కసినిం దునుమాడిన శ్రీ
దశరధరాజేంద్రపుత్ర దయఁగను రామా

12. కం. గౌతమపత్ని కహల్యకుఁ
బాతకమును బో నడంచి పాషాణంబున్
నాతిగా నొనరించిన
సీతాధిప నీదుసేవఁ జేయుదు రామా

13. కం. ముని కౌశికు యాగంబును
ఘనముగ రక్షింపనెంచి కడుదుష్టాత్ముల్
దనుజుల మారీచాదుల
దునుమాడిన వాఁడ వీవు దురమున రామా

14.కం. ఆనందించి మునీంద్రుఁడు
నానాశశ్త్రాస్త్రములను నలినోదర నీ
కానాఁ డొసంగె విద్యలఁ
దా నెన్నో మంత్రములను దశరథరామా

15. కం. జనకధరానధుఁడు తా
ఘనయాగము నొండొనర్చు కాలములోనన్
ముని నినుఁ గొంపోవుఁడు నా
జనకుడు మన్నించె నిన్ను జనపతి రామా

16. కం. అవలీల శివునివిల్లున్
దివిజులు వినుతింప విఱిచితివి నీ వపు డ
య్యవనీసుతఁ బెండ్లాడిన
యనీశ్వర నిను నితింప నలవియె రామా

17. కం. జానకిసమేతుఁ డయ్యును
నానందముతో నయోధ్యయం దుండిననిన్
మానవనాథాగ్రణి నే
మానసమున నెంతుఁ బ్రోవుమా శ్రీరామా

18. కం. కైకకు వరము లొసంగిన
భూకాంతునియాజ్ఞం బొంది భూమిజ ననుజున్
గైకొని వనుల కరుఁగుసు
శ్లోకుని నినుఁగొల్తు లోకసుందర రామా

19. కం. భరతుఁడు రాజ్యమునకు నిన్
నరుదెమ్మని వేఁడ నీవ యాతనిమాటన్
నిరశించి పురికిఁ బోవక
వరపాదుక లిచ్చి యనుజుఁ బంపితి రామా

20. కం. జాయానుజయుక్తుఁడ వై
పాయక సత్యవ్రతంబు పదునాల్గేడుల్
కాయక్లేశము లోర్చుచుఁ
జేయుదు వనవాస మంటి శ్రీరఘురామా

21. కం. సీతాసౌమిత్రులతోఁ
బ్రీతిని నత్ర్యాశ్రమంబు వేంచేసిననీ
ఖ్యాతినిఁ బొగడె మునీంద్రుం
డతనిసతి కాన్కలిచ్చె నతివకు రామా

22. కం. అలదండకావనములో
ఖలుఁ డైనవిరాధుఁ జంపి కడుదుర్మతి యౌ
నలశూర్పణఖకుఁ గినుకన్
గలిగించితి పరిభవమ్ము కదె శ్రీరామా

23. కం, ఖరదూషణాదుల్ లసురులు
దురమునఁ బదునాల్గువేలఁ దున్మాడితివో
ధరణీశ నీప్రభావము
తరమగునే వినుతిఁజేయ దశరథరామా

24. కం. పంచవటీతీరమున ర
చించితి వొక పర్ణశాల సీతాసతితో
నెంచఁగ లక్ష్మణుతోడ వ
సించితి వచ్చోట నీవు స్ఠిరముగ రామా

25. కం. జానకిసుందరరూపము
దానవనాధుండు వినియు దశకంథరుఁ డా
జానకిని నపహరింపఁగ
మానసమునఁ దలఁచె దుష్టమతియై రామా

26. కం. తనపూర్వమంత్రి మారీ
చునిఁ గని రావణుఁడు పల్కె క్షోణిజఁ దెత్తున్
జనుదెమ్ము సహాయం బన
ననుమానించియును వచ్చె నాతఁడు రామా

27. కం. నీ మహిమ మెఱుగుఁ గావున
దా మోక్షము నొందఁ గోరి తగ నీచేతన్
నామారీచుఁడు వచ్చె మ
హామాయామృగము నయ్యు నప్పుడె రామా

28. కం. కనకపుఁ గురంగమై యా
జనకజఁ గనుఁగొనఁగఁ బర్ణశాలకు ముందా
దనుజుఁడు నాట్య మొనర్చిన
జనకజ తెమ్మనియె దాని జనపతి రామా

29. కం. వైదేహి కోరుకోరిక
మోదంబునఁ దీర్పనెంచి భూమిజ నీకున్
నేఁ దెచ్చి యిత్తు నని నీ
సోదరు నట నిల్పి పోతి సుందర రామా

30. కం. కనకమృగంబును బట్టఁగ
ధనువుం గైకొనియుఁ బోయి దానవమాయన్
గని తక్షణంబులో నా
కనకమృగమునుఁ గూల్చితీవు కదె రఘురామా

31. కం. ఆమారీచాసురుఁడున్
స్వామీ నీస్వరముతోడఁ జయ్యన నఱవన్
భూమిజ విని నీదరికిన్
సౌమిత్రినిఁ బంపెఁ గాదె జనపతిరామా

32. కం. సమయంబును గనిపట్టియు
యమివేషంబును ధరించి యసురేశ్వరుఁ డా
క్షమసుత దరికింజని భి
క్షము వేయు మటంచుఁ గోరె ఖలుఁడై రామా

33. కం. అతఁడు నిక్కపుముని యని
సీతాబ్జానన తలంచి శీఘ్రమె భిక్షం
బాతని కిడు నంతట నా
ఘాతుకుఁడు నిజంబు రూపుఁగైకొనె రామా

34. కం. తనరూపము గాంచియు మూ
ర్చను మునిఁగినధరణిసుతను రథమున నిడియున్
గొనిపోయె గగనవీధిని
దనలంకాపురమునకును దనుజుడు రామా

35. కం. ఆలంకాపురమందున్
బాలామణి నొక్కశింశుపాతరువుకడన్
ఆలోన నుంచి దనుజుఁడు
వేలకువే ల్కావలుంచె వెలందుల రామా

36. కం. అంతట నరణ్యమున నా
కాంతను విడనాడి రాగఁ గని లక్షణు నీ
వెంతేని మందలించియు
నింతి నరయఁ బర్ణశాల కేగితి రామా

37. కం. జనకాత్మజాత నెవ్వఁడొ
దనుజుఁ డపహరించె ననియుఁ దలఁచియు నీ వా
యనుజినితో దక్షిణదిశ
జనియుంటివి దైన్యమునను జానకిరామా

38. కం. ఆమార్గమున జటాయువు
భూమిజకై దనుజుతోడఁ బోరినవానిన్
భూమిఁ బడియున్నవానినిఁ
బ్రేముడిఁ గన్గొంటి వీవ శ్రీరఘురామా

39. కం. ఆతనివలనను నీవా
సీతావృత్తాంత మెల్ల శీఘ్రమ విని నీ
వాతనికి మోక్ష మొసఁగియు
నీతమ్మునిఁ గూడిపోతి నృపవర రామా

40. కం. అలశబరి పరమభక్తిని
ఫలముల నర్పించె నీకు వగఁ దమ్మునితో
ఫలముల భుజించి యామెకుఁ
గలిగించితి వీవు ముక్తిఁ గదె శ్రీరామా

41. కం. సాలము లేడుం గూల్చియుఁ
బోలఁగ దుందుభిశరీరమును దూరముగాఁ
గాలం జిమ్మి యొకమ్మున
వాలిం బడఁగూల్చితీవు పావన రామా

42. కం. ఇనసుతునితోడ సఖ్యముఁ
బొనరించి వాలిని వధియించియును దద్రాజ్యం
బినతనయునకు నొసంగియు
ననువుగఁబాలించితీవ యనఘా రామా

43. కం. హనుమానునిచే సీతా
వనజానన కానవాలుఁ బంపియు నీ వా
జనకాత్మజఁ దెచ్చుటకై
యినజుసహాయంబు గోరి తెంతయు రామా

44. కం. భూమిజ యశోకవనమున
సేమంబున నున్నవార్తఁ జెచ్చెర వినియున్
సౌమిత్రిసమేతుఁడవై
యామోదించితివి కువలయాధిప రామా

45. కం. బలగం బెల్లను గూడుక
జలజాప్తతనూజతోడ శ్వసనజతోడన్
అలఘుడు నీ తమ్మునితో
లలిని బయల్వెడలి తీవు లంకకు రామా

46. కం. ఆవారథిమధ్యంబున
భూవరసేతువునొకండు పొల్పెనలారన్
వేవేగమ నిర్మించితి
దేవా నీమహిమ నాకుఁ దెలియునె రామా

47. కం. శరణుం గోరినవానిని
దురితాత్ముం డగ్రజన్ము దోషాచరునిన్
నిరసించి వచ్చునతనిన్
శర ణిచ్చి విభీషణాఖ్యు సాకవె రామా

48. కం. వానరబలములతోడన్
జానకికై లంకకేగి సంగరమందున్
దానవవీరులఁ దున్మిన
మానవపతి నినుఁ దలంతు మదిలో రామా

49. కం. లంకాపత్తనమున ని
శ్శంకన్ నీసైన్య మల నిశాచరబలమున్
గొంకకఁ చెండాడెడు నే
వంకన్ జయమయ్యె నీకుఁ బ్రభువర రామా

50. కం. ఆహవరంగములో నీ
వాహనుమత్స్కంధ మెక్కి యసురాగ్రణులన్
బాహాబలమున దున్మిన
శ్రీహరిదివ్యావతార సీతారామా

51. కం. బలవంతుఁ డైనవానిని
బలుగాకినిఁ గుంభకర్ణుఁ బవరములో నీ
విలఁ గూల్చి వైచినాఁడవు
జలజోదర నిన్నుఁ బొగడ శక్యమె రామా

52. కం. మాయావి యైనవాని న
మేయబలుం డైనవాని మిగుల దురాత్మున్
నాయింద్రజిత్తు ననిలో
నీయనుజుఁడు సంహరించె నృపవర రామా

53. కం. దశకంధరుఁ డపు డెంతయుఁ
బ్రశస్త మగు నరద మెక్కి ప్రభునీపైనన్
విశిఖంబుల వైవఁగ నా
దశముఖుతోఁ బోరి తీవ దశరథ రామా

54. కం. ధరణిని నిల్చినరఘుభూ
వర నీవును రధియు డైన పంక్తిముఖుండున్
దురమొనరింపఁగఁ గాంచియు
సురపతి తే రంపె నీకు సుందర రామా

55. కం. మాతలిచేతను గడు సం
ప్రీతినిఁ బంపించినట్టి విమలరధంబున్
క్ష్మాతలపతి వపు డెక్కియు
నాతఱి సల్పితివి నీవ యాలము రామా

56. కం. దేవతలెల్లరు నీ వా
రావణుతోఁ బోరు టంబరమున నిలిచియున్
భూవర చేచుచు నిన్నున్
దీవించుచు నుండిరపుడు తెలియగ రామా

57. కం. ఆదిత్యహృదయమంత్రం
బాదరమున నాయగస్త్యుం డపుడు తెలుప నీ
వాదిత్యుని సేవించియు
నాదేవుననుగ్రహం నందితి రామా

58. కం. తనవంశభూషణుఁడ వని
మనమున హర్షించి యంశుమంతుఁడు నీకున్
దననిజదర్శన మొసఁగియు
దనుజేంద్రుని గెల్తు వనియె దశరథ రామా

59. కం. సూర్యానుగ్రహ మొందిన
సూర్యకులాభరణుఁడీవు శూరాగ్రణివై
ధైర్యోత్సాహం బలరఁగ
శౌర్యంబున సంగరమ్ము సల్పితి రామా

60. కం. బ్రహ్మాస్త్రము మంత్రించియు
బ్రహ్మకులజుఁ డైన పంక్తివదనునిపైనన్
బ్రహ్మాదిదివిజ సన్నుత
బ్రహ్మాండం బలర నివు వైచితి రామా

61. కం. నీయస్త్రమహిమవలనన్
మాయావి దశాననుండు మహిపైఁగూలన్
శ్రీయుతుఁ డగునీ కెల్లరుఁ
జేయుదు రభివాద మపుడు సీతారామా

62. కం. సురలెల్ల సంతసించియు
దురితాత్మునిఁ బంక్తిముఖునిఁ దున్మిన నీపై
గురిసిరి పూవులవానను
జరితార్థుఁడ వైననీప్రశంసయె రామా

63. కం. అనిమొన విజయుఁడ వగునిన్
గబుఁగొన నేతెంచి దేవగణ మెల్లను వం
దనముల నొనర్చి స్తోత్రం
బునొనర్చిరి భక్తలోకపూజ్యుఁడ రామా

64. కం. మనుజావతారమై నీ
వనిమిషకార్యంబొనర్ప నవనీస్థలిలో
జనపతిదశరథునింటను
జనియించితి రాముఁ డనఁగ శౌరివి రామా

65. కం. నీవు విభీషణు నప్పుడు
రావణు రాజ్యంబునందు రాజేంద్రునిఁగా
నీ వభిషేకించితివో
దేవా నీదగుప్రతిజ్ఞఁ దీరఁగ రామా

66. కం. అప్పుడు విజయము సీతకుఁ
జెప్పుటకై యాంజనేయుఁ జేరియు నటకున్
జప్పున నీ వంపించిన
నప్పావనగాత్రి హర్షమందెను రామా

67. కం. బవరమున గెలుచునిన్నా
యవనిజ కనుగోఁ దలచి యాజ్ఞను వేడన్
బవమానతనయుఁ డంతట
నవనిజకోరికను దెల్ప నప్పుడె రామా

68. కం. అనుమానించియు నీవున్
మనమందునఁ జింతఁ బొంది మైధిలిఁగొని తె
మ్మని యవ్విభీషణున కా
జ్ఞ నొసంగితి వంతలోన జానకిరామా

69. కం. పరమపతివ్రత యగునా
ధరణీనందనను దెచ్చి దనుజేంద్రుఁడు తాఁ
ద్వరితమే నీకర్పించెను
బరమామోదమున నపుడు ప్రభు శ్రీరామా

70. కం. ఆసమయంబున నీ వా
క్ష్మాసుతఁ గోపమునఁ గాంచి మైధిలి నీపై
నాసను నే విడనాడితి
నో సఖీ నినుఁ బాసి తంటి వో రఘురామా

71. కం. పరకాంతాసక్తుండగు
దురితుఁడు రావణునియింటఁ దోయలి నీవున్
జిరకాలము వసియించితి
చెరుపడె నీశీలమంటి శ్రీరఘురామా

72. కం. నీపలుకులు శ్రవణములకు
భూపుత్రికి ములుకు లయ్యు మూర్చ మునిఁగియున్
క్ష్మాపైనను బడి కొంతకు
నాపావనగాత్రి యిట్టులనె శ్రీరామా

73. కం. నీనామస్మరణముతో
మేనం బ్రాణముల నిల్పి మిహిరకులేంద్రా
నే నసురుఁ గోరుదునె యని
జానకి వచియించె నీకు జగదభిరామా

74. కం. అనల ప్రవేశమొనరిచి
మనమున నున్నట్టిశంక మాన్పెద నని యా
జనకజ నీకును మ్రొక్కియు
ఘనవహ్నిం జొచ్చె నపుడుకనుగొన రామా

75. కం. పావని యగుభూనందన
పావకునిం జొచ్చినంతఁ బరిశుద్ధుండై
పావకుఁడు తెచ్చి సీతా
దేవిని నీకొసఁగె దేవ దేవుడ రామా

76. కం. పాతివ్రత్యంబునఁ బ్ర
ఖ్యాతిం గైకొన్న మహిజ కామిని యగునే
భూతలనథా యని సం
ప్రీతిని వచియించె వహ్ని వేగమ రామా

77. కం. నీతండ్రి దశరథుండును
భూతలమున కరుగుదెంచి పుత్రవరేణ్యా
సీతను గైకొను మనియును
నీతో వచియించెఁ గాదె నృపవర రామా

78. కం. పంకరుహసంభవుండును
శంకరుఁడుబు సర్వసురలు చనుదెంచియు నీ
శంకను నశింపఁ జేసియుఁ
బంకజముఖి నేలు మనియుఁ బల్కిరి రామా

79. కం. జానకిశీల మెఱింగియు
మానవవర యిట్లొనర్చి మహియం దెంతో
జానకికిఁ గీర్తి గూర్చితి
మానితయశుఁడైననీవు మాప్రభు రామా

80. కం. సీతాసతి నూరార్చియుఁ
బ్రీతిని మన్నించి నీవు ప్రియసతి నే నీ
పాతివ్రత్య మెఱింగియె
యీతీఱున జేతునంటి వెంతయు రామా

81. కం. భూమిజను స్వీకరించియు
సౌమిత్రీసహితుం డీవు సమరవిజయుఁడై
యామోద మొందుచుంటివి
కామితమందార నీవు ఘనుడవు రామా

82. కం. అంతటఁ బుష్పకయానము
సంతసమునఁ దెచ్చి యానిశాచరుఁ డొసఁగన్
గాంతానుజులం గూడుక
సంతసమున నెక్కితీవు స్వామివి రామా

83. కం. దనుజులు కపులుం గొల్వఁగ
ననుజునితో సీతతోడ నాయానమునన్
దినకరునిఁ బోలెఁ వెల్గుచు
జనియుంటి వయోధ్య కీవు జానకిరామా

84. కం. సాకేతపురికి జన నీ
వాకౌసల్యాది మాతలందఱఁ గని నీ
రాకం గోరెడుఁదమ్ములఁ
బ్రాకటముగఁ గంచి తీవ రాఘవరామా

85. కం. ఇనవంశాబ్ధి హిమాంశునిఁ
జనకసుతాజీవితేశు సద్గుణనిధినిన్
ఘనరాజ్యమందు నను నీ
యనుజులు పట్టంబుఁ గట్టి రప్పుడె రామా

86. కం. సీతాసమేతువుడవునై
నీతమ్ములతోడఁ గూడి నిజరాజ్యంబున్
గౌతుకమునఁ బాలించుచు
ఖ్యాతిం గాంచితివి నీవు ఘనుడవు రామా

87. కం. జనకాత్మజాహృదీశ్వర
జనులను నీబిడ్డ లట్లు సాఁకుచు రాజ్యం
బును బదివేలేడులు ప్రో
చిననీకు నమస్కరింతు శ్రీరఘురామా

88. కం. కాకుత్థ్సవంశరత్నమ
నీకాళుల ధూళి నయ్యు నిలిచెద నన్నున్
గైకొని పరిపాలింపవె
సాకేతపురాధినాధ జానకిరామా

89. కం. శిఖింతువు దురితాత్ముల
రక్షింతువు శరణుఁ గోరుప్రజ నెల్లర నో
పక్షీంద్రబాహనా నను
రక్షింపఁ దలంపవేల రఘుపతి రామా

90. కం. భువనాధిపుఁడీవనుటకు
భవునిశరాసనము విఱుచుబాహుబలంబే
యవనీశ సాక్షియగు నీ
ప్రవిమలమాహత్మ్య మెన్న వశమే రామా

91. కం. పత్రఫలపుష్పతోయము
లిత్రు మహీజనులు భక్తి నెల్లర నీవున్
మిత్రమయి ప్రోతు దశరథ
పుత్రా నన్నేల నీవు ప్రోవవు రామా

92. కం. శ్రీమంతంబు సనాతన
మై మహిమాన్వితము నయ్యు నవనీసుతతో
నామోదప్రదము భవ
ద్రామాకారంబు నకును బ్రణతులు రామా

93. కం. రా యని పల్కనఘంబులు
బోయెడు వెలుపలకు జిహ్వమూలము గాఁగన్
మాయని పల్కఁ గవాటము
వేయువిధం బనియు నేను వింటిని రామా

94. కం. రామస్మరణములోని మ
హామహిమం బెఱిఁగి యేను నత్యతభక్తిన్
రామాయణమును రచించియు
స్వామీ నీకిచ్చియుంటి జానకిరామా

95. కం. సేతువుఁ గట్టేడువేళను
సీతాధిప యుడుత చిన్నిచేతులతోడన్
బ్రీతిని దెచ్చెను సైకత
మాతఱి సంప్రీతి దాని నరయవె రామా

96. కం. వ్రతముల నుపవాసంబుల
సతతము నీయందు భక్తిసల్పక పోతిన్
క్షితినాధ చంద్ర నన్నే
గతి రక్షించెదవొ నీవు కరుణను రామా

97. కం. ధర్మము లొనర్పఁ జాలను
నర్మిలితో బీదజనుల నారయఁ జాలన్
ధర్మవిచారుఁడ వగునీ
వర్మిలి నన్నేలుమయ్య యచ్యుత రామా

98. కం. దురితములు పెక్కొనర్చితి
నరయఁగ సుకృతం బొనర్పనైతిని నేనో
పరమాత్మ భక్తవత్సల
శరణొందితి నన్ను దయను సాకవె రామా

99. కం. గురువులకు నాదికారణ
గురుఁ డౌదువు వేల్పులెల్లఁ గోరఁగ నీవీ
ధరణిని జన్మించిన శ్రీ
హరివగుదువు నిన్నుఁ బొగడ నలవియె రామా

100. కం. భక్తార్తిహరుఁడ వందురు
భక్తశరణ్యుండ వనియుఁ బల్కుదు రార్యుల్
భక్తిని నిది యొసఁగితి నా
సక్తిం గ్రహియించి నన్ను సాకవె రామా

101. కం. నాతప్పులెల్ల మఱచియు
నోతండ్రీ యిది గ్రహించియును బరమేశా
ప్రీతిని నను రక్షింపవె
సీతాలక్ష్మణసమేత శ్రీరఘురామా

102. కం. నీకంకితమిడి వ్రాసితి
నాకుం గలభక్తితోడ నలినేక్షణ నీ
వీకృతి గైకొని నన్నుం
బ్రాకటముగఁ బ్రోవు భక్తవత్సల రామా

103. కం. సకలజగదంతరాత్ముఁడ
వకలంకుఁడ వైననీపదాంబుజములపై
సకలేశ మనము నుంచెద
బ్రకటితముగఁ బ్రోవుభక్తవత్సల రామా

104. కం. కవిసార్వభౌమపుత్రిక
ను విశాలాక్షియనుపేర నొనరినదానన్
గవితగతియెఱుగఁజేసితి
నవనీశ్వర శతకమందు మచ్యుతరామా

గద్యము
ఇది శ్రీకల్లూరివిశాలాక్షి ప్రణీతము.
శ్రీరామార్పణమస్తు
శ్రీ శ్రీ శ్రీ

Tuesday, August 20, 2013

నృకేసరిశతకము - శేషాచలదాసు (శేషప్ప)

నృకేసరిశతకము
                        శేషాచలదాసు (శేషప్ప)

1. ఉ. శ్రీకమలాలయారమణ శీఘ్రముగా దయఁజూచి నామనో
వ్యాకులమెల్లఁ దీర్చు మిఁక వారిజలోచన నమ్మినాఁడ నే
లోకులఁ గొల్వనేర భువిలో నను వంచనజేయఁబోకుమీ
నీకు నమస్కరించెదను నేర్పుగ ధర్మపురీనృకేసరీ

2. చ. అమరము పంచకావ్యముల నైనఁ బఠింపఁగలేదు లెస్సగా
శ్రమపడి ప్రాసవిశ్రమవిచారము జేయఁగలేదు నే కవి
త్వము గని నిన్ను వేఁడితిని తప్పులొ యొప్పులొ చిత్తగించుమీ
కమలదళాక్ష పండితుఁడఁ గానుర ధర్మపురీనృకేసరీ

3. చ. రవికుల రేఁగుకాయలకు రత్నములే వెలబోసినట్లు దు
ష్కవిజనులంత బుద్ధిచెడి కాసులకోసము తుచ్చమైనమా
నవులను బ్రస్తుతించుచు ఘనంబుగఁ బద్యము లమ్ముకొండ్రు మా
ధవ నినుఁ గానఁజాలరు ముదంబున ధర్మపురీనృకేసరీ

4. చ. పెదవులు దీర్ఘదంష్ట్రలును భీకరమైన విశాలనేత్రముల్
కుదిరినమీసముల్ నుదురు కుంజరమున్ దునిమెటి కేసరి
వదనము దీర్ఘబాహులును వజ్రనఖంబులు నీశరీరసం
పద పొడసూపవయ్య మునిప్రస్తుత ధర్మపురీనృకేసరీ

5. ఉ. తిన్ననిశంఖచక్రములు దివ్యకిరీటము కుండలంబులున్
పన్నగరాజతల్పమునం బన్నశరీరము నాల్గుచేతు ల
త్యున్నతమైన వక్షమున నుంచినలక్ష్మిని నీదురూపు నా
కన్నులఁ జూపవయ్య పొడగాంచెద ధర్మపురీనృకేసరీ

6. ఉ. చూచితి నీకిరీటమును జూచితి కుండలముల్ ముఖంబు నేఁ
జూచితి శంఖచక్రములు చూచితి కౌస్తుభవక్షదేహమున్
జూచితి పీతవస్త్రమును జూచితి లక్ష్మిని నిన్ను లెస్సగాఁ
జూచితిఁ గన్నులార మధుసూధన ధర్మపురీనృకేసరీ

7. ఉ. తల్లివి దండ్రి వాప్తుఁడవు దాతవు భ్రాతవు నీవె సుమ్మి నే
చిల్లరదేవతార్చనలు చేసెడివాఁడనుగాను స్వామి నీ
చల్లనిపాదపద్మముల సన్నిధిఁ గోరితిజిహ్వతోడ నే
కల్లలు బల్కనయ్య ననుగావుము ధర్మపురీనృకేసరీ

8. ఉ. అందఱకంటె నేను దురితాత్ముఁడనయ్య జగత్ప్రసిద్ధిగా
ముందఱ నాగతేమొ యని మూర్ఖుఁడనై భయమొందుచున్న నా
యందుఁ గటాక్షముంచి సకలాపదలన్ దొలగింప నీకు నే
వందన మాచరించెదను వాసిగ ధర్మపురీనృకేసరీ

9. ఉ. నమ్మితి నీవె దిక్కనుచు నారదసన్నుత దేహమైతె నీ
కమ్మితినయ్య నే నొరుల యాశఁబడుండసుమీ సురేశ నా
నెమ్మదిఁ గోర్కిదీర్చు మిఁక నీవు ప్రసన్నుఁడ వైనఁజాలు నే
సమ్మద మొందెదన్ దనుజసంహార ధర్మపురీనృకేసరీ

10. ఉ. బొందిని బ్రాణముల్ వెడలిపోయెడినాఁటికి వసుదేవ గో
వింద ముకుంద యంచు నిను వింతగ నెంతునొ యెంచలేనొ నే
నందుల కెంతొ చింతిలెద నాసమయంబున కీవు వచ్చి నా
ముందఱ నిల్చియుండఁగదె మ్రొక్కెద ధర్మపురీనృకేసరీ

11. ఉ. ఆయువు గల్గినంతపరియంతర మన్నివిథాల నాకు సో
పాయముజేసి సేవకునిప్రాణము లేఁగెడివేళ శంఖచ
క్రాయుధముల్ ధరించి భుజగారివిహంగము నెక్కివచ్చి నీ
చాయకుఁ దీసికొమ్మినను జయ్యన ధర్మపురీనృకేసరీ

12. ఉ. ఇప్పుడు నేను పాతకము లెక్కుడుజేసితి భీతినొందకే
తప్పులు బెట్టుచున్ యముఁడు దండన నాఁటికిఁ జేయునేమొ నే
నప్పటి కాఁగలేను సుమి యాయమదూతలు పట్టరాఁగ నిన్
దప్పక వేఁడుకొందు నను దాకొను ధర్మపురీనృకేసరీ

13. ఉ. దుష్టుఁడ సుమ్మి నన్ను యమదూతలు గైకొని పోవునాఁటి కే
కష్టము ప్రాప్తమౌనొ నరకంబులవార్తలు వింటి నీకృపా
దృష్టియనే సముద్రమునఁ దేల్చియు నాకభయం బొసంగు మీ
శిష్టులలోన నను దరిఁ జేర్చుము ధర్మపురీనృకేసరీ

14. చ. మరణమునాఁటి కాయముని మన్ననదూతలు రాకమున్నె నీ
కరముల శంఖచక్రములఁ గావలిబంపుమి ధీరుఁడైన నీ
గరుడునిఁ బంపు మిక్కడకుఁ గష్టములేక సుఖాన వారియా
సరగొని నిన్ను వేడెదను సయ్యన ధర్మపురీనృకేసరీ

15. చ. సమరసమైన పెద్దపులిచాటున కేఁగిన నెల్కకండ్లకున్
నమిలెడిగండుబిల్లి యొకనల్లిసమానము నిశ్చయంబుగాఁ
గమలదళాక్ష నీకరుణగల్గిన భక్తుని నేత్రదృష్టికిన్
యముఁడొకనల్లి పిల్లజతయౌ సుమి ధర్మపురీనృకేసరీ

16. ఉ. శ్రీనరసింహ నీభజనఁ జేసెడిభక్తులతోడఁ గూడుచో
నేను పవిత్రమయ్యెదను నీచులసంగతి చాలుచాలు నే
మానవజన్మమెత్తి పలుమందిని వేఁడితి బొట్టకోసమై
దీనుఁడనయ్య ననుఁ గడతేర్చుమీ ధర్మపురీనృకేసరీ

17. ఉ. కాయజకోటిరూప నవకంజదళాక్ష ముకుందకృష్ణ నా
రాయణ వాసుదేవ గజరక్షక నీలశరీర శంఖచ
క్రాయుధ మేరుధీర భుజగాంతకవాహన మోక్షదాయకా
నాయిలవేల్పు వంచు నిను నమ్మితి ధర్మపురీనృకేసరీ

18. ఉ. కంటిని నీకృపారసము కష్టములొందుచు నిన్ను వేఁడఁగా
వెంటనె మేలుజేసితివి వేల్పులు భూమిని నెందరైన నీ
దంటకు సాటిరా రనుచు దండిగ బొబ్బలుపెట్టి చేతఁ జే
గంటనుగొట్టి సాటెదను గట్టిగ ధర్మపురీనృకేసరీ

19. ఉ. పుట్టితి మీపదాబ్జముల భూమిని నాతలవంచి దండముల్
బెట్టితి నీదుపేరిటను బెద్దకుఠారము చేతఁబట్టి నేఁ
గొట్టితి పాతకాటవిని కుంజరరక్షక నీకు బంటునై
పుట్టితి భూమిలోన సురపూజిత ధర్మపురీనృకేసరీ

20. ఉ. వింటిని నీకథల్ చెవుల వేడుకతో నరసింహ మాధవా
యంటిని నోత లెస్స బలువాసను నీ నయమైనరూపు నే
గంటిని కండ్లనిండ ననుగాచెడి  దాతవుగాఁగ నమ్ముకో
నుంటిని నీపదాబ్జముల నొప్పుగ ధర్మపురీనృకేసరీ

21. ఉ. ఎంచెద నీగుణంబులను హెచ్చుగ నీకథఁబాడుకొంచు వా
యించెద వీణతాళముల నెప్పుడు నాహృదయంబులోన ధ్యా
నించెద నీపదాబ్జములు నేర్పున నీదయ చాల్పుగాఁగ ర
ప్పించెదఁ జూడు నాతెలివిపేరుగ ధర్మపురీనృకేసరీ

22. చ. కువలయపత్రనేత్ర శతకోటిదివాకరతేజ పద్మసం
భవనుత పక్షిరాడ్ధ్వజ కృపాజలధీ జగదీశ యిందిరా
ధవ మధుకైటభాంతక సుధాకరకీర్తి విశాలకుండల
శ్రవణసరోజనాభ కరిరక్షక ధర్మపురీనృకేసరీ

23. చ. సురనుత చక్రహస్తరణశూర నవాబ్జదళాక్ష కంబుకం
ధర గజరాజవాహన గదాధర కౌస్తుభవక్షపింగళాం
బరధర భోగిరాట్శయన భక్తజనాంబుజమిత్ర మందరో
ద్ధర మునిజాలవందిత పదద్వయ ధర్మపురీనృకేసరీ

24. ఉ. శ్రీహరి వాసుదేవ నరసింహ జనార్ధన చారుపక్షిరా
డ్వాహన శంఖచక్రధర వారణరక్షక భూపతీ జగ
న్మోహన దుష్టదానవ సమూహవినాశ త్రిలోకవంద్య మాం
పాహి ముకుంద దీనజనబాంధవ ధర్మపురీనృకేసరీ

25. ఉ. వారిజపత్రనేత్ర సురవందిత పాదసరోజసింధుగం
భీరవిరించిరుద్రనుత భీకరదైత్యవినాశ చక్ర మం
దార రమాకళత్ర ఫలదాయక సర్వ జగన్నివాస శృం
గారశరీర కేశవ ఖగధ్వజ ధర్మపురీనృకేసరీ

26. ఉ. శ్రీతరుణీమనోహర శశీధవసన్నుత చారునీల జీ
మూతశరీర పాతకమోచన సద్గుణజాల భక్తకం
జాతవిలోల దుర్దనుజసర్పఖగేశ్వర యామినీకర
శ్వేతయశోవిశాల మునిసేవిత ధర్మపురీనృకేసరీ

27. ఉ. చిత్తములోన నీభజనఁ జేసెడివాఁడు వయోధనాళిచే
మత్తుఁడుగాక నికథలు మానక వీనులవిన్నవాఁడు నో
రెత్తి మహాముదంబునను నెప్పుడు నిన్ను నుతించుచున్నవాఁ
డుత్తమ జాతివాఁడు పురుషోత్తమ ధర్మపురీనృకేసరీ

28. చ. గజహయదానముల్ గ్రహణకాలపుగోగణభూమిదానముల్
రజతహిరణ్యదానములు రత్నపుదానము లన్న దానముల్
నిజముగఁ గోటిచేసి నను నీరజలోచన వాసుదేవ ని
భజనసమానమౌనె మురభంజన ధర్మపురీనృకేసరీ

29. ఉ. గోవులఁ బంచిపెట్టినను గోటిధనంబును లూటి బుచ్చినన్
బావులు చాల ద్రవ్వినను బట్టలు కట్నము లెన్నిబెట్టినన్
త్రోవల చెర్లువేసినను తోఁటలఁ బెంచినగాని దేవ నీ
సేవకు సాటిరావు సుమి శ్రీహరి ధర్మపురీనృకేసరీ

30. ఉ. వేదము లాదిగా సకలవిద్యల నేర్వఁగలేను ద్రవ్యసం
పాదనఁజేసి త్యాగమునఁ బైకొని దానము లివ్వఁజాల యే
కాదశు లుండలేను నడిగంగను స్నానము చేయలేను నీ
పాదయుగంబు నమ్మెదను భక్తిని ధర్మపురీనృకేసరీ

31. ఉ. కూటికి మానవాధములఁ గొల్చినరీతిని నినుఁ గొల్వ నా
కేటికి బుద్ధిపుట్టదుర యెంత దురాత్ముఁడనైతి నయ్యయో
నాఁటిదినాలనుండి నిను నమ్మిన సద్గతిగల్గు లెస్సగ
హాటకదైత్యనాశవిభవాచ్యుత ధర్మపురీనృకేసరీ

32. ఉ. శ్రీరమణీయ నీ కధికసేవలు చేయఁగలేను గాని సం
సారము నుద్వహింప ఘనజారుల నీచులనైనఁ గొల్చితిన్
సారెకుఁ బొట్టకై సకలజాతిమనుష్యుల సంగ్రహించితిన్
బేరుగ నాకు ముక్తి కడుపేసుమి ధర్మపురీనృకేసరీ

33. చ. కుజనులఁగూడి నేఁ బెరుకు కూఁతలఁ గూయఁగ నేర్తుఁగాని నీ
రజదళనేత్ర నిన్నుఁ జతురత్వముతోఁ గొనియాడఁజాల నే
నిజముగఁ బాపకర్ముఁడను నీకృపచేఁ గడతేర్చునన్ను మా
రజనక నీకు మ్రొక్కెద సురస్తుత ధర్మపురీనృకేసరీ

34. ఉ. దానవనాథ నీకిపుడు దాసుఁడనై నినుఁ గొల్చుచుంటి మే
లైనవరం బొసంగు మిపు డన్యుల నే బ్రతిమాల పొట్టకై
యేనుఁగునెక్కి దిడ్డిచొర నీఁగుదు నెట్లు మహానుభావ నీ
వే నను జేతబట్టు మని వేఁడితి ధర్మపురీనృకేసరీ

35. ఉ. రేయుఁబవళ్ళు నిన్ననుసరించిన నీదయ బుట్టదెందు క
న్యాయముఁ జేయ సాగితివి నాయపరాధము లేమిరా జగ
న్నాయక నీవు నన్నుఁ గఠినత్వముమై గన ధర్మమౌనొకో
తోయజనాభ యెంతకని దూరుదు ధర్మపురీనృకేసరీ

36. ఉ. ఎవ్వరివద్ద కేఁగుదు నిఁ కెవ్వరితో మెఱబెట్టుకొందు నే
నెవ్వరి నాశ్రయించెద నిఁ కెవ్వరు చింతలుదీర్చువారు న
న్నెవ్వరు చేతఁబట్టెదరిఁకేయ్యది తోఁచదు నివుదప్ప నా
కెవ్వరు గానరారు జగదీశ్వర ధర్మపురీనృకేసరీ

37. ఉ. ఏమిర నరసింహ యిపు డెందుకు నీదయరాదు నాయెడన్
బ్రేమను సారెసారెకును బిల్చినం బల్కవదేమిరా పరం
ధామ భవత్పదాబ్జములు ధ్యానము జేయుదురా ముకుంద నీ
మోమిటు జూపరా భువనమోహన ధర్మపురీనృకేసరీ

38. ఉ. నానరసింహ నాధనమ నాయిలువేలుప నామనోహరా
నీనగుమోముఁ జూపర మునిస్తుత నిన్ను గణించుచుంటిరా
దీనతనొంది వేఁడగను దిప్పలఁబెట్టక ననుఁ గావరా
నేను పరుండనౌర గణియింపర ధర్మపురీనృకేసరీ

39. ఉ. దండము నారసింహ నను దగ్గఱదీసి వరంబులిచ్చి భూ
మండలమందు నాబ్రదుకు మంచిగఁ జేసి సుఖాన నుంచుమీ
దండితమహాత్మకుండనుచు ధైర్యముతోడుత నమ్ముకొంటి నీ
యండ తొలంగనయ్య కరుణార్ణవ ధర్మపురీనృకేసరీ

40. ఉ. సారసపత్ర నిను సారెకు నే బతిమాలిమాలి వే
సారితినా! యిదేమిపుడు సాగకవచ్చెను నీకు బట్టుకై
వారములేమనందు ననువంచనజేయఁ దలంచినావొ నీ
కారడ మేమొనాకుఁ బొడకట్టదు ధర్మపురీనృకేసరీ

41. ఉ. ఓనరకేసరీ యనఁగ నో యని పల్క విదేమి మాటమా
త్రానికి నోఁచనా యిపుడు దాసుని మీఁద మఱింతకోపమే
పూనితి వెందుకయ్య దయబుట్టదు నే నపరాధి నంహు హా
మానవదేల మచ్చరము మాధవ ధర్మపురీనృకేసరీ

42. చ. శరణని గోరియుంటి ననుఁ జయ్యనఁ గావవిదేమి నీకు నా
మొఱ వినఁ జెప్పవచ్చితిని మ్రొక్కఁగఁ గోర్కెనుదీర్చుకుంటి నీ
బిరుదుకు భంగమయ్యె సుమి పెద్దపకీర్తి గడించుకోకుమీ
చెఱుపక ననుఁ జేకొనుమి శ్రీధర ధర్మపురీనృకేసరీ

43. చ. నళినదళాక్ష కృష్ణ శరణాగతవత్సల యంచు నిన్ను నేఁ
బిలువఁగ నీవు నో యనవు బెల్లపుగడ్డలు నోటఁబెట్టుకో
పలుకఁగ లేకపోయితివొ బాగుగ నేఁడు పరాకువైతివో
పలుకుటిలంబులం దలఁతొ పావన ధర్మపురీనృకేసరీ

44. ఉ. మంచి ప్రతాపమూర్తివని మాటికి నేను కరంబులెత్తి జో
డించి నమస్కరించుచుఁ బదింబడి వేఁడఁగ నీవు నామొఱా
లించవ దెందుకయ్య లవలేశము నీదయ లేకపోయెఁ బో
షించెడిదాత లెవ్వరిఁక శీఘ్రము ధర్మపురీనృకేసరీ

45. ఉ. సుందరరూప నున్నుఁ బొడచూచెద నంటె బిరాన నీవు నా
కెందుకుఁ గానరావొ యిపు డెచ్చటి కేఁగితివో జనార్ధనా
యిందుదివాకరాక్ష ధన మిమ్మని వేసటఁబెట్టఁగాని నీ
యందము జూపు శీఘ్రముగ నచ్యుత ధర్మపురీనృకేసరీ

46. ఉ. హేమము భూషణావళియు నేన్గులు నశ్వములందలంబులున్
గ్రామము లీయలేవు ఘనకార్యములం దగిలించుకోకుమీ
నీముఖమైనఁజూపుమిఁక నీ కిది కష్టముగాదు చుల్కనే
నా మనసింతకే భ్రమసె నమ్మితి ధర్మపురీనృకేసరీ

47. చ. కరి మకరంబునోటఁ బడి కష్టము లొందఁగఁ జేతిచక్రమున్
సరగునఁ బంపి నీటను మొసల్ని వధించి గజంబు నేలు నా
తెఱఁగున నేడు నన్నుఁ గడతేర్చుమి నీకు నమస్కరించెదన్
బిరబిర వచ్చి నాకుఁ గనుపింపవె ధర్మపురీనృకేసరీ

48. ఉ. మ్రొక్కునఁ జూడవేమి నిను ముద్దుగఁ బిల్చినం బల్కవేమి నేఁ
జక్కన సేవసేయఁగను చయ్యనం గోర్కిని దీర్చవేమి నా
కక్కఱబడ్డవేళ యిపుడాదుకోజాలవదేమి నీకు నా
కెక్కడివైరమో తెలుపవేమిర ధర్మపురీనృకేసరీ

49. చ. సరసిజనాభ నే సకలజన్మము లెత్తితి థాత్రిలోపలన్
స్థిరమొకటైన లేదుగద తీవ్రమె పుట్టుచు మర్లఁ జచ్చుచున్
దిరిగితి రానుపోను బహుత్రిప్పల నొందితి వేసటైతి నీ
చరణములాన జన్మములు చాలిఁక ధర్మపురీనృకేసరీ

50. ఉ. మామిడిపండ్లపానకము మంచిమధూదకమిశ్ర భక్ష్యముల్
జామలు నారికేళములు చెక్కెర ద్రాక్షఫలంపులక్షలున్
తామరసాక్ష మేలిమి సుధామధురాదులు లక్షయైన నీ
నామము సాటిగావుర జనార్ధన ధర్మపురీనృకేసరీ

51. ఉ. మేలిమి భూసురాది బలుమేటికుటుంబములు నాలుగుండఁగాఁ
జాలుపు విస్తరించె నరజాతిని సజ్జనుఁ డెవ్వఁడుండినన్
చేలుగ మిమ్ము నిత్యము భజించుచు నమ్మినఁ జాలు ముక్తి చం
డాలునకైనఁ గద్దు గరుడధ్వజ ధర్మపురీనృకేసరీ

52. చ. ఇలను మనుష్యజాలమున నెక్కువతక్కువ లున్నవన్నచోఁ
గులముల శ్రేష్ఠ మెవ్వరిది కొంచము గానఁగరాదు వారు ని
ర్మలినశరీరులో గుమగుమా యను కుక్షిని గందమునదా
తెలిసిన నిండుభక్తులె సుధీరులు ధర్మపురీనృకేసరీ

53. ఉ. కేశవ మీకథల్ మిగులఁ గీర్తనఁజేయుచుఁ గామ్యమైన దు
ష్పాశము గోసివేసి నిజభక్తి విరక్తి సుభుద్ధి జ్ఞానముల్
వాసిగ సంగ్రహించిన భవజ్జను లేకులమందుఁ గల్గినన్
నేశరణందు వారలకు నిక్కము ధర్మపురీనృకేసరీ

54. ఉ. శాంతము సత్యవృత్తి ఘనసాధుతయున్ గరుణాసమృద్ధి వి
శ్రాంతిగ భక్తిజ్ఞానము విరక్తి సదావననామకీర్తనల్
భ్రాంతి సుబుద్ధు లేజనునిపాలఁ జెలంగునొ వాఁడె దివ్యవే
దాంతులకన్న శ్రేష్ఠుఁడు కృతార్థుఁడు ధర్మపురీనృకేసరీ

55. చ. భ్రమరము కీటకంబు నొగిఁబట్టుకవచ్చి నిజస్వరూపమున్
సమముగఁ జేసినట్లు ఘనసజ్జను లైనమహాత్ములున్నఁ బా
పమతులఁ జేరఁబిల్చుకొని భక్తులఁ జేయరె నిశ్చయంబుగన్
విమలసరోజలోచన వివేకులు ధర్మపురీనృకేసరీ

56. ఉ. చిన్నతనంబునుండి కడుఁ జేసితి పాపము లన్ని నావి నా
కెన్నఁదరంబుగాదు సుమి హీనుఁడ నీచుఁడ బాపకర్ముఁడన్
ఎన్నిటఁ జూడ నానడలిక లించుక మంచివిలేవు స్వామి నీ
మన్ననచేత దోషములు మాన్పుము ధర్మపురీనృకేసరీ

57. ఉ. నీరజపత్రనేత్రయుగ నేను గడించిన పాతకంబు వి
స్తారము గద్దు నాకొకఁడు సాటిదురాత్ముఁడు లేడు సుమ్మి నా
నేరము లన్నిగాచి కరుణించెడి తండ్రివిగాఁగ నేఁడు నీ
చేరువఁ జేరినాఁడ దరిఁజేర్చుము ధర్మపురీనృకేసరీ

58. ఉ. పుట్టిననాఁటనుండి యొకపుణ్యము జేయఁగలేదు గాని నే
పుట్టితిం బాతకంబులను బూని గడించితి కావరంబునన్
బొట్టను లెస్సగా బుగులు పుట్టిన దిప్పుడు నాఁటికోసమే
చుట్టములేక నీశరణుఁ జొచ్చితి ధర్మపురీనృకేసరీ

59. ఉ. నిర్మలు లైనమానవుల నిందలఁ జేయగ నేర్తు నేను దు
ష్కర్మముజేసి మందికి సుకర్మముఁ జెప్పుకొనంగ నేర్తు స
ద్ధర్మములాచరించునెడఁ దప్పక విఘ్నము జేయనేర్తు నే
దుర్జనుండనయ్య పెనుద్రోహిని ధర్మపురీనృకేసరీ

60. చ. గడుసుదనంబునం బరులకాంతల వశ్యము జేయ నేర్తుఁగా
రడమున మంది ద్రవ్యమును రక్తిని గుంజఁగ నేర్తు లెస్సగా
విడిబడి పెద్దపిన్నలను వేమఱు నిందయొనర్ప నేర్తు నే
పెడసరబాపకర్ముఁదను బెద్దను ధర్మపురీనృకేసరీ

61. ఉ. ప్రొద్దునలేచి నేను కడుబొంకులు బల్కుచునుందు నోట నా
వద్ద నిజంబు లేదు పెరవారి సుఖంబు సహింపలేను నా
బుద్ధి మహావికారపుదు భూమిని దుష్టగుణంబులందు నే
పెద్ద దురాత్ముఁడన్ వినుమి వేరుగ ధర్మపురీనృకేసరీ

62. ఉ. మాటలు వాఁడిబల్లెములు మానసమన్న విషంబు హస్తముల్
నాటెడుతమ్మముండ్లు నయనంబులు నిప్పులు దుర్గుణంబులే
కూటికిలేదు నా కధికకోపము పాతకు లెందఱైన నా
గోటికి సాటిరారు చెడఁగొట్టకు ధర్మపురీనృకేసరీ

63. ఉ. చాటుకుఁ బెద్దతప్పులను జాలఁగఁజేసి భయంబు నొందకే
నేటుకువచ్చి దుర్గుణము నేరనిపెద్దలఁ గూడి వారితో
సాటికి నిల్చి నే నొకరిజాతులనీతుల నెంచుచుందు నా
పాటి దురాత్ముఁ డేడి రిపుభంజన ధర్మపురీనృకేసరీ

64. ఉ. నేటుగ మంది మెప్పులకు నేనొక వింతగఁ గంఠమందు వే
సేటివి పెద్దపెద్దతులసీవనమాలలు చాటుచేరి చే
సేటివి నీచకార్యములు శ్రీధరనాపని నీ వెఱుంగవా
నేఁటికి సద్గుణం బొకటి నేరను ధర్మపురీనృకేసరీ

65. ఉ. లోపలి పాపకర్మములు లోకుల కేర్పడకుండఁ జేయుచున్
నేపదిమంది కందఱకు నీతులు తత్వములెల్లఁ జెప్పెదన్
నాపురుషార్థ మింతె సుమి నల్గురుకండ్లకు నేను పెద్దనీ
నాపస మేడిపండు సురనాయక ధర్మపురీనృకేసరీ

66. ఉ. మంచిగ ధర్మశాస్త్రములు మందికిఁజెప్పఁగ నేర్తుఁగాని నే
కించతనాలు మానఁగద కేవలదుర్గుణుఁడన్ సుబుద్ధి లే
దించుక యైనఁగాని మనసెప్పుడు చంచలమందుచుండు నా
సంచితపాపకర్మములఁ జంపుము ధర్మపురీనృకేసరీ

67. ఉ. ఇంటికి నిత్యభిక్షమున కెందఱు వచ్చినఁగాని తెంపుతో
గంటెడు గింజలొకరికి గ్రక్కున వేయఁగలేదు ధర్మమే
మంటగలేదు నాకుఁ గరుణార్ణవ నేనతిలోణినయ్య నీ
బంటును నమ్మికొంటి ననుబాయకు ధర్మపురీనృకేసరీ

68. చ. ధనము గడించి పెద్దలకు దానము చేయంగలేను గని నే
పెనఁగొని జారకాంతలకుఁ బెట్టితి సొమ్ములు మందికేర్పడన్
ఘనులను గూడలేక పలుగాకులలోపల నుంటినయ్య నా
మనసున సిగ్గులేదు లవమాత్రము ధర్మపురీనృకేసరీ

69. ఉ. చంచలచిత్తుఁడన్ బరమజారుఁడఁ జోరుఁడఁ బాతకుండ నే
కొంచమువారితోడ జతగూడి చరింపుదు నాగుణాలు వ
ర్ణించఁదరంబుగాదు సుమి నీవిపుడన్ని క్షమించి నన్ను ర
క్షించుమి నీకు మ్రొక్కెదను గేశవ ధర్మపురీనృకేసరీ

70. ఉ. అంధున కద్ద మేమిటికి నందము దప్పినముండమోపికిన్
గంధపుఁబూఁతలేమిటికిఁ గాననమందుఁ జరించుకోఁతికిన్
సింధుజరత్న మేమిటికిఁ జెడ్డదురాత్మున కెన్నఁడైన నీ
గ్రంధపు విన్కి యేమిటికి గట్టిగ ధర్మపురీనృకేసరీ

71. చ. బురదను బొర్లుచున్న యెనుబోతుల కేటికి మంచిగంధముల్
గురుతుగ భవ్వు భవ్వు మను కుక్కల కేటికి బూరగొమ్ములున్
గఱకది యేల గాడ్పునకుఁ గారము తమ్మలపాకు కెందుకున్
నిరుపమదుష్టుకెందుకుర నీకథ ధర్మపురీనృకేసరీ

72. ఉ. ఏనుఁగు బోవఁజూచి ధ్వను లెత్తుచుఁ గుక్కలు గూయసాగుచో
దానిమనస్సు కోపపడి దందడి వానిని వెంబడించునే
మానవులందు సజ్జనుల మత్తులు కొందఱు గేలిచేయుచో
ఆనరుఁ డల్గి వాండ్ర బదులాడునె ధర్మపురీనృకేసరీ

73. చ. బిరుదుగ గడ్డముల్ జడలు పెంచుక నిక్కఁగనే మహాత్ముఁడా
పరమతపస్వి గాఁడు సుమి పందికి వెండ్రుక లెప్పుడుండవా
బెరుకుగుణాలు మానుకొని ప్రేమను నిన్నెవఁడైనఁ గొల్చెనా
ధరణిని వాఁడె పావనుఁడు ధన్యుఁడు ధర్మపురీనృకేసరీ

74. ఉ. ఎన్నఁడు నీవు నకభయ మిచ్చెదవో కరుణాసముద్ర నీ
మన్నన కాసనొందితిసుమా ననుదూరము చేయఁబోకుమీ
నిన్నిపుడేను నమ్మితిని నిర్దయయుంచక కావు కావు నా
విన్నపమాలకించి నను వీడక ధర్మపురీనృకేసరీ

75. ఉ. దినకరచంద్రనేత్రయుగ దీనత నొందుచు నిన్నుఁ బిల్వఁగా
నెనరున మాఱుబల్కక విని విననట్టుల నుంటివేమి నీ
తనయునిమీఁద నీవు దయఁ దక్కువజేసిన నీకు భువిలో
ఘనమపకీర్తి సుమ్మి ధృతకౌస్తుభ ధర్మపురీనృకేసరీ

76. చూతఫలంబు నోటఁ జవి చూచెడిచిల్క కుమెత్తకాయయున్
బ్రీతి జనించునే మదిని రేయుఁబవళ్ళు ముకుంద నీకుఁ బ్ర
ఖ్యాతిగ సేవజెసినమహాత్ముఁడు నీచులసేవజేయునే
పాతకనాశ యోగిజనప్రస్తుత ధర్మపురీనృకేసరీ

77. చ. ఖగపతి నీకు వాహనము కౌస్తుభరత్నము భూషణంబు ప
న్నగపతి శయ్య మన్మథుఁడు నందనుఁ డంబుధిపుత్రి భార్య ము
జ్జగముల వారు బంట్లు రవిచంద్రులు లోచనముల్ ముకుంద నీ
కగణితమైన భాగ్య మహహా భళి ధర్మపురీనృకేసరీ

78. చ. గరుడునితోడ కోడియును గాంతి హిరణ్యముతోడఁ గంచు భా
స్కరు నొగి విస్ఫులింగము గజంబుల దోమ విశాలమైన మం
దరమును చిల్లరాయి నిను దల్చెడిభక్తులతోడ దుర్జనుల్
సరిపడవత్తురే దురితసంహార ధర్మపురీనృకేసరీ

79. ఉ. ఎంతకు నున్ను వేఁడుదునిఁ కెన్నివిధంబుల దూరి పల్కినన్
మంతనమందు నీనెనరుమచ్చుకు లేదు పరీక్షబట్టుచో
సంతత మిట్లు నీవు పగ చాలుపు దాల్చిన నేవిధాన జీ
వింతును నాకు దిక్కెవ్వరు వేలుపు ధర్మపురీనృకేసరీ

80. తల్లి విషంబుఁ బెట్టినను దండ్రి ధనాఢ్యుల కమ్ముకొన్న భూ
వల్లభుఁ డిల్లు దోఁచినను వద్దని పల్కెడివార లుందురా
ఉల్లములోన నీవు నెనరుంచక వ్యాధులఁ బెట్టి ముంచఁగాఁ
జిల్లర వైద్యులెల్ల దరిజేర్తురె ధర్మపురీనృకేసరీ

81. చ. జలజదళాక్ష నీకరుణ చాలుపుగాఁ గలిగున్నఁజాలు నే
బలుఁడను ధైర్యవంతుఁడను భాగ్యుఁడ శూరుఁడ నిర్మలుండఁ గే
వలముగ నే కృతార్థుఁడను వాసిగఁ బుణ్యుఁద నయ్యెదం జుమీ
చెలుగుచు నీవు నన్ను దరిజేర్చుమి ధర్మపురీనృకేసరీ

82. ఉ. మోక్షము నిన్ను నే నడుగ ముఖ్యపదార్థము నీకృపారసం
బీక్షణమందు నాకొసఁగు మింతటితోఁ బరితృప్తి నొందెదన్
సాక్షులు నీపదాబ్జములు సత్యముఁ బల్కెదఁగల్లలాడకే
రాక్షసనాశ దీనజనరక్షక ధర్మపురీనృకేసరీ

83. ఉ. ఆగజరాజు నీకు ఘనమైనమణుల్ జమచేసి పంపెనా
త్యాగముతో విభీషణుఁడు ద్రవ్యము నీ కెఱుఁగంగఁ దెచ్చెనా
కాఁగులతోఁ గుచేలుఁ డధికంబుగ నీ కటుకుల్ నొసంగెనా
బాగుగ వారినేలితివి పైకొని ధర్మపురీనృకేసరీ

84. చ. జగతిని శ్రేష్ఠమైన నరజన్మము లెత్తినవారలున్ జతు
ర్నిగమము లాఱుశాస్త్రములు నేర్చినవారలు యజ్ఞసంతతుల్
తెగువ నొనర్చి పుణ్యకరతీర్థము లాడినవారు నైన నిన్
బొగడుచునుండుభక్తులను బోలరు ధర్మపురీనృకేసరీ

85. చ. వెలయఁగ నేపురాణములు విన్నదిలేదు పఠింపలేదు పె
ద్దలసహవాస మే నెఱుఁగఁ దత్త్వము గానను దేహసౌఖ్యమే
చెలఁగుచు నేను గోరెదను చెడ్డది మంచిది పాపపుణ్యముల్
దెలియని వెఱ్ఱిమూఢుఁడను దిద్దుకొ ధర్మపురీనృకేసరీ

86. ఉ. కంజదళాక్ష నిన్ను బహుగాఁ గొనియాడెడి వారికెల్ల నే
నంజలిజేసి మ్రొక్కెద దురాత్ముల నన్యులఁ గండ్లఁజూచినన్
రంజిలఁబోదు నామనసు రాజనిభానన దుష్టదైత్యరా
డ్భంజన నీపదాబ్జములఁ బట్టితి ధర్మపురీనృకేసరీ

87. ఉ. సుందరమైన కాంతలను జూచి భ్రమియించెదఁగాని నామన
స్సందున లావసహ్యపడ దాస్తియుఁ గామిను లేఁగుదెంచి నా
ముందఱ నిల్చినన్ విడువ మూర్ఖుఁడ నాకిటువంటి బుద్ధి నీ
వెందుకుఁబెట్టి పెంచితివొ యేలుకొ ధర్మపురీనృకేసరీ

88. చ. భువనములెల్లఁ గాచెడిప్రభుత్వము దండిగ నీకుఁ గల్గె రా
జవు చతురననాదిసురజాలము నీకనుకూలసైన్యమై
రవికుల నిన్నుఁ గొల్వఁగను రాక్షసభంజన నీకు సర్వవై
భవ జయమంగళం బగుట బ్రాతియె ధర్మపురీనృకేసరీ

89. ఉ. మ్రొక్కిన నీకు మ్రొక్కెదను మోదముతోఁ గలనైననుఁగాని నే
తక్కినవేల్పులందఱకు దండము బెట్టను శర్కరాలియున్
బొక్కిననోటితోఁ దవుడు బొక్కఁగఁ బోవునే యెవ్వఁడైన నీ
యొక్కనిమీఁద నేను మనసుంచితి ధర్మపురీనృకేసరీ

90. ఉ. నీ నయమైనకీర్తనలు నేర్పునఁ జక్కని వీణె మీటుచున్
గానము బాడ నారదుఁడఁగాను మహాభయభక్తిప్రేమతో
దానము నీకుఁజేయ బలిదైత్యుఁడగాను జగత్తులోపలన్
నేను వృథా మనుష్యుఁడను నిల్చితి ధర్మపురీనృకేసరీ

91. ఉ.  నిన్ను భజించుభక్తులను నిందలుబల్కుచు జాతు లెన్నుచున్
బన్నుగ గేలిసేయుచును బండ్లిగిలించుచు నవ్వుచున్ మదిన్
బన్నుదురాత్ములన్ యముఁడు వర్లఁగ వర్లఁగ నోటిమీఁద నే
తన్నకపోఁడు నాఁటి కిది తప్పదు ధర్మపురీనృకేసరీ

92. ఉ. శ్రీవనితాకళత్ర నిను జిత్తములోన భజించి నిత్య నీ
సేవలుజేయునట్టి నరశేఖరుసంగతి నాకుఁ గల్గెనా
పావనమయ్యెదన్ సకలపాపము లాపద లన్ని దూరమై
పోవును నేకృతార్థతను బొందెద ధర్మపురీనృకేసరీ

93. ఉ. దేవరవారిభక్తులకుఁ దిన్నగ మ్రొక్కరు భక్తులందఱున్
గోవధఁ జేయింలేచ్చులకు గొబ్బున లేచి సలాము చేతురున్
కేవల పారమార్థికులకే సుమి పెద్దలమీఁదిప్రేమలున్
గావరులైన దుర్జనులు గానరు ధర్మపురీనృకేసరీ

94. ఉ. పెద్దలమంచుఁ బ్రశ్నలిడి పెక్కులు జెప్పెడి పాపకర్ములన్
వద్దికిఁ జేరఁబిల్చుకొని వారిమనస్సుల శోధజేయకే
దిద్దక యేసుమంత్ర ముపదేశము లిత్తురు కాసులాసకై
గద్దరివారి కీపనులు కైకిలి ధర్మపురీనృకేసరీ

95. చ. కలియుగమందు విప్రుఁడనుగాను నృపాలుఁడఁ గాను మేటివై
శ్యులజతవాఁడఁగాను బలుశూరుఁడఁగాను సమస్తమైన జా
తుల నొకరుండఁగాను సుమి దుర్దనుజాంతక నీపదాబ్జముల్
దలఁచెడివారిదాసులకు దాసుఁడ ధర్మపురీనృకేసరీ

96. ఉ. కొండలుగావు దేహములు కుంభినిలోపల శాశ్వతంబుగా
నుండవు ప్రాణముల్ విడువ నొప్పుగ మిత్రుల గాలవేతురో
కండలు మాంస మొల్చుకొని కాకులు గద్దలు మేసిపోవునో
పండితులైననుం బ్రదు కబద్ధము ధర్మపురీనృకేసరీ

97. చ. నరములగుత్తి ముల్లొకటి నాఁటినఁ దాలనితోలుతిత్తి నె
త్తురుగదె దీనినిండ బలుతొమ్మిదిచిల్లులు గల్గకుండ భూ
నరున కిదేమి లెస్స యగు నమ్మినవారికి లావు ఫిస్స చీ
మురికిది పాడుమొక్క సుమి ముప్పిది ధర్మపురీనృకేసరీ

98. ఉ. నాయజమాని వీవు నిను నమ్మినదాసుఁడ నేను నీకు నా
కాయము నమ్ముకోను మధుకైటభమర్ధన ననుఁగావు నీ
వే యిఁక దిక్కు నాకుఁ బెరవేలుపు లెవ్వరు లేరు సుమ్మి నే
పాయక నిన్నుఁ గొల్చెదను భక్తుఁడ ధర్మపురీనృకేసరీ

99. చ. వనజదళాక్ష నన్నుఁ బెరవానిగఁ జూచెద వేల నివు గ్ర
క్కున దయజూచి నామదిని గోరిక దీర్ప వదేమి నేను జే
సినబలుతప్పు లేమిపుడు చేతులు జాచి నమస్కరించెదన్
గనికరముంచి నేరములఁ గావుము ధర్మపురీనృకేసరీ

100. చ. నరహరి నీపదాబ్జములు నాహృదయంబున నిల్పి లెస్సగా
మురియుచు నే స్మరించెదను మోక్షము లిచ్చెడి దాత వంచు సుం
దర నిను మానఁజాలఁ బరదైవములం గొనియాడనేర న
న్నరమరసేయకయ్య దనుజాంతక ధర్మపురీనృకేసరీ

101. ఉ. ఓకరుణాసముద్ర పురుషోత్తమ నీపదపంకజంబులున్
నాకు మహాధనంబు శరణాగతుఁదన్ ననుఁ జేతఁబట్టుమీ
నే కపటాత్ముఁడన్ బరమనీచుఁద నేరము లెంచఁబోకుమీ
చేకొని తప్పులన్ని క్షమ జేయుమి ధర్మపురీనృకేసరీ

102. చ. పరమమృదుత్వమైన పదపంకజముల్ నిరసించు శ్రీరమా
కరముల కబ్బినట్టి త్రిజగంబులవారల కిష్టమైన నీ
చరణసరోజయుగ్మములు చయ్యన నాశిరమందు నిల్పి నా
దురితములన్ని దూరముగఁ దోలుము ధర్మపురీనృకేసరీ

103. చ. తరణిసరోజనేత్ర వరదాతవు నీ వనుచుం దలంచి నీ
చరణము లాశ్రయించితిని శాశ్వతమైనవరంబు లిమ్ము మీ
కరుణకు నేను బాత్రుఁడను గష్టము లంటఁగనీయఁబోకుమీ
తఱుచుగ మిమ్ము వేఁడెదను దాసుని ధర్మపురీనృకేసరీ

104. చ. తరణిని గోరు పద్మములు తన్మకరందము గోరు భృంగముల్
శరనిధి గోరు మేఘములు చంద్రుని గోరు చకోరవర్గముల్
పురుషుని గోరు శ్త్రీలు ఘనపుంగవుఁ గోరుదు రెల్లభక్తులున్
గరుణనుగోరు నాహృదయకంజము ధర్మపురీనృకేసరీ

105. చ. ఇతరసుఖంబుఁ గోరకయే యెవ్వఁడు నీమృదుపాదపద్మముల్
సతతముగా భజించినను సకులవంతుఁడు వాఁడె సుమ్మి దు
ర్గతుఁడయి యెవ్వఁడైన రఘురాముని భక్తుల నిందజెసెనా
పతితుఁడు వాఁడె పంచములబంధుఁడు ధర్మపురీనృకేసరీ

106. చ. వరుసతొ వెదశాస్త్రములు వల్లెనవేసి సమస్తశాస్త్రముల్
దిరుగుచు రాజపుజితప్రతిష్ఠను బొందఁగవచ్చుఁగాని పా
మరలు మాని నీభజనమాత్రము జెసెడిభక్తిగల్గుటే
నరులకు దుర్లభంబు సుగుణాంబుధి ధర్మపురీనృకేసరీ

107. ఉ. భాగ్యము లిచ్చు నీభజన పాయక నిశ్చలభక్తి యోగవై
రాగ్యము లిచ్చు నిత్యసుఖరాజితమూర్తులఁజేసి సంతతా
రోగ్యసతీసుతాదికనిరూఢి ఘటించుటెగాక ముక్తికిన్
యోగ్యులఁజేయు నన్నిటికి నొప్పుగ ధర్మపురీనృకేసరీ

108. ఉ. నే చతురత్వమే మెఱుఁగ నీకృపవల్లఁ గవీశ్వరుండ నై
తోఁచినపద్యముల్ ముదముతో రచియించితి తప్పులున్న నీ
వే చెలువారఁజేసి వెతఁబెట్టక కోర్కుల నెల్లదీర్చి శే
షాచలదాసు నేలు మునిసన్నుత ధర్మపురీనృకేసరీ

సంపూర్ణము

Saturday, August 10, 2013

రాజగోపాలశతకము - ఉన్నవ యోగానందకవి

రాజగోపాలశతకము
                                ఉన్నవ యోగానందకవి

(సీసపద్యములు)

1. శ్రీకరనిలయమై చెన్నొంది యుష్మత్కృ, పామృతదృష్టిచే నంకురించి
సత్పదసందర్భసరసవాఙ్మహనీయ, శాఖోపశాఖలచాయఁ బరగి
పరమగంధకృద్బహుమానమంజరీ, పరిఫుల్లసుమములఁ బరిమళించి
యలరుచు నుండెడు నస్మన్మహాభాగ, ధేయసారస్వతదివిజతరువు

నందు సత్ఫల ముదయంబు నొందుకొఱకు
సముచితంబుగ సీసశతము రచింతు
సురుచిరాకార ఉన్నవపురవిహార
రాజగోపాల రాధామనోజఖేల

2. బృందావనంబులో బిబ్బోకవతులపైఁ, గూర్మిచే మరుకేళిఁ గూడికూడి
కరుణతోఁ గుబ్జను గైకొని రతిలీల, నలవరించినభంగి జలవుమెఱసి
నవరసాలంకారకవివరప్రోక్తప్ర, వంధాభినుతి చేతఁ బరిఢవిల్లి
కృపఁ జూచి నావంటికించిద్జ్జుఁ డొనరించు, శతకముఁ గొమ్ము శాశ్వతము గాను

నిన్ను వర్ణింప శేషాహినీరజాత
సంభవభవాదులకు నైన శక్యమగునే
సురుచిరాకార ఉన్నవపురవిహార
రాజగోపాల రాధామనోజఖేల

3. దండము పద్మగర్భాండభాండోదర, పుండరీకాక్ష వేదండవరద
దండము కాళీయకుండలిరాట్ఫణా, మండలకృతచిత్ర తాండవపద
దండము మదగజశుండాభదోర్ధండ, చండపరాక్ర మాఖండలనుత
దండము రక్షితపాండవ వాహీకృ, తాండజరాజ విఖండితాఘ

దండ మంభోధిభయదప్రచండకాండ
దండ మతులితశార్జ్గకోదండభరణ
సురుచిరాకార ఉన్నవపురవిహార
రాజగోపాల రాధామనోజఖేల

4. వందన మిందిరాసుందరీహృదయార, విందానుషంగమిళింద నీకు
వందన మమృతాశిసందోహసన్నుత, మందరధరణ గోవింద నీకు
వందన ముజ్జ్వల నందకహతదైత్య, బృంద త్రయీమూలకంద నీకు
వందన మాత్మజకందర్ప దేవకీ, వందన స్తుతముచుకుంద నీకు

ననుచు సద్భక్తిపూర్వకమున వచించు
మనుజులకు ముక్తి కరతలామలక మగును
సురుచిరాకార ఉన్నవపురవిహార
రాజగోపాల రాధామనోజఖేల

5. యదుకులవార్ధి రాకామృతకిరణాయ, భవహరణాయ తుభ్యం నమోస్తు
గగనధునీజన్మకారణచరణాయ, యగధరణాయ తుభ్యం నమోస్తు
కమనీయమౌరళీగానప్రవీణాయ, భద్రగుణాయ తుభ్యం నమోస్తు
కస్తూరితిలకాయ కౌస్తుభాభరణాయ, భర్మచేలాయ తుభ్యం నమోస్తు

పంకరుహలోచనాయ తుభ్యం నమోస్తు
భక్తసంరక్షణాయ తుభ్యం నమోస్తు
సురుచిరాకార ఉన్నవపురవిహార
రాజగోపాల రాధామనోజఖేల

6. అక్షీణరణరంగరక్షోనివహభంగ, పక్షిరాజతురంగ బహుపరాకు
ఘోరారిధర చక్రధారాదళితనక్ర, భారావనీచక్ర బహుపరాకు
తాండవస్ఫుటలీల ఖండితార్జునపాల, పాండవపరిపాల బహుపరాకు
వరభుజంగమతల్ప గురువిక్రమానల్ప, పరమార్థి జనకల్ప బహుపరాకు

భక్తయోగీశహృద్వాస బహుపరాకు
భానుకోటిప్రభాభాస బహుపరాకు
సురుచిరాకార ఉన్నవపురవిహార
రాజగోపాల రాధామనోజఖేల

7. రుక్మిణీహృదయసరోరుహభృంగాయ, భామామనఃపద్మభాస్కరాయ
జాంబవతీచిత్తపద్మసంచరణాయ, తారుణ్యమిత్రవిందాధవాయ
భద్రాహృదాంతరఫలదాయకాయ సు, దంతామనోహరస్వాంతజాయ
వరకళిందాత్మజాసరసప్రియాయ ని, రంతరలక్షణారంజనాయ

రాధికాదృక్చకోరతారావరాయ
దివ్యకల్యాణవిభవాయతే నమోస్తు
సురుచిరాకార ఉన్నవపురవిహార
రాజగోపాల రాధామనోజఖేల

8. భవదీయసత్కథాఫణితపద్యంబులో, నొరగులు మిక్కిలి యుండెనేని
ఇక్షుదండంబు పేడెత్తిన గుజ్జైనఁ, గుంటువోయినఁ గడుఁ గుఱుచయైన
మధురంబుగాక నెమ్మది విచారించినఁ, దిక్తమౌనా యని ధీరులైన
సుకవు లాదరణతోఁ జూతురు గావునఁ, దప్పు లుండిన నైన నొప్పుచేసి

కైకొనుము నీకటాక్షవీక్షణము గలిగి
భవ్యకరుణావిధేయ సద్భక్తగేయ
సురుచిరాకార ఉన్నవపురవిహార
రాజగోపాల రాధామనోజఖేల

9. నీనామపఠనంబు నెమ్మిఁజేసికదా, యాకిరాతుఁడు దా మహర్షి యయ్యె
నీపాదరేణువు నెఱయ సోఁకినఁ గదా, పాషాణ మప్పుడె పడఁతి యయ్యె
నీతరుణాంఘ్రిసంజాత యౌటనె కదా, జాహ్నవి లోకప్రశస్త యయ్యె
నీమంత్ర మెడలోన నిల్పుటనే గౌరి, సర్వమంగళయన జగతిఁ బరగె

నౌరా భదీయదివ్యనామామృతంబుఁ
గ్రోలునరుఁ డేల యితరంబుఁ గోర నేర్చు
సురుచిరాకార ఉన్నవపురవిహార
రాజగోపాల రాధామనోజఖేల

10. మకరిచేఁ గడుడస్సి మది నిల్పి వేఁడిన, గజరాజుఁ గాచినఘనుఁడ వీవు
హాకృష్ణ! యన్నంత నక్షయపటములు, ద్రౌపది కొసఁగినదాత వీవు
అడుకులు దెచ్చిన యాకుచేలునకు సౌ, భాగ్యమిచ్చిన జగత్ప్రభుఁడ వీవు
గంధ మర్చించువక్రాంగిఁ గుబ్జను జూచి, రమ్యాంగిఁగాఁ జేయురాజు వీవు

అహహ నీమహనీయదయార్ద్రచిత్త
వృత్తి వర్ణింప నలవియే విధికినైన
సురుచిరాకార ఉన్నవపురవిహార
రాజగోపాల రాధామనోజఖేల

11. శరధిఁ జొచ్చి బిరానఁ దిరిగి యిట్టట్టుపొ, రలి నోరుదెఱచి కెరలి జలములు
గళగళఁ ద్రాగి వెక్కసమైన నుమియుచుఁ, గషఠఝషములఁ గర్కటకములను
జుట్టి మట్టాడుచుఁ జటులకోపాటోప, మున సోమకాసురుఁ గినిసి పట్టి
కులిశసన్నిభ దంష్ట్రములఁ జక్కుచక్కుగా, నఱికి విక్రమమున మెఱసి వేద

ములను గొనివచ్చి ప్రియమున నలువ కిచ్చి
నట్టి మత్స్యావతార మేమని నుతింతు
సురుచిరాకార ఉన్నవపురవిహార
రాజగోపాల రాధామనోజఖేల

12. పాలమున్నీటిలోపల సురాసురులు గుం, పులుగూడి మందరభూధరంబుఁ
గవ్వముఁ గావించి కాకోదరాధీశు, నాఁకత్రాడుగఁ జేసి యబ్ధిలోనఁ
జేకొనితరువంగ శైలంబు గలఁగిన, సురలమొఱవిని యాదరణతోడ
సంబుధిలోఁ జొచ్చినప్పుడు జలజంతు, జాలంబు భయమున సంచలింపఁ

గూర్మరూపంబుఁ దాల్చి యాకొండ నెత్తి
నట్టి నీవేష మెన్న బ్రహ్మకు వశంబె
సురుచిరాకార ఉన్నవపురవిహార
రాజగోపాల రాధామనోజఖేల

13. సన్నపుఁబదములు నున్ననిగొరిజలు, చిన్నికన్నులు విలసిల్లు చెవులు
వెడఁదఱొమ్మును గొప్పవెన్నును గుఱుచవా, లము కఱవయినరోమములు కొద్ది
నడుమును బటువైనయొడలు నున్నతఘోణ, మును గడునిశితదశనయుగమును
గిటగిట గీటించు ఘుటఘుటార్భటముల, నడరి మహార్ణవమందుఁ జొచ్చి

హేమనయనాసురుని జంపి భూమి సవ్య
రదమునను నానినట్టివరాహరూప
సురుచిరాకార ఉన్నవపురవిహార
రాజగోపాల రాధామనోజఖేల

14. చిడిముడి హేమకశిపుఁడేడిరాచక్రి, స్తంభంబులో నని చఱచినపుడు
పటపట స్తంభంబు పగిలి భీకరకారా, ళముఖము నిశితనఖములుఁ గ్రకచ
కఠినదంష్ట్రలుచిఱు కన్నులు కొద్దినె, న్నడుమును జొక్కపునిడుదవాల
మలర నృసింహమై వెలసి కీలార్చి వి, పక్షుని పెనుకళేబరముఁ జించి

రక్తధారలు గురియ నాగ్రహము మెఱసి
నట్టినీ శౌర్య మెన్నఁగా నజుని వశమె?
సురుచిరాకార ఉన్నవపురవిహార
రాజగోపాల రాధామనోజఖేల

15. చిఱుతపాదములును జిన్నారిబొజ్జయుఁ, గుఱచకర్మములు గులుకుమోము
నిద్దంపుఁజెక్కులు కొద్దియంగుళములు, కరకమండలము వ్యాఘ్రాజినంబు
నారముంజియు గోఁచి యాతపత్రంబును, యజ్ఞోపవీతంబు నక్షమాల
యునుధరియించి వామనుఁడవై బలిని బ, దత్రయభూమిని దాన మడిగి

యవని దివి రెండుపదముల నాక్రమించి
యొక్కపాదంబుఁ దలమీఁదఁ ద్రొక్కితౌరా
సురుచిరాకార ఉన్నవపురవిహార
రాజగోపాల రాధామనోజఖేల

16. భార్గవరామరూపము ధరించి కరము, న ధనువుఁ బట్టి దొనలు వహించి
గండ్రగొడ్డలిఁబూని కదిసి రాజులమీఁద, శరవృష్టి గురియుచు నఱకునపుడు
కూలు తేరులు ధరవ్రాలు ఘోటకములు, పడియున్న కరులు కబంధములును
తెగిపడ్డతలలు విఱిగిపడ్డరాజులు, నైనయాహవభూమియందు నిలిచి

కార్తవీర్యుని భుజములగర్వ మణఁచి
విజయ మొనరించితౌ జగద్విదితముగను
సురుచిరాకార ఉన్నవపురవిహార
రాజగోపాల రాధామనోజఖేల

17. దశరథసుతుఁడవై తాటకఁ దునిమి సు, బాహుని ద్రుంచి తపసునిజన్న
మునుగాచి యాశంకరునివిల్లు విఱిచి సీ, తను బెండ్లియాడి మోదమునఁ జెలఁగి
తండ్రివాక్యమునిల్పి దండకాటవిఁ జొచ్చి, మాయామృగముఁ జంపి జాయఁ బాసి
వాలినిగూల్చి భాస్వత్తనూజునిగూడి, సామీరిచే సీతసేమ మరసి

వనధి బంధించి రావణవధ మొనర్చి
యవనిజను గూడుకొన్న రామావతార
సురుచిరాకార ఉన్నవపురవిహార
రాజగోపాల రాధామనోజఖేల

18. కలువపూవన్నియచెలువుచల్లడము జొ, క్కపునీలిధట్టి నిగన్నిగప్ర
భలు గుల్కునల్లనిపట్టుదుప్పటి నీల, మణికిరీటము మృగమదతిలకము
ధరియించి రాజసత్వము మీఱి కంసుని, సభఁ జొచ్చి భుజములు చఱచి మల్ల
రంగంబులో నిల్చి పొంగుచు, ముష్టికా, సురుని జయించి కంసుని వధించి

నట్టి నీబలభద్రరామావతార
మహిమ వర్ణింపఁగా నౌనె మర్త్యులకును
సురుచిరాకార ఉన్నవపురవిహార
రాజగోపాల రాధామనోజఖేల

19. వెలయఁ బురత్రయములరాక్షసులు నిజ, భార్యాపతివ్రతాప్రాభవమున
విజయులై వెలిఁగి దివిజుల బాధింప నా, యమరులు మొఱవెట్ట నాదరమున
విని వారి కభయంబు మునుకొని యొసఁగుచు, బుద్ధరూపముఁ దాల్చి పొందు మీఱ
వరదితిజాంగనా వ్రతభంగ మొనరించి, శివునినిల్కానిఁగాఁ జేసి నీవు

శరముఖంబున నిలిచి తత్పురనివాస
పుణ్యజనులను ద్రుంచితౌ ముదముతోడ
సురుచిరాకార ఉన్నవపురవిహార
రాజగోపాల రాధామనోజఖేల

20. కడునొప్పు గొరిజలు వెడఁదఱొమ్మును జిరు, కొద్దివాలము వెన్ను కుఱుచఁదనము
కళలు గుల్కెడుమోము గలపంచకల్యాణి, హయముకుఁ జికిలికళ్లియము పసిఁడి
పల్లము ముత్యపుజిల్లుల యంకవ, న్నియలును గైసేసి హొయలుమీఱఁ
బెనువిల్లు తరకసంబును వజ్రంపుబాకుఁ, గట్టి యుత్తమతురంగంబు నెక్కి

యవనిఁ దిరిగెడునీదుకల్క్యావతార
విభవ మెన్నంగ నగునె యావిధికినైన
సురుచిరాకార ఉన్నవపురవిహార
రాజగోపాల రాధామనోజఖేల

21. చోఱవై జలనిధి చొచ్చిన కూర్మమై, కొండవీఁపున నానుకొనిన ఘోణి
వై నేలత్రవ్విన వరనృసింహంబ వై, భయపెట్టినను పొట్టిబ్రహ్మచారి
వై దానమడిగిన మేదినీసురుఁడ వై, రాజులఁ గొట్టినరాజువయ్యు
నడవులదిరిగిన హలముమోచిన బుద్ధ, కలికి రూపములచే వెలసియుండి

నన్ను రక్షింపకున్న వెన్నంటివచ్చి
పట్టి సాధింతు నీబంటుపంత మిటుల
సురుచిరాకార ఉన్నవపురవిహార
రాజగోపాల రాధామనోజఖేల

22. పాలకడలి వటపత్రశయనుఁడ వై, యోగనిద్రాముద్ర నొందియుండి
నను శేషఫణిరాజఘనఫణామండల, సింహాసనంబునఁ జెలఁగియున్న
గరుడవాహనమెక్కి మురియుచు లోకముల్, దిరుగంగఁ బోయిన వరమునింద్ర
హృదయాంతరంబుల నొదిగి తారుండిన, సూర్యమండలమునఁ జొచ్చియున్న

నన్ను రక్షింపకున్న వెన్నంటివచ్చి
పట్టి సాధింతు నీబంటుపంత మిటుల
సురుచిరాకార ఉన్నవపురవిహార
రాజగోపాల రాధామనోజఖేల

23. తల్లిదయాహీనతను జన్నియనివార్త, యెఱిఁగి పొర్గింటను బెరుగుటయును
దానవిచనుబాలు త్రావి జీవించుట, దొంఇగ్లి వెన్నలు మ్రింగుటయును
జాలరోసి యశోద ఱోలఁ గట్టినసుద్ది, ముద్దులు గూల్చినపెద్దఱికము
గొల్లభామలకట్టుకోఁక లెత్తుకపోయి, పొన్నమ్రానెక్కినపిన్నతనము

పసులకాపరి వైనట్టిపలుచఁదనము
చెలఁగి చాటుదు నను రక్షింపకున్న
సురుచిరాకార ఉన్నవపురవిహార
రాజగోపాల రాధామనోజఖేల

24. సలలితంబుగ మూఁడునెలలబాలుండవై, బండిఁ దన్నినయట్టిదుండగంబు
వలనొప్ప నేఁడాదివాఁడవై యాతృణా, వర్తునిఁ జంపినధూర్తతనము
క్రేపులఁ గాచుచోఁ గినిసి బకాసురుఁ, బట్టిద్రుంచినయట్టిదిట్టతనము
ఆటలాడుచును వత్సాసురు నదరంట, సెలగోలఁ గొట్టినబలిమి కలిమి

ఖరదనుజుఁ గూల్చినట్టియాచుఱుకుఁదనము
చెలఁగి చాటుదు నన్ను రక్షింపకున్న
సురుచిరాకార ఉన్నవపురవిహార
రాజగోపాల రాధామనోజఖేల

25. గోవుల మనుజుల బ్రోవ గోవర్ధన, గిరిఁ గేల నెత్తినబరవసంబు
సొంపు మీఱఁగ నాయశోదకు ముఖమున, లోకముల్ చూపినభీకరంబు
బలియుఁడవై గోపభామినీమణులను, దుడుకుపనుల్ సేయుపడుచుఁదనము
పరమేష్ఠి దాఁచిన బాలవత్సములను, బ్రతికల్పనము చేయు చతురతయును

దగిలి కార్చిచ్చు మ్రింగిన తెగువతనము
చెలఁగి చాటుదు నన్ను రక్షింపకున్న
సురుచిరాకార ఉన్నవపురవిహార
రాజగోపాల రాధామనోజఖేల

26. ధట్టించి మల్లయుద్ధమునఁ జాణూరునిఁ, బట్టిత్రుంచిన యట్టిదిట్టతనము
అపకీర్తికోడక యవలీలగా మేన, మామను జంపిన తామసంబు
అవినీతుఁడగు కాలయవనుని ధాటికి, వెఱచి పోయినయట్టి పిఱికితనము
రూఢిగా బావయౌ రుక్మకు ననయుని, మూతి గొరిగినట్టి ములుచదనము

అత్త యగురాధ నంటినయపశయంబు
చెలఁగి చాటుదు నన్ను రక్షింపకున్న
సురుచిరాకార ఉన్నవపురవిహార
రాజగోపాల రాధామనోజఖేల

27. పాందవు ల్పంపినపని కియ్యకొనిపోయి, దూతకృత్యము చేయుకౌతుకంబు
విహితబాంధవులను విడిచి విదురినింట, విందారగించిన పొందికయును
గర్ణదుర్యోధనుల్ దుర్నీతులై పట్ట, విశ్వరూపముఁ జూపు విభ్రమంబుఁ
జుల్కదనం బని చేడక విజయుని, సారథి వైనట్టి పౌరుషంబు

ఘోటకాసురుఁ దునిమిన పాటవంబు
చెలఁగి చాటుదు నన్ను రక్షింపకున్న
సురుచిరాకార ఉన్నవపురవిహార
రాజగోపాల రాధామనోజఖేల

28. ఎలమి సత్రాజిత్తునిల్లుఁ జూడఁగఁబోయి, యలశమంతకమణి కాసపడుట
మణి ప్రసేనుండు ప్రేమను గొనిపోవఁగా, నీవు మానవులచే నిందపడుట
జాడపట్టుకపోయి జాంబవతుం డున్న, గుహఁ జొచ్చి యాతనిమార్కొని నిలుచుట
ఆభల్లుకేశ్వరుం డాత్మజాతను మణిఁ, దెచ్చియిచ్చిన బ్రీతిఁ బుచ్చుకొనుట

తెలిసి యపవాద మెల్లను దీర్చుకొనుట
చెలఁగి చాటుదు నన్ను రక్షింపకున్న
సురుచిరాకార ఉన్నవపురవిహార
రాజగోపాల రాధామనోజఖేల

29. కేళికిఁగలియక చాలఁ గోపించిన, యాలికి మ్రొక్కినబేలుఁదనము
వెలఁదిమాతలువిని యలకల్పవృక్షంబు, నిలకుఁ దెచ్చినయట్టిబలిమికలిమి
నరకాసురుని జూచి వె!రచి యాసత్యకుఁ, జేసాచి విల్లిచ్చుకోఁచదనము
కారియఁ బడియున్నకన్యకాషోడశ, సాహస్రములమీఁద మోహపడుట

గొల్లయిల్లాండ్రమానముల్ కొల్లగొనుట
చెలఁగి చాటుదు నన్ను రక్షింపకున్న
సురుచిరాకార ఉన్నవపురవిహార
రాజగోపాల రాధామనోజఖేల

30. ముద్దులుగుల్కునెమ్మోము నిద్దపుఁదళ్కుఁ, జెక్కులసొబగు నాసికము వెడఁద
కన్నులు జిగినొప్పుకర్ణము లాజాను, దీర్ఘబాహువులు విస్తీర్ణవక్ష
మును సోయగపుమేను తనుమధ్యమమును చిన్న, బొజ్జయు నునుగాంతిపొడముతొడలు
చెలువంపుజంఘలు చిఱుతపాదములును, గలిగి యొప్పులకుప్పకరణిఁ దేజ

రిల్లు నినుఁ గన్నతల్లి నారీమతల్లి
దేవకీదేవి భాగ్యంబు దెలియ వశమె
సురుచిరాకార ఉన్నవపురవిహార
రాజగోపాల రాధామనోజఖేల

31. లలితముక్తామణిలాలాటికద్యుతుల్, నిటలంబుమీఁదను నృత్యమాడఁ
గాంచనరత్నసంగతరశనాఘంటి, కానినాదము ఘల్లుఘల్లు మనఁగఁ
గరయుగమంజుల కంకణరోచులు, గగనభూభాగముల్ గప్పుకొనఁగ
వెలయంగఁ గరమున వెన్నముద్ద ధరించి, కొత్తకంబళమున నొక్కింత దాఁచి

కొనుచు దోఁగాడునిన్నుఁ గన్గొను యశోద
పుణ్యఫల మింతయని చెప్పఁబోల దౌర
సురుచిరాకార ఉన్నవపురవిహార
రాజగోపాల రాధామనోజఖేల

32. ధగధగద్యుతులతొఁ దనరుముత్తియముల, రావిరేక నుదుట ఠీవిఁ జూప
రత్నసంఘటిత మై రంజిల్లుమద్దికా, యలజోడు చెక్కులలరింపఁ
బులిగోరు నేవళమునఁగల్గునునుకాంతి, గరిమ యురంబునఁ గప్పుకొనఁగ
మణిమయమంజులమంజీరనినదంబు, కడఁగి యొక్కొకసారి ఘల్లుమనఁగ

తప్పటడుగు లిడుచు నాదనొప్పు నిన్నుఁ
గన్నతల్లియు భాగ్యము నెన్నవశమె?
సురుచిరాకార ఉన్నవపురవిహార
రాజగోపాల రాధామనోజఖేల

33. ఆనిముత్తియముల నమరినకుళ్ళాయి, శిరమున నొకవింతచెలువు మెఱయఁ
దళతళ మనుపైఁడితళ్కులకుబుసంబు, కమనీయతనునీలకాంతు లీనఁ
బదయుగంబున నున్నపసిఁడిగజ్జలు సారె, కును ఝుణంఝుణ ఝుణంఝుణ యనంగ
ముంగిటఁ దిరుగంగ ముద్దులమాతలు, విని నందుఁ డానందమునఁ జెలంగి

యయ్య రావోయి యటుపోకు మనుచునిన్నుఁ
గౌగిలించినతండ్రిది గాక ఫలము
సురుచిరాకార ఉన్నవపురవిహార
రాజగోపాల రాధామనోజఖేల

34. బెడఁగైనయట్టిచల్లడము ధరించి పైఁ, దలుకుబంగరువన్నెదట్టి గట్టి
చెలువార సందిట నెలవంకజాళువా, తాయెతుల్ గట్టి కౌశేయశాటి
వల్లెవాటుగ వేసి వాసిందుకస్తూరి, తిలకంబు నుదుటనుదీర్చి శిరము
మూర్కొని చెక్కిళ్ళు ముద్దాడుచును దండ్రి, రావోయి యనుచు గారాబమునను

నిన్నుఁ జం కిటు లిడుకొని యున్నమాయ
శోదసౌభాగ్య మెంతని స్తుతి యొనర్తు
సురుచిరాకార ఉన్నవపురవిహార
రాజగోపాల రాధామనోజఖేల

35. అమ్మ! ఏమిర యాదవాగ్రణి? గిన్నెదే;, ఏలరా చషకంబు? పాలు ద్రావ;
నిపుడు దుగ్ధములులే; వెప్పుడుగల్గును?, రాత్రికాలమునందు; రాత్ర మెపుడు?
నంధకారపువేళ; ననినఁ గన్నులు మూసి, యిదె నిశివచ్చెనే యిమ్ము పాన
పాత్రంబుఁ దెమ్మని బలిమి యశోదమ్మ, పైఁటకొం గీడ్చినబాల్యచేష్ట

లన్నియును జూపరులకుఁ జోద్యంబు లగుచు
నేత్రపర్వంబులౌ నీ విచిత్రమహిమ
సురుచిరాకార ఉన్నవపురవిహార
రాజగోపాల రాధామనోజఖేల

36. వెఱువకదినమును బొరుగిండ్లఁ జొరబడి, మీఁగడల్ వెన్నలు మెసవి మెసవి
యుట్లమీఁదటిపాలచట్లు చేయందక, తగురంధ్రమొనరించి త్రావి త్రావి
పెరుగుకుందలలోన నురువడి చేవెట్టి, సొంపుగా నొకకొంత జుఱ్ఱిజుఱ్ఱి
యొరులు చూడకయుండ నరిగి యెప్పటియట్ల, తోటిబాలురతోడ నాటలాడి

కేరి నవ్వుచుఁ దల్లికౌఁగిట వసించి
తౌర నీచౌర్యమహిమ యేమని నుతింతు
సురుచిరాకార ఉన్నవపురవిహార
రాజగోపాల రాధామనోజఖేల

37. ఏమిరా కృష్ణ! మ న్నేఁటికిఁ దిన్నావు?, అమ్మ! నేఁ దినలేదు అయ్యతోడు
చిన్నవాండ్రందఱు చెప్పిరి గదవోయి, నీవు వారలమాట నిజము జేసి
విందువా నేనంతవెఱ్ఱినా శిశువునా!, ఆఁకొంటినా! చూడవమ్మ నోటి
వాసన యనుచును వక్త్రంబుఁ దెఱచి లో, నా యశోదకును బ్రహ్మాండభాండ

పంక్తులెల్లను దొంతులపగిదిగాను
బెంపుచేసిననిన్ను వర్ణింప దరమె?
సురుచిరాకార ఉన్నవపురవిహార
రాజగోపాల రాధామనోజఖేల

38. తనరంగ నాయశోదాదేవి యొకనాడు, దధికుంభమున నించి తరుచుచుండఁ
జని నీవు పెరుఁగుతె మ్మనుచుఁ గవ్వముఁ బట్టు, కొన్న యాకుండలో గుమ్మఁడనెడు
బూచి యున్నాఁడురా పొమ్మని బెదిరింప, గుమ్మణ్ణిచూపవే యమ్మ యనుచుఁ
గరమునఁ జేలంబుఁ గట్టిగఁ బట్ట నా, ఘుమ్మనునాదమే గుమ్మడనిన

నవ్వు మోమునఁ జిల్కఁ జిన్నారిబొజ్జ
గదల గంతులు వేసినఘనుఁడ వహహ
సురుచిరాకార ఉన్నవపురవిహార
రాజగోపాల రాధామనోజఖేల

39. అమ్మ! మీఁగడపాలు తెమ్ము లే లెమ్మని, పాణిపంకజమునఁ బైఁటఁబట్టి
తిగిచినమోము నొద్దికచూచి ముద్దాడి, గిలిగింతలిడుచుఁ గౌఁగిటను జేర్చి
ఔనుర కృష్ణ! నీ వాఁకలి గొన్నావు, బువ్వపెట్టెద నని యవ్వధూటి
మీఁగడపాలతో మేళగించినయోగి, రముఁ దవనీయపాత్రముననునిచి

చేతి కందీయ మెసఁగినకౌతుకంబుఁ
దలఁచి వర్ణింప నెవ్వరి కలవియగునె
సురుచిరాకార ఉన్నవపురవిహార
రాజగోపాల రాధామనోజఖేల

40. గోపబాలురతోడఁ గూడి నిత్యంబును, వత్సంబులను గాయ నుత్సాహించి
నునుబట్టుపచ్చడమును మేనఁగీలించి, కనకచేలము బిగికాసెఁగట్టి
పదముల రంజిల్లఁ బాదుకల్ ధరియించి, కరమున సెలగోల నెఱయఁ బట్టి
క్రేపుల నదలించి కేరుచుఁ జెలికాండ్రఁ, జేరుచుఁ జిరునవ్వు చిల్కుమోము

పూర్ణచంద్రునిరీతి బొలుపుమిగిలి
వెలయునీగోపవేషము చెలువుఁదలఁతు
సురుచిరాకార ఉన్నవపురవిహార
రాజగోపాల రాధామనోజఖేల

41. మౌళిపైఁ జుట్టినమాయూరబర్హంబు, బలభేదికార్బుకప్రభలు గాఁగ
భువనమోహన మనమురళీనినాదంబు, పటుతరస్తనితశబ్ధంబు గాఁగ
ఘనతరోరఃకనత్కౌస్తుభమణికాంతి, లాలితచంచలాలతిక గాఁగఁ
గమనీయదృక్కోణకరుణారసంబులు, రాజితవర్షనీరములు గాఁగఁ

బ్రావృడంబుదతుల్యవిగ్రహము సొంపు
లలర బృందావనంబున వెలసి తౌర
సురుచిరాకార ఉన్నవపురవిహార
రాజగోపాల రాధామనోజఖేల

42. ఏకాంతి గని గోవు లిది కలిందాత్మజా, జల మనుశంకచేఁ జనును ద్రావ
నేదీప్తినీక్షించి యిది వలాహక మని, మత్తమయూరముల్ నృత్తమాడు
నేరుచిఁ జూచి యాభీరకాంతలు తమా, లదళంబు లివియని చిదుమఁదలఁతు
రేశోభఁ గనుఁగొని యిలలోన శిశువులు, సరసజంబూఫలేచ్చను జెలంగి

రట్టి భదీయమూర్తిమహఃప్రభావ
మితరులను భ్రాంతి నొందించుటెంతయరుదు
సురుచిరాకార ఉన్నవపురవిహార
రాజగోపాల రాధామనోజఖేల

43. ఆపీతదుగ్ధమై యభినవనవనీత, సంస్నిగ్ధమై ఘనసదృశమగుచుఁ
గోమలతాపించగుచ్చసమాన మై, ముగ్ధమై దధికణదిగ్ధ మగుచు
నమలకేకీంద్రబర్హాలాంచితము నయి, వాసవోపలసువిలాస మగుచు
నలరుయుష్మద్విగ్రహము భక్తజనమనో, వాంచితంబును దీర్చు నంచితముగ

భువనమోహనరూప విస్ఫూరితశార్ఙ్గ
చాప యదుకులభూషణ చక్రహస్త
సురుచిరాకార ఉన్నవపురవిహార
రాజగోపాల రాధామనోజఖేల

44. తతగోఖురోద్ధూతధరణీపరాగంబు, గప్పినకుంతలాగ్రంబుతోడ
సంచరణాయానజనితఘర్మాకంబుకం, దళిశోభితామలాననముతోడ
నధ్రబింబాసక్తపృథులవేణూద్భవ, సవ్యమాధుర్యగానంబుతోడ
భద్రదంతావళప్రతిమానయానంబు, తోడ గోపాలురతోదఁ గూడి

సంజకడ నీవు రాఁజూచి సంభ్రమమున
ఘోషకాంతలు నీపొందుఁ గోరి రౌర
సురుచిరాకార ఉన్నవపురవిహార
రాజగోపాల రాధామనోజఖేల

45. ఒకనాడు గోపికాయూధంబుతోఁ గూడి, కడిమిమైఁ జని కుప్పిగంతులిడుచు
నొకసారి గుమిగూడి యుల్లాసమునఁ బూని, జోడుదాఁగిలిమూఁత లాడుకొనుచు
నొకవేళ ముదమున నుప్పొంగి కొలఁకుల, సారెకు జలకేళి సలుపుకొనుచు
నొకమాటు నవకుసుమోదయవనములఁ, బువ్వుల నొండొరుల్ రువ్వుకొనుచు

జెలఁగి యిచ్చావిహారంబుఁ జేయునీదు
శైశవక్రీడ లేమని చెప్పువాఁడ
సురుచిరాకార ఉన్నవపురవిహార
రాజగోపాల రాధామనోజఖేల

46. ఏరుచి వదనపంకేరుహాసంగిభృం, గనివహవ్యామోహకరముఁ దాల్చు
నేబెడం గమలముఖేందుమండలమున, సలలితలాంఛనశంకఁ జూపు
నేకాంతి కుంతలానీకసూర్యాత్మజా, రమణీయకుల్యాభ్రమము వహించు
వేఛవి దృష్యమాణేందీవరేక్షణా, చిత్తజబాణమై చెలువు నెఱపు

నట్టికస్తూరితిలకముఁ బెట్టి నుదుట
సతుల వలపించుటకు నెఱజాణ వీవె
సురుచిరాకార ఉన్నవపురవిహార
రాజగోపాల రాధామనోజఖేల

47. ఏరవం బభినవాభీరకామినులను, వశలఁగ మోహప్రవశలఁ జేయు
నేనినాదము సూరిమౌనిసంఘములకు, శ్రావ్యమై చిరకాలభవ్య మొసఁగు
నేధ్వని *మృగగోపతండములకు మనో, హరముగాఁ దాపాపహరము చేయు
నేశబ్ధ మసురకులేశవినాశన, కరముగాఁ హృదయభీకరముఁ జూపు

నౌర! నీకేలఁ బట్టినచారువంశ
నాలనినదంబు లంతవిన్నాణ మయ్యె
సురుచిరాకార ఉన్నవపురవిహార
రాజగోపాల రాధామనోజఖేల
(*గోగోపమృగసంతతికి అని పాఠాంతరము)

48. శుండంబు నవనీతసుందరగంధవా, హాలంకృతంబుగా నలరుచుండ
మాటలు తస్కరకోటియుక్తివ్యాజ, పాటనంబున మీటి తేటపడఁగఁ
గన్నులు కుహనాప్రకారభాసురములై, జారవిలాససంచరతఁ దెలుపఁ
దరుణాంఘ్రిపంకజద్వంద్వంబు సారెకుఁ, బటుతరతాండవభ్రమము నెఱప

సొబగు మీఱిననినుఁ జూచుసుదతు లెల్లఁ
బంచశరసాయకంబులపాలు గారె
సురుచిరాకార ఉన్నవపురవిహార
రాజగోపాల రాధామనోజఖేల

49. ఎవ్వనిమృదుభాష లిందుబింబాననా, శ్రవణరంధ్రములకుఁ జవులు గఱపు
నెవ్వనిక్రేఁగంట నెసఁగినచూడ్కులు, కామినీహృదయముల్ గఱఁగఁజేయు
నెవ్వనిమోవి పైనవ్వు భామాజన, వరలోచనోత్సవకరము నెఱపు
నెవ్వనిసుందర మిక్షుకోదండుని, భంగి నింతులనెల్ల భ్రమయఁ జేయు

నట్టినీమోహనాకార మవనిలోన
వలపుఁ బుట్టింపదే పతివ్రతలకైన
సురుచిరాకార ఉన్నవపురవిహార
రాజగోపాల రాధామనోజఖేల

50. పంతగింపుచు గోపబాలురతోఁగూడి, కందుకక్రీడలఁ జెందుచున్న
తఱి నొక్కఘోషసుందరి పొడచూపినఁ, గడువేగ నాకాంతఁ గదియఁబోయి
యిదె బంతివచ్చె నోయెలనాఁగ నీపైఁత, కొంగుఁ జాపు మటంచుఁ గుదియఁబట్టి
కుచములపై నఖకోరకంబులు నిల్పి, యరసిన బంతి లేదంచు మరలి

మొలకనవ్వులు మోముపైఁ జిలుకవచ్చు
నట్టినీచతురత్వ మేమని వచింతు
సురుచిరాకార ఉన్నవపురవిహార
రాజగోపాల రాధామనోజఖేల

51. మందకుఁ జనుచున్నమందయానను జూచి, వెనుకొనిపోయి వేవేగఁ గదిసి
పెండ్లికూఁతుర నీదుపెనిమిటిపేరేమి, చెప్పుమా యని కేళు చేతఁ బట్టి
నలుదిక్కు లీక్షించి బలిమిఁ గౌఁగిటఁ జేర్చి, ఘనమాలతీకుడుంగమున నునిచి
కరములఁ బాలిండ్లు గదియించి బిరబిర, పలుచనికెమ్మోవిఁ బంట నొక్కి

మారుకేళిని గూడినబేరజంపు
చర్యఁ దలపోయ జనుల కాశ్చర్యమయ్యె
సురుచిరాకార ఉన్నవపురవిహార
రాజగోపాల రాధామనోజఖేల

52. పొరుగూరఁ జల్లమ్మఁబోయినగొల్లయి, ల్లాండ్రను ద్రోవలో నడ్డగించి
వనితలారా మీకు వల్లభు లెవ్వార, లెందుండుదురు మీర లేకతమునఁ
జిక్కితిరిఁక నేమిచేతురు నాతోడ, మదనకేళికి రండు ముదముతోడ
ననుచు జంకించి యవ్వనరుహనయనలఁ, బొదరిండ్లలోఁ దార్చి భూరిసత్వ

శాలివై యందఱికి నన్ని చందములను
నల్లపని చేసి విడిచినబల్లిదుఁడవు
సురుచిరాకార ఉన్నవపురవిహార
రాజగోపాల రాధామనోజఖేల

53. కౌతుకంబున ఘోషకాంతలు యమునాన, దీజలకేలిని దేలుచున్న
సమయంబుఁ జూచి వేచని వారివస్త్రంబు, లన్నియు గొనిపోయి పొన్న యెక్క
నతివ లంశుకవిహీనాంగనలై లజ్జించి, యతనుమందిరముల హస్త మిడుచు
వలువలిమ్మని వేఁడ వనితలారా చేతు, లెత్తి మ్రొక్కినఁ జీరలిత్తు ననుచు

కీరవాణులచేత మ్రొక్కించుకొనుట
యెంత వింతని నే విన్నవింతు నౌర
సురుచిరాకార ఉన్నవపురవిహార
రాజగోపాల రాధామనోజఖేల

54. కుసుమాపచయకాంక్ష గోపిక్క ల్వనవాటి, కేగినజాడల నెఱిఁగి వెంటఁ
బడిపోయి వనములోఁ బడఁతులఁ గనుఁగొని, యింతులార! సుమము లిచట లేవు
ముందట మల్లెలు మొల్లలు గలవని, తప్పుమాటలు కొన్ని చెప్పి పొదలు
చొరఁదీసి బలిమిచేఁ బరిరంభణము చేసి, యధరబింబామృతం బాని యూని

సురతకేళిని వేర్వేఱఁ జొక్కఁ జేసి
తౌర నీవెంతనేర్పరి వని వచింతు
సురుచిరాకార ఉన్నవపురవిహార
రాజగోపాల రాధామనోజఖేల

55. పా లమ్మఁజనుగొల్లపడఁతులవెనువెంట, బరిగి కాననభూమి నడ్డగించి
బలిమిచే నొకయింతి పాలిండ్లు చెనకుచు, మురియుచు నొకకాంతమోవి నొక్కి
సుందరి నొక్కర్తుఁ జూచి చెక్కిలి మీటి, కామిని నొక్కర్తుఁ గౌఁగిలించి
ముదముతో వారిని మోహవశలనుఁ గా, వించి కంతునికేళి వేడ్కలలర

నందఱికి నన్నిరూపులై పొందినట్టి
నీదుచాతుర్యమహిమ వర్ణింప వశమె
సురుచిరాకార ఉన్నవపురవిహార
రాజగోపాల రాధామనోజఖేల

56. బృందావనమున నాభీరకాంతలనెల్ల, దినదినంబును బల్మి నొనరఁగూడి
మాపటివేళల నేపార నిండ్లకుఁ, జని పురుషులు లేని సదనములను
జొచ్చి కన్యలఁ జూచి మచ్చిక నచ్చిక, బుచ్చిక ల్గావించి పొందుగాను
సరసంబు లాడుచుఁ జక్కిలిగింతలు, పెట్టుచు వారలగుట్టు లరసి

పాన్పుమీఁదటఁ గ్రుంగిలఁబడఁగఁ దిగిచి
ప్రథమసురతంబుఁ గావించుప్రౌఢ వౌర
సురుచిరాకార ఉన్నవపురవిహార
రాజగోపాల రాధామనోజఖేల

57. నందునిసోదరి సుందరీమణి రాధ, యొకనాఁడు నీసొబ గొనరఁ జూచి
రారకృష్ణా యని గారవంబునఁ బిల్వఁ, జని నీవు ప్రేమ నవ్వనరుహాక్షి
మిసమిసమను మేనిపసఁ జూచి సిబ్బెపు, గబ్బిగుబ్బలసోయగంబుఁ గాంచి
తత్తరంబునను మేనత్తని తలంచక, చేరి కౌఁగిటిలోనఁ జేర్చి కూర్మి

నతనుకేళిని దేల్చినవితతచరిత
మెంత వింతని సారె వర్ణింతు నహహ
సురుచిరాకార ఉన్నవపురవిహార
రాజగోపాల రాధామనోజఖేల

58. రాథావధూటి నిరంతరప్రేమాతి, శయభవదర్పితస్వాంత యగుచు
దధిరిక్తమైనట్టిపృథులకుంభమున, మంథదండంబుఁ బల్మారు పూని
తఱచఁగ నీవును దత్కుచస్తంభచం, చలలోలదృష్టిచే నలరి ధేను
దుగ్ధదోహనమునకై తొడరి యాఁబోతును, బిదుకంగఁ బోవుట విదితమయ్యె

నౌర విహ్వలచిత్తులై యలరినట్టి
యుభయమోహంబు లెంతనియభినుతింతు
సురుచిరాకార ఉన్నవపురవిహార
రాజగోపాల రాధామనోజఖేల

59. యమునాతటంబున నమరంగ నొకరాత్రి, నవ్యమాధుర్యగానంబు సేయ
వినిగోపకాంతలు విహ్వలస్వాంతలై, పతులను సుతులను బరగ విడిచి
వచ్చి భవన్ముఖవనజంబు బొడగాంచి, విరహాగ్నితప్తలై వేఁడుకొనినఁ
గరుణించి యాఘోషకామినీజనముల, కన్ని రూపములఁ బ్రియం బొనర్చి

రాచకేళిని దేల్చినప్రాభవంబుఁ
జూచి వర్ణింపఁగాఁ దమ్మిచూలివశమె
సురుచిరాకార ఉన్నవపురవిహార
రాజగోపాల రాధామనోజఖేల

60. ముదముతో రుక్మిణి గదిసి వీడె మొసంగఁ, దగ సత్యభామ గంధంబుఁ బూయ
జాంబవతీకన్య చామరంబులు వీవ, మిత్రవింద విపంచి మేళవింప
భద్ర దా శ్రీపాదపద్మంబు లొత్తంగఁ, బరగ సుదంత దర్పణముఁ జూపఁ
గాళింది నవపుష్పమాలిక లొసఁగంగ, లక్షణ శయ్య నలంకరింప

స్త్రీలు కొలువున్న వేళలఁ చిత్తభవుని
బలెను శృంగారరసము నీకలరె నౌర
సురుచిరాకార ఉన్నవపురవిహార
రాజగోపాల రాధామనోజఖేల

61. బాణునివీటిలోపల ననిరుద్ధుండు, రుద్ధుఁడై పడియున్న రోష మొదవి
చని వానివాఁకిట నొనరంగఁ గాపున్న, హరుని బాణాహతి నురువడించి
యారక్కసునితోడ నడరి కయ్యముచేసి, చతురంగబలములఁ జదియఁగొట్టి
సాహసంబున ఘనచక్రధారను బాణ, దనుజునిబాహువుల్ దునిమి వైచి

విజయశంఖంబుఁ బూరించువేళఁ జూడ
వీరరస మెల్ల నీయందె వెలసె నౌర
సురుచిరాకార ఉన్నవపురవిహార
రాజగోపాల రాధామనోజఖేల

62. ధరణిలో నొకవిప్రవరుఁడు కుచేలుండు, నిరుపేఁద యైయుండి నెమ్మినొక్క
నాఁడు భవద్దర్శనముఁ గోరి తనజీర్ణ, పటముకొంగునఁ గొణిదెఁ డటుకు లునిచి
కొనివచ్చి నినుఁ గాంచి యొనర దీవించిన, నేమితెచ్చితి వని ప్రేమతోడ
నరసి యాపృథుకముల్ కరమున నిడుకొని, భక్షణం బొనరింప దత్క్షణమున

వితతసామ్రాజ్యవిభవసంగతునిఁ జెసి
నట్టికరుణారసంబు నీకమరె నౌర
సురుచిరాకార ఉన్నవపురవిహార
రాజగోపాల రాధామనోజఖేల

63. బలభేది యలుకతొఁ బటుతరమేఘజా, లములను విడిచి శిలాప్రయుక్త
వర్షంబుఁ గురియింప వల్లవజనమును, గోవులు భీతి నాకులత నొంద
వీక్షించి మీరేల వెఱచెద రని వారి, నందఱ నావులమందఁ దోలు
కొనుచు రమ్మని పోయి గోవర్ధనాచలం, బిరవుగా నొకకేల నెత్తిపట్టి

సర్వజీవుల నెల్ల రక్షనముచేసి
నట్టియద్భుతరసము నీ కలరె నౌర
సురుచిరాకార ఉన్నవపురవిహార
రాజగోపాల రాధామనోజఖేల

64. రుక్మిణికొఱకునై రూఢిగా భీష్మక, నగరంబుఁ జొచ్చి యాఖగకులేంద్రుఁ
డమరనాథుని గెల్చి యమృతంబుఁ గైకొన్న, కరణి చైద్యాదుల నురువడించి
పుష్పగంధిని గొనిపోవఁగ రుక్మకుం, డదె పోకుమని వెంటనంటి వాఁడి
నారసంబులనేయ నవ్వి యాతనిఁబట్టి, బావ రమ్మని శితభల్లములను

దలయు మూతియు రేవులై తనర గొరిగి
నట్టి హాస్యరసంబు నీకలరె నౌర
సురుచిరాకార ఉన్నవపురవిహార
రాజగోపాల రాధామనోజఖేల

65. మధురాపురంబు నెమ్మది నేలుచుండంగఁ, జతురంగబలసముచ్చయము తోడ
నడరి జరాసంధుఁ డతికోపఘూర్ణిత, హృదయుఁడై దాడిగాఁ బొదివి నిన్నుఁ
గదనంబునకుఁ బిల్వ మదిలోన నూహించి, నగరంబు వెడలి కాననముఁ జొచ్చి
కొండఁ బ్రాఁకినఁ జూచి ఘోరదావానలం, బిడిన నందుండక కడురయమున

ద్వారకాపుర మిరవుగాఁ జేరి యుండి
నట్టి భయరస మవ్వేళ కలరె నౌర
సురుచిరాకార ఉన్నవపురవిహార
రాజగోపాల రాధామనోజఖేల

66. ధరనిఁ బౌండ్రకుఁడనునరపాలకుడు భవ, చ్చిహ్నము ల్దాల్చి ప్రసిద్ధము
వాసుదేవుఁడ నేను వసుధలో నాకంటె, విక్రమశాలి యేవీరుఁడనుచు
దూతనంపిన విని తొడఁబడ వానిపైఁ, జని రోషమున ఘోరసంగరమునఁ
బటుశరవహ్నిచే బలముల సమయించి, కరితురంగములఁ జీకాకుచేసి

యతనితలఁద్రుంచి వైచినయట్టితఱిని
జెలఁగి బీభత్సరసము నీకలరె నౌర
సురుచిరాకార ఉన్నవపురవిహార
రాజగోపాల రాధామనోజఖేల

67. కౌరవపాండవుల్ ఘోరయుద్ధముఁ జేయు, తఱి నరసారథిత్వము వహించి
యరదంబుఁ గడపంగ నురవడి భీష్ముండు, విజయునిపై బాణవిసరములను
జొనిపి గర్వము మీఱి సునిశితశరమును నీ, యురము నాటించినఁ గెరలి నీవు
ధరణిపైఁ గుప్పించి యురికి చక్రము చేతఁ, బట్టి యామిన్నేటిపట్టిమీఁద

నరుగఁ బార్థుండు మన్నింపు మని మరల్చు
నపుడు రౌద్రరసంబు నీకలరె నౌర
సురుచిరాకార ఉన్నవపురవిహార
రాజగోపాల రాధామనోజఖేల

68. ధర్మపుత్రుఁడు మహాధ్వరముఁ జేసెడువేడ్కఁ, బూని నానాదేశభూపతులను
బిలిపించి హితబంధువులను రావించి పే, రోలగం బుండెడువేళయందుఁ
బటుమదాంధుఁడు శిశుపాలుండు నినుఁ జూచి, పూర్వవైరముఁ దలపోసి కొన్ని
ప్రల్లదంబులు వల్కఁ బ్రతిభాషలాడక, యూరకుండితి వేమికారణంబొ

కాని తెలియదు లోకప్రకాశమైన
శాంతిరస ముప్పతిల్లె నీసమ్ముఖమున
సురుచిరాకార ఉన్నవపురవిహార
రాజగోపాల రాధామనోజఖేల

69. సతులు శృంగారంబు దితిజులు వీరంబు, భూసురు ల్కరుణ యద్భుతము జనులు
హాస్యంబు రుక్మకుం డలజరాసంధుండు, భయము పౌండ్రకుఁడు బీభత్సరసము
రౌద్రంబు భీష్ముండు రమణీయశాంతంబు, శిశుపాలుఁ డెఱుఁగంగఁ జేయునట్టి
నవరసాలంకారభవదీయనామంబు, పగనైన వగనైన బాంధవమున

నైన భీతిని నైన యిం పొనరఁ దలఁచు
నరుల కంటనిదందురు దురితచయము
సురుచిరాకార ఉన్నవపురవిహార
రాజగోపాల రాధామనోజఖేల

70. న్యాయమార్గముఁ దప్పి నరులను వేధింప, రాజు గాఁదతఁడు తరాజు కాని
పతిభక్తి విడిచి సంపద నొందు జవరాలు, ఆలుగాదది నీచురాలు గాని
తల్లిదండ్రులమాట దాఁటిన సుతుఁడు దా, సుతుఁడు గాఁడతఁడు కుత్సితుఁడు గాని
అతిథిభాగవతుల నర్చింపలేనిల్లు, యిల్లుగాదది వట్టిపొల్లు గాని

పరమధర్మజ్ఞుఁడే రాజు భక్తిగలది
యాలు సుగుణుండె కొడుకు పూజార్హ మిల్లు
సురుచిరాకార ఉన్నవపురవిహార
రాజగోపాల రాధామనోజఖేల

71. కరణంబు కాఁపులు గలహించుచుండిరా, యూరుగా దది లత్తుకోరు గాని
అర్థులు వేఁడిన నడియాస వెట్టెనా, దాతగాఁ డాతడు ప్రేత గాని
ధనమిచ్చుదాతపద్యము చదువఁడ యేని, వందిగాఁ డాతడు పంది గాని
సురుచిరసచ్ఛబ్దశుద్ధి లేకుండెనా, సుకవికాఁ డాతఁడు కుకవి గాని

వైర ముడిగిన దూరిడువాఁడె దాత
చదువు గలవాఁడె భట్టు, వాగ్ఝరుయె సుకవి
సురుచిరాకార ఉన్నవపురవిహార
రాజగోపాల రాధామనోజఖేల

72. వినయంబు గలకాంత విడిచి వర్తించెనా, విభుఁడు గాఁడతడు రాసభుఁడు గాని
గురుమంత్ర మెదలోన గుప్తంబు సేయఁడే, నరుఁడు కాఁడతఁడు వానరుఁడు గాని
ప్రేమతోఁ జన్నిచ్చి పెంచకయుండెనా, తల్లిగాదది మాఱుతల్లి గాని
ప్రభువు చెప్పినయట్టి పనికి మాఱాడెనా, భటుడు గాఁడతఁడు దుర్భటుఁడు గాని

గుణము గలవాఁడె పతి మంత్రగోప్త జనుఁడు
పెంచినది మాత పనులు గావింప బంటు
సురుచిరాకార ఉన్నవపురవిహార
రాజగోపాల రాధామనోజఖేల

73. అమయఘ్నం బైనయౌషధజ్ఞుడు గాని, వెజ్జు గాఁడాతఁడు జజ్జు గాని
చతురుపాయంబులసరణిఁ దెలియనిమంత్రి, మంత్రి గాఁడతఁడు దుర్మంత్రి గాని
విదితనానాశాస్త్రవేది గానిబుధుండు, బుధుఁడు గాఁడతఁడు బుద్బుధుఁడు గాని
శమద్మానుష్ఠానసమితిఁ దాల్పక యున్న, దపసి గాఁడతఁడు కుతపసి గాని

ప్రాజ్ఞుఁడే వెజ్జు సదుపాయపరుఁడె సచీవుఁ
డర్థవేదియె సురి బ్రహ్మజ్ఞుఁడె ముని
సురుచిరాకార ఉన్నవపురవిహార
రాజగోపాల రాధామనోజఖేల

74. ప్రియముతో రమ్మని పిలిచిపెట్టనికూడు, కూడు గాదది పుట్టగూడు గాని
భోగదానములనుఁ బొందరానిధనంబు, ధను గాదది వన్నెదనము గాని
సత్యవాక్యము నిల్పఁ జాలనినరుజిహ్వ, జిహ్వ గాదది గోధిజిహ్వ గాని
పరుల కుపకారంబు పట్టిసేయని బ్రతుకు, బ్రతుకు గాదది రోఁతబ్రతుకు గాని

దయగలది భోజ్య మక్కరధనము ధనము
నిలుకడది నాల్క యుపకృతినియతి బ్రతుకు
సురుచిరాకార ఉన్నవపురవిహార
రాజగోపాల రాధామనోజఖేల

75. సరసాన్నములఁ దృప్తిసలుపఁజాలని పెండ్లి, పెండ్లి గాదది దూబపెండ్లి గాని
అరసి తారతమ్యము లెఱుంగని పెద్ద, పెద్ద కాఁడాతఁడు గ్రద్ద గాని
వినయమ్ము లేక వేవే లొసంగిన యీవి, యీవి గాదది మంటిదీవి గాని
బంధువుల్ సమ్మతపడనట్టిశుభము దా, శుభము గాదది విపన్నిభము గాని

తృప్తిఁ బొందినదే పెండ్లి, తీర్పే పెద్ద
తనదువినయమె యీవి బాంధవమె శుభము
సురుచిరాకార ఉన్నవపురవిహార
రాజగోపాల రాధామనోజఖేల

76. వల పెంతగల్గిన వారకాంతలమాట, మాట గా దది నీళ్ళమూట గాని
కుల మెంతగల్గినఁ గులహీనుతోఁ జెల్మి, చెల్మి గా దది పాముచెల్మి గాని
నెల వెంతకల్గిన నీచులతోఁ బొందు, పొందు గా దది పెట్టుమందు గాని
ధన మెంత గల్గినఁ దా విజాతులసేవ, సేవ గా దది చెడుత్రోవ గాని

మాననిది మాట సుగుణిది మంచితనము
ఘనునితొఁ బొత్తు సత్కులజునిది సేవ
సురుచిరాకార ఉన్నవపురవిహార
రాజగోపాల రాధామనోజఖేల

77. పరగ శ్రీవైష్ణవార్పణము సేయనికల్మి, కల్మి గా దది పెద్దకొల్మి గాని
పరమభాగవతసంస్పర్శఁ జెందని నోము, నోము గా దది పెనుగోము గాని
హరిదాసచరణానుసరము గానిజలంబు, జలము గా దదియె కజ్జలము గాని
కమలాక్షభక్తసంగతిఁ గోరనిత్రిదండి, దండి గాఁ డతఁడు త్రిదండి గాని

వైష్ణవార్పణసిరి భాగవతమె నోము
ముక్తసంగుఁడె యతి తీర్థములె పదములు
సురుచిరాకార ఉన్నవపురవిహార
రాజగోపాల రాధామనోజఖేల

78. స్థిరబుద్ధితో నినుఁ జింతసేయనిదినము, దినము గా దదియె దుర్దినము గాని
వితతమౌ నీకథ ల్వినకయుండిన చెవుల్, చెవులు గా వవి కొండగవులు గాని
భవదీయనామము ల్పలుకకుండిననోరు, నోరు గా దది డక్కతీరు గాని
సొంపుగా నీమూర్తి సొబగుఁ గాననికనుల్, కనులు గా వవి నీటిదొనలు గాని

చింతగలదియె తిధి విన్కిఁజెలఁగు శ్రుతులు
పఠనగలదియె నోరు చూపరయ కనులు
సురుచిరాకార ఉన్నవపురవిహార
రాజగోపాల రాధామనోజఖేల

79. సతతంబు నీప్రదక్షిణము సేయనికాళ్ళు, కాళ్ళు గా వవి మరగాళ్ళు గాని
అనయము నీపదార్చనము సేయనికరము, కరము గా దది దర్వికరము గాని
భవదలంకృతసుమభ్రమితఁ జెందనిముక్కు, ముక్కు గా దది పందిముక్కు గాని
చేరి యుష్మత్కథల్ చింతసేయనిబుద్ధి, బుద్ధి గా దది పాపవృద్ధి గాని

వలగొనిన వంఘ్రులును పూజగలవి చేతు
లలరువాసనఁగొన నాస మతిశమవతి
సురుచిరాకార ఉన్నవపురవిహార
రాజగోపాల రాధామనోజఖేల

80. మంత్రప్రభూత్సాహ మహితశక్తిత్రయం, బును రజస్సత్వతమోగుణంబు
లును దానధర్మపరోపకారంబులు, వరభవిష్యద్భూత వర్తమాన
ములు లయస్థితి జన్మములు శైత్యమాంద్యసౌ, రభ్యాది లక్షణత్రయము లెఱిఁగి
సరసవేదపురాణ శాస్త్రేతిహాసాది, విద్యాచతుష్టయ విభవ మరసి

నడచుకొను మానవేశుండు పుడమిలోనఁ
బ్రణుతిఁ గాంచును దా సభాపతి యనంగ
సురుచిరాకార ఉన్నవపురవిహార
రాజగోపాల రాధామనోజఖేల

81. ఘనమనోవాక్కాయకర్మంబులను ధర్మ, కామార్థమోక్షము ల్ప్రేమ నెఱిఁగి
రథగజాశ్వపదాతిరమణీయచతురంగ, బలసమేతుఁ డగుచు బ్రహ్మచారి
భిక్షువాసప్రస్థపితృమాతృబంధుగృ, హస్థులఁ గరుణచే నరసికొనుచుఁ
దగ సామఋగ్యజురధర్వణవేత్తలౌ, భూసురోత్తములను బూజచేసి

వెలయు నరపాలచంద్రుఁ డీయిలను ముగులఁ
బ్రణుతి కెక్కును దా సభాపతి యనంగ
సురుచిరాకార ఉన్నవపురవిహార
రాజగోపాల రాధామనోజఖేల

82. అరయఁ బ్రభాతమధ్యాహ్నసాయంకాల, ములను సంధ్యాదికములను దీర్చి
ఘనతరాహవనీయగార్హపత్యసుదక్షి, ణాగ్నిహోత్రులకు హవ్యము లొసంగి
యంశుకాభరణగంధాదిచతుర్విధ, శృంగారములఁ గడు రంగు మీఱి
ధరణిఁ గృతత్రేతద్వాపరకలియుగ, ధర్మప్రవర్తనఁ దనరఁ బ్రజలఁ

గరుణ నేలినరాజశేఖరుఁడె జగతిఁ
బరిఢవిల్లును దా సభాపతి యనంగ
సురుచిరాకార ఉన్నవపురవిహార
రాజగోపాల రాధామనోజఖేల

83. భూజలతేజోనభోవాయుపంచక, భూతాత్మకుఁడ వని బుద్ధి నెఱిఁగి
యలరుప్రాణాపానవ్యానాదిప్రాణవా, యువు లున్నఠావుల యుక్తిఁ దెలిసి
రూఢ శబ్ధస్పర్శరూపరసగంధంబు, లేనింటియందలి యెఱుక గలిగి
త్వక్చక్షుశ్రోత్రజిహ్వాఘ్రూణనిర్మల, పంచేంద్రియంబులఁ బదిలుఁ డగుచు

వెలయు భూపాలముఖ్యుఁ డీవిశ్వమునను
బ్రస్తుతికి నెక్కు దా సభాపతి యనంగ
సురుచిరాకార ఉన్నవపురవిహార
రాజగోపాల రాధామనోజఖేల

84. మాఘరఘువంశకుమారసంభవమేఘ, సందేశ భారవిసముదయార్థ
మెఱిఁగి భాట్టప్రభాకరతర్కమీమాంస, వేదాంతవైశేషికాదికములు
దెలిసి వ్యాకరణజౌతిషకల్పశిక్షాని, రుక్తఛందస్సుల యుక్తికలిగి
యాజనాథ్యాపకాధ్యయనదానప్రతి, గ్రహయజనాఖ్యషట్కర్మనిరతు

లైనవిప్రుల నరసినమానవేశుఁ
డతులగతి నొప్పుఁ దా సభాపతి యనంగ
సురుచిరాకార ఉన్నవపురవిహార
రాజగోపాల రాధామనోజఖేల

85. ఘనహరిశ్చంద్రసగరపురూరవనల, పురుకుత్సకార్తవీర్యులచరిత్ర
మెఱిఁగి పౌరాణికపరిహాసవిద్వాంస, భటకవిసప్తాంగభరితుఁ డగుచు
ధనధాన్యవస్తువాహనమిత్రసంతాన, బాంధవాద్యష్టసంపదలు గలిగి
నిధితటాకారామనిర్జరాలకృతి, భూసురస్థాపనపుత్రు లనెడు

సప్తసంతానములను బ్రశస్తుఁడైన
ప్రభువునకుఁ జెల్లుఁ దా సభాపతి యనంగ
సురుచిరాకార ఉన్నవపురవిహార
రాజగోపాల రాధామనోజఖేల

86. భోజనవస్త్రతాంబూలగంధప్రియ, కామినీసంగీతకనకభూష
ణాదుల మేదుశయ్య లనఁ దగు నష్టభో, గము లనుభవింపుచుఁ గటుకాషాయ
తిక్తాంలమధురవార్ధిజముఖ్యషడ్రస, ముల నెఱుఁగుచుఁ భక్ష్యభోజ్యలేహ్య
పానీయచోష్యసుపంచవిధాహార, ముల నతిథులఁ దృప్తి బొందఁజేసి

చెలఁగి విహరించుమనుజుఁడే క్షితితలమునఁ
బ్రతిభఁ గాంచును దా సభాపతి యనంగ
సురుచిరాకార ఉన్నవపురవిహార
రాజగోపాల రాధామనోజఖేల

87. వీర బీభత్ససృంగారకరుణాద్భుత, శాంతాదినవరసస్వాంతుఁ డగుచుఁ
గులరూపయౌవనస్థలధనవిద్యాప్ర, భృత్యష్టమదములఁ బెనఁగుగొనక
నిధిజలపాషాణనిక్షేపకక్షోణి, కాగామిసిద్ధస్వాస్థ్యంబు లనెడి
యష్టభోగములతో నైనగృహారామ, క్షేత్రముల్ భూసురశ్రేణి కొసఁగు

పురుషసింహుండు వెలయు నీపుడమిలోన
వితతయశుఁ డనఁ దా సభాపతి యనంగ
సురుచిరాకార ఉన్నవపురవిహార
రాజగోపాల రాధామనోజఖేల

88. శాల్మిలిప్లక్షకుశక్రౌంచపుష్కర, శాంకజంబూద్వీపసరణి విజయ
శాసనంబులు నిల్పి చంద్రస్Yర్యాంగార, కాదిగ్రహబలవిహారుఁ డగుచు
సంస్కృతమగధపైశాచికప్రాకృతా, పభ్రంశకాద్యష్టభాష లెఱిఁగి
శబ్ధవిరోధదుస్సంధిపునరుక్తి ఛం, దోభంగముఖదశదోషరహితు

లైనకవిరాజులను బ్రీతి నరసికొనినఁ
బ్రాజ్ఞుఁడై యొప్పుఁ దా సభాపతి యనంగ
సురుచిరాకార ఉన్నవపురవిహార
రాజగోపాల రాధామనోజఖేల

89. అంగలాటదశార్ణ కాంగకాంభోజకే, కయఘూర్జరకిరాతగౌళసాల్వ
బాహ్లికశాల్మలబార్బరనేపాళ, పాంచాలమలయాళపాండ్యమత్స్య
సౌరాష్ట్రకోసలసౌవీరటెంకణ, కొంకణగాంధారకురుయుగంధ
రాంధ్రకళింగమహారాష్ట్రమాళవ, ప్రముఖఛప్పన్నదేశములభాష

లెఱిఁగి ధర్మప్రవర్తనఁ దిరుగురాజు
భాసిలుచు నుండుఁ దా సభాపతి యనంగ
సురుచిరాకార ఉన్నవపురవిహార
రాజగోపాల రాధామనోజఖేల

90. కేశవ మాధవ కృష్ణ హృషీకేశ, వామ నాచ్యుత హరి వాసుదేవ
దామోద రానిరుద్ధ జనార్ధన నృసింహ, ప్రద్యుమ్న గోవింద పద్మనాభ
నారాయణోపేంద్రధీర మధుసూధన, శ్రీధ రాధోక్షజ శ్రీశ విష్ణు
సత్పుండరీకాక్ష సంకర్షణ త్రివి, క్రమ యనునామముల్ క్రమముతోడ

నేనరుండైనఁ బఠియింప నిహపరముల
సౌఖ్య మొసఁగుదువఁట యెంతసదయమతివి
సురుచిరాకార ఉన్నవపురవిహార
రాజగోపాల రాధామనోజఖేల

91. ధరలోన నేజాతినరుఁడైన శంఖచ, క్రాంకితుఁ డై భక్తి నలరెనేని
ఛిద్రోర్ధ్వపుండ్రంబుఁ జన్నుమీఱ ధరించి, దాసనామంబునఁ దనరెనేని
మదిని అష్టాక్షరీమంతజపం బొన, రించి వనమాల వహించునేని
సద్గురుకృపచేతఁ జరమార్థవిభవంబుఁ దెలిసి పరతంత్రుఁ డై నిలిచెనేని

యతని కలుషము లెల్లను హతముచేసి
పరమపద మిత్తువఁట యెంతసరసమతివి
సురుచిరాకార ఉన్నవపురవిహార
రాజగోపాల రాధామనోజఖేల

92. ప్రహ్లాద నారద బలి భీష్మ రుక్మాంగ, దార్జున పుండరీ కాంబరీష
సనకసనందన శౌనక వ్యాస ప, రాశర ధ్రువ బాదరాయణ గుహ
విదుర విభీషణ వినతాతనూభవ, గజరాజ వాల్మీకి భుజగనాథ
పవనతనూజ యుద్ధవ వసిష్ఠాదిభా, గవతోత్తములు నీదుకరుణఁ బడసి

తావకీయాంఘ్రి సేవలఁ దగిలి జన్మ
రహితులై కాంచి రట భన్మహితపదవి
సురుచిరాకార ఉన్నవపురవిహార
రాజగోపాల రాధామనోజఖేల

93. హలకులిశాంకుశ జలజశంఖరథాంగ, కల్పకరేఖాప్రకాశితములు
అభినవవికసనహల్లకదళనిభ, పరిపూర్ణశోణభాభాసురములు
హరజటాజూటనృత్త్యత్తరంగోజ్జ్వల, గంగానదీజన్మకారణములు
అఖిలమౌనీంద్రహృదంతర రంగస్థ, లస్ఫురన్నాట్యవిలాసములును

భద్రకరములు భవదీయపదయుగములు
నామనోవీధి నిలుపవే నలిననాభ
సురుచిరాకార ఉన్నవపురవిహార
రాజగోపాల రాధామనోజఖేల

94. సకలయోనులయందు జన్మించి జన్మించి, దినమును బొట్టకై తిరిగి తిరిగి
యున్మత్తవృత్తిచే నుప్పొంగి యుప్పొంగి, పంచేంద్రియవ్యాప్తిఁ బరగి పరగి
కలుషజాలంబులు గావించి కావించి, మొగిని సంసారాబ్ధి మునిఁగి మునిఁగి
తనుజరాభారంబుఁ దాలిచి తాలిచి, నరవిఁ గొన్నాళ్ళకుఁ జచ్చి చచ్చి

మరలఁ బుట్టంగలేక నీచరణయుగళ
సేవఁ గోరితి నను దయఁ గావవలయు
సురుచిరాకార ఉన్నవపురవిహార
రాజగోపాల రాధామనోజఖేల

95. మర్యాదరహితుఁడ మదనపరవశుండ, వంచనాపరుఁడను గొంచెగాఁడఁ
గఠినహృదయుఁడ దుష్కర్ముఁడ నీచుండ, గురుపాతకుఁడ గృతఘ్నుఁడను ధురభి
మానిని లోభిని మత్సరయుతుఁడను, దుర్గుణుండను గురుద్రోహి నైన
నావంటియజ్ఞాను నేవిధంబున నీదు, దయకుఁ బాత్రునిగాఁగఁ దలఁచకున్నఁ

బతితపావనబిరుదు యేపట్ల నీకు
నిలుపఁబోవదు సుమ్ము భూతలమునందు
సురుచిరాకార ఉన్నవపురవిహార
రాజగోపాల రాధామనోజఖేల

96. పుత్త్రమిత్రకళత్రపూరితసంసార, జలధికి నావ మీచరణసేవ
బహుజన్మసంచితపటుఘోరపాతక, సముదాయాభావ మీచరణసేవ
బధిరాంధశాబకపశుపక్షిసుజ్ఞాన, జననప్రభావ మీచరణసేవ
శాశ్వతమహనీయసాయుజ్యపదవికిఁ, జక్కనిత్రోవ మీచరణసేవ

యనుచు వేదాంతసిద్ధమై యలరుచుండుఁ యలరుచుండుఁ
గాన భవదంఘ్రి సేవయు కలుగఁజేయు
సురుచిరాకార ఉన్నవపురవిహార
రాజగోపాల రాధామనోజఖేల

97. కఠినతరాజ్ఞానఘనతిమిరార్యమ, కిరణముల్ మీనామకీర్తనములు
చటులదురింద్రియసర్పసముచ్చయ, కేకులు మీనామకీర్తనములు
కలుషౌఘదుర్గమకాననదావాగ్ని, కీలలు మీనామకీర్తనములు
మహితారిషడ్వర్గమదగజసంచయ, కేసరుల్ మీనామకీర్తనములు

గాన మామకహృదయరంగస్థలమున
నర్తనక్రీడ సల్పు మనాథనాథ
సురుచిరాకార ఉన్నవపురవిహార
రాజగోపాల రాధామనోజఖేల

98. జపహోమసంధ్యాదిసత్క్రియల్ జేసిన, నుపవాసములఁ గార్శ్య మొందియున్న
బుణ్యస్థలంబులు పోయి సేవించిన, మానక దానముల్ పోయి సేయఁ
గాశీప్రయాగగంగానదీస్థలముల, సకలధర్మంబులు సలుపు చున్న
సారె ధనుఃకోటి స్నానంబు చేసిన, భక్తినీయెడ లేక ముక్తి లేదు

కన నీపదపంకజధ్యానపరుని
గా నొనర్పుము కరుణించి కమలనాభ
సురుచిరాకార ఉన్నవపురవిహార
రాజగోపాల రాధామనోజఖేల

99. అల యజామీళునికలుషంబు లెడలించి, యెలమితో సాయుజ్య మీయ లేదె?
అపకార మొనరించినట్టికాకాసురుఁ, గృపతోడఁ జూచి రక్షింపలేదె?
పగవానితమ్ముని మృగధరార్కస్థాయి, గా లంకఁ బట్టంబు గట్టలేదె?
సభలోన నపరాధశతము పల్కినయట్టి, శిశుపాలు నాత్మలోఁ జొనుపలేదె?

నీదయారస మొరులు వర్ణింపఁ గలరె
నన్ను గరుణింపు మిదె నీకు విన్నపంబు
సురుచిరాకార ఉన్నవపురవిహార
రాజగోపాల రాధామనోజఖేల

100. జపహోమసత్క్రియల్ సలుపంగ నోప నే, నుపవాసములఁ గ్రుస్సి యుండ నోప
పుణ్యస్థలంబులు పోయి చూడఁగ నోప, స్నానసంధ్యావిధుల్ పూన నోప
కాశి గంగాప్రయాగములకుఁ బో నోప, సకలధర్మంబులు జరుప నోప
అఖిలవ్రతంబుల నాచరింపఁగ నోప, నిరతాన్నదానంబు నెఱప నోపఁ

గనుక నీదాససఖ్యంబుఁ గలుగఁజేసి
నీదునామంబు జిహ్వను బాదుకొలుపు
సురుచిరాకార ఉన్నవపురవిహార
రాజగోపాల రాధామనోజఖేల

101. నాలుక కేశవనామము నొడువుము, చిత్తమా హరిమీదఁ జింత నిలుపు
పాణియుగంబ శ్రీపతిపూజ సేయుము, కర్ణద్వయమ విష్ణుకథలు వినుము
పదయుగ శ్రీధరభవనంబు వలగొను, నయనయుగ్మమ యదునాథుఁ జూడు
నాసాపుటమ జగన్నాయకశ్రీపాద, తులసి నాఘ్రాణించు మలర ననుచు

నవయువంబుల మనవిగా నడుగుకొంటి
విన్నపము లెంతచేసియు వేఁడుకొంటి
సురుచిరాకార ఉన్నవపురవిహార
రాజగోపాల రాధామనోజఖేల

102. శ్రీరాజగోపాలశేఖరవరమహో, న్నతగోపురంబు ఉన్నవపురంబు
సర్వంసహాచక్రసంచారద్భారతీ, నాత్యరంగంబు ఉన్నవపురంబు
కామితాఖిలవస్తుకల్పనారుచిరాభి, నవగోపురంబు ఉన్నవపురంబు
సలలితనిర్మలసలిలధారాపూర, నలినాకరంబు ఉన్నవపురంబు

నవనిధిశ్రీకరంబు ఉన్నవపురంబు
వరసఖస్థావరంబు ఉన్నవపురంబు
సురుచిరాకార ఉన్నవపురవిహార
రాజగోపాల రాధామనోజఖేల

కం. శ్రీరమణీకుచకుంభిత
టీరమ్యకురంగమదపటీరసుగంధ
వ్యారోపితవక్షస్థల
గోపతిపరిపాలరాజగోపాల హరీ

రాజగోపాలశతకము
సంపూర్ణము

Saturday, August 3, 2013

లక్ష్మీశతకము - పరవస్తు మునినాథకవి

లక్ష్మీశతకము
                                   పరవస్తు మునినాథకవి
(కందపద్య శతకము)

1. శ్రీమద్వేంకటవల్లభ
కామిని చేటీకృతేంధ్రకామినీ హంసీ
గామిని పక్షికులాధిప
గామిని సకలామరీశిఖామణి లక్ష్మీ

2. న్యాయిని విష్ణుమనస్సం
స్థాయిని భుజగాధిరాజశాయిని శుభసం
థాయని పీతాంబరపరి
థాయని సకలార్థసిద్ధిదాయిని లక్ష్మీ

3. చారుమునీంద్రమనస్సం
చారిణి భక్తసుమనోనుచారిణి వినమ
చ్చారిణి భవనాభినుతా
చారిణి సంతతశుభదవిచారిణి లక్ష్మీ

4. వృజినసమాజవిభంజని
నిజభక్తమనోబ్జరంజనీ నేత్రవిభా
విజితమదఖంజనీ స
ర్వజగద్రవ్యాంజనీ నిరంజని లక్ష్మీ

5. ఘనతరదరిద్ర శాసిని
వనజవనీవాసినీ సువాసిని సకలో
పనిషత్సభావిభాసిని
యనఘుసుధాకుందమందహాసిని లక్ష్మీ


6. కమలాక్షదివ్యమహిషీ
కమలా పద్మ రమా జగజ్జననీ మా
కమలవనీనిలయామృత
కమలనిధి ప్రియకుమారికా శ్రీలక్ష్మీ

7. భువి శ్రీమచ్చేషమఠ ప
రవాస్తు జియ్యరు శిరోగ్రరత్నకృపాపాం
గవిభావితాష్టఘంటా
కవితాద్రవిణాఢ్యుఁడను తగంగా లక్ష్మీ

8. అనుపమకవితారచనా
ఘనప్రవీణుండ మదకుకవిమూర్ధ్నవిలుం
ఠనకుశలహస్తవల్లవుఁ
డను మునినాథభిధానుఁడను శ్రీలక్ష్మీ

9. మందారమంజరీమక
రందఝరీమాధురీధురాభరణవచో
బృందంబుల నీపేరిటఁ
గందంబులు చెప్పువాఁడఁ గైకొను లక్ష్మీ

10. కందంబులు కవి మధురస
కుందంబులు సకలదీనకోకిలచయమా
కందంబులు భక్తజనా
నందంబులు శతకముగ నొనర్తును లక్ష్మీ

11. సరసోక్తి సరణి సుందర
తరశతకందప్రసూనదామక మతిభ
క్తి రచించి సమర్పించెదఁ
గరుణం గైకొనుము సిరులు గ్రాలఁగ లక్ష్మీ

12. ప్రణవాకారిణి విష్ణు
ప్రణయిని ప్రణతప్రజార్తభంజననిపుణీ
ప్రణుతజన మందిరప్రాం
గణవిలసత్పారిజాతకద్రుమ లక్ష్మీ

13. వైమానికమానవతీ
స్తోమార్పిత కల్పవృక్షసుమమాలామో
దామోదిత దివ్యాంగీ
సామాగమగానరసహసన్ముఖి లక్ష్మీ

14. చారుచరణ సారసలా
క్షారససంలక్షితాంబుజాతేక్షణ వ
క్షోరత్ననికేతన మ
థ్యారమ్యస్థలిని నతజనావని లక్ష్మీ

15. మునిరాజరాజవదనా
జనసుమనఃమంకజాతసమదాలిని పా
వనశీలినీ మహాశో
భనశాలిని దీనజాలపాలిని లక్ష్మీ

16. అమృతసఖీ హిమకరబిం
బముఖీ శరణాగతాతిభరణోరుగుణా
భిముఖీ గంధర్వసుధాం
శుముఖీ మృదుమధురగానసుముఖీ లక్ష్మీ

17. సురకమలముఖీ కోమల
కరపల్లవపీడ్యమానకమనీయపదాం
బురుహయుగళీ నిరర్గళ
కరుణారసభరిత కృదయకమలా లక్ష్మీ

18. జలజభవప్రముఖాఖిల
నిలింపలీలావతీమనీకరతలసం
చలితమణిచామరచయా
నిలనటదలకాళిలలితనిటలా లక్ష్మీ

19. విరజాతరంగిణీక
ర్బురమయసైకతవితానముద్రితచరణాం
బురుహ రథాంకుశహలక
ల్పరథంగదరాబ్జవజ్రలాంచని లక్ష్మీ

20.లలితాబ్ధ్యంతరిలామ
ధ్యలసద్వనకుసుమరసఝరావర్ధితక
ల్పలతావితానకలితో
జ్జ్వలచింతారత్నపీఠవాసిని లక్ష్మీ

21. స్వారాట్పముఖాఖిలబృం
దారకబృందోరుమౌళితటమానిక్య
స్ఫరకిరణ దీపావళి
నీరాజనరాజితాంఘ్రినీరజ లక్ష్మీ

22. ఘనమాన్యవళక్షాంబర
మణినాదసభానిశాంతమకుటాదికమం
డనగోదంతావళవా
హనలీలోద్యానవనవిహారిణి లక్ష్మీ

23. ఇందీవరమిత్రసుధా
స్యందనకౌస్తుభదిగంతసామజసామ్రా
ణ్మందారపుష్పవాటీ
బృందారకధేనుసోదరీమణి లక్ష్మీ

24. శతమఖముఖనిఖిలహరి
త్పతిశతపత్రాననావితానకరసమ
ర్పితచంద్రశకలపేటీ
ధృతరత్న సువర్ణమయకిరీటీ లక్ష్మీ

25. మధుకైటభవైరిప్రియ
మధురాధర విలసమానమానాతీత
ప్రథితాసమానవైభవ
సుధామధురవాక్తరంగశోభిని లక్ష్మీ

26. పరమపదావాసిని సో
మరసాస్వాదనవిలోలమంజుల హేమాం
బరశోభిని భక్తప్రియ
వరదాయని దాంతిబ్రహ్మవాదిని లక్ష్మీ

27. భూరమణమకుటతటశో
భారత్నమరీచిజాలబాలాతపసు
స్మేరపదాంబుజ భువనా
థరామనీ శంఖచక్రథారిణి లక్ష్మీ

28. లలితనిజపీఠపార్శ్వ
స్థలసంస్థితవాగ్గిరీంద్రజారతిహస్తో
జ్జ్వలవీటికాకరండక
కళాచికారత్నపాదుకాయుగ లక్ష్మీ

29. నిరుపమనిర్మల ఖేలిని
పరమేశ్వరి యాదిదేవి భక్తజనాళీ
పరతంత్రదివ్యసుమన
స్సరసీరుహపరమపురుషసహచరి లక్ష్మీ

30. ఆపత్సఖిశుభకరిస
ర్వోపద్రవవారిణీ శుభోజ్జ్వలభక్తా
ళీ పారిజాతత్రిభువన
దీపాకురమంగళాదిదేవత లక్ష్మీ

31. నృపదృక్కమలావాసిని
నృపసింహాసననివాసినీ సకలమహా
నృపపాలినీ సుదుర్మద
నృపసంఘాతోగ్రశాసిని శ్రీలక్ష్మీ

32. యతిహృత్పంకజమధుకరి
పతగాధిపగమని పతితపావనిపరిర
క్షితనిర్జరి జగదుదయ
స్థితిసంహృతికరి యనంతధీనిధి లక్ష్మీ

33. దిగిభవితానానీతం
బగుచల్లనినీటతేట నభిషేకం బా
డుగరితతలమానికమా
భగవతి లావణ్యవతి ప్రభావతి లక్ష్మీ

34. పెనుపడగదారికవణం
బును దినెడివయాళి వార్యముపయిం బలుప్రా
మినుకుంగొనవీధులఁ బెం
పున వాహ్యాళిం జరించు ముద్దియ లక్ష్మీ

35. నలువ నెలతాల్పు మెదలుం
గలవేలుపుతలిరుబోండ్లగములు ననుంగుం
జెలికత్తియలై కొలువం
జెలువారు త్రిలోకజనని శ్రీకరి లక్ష్మీ

36. నళినాక్షునురఃపీఠిం
గొలువై కచ్చపముకుందకుందాదినిధుల్
గొలువ జగంబుల నెనరుం
దలిర్ప రక్షించు భువననాయకి లక్ష్మీ

37. వినయము శాంతియు సత్యం
బును క్షమయును ధృతియు దానమును శ్రద్ధతపం
బును నీతియు ధర్మంబును
నను నిక్కల నాట్యమాడు నన్నువ లక్ష్మీ

38. పలుకుఁజెలి మరుగరిత ప
జ్జలఁ గోడఱికము లొనర్పఁ జక్రధరుఁడు మో
సలఁ గార్యభరము దీర్పఁగఁ
నెలమి జగంబుల భరించు నీశ్వరి లక్ష్మీ

39. త్వదనుగ్రహపాత్రుండు జ
గదభినుతుం డధికభోగి ఘనయశూఁడు మనీ
సదనచరుండు ప్రబుద్ధియు
సదయుఁడు నృపమకుటఘటితచరణుఁడు లక్ష్మీ

40. కమలాలయ త్వద్భ్రూవి
భ్రమఖేదం బీశదాసవైషమ్యము లో
లము నిమ్నోన్నతము నొన
ర్చు మహాశ్చర్యము తలంచి చూడఁగ లక్ష్మీ

41. నీనెనరు గొనం బింతని
జానుగఁ గొనియాడఁ దరమె చతురానన పం
చానన షడానన సహ
స్రాననులకు బహుఘృణాగుణాకరి లక్ష్మీ

42. వరదాయని సుఖకరి యిం
దిర శ్రీకరి మంగళాధిదేవత యఖిలే
శ్వరి భక్తావని జలధీ
శ్వరి కన్య యనంగ నీకు సంజ్ఞలు లక్ష్మీ

43. నీవు గలచోటు సరసము
నీవును లేనట్టిచోటు నీరసము జగ
త్పావని సరిలసదనుకం
పావని రదవసనజితజపావని లక్ష్మీ

44. కలుములపైదలి బలులే
ములసిలుగులు బాపుతల్లి ముజ్జగములఁ బెం
పలరన్ బ్రోచు యువతి త
మ్ముల నిమ్ముల నాడు ముద్దుముద్దియ లక్ష్మీ

45. భవదనుకంపకు విను వెలి
యవువాఁడు జనావమతుఁడు నపయశూఁ డబలుం
డవినీతి కుమతి దారి
ద్ర్యవశుం డతిమూర్ఖుఁడును దురాశుఁడు లక్ష్మీ

46. కొమరార నీవు కలిమి క
లిమి కమలా నీవు లేమి లేమి ధరిత్రిన్
గమనీయకపోలముకుర
సముంచితమురారివదనసారస లక్ష్మీ

47. అకటకట యరుదు నీకత
యొకని ధనాశుఁ జేసి యొకనిఁ జెఱిచి వే
ఱొకని మురిపించి యిట్టులఁ
దకతక లాడింతు జగము తడఁబడ లక్ష్మీ

48. హారమకుటకుండలకే
యూరాదిసమస్తభూషణోజ్జ్వలదివ్యా
కారిణి దారిద్ర్యప్రవి
దారిణి నిను దలఁచువారు ధన్యులు లక్ష్మీ

49. గురుభక్తిరతులు పరధన
పరదారపరాజ్ఞ్ముఖులు సుభాషణులు ధరా
సురహితులు దానశీలురు
సరసాత్ములు త్వత్కృపార్హజనములు లక్ష్మీ

50. వెలితమ్మిగద్దెఁ గొలువై
జలజభవాద్యమరవరులు స్వనిటలఘటితాం
జలు లై కడు సేవింపఁగ
నెలమి జగం బేలు త్రిభువనేశ్వరి లక్ష్మీ

51. బలి బిచ్చ మిడక ధర్మ మె
డలి కామక్రోధముల నడరి పరుషపువా
క్కులఁ గ్రూరు లగుచు గర్వము
గలవారలు మీకు మెప్పుగా రిల లక్ష్మీ

52. పండితుఁ డాతఁడు శ్లా
ఘ్యుండతఁడు కులీనుఁడతఁడు గుణియాతఁడు శూ
రుం డాతడు ధన్యుం డె
వ్వండు భవత్కరుణ గల్గువాఁ డిల లక్ష్మీ

53. రమ! యెవనిమొగముపై నీ
బొమగదలునొ వాఁడు రత్నముకుటుఁడయిగజేం
ద్రమునెక్కి ముత్తియపు గొడు
గమర నమ న్నృపులఁ జూడ కరుగును లక్ష్మీ

54. సుమశరుతల్లీ సుగుణౌ
ఘమతల్లి ప్రార్థితార్థకల్పవల్లీ
యమరుజగంబులతల్లీ
విమలకృపారసపుపాలవెల్లీ లక్ష్మీ

55. సరససుమచందనాది సు
పరిమళవస్తుతతియందు భాసిలి యవియున్
ధరియించు ఘనులసంప
భరితులఁ గావించు పరమపావని లక్ష్మీ

56. శనిముఖు లష్టమగతి కె
క్కినవిధి కష్టదశ నొసట గీసిన నీప్రా
పునఁగల నరు నే మొనరుతు
రినపుషితాంబుజము దుహీన మేచునే లక్ష్మీ

57. శ్రీయును భూమియు లక్ష్మియు
నా యభిదానంబులం దనర్చియు భక్త
శ్రేయోదాయిని వగు నిను
బాయక మదిలోఁ దలంతు భక్తిని లక్ష్మీ

58. తలతొడవుగా ధరింతును
హలకులిశాంకుశకుశేశయాదియాదిశుభాంకో
జ్జ్వల మగు త్వత్పదకమలయు
గళ మస్మద్రక్షకై తగంగా లక్ష్మీ

59. విను దిగ దచ్చిరువార్వెయి
కనులయొడయు లెట్టికన్నుఁగవ గోరుదు రా
వనజదళరుచిదళిత మై
పొనరెడి నీకన్నుగవకు మ్రొక్కుదు లక్ష్మీ

60. వినఁ గనఁగ విచిత్రము నీ
నెనరుం గలచూడ్కి యెవ్వనిపయిఁ బొలుచువాఁ
డు నరేంద్ర మకుటవిఘటిత
ఘనమణిఘృణిమండితాంఘ్రికమలుఁడు లక్ష్మీ

61. సిరి నీకు జోహారు పయ
శ్శరధిసుతా నీకు జోత సకలజగదధీ
శ్వరి నీకు మ్రొక్కు కనకాం
బురుహవాసిని నీకు గేలుమోడుపు లక్ష్మీ

62. నరుఁడు నరపాలకుఁడు నీ
కరుణాపాంగములగములఁ గాఁడే యా నీ
కరుణారసముగదా రా
జ్యరమాకలితాభిషేకసలిలము లక్ష్మీ

63. నీపాలఁ బడితి భక్తా
ళీపాలిని ఘనకృపాలలితశుభదృష్టిన్
మాపాల గలిగి బ్రోవుము
భూపాలార్పితమణీభూషణీ లక్ష్మీ

64. నానూతననిక్షేపమ
నానోఁచిన నోముపంట నాభాగ్యమ నా
యానందజలనిధీ నా
మానితమందారకక్షమాజమ లక్ష్మీ

65. ననుఁ గన్నతల్లి నన్నే
లిన దైవమ నాతపోలలితఫలమాన
న్మనుచు పదార్వన్నెయమల
నను నెనరునఁ బ్రోచు కలిమి నవలా లక్ష్మీ

66. నీ వని నమ్మితిఁ ద్రిజగ
త్పావని విను నీవినా యితఃపర మెఱుఁగన్
రావే లోకైకేశ్వరి
కావవె భద్రాత్మికా సుఖప్రద లక్ష్మీ

67. నినుఁదప్ప వెఱె యన్యులఁ
గొనియాడఁగఁ బోను జనని గొనకొనియుం బ్రో
చిన నీవె బ్రోవక యుం
డిన నీవె విను త్రిలోకనాయిక లక్ష్మీ

68. ఓకమలపాణి యోభువ
నైకజనని యోనమద్గుఋహాంగణదివిజా
నోకహ! రావే కృపఁగన
వే కడునార్తు నను బ్రోవవే వెస లక్ష్మీ

69. ఘోరదరిద్రసముద్రవి
హారమహాబాడబానలాలింగనమున్
జారుకటాక్షసుధారస
పూరంబుల నార్చి నన్నుఁబ్రోవుము లక్ష్మీ

70. ఇమ్మా మదభీష్టంబులు
కొమ్మా మా మ్రొక్కులన్ ముకుందుననుంగుం
గొమ్మా వినవమ్మా మా
యమ్మా వలరాజు గన్నయమ్మా లక్ష్మీ

71. నిరతము యుష్మచ్చరణాం
బురుహద్వయచింతనాప్రమోదాత్ముఁడ నై
కర మలరారు ననుం గని
గురుకృప రక్షణము సేయఁగూడదె లక్ష్మీ

72. విను మెన్నికష్టములు బె
ట్టినఁ బడి యోర్చితి నెదం గడిందిధృతి బెం
పున రక్షింప మనంబున
నెనరించుక కలుగ దకట నీ కిఁక లక్ష్మీ

73. విను మెటులఁ దప్పదు సుమీ
ఘనసంపదలిచ్చి ననుఁ గావక నీ వెం
దును భక్తజనంబులకుం
గనుఁగొన ముంగొంగుపసిఁడి గావే లక్ష్మీ

74. పరిభవపరిచితి మిక్కిలి
దురవస్థం బెట్టి తార్తి దొరయించితి వ
చ్చెరు వే నృయపరాధం
బురక యొనర్చితి వచింపు మున్నతి లక్ష్మీ

75. చేసితి చేయంగలపనిఁ
బోసితి పరిభవపుధారఁ బొలియించితి వా
యాసంబుల నిఁకనైన మ
హా సంపదలిచ్చి కావుమా వెస లక్ష్మీ

76. కనికరపుఁగడలివైనను
ఘనసంపద లిచ్చి యిపుడు కావుమి యటులై
నను నీలసత్కథావళి
గను విద్వత్సభలలోఁ బ్రకాశము లక్ష్మీ

77. వింటిఁ ద్వదంచితచరితం
బంటి ననుం గరుణఁ బ్రోవు మని నిను నెడఁదం
గంటి భవత్కారుణ్యముఁ
గంటి నిధానంబుఁ గంట గాదే లక్ష్మీ

78. నొచ్చితి నవమతి నచ్చితి
పెచ్చు గదిరె నిచ్చఁ గచ్చువిచ్చైతి కటా
నచ్చి నిను జొచ్చి వచ్చితిఁ
గ్రచ్చర నిప్పచ్చరంబు వ్రచ్చుము లక్ష్మీ

79. కడుకష్టపెట్టి తిటు లె
క్కుడు గాసిలఁజేసి తొప్పుఁ గుందించితి వా
రడి యింకనైన దీరిచి
గడలుకొనం బ్రోవరాదె గ్రక్కున లక్ష్మీ

80.నను గృపఁ జూడుము దుస్థ్సితు
లను దొలఁగింపుము శుభోజ్జ్వలశ్రీయుతుగా
నొనరింపుము భవదాశ్రిత
జను లాపద్రహితు లనవె చదువులు లక్ష్మీ

81. నీచూపు లెచటి కేఁగునొ
యాచోటికి నరుగు గలుము లహమహమని నిన్
యాచించుఁ గాదె నాదెస
నాచూపులఁ గను మొకించుకంతయు లక్ష్మీ

82. నను గావు నను ధరింపుము
నను సత్కృప రక్షసేయు నను నేలుము వే
నను గలుము లొసఁగి ప్రోవుము
నను మన్నింపుమి యెడంద నమ్మితి లక్ష్మీ

83. నిను వేఁడుదు నినుఁ బొగడుదు
నిను గొలుతు నినుం దలంతు నిను వర్ణింతున్
నిను సంప్రార్థింతు నినున్
వినుతింతున్ గోర్కులొసఁగు వేగమె లక్ష్మీ

84. విను తడవేల యొనర్చెదు
పెనుజిక్కులఁ జక్కఁజేసి పెనుపుము సిరులన్
దనివోవ నెనరుచూడ్కుల
నను గనుఁగొని భక్తజనమనఃప్రియ లక్ష్మీ

85. మదిఁదలఁచి యర్చనము లి
చ్చెద మ్రొక్కెదఁ గిర్తనంబుఁ జేసెద నిదె నీ
కొదవించు నన్నివిధులు శు
భదములు గావే త్రిలోకపావని లక్ష్మీ

86. సరసిరుహనివాసిని శుభ
కరిపంకజహస్తపద్మగంధిని భూతే
శ్వరి పద్మిని దరిత్రిభువన సుం
దరి నిన్నుఁ దలంతు లోకనాయిక లక్ష్మీ

87. అమృతమయాత్మిక సకలా
గమసన్నుత సుప్రసన్నకాంతప్రసాదా
భిముఖి నతార్తివినాశని
కమలా నిను గొల్తు గరుడగామిని లక్ష్మీ

88. ధనధాన్యకరి శుభంకరి
వినమజ్జనసురసురభి ప్రవిమలాత్మకచం
దనశీతలత్రిభువనవ
ర్ధనిదేవి భజింతు నిన్ను దారణి లక్ష్మీ

89. సతతానందమయాత్మిక
శ్రుతిమౌళిమణిప్రభావిశోభిత శరణో
చతురాననాదిసేవిత
చతుర్భుజ దలంతు నిను యశస్విని లక్ష్మీ

90. లలితాత్మిక భాస్కరి ని
ర్మలిని హిరణ్మయి సుపర్వమహిళాకర సం
చలచామరమరుదంకుర
చలితాలక యెంతు నిను రసాసఖి లక్ష్మీ

91. శివ శివకరి యవిభూతి
ప్రవిమర్ధని పద్మనిలయ పద్మిని పద్మో
ద్భవ పద్మప్రియ పద్మిన్
ధ్రువఁ గొలుతు నినున్ సువర్ణరూపిణి లక్ష్మీ

92. త్రైలోక్యకుటుంబిని ప
ద్మాలయ పద్మమకరాదికానేకనిధీ
వ్యాలీఢపురస్థ్సలి నత
పాలిని వినుతింతు నిను విభావరి లక్ష్మీ

93. స్థితి సిద్ధి సరస్వతి రతి
ధృతి బుద్ధిం బ్రకృతి దితి నదితి మంగలదే
వత నమృతసుమతి దివ్యా
కృతి నిను గీర్తింతుఁ జిదచిదీశ్వరి లక్ష్మీ

94. అనఘు వసుంధర వసుధా
యిని తేజస్విని మహేశ్వరేశ్వరి శుభహ
స్తిని నాథసంప్రభోధిని
ధనవాసిని దలఁతు నిను సుధాసఖి లక్ష్మీ

95. శోకవినాశని సుఖద శు
భాకారిణి పద్మ త్రిజగదవనిహిరణ్య
ప్రాకారవినమదమరా
నోకహ నినుఁగొల్తు హరి మనోహరి లక్ష్మీ

96. విశ్వజనయిత్రి శాశ్వత
శశ్వత్సంపత్ప్రదన్ బ్రశాంతి నఖిలలో
కేశ్వరి భక్తజనప్రియ
విశ్వాత్మిక దలఁతు నినుఁబ్రమలివిని లక్ష్మీ

97. సత్యాత్మిక వసుథారిణి
నిత్యానందస్వరూపిణిం ధాత్రి శతా
దిత్యప్రభ శుచి నభవా
దిత్యప్రణుతాంఘ్రి నిను నుతింతును లక్ష్మీ

98. శతకోటిచంద్రశీతల
జతురానన మీనకేతుజనని విభూతిన్
సతి పద్మమాలికాధర
నతపోషణి గొలుతు నిను ధనప్రద లక్ష్మీ

99. దారిద్ర్యప్రవిదారిణి
నీరేజవనీవిహారిణిన్ బరమశుభా
కారిణి నతపరిభసం
హారిణి నిను దలఁతుఁ గృతివిహారిణి లక్ష్మీ

100. నారాయణి దుష్కృతసం
కారిణి నభయప్రదానహస్తాబ్జపయః
పారావారకుమారి ఘృ
ణారాశి తలంతు నిను సనాతని లక్ష్మీ

101. జయజయ దరిద్రమర్ధని
జయజయ భక్తార్తిశమని జయజయ దేవీ
జయజయ మునికవివరనుత
జయజయ నిజభక్తశుభద జయజయ లక్ష్మీ

102. అలరుం గైతలనేరుపు
గలుగంగా నిన్నుఁబొగడఁ గాంచితిఁ దలఁపన్
దొలిబాముల నోఁచిన నో
ములపంట ఫలించె సిరులఁ బొదలితి లక్ష్మీ

మ. అనఘు శ్రీపరవస్తు శేషమఠపీ
ఠాధీశజియ్యర్మహేం
ద్రనిరాఘాటకృపాకటాక్షరససం
ప్రాప్తాష్టఘంటాకవి
త్వనిధి శ్రీ శతపత్రసన్మఠముని
స్వామిప్రణితంబు ధా
త్రిని లక్ష్మీశతకంబు భానుశశిభూ
భృత్తారమై శోభిలున్

సమాప్తం