Wednesday, February 13, 2013

శతకసాహిత్యం - ఉపోద్ఘాతం

శతకసాహిత్యం గురించి కొంత ఇంతకు ముందు చర్చించుకున్నాము. సంస్కృత, తమిళ, కన్నడ భాషాసాహిత్యలలో ప్రారంభమైన శతక ప్రక్రియ ఆంద్రసాహిత్యంలో తనదైన ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నది. తెలుగులో మొట్టమొదటి శతకము ఏదీ అనే విషయంలో ఇంకా కొంతవాదనలు ఉన్నా పాల్కూరికి సోమనాథకవి 12వ శతాబ్దంలో వ్రాసిన శతకము మొదటి శతకంగా చాలామంది పండితులు అంగీకరించిన విషయం. అప్పటినుంచి ఈనాటివరకు ఈ శతకరచన ఎన్నో క్రొత్తదారులు తొక్కుతు తెలుగు సాహిత్యంలో ఒక విశిస్ఠస్థానాన్ని సంపాదించుకొన్నది అనటంలో ఏమాత్రం సందేహంలేదు. ఆకాలం నుండి నేటివరకు అనేకమంది కవులు ఎన్నో శతకాలను మనకందించారు. అయితే చాలామంది ప్రబంధ కవులు తమ రచనలలో ప్రబంధలను మాత్రమే పేర్కొని శతకరచనలు చేసినా వాటిని పేర్కొనలేదు. కారణాలు మాత్రం అంతగా తెలియరావు. ఎందరోకవులు ఎన్నోసందర్భాలలో చెప్పిన శతకాలు ఇప్పతివరకు ఎన్ని అనేది ఒక అంచనాకి రావటం కష్టమే. "కాదేది కవిత కనర్హం" అన్నట్లు శతకాలు ఒక్క భగవంతుని గురించే కాక అనేక సందర్భాలలో అనేక విషయాలలో చెప్పబడ్డాయి. 

శతక వర్గీకరణ

ముందుగా చెప్పినట్లు శతకాలు అనేక విషయాలపై, అనేక సందర్భాలలో రచించినవి కావటంవలన వానిలో అత్యంత వైరుధ్యం కనిపిస్తుంది. ఈ వైరుద్యాన్ని దృష్టిలో ఉంచుకొని శతకాలను ఈ క్రిందివిధంగా వర్గీకరించవచ్చు.

1. భక్తి శతకాలు : ఈ శతకాలు భక్తిరస ప్రాధాన్యాలు. వీనిని మరల (అ) శివభక్తి, (ఆ) విష్ణుభక్తి, (ఇ) దేవీభక్తి (ఈ) ఇతరదేవతా శతకాలు (ఉ) మానవస్తుతి ప్రతిపాదకాలుగా విభజించవచ్చు. 

2. శృంగార శతకాలు : భగవంతుని శృంగార లీలలను వర్ణిస్తు చెప్పిన వేంకటేశ్వర శతకము, అంబికాశతకము లాంటి శతకాలతో మొదలై కాలక్రమేణా శృంగార రసముతో శతకాలు వచ్చాయి. స్త్రీ, పురుష విరహ వర్ణన, శృంగార భావనలు ఈ శతకాల ప్రధాన విషయం. కలువాయి శతకం, గోరంట్ల మాధవ శతకం, లావణ్య శతకము, భోగినీ శతకము మొదలైనవి ఈ కోవకి చెందుతాయి.

3. నీతి శతకాలు : మనవ మనుగడకి మూలము ధర్మము నీతి. ఈతువంటి నీతిని మానజాతికి సులభంగా అర్ధమయ్యే రీతిలో తెలియచేయటానికి నీతి శతకాలు ఎంతో దోహదం చేస్తాయి. సుమతీ, భాస్కర, కుమారీ, కుమార, మానినీ వంటి శతకాలు ఈ కోవలోకి వస్తాయి. 

4. వేదాంత (తాత్విక) శతకాలు : భగవంతుని చేరే జ్ఞానమార్గాన్ని తెలుపుతూ చేయబడిన శతకాలు. వీనిలో వివిధ మతసిద్ధాంతాలు, తాత్విక విషయాలు, వైరాగ్యమార్గం వంటివి ప్రధాన విషయం. సదానందయోగి శతకము, శివముకుంద శతకము, సంపంగిమన్న శతకము, దత్తయోగీంద్ర శతకము ఈ కోవకి చెందిన శతకాలు.

5. హాస్య శతకాలు : ఇవి హాస్యరస ప్రధాన శతకాలు. ఒక చిన్న విషయాన్ని తీసుకొని నవ్వు పుట్టించే విధంగా వర్ణిస్తూ చెప్పినవి. ఇందులో హాస్యమే ప్రధానాంశం. పొగచుట్ట శతకము, పకోడీ శతకము, విసనకర్ర శతకము, చీపురుపుల్ల శతకము, పిల్లి శతకము లాంటి శతకాలు ఈ కోవకి చెందుతాయి.

6. చారిత్రిక శతకాలు : చారిత్రిక, రాజకీయ సంఘటనల ఇతివృత్తంగా చెప్పిన శతకాలు ఇకోవలోకి వస్తాయి. ఆంధ్రనాయక శతకము, సింహాద్రినారసింహ శతకము, భద్రగిరి శతకము, విశ్వేశ్వర శతకము మొదలైనవి ఈ వర్గంలోకి చెందుతాయి.

7. జీవిత చారిత్రిక శతకాలు : గొప్పవారి జీవిత చరిత్రలు శతకరూపంలో కొంతమది కవులు వ్రాసారు. ఉదాహరణకి కృష్ణమూర్తి శతకము ఈ కోవలోకి వస్తుంది.

8. స్వీయచరిత్ర శతకాలు : కొంతమంది కవులు తమ ఆత్మకధను శతకరూపంలో వ్రాసికొన్నారు. హరిహరేశ్వర శతకము, బిల్పేశ్వర శతకము, కామేశ్వరీ శతకము మొదలైనవి ఈ వర్గంలోకి వస్తాయి.

9. వ్యాజ్య నిందాస్తుతి శతకములు : కొందరు కవులు తమకు కలిగిన కష్టాలను కానీ, సమాజంలోని అన్యాయాలను కానీ చూచి భరించలేక భగవంతిని ఎత్తిపొడుస్తూ, ఆయనలోని గుణాలను లోపాలుగా చూపిస్తు వ్యాజ్యనిందలో స్తుతించారు. ఆంధ్రనాయక శతకం, విశ్వేశ్వర శతకం, భద్రగిరి శతకం, సింహాద్రి నారసింహ శతకం, వేంకటేశ్వర శతకం మొదలైనవి ఈ కోవలోకి వచ్చే కొన్ని శతకాలు.

10. కథా శతకాలు : కొందరు కవులు ఒక కథాని వస్తువుగా స్వీకరించి ఆ కథను శతకరూపంలో వ్రాసారు. ముకుందరాఘవ శతకం, లవకుమార శతకం, భాగవత ప్రధమ స్కంధ శతకం, భాగవత దశమ స్కంధ శతకము మొదలైనవి కధా శతకాల కోవలోకి వస్తాయి.

11. సమస్యాత్మక శతకాలు : ఇవి ఇచ్చిన ఒక సమస్యను పద్యపాదమకుటంగా చేసుకొని చెప్పిన శతకాలు. సత్యవతీ శతకం, అనుభవరసిక శతకం మొదలైన శతకాలు ఈ పద్ధతిలో వచ్చిన శతకాలు.

12. నిఘంటు శతకాలు : 12 శతాబ్ధంలో వెలువడిన అచ్చతెలుగు నిఘంటువులు శతకరూపంలో ఉండేవి. వేంకటేశాంధ్రం, సాంబనిఘంటువు, ఆంధ్రభాషార్ణవము, మొదలైనవి నిఘంతు శతకాలు.

13. అనువాద శతకాలు : ఇతరభాషల్లో నుండి తెలుగు భాషలోకి అనువదించిన శతకాలన్ని ఈ విభాగంలోకి వస్తాయి. సూర్యశతకం, సౌందర్యలహరి, గాథాసప్తశతి, శివానందలహరి, మొదలైన అనేక సంస్కృత, ప్రాకృత కావ్యాలు శతక రూపంలో తెలుగులోనికి అనువదించ బడ్డాయి.

14. అచ్చతెలుగు శతకాలు : 18వ శతాబ్ధం నుండి మొదలైన అచ్చతెలుగు శతకాలలో ఇతర భాషలు వాడక పూర్తిగా తెలుగు పదాలతోనే శతకరచన చేసిన కవులున్నారు. భళిరా కరివేళ్పు శతకం లాంటివి ఈ కోవకు చెందే శతకాలు.

15. చాటు శతకాలు : సందర్భోచితంగా అనేక విషయాలపై చెప్పిన ఒకే మకుటంగల శతకాలు. రఘుపూరి కేశవ శతకము, రామతీర్థ శ్రీరామ శతకము మొదలైనవి ఈ వర్గంలోకి వస్తాయి.

ఇంతవైవిధ్యం ఉన్న శతకాలు లభిస్తున్నప్పటికీ మన శతక కవులు శతక రచనకు కొన్ని నియమాలను, కొన్ని లక్షణాలను ఏర్పరుచుకొని ఆ నియమాలను అనుసరిస్తూనే శతక రచనలను సాగించారు. 

శతక లక్షణాలు 

1. సంఖ్యా నియమం: శతకం అనగా వంద. ఈ విధంగా చూస్తే శతకం వందపద్యాలకు పరిమితంకావాలి. ఐతే సంస్కృత సంప్రదాయం అనుసరించి శతకాలలో 100, 108, 116 పద్యాలవరకూ వ్రాయటం ఆచారంగా తీసుకొన్నారు. వంద పద్యాలకు తక్కువగా ఉన్న పద్యాలు కల రచనలను శతకం అనటానికి వీలు లేదు. శతక రచనలో సంఖ్యకు ప్రాధాన్య్త ఉండటం వలన అంతకు పైబడిన పద్యాల రచనలను ద్విశతి (200), త్రిశతి (300), పంచశతి (500), సప్తశతి (700) అనే సంప్రదాయం ఏర్పడింది. వెయ్యిపద్యాలకు పైన ఒకే మకుటంతో ఉన్న పద్యాలున్న రచనలను కూడా శతకంలో చేర్చారు. వేమన పద్యాలు 3000కు పైగా ఉన్నా ఒకే మకుటంతో ఉండటంవలన వేమన శతకం అని పిలవబడుతున్నది.

2. మకుట నియమం: శతకంలోని చివరిపాదం గానీ, పాదాంతంలో గానీ ఒక పేరును సంభోదిస్తూ ఉంటుంది. దీనినే మకుటం అంటారు. ఈ మకుటం సంభోదనా విభక్తియై అన్ని పద్యాలలో సమానంగా ఉంటుంది. ఉదాహరణకు వేమన శతకంలో విశ్వధాభిరామ వినురవేమ, కాళహస్తీశ్వర శతకంలో శ్రీకాళహస్తీశ్వరా, నారాయణ శతకంలో నారాయణా, అనేవి ఆ శతకాలకు మకుటాలు. 

3. వృత్త లేక చంధో నియమం : శతక మకుట నియమం వలన శతకంలోని ప్రతిపద్యాన్ని ఒకటి లేక రెండు వృత్తాలలోమాత్రమే వ్రాయటానికి కుదురుతుంది. అందుచేతనే ఈ నియమం ఏర్పడుతున్నది. ఉదాహరణకు దాశరథీ శతకంలో "దాశరధీ కరుణాపయోనిథీ" అనే మకుటం చంపకమాల, ఉత్పలమాల వృత్తాలకు మాత్రమే కుదురుతుంది. అలాగే కాళహస్తీశ్వర శతకంలోని "శ్రీకాళహస్తీశ్వరా" అనే మకుటం మత్తేభ శార్ధూల వృత్తాలకు మాత్రమే కుదురుతుంది. ఐతే ఒకే వృత్తంలో సంపూర్ణ శతకాలు కూడా చాలానే ఉన్నాయి. సీసపద్య శతకాలు, కందపద్య శతకాలు వీటికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

4.రస నియమం : శతకాలన్నిటిలోను ఒకే రసం ప్రతిపాదించబడాలి. భక్తి రస శతకాలలో భక్తిరసంతో కూడిన పద్యాలు మాత్రమే వస్తాయి. వీర, రౌద్ర, హాస్య రసాలకు ఇక్కడ తావు ఉండదు. 

దాదాపుగా మన తెలుగు శతక సాహిత్యంలో పై నియమాలను అనుసరిస్తునే రచనలు చేసారు. ఇప్పటికీ చేస్తున్నారు. కాకపోతే కొంతమంది కొన్నిచోట్ల ఈ నియమాలను పాటించక రచనలు చేసారు. ఉదాహరణకి సంబోధనా విభక్తి మాత్రమే శతక మకుటలో ఉంటుంది కానీ "రంగశాయి శతకం"లో సంభోదన విభక్తికి బదులు గోపాలుడు రంగశాయి మనపాలగలడు విచారమేటికిన్ అనే మకుటంతో, నార్లవేంకటేశ్వరావు గారి శతకంలో వాస్తవమ్ము నార్లవారి మాట అనే మకుటంతో వ్రాసారు. కొన్ని శతకాలు సంస్కృతాంద్ర మిశ్రమ రచనలైతే, మరికొన్ని అచ్చ తెలుగు శతకాలు మరి కొన్ని గ్రామ్యభాష లో రచించబడ్డాయి. 

దశకవిభాగం: కొన్ని శతకాలలో ఈ దశకవిభాగం అనే ప్రక్రియ కనిపిస్తుంది. అంటే శతకంలోని ప్రతి పది పద్యాలను ఒక విభాగంగా చేసి వానిని ఒక శీర్షిక క్రింద వ్రాయటం. ఉదాహరణకి నారాయణ శతకంలో ఆది, అవతార,, దివ్యరూప, నామ, కృష్ణవతారవిశంతి, జ్ఞానవిశంతి, మోక్షవిశంతి అనే విభాగాలున్నవి. ఇదేవిధంగా భర్తృహరి నీతి శతకంలో, శృంగార, వైరాగ్య శతకాలలో కూడా దశకవిభాగం ఉన్నది.

(ఈ ఉపోద్ఘాతం శ్రీగాజుల సత్యనారాయణ గారి "తెలుగువారి సంపూర్ణ చిన్న బాలశిక్ష" ఆధారంగా వ్రాసినది)

2 comments:

  1. సుబ్రహ్మణ్యంగారూ....చాలా బాగుంది. మంచి కృషి. స్టాక సాహిత్యం మీద మీరు చేస్తున్న పరిశోధన బహు ప్రశంసనీయం.

    ReplyDelete
  2. సుబ్రహ్మణ్యంగారూ ! హృదయపూర్వకాభినందనలు. మీ కృషి అనన్యసాధ్యం. 100 శతకముల పట్టికను ఇచ్చారు. ఇన్ని శతకాలను సేకరించడం సామాన్యమైన సంగతి కాదు......... మరి ఆ, యా శతకముల్లోని పద్యసుమముల పరిమళమును మేము ఆఘ్రాణించే భాగ్యం కలిగిస్తారా ?

    ReplyDelete