భద్రాద్రిరామచంద్ర శతకము (రామచంద్రీయము)
బళ్ళ రామచంద్రరాజు
1. శ్రీరామ! జయరామ! శృంగారరామ! స
త్ప్రియనామ! యాననవిజితసోమ!
శ్రీజానకీసతీచిత్తాబ్జభృంగ! స
మాశ్రితరక్షాచణాంతరంగ!
శంఖచక్రగదాసిశార్గ్జసంయుతహస్త!
శతకోటిభానుతేజఃపశస్త!
దానవారి! నృపాలమానసంరక్షణ!
కరిరాజపోషణ! కలుషహరణ!
దివిజగంగాసముద్భవోద్దీప్తచరణ!
పక్షిరాజతురంగ! విపక్షభంగ!
భద్రహృదయాబ్జపూష! సద్భక్తపోష!
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!
2. వాగ్బూషణము లేనివానికి నిలువెల్ల
సొమ్ము లుండిన సోయగమ్ము కలదె?
వితరణంబే లేనివిత్తం బదెంతయు
న్నను లోకమునఁ బ్రయోజనము కలదె?
ప్రతిపదంబును రసాస్పదము కాకుండినఁ
గవనమ్ము వినఁగ నుత్సవము కలదె?
ఆజన్మభూతదయాశూన్యమతికి నెం
తటిచదు వున్న సార్థకత కలదె?
ప్రకృతికాంతావిలాససంభరిత మగు ప్ర
పంచకపుమాయలోఁబడి పల్లటిల్లి
భక్తితో నినుఁ గొలువల ముక్తి కలదె?
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!
3. విద్వాంసునకు లేవు వింతదేశంబులు
పరమార్థమున లేదు బాంధవంబు
కవి యెఱుంగని సృష్టికలన యెచ్చట లేదు
చవిలేనికూర వాచవినిఁ బడదు
పండుగుపేరిటఁ బరమాన్నములు లేవు
తిండిపోతుకు లేదు దండితనము
ఎండమావుల నుండ దేమాత్ర ముదకము
కులట లెవ్వరికి సంకోచపడరు
ఊరిలోవారి కుండదు వారిభయము
బాటసారి కుండాదు వల్లకాటి భయము
భక్తులకు లేదు కాలునిపాశభయము
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!
4. అగ్రహారము లీయ నాస్థ యెవ్వరి కుండెఁ?
బన్నులు కట్టించుప్రభులె కాని;
వార్షికముల నిచ్చు వాసి యెవ్వరి కుండెఁ
గవుల బాధించు భూధవులె కాని;
యీనాము లిచ్చెడునీవి యెవ్వరి కుండె?
హితుల వంచించు భూపతులె కాని;
పండితాదరణవైభవము లెవ్వరి కుండె?
దుర్మంత్రులను బెంచుదొరలె కాని;
శ్రితుల కుపకృతు లొనరించు క్షితుపు లెవ్వరు?
తినెడుకూడును బోఁగొట్టు ఘనులె కాని;
యిట్టి ప్రభువులా కవులఁ జేపట్టువారు
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!
5. కలవానిచెంతను గాఁపురం బుండినఁ
గష్టసుఖమ్ములు గాఢమగును
ఒడలెఱుంగనిరాజుకడ నున్న భృత్యులు
మానాపమానముల్ పూనవలయు
జూదరిస్నేహమ్ము నాదరించినపట్లఁ
దుదకు నష్టములతోఁ దూలిపోవు
సానులయిండ్లె యాస్థానమ్ములై యున్న
భోగులు జోగులై పోవుచుంద్రు
మనుజు లెల్లప్పుడు ధనమదముచేత
మాసిపోవరె? బుద్ధులు మాఱిపోయి;
యెఱిఁగి తిరిగినవారికె పరువుగలదు;
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!
6. పెద్దవారింటను బెత్తనదారైన
నౌదార్య మబ్బునే? యల్పునకును;
సొమ్మిచ్చి లంజలచుట్ట మైనంతనే
రారాజె కానిమ్ము రసుకుఁ డగునె?
పదిమందిలో మంచివానిని బడఁదిట్ట
నెద్దగునే కాని పెద్ద యగునె?
వేషభాషలమాత్ర వేదాంతి తా నౌనె?
పరతత్వ మెఱుగని పరమశుంఠ;
శ్రీమదభిరామతారకనామరహిత
కావ్యపాఠము బుధజనశ్రావ్య మగునె?
చెవుల గీపెట్టు ఝిల్లికారవమె కాని;
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!
7. పురుషాయితము చేయుపూఁబోఁడికా? సిగ్గు;
వెలయాలికా? రాజవీథిభయము;
పచ్చిమాంసంబు సాపడువానికా? దయ;
ఱాఁగకా? యల్లుని రాజసంబు;
పరు వెఱుంగని యూరఁబందికా? యంబారి;
మంత్రికా? చెప్పుట తంత్రమహిమ;
రస మెఱుంగనిపసరమునకా? కవనంబు;
ముదికొండముచ్చుకా? ముద్దుగుమ్మ;
మాటవాసి యెఱుంగక కాటులాడు
మోటుమానిసికా? హాస్యములపసందు;
నరపిశాచికా? నీదివ్యచరణభక్తి;
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!
8. కామాతురుఁడు వావి కనిపెట్టి పొందునే?
లంచగాఁ డెంచునే మంచితనము?
లంజ మగం డెంతలాలింప మెచ్చునే?
వెలయాలి నమ్మునే విటులబాస?
లర్థాతురుఁడు చుట్టమన్న డబ్బిచ్చునే?
త్రాగి జమీ నిడ్డఁ ద్యాగియౌనె?
గయ్యాళి తనపతి గౌరవం బెంచునే?
జ్ఞాని మోహాబ్ధిలో జాఱిపడునె?
స్వసుఖమే కోరుకొనునట్టిస్వామి యెపుడు
నాలకించునె? ప్రజలగగ్గోలు; నకట!
యిట్టివారికి గతు లేమి పెట్టినావొ?
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!
9. అప్పుఁజేసుక తిన్న పప్పుఁగూ డొకబెంగ
పరులకల్మి కసూయపడిన బెంగ
అన్నదమ్ములయాస్తు లపహరించిన బెంగ
పెండ్లము విడనాడఁ బెద్దబెంగ
అన్యాయ మొనరింప నంతకంటెను బెంగ
వర్ణసంకర మైనపట్ల బెంగ
కూఁతురు చెడుఁగైన మాతకుఁ గడుబెంగ
కొడుకు దుండగుఁడైన గొప్పబెంగ
ఇట్టి సంసారపుంబెంగ లెన్నొ పెట్టి
కట్టికుడుపుచు నుంటివి కర్మములని
మాకు నినుఁ జేరుకొన నింక మార్గ మేది?
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!
10. కులకాంత సతత మాకులతఁ జెందించిన
నింద్రవైభవ మున్న నేమిశోభ
కన్నకుమారు నాపన్నుఁ జేసినపట్లఁ
దనమంచి కిఁక నేమిఘనతవచ్చుఁ
దన సేవకులఁ బట్టి తహతహలాడింప
యధికారమున కేమి యంద మబ్బు
నర్థికే మీయక యల్లరి పెట్టినఁ
బరమార్థమున కేమి పాలుగూడు
వేలు లక్షలకొలఁదిని జాలినంత
ద్రవ్య మార్జించి తుదకు నధర్మమూని
సంచరించెడివారికే సంచితమ్మొ?
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!
11. హెచ్చుపన్నులు గట్టఁ బెచ్చుపెర్గినగౌ
ర్మెంటును మేమేమి గెంటఁగలము?
అభిమానులకు నిచ్చు నధికార్లు గలుగ లో
కలుబోర్డు నేమేమి కట్టఁగలము?
కలవార లగుచుఁ బేదలకుఁ జో టీయని
ధనికుల నేమేమి చెనకఁగలము?
జారతాచోరతాచారపారీణుల
కెంతబోధించి వారింపఁగలము?
అన్నిటికి నీవె కలవు నే నెన్నిసార్లు
మొఱవెట్టిన ఫలమేమి మూఢలోక
మెంచదే వచ్చి పైఁబడు మంచిమాట
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!
12. పిల్లకాసుకు కొట్టి కల్లలాడించెడి
యధికార్ల కేముండు నంత్యదశకు?
కూటసాక్ష్యము లిచ్చి కొంపలఁగూల్చెడి
గడుసుకు పరలోకగతులు కలవె?
వడ్డికి వడ్డీలు సడ్డింపు లేకుండఁ
గట్టువారికి ముక్తి గలదె భువిని?
అప్పుఁ గైకొని పోయి ముప్పుత్రిప్పలఁ బెట్టు
చెడు గిహపరములఁ జెందఁగలఁడె?
వీరికర్మానుసార మాతీరు చేసి
పాతకము గూర్పనో యపఖ్యాతికొఱకొ
ఎఱుఁగలే మిఁక నీబుద్ధి కెఱుకగాదె
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!
13. బదులిచ్చి కొనితెచ్చు బంధువిరోధమ్ము
చనవిచ్చి గైకొన్న చౌకతనము
ఉపకారమున కేగి యురిలోఁ దగుల్కొంట
మనసిచ్చి వీథిలో మాటఁబడుట
ఇలువీడి పొరుగింట నెలవు చేకొనియుంట
ఆడితప్పినవారి నంటియుంట
చంచలాక్షుల నమ్మి వంచనపాలౌట
కూటికై నీచులఁగూడఁ జనుట
నాకె కా దిఁక జన్మజన్మములకైన
నక్కటా! యివి పగవారికైన వలదు
బుద్ధిమంతుల కే నేమి బోధసేతు?
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!
14. భోగలాలసునకు రోగభయం బెచ్చు
రోగి కోరికల నుఱ్ఱూతలూఁగు
చాగి కీయను డబ్బు సర్దుబాటుండదు
శ్రీమంతుఁ డిడుటకుఁ జేయిరాదు
సిరిగలానికి లేదు చిత్తశాంతి రవంత
కూలివానికిఁ గోర్కి చాల హెచ్చు
పేదవానిగృహంబు పిల్లలతో నిండుఁ
గలవాని కొకడైనఁ గలుగకుండు
తగినసతి యున్న నీడైనమగఁడు లేఁడు
ప్రథితకవి యున్న రసికుడౌ ప్రభుఁడు లేఁడు
ఏమొ నీసృష్టివైచిత్ర్య మెఱుఁగఁబోను
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!
15. ప్రజ కసమ్మతమగు పరిపాలనంబును
దుర్మంత్రి గలవారి దొరతనంబు
పదవికై పరుల నాపదలపా ల్జేయుట
ఇంటగు ట్టెచ్చెడి తుంటరియును
వేదాదు లెఱుఁగని విప్రు లాధిక్యంబు
అహమును విడనట్టి యణఁకువయును
జాగా యెఱుంగని వాగుడితనమును
పూటకూళ్ళమ్మల పుణ్యగరిమ
ఎవరు మెత్తురు లోకము కేమిహితవు?
చెడ్డపేరెదొ తనపయిఁ బడఁ బోవఁ
దానె గాదు పితామహుఁ దరమె యగునె?
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!
16. విద్వంసునకు నేల వేషభాషల మెండు
పరమమిత్రున కేల బాంధవంబు
అర్థాతురున కేల యందచందంబులు
కాటికాపరికి శృంగారమేల
పలికిబొంకినవారి భాగ్యమ్ము లవియేల
పాపికి సంసారభయ మదేల
చెనటికిఁ బరనింద చేటేమి తెచ్చు ని
రక్షరకుక్షికి రాజ్యమేల
వినయ మెఱుఁగనివానికి మనవి యేల
కవిత యెఱుఁగనివానికిఁ గావ్య మేల
అర్థి కన్నంబు బెట్టని యాస్తు లేల?
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!
17. కలవాఁడె యైనచోఁ గడనున్నఁ గందురు
తప్పు చేసిన వాని నొప్పుకొంద్రు
భాగ్యవంతుడు తిట్టి బాధపెట్టినపట్ల
మందలిం పని మోద మందుచుంద్రు
ధనుకుడు ప్రాల్మాలి ఖనకుఁ డైననుగాని
సామర్థ్య మని వాని సన్నుతింత్రు
శ్రీలుగలాడు కూనీలు చేసినఁగాని
పొలియించె ఖలు నని పొగడుచుంద్రు
కలిమి పేరెత్తఁ దలదూర్చుఁ గలియుగంబు
మంచిచెడ్డలు యోచించు మనుజులెవరు?
ఎంతగ్రుడ్డిగ జగము సృష్టించి తయ్య
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!
18. మాతృభాషలకు సన్మానంబు కొఱతయ్యె
పరభాషలకుఁ జాల బరువు హెచ్చె
సంసారు లన్నిట సానులుగా నైరి
సానులన్నిటను సంసారులైరి
వర్ణాశ్రమాచారవాసన లడుగంటె
మెట్టవేదాంతమే పట్టూఁబడియె
పల్లెలన్నియుఁ బూఁటకూళ్ళకు నెలవయ్యె
నన్నసత్రములన్ని యంతరించెఁ
జదువుసాము లిఁకేలని వదలి జార
చోరు లయి కాలమున్ బుచ్చు శూరులైరి
ప్రబలెఁ బాశ్చాత్యపద్ధతుల్ ప్రాభవముగ
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!
19. దాత దరిద్రుడే; ధనవంతుడా? లోభి
న్యాయాధికారి యన్యాయకారి
అగ్రకులంబులా? యడుగంటె మొదటికి
నీచజాతులు పైకి నిలువఁ జూచె
నల్పవిద్వంసున కధికమౌ గర్వమే
గుణవంతునకుఁ గూడు కొఱత వచ్చు
గుణహీనునకు డబ్బు కుప్పలు కుమ్మలే
కడుపేదవాని కాఁకలియు హెచ్చు
రంభ షండున కగును బల్ ఱాఁగ యుత్త
మోత్తమునకును భార్య యౌ నుర్వియందు
నేమొ నీసృష్టివైచిత్ర్య మెఱుకపదదు
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!
20. తినఁబోవువయసులోఁ గొన డబ్బు లేకుండు
డబ్బుండి తినఁ గడు పుబ్బుచుండుఁ
దనప్రాయమున విత్త మన లెక్కపెట్టఁడు
ముదిమిలో గవ్వైన వదలబోఁడు
పండకుండినచేను ఫల మియ్యఁ డెవ్వఁడు
పండఁ బన్ననివచ్చు ప్రముఖుఁ డుండు
మానధమ్మున కూనువానికి నేదొ
సంసారలోపమే సంభవించుఁ
గటకటా! యివి నీచేతఁ గలుగుపనులొ
కాక వారిపురాకృతకర్మఫలమొ
యెంచ శక్యము కాదు బాధించ కయ్య
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!
21. కలిమి ఇంచుకకల్గఁ గలవారలం దెల్ల
మొనగాఁడ నని యెంచుమనుజుఁ డొకఁడు
బంట్రౌతుపని సేయువాఁయ్యు మదిని దా
నిని మోక్ష మనుకొను మనుజుఁ డొకఁడు
ఓనమాలును ఒచ్చిరాని సాహితితోడఁ
దనపాండితికి నిక్కు మనుజుఁ డొకఁడు
తనధర్మమును మానుకొనికూడఁ దనజాతి
ఘనతకై యుప్పొంగుమనుజుఁ డొకఁడు
ఇట్టు లున్నార లిది మౌఢ్యమే కదయ్య!
అసలు ధనమును బదవి విద్యయును జాతి
ఘనములే? పూజ్యమైనది గొనమెకాని
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!
22. కోపము వారించుకొనువాఁడె గురుమూర్తి
పాడిఁ దప్పనివాఁడె పండితుండు
ప్రియుని దా మనసారఁ బ్రేమించునదె భార్య
లంచ మడ్గనివాఁడె సంచితార్థి
పలువురు తల లూఁపఁ బాడినదే పాట
వ్యాధిని గనిపెట్టువాఁడె వెజ్జు
కన సర్వజనవశ్యమును జేయునదె విద్య
యభయప్రదానమే యధికశక్తి
రసికు నంకాన దీపించురమణివలె ని
రక్షరునిగూడ వలపించునదియె కవిత
యాపదకు నడ్డుపడువాఁడె యాప్తుఁ డెపుడు
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!
23. పార్టిభేదము వెట్టి పడఁగొట్టుటేకాని
జాతిభేదం బేమి చావలేదు
స్వార్థంబు విడినార మని చెప్పుటేకాని
పదవులపై నాశ వదల లేదు
పార్టీలు వృద్ధియై పరువెత్తుటేకాని
యుపకార మొనరించు నూహలేదు
వోటు వో టనెడుసాపాటురాయళ్లకు
మనవిని వినుటకే మనసులేదు
ఇట్టి మెంబర్లఁ బ్రెసిడెంట్లఁ బట్టు లరసి
కొలువఁ బండితకవుల కేవిలువ గలదు?
ఆశ్రయింపఁగ నిడవె? నీ వభిమతములు
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!
24. ఏ మన్నఁ బడినచో నెంతొసాత్వికుఁ డందు
రెదురింపఁగా వాఁడె యెడ్డెమనిసి
తన కిచ్చకముగఁ జెప్పిన మంచివాఁ డంద్రు
న్యాయంబు చెప్ప నన్యాయవాది
పద్యము లెలుఁగెత్తిపాడిన భట్టంద్రు
మాటాడకుండిన మందుఁ డంద్రు
కనిపెట్టి మాట్లాడ గడుసువాఁ డందురు
చన విచ్చినంతనే చవట యందు
రెవనిసామర్థ్య మెవరికి నెఱుకపడును
బుద్ధిమంతులకేగాని పుడమియందు
గంగలోఁ తెంచ శక్యమే కొంగలకును
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!
25. బలియుఁ దా నెంతటితులువరక్కసి యైన
విష్ణు మెప్పింపఁడే వితరణమున
రావణు డెంతదుర్మార్గుఁ డైయుండినఁ
బాలింపఁడే లంక మే లనంగ
దుర్యోధనుం డెంతదుండగీఁ డైనను
బ్రజల మన్నింపఁడే పాలనమున
నందుఁ డెంతయసూయ నందినవాఁడైనఁ
బౌరులఁ జూడఁడే గౌరవముగ
వారు వారికిఁ దగినట్టివారితోడ
వైరమున్ బూనిరేకాని వాస్తవముగఁ
బ్రజల బాధించిరే యెట్టిపట్లనైన
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!
26. నాగలోకవిలాసభోగినీమణి యైన
మగని లోఁజేయుట తగవుకాదు
సాటిలేనటువంటికోటీశ్వరుం డైనఁ
బేదల విడనాడఁ బెంపు లేదు
పండితమండలాఖండలుం డైనను
మూఢులతో వాద మాడరాదు
భోజునంతటి మహారాజైన "లోకలు
బోర్డు"ల నాసించి పోవరాదు
వీని గుర్తించుజను లెందు మాననీయు
లగుదు రన సంశయము లేదు; తగవుమాలి
పోవ యత్నింతురా చేటు మూడకున్నె?
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!
27. యజ్ఞాదికంబుల నాస్థతోఁ జేయంగ
నాస్తికి మునుముందె స్వస్తియయ్యెఁ
దీర్థాలవెంబడిఁ దిరిగి నిన్ దరిసింప
నారోగ్యమా చాలినంత లేదు
దీనుల రక్షింపఁ బూనుద మనుకొన్నఁ
గడుపాఱ నన్నంబు కానరాదు
పనిఁబూని నీసపర్యను గాల మేఁగింప
నసదృశ ధైర్యసాహసము లేవి?
అనయమున్ బస్తు లేకుండ నాదరించి
తృణమొ కణమొ నీవిడిన ద దెంతొ యంతె
దానితో నుంటి నిటుమీఁద దారి నీవె
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!
28. వార్ధక్యమా చెవిఁ బట్టి యాడింపఁగాఁ
బడుచుఁబెండ్లా మున్న ఫల మ దేమి?
కాపేయమా చేయిఁ గట్టివేయుచునుండ
వాకిట నిధి యున్న ఫల మ దేమి?
సంసారమా కాలిసంకెల యైయుండఁ
బరము పరం బన్న ఫల మ దేమి?
ఉబలాటమా యుసు రుడుఁగుచో నీఁగికిఁ
బలవరించినయంత ఫల మ దేమి?
జ్ఞాన మొదవిన దాది నీస్మరణ లేక
మేఁకమెడచన్నువలె నున్న మే నదేల?
నీప్రసాదముఁ గొన్నవానిదె భవమ్ము
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!
29. ముఖము చంద్రుఁడె, భృంగములు ముంగురులు, నుగ్గు
బుగ్గలు జగ్గులనిగ్గు లీనుఁ
జూపులు తూపులు, చూడ ముచ్చట యగు
మోవి తేనియ తేట, ముద్దుగారు
పాలిండ్లు గజనిమ్మపండ్లు, చూచుకములు
కాటుకపిట్టలకాంతి మించు,
నారు చీమలబారుతిరుఁ గేరుచునుండుఁ
గచము నల్లనిత్రాఁచుకరణిఁ దోచుఁ
మొగముసోయగమున కెంతొ మురిసి మురిసి
కుచము లని, కటియు, నా రని, కచము లనుచుఁ
గల్పనలు సేయుకవుల వాగ్గతులు వితలు
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!
30. పితృకార్యమునఁ గర్చువెట్టనివాఁ డగ్ర
హారంబుల నొసంగి యాఁపు టెట్లు?
కూలివానికె కొల్చుఁ గొలువనియాతండు
ధాన్యరాసుల నెట్లు ధారవోయుఁ?
దనవారినే మెచ్చ ననువాఁడు పరు నల్ప
విషయంబులో నేమి వినుతిసేయుఁ?
దనతప్పునే బైటఁ దలపెట్టువెంగలి
పరుల దే మని చాటుపఱుచుచుండుఁ?
గృత మెఱుంగక దారుణగతుల నడచి
మాయలోఁబడి మర్యాద మంటఁ గల్పు
నిట్టివారికి నేగతిఁ బెట్టినావొ?
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!
31. భగవంతునకుఁ బ్రేమ భక్తలోకమునందుఁ
దలిదండ్రులకుఁ బ్రేమ తనయులందు
వెచ్చకానికి లంజయిచ్చకమ్ములఁ బ్రేమ
వెలయాలికిం బ్రేమ విత్తమందుఁ
గ్రొత్తకోడలి కింటిపెత్తనమ్మునఁ బ్రేమ
నటకులకుం బ్రేమ నాట్యమందుఁ
జిఱుతపిల్లల కెల్లఁ జిఱుతిండిపైఁ బ్రేమ
సుకవులకుం బ్రేమ సూక్తులందు
సరసులకుఁ బ్రేమ రసికప్రసంగమందుఁ
జదువరికిఁ బ్రేమ పుస్తకసమితియందుఁ
బిసినిగొట్టుకు ధనమందె ప్రేమ మెండు
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!
32. కార్యవాదులపట్లఁ గయ్యంబు కూడదు
దుర్మార్గుఁ డేమన్న దుడుకు వలదు
కవులతో నెన్నఁడుఁ గలహంబు పడరాదు
బిక్షుకు నల్లరి వెట్టఁ దగదు
కొండెగాండ్రను జేర్చికొన హాని తప్పదు
లేది దారోపింపఁ బూనరాదు
పరకాంతఁ గలనైన భావింప నొప్పదు
వంతలవానితో వాదు వలదు
తాహతును మీఱునట్టియత్నంబు తగదు
నీతిమార్గమ్ముఁ దప్పుట ఖ్యాతిగాదు
శరణు చొచ్చినఁ బ్రోచుటే పరమపథము
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!
33. అతిరాగ మెచటనో హానియు నచటనే
సుజనుఁ డెచటనో దుర్జనుఁ డచటనె
భోగమ్ము లెచటనో రోగమ్ము లచటనె
గుణ మెచ్చటనొ యవగుణ మచటనె
ఆస్తిక్య మెచటనో నాస్తిక్య మచటనె
క్రొత్తావి యెచటనో క్రుళ్ళచటనె
మునివృత్తి యెచటనో మూర్ఖత యచటనే
భాగ్య మెచ్చటనొ లేవడి యచటనె
ఒకటొకటి కవినాభావ మొప్ప మమ్ము
దింపి సంసారమను పాడు రొంపియందుఁ
ద్రిప్పుచున్నాఁడ వాశల కప్పగించి
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!
34. ఖరము సింగముతోలుఁ గప్పుకొన్ననుగాని
గర్జించునే? కూయుఁగాక యెపుడు
ఱంకులాడిని భర్త లాలించిననుగాని
విటునివంకను గన్ను మిటకరించుఁ
గఱకుఁగసాయికి నఱచి చెప్పినఁగాని
మానునే? పశుహత్యఁ బూనుఁగాని
కుక్క నందలమునఁ గూర్చుండఁబెట్టిన
మఱచునే? చెప్పుక కుఱకుఁగాని
యిట్టివెడబుద్ధు లుండిన నెట్టివార
లార్చితీర్చుదు రయ్య? నీయాజ్ఞ చేత
వార లంతట వారలే తీరవలయు
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!
35. ఈశ్వరాంశము లేక యైశ్వర్యవంతుఁడే?
విష్ణ్వాంశ లేకుండ విభుఁడు కాఁడు;
కిన్నరాశంబు లేకున్న గాయకుఁ దౌనె?
శుక్రాంశ లేకుండ సుకవి కాఁడు;
భోగ్యంశ లేకున్న భోగవంతుం డౌనె?
గుర్వాంశ లేకుండ గురుఁడు కాఁడు;
బ్రహ్మాంశ లేకున్న బ్రహ్మవిదుం డౌనె?
రవ్యంశ లేక విక్రముఁడు కాఁడు;
అప్సరోంశయు లేక నాట్యంబు రాదు;
పెట్టిపుట్టకపోయినఁ బట్టదు సిరి;
భక్తి కలవాఁడు కాకున్న ముక్తి లేదు
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!
36. వలపింపనేరని వనితయందం బేల?
కూడని కార్యంబుఁ గోర నేల?
సరసాన్నములు లేని సంతర్పణం బేల?
కవిలేని సభల వైభవము లేల?
పెట్టిపోయనిదొర వెట్టిచాకిరి యేల?
యెపుడొ వీడినపతి కేడ్వ నేల?
అప్పుతోడుతఁ గల్మినంది యుబ్బుట యేల?
యౌచిత్య మెఱుగని త్యాగ మేల?
సార్థకతలేని వెల్ల నిరర్థకములు;
తోఁచ కావేదజడుఁ డిట్టితుచ్చసృష్టిఁ
బెంపుగాఁ జేయు నిఁక మందలింప వేల?
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!
37. వానిజ్యమున లక్ష్మి వఱలుచుండు నటంచు
మించి శాస్త్రమ్ము వచించుఁగాదె
యందులో సగ మర్థ మందరే కర్షకుల్?
వ్యవసాయ మొనరించి పాటుపడిన;
దానిలో సగము సేవానిష్ఠ రాజుల
కడ నుండువారికిఁ గలుగుచుండుఁ
బైమువ్వురుకె పట్టుపడులక్ష్మి భిక్షాట
నమ్ములో లేదు లవమ్ముఁగూడఁ
గాన నీదురావస్థ నన్ బూనకుండ
బ్రతుకుఁదెఱువున కేదొ సద్గతి నొసంగి
కూర్మితో నీపదాబ్జముల్ గొలువనిమ్ము
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!
38. తనవారికే కీడుఁ దలఁచుచుండెడువాఁడు
సైఁచునే పగవారి సంతసంబు
గంగిగోవును బట్టి ఘాతచేసెడువాఁడు
పలికిబొంకుట కేమి భయముపడును
దనతల్లిపట్లనే త ప్పొనర్చెడువాఁడు
పరకాంత నే మని పట్టఁబోడు
ఆపదలో నిడ్డయప్పె తీర్చనివాఁడు
పిలిచి యెవ్వరికిఁ గాసుల నొసంగుఁ
జుట్టముల కేదొ యపకృతిఁ జూచువాడు
పరుల కే మని చేయఁడు పాపపుఁబని?
నిట్టివారల కేగతిఁ పట్టఁగలదొ!
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!
39. ముడిగాళ్ళు పడినచో ముదిత యిల్లా లగుఁ
గలిమి నశింప జాగ్రత్తపుట్టుఁ
గామేచ్చ లడుగంటఁ గడకు బైరాగి యౌఁ
బరపతి పోయిన నిరసన మగు
నతివ లెవ్వరు రామి ననుకూలుఁ డైయుండు
రిక్తుఁ డౌనెడ దేశభక్తుఁ డగును
అప్పు పుట్టనినాఁడు గొప్ప లక్కఱలేదు
ఆపదలో మ్రొక్కు లధిక మగును
దేహదార్ధ్యము గలనాఁడె తెలివిఁజెంది
యక్షరంబైన నీపద మందుకొఱకుఁ
బాటుపడ రేమిపాపమో నేఁటి ప్రజలు
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!
40. నిజ మాడ నెవరికి నిష్ఠురమే వచ్చు
మొగమిచ్చకము లాడ ముచ్చట యగు
నైనదానికి నెంతొ యారాటపడుదురు
కాఁబోవుదానిని గాన రెవరు
చూచిచూడనిపని పేచీని బుట్టించుఁ
బ్రత్యక్ష మగుదానిఁ బట్టఁబోరు
కాంక్షించువస్తువు కనఁబడ దెప్పుడు
నుపయోగపడనిది యుండు నెదుటఁ
దగువివేకంబు లేకున్న నగును నెల్ల
పనులయం దిట్లె తత్తఱపా టదెంత
పండితుల కైన నొక్కొక్క పట్టునందు
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!
41. పదములు పాటించి కుదు రైననదకతో
నూతనఫక్కిని నూలుకొల్పి
రసముఁ బూరించి సంతసము పెంపెసలార
భావముల్ విరియంగఁ బాఱఁజేసి
వలపించి రీతుల మొలపించివృత్తులు
పచరించు మఱుఁగులు పట్టువఱచి
పాపపుణ్యములు నగణ్య మౌ నీతులు
మరులు పుట్టించి సంబరము నిచ్చి
కవిత యొప్పినఁ గనఁబోరె కలియుగాన
సరసుల మటంచుఁ దెగనీల్గసాగుచుంద్రు
ప్రభువులో కాక వీరలు పశువులొక్కొ?
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!
42. కనపడ్డకాంతను గౌఁగిలించిననాఁడె
పురుషకారం బని పొంగిపోతి
సాధునైననుగాని బాధ పెట్టిననాఁడె
పేరుండు నని పెచ్చుపెరిఁగినాను
నిరపరాధులనైన నిరసింపకుండిన
నధికారమా యని విధముచెడితిఁ
గడుపు నిండినమాత్రఁ గైలాస మనుచు దు
రాగతమ్ములు సేయసాగినాను
ఏమిశిక్ష విధింతువో యెఱుఁగఁ జాల
నెంతపరితాపపడిన నిం కేమిఫలము
నీకృపారస మిచ్చి మన్నింపుమయ్య
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!
43. మాలమాదిగలెల్ల మనవా రనుటెగాని
పరమార్థ మూహించి జరుపలేరు
దారపుత్రాదులు వైరు లంటయెగాని
వారికై శ్రమపడ భార మనరు
పూర్వశాస్త్రంబులఁ బ్రువ్వదిట్టుటెగాని
వానిప్రామాణ్యంబు మానలేరు
మతములన్నిటి కొక్కగతి యనుటేగాని
పనివచ్చినపుడు వే ఱనుట పోదు
సహజముగ నాత్మలో నెట్టిసంశయంబు
లిమిడియున్నను లోకుల కిచ్చలముగ
నాడుదురు పండితులుగూడ నధమరీతి
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!
44. పడఁతికి బరబుద్ధి పొడమఁగూడదుగాని
పొడమ నిరోధించు పురుషుఁడెవఁడు
దానశీలునియొద్ద ధన ముండవలెఁగాని
వలదని వారించువాఁ డెవండు
మొండెవానికి మంచి యుండఁగావలెఁగాని
చెప్పి చేయించు నెచ్చెలి యెవండు
రాగాంధునకును వైరాగ్యంబు గలుగదు
కలిగినఁ దప్పించు బలియుఁ డెవఁడు
సహజసద్గుణసంపద జరగువాని
కడ్డు బెడ్డును గలదె? యెం దైనఁగాని
యింతకుఁ ద్వదాజ్ఞ దాఁటంగ నెవనివశము?
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!
45. అగ్నిసాక్షిగఁ బెండ్లియాడినసతిఁ బాసి
పరకాంతపదములు పట్టినట్లు
తనసేమముం గోరుఘనులను నిరసించి
పలుగాకుల మేలు సలిపినట్లు
విమలగంగాప్రవాహమున స్నానము మాని
పల్వలమ్ములఁ గ్రుంకఁబాఱినట్లు
మాతృభాషలకు సన్మానంబు విడనాడి
పరభాషలను గౌరవించినట్లు
స్వజన సంఘంబునెల్ల నావలకు నెట్టి
పరుల మన్నించుచుండు భూపతులు గలుగ
సుఖము మా కెట్టు లబ్బు నీక్షోణియందు?
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!
46. త్రాగుఁబోతులతోడఁ దగదు శవాసంబు
మర్యాద నాసించు మానవులకుఁ
గులవృత్తిఁ బట్టి లోఁకువఁ జేయువారితోఁ
గలియుట జ్ఞానికిఁ గష్టతరము
తనశక్తిఁ బరునిశక్తిని గణింపనివారి
యండఁ జేరిన ఘను లుండలేరు
మాతపొందిక లేని మోటుమానిసితోడ
సరసులు మాటాడ విరస మగును
ఎఱుఁగ కందఱి నొకరీతిఁ గఱకులాడు
నెడ్డెమనుజులు నిరసింప నేమిలోటు?
మానధనులకు సంతోషహాని గాని
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!
47. ఇంపుగా మగని రమింపఁ గల్గినమాత్ర
నిల్లా లగునె? మంచియుల్ల మేది?
మెడనిండ దండలు పడవేసినంతనే
గురువరుం డగునె? సద్గుణము లేవి?
బూడిద నిలువెల్లఁ బూసినమాత్రాన
బైరాగి యగునె? ప్రభావ మేది?
గోటుగాఁ దలను గిరీట మూనినమాత్ర
రాజౌనె? తగినంతరశ్మి యేది?
ఆశ లడుగంటకుండిన యతియు నగునె?
దోషములు చెప్పినంత నిర్దోషి యగునె?
యేపగిది నున్ననేమి నీ కెఱుకపడిన
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!
48. భార్యయేకద యని బాధించితిని నేర
మున్న లేకున్న దురుక్తు లాడి
నౌకరే యని వెట్టిచాకిరి చేయించి
పరితాపపెట్టితి సరకుఁగొనక
తలిదండ్రులే యని విలువ గణింపక
తూలనాడితి బుద్ధి ప్రాలుమాలి
బుజ్జగించుచు విద్య లొజ్జ చెప్పినఁగాని
యపహసించితి మంచి నరయలేక
ఏమిపాపానఁ బోదునో యెఱుఁగఁబోను
జేసినవి తప్పులే ముందు చేటెఱుఁగక
చెప్పితిని మీఁద నింక నీచిత్త మెట్లొ?
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!
49. చల్లగా మాట్లాడి పిల్లసైతానుగా
విడిపోవఁడని పల్కు వేదురొకఁరు
చనవీయఁ జంకెక్కుచంటిబిడ్డగు నంచు
బొమ్మని చెప్పెడు పురుషుఁడొకఁడు
కదిపిన వానిని గందిరీఁగలపుట్ట
పలుకరింపకు మనుపలువ యొకఁడు
ఒకమాటు8 నేర్ప నోపికపట్టి వార్షిక
మడుగుభల్లుక మనువెడఁ గొకండు
పొట్టకై వేఁగి ప్రజలఁ జేపట్టియుండఁ
బండితులఁ జూచి యిటువంటిబండమాట
లాడుచుండఁగ సుఖము లెవ్వాఁడొసంగు?
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!
50. ధనవంతుఁ డనుచు సందర్శనంబును జేయ
మొగమెత్తి చూడఁడే మొద్దురీతి
నొకవేళ మాట్లాడ నూహించునా యేదొ
మో మోరగాఁ ద్రిప్పి జామున కను
నామాట తనసొత్తు కేమినష్టము లేని
పద్ధతి నైనచోఁ బలుకుచుండుఁ
దనమాట పైపెచ్చు విను మంటయేకాని
చెప్పినమనవిని జెవులఁబెట్టఁ
డిట్టిలుబ్ధుఁడు మూటలు కట్టి ధనము
తాఁ దినక యొరుల కీయక దాఁచుకొన్నఁ
దుదకు దొంగలకో మఱి దొరలకగునొ?
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!
51. కవనంబు మంచిదే కాఁబోవువాఁడవే
యని మెచ్చుటేకాని మనవివినరె?
సేవకావృత్తి కాశింప నీకేలంచు
మాటాడుటేకాని మూట విడరె?
నోరారఁదీపిగా నుడువుచుండుతెకాని
తగుసహాయముగోర మొగముఁ గనరె?
మన మంత యొకటని మాట యిచ్చుటెకాని
తమజాతి గన్న నుత్తములఁ గనరె
యిట్టిప్రజ నమ్మి నీభక్తిఁ గట్టిపెట్టి
యైహికముఁ గూడ విడనాడు నధమవృత్తి
నట్టునకు ముక్కకును జెడునట్లుకదె?
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!
52. చదు వాతఁడేకాఁడు చదివితి నే నని
వికటంబుగా వాగువెడఁ గొకండు
పనిలేనిపని నక్కవినయాలు మన కేల?
యని యీసడించెడిచెనఁటి యొకఁడు
ధనవంతు్డను గాద? మన మాట చెల్లదా?
యని నోరుజాఱెడిఘనుఁ డొకండు
వీనిరక్కఱ యేమి? కాని కూడను రాని
పద్యాల కే మను ప్రభు వొకండు
అడిగికొని మనువారికీ పొడుగులేల?
యనుచు నిరసించుచుండెడి యధములుండ
సుఖము మా కెట్లుగల్గు నీక్షోణియందు?
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!
53. ఎదుటివాఁ డేదైనఁ జదువుచోఁ బ్రశ్నింపఁ
బెద్ద నౌదు నటంచు గద్దరించి
తప్పు లేనిదె పట్టి తహతహలాడింప
గొప్ప వచ్చు నటంచుఁ గోరుచుందు
రొప్పైనఁ దప్పైన నూహింపఁగాఁబోక
మఱియొక్కమా రన్న మాన్యతయని
సభలోనఁ దన నెంతొ స్వామివా రనవలె
నంచు మాటలు గుఱిపించుచుందు
రిట్టివెడఁగులు కలరుగా యెందఱేని
నాత్మవినుతియుఁ బరనింద లధికముగను
జేసికొంటయె తమగొప్ప; చే టెఱుఁగరె
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!
54. ఒడలెల్ల నలిపినయూరమంగలి కైనఁ
బంచెగుడ్డ నిడుపాపానఁ బోను
ఏఁటికేఁడాది మాబోటికిఁ జదు వన్న
మాష్టారుకె లేదు మల్లుపంచె
ఎల్లప్పు డింటిలోఁ బిల్ల నాడించెడు
దానికే నియ్య నేఁ గానికూడ
నింట వంటలుచేసి పెంటప్రోఁ గెత్తెడి
గుంటకే లేదు పేరంట మెపుడు
చెయ్యమన్నట్టిపని చేసి చాయవలెనె
కూడ నుండినచో సేలు జోడుగాని
కవి కిడెడి దేమి? యిఁక మంటిగడ్డయండ్రు
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!
55. పండితుం డయ్యును బండబూతులు వ్రాయ
వ్యవహారిక మని వాడుచుంద్రు
కర్మిష్ఠుఁ డయ్యు భోగపరాయణుం డైన
సచ్చరిత్రుం డంచు మెచ్చుచుంద్రు
బ్రహ్మజ్ఞుఁ డయ్యు దుర్ణయముఁ గావింప శి
ష్టాచార మని కొనియాడుచుంద్రు
స్వాతంత్ర్య మని వనితాతతి సివమాడ
మంచిరీతిగఁ బ్రశంసించుచుంద్రు
ఎప్పుడు నేయెండ కాగొడు గెత్తియున్న
సమయవేది యితం డంచు సన్నుతింత్రు
ఏదిసత్యమొ యది లొక మెంచ దకట!
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!
56. నారాయణా! యని నోరార నినుఁ బిల్వ
నేరనిపుట్టుకసార మేమి?
మాధవా! నీపదారాధన సేయని
పాణిద్వయం బున్న ఫల మ దేమి?
గోవింద! నీకథల్ కోర్కితో విననట్టి
శ్రుయుగళం బున్న సుఖ మ దేమి?
శ్రీధరా! యని నిన్నుఁ జేరి జోహార్లు కా
వించని యీమేను బెంచ నేమి?
పుండరీకాక్ష! యని నీదుపూజ సుంత
చేయఁజాలని జన్మముల్ చేటుకొఱకె
మానవత్వంపు ఫలితమ్ము మా కిఁ కేది?
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!
57. కౌసల్య "నాపాప! కన్నతండ్రీ!" యని
ముద్దాడఁ జేసినపున్నె మేమొ?
"రామచంద్రా!" యని రాగాలు పాడుచుఁ
బొగడు నారదుపూర్వపుణ్య మేమొ?
"గరుఁడ" నం చవనిజావరున కుప్పొంగు వ
సిష్ఠుని పూర్వసంచిత మ దేమొ?
తనవెంత రాముండు చనఁగ సంతోషించు
గాధినందనునిభాగ్యం బ దేమొ?
"తనయ! శ్రీరామభద్ర!" యం చొనరఁ బిలుచు
దశరథునిపూర్వకృత మగుతప మడేమొ?
తెలియ నావంటియల్పున కలవి యగునె?
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!
58. చక్రి సర్వగతుండు శర ణాతఁడే యన్న
ప్రహ్లాదుఁ డెటువంటిప్రముఖుఁ డయ్యె?
రక్షకుఁ డొకఁడున్న రక్షింపఁడా యన్న
గజరాజు మృతజీవగణనఁ బడడె?
భక్తుఁడై నినుఁగూర్చి రక్తితో జపియించు
నంబరీషుం డెంతయధికుఁ డయ్యె?
నేకాదశీసువ్రతైకధురీణుండు
రుక్మాంగదుం డెంతరూఢి కెక్కె?
భక్తిపరత, యాస్తిక్యము, పరమనిష్ఠ,
వ్రతము గల్గినసుజనుల పాలిటికిని
నీవు ముంగొంగుపసిఁడివి గావె? దేవ!
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!
59. ఆఁకలి కన్నమ్ము నమృతంబె యనుకొంటి
మృష్టాన్నములు నీవి మెసవుచుండ
మంచిచాఁపను బట్టేమంచంబె యనుకొంటిఁ
దూఁగుటుయ్యాల నీ వూఁగుచుండఁ
దాతియాకులపంచఁ దగు సౌధ మనుకొంటి
గుళ్ళు గోపురము లంగళ్ళు నీవి
కాలినడయె నేను గజ మెక్కు టనుకొంటి
రథముపై విహరించురాజ వీవు
ఎంత కంతయె నీసుఖం బెంతుకాని
నాదుమొఱ నాలకించి నన్నాదుకొనవు
స్వార్థపరుఁడవె నీవు గూఢార్థ మెఱుఁగ
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!
60. నీకంటె నా కెవ్వ రెక్కడఁ గలరయ్య?
యాశ్రితవత్సలు లైనవారు;
ఎలుఁగెత్తి మొఱవెట్ట నలజడి తప్పించు
వారు నా కెవరు కన్నారఁ జూచి?
యాత్మసౌఖ్యము నాకు నమరింప నెవరయ్య?
నిన్ను వినాఁగ నాపన్నుఁ డనుచు;
నేమిచేసిన సరె ప్రేమపాత్రుఁడ నన
జాలి యెవ్వరికి నీ వేలకున్న?
నేమిసేతువో? మతిమాలి యింపటంచుఁ
గొంపలోఁబడి నినుఁజూడఁ దెంపులేక
తూలితిని, నిప్పుడా నన్ను దోషి వనుట?
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!
61. అలివేలుమంగతో నావెంకటేశుండు
తిరుపతికొండపై స్థిరుఁడు కాఁడె?
దక్షయజ్ఞధ్వంసదక్షుఁడు వీరభ
ద్రయ్య పట్టిసపర్వతమున నిలఁడె?
సత్యనిర్వహణుఁ డౌ సత్యనారాయణుఁ
డన్నవరాద్రిపై నాదుకొనఁడె?
పసిఁడికన్నులవానిఁ బడఁగూల్చి యప్పన్న
సింహాద్రియందు వసింపఁబోడె?
సాటివారలు భూధరాస్థాను లనుట
బీవు నిట నుంటివా రాజఠీవి విడిచి
యెచటనుండిన నీప్రభ కేమిలోటు?
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!
62. కమల నిన్నేప్రొద్దుఁ గామించి నీపాద
సేవ జేయఁగ నేను జేయు టెపుడు?
ప్రద్యుమ్నముఖకుమారశ్రేణి నీదువా
త్సల్య మొందఁగ నాకు సమయ మెపుడు?
పడకయై విడక శేషుఁడే యూడిగము సేయ
నా కెప్పు డిఁకఁ దరుణము లభించు?
సురసంఘమెల్ల నీ శూశ్రూష సేయ నా
కవకాశ మేది నీయండ నుండ?
గంగ నీకాలిలోఁ బుట్టఁ గమల మెపుడు
బొడ్డుపూవయి వికసిల్లు పొలుపుమీఱ
నర్ఘ్యపాద్యము లేమి యీయంగఁగలను
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!
63. శబరి యెంగిలిపండ్లు చవిఁజూపునంతలో
నిహపరసౌఖ్యము లిచ్చినావు
పగవానితమ్ముఁ డిమ్ముగ నినుఁ గొల్వ లం
కకు వేడ్కఁ బట్టముఁ గట్టినావు
సుగ్రీవుఁ డానాఁడుచుట్టమై చూడఁ బ్రే
మించి కిష్కింద నేలించినావు
అనుమఁడు నిను నమ్మినంతమాత్రనె భవి
ష్యద్బ్రహ్మపద మీయఁజాలినావు
ఏమి కావలెనన్న నీ కేమిలోటు?
చేతిలో నున్న దేమైనఁ జేయగలవు
నాకుఁ జేయనె నీకుఁ బరాకుకాని
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!
64. అనుకొన్న పని యెప్పు డప్పటికప్పుడే
కాదు నీసుతుని సంకల్ప మేమొ?
సిరులకై కష్టించితిరుగ మాయింటికి
రాదు నీసతి కేమి రాజసమ్మొ?
నను వీడు మని వేఁడుకొనఁ బోఁడు నేఁ జేయు
నపకార మేమొ నీయాత్మజునకుఁ?
గలుషముల్ బాయ గంగాస్రవంతిని మున్గఁ
బ్రోవదే నీకూఁతుభావ మేమొ?
కాని పైవారి నిందింపఁబోను నీదు
కోడలే మంచిదయ్యె నాకోర్కెఁదీర్ప
నిన్ను వరునిగఁ జేసె నాకన్నకృతికి
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!
65. నీధ్యానమును జేయ నిలువక చలియించు
మనసు వాల్గంటులఁ గనుచునుండు
నీపూజ చేయఁగ నిరసించు చేదోయి
యతివచందోయిపై నత్తమిల్లు
నీనామముఁ దలంపఁ బూననినాబుద్ధి
పడఁతిపేరు దలంపఁ బరువులెత్తు
నీకథారసము పై నిలుపనినాలుక
ముగుదకెమ్మోవికై మొగమువాచు
నేమొ నాపూర్వకృతపాప మెంచలేను
జేసినవి తప్పు లెన్నియో చెప్పలేను
గాతువో కావవో నన్ను ఘాతుకుఁడని
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!
66. ఎవనిని యాచింప నే మిచ్చి పంపును?
బొట్ట కాపూఁటకుఁ బెట్టలేఁడె?
ఎవనికి నాబాధ లిటులంచు మెఱపెట్టఁ
దలనూఁపడే? లోకధర్మ మనును
ఎవని సన్నుతిచేయ నేమిలాభము గల్గు
పరిపాటి తప్పదే పండితులకు?
ఎవనితో నాస్థితి నెఱుకచేసినఁగాని
మనసిచ్చి మాట్లాడు మనికి లేదె?
ఏల నీవుండ నన్యుల బ్రాలుమాలి
పోయి వేసారి కాలముఁ బుచ్చుకొంటి?
నందఱిని జూడవే జగద్బంధుఁడ వయి
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!
67. పుట్టుకలో నెంతొ పోర్వెట్ట లాలించి
పెంచిన దెవరు ప్రేమించి నన్ను?
శిశువునై యాఁకలిచే నేడ్వఁ బాలిచ్చి
పెంచిన దెవరు ప్రేమించి నన్ను?
వడుగు నై యడిగిన బడుఁ గయ్యె నని పెట్టి
పెంచినదెవరు ప్రేమించి నన్నుఁ?
బెద్దనై యుండ నాపెంపుఁ గోరుచుఁ జూచి
పెంచిన దెవరు ప్రేమించి నన్నుఁ?
జదువుసాములు చెప్పించి కుదురుఁ గోరి
పేరుఁ, బ్రతిభయు రాఁ జూచి పెంచు టెవ్వ?
రన్నిటికి నీవె; తలిదండ్రు లన్న నెవరు?
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!
68. ఏతీరుగా ననుఁ బ్రీతిఁ గాపాడుచుఁ
జేతో ముదంబును జేయఁగలవొ
సంసారమా పెద్ద సాగరంబుగఁ దోఁచు
హింసాకరం బయ్యె నింతవఱకు
గతి లేదు బ్రతుక సమ్మతి లేదు నీచుల
సేవ చేయఁగ నాకుఁ జిత్తమందు
ధనశూన్యుఁ డయ్యును దాతయే కనుఁగాని
కలవార లీయరేఁ గానికూడ
నెట్లు జీవింప నిఁకమీఁద నెవరుదిక్కు?
బ్రతికినన్నాళ్లు భ్క్షయే గతులు కాఁగ
ముందుపుట్టువుఫల మేమి పొందఁగలము
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!
69. భోగభాగ్యము లేమి పొసఁగింపకుండిన
నారోగ్యభాగ్యము నైన నిమ్ము
సంసారసుఖములు సాగింపకుండిన
నిండువేడుకతోడ నుండనిమ్ము
సచ్చితానందంబు సమకూర్పకుండినఁ
దాపత్రయం బైనఁ దగ్గనిమ్ము
పుత్రపౌత్రబలమ్ముఁ పూర్తిసేయకయున్నఁ
గృతసంతతిని గనఁ గతుల నిమ్ము
ఏమిపాపమొ యెటుఁజూడ నెవరు లేక
బాధపడుచుండు నావంటిపామరునకు
దివ్యమగు నీపదమ్ములే దిక్కు తండ్రి!
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!
70. అధికారిఁ జేతు నిరక్షరకుక్షినిఁ
బండితు మూలఁ గూర్చుండఁజేతు
లోభివానికి లక్షలుం గోటు లిత్తువు
దాతను ఋణముతోఁ బాతివైతు
కడుమంచివానికిఁ జెడుగురాలినిఁ గూర్తు
మంచిదానికి దుష్టు మగనిఁజేతు
కూటిపేదను దెచ్చి కోటీశ్వరునిఁ జేతు
కోటీశ్వరుని భిక్షుకుని నొనర్తు
వేమితలఁచిన నీచేత నేమికాదు?
నటకుఁడవు నీవె యీజగన్నాటకమున;
నార్చినను దీర్చినను నీవె యార్తరక్ష!
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!
71. తాటక నలనాఁడు తనువుమాపితి వన్న
నాఁడుదానిని జంప నధికమేమి?
వాలి నొక్కమ్మునఁ గూలనేసితి వన్నఁ
గోఁతిఁ జంపఁగ నెంతఖ్యాతి వచ్చె?
మాయలేడిని రూపుమాపితి నంతివా?
ఇఱ్ఱి నేయుట యెంతవెఱ్ఱితనము
ఆరావణుని జంప శూరుఁడ నందువా?
పదుగురు కలసినపని య దెంత
ఎఱిఁగినటువంటివా రున్నయెడలఁ జెప్పు
నీప్రతాపమ్ము మహిమయు నీటుగోటు
ఏమిలాభము నాపట్ల నెడ్డెవాఁడ
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!
72. సాంతంబుగా శాస్త్రసమితి శోధించిన
సమకూరునే? నీదు సత్వగుణము
పంచీకరణ మెల్ల బాగుగా నేర్చిన
గ్రాహ్యమే? నీతత్వగౌరవంబు
షణ్ముద్రలను బట్టి సాధించియుండిన
దొరకునే? నీదగు పరమపదము
కఠినోపవాసముల్ గావించియుండిన
నొదవునే? నీదు సాయుద్యపదవి
కర్మకాండంబునకు నెంత కట్టువడిన
నమృతమయమగు నీమూర్తి నరయఁదరమె?
చిత్తసంశుద్ధి గలభక్తిచేతఁ గాక
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!
73. ఏకోరికి యని నీకు నెఱిఁగి చెల్లించుదు
నేమంత్రతంత్రమ్ము లిష్ట మందు
నేపూవు పండని యెఱిఁగి యర్పించుదు
నేరీతి హిత మని యేమిసేతు
నేది నీస్తవ మని యెఱిఁగి నేఁ జేయుదు
నేదారి నీ దని యేర్పరింతు
నెందు నున్నా వని యెఱిఁగి పూజించుదు
నేరూప మని నిర్ణయించుకొందు
నేమొ? నీనిజ మెఱుఁగ నా దెంతబుద్ధి?
యేమి సేయుదు? సామర్థ్య మేది నాకు?
నెట్లుమన్నింతువో కృతి నిచ్చుచుంటి
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!
74. ఆవేశమా నన్ను నల్లలనాడింపఁ
బాపపుణ్యము లెంచ నోఁపనైతి
దారిద్ర్యమా నన్నుఁ దహతహలాడింపఁ
జేసితి నెన్నియో చెడ్డపనులు
కామాంధకారమా కనుఁగప్పి ననుఁద్రిప్పఁ
బరకాంతకౌఁగిటఁ బట్టువడితి
ధనకాంక్షయా వెన్నుఁ దన్ని త్రోయుచునుండఁ
గలిమి సంపాదింప నలుఁగుచుంటి
నేమిచేసినఁ జేసితి నెఱుకమాలి
ప్రాలుమాలితి నని నన్ను జాలిదలఁచి
యేలుకొనుభారమా నీదె; యెవరుదిక్కు?
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!
75. కవనమ్ముఁ జెప్పి నీకరుణఁ బొందుదు నన్నఁ
బోతన్ననా? మేను బొంగఁజేయ;
నకలంక మగుభక్తి నలరించుటకు నేఁ గ
బీరునా? నిన్నుఁ గన్నారఁ జూడ;
సంగీతమున నిన్ను సంతసింపఁగఁజేయ
ద్యాగయ్యనా? నీదురాగ మొప్ప;
గుళ్ళు, మంతపములు, గోపురాల్ గట్టింప
గోపన్ననా? యట్టిప్రాపు లేవి?
ఆస్తికిని మాస్తి యున్న దీహస్తయుగమె;
యదియె నీకు సమర్పణ మనుదినంబుఁ
బైని గొసరుగ నామనఃపద్మ మిడుదు
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!
76. వీనులవిం దైన నీనుతి విను చెవుల్
చెవులుగా కితరులచెవులు చవులు
చిత్రమౌ నీదుచారిత్రముల్ పఠియించు
వాయిగా కితరులవాయి గోయి
పూజ్యమౌ నీపాదపూజ చేయుకరంబు
కరముగా కితర మౌ కరము నరము
కరుణ కిమ్మైన నీవరమూర్తిఁ గనుకండ్లు
కండ్లుగా కితరులకండ్లు గండ్లు
కాన నిరతంబు నీపదధ్యాన మూని
ముదము దైవాఱ సేవింతు హృదయమందుఁ
బ్రోవవే నాకు నీకన్నదేవుఁ డెవఁడు?
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!
77. ఏడుకొండలవాని వేఁడఁ బ్రసాద మన్
పేరుతోఁ బెట్టఁడే యోరె మింత?
శ్రీజగన్నాథేశుఁ జేరినఁ బొంగలి
పెట్టింపఁడే యింత పొట్టనిండ?
సింహాద్రియప్పన చెంత కేఁగినఁ దిని
పింపడే పులిహోరఁ బ్రీతితోడ?
వరదరాజస్వామివారిని దర్శింప
నిష్టాన్న మిడఁడె సంతుష్టి దీఱఁ?
బొట్టకూటికిఁ గాదు నిన్ బట్టుకొంట
నీపదధ్యానమున భక్తి నిలుపుభిక్షఁ
బెట్టఁగల్గిన నదె పదివేలు మాకు
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!
78. ఎఱుఁగనివాఁడవా? జరుగుఁబాటే లేక
యడిగితిఁగాని నాయాసకొలఁదిఁ
దెలియనివాఁడవా? కలతెఱం గంతయుఁ
జెప్పితిఁగాని నా తిప్పలన్ని
నేరనివాఁడవా? దూర మాలోచింప
నాఁగలే కున్నది యంటిఁగాని
చూడనివాఁడవా? సుఖపడుమార్గము
మొఱపెట్టితినిగాని కొఱఁతలెల్ల
నెపుడు నీ వుంటి వని నాదుహృదయమందు
దొడ్డనమ్మక మున్నను దూలిపోయి
త్రాగుఁబోతుగఁ జెలరేఁగి వాగుచుందు
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!
79. పుట్టియుం బుట్టక మున్నె నీకథ విన్న
ప్రహ్లడుఁ డెన్నెన్నొ పాట్లుపడియెఁ
దనదుసర్వస్వ మీ వనుకొన్న యలకుచే
లునకు నిర్ధనత తప్పనిది యయ్యెఁ
గృతికన్యకను సమర్పించినపోతన్న
పొలముదున్నియె పొట్టఁ బోసికొనియెఁ
గొందపై నీకిల్లు కోరి కట్టినరామ
దాసుకుఁ జెఱసాల వాసమయ్యె
ముందు నినుఁ గొల్చువారికి నెందుఁ జూడఁ
గష్టములె కాని సుఖములు కానరావు;
అటులె నాపట్ల నైన నే నాఁగఁగలనె?
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!
80. పరమేశ్వరా! నన్నుఁ బాలించు టెప్పుడు?
నీదయారసము నందించు టెపుడు?
నారాయణా! నన్ను నమ్ము నమ్ము టిఁ కెప్పుడు?
నీ విచ్చుఫలము రుచించు టెపుడు?
భువనమోహన! నీదుపూజ మా కెప్పుడు?
తనువు శాశ్వతముగాఁ దనరు టెపుడు?
కేశవా! నిన్ను నేఁ గీర్తించు టెపుడు?
మెప్పించుశక్తితో మెలఁగు టెపుడు?
ఉన్నకాలము నిద్రచే సున్న సగము;
రోగ మని రొచ్చు లని ప్రతిరోజు బాధ
పెట్ట నిహ మేది? పర మేది? తుట్టతుదకు;
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!
81. పురుషార్థమా? యేమి పుణ్యమా? యీతనిఁ
బోషింప నని నీవు పొంచినావ?
విజయమా? యిటువంటి వెఱ్ఱిమానవుఁ గరు
ణించ నా? కనుచు యోచించినావ?
వంశమా? వర్ణమా? వాసవుండా? యేమి
మన కేలరా? యని మఱచినావ?
యేపాటి కలవా? డిఁ కెందులో జమవాఁడు?
పోని మ్మటంచు బూనుకొనవ?
యేమొ నీయూహ తెలియదే యెదుటఁబడిన
నేమి కోరఁగవలయునో యెఱుగకుంటిఁ
జాలుఁ గనిపెట్టి ప్రోచెడిశక్తి లేదె?
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!
82. మీనమై సోముని జా నడంచినదిట్ట
మెట్టుపైనూను తాబేటిమేటి
పసిడికన్నులవానిఁ బడఁగొట్టుక్రోడము
నరసింహుఁడై బాలు నరయు ప్రోడ
బలికిఁ బాతాలము నెలవుఁజేసిన గుజ్జు
జనపాలురను గొట్టుజన్నిగట్టు
రావణుఁ బరిమార్చు రఘురామచంద్రుఁడు
హలముఁ, దాటిసిడంబుఁగలుగుబలుఁడు
బుద్ధదేవుండు, కల్కి ప్రబుద్ధుఁ డాది
మూర్తులన్నియు నీవె నీకీర్తి వినమె
దశరథాత్మజరామ! కోదండరామ
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!
83. నారీకుచారూఢపారీణధోరణి
చేరువకు నన్నుఁ జేర్చినావు
కామినినిడువాలుకడగంటిచూపులఁ
బిచ్చివాఁడన భ్రమపెట్టినావు
రమణీయరమణీవిలాసమ్ముల నపూర్వ
వర్తనమ్ములకుఁ బాల్పఱచినావు
సుదతికెమ్మోవికింశుకపునిగారింపు
చే దృష్టిచపలతఁ జేసినావు
ఎంతమఱలింప నెంచిన నించుకంత
మఱవ నీయక నాబుద్ధి మఱుఁగుపఱచి
తెంతటిదయార్ద్రహృదయుఁడ వీవొ భళిర
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!
84. సీతామహాదేవి చేర వద్దనియెనో
లక్ష్మణుం డీతఁ డలక్ష్యుఁ డనెనొ
కౌసల్య ననుఁ జూడఁ గలహించునో దశ
రథుఁడు చెప్పుటకుఁ బరాకుపడెనొ
భరతుఁడు నాసేమ మరయ వద్దనియెనో
శత్రుఘ్నుఁ డీవంకఁ జనఁగనీఁడొ
సుగ్రీవుఁడే నన్నుఁ జూడ వద్దనియెనో
ఆంజనేయశిఫారు నందలేదొ
అలవిభీషణుఁ డెనియుఁ బలుకఁబోఁడొ
ననుగుఱించి పైవారల మనవు లేల?
స్వయముగా నీవె రక్షింపఁ జాలవొక్కొ?
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!
85. ధనకాంక్ష ననుఁ జేరి తలఁబట్టి లాగిన
నీచులయొద్దఁ జేఁ జాఁచఁబోను
పొట్టపోషణకు నేపట్టు లేకున్నను
గూటసాక్ష్యములకై పాటుపడను
గోటుగా శృంగారపాటవ మాశించి
నాటకా లాడంగఁ బాటిసేయఁ
గోటీశ్వరులతోడఁ గూర్మి చేకూరినన్
గులవృత్తిఁ దొలఁగ మేకొనఁగఁబోను
ఆస్తికుండ నౌచు ధర్మరహస్య మెఱిఁగి
కఱవొ కాటకమో పడి కాల మెట్లొ
గడుపుచున్నను దయరాదు; కర్మ మేమొ
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!
86. మొసలితో యుద్ధమా? తసనాలుపడుటకు
నాపని యెంత నీప్రాపు చాలు
యాచన సేయుటా? గోఁచిబాపఁడ వయి
నాపని యెంత నీప్రాపు చాలు
మోసముఁ జేయుటా? మోహనమూర్తివై
నాపని యెంత నీప్రాపు చాలు
రక్కసితోఁ బోర? చిక్కులుపడుటకు
నాపని యెంత నీప్రాపు చాలు
నంటి నేమంటి; విదిచేయ నర్హమంటిఁ
దుదకు నీవుంటి నేనుంటి దొడ్డ దపుడు
చేయవచ్చును దక్షత చేతి కిచ్చి
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!
87. చెఱుకుపిప్పికిఁ జీమఁ జేరిచె నెవ్వఁడు?
నాభిలోఁ బురువుల నాఁటె నెవఁడు?
వృక్షాగ్రమునఁ జేర్చెఁ బక్షుల నెవ్వఁడు?
నదిఁ బొంగఁ జేసెడినాథుఁ డెవఁడు?
రాతిలోఁ గప్పను రక్షించు నెవ్వఁడు?
ఎల్లపూలకుఁ దావిఁ జల్లె నెవఁడు?
కడలిలో లవణంబుఁ గలుపువాఁ డెవ్వఁడు?
తివిరి ముండ్లకు వాడి దిద్దు నెవఁడు?
సహజ మగుశక్తిఁ బ్రకృతిలో సంతరించి
యాదుకొన వొక్కొ? మొక్కకుఁ బాదువోలె
అట్టినీకు నమస్కారమయ్య తండ్రి
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!
88. ఎవనియానతిచేత నీరేడుజగములు
పుట్టుచుఁ బెరుఁగుచుఁ గిట్టుచుండు
నెవనియానతిచేత నీసూర్యచంద్రు ల
హర్నిశంబులు చేయ నర్హులైరి
యెవనియానతిచేత నీగ్రహమ్ములు మింట
నలువొందు నక్షత్రనామ మొంది
యెవనియానతిచేత నీసదాగతి యెల్ల
జీవులప్రాణమై చెలువు మీఱు
నెవనియానతిచేఁ జెట్టు లివురుఁ దొడిగి
పూలుఁ గాయలుఁ బండ్లుఁ బెంపుగ నొసఁగు
నట్టిపరమాత్మ వీవ నిన్ బట్టుకొంటి
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!
89. కొండంతగజమున కుండుబలం బేడ?
మావటీఁ డైనట్టిమనుజుఁ డేడ?
గుండె గాబర సేయుచుండుసాగర మేడఁ?
బడవ గెంటెడువానిపగ్గె యేడ?
బ్రహ్మాండభాండంబు పర్వుచీఁకటి యేడఁ?
గడు మిన్కుమనుదీపకళిక యేడ?
మానవదేహంబు మాపురోగం బేడ?
నౌషధ మావగింజంత యేడఁ?
బురహరుం డేడ? మరువిరిశరము లేడ?
హెచ్చుతగ్గులు చెప్ప నే నెంత? నీవె
యాదరింప రవ్వంత కొండంత గాదె
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!
90. భద్రాద్రి శ్రీరామభద్రుఁడవే యన్న
శ్రీరంగవాసిగాఁ జెప్పుచుంద్రు
శ్రీరంగమే నీకు స్థిరమందిరం బన్న
నాజగన్నాథ మాయతన మందు
రాజగన్నాథమే యాయతనం బన్న
సేతువునందు వసింతువందు
రాసేతువే నీనివాస మౌ ననుకొన్న
నల యయోధ్యాపురి నిలయమంద్రు
తిరిగితిని దేశదేశాలు దిమ్మతిరగ
నీప్రభావమె, నీరూపె, నీగుణంబె
యౌర! నీవొక్కయెడనుంటివనుట యెట్లు?
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!
91. సంసారమా చాల హింసాకరం బని
తెలిసియు మాయలోపలనె పడితి
విషయసుఖమ్ములా వెతలకోసమె యని
తెలిసియు మాయలోపలనె పడితిఁ
బుత్త్రమిత్త్రకళత్రపౌత్త్రు లస్థిరమని
తెలిసియు మాయలోపలనె పడితి
ధనధాన్యములు భూమి తనవెంట రా వని
తెలిసియు మాయలోపలనె పడితి
బేమొ? యీమాయ నీలీలయేమొకాక
యెంత ఝాగ్రత్తపడిన నావంత జ్ఞప్తి
రాదు; పడిపోవఁ బరితాపమా దహించు,
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!
92. తనువు నిత్య మటంచుఁ దలపోసి కొన్నాళ్లు
సింగారముల్ సేయఁ జెల్లిపోయె
గామినీభోగేచ్చ కలుగఁగఁ గొన్నాళ్లు
కన్నుమి న్నెఱుఁగనికాల మాయెఁ
బుత్త్రమిత్త్రకళత్రపౌత్త్రసంపత్తిని
గడియింపఁ గొన్నాళ్లు గడచిపోయెఁ
బేరుపతిష్ఠ కై పీఁకులాడుటలోనె
బిరబిరఁ గొన్నాళ్లు తిరిగిపోయెఁ
గాలమా పోయె; నిఁక నీదుకరుణ యెట్లొ
నిను స్మరియింప నైతి నం చెన్నఁబోక
విన్నపము లాలకింపు మాపన్నశరణ
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!
93. కరిరాజు కష్టనిష్ఠురములు మొఱపెట్టఁ
బ్రోవవే నీదగుఠీవి మెఱయఁ?
బ్రహ్లాదుఁడానాఁడు పడలేని బాధలఁ
గని కటాక్షింపవే కనికరమునఁ
బాందవుల్ పడరానిపాటులు పడుచుండఁ
దోడునీ డయి నీవుకూడఁ జనవె?
ద్రౌణిశరాగ్నిచేఁ దహతహపడు నుత్త
రాగర్భశిశువు నూరార్పలేదె?
అట్టులే చూడు నన్ను నిప్పట్టునందు
కలిమిఁ జుట్టఱికములనే తలఁప కయ్య
దీనులను బ్రోతు రెవ రింక? దేవడేవ
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!
94. ఎచట నీనామమే యెక్కువ వినిపించు
నెందుఁ జూచిన నీదుమందిరములె
ఎచట నీచరితమే ప్రచురమ్ముగాఁ దోఁచు
నెందు నీలీలకు సందులేదు
ఎచట నీగోష్ఠియే యింపు లొల్కుచునుండు
నెందు నీసృష్టికి నెడములేదు
ఎచట నీప్రతిభకు హెచ్చుతగ్గులు లేవు
ఎందు నిన్ బోలువా రెవరుకలరు?
ఎచట నీరాజ్యగౌరవ మెంచగలము?
ఇంతకును బూర్వకృత మగు సంచితమునఁ
దెలియకే వారు వీరని కలఁతవడితి
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!
95. రక్షింప శిక్షింప దక్షుండ వీ వౌటఁ
జెప్పఁగా నేల? నీచిత్త మింక
విఱిపింపఁ గఱిపింప విజ్ఞాని వీ వౌటఁ
జెప్పఁగా నేల? నీచిత్త మింక
నాలింప లాలింప నధికారి వీ వౌటఁ
జెప్పఁగా నేల? నీచిత్త మింక
బాలింపఁ దూలింపఁ బ్రభుఁడవు నీ వౌటఁ
జెప్పఁగా నేల? నీచిత్త మింక
నామమాత్రమ్ము నాప్రయత్నమ్ముకాని
కార్యకారణఫలితసంఘటన నీదె
మనుజచాపల్యమును నేను మానఁగలనె?
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!
96. ఏజీవకోటికి నేలిక వనుకొందు
నేమూర్తి నీదని యెంచుకొందు
నెపుడు నీయాధార్థ్య మెఱుఁగుదు ననుకొందు
నెపుడు నమ్మఁగలాఁడ నిచ్చయందు
నెవరు నాయానవా లెఱిగింతు రనుకొందు
నెవరికిఁ జిక్కినా వీవు ముందు
నేమహాత్ముఁడు నీకు హితుఁడని యనుకొందు
నెవ్వానివలన ని న్నెరిగికొందు
నెదియో మాయగాఁ దోచె నెంతవఱకు
యోచనము చేసి కష్టించి యోర్చియుందుఁ
బుణ్యకాలము రవ్వంత పోవుచుండె
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!
97. ధూపదీపములచే దీపించు నీగుడి
కలపంబు నీమేన వలపు లీను
శృంగారకళలతోఁ జెలఁగు నీపడకిల్లు
సొంపుగుల్కెడు పవ్వళింపుఁబాన్పు
ఇంగిలీకపు వింతరంగు దుకూలంబు
పరమాన్నములు నీకుఁ బారణములు
రత్నాలు, పతకహారములు, కిరీటంబు
పచ్చలకడియాలు, పైఁడిగొడుగు
నన్నియును గల్గి నా కొకటైన నిడవె?
పేరుఁ దలఁదాల్చినను నీకుఁ బ్రేమ లేదె?
పేరు సార్థక మగుసదాచార మేది?
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!
98. గోవిందుఁడని నిన్నుఁ గొవిదు లందురే?
నాకష్ట మెఱుఁగనినాఁడు నిన్ను;
సర్వేశ్వరుం డన్న సత్కీర్తి యుండునే?
నన్ను రక్షింపనినాఁడు నీకు;
సర్వజ్ఞుఁ డీ వన్న సన్నుతి యుండునే?
నామొఱాలింపనినాఁడు నీకు;
నార్తరక్షకుఁ డన్నయధికార ముండునే?
నన్నుద్ధరింపనినాఁడు నీకు;
నెంచ గోవిందుఁడవొ పరమేశ్వరుఁడవొ
జ్ఞానివొ రక్షకుందవొ నే నెఱుంగ;
నీపరీక్షకు నే నెట్టు లోపఁగలను
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!
99. నీపాదసేవ మనీషియై సర్వదా
పాయని వీరాంజనేయుఁ డెఱుఁగు
సంకల్పమాత్ర నీ సత్స్వరూపస్ఫుర్తి
ముదముతోఁ జూచు నారదుఁ డెరుంగు
భవదీయమహిమ గర్భస్థుఁడై కథలుగా
నాలించినట్టిప్రహ్లాదుఁ డెఱుఁగుఁ
బ్రకృతియం దెల్ల నీప్రభ నిండె ననునట్టి
శ్రుతిరహశ్యము శ్రీశుకుఁ డెఱుంగు
నీదు నామమహత్త్వంపునియతి యెల్లఁ
గోకిలం బయి కూయి వాల్మీకి యెఱుఁగుఁ
గాని ని న్గన మే మెంత కలియుగాన
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!
100. పాపమంచును బరితాప మొందుదుఁగాని
చేయుచున్నా నెన్నొ చెడ్డపనులు
కడుపుకక్కుఱితిగాఁ గడ కెఱుంగుదుఁగాని
తడఁబడుచుంటి దుందుడుకుపనుల
మంచిగా దనుచు యోచించుచుందునుగాని
విడువదే? మన సేమి చెడుగులందు
నజ్ఞాన మని బుద్ధి నాడుచుందునుగాని
యావేశమునుబట్టి యాఁపలేనె
ఏమిపాపమొ, నాజన్మ కేమికొఱయొ?
చేసి పరితాప మందుటఁ జేయుచుంట
మానదే నీదుభక్తిని బూను టెపుడు?
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!
101. ప్రియునికైవడి నన్నుఁ బ్రేమలో ముంతువు
శాఠునిరీతిగ నాకు శ్రమల నిడుదు
తల్లిలాగున నన్ను నెల్లెడఁ జూతువు
కలచందమునఁ దోఁచి కనులఁబడవు
గురునిమాదిరి నాకు మఱుఁగుఁ జెప్పుచునుందు
పాపాకూపమునందుఁ బాఱవైతు
తండ్రిపోలిక నన్ను దయ నేలఁ గనిపింతు
వాపత్తు పైఁబడ్డ నడ్డుపడవు
ఏమొ నీయూహ తోఁచది ట్లెందుకొఱకు
మాయ నాటక మాడెద వోయి! చెపుమ
దీన నీకగుపేరుప్రతిష్ఠ లేమి?
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!
102. హిందూముసల్మాను లందఱి నొకటిగాఁ
జేసిన దీభద్రశిఖరిగాదె?
గోపన్న సంసారతాపమ్ము లడుగంటఁ
జేసిన దీభద్రశిఖరిగాదె?
తానీషామూర్ఖతఁ దప్పించి జ్ఞానిగాఁ
జేసిన దీభద్రశిఖరిగాదె?
మతములఁ గొట్టి సమ్మతి నందఱిని గొల్వఁ
జేసిన దీభద్రశిఖరిగాదె?
యెంచ నీభద్రగిరిపూర్వసంచితమ్ము
చెప్ప శక్యమే నాబోఁటిచిఱుత కిపుడు?
వినఁ దలంచిన బీవె చెప్పింపవలయు
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!
103. ఎవఁడు నాకిచ్చు? నీకృప యింత లేకున్న
నంతి ధనప్రాప్తి యైనతఱిని
నెవఁడు నన్ గొట్టు నీ దవుపూన్కి లేకున్న
నంటిఁ దిరస్కార మైన తఱిని
నెవఁడు వంచించు నీ కిష్టమే లేకున్న
నంటిఁ బరాభవం బైనతఱిని
నెవఁడు బిడ్దగి నీయహీనమౌ దయలేక
యుంటిఁ బుత్రోత్సవ మైనతఱిని
నన్నిటికి నీవె యంటి నే నాడుమాట
తప్పొ యొప్పొ యెఱుంగ నీవొప్పితేనిఁ
జూడు నాభార మంత మాఱాడకుండ
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!
104. పోతనపైఁ జూపుప్రీతిఁ జూపిననాఁడు
హాయిగాఁ గృతినీకె యీయఁబోనె?
భ్రమకీటన్యాయభాతిఁ జేసిననాఁడు
కాళిదాసునివంటికవిని గానె?
వాల్మీకి కిడినతావకమంత్ర మిడునాఁడు
వ్రాయనే కోటిరామాయణములు
ధర్మాత్మజున కిడ్డదయను జూపిననాఁడు
పాలింపనే లోకజాల మొకఁడ?
నాంజనేయునిపఁ జూపు నాదరమ్ముఁ
జూపినావేని నామీఁద సుస్థిరముగఁ
బడయనే భావిసద్భ్రహ్మపదవి నేను
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!
105. ఆఁకలివేళ మృష్టాన్నముల్ చల్లారఁ
బెట్ట శ్వానము మూతిఁ బెట్టినపుడు
పరిపక్వమై పంతపైరుండగాఁ బెను
గాలిచే సస్యము తూలినపుడు
తనువరించిన కాంత గొనిపోయి తలిదండ్రు
లితరులకున్ బెండ్లి కిచ్చినపుడు
వైభవోపేతపట్టాభిషేకంబు కాం
తారవాసంబుగా మాఱినపుడు
నర్థిమన మెట్టులుండునో యటులె నాకుఁ
జేతి కందెడిఫలమునుఁ జేరనీక
వ్యర్థునిగఁ జేయుచుంటి నీస్పర్థ యేమొ
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!
106. ఆంజనేయున కిచ్చునాధిక్య మిడినచో
దాఁటనే భవవార్ధి మాటలోనె?
ప్రహ్లాదునకు నిచ్చు భక్తి నా కిడినచోఁ
జూడనే నిన్నెల్ల చోటులందు
ధ్రువున కిచ్చినమనోరూఢి నాకిడినచోఁ
గట్టనే నిన్ను నాయెట్టయెదుట?
నారదుపైఁ జూపుకూరిమి నా కిడ్డఁ
గలసికోనే నిన్నుఁ దలపులోనె?
ఎంతపాక్షికమో భక్తసంతతియెడ
నిప్పటికి నీకు నామీఁద నేమొకాని
కనికరము రాదె? నాపూర్వకర్మ మొక్కొ?
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!
107. ఆపన్నులను వీడ నీపన్నుగడ యేల?
యచ్చు కొక్కటి సేయ మెచ్చ రెవరు
కష్టజీవులఁ బ్రోవ నిష్టము లేకున్న
సుఖుల రక్షింపను జోద్య మేమి?
పాపాత్ములను నెట్లు పాలింప నందువా?
పుణ్యులఁ జూచినఁ బొలు ప దేమి?
ఏపాటిదొర వని చేపట్ట నంటివా?
ఘనుల కీ వరసెడిపనులు గలవె?
నీకు దక్షత కలదేని సాఁకు మయ్య
వారు వీరని భేదము చేరకుండ
దీనరక్షకబిరుదు శోధించు మయ్య
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!
108. కైకవరంబుచేఁ గానల నివసింప
వచ్చినా వనఁగ నిన్ మెచ్చెజనము
ఖరదూషణాదిరాక్షసులఁ జొక్కాడుట
నాలించి ఋషులు మిన్నందుకొనిరి
పగవానితమ్మునిఁ బాలించితి వనంగ
సురలు వర్షించిరి విరులవాన
రావణుఁ జంపి నీలావుచే సీతను
గైకొంటి వనఁ గీర్తి కడలుప్రాఁకె
నేమిలోటయ్య? గుణవంతు లెచట నున్న
గౌరవమెకాని సుఖములఁ గాంచఁబోరు;
కనుకనే కొండ లెక్కంగ మనసువుట్టె;
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!
109. తాతకఁ బరిమార్చుపోటరి వైయున్న
రాదు నీకీపాఎఉ రామభద్ర!
శివునికార్ముక మొక్క చిటికలో విఱిచిన
రాదు నీకీపేరు రామచంద్ర!
వాలి నొక్కమ్మునఁ గూలనేసినఁగాని
రాదు నీకీపేరు రామచంద్ర!
రావణాసురుఁ జంపుచేవ గల్గినఁగాని
రాదు నీకీపేరు రామచంద్ర!
సీత నీచెట్టఁబట్టుటఁ జేసికాని
యింతపేరుండునే ద్వాపరాంతమునకుఁ?
దాత, రఘువున కేది నీఖ్యాతిఁ జూడ?
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!
110. ఒకచోట నవ్వింతు వొకచోట నేడ్పింతు
వొకచోటఁ బాడింతు వొప్పుమీఱ
నొకచోట మ్రొక్కింతు వొకచోట మ్రొక్కుల
నందుకొ మ్మని నన్ను ముందునుంతు
వొకచోట రాగమ్ము నొకచో విరాగమ్ముఁ
గలిగించి యాశ్చర్యకలన ముంతు
వొకచోఁ జిరాకుని నొకచోఁ బరాకును
దెప్పించి నాముప్పు త్రిప్పలందు
ఒకచో నుండ నియమింతు వొక్కచోట
దేశద్రిమ్మరి యనిపించి త్రిప్పు దౌర!
బొమ్మలమె నీకు మేము? కానుమ్ము దేవ!
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!
111. నీధ్యానమును జేసి నిమిషంబులోపలఁ
గనుమాసి నీమూర్తిఁ గాంచుచుండ
జాగరూకతతోడ యోగమ్ముఁ బట్టఁగఁ
బట్టేరా వీడఁ డని తుట్టతుదకు
శ్రవణమ్ములకు నేదొశబ్దమ్ముఁ జేకూర్చి
చెలువ మోహపుబొమ్మఁ జెంత నునిచి
కనులపండువుగాఁగఁ గనఁజేసి చిటికలోఁ
జిత్తమ్ము నిటునటుఁ జెదరఁగొట్టి
మట్టెచప్పుడుతో నీవు మాయమగుదు
వింతవ్యామోహ మిడినవా రెవరు నాకు?
బంతివలె నీవెకాదె యాడింతు నన్ను
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!
112. ధర్మమార్గమ్ము నాదరముతోఁ జూపినన్
స్వాంత మావంకముఁ జనఁగఁబోదు
కామోపభోగముల్ కలలవంటి వటంచుఁ
దెలిపినన్ మనసు చంచలత విడువ
దేది యేలాగున నేర్పాటు కాఁదగు
నది నాపురాకృత; మట్టి కర్మ
మున కనుకూల మై యొనరుదానికి మించి
యిదమిత్థ మని చేయ నెవని శక్య?
మిదియె నాప్రార్థనము; నాకు నిదె మతంబు;
జన్మజన్మాంతరములందు మన్మనమున
నీపదారూఢ మగు భక్తి నిలుపుమయ్య
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!
113. గర్భనారకమును గడచి నే భువిఁ బడ
కుండ నాతండ్రికి నుసురుఁ బాపి
తరువార మూఁడేండ్లు దాఁట నాజనయిత్రి
నెఱిఁగి యెఱుఁగకుండఁ గఱవుఁజేసి
ననుఁ జూచువార లెందును లేనితఱిని నా
పెదతల్లికిని బేర్మిఁ బెం పొసంగి
చదువుకో దేశాల సంచరింపఁగఁ బంపి
సంసార మని మొక్క చానఁ గట్టి
బిడ్డ లని పెట్టి చంపుచు నడ్డమైన
పొరుగుపంచల పాల్చేసి పొట్టకొఱకుఁ
ద్రిప్పుచుంటివి నీముప్పుతిప్ప లనుచు
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!
114. దున్నఁబోవగ నెద్దు మన్నఁబోవగ నావు
కాకుండఁబోయితిఁ గర్జ మేమి?
ఱెక్క లాధార మేముక్క లేమాత్రమౌ
వచ్చిన డబ్బిచ్చువారు లేరు
కాలముఁబట్టి నౌకరి మంచి దని యుంటి
నూరూరఁ బొట్టకుఁ జేరలేక
పొట్ట నెప్పట్లనో పోషించుకొనవచ్చుఁ
బని వోవ నుత్సాహభంగ మయ్యె
నేదొ నీపున్నె మంచు నే నాదుకొన్న
పనియె పదివేలు; పయిపయిపరువు లేల?
యెవనికిని బుద్ధి పుట్టింప నీయఁబోరు;
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!
115. అగ్రహారికుఁదను నగ్రహారము లెదు
నిగ్రహించెడుబుద్ధి నిలుపలేను
విద్యార్థినేకాని విద్వాంసుఁడనుగాను
బద్య మల్లినఁ గవీశ్వరుఁడగాను
బొట్టకోసము విద్యఁ బట్టిపల్లార్పను
ధనవంతు లనుచు వందనము లిడను
రాజమర్యాదకై ప్రాకులాడఁగఁబోను
నోరూర్చురుచులకై జాఱిపడను
గులముపెంపును బాటించి గుణ మెఱింగి
న్యాయమార్గము చేపట్టి నడుచుచున్న
జాలిఁ జూడ వదేమొ? దయాలవాల
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!
116. "ఊడిమూడి" సమాఖ్య నొప్పునింతను నన్న
పూర్ణకు నాగరాట్ పుంగవునకుఁ
దనయుఁడ రామభద్రునకుఁ బౌత్రుండ, భా
రద్వాజగోత్రానఁ గ్రాలుచుండి
తగ "బళ్ల" వారికిఁ దత్తుండ నయి వేంక
మాంబను నీలాద్రిమనుజవిభుని
దల్లియుఁ దండ్రిగా నెల్లప్పుడును గొల్చి
వారియాశీర్వాదభాగ్య మంది
వినుతరుక్మాంగదునిగోత్ర మెనసి నీకు
గాంక నూటపదా ర్లీయఁ గలిగినాఁడ
సాఁకుమీ ననుఁ గృప రామచంద్రకవిని
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!
సమాప్తం