Friday, October 17, 2014

కృష్ణశతకము - కపిల కృష్ణశర్మ (కర్మశ్రీ)

కృష్ణశతకము
                                      కపిల కృష్ణశర్మ (కర్మశ్రీ)
(కందపద్యశతకము)

1. శ్రీకర! మునిమానసమో
దాకర! జితనీలనీరదశ్యామా! ల
క్ష్మీకాంతా హృద్రమ్య
శ్రీకైరవకైరవాప్త! జేజేకృష్ణా!

2. భువి జక్రవరపు వంశో
ద్భవు శాస్త్ర నిగమ పురాణ పారంగతునిన్
కవివరగురువేంకటరా
య, విబుధవర్యు గొలుతు ననయంబును కృష్ణా!

3. వాణిని శాస్త్రనిగమచయ
పాణినిఁ బద్మజురమణిని ప్రాకట సుగుణ
శ్రేణిని పన్నగసన్నిభ
వేణిని మృదుపలుకు లొసఁగ వేడెదు కృష్ణా!

4. అసదృశ కవితా సృష్టులు
పస నొనరించియు వెలుంగు భాసురకవిలో
క సుధాకరులకు మ్రొక్కి, స
రసత శతకమును రచింతు రాధాకృష్ణా!

5. అదీది యనగను కుదరని
మదినొక నలత జలఁగి యరమరకలు వెట్టన్
బెదరియు నుపశమనమునకు
మది యలరఁగ నిది నుడివెద మాధవకృష్ణా!

6. పాదోద్భవ గంగాఝరి
మోదముతో శిరమునందుఁ బూనుటగాదే
సాదృశహీనమహామహి
మా దారియగుచు వెలుఁగు నుమాపతి కృష్ణా!

7. సతి సుతహిత జనజలచర
యుతమగు సంసార పంకిలోదధిగడువన్
తతనీసంస్మృతి నౌకా
ప్రతిపత్తియు లేక మాకు వశమే కృష్ణా!

8. వైష్ణవమాయాగుణ వ
ర్థుష్ణుత జాటఁగ నుమాపతిన్ఘన మాయా
నిష్ణాతు న్మోహినివై
దృష్ణత బాపవె విలాస ధుర్యతఁ కృష్ణా!

9. సిరిగల రోజులలోనన్
హరినామ స్మరణ గల్గ దద్ది హరించన్
దరిఁ జేరంజూతురు గద
మరి దీనజనావనాఖ్య మహిమది కృష్ణా!

10. నిరతము నిశ్చల భక్తిని
బరగుచు భవబంధ విదళపరిధవయుతమౌ
హరి పాదాంభోజాతత
స్మరణాసక్తుఁడగు వాడె మాన్యుఁడు కృష్ణా!

11. గోవు లుపనిషత్తు లరయ
నీ విల దోగ్ధవు కిరీటియే దూడ మహా
పావనగీతయు దుగ్ధము
ద్రావిన మోహమడఁగునట ద్రావెద కృష్ణా!

12. దేహము నిత్యముగాదని
యూహల నెఱిఁగియు గణింప నోపముగాదే
మోహానహవివశులమయి
శ్రీహరి పాదారవింద చింతన కృష్ణా!

13. విను మర్పణము బ్రహ్మము
అనలము బ్రహ్మము, హవిస్సునది బ్రహ్మమగున్
ఘనతర ఫలమది బ్రహ్మము
యొనరించెడివాడు బ్రహ్మయననగు కృష్ణా!

14. సర్వము బ్రహ్మమయంబగు
నుర్విని కర్మమున బ్రహ్మయూహాయునున్నన్
దుర్విషయ విముఖుఁడైనను
నుర్వర బ్రహ్మపద భాగ్యమొందును కృష్ణా!

15. భవదీయాకృతి భయ, భ
క్తి, విధేయత లలర నిలిపి స్థిరముగ మదిలో
భవ పాశంబులు ద్రెళ్ళగ
సవినయమున సన్నుతింతు సతతము కృష్ణా!

16. జ్ఞామికి సర్వము బ్రహ్మము
తానొనరించెడి పనులును తత్ప్రీతికినై
మానుగ బొందెడు ఫలమును
తాకినంత మెచ్చు నెపుడు దానికె కృష్ణా!

17. కాలము గడుపఁగ కర్మము
లోలి నటించు ఫలరక్తి నొడఁబడఁ డెపుడున్
మేలును గీడును బొందం
జాలక పరమున కలియును జ్ఞానియు కృష్ణా!

18. ఈ మఖమును జేయుదు నే
నీ మఖఫలముగ గనుదు ననేక సుఖములన్
కామిత భోగముల మరఁగ
తామది నెంచును జడమతి తప్పక కృష్ణా!

19. జీవునిగ వెలుఁగువాఁడును
దైవాంశమునై శరీరధరుఁడై యలరున్
"జీవోదేవ సనాత"
భావము గ్రాహ్యము గదర శుభంకర కృష్ణా!

20. ఆత్మలకును వెలియునయి స
ర్వాత్మలకు వెలుఁగుటఁజేసి ప్రాభసమున భూ
తాత్ముంద నగుట నిల బర
మాత్ముఁడనుచు విభుదవర్యు లాడరె కృష్ణా!

21. లీలఁగ మాయాశక్తిని
గ్రాలుచు చిన్మయ స్వరూపకలితుఁడ వగుచున్
నేలను నింగిని నన్నిఁట
డాలియు నుంటివి పొగడవశమె నిను కృష్ణా!

22. పదునాలుగు భువనంబుల
నుదరమునిడి దేవకీసతి యుదరములోనన్
కుదిరితి వెట్లొకొ దాననె
కుదురును చిద్రూపుఁడనుచు గొలువంగ కృష్ణా!

23. ద్యోతకమయ్యెడు తత్త్రయ
జ్యోతుల కవ్వల వెలిఁగెడు జ్యోతివగు బరం
జ్యోతివి తేజోధారివి
జ్యోతిర్మయ రూపివిగద శుభఁకర కృష్ణా!

24. చూచుట సులభము మదిలోఁ
జూచుట నేర్చిన నయినను జూచుటకేలా
దోచుట తనుదానే లోఁ
జూచుటయే చూచుటకద చోద్యము కృష్ణా!

25. విలువైనది విజ్ఞానము
సులువైనది కాదుకాని చోద్యము నరజ
న్మలకే యధికారంబును
గలదు తెలియ తెలియఁగవలె ఘనముగ కృష్ణా!

26. ఏ తెలివిని తెలిసిన నిఁక
నే తరిఁ దెల్యనగు దెలివి యిల మిగిలియు పో
దా తెలివిని తెలిసికొనుట
యే తెలివియని యెలియవలె నెదలో కృష్ణా!

27. తగువారల వేడినపని
యగుఁగా నందరిని జూచి యాచించుటయున్
తగునే సర్వాధిపతివి
యగుటను నిన్నే నుతింతు నరయము కృష్ణా!

28. దారులు వేరగు గమ్యము
నారయ నొక్కటె కనుగొన నభిమత గతులన్
జేరుదు రవ్వియ మతముల
దారులు దోచిన విధముగ దప్పెటు కృష్ణా!

29. కోయిల చేరని వనమును
ధీయుతులుండని సభ కవిధీరులు నరుదౌ
నాయూరును ధరన్యాయము
జేయని దొర, పురి దగదు వసింపఁగ కృష్ణా!

30. సరసత నెఱుఁగని సానియు
వరవాక్చాతురిమలేని పండిత జనుడున్
పరితుష్టుల జేయని కవి
వరుఁడును రాణించరుగద! వసుధను కృష్ణా!

31. ధనమును విద్యయు గలుఁగని
మనుజుని స్వజనులుగూడ మన్నింపరుగా
ఘన విషదంష్ట్రలు వడిఁ బెర
కిన పన్నగ లక్ష్యమేమి? కేశవకృష్ణా!

32. అతి గర్విని గణియింపక
సతిని బ్రక్కను పరుండ సమ్మతినీకే
కితునకు బలుకకయుండుట
యె తగిన శిక్షలు ముకుంద యీశ్వర కృష్ణా!

33. అతివాచాలత గూడదు
సతము ముభావమున నుండు సత్పురుషు భయా
న్వితుగ దలంచును లోకము
తత నిజము గ్రహింపలేమి తథ్యము కృష్ణా!

34. పరులకు మిక్కిలి నీతులు
గరపుట కడుతేలికయె ప్రకటముగ తానా
చరణం జూపుట కష్టము
కరుభయహర! శ్రితభవహర! కారణకృష్ణా!

35. అల కాళీయుని శిరమున
పలువిధముల నాట్యభినయ పావన పాదం
బులు మదిఁబాయక గొల్చెద
నిల భవబంధము లుడుగఁగ నెంచియు కృష్ణా!

36. హరిహర రూప విభేదము
నరయగ లేదని నెఱిఁగియు స్వాంతములోనన్
హరుఁడన నభిమానంబిల
నురవగు నదియేమి చిత్రమోకద కృష్ణా!

37. వినుమ నిరువుర సమముగ
మానసమున దలతుగాన మానక నిన్నున్
నేనోపినటుఁల బొగడుదు
మానుగ గ్రహియించవయ్య మాధవ కృష్ణా!

38. కలలోఁ బొడఁగని శతకముఁ
బలికించుట నరయ నీకు భక్తుల పాలన్
వలమాలిన ప్రేమయనుచుఁ
దలఁపగ వచ్చును మనమునఁ దప్పక కృష్ణా!

39. జనకుని మ్రొక్కగ సిగ్గిలు
తనయుఁడు నడివీధినిబడి తడబడు సానిన్
జనకూటమిఁ జేర వెఱపుఁ
గను పిఱికియుఁ బైకిరారు గదరా కృష్ణా!

40. పరుల ధనమ్మును గుడుచుచు
దొర నీయూరికి నటంచు దుందుడుకొప్పన్
చరియింతురు కొందఱు మరి
సరుకుండని యాకెగిరెడి సంగతి కేష్ణా!

41. ముదమున మెలఁగెడు భార్యయు
నెదురు బలుకుచు నిరసించు నే సోదరియున్
కుదురుగ పాలీనొల్లని
మొదవు నవశ్యము విడుచుట బోలును కృష్ణా

42. కుస్ఖిం గోసియు గాంచిన
నక్షరముండదు మరేల నన్నిఁట నేనే
దక్షుఁడనంచాడు తులువ
నీక్షితి నెటు మందలింతువీవో కృష్ణా

43. పిలిచినతోడనె పలికిన
తొలఁగును దొర ఠీవి యనచు దోర్గర్వమిలన్
అలరఁగ పరధ్యానంబున
మెలఁగెడు మందమతులుండ్రి మేదిని కృష్ణా

44. తెలసినవాఁడైనను మరిఁ
తెలియనివాఁడైన బ్రతుకు తెరువులు దెలియున్
తెలిసియు తెలియని మూఢుఁడు
తెలియక మిడిసిపడుచుండు తేలఁడు కృష్ణా

45. గిల్లలు బెరకిన కుక్కను
పిల్లలతోడనవసించు బెబ్బులిని యిలన్
జిల్లర తిరుగుడు మరగిన
పిల్లను నమ్మదగదు రిపుభీకర కృష్ణా

46. జ్ఞానవిహీనుఁడె ధారుణి
దీనుఁడు ధన భోగ భాగ్య దివ్యసుఖములన్
గానని వాఁడు దరిద్రుఁడు
గా నిల దీనుండుగాడు కదరా కృష్ణా

47. గోవింద కథా మధుర సు
ధావరధారానురక్తిఁ దవిలినవాఁడే
పావన చారిత్రుఁడు దీ
నావనభావన! ముకుంద! హరి! శ్రీకృష్ణా

48. చతురాంభోధిపరీతవ
సతి భూతల మెవ్వని నిజచరణత్రయమై
వృత్తమై వెలుఁగొందెడు న
య్యతుల మహిమయుతు భజింతు ననిశము కృష్ణా

49. పాలింపను లాలింప మొ
రాలింపంగా సమర్థుడాఢ్యుఁడ వీవే
పాలింపవె శరణంటిని
లాలింపవె యభమిచ్చి లలి శ్రీకృష్ణా

50. కోరను ధనధాన్యంబులు
జీరను ఘన భోగభాగ్య సిరిసంపదలన్
గోరెద భవబంధముల
జీఱెడి పదారవింద చింతన కృష్ణా

51. జలజాకర సలిలంబుల
దళలహరీఫేన బుద్భుదంబు లొదవి త
జ్జలమున కలియు గతిని ని
ర్మల సృష్టిని జీవులుండి మలఁగును కృష్ణా

52. శ్రీ రమణీ కుచ రంజిత
సార సుగంధ మృదులిత తుషార నిమగ్న
స్ఫారోదార విలాస ప్ర
కారా! శ్రితజన భయహర కారణ కృష్ణా

53. తారకము జటులతర స
సారవిదారకము సుజన సన్నుత ముని హృ
చ్చోరకము ముకుందు శుభా
కారముఁగోరి వినుతింతు హరి శ్రీకృష్ణా

54. పావన గీతా క్షీరము
ద్రావిన ధీరుఁడు కిరీటి ధన్యుఁడు సుమ్మీ
తావక తత్త్వము దెలిసిన
బోవును భవపాపపాశములుగద కృష్ణా

55. నందయశోదల నయనా
నందకర! మునిజన హృద్వనజమోదకరా!
సుందర విగ్రహ! హరి గో
వింద! ముకుంద! వినుత త్రివిక్రమ కృష్ణా

56. శ్రీధర! కేశవ! వామన!
మాధవ! శౌరి! పురుషోత్తమ! హరి! వృషీ కే
శాధోక్షజ! మధుసూధన!
సాధుజనావన! మునిజనసన్నుత కృష్ణా

57. శ్రీసతి పాదములొత్తఁగ
భాసుర కాంతులను కౌస్తుభమణి వెలయ నా
భీ సరసీజంబున విధి
యాసీనుఁడ ననురాగమున నలరదె కృష్ణా

58. దయ్యము దయ్యమనంగా
నెయ్యెడ వేరుం గలుగునె యింటిని దుయ్యం
గయ్యాళి సతియ కదరా
దయ్యము సుజనవినుతోన్నత చరణ! కృష్ణా

59. బాలుఁడ నీతులు జెప్పఁగ
జాలనుగాన వచియింతు శైశవ కేళీ
జాలము కరుణించియు నన్
పాలన జేయుము శ్రితజన బాంధవ కృష్ణా

60. నేలను తినుటయు నేలన
నేలయె నాలోన నుండు నేలనె గుడుతున్
జాల విఁకేమని నోటను
నేలను జూపితె జననికి నెమ్మది కృష్ణా

61. మాయలపుట్టగు దిట్టను
మాయను గ్రమ్మఁగ బశులను మరి కాపరులన్
మాయము జేసిన ధాతయె
మాయంబడిపోడె మున్ను మాధవ కృష్ణా

62. ప్రేమార!ం బిలువఁ బంపిన
మామను దరిఁజేరి చీరి మడియఁగఁ గొట్ట
న్నేమాత్రము ధర్మంబగు
దామోదర! నీరజాక్ష! దయంగను కృష్ణా

63. వృక్షమ్ములు రెంటికి నిజ
వక్ష స్థలి మోపిడి చిరుపాపని లీలన్
దక్షతఁ ద్రోసిన ఫెళఫెళ
నీక్షితి వ్రాలవె! మును జగదీశ్వర కృష్ణా

64. నీవెటు సేసిన లీలలు
మావిలఁ బిచ్చి పనులౌను మాకున్ నీకున్
ఈవైరుధ్య మదేమిటి?
పావనచరణా! శ్రితజన భయహర కృష్ణా

65. ఓంకారమయ స్వరూపా!
శంకర వనజోద్భవముఖసన్నుతభావా
పంకజనాభా! ప్రధిత శు
భంకరనామా! శ్రితజన బాంధవ కృష్ణా

66. జలకం బాడఁగబోవ
న్నల యక్రూరుని కరయుగ్మమందు ననతి కృపా
కలిత స్వాంతుడవై లీ
లల దర్శన మోవె కృప చెలంగఁగ కృష్ణా

67. ఈరేడు జగము లేలెడి
సారగుణు సుతునిగఁ బొదవి సాకెనన యశో
దారమణి సుకృత మెన్నఁగ
నేరుదుమే చిశ్వనాధ! నిర్గుణ కృష్ణా!

68. బొడ్డునఁగల నలుమోముల
బిడ్డకు సృష్టి విధమెల్ల వేళలఁ దెలిపే
దొడ్డవు వేడుక బుట్టెనె
బిడ్డగఁ బెరుగంగ గొల్లవీటిని కృష్ణా

69. వెన్నయు మీగడ పెరుగును
నెన్నఁగ పాలును గుడువఁగ నిత్తరి మనసై
యున్నదె హా! కాలబలిమి
నిన్నును బంధించు నొక్కొ నిచ్చలు కృష్ణా

70. పాలను ద్రావుమటంచును
చాలఁగ పాలిచ్చు రాక్షస యువతి నపుడున్
లీలగ పాలను నిజ ప్రా
ణాలను బీల్చితివఁట తగునా హరి శ్రీకృష్ణా

71. ధనమది మిక్కిలి గూర్చిన
జనునాడావంతయు వెనుజని వచ్చునె? క
న్గొనఁ గేవలమది జంజా
టన సప్ప మరేమి ప్రస్ఫుటంబుగ కృష్ణా

72. ధనమార్జన సేసెడివే
ళను నాకసలు మరణము హుళక్కి యటంచున్
ఘన దానధర్మముల వే
ళను రేపే జత్తునని దలఁపవలె కృష్ణా

73. పరకాంతల దల్లులవలె
నరయవలె నటంద్రు గోపికాంగనలను నె
ట్లరసితి వీవు జుజము నుడు
వరగోపాల! యవినీతిఁ బరగవె కృష్ణా

74. బాలుఁడవై నిఖిల భువన
పాలుఁడవై యిల యశోద భామిని సుకృతా
జాలుఁడవై రేపలి గో
పాలుఁడవై యలరు నిన్నుఁ బాడెదు కృష్ణా

75. ధైర్యము వీడక నిరతము
స్థైర్యంబున బురుషకార్య తత్పరుఁడైనన్
కార్యము దప్పక జరుగు న
వార్యంబగు దైవబలము బడనియు కృష్ణా

76. మానవ పూనిక మొదలే
లేనిచొ దైవంబెటుల ఫలించును మదిలో
దీనిని దలఁపక లేడని
జ్ఞానహీనత తలఁతురు సత్యము కృష్ణా

77. కర్తాకర్తవుగాఁగా
వర్తింతువు గాదె సత్యభామా గర్వ
స్ఫూర్తిని బాపఁగ నారద
మూర్తి నియంతగ నిలుపవె మురళీకృష్ణా

78. వారినివీరునిఁ బ్రోచిన
ధీరుఁడవంచును శరణు నుతించితి వడి న
న్జేరి గావకనున్నను
నేరను నీమహిమ నమ్మ నిజముగ కృష్ణా

79. తెగువఱకుఁ ద్రాడు బిగిం
చఁగఁ దగదు సుమా! ముకుంద! సత్వరముగ బ్రో
వఁగ చూడుము భక్తుని స
త్వగుణ విరాజిత గుణరహితా! హరికృష్ణా!

80. ఆరిషడ్వర్గమ జేయుము
ధర ముక్తిప్రద మహిత పదద్వయ నిజ సం
స్మరణ విడువఁగ నశక్యం
బిఱుకటమునఁబడితిని దయ నేలుము కృష్ణా

81. నాలుగు విధముల భక్తులు
జాలఁగ గొల్చెదరు నిన్ను జ్ఞానజిఘృక్షుల్
పాలిత కాములు నార్తులు
గా లలితజ్ఞులు వచింత్రు క్ష్మాతలి కృష్ణా

82. కామాతుర బుద్ధిని మే
మేమాలిన్యం బెఱుంగ మెన్నగ సత్వ
స్తోమం బుడిగిన దెలియు న
దేమో యాయగ బలుకుదు రిమ్మెయి కృష్ణా

83. పసఁ దెలియు బనులకు శివుని
యుసు కొల్పుచు పాలు బెరుగు లూరక గ్రోలన్
విసురుగ బోదువు మరతుమె
విసము గుడుచు సంఘటనను వీసము కృష్ణా

84. కన్నుల కాళుల చేతుల
నన్నుల మిన్న లిల సైగ లాడఁగ వనజో
త్పన్నునకైనను దెలియునె
కన్నెల చేష్టలు విచిత్రకరమగు కృష్ణా

85. దేహము శాశ్వత మంచును
మోహమునఁ దలంచెడివారు మూర్ఖులు ధరణిన్
దేహము బోవుట నెఱిఁగియు
మోహమున దపించువారు మూఢులు కృష్ణా

86. ఇతరము దలపక మదిలో
సతతము నిన్నే కొలిచెడి సత్పురుషునకున్
వితరణ లేకయె బంటుగ
నతని విడువక చరియింతు వటరా కృష్ణా

87. కోరిక లుడిగియు నాత్మన్
జేరిచి మనమును స్థిరముగ చింతన చేయ
న్నేరుచు సత్పూరుషుఁడే
యారయ నారూఢుఁడనగ నర్హుఁడు కృష్ణా

88. భేదములేకను సర్వము
నాది పురుషవరు స్వరూపమంచును మదిలో
మోదించెడి సమదర్శన
మేదుర భావము గలుగుట మేలగు కృష్ణా

89. అదుపాజ్ఞలు లేకను దా
జెదర దిరుగుమదిని విషయచింతల యెడలన్
గుదియించును నెమ్మది నె
మ్మది దైవపరంబు సలుప మలగును కృష్ణా

90. ఊపిరి వోయెడి వేళల
నోపము హరినామ చింత నొనరింపంగా
నా పరువంబున కిపుడే
నీపద సేవలు సలుపుదు నెమ్మది కృష్ణా

91. జలమున బడు లవణకణము
జలరూపము దాల్చుగతిని సర్వస్వము ని
శ్చల మనమున దైవార్పణ
మిలఁ జేసెడి వాడె భక్తిఁడెన్నగ కృష్ణా

92. నమ్మిక గావలె మును గ
ర్వమ్మది పోవలె పయి నరి వర్గము దొలగున్
నెమ్మది భక్తి గుదురు స
త్యమ్మిది తెలిసిన పురుషుఁడు ధన్యుఁడు కృష్ణా

93. తను తా నెఱిఁగియు క్రీడిం
చును మదిలో ముదమున మఱచును తనగతియున్
తనకే కోర్కెలు గలుగక
నివ నారూఢస్థితి నిల బరగును కృష్ణా

94. వేదంబులు శాస్త్రంబులు
దాదరి ముట్టఁ జదివియును తత్సారంబౌ
ఆదివిరాట్టు నెఱుఁగరు ప్ర
సాదమునన్ దిరుగు గరిట సంగతి కృష్ణా

95. పనిబడి యేగియు నచ్చో
టను జేరి తిరిగియు వచ్చుట మరచుగతి నే
లను జన్మము దాల్చితినని
మనమున నెంచడు బురుషుడు మాయగాక కృష్ణా

96. జ్ఞాన స్వరూపు డాతడు
ధ్యాననిదానుండ వీవు దద్దయు భక్తిం
బూని శివకేశవు లొకటి
గా నెఱిగినగాని శుద్ధిగాదుర కృష్ణా

97. దివ్యము భవ్యము మునిజన
సేవ్యము నిఖిల భువనతర శ్రేయోపద బా
ధవ్యము వనజోద్భవ శివ
స్తవ్యమగు శుభాకృతి మది దలచెదు కృష్ణా

98. విశ్వేశ్వరు, విశ్వాలయు
విశ్వేతరు, విశ్వలోలు, విశ్వాకారున్
విశ్వపతిని, విశ్వగతిని
విశ్వుని, ఘనవిశ్వమయుని వేడెదు కృష్ణా

99. కవితా మాధుర్య సుధా
నవధారలు దయనొసంగి నన్నిలబ్రోవన్
భవదీయాకృతి గొలిచెద
నపని గరుణగొని మొఱవిని నరయుము కృష్ణా

100. తత సత్కవితా ఘన ని
ర్మిత భవ్యచరిత్రలందు మేలగు స్థానాం
క్షత రవ్వంతయు లేదుర
క్షితి నీ నామస్మృతి నిటుజేసితి కృష్ణా

101. సృష్టి స్థితి లయకారణ
దుష్ట దురిత సంయుత భవ దుర్గతి హరణా
శిష్ట జన వినుత చరణా
స్రష్టా నిమిషేంద్ర వినుత శరణా కృష్ణా

ఇది శ్రీచక్రవరం వేంకటరామరాయ గురుకరుణాకటాక్ష
లబ్ధకవితా ధౌరేయ కాశ్యప సగోత్ర పవిత్ర కపిల
వంశాంబుధీ సుధాకర శ్రీకామేశ్వరసూర్య
నారాయణార్య ప్రియ మధ్యమ పుత్ర కృష్ణ
శర్మ నామధేయ ప్రణీత
శ్రీకృష్ణా శతకంబు
ఓం తత్ సత్

Sunday, October 12, 2014

శతకాల పట్టిక 6

మిత్రులందరికి నమస్కారం. గతకొద్దికాలంగా పనుల ఒత్తిడివలన శతకసాహిత్యంలో పోష్టులను వేయలేకపోయినాను. అందులకు మీరందరు అన్యధా భావించరని ఆశిస్తాను. ఈ మధ్యలో ఒక మిత్రులు శ్రీవశీరప్పగారి రామకృష్ణగారు వారివద్దనున్న దాదాపు 300 పైచిలుకు శతకాల పట్టికను నాకు పంపించారు. శ్రీరామకృష్ణగారు శతకసాహిత్యాభిమానే కాక స్వయంగా శతక రచయిత కూడా. "మారుతిదేవా" అనే మకుటంతో "మారుతీదేవ శతకాన్ని" వీరు రచించారు. వీరి శతకసాహిత్యం పై అభిమానం ఆసక్తి సర్వదా అభినందనీయం. వారు అనేక ప్రయాసలకోర్చి నాకు ఈ పట్టిక పంపినందులకు ధన్యవాదాలతో, వారు మరెన్నో శతకాలని భవిష్యత్తులో మనకు అందిస్తారని ఆసిస్తున్నాను. వారు పంపిన శతకాలను ఇదివరలో లాగానే పోష్టుకు 100 చొప్పున మీకు అందచేస్తున్నాను

1 శ్రీవినాయక శతకము నిర్విషయానంద స్వామి 1973,శ్రీవినాయకా
శ్రీవిఘ్ననాయక శతకము ముచ్చేలి శ్రీరాములు రెడ్డి 2002 విఘ్ననాయకా
3,శ్రీవినాయక శతకము మంకు శ్రీను 2012 శ్రీవినాయకా
4 మారుతీదేవ శకతము వశీరప్పగారి రామకృష్ణ 2011 మారుతి దేవా
5 శ్రీకాశీవిశ్వనాయక శతకము మడిపల్లి వీరభద్రశర్మ 2005 విశ్వనాయకా
6 శ్రీసంగమేశ్వర శతకము తాడూరు మోహనాచార్యులు 2002 సంగమేశ్వరా
7 శ్రీమల్లేశ శతకము జోస్యము జనార్ధన శాస్త్రి 2009 శ్రీమల్లేశా
8 శ్రీమృత్యుంజయ శతకము పామిశెట్టి రామదాసు 1998 మృత్యుంజయా
9 శంభూ శతకము విభావనుఫణిదపు ప్రభాకరశర్మ 1994 శంభూ
10 శ్రీరాజరాజేశ్వరీ శతకము బండకాడి అంజయ్య గౌడ్ 2008 రాజరాజేశ్వరా
11 శ్రీకపోతేశ్వరా శతకము డా. తూములూరి శ్రీదక్షిణామూర్తి శాస్త్రి 2004 శ్రీకపోతేశ్వరా
12 శ్రీబాలకోటీశ్వరా శతకము చల్లా పిచ్చయ్య శాస్త్రి 1956 బాలకోటీశ్వరా
13 శ్రీ చంద్రమౌళీశ్వరా శతకము బండకాడి అంజయ్య గౌడ్ 2006 శారదాక్షేత్ర నిలయేశ సాధువినుత జంగమార్చితా పరమేశ చంద్రమౌళి
14 చంద్రశేఖర శతకము సారెడ్డి చంద్రశేఖర రెడ్డి 2010 చంద్రశేఖర నిన్నునే సన్నుతింతు
15 శ్రీచంద్రమౌళి శతకము బేతపూడి రాజశేఖర రావు 2004 సర్వశక్తిశాలి చంద్రమౌళి
16 చంద్రశేఖర శతకము,,,చంద్రశేఖరా
17 శ్రీకఱకంఠేశ శతకము కాసా చిన్నపుల్లారెడ్డి 1979 ఎట్లు రక్షింతువే కఱకంఠేశ దేవా
18 అంబికేశ శతకము భాస్కరరాజు నాగేశ్వరరావు 1979 అభ్రకేశ యీశ అంబికేశ
19 శ్రీరామలింగేశ్వర శతకము జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు 2010 శ్రీరామలింగేశ్వరా
20 శ్రీరామలింగేశ్వర శతకము డా. చి. వి. సుబ్బన్న శతావధాని 2001 రామలింగేశ్వరా
21 భోగిరామేశ్వర శతకము కే. నాగప్ప 1988 శ్రీభోగిరామేశ్వరా
22 శ్రీత్రిపురేశ్వర శతకము పోలూరి సత్యనారాయణ 2010, శ్రీత్రిపురేశ పాహిమాం
23 నాగలింగ శతకము డా. రాధశ్రీ 2008 నాగవరమందు చెలువొందు నాగలింగ
24 భావలింగ శతకము శివయోగి శివశ్రీ ముదిగొండ శంకరాధ్యులవారు 2003 పాపభయ విభంగ భావలింగా
25 మల్లికార్జునలింగ శతకము శివయోగి శివశ్రీ ముదిగొండ శంకరాధ్యులవారు 2003,మల్లికార్జునలింగా
26 శంభూద్భవం శ్రీరాజరాజేశ్వర శతకం పిట్టా సత్యనారాయణ 2009 రావే రాజరాజేశ్వరా రవియె పిలిచె
27 తమ్మడపల్లి శ్రీరాజేశ్వరస్వామి శతకము పిట్టా సత్యనారాయణ 2011 "పార్వతీశ్వరా తమ్మడపల్లెతోతరవి, యశోధర అభ్షేకరక్షక హరా"
28 "అంతరంగనివేదనము, శ్రీశంకర శతకము" శలాక రఘునాథ శర్మ 1994 శంకరా,
29 శ్రీవిశ్వేశ్వర శతకము డా. వీరాసూర్యనారాయణ 2009 విశ్వేశ్వరా
30 శ్రీమేధాదక్షిణామూర్తి శతకము మల్లాది నరసింహ మూర్తి 2011 మేధా దక్షిణామూర్తివే
31 శ్రీరామలింగేశ్వర శతకము ఇనపావులూరి సుబ్బారావు 2001 కలువకూరి రామలింగ! కలుషభంగ! హే శివా!
32 అన్నపూర్ణ శతకము భమిడిపాటి కాళిదాసు 2010 అన్నపూర్ణవిభుని ఆత్మదలతు
33 ఈశ్వర సంప్రశ్నము పి. హుస్సైన్ సాబ్ 1994 ఈశ్వరా
34 శ్రీపార్వతీశతకము డా.ఆశావాది ప్రకాశరావు 2010 పార్వతీమాత ఆశ్రితపారిజాత
35 కడప శ్రీవిజయదుర్గా శతకము యలమర్తి మధుసూధన 2009 విజయదుర్గా పాపవర్గాపహా
36 శ్రీలలితా శతకము సిద్ధంసెట్టి సంజీవదాస్ 1975 లలితా
37 శ్రీరాజరాజేశ్వరీ శతకము ద్విభాషి సోమనాథ కవి 1964 శ్రీరాజరాజేశ్వరీ
38 శ్రీ రేణుకాదేవి శతకము బండకాడి అంజయ్య గౌడ్ 2006 రేణుకాంబతల్లి రేణుకాంబా
39 శ్రీసరస్వతీ శతకము బాందిడి పురుషోత్తమ రావు 2006 శ్రీసరస్వతీ
40 శ్రీబళ్ళారిదుర్గాంబికా శతకము   దాదన చిన్నయ్య 1983 బళ్ళారి దుర్గాంబికా
41 శ్రీసిద్ధేశ్వర శతకము చింతపల్లి నాగేశ్వరరావు 2010 గౌరీ సిద్దేశ్వరీ
42 శ్రీవాసర సరస్వతీ శతకము డా.కలువకుంట రామకృష్ణ 1995 వందనములందు కొనవమ్మ వాసరాంబా
43 వాసరేశ్వరీ శతకము అష్టకాల నరసింహశర్మ 1997 వాసరేశ్వరీ
44 మహాయోగి తిక్కలక్ష్మాంబ శతకము కరిబసవ శాస్త్రులు 1982, భక్త నికురుంబ భ్రమరాంబ భార్గవాంబ తిక్కలక్ష్మాంబ ఆదోని దేవతాంబ
45 శ్రీఈశ్వరమ్మగారి శతకము శ్రీతలారి రామకృష్ణప్ప 1998 వీరలోకమాత ఈశ్వరమ్మ
46 నలువరాణి శతకము గుళ్ళపల్లి తిరుమల రామకృష్ణ 2000 నడచిరావమ్మ నావాణి నలువరాణి
47 శ్రీరాజరాజేశ్వరీ శతకము డా. తూములూరి శ్రీదక్షిణామూర్తి శాస్త్రి 2010 రాజరాజేశ్వరీ,
48 రాజరాజేశ్వరీ శతకము మంకు శ్రీను 2008 శ్రీరాజరాజేశ్వరీ 
49 దత్తాత్రేయ శతకము గొట్టిముక్కల సుబ్రహ్మణ్యశాస్త్రి 2008 దత్తాత్రేయా
50 వేణుగోపాల శతకము గొట్టిముక్కల సుబ్రహ్మణ్యశాస్త్రి వేణుగోపాల పామూరు విభవజాలా
51 కృష్ణనీతి పంచాశతి కాకర్ల కృష్ణమూర్తి శాస్త్రి 1999  కృష్ణా
52 భీమన్నా ద్విశతి డా. అక్కిరాజు సుందర రామకృష్ణ 2005 భీమన్నా
53 లింగన త్రిశతి బుసిరెడ్డి లింగారెడ్డి 2010 శ్రీశుభాంగ మేడిచెలమలింగా
54 వాసరమ్మవాణి పంచశతి మేడిచర్ల ప్రభాకరరావు 2007 "హృదయవాణి - వసుధ వాసిగన్న వాసరమ్మా వాస్తవవాణి - మేలు నెఱిగి మెలగు మేడిచెర్ల, అక్షరవాణి - మెలగునాత్మ నెరుగ మేడిచర్ల, జీవనవాణి - మెలగు కర్మ నెఱిగి మేడిచర్ల, విజ్ఞానవాణి - మేలు నెఱిగి మెలగు మేడిచెర్ల"
55 శ్రీమదనంద నిలయేశ శ్రీనివాసా శతకము ఆలూరి లక్ష్మీనారాయణ  2009 శ్రీ మదానంద నిలయేశ శ్రీనివాసా,
56 నరసింహాపుర నివాస నరహరి రామా శతకము ఆలూరి లక్ష్మీనారాయణ  2009 నరసింహాపుర నివాస నరహరి రామా
57 కలియుగంబు వింత కనరకన్న శతకము ఆలూరి లక్ష్మీనారాయణ 2009 కలియుగంబు వింత కనరకన్న
58 సారంగ పురాంజనేయ సంగరవిజయా శతకము ఆలూరి లక్ష్మీనారాయణ 2009 సారంగ పురాంజనేయ సంగరవిజయా
59 శ్రీ కురుమూర్తి శ్రీనివాస శతకము వైద్యం వేంకటేశ్వరాచార్యులు 2011 కురుమూర్తి శ్రీనివాస మహాత్మా
60 కురుమూర్తివాస శతకము వైద్యం వేంకటేశ్వరాచార్యులు 2011 కురుమూర్తివాస పాహిప్రభో 
61 శ్రీరంగనాయక శతకము,వైద్యం వేంకటేశ్వరాచార్యులు,2011,రంగనాయకా,
62 శ్రీసుద్దిమళ్ళ కంబగిరి లక్ష్మీనరసింహ శతకము వైద్యం వేంకటేశ్వరాచార్యులు 2011 కంబగిరి లక్ష్మీనృసింహా 
63 శ్రీసుదర్శన చక్రరాజ శతకము వైద్యం వేంకటేశ్వరాచార్యులు 2011 సచ్చరిత్ర సుదర్శన చక్రరాజ 
64 శ్రీసుదర్శన చక్రరాజ శతకము వైద్యం వేంకటేశ్వరాచార్యులు 2011 సుదర్శన చక్రరాజమా
65 శ్రీ చెన్నరాయ శతకము వైద్యం వేంకటేశ్వరాచార్యులు 2011 చెన్నరాయా
66 శ్రీయతిరాజ శతకము వైద్యం వేంకటేశ్వరాచార్యులు 2011 యతిరాజా
67 తెలుగుభాష శతకము వైద్యం వేంకటేశ్వరాచార్యులు 2011 తెలుగుభాష
68 శ్రీకపిలవాయి లింగమూర్తి శతకము వైద్యం వేంకటేశ్వరచార్యులు 2011 రంగదమలకీర్తి లింగమూర్తి
69 ఉన్నామాట  వైద్యం వేంకటేశ్వరాచార్యులు 2011,ఉన్నమాట  వైద్యమన్నామాట
70 శ్రీ వేంకటేశ శతకము వైద్యం వేంకటేశ్వరాచార్యులు 2011 చారుదరహాస కురుమూర్తి శైలవాస విగతభవపాశ లక్ష్మీశ వేంకటేశ
71 మాతృస్తుతి శతకము అల్లం జగపతిబాబు 2010 వరవరాజగపతి వినర
72 ఆత్మభోదామృత శతకము అల్లం జగపతిబాబు 2010 వరవరాజగపతి వినర
73 శ్రీశాయి త్రిశతి మడిపల్లి భద్రయ్య 1988 శరణు శిరిడీశాయి  శరణు శరణు
74 మూకాపంచశతి వారణాసివేంకటేశ్వర్లు (తాత్పర్యకర్త) 2012 "1. ఆర్య శతకము. 2. పాదారవింద శతకము, 3. స్తుతి శతకము 4. కటాక్ష శతకం 5. మందస్మిత శతకము"
75 శ్రీ స్తవరాజపంచశతి వానమామలై వరదాచార్యులు 2007 "1. శ్రీవేంకటేశ్వర స్తవరాజము – వేంకటేశ్వరా, 2. శ్రీరామ స్తవరాజము – రాగవా, 3. శ్రీనృసింహ స్తవరాజము – నృకేసరి హరీ శ్రీహరీ, 4. శ్రీరంగ స్తవరాజము – రంగరాట్/ రంగాడ్యరా/ రంగనాయకా"
76 జానకీనాయక శతకము పోలూరి సత్యనారాయణ 2010 రఘురామా జానకీ నాయకా 
77 శ్రీ వీరరాఘవ శతకము సుదర్శనం శ్రీపట్నం వీరరాఘవరావు 1996 వీరరాఘవా
78 శ్రీ వీరరాఘవ శతకము పాంచజన్యం శ్రీపట్నం వీరరాఘవరావు వీరరాఘవా
79 రామప్రభు శతకము అష్టకాల నరసింహరామశర్మ 1994,రామప్రభూ 
80 శ్రీకోదండరామ శతకము వంగనూరు సుంకర చిన్నవేంకటస్వామి 2005 కొండుపల్లి కోదండ ధరా 
81 కోదండరామ శతకము శ్రీలక్ష్మీకాంతానంద స్వామి రామశ్రీరామ కోదండరామచంద్ర
82 భద్రాద్రిరామ శతకము పరశురామ నరసింహదాసు రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్యకామ కరుణాలలామ లోకాభిరామ
83 పరశురామ సీతారామ శతకము పరశురామ నరసింహదాసు పరశురామ సీతారామా
84 జానకీరామ భద్రగిరీశ్వరా శతకము డా. కావూరి పాపయ్యశాస్త్రి 2010 జానకీరామ భద్రగిరీశ్వరా,
85 శ్రీవేలమూరిపుర సీతారామచంద్రప్రభు శతకము ఇలపావులూరి సుబ్బారావు 2009 వేలమూరిపుర సీతారామచంద్రప్రభూ
86 శ్రీరామచంద్ర శతకము రేవల్లి రామయ్య 1982 రమ్యగుణసాంద్ర సౌమ్య శ్రీరామచంద్ర
87 శ్రీ ప్రసన్నరామాయణ శతకము మూగలూరి భవానివెంకటరమణ 2007 మాకుప్రసన్నుడయ్యెడున్
88 పద్మనాభ శతకము గాడేపల్లి సుబ్బమ్మ 2005 పద్మనిలయనాభ పద్మనాభ
89 తాట్లవాయి శ్రీరామ శతకము సముద్రాల వేణుగోపాలాచార్య 2010 వడిగమము బ్రోవర తాట్లవాయిరామ
90 అచ్చతెనుగు రామాయణ రాగవ శతకము తత్త్వాది కృష్ణశర్మ 2013 రాగవా
91 శ్రీ సూర్య శతకము ఎం. ఆదినారాయణ శాస్త్రి 1984 మకుటం లేదు
92 శ్రీ సూర్యనారాయణ శతకము డా. వీరాసూర్యనారాయణ 2010 సూర్యనారాయణా
93 ఆదిత్య శతకము దేవులపల్లి చెంచుసుబ్బయ్య మకుటం లేదు
94 సూర్య శతకము సూర్యనారాయణ కవి 2005 ఆర్యజనజీవ టెక్కలిసూర్యదేవ
95 సూర్యరాయసూక్తి సుమమాల సూర్యనారాయణ కవి 2005 సుకవిజన విధేయ సూర్యరాయ
96 కృష్ణమధవ శతకము జింకా నారాయణస్వామి 2007 కృష్ణ మాధవా
97 శ్రీ వలపర్లి వేణుగోపాల శతకము నిశాపతి 1994 లీలావలపర్లి  వేణుగోపాలబాల
98 భక్త రక్షామణి శతకము గాదె లక్ష్మీపతి భక్త రక్షామణి
99 ఆపదుద్ధారక శతకము బాపట్ల హనుమంతరావు రామా ఆపదుద్ధారకా
100 శ్రీ పాండురంగ శతకము బి. సుబ్రహ్మణ్య శాస్త్రి 2008 భక్త హృత్పద్మభృంగ శ్రీపాండురంగా