Sunday, June 1, 2014

కాళహస్తిశతకము - బాణాలవవీరశరభయ్య

కాళహస్తిశతకము
                                                బాణాలవవీరశరభయ్య

1. ఉ. శ్రీజలధౌతహైమవతి చిత్తసుధారసపానదంష్ట్రయు
గ్రాజగవంధసుర్జ్వరహరాననహాస ధరాధరార్చితా
రాజకిరీట పంచముఖ రంజితశుభ్రశరీరబంధురాం
భోజభవానుతాంఘ్రి ఫణిభూషణ చంద్రహుతాశనార్కగో
రాజిత కాళహస్తి మణిగోపుర సాంబశివా మహాప్రభో

2. ఉ. మూలము విశ్వకర్మకులభూషణ భద్రయపుత్త్రరత్న బా
ణాలవవంశదీపక సనాతనగోత్ర ప్రశస్తభూప్రతీ
పాలకుఁడైన వీరశరభేంద్రకవీంద్రుఁడు నిత్యకోటిలిం
గాలను బూజచేసి శతకంబురచించె గ్రహించవయ్య నా
పాలిటి కాళహస్తి పరమాత్ముఁడ సాంబశివా మహాప్రభో

3. చ. వరపురికాళహస్తివిభవంబులు చూడనికన్ను లేల సు
స్థిరముగ మిమ్ము నాత్మలో వచింపనిపాపపు జిహ్వయేల యో
పురహర మిమ్ము పువ్వులను బూజలు సేయనిచేతు లేల స
ద్గురుకరుణాకటాక్షములు గోరని మానవజన్మమేల యీ
ధరణిని కాళహస్తి మహరుద్రుఁడ సాంబశివా మహాప్రభో

4. దక్షిణకాశి గంగ యరుదైన సువర్ణముఖీమహానదిన్
ఇక్షుసుధారసాబ్ధి యని యక్షులుతుంబురునారదాదులున్
దక్షులె యైరి సిద్ధులు కృతార్థులు నైన మహాస్థలంబు పం
చాక్షరిమంత్రపూరితరసామృతపాత్రులదివ్యక్షేత్ర మో
దక్షిణకాళహస్తి ధరణీశ్వర సాంబశివా మహాప్రభో

5. ఉ. దక్షిణకాశిముఖ్యనది దక్షిణస్వర్గము పుణ్యక్షేత్రమై
మోక్షము లేనిదీనులకు మోక్షములిచ్చి తరింపఁజేయ నీ
దక్షిణకాశి కేవలము దగ్గఱనున్నది కంటిమయ్య ప్ర
త్యక్షము దేవలోకమని యేర్పడ నేఁటికి మళ్ళి పుట్టె ఫా
లాక్షుఁడ కాళహస్తి పరమాత్ముఁడ సాంబశివా మహాప్రభో

6. ఉ. భూమిని నీసువర్ణముఖి పుట్టెను రెండవవారణాశియై
పామరబద్ధపాశభవపాపవిమోచన పుణ్యక్షేత్రమై
క్షేమము నిచ్చుకర్మములఁ జెంది యవస్థలఁ గొట్టి వేగ మీ
నామసుధారసామృతము నమ్మితి మమ్ములఁ బ్రోవవయ్య నీ
ప్రేమను కాళహస్తి మహారుద్రుఁడ సాంబశివా మహాప్రభో

7. చ. పురహరకుంజరాననసుపుత్ర పవిత్రపితామహార్చితా
వరద పరంపరాత్పర దివాకరసన్నిభ నాగకుండలా
భరణ శశాంకబింబ కళభాసితవిభ్రమమేరుతారకా
పురజితభస్మ లేపనవసుందరసన్నుత నీవెగాక స
ద్గురుఁడవు కాళహస్తి పరమేశ్వర సాంబశివా మహాప్రభో

8. చ. ధరధర మేరుచాప ప్రమధాధిప రుద్ర యువేంద్రతాడనా
గరళగళ త్రినేత్ర ఫణికంకణ శంభుకృశానురేత యో
హరహర శూలపాణి హరిహంస తురంగమ మౌళిరత్న ని
ర్జరనుత మూలబ్రహ్మ దనిజాంతక శాంభవిచిత్తచోర శ్రీ
పురహర కాళహస్తి త్రిపురాంతక సాంబశివా మహాప్రభో

9. చ. కలఁగని మేలుకొన్నగతి గౌరవమాయప్రపంచకంబులోఁ
గలిసి సమస్తభాగ్యములు గల్గిన నేమిఫలంబు సంపదల్
నిలువవు దేహమోహములు నీరుమలంబులు మష్టుగుంటలో
మొలచిన నీరుబుగ్గ యిది మోసముజేయును నమ్మరాదు ని
శ్చలముగ కాళహస్తి నిటలాక్షుఁడ సాంబశివా మహాప్రభో

10. ఉ. కాసిపురీశగర్భనవఖండధరిత్రిపతిత్వ మబ్బునా
యాశకు మట్టు లేదు కనకాద్రిసమానధనంబు గల్గినన్
లేశము వెంటరాదు మది కింపుగఁ జేసిన పుణ్యముల్
ద్రీసినఁబోదు నీకరుణతోయజము ల్వికసించినంతటన్
బాసును కాళహస్తి కఱకంఠుఁడ సాంబశివా మహాప్రభో

11. ఉ. నిల్వవు యెట్టికాయములు నిల్వవు గోవులు మాయసంపద
ల్నివవు భోగభాగ్యములు నిల్వవు సొమ్ములు నిండ్లు మేడలున్
నిల్వవు ఊహపోషణలు నిల్వవు కష్టసుఖాలు నంశలున్
నిల్వవు మోహపాశములు నిల్వవు వాంఛలు పాఁడిపంటలున్
నిల్వవు కాళహస్తి నిటలాక్షుఁడ సాంబశివా మహాప్రభో

12. ఉ. తావక పుత్రదారతలిదండ్రులు నన్నలు తమ్ములు న్జెలుల్
బావలు చుట్టము ల్సఖులు బంధువు లెవ్వరు వెంటరారు యీ
జీవముకాస్తపోతే మఱిచేరరు దగ్గఱ నెంతప్రాణసం
జీవప్రియాప్తులైన హరిషించరు శీఘ్రము పట్టుమందు రో
దేవుఁడ కాళహస్తి జగదీశ్వర సాంబశివా మహాప్రభో

13. ఉ. ప్రాణికిబొంది కేమి ప్రతిబాధ్యత యెప్పుడొ యేక్షణాననో
ప్రాణము భంగపెట్టి సుతపత్ని పితామహు దుఃఖపెట్టి నా
ప్రాణము తల్లడిస్తు తనబాటనె యెక్కడ నేస్థళాననో
ప్రాణము వెళ్ళిపోతె తనబాధ్యత లంతటదీఱిపోవు నా
ప్రాణికి కాళహస్తి పరమాత్ముఁడ సాంబశివా మహాప్రభో

14. ఉ. ప్రాణము లుండఁగానె నినుఁ బ్రార్ధనచేసి నటించరాదు నీ
ప్రాణము లెంతమట్టుకు నిబంధనయున్నదొ యంతమట్టుకే
ప్రాణము నిల్వదాకడను బాధ్యత దీఱితె దాని కేల నీ
ప్రాణము కాళహస్తి పరమాత్ముఁడ సాంబశివా మహాప్రభో

15. ఉ. ప్రాణము బొందిలోనిలిచి పాపము పుణ్యము రెండు జేసి యా
ప్రానము లేచిపోయి యమబాధలఁజేందితె బొందిపోయి యీ
ప్రాణిసహాయమౌ నవల బంధఋణాదులు దీఱునంతయా
ప్రాణము లేచిరాదు ఉపకారమె యొక్కటివచ్చుఁదోడుగాఁ
బ్రాణికిఁ గాళహస్తి పరమాత్ముఁడ సాంబశివా మహాప్రభో

16. ఉ. ఎట్టుఘటంబు లుండినది యెందుకు నెక్కడ నేస్థళాననో
ఔట్టినచీటనో బ్రతుకఁబోయినచోటనొ యున్నచోటనో
గుట్టనొత్రోవనో గుహనొ గుంటనొ చావు నిజంబు బొందికిన్
గట్టిగ కాళహస్తి గణనాయక సాంబశివా మహాప్రభో

17. ఉ. పుట్టుక యేడనో సకలభూములఁ ద్రొక్కి చరించు టేడనో
పట్టణమేడనో యుదకపానము యేడనొ మట్టి యేడనో
గిట్టడ మేడనో మఱి సుఖించుట యేడనొ యుండుటేడనో
గట్టిగ నీవెఱుంగుదువుగాక యితర్లకుఁజెంది చిక్కునా
వట్టిది కాళహస్తిపతి రుద్రుఁడ సాంబశివా మహాప్రభో

18. ఉ. ఎన్నిమహాస్థలంబు లని యెక్కడ చూడను చూతునే భవ
ద్ధ్యానము సేయ కెన్నఁటికి దైవము నెక్కడ తాను వేదసం
పన్నగుణ్ఢ్యుఁడై తనతపస్సు ఫలిచితె ఉన్నచోటనె
యున్నది మోహనామృతము ఊఱకెభూమిఁజరుంపఁగానె యే
మున్నది కాళహస్తి మునివందిత సాంబశివా మహాప్రభో

19. ఉ. పేరుకు నన్నియాత్రలుఫలించెననంగను పుణ్యుఁడాయెనా
కారముమానెనా సకలకర్మనివారణ సిద్ధుఁడాయెనా
ఊఱకె పోయిరావడము ఒక్కటె యెందుసమస్తయాత్రలున్
దీఱిన దీఱకున్న గురుతీర్థప్రసాదధురీణుఁ డాయెనా
శూరుఁడ కాళహస్తి శివశోభన సాంబశివా మహాప్రభో

20. ఉ. ఇత్తడి హేమమౌనె యది యెన్నిపుటంబులువేసి చూచినన్
ఇత్తడియిత్తడేను నిధి యెక్కువసొమ్ముకు నష్టిచేటు నా
యిత్తడి పైఁడియౌనె యిది యన్యమెఱుంగక రిత్తవేల్పులన్
సత్తుగఁ బూజచేసినను సద్గురుపాదము నమ్మకుండినా
ఉత్తిది కాళహస్తి వృషభేశ్వర సాంబశివా మహాప్రభో

21. ఉ. జీవుఁడు జీవుఁ డంచును భజించిన నాత్మకు నాత్మ దేవుఁడే
జీవుఁడు జీవుఁడే గురుఁడు జీవుఁడు దేవుఁడు నీవదేవ నీ
త్రోవను నీవు పోతె పెడత్రోవకు బొందికి యాత్ర గల్గు ని
ర్జీవి ఘటంబు శీఘ్రముగఁ జేరువగాఁ బది రుద్రభూమికిన్
జీవము కాళహస్తి గిరిజాపతి సాంబశివా మహాప్రభో

22. ఉ. జీవుఁడు వచ్చిపోవుక్రియ చిక్కఁగ నీయక చచ్చి పుట్ట నీ
లాగున నిట్టిజన్మములు లక్షలు కోట్లన విందు నందు నా
దేవుఁడ యేమిసార్థకము మానసమందున నిన్ను నమ్మినన్
కేవలమున్ను మోక్షపురి కెత్తుకపోయి తరింపఁజేతువో
ధీరుఁడ కాళహస్తి జగదీశ్వర సాంబశివా మహాప్రభో

23. ఉ. ఏమిఘటంబు ఏమిబ్రతు కేమిశరీరము ఏమిదేహమున్
ఏమిసుఖంబు ఏమి యిది యెన్నఁటికైనను చావు సిద్ధ మీ
భూమిని యిట్టిజన్మములు పుట్టిన గిట్టిన మోక్ష మేమి నా
స్వామికధాసుధామృతరసజ్ఞతఁ జెందిన ముక్తిగల్గు నే
దీనుఁడ కాళహస్తి జగదీశ్వర సాంబశివా మహాప్రభో

24. ఉ. ఎక్కడి చుట్టపక్కములు నెక్కడిపుత్రులు తల్లుదండ్రులున్
ఎక్కడిసంతపట్టునది యెక్కడనైన ఫలించి యుండెనా
ఎక్కడ దేశదేశములు నందజము ల్జత ప్రొద్దుగ్రుంకితే
ఎక్కడిపక్షులక్కడనె యెవ్వరిబాటలు వారివారికే
నిక్కము కాళహస్తి నిటలాక్షుఁడ సాంబశివా మహాప్రభో

25. చ. పులివలె యీఘటంబు పడిపోయినపిమ్మట గాలి గాలిలో
పలను ఋణానుబంధప్రతిబాధ్యతనున్న కళేబరంబులో
నిలుచునటన్న స్వగృహము నీడను బాసితె ఆఁకటింటిలో
నిలిచినహంసకైన కని నీవు యెఱుంగనిమాయయున్నదా
వెలుపల కాళహస్తి యతివందిత సాంబశివా మహాప్రభో

26. చ. మనుజులలోను గర్భకసుమాలపు ఘొక్కలయందు మళ్ళి హా
ననుఁబడఁ ద్రోయవద్దు యొకనాఁటికినైన మహాత్మ యీపున
ర్జననము చాలు సద్గతికిఁ జేర్చర యీశ్వర యేదివేళ నే
నిను నెడఁబాయకుందు ధరణీశ్వర యంచును మ్రొక్కుచుంటి నా
మనసున కాళహస్తి మహారుద్రుఁడ సాంబశివా మహాప్రభో

27. ఉ. ముట్టునఁ బుట్టి రక్తమలమూత్రములందున దోషకారినై
పుట్టిన యెన్నిజన్మములు భూమిని మళ్ళి యనేకచోట్ల నే
బుట్టితె నేమి కద్దు నరపుట్టుక నాకిఁక వద్దు నన్ను నీ
పట్టున నిల్పి మోక్షక్రియ మార్గము జూపి తరింపనీయరా
గట్టిగ కాళహస్తి గణనాయక సాంబశివా మహాప్రభో

28. చ. పిడికిట పుష్యరాగమణిఁ బెట్టుక వ్యర్థులు రాళ్ళ కోసమై
యడవిఁ జరింప నేల మిము నాత్మ నెఱుంగక సంతజోగులై
పుడమి చరింపనేల శివపూజాక్రమంబులు మాన నేల నా
కడపట పొర్లనేల నుదకంబులు లేక నశించనేల యా
గడములు కాళహస్తి యజవందిత సాంబశివా మహాప్రభో

29. ఉ. కాశికిఁ బోవనేల నుదకంబులు మోసుకరా వదేల నా
కాశి మహాప్రవాహజలకాలువలై ప్రవహించుతోయ మా
కాశిజలంబు గాదె శివకాశి భవుండవు నీవెకావె యా
కాశికిఁబోవ నా సకలకర్మజముల్ బెడఁబాసి పోనె భూ
తేశుఁడ కాళహస్తి భువనేశ్వర సాంబశివా మహాప్రభో

30. ఉ. బట్టలు పిండి కట్టుకొని భక్తిగ సంధ్యల నెంతవార్చినన్
బట్టెఁడు చేతిలోన నొకభక్తునికైన సతతభిక్షముల్
పెట్టక ముక్తిలేదు మునుపేమియునైనను పెట్టి పుట్టితే
పుట్టికి నూరుపుట్లు శివపూజలు నూటికి కోటివేలు నీ
దిట్టము కాళహస్తి భువనేశ్వర సాంబశివా మహాప్రభో

31. చ. తెలివిగనున్నవాఁడె యుపదేశముఁబొంది శివాశివా యనున్
పలుకులు సంగ్రహించుకొని భావమునందున ముక్తికాంతతోఁ
గలసి సుఖింపలేక నరకంబునఁ బాపపుకల్మశంబులో
బలిమిగ దూఱిపోయి యమబాధల కోపిరి కష్టజీవులై
సలలిత కాళహస్తి బుధశంకర సాంబశివా మహాప్రభో

32. ఉ. హా పరమాత్మ యంచు చతురక్షరిప్రాణప్రతిష్ఠ మంత్ర ని
క్షేపము మాకు కావలయుఁ గేవలమున్న సదాశివయనే
యాపదబాంధవుండ త్రిపురాంతక రుద్రునినామకీర్తనల్
పాపవిమోచనంబు లని ప్రార్థనజేసెద పాదపద్మముల్
జూపుమి కాళహస్తి సురసేవిత సాంబశివా మహాప్రభో

33. ఉ. కాయఁగ రావణాసురునికన్న ధనాఢ్యులు లేరు భూమిలో
మాయలయందు సర్వఘనమంత్రములందును ధైర్యమందునున్
బ్రాయమునందునున్ బలపరాక్రమమందును  భక్తియందునున్
గాయము నందు గా తుదకు కాలము జెల్లిన యంతనే హతుం
డాయెను కాళహస్తి యమరార్చిత సాంబశివా మహాప్రభో

34. ఉ. నీమము బట్టి రావణుఁడు నిత్యము భోజనకాలమందు హా
కోమలి సన్నుతాంఘ్రి నవకోటికి నర్థుల పూజచేసి ర
క్షామణి యేమి మోక్షసిరి సంపదనొంది తరించు పైఁగ శ్రీ
రాములచేతఁ జచ్చె ద్రిపురాంతక చూడుమి భక్తిలేకనా?
భూమిని కాళహస్తి భువనేశ్వర సాంబశివా మహాప్రభో

35. చ. జలధర లోకరక్షకుఁడు సర్వము రుద్రమయం జగత్తుగాఁ
బలికిన వేదశాస్త్రములు బాగఁ జెలంగె మదాంధులై దురా
త్ములు పతనంబుచేత శివదూషణ చేసి యనేకYఏండ్లు బా
ధలఁబడి నోరుపుచ్చి సిరి దప్పి యఘోరపుదుఃఖజీవులై
నిలచిరి కాళహస్తి నిటలాక్షుఁడ సాంబశివా మహాప్రభో

36.జలధర నీవు మాకు సిరిసంపద లిచ్చిన మేలువార్తగా
కలగని మేలుకొన్న యటు గాక మహేశ్వర యేదివేళ నీ
కొలువున నుండి యన్యులను గోరి వచింపను నోరురాదయా
వలితఫణీంద్రనారిబిటలాక్ష సదాశివ శంభుమూర్తికే
వలమును కాళహస్తి కఱకంఠుఁడ సాంబశివా మహాప్రభో

37. ఉ. హీనులె ఎన్నివిద్యలు గ్రహించిన యప్పటిపొట్టకూటికే
కాని తరింపు గాదె! యధికారమునందును ముక్తి యున్నదే
వీనికి ముక్తికాంతస్థలమెక్కడిదో యుని కేడనో మహా
జ్ఞానచరాచరంబులు మాహాత్ముఁడ ని న్మది చాల నెప్పుడున్
గానరు కాళహస్తి కఱకంఠుఁడ సాంబశివా మహాప్రభో

38. ఉ. హీనపుజాతిదుర్గుణుని కెన్నివిధంబుల బోధ చేసినన్
వానియసద్గుణంబులు నివారణ మొందునె భోగి వాసుకీ
కూనకు పాలు తేనె దధి గుజ్జురసంబుల నెంత బోసినన్
దానివిషంబు బోనె మృతితప్పునె క్రూరముమానునే కనన్
మానరు కాళహస్తి బుధమాన్యుఁడ సాంబశివా మహాప్రభో

39. ఉ. నిండు సమస్తలోకముల నీలసుకంధర రుద్రమూర్తికిన్
రెండవసాటి వేల్పులిఁక లే రని వాఁకిట ఘంట గట్టి వే
దండము నెక్కి యంతటను దంధణదంధణ భేరి వేసి బ్ర
హ్మాండము దండ నిండుకొని యద్భుతమైన మహాస్వరూపుఁడై
యుండవె కాళహస్తి త్రిదశోన్నత సాంబశివా మహాప్రభో

40. చ. విపులరథంబు హేమగిరి విల్లు నుపేంద్రుఁడు గాండ మర్కఋ
క్షపతులు బండికండ్లు విధిసారథి శేషుఁడు నారి వేదముల్
నృపుఁడు గుఱాలుజెసికొని నృత్యము ద్రొక్కుచు తోలినేర్పుగా
త్రిపురసురారిఁ గూల్చితివి ధీరత నెవ్వరు నీకుమించిరో
కృపగల కాళహస్తి గనకేశుఁడ సాంబశివా మహాప్రభో

41. చ. నరసురవంద్యుఁ డీశ్వరుఁడు నాయకుఁ డొక్కఁడె గాని వేరితః
పరము నెఱుంగ మంధకవిపక్ష యటంచు సహస్త్రశీరుషా
పురుష యటంచు దేవతలు పూజ యొనర్చి తరించినారు నా
తరమె భవత్స్వరూపములత్రాణ యెఱింగి నుతింప నాత్మ సు
స్థిరముగ కాళహస్తి సురసేవిత సాంబశివా మహాప్రభో

42. ఉ. ఒక్కఁడెలోకరక్షకుఁడు ఒక్కఁడె దైవము ఎందుఁజూచినన్
మిక్కుట మైన రూపములు మింటికి మంటికి సూత్రధారుఁడై
తక్కి సమస్తలోకములఁ దాండవ మాడుచునున్నవాఁడు తా
నొక్కఁడెగాక యీశ్వరుఁడు ఒక్కనిమించి యితఃపరుండు ఇం
కెక్కడ కాళహస్తి గిరిజేశ్వర సాంబశివా మహాప్రభో

43. ఉ. తత్తర నన్ను గన్నతలిదండ్రులు ఎత్తుకముద్దులాడి నీ
పొత్తున డించి యీశ్వరుఁడు పోషణజేయునటంచు గట్టిగా
దత్తము జేసినారు గురు దైవము నిద్దఱు నాకు నీవె సా
క్షాత్తునిజస్వరూపమును కన్నులఁజూపుము కాంక్షదీర నన్
రక్షక కాళహస్తి బుధరంజక సాంబశివా మహాప్రభో

44. చ. కొడుకులు లేకలేక యొకకోకిలవాణి సుపుత్రుమాఱుగా
నుడుతనుదెచ్చి పెంచుకొని యుగ్రునిపేరిటఁ బిల్చి రార యో
కొడుకని ముద్దులాడఁగను గొమ్మకు నప్పుడు గర్భచిహ్నలై
కడుపు ఫలించె సంపదలు కన్నులఁ జూపె సమస్తకర్మముల్
విడిచెను కాళహస్తి వృషభేశ్వర సాంబశివా మహాప్రభో

45. చ. స్థిరముగ నీదుదర్శనము జేసిననాఁడె యనేకపాపముల్
పరిహారమాయె కర్మములు పాఱఁదొలంగె దరిద్రదుఃఖముల్
దరికొని కాలసాగె రజతాద్రి కనుంగొనఁ ద్రోవ జిక్కె యో
పరమశివుండ మోక్షమనుపర్వతమెక్కితినయ్య యో హరా
హరహర కాళహస్తి హరివందిత సాంబశివా మహాప్రభో

46. చ. పొదలెడినాదరిద్రములు పోయెను మిమ్ములఁ జూడఁగ నహా
కుదిరెను మామనస్సు వృషఘోటక భీష్మభవాంధకారముల్
వదలెను నేఁటితోను మనవాంచను వచ్చిన కాలకింకరుల్
ఒదిగిరి మూలమూల నిఁక నూఱక శంభునినామ కీర్తనల్
చదివెద కాళహస్తి త్రిపురాంతక సాంబశివా మహాప్రభో

47. చ. కమలపుబాళికిన్ హరికి గట్టిగ స్నేహమటంచునందు రా
కమలము లేడనైన నుదకంబులు లేని స్థలంబునందునా
కమలసఖోగ్రతిగ్మఖరకాంతులకు న్మరితాళరాదె యా
కమలము వాడిపోక నుదకంబులు బాసిన చావదా భవ
త్కమలము కాళహస్తి కఱకంఠుఁడ సాంబశివా మహాప్రభో

48. ఉ. ముప్పునఁ గాలకింకరులు ముంగిట జేరుక కాలపాశముల్
తెప్పున గట్టి ప్రాణములు తీసెడువేళల మాయచీకటిన్
గప్పిననాఁడు మీస్మరణకల్గునొ కల్గదొ యందు కిప్పుడే
తప్పక చేతు మీస్మరణ త్య్రంబక నేను తరించుకోసమై
యప్పని కాళహస్తి నిటలాక్షుఁడ సాంబశివా మహాప్రభో

49. చ. నెరయ దరిద్రదోషమున నిత్యము జానెఁడుపొట్ట కోసమై
నరులనుతించి మానుషము దప్పి యసత్యములాడలేక నీ
మఱుఁగునఁ జేరి రిక్తులము మమ్మును బ్రోవు మటంచు మ్రొక్కినన్
గఱుఁగదు నీమనంబు శితకంధర యింతపరాకదేల రా
యెఱిఁగియు కాళహస్తి వృషభేశ్వర సాంబశివా మహాప్రభో

50. ఉ. నెత్తిన గంగ యుండ శిఖినేత్రమునం దనిలుండునుండ నీ
యెత్తున ధాన్యముండ మఱియెత్తుగఁ జేతను పాత్రయుండ నీ
పొత్తునఁగూడువండుకొనిచోద్యముగా భుజింపరాదె యీ
పిత్తమదేమి జోగివలె భిక్షకుఁ బోవఁగనేమి వట్టిదే
దిట్టవు కాళహస్తినుత దిక్పతి సాంబశివా మహాప్రభో

51. ఉ. తాండవలింగ నీమతి వితందము లేమొ యనాథలోభిపా
షాండుల కీవు భాగ్యయుత సంపదలిత్తువు సత్యసద్గుణో
ద్దండనిధానమంత్రజపతత్వప్రసంగతపఃప్రభూతస
త్పండితు లైనవారికి విపత్తుల నిత్తు వదేమి వారి కా
దందన కాళహస్తి పురధారణ సాంబశివా మహాప్రభో

52. ఉ. బారుగ నాటలాడి శివభక్తులతో సరియైననీకు శృం
గారము లేల దారువనకాంతలు నేల భవాని యేల భా
గీరథి యేల సర్పభుజకీర్తులు నేల ధరించుకొన్న దే
వేరులయొక్క ముద్దుమురిపెంబుల నెవ్వరు జూడనయ్య మీ
వారిలొ కాళహస్తి సురవందిత సాంబశివా మహాప్రభో

53. ఉ. పన్నగభూష నీవు చెయి బట్టిన చాపము పైఁడికొండ నీ
వున్నది వెండికొండ తలనున్నదియంత హిరణ్యనీరు నీ
కన్న ధనాఢ్యు లేరి జగమందున యేబగ నెంచి చూచినన్
దిన్నగ భిక్షమెత్తుకొన దీనుఁడవా దరులేనివాఁడవా
యెన్నఁగఁ గాళహస్తి వృషభేశ్వర సాంబశివా మహాప్రభో

54. ఉ. ప్రేమతో నీవుగన్నయొకబిడ్డఁడు గుజ్జయి కూటికేడ్చెనా
వామప్రియాత్మజుం డన వివాహము లేక తపించుచుండ నీ
ధూమసుతుండు పైకినొకదుప్పటి యిమ్మని యంగలార్చె నీ
కేమిపరాకొ పుత్రులకు నివ్వనివాఁడవు మాకు నిత్తువే
భూమిని కాళహస్తి ఫణిభూషణ సాంబశివా మహాప్రభో

55. ఉ. భీమ మహేశ్వరా పిలువ పేరును నీవె ధరించుకొందు నీ
భామకు రాగిసొమ్ముల నపారముగా ధరియించినావు చి
న్నామెకు జీరె యివ్వక ననాథనుగా నొగిఁ జేసినావు నీ
కేమి దరిద్రమొందె యపకీర్తి యెఱుంగక చేసి యట్టు లీ
భూమిని కాళహస్తి సురపూజిత సాంబశివా మహాప్రభో

56. చ. కరివరదా<ఘ్రిజా నగహితాత్మజ దారువనాంగనామణీ
తరుణులఁ బాసి యుగ్రజపతర్పణహోమము నిల్పి ప్రోదినా
హార్యము మించి యీడిగెవధూమణితోఁజని కల్లుకుండలోఁ
జొరఁబడి యూపిరాడక యుసూరని నీవె తపించి తంతగా
విరహమటయ్య కంచిపృథివీశ్వరా సాంబశివా మహాప్రభో

57. ఉ. పండితసన్నుతాంఘ్రి యొకభక్తుఁడు పుత్రునిఁ జంపి కూరగా
వండి భుజింపఁజేసె మఱియొక్క మహాత్ముఁడు నీకు భృత్యుఁడై
యుండికళత్రమిచ్చె ననువారఁగ జూచి మఱొక్కభక్తుఁడున్
మెండుగ ఱాళ్ళురువ్వె పరమేశ్వర భక్తులజాడ యెంతయు
ద్దండమొ కాళహస్తి యతివందిత సాంబశివా మహాప్రభో

58. ఉ. భాసురపంచవక్త్ర యొకభక్తుఁడు యెంగిలిపండ్లు గిన్నెలోఁ
దీసుకవచ్చి పెట్టినను దగ్గున లేచి భుజించి మెచ్చి కై
లాసము నిచ్చినావు కఱకంఠుఁడ నీభ్రమ యేమిచెప్ప నో
వాసవపూజితాంఘ్రి మునివందిత మమ్ములఁ బ్రోవుమయ్య నీ
దాసుఁడ కాళహస్తి నిటలాక్షుఁడ సాంబశివా మహాప్రభో

59. ఉ. మానకబోయఁడెన్నఁడు సమస్తమృగములఁ జంపి దొన్నెతో
మాంసము దెచ్చిపెట్టి తినుమంటె భుజిస్తివి ఎగ్గులేక నీ
తాపమదేమొ నీ విఁకను దగ్గఱ రాకుమటంచు పార్వతీ
హింసల నిన్ను బెట్టితే సహిస్తివి యప్పుడు శాంతమూర్తివై
పురహర కాళహస్తి త్రిపురాంతక సాంబశివా మహాప్రభో

60. చ. అతులితకాలకూటవిష మప్పుడు ముప్పదిమూఁడు కోటిదే
వతలు ననేకబాధ పడి వచ్చి భయంబున నోహొ పార్వతీ
పతి యని నీవు దిక్కుయని పక్షులువోలెను తల్లడించుచున్
గతి చెడి వస్తె యందఱిని గాచి విషంబు హరించినావు స
మ్మతముగ కాళహస్తి సురవందిత సాంబశివా మహాప్రభో

61. చ. గరళముమ్రింగికంఠమునఁగప్పి హరించి జయించి మాయఁగా
సురతను నీవు మూర్ఛగొని స్రుక్కెను ఆపదమూఁడుజాములున్
సురమునిభూతదయసిద్ధయతిసూర్యసుధాశు ఉపేంద్రయింద్రగం
ధరువులు భక్తిచేత తమదాపున జేరుక సేవచేయుచున్
తిరిగిరి కాళహస్తి త్రిపురాంతక సాంబశివా మహాప్రభో

62. చ. అరమరలేక నేను శివరాత్రిమహోత్సవకాలమందు జా
గరణము జేసి గొప్పఁగ నఖండము బెట్టుక మేలుకొంటి హా
మరి పదుమూఁడుజాములును మౌనుల మంచును నిద్రహారము
ల్మఱచి తదేకధ్యానము మర్వక మిమ్ము భజింపఁజేయు మీ
తిరుగిరి కాళహస్తి త్రిపురాంతక సాంబశివా మహాప్రభో

63. ఉ. దుర్గుణయాగశిక్ష సురధూర్జటి దుంధుభిదుందుభీసుతా
భర్గ భవాభవాంతక ప్రభాకర వర్ణ యపర్ణ పార్వతీ
దుర్గమృడానిచండిక వధూమణి మానస పద్మబంభరా
భార్గవశిష్యవర్గ సురవందిత సాంబశివా మహాప్రభో

64. ఉ. వాదుకుబోకమాకు భగవంతుఁడెదిక్కుగదా యటంచుమీ
పాదము నమ్ముకున శివభక్తుల కేమి వ్రతంబులంచు నే
కాదశులంచు నోరువడి గట్టుక యుండి నశించనేల యీ
బాధలవేల వట్టి యుదకంబులు పిండి భుజింపనేల నా
వేదన కాళహస్తి నిటలాక్షుఁడ సాంబశివా మహాప్రభో

65. ఉ. నీవె సమస్తరూప ధరణీశ్వరమండలజ్యోతిరూపమున్
నీవె జగత్గురు ప్రముఖ నిత్యమహోత్సవశక్తిరూపమున్
నీవె పరంపరాత్ప్రముఖ నిగ్రహవిగ్రహమంత్రరూపమున్
నీవె జయంజయాసుగుణ నిర్గవిచారమహాస్వరూపమున్
నీవెగ కాళహస్తి నిటలాక్షుఁడ సాంబశివా మహాప్రభో

66. ఉ. నంది తురంగ సుందరపినాకప్రియాంబక స్పష్టసారధీ
నందసుతాగ్ని భక్తశరణాగతపోష నమశ్శివాయ యో
సుందరమూర్తి ఖండపరశూ రజతాద్రిపతీ ధనంజయా
వందిత నాగభూషణ భవానికళత్ర సుభక్తిసంగమా
నందము కాళహస్తి యజవందిత సాంబశివా మహాప్రభో

67. ఉ. దేవ మహానుభావ జగదీశ్వర ధూర్జటి యీశ్వరా మహా
దేవ హరా మృడానిజప దేవత భర్గఫణీంద్రహార హా
రావళి నీలలోహిత పురాజిత బ్రహ్మకపాలహస్త యో
పావనమూర్తి సద్గురుఁడ పాలిత మౌనిసురేంద్ర మోక్షబృం
దావన కాళహస్తి భువనేశ్వర సాంబశివా మహాప్రభో

68. ఉ. అంగజవైరి భక్తహృదయాంబుజభృంగ కురంగపాణి శు
భ్రాంగ శుభాంగ లింగ భవభంగ ప్రసంగదయాంతరంగ మా
తంగభుజంగపుంగ వసితాంగలతాంగవముక్తికామభ
స్మాంగ విభూషితాంగ వృషసంగ కృపాతిమిరాంగ భంగస
ర్వాంగమ కాళహస్తి వృషభేశ్వర సాంబశివా మహాప్రభో

69. ఉ. భూతపతీ కపాలభృతు భావృతవక్షసరోరుహంఘ్రిసం
భూతనుతాగ్నికేశ శివపూజామహాత్మ్యము భక్తవత్సలా
మాతపితాసహోదరులు మాకిఁక నెవ్వరు మీకు మించ నో
శ్వేతకళత్రపూర్ణశశిశేఖర యిక్కడ మాకు నీవె సం
ఘాతము కాళహస్తి వృషభేశ్వర సాంబశివా మహాప్రభో

70. చ. పరశివ యాదిబ్రహ్మ వృషభధ్వజ మద్గురు షణ్ముఖాపితా
సురగురువ్యోమ కేశ వరసుందర యీశ్వర యప్రమేయ యో
కరుచరదాసుతాంఘ్రి శితికంఠ గిరీశ మహేశ్వరా జరా
సురహర ఖడ్గపాణి జయశూలి భవాని శివా పితామహా
పురహర కాళహస్తి త్రిపురాంతక సాంబశివా మహాప్రభో

71. చ. పరమరహస్యమంత్ర క్రియాభాసుర పక్వఫలామృతామృతా
ధర రుచిగొన్న భక్తగణదక్ష మహాత్ములపాదధూళి నా
శిరమునఁ జేరి యెన్నటికి సిద్ధుల మౌమొగాక నేను నీ
మఱుఁగునఁ జేరినాను అభిమానము నించి తరింపఁజేయవే
గుఱుతుగ కాళహస్తి గిరిజాధిప సాంబశివా మహాప్రభో

72. ఉ. మాతృపితాసుతాంఘ్రి శివమంత్రము నోట పఠించకున్నయా
నోరు వృధానిరర్థకము నోరనరాదది పాడుబొంద ఓం
కారమహత్త్వభక్త సిరికాంచన బ్రహ్మకపాలహస్త ఓం
కారవిభూతిదాయక సుకంధర గంధశరీరదేహకం
ఠీరవ కాళహస్తి కఱకంఠుఁడ సాంబశివా మహాప్రభో

73. ఉ. మానవజన్మ మెత్తిశివమంత్రలసద్గతిముక్తి సత్ర్కియా
హీనుఁడు ఎన్నివిద్యలు గ్రహించిన నేమి ఫలంబు ఈశ్వర
ధ్యానము చేసి మోక్షమును గన్గొన కెప్పుడు సంచరించునే
మానవుఁడైనఁగాని శివమందిరమందు నటించనేర్చు నా
మానవ కాళహస్తి మహారుద్రుఁడ సాంబశివా మహాప్రభో

74. ఉ. వాసవపూజితాంఘ్రిమునివందిత దేవ పరాకు ఈశ్వరా
భాసురకృద్విహాసవిరూపాక్ష మృగాంక మృగాంకశోభితా
వాసుకి యాదిభక్తగణవత్సల చారుత్రిమూర్తి మూలసిం
హాసనజ్యోతిరూప పరహంస విరాడ్గురుదక్షిణాశకై
లాసము కాళహస్తి కఱకంఠుఁడ సాంబశివా మహాప్రభో

75. చ. నెఱ నిను నమ్మి కొల్చునరు నేత్రసరోరుహపూజితాంఘ్రినే
నిరతము మంత్రపుష్పములనేఁ ఱేటనుఁపట నిన్ను చిత్తుగా
గుఱుతుగఁ బూజచేసి యమద్వారము గట్టిగఁ బాడుజేతుగా
బిరుదుశరాయుజూడు వృషభేశ్వర భూరిజటాకలాప యో
పురహర కాలహస్తి త్రిపురాంతక సాంబశివా మహాప్రభో

76. చ. పురహర తొల్లి విష్ణువును చూడవె నేత్రసరోరుహంబుతో
మురియుచుపూజచేసిమది మోక్షములందితరించె నిప్పుడున్
మఱిమఱినోరు క్రొవ్వి శివమంత్రము నోట పఠించకున్న యీ
నరులకు ఏమొకాని వరనందన సత్కళకాంతి లేకనే
జరగిరి కాళహస్తి జగదీశ్వర సాంబశివా మహాప్రభో

77. ఉ. రక్తకళత్ర యీశ్వరుఁడు రాజితనామ గిరీశవైభవా
భక్తులు తొల్లి యిక్కడతరించెద మంచును వచ్చి యాత్మలో
రక్తము చేతనిన్నుఁ గనినప్పుడె సుస్థిరమూలజీవు లై
భక్తి ఫలిణ్చె నింద్రునియుపాస్తిబలంబున ధన్యులైరి నీ
భక్తులు కాళహస్తి భువనేశ్వర సాంబశివా మహాప్రభో

78. ఉ. నీరజటాకలాప పరమేశ్వర నిన్ను నుతింప దేవ బృ
దరకు లైనఁజాలరు యధాస్థితిగా నినుఁగాంచి నిన్నుఁగై
వారము జేసి సద్గురుఁడ వర్ణనేయను నాతరంబె యో
మేరువశార్గ్జపాణి పరమేశ్వర పూరితధర్మసత్య సం
కారణ కాళహస్తి పరమేశ్వర సాంబశివా మహాప్రభో

79. చ. శరణని నిన్ను వేఁడితిని చక్కనితండ్రి పతీతపావనా
బిరుదులు గట్టినావు యట పేరు వహించి తరింపఁజేసి నా
పరమసుఖంబు భక్తులకు పాపిటబొట్టు కిరీటరత్న మీ
పురము సమస్తజీవులకుఁ బుణ్యము లిత్తువటంచు వస్తి మీ
మఱుగుకు కాళహస్తి మహారుద్రుఁడ సాంబశివా మహాప్రభో

80. ఉ. ధాత్రి సమస్తభక్తులు కృతార్థులు నైనమహాస్థలంబు నీ
క్షేత్రమహత్త్వ మేమి యని చెప్పుదు మోక్షనదీగయాకురు
క్షేత్రప్రయాగ దీపఋషిసిద్ధులు పుట్టినజన్మభూమి యీ
క్షేత్రము దివ్యక్షేత్రమనఁ జాలఁ బ్రసిద్ధము నమ్మి యీ మహా
క్షేత్రము కాళహస్తి శితికంఠుఁడ సాంబశివా మహాప్రభో

81. ఉ. గోత్రకళత్రమిత్ర మదగోధ్వజగాత్ర శరీరదానగో
త్పాత ప్రతిష్ఠప్రాణపరిపాలకసద్గుణ దేవరత్న గా
యత్రినుతాంఘ్రిభక్తులకు ఏమి ప్రధానము కేవలం శివ
స్తోత్రము జీవనౌషధము జిహ్వకు కర్మవిమోచనంబు ఈ
క్షేత్రము కాళహస్తి శశిశేఖర సాంబశివా మహాప్రభో

82. ఉ. హా సుర హా గజాసురుని హామికనిల్వ ధరించలేక హా
నీసరిసాటి దేవతలు నిన్ను భజించుచు వచ్చి మూఁతిపై
మీసములేదు మాఁకు బరమేశ్వర మమ్ములఁ బ్రోవవయ్య మీ
దాసుల మంచు మ్రొక్కిమఁబ్రతాపము చాలును మాకు శ్రీగిరి
వాసుఁడ కాళహస్తి మహారుద్రుఁడ  సాంబశివా మహాప్రభో

83. చ. పరమసఖుండ భక్తసుకర వ్రజనుగ్రహజాగ్రతస్థళా
ల్దొఱుకదు యింతకన్నను చతుర్దశలోకములెంచిచూడ నీ
కరుణాకటాక్షవీక్షణము గట్టిగ నుంచుమి నమ్మినాను నీ
చరణము సేవ భక్తులకు సర్వము నీవె మహానుభావ శ్రీ
ధరనుత కాళహస్తి జగదీశ్వర సాంబశివా మహాప్రభో

84. ఉ. మన్మధవైరి మాకు పరమామృతపానము సేయకున్న యా
జన్మమదేల సద్గురునిచెంతను జేరి తదేకనిష్టతో
చిన్మయలింగ మంత్రము ప్రసిద్ధిగ నోట పఠించితే పున
ర్జన్మము లేదు భక్తులకు క్షేమము ఇంద్రునిసన్నిధానమే
జన్మము కాళహస్తి జగదీశ్వర సాంబశివా మహాప్రభో

85. చ. హరహర ఇష్టలింగ సురహాస ముఖాబ్జ నమోనమోపురం
దరనుతకాలకంధర కృతార్థులజేయు మటంచు నాత్మలో
సిరి గలవాసుదేవుని భజింపనిపాపపుదుష్టు లైన యీ
నరులను ఘోరమైనయమదండనఁ బెట్టిరి చూడవయ్య యో
పురహర కాళహస్తి త్రిపురాంతక సాంబశివా మహాప్రభో

86. చ. పుడమిని భక్తి గల్గి శివపూజ సుధామృతపూర్ణ సద్భుధా
ముడివిడఁ గోసి లోపలను మూలవిరాటునిమోక్షకన్యకా
కుడిభుజ మెక్కి తాండవము కుల్కఁగ గని యనేకపాపము
ల్విడుదలగావు కర్మములు వీడవు ఎంతటివారికైన రు
ద్రుఁడ విను కాళహస్తి మహారుద్రుఁడ సాంబశివా మహాప్రభో

87. చ. ఎఱుఁగక చేసి పాపములు ఎంత తపించిన వ్యర్థ బోవునా
వరయమధర్మరాజుపరిపాలన నాఁటికివచ్చు నీ మహా
గరువమదాంధకారమునఁగానక చేసినపుణ్యపాపముల్
తఱుముకవచ్చు వెంటఁబడి తప్పక యెక్కడఁ దాగియున్నవో
పురహర కాళహస్తి త్రిపురాంతక సాంబశివా మహాప్రభో

88. ఉ. ఇక్షుసుధాంఘ్రియీశ్వరుఁడ ఎన్నఁడు మిమ్ములఁజూడ మయ్య ప్ర
త్యక్షము జెసికోవలసి తెప్పున మానసపూజ చేత ఫా
లాక్షుఁడ ముక్తికాంత నుపలాలనజేసి సుఖించితే మహా
మోక్షము గద్దు భక్తులకు మూలము నీవె మహానుభావ శ్రీ
లక్షణ కాళహస్తి మహారుద్రుఁడ సాంబశివా మహాప్రభో

89. ఉ. నిండుదయాబ్ధి మోక్షజిత నిండుఘటాబ్ధిహిరణ్యశైల కో
దండ ధరిత్రిదాత భవదద్భుతనిర్మలయోగపూరితా
తాండవలింగ నాయెదుటఁ దాండవనృత్తవినోదలీల ను
ద్ధండము గుల్కఁ జూడవలెదాత నుతాంఘ్రిముకుందబాంధవా
మండిత కాళహస్తి మహారుద్రుఁడ సాంబశివా మహాప్రభో

90. చ. పురహర శంభుమూర్తి శివపూజమహత్త్వముఁ జూచి యా
త్మలో పరుషముచేత మాయగను నందెలు మువ్వలు నాడఁ జూచి యో
వరగురు ధర్మభిక్షయని వచ్చి నిలంబడి తొల్లి యాత్మలో
సరళిగమెచ్చి భక్తిగఁబ్రసన్నము నై దరిఁ జేర్పరా విరా
ట్పురుషుఁడ కాళహస్తి వృషభేశ్వర సాంబశివా మహాప్రభో

91. ఉ. కాలము దప్పకుండ దశకంధరబంధురవందితత్రిశూ
లాలను బూజచేసి నిటలాక్షుఁడ యేమి భజింతునయ్యయో
మూలవిరాట్టు సద్గుణుఁడ ముద్దులతండ్రి శశాంకమౌళి నా
పాలిటిలింగమూర్తి విరూపాక్షుఁడ దైత్యమదాపహార భూ
పాలక కాళహస్తి మహారుద్రుఁడ సాంబశివా మహాప్రభో

92. ఉ. నిత్యము రుద్రమంత్రజపనిష్ఠఁ దపోబలమోక్షసిద్ధుఁడై
సత్త్వగుణాభిరాము నిను సన్నుతిఁజేయ ననేకకోట్ల బ్ర
హ్మహత్యలు పాఱిపోను మదహస్తముఖోద్భవ యేది వేళ నీ
సౌఖ్యము సర్వమోక్షసిరిసంపద లిచ్చును మాకు మందరా
కృత్యము కాళహస్తి మహారుద్రుఁడ సాంబశివా మహాప్రభో

93. ఉ. ఈశ్వర శంభుమూర్తి జగదీశ్వర కావవె యప్రమేయ కా
మేశ్వర సాంబమూర్తి పరమేశ్వర శాంతదయాబ్ధి దేవ నం
దీశ్వరలింగమూర్తి వసుధేశ్వర భక్తసుధామయార్ధనా
రీశ్వర ననుఁబ్రోవు పరమాత్ముఁడ శంకరయప్రమేయనా
రీశ్వర కాళహస్తి వృషభేశ్వర సాంబశివా మహాప్రభో

94. ఉ. నాయెడఁ బ్రేమ గల్గి శివసుధామృతమంత్ర వేద పా
రాయణ మాకు భోజనము రాజితసద్గుణనిత్యసత్యమే
యాయువు గానధర్మములు నక్షయమైనధనంబు మాకు నా
దాయము రుద్రమూర్తి భవదంఘ్రుల నమ్మితి భక్తజీవనో
పాయము కాళహస్తి పరమాత్ముఁడ సాంబశివా మహాప్రభో

95. ఉ. మంత్రము మంత్ర మందురు సమస్తమునీంద్రులు సప్తకోటి యా
మంత్రము లెల్ల పామరులు మాయజపాలకుఁ జేయునట్టి దీ
తంత్రము గాక భక్తులకుఁ దారక మౌళినామమంత్రమే
మంత్రము గాకయన్నియును మంత్రములంచు జపించవచ్చునా
యంత్రము కాళహస్తి యతివందిత సాంబశివా మహాప్రభో

96. ఉ. నిన్నుఁదలంతు నన్ను గరుణించుమటంచుఁ దలంచి యాత్మలో
నెన్నఁటికైనప్రాప్తమున నీశ్వరరూపముఁ జూడఁ గల్గునో
కన్నులగాంక్ష దీఱఁగఱకంఠుఁడ నామము శబ్ధవాక్యముల్
విన్నఫలంబుగల్గునని వేదము లెప్పుడు నార్భటించుచున్
ఉన్నవి కాళహస్తి వృషభేశ్వర సాంబశివా మహాప్రభో

97. ఉ. మేలుగ నాదమూర్తి పరమేశ్వర నామసుధారసంబు నా
నాలుకమీఁద నెన్నఁటికి నాట్యము గల్గునొ నాఁడు జన్మజ
న్మాల తరించుచుందు నని మానసమందు నితింతు భక్తవా
చాలక మైన రుద్రుని ప్రసంగము నెప్పుడు నోట నూనితే
చాలును కాళహస్తి సకలేశ్వర సాంబశివా మహాప్రభో

98. చ. క్షితినుతపద్మగంధమునిసిద్ధగణమ్ములు జన్మభూమిదే
వతలకు స్వర్గలోకమున నంబుధిరాసులమీఁది మేదినీ
పతులకు పార్శ్వవేది శివభక్తిమహాత్ములనోరఁగల్గ నా
పతులకు గండ్రకత్తెర జంపాతకృతార్థులజ్ఞానబోధ స
న్నుతులకు కాళహస్తి పరమాత్ముఁడ సాంబశివా మహాప్రభో

99. చ. క్షమధర కౌస్తుభామణిసుగంధగజధ్వజపారిభద్రనా
గమునకు రక్షరేకు క్షమ కాంతి శిరోమణి చుక్కబొట్టు వే
దములకుఁ బట్టుకొమ్మ రిపుదానవతస్కరరుద్రభూమి పా
పములకు హోమగుండము శుభస్కరపాత్రులకన్నపూర్ణక్షే
మములకు కాళహస్తి పరమాత్ముఁడ సాంబశివా మహాప్రభో

100.ఉ. ప్రాణము నమ్మరాదు ఇఁక ప్రాపుగ నమ్మి ఘటంబులోన నీ
ప్రాణము లుండఁగానె నిను బ్రార్థనఁజేసి నటింపరాదయా
ప్రాణ మనిత్య మంతరునప్రాణము జూచిన బుద్ధి వెంతనే
ప్రాణము గానరాదు ఉపకారము ఒక్కటి వచ్చుతోఁడుగా
ప్రాణికి కాళహస్తి విరూపాక్షుఁడ సాంబశివా మహాప్రభో

101. ఉ.పాండుకళాధురీణుఁ డెడఁబాయక సర్వజగత్కిరీటివై
డండ డడాండ డాండ డడడాండ యటంచు నుతింతు నిను నే
తాందవమూర్తి సర్వభవతారక బ్రహ్మపిపీలికాది బ్ర
హ్మాండమునిండ నిండుకొని యద్భుతమైనమహాస్వరూపమై
యుండవె కాళహస్తి జగదీశ్వర సాంబశివా మహాప్రభో

102. ఉ. పండితపామరు ల్సకలపాపవిమోచనదండదండనో
ద్దండభవాండమండితపదాండనఖండలమండలాద్రి కో
దండప్రచండపిండభవదండలఖండితకుందపాండురా
పాందవవీరరుద్రపరిమండితభార్గవపాండవాగ్ని రు
ద్రాండజ కాళహస్తి మహారుద్రుఁడ సాంబశివా మహాప్రభో

103. ఉ. కుంభిని సర్వదేవతలు కోరిన నేమిఫలంబు వారికిన్
శంభుఁడె తల్లిదండ్రి గురుశంభుఁడె దిక్కు జగత్తుకెల్ల నా
శంభుఁడె రక్షకర్త యని సంతతమున్ స్మరియింతునే జయ
స్తంబము వేసినాఁటెదను సాహసకార్యపరక్రమక్రమో
జ్జృంభణ కాళహస్తి శశిశేఖర సాంబశివా మహాప్రభో

104. ఉ. వారధిఁ గట్టవచ్చు భగవంతునిఁగన్నులఁజూడవచ్చు వ్యా
పారము సేయవచ్చు బడబాగ్నికణంబుల మ్రింగవచ్చు నౌ
తారము లెత్తవచ్చు యమదండనహింసకుఁ దాళవచ్చు సం
సారమునీఁదరాదు హరిసాక్షిగ నాకొకత్రోవఁజూపవే
ధారుణి కాళహస్తి ధరణీశ్వర సాంబశివా మహాప్రభో

105. చ. అమరగణార్చితా తమకు నాశ్రితు లైనయనేకభక్తులన్
శ్రమలెడఁబాపి ఘల్లున భృశంబుగ గజ్జలమ్రోఁత బుట్టఁగా
భ్రమమున నందివాహనముపైన నిలంబడి భక్తులిండ్లనున్
ధిమిధిమినాట్యమాడుచును దీనులఁబ్రోవవెమోక్షమిచ్చిసం
భ్రమముగ కాళహస్తి నిటలాక్షుఁడ సాంబశివా మహాప్రభో

106. ఉ. నే శరణన్నవాని కరుణింతువు చక్కఁగ మెచ్చి యర్ధనా
రీశ్వర నిన్ను నిప్పుడెదిరించినవారిసమస్తలోకసం
కాశనపక్ష భీష్మసురగర్వ దృఢాంచితవజ్రదైత్యవ
జ్రాసిపితాపితామహులచాఁటునఁబోయిన సంహరించవా
చూచితె కాళహస్తి శివసుందర సాంబశివా మహాప్రభో

107. ఉ. శంకలు దీర్చి భక్తుల నిజంబుగఁ బ్రోతువటంచు బల్కితే
బొంకకు మాడితప్పకు మబద్ధములాడకుముక్తిలేని ని
శ్శంకపరీతఖండహరమాగతమోహరి బాయకుండుటల్
జంకుదువా శివార్చకుల చెంతకు దూతలఁ జేరనిత్తువా
శంకర కాళహస్తి నిటలాక్షుఁడ  సాంబశివా మహాప్రభో

సమాప్తము