చన్నకేశవ శతకము
- నారాయణం రామానుజాచార్యులు
(సీసపద్య శతకము)1. శ్రీచిత్తసుమభృంగ సింధురాపద్భంగ, కరుణామయాపాంగ ఖగశతాంగ
నీలనీరదగాత్ర నిగమవేద్యచరిత్ర, సుమహితనుతిపాత్ర కమలనేత్ర
భ్జగాధిపతితల్ప నిజదాసజనకల్ప, ధృతసత్యసంకల్ప హతవికల్ప
భవతూలవాతూల పరిపాలితకుచేల, మునిజనహృల్లోల కనకచేల
తే|గీ| కుందకుట్మలరదన పూర్ణేందువదన
సకలనిర్జరగణశస్త చక్రహస్త
సురుచిరవిలాస లశునాఖ్యపురనివాస
చన్నకేశవదేవ విశాలభావ!
2. బ్రహ్మాదులే నిన్ను ప్రస్తుతింపగ నేర, రని వేదశాస్త్రంబు లనుచునుండ
నారదాది మహర్షులారసి నీమహి, మంబుం గన్గొనలేక మసలుచుండ
వనజాండంబులే ఘనమాయచేజిక్కి, కీల్బొమ్మలనుబోలి కెరలుచుండ
భుజగాధినేత నిన్బొగడుటకై వేయి, వక్త్రముల్ చాలక వగచుచుండ
నింక నేనెంతవాఁడనో యిందిరేశ
నిన్ను దెలిసి నితింప నాపన్నవరద
సురుచిరవిలాస లశునాఖ్యపురనివాస
చన్నకేశవదేవ విశాలభావ!
3. ఉడుపంబుజే నబ్ధినుత్తరింతునటంచు, జనుదెంచుమూర్ఖుని చందముగను
కమలాక్ష భవదంకితముగ సీసము లొక్క, శతంబు నిర్మింప సాహసించి
మొదలిడితిని నేడు తుదిముట్టసేయుము, మామక జిహ్వాగ్రమందు నిలిచి
అభినవభావ సంహతియుక్త సౌభాగ్య, పదముల నందించ్చి పడయు యశము
నీవుకృపసేయు పదమునే నిల్పువాడ
నిందు నాకేమితెలియు గోవింద నిజము
సురుచిరవిలాస లశునాఖ్యపురనివాస
చన్నకేశవదేవ విశాలభావ!
4. స్తుతిగర్భనింద నీశతకమం దెసరేఁగి, గూర్చితంచును మదిం గుందబోకు
కలికాలజనమరణంబులు దేవరసమక్ష, మునఁ దెల్పినందు కేమనఁగఁబోకు
మాత్మీయ కష్టసౌఖ్యముల నొక్కొక్కచోటఁ, దలఁచితినని యీర్ష్యఁ దగులఁబోకు
భవదంఘ్రీసారస భజన మేమరినాడ, నని చూచినంతనే గినియఁబోకుఁ
పాపివీడని భయపెట్టి పైకిరాకు
పద్మలోచన యిదె యలవాటు నీకు
సురుచిరవిలాస లశునాఖ్యపురనివాస
చన్నకేశవదేవ విశాలభావ!
5. నీలిమేఘంబుపై నెగడు విద్యుద్వల్లి, యన రమభవదుర మందునొప్ప
బొడ్డుఁదమ్మివసించు బిడ్డతుందుడుకుచే, ముసరుతేఁటులు తమ మొనలువిప్ప
కుండలాంగదహార కోటీరమణిరుచు, ల్మిఱుమిట్లుగొల్పుచు మిన్నుఁగప్ప
కదలినచరణము ల్గజ్జెలందెల ఝణం, ఝణ తాళగతులకుఁ జదువుఁజెప్ప
శేషతల్పము రవికాంతి సీమఁదప్ప
మ్రోల సాక్షాత్కరించు వరాలకుప్ప
సురుచిరవిలాస లశునాఖ్యపురనివాస
చన్నకేశవదేవ విశాలభావ!
6. చూడామణిప్రభా సులలితపింఛావ, తంసంబు తళతళ త్తళవహింప
కస్తూరికాతిలకాభిరామంబైన, నగుమోము చందురు బిగినడంప
వరదాభరరథాంగ వార్ధిజాంచిత చతు, ష్కరములు దేవతాతరులనొంప
హారాంశుకంబు లుద్యత్కోటి చండాంశు, మండలాహంకృతుల్మాపిపంప
పదములంబుజగర్వ సంపదల్ద్రుంప
మ్రోలవేంచేయు నామొఱలాలకింప
సురుచిరవిలాస లశునాఖ్యపురనివాస
చన్నకేశవదేవ విశాలభావ!
7. బలిదానవునిద్రొక్కి పాతాళభూమికిఁ, బంపునప్పుడు నొప్పి పట్టెనేమొ
అభివాదవేళలం దజరుద్రమౌళి క, ర్కశరత్నములుదాకి కందెనేమొ
సామజేంద్రునిగావ సత్వరంబుగఁ దాము, వేంచేయ బడలికఁ గాంచెనేమొ
గురుసైరిభాస్థి పంజరము నంబరవీధి, కెగఁదన్నుచో బాధ దగిలెనేమొ
దేవాధ్దేవ నీదివ్యచరణ
నీరజంబులనొత్తఁగనిమ్ము రమ్ము
సురుచిరవిలాస లశునాఖ్యపురనివాస
చన్నకేశవదేవ విశాలభావ!
8. వైకుంఠమాధవ వాసుదేవ ముకుంద, నారాయణ జనార్ధనాబ్జనాభ
దామోదరానంత దైత్యాంతకతమాల, శ్యామలాకార సంసారదూర
వనధికన్యాపరిష్వక్తవక్షోభాగ, భాగీరధీజాని భాగదేయ
నతశేషశేషాశనామితపదజల, జాత హృషీకేశ చక్రహస్త
అనుచు జాగ్రదవస్థయం దహరహంబుఁ
దలఁతుఁ గలనైనఁ గన్పింప వలదెతండ్రి
సురుచిరవిలాస లశునాఖ్యపురనివాస
చన్నకేశవదేవ విశాలభావ!
9. క్షీరపాథోధి గంభీరతరంగ ని, నాదంబుచేఁ జెవి నాటలేదొ
సురవారకామినీ వరనృత్యశింజితం, బులలీనమై వినంగలుగలేదొ
చతురాననది నిర్జరబృంద జయజయ, ధ్వనులచే గుఱిఁజేసి వినఁగలేదొ
పర్యంకభూతాహి పతితీవ్రనిశ్వాస, పవనంబుచేఁ జెవిఁ బడఁగలేదొ
ఇంతమొఱవెట్టుచున్నఁ గాసంతైన
విన్నచోఁ బల్కకుందువే కన్నతండ్రి
సురుచిరవిలాస లశునాఖ్యపురనివాస
చన్నకేశవదేవ విశాలభావ!
10. రామశ్యామల్మేఘ కోమలదీప్త్యభి, రామ సీతామనస్సీమకామ
కామకోటివిలాస కలికల్మషనిరాస, భువనమోహనరాస భుజగవాస
వాసవమదహార వైనతేయవిహార, నవనీతచోర దుర్ణయవిదూర
దూరవీక్షణవేద్య వీరయూధాభేద్య, సవనఖండితచైద్య సాధుహృద్య
హృద్యభవమగ్నవైద్య సంపద్యమాన
సద్యశఃపుంజ కలితానవద్యవిద్య
సురుచిరవిలాస లశునాఖ్యపురనివాస
చన్నకేశవదేవ విశాలభావ!
11. వాల్మీకి దేవరవారి కీర్త్యంశము, ల్భాషించి పరమనిర్దోషుఁడయ్యె
శుకయోగివర్యుఁడీశూఁడవైన నీకథ, ల్వినుతించి షడ్వర్గ విజయుఁడయ్యె
వర్ణించి మీదివ్యవైభవం బక్రూరుఁ, డమరదుర్లభపదం బధిగమించె
శ్రీవిష్ణుచిత్తు మీసేవ్యత్వమును జాటి, చెప్పి సంస్కృతివార్ధి దప్పుకొనియె
నిపుడు నాపిచ్చివ్రాతలేమిచ్చునట్లు
పూనిచేయింపఁదలచితో బుద్ధియందు
సురుచిరవిలాస లశునాఖ్యపురనివాస
చన్నకేశవదేవ విశాలభావ!
12. అసురబాలుని యార్తి నాలించి యాయస, స్తంబమందుననిల్వఁ దరలలేదె
సర్వలోకశరణ్య సన్నిధిఁ గృపసేయు, మనవిభీషణు దయం గనఁగలేదె
మొఱవినినంతనే బిఱబిఱ చనుదెంచి, కరినాధు నర్మిలి గావలేదె
అఖిలేశమాంపాహి యని ద్రుపదాత్మజ, చింతింపఁ గరుణవీ క్షింపలేదె
పతిపరిభూతయై పరమాత్మగావవే, యన నహల్యను బ్రీతిఁ దనుపలేదె
ఓకృపానిధి నీవె నాకు దిక్కని ధ్రువుం, డర్ధింప నాతనికై యరుగలేదె
అంత కరుణార్ద్రహృదయుండవయ్యు నెంత
వేఁడుచున్నను రక్షింపవేమి తండ్రి
సురుచిరవిలాస లశునాఖ్యపురనివాస
చన్నకేశవదేవ విశాలభావ!
13. హరినామకీర్తన హర్యక్షరవముచే, సమయవేపాపౌఘ సామజములు
మురవైరి పదభక్తి పరశుధారాహతిఁ, బడకుండునే విపత్పాదపములు
వనజాక్షుదివ్య సపర్యానిలంబుచేఁ, బాయవే కామాదితోయదములు
చక్రహస్తుకథాప్రసంగకీల దహింపఁ, జాలదే సంసారతూలరాసి
ననుచు నీభక్తు లనిశంబు నభినుతింప
వినినవాఁడైన లోకమందనఘుఁడౌను
సురుచిరవిలాస లశునాఖ్యపురనివాస
చన్నకేశవదేవ విశాలభావ!
14. సకలదైత్యవితాన సామజహర్యక్ష, పాండవపక్ష శ్రీవత్సవక్ష
కరుణాకటాక్ష నిర్జరసంచయాధ్యక్ష, నవనీరజాతాక్ష భువనరక్ష
ధృతసత్యదీక్ష నిర్జితజాతరూపాక్ష, హితనిటలాక్ష భంజితమహోక్ష
ఘనశిరోరుహపక్ష వనధిశిక్షణదక్ష, శృంగారవీక్ష సద్భంగరూక్ష
కృతమహర్షి సతీశాపగతివిమోక్ష
దయఁగనంగదె భక్తమందారవృక్ష
సురుచిరవిలాస లశునాఖ్యపురనివాస
చన్నకేశవదేవ విశాలభావ!
15. అజసూతిమానసాంబుజకర్ణికాంతరం, బునఁజిక్కి మార్గముం గనఁగలేదొ
ప్రహ్లాదు దృఢతరం బగుభక్తి సంకెల, ల్బంధింపఁ గదలఁగా వలనులేదొ
అంబరీషుధ్యాన శాంబరీ మహిమచేఁ, గలవరపడి దిక్కుఁ గానలేదొ
శ్రీపరాశరమౌని శేఖరు హృత్పాశ, బంధంబు విడఁదీయ బలములేదొ
ఇట్టి ప్రత్యూహములు లాగి పట్టకున్న
సేవసాయింప నశ్రద్ధఁ జేయగలవె
సురుచిరవిలాస లశునాఖ్యపురనివాస
చన్నకేశవదేవ విశాలభావ!
16. ధీరమహావీర కారుణ్యరసపూర, నిగమాంతసంచార నిర్వికార
బుధజనమందార పోషితసురవార, కౌస్తుభమణిహార కలివిదార
మానితశతకోటి మనధాకార శ్రీ, రాధికాధరబింబ రాజకీర
వల్లవీజనచిత్త వైభవాలంకార, యమునావనవిహార యదుకిశోర
జలధిగంభీర మేఘమేచకశరీర
నన్నుఁ జేకోర త్రిభువనాపన్నివార
సురుచిరవిలాస లశునాఖ్యపురనివాస
చన్నకేశవదేవ విశాలభావ!
17. గతినీవెరమ్ము మాపతివైతి వికలెమ్ము, కోరికలిమ్ము భక్తులదె సొమ్ము
దయఁగనంగదె మమ్ము దాసులమతివమ్ముఁ, జేయకు ననునమ్ము సిరులఁదెమ్ము
మమ్మాదుకొమ్ము నీమహిమను భువిఁజిమ్ము, మహితయశమ్ముఁ గాపాడుకొమ్ము
సకలకష్టౌఘమ్ము సమయింపఁ జాపమ్ము, ననుగూర్పుము శరమ్ము వినయమిమ్ము
ఘనగుణంబులప్రోడవుగమ్ముఁ మమ్ము
భూరిసుఖములఁదేల్చు మనాతరమ్ము
సురుచిరవిలాస లశునాఖ్యపురనివాస
చన్నకేశవదేవ విశాలభావ!
18. నియతదయాపాంగ నీలమేఘశుభాంగ, చికురోపమితభృంగ నికరరంగ
కనదరాతివిభంగ వనధికన్యాసంగ, ఘనసుగుణోత్తుంగ ఖగతురంగ
శర్వధనుర్భంగ శయనీకృతభుజంగ, జితసహస్త్రానంగ ధృతరథాంగ
భార్గవోన్నతిభంగ పాలితమాతంగ, జాతరూపమయాంగ సత్ప్రసంగ
దళితకలికాలతిమిరపతంగమంగ
ళోత్తమానంతమణికిరీటోత్తమాంగ
సురుచిరవిలాస లశునాఖ్యపురనివాస
చన్నకేశవదేవ విశాలభావ!
19. ఇందిరాసతిమూపు నందొక కేలుండ, నొకట లీలాంబుజం బూఁగుచుండ
సిగఁజుట్టఁజాలని చికురబృందముగండ, భాగంబులను నాట్యమాడుచుండ
మందస్మితం బింద్రమణిపర్వతముదండఁ, బండువెన్నెలపసల్ చెండుచుండ
కౌస్తుభమాణిక్య కలితవజ్రపుదండ, యుద్యదర్కశతంబు నొంచుచుండ
మందమారుతకంపిత మౌ శిఖండ
దామమౌదలసుప్రభల్ దనరుచుండ
నెదుటసాక్షాత్కరించు నామదికినిండ
ప్రముదమొనఁగూడఁ బాలిత పద్మజాండ
సురుచిరవిలాస లశునాఖ్యపురనివాస
చన్నకేశవదేవ విశాలభావ!
20. సర్వలోకాధార గర్వితారివిదార, జితమన్మథాకార శ్రుతివిహారా
కాలాంబుధరగాత్ర కమలాప్తశశిన్నేత్ర, శివనుతవరిత్ర శ్రీకళత్ర
దీనరక్షణదక్ష మానితమునిపక్ష, కౌస్తుభమణివక్ష ఖలవిపక్ష
తిలసుమసమనాస దీప్తికాంచనవాస, కమనీయదరహాస కలినిరాస
పూర్వభవహృత వాసుదేవ పుణ్యజాల
భువనమోహన ఛిద్రోర్ధ్వ పుండ్రఫాల
యేల మమ్మేల జాగు గోపాలబాల
సురుచిరవిలాస లశునాఖ్యపురనివాస
చన్నకేశవదేవ విశాలభావ!
21. భవభయంబులకు మీభక్తిభావమె మందు, వనధిజగలదు నీవక్షమందు
ననితరసౌలభ్యమైన యశంబందు, సర్వేశ పదునాల్గు జగములందుఁ
బండవేయని ప్రాణపరిరక్షణమునందుఁ, బ్రతినఁబూనితి ధర్మసుతునిముందు
కుబ్జచందనమిచ్చి కోరెనుమీపొందుఁ, గన్పింపరాదె నిన్గనులఁగందు
వెతకిచూచిన నీసాటి వేల్పు లెందు
నుందు రఖిలంబు నీవె మాకిందునందు
సురుచిరవిలాస లశునాఖ్యపురనివాస
చన్నకేశవదేవ విశాలభావ!
22. ఘనభుజాంతరసీమఁ గాపురముండిన, లక్ష్మి నిశ్చలతటిల్లతికగాగ
నను నన్నియున్నచోఁ గనరఘౌఘంబను, శ్రీసూక్తిసాంద్ర గర్జితముగాగ
నంగదకోటీరహారప్రోతవిచిత్ర, మణిరుచుల్బలవైరి ధనువుగాగ
జితతమాలశ్యామలతయైన తిరుమేని, ప్రభమేదుప్రావృడభ్రంబుగాగ
వేగవేంచేసి భవదనురాగవృష్టి
సల్పి మత్స్వాంతసస్యశోషణ మడంప
రాదె రారాదె యనుకంపలేదెవాదె
సురుచిరవిలాస లశునాఖ్యపురనివాస
చన్నకేశవదేవ విశాలభావ!
23. అపరాధియనక కాకాసురుం దయఁజూచి, కీర్తినొందితివన్న కింవదంతి
మలినవర్తనుఁడైన మాలిని యనువాని, గైకొంటివనెడు నీఘనయశంబు
ఆజన్మపాపిష్ఠుఁడైన యజామీళు, రక్షించితివను పురాణగాధ
నంగనాలంపటుండై మలిమ్లుచుఁడైన, యజ్ఞదత్తునిబ్రోచి నట్టివార్తఁ
గల్లగానెంతు మమ్మేలనుల్ల ముల్ల
సిల్ల వేంచేయకున్న శ్రీవల్లభవిను
సురుచిరవిలాస లశునాఖ్యపురనివాస
చన్నకేశవదేవ విశాలభావ!
24. వాత్సల్యమున నీకు వన్నెఁగూర్చినవాఁడు, ప్రహ్లాదుఁడేగదా పద్మనాభ
అభయదానమున నీయశము నిల్పినవాఁడు, రావణానుజుఁడెగా రఘుకులేంద్ర
ఆర్తిహరత్వమందలగజనాధుఁడే, గద పేరుదెచ్చిన ఘనగుణాఢ్యుఁ
దౌదార్యమునఁ బెద్దయని లోకములలోనఁ, జాటిచెప్పినది పాంచాలిగాదె
పతితపావన బిరుదంబుఁ బట్టుపట్టి
జగతినిల్పుట నాబోటి జనులుగారె
సురుచిరవిలాస లశునాఖ్యపురనివాస
చన్నకేశవదేవ విశాలభావ!
25. శరణాగతత్రాణ బిరుదంబునకు హాని, గల్గు నాపై దయ గలుగకున్న
నఖిలపాపధ్వంసి వని బల్కఁ డొకఁడైన, నసదృశభక్తి నాకొసఁగకున్న
నాపదుద్ధారకుండను యశోవిభవంబుఁ, గల్లగానెంతు నన్నొల్లకున్న
సకలలోకారాధ్య చరణుండవను పల్కు, మిథ్యయౌ దర్శనమియ్యకున్న
వాదమికనేల నేను నీవాఁడనన్నఁ
గినిసి కరుణింపకున్న నీకీర్తిసున్న
సురుచిరవిలాస లశునాఖ్యపురనివాస
చన్నకేశవదేవ విశాలభావ!
26. నిరతాన్నగోదాననిష్ఠులౌ మనుజులఁ, గరుణింప నీకెంత ఘనతగల్గు
వేదవేదాంతార్థవిదులఁ జేరఁగఁదీసి, ప్రోచిన నీకేమి పొసగుకీర్తి
ఏప్రొద్దు నీనామ మేమఱక జపించు, భక్తులఁగాచుటేపాటి గుణము
సుతసతీహితదూర మతులఁగాచిన నీకుఁ, దిరమౌనె పేరుప్రతిష్ఠ లరయ
కాచినను నన్ను నాబోటి కఠినమతులఁ
గావవలె పేరురావలెఁ గాకనీకు
సురుచిరవిలాస లశునాఖ్యపురనివాస
చన్నకేశవదేవ విశాలభావ!
27. నిర్భయంబుగ దాసనివహంబు నినుఁ జేర, కుండఁ బెన్బాముపైఁ బండినావు
సిగ్గుచే నెవరు నీ చెంతఁజేరరటంచు, దార నురంబునఁ దాల్చినావు
శరణార్థు లనిశంబు నరుదెంతురనుభీతి, నడిసందరంబులో విడిసినావు
అండనుండినవాఁడు గుండె ఝల్లనిపోవ, భూతనాధునిమైత్రిఁ బొందినావు
నీకు నీవౌచుఁ దిరుగాడ నేర్చినావు
కన్నులకుఁ జూపవైతి వీవున్నతావు
సురుచిరవిలాస లశునాఖ్యపురనివాస
చన్నకేశవదేవ విశాలభావ!
28. మాటిమాటికి బొంకి మహిఁ జరించెడు నతి, కాముఁకు డుపకారి కాఁగలండె
యెవ్వేళలను భోజనేచ్ఛతోఁ దిరుగాడు, బబహ్వాశివలన యేపనులు ముగియు
నతివాంఘ్రితాడనంబైన రసోచితం, బేయను స్త్రీలోలుఁ డేమిసేయుఁ
బరమపతివ్రతా భంగకరుండైన, పూరుషుఁ డేపాటి బుద్ధిశాలి
అన్నిగుణములు శ్రీవారియందుఁగలవు
గాన నెటుప్రోతువని నమ్మకంబునాకు
సురుచిరవిలాస లశునాఖ్యపురనివాస
చన్నకేశవదేవ విశాలభావ!
29. అతికాముకుఁడవౌట కితర సాక్ష్యములేల, చాల్గొల్లపడుచుల జవ్వనంబు
బహ్వాశివనుటకై ప్రబలసాక్ష్యముగాదె, నిఖిలలోకములున్న నీయుదరము
స్త్రీలోలుఁడని చాటిచెప్పుటకై పారి, జాతాపహరణంబు చాలదొక్కొ
ధరసతీవ్రతభంగ కరుఁడవౌటకు సాక్ష్య, ముల్గావె నీశిలామూర్తులరయ
ఇంతఘనుఁడవు నీవని యే నెఱుంగు
దైన విడనాడఁజాల నీయంఘ్రియుగము
సురుచిరవిలాస లశునాఖ్యపురనివాస
చన్నకేశవదేవ విశాలభావ!
30. అటుకులుదిని కుచేలాఖ్య భూసురవర్యు, నకుఁగూర్చి తైశ్వర్య నికరములను
భక్షించి యెంగిలి పండులాశబరికి, వశముఁజేసితివి కైవల్యపదవి
నఱువదినాల్గు విద్యల నభ్యసించి సాం, దీపసుతుఁదోడి తెచ్చిపెట్టి
తటవీప్రదేశమం దన్న మర్పించిన, మునిపత్నులకు భక్తిముక్తిలిడితి
వెవరిఁబ్రోచితో ప్రతిఫలమేమిలేక
లంచగొండివే నీవెప్పుడెంచిచూడ
సురుచిరవిలాస లశునాఖ్యపురనివాస
చన్నకేశవదేవ విశాలభావ!
31. నిజసోదరినిబట్టి విజయు రక్షించితి, వంతియేగాని యిందెంత కరుణ
తల్లిదండ్రులచెఱఁ దప్పించుటకుఁ గంసు, నడఁచితి వదియు భక్తావనంబె
జాయాపహరణ రోషముచేతఁ బౌలస్త్యుఁ, బరిమార్చి తది జగద్భద్రగుణమె
బాణునికరములం బడఁద్రుంచి పొత్రుని, గొనివచ్చుటెంత లోకోపకార
మహహ నీకైనవారల నాదరింతు
వెవరు నీగుట్టుఁ దెల్పరీ విశ్వమందు
సురుచిరవిలాస లశునాఖ్యపురనివాస
చన్నకేశవదేవ విశాలభావ!
32. వావిఁదప్పినటింప వలదని మేనత్త, మొత్తుకొన్నను బోని మొరటుతనము
నినుగాలయవనుండు నిలుమని పైకొనఁ, బఱువిడినప్పటి పిఱికితనము
విందారగించి సంక్రందను వీటిలో, ద్రోహివైచేసిన దొంగతనము
అవమానమనక వల్లవకామినుల పొందుఁ, గోరి చరించిన కొంటెతనము
గుట్టుగానుండె నన్ను జేపట్టవేని
బట్టబయలుగఁజేతు నీబెట్టువిడుము
సురుచిరవిలాస లశునాఖ్యపురనివాస
చన్నకేశవదేవ విశాలభావ!
33. పల్మా`రుమగదాధిపతి పోరఁదఱిమిన, నెన్నఁడువీడవు నీకున్నబెట్టు
అన్నులమిన్న నీసన్నుతాంగికి మ్రొక్కి, చెడకయుంచితివి నీచెంతఁగుట్టుఁ
బరులువిన్నను నవ్వుదురని లోలోమ్రింగి, తిరిగెదుబృందచేఁ దిన్నతిట్టు
నారడిఁబుచ్చితీ వాపగాతనయుపై, నల్గిచక్రముఁ బూనననిన యెట్టు
రట్టుఁజేయరే యితరుఁడైనట్టులైన
స్వామివైనందుచే నీకు సాగిపోయె
సురుచిరవిలాస లశునాఖ్యపురనివాస
చన్నకేశవదేవ విశాలభావ!
34. రాకపోకలెఱుంగరాక వర్తిలుచుండు, భార్యగల్గినవాని బ్రతుకదెంత
నిష్ఠాత్ములనుఁబట్టి నిరతము బాధించు, తనయుఁడబ్బినవాని ఘనతయెంత
నిమ్నాభిముఖియౌచు నిచ్చలుఁదిరుగాడు, కూఁతురుండినవాని కులమదెంత
గ్రామదాహకుడౌ దిగంబరితో మైత్రి, సల్పుచుండెడివాని సరసమెంత
వరుసనివియన్ని యేలినవారియందె
కలవు కల్గిన భువనైకకర్త వనిరి
సురుచిరవిలాస లశునాఖ్యపురనివాస
చన్నకేశవదేవ విశాలభావ!
35. హలముసలంబుల నన్నభాగమువైచి, పంచాయుధములు గ్రహించినావు
అసితాంబరమునీది హాటకాంబరము నా, దనుచు నేర్పునఁ జెపితి వన్న కీవు
నాభాగమనుచు రత్నాకరంబుననుండి, యొసఁగితిపురినన్న కొక్కతావు
సామాన్యమణిహార సామాగ్రి సహజున, కొసఁగి కౌస్తుభముఁ గైకొంటి వీవు
నిన్ను సాదృశ్యముగ నెవ్వడెన్నఁబోవు
దాయవిభజనమందు నాతప్పుఁగావు
సురుచిరవిలాస లశునాఖ్యపురనివాస
చన్నకేశవదేవ విశాలభావ!
36. నారియౌ తాటకం బోరఁ గూల్చిననాడె, నీతిమార్గాసక్తరీతి తెలిసె
మారుతి రారాజు పోరాడునాడె నీ, ధర్మైక పక్షపాతమ్ము తెలిసె
మున్నిచ్చి కల్పభూజము మ్రుచ్చిలునాడె, దానశౌండత్వ మంతయును దెలిసె
పాండునందన దౌత్యపదవినందిననాడె, సర్వాతిశాయిత్వ సరణి తెలిసె
లోకములకెల్ల నిన్నిప్పుడేకతమునఁ
దెలిసి ప్రార్థించి బ్రతుకుటో తెలియవలసె
సురుచిరవిలాస లశునాఖ్యపురనివాస
చన్నకేశవదేవ విశాలభావ!
37. సుతుఁడెంతసుకృతియో మతిమంతులకు నల్ప, జీవితంబు ఘటింపఁ జేయుచుండు
సతియెంతనిర్దయాశాలినియో కోవి, దులువేడఁ జూడకఁ దొలఁగుచుండు
కోడలెంతటి మహా కుత్సితాత్మయొగాని, కలవారిఁజూచినఁ గనలుచుండు
మామయెంత విషస్వభావుఁడో జననాశ, తరుణమన్నను బొంగి పొరలుచుండు
నిదురపట్టదు నీకెప్డు నిఖిలలోక
ప్రళయమనుమాట వినునంతవఱకదెంత
పాపమోకాని యెంతనిర్భాగ్యుఁడైన
నమ్మికొల్చునె నీయడ్గుదమ్ము లహహ
సురుచిరవిలాస లశునాఖ్యపురనివాస
చన్నకేశవదేవ విశాలభావ!
38. గొంతులో విషముంచికొని మాటలాడు క, పాలియా మీప్రియబాంధవుండు
గురుపత్నిఁగూడి తాఁగొంటెయై దిరుగాడు, క్షయరోగియా మీకు స్యాలకుండు
తనకంటెఁబెద్దయౌ తరుణికి మగఁడైన, యంగవిహీనుఁడా యాత్మజుండు
నీవుండ నితరులనెత్తిపైఁ దనభార, ముంచిన ప్రౌఢయా ముఱియుచుండు
భార్య; తెలిసెను నీవారివలన యుష్మ
దీయ సద్గుణసంపత్తి వేయునేల
సురుచిరవిలాస లశునాఖ్యపురనివాస
చన్నకేశవదేవ విశాలభావ!
39. త్రోసివేయక మాటఁ దోయధి దయఁబూని, భువినొసంగినఁ గట్టితివి పురంబు
నడిగినంతనె కుబేరుఁడు రుణంబిచ్చినఁ, బెండ్లాడితివి మహాపెద్దననుచుఁ
గలుముల జవరాలు కాంతయైన కతాన, వాసిగంటివి ధనవంతులందు
నైనవారలు పెద్దవని గౌరవముఁజూప, వల్లవజనచక్రవర్తివైతి
వేదిపదిమందితోపాటు వాదమునకు
నైనఁ బిత్రార్జితంబు నీ కనఘచరిత
సురుచిరవిలాస లశునాఖ్యపురనివాస
చన్నకేశవదేవ విశాలభావ!
40. సవతితల్లికి సంతసముఁగూర్ప వనికేగి, తల్లిపై శోకాగ్నిఁ జల్లినావు
సర్వసర్వంసహా చక్రమేలు మటంచు, సహజుండు వేడ వేసారినావు
అతిబలుండగు వాలి నన్యాయమునఁద్రుంచి, బలహీను రవిజుఁ జేపట్టినావు
నినుగాంచి సంతోష నీరధినోలాడు, నవనిజం బరుషోక్తు లాడినావు
ఏమిటీవెఱ్ఱి నడవడి స్వామివైన
నౌదు వీవేమి యాలోచనాపరుఁడవొకొ
సురుచిరవిలాస లశునాఖ్యపురనివాస
చన్నకేశవదేవ విశాలభావ!
41. స్వల్పదానముఁగోరి సర్వస్వ మపహరిం, పఁగనెంచు టెంత సంపత్కరంబొ
వంచించి రాజసంచయమును భైష్మిఁ, దోడితెచ్చు టదెంత దొడ్డతనమొ
బీదబాపనిగోరి పృథుకముల్ప్ర్ట్టించి, కొని తినుటెంతటి గొప్పగుణమొ
ప్రణయవైరావేశభరితయై యొప్పారు, పడఁతికిమ్రొక్కుటే పాటిఘనమొ
తెలియనేరికి తరము నీ దివ్యచిత్త
గతివిలాసము బ్రహ్మాండతతులలోన
సురుచిరవిలాస లశునాఖ్యపురనివాస
చన్నకేశవదేవ విశాలభావ!
42. స్త్రీవచనంబుచే స్థిరతరంబౌతాత, సకలసంపత్తికి స్వస్తిచెపితి
వొకపక్షిమాట తావక మనంబున నమ్మి, నిర్ణయించితి శత్రునిలయ మహహ
ఒకకోతితో స్నేహమొనరించి స్వమతాను, యాయిపై నాగ్రహమందినావు
బుధశత్రుఁడగువాని బుద్ధుల నాలించి, జడమయునకు మ్రొక్కఁ జాలితీవు
నీగుణంబులు వినుతింప నెవరితరము
సకలముడిగిన సన్నాసులకునుదప్ప
సురుచిరవిలాస లశునాఖ్యపురనివాస
చన్నకేశవదేవ విశాలభావ!
43. పుత్రిని దయ్యాలపోతున కిచ్చితిఁ, గాపురంబేరీతిఁ గడపఁగలదొ
అనయము వైరుధ్యమునఁ బెనంగెడు భార్య, లిరువుర నిఁక నెట్టులేలఁగలనొ
ఆత్మజుం డంగనాదౌత్య జీవనుఁడయ్యె, నీయపకీర్తి నేనెట్లు సైతు
శ్వశురుఁడేకాలంబు జడనిధియైయుండెఁ, గష్టసౌఖ్యము లేరికడను దెల్పు
దనుచు వైరాగ్యమునుచెంది మనమునందుఁ
బాముపైఁ బవ్వళించితే స్వామినీవు
సురుచిరవిలాస లశునాఖ్యపురనివాస
చన్నకేశవదేవ విశాలభావ!
44. స్వాంతమందున దేవతాంతరంబును వీడి, భజియింప మిము బహుభక్తిఁబొంగి
యొకనాటికైన నమ్మక పరీక్షించుటల్, మానకుంటివటంచు మదిగలంగి
తలఁచినంతనె యిష్టతమములౌ వస్తువుల్, దంద్రియీయకయున్నఁ దనయుభంగి
నభిలషించినవేళ నరసి కామ్యార్థముల్, భర్తయొసఁగకున్న భార్యభంగి
నంబుజాతాక్ష నే స్వతంత్రంబువలన
నంటి నినుఁ గొన్నిమాట అన్నింటి మదిని
నిల్పి గనలకు నామనోనిశ్చయంబు
సర్వమెఱుఁగవె దేవతాసార్వభౌమ
సురుచిరవిలాస లశునాఖ్యపురనివాస
చన్నకేశవదేవ విశాలభావ!
45. జనకుఁడష్టైశ్వర్య సంపన్నుఁడైయున్న, సుతుఁడొందఁగారాని శుభమదేది
పతివయోభాగ్యరూపములుండి వశుఁడైన, సతిపొందఁగాలేని సౌఖ్యమేది
సార్వభౌముఁడు వేదశాస్త్రాచరుఁడైన, ప్రజవడయఁగలేని భాగ్యమేది
అఖిలకళావిదుండాచార్యుఁడైయున్న, గృహమేధిఁగూడని మహిమయేది
సర్వశేషివి నీవు మాస్వామివైతి
వెందు మే మొందరాని యానందమేది
సురుచిరవిలాస లశునాఖ్యపురనివాస
చన్నకేశవదేవ విశాలభావ!
46. అణువునం బరమాణువౌచు మహత్తునం, దతి గొప్పయై వెల్గు నతఁడెవండు
అఖిలాండకోటి బ్రహ్మాండ సృష్టిస్థితి, ప్రళయకరుండగు ప్రభువెవండు
ప్రథితవేదాత్మక ప్రణవకారణవర్ణ, వాచ్యుఁడై చెలువొందు వాఁడెవండు
భవపద్మసంభవప్రముఖులౌ యమరులఁ, గనుసన్నలను నుల్పు ఘనుఁడెవండు
ఆదిమద్యాంతరహితుఁడౌ యతఁ డెవండు
నీవుగాకన్యుఁ డొక్కండు నిరుపమాన
సురుచిరవిలాస లశునాఖ్యపురనివాస
చన్నకేశవదేవ విశాలభావ!
47. వర్ణది నీపాద సరసిజోద్భవమయ్యెఁ, బల్కంగలారె శ్రీపాద మహిమ
పరమేష్టి నీనాభిపద్మమం దుదయించె, నుదరసంపద నెన్నఁగ దరమౌనె
చంద్రుండు నీమనోజాతుఁడై వెలుగొందె, నాత్మవైశద్య మేమని వచింత్రు
లోకబాంధవుఁడు నీలోచనభవుఁడయ్యెఁ, దరమె వీక్షణభాగ్య గరిమఁబొగడఁ
గవులు గుమిగూడి వేయేడ్లు కష్టపడిన
నీకు సముఁడవు నీవెపో నిశ్చయముగ
సురుచిరవిలాస లశునాఖ్యపురనివాస
చన్నకేశవదేవ విశాలభావ!
48. ఆత్మేశ్వరుండవై యలరెడు నీకంటెఁ, బరుఁడెవ్వఁడీ లోకప్రతతికెల్ల
విశ్వాత్మకుండవై వెలసిన నిను వీడి, యెవనిలో లయ్మగు భవనపంక్తి
భవదీక్షణాత్తవైభవులయ్యె బ్రహ్మాదు, లభవయుష్మత్సమాభ్యధికు లెవరు
నీకంటె నెవ్వఁడీ నిగమ మహారణ్య, సంచారలభ్యుఁడౌ శాశ్వతుండు
సకలచేతన రక్షణోత్సాహపరవ
శుండవీ వొక్కరుఁదవే వేదండవరద
సురుచిరవిలాస లశునాఖ్యపురనివాస
చన్నకేశవదేవ విశాలభావ!
49. పరమయోగులకైనఁ బట్టంగరాని ని, న్నతివ యొక్కతె ఱోటికంటఁగట్టె
సిరియైన నీయందుఁ జెందని వాల్లభ్య, పదవినిందిరి గొల్లపడుచు లహహ
బ్రహ్మాదులకునైనఁ బడయంగరాని నీ, పరిచర్యనందె గోపాలసుతులు
మహనీయ దుర్లభ్యమగు భవద్దర్శన, మా భీకరతలామలకమయ్యె
వారి సౌభాగ్యమో లేక వనజభవుని
వ్రాతనైనను దిద్దు శ్రీవారి దయయి
సురుచిరవిలాస లశునాఖ్యపురనివాస
చన్నకేశవదేవ విశాలభావ!
50. ఆహారనిద్రలనైన విసర్జించి, లెక్కింపవచ్చు భూరేణువులను
బహువిధశ్రమకోర్చి పల్కవచ్చును మింటి, చుక్కల నెన్నియో లెక్కవెట్టి
సాగరోగకబిందు సంతతిఁ గష్టించి, లెక్కసేయఁగవచ్చు నిక్కముగను
దేవాధిదేవ నీదివ్యమంగలగుణా, వళి మామకీన దుర్వారకలుష
ములను గణియించి తెల్పఁగా నలవియగునె
ధాతకైనను బ్రమధ సంత్రాతకైన
సురుచిరవిలాస లశునాఖ్యపురనివాస
చన్నకేశవదేవ విశాలభావ!
51. నిష్కాములై మిమ్ము నిరతము సేవించు, పరమభక్తులకెల్లఁ బాడికుండ
సర్వస్వమును భవత్సాన్నిధ్యమే యను, ఘనులకెల్లరకు బంగారుకొండ
ముక్తికాంతా మనశ్శక్తి సంహారశీల, మగు భవజ్జనుల ముత్యాలదండ
శమన సైనిక ధైర్యశౌర్యంబులను మాపి, పాఱఁదోలఁగజాలు పట్టుజండ
శత్రుజనమారణోత్క్షిప్త చాపదండ
మౌర యేమందు దేవరవారి యండ
సురుచిరవిలాస లశునాఖ్యపురనివాస
చన్నకేశవదేవ విశాలభావ!
52. ద్రౌణిబాణాగ్ని సంతుప్తుఁడై పసిపాప, ప్రాణముల్ దేనిచేఁ బడసెఁ దొల్లి
ఎందుచే ధర్మజుం డేడుదీవుల నేలెఁ, దన యశశ్చంద్రిక ల్ధరణిఁజల్లి
ధ్రువుఁడెటులొందె వాగ్ధవ ముఖ్య గీర్వాణ, సమితి చేరనిచోటు సంతసిల్లి
సకలబ్రహ్మాండ సంక్షపిత పాపౌఘమ, న్ప్రథఁగాంచె నెందుచేఁ బాలవెల్లి
అట్టి భవదీయ సరసదయామతల్లి
కాదె దాసులపాలిటి కల్పవల్లి
సురుచిరవిలాస లశునాఖ్యపురనివాస
చన్నకేశవదేవ విశాలభావ!
53. మన్నుఁదింటి వటంచు మున్ను నిన్ను యశోద, దండించె నా సతి ధైర్యమెంతొ
నందుండు నిన్నాలమందలఁగాయగా, నియమించె నాతని నేర్పదెంతొ
వెన్నమ్రుచ్చని గొల్లకన్నియల్నినుబట్టి, బంధించిరట వారిబలమదెంతొ
గురుపత్ని కట్టెలు గొట్టి తెమ్మనిపంపెఁ, దలపోయ నామె స్వాతంత్ర్యమెంతొ
భక్త్యాధీనుండవగుటచే శక్తికల్గి
చేసిరానాడు వారిట్టి చేష్ట లహహ
సురుచిరవిలాస లశునాఖ్యపురనివాస
చన్నకేశవదేవ విశాలభావ!
54. రాజ్యార్థులై మిమ్ముఁ బ్రార్థించువారికిఁ, గరిపురీశుఁడు యుధిష్ఠిరుఁడె సాక్షి
పుత్రార్థులై మిమ్ము బూజించువారికిఁ, దరుణీలలామ యుత్తరయె సాక్షి
సౌఖ్యార్థులై మిమ్ము శరణనువారికి, ఘనుఁడైన యా విభీషణుఁడె సాక్షి
మోక్షార్థులై మిమ్మపేక్షించువారికి, ఖట్వాంగభూమి పాగ్రణియె సాక్షి
సిరులు నిను గోరి యనిశము సేవఁజేయు
చుండువారికి ధరఁగుచేలుండె సాక్షి
సురుచిరవిలాస లశునాఖ్యపురనివాస
చన్నకేశవదేవ విశాలభావ!
55. భవదీయ దివ్యనామప్రభావోత్కర్ష, దాక్షాయణీ ప్రాణధవుఁ డెఱుంగు
త్వత్పాద సరసిజాత పరాగమాహాత్మ్య, మతిపూత గౌతమసతి యెఱుంగు
తమ నిగ్రహ ప్రసాదముల వైఖరి భక్తి, పరుఁడైన యాపగావరుఁ డెఱుంగు
మీ సత్యశేముషీ భసురలీల లా, దశకంధరుని సహోదరుఁ డెఱుంగుఁ
గాక దేవర కల్యాణ ఘనగుణౌఘ
మహిమఁ దెలియంగనేర్చునే మాదృశుండు
సురుచిరవిలాస లశునాఖ్యపురనివాస
చన్నకేశవదేవ విశాలభావ!
56. ఇఁక ప్రాణ్ముల్నిల్వ వొక క్షణంబనుదాఁక, వారణేంద్రుని గావ వచ్చినావె
రారాజు సభలోఁ బరాభవించినదాఁక, ద్రౌపది@ బ్రోవఁగాఁ దలఁచినావె
అన్నచేఁ దన్నులు తిన్నదాఁక విభీష, ణునిపై దయారస మునిచినావె
పినతల్లి వెళ్ళఁగొట్టినదాఁక యౌత్తాన, పాదిని గరుణఁ గాపాడినావె
భక్తజనులకు ముం దహం భావ ముడిపి
కడకు రక్షిచుచుందు వో కమలనాభ
సురుచిరవిలాస లశునాఖ్యపురనివాస
చన్నకేశవదేవ విశాలభావ!
57. ధృతశిరస్తటవిష ప్రతతుఁడై చెల్వొందు, పురుషుఁడా మీ భారమూనువాఁడు
సతతరంధ్రాన్వేష రతుఁడై ప్రవర్తిల్లు, పురుషుఁడా మీ భారమూనువాఁడు
వినువేళఁ గనలేని కనువేళ వినలేని, పురుషుఁడా మీ భారమూనువాఁడు
వక్రగాములకెల్ల వల్లభుఁడైయుమ్మ, పురుషుఁడా మీ భారమూనువాఁడు
అఖిలజగత్ప్రాణహారియై జీవించు, పురుషుఁడా మీ భారమూనువాఁడు
అదినుండియు శేషుఁడేయ్యను తలంపు
చేత నిక్షేపరాయుఁడౌ యీతగాని
యందు నీ సర్వభారంఁ బొందుపఱచి
సాక్షివై చూచుచుంటివే జాయతోడ
సురుచిరవిలాస లశునాఖ్యపురనివాస
చన్నకేశవదేవ విశాలభావ!
58. ఆశ్యవివరమునం దఖిల ప్రపంచంబుఁ, జూపింపఁగ యశోద చోద్యమందె
కార్చిచ్చు మ్రింగుట ల్గనులారఁగాంచి గో, పరిపాలకుల్మహా ప్రౌఢుఁడనిరి
కాళియోరగు ఫణాగ్రములఁ దాండవకేళి, సల్పుచో లోకుల సాధ్యుఁడనిరి
తననపాంపతిలోకముననుండి కొనిరాగ, నందుండు నిరుపమా నందుఁడయ్యెఁ
గాని నిను సర్వకారణ కారణుండ
వనుచు మదినమ్మి గొల్చిన వారలేరి
సురుచిరవిలాస లశునాఖ్యపురనివాస
చన్నకేశవదేవ విశాలభావ!
59. రారశురి యటంచుఁ జీరి నిన్ముద్దాడె, నందునిభాగ్య మేమందునొక్కొ
త్వచ్ఛరీర రజోంకి తముఁ జేసికొనె మేను, నందునిభాగ్య మేమందునొక్కొ
వచ్చిరానట్టి నీవాక్యంబు లాలించె, నందునిభాగ్య మేమందునొక్కొ
భవదుపగుహన పారవశ్యమునొందె, నందునిభాగ్య మేమందునొక్కొ
ఎన్నిజన్మలఁ జేసిన పున్నె మతనిఁ
జేర నినుఁ బెంచఁగల్గెనో చెప్పనగునె
సురుచిరవిలాస లశునాఖ్యపురనివాస
చన్నకేశవదేవ విశాలభావ!
60. స్తనములంగాకోలమునుబూని పాల్ద్రావఁ, జెసిన కుమతికిచ్చితివి మోక్ష
మభవయుష్మచ్ఛరిత్రుఁడౌ శిశుపాలు నై, క్యముఁజేసికొంటి వీవాత్మయందు
మీపేరు వినని మేదినిఁ దిరుగు ఘం, టాకర్ణు పాప మడంచి తహహ
నీ ప్రానముల్దీయనెంచి రప్పించిన, శుంఠ కిచ్చితివి వైకుంఠపదవి
శాత్రవులకైన నీ విట్టి సౌఖ్య మొసఁగ
మఱుగుఁజేరినవారి కేమరుదు భువిని
సురుచిరవిలాస లశునాఖ్యపురనివాస
చన్నకేశవదేవ విశాలభావ!
61. లోకంబు లుదరంబులోనఁ గల్గిన నీకు, వసుదేవు గృహమె నివాసభూమి
నిఖిలకారణుఁడవై నెగడు నీ కా యశో, దా నందులె తల్లిదండ్రు లహహ
పాలకడలిలోనఁ దేలియాడెడు నీకు, బలకరంబే గొల్లపడఁతి పాలు
చరణమునన్గంగ జననమొందిన నీకు, శుచియొసంగెనె గర్గు సుఘట జలము
ఏమిచిత్రమొ నీ కథ లెవని కెఱుక
భక్తమందార ధృతలోకభారధీర
సురుచిరవిలాస లశునాఖ్యపురనివాస
చన్నకేశవదేవ విశాలభావ!
62. పురిటింటిలోఁ దల్లి పుత్రులంబోలె స, ద్భక్తాళి నరసి కాపాడుచుంట
అఖిలకష్టౌఘంబు ననుభవించుచునైన, దాసుల కభిలాషితంబు లిడుట
జనకుండు సుతు నపచారంబుకైవడిఁ, బరమభక్తుల దోష మరయకుంట
లేగను వెన్నంటి యేగు ధేనువుమాడ్కి, సేవకతతివెంటఁ బోవుచుంట
తగియె దేవరవారికే తమనుబోలు
పోషకుండేడి పదునాల్గు భువనములను
సురుచిరవిలాస లశునాఖ్యపురనివాస
చన్నకేశవదేవ విశాలభావ!
63. కృష్ణత్వమునమించెఁ గిసలయాధరి భవ, త్కచ సుందరంబు నే కవి వచించు
నచ్యుతత్వమునొందె నంగన నీ పయో, ధరము లౌనత్య మెంతనుచుఁ జెపుదు
భుజగపర్యంకత్వమును బొందె నతివ నీ, యుదర మెట్లు నుతించు మదనుఁడైన
నీశరీరము హృషీకేశత్వము వహించె, సుందరి నీయందమెందుఁగల్గు
ననుచుఁ గులటలఁ బొగడుచు ననుదినంబు
జారుఁడైనను మోక్షంబుఁ జూఱఁగొనఁడె
సురుచిరవిలాస లశునాఖ్యపురనివాస
చన్నకేశవదేవ విశాలభావ!
64. చరియింతు మీ దివ్యచరణయుగ్మము నమ్మి, నినుగాంచి యభ్రమేయనును నెమ్మి
సలిపించితివి కౌరవులపైన నొక దొమ్మి, పాండుపుత్రులతోటి పాటుకమ్మి
గర్వంబువిడదె నీ కన్గవఁగనిదమ్మి, దాపుఁజేర్పఁగరాదె దయనుజిమ్మి
నినుఁగాక నితరుల నే స్తుతింపను సుమ్మి, విన్నపమాలింప వేగరమ్మి
భక్తిధనమును వాంఛించి భావమిమ్మి
వసుధఁ దిరుగుట నీ కలవాటె సుమ్మి
సురుచిరవిలాస లశునాఖ్యపురనివాస
చన్నకేశవదేవ విశాలభావ!
65. సకలవారిచరాళి చరియింప ధృతిఁదూలి, మున్నీటిలోఁదేలి మున్గఁజాలి
భుజగలోకంబెల్ల భుగభుగధ్వనివల్లఁ, దల్లక్రిందై తల్లడిల్లి డుల్ల
దుమికినంతనె పొంగి తోయరాశి చెలంగి, నలువైపులఁ గలంగి కలయనింగి
సోమకాసురుఁ దొట్టి సుఖలీల మెడఁబట్టి, ప్రాణముల్విడఁగొట్టి వడసినట్టి
త్రయిఁ బ్రసాదింపవే మున్ను ధాతృనార్తి
మాపి లోకైకకీర్తి శ్రీమత్స్యమూర్తి
సురుచిరవిలాస లశునాఖ్యపురనివాస
చన్నకేశవదేవ విశాలభావ!
66. పాలమున్నీరొక్క భాండమై వెలుగొంద, మహితాద్రియూషమై మార్పునొంద
ఫణిపతిరజ్జువై పరిణామమును జెంద, లోకముల్పదునాల్గులోనఁ గుండ
తమతమ హస్తముల్దారుమారై కందఁ, ద్రచ్చుచుండఁగ దేవదనుజులంద
రునుగూడి నగము జారుచునుండ నందంద, నిలిచి సంప్రార్థింప నీవు క్రిందఁ
జేరి మూపునఁబూని యశేషభార
మమృత మొసఁగితి వౌర కూర్మావతార
సురుచిరవిలాస లశునాఖ్యపురనివాస
చన్నకేశవదేవ విశాలభావ!
67. గిరిమహీరహయుక్త ధరణినౌకమురీతి, ముంచి సాగరమందు మించి నీతి
వీడి మెమ్మెదిరింప విబుధలోకారాతి, యైన హిరణ్యాక్షు నాత్మహేతిఁ
బడఁద్రుంచి దైత్యులు పార దిక్కులు భీతి, మాయురేయన దేవ మనుజజాతి
సస్యాగ్రలగ్నతుషారబిందువుభాతి, వెలుఁగ దంష్ట్రాగ్రమందిలమహాతి
వైభవంబునఁ గన్పట్టి వసుధ లాఁతి
వారలందెల్ల భీతిభావంబుఁబాతి
తహహ శ్రీమద్వరాహరుద్రాబ్జసూతి
తుష్టికారణమైతివరిష్టతాతి
సురుచిరవిలాస లశునాఖ్యపురనివాస
చన్నకేశవదేవ విశాలభావ!
68. పుండరీకాక్షుఁడీ మండపస్తంబ్భమం, దుండకుండిన నిన్నుఁ జెండి ఖండ
ఖండముల్సేతు నా మండలాగ్రంబుతో, నుండు మర్భకయంచు మండి చండ
తాండవంబునఁ బద్మజాడభాండంబునిండ, గండడైయార్చి యుద్దండదండ
శౌండుఁడౌ వసుకసిపుం డాత్మదోఃకాండ, మండితంబగు గదా దండతుండ
మున హిరణ్యసభాస్తంభమును వితండ
వాదియై మోదెఁ దెలియకీ వందునుండ
సురుచిరవిలాస లశునాఖ్యపురనివాస
చన్నకేశవదేవ విశాలభావ!
69. ప్రళయనిర్ఘాతరావము నీసడింపఁజా, ల్పెళపెళధ్వని లోకములఁ గలంప
లయకాలజనిత వలాహకలితతిలీలఁ, బొగగ్రమ్మ భూనభంబులు చలింప
మిన్నంది భువివ్రాలు ముణ్గురులనుగాంచి, యసురుఁడు మృతితప్పదని తలంప
వనజాసనాది దైవతనికాయము భీతి, కలితమౌ భక్తి నంజలి ఘటింప
నరసింహరూపివై ధర హేమకశిపుని, యసువులాక్షణములో నపహరింపఁ
దరలికంబమునుండి దైత్యుని బరిమార్చి, తౌరౌరా ప్రహ్లాదుఁడభినుతింప
భక్తరక్షణపరత నిన్బరిఢవింప
సకలమునిపుంగవుల్గూడి సంతసింప
వితతకీర్తి వహింప సేవితనిలింప
సురుచిరవిలాస లశునాఖ్యపురనివాస
చన్నకేశవదేవ విశాలభావ!
70. అదితికశ్యపులకు నన్గుబిడ్డఁడవౌచుఁ, బుట్టి వారల పున్నెమునను బట్టి
వడుగువై పసుపుదోవతి కటీతటమునం, గట్టి యచ్ఞాబీచకంబునెట్టి
బలిసలలిత యజ్ఞనిలయము సుఖలీల, మెట్టి తచ్చిత్తంబుఁ గట్టిపెట్టి
త్రిపదవైశాల్య పృథ్వినిగోరి దానముం, బట్టి మోదముతో నభంబుఁదొట్టి
అంఘ్రీయుగమున దివి భువి నణచిపట్టి
వసుధనిల్పక యతని యావలకుఁగొట్టి
త్రిదశసామ్రాజ్య మన్నపైఁ దెచ్చికట్టి
తెంతచేసితొ పొట్టివై యంతుముట్టి
పరుఁడెవండైనఁ గలఁడె నీవంతి జెట్టి
సురుచిరవిలాస లశునాఖ్యపురనివాస
చన్నకేశవదేవ విశాలభావ!
71. జగతి రాజన్యవంశజులు దుర్మతులౌచుఁ, దిరుగభూభారంబుఁ దీర్ప నేమ
మును బూని పరమపావనమైన భృగుమహా, ముని వంశమున నీవు మొనసి జామ
దగ్న్యుండవై పుట్టి ధరణి ముయ్యేడుమా, ర్లఖిలాయుధములతో నమిత తామ
సమునొంది రాజవంశజులను వేటాడి, నఱకి ప్రోవులు వెట్టి నైజధామ
మునకుఁజేరితి వరిభీమ మునిలలామ
పతితజనపావనోద్ధామ పరశురామ
సురుచిరవిలాస లశునాఖ్యపురనివాస
చన్నకేశవదేవ విశాలభావ!
72. సకలజగజ్జాల జనకుండవై కోస, లేంద్రుని సుతుఁడవౌటెంతవింత
ప్రమథాధిపతి ధనుర్భంగశుల్క మొసంగి, యింతిని గైకొను టెంతపంత
మటవులలోనఁ బర్యటనంబుసేయుట, త్రిదశశాత్రవుల కదెంత చింత
బలపరాక్రమశాలి బలభేది తనయున, కినతనూజుని మైత్రి యెంత వంత
పగవానితమ్మునిపై ననుగ్రహమూని, చెంతఁజేరఁగదీయు టెంత శాంత
మఖిలసేనలతో దశాస్యుని బరిమార్చు, టింద్రాది దివుజుల కెంత సంత
సమో యెఱుంగ వశంబె యీ జగతి నెంత
వారలకునైన రఘుకెలేశ్వర రవంత
సురుచిరవిలాస లశునాఖ్యపురనివాస
చన్నకేశవదేవ విశాలభావ!
73. యాదవకుల కలశోదధి పూర్ణసు, ధాకరమూర్తివై దనరిలీల
హలగదాముసల ఖడ్గాది దివ్యాయుధం, బులఁబూని హస్తినాపురముఁ గేలఁ
బెకలించి భూమిభారకులను దునుమాడి, రైవతరాజాధిరాజ బాలఁ
బరిణయంబై యహర్పతి తనూజపై, నల్గి తద్ధుర్ణయం బపుడె నేల
పాలుచేసితి మధులోల నీలచేల
కదనరిపుజాలకాల శ్రీకామపాల
సురుచిరవిలాస లశునాఖ్యపురనివాస
చన్నకేశవదేవ విశాలభావ!
74. దేవకియను వసుదేవుని పత్నియం, దావిర్భవించి మాయావిలోల
మానసులౌ యశోదా నందులనుజేరి, వారిచేఁ బెంపుడువడసి రాల
వానను గురియింప వాసవుఁడపు డద్రి, శేఖరమెత్తి నీ చిఱుతవ్రేలఁ
గంసాది దుష్టరాక్షసులను హరియించి, మొనసి భీష్మకసుత న్మోహజాల
బద్ధచిత్తనుజేసితౌ భర్మచేల
పరమకరుణాలవాల గోపాలబాల
సురుచిరవిలాస లశునాఖ్యపురనివాస
చన్నకేశవదేవ విశాలభావ!
75. భువనవిధ్వంసన ప్రవరులౌ రాక్షసా, ధముల నుక్కడఁగింపఁ దరుణమెంచి
తావకమహిమచేఁ దద్వధూజనమున, కసతీత్వ దుర్యశంబపుడె పంచి
నిత్యానుభవసిద్ధ నిర్జరౌఘ సమస్త, బాధలం దలఁచి కోపంబుఁబెంచి
దావదహనుభంగిఁ దద్దైత్యవనము ని, మేషమాత్రమున భస్మీకరించి
అఖిలలోకంబులను గావ నవతరించి
తౌర బుద్ధస్వరూప మీవధిగమించి
సురుచిరవిలాస లశునాఖ్యపురనివాస
చన్నకేశవదేవ విశాలభావ!
76. సకలసంపజ్జాత జనకమౌ భవదీయ, చరణ నీరజభక్తి మఱపుఁజెంది
నిగమచోదిత ధర్మనిర్ణయంబును వీడి, మధుచౌర్య వనితాభిమానమొంది
తిరుగాడ భూజనుల్గలియుగాంతమున నీ, వతులిత ఘోర కోపాగ్నిఁబొంది
అత్యున్నతంబైన హయము నధిష్ఠించి, హ్రాదినీసమచంద్రహాసమంది
కలికివై రాగనుంటివీ యిలఁ గడింది
గుమినిజక్కాడ బాహుబలము కొలంది
సురుచిరవిలాస లశునాఖ్యపురనివాస
చన్నకేశవదేవ విశాలభావ!
77.శేషాద్రిశిఖర సంస్థితుఁడవౌ నీవు మా, యిలువేల్పువైయుండ నేమిభయము
శ్రీరంగపతివౌచుఁ జెల్వొందు నీవు మా, సేమమరయుచుండ నేమి కొఱఁత
నిగమాద్రిపై నీవు నెలకొని మా గృహ, వైద్యుండవైతివే వాంఛగలదు
శాలిహోత్రాశ్రమాస్థాననాధుండవై, గాచుచుంటివి మాకుఁ గలదె చింత
భద్రగిరి తుంగశృంగాంగ్రభాగమందు
వెలసియుండియు నిను మదిఁ దలఁచునంత
నాపదుద్ధారకుండవై యలరుచుందు
విహపరంబుల మాకిఁక నేమివలయు
సురుచిరవిలాస లశునాఖ్యపురనివాస
చన్నకేశవదేవ విశాలభావ!
78. నందుండు సుతుఁడని నవనవోన్మేషమౌ, ప్రేమచే నిను బెంచి పెద్దఁజేసి
హితుఁడని గోపకుల్సతతము నిన్నుఁగూడి, బృందావనస్థలిం జెందియాడి
కందర్పశతకోటి సుందరుండని గొల్ల, పడుచులు నీపయిన్భ్రాంతిఁజెంది
ప్రియసహోదరుఁడని ప్రేమచేఁ బాంచాలి, నినుగాంచి సంతసంబున మెలంగి
ధన్యతము లైరిగాదె నీ తత్వమరయ
కున్నవారల కెందేమి కొఱఁతగల్గె
సురుచిరవిలాస లశునాఖ్యపురనివాస
చన్నకేశవదేవ విశాలభావ!
79. శశధరాన్వయమందు జన్మించి యాభీర, పతి సతీమృద్వంక పాళినెక్కి
గొల్లముద్దియలిండ్ల నల్లరిఁ గావించి, దొంగవై పాలుపెరుంగు మెక్కి
కటితటంబునదట్టి గట్టిగా బిగియించి, కాళియోరగుతల ల్గదలద్రొక్కి
మొనసి గోపాల గోధనములన్సృష్టించి, పరమేష్ఠి గర్వభావంబుఁ జెక్కి
సకలయోగీంద్ర హృత్పంకజములఁజొక్కి
మహిమవెదచల్లి యిటనుంటి మాకుదక్కి
సురుచిరవిలాస లశునాఖ్యపురనివాస
చన్నకేశవదేవ విశాలభావ!
80. అవనిజాప్రముదావహంబు నీవాల్చూపు, దాసుల కిష్టార్థదంబు ప్రాపు
ఖరదూషణాది రాక్షసమారకముతూపు, మొనసి మందరగిరి న్మోసె మూపు
అక్రూరునకుఁ జూపితౌర నీ తొలిరూపు, భవదంఘ్రి సంసారభయముఁ బాపు
త్వత్తేజ మంబుజోద్భవ ముఖ్యులకుఁ గాపు, చిరభక్తి యముని కింకరుల నాపు
నీ మహాశక్తి జగముల నేలనోపు
చూపు నీమూర్తిఁ గనులకు రేపుమాపు
సురుచిరవిలాస లశునాఖ్యపురనివాస
చన్నకేశవదేవ విశాలభావ!
81. అణిమాదిదాయకుండగు పార్వతీ మనో, రమణుఁడు మీ మిత్రర్త్నమైన
నఖిలసంపద్దేవతాఖ్యచేఁ జెలువొందు, భార్గవి మీప్రియ పతినియైనఁ
ద్రిభువనసామ్రాజ్యవిభవాధికారియౌ, పాకశాసనుఁడు మీ భ్రాతయైన
నవనిధిపరిపాల నాధ్యక్షుఁడౌ యక్ష, పతి భవత్త్కైంకర్య గతికుఁడైన
బలిని యాచింప మీకేగవలెసె నెవరి
నాదుకొందురు లేమియందైనవారు
సురుచిరవిలాస లశునాఖ్యపురనివాస
చన్నకేశవదేవ విశాలభావ!
82. ప్రహ్లాదు నటు బహుభంగుల బాధించి, భర్మకశిపుఁడేమి బాగుపడియెఁ
బాండవులకు భంగపాటుఁగూర్చిన ధార్త, రాష్త్రాగ్రజుండెంత రాజ్యమేలె
వినయుఁడైన విభీషణుని దిరస్కృతుఁజేసి, పౌలస్త్య్ఁ డెన్నాళ్ళు బ్రతుకఁగల్గెఁ
గోపంబుచే ముచుకుందుని దలఁదన్ని, కాలయవనుఁడెన్ని గడియలుండె
వసుధ రోజులు దీరిన వారలెల్ల
రిట్లె భవదీయులఁ దృణీకరించుచుంద్రు
సురుచిరవిలాస లశునాఖ్యపురనివాస
చన్నకేశవదేవ విశాలభావ!
83. సరసశబ్ధార్ధ లక్షణ మెఱుంగకఁ గృతిఁ, గూర్చుట మీపేరగొప్పతప్పు
త్రికరణశుద్ధిగా నొకపరియైన మీ, సేవఁజేయక మానుట చెడ్డ ముప్పు
పెట్టుపోతలులేని కట్టుకుంకల కొల్వు, చన్న జన్మలఁ జేసికొన్న యప్పు
కవిజనధిక్కార కరణంబు తన యశ, స్సుందరీమణి తలక్రింద నిప్పు
అభవ నీ భక్తితాపత్రయంబు విప్పు
చెనటి సఖ్యంబు సుజ్ఞానధనముఁ గప్పు
సురుచిరవిలాస లశునాఖ్యపురనివాస
చన్నకేశవదేవ విశాలభావ!
84. సతత గోదాన దీక్షాపరుండగు నృగుం, డూసరవెల్లియై యుద్భవిలఁడె
అరమసామ్రాజ్య సర్వాధికారము నొంది, పుట్టడే నహుషుండు భుజగమగుచు
నీ కెంత యభిమాన నిలయమైనను యుధిష్ఠిరుఁడుగాంచడె దందదరుని పురము
నారదసంయమి నారియై జన్మించి, వసుధలో సంతతి వడయలేదె
ఎవరి ప్రారబ్ధమును ద్రిప్ప నెవరితరము
గాని పరిపూర్ణ కృప నీకుఁ గల్గియున్న
నెంత ప్రారబ్ధమైన మమ్మేమిసేయు
సురుచిరవిలాస లశునాఖ్యపురనివాస
చన్నకేశవదేవ విశాలభావ!
85. భక్తిమార్గమెఱుంగఁ బడఁజేయని యతండు, గురువుగా డొకపాడు దొరువుగాని
భవదీయ నామ వైభవముఁ జాటని దొక్క, విద్యగాదది మోక్షభిద్యగాని
భర్తతత్వమెఱింగి పల్కనేరకయున్న, భార్యగాదది ప్రాణహార్య గాని
ధర్మమార్గముఁదప్పి తగవుఁదీర్చునతండు, పెద్దగాడొక గ్రుడ్డిగద్దగాని
నిమిషమాత్రంబు నిను మది నిల్పకున్న
నరుఁడుగాడొకవెఱ్ఱి వానరుఁడుగాని
సురుచిరవిలాస లశునాఖ్యపురనివాస
చన్నకేశవదేవ విశాలభావ!
86. మంచిచెడ్డ లెఱింగి సంచరింపకయున్న, పురుషున కిహమందు భక్తిసున్న
పొరుగున జామాత పూని కాపురమున్న, భాగ్యవంతులకెల్ల బ్రతుకు సున్న
దారిద్ర్యమున భార్య తగవులాడుచునున్న, నభిమానులకు జీవితాశ సున్న
పరిపరభామినీ రతులఁదేలుచునున్న, వనితాలలామకు వయసు సున్న
సుతుఁడు చెడుగైన నిహపర గతులు సున్న
మిమ్ము మది నమ్మకున్న మోక్షమ్ము సున్న
సురుచిరవిలాస లశునాఖ్యపురనివాస
చన్నకేశవదేవ విశాలభావ!
87. శిల్పి సంకల్పించి చేసిన శిల దివ్య, మంగళరూపియై మార్పుఁగొనదె
శునకమును దెచ్చి యోపికతోటి సర్వశా, స్త్రములు చెప్పిన నది చదువుకొనదె
హయమును శిక్షఁ జేయఁగఁ దాళగతులకుఁ, దప్పక వర్తించి మెప్పుఁగనదె
కొండకోతినిబట్టి దండించి నేర్పిన, నిల చిత్రకృత్యము ల్నేర్చుకొనదె
ధర మహాపాపినౌ నన్ను దాస దాస
కోటిఁ జేర్పఁగ యత్నించు కొనఁగఁదగదె
సురుచిరవిలాస లశునాఖ్యపురనివాస
చన్నకేశవదేవ విశాలభావ!
88. ఖలుకల్కలున్భీరు గణముచేఁ దలఁదాల్పఁ, బడియు వక్రగుణంబు విడువకుండు
భూత్యవలిప్తత న్మూర్ఖులు ముకురముల్, జనులనువ్యత్యయంబున గ్రహించు
దురు పానహంబులు దుస్కింకరులు స్నేహ, మందియు పదభంగమొందఁఝేయు
నక్షిగతత్వంబు నందియున్నను దుర్జ, నాంజనాకారంబు లరయరాదు
ఇభము లతినీచమానసులెపుడు దమకు
వృద్ధికారణమైన భూభృద్విభగ్న
మునకె యత్నించుచుండు నీభువి నిజంబు
సురుచిరవిలాస లశునాఖ్యపురనివాస
చన్నకేశవదేవ విశాలభావ!
89. కాలాహినిజఫణాగ్రములనుండు గరంబు, సరగునఁ బిండగైఁ జాచినట్లు
బడబాగ్ని నవలీలఁ బట్టిమ్రింగుటకునై, నరుఁ డొకరుఁడు నోరు తెఱచినట్లు
ఆఁకొని గుహనున్న హర్యక్షముంజేరి, తజ్జటల్మెలివెట్టఁ దలఁచినట్లు
జ్వాలావిలోలమౌ కాలకూటవిషంబు, రుచిఁజూడ నివ్విళులూరినట్లు
గాదె మీపదభక్తి సంకలితులైన
బుధుల కపకృతిఁగావింపఁ బూనియుంట
సురుచిరవిలాస లశునాఖ్యపురనివాస
చన్నకేశవదేవ విశాలభావ!
90. తపముసేయఁగఁ బర్వతాగ్రభాగమువీడి, యూషరక్షేత్రమందుండురీతి
యేలారజఃపురితేక్షు సారమువీడి, యతితిక్తరసముఁ దాగతుకురీతి
ఘనరత్నఖచిత కంకణజాలమునువీడి, వన్నెగాజులు దాను గొన్నరీతి
షడ్రసోపేతమౌ శాల్యోదనమువీడి, జొన్నసంకటిఁగోరి తిన్నరీతి
గాదె నిను వీడి యజ్ఞానవాదులౌచు
నరులు దిరుగుట దేవతాంతరమునందు
మానసములుంచి ముక్తికై దీనబంధు
సురుచిరవిలాస లశునాఖ్యపురనివాస
చన్నకేశవదేవ విశాలభావ!
91. కరుణాస్వభావుఁడై కష్టించి నను బెంచి, యొజ్జలకొలువున కొప్పగించి
నేర్పించి సాహిత్య నిగమాగమంబులు, వరుస నన్నొకయింటి వానిఁజేసి
సతతము నావ్యధాసంతసంబులలోనఁ, జాలిన కూర్మితోఁ బాలుగొనుచు
క్షణమైన నన్వీడఁ జాలని మత్సహో, దరుఁడు శేషాచార్యవరుఁడు లేని
కొఱఁత నాకెట్లు దీర్పఁగాఁ దలఁచి యిపుడె
సంభ్రమంబున దేవర సన్నిధాన
మునకుఁ జేర్చితి వైహికంబులకుఁబాపి
యింతలో నిట్లొనర్తువం చెఱుఁగనైతి
సురుచిరవిలాస లశునాఖ్యపురనివాస
చన్నకేశవదేవ విశాలభావ!
92. తత్పుత్రులకుఁ జిన్నతన మింకఁ దీరలే, దని మది విశ్వాసమునిచినావె
భవదంకితముచేయఁ బడిన యీశతకమం, తయు వినువఱకైనఁ దాళినావె
గానరూపంబుగాఁ దానొనర్చిన రామ, కథఁబాడఁ గొన్నాళ్ళు గడపినావె
ప్రణమిల్లి నీకు నేఁ బయనమై యరిగిన, నొప్పగింతలకైన నోర్చినావె
ఇంతతొందరపడితి విదేమి చిత్ర
మకట మత్ప్రియ సోదరు నవనిఁబాప
నెట్లు మ్రింగుదు నీ దుఃఖ మేమిసేతు
హరిహరీ యెంత దుష్కాల మరసిచూడ
సురుచిరవిలాస లశునాఖ్యపురనివాస
చన్నకేశవదేవ విశాలభావ!
93. ఇప్పించితివి ధరిత్రీశ్వరతతిచేత, నెనలేని గౌరవం బెపుడు సభలఁ
దెప్పించితివి సర్వ దిక్కులలోఁ బేరు, వైద్యలోకాచార్యవర్యుఁడనుచుఁ
గప్పించితివి మేనఁ గర్బురాంచలయుక్త, కౌశేయముల్దేవ క్రతువులందు
రప్పించితివి ప్రాజ్ఞరాజిని మైత్రిచేఁ, దనచెంత కనిశంబు వినయమొప్ప
అట్టి మామకసోదరుండైన శేష
విబుధసత్తము నెడఁబాపి వితతశోక
సాగరముంచితే స్వామి నన్ను
సురుచిరవిలాస లశునాఖ్యపురనివాస
చన్నకేశవదేవ విశాలభావ!
94. త్వత్పార్షదుల్కోటి తరణిబింబోజ్జ్వలం, బగు విమానోత్తమం బందునుంచి
సురదుందుభుల్మ్రోయ వరసిద్ధసాధ్య గం, ధర్వులు జయజయధ్వనులుసేయ
దరహాసముఖులౌచుఁ గరమనురక్తి రం, భాదులు దివ్యనాత్యంబుసల్ప
తత్పుణ్యతతిఁ బురందరుఁడు సంశ్లాఘించి, తలయూఁచి తెదురుగాఁ దరలిరాగ
క్రతుభూజుల్గుమిగూడి కైవారముల్సేసి, కూర్మితోఁ గురియింపఁ గుసుమవృష్టి
దశదిశల్వెలుగంగఁ దరణిబింబవిభేద, మొనరించి క్రమముగా నూర్ధ్వలోక
సముదాయమునుదాటి సర్వదేవాలక్ష్య, మై సనాతనమౌచు నప్రమేయ
మహిమానుభూయమై మహితహేమవికార, ద్వారచతుష్టయా వరణగుప్త
మై విరాజిలుచుండి మహనీయ గోపుర, శతసహస్త్రముగల్గి సతతవికచ
హైమాంబుజాకీర్ణ మగు సుధారససరి, చ్ఛాతకోటిచే నలంకృతమునైన
దివ్యలోకముఁజేర్చి దేదీప్యమానకో, ట్యర్కాభమై యందు నలరుచున్న
తపనీయద్వాదశ తలయుతంబగు విమా, నోపకంఠమునందు నునిచి నిత్య
సూరులు వెఱఁగొంది చూచి సంతోషింప, నపుడు దేవీభూషణాయుధముల
నవధరించి పితామహాది దైవత పరి, చర్యలందుచు శేషశయనమందు
వేంచేసియున్న మీ విమల పాదసరోజ, వరయుగ్మసన్నిధిం బరమపావ
నుని మత్సహోదరు నునిచినఁ గరుణార, సాయుతాపాంగ ధన్యాత్ముఁజేసి
దరహాసచంద్రికా ధవలతనిజతను, కాంతికాంతుండవై శాంతముగను
కోభవానని మీరు కూర్మితో నడుగంగ, భవదీయుఁడ నటంచుఁ బల్కి మోద
జలకణపరిపూర్ణ చక్షుఁడై ప్రణమిల్లి, నిగమోక్తసన్మంత్ర నిచయమునను
నుతియించి పరవశమతుఁడై ద్వయంబను, సంధించుచున్న మత్సహజుఁగాంచి
శ్యామలత్వ చతుర్భుజత్వాది లక్షణం, బులఁ బరమాదరంబున నొసంగి
భవదంఘ్రి కైంకర్య పదవిం బ్రసాదించి, కరుణించియుంచితే ఘనచరిత్ర
తలపోయ మా సహోదరుని శేషవిచక్ష, ణుని గూడినంగాని వనజనాభ
శేషిశబ్ధము నీయందుఁజెంది సుస్థి
రంబుగాదని యనవసరంబునందు
నింతచేసితి కాఁబోలు నెంత యుక్తి
పరుఁడవోగాని నిన్నెట్లు ప్రస్తుతింతు
సురుచిరవిలాస లశునాఖ్యపురనివాస
చన్నకేశవదేవ విశాలభావ!
95. మీపాదచింతనామృతవృష్టిలేక యీ, భవదావశోష నేఁ బాయఁగలనె
పరమేశ నీదివ్య భక్తిప్లవములేక, యఘమహార్ణవపార మందగలనె
భవదీయ కైంకర్య భాస్కరప్రభలేక, యజ్ఞానతమము నే నడఁచఁగలనె
త్వత్కథాసల్లాప దంభోళిలేక ష, డ్రిపుసగంబుల సంహరింపఁగలనె
ఏమిచేసెదొ నన్నెట్టు లేలుకొనెదొ
దళితరిపుజాల మృగమద తిలకఫాల
సురుచిరవిలాస లశునాఖ్యపురనివాస
చన్నకేశవదేవ విశాలభావ!
96. సతత పీతామృతా స్వస్థచిత్తసురౌఘ, మునఁజేర్చి స్వర్లోకముననెయుంచు
జననమరణక్లేశ మనుభవించెడు జీవు, లనుజేర్చి భూలోక ముననెయుంచు
నిరతరంధ్రాన్వేష నిష్ఠపన్నగ కులం, బునఁజేర్చి పాతాళ ముననెయుంచు
మతిదుస్సహవ్యధలంది ఘోషిలు పాపు, లను జేర్చి రౌరవం బుననెయుంచు
మెచటనుంచిన నీభక్తి నెపుడు విడువ
నట్టు కృపసేయు వరము నాకెట్టులైన
సురుచిరవిలాస లశునాఖ్యపురనివాస
చన్నకేశవదేవ విశాలభావ!
97. దేవరశ్రీపాద దివ్యభక్త్యున్మేష, మధుర సుధారసమాని దృప్తిఁ
జెందిన మామక జీవితంబంతయు, సరసీరుహాక్ష నీ సమ్ముఖమున
నంజలిఘటియించి నమ్రశిరస్కుండ, నై భాష్పపూరిత నయనయుగళ
మునుగల్గి మేన్గగు ర్పోడువ గద్గదికతో, భవదీయ సుగుణ వైభవముఁ దలఁచి
మాతిమాటికిఁ బరవశ మానసుండ
నగుచుఁ జరుపఁగఁజూడు నాకన్య మేల
సురుచిరవిలాస లశునాఖ్యపురనివాస
చన్నకేశవదేవ విశాలభావ!
98. తరణిబింబము నెప్పుడరవిందములుమాడ్కి, నీమూర్తిఁగనఁగోరు నేత్రయుగము
స్తోకకంబంతరి క్షోదకంబునుబలె, శ్రీపాదతీర్థంబె జిహ్వగోరు
దందశూకంబులు దారగీతముఁబోలె, శ్రవణముల్గోరు మీసత్కథాలి
నంబుదంబును మయూరంబుకైవడి భవ, చ్చరణ నీరజధూళి శిరముగోరు
కడకు నను రౌరవాది లోకములఁద్రోసి
కష్టపెట్టెదొ దేవర కడకుఁదీసి
నిత్యకైంకర్య మొసఁగెదో నే నెఱుంగ
సురుచిరవిలాస లశునాఖ్యపురనివాస
చన్నకేశవదేవ విశాలభావ!
99. ఎటుద్రిప్పిననుద్రిప్పు ముచ్చవచ్చినయట్లు, శ్రీభాగవతగోష్ఠి జెందఁజూడు
మేమిచేసినఁజేయు మెవ్వేళ లనుభవ, త్పరిచర్యలం దాసపడఁగఁజూడు
మెందుఁద్రోసినఁద్రోయు మిందిరాధవతమౌ, గుహఁబడి చింతిలకుండఁజూడు
మెదిగూర్చినఁ గూర్చు మో దయానిధి దుర, హంకృతి ననుఁజేరనట్లుచూడు
మెన్నికష్టము కిచ్చిననిమ్ము మెపుడు
నిను దలంచుచు దాసోహమనఁగఁజూడు
సురుచిరవిలాస లశునాఖ్యపురనివాస
చన్నకేశవదేవ విశాలభావ!
100. కఱకుటమ్ముల మిమ్ముఁ గప్పిన భీష్ముపై, జాలినొందినమాట జ్ఞప్తియున్న
భల్లుకేశ్వర ముష్టి ప్రహరంబులకు సైఁచి, కరుణఁగాంచిన మాట మరువకున్నఁ
దన్నిన భృగునెద న్మన్నించి లాలనఁ, జేయుట విస్మృతిఁ జెందకున్న
గురుశిలావృష్టిఁ బైఁ గురియించిన మహేంద్రు, నరసి ప్రోచినమాట గురుతుయున్న
నస్మదపరాధములు సైచు టనఁగనెంత
వంతఁదీరిచి నను గాచు టెంతవింత
సురుచిరవిలాస లశునాఖ్యపురనివాస
చన్నకేశవదేవ విశాలభావ!
101. ఋణపాతకంబెట్లు నను గష్టపెట్టునో, పనిబూని నీవె కాపాడుమయ్య
భవసాగరం బెప్పుడవలీల ముంచునో, తప్పించి కృపఁజూడఁ దలఁచుమయ్య
నను మృత్యు వేక్షణంబున మోసగింపఁగా, నుండెనో కన్పెట్టి యుండుమయ్య
కర్మశేషం బెట్టి గతి కీడ్చునో నన్నుఁ, జేయూత నొసఁగి రక్షింపుమయ్య
నిన్ను విడనాడి జీవింప నేరనయ్య
ప్రాపునిడకుంట కే నీ పరాయినయ్య
సురుచిరవిలాస లశునాఖ్యపురనివాస
చన్నకేశవదేవ విశాలభావ!
102. ఆశ్రితవనదీక్ష నంది వెల్గెడు భవ, త్సవ్యదివ్యపదాంబు కంబుఁజూచి
తత్సమప్రతిభాయుతంబగు దక్షిణాం, ఘ్రి సరోరుహంబు నొక్కింతకుంచి
సవ్యేతరంబైన జానుతటంబుపైఁ, దద్దివ్యహస్త పద్మంబుఁజేర్చి
యహిరాజభోగ పర్యంకమం దపరక, రంబును హొయలు మీరంగనుంచి
పరకరయుగముచే నరివారమారణ, కరములౌ శంఖ చక్రములఁదాల్చి
ఘనసారమిశ్ర శ్రీగంధ నవ్యసురత్న, భూషణాంచితుఁడవై పొల్పుమీర
సిరియు భూనీళలును పాదసరసిజముల
భద్రముగనొత్త నిద్రాభిముద్రితుండ
వగుచుఁ బవళించియున్న నీదగు విలాస
మూర్తి నెప్పుడు నన్మనోంబుజనందు
నిల్పి కృపఁజూడ నెంచు నన్నల్పుఁడనక
సురుచిరవిలాస లశునాఖ్యపురనివాస
చన్నకేశవదేవ విశాలభావ!
103. శుద్ధసాత్వికప్రకా శోదంచితంబైన, పదమునం బరరూపి వౌచునుండి
ప్రాకృతబ్రహ్మాండ పంక్తులు సృజియించి, తాల్చి పంచవ్యూహ తనువు లచట
విశ్వవిఖ్యాతమౌ విభవత్వమున మీన, కమఠకోలాది రూపములనొంది
తతజీవకోటి హృత్తటసార సోదరాం, తర్యామివై సతతంబు నిలిచి
భుజగశైలాది బహువిధ భాగ్యదేశ
సమితి నర్చాస్వరూపివై సంస్మరింప
సకలచేతన రక్షణేక్షణుఁడవగుచు
నిండియుండిన నీకిదే దండమిడుదు
మఱచినను నేను నిను నన్ను మఱువకయ్య
సురుచిరవిలాస లశునాఖ్యపురనివాస
చన్నకేశవదేవ విశాలభావ!
104. ప్రారబ్ధవశముచేఁ బైఁబడ్డ కష్టముం, బాపి రక్షింప నీభారమంటి
జన్మలో నొకపరి శరణన్న వారల, కభయప్రదుండ వీవనుచు వింటి
నే నొనర్చిన పాప నివహము న్సైరించి, త్వభక్తి నిమ్మని తలఁచుచుంటి
నాయదృష్టంబుచే నఖిల దైవత చక్ర, వర్తివౌ నీయందె వాంఛఁగొంటి
చిత్తశుద్ధికి భంగంబుఁ జేయకంటి
నమ్మియుంటిని నిన్మదిం దమ్మికంటి
సురుచిరవిలాస లశునాఖ్యపురనివాస
చన్నకేశవదేవ విశాలభావ!
105. భోగిరాడ్భోగోప భాగరత్నప్రభా, శబలిత నిజకాంతి సంఘనీవు
లోకైకనుత జగల్లోచనాన్వయ సరి, త్పతికైరవాప్తుఁడై ప్రాజ్ఞుఁడైన
శ్రీమన్మహారాజ శేఖరుఁడౌ దశ, రథసార్వభౌముని రమణియందు
జన్మించి శ్రీరామ చంద్రుండవై యొన, ర్చిన దివ్యచరిత వర్ణించి రాఘు
వాభ్యుదయమను పేరుతో వసుధ జన్మ
సార్థకముఁ జేసికొననుంటి సమయ మరసి
యెట్లు దోడ్పడనుంతివో యిందిరేశ
సురుచిరవిలాస లశునాఖ్యపురనివాస
చన్నకేశవదేవ విశాలభావ!
106. ఒకదివ్య చరణంబు నొనరుగా ముందిడి, నొగ నొక జానువునుంచి నిల్చి
సవ్యదక్షణహస్త జలజంబులం గశా, జ్ఞానముద్రలఁబూని మానితముగ
ప్రణయరసావేశ భరితమై యొప్పారు, దృక్కుచేఁ బార్ధుని దిక్కుఁజూచి
లలితకుండలకాంతి చలితమై యెడనెడ, గండభాగములందు మెండుకొనఁగ
సకలవేదాంతార్థ సారమై సంసార, తారమై వెల్గు గీతామృతాబ్ధిఁ
దేలి యాడించుచున్న మీ దివ్యమూర్తి
నన్మనస్తామరసపీఠమందు నిత్య
వాసముంజేయుఁగాక గర్వాభిభూత
జాత చేతన హరరోష సూతవేష
సురుచిరవిలాస లశునాఖ్యపురనివాస
చన్నకేశవదేవ విశాలభావ!
107. శుభమస్తుతే యశశ్శోభిత భువనాయ, విజయోస్తు దరచక్ర నిజకరాయ
స్వస్త్యస్తునీహార పతిమిత్రనేత్రాయ, కల్యాణమస్తుతే కలిహరాయ
శివమస్తు భవపద్మ భవనతపాదాయ, మంగళమస్తుతే మాధవాయ
భావుకమస్తుతే భవరోగహరణాయ, కుశలంసదాస్తు సద్గుణగణాయ
దాసజనపరిపాలనోత్సాహ తరళితాంత
రంగవిభవాయతే నమో భంగురాయ
సురుచిరవిలాస లశునాఖ్యపురనివాస
చన్నకేశవదేవ విశాలభావ!
108. దండంబిదే పద్మజాండకోటిపిచండ, ఖండితరిపు శిరఃకాండ నీకు
వందనంబిదె మౌని బృందవందితలస, త్సుందర చరణార వింద నీకు
జోహారిదే చతుర్బాహాధ్రజితాంబు, వాహ సందోహ శ్రీదేహ నీకు
సాష్టాంగమిదె భక్త కష్టాపనోద సం, తుష్టాంతరంగ సంసృష్ట నీకు
ప్రణతిశతమిదె మోహిత బ్రహ్మరుద్ర
శక్రముఖ్యాసురారాతి సంఘ నీకు
సురుచిరవిలాస లశునాఖ్యపురనివాస
చన్నకేశవదేవ విశాలభావ!
109. నతి నీకుఁ గారుణ్యమతి దయానిధి భక్త, వత్సల నీపాద వనజ భక్తి
పరవశస్వాంతుండఁ గరుణ్తో నన్గావు, మస్మత్పురాతనంబైన కర్మ
వశముచే జడుఁడనై మశకకీటాది జ, న్మము లెన్నియో నొంది మమకీన
కర్మక్ష్యంబున న్గన్గొంటి భవదంఘ్రి, పంకేరుహద్వంద్వ పత్తనంబు
నీ సమయం బాది దాసదాసుఁడ జగ, త్పతి వలదిక నిల భవము నాకు
భవసాగరోదర పతితుండనౌ నన్ను, దరిఁ జేర్ప మీపాద సరసిజములు
గాక వేఱొక దిక్కుగలదె మామక ధన, దారాది బహువిధ భార మిపుదె
శ్రీజనార్ధన నీయందుఁ జెందఁజేసి
యుంటి శరణాగతుండనై యుష్మదంఘ్రి
సేవనొనగూర్చి వేగ రక్షింపుమయ్య
సురుచిరవిలాస లశునాఖ్యపురనివాస
చన్నకేశవదేవ విశాలభావ!
110. అభవశ్రీ వైఖానసాన్వయ కలశాబ్ధి, పూర్ణసుధాకరమూర్తియైన
శ్రీరామదేశిక సూరివర్యుఁడు గలం, డఖిలార్థవేది మోహప్రభేది
తద్ధర్మపత్నియై దనరు లక్ష్మీనర్స, మాంబకు నేఁ దృత్తీయాత్మజుండ
మహిశ్రీభరద్వాజమౌని గోత్రుఁడ భవ, త్పద నీరజార్చన ప్రముదితుండ
సర్వేశరామానుజాభిధానుండ మీ, సహజకోమల కృపాసముదయమునఁ
గూర్చియొసఁగినాడ నోర్చి లోపములున్నఁ, గైకొని యీశతకంబు నన్నుఁ
గరుణఁ గృతకృత్యుఁజేయుమో ఘనఘనాంగ
రక్షితామర సామ్రాజ్య లసదపాంగ
సురుచిరవిలాస లశునాఖ్యపురనివాస
చన్నకేశవదేవ విశాలభావ!
పరిసమాప్తము