Tuesday, November 12, 2013

బెజవాడ కనకదుర్గాంబ శతకము - సరికొండ నరసింహరాజు

బెజవాడ కనకదుర్గాంబ శతకము
సరికొండ నరసింహరాజు
(కందపద్య శతకము)

1. శ్రీరమణీ వినుతాంబా
ఘోరదురితశైలశంబ గుణనికురంబా
నీరదవేణి విడంబా
నారీ బెజవాడ సత్కనక దుర్గాంబా

2. అంబరము జూచి వాజి సం
గంబొందు నటంచు శివదిగంబరివొయ్నీ
డంబము సరెనను శరజ
న్మాంబా! బెజవాడ కాళికాంబ! మదాంబా!

3. శంబర మొక్కటి కేలను
శంబరము శిరమునందు సరెసరెనే న
ర్ధంబిక నాయను శరజ
న్మాంబా! బెజవాడ కాళికాంబ! మదాంబా!

4. అంబుజములుదాల్చియు వా
డంబడునని యేరునిల్పు డమరుకధరయన్
చుంబతిగేరెటి శరజ
న్మాంబా! బెజవాడ కాళికాంబ! మదాంబా!

5. అంబిక నామది నీపా
దంబులపై యుండునటుల దయసేయ వేచి
........ శరజ
న్మాంబా! బెజవాడ కాళికాంబ! మదాంబా!

6. త్ర్యంబకమత ధూషుల నిశి
తాంబకములపాలుజేసి యఖిలసుర కదం
బంబుల నేలవె శరజ
న్మాంబా! బెజవాడ కాళికాంబ! మదాంబా!

7. అంబూకృత గీతసతీ
స్తంబవిజిత వాసినిన్ను సరసొక్తుల డెం
దంబున గొలిచెద శరజ
న్మాంబా! బెజవాడ కాళికాంబ! మదాంబా!

8. జంబూనది జంబూనద
జంబాలముగన్యజేసి చతురాస్యుడుని
న్సాంబునకిడడే శరజ
న్మాంబా! బెజవాడ కాళికాంబ! మదాంబా!

9. అంబికనీపద రాజీ
వంబులుభజించినాడ వడినాదుష్క
ర్మంబులు బాపవె శరజ
న్మాంబా! బెజవాడ కాళికాంబ! మదాంబా!

10. కంబంబున బొడమిన పీ
తాంబరధర తోడబుట్టి దయచేముల్లో
కంబులనేలవె శరజ
న్మాంబా! బెజవాడ కాళికాంబ! మదాంబా!

11. అంబుజ సంభవు వరగ
వంబున మహిషుండు నిను వడి మార్కొనిప్రా
ణంబులు విడవడె శరజ
న్మాంబా! బెజవాడ కాళికాంబ! మదాంబా!

12. జాంబవతి నీదుపద ప
ద్మంబులుమదినిల్పి విష్ణుదారామణియై
సంబర మొందదె శరజ
న్మాంబా! బెజవాడ కాళికాంబ! మదాంబా!

13. కంబుత్రి శులము గంతయు
శంబరమును కేలబూను సాంబశివునిదే
హంబున సగమౌ శరజ
న్మాంబా! బెజవాడ కాళికాంబ! మదాంబా!

14. లంబాలక నీదుకపో
లంబులు ముకురంబులనుచు లవిశంకరు స
చ్చుంబనల మెచ్చు శరజ
న్మాంబా! బెజవాడ కాళికాంబ! మదాంబా!

15. బింబాధరము చిల్కల
గుంబల్కులుకనులు మీండ్లుకుచములు కవలౌ
చుంబొదలియలర శరజ
న్మాంబా! బెజవాడ కాళికాంబ! మదాంబా!

16. నింబాళిచీరెగట్టి కు
సుంబాకంచుకము దొడగి సుందరమౌ వే
సంబులసుందరె శరజ
న్మాంబా! బెజవాడ కాళికాంబ! మదాంబా!

17. అంబికనీ మోముకు శశి
బింబంబెనగాక గగనవీధికి కనుప
క్షంబైన నోడె శరజ
న్మాంబా! బెజవాడ కాళికాంబ! మదాంబా!

18. అంబుదము నీదువేణి
కంబళమున కోడిగిరుల కానలబడి వా
దంబాడి గ్రక్కె శరజ
న్మాంబా! బెజవాడ కాళికాంబ! మదాంబా!

19. శంబరహర నితఖిలగిరి
శంబలసద్గుణ కదంబ శంబర నేత్రీ
బింబాధరివౌ శరజ
న్మాంబా! బెజవాడ కాళికాంబ! మదాంబా!

20. అంబక పంచకు డలను త్ర
యంబకు నెదిరించు పగిది ననృతులునిను హా
స్యంబాడి చెడరె శరజ
న్మాంబా! బెజవాడ కాళికాంబ! మదాంబా!

21. అంబరుహాప్త ప్రతి బిం
బంబనగా మెరయురత్న పతకమొసగునీ
లంబన మెన్నెద శరజ
న్మాంబా! బెజవాడ కాళికాంబ! మదాంబా!

22. అంబుజరుహ నేత్రిహర
చుంబిత బింబా ధరోష్టిశ్రుతిహితవాణీ
యంబుదవేణి శరజ
న్మాంబా! బెజవాడ కాళికాంబ! మదాంబా!

23. భంబులమించును నీదున
ఖంబులు పద్మములు నీదృగంబులు గద నీ
లాంబుద కచవౌ శరజ
న్మాంబా! బెజవాడ కాళికాంబ! మదాంబా!

24. తాంబూలీ సంభసం
భంబుల పోకలను ప్రజశుభంబుగనీ ధా
మంబుల నించరె శరజ
న్మాంబా! బెజవాడ కాళికాంబ! మదాంబా!

25. సాంబకరాలంబితకుచ
శంబరవైరినుత గౌరిసాథ్వీమణిరో
లంబసమాలక శరజ
న్మాంబా! బెజవాడ కాళికాంబ! మదాంబా!

26. జాంబూస దాంబరాభర
ణంబులు ధరియించి ప్రమథ నాధుని వామాం
కంబున మెరయవె శరజ
న్మాంబా! బెజవాడ కాళికాంబ! మదాంబా!

27. అంబరసమమధ్య మశశి
బింబసదృశముఖవిరాజి బింబాధరి కా
దంబగమన వర శరజ
న్మాంబా! బెజవాడ కాళికాంబ! మదాంబా!

28. పంబల తప్పెట్లమృదం
గంబుల రవములను నీదుగణములు ప్రతి గ్రా
మంబుల నెగడరె శరజ
న్మాంబా! బెజవాడ కాళికాంబ! మదాంబా!

29. తాంబూలంబులు గడుధూ
పంబులుగొని యుగ్రములను బ్రబలెగణములూ
ళ్లంబరికింపవె శరజ
న్మాంబా! బెజవాడ కాళికాంబ! మదాంబా!

30. తెంబలగా మేకల గొ
ర్లంబొరిగొని భక్తగణాము రక్షించిన నీ
సంబర మెంచెద శరజ
న్మాంబా! బెజవాడ కాళికాంబ! మదాంబా!

31. కంబుల పూరించుచు నృ
త్యంబుల చెలరేగి నీదయావేశులు కో
పంబున నెదడరె శరజ
న్మాంబా! బెజవాడ కాళికాంబ! మదాంబా!

32. అంబరకేశునితో వా
దంబాడిన దక్షునింట నడగియు హిమవం
తంబున బుట్టవె శరజ
న్మాంబా! బెజవాడ కాళికాంబ! మదాంబా!

33. లంబోదరు డెంతో మో
దంబున నినుగొల్వ ముదముదనరు పగిది క్షే
మంబొసగు మాకు శరజ
న్మాంబా! బెజవాడ కాళికాంబ! మదాంబా!

34. అంబనయుత సుగ్రీవా
జంబుక సంస్తూయనామ శాంభవి భవ్య
స్తంబజగదాంబ శరజ
న్మాంబా! బెజవాడ కాళికాంబ! మదాంబా!

35. తంబూర ఢక్కితాళర
వంబులతో నిన్నుబహుగావర్ణించిన మే
ల్సంబర మొందవె శరజ
న్మాంబా! బెజవాడ కాళికాంబ! మదాంబా!

36. అంబుజభవ శక్రాదులు
తుంబురునారదులతోడ తోతెంచిరి నీ
సంబరముజూడ శరజ
న్మాంబా! బెజవాడ కాళికాంబ! మదాంబా!

37. కంబళసమ కచసుప్రా
లంబగుణకదంబ భవ్యలీలానికురంబా
బింబాధరోష్టి శరజ
న్మాంబా! బెజవాడ కాళికాంబ! మదాంబా!

38. నంబులు తంబళులును భే
దంబులు లేకుండ నీసుధామములకు దం
డంబులు బెడుదురు శరజ
న్మాంబా! బెజవాడ కాళికాంబ! మదాంబా!

39. బింబితకర మౌనీరూ
పంబులు గాశిలల నేరుపరిదియు నటధూ
పంబుల నిడరే శరజ
న్మాంబా! బెజవాడ కాళికాంబ! మదాంబా!

40. బాంబూనద కృతకుంభజ
లంబులచేవారుబోసి లలనలు(?) నీ పా
దంబులబడరే శరజ
న్మాంబా! బెజవాడ కాళికాంబ! మదాంబా!

41. బొంబై కాశీపురదే
శంబులలో జనులయెదలు ఝల్లనగను నీ
డంబము జూపవె శరజ
న్మాంబా! బెజవాడ కాళికాంబ! మదాంబా!

42. డంబముగల మంత్రజ్ఞుల
దుంబాళా జేసి మాకుతో డైకడు మో
దంబున బ్రోవవె శరజ
న్మాంబా! బెజవాడ కాళికాంబ! మదాంబా!

43. కంబళి వాక్యంబులతో
పంబలు తప్పెట్లుమ్రోయ ప్రజలందరు నీ
గుంబము జేరరె శరజ
న్మాంబా! బెజవాడ కాళికాంబ! మదాంబా!

44. స్తంబేర మారినెక్కిజ
గంబులపై దాడివెడలి కరిడీజాడ్యా
డంబరముడుపవె శరజ
న్మాంబా! బెజవాడ కాళికాంబ! మదాంబా!

45. త్య్రంబక పరిరంభణమున
సంబరమును జెందుచిత్త సారసలహరీ
బింబాధరివౌ శరజ
న్మాంబా! బెజవాడ కాళికాంబ! మదాంబా!

46. శంబాకృతమగు భువిధా
న్యంబులు ఫలియించినటుల నంబికనీ మం
త్రంబున నెగడితి శరజ
న్మాంబా! బెజవాడ కాళికాంబ! మదాంబా!

47. స్తంబర మమునుకుంభీ
రంబొగి బాధించినట్లు రాపాడెటి లే
మింబొరిగొనవె శరజ
న్మాంబా! బెజవాడ కాళికాంబ! మదాంబా!

48. కంబీలం దింగలమిడి
రంబెముగను దీపమొసగి రాత్రులునీ మం
త్రంబులనుడువరె శరజ
న్మాంబా! బెజవాడ కాళికాంబ! మదాంబా!

49. జంబీర ఫలములను శు
భంబుగనీ ముందరునిచి ప్రజలందరు నృ
త్యంబులు జేయరె శరజ
న్మాంబా! బెజవాడ కాళికాంబ! మదాంబా!

50. చెంబులు మూతలుగాకల
శంబులనై వేద్యమునీచి జనములు సంతో
షంబుగ వచ్చెదరౌ శరజ
న్మాంబా! బెజవాడ కాళికాంబ! మదాంబా!

51. కంబములు నిల్పియిటికెల
గుంబంబులు గట్టినీదు కొలుపులు ప్రతిగ్రా
మంబులజేయరె శరజ
న్మాంబా! బెజవాడ కాళికాంబ! మదాంబా!

52. డంబము కృష్ణోత్తర శై
లంబుననివసించి భక్తులకు బహుసామ్రా
జ్యంబుల నివ్వవె శరజ
న్మాంబా! బెజవాడ కాళికాంబ! మదాంబా!

53. తంబళి నినుగొల్వగ మో
దంబున వేశ్యాజనంబు తాళగతులనా
ట్యంబాడిరిగద శరజ
న్మాంబా! బెజవాడ కాళికాంబ! మదాంబా!

54. జంబూఫలం బుక్రియను వి
షంబుగళంబందునిల్ప జాలుదువని ప్రే
మంబతిననుపవె శరజ
న్మాంబా! బెజవాడ కాళికాంబ! మదాంబా!

55. తాంబూరనాదమునుగా
త్రంబొక్కటి గాగబలుకు తాళజ్ఞులతో
సంబరమొందవె శరజ
న్మాంబా! బెజవాడ కాళికాంబ! మదాంబా!

56. అంబరము నొరయునీగుడి
కంబములందిడిన దీపకళికలునక్ష
త్రంబులనదగును శరజ
న్మాంబా! బెజవాడ కాళికాంబ! మదాంబా!

57. బింబంబని నీయధరో
ష్టంబుశుకంబాను నపుడుశంభుండుగని మో
దంబొందెనుగద శరజ
న్మాంబా! బెజవాడ కాళికాంబ! మదాంబా!

58. జాంబూన దగిరికార్ముక
మంబుధి యంబుధిగాగ నలరినశివు డెం
దంబందుమెలగు శరజ
న్మాంబా! బెజవాడ కాళికాంబ! మదాంబా!

59. భంబులమించును నీదున
ఖంబులు పద్మములు నీదృగంబులుగద నీ
లాంబుదకచవౌ శరజ
న్మాంబా! బెజవాడ కాళికాంబ! మదాంబా!

60. కుంభిణిదుష్కృత జనభా
రంబుడుపుమటంచు నిన్ను రహి వేడిన కో
పంబున వెడలితి శరజ
న్మాంబా! బెజవాడ కాళికాంబ! మదాంబా!

61. శంబరమును కేలబూనిన
శంభునియర్ధంగివైన శాంభవివని డెం
దంబునగొల్తును శరజ
న్మాంబా! బెజవాడ కాళికాంబ! మదాంబా!

62. శంబరమున నిలుడెత్తుక
దంభకుడై పోవుననుచు దాల్చువరుఫణీ
లంబనలమెచ్చు శరజ
న్మాంబా! బెజవాడ కాళికాంబ! మదాంబా!

63. శంభునితలభిక్షాపా
త్రంబుగగొన్నట్టి శంభుదారామణినే
మంబుగ నెంతును శరజ
న్మాంబా! బెజవాడ కాళికాంబ! మదాంబా!

64. సంభాదంబులనిను వే
దంబుల చేనుడువప్రేమ దళుకొత్తగ నే
రంబెంచదగునె శరజ
న్మాంబా! బెజవాడ కాళికాంబ! మదాంబా!

65. కుంభముమహిసురాది జ
నంబులునీఢాకకడ్రిన మ్రులమని ఖే
దంబులు మానరె శరజ
న్మాంబా! బెజవాడ కాళికాంబ! మదాంబా!

66. కాంభోజలాటదహళాం
ధ్రంబులజనులెల్లనీకు దగుకాన్కలు వే
గంబునదెచ్చిరి శరజ
న్మాంబా! బెజవాడ కాళికాంబ! మదాంబా!

67. దంభకుడై రావణుడురు
జృంభణముననవలమెత్తి సోలుచుమీబల్
గంభీరమెంచె శరజ
న్మాంబా! బెజవాడ కాళికాంబ! మదాంబా!

68. దంభకమతకుత్కీలక
దంభోళివటంచునిన్ను దలతునునా చి
త్తాంభోజమునను శరజ
న్మాంబా! బెజవాడ కాళికాంబ! మదాంబా!

69. గంభీరఘోషఘనసం
రంభంబునమించువాద్య రవములతో నీ
జృంభణము మెరసె శరజ
న్మాంబా! బెజవాడ కాళికాంబ! మదాంబా!

70. అంభోజోద్భవుడు చిత
స్తంభముల వేదినగ్ని సాక్షిగనిను శ్రీ
శంభునకు గూర్చె శరజ
న్మాంబా! బెజవాడ కాళికాంబ! మదాంబా!

71. అంభోదరగర్జితవా
గ్ధంభకజనగళవిదారి కరుణాకరు ది
వ్యాంభోజముఖివె శరజ
న్మాంబా! బెజవాడ కాళికాంబ! మదాంబా!

72. కుంభజముఖ సయ్యమినికు
రుంభము భవదీయ గృహవిలోకనమున మో
క్షంబందిరిగద శరజ
న్మాంబా! బెజవాడ కాళికాంబ! మదాంబా!

73. శంభుడు విజయుడు కిటికై
శుంభోత్కోపమునబోరు చుండగగనిమో
దంబొందితీవె శరజ
న్మాంబా! బెజవాడ కాళికాంబ! మదాంబా!

74. జంబలఫలములు నీకుచ
కుంభముల కీడుగాక కోతలబడి వా
డంబడెచూడగ శరజ
న్మాంబా! బెజవాడ కాళికాంబ! మదాంబా!

75. సంభాసిత జంభలకుచ
జంభారినుతాంఘ్రియుగళి శాంభవినావి
స్రంభము మాంపవె శరజ
న్మాంబా! బెజవాడ కాళికాంబ! మదాంబా!

76. రంభలకుసాటి నీతొడ
లంబుజములు బోలుపదములవనిని నీ
కుంబాటిలేరు శరజ
న్మాంబా! బెజవాడ కాళికాంబ! మదాంబా!

77. అంబరమణికాంతశిలా
స్తంబఘటితవాస వాసిశైలనితంబా
స్తంబవిహారివె శరజ
న్మాంబా! బెజవాడ కాళికాంబ! మదాంబా!

78. డంబముగను నీముందట
కుంభములబోసి గొర్ల గోసియబలు నృ
త్యంబాడిరిప్రజ శరజ
న్మాంబా! బెజవాడ కాళికాంబ! మదాంబా!

79. గుంబములు వదలి చెంబులు
కంభీల్గొని జనములెల్ల గదలియు వనవా
సంబునుజేయరె శరజ
న్మాంబా! బెజవాడ కాళికాంబ! మదాంబా!

80. అంబుధి జంబాలంబై
నంబుధజన కగ్రహంబు నడవడివిడినన్
దంభముబలుకవు శరజ
న్మాంబా! బెజవాడ కాళికాంబ! మదాంబా!

81. శంభుపరి అంభణమున
సంబాసిత చిత్తవైన జంబలకు సనా
దంభము లుడుపవె శరజ
న్మాంబా! బెజవాడ కాళికాంబ! మదాంబా!

82. రంభాస్థంభ ప్రతిరూ
పంబులు నీయురువులు నభంబగునీ మ
ధ్యంబుగదా వర శరజ
న్మాంబా! బెజవాడ కాళికాంబ! మదాంబా!

83. జాంబూనదగరుడశిలా
స్తంబస్ధగితంబుగాక దనరిననీ దే
హంబుభజియింతు శరజ
న్మాంబా! బెజవాడ కాళికాంబ! మదాంబా!

84. శంభుండు గంగనునీపా
దంబులబడవై చెననగదగె కృష్ణానం
ద్యాంబుదవేణి శరజ
న్మాంబా! బెజవాడ కాళికాంబ! మదాంబా!

85. బంభరసమకుంతలకా
దంబగమన కంబుకంఠి దైత్యాంతకి చి
త్రాంబరధారివె శరజ
న్మాంబా! బెజవాడ కాళికాంబ! మదాంబా!

86. శంభుండుకాళీయనిహా
స్యంబాడినగౌరవర్ణమతివినీ స
త్యం బేమనదగు శరజ
న్మాంబా! బెజవాడ కాళికాంబ! మదాంబా!

87. డాంబికమునదిరుగను కొం
డెంబులు పల్కంగనేర డెందంబుననీ
జృంభణమెన్నెద శరజ
న్మాంబా! బెజవాడ కాళికాంబ! మదాంబా!

88. అంభీధిస్తంబుండగు
శంభునిశాంబరిజయించి సాంతవనముచే
రంబొదలితివివౌ శరజ
న్మాంబా! బెజవాడ కాళికాంబ! మదాంబా!

89. శుంభద్భలయుతదానవ
కుంభినిచయసింహరూపి గురుతరకోపి
శాంభవివీవే శరజ
న్మాంబా! బెజవాడ కాళికాంబ! మదాంబా!

90. శుంభద్ధంభవిహారి
కంబుగళీయంబుజాక్షి కంబుచయధరీ
శుంభద్గుణివౌ శరజ
న్మాంబా! బెజవాడ కాళికాంబ! మదాంబా!

91. దంభకనికురుంబముపీ
తాంబరుధరుడాదివిష్ణు డనిగొల్వక వా
దంబులమడయరె శరజ
న్మాంబా! బెజవాడ కాళికాంబ! మదాంబా!

92. ఓంభూర్భువరవదక్షమ
ఖంబువిఖాతంబుజేసి కడువడిహిమ గో
త్రంబునబుట్టవె శరజ
న్మాంబా! బెజవాడ కాళికాంబ! మదాంబా!

93. అంబిక నినుభువనావ
స్తంభప్రతిమలుగ జేసి జనులందరు మో
దంబున గొలువరె శరజ
న్మాంబా! బెజవాడ కాళికాంబ! మదాంబా!

94. యంబెరు మానారుపదా
బ్జంబులు మదితలచినీదు సమ్మతిగొని ప
ద్యంబులు జేసితి శరజ
న్మాంబా! బెజవాడ కాళికాంబ! మదాంబా!

95. అంబిక నీచరితములం
దంబగుకందములుగాగ నఖిలజనా నం
దంబుగ జెప్పితి శరజ
న్మాంబా! బెజవాడ కాళికాంబ! మదాంబా!

96. తాంబూలీస్తంభ స్త
భంబులపోకలను ప్రజశుభంబుగనీ ధా
మంబులనించరె శరజ
న్మాంబా! బెజవాడ కాళికాంబ! మదాంబా!

97. స్తంభాద్రిపురికి నాగ్నే
యంబునకొండపలి దక్షణాచలశిఖరా
గ్రంబందునుండు శరజ
న్మాంబా! బెజవాడ కాళికాంబ! మదాంబా!

98. శంబర భరకృష్ణాతీ
రంబగునాగులవరంబు రాజిలుశుభవా
సంబుగ నుండుదు శరజ
న్మాంబా! బెజవాడ కాళికాంబ! మదాంబా!

99. కుంభిణితుమ్మల చెర్వున
యంబవగువంశాబ్ధిచంద్రు డౌ మల్లయ పా
దాంబుజ సేవ్యుడ శరజ
న్మాంబా! బెజవాడ కాళికాంబ! మదాంబా!

100. కుంభిణిగలసరికొండకు
లంబునజనియించు నర్స్రాయాఖ్యుడ నీ
కుంబరిచారుడ శరజ
న్మాంబా! బెజవాడ కాళికాంబ! మదాంబా!

Friday, November 8, 2013

జానకీనాయక శతకము - మాటూరు వెంకటేశం

జానకీనాయక శతకము
                                      మాటూరు వెంకటేశం

1. శా. శ్రీరామా రవివంశజా రఘుపతి సీతేశ శ్రీరాఘవా
తారేశాయుతసార చారువదనా దాక్షిణ్యరత్నాకరా
మారీచాదిసమస్తదైత్యహరణా మార్తాండకోటిప్రభా
మారారి ప్రముఖామరాళినుత రామా జానకీనాయకా

2. శా. రామా! రామా! కృపాసముద్ర! రఘువీరా! ధరుణీవల్లభా!
సోమాబ్జప్రియకోటితేజ! రవివంశోద్ధార! శ్రీరాఘవా
శ్రీమాటూరిపురీశ! కృష్ణ! కమలాచిత్తాబ్జభృంగంబయి
మ్మా మాకోరికలన్నియున్నిపుడు రామా జానకీనాయకా

3. మ. నినువర్ణింపఁగ నెంతవాఁడ మదిలో నీపాదపద్మంబులే
ననిశంబున్నతభక్తితోఁ దలఁతు నాయందుంగృపం జూపవే
నిను వర్ణింపగ శక్తిహీనుడను నా నేర్పేర్పడన్ బద్యముల్
మనసొప్పన్ రచియించి నీ కిడుదు రామా జానకీనాయకా

4. మ. చదువుల్మిక్కిలినేర్వలేదు జపముల్ సల్పంగనేనేర నీ
పదపద్మంబులునమ్మినాఁడ మదిలో పాపఘ్ను సర్వేశ నా
రదమౌనిస్తుత రామ భూరమణ రారా యంచుఁ గీర్తింతు స
మ్మదముంబొందుచు నన్నుగావు మిఁక రామా జానకీనాయకా

5. మ. కరినిం బ్రోచినభంగి నింద్రతనయున్ గన్గొన్నచందంబునన్
మఱియాద్రౌపదిగాచురీతి ధ్రువు సన్మానించుభావంబునన్
గుఱిగా భీష్మునిజూచుపోలిక ననుం గూడం గృపఁజూడవే
మరియాదల్చనకుండ భక్తునెడ రామా జానకీనాయకా

6. మ. సిరులన్ నమ్మఁగలేదు, భూమిపతులన్ సేవింపబోలేదు ని
న్నెఱుఁగన్ నేరని దుష్టమానవులతో నింపెంతగావచ్చినన్
మురియన్ లేదు, సమస్తభంగులను నిన్నున్ నమ్మి నీనామసం
స్మరణన్ జేసెద గావవే దయను రామా జానకీనాయకా

7. మ. మదిలో నిన్నుదలంచియున్ శరణనన్ మన్నించుచందంబులున్
విదితంబై బహుశాస్త్రముల్దెలుపఁగా వేమాఱునిన్వేఁడినన్
సదయత్వంబున బ్రోవవేమియిఁక దోసం బెంతయుం జేసినన్
మదిలో నీవనినమ్మియుంటిఁగద రామా జానకీనాయకా

8. మ. కరుణన్ గావవదేమి భక్తునియెడన్ కౌటిల్యమింతేటికిన్
శరణన్నంతనె శత్రుసోదరున కాచంద్రార్కమౌనట్టి యా
వరమేలాగున నిచ్చితో, కపటక్రవ్యాదేశునెట్లోమితో
మఱపుల్ నాయెడగల్గెనా యిపుడు రామా జానకీనాయకా

9. మ. నిను నేఁగొల్చెదనంటి నీచరణముల్ నేనమ్మినానంటి నా
వినయోక్తుల్వినమంటి దోసముల నుర్విన్ మాపుమంటిన్ వరం
బనిశంబీమనియంటి, నిన్ విడచి దేవా యన్యుసేవింప నా
మనముం బాయకనిల్వమంటిఁగద రామా జానకీనాయకా

10. మ. మఱువంబోకు పరాకుగాకు వరమిమ్మా నాకు నే దైవమున్
సరిగారెన్నఁగనీకు, నీగుణకధల్ సల్పంగఁబోబోకు నా
మొఱయాలించుటగొప్పనీకు, నదియేమోయంటివానాఁడు నీ
మరియాదల్చనకుండనుండుఁగద రామా జానకీనాయకా

11. మ. మిమునేనమ్మినవాఁద నాయెడను స్వామీ మున్ను బ్రహ్లాదునిన్
విమలాత్ముండగు నవ్విభీషణుని దేవేంద్రాత్మజున్ ద్రౌపదిన్
ప్రమదంబిచ్చుచుఁబ్రోచినట్లు నను సంభావింపు కారుణ్యతన్
మమకారంబులువాసి గొల్చెదను రామా జానకీనాయకా

12. మ. అహిశయ్యంబవళించుచున్ గరుడవాహారూఢిచే నొప్పుచున్
దహనజ్వాలలమించు చక్రమరచేతన్ బట్టి దైత్యేశులన్
బహుభంగిన్ దునుమాడి సర్వజగముల్ బాలింతువేవేళ నీ
మహిమంబు ల్గొనియాడనావశమె రామా జానకీనాయకా

-: దశావతారములు :-

13. మ. నిగమంబుల్గొనిపోవుసోమకునితో నీవంబుధిన్ జొచ్చి స
త్వగతిన్ వానివధించి వేదచయముల్ వాణీశు కిప్పింపవే
పగసాధించి మహాత్మ యచ్యుత పరబ్రహ్మంబవైనట్టి నీ
దగు మీనాకృతి కేను మ్రొక్కెదను రామా జానకీనాయకా

14. శా. దేవానీకము రాక్షసు ల్బలిమిచే ధీరాత్ములై మంథర
గ్రావంబు, న్బెకలించి పాలకడలిన్ గవ్వంబుగాఁద్రచ్చినన్
భావంబుల్చెడి లోకముల్ భయపడన్ బాలించి కూర్మంబవై
మావక్షస్థలి నిల్పవే గరిమ రామా జానకీనాయకా

15. మ. లనకాఖుండు వరబ్రభావపటిమన్ గర్వాంధుడై భూమితాఁ
గొని వారాశినిడాగియున్నయపుడున్, క్రోడస్వరూపంబునన్
దనుజాధీశునిద్రుంచి యెప్పటిగతిన్ ధాత్రిన్ దగన్ నిల్పవే
మనుజాహారకులాటవీదహన రామా జానకీనాయకా

16. శా. నరసింహాకృతి నుక్కుకంబమునజన్మంబౌచు నత్యుగ్రతన్
కరయుగ్మంబునఁబట్టి హేమకశిపున్ ఖండించి శాంతుండవై
హరబ్రహ్మాదులు మౌనిబృందములునిన్నాత్మన్ బ్రశంసింపఁగా
మఱిబ్రహ్లాదుని గాచి తివెకద రామా జానకీనాయకా

17. మ. మరుగుజ్జుండవునై వటుందవగుచున్ మధురవాక్యంబులం
దరికిన్ మెప్పువహింపఁ బల్కుచు బలిన్ దానంబు మూడడ్గులున్
బరగన్వేఁడి గ్రహించి భూమి నభముల్ పాదద్వయింగప్పి క్ర
మ్మర పాదంబున దైత్యు ద్రొక్కితివి రామా జానకీనాయకా

18. మ. జనకున్ జంపిన కోపవహ్ని దనరన్ శశ్వత్కుఠారంబుచే
జనలోకేశుల నిర్వదొక్కతడవల్ సంధించి వేవేగమే
యనిలో రూపులు మాపి కశ్యపునకున్ జ్యాదానమున్ జేయవే
మనసోత్సాహముతోడ నిందలఁతు రామా జానకీనాయకా

19. మ. మొదటం తాటకిద్రుంచి మౌనిసపనంబుంగాచి గౌరీశు వి
ల్లదియంతన్ దునుమాడి భూసుతవివాహంబౌచు బిత్రాజ్ఞచే
ముదమొప్ప న్వనభూమికేగి జగముల్మోదింపగారావణున్
మదిలోభీతిలఁగూల్చవే ధరణి రామా జానకీనాయకా

20. మ. బలరామాఖ్యుఁడవై హలాయుధమునం బల్మాఱుదైత్యేశులం
దలల్న్ ద్రుంచి ప్రతాపమొప్పఖలులందండించి శిష్టావనం
బిలఁ బ్రఖ్యాతిగసల్పి ధర్మములు పెంపేర్పాటుగానిల్పి ని
ర్మలకీర్తిన్ విలసిల్లి తీవెకద రామా జానకీనాయకా

21. మ. పురముల్మూఁడుజయింపఁగాఁ దలఁచియున్ బుద్ధుండవై నేర్పుతోఁ
బురకాంతల్ వ్రతభంగమౌనటుల సంభోదింప గౌరీశుడున్
శరవహ్నిందహియింపఁ డాపురములన్ సర్వాత్మనీమాయ నీ
మరుఁగెవ్వండెఱుగంగశక్తుఁడగు రామా జానకీనాయకా

22. మ. కలవేళన్ నృపులందఱుంగుంపతులై గర్వాంధులై తుఛ్చులై
ఖలులై ధర్మవిహీనులై పరగుచున్ గౌటిల్యతన్ బూనఁగాఁ
గలుకాఖ్యన్ జనియించి వారి నపుడున్ ఖండించి సద్ధర్మముల్
మలినంబు ల్విడఁగొట్టినిల్పెదవు రామా జానకీనాయకా

23. శా. శ్రీసీతాపతి రాఘవేంద్ర కరుణాసింధుండసత్యవ్రతా
నీసాటెవ్వరు లేరటంచు మదిలోనిక్కంబుగా నమ్మితిన్
నేసేవించెద నీపదాబ్జయుగళిన్ వేమారు నెల్లప్పుడున్
మాసామీ ననుబ్రోవ నీకెతగు రామా జానకీనాయకా

24. శా. నేమీదాసుడనంటి నాకు వరముల్ నీవిమ్మటంటిజుమీ
మీనామంబుతలంతునంటి దయతో మేలీయవేయంటి ని
న్నే నాబుద్ధిని నమ్మియుంటి కృపకున్ నీకన్నలేరంటి యో
మానాధా ననునేలుమంటిగద రామా జానకీనాయకా

25. కరుణాసింధుడవండ్రు నిన్ను నది నిక్కంబంచు నేనమ్మి నీ
చరణంబుల్మదిజేర్చి వేడితిని లేశంబైన దాక్షిణ్యమున్
బొరయన్ జేయ వికేమిచేయవలయున్ పుణ్యాత్మ నేనెప్పుడున్
మరువ న్నీపదపద్మము ల్మదిని రామా జానకీనాయకా

26. శా. మిమ్మెన్నంగవశంబె ధాతకయినన్ మీపాదపద్మంబులన్
నెమ్మింబుట్టియు లోకపావనియనన్ నీపుత్రిగంగానదిన్
సమ్మోదంబున దా తరింప హరుడున్ చక్కందలం దాల్చడే
మమ్మున్ బ్రోవగ నీవ యింకెవరు రామా జానకీనాయకా

27. మ. శితికంఠుండు సహస్త్రనామములలో శ్రీరామనామంబు ను
న్నతభక్తిన్ జపియించువారికి మహానందంబు శోభిల్లు స
ద్గతికిన్ మూలమటంచు గౌరికిని మంత్రం బంతయుజెప్పె నా
మతి నీమంత్రరహశ్యమున్ దలతు రామా జానకీనాయకా

28. శా. రారా రాఘవ రామచంద్ర కరుణన్ రంజిల్ల నన్నేలరా
రారా జానకీప్రాణనాధ రఘువీర నీవేదిక్కురా
రారా నీదయ కేనుపాత్రుడనురా రావయ్య నన్బ్రోవగా
మారాకార సహస్త్రశీర్షకృప రామా జానకీనాయకా

29. హరబ్రహ్మాదులు మౌనిబృందములు నిన్నాత్మన్నిరూపింపలే
కెరుగంజాలక చిత్ప్రకాశుడవు లోకేశుండవంచున్ నమ
స్కరణంబుల్దిగజేసి కాంచిరిగదా సర్వంబు నీవంచు ని
న్మదినేభంగిని గానగావశమే రామా జానకీనాయకా

30. శా. గౌరీనాయక చాపఖండన త్రిలోకారాధ్య దైత్యాంతకా
పారావార విహారశత్రుభయదాపాపఘ్నుభక్తప్రియా
వీరాగ్రేసరరాధవేశ హరిగోవిందా ననున్ గావవే
మారెన్నంగను లేరు నీసమము రామా జానకీనాయకా

31. మ. బలగర్వాంధుని దానశీలుని బలిన్ బంధింపవే పొట్టివై
బలిమిన్ జంపవె రాజులన్ పరశుచే పారుండవై యుగ్రతన్
ఖలుఁడౌరావణుఁద్రుంపవే యవనిజాకాంతుండవై దేవ నీ
ర్మలకీర్తుల్ప్రభవింపజేసితివి రామా జానకీనాయకా

32. మ. నరమాంసాశనసంఘము ల్దివిజులన్ దండించి దుష్టాత్ములై
పరగన్ వారినిం బల్మిచే దునుముచున్ పద్మాక్షదేవావళిం
గరుణంబ్రోచితివీవెకావె సుగుణా కారుణ్యవారాసి నీ
మరుగుంజొచ్చినవారి కేకొదువ రామా జానకీనాయకా

33. శా. ఏనీదాసుడ నీవునాదొరవు యింకెవ్వారినింగొల్తుని
న్నేనాయాత్మదలంచువాడనిక నానేరంబులెన్నేనియున్
గానన్ వచ్చినగావగాదగురమాకాంత భవత్సేవనే
మానన్గష్టములెన్నివచ్చినను రామా జానకీనాయకా

34. మ. స్థిరబుద్ధిన్ నినునాశ్రయించి యెపుడున్ చిద్రూపసర్వేశ యీ
శ్వర నారాయణ యిందిరారమణ దేవాభక్త సంరక్షణా
పరమాత్మా మునికోతిపూజిత పరబ్రహ్మం బవంచున్ మదిన్
స్మరణల్ సల్పెద యిమ్ముసద్గతిని రామా జానకీనాయకా

35. శా. శ్రీరామ రఘురామరామయని నేసేవింతునీపాదముల్
నీరూపెన్నగజాల గాన దయతో నీవేప్రసన్నుండవై
రారాయేమిభయంబురా యనుచు ధారాళంబుగబల్కవే
మారుంజెప్పకనిన్నుఁజేరెదను రామా జానకీనాయకా

36. మ. పదునాల్గౌ భువనంబులున్ సుఖరతిం బాటిల్లెనీబొజ్జలో
మెదలన్ నీవుధరించికాచెదవు స్వామీ నీకు దాసుండనీ
బదులేలేరని భర్తవీవె యనుచుం భక్తిన్ మృదంగధ్వనిన్
మదమాతంగమునెక్కిసాటెదను రామా జానకీనాయకా

37. మ. గురువుల్ శిష్యులఁ గానవచ్చి స్వపదాంగుష్టంబులున్ గన్నులుం
బొరయంమ్రొక్కుమనంగవచ్చు శిరముల్ బూజించి మాకానుకల్
దలచిమ్మంచనవచ్చుగాని మరి యాత్మన్ నిన్ను నీమాయ నీ
మరుగు ల్గానగలేరు పండితులు రామా జానకీనాయకా

38. మ. సతతంబున్ ఘనవిద్యలున్ జదువుచున్ శాస్త్రంబులుం జూచుచున్
ప్రతిపాదించుచు తత్వమార్గరచనల్ భాషించి బ్రహ్మంబుగాం
చితిమంచున్ రుచిపుట్టగా సభలలో చెప్పంగనే కానిదా
మతినిర్జించిన సౌఖ్యముల్గనరు రామా జానకీనాయకా

39. మ. పరమంబైన భవత్కధానుతుల సద్భావంబు పద్యంబులన్
దరుచైతప్పులునున్న పుణ్య మరచేతంగాంతురెట్లన్ననున్
మరయంచున్ దపమాచరింపు యెరుకన్ మన్నించి మేలియ్యవా
మరువన్ బోకుము యిట్టిచందములు రామా జానకీనాయకా

40. మ. శ్రీకంఠుం డరచేతిపున్కవిడిచెన్ శ్రీదేవిభిక్షంబిడన్
శ్రీకంఠుండుమహేశ్వరాఖ్యదనరెన్ సేవించి నీదాసుడై
శ్రీకంఠుండు దహించె యాత్రిపురముల్ శీఘ్రంబు నీస్రాపునన్
మాకింకేమిభయంబు నిన్గొలువ రామా జానకీనాయకా

41. మ. ఘనతన్ జెందిరి నీదునామపఠనన్ గౌరీశ వాణీశులున్
మునులున్ తారకనామజప్యమున నిన్నున్ నీపదాబ్జంబులున్
గనియుత్కృష్టమహాత్ములైరి నిను వేడ్కన్ గొల్చినన్ పాపము
ల్మనునే పోవునుకాక భస్మమయి రామా జానకీనాయకా

42. మ. కదలన్ బోకను వేయినోళ్ళ నహిలోకస్వామి మిమ్మేర్పడన్
తుదిముట్టన్ నుతియింపలేక నిగిడెన్ దోషఘ్ను నిన్నింక నా
మది సంస్తుత్యముచేయగావశమె నే మందుండ నజ్ఞానుడన్
మదినేనొక్కటిగంటి మీశరణు రామా జానకీనాయకా

43. మ. పగనైనన్ వగనైన ప్రాణభయ మాపాదింపగానైన నీ
దగునామంబు దాంచువారికి యధార్ధంబైన పుణ్యంబులుం
నిగమస్తుత్య లభించు నన్న పలుకుల్ నిక్కబదెట్లన్న న
మ్మగఘంటాశ్రవుబ్రోచినట్లర రామా జానకీనాయకా

44. మ. జయరామా హరి వాసుదేవ గజరాట్ సంత్రాసవిచ్ఛేదనా
నియతాత్మా యహిశాయి కృష్ణ వరదా నియుండ లోకేశ శ్రీ
దయితాచిత్తసరోజభృంగమధుదైత్యంధ్వంన సర్వేశ్వరా
మయపుత్రీధవకంఠనిర్దళన రామా జానకీనాయకా

45. మ. చనునే నామొరయాలకించక వృధాజాడ్యంబునుంజేయగా
వినుమీభక్తులతోటివాడ నగుదున్ వేరున్నదే నాయెడన్
అనఘా నన్నుతరింపజేయు మిక నీ కాత్ముండ దాసుండనై
మనుచున్ నిన్ను స్మరించుచుండెదను రామా జానకీనాయకా

46. శా. స్వామీ నీవు పరాకుగాక వినుమీ స్వాంతంబురంజిల్లగా
నామాటల్ భవదీయదాసుడనుగానన్ బ్రేమచే దేవ దే
వా మానాయక నిన్నెనమ్మితిని నీవాడన్ ననుంగాచి యి
మ్మామోక్షంబు మదీయవాంఛయిదె రామా జానకీనాయకా

47. మ. మదిలో నిన్నుందలంచి వేడుకొని యేమంటిం దయాసాగరా
విదురుండాడినభంగి నేనడిగితిన్ వేడ్కన్ వరంబిచ్చుటల్
యిదినీకున్ సహజంబకాదె దయతో యిష్టంబులన్ దీర్చి నా
మదికిన్ సంతసమంద జేయగదె రామా జానకీనాయకా

48. మ. కరినీకేమిడియుండెనాడు చెపుమా ఘంటాశ్రవుండేమనెన్
శరతల్పుండగు భీష్ముడేమియొసఁగెన్ సద్భక్తియున్ దప్పనీ
శరణుంజొచ్చినయావిభీషణుడు యేసంబంధియో నీకు నీ
మరుగుల్ నీవలపక్షము ల్దెలిసె రామా జానకీనాయకా

49. శా. నీరూపంబునుతింప శక్యమగునే నీపాదపద్మంబులున్
జేరన్ రాయి యహల్యయయ్యెఁబృధివిన్ సీతేశనీమోహనా
కారంబీయెడనాకు జూపగదవే కాకుత్సవంశోద్భవా
మారాకారయటంచుగొల్చెదను రామా జానకీనాయకా

50. శా. నీపాదాంబుజయుగ్మమున్ దలచెదన్ నీకీర్తనల్బాడెదన్
గోపాలా యదునందనా యనుచు నీకున్ మ్రొక్కెదన్ భక్తితో
నీపేరం బనిచేయుచున్ గరములన్ నిన్నింక బూజించెదన్
మాపాలం గరుణింపవేయెపుడు రామా జానకీనాయకా

51. మ. జననంబై యిహలోకసౌఖ్యములచే సంతోషచిత్తుందనై
ఘనసంసారపయోధిలోముణిగి కాంక్షల్మిక్కిలై మూఢతన్
నినునెంతైనదలంపలేని నరుడన్, నీచస్వభావుండ నై
మనుచున్నాడను యేమిజెప్పవలె రామా జానకీనాయకా

52. మ. హరి గోవింద ముకుంద కృష్ణ జగధాధారాహిపర్యంక యీ
శ్వర గోపాలక చక్రహస్త కమలేశా రామ నారాయణా
మరలోకేశ జనార్ధన భవహరా మౌనీంద్ర సంసేవితా
మరుపెంతైననురాదు నీమహిమ రామా జానకీనాయకా

53. మ. వృధగా జేయకు నాదుమొఱ్ఱవిను నిన్వేడన్ పరాకా దయా
నిధివంచున్ బహునమ్మినానిపుడు నన్నిట్లేచగా న్యాయమా
విధిరుద్రామరవంద్య నీశరణు రావే నన్ను రక్షింపవే
మదుసంహార భవత్పదాశ్రయుడ రామా జానకీనాయకా

54. మ. బలిపాతాళముకంతద్రొక్కిన భవత్పాదంబురాకుండెనో
అలపాషాణముమీది పాదమిపుడున్నట్లుండెనో గాల నీ
విలస్త్పాదములేలజూపవయ నీవేదిక్కునాకంటి ను
మ్మలికన్ బెట్టక యిమ్ము వేవరము రామా జానకీనాయకా

55. మిను బ్రహ్మాదు లెరుంగలేరనినచో నేనెంతవాడన్ నినున్
గన నజ్ఞానుడ మూఢుడన్ జడుడ లోకస్తుత్య నీపాదచిం
తనగల్గం గరుణింపవే దయను నీదాసుండనై యుర్విలో
మనుదు నిన్ను దలంచుచు నందిని రామా జానకీనాయకా

56. మ. తెలియన్ లేరు మహాత్మ నిన్ను మునులున్ దేవేంద్ర రుద్రాదులే
వలనన్ నీపదపద్మముల్ దలచిరో వారెంతయో శ్రేష్టులై
విలసత్కాంతులనొప్పియుండిరొ ననున్ వీక్షించి రక్షింపు నే
మలినస్వాంతుడగాను దాసుడను రామా జానకీనాయకా

57. శా. శ్రీనారాయణ రాఘవేంద్ర కరుణాసింధుండగోపాలకా
నీనామామృతసారమీయగదవే నీపాదభృత్య్డనై
నానాపాపచయంబుబాసెదను గానన్ మోక్షమ్మీయంగదే
మానాధా శరణంచువేడితిని రామా జానకీనాయకా

58. మ. గురువై దేవుడవై సనాతనుడవై కోదండహస్తుండవై
కరుణానీరధివై జగన్నుతుడవై కౌసల్యాపుత్రుండవై
నెరి నాతల్లివి రండ్రివై బరగుచున్ నిత్యంబు నన్బ్రోవవే
మరుగుల్బెట్టకు నిన్నె నమ్మితిని రామా జానకీనాయకా

59. శా. నాపాలన్ గృపగల్గి దొడ్డదొరవై నాతల్లివై తండ్రివై
నాపుణ్యంబులరాశివై ఘనుడవై నన్గాచుదైవంబవై
నాపాపాపహమూతిన్ వై సముడవై నాపెన్నిధానంబవై
మాపాలన్ గరుణించిబ్రోవగదె రామా జానకీనాయకా

60. మ. ఘనసంసారపయోధిదాటుటకు మార్గంబేదియో వేగనేఁ
గనగా జేయగదయ్య యింకెవరు నన్గావఁగ నీవయ్య ని
న్ననయంబున్ భజింతునయ్య మరినీకాత్ముండనేనయ్యమీ
మనసుంబెట్టగదయ్య నాగతికి రామా జానకీనాయకా

61. మ. అరిషడ్వర్గములన్ జయించి సుఖినై యాత్మన్ నినున్ గొల్చినా
దురితంబుల్ హరియించితిన్ సకలదుర్దోషంబులన్ బాసితిన్
హరినీదాసుడనైతి నింక మది నీధ్యానంబుగావింతు క్ర
మ్మరజన్మంబులనొందకుండగను రామా జానకీనాయకా

62. మ. హరు శైలాత్మజ నాంజనేయ ధ్రువు నయ్యక్రూరునిం వ్యాసునిన్
గరినిన్ భీష్ముని నారదున్ బలి శుకున్ ఘంటాశ్రవున్ ద్రౌపదిన్
నరు బ్రహ్లాదు విభీషణుం గొలుతునో నారాయణాయంచు వే
మరునీనామము బాయకుండుదును రామా జానకీనాయకా

63. మ. గతినీవేయనినమ్మియుంటి యీద్గంటిన్ మరేచందముల్
మతిహీనుండనుగాన నేనెరుగ రామా నామనఃపద్మమం
దరికారుణ్యముతోడ నిల్వగదెమోహాంధ్యంబులన్ బాసినే
మతిమంతుడనునౌచునిన్గనుదు రామా జానకీనాయకా

64. మ. స్థిరతన్ ధ్యానముసేయు సన్మునులకుం జిత్తాబ్జభృంగంబునై
పురుహూతాది సమస్తదేవతలకున్ బూజింపముఖ్యంబునై
పరగెన్ నీపదపంకజద్వితయమో పద్మాక్ష నీసాటికిన్
మరియేదైవములేడు యెంచగను రామా జానకీనాయకా

65. శా. రామా నీదయకేనుపాతృడను రారా వేగ నన్గావరా
నీమాయల్గనలేనురా దెలుపరా నీకేనుభక్తుండరా
కామాంధుండనుగానురా నిజమురా కౌటిల్యమింకేలరా
మామీదం గృపయుంచరా శరణు రామా జానకీనాయకా

66. మ. జననంబందియు వృద్ధిబొంది పిదపన్ సంసారకృత్యంబులం
దనియంజేసితి చాలు నింక హరి నీదాసుండనైభక్తితో
జనలోకంబున నీదు కీర్తనాసుధాసారంబునే గ్రోలెదన్
మనసుంబట్టి హరించు నాయఘము రామా జానకీనాయకా

67. హరి నావిన్నపమొక్కటైనవినవయ్య పూర్వకాలమ్మునన్
గరి మొర్రెట్లు వినంగనోపితివి గంగానందనుండట్లు నీ
శరణుంజొచ్చిన నెట్లు బ్రోచితివి యాచందంబులట్లుండన
న్మదినిబ్భంగిని జూడవచ్చునయ రామా జానకీనాయకా

68. తగదా నాకభయంబునిచ్చుటకు నేదాసుడనయ్యుండగాఁ
దగునా కంసవిదారి నన్నువీడ నా తప్పేదియో జెప్పుమా
పగలున్ రాత్రియు నిన్ను నేదలతు నాభావంబునన్ భక్తితో
మగుడన్ నాయెడ పంతమేమిటికి రామా జానకీనాయకా

69. జపముల్ సల్పగలేదు పుణ్యనదులం జేరంగబోలేదు నే
నుపవాసంబులనుండలేదు వినుమా యుష్మత్పదాంభోజమే
నెపుడున్ నాహృదయంబునన్ నిలిపి నిన్నేగొల్తు దైత్యఘ భీ
మ పరాకేమిటికయ్య నాయెడను రామా జానకీనాయకా

70. పతినీవే గతినీవె నాదొరవునై పాలించగానీవె నన్
మతిమంతుండగజేయ నీవె దయతో నన్నేలగానీవె న
న్నతి ప్రేమంబున బ్రోవ నీవెపుడు నాయాత్ముండవున్నీవె నా
మతిలో నిల్చినవాడవీవెకద రామా జానకీనాయకా

71. శా. పుట్టింపగను వృద్ధిజేయఁగ లయంబునన్ సల్పగానీవె నీ
గుట్టున్మాయలుగానలేరు విధియుం గూఢంబుగా క్రేపులన్
బుట్టించేమియొనర్చెచక్రధర నన్భాదించు పాపంబులన్
మట్టించీయగదయ్య పుణ్యములు రామా జానకీనాయకా

72. మ. మదినేనొక్కటిగంటి భక్తులయెడన్ మన్నించుచందంబు నే
నదియుంజెప్పెద నంజనీసుతుని బ్రహ్లాదుం బలిన్ వ్యాసుఁద్రౌ
పది నక్రూరు విభీషణున్ విదురునిం బ్రఖ్యాతిగా గావవా
మదియందున్ నను నట్టుజూడు మిక రామా జానకీనాయకా

73. మ. ఉడురాడ్జూటశరణ్య శేషశయనా యుత్కృష్టకీర్తిప్రభా
విడిపోనేరవు పూర్వజన్మఫలముల్ వేధించునంచు న్భయం
పడి నీపదసరోజముల్ దలచి నీభక్తుండనైతింగదా
మడియంజేయుము నాదుపాపములు రామా జానకీనాయకా

74. మ. భ్రమలు న్నాకు మరేమిలేవు యిక నీపాదాబ్జముల్ గొల్వగా
భ్రమయే యొక్కటిగన్నవాడ నటులన్ పాతృండనైయుండెదన్
సమబుద్ధిన్ నినువేడెదన్ మనమునన్ సంతోషినైయుందు నా
మమతల్దీర్పగనీవ యింకెవరు రామా జానకీనాయకా

75. మ. దిననాధాయుతకోతితేజదివిజాదిత్యాదిసంస్తుత్యస
న్మునిచిత్తాబ్జనివాసభక్తజనసమ్మోదాంఘ్రిపద్మద్వయా
నినునేనెప్పుడు రామరామయనుచున్ నీయందుసద్భక్తితో
మనమందుంభజియింతు గావగదె రామా జానకీనాయకా

76. మ. సిరికిన్ భర్తవునై సురాధిపులకున్ సేవింపదైవంబవై
హరబ్రహ్మాదులెరుంగరాని బహుమాయాత్ముండవై నీవుయీ
ధరణింబుట్టుచు దుష్టులందునుముచున్ ధర్మంబులంనిల్పుచున్
మరియాశ్చర్యముగా నటింతువయ రామా జానకీనాయకా

77. శా. కంటిన్ నీపదపద్మము ల్మనములో ఖండించితిన్ పాపముల్
వింటిన్ నీసుచరిత్రముల్ముదముతో వెర్రిన్ విడంగొట్టితిన్
బంతన్ నిన్ను మనంబునం దలచుచుం భావించి మేల్గాంచుచుం
మంటిం న్నీదయజెప్పగావశమె రామా జానకీనాయకా

78. మ. వరగర్వమున నష్టదిక్పతులనున్ వంచించిజైలాసమున్
గరముల్సాచియునెత్తినట్టిప్రబలున్ గర్వాందునిన్ రావణున్
సురసంఘంబులు మెచ్చ ద్రుంచితివి నీశూరత్వమున్ బల్కగా
మరిబ్రహ్మాదులకైన జొప్పడునె రామా జానకీనాయకా

79. మ. అతిభక్తిన్ నిను నెంతగానుతులు నాయాత్మన్ దగన్ జేయగా
మతినింబెట్టవుయేమియంచనవు నమ్మన్ లేవ నాయందునన్
గతినీవేయని యంత్గాదె యెపుడున్ గారుణ్యమున్ గల్గి నా
మతిలోనిల్చి కృతార్థుఁజేయగదె రామా జానకీనాయకా

80. క్షీరాంభోధివిహార సర్వసుమనశ్చిత్తాబ్జసంచార శృం
గారాకార సుమేరుధీరగిరిరాడ్గంభీర సద్భక్తమం
దారాంభోధిసుతాత్మదార పరతత్వాధార నీకీధరన్
మారెవ్వారిక నీవెకర్తవయ రామా జానకీనాయకా

81. మ. వనజాతప్రభవామరేంద్రనుత దేవా సర్వభూతాదిరా
డ్భవకోదండవిఖండనా సకలపాపధ్వంస దైత్యాంతకా
వినవే యార్తకనావనా యనుచు నేవిజ్ఞాపనల్ సేయఁగా
మనసుంబెట్టక యుండుటేమిటికి రామా జానకీనాయకా

82. మ. ఇకనేనెట్టులనిందలంతు హరి నన్నీవేమిగా జేసెదో
యొకమార్గంబిదియంచు జెప్పదగదే యోదేవ నీదాసుడన్
అకటా నాకభయంబులిమ్ము కరుణాత్మా నీవెనాదిక్కయా
మకరాక్షాసురప్రాణవిర్దళన రామా జానకీనాయకా

83. మ. మధురంబుల్విడి చేదుగోరుకరణిన్ మర్త్యావళుల్ వెఱ్ఱులై
వృధ దైవంబులగొల్చుటేమి ఫలమో వేమారు నిన్వేడగా
నధికారంబున మోక్షమిచ్చుటకు దేవా నీవెదైవంబవో
మధువైరీ యికమాటలేమిటికి రామా జానకీనాయకా

84. మ. కనకగ్రావము మందిరంబు కలుము ల్గన్నమ్మ యిల్లాలు స
ద్ఘనతన్ సృష్టియొనర్చువాడు సుతుడున్ తద్దేవతల్ భృత్యులున్
మునులున్ భక్తులు శూలి మిత్రుడనగా ముఖ్యుండవై కర్తవై
మనసొప్పన్ ప్రభువై నటింతువయ రామా జానకీనాయకా

85. మ. సుధ జన్మించిన తోడనె వనితవై శోభిల్లి దైత్యేశులున్
వ్యధజెందన్ సురబృందము ల్దనియ నీవావేళ పీయూషమ
త్యధికంబొప్పగబోసి రాక్షసుల గర్వాటోపముల్ మాన్పవే
మధురంబుల్ భువి నీచరిత్రములు రామా జానకీనాయకా

86. శా. నీరూపంబిదియంచు నెన్నదరమౌనే యేరికిన్ ధాత్రిపై
వీరాగ్రేసరు డర్జునుం డతనికీవేచూపవే రూపమున్
యేరూపంబనిరూఢిలేక మదిలో యీశా పరబ్రహ్మయో
మారారీనుతయంచు మ్రొక్కెదను రామా జానకీనాయకా

87. మ. కరిపట్ణంబున కేగి కౌరవులతో కార్యానుకూలంబుగా
కురురాజొద్దను ధర్మరాజుపలుకుల్ గొన్నిందగంజెప్పినన్
చెరుపుల్ జెప్పితివంచు నీయెడను దుశ్చేష్టల్దలంపన్ సభన్
మరినీయద్భుతరూపుజూపితివి రామా జానకీనాయకా

88. మ. అరయన్ పార్వతీప్రాణనాధునకుమస్తాగ్రంబునన్ రత్నమై
వరమౌనీశ్వరభక్తబృందమునకున్ భాసిల్లు మోక్షాంకమై
గరిమన్ సాయకశాయికింజననియైగన్పించుమున్నేటికిన్
మరిపుట్టిల్లగు నంఘ్రులం దలతు రామా జానకీనాయకా

89. మ. పతినీవేయని నీదునామపఠనన్ బాటించి దత్సారముం
సతతంబున్ రుచిపుట్టజుఱ్ఱెదను నాసంకల్పము ల్దీర్చుమీ
నుతులున్మిక్కిలిచేయనేర నెపుడున్ నోరూరమీకీర్తనల్
మతినిల్పేను బఠించుచుండెదను రామా జానకీనాయకా

90. మ. హరి నీపాదసరోజముల్ సతమునాయాత్మన్గనన్ జేసెదన్
నెరినాకష్టములెన్నడున్ దరుగునో నేనెట్లు నిన్గాంతునో
కరుణాసింధుడ చెప్పవే దయను లోకస్తుత్య లక్ష్మీశ యే
మరకేనెప్పుడు నీకుమ్రొక్కెదను రామా జానకీనాయకా

91. మ. హరి శ్రీకృష్ణ ముకుంద చక్రధరకంసారాతి వైకుంఠమం
దిర గోపాలక నందనందన రమాధీష్టానలోకేశ్వరీ
శ్వరగోవిందమురారిశౌరి యనుచున్ భక్తిన్ నినుంగొల్చి నీ
మరుగుంజొచ్చితినయ్య కావుమిక రామా జానకీనాయకా

92. మ. ఖరునిందృంచి కబంథునిం దునిమి కోకద్రోహియౌ రావణున్
శరజాలంబులపాలుజేసి త్రిశరున్ శాసించి దైత్యాళినం
దర దున్మాడియు లోకము ల్ముదమునొందంజేసితీవేకదా
మరపుల్ రావు భవత్ప్రతాపములు రామా జానకీనాయకా

93. మ. ఇక నెన్నింతికి నిన్ను నేవదల నాయిచ్ఛన్ దయాళిందవై
అకలంకుండను నీదుభక్తుడను నీయాత్మన్ సదాగొల్చెదన్
శుకభంగిన్ గృపగల్గినిశ్చలత నన్నుంగాచి రక్షింపవే
మకరిందృంచి కరీంద్రుగాచుక్రియ రామా జానకీనాయకా

94. మ. అదితీనందనులున్ విధాత మునులయ్యామ్నాయముల్ రుద్రుడున్
విదితంబొప్పగ గానలేరనగ నిన్వేడంగ నాశక్యమే
చదువుల్నేరను మానవాథముడ నాశక్త్యానుసారంబుగా
మదిలోనెప్పుడు గొల్చుచుండెదను రామా జానకీనాయకా

95. మ. కరినేలాగునగాచినావొధృవుకాంక్షల్దీర్చుటేబ్భంగియో
నరువాంచ్ఛావళి నెట్లొసంగితొ బలిన్ నాడెట్లురక్షించితో
యెరుగన్ తద్ధయస్వామినాయెడను నీవిట్లున్విచారించుటల్
మదినింకాదరణంబులేకునికి రామా జానకీనాయకా

96. మ. అహితల్పా ఖగవాహనా యసురసంహారా దయాసాగరా
తుహినోర్వీధరజార్చితా నిగమసంస్తుత్యా జగద్రక్షకా
విహగేంద్రధ్వజచక్రహస్తవరదా విప్రాళిసంసేవితా
మహిపుత్రీధవ భక్తవత్సలుడ రామా జానకీనాయకా

97. మ. అధికాశ్చర్యము నీచరిత్రములు సర్వాధిశకీశాళి యం
బుధి బంధించుట లంకకుం జనుటయుం పూర్వామరాధీశులం
పృధివింగూల్చుట చోద్యనయ్యె బిటు లే పృధ్వీశులుం జేసిరే
మధువిధ్వంస మహాత్మ నీకెతగు రామా జానకీనాయకా

98. మ. కమలేశ వనమాలి కృష్ణ హరి లోకారాధ్య శ్రీరాఘవా
కమలద్వేషణ కోటిపూర్ణవదన కంజాక్ష మీపాదయు
గ్మము హృత్పద్మమునందు నిల్పితిని రమ్మా నన్ను రక్షింప నా
మమతల్ దీర్పుము నీకటాక్షమున రామా జానకీనాయకా

99. మ. కలడన్నంతనె యుక్కుకంబమున గల్గన్ లేదనీరూపు నా
పలుకుల్ యేక వినంగరావు చెపుమా పాపఘ్ను నీకిట్లు భ
క్తులయందున్ వలపక్షముల్దగునె నాకోర్కెల్ ప్రసాదించి ని
ర్మలచిత్తంబున నన్నుగాచుకొను రామా జానకీనాయకా

100. శా. ఏనైతే నిను నమ్మినాడ నిక నన్నేలాగునన్ గాచెదో
నేనెవ్వారిదలంపలేదు నిజమే నీదాసుడన్ దీనుడన్
నీనామస్తుతులాచరింతు మదిలో నీధ్యానముంజేసెదన్
మానారీ హృదయేశ నిన్మరువ రామా జానకీనాయకా

101. శా. అయ్యా రాఘవరామచంద్ర రవివంశాంభోధిశీతాశనా
కుయ్యాలింపగదయ్య భక్తజనులం గూర్మిందయన్ బ్రోవ నీ
వయ్యా దైవమటంచు వేదచయము ల్వర్ణింపవే నిన్ను యే
మయ్యానాకభయంబులియ్యవయ రామా జానకీనాయకా

102. మ. పదధూళిన్ శిల నాతిజేయుచు మహాభవ్యప్రకాశుండవై
కదనక్షోణిని రావణాద్యసురులంఖండించు వీరుండవై
మదిలో నిను దలంచు భక్తులను సంభావించు దైవంబవై
మదియుప్పొంగ జగంబులేలుదువు రామా జానకీనాయకా

103. మ. సతులం బుత్రుల భ్రాతలం బ్రియముచే సఖ్యంబునన్ భ్రామికల్
మతినింబెట్టగలేదు నీచరణపద్మంబు ల్మదింజేర్చియో
పతితత్రాణయటంచు నీకృపకు నేపాత్రుండనై యుంటి స
మ్మతితోడన్ ననుగావుమీదయను రామా జానకీనాయకా

104. శా. శ్రీరామా సురసేవితాంఘ్రియుగళా సీతామనోనాయకా
పారావార విహార భక్తవరదా పద్మాక్షలోకేశ్వరా
వీరాగ్రేసర రావణాంతక జగద్విఖ్యాతిగా నాయెడన్
మారుంబల్కక యిమ్ము సద్గతిని రామా జానకీనాయకా

105. శా. రావే నారదసన్నుతా రఘువరా రావే జగన్నాయకా
రావే నీవనినమ్మినాడ దయతో రావే నన్నున్ గావవే
రావే నీకు నమస్కరింతు నెపుడుం రావే దయాసాగరా
మావెన్నుండవు నిన్నె నమ్మితిని రామా జానకీనాయకా

106. శా. నేనీదాసుడనైతి నాయఘములం నిర్జించి మీపాదము
ల్గానంగోరితి నిమ్ము నాకు వరము న్గావం దయాదృష్టిచే
శ్రీనాధా ననునేలవయ్య వరదా చిదృపసర్వేశ నా
మా నాచిత్తమునందునిల్పితిని రామా జానకీనాయకా

107. మ. అనిశంబున్ భవదీయనామచరితంబైనట్టి యీపదూము
ల్వినినన్ వ్రాసిన బల్కినన్ దురితముల్విధ్వంసమైపోయి శో
భనసౌఖ్యమ్ములు నబ్బుపుణ్యములునుం బ్రాప్తించు నెవ్వారికిన్
మనమందు దృఢబుద్ధిన్ దలప రామా జానకీనాయకా

108. మ. ఘనుడౌ శీతనమంత్రికిం దనయుడం గౌండిన్యగోత్రుండ స
జ్జనుడన్ మాటురి వెంకటాఖ్యుడ కవుల్ సంతుష్టులై మెచ్చగా
ననఘూ నే రచించితిన్ శతక మిట్లత్యంత భక్తిన్ దగన్
మనసొప్పన్ భవదంకితంబుగను రామా జానకీనాయకా

సమాప్తం