Saturday, October 26, 2013

భద్రాద్రిరామచంద్ర శతకము - బళ్ళ రామచంద్రరాజు

భద్రాద్రిరామచంద్ర శతకము (రామచంద్రీయము)
                                                                                 బళ్ళ రామచంద్రరాజు 


1. శ్రీరామ! జయరామ! శృంగారరామ! స
త్ప్రియనామ! యాననవిజితసోమ!
శ్రీజానకీసతీచిత్తాబ్జభృంగ! స
మాశ్రితరక్షాచణాంతరంగ!
శంఖచక్రగదాసిశార్గ్జసంయుతహస్త!
శతకోటిభానుతేజఃపశస్త!
దానవారి! నృపాలమానసంరక్షణ!
కరిరాజపోషణ! కలుషహరణ!

దివిజగంగాసముద్భవోద్దీప్తచరణ!
పక్షిరాజతురంగ! విపక్షభంగ!
భద్రహృదయాబ్జపూష! సద్భక్తపోష!
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!

2. వాగ్బూషణము లేనివానికి నిలువెల్ల
సొమ్ము లుండిన సోయగమ్ము కలదె?
వితరణంబే లేనివిత్తం బదెంతయు
న్నను లోకమునఁ బ్రయోజనము కలదె?
ప్రతిపదంబును రసాస్పదము కాకుండినఁ
గవనమ్ము వినఁగ నుత్సవము కలదె?
ఆజన్మభూతదయాశూన్యమతికి నెం
తటిచదు వున్న సార్థకత కలదె?

ప్రకృతికాంతావిలాససంభరిత మగు ప్ర
పంచకపుమాయలోఁబడి పల్లటిల్లి
భక్తితో నినుఁ గొలువల ముక్తి కలదె?
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!

3. విద్వాంసునకు లేవు వింతదేశంబులు
పరమార్థమున లేదు బాంధవంబు
కవి యెఱుంగని సృష్టికలన యెచ్చట లేదు
చవిలేనికూర వాచవినిఁ బడదు
పండుగుపేరిటఁ బరమాన్నములు లేవు
తిండిపోతుకు లేదు దండితనము
ఎండమావుల నుండ దేమాత్ర ముదకము
కులట లెవ్వరికి సంకోచపడరు

ఊరిలోవారి కుండదు వారిభయము
బాటసారి కుండాదు వల్లకాటి భయము
భక్తులకు లేదు కాలునిపాశభయము
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!

4. అగ్రహారము లీయ నాస్థ యెవ్వరి కుండెఁ?
బన్నులు కట్టించుప్రభులె కాని;
వార్షికముల నిచ్చు వాసి యెవ్వరి కుండెఁ
గవుల బాధించు భూధవులె కాని;
యీనాము లిచ్చెడునీవి యెవ్వరి కుండె?
హితుల వంచించు భూపతులె కాని;
పండితాదరణవైభవము లెవ్వరి కుండె?
దుర్మంత్రులను బెంచుదొరలె కాని;

శ్రితుల కుపకృతు లొనరించు క్షితుపు లెవ్వరు?
తినెడుకూడును బోఁగొట్టు ఘనులె కాని;
యిట్టి ప్రభువులా కవులఁ జేపట్టువారు
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!

5. కలవానిచెంతను గాఁపురం బుండినఁ
గష్టసుఖమ్ములు గాఢమగును
ఒడలెఱుంగనిరాజుకడ నున్న భృత్యులు
మానాపమానముల్ పూనవలయు
జూదరిస్నేహమ్ము నాదరించినపట్లఁ
దుదకు నష్టములతోఁ దూలిపోవు
సానులయిండ్లె యాస్థానమ్ములై యున్న
భోగులు జోగులై పోవుచుంద్రు

మనుజు లెల్లప్పుడు ధనమదముచేత
మాసిపోవరె? బుద్ధులు మాఱిపోయి;
యెఱిఁగి తిరిగినవారికె పరువుగలదు;
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!

6. పెద్దవారింటను బెత్తనదారైన
నౌదార్య మబ్బునే? యల్పునకును;
సొమ్మిచ్చి లంజలచుట్ట మైనంతనే
రారాజె కానిమ్ము రసుకుఁ డగునె?
పదిమందిలో మంచివానిని బడఁదిట్ట
నెద్దగునే కాని పెద్ద యగునె?
వేషభాషలమాత్ర వేదాంతి తా నౌనె?
పరతత్వ మెఱుగని పరమశుంఠ;

శ్రీమదభిరామతారకనామరహిత
కావ్యపాఠము బుధజనశ్రావ్య మగునె?
చెవుల గీపెట్టు ఝిల్లికారవమె కాని;
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!

7. పురుషాయితము చేయుపూఁబోఁడికా? సిగ్గు;
వెలయాలికా? రాజవీథిభయము;
పచ్చిమాంసంబు సాపడువానికా? దయ;
ఱాఁగకా? యల్లుని రాజసంబు;
పరు వెఱుంగని యూరఁబందికా? యంబారి;
మంత్రికా? చెప్పుట తంత్రమహిమ;
రస మెఱుంగనిపసరమునకా? కవనంబు;
ముదికొండముచ్చుకా? ముద్దుగుమ్మ;

మాటవాసి యెఱుంగక కాటులాడు
మోటుమానిసికా? హాస్యములపసందు;
నరపిశాచికా? నీదివ్యచరణభక్తి;
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!

8. కామాతురుఁడు వావి కనిపెట్టి పొందునే?
లంచగాఁ డెంచునే మంచితనము?
లంజ మగం డెంతలాలింప మెచ్చునే?
వెలయాలి నమ్మునే విటులబాస?
లర్థాతురుఁడు చుట్టమన్న డబ్బిచ్చునే?
త్రాగి జమీ నిడ్డఁ ద్యాగియౌనె?
గయ్యాళి తనపతి గౌరవం బెంచునే?
జ్ఞాని మోహాబ్ధిలో జాఱిపడునె?

స్వసుఖమే కోరుకొనునట్టిస్వామి యెపుడు
నాలకించునె? ప్రజలగగ్గోలు; నకట!
యిట్టివారికి గతు లేమి పెట్టినావొ?
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!

9. అప్పుఁజేసుక తిన్న పప్పుఁగూ డొకబెంగ
పరులకల్మి కసూయపడిన బెంగ
అన్నదమ్ములయాస్తు లపహరించిన బెంగ
పెండ్లము విడనాడఁ బెద్దబెంగ
అన్యాయ మొనరింప నంతకంటెను బెంగ
వర్ణసంకర మైనపట్ల బెంగ
కూఁతురు చెడుఁగైన మాతకుఁ గడుబెంగ
కొడుకు దుండగుఁడైన గొప్పబెంగ

ఇట్టి సంసారపుంబెంగ లెన్నొ పెట్టి
కట్టికుడుపుచు నుంటివి కర్మములని
మాకు నినుఁ జేరుకొన నింక మార్గ మేది?
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!

10. కులకాంత సతత మాకులతఁ జెందించిన
నింద్రవైభవ మున్న నేమిశోభ
కన్నకుమారు నాపన్నుఁ జేసినపట్లఁ
దనమంచి కిఁక నేమిఘనతవచ్చుఁ
దన సేవకులఁ బట్టి తహతహలాడింప
యధికారమున కేమి యంద మబ్బు
నర్థికే మీయక యల్లరి పెట్టినఁ
బరమార్థమున కేమి పాలుగూడు

వేలు లక్షలకొలఁదిని జాలినంత
ద్రవ్య మార్జించి తుదకు నధర్మమూని
సంచరించెడివారికే సంచితమ్మొ?
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!

11. హెచ్చుపన్నులు గట్టఁ బెచ్చుపెర్గినగౌ
ర్మెంటును మేమేమి గెంటఁగలము?
అభిమానులకు నిచ్చు నధికార్లు గలుగ లో
కలుబోర్డు నేమేమి కట్టఁగలము?
కలవార లగుచుఁ బేదలకుఁ జో టీయని
ధనికుల నేమేమి చెనకఁగలము?
జారతాచోరతాచారపారీణుల
కెంతబోధించి వారింపఁగలము?

అన్నిటికి నీవె కలవు నే నెన్నిసార్లు
మొఱవెట్టిన ఫలమేమి మూఢలోక
మెంచదే వచ్చి పైఁబడు మంచిమాట
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!

12. పిల్లకాసుకు కొట్టి కల్లలాడించెడి
యధికార్ల కేముండు నంత్యదశకు?
కూటసాక్ష్యము లిచ్చి కొంపలఁగూల్చెడి
గడుసుకు పరలోకగతులు కలవె?
వడ్డికి వడ్డీలు సడ్డింపు లేకుండఁ
గట్టువారికి ముక్తి గలదె భువిని?
అప్పుఁ గైకొని పోయి ముప్పుత్రిప్పలఁ బెట్టు
చెడు గిహపరములఁ జెందఁగలఁడె?

వీరికర్మానుసార మాతీరు చేసి
పాతకము గూర్పనో యపఖ్యాతికొఱకొ
ఎఱుఁగలే మిఁక నీబుద్ధి కెఱుకగాదె
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!

13. బదులిచ్చి కొనితెచ్చు బంధువిరోధమ్ము
చనవిచ్చి గైకొన్న చౌకతనము
ఉపకారమున కేగి యురిలోఁ దగుల్కొంట
మనసిచ్చి వీథిలో మాటఁబడుట
ఇలువీడి పొరుగింట నెలవు చేకొనియుంట
ఆడితప్పినవారి నంటియుంట
చంచలాక్షుల నమ్మి వంచనపాలౌట
కూటికై నీచులఁగూడఁ జనుట

నాకె కా దిఁక జన్మజన్మములకైన
నక్కటా! యివి పగవారికైన వలదు
బుద్ధిమంతుల కే నేమి బోధసేతు?
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!

14. భోగలాలసునకు రోగభయం బెచ్చు
రోగి కోరికల నుఱ్ఱూతలూఁగు
చాగి కీయను డబ్బు సర్దుబాటుండదు
శ్రీమంతుఁ డిడుటకుఁ జేయిరాదు
సిరిగలానికి లేదు చిత్తశాంతి రవంత
కూలివానికిఁ గోర్కి చాల హెచ్చు
పేదవానిగృహంబు పిల్లలతో నిండుఁ
గలవాని కొకడైనఁ గలుగకుండు

తగినసతి యున్న నీడైనమగఁడు లేఁడు
ప్రథితకవి యున్న రసికుడౌ ప్రభుఁడు లేఁడు
ఏమొ నీసృష్టివైచిత్ర్య మెఱుఁగఁబోను
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!

15. ప్రజ కసమ్మతమగు పరిపాలనంబును
దుర్మంత్రి గలవారి దొరతనంబు
పదవికై పరుల నాపదలపా ల్జేయుట
ఇంటగు ట్టెచ్చెడి తుంటరియును
వేదాదు లెఱుఁగని విప్రు లాధిక్యంబు
అహమును విడనట్టి యణఁకువయును
జాగా యెఱుంగని వాగుడితనమును
పూటకూళ్ళమ్మల పుణ్యగరిమ

ఎవరు మెత్తురు లోకము కేమిహితవు?
చెడ్డపేరెదొ తనపయిఁ బడఁ బోవఁ
దానె గాదు పితామహుఁ దరమె యగునె?
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!

16. విద్వంసునకు నేల వేషభాషల మెండు
పరమమిత్రున కేల బాంధవంబు
అర్థాతురున కేల యందచందంబులు
కాటికాపరికి శృంగారమేల
పలికిబొంకినవారి భాగ్యమ్ము లవియేల
పాపికి సంసారభయ మదేల
చెనటికిఁ బరనింద చేటేమి తెచ్చు ని
రక్షరకుక్షికి రాజ్యమేల

వినయ మెఱుఁగనివానికి మనవి యేల
కవిత యెఱుఁగనివానికిఁ గావ్య మేల
అర్థి కన్నంబు బెట్టని యాస్తు లేల?
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!

17. కలవాఁడె యైనచోఁ గడనున్నఁ గందురు
తప్పు చేసిన వాని నొప్పుకొంద్రు
భాగ్యవంతుడు తిట్టి బాధపెట్టినపట్ల
మందలిం పని మోద మందుచుంద్రు
ధనుకుడు ప్రాల్మాలి ఖనకుఁ డైననుగాని
సామర్థ్య మని వాని సన్నుతింత్రు
శ్రీలుగలాడు కూనీలు చేసినఁగాని
పొలియించె ఖలు నని పొగడుచుంద్రు

కలిమి పేరెత్తఁ దలదూర్చుఁ గలియుగంబు
మంచిచెడ్డలు యోచించు మనుజులెవరు?
ఎంతగ్రుడ్డిగ జగము సృష్టించి తయ్య
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!

18. మాతృభాషలకు సన్మానంబు కొఱతయ్యె
పరభాషలకుఁ జాల బరువు హెచ్చె
సంసారు లన్నిట సానులుగా నైరి
సానులన్నిటను సంసారులైరి
వర్ణాశ్రమాచారవాసన లడుగంటె
మెట్టవేదాంతమే పట్టూఁబడియె
పల్లెలన్నియుఁ బూఁటకూళ్ళకు నెలవయ్యె
నన్నసత్రములన్ని యంతరించెఁ

జదువుసాము లిఁకేలని వదలి జార
చోరు లయి కాలమున్ బుచ్చు శూరులైరి
ప్రబలెఁ బాశ్చాత్యపద్ధతుల్ ప్రాభవముగ
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!

19. దాత దరిద్రుడే; ధనవంతుడా? లోభి
న్యాయాధికారి యన్యాయకారి
అగ్రకులంబులా? యడుగంటె మొదటికి
నీచజాతులు పైకి నిలువఁ జూచె
నల్పవిద్వంసున కధికమౌ గర్వమే
గుణవంతునకుఁ గూడు కొఱత వచ్చు
గుణహీనునకు డబ్బు కుప్పలు కుమ్మలే
కడుపేదవాని కాఁకలియు హెచ్చు

రంభ షండున కగును బల్ ఱాఁగ యుత్త
మోత్తమునకును భార్య యౌ నుర్వియందు
నేమొ నీసృష్టివైచిత్ర్య మెఱుకపదదు
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!

20. తినఁబోవువయసులోఁ గొన డబ్బు లేకుండు
డబ్బుండి తినఁ గడు పుబ్బుచుండుఁ
దనప్రాయమున విత్త మన లెక్కపెట్టఁడు
ముదిమిలో గవ్వైన వదలబోఁడు
పండకుండినచేను ఫల మియ్యఁ డెవ్వఁడు
పండఁ బన్ననివచ్చు ప్రముఖుఁ డుండు
మానధమ్మున కూనువానికి నేదొ
సంసారలోపమే సంభవించుఁ

గటకటా! యివి నీచేతఁ గలుగుపనులొ
కాక వారిపురాకృతకర్మఫలమొ
యెంచ శక్యము కాదు బాధించ కయ్య
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!

21. కలిమి ఇంచుకకల్గఁ గలవారలం దెల్ల
మొనగాఁడ నని యెంచుమనుజుఁ డొకఁడు
బంట్రౌతుపని సేయువాఁయ్యు మదిని దా
నిని మోక్ష మనుకొను మనుజుఁ డొకఁడు
ఓనమాలును ఒచ్చిరాని సాహితితోడఁ
దనపాండితికి నిక్కు మనుజుఁ డొకఁడు
తనధర్మమును మానుకొనికూడఁ దనజాతి
ఘనతకై యుప్పొంగుమనుజుఁ డొకఁడు

ఇట్టు లున్నార లిది మౌఢ్యమే కదయ్య!
అసలు ధనమును బదవి విద్యయును జాతి
ఘనములే? పూజ్యమైనది గొనమెకాని
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!

22. కోపము వారించుకొనువాఁడె గురుమూర్తి
పాడిఁ దప్పనివాఁడె పండితుండు
ప్రియుని దా మనసారఁ బ్రేమించునదె భార్య
లంచ మడ్గనివాఁడె సంచితార్థి
పలువురు తల లూఁపఁ బాడినదే పాట
వ్యాధిని గనిపెట్టువాఁడె వెజ్జు
కన సర్వజనవశ్యమును జేయునదె విద్య
యభయప్రదానమే యధికశక్తి

రసికు నంకాన దీపించురమణివలె ని
రక్షరునిగూడ వలపించునదియె కవిత
యాపదకు నడ్డుపడువాఁడె యాప్తుఁ డెపుడు
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!

23. పార్టిభేదము వెట్టి పడఁగొట్టుటేకాని
జాతిభేదం బేమి చావలేదు
స్వార్థంబు విడినార మని చెప్పుటేకాని
పదవులపై నాశ వదల లేదు
పార్టీలు వృద్ధియై పరువెత్తుటేకాని
యుపకార మొనరించు నూహలేదు
వోటు వో టనెడుసాపాటురాయళ్లకు
మనవిని వినుటకే మనసులేదు

ఇట్టి మెంబర్లఁ బ్రెసిడెంట్లఁ బట్టు లరసి
కొలువఁ బండితకవుల కేవిలువ గలదు?
ఆశ్రయింపఁగ నిడవె? నీ వభిమతములు
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!

24. ఏ మన్నఁ బడినచో నెంతొసాత్వికుఁ డందు
రెదురింపఁగా వాఁడె యెడ్డెమనిసి
తన కిచ్చకముగఁ జెప్పిన మంచివాఁ డంద్రు
న్యాయంబు చెప్ప నన్యాయవాది
పద్యము లెలుఁగెత్తిపాడిన భట్టంద్రు
మాటాడకుండిన మందుఁ డంద్రు
కనిపెట్టి మాట్లాడ గడుసువాఁ డందురు
చన విచ్చినంతనే చవట యందు

రెవనిసామర్థ్య మెవరికి నెఱుకపడును
బుద్ధిమంతులకేగాని పుడమియందు
గంగలోఁ తెంచ శక్యమే కొంగలకును
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!

25. బలియుఁ దా నెంతటితులువరక్కసి యైన
విష్ణు మెప్పింపఁడే వితరణమున
రావణు డెంతదుర్మార్గుఁ డైయుండినఁ
బాలింపఁడే లంక మే లనంగ
దుర్యోధనుం డెంతదుండగీఁ డైనను
బ్రజల మన్నింపఁడే పాలనమున
నందుఁ డెంతయసూయ నందినవాఁడైనఁ
బౌరులఁ జూడఁడే గౌరవముగ

వారు వారికిఁ దగినట్టివారితోడ
వైరమున్ బూనిరేకాని వాస్తవముగఁ
బ్రజల బాధించిరే యెట్టిపట్లనైన
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!

26. నాగలోకవిలాసభోగినీమణి యైన
మగని లోఁజేయుట తగవుకాదు
సాటిలేనటువంటికోటీశ్వరుం డైనఁ
బేదల విడనాడఁ బెంపు లేదు
పండితమండలాఖండలుం డైనను
మూఢులతో వాద మాడరాదు
భోజునంతటి మహారాజైన "లోకలు
బోర్డు"ల నాసించి పోవరాదు

వీని గుర్తించుజను లెందు మాననీయు
లగుదు రన సంశయము లేదు; తగవుమాలి
పోవ యత్నింతురా చేటు మూడకున్నె?
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!

27. యజ్ఞాదికంబుల నాస్థతోఁ జేయంగ
నాస్తికి మునుముందె స్వస్తియయ్యెఁ
దీర్థాలవెంబడిఁ దిరిగి నిన్ దరిసింప
నారోగ్యమా చాలినంత లేదు
దీనుల రక్షింపఁ బూనుద మనుకొన్నఁ
గడుపాఱ నన్నంబు కానరాదు
పనిఁబూని నీసపర్యను గాల మేఁగింప
నసదృశ ధైర్యసాహసము లేవి?

అనయమున్ బస్తు లేకుండ నాదరించి
తృణమొ కణమొ నీవిడిన ద దెంతొ యంతె
దానితో నుంటి నిటుమీఁద దారి నీవె
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!

28. వార్ధక్యమా చెవిఁ బట్టి యాడింపఁగాఁ
బడుచుఁబెండ్లా మున్న ఫల మ దేమి?
కాపేయమా చేయిఁ గట్టివేయుచునుండ
వాకిట నిధి యున్న ఫల మ దేమి?
సంసారమా కాలిసంకెల యైయుండఁ
బరము పరం బన్న ఫల మ దేమి?
ఉబలాటమా యుసు రుడుఁగుచో నీఁగికిఁ
బలవరించినయంత ఫల మ దేమి?

జ్ఞాన మొదవిన దాది నీస్మరణ లేక
మేఁకమెడచన్నువలె నున్న మే నదేల?
నీప్రసాదముఁ గొన్నవానిదె భవమ్ము
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!

29. ముఖము చంద్రుఁడె, భృంగములు ముంగురులు, నుగ్గు
బుగ్గలు జగ్గులనిగ్గు లీనుఁ
జూపులు తూపులు, చూడ ముచ్చట యగు
మోవి తేనియ తేట, ముద్దుగారు
పాలిండ్లు గజనిమ్మపండ్లు, చూచుకములు
కాటుకపిట్టలకాంతి మించు,
నారు చీమలబారుతిరుఁ గేరుచునుండుఁ
గచము నల్లనిత్రాఁచుకరణిఁ దోచుఁ

మొగముసోయగమున కెంతొ మురిసి మురిసి
కుచము లని, కటియు, నా రని, కచము లనుచుఁ
గల్పనలు సేయుకవుల వాగ్గతులు వితలు
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!

30. పితృకార్యమునఁ గర్చువెట్టనివాఁ డగ్ర
హారంబుల నొసంగి యాఁపు టెట్లు?
కూలివానికె కొల్చుఁ గొలువనియాతండు
ధాన్యరాసుల నెట్లు ధారవోయుఁ?
దనవారినే మెచ్చ ననువాఁడు పరు నల్ప
విషయంబులో నేమి వినుతిసేయుఁ?
దనతప్పునే బైటఁ దలపెట్టువెంగలి
పరుల దే మని చాటుపఱుచుచుండుఁ?

గృత మెఱుంగక దారుణగతుల నడచి
మాయలోఁబడి మర్యాద మంటఁ గల్పు
నిట్టివారికి నేగతిఁ బెట్టినావొ?
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!

31. భగవంతునకుఁ బ్రేమ భక్తలోకమునందుఁ
దలిదండ్రులకుఁ బ్రేమ తనయులందు
వెచ్చకానికి లంజయిచ్చకమ్ములఁ బ్రేమ
వెలయాలికిం బ్రేమ విత్తమందుఁ
గ్రొత్తకోడలి కింటిపెత్తనమ్మునఁ బ్రేమ
నటకులకుం బ్రేమ నాట్యమందుఁ
జిఱుతపిల్లల కెల్లఁ జిఱుతిండిపైఁ బ్రేమ
సుకవులకుం బ్రేమ సూక్తులందు

సరసులకుఁ బ్రేమ రసికప్రసంగమందుఁ
జదువరికిఁ బ్రేమ పుస్తకసమితియందుఁ
బిసినిగొట్టుకు ధనమందె ప్రేమ మెండు
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!

32. కార్యవాదులపట్లఁ గయ్యంబు కూడదు
దుర్మార్గుఁ డేమన్న దుడుకు వలదు
కవులతో నెన్నఁడుఁ గలహంబు పడరాదు
బిక్షుకు నల్లరి వెట్టఁ దగదు
కొండెగాండ్రను జేర్చికొన హాని తప్పదు
లేది దారోపింపఁ బూనరాదు
పరకాంతఁ గలనైన భావింప నొప్పదు
వంతలవానితో వాదు వలదు

తాహతును మీఱునట్టియత్నంబు తగదు
నీతిమార్గమ్ముఁ దప్పుట ఖ్యాతిగాదు
శరణు చొచ్చినఁ బ్రోచుటే పరమపథము
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!

33. అతిరాగ మెచటనో హానియు నచటనే
సుజనుఁ డెచటనో దుర్జనుఁ డచటనె
భోగమ్ము లెచటనో రోగమ్ము లచటనె
గుణ మెచ్చటనొ యవగుణ మచటనె
ఆస్తిక్య మెచటనో నాస్తిక్య మచటనె
క్రొత్తావి యెచటనో క్రుళ్ళచటనె
మునివృత్తి యెచటనో మూర్ఖత యచటనే
భాగ్య మెచ్చటనొ లేవడి యచటనె

ఒకటొకటి కవినాభావ మొప్ప మమ్ము
దింపి సంసారమను పాడు రొంపియందుఁ
ద్రిప్పుచున్నాఁడ వాశల కప్పగించి
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!

34. ఖరము సింగముతోలుఁ గప్పుకొన్ననుగాని
గర్జించునే? కూయుఁగాక యెపుడు
ఱంకులాడిని భర్త లాలించిననుగాని
విటునివంకను గన్ను మిటకరించుఁ
గఱకుఁగసాయికి నఱచి చెప్పినఁగాని
మానునే? పశుహత్యఁ బూనుఁగాని
కుక్క నందలమునఁ గూర్చుండఁబెట్టిన
మఱచునే? చెప్పుక కుఱకుఁగాని

యిట్టివెడబుద్ధు లుండిన నెట్టివార
లార్చితీర్చుదు రయ్య? నీయాజ్ఞ చేత
వార లంతట వారలే తీరవలయు
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!

35. ఈశ్వరాంశము లేక యైశ్వర్యవంతుఁడే?
విష్ణ్వాంశ లేకుండ విభుఁడు కాఁడు;
కిన్నరాశంబు లేకున్న గాయకుఁ దౌనె?
శుక్రాంశ లేకుండ సుకవి కాఁడు;
భోగ్యంశ లేకున్న భోగవంతుం డౌనె?
గుర్వాంశ లేకుండ గురుఁడు కాఁడు;
బ్రహ్మాంశ లేకున్న బ్రహ్మవిదుం డౌనె?
రవ్యంశ లేక విక్రముఁడు కాఁడు;

అప్సరోంశయు లేక నాట్యంబు రాదు;
పెట్టిపుట్టకపోయినఁ బట్టదు సిరి;
భక్తి కలవాఁడు కాకున్న ముక్తి లేదు
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!

36. వలపింపనేరని వనితయందం బేల?
కూడని కార్యంబుఁ గోర నేల?
సరసాన్నములు లేని సంతర్పణం బేల?
కవిలేని సభల వైభవము లేల?
పెట్టిపోయనిదొర వెట్టిచాకిరి యేల?
యెపుడొ వీడినపతి కేడ్వ నేల?
అప్పుతోడుతఁ గల్మినంది యుబ్బుట యేల?
యౌచిత్య మెఱుగని త్యాగ మేల?

సార్థకతలేని వెల్ల నిరర్థకములు;
తోఁచ కావేదజడుఁ డిట్టితుచ్చసృష్టిఁ
బెంపుగాఁ జేయు నిఁక మందలింప వేల?
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!

37. వానిజ్యమున లక్ష్మి వఱలుచుండు నటంచు
మించి శాస్త్రమ్ము వచించుఁగాదె
యందులో సగ మర్థ మందరే కర్షకుల్?
వ్యవసాయ మొనరించి పాటుపడిన;
దానిలో సగము సేవానిష్ఠ రాజుల
కడ నుండువారికిఁ గలుగుచుండుఁ
బైమువ్వురుకె పట్టుపడులక్ష్మి భిక్షాట
నమ్ములో లేదు లవమ్ముఁగూడఁ

గాన నీదురావస్థ నన్ బూనకుండ
బ్రతుకుఁదెఱువున కేదొ సద్గతి నొసంగి
కూర్మితో నీపదాబ్జముల్ గొలువనిమ్ము
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!

38. తనవారికే కీడుఁ దలఁచుచుండెడువాఁడు
సైఁచునే పగవారి సంతసంబు
గంగిగోవును బట్టి ఘాతచేసెడువాఁడు
పలికిబొంకుట కేమి భయముపడును
దనతల్లిపట్లనే త ప్పొనర్చెడువాఁడు
పరకాంత నే మని పట్టఁబోడు
ఆపదలో నిడ్డయప్పె తీర్చనివాఁడు
పిలిచి యెవ్వరికిఁ గాసుల నొసంగుఁ

జుట్టముల కేదొ యపకృతిఁ జూచువాడు
పరుల కే మని చేయఁడు పాపపుఁబని?
నిట్టివారల కేగతిఁ పట్టఁగలదొ!
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!

39. ముడిగాళ్ళు పడినచో ముదిత యిల్లా లగుఁ
గలిమి నశింప జాగ్రత్తపుట్టుఁ
గామేచ్చ లడుగంటఁ గడకు బైరాగి యౌఁ
బరపతి పోయిన నిరసన మగు
నతివ లెవ్వరు రామి ననుకూలుఁ డైయుండు
రిక్తుఁ డౌనెడ దేశభక్తుఁ డగును
అప్పు పుట్టనినాఁడు గొప్ప లక్కఱలేదు
ఆపదలో మ్రొక్కు లధిక మగును

దేహదార్ధ్యము గలనాఁడె తెలివిఁజెంది
యక్షరంబైన నీపద మందుకొఱకుఁ
బాటుపడ రేమిపాపమో నేఁటి ప్రజలు
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!

40. నిజ మాడ నెవరికి నిష్ఠురమే వచ్చు
మొగమిచ్చకము లాడ ముచ్చట యగు
నైనదానికి నెంతొ యారాటపడుదురు
కాఁబోవుదానిని గాన రెవరు
చూచిచూడనిపని పేచీని బుట్టించుఁ
బ్రత్యక్ష మగుదానిఁ బట్టఁబోరు
కాంక్షించువస్తువు కనఁబడ దెప్పుడు
నుపయోగపడనిది యుండు నెదుటఁ

దగువివేకంబు లేకున్న నగును నెల్ల
పనులయం దిట్లె తత్తఱపా టదెంత
పండితుల కైన నొక్కొక్క పట్టునందు
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!

41. పదములు పాటించి కుదు రైననదకతో
నూతనఫక్కిని నూలుకొల్పి
రసముఁ బూరించి సంతసము పెంపెసలార
భావముల్ విరియంగఁ బాఱఁజేసి
వలపించి రీతుల మొలపించివృత్తులు
పచరించు మఱుఁగులు పట్టువఱచి
పాపపుణ్యములు నగణ్య మౌ నీతులు
మరులు పుట్టించి సంబరము నిచ్చి

కవిత యొప్పినఁ గనఁబోరె కలియుగాన
సరసుల మటంచుఁ దెగనీల్గసాగుచుంద్రు
ప్రభువులో కాక వీరలు పశువులొక్కొ?
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!

42. కనపడ్డకాంతను గౌఁగిలించిననాఁడె
పురుషకారం బని పొంగిపోతి
సాధునైననుగాని బాధ పెట్టిననాఁడె
పేరుండు నని పెచ్చుపెరిఁగినాను
నిరపరాధులనైన నిరసింపకుండిన
నధికారమా యని విధముచెడితిఁ
గడుపు నిండినమాత్రఁ గైలాస మనుచు దు
రాగతమ్ములు సేయసాగినాను

ఏమిశిక్ష విధింతువో యెఱుఁగఁ జాల
నెంతపరితాపపడిన నిం కేమిఫలము
నీకృపారస మిచ్చి మన్నింపుమయ్య
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!

43. మాలమాదిగలెల్ల మనవా రనుటెగాని
పరమార్థ మూహించి జరుపలేరు
దారపుత్రాదులు వైరు లంటయెగాని
వారికై శ్రమపడ భార మనరు
పూర్వశాస్త్రంబులఁ బ్రువ్వదిట్టుటెగాని
వానిప్రామాణ్యంబు మానలేరు
మతములన్నిటి కొక్కగతి యనుటేగాని
పనివచ్చినపుడు వే ఱనుట పోదు

సహజముగ నాత్మలో నెట్టిసంశయంబు
లిమిడియున్నను లోకుల కిచ్చలముగ
నాడుదురు పండితులుగూడ నధమరీతి
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!

44. పడఁతికి బరబుద్ధి పొడమఁగూడదుగాని
పొడమ నిరోధించు పురుషుఁడెవఁడు
దానశీలునియొద్ద ధన ముండవలెఁగాని
వలదని వారించువాఁ డెవండు
మొండెవానికి మంచి యుండఁగావలెఁగాని
చెప్పి చేయించు నెచ్చెలి యెవండు
రాగాంధునకును వైరాగ్యంబు గలుగదు
కలిగినఁ దప్పించు బలియుఁ డెవఁడు

సహజసద్గుణసంపద జరగువాని
కడ్డు బెడ్డును గలదె? యెం దైనఁగాని
యింతకుఁ ద్వదాజ్ఞ దాఁటంగ నెవనివశము?
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!

45. అగ్నిసాక్షిగఁ బెండ్లియాడినసతిఁ బాసి
పరకాంతపదములు పట్టినట్లు
తనసేమముం గోరుఘనులను నిరసించి
పలుగాకుల మేలు సలిపినట్లు
విమలగంగాప్రవాహమున స్నానము మాని
పల్వలమ్ములఁ గ్రుంకఁబాఱినట్లు
మాతృభాషలకు సన్మానంబు విడనాడి
పరభాషలను గౌరవించినట్లు

స్వజన సంఘంబునెల్ల నావలకు నెట్టి
పరుల మన్నించుచుండు భూపతులు గలుగ
సుఖము మా కెట్టు లబ్బు నీక్షోణియందు?
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!

46. త్రాగుఁబోతులతోడఁ దగదు శవాసంబు
మర్యాద నాసించు మానవులకుఁ
గులవృత్తిఁ బట్టి లోఁకువఁ జేయువారితోఁ
గలియుట జ్ఞానికిఁ గష్టతరము
తనశక్తిఁ బరునిశక్తిని గణింపనివారి
యండఁ జేరిన ఘను లుండలేరు
మాతపొందిక లేని మోటుమానిసితోడ
సరసులు మాటాడ విరస మగును

ఎఱుఁగ కందఱి నొకరీతిఁ గఱకులాడు
నెడ్డెమనుజులు నిరసింప నేమిలోటు?
మానధనులకు సంతోషహాని గాని
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!

47. ఇంపుగా మగని రమింపఁ గల్గినమాత్ర
నిల్లా లగునె? మంచియుల్ల మేది?
మెడనిండ దండలు పడవేసినంతనే
గురువరుం డగునె? సద్గుణము లేవి?
బూడిద నిలువెల్లఁ బూసినమాత్రాన
బైరాగి యగునె? ప్రభావ మేది?
గోటుగాఁ దలను గిరీట మూనినమాత్ర
రాజౌనె? తగినంతరశ్మి యేది?

ఆశ లడుగంటకుండిన యతియు నగునె?
దోషములు చెప్పినంత నిర్దోషి యగునె?
యేపగిది నున్ననేమి నీ కెఱుకపడిన
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!

48. భార్యయేకద యని బాధించితిని నేర
మున్న లేకున్న దురుక్తు లాడి
నౌకరే యని వెట్టిచాకిరి చేయించి
పరితాపపెట్టితి సరకుఁగొనక
తలిదండ్రులే యని విలువ గణింపక
తూలనాడితి బుద్ధి ప్రాలుమాలి
బుజ్జగించుచు విద్య లొజ్జ చెప్పినఁగాని
యపహసించితి మంచి నరయలేక

ఏమిపాపానఁ బోదునో యెఱుఁగఁబోను
జేసినవి తప్పులే ముందు చేటెఱుఁగక
చెప్పితిని మీఁద నింక నీచిత్త మెట్లొ?
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!

49. చల్లగా మాట్లాడి పిల్లసైతానుగా
విడిపోవఁడని పల్కు వేదురొకఁరు
చనవీయఁ జంకెక్కుచంటిబిడ్డగు నంచు
బొమ్మని చెప్పెడు పురుషుఁడొకఁడు
కదిపిన వానిని గందిరీఁగలపుట్ట
పలుకరింపకు మనుపలువ యొకఁడు
ఒకమాటు8 నేర్ప నోపికపట్టి వార్షిక
మడుగుభల్లుక మనువెడఁ గొకండు

పొట్టకై వేఁగి ప్రజలఁ జేపట్టియుండఁ
బండితులఁ జూచి యిటువంటిబండమాట
లాడుచుండఁగ సుఖము లెవ్వాఁడొసంగు?
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!

50. ధనవంతుఁ డనుచు సందర్శనంబును జేయ
మొగమెత్తి చూడఁడే మొద్దురీతి
నొకవేళ మాట్లాడ నూహించునా యేదొ
మో మోరగాఁ ద్రిప్పి జామున కను
నామాట తనసొత్తు కేమినష్టము లేని
పద్ధతి నైనచోఁ బలుకుచుండుఁ
దనమాట పైపెచ్చు విను మంటయేకాని
చెప్పినమనవిని జెవులఁబెట్టఁ

డిట్టిలుబ్ధుఁడు మూటలు కట్టి ధనము
తాఁ దినక యొరుల కీయక దాఁచుకొన్నఁ
దుదకు దొంగలకో మఱి దొరలకగునొ?
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!

51. కవనంబు మంచిదే కాఁబోవువాఁడవే
యని మెచ్చుటేకాని మనవివినరె?
సేవకావృత్తి కాశింప నీకేలంచు
మాటాడుటేకాని మూట విడరె?
నోరారఁదీపిగా నుడువుచుండుతెకాని
తగుసహాయముగోర మొగముఁ గనరె?
మన మంత యొకటని మాట యిచ్చుటెకాని
తమజాతి గన్న నుత్తములఁ గనరె

యిట్టిప్రజ నమ్మి నీభక్తిఁ గట్టిపెట్టి
యైహికముఁ గూడ విడనాడు నధమవృత్తి
నట్టునకు ముక్కకును జెడునట్లుకదె?
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!

52. చదు వాతఁడేకాఁడు చదివితి నే నని
వికటంబుగా వాగువెడఁ గొకండు
పనిలేనిపని నక్కవినయాలు మన కేల?
యని యీసడించెడిచెనఁటి యొకఁడు
ధనవంతు్డను గాద? మన మాట చెల్లదా?
యని నోరుజాఱెడిఘనుఁ డొకండు
వీనిరక్కఱ యేమి? కాని కూడను రాని
పద్యాల కే మను ప్రభు వొకండు

అడిగికొని మనువారికీ పొడుగులేల?
యనుచు నిరసించుచుండెడి యధములుండ
సుఖము మా కెట్లుగల్గు నీక్షోణియందు?
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!

53. ఎదుటివాఁ డేదైనఁ జదువుచోఁ బ్రశ్నింపఁ
బెద్ద నౌదు నటంచు గద్దరించి
తప్పు లేనిదె పట్టి తహతహలాడింప
గొప్ప వచ్చు నటంచుఁ గోరుచుందు
రొప్పైనఁ దప్పైన నూహింపఁగాఁబోక
మఱియొక్కమా రన్న మాన్యతయని
సభలోనఁ దన నెంతొ స్వామివా రనవలె
నంచు మాటలు గుఱిపించుచుందు

రిట్టివెడఁగులు కలరుగా యెందఱేని
నాత్మవినుతియుఁ బరనింద లధికముగను
జేసికొంటయె తమగొప్ప; చే టెఱుఁగరె
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!

54. ఒడలెల్ల నలిపినయూరమంగలి కైనఁ
బంచెగుడ్డ నిడుపాపానఁ బోను
ఏఁటికేఁడాది మాబోటికిఁ జదు వన్న
మాష్టారుకె లేదు మల్లుపంచె
ఎల్లప్పు డింటిలోఁ బిల్ల నాడించెడు
దానికే నియ్య నేఁ గానికూడ
నింట వంటలుచేసి పెంటప్రోఁ గెత్తెడి
గుంటకే లేదు పేరంట మెపుడు

చెయ్యమన్నట్టిపని చేసి చాయవలెనె
కూడ నుండినచో సేలు జోడుగాని
కవి కిడెడి దేమి? యిఁక మంటిగడ్డయండ్రు
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!

55. పండితుం డయ్యును బండబూతులు వ్రాయ
వ్యవహారిక మని వాడుచుంద్రు
కర్మిష్ఠుఁ డయ్యు భోగపరాయణుం డైన
సచ్చరిత్రుం డంచు మెచ్చుచుంద్రు
బ్రహ్మజ్ఞుఁ డయ్యు దుర్ణయముఁ గావింప శి
ష్టాచార మని కొనియాడుచుంద్రు
స్వాతంత్ర్య మని వనితాతతి సివమాడ
మంచిరీతిగఁ బ్రశంసించుచుంద్రు

ఎప్పుడు నేయెండ కాగొడు గెత్తియున్న
సమయవేది యితం డంచు సన్నుతింత్రు
ఏదిసత్యమొ యది లొక మెంచ దకట!
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!

56. నారాయణా! యని నోరార నినుఁ బిల్వ
నేరనిపుట్టుకసార మేమి?
మాధవా! నీపదారాధన సేయని
పాణిద్వయం బున్న ఫల మ దేమి?
గోవింద! నీకథల్ కోర్కితో విననట్టి
శ్రుయుగళం బున్న సుఖ మ దేమి?
శ్రీధరా! యని నిన్నుఁ జేరి జోహార్లు కా
వించని యీమేను బెంచ నేమి?

పుండరీకాక్ష! యని నీదుపూజ సుంత
చేయఁజాలని జన్మముల్ చేటుకొఱకె
మానవత్వంపు ఫలితమ్ము మా కిఁ కేది?
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!

57. కౌసల్య "నాపాప! కన్నతండ్రీ!" యని
ముద్దాడఁ జేసినపున్నె మేమొ?
"రామచంద్రా!" యని రాగాలు పాడుచుఁ
బొగడు నారదుపూర్వపుణ్య మేమొ?
"గరుఁడ" నం చవనిజావరున కుప్పొంగు వ
సిష్ఠుని పూర్వసంచిత మ దేమొ?
తనవెంత రాముండు చనఁగ సంతోషించు
గాధినందనునిభాగ్యం బ దేమొ?

"తనయ! శ్రీరామభద్ర!" యం చొనరఁ బిలుచు
దశరథునిపూర్వకృత మగుతప మడేమొ?
తెలియ నావంటియల్పున కలవి యగునె?
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!

58. చక్రి సర్వగతుండు శర ణాతఁడే యన్న
ప్రహ్లాదుఁ డెటువంటిప్రముఖుఁ డయ్యె?
రక్షకుఁ డొకఁడున్న రక్షింపఁడా యన్న
గజరాజు మృతజీవగణనఁ బడడె?
భక్తుఁడై నినుఁగూర్చి రక్తితో జపియించు
నంబరీషుం డెంతయధికుఁ డయ్యె?
నేకాదశీసువ్రతైకధురీణుండు
రుక్మాంగదుం డెంతరూఢి కెక్కె?

భక్తిపరత, యాస్తిక్యము, పరమనిష్ఠ,
వ్రతము గల్గినసుజనుల పాలిటికిని
నీవు ముంగొంగుపసిఁడివి గావె? దేవ!
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!

59. ఆఁకలి కన్నమ్ము నమృతంబె యనుకొంటి
మృష్టాన్నములు నీవి మెసవుచుండ
మంచిచాఁపను బట్టేమంచంబె యనుకొంటిఁ
దూఁగుటుయ్యాల నీ వూఁగుచుండఁ
దాతియాకులపంచఁ దగు సౌధ మనుకొంటి
గుళ్ళు గోపురము లంగళ్ళు నీవి
కాలినడయె నేను గజ మెక్కు టనుకొంటి
రథముపై విహరించురాజ వీవు

ఎంత కంతయె నీసుఖం బెంతుకాని
నాదుమొఱ నాలకించి నన్నాదుకొనవు
స్వార్థపరుఁడవె నీవు గూఢార్థ మెఱుఁగ
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!

60. నీకంటె నా కెవ్వ రెక్కడఁ గలరయ్య?
యాశ్రితవత్సలు లైనవారు;
ఎలుఁగెత్తి మొఱవెట్ట నలజడి తప్పించు
వారు నా కెవరు కన్నారఁ జూచి?
యాత్మసౌఖ్యము నాకు నమరింప నెవరయ్య?
నిన్ను వినాఁగ నాపన్నుఁ డనుచు;
నేమిచేసిన సరె ప్రేమపాత్రుఁడ నన
జాలి యెవ్వరికి నీ వేలకున్న?

నేమిసేతువో? మతిమాలి యింపటంచుఁ
గొంపలోఁబడి నినుఁజూడఁ దెంపులేక
తూలితిని, నిప్పుడా నన్ను దోషి వనుట?
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!

61. అలివేలుమంగతో నావెంకటేశుండు
తిరుపతికొండపై స్థిరుఁడు కాఁడె?
దక్షయజ్ఞధ్వంసదక్షుఁడు వీరభ
ద్రయ్య పట్టిసపర్వతమున నిలఁడె?
సత్యనిర్వహణుఁ డౌ సత్యనారాయణుఁ
డన్నవరాద్రిపై నాదుకొనఁడె?
పసిఁడికన్నులవానిఁ బడఁగూల్చి యప్పన్న
సింహాద్రియందు వసింపఁబోడె?

సాటివారలు భూధరాస్థాను లనుట
బీవు నిట నుంటివా రాజఠీవి విడిచి
యెచటనుండిన నీప్రభ కేమిలోటు?
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!

62. కమల నిన్నేప్రొద్దుఁ గామించి నీపాద
సేవ జేయఁగ నేను జేయు టెపుడు?
ప్రద్యుమ్నముఖకుమారశ్రేణి నీదువా
త్సల్య మొందఁగ నాకు సమయ మెపుడు?
పడకయై విడక శేషుఁడే యూడిగము సేయ
నా కెప్పు డిఁకఁ దరుణము లభించు?
సురసంఘమెల్ల నీ శూశ్రూష సేయ నా
కవకాశ మేది నీయండ నుండ?

గంగ నీకాలిలోఁ బుట్టఁ గమల మెపుడు
బొడ్డుపూవయి వికసిల్లు పొలుపుమీఱ
నర్ఘ్యపాద్యము లేమి యీయంగఁగలను
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!

63. శబరి యెంగిలిపండ్లు చవిఁజూపునంతలో
నిహపరసౌఖ్యము లిచ్చినావు
పగవానితమ్ముఁ డిమ్ముగ నినుఁ గొల్వ లం
కకు వేడ్కఁ బట్టముఁ గట్టినావు
సుగ్రీవుఁ డానాఁడుచుట్టమై చూడఁ బ్రే
మించి కిష్కింద నేలించినావు
అనుమఁడు నిను నమ్మినంతమాత్రనె భవి
ష్యద్బ్రహ్మపద మీయఁజాలినావు

ఏమి కావలెనన్న నీ కేమిలోటు?
చేతిలో నున్న దేమైనఁ జేయగలవు
నాకుఁ జేయనె నీకుఁ బరాకుకాని
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!

64. అనుకొన్న పని యెప్పు డప్పటికప్పుడే
కాదు నీసుతుని సంకల్ప మేమొ?
సిరులకై కష్టించితిరుగ మాయింటికి
రాదు నీసతి కేమి రాజసమ్మొ?
నను వీడు మని వేఁడుకొనఁ బోఁడు నేఁ జేయు
నపకార మేమొ నీయాత్మజునకుఁ?
గలుషముల్ బాయ గంగాస్రవంతిని మున్గఁ
బ్రోవదే నీకూఁతుభావ మేమొ?

కాని పైవారి నిందింపఁబోను నీదు
కోడలే మంచిదయ్యె నాకోర్కెఁదీర్ప
నిన్ను వరునిగఁ జేసె నాకన్నకృతికి
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!

65. నీధ్యానమును జేయ నిలువక చలియించు
మనసు వాల్గంటులఁ గనుచునుండు
నీపూజ చేయఁగ నిరసించు చేదోయి
యతివచందోయిపై నత్తమిల్లు
నీనామముఁ దలంపఁ బూననినాబుద్ధి
పడఁతిపేరు దలంపఁ బరువులెత్తు
నీకథారసము పై నిలుపనినాలుక
ముగుదకెమ్మోవికై మొగమువాచు

నేమొ నాపూర్వకృతపాప మెంచలేను
జేసినవి తప్పు లెన్నియో చెప్పలేను
గాతువో కావవో నన్ను ఘాతుకుఁడని
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!

66. ఎవనిని యాచింప నే మిచ్చి పంపును?
బొట్ట కాపూఁటకుఁ బెట్టలేఁడె?
ఎవనికి నాబాధ లిటులంచు మెఱపెట్టఁ
దలనూఁపడే? లోకధర్మ మనును
ఎవని సన్నుతిచేయ నేమిలాభము గల్గు
పరిపాటి తప్పదే పండితులకు?
ఎవనితో నాస్థితి నెఱుకచేసినఁగాని
మనసిచ్చి మాట్లాడు మనికి లేదె?

ఏల నీవుండ నన్యుల బ్రాలుమాలి
పోయి వేసారి కాలముఁ బుచ్చుకొంటి?
నందఱిని జూడవే జగద్బంధుఁడ వయి
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!

67. పుట్టుకలో నెంతొ పోర్వెట్ట లాలించి
పెంచిన దెవరు ప్రేమించి నన్ను?
శిశువునై యాఁకలిచే నేడ్వఁ బాలిచ్చి
పెంచిన దెవరు ప్రేమించి నన్ను?
వడుగు నై యడిగిన బడుఁ గయ్యె నని పెట్టి
పెంచినదెవరు ప్రేమించి నన్నుఁ?
బెద్దనై యుండ నాపెంపుఁ గోరుచుఁ జూచి
పెంచిన దెవరు ప్రేమించి నన్నుఁ?

జదువుసాములు చెప్పించి కుదురుఁ గోరి
పేరుఁ, బ్రతిభయు రాఁ జూచి పెంచు టెవ్వ?
రన్నిటికి నీవె; తలిదండ్రు లన్న నెవరు?
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!

68. ఏతీరుగా ననుఁ బ్రీతిఁ గాపాడుచుఁ
జేతో ముదంబును జేయఁగలవొ
సంసారమా పెద్ద సాగరంబుగఁ దోఁచు
హింసాకరం బయ్యె నింతవఱకు
గతి లేదు బ్రతుక సమ్మతి లేదు నీచుల
సేవ చేయఁగ నాకుఁ జిత్తమందు
ధనశూన్యుఁ డయ్యును దాతయే కనుఁగాని
కలవార లీయరేఁ గానికూడ

నెట్లు జీవింప నిఁకమీఁద నెవరుదిక్కు?
బ్రతికినన్నాళ్లు భ్క్షయే గతులు కాఁగ
ముందుపుట్టువుఫల మేమి పొందఁగలము
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!

69. భోగభాగ్యము లేమి పొసఁగింపకుండిన
నారోగ్యభాగ్యము నైన నిమ్ము
సంసారసుఖములు సాగింపకుండిన
నిండువేడుకతోడ నుండనిమ్ము
సచ్చితానందంబు సమకూర్పకుండినఁ
దాపత్రయం బైనఁ దగ్గనిమ్ము
పుత్రపౌత్రబలమ్ముఁ పూర్తిసేయకయున్నఁ
గృతసంతతిని గనఁ గతుల నిమ్ము

ఏమిపాపమొ యెటుఁజూడ నెవరు లేక
బాధపడుచుండు నావంటిపామరునకు
దివ్యమగు నీపదమ్ములే దిక్కు తండ్రి!
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!

70. అధికారిఁ జేతు నిరక్షరకుక్షినిఁ
బండితు మూలఁ గూర్చుండఁజేతు
లోభివానికి లక్షలుం గోటు లిత్తువు
దాతను ఋణముతోఁ బాతివైతు
కడుమంచివానికిఁ జెడుగురాలినిఁ గూర్తు
మంచిదానికి దుష్టు మగనిఁజేతు
కూటిపేదను దెచ్చి కోటీశ్వరునిఁ జేతు
కోటీశ్వరుని భిక్షుకుని నొనర్తు

వేమితలఁచిన నీచేత నేమికాదు?
నటకుఁడవు నీవె యీజగన్నాటకమున;
నార్చినను దీర్చినను నీవె యార్తరక్ష!
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!

71. తాటక నలనాఁడు తనువుమాపితి వన్న
నాఁడుదానిని జంప నధికమేమి?
వాలి నొక్కమ్మునఁ గూలనేసితి వన్నఁ
గోఁతిఁ జంపఁగ నెంతఖ్యాతి వచ్చె?
మాయలేడిని రూపుమాపితి నంతివా?
ఇఱ్ఱి నేయుట యెంతవెఱ్ఱితనము
ఆరావణుని జంప శూరుఁడ నందువా?
పదుగురు కలసినపని య దెంత

ఎఱిఁగినటువంటివా రున్నయెడలఁ జెప్పు
నీప్రతాపమ్ము మహిమయు నీటుగోటు
ఏమిలాభము నాపట్ల నెడ్డెవాఁడ
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!

72. సాంతంబుగా శాస్త్రసమితి శోధించిన
సమకూరునే? నీదు సత్వగుణము
పంచీకరణ మెల్ల బాగుగా నేర్చిన
గ్రాహ్యమే? నీతత్వగౌరవంబు
షణ్ముద్రలను బట్టి సాధించియుండిన
దొరకునే? నీదగు పరమపదము
కఠినోపవాసముల్ గావించియుండిన
నొదవునే? నీదు సాయుద్యపదవి

కర్మకాండంబునకు నెంత కట్టువడిన
నమృతమయమగు నీమూర్తి నరయఁదరమె?
చిత్తసంశుద్ధి గలభక్తిచేతఁ గాక
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!

73. ఏకోరికి యని నీకు నెఱిఁగి చెల్లించుదు
నేమంత్రతంత్రమ్ము లిష్ట మందు
నేపూవు పండని యెఱిఁగి యర్పించుదు
నేరీతి హిత మని యేమిసేతు
నేది నీస్తవ మని యెఱిఁగి నేఁ జేయుదు
నేదారి నీ దని యేర్పరింతు
నెందు నున్నా వని యెఱిఁగి పూజించుదు
నేరూప మని నిర్ణయించుకొందు

నేమొ? నీనిజ మెఱుఁగ నా దెంతబుద్ధి?
యేమి సేయుదు? సామర్థ్య మేది నాకు?
నెట్లుమన్నింతువో కృతి నిచ్చుచుంటి
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!

74. ఆవేశమా నన్ను నల్లలనాడింపఁ
బాపపుణ్యము లెంచ నోఁపనైతి
దారిద్ర్యమా నన్నుఁ దహతహలాడింపఁ
జేసితి నెన్నియో చెడ్డపనులు
కామాంధకారమా కనుఁగప్పి ననుఁద్రిప్పఁ
బరకాంతకౌఁగిటఁ బట్టువడితి
ధనకాంక్షయా వెన్నుఁ దన్ని త్రోయుచునుండఁ
గలిమి సంపాదింప నలుఁగుచుంటి

నేమిచేసినఁ జేసితి నెఱుకమాలి
ప్రాలుమాలితి నని నన్ను జాలిదలఁచి
యేలుకొనుభారమా నీదె; యెవరుదిక్కు?
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!

75. కవనమ్ముఁ జెప్పి నీకరుణఁ బొందుదు నన్నఁ
బోతన్ననా? మేను బొంగఁజేయ;
నకలంక మగుభక్తి నలరించుటకు నేఁ గ
బీరునా? నిన్నుఁ గన్నారఁ జూడ;
సంగీతమున నిన్ను సంతసింపఁగఁజేయ
ద్యాగయ్యనా? నీదురాగ మొప్ప;
గుళ్ళు, మంతపములు, గోపురాల్ గట్టింప
గోపన్ననా? యట్టిప్రాపు లేవి?

ఆస్తికిని మాస్తి యున్న దీహస్తయుగమె;
యదియె నీకు సమర్పణ మనుదినంబుఁ
బైని గొసరుగ నామనఃపద్మ మిడుదు
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!

76. వీనులవిం దైన నీనుతి విను చెవుల్
చెవులుగా కితరులచెవులు చవులు
చిత్రమౌ నీదుచారిత్రముల్ పఠియించు
వాయిగా కితరులవాయి గోయి
పూజ్యమౌ నీపాదపూజ చేయుకరంబు
కరముగా కితర మౌ కరము నరము
కరుణ కిమ్మైన నీవరమూర్తిఁ గనుకండ్లు
కండ్లుగా కితరులకండ్లు గండ్లు

కాన నిరతంబు నీపదధ్యాన మూని
ముదము దైవాఱ సేవింతు హృదయమందుఁ
బ్రోవవే నాకు నీకన్నదేవుఁ డెవఁడు?
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!

77. ఏడుకొండలవాని వేఁడఁ బ్రసాద మన్
పేరుతోఁ బెట్టఁడే యోరె మింత?
శ్రీజగన్నాథేశుఁ జేరినఁ బొంగలి
పెట్టింపఁడే యింత పొట్టనిండ?
సింహాద్రియప్పన చెంత కేఁగినఁ దిని
పింపడే పులిహోరఁ బ్రీతితోడ?
వరదరాజస్వామివారిని దర్శింప
నిష్టాన్న మిడఁడె సంతుష్టి దీఱఁ?

బొట్టకూటికిఁ గాదు నిన్ బట్టుకొంట
నీపదధ్యానమున భక్తి నిలుపుభిక్షఁ
బెట్టఁగల్గిన నదె పదివేలు మాకు
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!

78. ఎఱుఁగనివాఁడవా? జరుగుఁబాటే లేక
యడిగితిఁగాని నాయాసకొలఁదిఁ
దెలియనివాఁడవా? కలతెఱం గంతయుఁ
జెప్పితిఁగాని నా తిప్పలన్ని
నేరనివాఁడవా? దూర మాలోచింప
నాఁగలే కున్నది యంటిఁగాని
చూడనివాఁడవా? సుఖపడుమార్గము
మొఱపెట్టితినిగాని కొఱఁతలెల్ల

నెపుడు నీ వుంటి వని నాదుహృదయమందు
దొడ్డనమ్మక మున్నను దూలిపోయి
త్రాగుఁబోతుగఁ జెలరేఁగి వాగుచుందు
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!

79. పుట్టియుం బుట్టక మున్నె నీకథ విన్న
ప్రహ్లడుఁ డెన్నెన్నొ పాట్లుపడియెఁ
దనదుసర్వస్వ మీ వనుకొన్న యలకుచే
లునకు నిర్ధనత తప్పనిది యయ్యెఁ
గృతికన్యకను సమర్పించినపోతన్న
పొలముదున్నియె పొట్టఁ బోసికొనియెఁ
గొందపై నీకిల్లు కోరి కట్టినరామ
దాసుకుఁ జెఱసాల వాసమయ్యె

ముందు నినుఁ గొల్చువారికి నెందుఁ జూడఁ
గష్టములె కాని సుఖములు కానరావు;
అటులె నాపట్ల నైన నే నాఁగఁగలనె?
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!

80. పరమేశ్వరా! నన్నుఁ బాలించు టెప్పుడు?
నీదయారసము నందించు టెపుడు?
నారాయణా! నన్ను నమ్ము నమ్ము టిఁ కెప్పుడు?
నీ విచ్చుఫలము రుచించు టెపుడు?
భువనమోహన! నీదుపూజ మా కెప్పుడు?
తనువు శాశ్వతముగాఁ దనరు టెపుడు?
కేశవా! నిన్ను నేఁ గీర్తించు టెపుడు?
మెప్పించుశక్తితో మెలఁగు టెపుడు?

ఉన్నకాలము నిద్రచే సున్న సగము;
రోగ మని రొచ్చు లని ప్రతిరోజు బాధ
పెట్ట నిహ మేది? పర మేది? తుట్టతుదకు;
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!

81. పురుషార్థమా? యేమి పుణ్యమా? యీతనిఁ
బోషింప నని నీవు పొంచినావ?
విజయమా? యిటువంటి వెఱ్ఱిమానవుఁ గరు
ణించ నా? కనుచు యోచించినావ?
వంశమా? వర్ణమా? వాసవుండా? యేమి
మన కేలరా? యని మఱచినావ?
యేపాటి కలవా? డిఁ కెందులో జమవాఁడు?
పోని మ్మటంచు బూనుకొనవ?

యేమొ నీయూహ తెలియదే యెదుటఁబడిన
నేమి కోరఁగవలయునో యెఱుగకుంటిఁ
జాలుఁ గనిపెట్టి ప్రోచెడిశక్తి లేదె?
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!

82. మీనమై సోముని జా నడంచినదిట్ట
మెట్టుపైనూను తాబేటిమేటి
పసిడికన్నులవానిఁ బడఁగొట్టుక్రోడము
నరసింహుఁడై బాలు నరయు ప్రోడ
బలికిఁ బాతాలము నెలవుఁజేసిన గుజ్జు
జనపాలురను గొట్టుజన్నిగట్టు
రావణుఁ బరిమార్చు రఘురామచంద్రుఁడు
హలముఁ, దాటిసిడంబుఁగలుగుబలుఁడు

బుద్ధదేవుండు, కల్కి ప్రబుద్ధుఁ డాది
మూర్తులన్నియు నీవె నీకీర్తి వినమె
దశరథాత్మజరామ! కోదండరామ
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!

83. నారీకుచారూఢపారీణధోరణి
చేరువకు నన్నుఁ జేర్చినావు
కామినినిడువాలుకడగంటిచూపులఁ
బిచ్చివాఁడన భ్రమపెట్టినావు
రమణీయరమణీవిలాసమ్ముల నపూర్వ
వర్తనమ్ములకుఁ బాల్పఱచినావు
సుదతికెమ్మోవికింశుకపునిగారింపు
చే దృష్టిచపలతఁ జేసినావు

ఎంతమఱలింప నెంచిన నించుకంత
మఱవ నీయక నాబుద్ధి మఱుఁగుపఱచి
తెంతటిదయార్ద్రహృదయుఁడ వీవొ భళిర
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!

84. సీతామహాదేవి చేర వద్దనియెనో
లక్ష్మణుం డీతఁ డలక్ష్యుఁ డనెనొ
కౌసల్య ననుఁ జూడఁ గలహించునో దశ
రథుఁడు చెప్పుటకుఁ బరాకుపడెనొ
భరతుఁడు నాసేమ మరయ వద్దనియెనో
శత్రుఘ్నుఁ డీవంకఁ జనఁగనీఁడొ
సుగ్రీవుఁడే నన్నుఁ జూడ వద్దనియెనో
ఆంజనేయశిఫారు నందలేదొ

అలవిభీషణుఁ డెనియుఁ బలుకఁబోఁడొ
ననుగుఱించి పైవారల మనవు లేల?
స్వయముగా నీవె రక్షింపఁ జాలవొక్కొ?
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!

85. ధనకాంక్ష ననుఁ జేరి తలఁబట్టి లాగిన
నీచులయొద్దఁ జేఁ జాఁచఁబోను
పొట్టపోషణకు నేపట్టు లేకున్నను
గూటసాక్ష్యములకై పాటుపడను
గోటుగా శృంగారపాటవ మాశించి
నాటకా లాడంగఁ బాటిసేయఁ
గోటీశ్వరులతోడఁ గూర్మి చేకూరినన్
గులవృత్తిఁ దొలఁగ మేకొనఁగఁబోను

ఆస్తికుండ నౌచు ధర్మరహస్య మెఱిఁగి
కఱవొ కాటకమో పడి కాల మెట్లొ
గడుపుచున్నను దయరాదు; కర్మ మేమొ
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!

86. మొసలితో యుద్ధమా? తసనాలుపడుటకు
నాపని యెంత నీప్రాపు చాలు
యాచన సేయుటా? గోఁచిబాపఁడ వయి
నాపని యెంత నీప్రాపు చాలు
మోసముఁ జేయుటా? మోహనమూర్తివై
నాపని యెంత నీప్రాపు చాలు
రక్కసితోఁ బోర? చిక్కులుపడుటకు
నాపని యెంత నీప్రాపు చాలు

నంటి నేమంటి; విదిచేయ నర్హమంటిఁ
దుదకు నీవుంటి నేనుంటి దొడ్డ దపుడు
చేయవచ్చును దక్షత చేతి కిచ్చి
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!

87. చెఱుకుపిప్పికిఁ జీమఁ జేరిచె నెవ్వఁడు?
నాభిలోఁ బురువుల నాఁటె నెవఁడు?
వృక్షాగ్రమునఁ జేర్చెఁ బక్షుల నెవ్వఁడు?
నదిఁ బొంగఁ జేసెడినాథుఁ డెవఁడు?
రాతిలోఁ గప్పను రక్షించు నెవ్వఁడు?
ఎల్లపూలకుఁ దావిఁ జల్లె నెవఁడు?
కడలిలో లవణంబుఁ గలుపువాఁ డెవ్వఁడు?
తివిరి ముండ్లకు వాడి దిద్దు నెవఁడు?

సహజ మగుశక్తిఁ బ్రకృతిలో సంతరించి
యాదుకొన వొక్కొ? మొక్కకుఁ బాదువోలె
అట్టినీకు నమస్కారమయ్య తండ్రి
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!

88. ఎవనియానతిచేత నీరేడుజగములు
పుట్టుచుఁ బెరుఁగుచుఁ గిట్టుచుండు
నెవనియానతిచేత నీసూర్యచంద్రు ల
హర్నిశంబులు చేయ నర్హులైరి
యెవనియానతిచేత నీగ్రహమ్ములు మింట
నలువొందు నక్షత్రనామ మొంది
యెవనియానతిచేత నీసదాగతి యెల్ల
జీవులప్రాణమై చెలువు మీఱు

నెవనియానతిచేఁ జెట్టు లివురుఁ దొడిగి
పూలుఁ గాయలుఁ బండ్లుఁ బెంపుగ నొసఁగు
నట్టిపరమాత్మ వీవ నిన్ బట్టుకొంటి
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!

89. కొండంతగజమున కుండుబలం బేడ?
మావటీఁ డైనట్టిమనుజుఁ డేడ?
గుండె గాబర సేయుచుండుసాగర మేడఁ?
బడవ గెంటెడువానిపగ్గె యేడ?
బ్రహ్మాండభాండంబు పర్వుచీఁకటి యేడఁ?
గడు మిన్కుమనుదీపకళిక యేడ?
మానవదేహంబు మాపురోగం బేడ?
నౌషధ మావగింజంత యేడఁ?

బురహరుం డేడ? మరువిరిశరము లేడ?
హెచ్చుతగ్గులు చెప్ప నే నెంత? నీవె
యాదరింప రవ్వంత కొండంత గాదె
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!

90. భద్రాద్రి శ్రీరామభద్రుఁడవే యన్న
శ్రీరంగవాసిగాఁ జెప్పుచుంద్రు
శ్రీరంగమే నీకు స్థిరమందిరం బన్న
నాజగన్నాథ మాయతన మందు
రాజగన్నాథమే యాయతనం బన్న
సేతువునందు వసింతువందు
రాసేతువే నీనివాస మౌ ననుకొన్న
నల యయోధ్యాపురి నిలయమంద్రు

తిరిగితిని దేశదేశాలు దిమ్మతిరగ
నీప్రభావమె, నీరూపె, నీగుణంబె
యౌర! నీవొక్కయెడనుంటివనుట యెట్లు?
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!

91. సంసారమా చాల హింసాకరం బని
తెలిసియు మాయలోపలనె పడితి
విషయసుఖమ్ములా వెతలకోసమె యని
తెలిసియు మాయలోపలనె పడితిఁ
బుత్త్రమిత్త్రకళత్రపౌత్త్రు లస్థిరమని
తెలిసియు మాయలోపలనె పడితి
ధనధాన్యములు భూమి తనవెంట రా వని
తెలిసియు మాయలోపలనె పడితి

బేమొ? యీమాయ నీలీలయేమొకాక
యెంత ఝాగ్రత్తపడిన నావంత జ్ఞప్తి
రాదు; పడిపోవఁ బరితాపమా దహించు,
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!

92. తనువు నిత్య మటంచుఁ దలపోసి కొన్నాళ్లు
సింగారముల్ సేయఁ జెల్లిపోయె
గామినీభోగేచ్చ కలుగఁగఁ గొన్నాళ్లు
కన్నుమి న్నెఱుఁగనికాల మాయెఁ
బుత్త్రమిత్త్రకళత్రపౌత్త్రసంపత్తిని
గడియింపఁ గొన్నాళ్లు గడచిపోయెఁ
బేరుపతిష్ఠ కై పీఁకులాడుటలోనె
బిరబిరఁ గొన్నాళ్లు తిరిగిపోయెఁ

గాలమా పోయె; నిఁక నీదుకరుణ యెట్లొ
నిను స్మరియింప నైతి నం చెన్నఁబోక
విన్నపము లాలకింపు మాపన్నశరణ
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!

93. కరిరాజు కష్టనిష్ఠురములు మొఱపెట్టఁ
బ్రోవవే నీదగుఠీవి మెఱయఁ?
బ్రహ్లాదుఁడానాఁడు పడలేని బాధలఁ
గని కటాక్షింపవే కనికరమునఁ
బాందవుల్ పడరానిపాటులు పడుచుండఁ
దోడునీ డయి నీవుకూడఁ జనవె?
ద్రౌణిశరాగ్నిచేఁ దహతహపడు నుత్త
రాగర్భశిశువు నూరార్పలేదె?

అట్టులే చూడు నన్ను నిప్పట్టునందు
కలిమిఁ జుట్టఱికములనే తలఁప కయ్య
దీనులను బ్రోతు రెవ రింక? దేవడేవ
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!

94. ఎచట నీనామమే యెక్కువ వినిపించు
నెందుఁ జూచిన నీదుమందిరములె
ఎచట నీచరితమే ప్రచురమ్ముగాఁ దోఁచు
నెందు నీలీలకు సందులేదు
ఎచట నీగోష్ఠియే యింపు లొల్కుచునుండు
నెందు నీసృష్టికి నెడములేదు
ఎచట నీప్రతిభకు హెచ్చుతగ్గులు లేవు
ఎందు నిన్ బోలువా రెవరుకలరు?

ఎచట నీరాజ్యగౌరవ మెంచగలము?
ఇంతకును బూర్వకృత మగు సంచితమునఁ
దెలియకే వారు వీరని కలఁతవడితి
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!

95. రక్షింప శిక్షింప దక్షుండ వీ వౌటఁ
జెప్పఁగా నేల? నీచిత్త మింక
విఱిపింపఁ గఱిపింప విజ్ఞాని వీ వౌటఁ
జెప్పఁగా నేల? నీచిత్త మింక
నాలింప లాలింప నధికారి వీ వౌటఁ
జెప్పఁగా నేల? నీచిత్త మింక
బాలింపఁ దూలింపఁ బ్రభుఁడవు నీ వౌటఁ
జెప్పఁగా నేల? నీచిత్త మింక

నామమాత్రమ్ము నాప్రయత్నమ్ముకాని
కార్యకారణఫలితసంఘటన నీదె
మనుజచాపల్యమును నేను మానఁగలనె?
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!

96. ఏజీవకోటికి నేలిక వనుకొందు
నేమూర్తి నీదని యెంచుకొందు
నెపుడు నీయాధార్థ్య మెఱుఁగుదు ననుకొందు
నెపుడు నమ్మఁగలాఁడ నిచ్చయందు
నెవరు నాయానవా లెఱిగింతు రనుకొందు
నెవరికిఁ జిక్కినా వీవు ముందు
నేమహాత్ముఁడు నీకు హితుఁడని యనుకొందు
నెవ్వానివలన ని న్నెరిగికొందు

నెదియో మాయగాఁ దోచె నెంతవఱకు
యోచనము చేసి కష్టించి యోర్చియుందుఁ
బుణ్యకాలము రవ్వంత పోవుచుండె
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!

97. ధూపదీపములచే దీపించు నీగుడి
కలపంబు నీమేన వలపు లీను
శృంగారకళలతోఁ జెలఁగు నీపడకిల్లు
సొంపుగుల్కెడు పవ్వళింపుఁబాన్పు
ఇంగిలీకపు వింతరంగు దుకూలంబు
పరమాన్నములు నీకుఁ బారణములు
రత్నాలు, పతకహారములు, కిరీటంబు
పచ్చలకడియాలు, పైఁడిగొడుగు

నన్నియును గల్గి నా కొకటైన నిడవె?
పేరుఁ దలఁదాల్చినను నీకుఁ బ్రేమ లేదె?
పేరు సార్థక మగుసదాచార మేది?
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!

98. గోవిందుఁడని నిన్నుఁ గొవిదు లందురే?
నాకష్ట మెఱుఁగనినాఁడు నిన్ను;
సర్వేశ్వరుం డన్న సత్కీర్తి యుండునే?
నన్ను రక్షింపనినాఁడు నీకు;
సర్వజ్ఞుఁ డీ వన్న సన్నుతి యుండునే?
నామొఱాలింపనినాఁడు నీకు;
నార్తరక్షకుఁ డన్నయధికార ముండునే?
నన్నుద్ధరింపనినాఁడు నీకు;

నెంచ గోవిందుఁడవొ పరమేశ్వరుఁడవొ
జ్ఞానివొ రక్షకుందవొ నే నెఱుంగ;
నీపరీక్షకు నే నెట్టు లోపఁగలను
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!

99. నీపాదసేవ మనీషియై సర్వదా
పాయని వీరాంజనేయుఁ డెఱుఁగు
సంకల్పమాత్ర నీ సత్స్వరూపస్ఫుర్తి
ముదముతోఁ జూచు నారదుఁ డెరుంగు
భవదీయమహిమ గర్భస్థుఁడై కథలుగా
నాలించినట్టిప్రహ్లాదుఁ డెఱుఁగుఁ
బ్రకృతియం దెల్ల నీప్రభ నిండె ననునట్టి
శ్రుతిరహశ్యము శ్రీశుకుఁ డెఱుంగు

నీదు నామమహత్త్వంపునియతి యెల్లఁ
గోకిలం బయి కూయి వాల్మీకి యెఱుఁగుఁ
గాని ని న్గన మే మెంత కలియుగాన
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!

100. పాపమంచును బరితాప మొందుదుఁగాని
చేయుచున్నా నెన్నొ చెడ్డపనులు
కడుపుకక్కుఱితిగాఁ గడ కెఱుంగుదుఁగాని
తడఁబడుచుంటి దుందుడుకుపనుల
మంచిగా దనుచు యోచించుచుందునుగాని
విడువదే? మన సేమి చెడుగులందు
నజ్ఞాన మని బుద్ధి నాడుచుందునుగాని
యావేశమునుబట్టి యాఁపలేనె

ఏమిపాపమొ, నాజన్మ కేమికొఱయొ?
చేసి పరితాప మందుటఁ జేయుచుంట
మానదే నీదుభక్తిని బూను టెపుడు?
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!

101. ప్రియునికైవడి నన్నుఁ బ్రేమలో ముంతువు
శాఠునిరీతిగ నాకు శ్రమల నిడుదు
తల్లిలాగున నన్ను నెల్లెడఁ జూతువు
కలచందమునఁ దోఁచి కనులఁబడవు
గురునిమాదిరి నాకు మఱుఁగుఁ జెప్పుచునుందు
పాపాకూపమునందుఁ బాఱవైతు
తండ్రిపోలిక నన్ను దయ నేలఁ గనిపింతు
వాపత్తు పైఁబడ్డ నడ్డుపడవు

ఏమొ నీయూహ తోఁచది ట్లెందుకొఱకు
మాయ నాటక మాడెద వోయి! చెపుమ
దీన నీకగుపేరుప్రతిష్ఠ లేమి?
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!

102. హిందూముసల్మాను లందఱి నొకటిగాఁ
జేసిన దీభద్రశిఖరిగాదె?
గోపన్న సంసారతాపమ్ము లడుగంటఁ
జేసిన దీభద్రశిఖరిగాదె?
తానీషామూర్ఖతఁ దప్పించి జ్ఞానిగాఁ
జేసిన దీభద్రశిఖరిగాదె?
మతములఁ గొట్టి సమ్మతి నందఱిని గొల్వఁ
జేసిన దీభద్రశిఖరిగాదె?

యెంచ నీభద్రగిరిపూర్వసంచితమ్ము
చెప్ప శక్యమే నాబోఁటిచిఱుత కిపుడు?
వినఁ దలంచిన బీవె చెప్పింపవలయు
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!

103. ఎవఁడు నాకిచ్చు? నీకృప యింత లేకున్న
నంతి ధనప్రాప్తి యైనతఱిని
నెవఁడు నన్ గొట్టు నీ దవుపూన్కి లేకున్న
నంటిఁ దిరస్కార మైన తఱిని
నెవఁడు వంచించు నీ కిష్టమే లేకున్న
నంటిఁ బరాభవం బైనతఱిని
నెవఁడు బిడ్దగి నీయహీనమౌ దయలేక
యుంటిఁ బుత్రోత్సవ మైనతఱిని

నన్నిటికి నీవె యంటి నే నాడుమాట
తప్పొ యొప్పొ యెఱుంగ నీవొప్పితేనిఁ
జూడు నాభార మంత మాఱాడకుండ
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!

104. పోతనపైఁ జూపుప్రీతిఁ జూపిననాఁడు
హాయిగాఁ గృతినీకె యీయఁబోనె?
భ్రమకీటన్యాయభాతిఁ జేసిననాఁడు
కాళిదాసునివంటికవిని గానె?
వాల్మీకి కిడినతావకమంత్ర మిడునాఁడు
వ్రాయనే కోటిరామాయణములు
ధర్మాత్మజున కిడ్డదయను జూపిననాఁడు
పాలింపనే లోకజాల మొకఁడ?

నాంజనేయునిపఁ జూపు నాదరమ్ముఁ
జూపినావేని నామీఁద సుస్థిరముగఁ
బడయనే భావిసద్భ్రహ్మపదవి నేను
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!

105. ఆఁకలివేళ మృష్టాన్నముల్ చల్లారఁ
బెట్ట శ్వానము మూతిఁ బెట్టినపుడు
పరిపక్వమై పంతపైరుండగాఁ బెను
గాలిచే సస్యము తూలినపుడు
తనువరించిన కాంత గొనిపోయి తలిదండ్రు
లితరులకున్ బెండ్లి కిచ్చినపుడు
వైభవోపేతపట్టాభిషేకంబు కాం
తారవాసంబుగా మాఱినపుడు

నర్థిమన మెట్టులుండునో యటులె నాకుఁ
జేతి కందెడిఫలమునుఁ జేరనీక
వ్యర్థునిగఁ జేయుచుంటి నీస్పర్థ యేమొ
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!

106. ఆంజనేయున కిచ్చునాధిక్య మిడినచో
దాఁటనే భవవార్ధి మాటలోనె?
ప్రహ్లాదునకు నిచ్చు భక్తి నా కిడినచోఁ
జూడనే నిన్నెల్ల చోటులందు
ధ్రువున కిచ్చినమనోరూఢి నాకిడినచోఁ
గట్టనే నిన్ను నాయెట్టయెదుట?
నారదుపైఁ జూపుకూరిమి నా కిడ్డఁ
గలసికోనే నిన్నుఁ దలపులోనె?

ఎంతపాక్షికమో భక్తసంతతియెడ
నిప్పటికి నీకు నామీఁద నేమొకాని
కనికరము రాదె? నాపూర్వకర్మ మొక్కొ?
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!

107. ఆపన్నులను వీడ నీపన్నుగడ యేల?
యచ్చు కొక్కటి సేయ మెచ్చ రెవరు
కష్టజీవులఁ బ్రోవ నిష్టము లేకున్న
సుఖుల రక్షింపను జోద్య మేమి?
పాపాత్ములను నెట్లు పాలింప నందువా?
పుణ్యులఁ జూచినఁ బొలు ప దేమి?
ఏపాటిదొర వని చేపట్ట నంటివా?
ఘనుల కీ వరసెడిపనులు గలవె?

నీకు దక్షత కలదేని సాఁకు మయ్య
వారు వీరని భేదము చేరకుండ
దీనరక్షకబిరుదు శోధించు మయ్య
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!

108. కైకవరంబుచేఁ గానల నివసింప
వచ్చినా వనఁగ నిన్ మెచ్చెజనము
ఖరదూషణాదిరాక్షసులఁ జొక్కాడుట
నాలించి ఋషులు మిన్నందుకొనిరి
పగవానితమ్మునిఁ బాలించితి వనంగ
సురలు వర్షించిరి విరులవాన
రావణుఁ జంపి నీలావుచే సీతను
గైకొంటి వనఁ గీర్తి కడలుప్రాఁకె

నేమిలోటయ్య? గుణవంతు లెచట నున్న
గౌరవమెకాని సుఖములఁ గాంచఁబోరు;
కనుకనే కొండ లెక్కంగ మనసువుట్టె;
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!

109. తాతకఁ బరిమార్చుపోటరి వైయున్న
రాదు నీకీపాఎఉ రామభద్ర!
శివునికార్ముక మొక్క చిటికలో విఱిచిన
రాదు నీకీపేరు రామచంద్ర!
వాలి నొక్కమ్మునఁ గూలనేసినఁగాని
రాదు నీకీపేరు రామచంద్ర!
రావణాసురుఁ జంపుచేవ గల్గినఁగాని
రాదు నీకీపేరు రామచంద్ర!

సీత నీచెట్టఁబట్టుటఁ జేసికాని
యింతపేరుండునే ద్వాపరాంతమునకుఁ?
దాత, రఘువున కేది నీఖ్యాతిఁ జూడ?
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!

110. ఒకచోట నవ్వింతు వొకచోట నేడ్పింతు
వొకచోటఁ బాడింతు వొప్పుమీఱ
నొకచోట మ్రొక్కింతు వొకచోట మ్రొక్కుల
నందుకొ మ్మని నన్ను ముందునుంతు
వొకచోట రాగమ్ము నొకచో విరాగమ్ముఁ
గలిగించి యాశ్చర్యకలన ముంతు
వొకచోఁ జిరాకుని నొకచోఁ బరాకును
దెప్పించి నాముప్పు త్రిప్పలందు

ఒకచో నుండ నియమింతు వొక్కచోట
దేశద్రిమ్మరి యనిపించి త్రిప్పు దౌర!
బొమ్మలమె నీకు మేము? కానుమ్ము దేవ!
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!

111. నీధ్యానమును జేసి నిమిషంబులోపలఁ
గనుమాసి నీమూర్తిఁ గాంచుచుండ
జాగరూకతతోడ యోగమ్ముఁ బట్టఁగఁ
బట్టేరా వీడఁ డని తుట్టతుదకు
శ్రవణమ్ములకు నేదొశబ్దమ్ముఁ జేకూర్చి
చెలువ మోహపుబొమ్మఁ జెంత నునిచి
కనులపండువుగాఁగఁ గనఁజేసి చిటికలోఁ
జిత్తమ్ము నిటునటుఁ జెదరఁగొట్టి

మట్టెచప్పుడుతో నీవు మాయమగుదు
వింతవ్యామోహ మిడినవా రెవరు నాకు?
బంతివలె నీవెకాదె యాడింతు నన్ను
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!

112. ధర్మమార్గమ్ము నాదరముతోఁ జూపినన్
స్వాంత మావంకముఁ జనఁగఁబోదు
కామోపభోగముల్ కలలవంటి వటంచుఁ
దెలిపినన్ మనసు చంచలత విడువ
దేది యేలాగున నేర్పాటు కాఁదగు
నది నాపురాకృత; మట్టి కర్మ
మున కనుకూల మై యొనరుదానికి మించి
యిదమిత్థ మని చేయ నెవని శక్య?

మిదియె నాప్రార్థనము; నాకు నిదె మతంబు;
జన్మజన్మాంతరములందు మన్మనమున
నీపదారూఢ మగు భక్తి నిలుపుమయ్య
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!

113. గర్భనారకమును గడచి నే భువిఁ బడ
కుండ నాతండ్రికి నుసురుఁ బాపి
తరువార మూఁడేండ్లు దాఁట నాజనయిత్రి
నెఱిఁగి యెఱుఁగకుండఁ గఱవుఁజేసి
ననుఁ జూచువార లెందును లేనితఱిని నా
పెదతల్లికిని బేర్మిఁ బెం పొసంగి
చదువుకో దేశాల సంచరింపఁగఁ బంపి
సంసార మని మొక్క చానఁ గట్టి

బిడ్డ లని పెట్టి చంపుచు నడ్డమైన
పొరుగుపంచల పాల్చేసి పొట్టకొఱకుఁ
ద్రిప్పుచుంటివి నీముప్పుతిప్ప లనుచు
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!

114. దున్నఁబోవగ నెద్దు మన్నఁబోవగ నావు
కాకుండఁబోయితిఁ గర్జ మేమి?
ఱెక్క లాధార మేముక్క  లేమాత్రమౌ
వచ్చిన డబ్బిచ్చువారు లేరు
కాలముఁబట్టి నౌకరి మంచి దని యుంటి
నూరూరఁ బొట్టకుఁ జేరలేక
పొట్ట నెప్పట్లనో పోషించుకొనవచ్చుఁ
బని వోవ నుత్సాహభంగ మయ్యె

నేదొ నీపున్నె మంచు నే నాదుకొన్న
పనియె పదివేలు; పయిపయిపరువు లేల?
యెవనికిని బుద్ధి పుట్టింప నీయఁబోరు;
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!

115. అగ్రహారికుఁదను నగ్రహారము లెదు
నిగ్రహించెడుబుద్ధి నిలుపలేను
విద్యార్థినేకాని విద్వాంసుఁడనుగాను
బద్య మల్లినఁ గవీశ్వరుఁడగాను
బొట్టకోసము విద్యఁ బట్టిపల్లార్పను
ధనవంతు లనుచు వందనము లిడను
రాజమర్యాదకై ప్రాకులాడఁగఁబోను
నోరూర్చురుచులకై జాఱిపడను

గులముపెంపును బాటించి గుణ మెఱింగి
న్యాయమార్గము చేపట్టి నడుచుచున్న
జాలిఁ జూడ వదేమొ? దయాలవాల
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!

116. "ఊడిమూడి" సమాఖ్య నొప్పునింతను నన్న
పూర్ణకు నాగరాట్ పుంగవునకుఁ
దనయుఁడ రామభద్రునకుఁ బౌత్రుండ, భా
రద్వాజగోత్రానఁ గ్రాలుచుండి
తగ "బళ్ల" వారికిఁ దత్తుండ నయి వేంక
మాంబను నీలాద్రిమనుజవిభుని
దల్లియుఁ దండ్రిగా నెల్లప్పుడును గొల్చి
వారియాశీర్వాదభాగ్య మంది

వినుతరుక్మాంగదునిగోత్ర మెనసి నీకు
గాంక నూటపదా ర్లీయఁ గలిగినాఁడ
సాఁకుమీ ననుఁ గృప రామచంద్రకవిని
రమ్యగుణసాంద్ర! భద్రాద్రిరామచంద్ర!

సమాప్తం

Saturday, October 5, 2013

శ్రీభద్రాద్రిరామ శతకము - పరశురామ నృసింహదాసు

శ్రీభద్రాద్రిరామ శతకము
                                  పరశురామ నృసింహదాసు

(సీసపద్య శతకము)

1. శ్రీగణాధీశుని సేవించి వినుతించి, భారతీనాథుని బ్రస్తుతించి
శ్రీపతిపాదముల్ చిత్తంబులోనుంచి, సాంబమూర్తిని సదా సంస్మరించి
వాసవాద్యఖిలదేవతలను బ్రార్థించి, సనకాదిమౌనుల సన్నుతించి
గురుపదాంభోజముల్ గొనియాడి పూజించి, వేదాంతవేద్యుల విన్నవించి

ఆంధ్రగీర్వాణకవుల నేనాశ్రయించి
చేయఁబూనితి శతకంబు చిత్తగించు
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ

2. శ్రీజానకీరామ సేవకసుత్రామ, రఘుకులాంబుధిసోమ యఘవిరామ
పతితపావననామ భవ్యపరంధామ, కరుణాలలామ సంగ్రామభీమ
వారివాహశ్యామ వరతులసీధామ, యమితవిక్రమ త్రిలోకాభిరామ
విజితభార్గవరామ వినతమౌనిస్తోమ, సంపూర్ణకామ సత్సార్వభౌమ

భక్తమందార నగధీర భయవిదూర
దనుజసంహార విమల వేదాంతసార
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ

3. వేదము ల్వివరించి విన నేర్చుకొనలేదు, శాస్త్రపురాణము ల్చదువలేదు
యాంధ్రగీర్వాణంబు లభ్యసింపఁగలేదు, వేదాంతమార్గము ల్వెదకలేదు
చూచి ఛందంబులు శోధింపఁగాలేదు, సాధుజనులపొందు సలుపలేదు
విలసదలంకారవిధము చూడఁగలేదు, కావ్యనాటకములు గానలేదు

మీకటాక్షంబు నాయందు మిగులఁ గలుగఁ
జేయఁబూనితి నే నొకసీసశతము
తప్పులేకుండ దయఁజేసి ధరణియందు
గవిజనంబులు మెచ్చ విఖ్యాతిసేయు
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ

4. నీలమేఘముతీరు నీశరీరంబును, బద్మరాగఛాయ పదయుగ్మమ్ము
పన్నగేంద్రసమానబాహుదండంబులు, సింహమధ్యమును హసించునడుము
తిలపుష్పమునుబోలు తీరైననాసిక, శ్రేష్ఠవిద్రుమసదృశోష్ఠములును
గమలంబులను మించు విమలనేత్రంబులు, పున్నమచంద్రునిబోలు మోము

మదనశతకోటి సుందరమైన చక్కఁ
దనము వర్ణింప బ్రహ్మకుఁదరముగాదు
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ

5. కేశవ గోవింద కృష్ణ దామోదర, నారాయణాచ్యుతనారసింహ
మధుసూధన త్రివిక్రమజనార్ధనముకుంద, వఈకుంఠవామనవాసుదేవ
పుందరీకదళాక్ష పురుషోత్తమోపేంద్ర, పరమాత్మ పరమేశ పద్మనాభ
మాధవాధోక్షజ మధువైరి శ్రీహరి, విష్ణు విశ్వంభర విశ్వనాథ

శ్రీధరానంతచిద్రూప శ్రీనివాస,
పుణ్యచారిత్ర సురనుత పుణ్యపురుష
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ

6. నిత్యనిరాకార నిరుప్రదవాఖండ, నిర్మల నిర్గుణ నిష్కళంక
నిష్కర్మ నిష్క్రియా నిస్సంగ నిర్వంద్య, నిరుపమనీరంధ్ర నిర్వికల్ప
నిష్ప్రపంఆవ్యయ నిర్ద్వంద్వ నిశ్శబ్ద, నిర్విచానంద నిర్వికార
నిర్విశేషాచింత్య నిరతిశయానంద, స్వస్వరూపంబు నిస్సంశయంబుగ

వారిజాసనకైలాసవాసవాస
వాదులకు నైన వర్ణింప నలవి యగునె
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ

-:ప్రపంచోత్పత్తిలక్షణము :-

7. ఆత్మయందు ననేకమాకాశ ముదయించె, నాకాశమున వాయు వపుడు పుట్టె
ననిలంబువలనను నగ్నిహోతముపుట్టె, నగ్నిహోత్రమువల్ల నప్పు పుట్టె
నప్పులవలన మహావనీస్థలి పుట్టె, నవనియం దోషధు లమరఁ బుట్టె
నోషధులందున నొనర నన్నము పుట్టె, నన్నమందును నరులాది సకల

జంతుజాలంబు లాయె నీజగతియుగము
లాయె నీరీతిఁ బరమాత్మ మాయవలన
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ

-: నరప్రమాణసూత్రము :-

8. నరుఁడు తొంబదియాఱు నంగుళా లెనిమిది, జేనలపొడవునా ల్జేనలెళుపు
నిట్లు ముప్పదిమూఁడుకోట్లరోమంబులు, వెలయు డెబ్బదిరెండువేలనాళ్ళు
నెముక లఱువదియాఱు నమరు తొంబది రెండు, కీళ్ళు ముప్పదిమూఁడు మూళ్ళప్రేగు
సేరుగుండెలు నర్ధసేరును రుధిరంబు, మణువు నాలుగుసేర్లు మాంసముండు

సోలపైత్యంబు శ్లేష్మ మరసోలె డుండు
నీప్రకారంబు దేహంబు లెంచిచూడ
జంతుజాలంబు లాయె నీజగతియుగము
లాయె నీరీతిఁ బరమాత్మ మాయవలన
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ

-: తొంబదియారుతత్త్వములు :-

9. జ్ఞానేంద్రియము లైదు కర్మేంద్రియము లైదు, శబ్దాదు లైదు కోశంబు లైదు
కరణము ల్నాల్గు రాగాదు లెన్మిది పది, నాళ్ళు వాయువులు పద్నాల్గు నేడు
థాతువు లైదు భూతము లాఱు చక్రాలు,  మలముల మూఁడవస్థలును నైదు
మూఁడుమందలములు మూఁడీషణంబులు, మూఁడువ్యాధులు గుణా ల్మూఁడు రెండు

తనువులనుగూడి షణ్ణవీత్యాదితత్వ
సాక్షిరూపుఁడవైనావు సత్యముగను
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ

-: పంచభూతలక్షణము :-

10. వసుధాజలం బగ్ని వాయు వాకాశంబు, లివి పంచభూతము ల్వీనియందు
రక్తశుభ్రాసితయుక్తధూమ్రసునీల, ములు గంధరసరూపములను స్పర్శ
శబ్దంబులును గ్రియాశక్తి జ్ఞానేచ్ఛాది, శక్తులు పరపరాశక్తు లమర
నాయుజవిష్ణువు త్ర్యంబకేశ్వరసదా, శివులు నొండొంటికి స్థిరముగాను

వర్ణగుణశక్తి బీజదేవతలు నుండు
నీకు నే గుణములు లేవు నిర్మలుఁడవు
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ

-: పంచభూతగుణములు :-

11. రూఢిశబ్దస్పర్శరూపముల్ రసగంధ, ములు నైదు పృధివియందమరియుండు
స్ప్ర్శరసమురూపశబ్దము ల్నాగును, జనితమై జలమారు చెలఁగియుండు
నగ్నిహోత్రమునందు నమరి రూపస్పర్శ, శబ్దము ల్మూఁడు నిశ్చయముగాను
వాయు వందస్పర్శవరశబ్దములు రెండు, నంబరం బందు శబ్దంబు నొకటి

యొక్కటియు లేక దిక్కులు పిక్కటిలఁగ
వెలుగుచున్నావు లోపల వెలుప లనక
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ

-: పంచీకరణలక్షణము :-

12. ఆకాశపంచక మంతరింద్రియములు, ప్రాణాదులును వాయుపంచకంబు
జ్ఞానేంద్రియములు వైశ్వానరపంచక, మప్పు పంచకము శబ్దాదు లైదు
కర్మేంద్రియము లైదు కడుభూమిపంచక, మిటు లిరువదియయిదింద్రియములు
యివి యాత్మగాదని యిన్నిటి నెఱిఁగెడి, యెఱుకయే పరమాత్మ యని యెఱిఁగి

సాంఖ్యాయోగంబు సాధించి సజ్జనుండు
ముక్తి జెందును మీపాదభక్తితోను
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ

-: పంచభూతాంశము :-

13. జ్ఞానసమానము ల్వీనులు శబ్దంబు, పాస్స్యోమయంశము ల్పరుసనాయ
మనసువ్యానము చర్మమును స్పర్శకరములు, వాయుయంశంబులు వరుస నాయ
రూఢిబుద్ధియు దాన రూపాక్షిపాదము, ల్వహ్నియంశంబులు వరుస నాయ
చిత్తంబు ప్రానంబు చిహ్నశిశ్నిరసంబు, వారియంశంబులు వరుస నాయ

గంధహంకారము లపానఘ్రుణగుదము
లాయ భూయంశ లిట్లు నీమాయవలన
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ

-: పంచభూతాంశగుణములు :-

14. నరము లస్థులు చర్మనఖరోమమాంసము, ల్భూగుణంబులు స్వేదమూత్రరక్త
ములు శుక్లశోణితంబులు వారిగుణములు, క్షుత్పిపాసాలస్యసుప్తిసంగ
ములు వహ్ని గుణములు చలనధావనకంప, నాకుంచనప్రసార్యాదికములు
పవమానగుణములు భయవికారంబులు, క్రోధలజ్జయు నభోగుణము లవియుఁ

బంచభూతాంశగుణములఁ బాఱదోలి
నీస్వరూపంబు గనువాడు నిర్మలుండు
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ

-: పంచకోశముల నిర్ణయము :-

15. అన్నరసంబుతోనైన శోణితశుక్ల, మయమైన యాదేహ మన్నమయము
పంచప్రాణంబులు ప్రబలికర్మేంద్రియ, పంచకమును గూడి ప్రాణమయము
జ్ఞానేంద్రియము లైదు మానసం బొక్కటి, కూడియైనవి మనోకోశమయము
చెలఁగి జ్ఞానేంద్రియములు బుద్ధియునుగూడి, విజ్ఞానమయమున విద్యయందు

మనసు కలసిన యానందమయము నిట్లు
పంచకోశములకు సాక్షిపరుఁడ వీవ
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ

-: పంచప్రానములస్థాననిర్ణయము :-

16. ప్రాణుండు హృదయాబ్జమందు నావాసమై, నాణిమస్వానము ల్నడుపుచుండు
పాయుపస్థలయం దపానుండు మలమూత్ర, ముల విసర్జనఁజేసి మెలగియుండు
నాభినందున సమానమునుండి సమముగా, నాళ్ళయందున నన్నింటిని నడపుచుండు
ఘనుఁ డుదానుండును కంఠమందుననుండి, వైఖరిపలుకులు పలుకఁజేయు

వ్యానపవనుండు దేహసర్వావయముల
నిండిశీతోష్ణస్పర్శల నెఱుకఁజేయు
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ

-: ఉపవాయువులలక్షణము :-

17. నాగుండు నుద్గారుణంబు సేయుచునుండు, మేలుగాఁ గూర్ముఁ డన్మీలనంబు
జేయించుఁ హృకరుండు జేరి తుమ్మించును, జితదేవదత్తుఁడు జృంభణంబు
మరణదేహములందు సరవి ధనంజయుం, డతిశోభము ఘటించి యడఁగఁజేయు
ఘనముగాంతర్యామియును ప్రపంచకుఁడను, వాయువు ల్వరుసకు వాహనముగ

నుండు వజ్రుండు ముఖ్యుండు నొనరుగాను
కీలికీలందు నుండును జీలపగిది
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ

-: సప్తధాతువులనిర్ణయము :-

18. మఱి రసరుధిరము ల్మాంసము మేదస్సు, మజ్జాస్థిరేతస్సుమానితముగ
నివి సప్తధతువు ల్నిబిడీకృతంబుగా, దేహికావరణంబు దేహమాయ
పాదాదిమస్తకపర్యంతమును నిండి, ప్రకృతిభేదంబుల ప్రబలమాయ
స్థూలమై దీర్ఘమై సూక్ష్మమై నటియించి, యందెందు మరణంబు జెందుచుండు

నిట్టి దేహంబులం దాస లేమిలేక
నిన్ను గనువాడు మునిజనసన్నుతుండు
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ

-: శరీరత్రయలక్షణము :-

19. జ్ఞానేంద్రియంబులు కర్మేంద్రియంబులు, నంతరింద్రియవిషయేంద్రియములు
ప్రాణాదులనుగూడి పరగ నిర్వదియాఱు, తత్త్వంబులను స్థూలతనువు నయ్యె
బాహ్యేంద్రియంబులు పదిప్రానములు నైదు, ధీమనంబుల సూక్ష్మదేహ మయ్యె
నీశరీరద్వయహేతువై యాద్యవి. ద్యాశ్రుతమై కారణాంగమయ్యె

మూఁడుదేహంబులకు నాదిమూలమైన
క్షరున కక్షరునకు బిలక్షణుఁడ వీవు
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ

-: చతుర్దశేంద్రియవిషయములు :-

20. శబ్దంబు చెవులకు స్పర్శ చర్మంబున, కక్షికి రూపు జిహ్వకు రసంబు
ముక్కుకు గంధంబు వాక్కుకు వచనంబు, కరమున దానంబు చరణములకు
గమనంబు గుదమునకు గలుగు విసర్జన, గుహ్యము కానందగుణము గలుగు
మనసు చలించును మతి నిశ్చయించును, చిత్తంబుఁ జింతించు మొత్తముగను

మఱి యహంకారన కభిమానపడును
నిన్నిటెఱిఁగిన తెలివి దా నెఱుఁగవలయు
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ

-: చతుర్దశేంద్రియములకు అధిదేవతలు :-

21. శ్రవణంబులకును దిక్చర్మంబునకు వాయు, చక్షువులకు జగచ్చక్షు వరుణుఁ
డును జిహ్వకును ఘ్రూణమున కశ్వినీసుతు, ల్వాగీంద్రియమునకు వహ్నిహస్త
ములకు నింద్రుడు పాదములకు నుపేంద్రుండు, గుదమును మృత్య్వు గుహ్యమునకు,
చతురాననుడు మానసమునకు జంద్రుండు, బుద్దికి పరమేష్ఠి శుద్ధచిత్త

మునకు జీవుం డహంకారమునకు శివుఁడు
తెలియవలె నీచతుర్దశదేవతలను
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ

-: జాగ్రదవస్థలలక్షణము :-

22. పంచవిశంతి తత్వపరిపూర్ణ మైనట్టి, స్థూలదేహమునందు సురుచిరముగ
రసస్పర్శలనరూపరసగంధవచనదా, నగమనోత్సర్జనానందములను
మానసాహంకారమతిచిత్తములఁగూడి, జీవుండు ముఖమునఁ జేరి నిలిచి
విశ్వనామముఁ జెంది వేర్వేర విభజించి, సకలవ్యాపారము ల్సలుపుచుండు

నదియు జాగ్రదవస్థయు ననుదినంబు
జనితమై జనుచుండును జన్మమునను
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ

-: స్వప్నావస్థలక్షణాము :-

23. శబ్దాదివిషయపంచకము వాక్యాదిపం, చకము నీపదియు నచ్చటను నిలిపి
మానసాహంకార మతిచిత్తములఁ గూడి, సప్తదశకతత్త్వసంజ్ఞసూక్ష్మ
దేహమందున కంఠదేశంబుననుజేరి, నిలిచి కొంచెముసేపు నిదురఁజెంది
జాగ్రత్తయందు తా జరిపినట్టుగఁ గ్రియ, ల్జేసి మేల్కొని జూడ లేశమైన

లేదు గనుకను స్వప్నంబు నాదిపురుష
సత్య మిదిగాదు జనితమై చనుచునుండు
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ

-: సుషుప్త్యవస్థలక్షణము :-

24. కంఠదేశమునహంకారచిత్తము లుంచి, ధీమనంబుల రెండి దీసికొనియు
కారణదేహహృత్కమలమందునఁ జేరి, యజ్ఞానసన్నిదియందు నిలిచి
నది సుషిప్త్యనఁబడు నచట రెంటిని నుంచి, తానవిద్యనుగూడి లీనమైన
నదియు గాఢసుషుప్తి యనఁబడు మహిమీద, సర్వంబు నెడబాసి స్మరణతప్పి

యుండ తుర్యం బటంచును యోగివరులు
చాటుచుందురు జనితమై జనుచు నుండు
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ

-: సాత్వికగుణలక్షణము :-

25. సత్యవ్రతాచారసంపన్నుఁడై యుండు, సత్కర్మక్రియలెల్ల సలుపుచుండు
తపము మౌనంబు నిత్సాహంబు గతినుండు, ధర్మమార్గంబులు దలఁపుచుండు
శమదమంబులు శాంతి శ్రద్ధలు గలిగుండు, శాస్త్రపురాణము ల్సలుపుచుండు
ధ్యాన సుజ్ఞానసన్మానము ల్గలిగుండు, శ్రేష్ఠదానంబులు సేయుచుండు

ధైర్యనిశ్చయబుద్ధి సద్భక్తినుండు
సకలభూతసముండు సాత్వికయుతుండు
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ

-: రాజసగుణలక్షణము :-

26. కామంబు క్రోధంబు గర్వంబు గలుగుట, కామ్యసంగతులహంకారపడుట
పరరాష్ట్రములమీఁద బంతంబుసేయుట, పరధనంబులఁ జూచి భ్రాంతిపడుట
వారకాంతల మెండు వాంఛించుచుండుట, నేరము లెన్నైనఁ గోరి వినుట
డంబ ముద్యోగమార్గంబుల మెలఁగుట, యుద్ధరంగమున సన్నద్ధమగుట

భోగభాగ్యంబుఁ గోరుట పొగడుకొనుట
లాలితంబుగ రాజసలక్షణములు
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ

-: తామసగుణలక్షణములు :-

27. అజ్ఞానవృత్తి మోహాంధకాతయుతుండూ, భూరినిద్రాసక్తి బొందియుండు
ఎదురు తన్నెఱుఁగక విదళించి యదలించుఁ, గోయును తోయును గోపఁబడును
అతిభోజనప్రియుం డతిపానధర్ముండు, పాతకంబుల పట్టుఁబడుచు నుండు
దూషించుచుండు దుర్భాషలు భాషించు, రోషములాడిన రోయకుండు

బుద్ధిలోలుండు సంసారబద్ధకుండు
కుటిలసంగుండు తామసగుణరతుండు
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ

-: గుణత్రయవిభాగలక్షణము :-

28. సాత్వికగుణునికి సగము రాజసము రా, జసములో సగము తామసమునుండు
రాజసగుణుని కర్ధము సత్వమందుండు, సత్వంబులోను దామసము సగము
తామసగుణుని కర్ధము రాజసము రాజ, సమునకు సత్వంబు సగమునుండు
త్రిగుణములీరీతి దేహములందుండు, సాత్వికగుణ ముండు సజ్జనుండు

గురుముఖంబున మీరూప మెఱుఁగుచుండు
త్రిగుణరహితుండు వర్ణింప నగణితుండు
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ

-: దశనాడులస్థాననిర్ణయము :-

29. గాంధారిహస్తిని ఘననాళములు రెండు, నేత్రద్వయంబుల నిలిచియుండు
నమరిన యూర్మిళ లనునాళములు రెండు, కర్ణద్వయంబులఁ గలసియుండు
పరజిహ్వనాడియు వక్త్రంబునందుండు, నాభిని శంఖినీనాళముండు
కులహాసినీ వాలికూడి రత్నాహ్వయ, గుదగుహ్యములయందుఁ గుదిరియుండు

కంఠమందున యశ్విని గలిగియుండు
క్షుధయుఁ దృప్తియునెఱింగించుచుండు నెపుడు
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ

-: ఇడాపింగళసుషమ్ననాడులలక్షణము :-

30. ఇడయు పింగళయును గుడియెడమలనుండు, నడుమ సూక్ష్మసుషమ్న నాడియుండు
నీనాడి రంధ్రమధ్యమునందు సూర్యసో, మాగ్నివిద్యాక్షరమాయ యాత్మ
సప్తసముద్రము ల్సప్తపర్వతములు, చతురాగమంబులు శాస్త్రములును
పంచభూతములు సప్తద్వీపములు లోక, ములు గుణంబులు మంత్రములు కళలును

బిందునాదము దిగ్వాయుబీజమాది
సకలదృశ్యపదార్థము ల్సమతనుండు
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ

-: చతుర్ధలోకస్థులనిర్ణయము :-

31. అతలంబు పాదము ల్వితలంబు గుల్ఫలు, జంఘలు సుతలంబు జానులందు
నుండు తలాతం బూరువులందు భూ, తలము గుహ్యము రసాతలమునుండు
కటిని పాటాళలోకము నాభిభూలోక, ముండు భువర్లోక ముదరమందు
స్వర్గంబు హృదియుఁబక్షము మహర్లోకంబు, ఘనజనుర్లోకంబు గళము బొమల

మధ్యమందు తపోలోక మమరు మూర్ధ్ని
సత్యలోకము నీనివాసస్థలంబు
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ

-: అష్టదిక్పాలకులస్థలనిర్ణయము :-

32. భ్రూమధ్య జంభారిపురంబుండు మఱియును, నగ్నిహోత్రునిపురం బక్షియందు
దక్షణకర్ణమం దంతకుపురముండుఁ, దత్పార్శ్వమున యాతుధానపురము
పరగఁ బృష్ఠమునందు వరుణునినగరంబు, పవనపురంబు నాపార్శ్వమందు
వామకర్ణమునందు వరకుబేరపురంబు, హరునిపురము దక్షిణాక్షియందు

శిరమునడుమను నుండు సుస్థిరముగాను
కుంఠితము గాన నీదు వైకుంఠపురము
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ

-: షడూర్ములలక్షణము :-

33. పృథివి జీవులకెల్ల క్షుధతృష్ణలును రెండు, ప్రాణధర్మములని పలుకఁబడెను
శోకమోహంబులు శోధింపఁగా మనో, ధర్మంబు లని వాని దలఁపవలయు
జననంబు మరణంబు జడరూపమైనట్టి, దేహధర్మములని తెలియఁబడెను
ఇవి షడూర్ము లటంచు వివిధమార్గంబుల, వివరించి వీనిని విడచి నిన్ను

సద్గురూక్తంబుగాఁ గన్నసజ్జనుండు
నిష్కళబ్రహ్మమై యుండు నిగమవినుత
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ

-: అష్టమదములలక్షణము :-

34. ఎక్కవకులమందు నేజనియించితి నాదు, కుల మెక్కు వనుటయుఁ గులమదంబు
సకలనిష్ఠాచారసంపంన్నుఁడను నేను, శ్రేష్ఠుఁడ ననుటయు శీలమదము
ద్రవ్యంబు నావద్ద దండిగా నున్నది, యని గర్వపడుటయు ధనమదంబు
ధరను నావంటి సుందరుఁడు లేఁడని నిక్కి, రూఢిగాఁ దిరుగుట రూపమదము

మదములన్నియు నీదేహమందు విడచి
భక్తినీమీద గలవాఁడు ముక్తుడగును
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ

35. బలవంతుఁడ వయసుగలవాఁడ వైరుల, న్వధియింతు ననుట యౌవనమదంబు
సకలశాస్త్రంబులు చదివి వంచించిన, నధికుఁడ ననుట విద్యామదంబు
అఖిలదేశాధిపత్యము నాకు గలదని, రంజిల్లుచుండుట రాజ్యమదము
స్నానసంధ్యాద్యనుష్ఠానుండ నేనని, మదియుబ్బుటయుఁ దమోమదము సుమ్మి

యష్టమదముల నణఁచి ననిష్ఠపరుఁడు
పుణ్యపురుషుండు వైకుంఠపురము నుండు
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ

-: అష్టపాశముల నిర్ణయము :-

36. తల్లిదండ్రియు భార్య తనయులు మిత్రులు, ధనము సహోదరు ల్తనువులైన
అష్టపాశంబులు నమరి బంధనములచేఁ, దగిలుండు నరులు నీధరణియందు
అత్తమామల బావ లల్లుండు కోడండ్రు, వదినెలు మఱదండ్రు మఱఁదు లనుచు
తాపత్రయంబులఁ దగిలి వర్తించుచు, మత్తులై మనుజులు మందమతిని

సాధుసజ్జనసంగతి సలుపలేక
మోక్షమార్గంబు నెఱుఁగరు మోహరహిత
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ

-: మలత్రయలక్షణము :-

37. పరమాత్మ మెఱుఁగక తెరుపు మరుపుచేత, గాత్రపుత్రకళత్రమిత్రులందు
సక్తుఁడై కడలేని సంసారవార్ధిలో, మునిగితేలుట నెల్ల యణవమలము
పరద్రవ్యమాపేక్షపడి పరజనులకు, నపకృతిసేయు మాయామలంబు
పుణ్యపాపములచేఁ బుట్టుచావులను ని, ర్మించుచుండుటయుఁ గార్మికమలంబు

మూఁడుమలముల విడువక ముక్తిపథము
గాన లేరైరి పామరమానవులును
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ

-: తాపత్రయలక్షణము :-

38. తాపత్రయంబుల ధర్మముల్వేర్వేఱ, వివరించి చెప్పెద విమలచరిత
దేహజన్యము లైన త్రివిధరోగంబుల, తాపదుఃఖంబు లధ్యాత్మికంబు
వ్యాళవృశ్చికచోరవ్యాఘ్రాదిభూతసం, భవదుఃఖములు నాధిభౌతికంబు
వర్షాశనీపాతయాయురగ్నిశిలాప, తనదుఃఖములు నాధిదైవకంబు

నిట్టితాపత్రయంబులఁ గొట్టివేసి
ధీరుఁ డగువాఁడు మోక్షాధికారియగును
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ

-: ఈషణత్రయలక్షణాము :-

39. కామధర్మార్థము ల్గలుగుటకై భార్య, నిచ్చ నుంచుటయు దారేషణంబు
సుతులు లేకున్న సుగతులు లేవనుచుఁ బు, త్రేచ్ఛనుండుటయ పుత్రేషణంబు
దానధర్మములచే తరియింతు నని ద్రవ్య, మిచ్చయించుటయు ధనేషణంబు
దారాది కేషణత్రయములచేతను, నవనిలో సౌఖ్యంబు లనుభవించి

పుణ్యలోకంబు లెల్లనుఁ బొందవచ్చు
గాన మీలోన నైక్యమార్గములు గావు
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ

-: వాసనత్రయలక్షణము :-

40. లోకానుసారియై లౌకికవృత్తుల, వసియించుటయు లోకవాస నండ్రు
శాస్త్రపద్ధతి తమోజపక్రతువ్రతముల, వర్తించుటయు శాస్త్రవాస నండ్రు
దేహశోషణఁ జేసి తీర్థయాత్రల కెల్ల, వడితిరుగుట దేహవాస నండ్రు
ఈమూఁడువాసన లిచ్ఛయించక దేశి, కులసేవ చేసి షడ్గుణము లణఁంచి

తత్త్వమస్యాదివాక్యతాత్పర్య మెఱిఁగి
తన్ను తాఁ గన్నపురుషుఁడ ద్వైతుఁడగును
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ

-: వ్యాధిత్రయలక్షణాము :-

41. వాతంబునం దుద్భవం బైన రోగము, ల్బాగుగా నెనిమిదిపదులు నయ్యె
పైత్యమం దుద్భవం బైనరోగంబులు, దండిగా నెనుబదిరెండునయ్యె
శ్లేష్మందున జనించినరోగములును ని, న్నూటనిర్వదినాల్గు నుచితమయ్యె
త్రివిధరోగంబు లీతీరున మున్నూట, నెనఁబదినారును నెన్నికయ్యె

నట్టివ్యాధుల కాధారమైన దేహ
భ్రాంతి విడచినవాఁడు సద్భ్రహ్మవిదుఁడు
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ

-: జన్మహేతులక్షణము :-

42. ఆత్మయందున మాయ యారోపితంబయ్యె, మాయయం దజ్ఞాన మపుడు గలిగె
నజ్ఞానమునఁ దోచె నవివేక మవివేక, మందున నభిమాన మమరఁ బుట్టె
నభిమానమందు రాగాదు లుద్భవమయ్యె, రాగాదులందుఁ గర్మములుఁ బొడమె
కర్మలవలనను గడలేని సుఖదుఃఖ, మూలమైనశరీరములఁ జనించె

నీవిధంబున దేఖంబు లెత్తి జనులు
నిన్నుఁ గనలేరు నిరుపమ నిర్మలాత్మ
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ

43. రాతిరిపడియున్న రజ్జు వంతటఁ జూచి, భ్రమసి పామని భయపడినయట్లు
శూక్తి దూరంబునఁ జూచి వెండి యటంచు, ప్రబలినయాశచే భ్రమసినట్లు
దండకారణ్యమం దెండుమొద్దును జూచి, దొంగవాఁడని భీతి దోఁచినట్లు
కలలోన వస్తువు ల్గని మేలుకొనలేచి, నావస్తువుల వెదుకాడినట్లు

నరులు సత్యయు జగమని నమ్మినారు
జ్ఞానపథమందు నిజరూపు గానలేక
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ

-: అనాత్మలక్షణము :-

44. జన్మాస్థివృద్ధులు క్షయపరిణామ నా, శములు షడ్విధవికారముల నాత్మ
ఘనబాల్యయౌవనకౌమారవార్ధక, ములు జాగ్రదాద్యవస్థలును నాత్మ
కమనీయమహదహంకారభూజలహుతా, శనసమీరాంతరిక్షముల నాత్మ
త్రిగుణముల్ స్థూలాదిదేహత్రయములన్న, మయమాదిపంచకోశముల నాత్మ

యంతరింద్రియబాహ్యేంద్రియముల నాత్మ
దృశ్యరూఅంబు శ్రుతమును దృక్కనాత్మ
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ

-: సాధనచతుష్టయసంపత్తిలక్షణము :-

45. సత్యంబు బ్రహ్మం బసత్యంబు సర్వప్ర, పంచంబ యని విమర్శించువాఁడు
ఇహపరసౌఖ్యంబు లిచ్ఛయింపకయుండి, పాపపుణ్యంబులఁ బడనివాఁడు
శమదమంబులు శాంతిశ్రద్ధోపరతితితీ, క్షలు సతతంబును గలుగువాఁడు
మోక్షంబుమీఁద నాపేక్షవిస్తారమై, కాని యేయాపేక్షలేనివాఁడు

గురుకటాక్షంబుచేతను గురుతెఱింగి
నసిపదం బగునీయందు నైక్యమగును
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ

-: శమదమాదిషట్కసంపత్తిలక్షణము :-

46. అంతరేంద్రియనిగ్రహంబు శమంబగు, బహిరింద్రియములనిగ్రహము దమము
నపవర్గషట్కంబు లణఁచుట శాంతియు, సుఖదుఃఖములకు నోర్చుట తితీక్ష,
వేదాంతశాస్త్రము ల్విని విమర్శించి స, ద్గురువందు భక్తిగల్గుటయు శ్రద్ధ
కర్మంబులను బ్రహ్మ కల్పించి హృత్పర, బ్రహ్మసంగం బుపరతి యటంచు

నెఱిఁగి నడచినవాడు యోగిశ్వరుండు
నతడు ముక్తుండు నాద్యుండు నచ్యుతుండు
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ

-: అరిషడ్వర్గములలక్షణము :-

47. కోరుట కామంబు కోరినయర్ధంబు, కొనసాగకుండిన క్రోధమగును
వచ్చిన ద్రవ్యంబు వదలకుండును లోభ, మాధనాపేక్ష మోహంబ యగును
ధనమున్నదని మోదమున నుబ్బి నాకేమి, కొదువని గర్వించినది మదంబు
తనద్రవ్య మపహరింతమనెడిజనులందు, మది నీర్ష్యయుంచుట మత్సరంబు

గనుక నీశత్రువర్గషట్కముల నణఁచి
శాంతిఁ బొందినపురుషుండు సర్వసముఁడు
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ

-: ఉపదేశమయ్యెడుక్రమము :-

48. సాధనచత్వారిసంపత్తియును గలిగి, పరిపూర్ణుఁ డైనసద్గురినిఁ జేరి
ద్వాదశాష్టాంగదండంబుల నర్పించి, తనుమనఃప్రాణము ల్ధారఁబోసి
భక్తితో నాత్మాంగభావసుస్థాన శు, శ్రుషలుఁజేసి సంతోషపఱిచి
నట్టి శిష్యునిమెచ్చి గట్టిగా గురుమూర్తి, త్రివిధదీక్ష లొనర్చి దివ్యముగను

హస్తమస్తకసంయోగమంచితముగఁ
జేసి నిజకేవలాత్మోపడేశ మొసఁగు
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ

-: ఉపదేశించుక్రమము :-

49. యమము నియమము నాసనము ప్రాణాయామ, మమరప్రత్యాహారమంచితముగ
ధ్యానధారణసమాధ్యష్టాంగయుతమంత్ర, యోగము లయహఠయోగములను
రాజయోగంబు తారకము సాంఖ్యామాన, సమును ముద్రలు లక్ష్యసాధకములు
వరతత్వమస్యాదివాక్యము ల్జీవేశ్వ, రైక్యసంధానము ల్రాజితముగ

శిష్యునికిఁ దెల్పి గురుమూర్తి స్థిరముగాను
పూర్ణభావంబుఁ బొందించు బుధులు మెచ్చ
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ

-: ధ్యానముద్రమంత్రయోగలక్షణము :-

50. భూసురుం డెవడైనఁ బుణ్యశీలుఁడు మహా, నదులతోయముల స్నానంబుఁజేసి
శుభ్రవస్త్రముగట్టి శుచియైనస్థలమందుఁ, గ్రమముతోఁ గూర్మచక్రము లిఖించి
దర్భకృష్ణాజినధవళాసనములపై, పద్మాసనస్థుఁడై పదిలముగనుఁ
గన్నులు బిగియించి కడువెన్ను నిక్కించి, నాసాగ్రమునఁ జూపుఁ జూచి మనసు

కష్టమైనట్టి మంత్రంబు నిష్ఠతోను
జపము సేసినయోగి సజ్జనుఁడు సుమ్మి
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ

-: రాధాముద్రలయయోగలక్షణము :-

51. ఱెప్పలు వ్రాల్పక రెండుఁజూపులఁ గను, బొమలమద్యమునందుఁ బొందనిలిపి
కర్ణరంధ్రములుఁ గదియంగ బిగియించి, నంతరజ్ఞప్తిచే నాలకించి
గజ్జమువ్వలనాదుఘంటారవము శంఖ, వీణతాళధ్వనుల్వేణుభేరి
మర్ధలమేఘూదిమహనీయదశవిధ, నాదము ల్విని చాల మోదమంది

నందులోపలఁ దదనాదమందు మనసు
లయముజేసిన యోగి విలక్షణుండు
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ

-: షణ్ముఖీముద్రహఠయోగలక్షణము :-

52. అంగుష్ఠములను గర్ణాంగంబులను మూసి, చక్షులు మధ్యతర్జనులమూసి
నాసికాయుగ్మమనామికంబుల మూసి, ఘనవక్త్రము కనిష్ఠకమున మూసి
పాదమూలమున వాయూపస్థలనుమూసి, నాధారమున వాయు నపుడులేపి
షట్ఛక్రములనున్నసంజ్ఞలకడతేరి, యాజ్ఞాసుచక్రమం దమర నిలపిఁ

జూపు పవనంబు యామన స్సొకటిఁజేసి
ధ్యాన మొనతించి హఠయోగి ధన్యుఁడగును
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ

-: శాంభవీముద్రరాజయోగలక్షణము :-

53. సురచిరశాంభవిఁ జూడంగఁ జూడంగ, చంద్రసూర్యాగ్నులు నింద్రధనువు
నవరత్నములభాతి నక్షత్రములరీతి, బిరుసుగాల్చిన యట్లు మెరుపువలెను
మండుమంటలభంగి నిండుచీకటిఁబోలు, మెండువెన్నెలకాంతి యెండవలెను
ఇదిజలమాదిగా ని ట్లనేకము పుట్టి, నణఁగిన పిమ్మట నమల మగును

బట్టబయ లైన బ్రహ్మంబు గట్టిగాను
వెలియు లోపలఁ గనుపడువేత్తలకును
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ

-: ఆధారచక్రనిర్ణయము :-

54. ఆసనస్థానమం దాధారచక్రము, నందు నాలుగురేకు లమరియుండు
వశషస లనుయెడివర్ణము ల్నాల్గుండు, నర్ధచంద్రాకార మమరియుండు
కుంకుమవర్ణంబు కింకిణీనాదంబు, నార్నూరుహంసలు నాడుచుండు
సద్భక్తియును క్రియాశక్తియు వర్తించు, ఘనతరంబున నన్ని గలిగినట్టి

కమలమందున బ్రేమతో విమలమైన
నీవు గణపతిరూపమై నిలచినావు
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ

-: స్వాధిష్ఠానచక్రనిర్ణయము :-

55. ఆధారమునకు రెండంగుళాలకుమీద, రంగస్థలం బుండు రంగుగాను
స్వాధిష్ఠచక్రము షడ్దళంబులఁ ద్రికో, నాకారమై యందు నమరియుండు
బభమయరల లుండు పాటిల్లు నైష్ఠిక, భక్తి వీరము జ్ఞానశక్తి యుండు
విమలవిద్యుత్కాంతి వీణారవంబును, నార్వేలుహంసలు నాడుచుండు

ప్రకటితంబుగ వికసితపద్మ ముండు
నీవు బ్రహ్మస్వరూపమై నిలచినావు
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ

-: మణిపూరకచక్రనిర్ణయము :-

56. మఱియు నాభిస్థానమణిపూరకం బది, దశదళంబులతోడ దనరియుండు
డఢలాదిఫాంతముదృఢతనక్షరములు, పది వేణునాదంబు ప్రబలియుండు
శ్యామలవర్ణ మిచ్ఛాశక్తి షట్కోణ, మగ్నిభూతంబు రా నంటియుండు
నవధానభక్తియు నచట కుందలిమీద, నార్వేలహంసలు నాదుచుండు

నిన్నయుండినచక్రమం దిష్టముగను
నీవు విష్ణురూపమై నిలచినావు
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ

-: అనాహతచక్రనిర్ణయము :-

57. హృదయస్థలమ్మునం దిరవై యనాహత, పద్మమందున దళాల్ పదియు రెండు
కఖగాదిపాంతము ఘనతరాక్షరములు, పదిరెండుయుండును బాగుగాను
వర్తులాకారము వాయుభూతము నాది, శక్తియుండును భవభక్తి యుండు
శతకుంభపుకాంతి శంఖారవంబును, నార్వేలహంసలు నాడుచుండు

భరితమై యున్నచక్రాధిపత్యముగను
నీవు రుద్రస్వరూపమై నిలచినావు
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ

-: విశుద్ధచక్రనిర్ణయము :-

58. తాలుమూలలయందు స్థానంబుగా విశు, ద్ధాంభోజ ముండు సుందరముగాను
పదియారుదళములు బాగుగా షోడశ, స్వరము లుండును పరాశక్తియుండు
స్ఫటికవర్ణం బందు స్వానందభక్తియు, నాకాశభూతంబు నమరియుండు
మోదంబుతో మేఘనాదంబు మ్రోయంగ, హంసలు దశశతం బాడుచుండు

భాసురంబుగ నానందభరిత మగుచు
నీవు యీశ్వరరూపమై నిలచినావు
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ

-: ఆజ్ఞాచక్రనిర్ణయము :-

59. నాసాగ్రవీథిని నయనద్వయంబుల, నడుమ నాజ్ఞేయంబు నమరియుండు
రెండురేకులు దానికుండు మీదను రెండు, హంక్షంబు లనియెడి యక్షరములు
నద్భినాదంబు మహాతత్వభూతంబు, మాణిక్యకాంతి సమరసభక్తి
గంగాసరస్వతీసంగమస్థానంబు, హంసలు పదినూర్లు నాడుచుండు

శ్రీకరంబుగ నట సదాశివవిలాస
రూపమైనావు నీవు నిరూఢముగను
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ

-: సహస్రారచక్రనిర్ణయము :-

60. సరససహస్రారచక్రంబు మూర్ధస్థ, లం బందు యుండు విలక్షణముగ
నందువేరేకు లింపొందుగా వర్తించు, సాక్షిభూతము సహజాత్మశక్తి
ఓంకారబీజము ఝుంకారనాదము, బహుచిత్రవర్ణముల్ పరమభక్తి
నమృతంబు నెప్పుడు నతివృష్టి గురియంగ, హంసలు దశశతం బాడుచుండు

నందు నిరుపమసచ్చిదానందముగను
నీవుసద్గుణరూపమై నిలచినావు
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ

61. కొండమీదను పద్దగుండు నొక్కటియుండు, గుండునడుమను నల్లగుండ్లు రెండు
గుండ్లుమధ్యను నక్క కూఁత లెట్టుచునుండు, కూఁతలనడుమను నూతియుండు
నూతిమధ్యంబున నాతియొకతె యుండు, నాతిమీఁదను నొక్కకోఁతి యుండు
కోఁతిమీదను బరంజ్యోతి వెల్గుచునుండు, జ్యోతియే జగమెల్లఁ జూచుచుండు

జూచుచుండెడి దానెందు చోద్యమెరిగి
నదియు తా నన యున్నవాఁ డాత్మవిదుఁడు
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ

-: పరమాత్మస్థాననిర్ణయము :-

62. విమలచిన్మయనేత్రకమలమధ్యంబున, మార్తాండసోమాగ్ని మండలములు
మండలంబులయందు మహనీయముగ నొక్క, నీలమేఘం బుండు నిజముగాను
మేఘమధ్యంబున మెరుపుమెరయుచు నుండు, నందు నీవారశూకాగ్ర ముండు
శూకాగ్రమున నతిసూక్ష్మస్వరూపమై, బహిరంతరంబులఁ బ్రజ్వరిల్లి

వెలుఁగుచున్నాఁడ వేకమై వెరపులేక
నిర్మలాకార నిరుపమ నిర్వికార
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ

-: ప్రకృతిలక్షణము :-

63. జ్ఞానేంద్రియము లైదు కర్మేంద్రియము లైదు, ప్రాణాదు లైది శబ్దాదు లైదు
ఘనమనోబుద్ధ్యహంకారచిత్తంబులు, నాల్గును నిరువదీనాల్గుతత్త్వ
ములఁగూడి ధవళాశ్యామలరక్తపీతవ, ర్ణములు నాలుగుగల్గిగి నదియె ప్రకృతి
యది క్షరం బది క్షేత్ర మదిజడం బది దృశ్య, మది యవిద్యాజ్ఞాన మదియ నాత్మ

నదియె జీవంబు నది దేహ మది జగంబు
నదియు సంసార మది బంధనరక మదియు
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ

-: అక్షరస్వరూపలక్షణము :-

64. శ్వేతరక్తసిత పీతవర్నంబుల, నడునుసునీలవర్ణంబునుండు
నిది నీలతోయద మగు దావినడుమని, ర్వాతదీపముకాంతిరీతినుండు
వదియు విద్యుల్లేఖ నదియు నాపోజ్యోతి, నదియు నోకారంబునక్షరంబు
నది మేరుశిఖరంబు నదియు@ గైలాసంబు, నది సత్యలోకంబు నాశ్రయంబు

నదియు వైకుంఠపదము తత్పదము నదియు
నదియు త్వంపద మరి యంతరార్థ మదియు
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ

-: పరమాత్మనివాసస్థలనిర్ణయము :-

65. శ్వేతరక్తాసితపీతనీలంబుల, నడుమ నిదాస మైనావు నీవు
మానితాదిత్యసోమాగ్నిమండలముల, నడూమ నివాస మైనావు నీవు
పొందుగాఁ గళనాదబిందుత్రయంబుల, నడుమ నివాస మైనావు నీవు
విమలభాగీరథీ యమునా సరస్వతి నడుమ నివాసమైనావు నీవు

అందపిండాండబ్రహ్మాండములను
నడుమనున్నావు నీవు శానందముగను
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ

-: ఆత్మసర్వగతలక్షణము :-

66. ధరణిలోఁ దిలయందుఁ దైలముండినతీరు, దారువునం దున్నదహమురీతి
నాణెమౌ దధియందు నవనీత మున్నట్లు, పుష్పమందున గంధ మున్నయట్లు
రంజిల్లు ఫలమందు రసము లుండినభంగి, జేలమం దున్నటి నూలుభంగి
తారహారాదులదార ముండినతీరు, నిసుకరాళ్ళందున్న యినుముతీరు

నఖిలజగముల సకలదేహంబులందు
నిండియున్నాఁడ వీరితి నిజముగాను
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ

-: దేహేంద్రియవిలక్షణము :-

67. నాతల్లి నాతండ్రి నాసతు ల్నాసుతు, ల్నాపశుసంఘంబు నాగృహంబు
నాభూషణంబులు నావాహనంబులు, నాక్షేత్రపాత్రము ల్నాజనంబు
నాధ్యాన మని పల్కినపుడు పురుషుండు, తానవిగాక వేఱైన విధము
నాశరీరంబును నాయింద్రియంబులు, నాజీవధర్మము ల్నాగుణంబు

లనుచు బల్కిన దేహేంద్రియాదులకును
నీవు వేఱుగ నుందువు నిశ్చయముగ
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ

-: ఎఱుకనిర్ణయము :-

68. ఇదిఘటం బిదిపటం బిది మఠం బిదిశఠం, బిదిహఠం బిదిపటం బిది యటంచు
నిదిమనం బిదిజనం బిదిధనం బిదిఘనం, బిదిదినం బిదివనం బిది యటంచు
నిదిహయం బిదిప్రియం బిదిప్రయం బిదినయం, బిదిజయం, బిదిభయం, బిది యటంచు
నిదిశిరం బిదికరం బిదినరం బిదిమదం, బిదిపరం బిదిస్థిరం బిది యటంచు

నదియు నిదియును నేదియు నది యటంచు
నెఱుఁగుచుండిన యెఱుకలో న్ర్ఱుక నీవు
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ

69. ఇది యపశబ్దంబు నిది సుశబ్దం బని, యెఱిగిన యెఱుకలో నెఱుక వీవు
ఇది యుష్ణ మిదిశీత మిది మృదుత్వం బని, యెఱిగిన యెఱుకలో నెఱుక వీవు
ఇదిశుక్ల మిదిరక్త మిదియుఁ గృష్ణం బని, యెఱిగిన యెఱుకలో నెఱుక వీవు
ఇది మధురం బాంల మిది లవణంబబి, యెఱిగిన యెఱుకలో నెఱుక వీవు

ఇది సుగంధంబు దుర్ఘంధ మిది యటంచు
నెఱుగుచుండిన యెఱుకలో నెఱుక వీవు
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ

-: నేతినేతియనిమహావాక్యలక్షణము :-

70. నీవు పృథ్వివిగావు నీరగ్నులునుగావు, మారితము మఱి వ్యోమంబుగావు
శ్రోత్రత్వక్కులుగావు నేత్రజిహ్వలుగావు, ఘ్రూణంబుగావు వక్త్రంబుగావు
పాదపాణులుగావు పాయుపస్థలుగావు, ప్రాణముల్గావు శబ్దంబు గావు
స్పర్శరూపులుగావు పరగరసముగావు, గంధంబుగావు చిత్కళలుగావు

మానసాదులుగావు కర్మములుగావు
సచ్చిదానందరూపాత్మసాక్షి వీవు
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ

71. షట్చక్రములుగావు షడ్వర్గములుగావు, కామాదిశత్రువర్గములుగావు
షట్కోణములుగావు షడ్భ్రమంబులుగావు, షడ్వికారంబులసరణి గావు
షట్కసంపత్తుల షడ్గుణంబులు గావు, వరషడూర్ములుగావు క్షరముగావు
షణ్మతంబులు గావు షట్ఛాస్త్రములుగావు, షట్కర్మములుగావు సత్తుగావు

సప్తధాతువులునుగావు సప్తకోటి
మంత్రములుగావు నానందమయుఁడ వీవు
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ

72. అష్టతనులుగావు అష్టాత్మలునుగావు, అష్టాంగయోగాదినిష్ఠగావు
అష్టమూర్తులుగావు యష్టపురంబులు, గా వష్టమతములు గావు నీవు
అష్టాబ్జములుగావు యష్టపాదంబులు, యష్టస్థలంబులు నరయ గావు
దశరంధ్రములుగావు దశనాడులునుగావు, దశవాయుగుణవికార్ములుగావు

పంచశక్తులు గా వాదిప్రకృతిగావు
సర్వపరిపూర్ణచైతన్యసాక్షి వీవు
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ

-: సర్వం ఖల్విదం బ్రహ్మ యను శ్రుతిపద్ధతి :-

73. తత్పదంబును నీవు త్వంపదంబును నీవు, నసిపదంబును నీవు నాత్మ నీవు
అండాండములు నీవు పిండాండములు నీవు, బ్రహ్మాండములు నీవు బ్రహ్మ నీవు
సత్తచిత్తులు నీవు సాక్షిరూపము నీవు, క్షరుఁడవు నీవు నక్షరుఁడ వీవు
క్షేత్రంబులును నీవు క్షేత్రజ్ఞుఁడవు నీవు, కర్మంబులును నీవు జ్ఞాన మీవు

స్థూలదీర్ఘంబులును నీవు సూక్ష్మమీవు
నీవునేనను నీవైన భావమీవు
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ

74. విశ్వసృష్టివి నీవు విశ్వేశుఁడవు నీవు, విశ్వవంద్యుఁడ వీవు విశ్వ మీవు
వేదవేద్యుఁడ వీవు బేదాంతకుఁడ వీవు, వేదస్థుఁడవు నీవు వేద మీవు
యజ్ఞకర్తవు నీవు యజ్ఞభోక్తవు నీవు, యజ్ఞరూపుఁడ వీవు యజ్ఞ మీవు
వేదవేద్యుఁడ వీవు వేదాత్మకుఁడ వీవు, దైవజ్ఞుఁడవు నీవు దైవ మీవు

శిష్యుఁదవు నీవు పరమదేశికుఁడ వీవు
సగుణనిర్గుణములు నీవు సాక్షి నీవు
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ

-: పంచభూతములైక్యనిర్ణయము :-

75. అవని నీరంబులో నైక్యంబుగాఁజేసి, యానీర మగ్నిలో నైక్యపఱచి
నాయగ్ని వాయువం దైక్యంబుగాఁజేసి, యావాయు గగనమం దైక్యపఱచి
గగనంబు మహదహంకారంబులోఁ గల్పి, తదహంకృతియు మహాతత్వమందు
నైక్యంబుగాఁజేసి యామహాతత్వంబు, నద్వయబ్రహ్మమం దైక్యపఱచి

నట్టి యోగీంద్రుఁ డద్వయుం డప్రమేయుఁ
డప్రమత్తుఁ డనంతుండు నఖిలసముఁడు
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ

-: జ్ఞానియగు లక్షణము :-

76. బ్రహ్మందాత్మైక్యభావంబు దెలిసిన, నజ్ఞానవృత్తులు నణఁగుచుండు
నజ్ఞానవృత్తులు నణిఁగిన పిమ్మట, నవివేకవృత్తులు నణఁగుచుండు
నవివేకవృత్తులు నణఁగిన పిమ్మట, నభిమానవృత్తులు నణఁగుచుండు
నభిమానవృత్తులు నణఁగిన పిమ్మట, రాగాదులెల్ల విరాగమౌను

రాగములు బోయినప్పుడు కర్మములు దొలఁగు
కర్మములు బోవ నిర్మలజ్ఞాని యగును
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ

-: ప్రజ్ఞానం బ్రహ్మయనే శక్తి లక్షణము :-

77. శ్రవణేంద్రియములశబ్దము ల్వినుచుండు, చర్మేంద్రియంబున స్పర్శనెఱుఁగు
చక్షురింద్రియముల వీక్షించు రూపముల్, రూఢిగా జిహ్వచే రుచుల నెఱుఁగు
ఘ్రూణరంధ్రంబుల గంధమాఘ్రాణించు, వాక్కున వచియించు వాక్యములను
యేజ్ఞానమున నిన్నియ్ర్ఱిఁగె నాజ్ఞానంబు, ప్రజ్ఞానమని శ్రుతు ల్బలుకుచుండు

నట్టిప్రజ్ఞానలక్ష్యార్థ మనుభవంబు
నీస్వరూపంబు నిక్కంబు నిజముగాను
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ

-: తత్త్వమసి యనేశక్తి లక్షణము :-

78. మఱియు సృష్టికి పూర్మందు ద్వితీయమై, నామరూపక్రియ లేమిలేక
యేకమై యచలమై యేదియుండునొ యది, తత్పదలష్యతాత్పర్య మిదియుఁ
దనవివేకమున సాధనచతుష్టయములు, గల్గినపూర్ణాధికారియందు
ధీమనోచిత్తదిదేహేంద్రియముల క, తీతమై సాక్షియై తేజరిల్లు

నదియు త్వంపదలక్ష్యార్థ మనఁగ నొప్పు
నసిపదార్థంబు నీరెంటి నైక్యమధిప
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ

-: అయమాత్మశక్తి యను బ్రహ్మలక్షణము :-

79. స్వచ్ఛమై సత్యమై స్వప్రకాశంబునై, యుపరోక్షమై సదా యమల మగుచు
నాద్యాంతరహితమై యచలమై నిత్యమై, శుద్ధమై బుద్ధమై సిద్ధ మగుచు
నిర్వ్యాజియైనట్టి నిర్గుణంబయి యాత్మ, పదమునకు లక్ష్య తాత్పర్య మిదియు
ప్రతిలేనిదై నిరుపద్రవంబై స్వతః, పరిపూర్ణమైనట్టి బయలు నగుచు

జగదధిష్ఠానమై చరాచరములందు
బాధితము లేక యున్నదే బ్రహ్మమగుచు
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ

80. అలచతుర్వేదమహాకావ్యములయందు, నీవె బ్రహ్మవు బ్రహ్మ వీవె యనుచు
ఉపనిషద్భాష్యంబు లూహించి వెదకిన, నీవె బ్రహ్మవు బ్రహ్మ వీవె యనుచు
యోగశాస్త్రములలో యుక్తిసాధించిన, నీవె బ్రహ్మవు బ్రహ్మ వీవె యనుచు
మంత్రశాస్త్రంబులు మర్మము ల్దెలిసిన, నీవె బ్రహ్మవు బ్రహ్మ వీవె యనుచు

వేదవేదాంతసిద్ధాంతవేద్యులెల్ల
నిశ్చయింతురు నిత్యంబు నిగమవినుత
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ

81. వరబ్రహ్మక్షత్రియవైశ్యాదివర్ణము, ల్నీకు నెన్నఁడు లేవు నిశ్చయముగ
నలబ్రహ్మచర్యాదియాశ్రమధర్మము, ల్నీకు నెన్నఁడు లేవు నిశ్చయముగ
స్వగతివిజాతిస్వజాతిభేదంబులు, ల్నీకు నెన్నఁడు లేవు నిశ్చయముగ
కులరూపనామము ల్గోత్రసూత్రంబులు, ల్నీకు నెన్నఁడు లేవు నిశ్చయముగ

ఖేదమోదంబులును భేదవాదములును
ల్నీకు నెన్నఁడు లేవుగా నిశ్చయముగ
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ

-: అంటి అంటనిలక్షణము :-

82. జలజపత్రమునందు సలిల మంతనియట్లు, నద్దమందున రూప మంతనట్లు
బురద యాకుమ్మరపురుగు కంతనియట్లు, నాజ్యంబు జిహ్వయం దంటనట్లు
భువి చింతపండుపై బొబ్బరంటనియట్లు, బలుచల్లలో వెన్న గలయనట్లు
చిత్రభానుండును చీఁక టంటనియట్లు, నాకాశమున వాయు వంటనట్లు

బ్రహ్మవేత్తలు మాయాప్రపంచమునందు
నఖిలవ్యవహారములు జేసి యంత రధిప
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ

-: పరిపూర్ణబోధ :-

83. ఈయుత్తబట్టబయలేమి లే దనుచును, ద్వాదశాక్షరి చాల దలఁచలేను
మూలమింతయు లేక మేలుగా నెఱిఁగెడి, నీశరీరద్వయ మేమిలేదు
అని గురువాక్యము విని సతతము మది, నుంచంగవలె నిది కొంచ మనఁగ
నిది నిశ్చయముజేసి యిది విడిపించిన, పరిపూర్ణమైయుండు బాధలెక

రాకపోకలు రెండును లేకనుండు
నట్టిసూత్రంబు దెలిసిన నచలమగును
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ

84. అవనిలో నీరులో నగ్నిహోత్రంబులో, మారుతమునను వ్యోమంబులోను
సురలలో నరులలో గిరులలో చరులలో, దరులలో హరులలో కరులలోను
ఊళ్ళలో గూళ్ళలో రాళ్ళలో రోళ్ళలో, వేళ్ళలో గోళ్ళలో తేళ్ళలోను
ఇండ్లలో గుండ్లలో బండ్లలో నోళ్ళలో, చీమలో దోమలో పాములోను

అచలమైయుండు కాలత్రయంబులందు
బాధితములేక కేవల బ్రహ్మముండు
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ

85. సృష్టికి పూర్వంబు సృష్టికి పరమందు, సృష్టి యున్నప్పుడు సృజనలేక
ప్రాగ్దక్షిణంబులుఁ బశ్చిమోత్తరముల, నాల్గుమూలలమీఁద నడుమక్రింద
నిష్కళంకంబయి నిర్వికారంబయి, ఘనతేజమై స్వప్రకాశ మగుచు
నచలమై స్వచ్ఛమై యాద్యంతశూన్యమై, పరిపూర్ణమై బట్టబయలుగాను

నేకమై యుండు నేబాధ లేక నుండు
నట్టివస్తువు కేవలాత్మనఁగఁబడును
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ

86. సగుణనిర్గుణములు సదసత్తులును నిరా, కారసాకారము ల్గానిదేదొ
క్షేత్రజ్ఞక్షేత్రము ల్జీవజంగంబులు, కారణకార్యము ల్గానిదేదొ
పాపపుణ్యంబులు బంధమోక్షంబులు, జ్ఞానకర్మంబులు గానిదేదొ
క్షరమక్షరంబులు సత్య మసత్యము, ల్ఖండ మఖండము గానిదేదొ

రాకపోకలఁ జెప్పంగ రానిదేదొ
యదియుఁ గేవలపరిపూర్ణ మనఁ నొప్పు
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ

87. వసుధలో నణఁగదు వార్ధిలో మునుఁగదు, గాఢాగ్ని చేత దగ్ధంబుగాదు
గాలుకిఁ గూలదు కరములఁ జిక్కదు, పాషాణములనైనఁ బగిలిపోదు
వానకుఁ దడవదు వడగండ్ల నొవ్వదు, యస్త్రశస్త్రంబుల హతముగాదు
ఎండకు నెండదు నేండ నీడకురాదు, ఘనపాశములనైనఁ గట్టుపడదు

చలికి వణఁకదు భయముల కులికిపడదు
యచలమై యున్న పరిపూర్ణ మమలచరిత
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ

88. బాధితంబైన యీప్రకృతిద్వయము లేని, కేవల పరిపూర్ణభావమినను
స్థూలదేహము లేదు సూక్ష్మదేహము లేదు, కారణదేహసంఘటన లేదు
ఘనమహాకారణఘటము లేనేలేదు, లేదు జాగ్రదవస్థ లేదు లేదు
లేదు స్వప్నావస్థ లేదు నిద్రావస్థ, లేది తుర్యావస్థ లేదు లేదు

సర్వ మీశ్వరతను చతుష్టయము లేదు
విశ్వకై నిట్టి ప్రాజ్ఞాదివిభులు లేదు
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ

89. పుట్టదు గిట్టదు పట్టదు ముట్టదు, కొట్టదు తిట్టదు కట్టుపడదు
యెఱుఁగదు మరుగదు కరుగదు పెరుగదు, పరగదు విరగదు తరుగుపడదు
ఆడదు పాడదు వాడదు వీడదు, వేడదు గూడదు జూడపడదు
అదరదు బెదరదు గదురదు చెదరదు, ముదరదు పదరదు గదలఁబడదు

చనదు పెనఁగదు చినుగదు వినదు గనదు
ఖేదమోదద్వయము లేని కేవలాత్మ
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ

90. సార్వకాలము చలించక నొక్కతీరుగాఁ, బరిపూర్ణమై యున్నబట్టబయలు
పతిగాదు సతిగాదు రతిగాదు బ్రతిగాదు, స్తుతియుఁ గా దుత్పత్తిస్థితియుఁ గాదు
మృతిగాదు స్మృతిగాదు శ్రుతిగాదు ధృతిగాదు, కృతిగాదు వికృతిగాదు హంకృతియుఁగాదు
క్షితిగాదు మతిగాదు మితిగాదు ద్యుతిగాదు, యతిగాదు మూలప్రకృతియుఁగాదు

గతియు దుర్గతియును లసద్గతియుగాదు
గతము విగతము గాదు నాగతముగాదు
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ

91. నేత్రజిహ్వఘ్రూణ శ్రోత్రత్వగింద్రియం, బుల కెవలాత్మను దెలియరాదు
పీతవర్ణముగాదు శ్వేతవర్ణముగాదు, కృష్ణపీతసునీలములునుగాదు
కటులవణాంలతిక్తకషాయ మధురాది, రస రుచి వస్తువర్గములుగావు
వీణారవముగాదు వేణునాదము గాదు, తాళమృదంగాది ధ్వనులుగావు

విమల పరిమళ మిళితద్రవ్యములు గాదు
గఠినశీతోష్ణమృదుసదాగతులుగాదు
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ

92. ఆద్యంతములులేని యచలము రెండు ప్ర, కారంబు లెన్నఁడు గకయుండు
క్రిందటగాలేదు ముందరగాబోదు, నిప్పుడుగాలేదు నిఁకనుగాదు
సర్వకాలం బేకసరణిగాఁ గదలక, మెదలక వదలక జెదరకుండు
నీప్రపంచమున కీపరిపూర్ణంబు, నకును సంబంధ మెన్నటికి లేదు

చావు పుట్టువు గలిగుండు జగమునకును
చావు పుట్టువు లేనిదే కేవలాత్మ
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ

93. ఆదిమధ్యాంతశూన్యంబైన దానెందు, పంచభూతములు జన్మించలేదు
బంధముక్తులులేని పరిపూర్ణమందు నీ, పంచకోశము లుద్భవించలేదు
జ్ఞానకర్మంబులు లేనివస్తువునందుఁ, బ్రకృతిస్వయంబు లుత్పత్తిలేదు
అచలమునందు మాయావిద్యలాదియు, పాధిద్వయంబు లుద్భవములేదు

జగము జీవులు స్థావరజంగమములు
బట్టబయలందు నెన్నఁడు బుట్టలేదు
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ

94. సురలు రాక్షసులు భూసురులువైశ్యులు శూద్ర, నరులు మౌనులు దిగంబరులు ఋషులు
యోగులు భోగులు రోగులు త్యాగులు, తరులు ఖేచరులు వానరులు గిరులు
రాజులు మంత్రులు రథతురంగంబులు, శరచాపధరులు భీకరులు కరులు
కలలో ననేక మెక్కడినుండి బచ్చెనో, గాని మేల్కొనిన నొక్కటియు లేదు

నీప్రపంచంబు నారీతి నేమిలేదు
బట్టబయలైన యచల మెప్పటికి నుండు
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ

95. క్షర మక్షరంబుల సగుణనిర్గుణములు, సత్య మసత్యముల్ సత్తుచిత్తు
కారణకార్యముల్ జ్ఞానకర్మంబులు, పురుషుండు బ్రకృతియు నెఱుకమఱపు
పాపపుణ్యంబులు బంధమోక్షంబులు,  జననంబు మరణంబు జడ మజడము
క్షేత్రజ్ఞక్షేత్రము ల్జీవదేహంబులు, మానాభిమానము ల్మంచి నెబ్ర

యట్టి ప్రకృతిద్వయంబులు గట్టుగాను
బట్టనయలందు నెన్నఁడు బుట్టలేదు
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ

96. చైతన్యమని యన్న క్షేత్రజ్ఞుఁ డని యెన్న, జ్ఞానము నెన్న హంకార మెన్న
సద్రూప మని యెన్న చిద్రూపమని యెన్న, స్వస్వరూపం బన్న సాక్షి యెన్న
ఈశ్వరుఁ డని యెన్న నిల విష్ణుం వని యెన్న, పరమాత్మ వని యెన్న బ్రహ్మ యెన్న
ఆదిశక్త్యని యెన్న నానంద మని యెన్న, పరమబంధం బెన్న బ్రక్రుతి యెన్న

మాయకేగల్గు నీనామధేయంబులును
బట్తబయలందు నొకపేరు బుట్టలేదు
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ

97. కర్తృత్వ భోక్తృత్వస్మృత్యత్వ మంత్రత్వ, ములు కేవలాత్మకుఁ గలుగ వెపుడు
జ్ఞాతృత్వ శ్రోతృత్వ ద్రుష్టృత్వ వక్తృత్వ,  ములు కేవలాత్మకుఁ గలుగ వెపుడు
ధాతృత్వ జేతృత్వ పాత్రత్వ యంత్రత్వ, ములు కేవలాత్మకుఁ గలుగ వెపుడు
శత్రుత్వ మిత్రత్వ జైత్రత్వ భేదిత్వ, ములు కేవలాత్మకుఁ గలుగ వెపుడు

గోత్రసూత్రపవిత్రాదిగాత్రములను
కేవలాత్మకు గలుగఁగాఁ బోవు సుమ్మి
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ

98. ఈయుత్తబట్టబై లేమి లే దనువాడు, రాగిగాఁ డతఁడు విరాగిగాఁడు
నెఱిఁగి శరీరంబు నేమిలేదనువాఁడు, జ్ఞానిగాఁ డతఁడు నజ్ఞానిగాఁడు
నున్న దున్నట్టుగా నుండఁజూచినవాఁడు, కర్మిగాఁ డతఁడు దుష్కర్మిగాఁడు
లేమి మాయావిద్య లేమిలేదనువాఁడు, ఘనుఁడుగాఁ డతఁడు కుంచనుఁడుగాఁడు

అనుమతంబైన జగము లేదన్నవాఁడు
బంధమోక్షద్వయంబులఁ బడనివాఁడు
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ

99. ఈయుత్తబట్టబై లేమిలేదనుస్వధా, పరిపూర్ణమై యుండు బ్రకృతిలెదు
కలలోనఁ గనుఁగొన్న గజమేమి లేనట్టి, యెఱుఁగశరీరము నేమిలేదు
ఇదిగురువాక్యంబు నింతకంటెను మహా, వాక్యరహశ్య మెందైనలేదు
ఇదిరాజమార్గంబు నిది యనాయాసంబు, నిది భ్రాంతిరహితంబు నిది స్థిరంబు

నిదియు నమ్మినవారికే యెగ్గులేదు
లేదు జన్మంబు మరణంబు లేదు లేదు
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ

100. భారతీపతి రమాపతి పార్వతీపతి, వాసవాద్యఖిలదేవతలయందు
మానవాశ్వగవాది మశకపిపీలికాం, తము జీవులందుఁ జైతన్య మొకటి
యట్టిచైతన్యమే యాత్మబ్రహ్మం బను, పదముకు లక్ష్యార్థభావ మిదియుఁ
గమలజాదిపిపీలికాంతశరీరముల్, వాచ్యార్థ మని వాని వదలితేని

యాపరబ్రహ్మచైతన్య మాత్మలనెడు
వాదభేదంబులేకాని వస్తు వొకటి
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ

101. బ్రహ్మకల్పంబులు ప్రతుయుగంబులుగాదు, సంవత్సరములు మాసములుగాదు
పక్షముల్ తిథివారనక్ష్త్రములుగాదు, గ్రహయోగకరణలగ్నములుగాదు
పర్వముల్ ఋతువులు పగలు రాత్రులుగాదు, వెలుగు చీకటి మేఘములునుగాదు
యుదయాస్తమయములు నుపరాగములుగాదు, త్రివిధకాలముగాదు దిశలుగాదు

నాదబిందుకళల్గాదు నభముగాదు
జీవనిర్జీవులును గాదు కేవలాత్మ
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ

102. పరిపూర్ణమైయున్న పరమాత్మబ్రహ్మవి, ద్యకు యోగమైన కాయంబు నిందు
బుద్ధికి సాక్షియై స్ఫురియింపుచున్నది, యహమనుపదమున కేథమగును
ప్రతిలేనిదై స్వతఃపరిపూర్ణపరమాత్మ, బ్రహ్మశబ్దమున కర్థంబు నిదియు
నహ మేవ బ్రహ్మ బ్రహ్మైవాహ మని యున్న, నస్మనేపదమున కర్థమనుచు

నెఱిఁగి వాచ్యార్థములనెల్లఁ బరిహరించి
యనిభవజ్ఞాని పొందు లక్ష్యార్థమందు
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ

103. దయభయధైర్యశ్రద్ధాలజ్జశమదమ, దర్పహంకారేచ్ఛదంభదైన్య
మదలోభమోహకామక్రోధమత్సర, సుఖదుఃఖక్ష్యవృద్ధిక్షుత్పిపాస
సంశయ నిశ్చయ సంకల్ప వైకల్ప్య, కంపనాకుంచన గమన చలన
శ్వాసబిశ్వాసవిసర్గవ్యాపకరాగ, ద్వేషకుటిలగర్వవేషభాష

వినయమానాభిమానాదివిషయసంఘ
ములును నిజకేవలాత్మకు గలుగవెపుడు
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ

104. బ్రాహ్మణోత్తములైన పరగక్షత్రియులైన, వైశ్యశూద్రులునైన వాంఛ గలిగి
ఈపద్యముల నన్ని యింపుగా విని వ్రాసి, చదివినజనులకు సౌఖ్యముగను
ధనధాన్యములు వస్త్రకనకభూషణములు, సుతసతుల్ హితబంధుసోదరులును
గజతురంగంబులు ఘనమైన పశువర్గ, మాందోళనము శుభం బతిధిపూజ

లాయురారోగూ మైశ్వర్య మమరి సుఖము
గలిగియుందురు మోక్షంబు గలిగి నిజము
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ

105. శ్రీకరలోకప్రసిద్ధుఁడై పరశు రా, మాన్వయాంభోధిహిమాంశుఁడైన
కూలంకషజ్ఞానకోటేశ్వరునకు శ్రీ, సుబ్బమాంబకు నేను సుతుడ నయ్యు
నరసింహదాసుండ నని పేరు విలసిల్లి, యమలకంభాలూరి యప్పగురుని
కరుణాకటాక్షంబు గలిగి వేదాంతార్థ, సారము లెస్సగా సంగ్రహించి

భరితముగ నూటనెనిమిదిపద్యములను
బ్రేమతోఁ జెప్పి మీకు నర్పించినాను
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ

106. ఇంపుగా జెప్పిన యీనూట యెనిమిది, మహనీయపద్యముల్ మౌక్తికములు
ప్రాసవిశ్రమములు బంగారుకొలుకులు, కూర్మిసబ్దంబులు గూర్చుటయగు
పరమతత్త్వార్థముల్ పచ్చలపతకంబు, మీయంకితంబును మేరుపూస
యీరీతి మౌక్తికహారంబు జేసి నే, ముదముతో నర్పించి మ్రొక్కినాను

కంఠమందున ధరియించి ఘనతమెఱసి
నన్నురక్షించు నిను సదా నమ్మినాను
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ

107. దశరథసుకుమార దానవసంహార, మందరనగధీర మంగళంబు
నీరజదళనేత్ర్ నీలతోయదగాత్ర, మౌనిజనస్తోత్ర మంగళంబు
భానుజవర్ధన భక్తజనార్ధన, భవలోకపరిహార మంగళంబు
కమలామనఃఖేల కాంచనమయచేల, మహనీయకులశీల మంగళంబు

మన్మధాకార రఘువీర మంగళంబు
మాధవానంద గోవింద మంగళంబు
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ

108. ఈపద్యశత మెవ్వ రింపుతోడఁ బఠించి, యావార్యుకరుణచే నమలమైన
స్వానుభూతివహించి సరవిఁ జెన్నొందుదు, రట్టివారలు భువి నహరహంబు
వాక్కుచే వర్ణింప వశము గానిదియును, నాత్మలోఁ దలఁపరానట్టిదియును
దేశకాలాదులం దిమడనట్టిదియును, నంతటఁ దానయై యలరునదియు

నగుచుఁ దన కన్యమును లేక యలవిగాక
నిట్టిదట్టిది యని నిర్ణయింపరాని
బట్టబయలైనబ్రహ్మంబుఁ బడయగలరు
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ

సమాప్తము