Thursday, January 24, 2013

శ్రీ బీ.వి.రమణ గారు శతకాలపై వ్రాసిన వ్యాసం

తెలుగులో శతక వాజ్మయం పన్నెండవ శతాబ్దంలో ప్రారంభమైంది. క్రీ.శ. 1160 ప్రాంతం నాటి మల్లికార్జున పండితుడు మొట్టమొదటి శతకకర్త. అతని శివతత్త్వ సారం మొదటి శతకం అని కొందరు, లేదా అతను రచించాడని చెప్పబడుతున్న శ్రీగిరి మల్లికార్జున శతకం మొదటి శతకమని కొందరు అభిప్రాయ పడుతున్నారు. 

అయితే అంతకు పూర్వమే శతక రచనకి బీజాలు పడ్డాయని పరిశోధకుల అభిప్రాయం. నన్నయ భారతంలో ఉదంకుడు నాగలోకానికి వెళ్ళిన సందర్భంలో "...మాకు ప్రసన్నుడయ్యెడున్" అనే మకుటంతో నాలుగు పద్యాలున్నాయి. నన్నెచోడుని కుమార సంభవంలో కూడా "దారిద్ర్య విద్రావణ" అనే మకుటంతో తొమ్మిది పద్యాలున్నాయి. శతక రచనకి ఇవి బీజ ప్రాయాలని నిర్ణయించారు.

పాల్కురికి సోమన శతక రచనకి గౌరవం, ప్రాచుర్యం కలిగించాడు. ఇతను రచించిన వృషాధిప శతకం సంపూర్ణ శతక లక్షణాలు గలది. మల్లికార్జున పండితారాధ్యుడు, పాల్కురికి సోమన, అన్నమయ్యల్ని కొందరు శతక కవిత్రయంగా పేర్కొంటారు. వీరి శతకాలు భక్తి శతకాలు. 

ఎందుచేతనో శ్రీనాథుడు శతక రచన చేయలేదు. 

పోతన నారాయణ శతకం రచించాడని ప్రతీతి. అందులో "ధర సింహాసనమై...." చాలా ప్రసిద్ధి చెందిన పద్యం. 

శతకాల్ని స్థూలంగా ఇలా వర్గీకరించ వచ్చును: భక్తి శతకాలు, నీతి శతకాలు, శృంగార శతకాలు, వైరాగ్య శతకాలు, హాస్య శతకాలు, దేశభక్తి శతకాలు, రాజకీయ శతకాలు, మొదలైనవి. 

భక్తి శతకాల్లో చెప్పుకోదగ్గవి శివతత్త్వసారం, వృషాధిప శతకం, సర్వేశ్వర శతకం, శ్రే కాళ హస్తీశ్వర శతకం, నారాయణ శతకం, రామదాసు దాశరధీ శతకం, శ్రీకృష్ణ శతకం, కామేశ్వరీ శతకం, చింతామమణీ శతకం, మొదలైనవి. కృష్ణ భక్తి ప్రధానంగా వెన్నెలకంటి జన్నయ్య దేవకీనందన శతకం రచించాడు. అన్నమాచార్య భక్తి శృంగారాత్మక మైన వేంకటేశ్వర శతకం, అయ్యలరాజు త్రిపురాంతకుని ఒంటిమిట్ట రఘువీర శతకం, యధావాక్కుల అన్నమయ్య సర్వేశ్వర శతకం. గోకులపాటి కూర్మనాథుని సింహాద్రి నారసింహ శతకం. మంచెళ్ళ కృష్ణకవి రాసిన శ్రీ వేంకట నగాధిపతి శతకం మొదలైనవి. 
కాసుల పురుషోత్తమ కవి రచించిన ఆంధ్రనాయక శతకం బాగా ప్రసిద్ధి పొందింది. 
ఇటీవల కాలంలో వేంకటేశ్వర శతకాలు, సత్యసాయి శతకాలు, క్రీస్తు శతకాలు, వచ్చాయి. దేశభక్తిని ప్రబోధించే శతకాలలో దేశ నాయకుల స్తుతి శతకాలు - గాంధి శతకము - కూడా వెలువడ్డాయి. 

నీతి శతకాల్లో చెప్పుకోదగ్గవి: వేమన శతకం, సుమతీ శతకం, గువ్వల చన్న శతకం, భాస్కర శతకం, కుమార శతకం, కుమారీ శతకం వగైరా. 

అధిక్షేప శతకాలు: హేళన, ఎత్తిపొడుపు మందలింపుల ద్వారా నీతిని బోధించే శతకాలు ఇవి. కవి చౌడప్ప, కూచిమంచి తిమ్మకవి, అడిదం సూరకవి ఈ పద్ధతిలో రచించారు. చౌడప్ప శతకం, కుక్కుటేశ్వర శతకం, శంభో శతకం, చక్కట్ల దండ శతకం, మొదలైనవి ఈ కోవకి చెందుతాయి. 

హాస్య శతకాలు: పకోడీని పొగుడుతూ రచించిన శతకం, చీపురు పుల్ల మీదా, చీపురు కట్ట మీదా పొగచుట్ట మీదా రచించిన శతకాలు ఉన్నాయి. 

శృంగార శతకాలు: అన్నమాచార్య రచించిన శ్రీ వెంకటేశ్వర శతకం మధుర భక్తి శృంగారానికి చెందింది. రాధాకృష్ణుల శృంగారాన్ని వర్ణించిన శతకాలు ఎక్కువ. సుందరీమణి శతకం, బ్రహ్మానంద శతకం, కీరవాణి శతకం, మదనగోపాల శతకం మొదలైనవి ఈ కోవకి చెందుతాయి. 
ఆధునికులలో సెట్టి లక్ష్మీనరసింహ కవి రాసిన "కృష్ణ శతకం" అశ్లీల శృంగార శతకమని పేర్కొంటున్నారు. మల్లాది శివరాం రాసిన 'శృంగార శతకం' దాంపత్య సన్నివేశాల్ని చక్కగా చిత్రీకరించిందిట. 

అనువాద శతకాలు: ఇతర భాషల్లోంచి తెలుగులోకీ, తెలుగు భాషలోంచి ఇతర భాషల్లోకీ అనువదింప బడిన శతకాలు ఉన్నాయి. సంస్కృతం లోంచి తెలుగులోకి అనువదించబడిన శతకాలు ఎక్కువ. మహిష శతకం, సూర్య శతకం, భల్లట శతకాలు అనువాదశతకాలే. భర్తృహరి సుభాషిత త్రిశతి అత్యంత ప్రసిద్ధమైన అనువాదం. వేమన శతకం తమిళంలోకి అనువదింప బడింది. సుమతీ శతకం సంస్కృతం లోకి అనువదింపబడింది. 

కథాత్మక శతకాలు : రామాయణ, భారత, భాగవతాదుల కథలని గ్రహించి కొందరు శతకాలుగా రచించారు. 

ఇతర శతకాలు : కొందరు వ్యాకరణ, నిఘంటు అంశాలను గ్రహించి శతకాలు రచించారు. గణవరపు వేంకట కవి నిఘంటువును శతకంగా రచించారు. తాళ్ళపాక పెదతిరుమలాచార్యులు రేఫ రకార లక్షణ గ్రంథాన్ని శతక రూపంలో రచించాడు. భాషావ్యాకరణ విశేషాలతో గిడుగు సీతాపతి గారు "భారతీ" శతకం రాసారు. ఇంకా పర్యాయపద శతకం కూడా ఉంది. ఆది వెలమ శతకం, హరిజన శతకం, అమృతాంజన శతకం, వారకామినీ శతకం, అనుభవరసిక శతకం, అహంకార శతకం మొదలైన రచనలు కూడా ఉన్నాయి. 

ఆధునిక కాలంలో: కోవెల సంపత్కుమారాచార్య లక్ష్మణ యతీంద్రులనుద్దేశించి సామాజిక, తాత్విక పరంగా శతకం రాసారు. చెళ్ళపిళ్ళ వారి ఆరోగ్య కామేశ్వరీ శతకం రచించారు. విశ్వనాథ సత్యనారాయణ గారు "ఎలిజీ"గా వరలక్ష్మీ త్రిశతిని శతకంగానే రచించారు. వావికొలను సుబ్బారావుగారి టెంకాయల చిప్ప శతకం, గరికిపాటి మల్లావధాని గారి "భారతాంబిక" శతకం. శ్రీ శ్రీ రాసిన సిరి సిరి మువ్వ శతకం, నార్ల వారి "నార్లవారి మాట", దాశరధి రాసిన దాశరధీ శతకం, బోయి భీమన్నరచించిన పిల్లి శతకం. బేతవోలు రామబ్రహ్మం గారి ప్యారడీ ఆధునిక వేమన శతకం చెప్పుకోదగ్గవి. 

800 సంవత్సరాల క్రితం మొదలైన శతక సాహిత్యం ఈ విధంగా తెలుగు భాషలో వైవిధ్యంతో వికాసంతో నేటికీ అవిచ్చిన్నంగా కొనసాగుతూనే ఉంది. నేటికీ శతకాలు పుంఖానుపుంఖాలుగా వెలువడుతూనే ఉండడం ముదావహం.

"శతకసాహిత్యం" గురించి ఒక్క చిన్నమాట

 శతకాల గురించి తెలియని తెలుగువాడు ఈ తెలుగుగడ్డ మీద ఉండరు అంటే అతిశయోక్తి కాదేమో. మన చిన్నప్పటినుంచి అన్నిటితో పాటు తెలుగువాచకంలో మనకి నేర్పిన వాటిలో ఇవి ఇప్పటికి మన జ్ఞాపకాల్లో చెక్కు చెదరకుండా నిలిచిపోయాయి. వేమన శతకం (ఉప్పుకప్పూరంబు నొక్కపోలికనుండు), సుమతీ శతకం (శ్రీరాముని దయచేతను), కృష్ణ శతకము (నీవే తల్లియు తండ్రియు), దాశరధీ శతకము, కాళహస్తీశ్వర శతకము, లోని పద్యాలు మన చిన్నప్పుడు అర్ధం తెలిసినా తెలియకపోయినా బట్టియం వేసినవాళ్ళమే. తరవాత కాలేజీలలో అంత పెద్దగా చదువక పోయినా చిన్నప్పటి పద్యాలు గుర్తుకొచ్చినప్పుడు అహా ఎంత బాగుంది, ఎంత అర్థం ఉంది అనుకోవటము చాలమందికి అనుభవంలోకి వచ్చిన విషయమే. నాకు సరిగా ఇలాగే జరిగింది. ఎలాగంటే ......

ఒకరోజు అంతర్జాలంలో దేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వరరావు గారి పుస్తకం ఒకటి దొరికింది.  పంతులుగారు ఆ పుస్తకంలో ఒక పూర్త్తి చాప్టర్ శతక సాహిత్యానికి కేటాయించటమే కాకుండా వారికి దొర్కిన చాలా శతకాలను ఆ పుస్తకంలో పొందు పరిచారు. ఆ పుస్తకం చదివిన తరువాత నాకు అసలు ఎన్ని శతకాలున్నాయి అన్న ప్రశ్న మొదలయింది. అందుకోసం అంతర్జాలంలో వెదుకులాట ప్రారంభించాను. ఆ వెదుకులాట నాకు దాదాపు 450 శతకాలను సంపాదించి పెట్టింది. వాటి వివరాలన్ని ఒక పట్టిక తయారు చెయ్యటం దాదాపు పుర్తి అయ్యింది. ఐతే ఈమధ్యనే పండిత వంగూరి సుబ్బారావు గారు రచించిన "శతక కవుల చరిత్రము" (1950) చదవటం జరిగింది. అందులో ఆ మహానుభావుడు దాదాపు 1200 శతకాలు 900 మంది శతక రచయితలను పరిచయం చేసారు. ఈ సంఖ్య దాదాపు 60 ఏళ్ళ క్రితం వరకు జరిగిన శతకాలాను సూచిస్తుంది. ఆ తరువాత అంటే 1950 నుండి ఇప్పటివరకు ఎన్ని శతకాలు వచ్చాయో ఆ వివరాలను కలిపితే ఈ సంఖ్య 3000 నుంచి 5000 వరకు వెళ్ళవచ్చును అనేది ఒక వాదన. మన తెలుగు సాహిత్యంలో ఎంతో అమూల్యమైన ఈ శతక సాహిత్యం లో దొరికిన మణులతో పోలిస్తే దొరకని ఆణిముత్యాలు ఎన్నెన్నో అనిపించింది. అంతర్జాలంలో కూడా ఏ సాహిత్య సంబంధిత సైటులో చూసినా 10 నుండి 15 శతకాల కంటే ఎక్కువ కనపడవు. తెలుగు వికిలో కూడా దాదాపు ఇదే సంఖ్య ఉన్నట్లు గుర్తు. మిగిలిన శతకాలు వాటి వివరాలు వాటి అతీగతి ఎవ్వరికి పట్టినట్లు కనిపించటం లేదు. తెలుగు సాహిత్యాభిమానులకు గర్వకారణమైన ఈ శతక సాహిత్యాన్ని కాలగర్భంలో కలిసిపోక ముందే రక్షించుకొనే అవసరం ఎంతైనా ఉంది. అటు ప్రభుత్వం ఇటు పండితులు, సాహిత్యాభిమానులు కలిసి ఈ సంపదను పరిరక్షించుకోకపొతే అపూర్వసాహితీ సంపదని కోల్పోయిన వారవుతాము.  ఇంత అద్భుతమైన మన సాహిత్య సంపదను కాపాడుకోకపోతే శాశ్వతంగా కోల్పోయే ప్రమాదం ఉంది. 

ఈ ఆలోచనతోనే నాకు ఇంతవరకు లభించిన శతకాల వివరాలను ఒకచోట పొందుపరిచి తెలుగు భాషాభిమానులతో పంచుకుందామనే ఉద్దేశ్యాన్ని నా facebook మిత్రులతో పంచుకోవటం జరిగినది. ఈ విషయంలో వారి ప్రోత్సాహం నాకు ఎంతో ఉపకరించింది. ప్రోత్సాహమే కాక వారు వారిదగ్గర ఉన్న శతక వివరాలను కూడా నాతో పంచుకొన్నారు. వారిలో శ్రీ గంటి లక్ష్మీనారాయణ మూర్తి గారు వారి వద్ద నున్న దాదాపు 40 శతకాల వివరాలను దయతో నాకు పంపించారు. ఆలాగే శ్రీ అనంత కృష్ణ గారు వారి స్వీయరచనలయిన రెండు శతకాలను నాకు పంపించారు. బొమ్మిరెడ్డి మురళీకృష్ణ గారు ఒక శతకం పంపించారు. ఇలా చెప్పుకొంటుపోతే ప్రతిఒక్కరు ప్రత్యక్షంగా లేక పరోక్షంగా సహాయం చేసారు. వారందరికీ నా కృతజ్ఞతలు.

ఈ సందర్భంగా అంతర్జాల మిత్రులకు నా మనవి: మీదగ్గర ఉన్న శతకాల వివరాలు (శతకం పేరు, రచయిత, ప్రకటించిన/రచించిన సంవత్సరం, మకుటం) లాంటి వివరాలు నాకు పంపితే  బ్లాగులో పొందుపరుస్తాను. ఇందుకోసమై  అన్ని వివరాలు ఒకేచోట పొందు పరచటానికి వీలుగావిడిగా ఈ బ్లాగు "శతకసాహిత్యం" అనే పేరున తెరుస్తున్నాను. ఇందులో ప్రధమ ప్రయత్నంగా నాకులభించిన శతకాలను పట్టికలో పొందుపరచి మీ ముందు ఉంచటం, ఆపైన అలభ్య శతకల పట్టికను కూడా తయారుచేసి ఒక చోట కూర్చటం.  ఐతే కొందరు మిత్రులు ప్రతిశతకానికి మచ్చుకి కొన్ని పద్యాలను ఏరి పోష్టు చేస్తే బాగుంటుందన్న సూచనలను చేసారు. చక్కటి ఆలోచన కాకపోతే కాస్త నెమ్మదిగా ఆ మెట్టుకి వెల్తాను. ముందుగా నా వద్ద ఉన్న ఈ పట్టికను మీతో పంచుకుంటాను. 
ధన్యవాదములు